ఆంధ్ర కవుల చరిత్రము - రెండవ భాగము/చేమకూర వేంకటకవి

గీ. అరుణపల్లవములబోలు నాపదంబు
   లాపదంబుల బోలును నలకజాత
   మలకజాతముబోలు నిత్యముఖలీల
   నిత్యముఖలీలబోలు నన్నెలతనడుము.


మ. బిగువుంగుబ్బలు గాంచి మాను నలజంబీరంబు బీరంబు క్రొం
    జిగిమోము ల్గని సిగ్గున న్వదలు రాజీవంబు జీవంబు విం
    తగ భ్రూరేఖలుచూచి భీతి నిడు గోదండంబు దండంబు త
    జ్జగతీమోహనుమ్రోల నున్న చెలులం జర్చింపగా శక్యమే. [ఆ.2]


శా. జోక న్వీడ్కొని చుక్కరేగెను జుమీ శుభ్రాంశుబింబప్రభో
    త్సేకంబు ల్తఱిగెం జుమీ కడకువచ్చెం జుమ్మి యీరేము చిం
    తాకాలుష్యము లేల బాల మదిలో ధైర్యం బవార్యంబుగా
    గోకోయన్గతి గుక్కుటంబు లఱచెం గోకోవిరావార్భటిన్. [ఆ.3]


52. చేమకూర వేంకటకవి

ఇతడు నియోగిబ్రాహ్మణుడు. లక్ష్మణామాత్యుని తనుభవుడు. ఈకవి సారంగధరచరిత్రము, విజయవిలాసము అను పద్యకావ్యములను జేసి తంజాపురీ వల్లభుడైన రఘునాధరాజున కంకితము చేసెను. విజయ విలాసమునకు సుభద్రాపరిణయమని నామాంతరము గలదు. కృష్ణదేవరాయ లించుమించుగా దక్షిణహిందూదేశమునంతను జయించిన కథ నీవరకే మాచదువరులు తెలిసికొని యున్నారు. ఆరాయల యనంతరమున తంజావూరు, మధుర, మొదలయిన ద్రావిడరాజ్యములు పాలించుటకయి తెలుగునాయకులు నియమింపబడిరి. తంజాపురిరాజ్యమునకు చెవ్వరాజు పాలకుడుగా నియమింపబడెను.


గీ. ఠీవి నచ్యుతరాయలదేనియైన
   తిరుమలాంబకు జెలియలై తేజరిల్లు

   మూర్తిమాంబను బెండ్లియై కీర్తి వెలసె
   జెవ్వవిభుడు మహోన్నతశ్రీ చెలంగ.

అను విజయవిలాసములోని పద్యమునుబట్టి యీచెవ్వరాజు విజయనగరాధీశ్వరుడైన యచ్యుతదేవరాయనికి దోడియల్లు డయినట్టు కనబడుచున్నాడు. అయినను వేంకటకవి చెవ్వరాజు మనుమడైనకృతిపతి యగు రఘునాథరాజు నాశ్వీర్వదించుచు


మ. ప్రకటశ్రీహరియంఘ్రి బుట్టి, హరుమూర్ధం బెక్కి యింపార మ
    స్తకముం బేర్కొన నెక్కుదేవి సహజోదంచత్కులోత్పన్న నా
    యకరత్నం బని యచ్యుతేంద్రరఘునాథాధీశ్వరస్వామికిన్
    సకలైశ్వర్యములు న్ని జేశువలనం దా గల్గగా జేయుతన్.


శూద్రునిగా వర్ణించినందున శూద్రకులసంజాతు డగు చెవ్వరాజునకును క్షత్రియవంశ జాతు డగు నచ్యుతదేవరాయనికిని బంధుత్వముండునా యని సందేహము తోచుచున్నది. మొట్టమొదట కృష్ణదేవరాయలే యుత్తమక్షత్రియుడు గాక దాసీపుత్రు డయినట్టు వాడిక గలిగియున్నదిగదా! క్షత్రియుడైన నరసింహరాజునకు దాసియు శూద్రయు నగు నాగాంబకుబుట్టిన కృష్ణదేవరాయనికి మొట్టమొదట క్షత్రియులెవ్వరును గన్య నియ్యనందున, అతడు శూద్రజాతి స్త్రీని గాంధర్వవిధిచే వివాహమాడి యచ్యుతదేవరాయని పుత్రునిగా బడసి యుండవచ్చును. అందుచేత నాయచ్యుతదేవరాయడు శూద్రకన్యనే పెండ్లిచేసికొనియు నుండవచ్చును.పెక్కు శాసనములలో నచ్యుతదేవరాయడు కృష్ణదేవరాయనికి కుమారు డైనట్టు చెప్పబడినను, శాలివాహనశకము 1459 హేవిళంబి సంవత్సరమున నచ్యుతదేవరాయ లొక బ్రాహ్మణునికి నారాయణపురము నగ్రహారమునుగా నిచ్చిన దానశాసనములో,


శ్లో. తిప్పాజీ నాగలాదేవ్యో కౌసల్యాశ్రీసుమిత్రయో

   
   జాతౌ వీరనృసింహేంద్ర కృష్ణరాయ మహీపతి:
   అస్మాదోబాంబికాదేవ్యా మచ్యుతేంద్రోపి భూపతి.


అను శ్లోకములయందు నరసింహరాజునకు తిప్పాంబయందు వీరనృసింహరాయడను, నాగలాంబయందు కృష్ణదేవరాయడును, ఓబాంబయం దచ్యుతదేవరాయడును కలిగినట్లు చెప్పబడి కృష్ణదేవరాయని కతడు తమ్ము డయినట్టు చెప్పబడియున్నది. ఈబంధుత్వ మింకను విచారణీయము. ఒకవేళ బయి శ్లోకములలో జెప్పబడినదే నిజమయినను, నాగమ్మవలనే యోబమ్మయు శూద్రజాతమైన భోగభార్యయై యుండవచ్చును. ఈవిచారము నటుండనిచ్చి యిక గధాంశమునకు వత్తము.



క. ఆమూర్త్యంబకు నఖిల మ
   హీమండలవినుతు డిచ్యుతేంద్రుడు సుగుణో
   ద్దాముడు జనియించెను ద
   ద్భూమీపతి రంగధాముపూజన్మించెన్.


క. ఆపుణ్యఫలంబుననె ద| యాపాధోరాశియైన యాయచ్యుతభూ
   మీపతికిన్ రఘునాధ | క్ష్మాపాలకు డుదయమయ్యెజైవాతృకుడై.


చెవ్వరాజున కచ్యుతరాజును, అచ్యుతరాజునకు గృతినాయకు డయినరఘునాధరాజును బుట్టి తంజాపుర రాజ్యము పాలించిరి. విజయవిలాసములోని యీక్రిందిపద్యమువలన రఘునాధరాజు రసికజనాగ్రగణ్యు డయినట్లును, విద్యలయం దసమాను డయినట్టును తెలియవచ్చుచున్నది.


గీ. నన్ను నడిపినయధికసన్మాన మెంచి
   యఖిలవిద్యావిశారదు డగుటగాంచి

    యవని నింతటిరా జెవ్వడని నుతించి
    కృతి యొసగ గీర్తికలదని మతిదలంచి.

మ. కలిగెంగా తనసమ్ముఖింబనియు సత్కారంబుతాజేయ నౌ
    దల నెంతే శిరసావహింతురనియుం దాగాక వేఱెందు సా
    ధులకున్ దిక్కనియున్ దయన్మనుపురీతుల్గాక శక్యంబె వి
    ద్యల మెప్పింపగ నచ్యుతేంద్ర రఘునాధస్వామి నెవ్వారికిన్?

రసికావతంసుడయిన కృతిపతి తన కంకితము చేయబడిన సారంగధరచరిత్రమునంతను విని యందు శోకరస మత్యద్భుతముగా వర్ణింపబడుటచూచి యది నిజముగా నేడిచినట్టే యున్నదని పలికెననియు, ఆపయిని గవి తనశక్తినంతను జూపి ప్రతిపద్య రసాస్పదముగా విజయవిలాసమును జేసి తీసికొనివచ్చి వినిపింపగా నతని యింటిపేరును బట్టి శ్లేషించి చేమకూర మంచిపాకమున బడెనని మెచ్చుకొనెననియు చెప్పుదురు. అచ్చతెలుగుపదములను పొందికగా గూర్చి కవనము చెప్పునే ర్పీకవికి గుదిరినట్లు మఱియొకకవికి గుదిరినదని చెప్ప వలను పడదు. అందుచేతనే కృతిపతి,


క. ప్రతిపద్యమునందు జమ | త్కృతి గలుగగ జెప్పనేర్తు వెల్లయెడలవై
   కృతపాఠము బాడముగా |క్షితిలో నీమార్గ మెవరికిని రాదుసుమీ.

అని కవిని శ్లాఘించి యున్నాడు. పింగళి సూర్యనార్యుని ప్రభావతీప్రద్యుమ్నమునకు దరువాత విజయవిలాసమే సర్వవిధములచేతను తెలుగులో శ్లాఘ్యకావ్యముగా నున్నది. జాతీయాదిచమత్కృతిని బట్టి విజయవిలాసమే శ్లాఘ్యతర మయినదనియు ననేకు అభిప్రాయపడు చున్నారు.


ఉ. తారసవృత్తిమై ప్రతిపదంబును జాతియు వార్తయుం జమ
   త్కారము నర్థగౌరవముగల్గ ననేకకృతుల్ ప్రసన్నగం

   భీరగతి న్వచించి మహి మించినచో నిక శక్తు లెవ్వర
   య్యా రఘునాధభూపరసికాగ్రణికిం జెవిసోక జెప్పగన్ ?


అని కవియే తన్నుగూర్చి తనకవిత్వమునందువలె జాతియు జమత్కారము నర్థగౌరవము గలుగునట్లుగా నింకొక్కరు చెప్పలేరని చెప్పికొనియున్నాడు. ఈకవి తనగ్రంథములయందు రేఫ శకటరేఫములకు యతిప్రాసమైత్రి కూర్చుటయేగాక, ఇకారసంధులు, క్త్వార్థక సంధులు, మొదలయిన పూర్వలాక్షణిక సమ్మతములుకాని ప్రయోగము లనేకములు చేసియున్నాడు.


ఉ. కోపమొకింతలేదు బుధకోటికి గొంగుపసిండి సత్యమా
   రూపము తారతమ్యము లెఱుంగు స్వతంత్రుడు నూతనప్రియా
   టోపములేని నిశ్చలు డిటుల్ కృతలక్షణుడై చెలంగగా
   ద్వాపరలక్షణుం డనగవచ్చునొకో యలధర్మనందనున్. [విజయవిలాసము]

ఈపద్యమునందలి రెండవచరణములో రాకును బండిఱాకును యతికూర్చినాడు.


గీ. అరుగగొంకెడు కన్నియ తెఱగు గాంచి, [విజయవిలాసము]

మ. ఖరభానుప్రియసూను డెప్పుడు నినుంగారించునేకా విభుం
    డఱచేలోపలి నిమ్మపంటివలె నత్యాసక్తి మన్నింప సౌ
    ఖ్యరసైకస్థితినుండి కావరమునం గన్గాన కాపత్సరం
   పర రా ద్రుళ్ళెదవేల యావిధిదరింప న్నీతరంబే మహిన్. [సారంగద]

ఇత్యాది స్థలములయందు రేఫఱకారములకు బ్రాసమైత్రి కూర్చినాడు.



క. సైకము నడుము విలాసర
   సైకము నెమ్మోము దీనిమృధుమధురోక్తుల్
   పైకము దెగడు న్నవలా
   పైకములోనెల్ల మేలుబంతిది బళిరా. [విజయవిలాసము]

చ. వడి నరపాలుభోగసతివావులు నాకుబనేమి యంట వం
   గడమునకెల్ల సొడ్డనిన గా దటునేనలపిన్ననాడె యే
   ర్పడితినటన్న బోవునె స్వబావము తల్లివినాకు నేక్రియం
   బడతుక నీవు వావిచెడ మందు మహింగలదమ్మయెందునున్. [సారంగధరచరిత్ర]


ఇందు మొదటిపద్యములో (మేలుబంతి+ఇది=) మేలుబంతిది యనియు, రెండవపద్యములో (పని+ఏమి=) పనేమనియు, ఇకారసంధులను గూర్చినాడు.



చ. అవనిని పాపపూపజవరా లెదలోపల బాపలేక యా
   తని తెలిముద్దునెమ్మొగము దప్పక తేటమిటారికల్కిచూ
   పున దనివారజూచి నృపపుంగవ యన్నిటజాణ వూరకే
   యనవలసంటిగా కెఱుగవా యొకమాటనె మర్మకర్మముల్. [విజయవిలాసము]


ఉ. కానకు గొంచుబోయిపుడు కాళ్ళును జేతులు గోయు డంచు లో
   నూనినకిన్క రాజు ముదుటుంగర మిచ్చెను మాకు బుద్ధి యే
   మానతియిండు మీరనిన నట్టులెచేయుడు కొంకనేల రా
   జాన నతిక్రమింప దగునాయని యాదృడచిత్తు డాడినన్. [సారంగధ]


ఇత్యాది స్థలములయందు (వలసి+అంటి=) వలసంటియనియు, (పోయి+ఇపుడు=) పోయిపు డనియు, క్త్యార్థేత్తునకు సంధి కలిపినాడు.



చ. చందనగంధి నెన్నుదురు చందురులో సగపాలు బాల ము
   ద్దుం దెలిచూపు లంగజునితూపులలోపల మేల్తరంబు లిం
   దిందిరవేణిమోవి యలతేనియలో నికరంబుతేట యే
   మందము మందయానముఖమందము మీఱు నవారవిందమున్. [విజయవిలాసము]


ముఖమందమని యీపద్యమునందును, రాజానయని పయిపద్యమునందును షష్ఠీతత్పురుషమునం దుత్తున కచ్చు పరంబగునప్పుడు నుగా గమమువచ్చి "ముఖమునందము" "రాజునాన" యని యుండవలసినదానికి మాఱుగా నుగాగమము పోగొట్టి ప్రయోగించినాడు.


మ. అని బాహాపరిరంభ సంభ్రమరసాయతైకచిత్తంబునం
    దను నీక్షింప నెఱింగి యందియలమ్రోతం గేకినున్ రా సఖీ
    జను లేతెంచి రటంచు వేమొఱగి హస్తంబు న్విడంజేసె నే
    ర్పున దప్పించుకపోవ భూవరు డనుం బూబోడికిం గ్రమ్మఱన్. [విజయవిలాసము]


సీ. నిలుచుండి చంక జేతులపెట్టుక కిరీటములు గలరాజులు కొలువుచేయ- [సారం]

ఇందు "తప్పించుకొని" "పెట్టుకొని" యని యుండవలసిన చోట్ల కొనునకు మాఱుగా కవర్ణకము ప్రయోగించినాడు.



సీ. చెంత గూర్చుండని చేజూప గూరుచుం
   డెదవుగా కూరకుండెదవు సుమ్ము. [విజయవి]

అచ్చు పరమగునపుడు స్రార్థనార్థక మధ్యమపురుష మువర్ణకమునకు లోపము రా గూడకపోయినను "గూర్చుండు" అని మువర్ణలోపము కలిగించి ప్రయోగించినాడు.


ఉ. ఓనృప నాకు జూడ నటయుగ్మలి నీసుతునిన్ మనోహరా
   మానవిలాను జూచి నిలు పోపక పట్టిన లోనుగామి నెం
   తే నెగు లూని వాని బొలియింపగ మాయలు పన్నె నిట్లు కొం
   డేనకు ధర్మరా జలుగు నిక్కముగా మిము జెప్పనేటికిన్- [సారంగధ]

తెలుగులందు గొన్నియెడల లులనలు పరమగునపుడు మువర్ణము లోపించి పూర్వమందున్న యకారమునకు మాత్రమే దీర్ఘము రావలసియుండగా నిచట గొండెమునకని యుండవలసినదానికి మాఱుగా నెకారమునకు దీర్ఘముపెట్టి కొండేనకని ప్రయోగించినాడు.


ఇట్లు లఘ్వలఘు రేఫములకు యతిప్రాసములయందు మైత్రి కల్పించినను, పూర్వ కవిప్రయోగములకు విరుద్ధములయిన ప్రయోగములు చేసినను, లింగమగుంట తిమ్మన్న, అప్పకవి, కూచిమంచి తిమ్మన్న మొదలయిన, లక్షణవేత్తలీ వేంకటకవిని లాక్షణికకవినిగా అంగీకరించి తమ లక్షణ గ్రంథములయందీతని గ్రంథములనుండి పద్యముల నుదాహరించియున్నారు. ఇప్పటివారు కవిత్వసారస్యమును విచారింపక గ్రంథములయందు రేఫద్వయప్రాస నిశ్రమమైత్రియో యేదో వ్యాకరణదోషమో యున్నదన్న హేతువుచేతరసవంతములైన యుత్తమ గ్రంథములను సహిత మగ్రాహ్యములని నిరాకరించుచున్నందున, అట్లు చేయుట యుక్తముకాదనియు ఛందోవ్యాకరణ దోషములు లేని రసహీనములగు గ్రంథములకంటె ఛందోవ్యాకరణదోషములను గలవయినను రసవంతములయిన గ్రంథములే యధికాదరణీయము లనియు జూపుటకయి యీ కవివిషయమున నింతదూరము వ్రాసినాడను. కవిత్వమునం దక్కడక్కడ గొన్ని నెరసులున్నను జాతీయములతోను సామెతలతోను నిండియుండి యర్థగౌరవము కలదయి రసవంతమయి యున్నందున చేమకూర వేంకటకవి కవిత్వము సర్వజనాదరణీయమయినదని తలచుచున్నాను. ఈకవి యించుమించుగా పదునేడవ శతాబ్దముయొక్క మధ్యభాగమునందున్నట్లు తెలియవచ్చుచున్నది. కృతిపతియైన రఘునాధ రాజుయొక్క కుమారుడగు విజయరాఘవరాజు 1674 వ సంవత్సరమునందు మధురాపురము రాజధానిగాగల పాండ్యదేశపురాజగు చొక్కలింగనాయకునితో యుద్ధముచేసి నిహితుడయ్యెను. అతనితో గృతిపతివంశ మంతరించినది. దీనినిబట్టి విజయవిలాసమును సారంగధర చరిత్రమును 1630-40 సంవత్సర ప్రాంతములయందు రచియింపబడినట్లు కనబడుచున్నవి. మూడేసి యాశ్వాసములుగా రచియింపబడిన యీ పుస్తకద్వయము నుండియు గొన్ని పద్యముల నుదాహరించుచు నీ కవిచరిత్రము నింతటితో బరిసమాప్తి నొందించుచున్నాను.

                  విజయవిలాసము

చ. క్షితిపయి వట్టిమ్రాకులు చిగిర్చి వసంతుడు తా రసోపగుం
   భితపదవాసనల్ నెఱప మెచ్చక చంద్రుడు మిన్నునం బ్రస
   న్నతయును సౌకుమార్యము గనంబడ ఱా ల్గరగగజేసె నే
   గతిరచియించి నేని సమకాలమువారల మెచ్చరేకదా- [ఆ.1]


ఉ. కోమలి యీగతి న్మది తగుల్పడ బల్కిన నవ్వి నిర్జర
   గ్రామణిసూను మీ రెచట గంటిరొ యంటివి కన్నమాత్రమే
   యేమని చెప్పవచ్చు నొకయించుకభేదము లేక యాయనే
   మేమయియున్న వారముసుమీ వికచాంబుజపత్రలోచనా- [ఆ.2]


చ. శివు డిటు రమ్మటంచు దయచేసినచో దల కెక్కి తుగ్రవై
   భవమున జూచుచో నడుగు బట్టితి వేమనవచ్చు నీగుణం
   బవునవు నందినన్ సిగయు నందక యున్నను గాళ్ళు బట్టుకొ
   దువు హరిణాంక వేళకొలదు ల్గద నీనడక ల్తలంపగన్. [ఆ.3]


                   సారంగధర చరిత్రము

ఉ. చక్కిలిగింతపెట్టినను సారె గికాగిక నవ్వుచున్ బయిం
   బక్క బడంగ జక్కనికుమారుని మక్కువమీఱ నేడ్పురా
   జెక్కిలిమీటి యెత్తి యెద జేరిచి ముచ్చట దీరునట్లుగా
   నక్కట ముద్దు లాడవలదా వలదా యిటువంటి భాగ్యముల్- [ఆ.1]


ఉ. ఆతరలాక్షి డెందమున నారట మొందుచు నేమిచేయుదున్
   రాతికి దోడుపోయినది రాసుతుడెండము మెత్తగాదు దా
   దాతికి వచ్చియుండ నిక దాలిమి చెల్లునె మారు డంటిమా
   ఘాతుకు దోడ్వరాదు సముఖంబున నేటికి రాయబారముల్- [ఆ.2]



ఉ. కందు గదయ్య నీమురుపు కన్నులపండువుగాగ నంటినం
   గందు గదయ్య నీతనువు కౌతుగ మొప్పగ నీదుప్రాపు నే
   గందు గదయ్య యంచు నినుగన్న సపత్ని సహింప దందు బో
   కందు గదయ్య యేల విననైతివి నావచనంబు పుత్రకా- [ఆ.3]