ఆంధ్ర కవుల చరిత్రము - రెండవ భాగము/కోట శివరామయ్య

ఉ. ఊరును నిల్లు బల్లియలు నొల్లక సల్లలితాంతరంగులై

ఘోరతరాటవిన్ ఘననికుంజములన్ సెలయేళ్ళ చెంత శృం

గారవంబులన్ భయదగహ్వరసీమ దపంబు జేసి పెం

పారుమహామునీశ్వరులయాత్మలు దత్తఱ మందె నత్తఱిన్. [ఆ.1]


ఉ. చిత్తసరోజ మిష్టమున జేరిచి చూపులు ప్రాణలింగమున్

హత్తగ జేసి భావమున కంచితతృప్తి యొసంగి సంగముల్

రిత్తలు చేసి యెందును జరింపగ నేరిచి తేని నీవ య

త్యుత్తమలింగమూర్తి వివి యొప్పుగ జేకొను సిద్ధరామనా. [ఆ.3]


మ. బసవయ్యా భవదీయమందిరమునన్ భక్తిన్ సదాభోజనం

బసలారంగ నొనర్చుజంగమము లాత్యాసక్తి నాకటించే

విసునంగా నికనేల తామసము ఠీవిన్ వారి దోడ్తెచ్చి మీ

రసమానస్థితి నారగింప గదరయ్యా హాయిగా నేటికిన్. [ఆ.5]

                          __________

16. కోట శివరామయ్య

ఈకవి సానందోపాఖ్యాన మను నాలుగాశ్వాసముల పద్యకావ్యమును రచించెను. ఇతడు శూద్రుడు; కౌశికగోత్రుడు; కోట బాపనయ్య పుత్రుడు; కాళహస్తిపుర నివాసుడు. ఇతడు తాను కృష్ణదేవరాయలకాలములో నున్నధూర్జటికవి శిష్యుడ నని గ్రంథములో జెప్పుకొని యుండుటచేత 1525 - 1550 వ సంవత్సరములకు మధ్యనుండియుండును. సానందొపాఖ్యానమునందు లక్షణవిరుద్ధము లైన ప్రయోగములు కొన్ని కానబడుచున్నవి. కవిత్వము మృదువుగానే యున్నది. ఈ గ్రంథము నందలి రెండు మూడు పద్యముల నిందుదాహరించుచున్నాను