ఆంధ్ర కవుల చరిత్రము - రెండవ భాగము/కృష్ణదేవరాయలు
ఆంధ్రకవుల చరిత్రము.
మధ్యకవులు
కృష్ణదేవరాయలు
ఇత డాముక్తమాల్యద యను నామాంతరముగల విష్ణుచిత్తీయ మనుప్రబమంధమును రచించిన మహాకవి. ఇతడు కవీశ్వరు డయి విద్వ న్మహాకవుల నాదరించుట వలననేకాక మహారాజయి యనేక దేశములను జయించుటవలన గూడ సుప్రసిద్ధు డయినవాడు. దక్షిణహిందూ దేశమును పాలించినరాజులలో నింతదేశమును జయించి యేలినవాడును, ఇంత ప్రసిద్ధి కెక్కినవాడును, మఱియెవ్వడును లేడు. కాబట్టి యీతని చరిత్రమును వ్రాయుటకుముం దీతని పూర్వచరిత్రమునుగూడ సంక్షేపముగా గొంతవ్రాయుట యుచితమని తోచుచున్నది. ఈతని రాజధాని బళ్ళారిమండలములోని యానెగొందికి సమీపమున తుంగభద్రాతీరమునం దున్న విజయనగరము. ఈవిజయనగరమునకు విద్యానగరమనియు నామాంతరము గలదు. ఈపట్టణము విద్యారణ్యస్వామియని మహాప్రసిద్ధిగన్న మాధావాచార్యులవారి యాజ్ఞచేత గట్టబడినది. ఈమాధవాచార్యు లాకాలమునందు బుక్కరాజువద్ద మంత్రిగా నుండెను. కంపభూపతి కుమారుడైన బుక్కరాజు క్రీస్తుశకము 1379 వ సంవత్సరము వఱకును రాజ్యము చేసెను. ఈరాజు హూణశకము 1336 వ సంవత్సరము మొదలుకొని 1350 వ సంవత్సరము వఱకునుగూడ తనయన్నయైన హరిహర రాజుతో గలిసి రాజ్యము చేసెననియు, ఆకాలమునందు గూడ మాధవాచార్యుడే వారికి మంత్రియనియు, వారికిరాజ్యము మాధవాచార్యుని వలననే వచ్చెననియు, కొందఱందురుగాని యది యెంతవఱకు సత్యమో తెలియదు. బుక్కభూపాలుని తండ్రియైన సంగ (కంప) రా జొకచిన్న సంస్థానాధిపతియై యుండి, మహమ్మదీయులు దండెత్తి వచ్చి హిందూ రాజ్యమును నాశనముచేసి యోరుగంటి ప్రతాపరుద్రుని చెఱగొనిపోయిన కాలములో తనరాజ్యమును పోగొట్టుకొని యుండును. కొందఱతడు గొల్లవాడని చెప్పుదురు. కాని యాతని పూర్వస్థితిని నిర్ధారణము చేయుటకు దగిన యాధారము లేవియు నిప్పుడు కానరావు. ఈ హరిహర బుక్కరాజులు సహితము ప్రతాపరుద్రుని యవసానదశ యందాతని సేవలో దండనాథులుగా నుండిరని యొకానొకరు వ్రాసియున్నారు. ఏదియెట్లున్నను వీ రారంభదశలో రాజ్యహీనులయియుండి తమ ధైర్యసాహసముల వలనను తమ కులగురువైన మాధవాచార్యుని బుద్ధిబలమువలనను రాజ్యము సంపాదించి, స్వతంత్రులై మాధవాచార్యుని మంత్రిగా జేసికొని యాతని యాలోచన ననుసరించి వర్తించు చుండినట్టుమాత్రము నిశ్చయముగా తెలియవచ్చుచున్నది. మాధవాచార్యులు తానొక దేవత నుపాసించి యాదేవతను బ్రత్యక్షము చేసికొని యామెవరముచేత బుక్కభూపాలునకు రాజ్యమిప్పించెనని కొందఱును, లక్ష్మీకటాక్షమును బొంది సన్నిహితురాలయిన లక్ష్మీదేవిని త న్నైశ్వర్యవంతునిగా జేయుమని కోరినప్పు డామె యాతని కాజన్మమునందు లక్ష్మీ లభింపదని చెప్పగా జన్మాంతరతుల్యమైన సన్యాసమును స్వీకరించి వైభవములను బొందెనని కొందఱును వ్రాసియున్నారు. ఇవి యిటీవలివారి బుద్ధికల్పితములు. ఇటువంటి కథలను కల్పించుటలో హిందువులకు గల సామర్థ్యము మఱియెవ్వరికిని గానబడదు. మాధవాచార్యులకు బూర్వమునందు శంకరాచార్య పీఠమునకు వచ్చిన యతీశ్వరు లాదిశంకరుని వలెను, ఇతర సన్యాసులవలెను పాదచారులయి భిక్షాటనము చేయుచు, శిష్యపరంపరకు తత్త్వబోధను జేయుచువచ్చిరి. ఈ మాధవాచార్యుడు బుక్కరాజువద్ద మంత్రిగానుండి సమస్తవైభవముల ననుభవింపుచు సన్యసించినవా డగుటచేత దాను సన్యాసియయ్యును తొంటివిభవములను విడువజాలనివా డయి జనులకు దనయందు గల గౌరవాధిక్యము వలనను, రాజానుగ్రహము వలనను, గజాశ్వాందోళనాది సమస్తరాజ చిహ్నములను ధరించి, పీఠాధిపతుల కిట్టి యైశ్వర్యచిహ్నము లుండవచ్చునని నిబంధనముచేసి సమర్థించుకొనెను. ఏనుగులతోను, గుఱ్ఱములతోను, వాద్యములతోను పల్లకులలోనెక్కి సర్వసంగపరిత్యాగు లయిన సన్యాసులు మహారాజ వైభవముతో సంచరించుట దేవతా పరాయత్తమని సాధించుటకై మనవారీ లక్ష్మీకథను తరువాత గల్పించియుందురు. సన్యాసాశ్రమమును స్వీకరించినప్పుడు మాధవాచార్యులవారు విద్యారణ్యు లన్న నామమును స్వీకరించిరి. వీరికాలము నుండియే జగద్గురువుల మనుకొనెడు స్మార్తాచార్యపీఠస్తు లయినయతుల కందఱకును గజాశ్వాదులును వాద్యములును పెండ్లి పల్లకులును పరంపరగా వచ్చుచున్నవి. ఈ మాధవాచార్యులవారు గొప్ప విద్వాంసులు. ఆదిశంకరుల తరువాత శంకరాచార్య పీఠమునకు వచ్చినవారిలో మాధవచార్యులకు బూర్వమునందుగాని పరమునందుగాని యింతటిపండితులు మఱియెవ్వరును లేరు. ఈయన పరాశర మాధవీయ మనుపేర పరాశరస్మృతి కొక్క గొప్ప వ్యాఖ్యానమును, కాలమాధవీయ మనునొక కాలనిర్ణ యగ్రంథమును, శంకరవిజయమును, విద్యారణ్యమని ప్రసిద్ధిగన్న వేదభాష్యమును, నూటయెనిమిది యుపనిషత్తుల కొకవ్యాఖ్యానమును, సర్వదర్శన సంగ్రహమును, మాధవనిదాసమును రచియించెను. రాబోయెడు విజయనగర రాజుల చరిత్రమును దివ్యజ్ఞానముచేత ముందుగానే తెలుపుచు నీ మహావిద్వాంసునిచే రచియింపబడిన దన్న కాలజ్ఞానమను పుస్తక మొకటి కలదు. గాని యది విజయనగర సంస్థానము క్షీణించినతరువాత రచింపబడిన యాధునికగ్రంథ మయియుండును. మాధవాచార్యులవారు తుంగ భద్రాతీరమునందున్న పంపానగరమునందు జన్మించిరి; వీరు బుక్కభూపాలునికి కులగురువులు; భారద్వాజసగోత్రులయిన తెలుగు బ్రాహ్మణులు; ఈయన తండ్రి మాయణుడు; అన్నసాయణుడు. అన్న యందును తండ్రియందునుగల గౌరవముచేత మాధవాచార్యుల వేదభాష్యములలో గొన్నిటికి వారిపేరులు పెట్టెను. మాధవాచార్యులు తొంబదిసంవత్సరముల ప్రాయమున సిద్ధిపొందిరట; ఈయన 1368 వ సంవత్సరము నందు బుక్కరాజుమంత్రి యైయుండిన ట్లొక తామ్రశాసనమువలన దెలియ వచ్చుచున్నది. మాధవీయాదిగ్రంథములలో మాధవాచార్యులవారు తమవంశమును దెలుపుచు వ్రాసిన రెండు శ్లోకముల నిందు జూపు చున్నాను:-
శ్లో|| యస్య బోధాయనంసూత్రం శాఖాయస్యచయాజుషీ
భారద్వాజకులంయస్య సర్వజ్ఞ స్సహిమా ధవ:
శ్రీమతీయస్యజననీ సుకీర్తి ర్మాయణు: పితా
సాయణోభోగ వాథశ్చ మనోబుద్ధిసహోదరౌ.
బుక్కరాజుతరువాత నాతనికి కామాక్షీ దేవివలన బుట్టినహరిహరనాథుడు 1379 వ సంవతరము మొదలుకొని 1401 వ సంవత్సరము వఱకును రాజ్యము చేసెను. ఈ హరిహరరాజునకు మల్లాదేవి వలన గలిగిన పుత్రుడైన వీరప్రౌడదేవరాయలు 1412 వ సంవత్సరము వఱకును, ఆతనిపుత్రుడైన విజయభూపతి 1418 వ సంవత్సరము వఱకును, ఆతనికుమారుడైన దేవరాయలు 1422 వ సంవత్సరము మొదలుకొని 1447 వ సంవత్సరము వఱకును రాజ్యము చేసినట్లు శిలాతామ్రశాసనములవలన దెలియవచ్చుచున్నది. కాని వీ రేయేసంవత్సరములయందు సింహాసన మెక్కిరో యేయేసంవత్సరములయందు పరమపదమును పొందిరో నిశ్చయముగా దెలియదు. బుక్కరాజు కాలమునుండియు వీరికి మహమ్మదీయులతో యుద్ధములు జరుగుచు వచ్చెను. 1364 వ సంవత్సరమునందు మొట్ట మొదట బుక్కరాజు మహమ్మదీయులను యుద్ధములో జయించెను. ఆతని పుత్రుడైన హరిహరరాజును మహమ్మదీయులతో యుద్ధము చేసి 1380 న సంవత్సరమునందు తురష్కులను గోవానగరమునుండి వెడల గొట్టెను. ఈ హరిహరరాజు హిందూదేవాలయముల కనేకములకు భూధానములు చేసెను. హరిహరరాజుయొక్క కడపటి దినములలో సాళువగుండరాజు మంత్రిగా నుండెను. గుండరాజు జైమినిభారతము కృతినందిన సాళువనృసింహరాజుతండ్రి. గుండరాజు మంత్రిగాను దండనాథుడుగాను ఉండి కొంత రాజ్యమును సంపాదించెను. తదనంతర మాతనిపుత్రుడు సాళువ నృసింహరాజు దేవరాయలు సంతానము లేక మృతుడగుటవలననో మఱియేలాగుననో కర్ణాటకరాజ్యము నాక్రమించుకొనెను. నరసింహరాజునకు తిమ్మరాజను పేరుగల జ్యేష్టభ్రాత యొకడు గలడు. అతడే యీశ్వరరాజు తండ్రియైన సాళువతిమ్మరాజని తోచుచున్నది. సాళువ నృసింహరాజు భూదానములు మొదలయిన దానము లనేకములు చేసెను. ఇతడు చిత్తూరి మండలములోని వందవాసినగరమునకు పడమట నామడదూరములో నున్న వెల్లము గ్రామములోని దేవాలయమునకు శాలివాహనశకము 1391 వ సంవత్సరమునం దనగా హూణశకము 1469 వ సంవత్సరమునందు గొంతభూమి యిచ్చెను; ఈతని రాజ్య కాలములోనే చిత్తూరిమండలములోని యాపూరు గ్రామములోని శివాలయమున కొకరిచేత శాలివాహనశకము 1393 వ సంవత్సరమునకు సరియైన క్రీస్తుశకము 1471 వ సంవత్సరము నందు గొంతభూమి యియ్యబడినది. ఈ నృసింహరాజు కాలమున తిమ్మరాజు పుత్రుడైన యీశ్వరరాజు దండనాథుడుగా నున్నట్లు వరాహపురాణ పీఠికవలన దెలియవచ్చుచున్నది. ఈ నృసింహరాజు మరణానంతర మీశ్వర రాజపుత్రు డయిన నరసింహరాజు రాజ్యమునకు వచ్చెను. ఇతడు 1487 వ సంవత్సరము వఱకును రాజ్యము చేసినట్లు శాసనములవలన దెలియవచ్చుచున్నది. కొందఱితడు 1505 వ సంవత్సరమువఱకు మాత్రమే రాజ్య పరిపాలనము చేసె ననియు, ఆసంవత్సరము మొదలుకొని యాతని జ్యేష్టపుత్రు డయిన వీరనృసింహరాయలు పరిపాలనము చేసెననియు చెప్పుచున్నారు. ఇదియే నిజమై యుండవచ్చును. పే రొక్కటియే యై యుండుటచేత శాసనములను పరీక్షించినవారు కొడుకునుగూడ తండ్రినిగా భ్రమించియుందురు. 1509 వ సంవత్సరమునందు కృష్ణదేవరాయల ప్రభుత్వ మారంభమైనది. కృష్ణదేవరాయలు రాజ్యమునకు రాకముం దాతని యన్నయైన వీరనృసింహరాయలు కొంతకాలము రాజ్యము చేసినట్లు కృష్ణదేవరాయల కంకితము చేయబడిన గ్రంథములయం దెల్లరు జెప్పబడియున్నది:-
క. వీరనృసింహుడు నిజభుజ
దారుణకరవాలపరుషధారాహతవీ
రారియగుచు నేకాతవ
వారణముగ నేలె ధర నవారణమహిమన్.
క. ఆవిభు ననంతరంబ ధ
రావలయము దాల్చె గృష్ణరాయుడు చిన్నా
దేవియు శుభమతి తిరుమల
దేవియునుం దనకు గూర్చు దేవేరులుగన్ - మనుచరిత్రము,
క. వారలలో దిప్పాంబకు
మారుడు పరిపంధికంధిమంథాచలమై
వీరనరసింహ రాయడు
వారాశిపరీతభూమివలయం బేలెన్. శా. వీరశ్రీనరసింహ శౌరి పిదపన్ విశ్వక్షమామండలీ
ధౌరంధర్యమున స్జనంబు ముద మంద న్నాగమాంబాసుతుం
డారూడోన్నతి గృష్ణరాయడు విభుండై రాజ్యసింహాసనం
బారోహించె విరోధులు న్గహనశై లారోహముం జేయగన్. [పారిజాతాపహరణము]
శిలాతామ్రశాసనాదులవలన దెలియవచ్చెడు పయివిధమునగాక యీ వంశవిషయ ముయి పలువురు పలువిధముల పరస్పరవిరుద్ధముగా వ్రాసియున్నారు. అందొక విధము నిందుక్రింద గనబఱిచెదను.
మొదలు - వఱకు
హరిహరరాయలు-------------------------1336 - 1350
బుక్కరాయలు---------------------------1350 - 1379
హరిహరరాయలు-------------------------1379 - 1401
విజయబుక్కరాయలు---------------------1401 - 1418
పల్ల బుక్క రాయలు-----------------------1418 - 1434
గౌడదేవరాయలు--------------------------1434 - 1454
రాజ శేఖర రాయలు-----------------------1454 - 1455
విజయభూపతి---------------------------1455 - 1456
ప్రౌడ దేవరాజు----------------------------1456 -1477
వీరప్రతాపరాయలు------------------------1477 - 1481
మల్లికార్జునరాయలు-----------------------1481 - 1487
రామచంద్రరాయలు------------------------1487 - 1488
విరూపాక్షరాయలు-------------------------1488 - 1490
నరసింహరాయలు-------------------------1490 - 1495
నరస రాయలు----------------------------1495 - 1504
వీరనరసింహ రాయలు----------------------1504 - 1509
కృష్ణదేవ రాయలు--------------------------1509 - 1530 ఈ పట్టిక యొక్కటియే చాలవఱకు శిలాతామ్రశాసనములలోని కాలము ననుసరించి యున్నది.
కృష్ణదేవరాయలు జన్మించిన దినముగాని సంవత్సరముగాని సరిగా దెలియదు. కృష్ణరాయలజనన మొకరు 1465 వ సంవత్సరమునందనియు, ఇంకొకరు 1487 వ సంవత్సరమునందనియు వ్రాసియున్నారు. గాని యందేది సత్యమయినదియు నిశ్చయించుట కాధారము లేవియు దొరకలేదు. ఇతడు శాలివాహనశకము 1387 వ సంవత్సరమునందనగా క్రీస్తుశకము 1465 వికృతిసంవత్సర పుష్యబహుళ ద్వాదశీ శుక్రవారమునాడు పుట్టినట్టు తెలిపెడి యీక్రిందపద్య మొకటి వాడుకలో నున్నది:-
ఉ. అందలి శాలివాహనశతాబ్దము లద్రివసుత్రిసోములన్
వందిత మైనయవ్వికృతివత్సర మందలి పుష్యమాసమం
దుం దగుకృష్ణపక్షమున నుండెడిద్వాదశి శుక్రవాసరం
బం దుదయించె గృష్ణుడు శుభాన్వితు డానరసింహమూర్తికిన్.
ఇది యంతవఱకు విశ్వసింపదగినదో బుద్ధిమంతులగువా రాలోచించుకొందురుగాక! అయినను, ఇది మొదటివారు చెప్పినకాలముతో సరిపోవుచున్నందున దీని నధికవిశ్వాసార్హముగా నెంచవచ్చును. 1829 వ సంవత్సరములో కావలి వెంకటరామస్వామిగారు కలకత్తానగరమునందు బ్రచురించిన దక్షిణహిందూదేశకవుల చరిత్రములో కృష్ణరాయలు తన నలువదవయేట శాలివాహనశకాబ్దములు 1446 వ సంవత్సరమునందనగా క్రీస్తుశకము 1524 వ సంవత్సరమునందు మృతినొందినట్టి వ్రాసియున్నారు. దీనిని బట్టిచూడగా నీ రాయలవారు హూణశకము 1484 వ సంవత్సరమున బుట్టిన ట్టేర్పడుచున్నది. అల్లసాని పెద్దన్న చెప్పినట్టు చాటుధారగా వచ్చుచున్న యీక్రింది పద్యములనుబట్టికూడ కృష్ణదేవరాయల మృతికాల మించుమించుగా దీనితో సరిపోవుచున్నది. ఉ. బోరన యాచకప్రతతి భూరివిపద్దశ నొందుచుండగా
నారయ శాలివాహనశకాబ్దము లద్రియుగాబ్ధిసోములం
దారణవత్సరంబున నిదాఘదినంబున జ్యేష్ఠశుద్ద ష
ష్ఠీరవివాసరంబున నృసింహుని కృష్ణుడు చేరె స్వర్గమున్
ఈ పద్యమునుబట్టి శకాబ్దములు 1447 టికి సరియయినహూణశకము 1524 వ సంవత్సరమున గృష్ణరాయ లంతరించినట్లు కానబడుచున్నను, 1530 వ సంవత్సరమువఱకు నాతని దానశాసనములు విస్తారముగా నున్నందున శాసనములను బరీక్షించిన యిప్పటి వారతడు 1530 వ సంవత్సరమునందే మృతినొందెనని నిశ్చయించియున్నారు. 1526, 1528, 1529 వ సంవత్సరములయం దచ్యుతదేవరాయల దానశాసనములు సహితము రెండుమూడు కానవచ్చు చున్నను, అవి కృష్ణరాయల జీవితకాలములోనే చేయబడినవి కావచ్చును. కృష్ణదేవరాయలతండ్రియైన నరసింహరాయనికి తిప్పాంబ యనియు, నాగమాంబయనియు, ఇద్దఱు భార్యలు గలరు. ఆ యిరువురలో తిప్పాంబ పట్టపురాణియనియు, నాగమాంబ భోగకాంతయనియు, చెప్పుదురు. కొన్ని శాసనములయందు గూడ నిట్లే కానబడుచున్నది. ఆయిద్దఱు భార్యలలో తిప్పాంబకు వీరనృసింహరాయలును, నాగమాంబకు కృష్ణదేవరాయలును పుట్టిరి. నరసింహదేవరాయల కోబమాంబ యని యింకొక భార్య యున్నట్లును, ఆమె కచ్యుతదేవరాయలు పుత్రుడయినట్టును, శాలివాహనశకము 1459 వ సంవత్సరమునకు సరియైన హూణాబ్దము 1537 హేవిళంబి సంవత్సరమున చిత్తూరిమండలములోని నారాయణపురము నొక బ్రాహ్మణునికి దాన మిచ్చుచు నచ్యుతదేవరాయలు వ్రాసియిచ్చిన తామ్రశాసనములోని యీక్రింది వాక్యములవలన దెలియవచ్చుచున్నది:తిప్పాజీ నాగలాదేవ్యో కౌసల్యా శ్రీసుమిత్రయో:
జాతౌ వీరనృసింహేంద్ర కృష్టరాయ మహీపతి:
అస్మాదోబాంబికాదేవ్యా మచ్యుతేంత్రోపి భూపతి:
కృష్ణదేవరాయలతండ్రి నరసింహ రాజే మధుర శ్రీరంగపట్టణము మొదలయినవానిని జయించి తద్దేశముల నాక్రమించినట్లు పారిజాతాపహరణములోని యీక్రిందిపద్యమువలన దేటపడుచున్నది.
సీ. కుంతలేశ్వరుడు చిక్కుపడంగవిద్యాపురంబు గైకొని నిజప్రౌడినెఱపె
బారసీకునకు దుర్భరమానవత్వంబు దొలగించె మానవదుర్గసీమ
జోళవల్ల భునకుసురవధూమధురాధర ములిచ్చిమధురాపురంబుగొనియె
శ్రీరంగ పట్టణసీమ ఖడ్గనటీవినోదంబు హావనేంద్రునకు జూపె
నతడు నుతికెక్కె రామసేత్వంతరాళ
కలితషోడశ దానవిఖ్యాతయశుడు
మండలీకర మేఘమార్తాండబిరుదు
డీశ్వరాధిపు నరసపృధ్వీశ్వరుండు.
1509 వ సంవత్సరమునకు సరియైన శాలివాహనశకము 1430 శుక్ల సంవత్సర వైశాఖమాసమునందు సింహాసనమునకు వచ్చువఱకును గల కృష్ణరాయనిచరిత్రము విశ్వాసార్హమైన దేదియు తెలియదు. వీర నృసింహరాయని పై జూపు ప్రేమముకంటె దండ్రి కృష్ణరాయనియెడ నధికప్రేమమును జూపుచు వచ్చెననియు, అది చూచి సహింపలేక వీరనృసింహరాయని తల్లి తన సపత్నీపుత్రుని జంపింప బ్రయత్నింపగా మంత్రియైన తిమ్మరు సాజాడ గనిపెట్టి యాతనిని దాచి ప్రాణమును రక్షించి కాపాడె ననియు, తరువాత గొంతకాలమునకు నృసింహదేవరాయలు జబ్బుచేత బాధపడుచు బ్రాణావసానకాలమునందు గొడుకులను బిలిచి తనవ్రేలియుంగరమును దీసికొన్నవాడు రాజ్యార్హు డని చెప్పినప్పుడు తక్కినవారు తీయుట కుపాయముతోచక యూరకుండగా గృష్ణరాయలు తనచేతిఖడ్గముతో జనకునివ్రేలు నఱికి యుంగరమును గైకొనెననియు, అతని సాహసమునకు మెచ్చి తండ్రి యాతనినే పట్టాభిషిక్తుని జేయ నియమించి దేహవియోగమును బొందెననియు కథలు చెప్పుదురు. నరసింహరాయని యనంతరమున జేష్ఠుడయిన వీరనృసింహరాయడే రాజ్యమునకు వచ్చినట్టు కృష్ణరాయని కంకితము చేయబడిన మనుచరిత్రాది గ్రంథములే చెప్పుచున్నందున , ఈ కడపటిసంగతి సత్యమయి యుండదు. కృష్ణదేవరాయడు సింహాసనమునకు వచ్చిన శీఘ్ర కాలములోనే యుద్ధయాత్రచేసి తన రాజ్యమును నానాముఖముల వ్యాపింపజేసెను. దాసీపుత్రు డగుటచేత నాతనికి సత్కులీనులగు రాజులెవ్వరును గన్య నియ్యనందున సింహాసన మెక్కునప్పటికి వివాహము కాలేదు. కృష్ణరాయలు 1513 వ సంవత్సరమునందు దక్షిణ దిగ్విజయ యాత్రకు బయలువెడలి మహిసూరు దేశములోని యుమ్మటూరు, శివసముద్రము, శ్రీరంగపట్టణము లోబఱుచుకొని గంగవంశరాజులను జయింపగా, తరువాత మహిసూరుదేశమంతయు స్వాధీనమయినది. ఈ దేశమును జయించినసంగతి పారిజాతాపహరణములోని ద్వితీయాశ్వాసాంతమందలి యీ క్రిందిపద్యమునందు సూచింపబడినది:-
శా. సమ్మర్దక్షమధీనిబంధనవిధాసంక్రందనాచార్య శూ
రమ్మన్యాచలవజ్రనాత జగతీరక్షాంబుజాక్షా శర
ధ్యమ్మార్గస్థవశాస్య రాజ్యసమ సహ్యప్రోద్భవాతీర భా
గుమ్మత్తూరి శివంసముద్రపుర వప్రోన్మూలనాడంబరా.
ఆ సంవత్సరమునందే కృష్ణదేవరాయలు నెల్లూరుమండలములోని యుదయగిరిమీదికి దండెత్తి, దాని కధికారిగానున్న వీరభద్రపాత్రుని పినతండ్రియైన ప్రహరేశ్వర పాత్రుని జయించి యా దుర్గమును సాధించెను. అటుతరువాత గృష్ణరాయల మంత్రియైన యప్పాజీ యను నామాంత రము గల తిమ్మరుసు (సాళువతిమ్మరాజు) నెల్లూరిమండలములోని కనిగిరి (కనకగిరి) కి రాజయినట్టియు, ఓరుగంటి ప్రతాపరుద్రుని సంతతి వారిలో గడపటివా డయినట్టియు వీరరుద్రగజపతి కాతనికొమార్తెను గృష్ణరాయల కిచ్చి వివాహము చేయుమని సందేశము పంపెను. ఆతడు హీనకులుడైన కృష్ణరాయనికి దనపుత్రిక నియ్యనని స్పష్టముగా జెప్పి యటువంటి బలవంతునితో విరోధము పెట్టుకొనుటకు సాహసింపజాలక కొమార్తె నిచ్చెద నని చెప్పి రాయలను మంత్రిసహితముగా రప్పించి, అంత:పురము చొచ్చినప్పుడు రాజుప్రాణములు గొన బ్రయత్నించెను. కోటలో బ్రవేశించిన తరువాత మంత్రియైన తిమ్మరు నీ మోసమును గనిపెట్టి రాజుప్రాణములు కాపాడుటకై తాను రాజువేషమును వేసికొని కృష్ణరాయనికి సేవకవేషమువేసి తన వెంటగొనిపోయెను. కాని కృష్ణరాయనిచేతివ్రేలినున్న ముద్రయుంగరమునుబట్టి యతడేరాజని యత:పురములోని వారానవాలు పట్టిరి. ప్రాణోపద్రవము సంభవింపనున్న యా సమయమునందు ధీమంతుడైన మంత్రియుపాయము వలన రాజు తానును మంత్రియు నెట్లో ప్రాణములు దక్కించుకొని పాఱిపోయి స్వదేశమును జేరినతోడనే సేనలనుగూర్చి కనిగిరిమీద దండెత్తివచ్చి వీరరుద్రునిరాజ్యమును, అతనిపుత్రికయైన చిన్నాదేవినిగై కొని, ద్రోహియైన యాతని జంపక కుటుంబసహితముగా వింధ్యపర్వత ప్రాంతములకు బాఱద్రోలెను. వీరరుద్రునిశుద్ధాంతస్త్రీలు వింధ్యపర్వతముపాలైన సంగతిని మనుచరిత్రమునం దల్లసాని పెద్దన యీరీతిగా వర్ణించి యున్నాడు:-
మ. ధరకెంధూళులు కృష్ణరాయలచమూధాటీగతి న్వింధ్యగ
హ్వరము ల్దూఱగ జూచి తా రచట గాపై యుండుటం జాల న
చ్చెరువై యెఱ్ఱనివింతచీకటులు వచ్చెం జూడరేయంచు వే
పొరిదింజూతురు వీరరుద్రగజరాట్ఛుద్ధాంతముగ్థాంగనల్. కృష్ణరాయలు 1515 వ సంవత్సరమునందు పూర్వదిగ్విజయ యాత్ర వెడలి ఆ సంవత్సరమునందె కొండవీడు, బెల్లముకొండ, బెజవాడ, కొండపల్లి, రాజమహేంద్రవరము మొదలయిన ప్రదేశములను జయించి, 1516 వ సంవత్సరమునందు విశాఘపట్టణమండలములోని భీమునిపట్టణమున కయిదుక్రోసులదూరములో నున్న పొట్నూరివద్ద రాతిజయ స్తంభమును వేయించి, ఆ మండలములోని వీరవల్లి తాలూకాలోని వడ్డాది జయించి, ఉత్కలదేశములోని కటకపురమువఱకును బోయి కటకపురమును గాల్పగా, కళింగదేశాధిపతియై యోడ్రదేశమును బాలించుచుండిన ప్రతాపరుద్రదేవుడు తనకుమార్తైన తిరుమలదేవిని రాజునకిచ్చి వివాహముచేసి సంధి చేసికొనెను. అందుచేత గృష్ణదేవరాయలు రాజమహేంద్రవరము వఱకును గల కళింగదేశమును మరల బ్రతాపరుద్రదేవుని కిచ్చివేసి, 1516 వ సంవత్సరాంతమున కాంచీపురము ప్రవేశించెను. ఈతని ప్రథమ భార్యయైన చిన్నాదేవికి అన్నపూర్ణాదేవియనియు నామాంతరముగలదు. ఈతనికి దిరుమలదేవియు నన్నపూర్ణాదేవియు నిద్దఱుభార్యలగుటను గృష్ణదేవరాయలు తాను విష్ణు చిత్తీయమునం దిట్లు తెలిపియున్నాడు:-
క. ఆవిభు ననంతరంబ ధ
రావలయము బూని తీపు రహిమై దిరుమ
ల్దేవియును నన్నపూర్ణా
దేవియు గమలాబ్జముఖులు దేవేరులుగన్.
ఈతడు పూర్వదిగ్విజయయాత్రలో సింహాచలమును దర్శించినప్పుడు భార్యాసహితముగా జేసినదానమునుగూర్చి సింహాచలదేవాలయములో నేడవ స్తంభముమీద జెక్కించిన యీక్రిందియంశమును విశాఘపట్టణమండల చరిత్రమునుండి తీసికొనుచున్నాను. "శుభమస్తు శ్రీమన్ మహారాజాధిరాజ పరమేశ్వర మూరురాయరగండ ఆదిరాయ విజయభాషాగీత ప్రవర రాయరగండ యవన రాజ్యసంస్థాపనాచార్య శ్రీవీరప్రతాపకృష్ణ దేవమహారాజులు విజయనగరాన సింహాసనస్థుడై పూర్వదిగ్విజయయాత్రకు విచ్చేసి ఉదయగిరి, కొండవీడు, కొండపల్లి, రాజమహేంద్రవరము మొదలయిన దుర్గాలు సాధించి సింహాద్రికి విచ్చేసి స్వస్థిశ్రీ విజయాభ్యుదయ శాలివాహనశక వర్షంబులు 1438 అగు నేటి ధాత సం చైత్ర బ 13 స్థిరవారానా సింహాద్రినాథు దర్శించి తమతల్లి నాగాదేవమ్మగారికిన్ని తమతండ్రి నరసరాయునిగారికిన్ని పుణ్యముగాను దేవునికి సమర్పించిన కంఠమాల 1 కి ముత్యాలు 991 వజ్రమాణిక్యాల కడియాలజోడు 1 టి శంఖచక్రాల పతకం 1 న్ని పయిడిపళ్ళెం 1 న్ని తూకాలు గ 44292 కానిమాడలు గ 2000 తమదేవి చిన్నా దేవమ్మగారిచేతను సమర్పించిన పతకం 1 కి గ 500 తిరుమలదేవమ్మగారిచేతను సమర్పించిన పతకం 1 కి గ 500 యింత మట్టుకు సమర్పించిన ధర్మశాసనము."
కృష్ణరాయల విజయములనుగూర్చి పారిజాతాపహరణమునందును, మను చరిత్రమునందును జెప్పబడిన కొన్ని పద్యముల సం దుదహరించు చున్నాను.
చ. మునుకొని కొండవీటికడ మూడత రుద్రుడు కృష్ణనందను
న్మనసిజునిన్ జయించె నది మానుషమే నరసేంద్రు కృష్ణరా
యనృపతి కొండవీటికడ వాహనభూమి బ్రతాపరుద్రసం
దను డగువీరభద్రు గరుణామతి గాచె జగత్ప్రసిద్ధిగన్.
చ. నెలకొని కృష్ణరాయధరణీవిభు డుత్కలభూమిపాలుతో
గలన నెదిర్చి హ స్తికరకాండతతు ల్మసకంపు బాములై
మలసినచోట గూడిన సమగ్రయశో వసనంబు గప్పి తా
వలవగ జేసె భూసతిని వశ్యవిధిజ్ఞడుగాన నేర్పునన్. సీ. ఉదయాద్రి వేగనత్యుద్ధతి సాధించెవినుకొండ మాటమాత్రన హరించె
గూటము ల్సెదరంగ గొండవీడగలించె బెల్లముకొండ యచ్చెల్ల జెఱిచె
వేలుపుకొండ నుద్వృత్తి భంగము సేసె జల్లిపల్లె సమగ్రశక్తి గూల్చె
గినుకమీఱ ననంతగిరి క్రిందుపడ జేసె గంబంబుమెట్లు గ్రక్కనగదల్చె
బలనికాయము కాలుముట్టల నడంచు
గటకమును నింక ననుచు సుత్కలమహీశు
డనుదినమ్మును వెఱచు నెవ్వనికి నతడు
రాజమాత్రుండె శ్రీకృష్ణరాయవిభుడు:-పారిజాతాపహరణము.
సీ. తొలుదొల్త నుదయాద్రిశిలదా కితీండ్రించు నసిలోహమున వెచ్చనయిజనించె
మఱికొండవీ డెక్కి మార్కొని నలియైనయలకసవాపాత్రు నంటిరా జె
నటసాగి జమ్మిలోయబడి వేగదహించె గోనబిట్టేర్చె గొట్టానదగిలె
గనకగిరిస్ఫూర్తి గరచె గౌతమి గ్రాచె నవులనాపొట్ణూరు రవులు కొనియె
మాడెములు వ్రేల్చె నొడ్డాది మసియొనర్చె
గటకపురి గాల్చె గజరాజు గలగిపఱవ
దోకచిచ్చన నౌర యుద్ధురత గృష్ణ
రాయబాహుప్రతాపజాగ్రన్మహాగ్ని.
చ. అభిరతి గృష్ణరాయడు జయాంకములన్ లిఖియించి తాళస
న్నిభముగ బొట్టునూరికడ నిల్పినకంబము సింహభూధర
ప్రభు తిరునాళ్ళకుం దిగుసురప్రకంబు కళింగమేదినీ
విభు నపకీర్తిక జ్జలము వేమఱుబెట్టిపఠించు నిచ్చలున్:-మనుచరిత్రము.
పూర్వదిగ్విజయయాత్ర చేసి వచ్చినతరువాత మూడుసంవత్సరములవఱకును కృష్ణదేవరాయలు యుద్ధము లేమియు జేసినట్టు కానబడదు. అత డాకాలమునందంతటను విద్యావ్యాసంగమునందు ప్రొద్దు పుచ్చుచుండెను. అల్లసానిపెద్దన తనస్వారోచిషమను చరిత్రమును, నంది తిమ్మన తనపారిజాతా పహరణమును, 1516 వ సంవత్సరమునకు తరువాతను 1520 వ సంవత్సరమునకు లోపలను కృష్ణదేవరాయనికంకితము చేసిరి. 1519 వ సంవత్సరాంతమునందు బీజపురమహమ్మదీయులతో యుద్ధము చేసి, 1520 వ సంవత్సరమునందు సుల్తానయినయేడిల్ ఖానుని జయించెను. ఈయుద్ధవార్త పూర్వోక్తములైన రెండుగ్రంథములయందు నుదహరింపబడక పోవుటచేత నవి యీ యుద్ధమునకు బూర్వమునందే రచియింపబడినట్టు నిశ్చయింపవలసియున్నది. అయినను గృష్ణదేవరాయలే తన యాముక్తమాల్యదయం దీయుద్ధవృత్తాంతము నీక్రింది పద్యముచే జెప్పియున్నాడు:-
మ. అలుక న్ఘోటకధట్టికాఖుర పుటీహల్య న్గురాసానిపు
చ్చలువో దున్ని చలచ్చమూగజమదాసారప్లుతిన్ గీర్తిపు
ష్కలసస్యం బిడి యేకధాటి బళిరా కట్టించితౌ దృష్టి కే
దులఖానోగ్రకపాల మర్థపహరిద్భూజాంగలశ్రేణికన్.
పయిపద్యమునుబట్టి యాముక్తమాల్యద 1520 వ సంవత్సరమునకు దరువాత రచియింపబడిన ట్లేర్పడుచున్నది. ఓరుగల్లు, గోలకొండ మొదలయిన సంస్థానములను గూడ జయించి యితడు తనరాజ్యమును దక్షిణహిందూస్థానమునం దంతటను వ్యాపింపజేసెను. ఈదక్షిణదేశమును పాలించినరాజులలో నింతగొప్పరాజ్యమేలినరాజు మఱియెవ్వడును లేడు. ఒడ్డిరాజు లయిన గజపతులను, తురుష్కరాజు లయిన యశ్వపతులను, తెలుగురాజు లయిననరపతులను, జయించుటచేత నీతనికి మూరురాయరగండడని బిరుదు కలిగినది. ఇటువంటి బిరుదము లనేకము లీయనకు గలవుగాని యవి యన్నియు నిందు వివరించుట యనావశ్యకము. ఈతడు శ్రీరంగపట్టణము, మధుర, తిరుచనాపల్లి, మళయాళము మొదలయిన దేశములను పాలించుటకు తెలుగునాయకు లను పాలకులనుగా నేర్పఱిచెను. ఈతడే తుంగభద్రానదికి విజయనగరమువద్ద వంతెన కట్టెను. ఈతనికి తిమ్మరుసు మంత్రిగా నుండెనుగాని యతడు రాజునకంటె మూడు సంవత్సరములు ముందుగా మృతినొందెను.
ఈకృష్ణదేవరాయలది తుళువవంశము. ఇంటిపేరు సాళువవారు; పూర్వు లావఱకు వసియించిన గ్రామనామములనుబట్టి సంపెటవారనియు, సెలగోలవా రనియు కూడ గృహనామము గలదు. ఈకడపటి రెండు పేరులును కరణములు వ్రాసియుంచిన కొండవీటికవిలె చరిత్రమునం దుదాహరింపబడి యున్నవి. ఇంతవఱకును రాజుయొక్క విజయములను గూర్చి సంక్షేపముగా వ్రాసియున్నాను. ఇక నీతని పాండిత్య ప్రభావాదులనుగూర్చి కొంత వ్రాయవలసి యున్నది. పూర్వకాలమునందు భోజరాజు సంస్కృతభాష నాదరించినట్లే యిత డాంధ్రభాష నాదరించి కవులను సన్మానించి గ్రంథరచన చేయించుటచేత నీతని కాంధ్రభోజుడని బిరుదనామము గలిగినది. ఇతడు కవుల నాదరించి కావ్యములు చేయించుటయే కాక తానుగూడ విద్వాంసుడై సంస్కృతాంధ్రములయందు గ్రంథములను రచియించుటకు సమర్థు డయియుండెను. ఈతడు సంస్కృతమునందు బెక్కుగ్రంథములు రచించినట్టు విష్ణుచిత్తీయమునందలి యీపద్యమునందు జెప్పబడియున్నది
సీ. పలికి తుత్ప్రేక్షోపమల జాతిపెం పెక్క రసికులౌనన మదాలసచరిత్ర
భావధ్వనివ్యంగ్యసేవధిగాగ జెప్పితివి సత్యావధూప్రీణనంబు
శ్రుతిపురాణోపసంహిత లేర్చి కూర్చితి సకలకథాసారసంగ్రహంబు
శ్రోత్రఘచ్ఛటలు విచ్చుగరచించితిసూక్తినై పుణిజ్ఞానచింతామణికృతి
మఱియు రసమంజరీముఖ్యమధుర కావ్య
రచనమెప్పించుకొంటి గీర్వాణభాష నంధ్రభాష యసాధ్యంబె యందు నొక్క
కృతి వినిర్మింపు మిక మాకు బ్రియముగాగ.
అయినను కృష్ణదేవరాయలు రచియించిన యీసంస్కృత గ్రంథము లేవియు నిప్పుడు గానరాకున్నవి. సంస్కృతముమాట యెటున్నను కవులను బ్రోత్సాహపఱిచి కావ్యములను చేయించియు తాను జేసియు తెలుగుభాష కీయన మహోపకారము చేసి యున్నాడు. ప్రబంధరచనము క్రొత్తగా నీ కృష్ణ దేవరాయల కాలమునందే యారంభమైనది. అంతకు బూర్వమునందున్న కవులు సంస్కృతమునుంచి యితిహాసములను బురాణములనుమాత్రము తెనిగించుచు వచ్చిరి. వారిలో గేతన యనుకవి యాజ్ఞవల్కధర్మశాస్త్రమును, దండివిరచితమైన దశకుమారచరిత్రమును, శ్రీనాథుడనుకవి శ్రీహర్ష విరచితమైన నై షధకావ్యమును పద్యకావ్యములనుగా దెలిగించిరి. బాణవిరచితమైన కాదంబరి యాంధ్రీకరింపబడినట్టు కానబడుచున్నది గాని కొన్ని లక్షణగ్రంథముల యందుహరింపబడిన పద్యములుతక్క గ్రంథ మెక్కడను పూర్ణముగా దొరకకున్నది.
ఏది యెట్లున్నను గృష్ణదేవరాయనికి బూర్వకాలమునందలికవులు రచించిన యాంధ్రగ్రంథములన్నియు సంస్కృతమునుండి చేసిన భాషాంతరములేకాని స్వబుద్ధికల్పితముగా రచించిన నూతనగ్రంథమం దొక్కటియు గానరాదు. తెలుగునందు నూతనముగా ప్రబంథరచనచేసి తరువాతివారికి దారిచూపినవాడు కృష్ణదేవరాయని యాస్థానకవియైన యల్లసాని పెద్దనామాత్యుడు. ఆతడు రచియించిన మొదటి ప్రబంధము స్వారోచిషమనుసంభమను మనుచరిత్రము. ఈ గ్రంథమునందలి కథ మార్కండేయ పురాణమునుండి గ్రహింపబడినది. మొట్టమొదట నీమనుచరిత్రమును ప్రబంధరూపమున రచింపబట్టియే పెద్దనార్యున కాంధ్రకవితాపితామహు డను బిరుదనామము కలిగినది. కృష్ణదేవరాయలకు సంస్కృతాంధ్రములయం దసాధారణపాండిత్యము గలిగియుండుట నాతడు రచియించిన యాముక్తమాల్యదయే సహస్రముఖముల ఘోషించుచున్నది. ఆముక్తమాల్యద కృష్ణరాయ కృతము కాదనియు దానిని తదాస్థానకవియైన పెద్దనార్యుడు రచించి పుస్తకమున దనప్రభువునకు గ ర్తృత్వమును నారోపించెననియు వాడుక కలదుగాని యదియంతగా విశ్వసనీయముగాదు. కృష్ణదేవరాయ లల్లసానిపెద్దనను, రామరాజభూషణుని, ప్రబంధములను రచించి తెమ్మని యాజ్ఞాపించెననియు, తదాజ్ఞానుసారముగా వారిరువురును గ్రంథరచనచేసి తమప్రబంధములను దీసికొనిరాగా జూచి రాజు వసు చరిత్రమునకంటె మనుచరిత్రము లేతపాకమున బడినదని యభిప్రాయము తెలిపెననియు, అందుమీద పెద్దన "యాముక్త మాల్యద" యనుపేర విష్ణుచిత్తుని చరిత్రమును రచియించి తీసికొనిరాగా విష్ణుచిత్తీయము ముదురుపాకముగా నున్నదనియె ననియు, చెప్పుదురుగాని యిదియంతయు నిటీవలివారి స్వకపోలకల్పితము. వసుచరిత్రమును రచియించిన రాజరాజభూషణుడు కృష్ణదేవరాయని కాలమునం దుండెనో లేడోయని సందేహింపవలసి యున్నది. ఉండిన పక్షమున నత డాకాలమున బిన్నవయసువాడయి యుండవచ్చును. ఆముక్తమాల్యదయు మనుచరిత్రమును రచియింప బడినతరువాత నేబదియేండ్లకుగాని రామరాజభూషణుడు వసుచరిత్రమును రచియింపలేదు. కాబట్టి పయికథ యెంతమాత్రమును నమ్మదగినదికాదు. ఆముక్తమాల్యదకును, మనుచరిత్రమునకును శైలియందు విశేష భేద ముండుటచేతను, ఆముక్తమాల్యద వ్యాకరణదోషయుక్త మయినదిగా నుండుటచేతను, ఆరెండుపుస్తకములు నేకకవిచే రచియింపబడినవి కావని నిశ్చయముగా జెప్పవచ్చును. పెద్దనకవిత్వములో లేనియికారసంధులును, తత్సమశబ్దములం దకారసంధులును, క్త్వార్థకసంధులును, ఆముక్తమాల్యదయందు గానబడుచున్నవి అందు గొన్నిటి నిందు క్రింద జూపుచున్నాను:-
ఇకారసంధులు.
1. గీ. నిం గిటు త్రిశంకుకతన మాతంగవాటి
యయ్యె నిక నుండదగదని యవనికరిగి
నట్టి నక్షత్రతారాగ్రహాళియనగ
గాంతనవరత్న రాసు లంగళ్ళ బొలుచు. ఆ 2
ఇందు మొదటిపాదమునందు "నింగి+ఇటు=నింగిటు" అని ప్రయోగింపబడినది.
2 చ. హతల నొనర్చె మోహితల నల్ల యయోముఖి నాపుల స్త్య భూ
సుతను నిరూపలౌట ననుచో ముసలిన్ బెదనిట్టతాడువం
టతివ రమించె దా ముసలి యయ్యు రహిన్మఱుగుజ్జుప్రేష్యకై
ధృతిచెడి యుగ్రసేనునకు బ్రేష్యత నొందియు దిద్ది యేలడే. ఆ 5
ఇందు మూడవ పాదమునందు "నిట్టతాడువంటి+అతివ=నిట్ట తాడువంటతివ" అనిప్రయోగింపబడినది.
తత్సమములం దకారసందులు.
1. చ. అడుగుననుండియుం బదిలమై చద లంటెడుకోటనొప్పు ప్రో
ల్చెడనికడంక దంచెనపుచేతుల గం గనుకాసె దూఱగా
నడుమనె యున్కిజేసి యల నాకపురి న్సరికై పెనంగి లా
వెడలగ బట్టివ్రేయుటకు నెత్తె ననం జను మల్లుసోరునన్. ఆ 2
ఇచ్చట రెండవచరణమున "గంగ+అను=గంగను" అని ప్రయోగింపబడినది.
3 చ. తడితల డిగ్గిముంప జడతం దుదఱెప్పల గన్నువిప్పి పు
ల్పొడుచుచు నీరు ముంగరలపోలిక ముక్కులగూడ నోట గొం
తొడియుచు గూటికఱ్ఱ సగ మొత్తుచు ఱక్కవిదిర్పు మున్నుగా
వడకుటెకాక చేష్టుడిగెవక్షము పక్షులుజానువుల్ చొరన్. ఆ 4 ఇచట నాలవచరణమందు "చేష్ట+ఉడిగె=చేష్టుడిగె" అని ప్రయోగింపబడినది.
3.శా. అబ్రహ్మణ్యము లోనవై చుకొనె నవ్యాయంబున న్మత్సుతం
దాబ్రహ్మాదులమేర నిల్పియు బ్రభుత్వం బూదియుం ద్రోతురే
యీబ్రక్కంద్విజు జూడరయ్య సభవా రీరంగభ ర్తంచు దు:
ఖాబ్రాశింబడి బాష్పకంఠుడు సముద్యద్దో:పలాలుండునై. ఆ. 6
ఇచట మూడవచరణమున "రంగభర్త+అంచు=రంగభర్తంచు" అని ప్రయోగింపబడినది.
1. సీ.కొంగవాల్నఱుకులంగుళుల బట్టుకజబ్బలంట గుట్టిడ వెజ్జునరయువారు
తలబడ్డ గుదియదెబ్బల బాతమసియిడియంబలిగంజండ్లనడుగువారు
తమసేగజెప్ప లో దయమీఱ వినిచీరజిం చిచ్చువారి దీవించువారు
నొలబడ్డ నెపమున గలలేనిసిరిజెప్పి చుట్టలపై దాడి వెట్టువారు
నైనసాంథులచేత గ్రందైనయూళ్ల
జాడగా నిట దెచ్చి యిన్నీడడించి
వారు నీ రాన బోవనొ వ్వారిమగిడి
వచ్చునాలోన నీరూపువచ్చెనాకు. ఆ.6
ఇచ్చట మూడవపాదమునందు "చించి+ఇచ్చు=చించిచ్చు" అనిప్రయోగింపబడినది. మఱియు నీపద్యమునందే మొదటిచరణమున 'పట్టుకొని" యనుటకు "పట్టుక" యనియు, రెండవచరణమందు "గంజి+ఇండ్ల=గంజిండ్ల" ననియు వ్యాకరణదుష్టములయిన ప్రయోగము లున్నవి. ఈవిధముగానే,
శా. ఎట్టూ యిట్టగునయ్యపల్క దయలే కిన్నాళ్లు నీకూడె యీ
పొట్టంబెట్టి మహాఘలబ్ధి దనువుం బోషించి యెన్నాళ్ల కే
నెట్టే నొక్కతపస్వి యొక్కప్రతి రాడే చూడడే తత్కపన్
బుట్టు న్నీ గెద దీని నా నొదవి యోపుణ్యాత్మయెంటివే "పుట్టున్నీగెద" (పుట్టున్+ఈగెద) మొదలయిన వ్యాకరణ విరుద్ధము లైన ప్రయోగములు మఱి కొన్నియందందు గానవచ్చుచున్నవి. కాబట్టి యీ యాముక్తమాల్యద సర్వలక్షణవేత్త యయిన యల్లసాని పెద్దన విరచితము కాదనుట స్పష్టము. అంతేకాక యీపుస్తకము పెద్దనకవనమువలె మృదువై నదియు, నల్లికగలదియుగాక కటుపద భూయిష్టముగా నున్నందున పెద్దనార్యకృతము కాదని నిశ్చయింప వలసి యున్నది. అయినను కృత్యాద్యవస్థయందు వంశావళిలో పెద్దన ప్రణీత మయిన మనుచరిత్రములోని పద్యములే యిందు గానబడు చున్నందున రెంటికిని గృతికర్త లొక్కరేయని యూహింపవలసి యుండునని కొంద ఱందురుగాని యీయూహ సరియైనదికాదు. వంశావళిలో కృష్ణదేవరాయని జయములును గుణవర్ణనలు మాత్రమే యధికముగా నున్నందున, ఆత్మస్తుతిని దన పద్యములతో జేసికొనుట కిష్టములేనివాడయి కృష్ణదేవరాయలు ప్రధమపురుషములను మధ్యమపురుషములనుగా మార్చి వేంకటేశ్వరుడు తన్నుగూర్చి పలికినట్లుగా మనుచరిత్రములోని పద్యములనే తన యాముక్తమాల్యదయందు వేసికొనియుండును. అయినను విష్ణుచిత్తీయమునందు ముఖ్యముగా నయిదవ యాఱవ యాశ్వాసములయందు పెద్దనపద్యములవంటి "యల్లిక జిగిబిగి" గల పద్యములును బెక్కులు కానబడుచున్నందున గృష్ణదేవరాయలు తన యాస్థాన కవీశ్వరులైనవారి సాహాయ్యమును స్వగ్రంథరచనమునందు బొందియుండును. ఒక్కసాహాయ్యమే యననేల? ఆ యిరువురుకవులును ముఖ్యముగా నాంధ్రకవితాపితామహు డని పేరొందిన యల్లసాని పెద్దనయు రచించిన పద్యములే పెక్కు లాముక్తమాల్యదయం దున్నట్లు కానబడు చున్నవి. అంతమాత్రముచేత గ్రంథకర్తృత్వమును వారి కారోపించుట వలనుపడదు. గ్రంథమును రాజేచేయగా తదాస్థానకవులు కొన్నిపద్యములను మార్చియు, కొన్నిపద్యములను తమవిచేర్చియు నుందురు. కృతి కర్త కృష్ణదేవరాయలనుట కాశ్వాసాంతమునందును కృత్యాదియందును జెప్పబడుటమాత్రమేకాక "పలికితు త్ప్రేక్షోపమల" నిత్యాది పద్యములో నుదాహరింపబడిన తద్రచిత గ్రంధనామములును తత్కర్తృత్వమును స్థాపించుచున్నవి.
ఈ కృష్ణరాయలు కవిత్వమునందు సమర్థుడని యాతనికాలమునం దాముక్తమాల్యదను రచించుటకుముందే యాతని యాస్థానకవులు చెప్పియుండుటకూడ విష్ణుచిత్తీయము కృష్ణరాయకృత మగుటనుస్థిరీకరించుచున్నది. ఈరాజు కవిత్వమునందు నిపుణు డనుటను సూచించుచు రాజునుగూర్చి "కవితాప్రావీణ్యఫణీశ" యను విశేషణము నుపయోగించిన పారిజాతాపహరణములోని నంది తిమ్మనార్యునిపద్యము నొకదానిని నిందు క్రింద బొందుపఱచుచున్నాను:-
క. శ్రీ వేంకటగిరివల్లభ
సేవాపరతంత్రహృదయ చిన్నమదేవీ
జీవితనాయక కవితా
ప్రావీణ్యఫణీశ కృష్ణరాయమహీశా. ఆ .4
అక్కడక్కడ వ్యాకరణ స్ఖాలిత్యము లున్నను కటువుగానున్నను మొత్తముమీద విష్ణుచిత్తీయముయొక్క కవిత్వము మిక్కిలి ప్రౌడముగాను, అర్థగాంభీర్యము కలదిగాను, అలంకార బహుళమయి స్వభావ వర్ణనలు కలదిగాను ఉన్నది. అందుచేతనే రేఫ శకట రేఫములనిమిత్తమయి పెనగులాడిన యప్పకవివంటివాడు సహితము యతిస్రాసముల యందు ద్విరేఫమైత్రి సంగీకరించిన యీ కవిగ్రంథమును గుణబాహుళ్యమును బట్టి లాక్షణికమైనదానినిగా సంగీకరించి తన లక్షణగ్రంథమునం దాముక్తమాల్యదనుండి పద్యములను లక్ష్యములనుగా దీసికొని యున్నాడు. తాను బూర్వము దిగ్విజయయాత్రకు వెడలి బెజవాడయందు గొన్నిదినములుండి కృష్ణామండలములోని శ్రీకాకుళమునందలి యాంథ్ర విష్ణుదేవుని సేవింపబోయిన హరివాసరమునాటి యాదేవుడు స్వప్నములోతోచి వేంకటేశ్వరుని కంకితముగా దెనుగుగ్రంధమును జేయుమనగా విష్ణుచిత్తీయమును రచియించినట్లు కవి తనగ్రంథమునం దీక్రింది వచనములతో జెప్పియున్నాడు.
"...కళింగ దేశవిజిగీషామనీషం దండెత్తిపోయి విజయవాటిం గొన్నివాసరంబులుండి శ్రీకాకుళ నికేతునుండగు నాంధ్రమధుమధను సేవింపంబోయి హరివాసరోపవాసం బచ్చట గావింప నప్పుణ్యరాత్ర చతుర్థయామంబున.
* * * * *
కీ. తెలు గదేలయన్న దేశంబు తెలు గేను
దెలుగువల్లభుండ దెలుగొకొండ
యెల్లనృపులు గొలువ నెఱుగనే బా పాడి
దేశభాషలందు దెలుగు లెస్స.
క. అంకితమో యన నీ కల
వేంకటపతి యిష్ట మైనవే ల్పగుట దదీ
యాంకితము చేయు మొక్కొక
సంకేతము కా కతడె రస న్నే గానే.
కళింగదేశ విజయయాత్ర కయి వెడలి విజయవాటి (బెజవాడ) కి వచ్చినది హూణశకము 1515 వ సంవత్సర మగుటచేత రాజీగ్రంథము నాసంవత్సరమునందు జేయనుద్దేశించి ప్రారంభించియుండును. అయినను నుదహరించిన యుపోద్ఘాతములోని "అలుకన్‌ఘోటక" ఇత్యాది పద్యమునందు వర్ణింపబడిన (1520 వ సంవత్సరమునందు జరిగిన) యేడిల్ఖా నుని జయించినవర్ణన మిందుండుటను బట్టి యీ గ్రంథము 1520 వ సంవత్సరము వఱకును ముగింపబడలేదు. ఈ పుస్తకమునందలి పద్యములు మొత్తముమీద శ్రుతికటువులుగా నున్నను, పెక్కుపద్యము లర్థగాంభీర్యము కలవిగా నుండుటయే కాక మృదుమధురపద గుంభితములైకూడ నున్నవి. కవియొక్క ప్రౌడిమయు కవననై పుణ్యమును దెలియుటకయి కొన్ని పద్యముల నిందుదాహరించుచున్నాను:-
మ. శయపూజాంబుజము ల్ఘటిం దడబడ జన్దోయి లేగౌనుపై
దయదప్ప న్బసుపాడి పాగడపు బాదం బొప్ప జెంగల్వడి
గ్గియనీ రచ్చ్యుతమజ్జనార్థము కటిం గీలించి దివ్యప్రబం
ధయుగాస్య ల్ద్రవిడాంగన ల్నడుతు రుద్యానంబులో త్రోవలన్. ఆ - 1
చ. బలసిన హల్లకచ్ఛటలపై దమజుంజురుముండ్లు రాయగా
గలమములుండు బండియెఱుగంబడి నీ రెడలింప దృష్ణ లో
దలకొన వంగి మున్ జలముద్రావెడు క్రిందటివేళ్ళు మీదట
న్నిలిపి మరందమానుకరణి న్నికటోపవనానిలాహతిన్. ఆ . 1
మ. తరుణు ల్తల్లియొఱ న్గుచంబు లునుపం దచ్ఛైత్యము ల్దీములై
పెర రేపం జనుదెంచెగాక రవిదీప్తిం గ్రుంకి పాతాళగ
హ్వరముం దూఱినవాని నీయదుకుత్రాళ్ళా తెచ్చునా దీర్ఘత
చ్చిరకృష్టిం గనునట్టిశైత్య మలరించె న్నూతులం దత్తఱిన్. ఆ.2
మ. గృహసమ్మార్జనమో జలాహరణమో శృంగారపల్యంకికా
వహనంబో వనమాలికాకరణమో వాల్లభ్యలభ్యద్వజ
గ్రహణంబో వ్యజనాతపత్రధృతియో ప్రాగ్దీపికారోపమో
నృహరీ వాదము లేల లేరె యితరు ల్నీలీలకుం బాత్రముల్. ఆ.2
ఉ. నావుడు వార లమ్మనుజనాధున కిట్లని రుబ్బి నేడుగా
దైవము గల్గె వేగ గురుదక్షిణగా జతురర్ణ వీవృతో (ఈ పేజీ వ్రాయబడి యున్నది) (ఈ పేజి వ్రాయబడి యున్నది) ద్వీవలయం బశేషమును వేడుము భూవర మమ్మునందఱం
బ్రోవుము బాంధవాస్తజనపోషణకంటెను ధర్మ మున్నదే. ఆ. 3
నే. హెచ్చైనమైత్రి బద్మినుల కెల్ల ఘనాత్యయకారకుండు సొ
మ్మచ్చుపడంగ జేయుటకునై యలక్రౌంచనగంబు పేరిక
మ్మచ్చున నీడ్చు శర్వగిరియందలివెండిశలాకపిండు నా
వచ్చి మరాళమాలికలు వ్రాలె గొలంకుల జక్రఝంకృతిన్. ఆ .4
నే. వాతెఱ తొంటికై వడి మాట లాడదు
కుటిలవృత్తి వహించె గుంతలంబు
లక్షులు సిరులురా నరచూడ్కి గనుగొనె
నాడించె బొమగొని యాననంబు
సనుగొమ ల్నెగయ వక్ష ముపేక్ష గడకొత్తె
బాణిపాదము లెఱ్ఱవాఱదొడగె
సారెకు మధ్యంబు దారిద్ర్యములె చెప్పె
ఱొచ్చోర్వ కీటు లోగజొచ్చె మేను
వట్టిగాంభీర్య మొక్కడు వెట్టుకొనియె
నాభి నానాటి కీగతి నాటిపొందు
చవుకయైనట్టి యిచ్చట జనదు నిలువ
ననుచు జాఱినకరణి బాల్యంబు జాఱె. ఆ .5
శా. సైరంధ్రు ల్పయి కెత్తి కజ్జలము బ్రక్ష్మశ్రేణికం దీర్ప వా
లారుంగన్నుల మీదు జూచుతఱి ఫాచాంచచ్చతుర్థీనిశా
స్పారేందుం గనె వక్త్ర మక్కనుటగా పర్వేందు డాత్మప్రభా
చోరుండుండగ దన్ను దద్గతవిభాచోరంబునున్ లోకముల్: ఆ. 5
చ. విను మొకమాట రాత్రిచర వేగిర మేటికి ని న్జయింతు రే
యనిమిషులైన భాజనగతాన్నము నేనిక నెందుబోయెద న్బెనగక ప్రాణరక్షణ ముపేక్షయొనర్చుట పాప మిందు కై
కనలకు నాకు మేనియెడకాంక్షయు లేదిదివోపుటేయురున్:-అ. 6
ఉ. బాసలు బండికండ్లు మఱి ప్రాణభయంబున లక్షచేసినం
గ్రాసము కృఛ్రలబ్ధ ముడుగ న్వశమే యిది నీకచెల్లె నో
భూసురవంశ్య పుణ్యజన పుణ్యజనాంకము తావకీసమే
పో సమకూరెడిం గులముపొత్తున దైత్యుల కెల్ల నంకతన్:-ఆ. 6
ఆముక్తమాల్యదనుబట్టియే కృష్ణదేవరాయలు విష్ణు భక్తుడనియు వైష్ణవ శిష్యుడనియు వేఱుగ జెప్ప నక్కఱలేకయే తెలిసికొనవచ్చును. అతడు విష్ణుభక్తుడైనను వైష్ణవశిష్యాగ్రేసరు డైనను, ఇతరదేవతల యందుగాని యితరమతములవారియందు గాని వై షమ్యము లేని వాడయి యుండెను. ఈ రాయలవారు విష్ణు దేవాలయములకు మాత్రమేకాక శివాలయములు మొదలైన వానికిగూడ భూదానములు చేసియున్నాడు. వైష్ణవమతాభిమానులను మాత్రమేకాక యితరమతావలంబులైన విద్వాంసులనుగూడ నాదరించియున్నాడు. ఆతని యాస్థానములో నల్లసానిపెద్దన మొదలైన వైష్ణవమత పక్షపాతులైన కవులుమాత్రమేకాక, స్మార్తుడై శివభక్తుడైన నందితిమ్మనార్యుడును, కేవల శైవులైన ధూర్జటియు, మాదనగారి మల్లన్నయు మొదలైన కవులునుకూడ సమ్మానమును బొందియున్నారు. అష్టదిగ్గజములని పేరొందిన యెనమండ్రు తెలుగుకవు లీరాజుయొక్క యాస్థానమునందుండి ప్రసిద్ధినొందిరని చెప్పుదురు. అల్లసానిపెద్దన, నందితిమ్మన్న, అయ్యలరాజు రామభద్రుడు, ధూర్జటి, మాదయ్యగారిమల్లన్న, పింగళిసూరన్న, రామరాజుభూషణుడు, తెనాలిరామకృష్ణుడు, అనెడి యెనమండ్రును అష్టదిగ్గజము లని వాడుక గలదు. కాని యిందు జెప్పబడినవారిలో గడపటి ముగ్గురును గృష్ణదేవరాయని కాలమునందున్నారో లేరోయని సందేహింపవలసి యున్నది. మొదటి యైదుగురునుమాత్ర మాకాలమునం దున్నట్లు కొన్ని గ్రంథ నిదర్శనములు కనబడుచున్నవి. వారిలో నల్లసాని పెద్దనార్యుడు తాను రచియించిన మనుచరిత్రమును, నందితిమ్మన తాను రచియించిన పారిజాతాపహరణమును, కృష్ణదేవరాయని కంకితములు చేసిరి. అయ్యలరాజు రామభద్రుడు కృష్ణదేవరాయల కాలమునందు మిక్కిలి చిన్నవాడై క్రొత్తగా గవిత్వముచెప్పుట కారంభించినవాడు. ఇతడు కృష్ణరాయలు జీవించియుండగా నాతని యాజ్ఞాప్రకారముగా సకల కధాసారసంగ్రహము నారంభించి తరువాత ముగించెనుగాని యది రామాభ్యుదయమువలె నంత ప్రౌడముగా నుండక వ్యాకరణ దోషములు కలదిగా నున్నది. రామభద్ర కవి తన్ను గృష్ణరాయలు కోరుటచేత సకలకథాసారసంగ్రహమును జేసితినని వ్రాసియున్న భాగము నా గ్రంధమునుండి యిందుదాహరించుచున్నాను:-
సీ. చినుకుపూసల నొనర్చినబిత్తరపుదండ దండాలుగల వేల్పుతపసికొండ
కొండాటములను జిక్కులుపన్ను జడదారి దారిగట్టులరాయు చీరుటలుగు
అలుగుడింతకి వెన్ను డిలకు దెచ్చినచెట్టు చెట్టుగట్టుగజేయు చెలువతోడు
తోడుచేడెల నేలుదొరకునుదో బుట్టు పుట్టులిబ్బుల ఱేని పొందుగాడు
గాడుపూరిని గాంచిన కన్నతల్లి | తల్లిబిడ్డల బెండ్లాడు గొల్ల మనికి
మనికితముదీర్చువిలుకాని జెనకువిందు|విందునీకీ ర్తినరసింహవిభునికృష్ణ
వ. ఇట్లు కీర్తివిస్తారధురంధరుండగు కృష్ణరాయ నరపాలాఖండలుండు నన్ను బిలిచి శ్రీమచ్ఛీతారమణ చరణకమల పరిచరణాయమాన మానసుండవు బహువిధ కవితా చమత్కారధుర్యుండవు సకల పురాణేతిహాస ప్రబంధరచనాదక్షుండవు మస్మనోరథకార్య నిర్వాహకుండవు నగుటంజేసి పురాతన మహాకవి విర చిత ప్రబంధంబు లన్వే షించి భగవద్భక్తి నిష్ఠాగరిష్టులగు రాజశ్రేష్ఠుల వృత్తంబులు ప్రసిద్ధంబు లగునట్లుగా బ్రశ స్తకథలు విన్యస్తంబులుగా సమకూర్చి సాహిత్యలక్షణచిత్ర కవిత్వప్రభావంబు లొక్కొక్కచోట గనంబడ రచియింపవలయునని ప్రార్థించి మఱియు నిట్లనియె.
చ. అఱవెతగుబ్బచన్వలె బయల్పడనీకయు ఘూర్జనారంగ నా
గురుకుచయుగ్మమున్వలె నిగూడముగాకయు నాంధ్రదేశపుం
గరితచమంగవన్వలె నొకానొకయించుక గానిపించినన్
సరసులు మెత్తు రక్కవిత జాణలకుం గడురంజకం బగున్.
వ. కావున నతిమధుర రసాయన ద్రాక్షాపాకంబుగా శృంగారరసయుక్తం బగునట్లు సకలకథాసార సంగ్రహంబు గ్రంథవిస్తారంబు కాకుండునట్లుగా రచియింపుమని యుపన్యసించిన సంతోషామృతతరంగి తాంతరంగుండ నగుచున్న సమయంబున."
రాజశేఖర చరిత్రమును రచియించిన మాదయగారిమల్లన్న కృష్ణదేవరాయల కాలములో నుండి యా రాజు గోలకొండ బిజాపురపు తురక సంస్థానములను జయించినపు డాతని కీర్తిని వర్ణించినట్లు కుమార ధూర్జటి కృష్ణరాయవిజయమునం దీక్రింది పద్యములతో జెప్పియున్నాడు:-
గీ. అటులు జయలక్ష్మి గైకొని యరులకరుల
హరుల ధనపంక్తులను దనపరము చేసి
వెలయు శ్రీకృష్ణరాయల విభవగరిమ
కాంచి కన్నులపండువుగాగ నపుడు.
గీ. సరససాహిత్యరచనవిస్పురణ మెఱయ
సారమధురోక్తి మాదయగారి మల్ల
నార్యు డలయల్లసాని పెద్దార్యవరుడు
ముక్కుతిమ్మన మొదలైన ముఖ్యకవులు. క. వినిపించిరపుడు వారికి
గనకాంబరభూషణములు ఘనత నొసగి యా
జనవరు డప్పాజి గనుం
గొని యిట్టని పలికె నపుడు కుతుకం బలరన్. ఆ. 3
ఈ కుమారధూర్జటికవియే కాళహస్తి మహాత్మ్యమును రచియించి తనపెదతాత యైన ధూర్జటికవి కృష్ణదేవరాయలసభలో బ్రసిద్ధి పొందినట్లు కృష్ణరాయవిజయములో నీక్రింది పద్యముచేత జెప్పి యున్నాడు.
చ. స్తుతమతి యైనయంధ్రకవి ధూర్జటిపల్కుల కేలగల్గెనో
యతులిత మాధురీమహిమ నా మును మీ పెదతాత చాల స
న్నుతిగనె గృష్ణరాయలమనోజ్ఞ సభ న్విను మీపు నట్ల మ
త్కృతబహుమానవై ఖరుల గీర్తివహింపుము ధాత్రిలోపలన్. ఆ. 1
అష్టమహిషీకళ్యాణమును ద్విపదకావ్యముగా రచించిన తాళ్ళపాక చిన్నన్న యనుకవి కూడ కృష్ణదేవరాయని కాలములో నున్నట్లు కొండవీటిచరిత్రములో కృష్ణరాయల దానములనుగూర్చి చెప్పిన యీ క్రిందివాక్యమువలన దెలియవచ్చుచున్నది:-
"వినుకొండసీమలో మిన్నికల్లు తాళ్ళపాక చిన్నయ్యగారి కగ్రహార మిచ్చెను."
"అద్దంకిసీమలో వలపర్ల అను గ్రామము తాళ్ళపాక చిన్నయ్యగారి కిచ్చెను."
వీరుగాక తక్కినకవులు కృష్ణదేవరాయల యాస్థానమునందుగాని యాతనికాలమునందుగాని యున్నట్లు తోచదు. రామరాజభూషణాదులు కృష్ణరాయల యాస్థానమునం దున్నట్లునేక కథలు కానబడు చున్నవి కాని యితర నిదర్శనములు లేక యవి విశ్వసింపదగినవి కావు. ఆయా కవుల కాలమును గూర్చియు వారివారి విషయమయి చెప్పబడు కథలను గూర్చియు నాయా కవుల చరిత్రములయందు వ్రాయబడును. ఆముక్తమాల్యదయందును, మనుచరిత్రము నందును గల యేకరీతి పద్యములనుగూర్చి సహిత మిచ్చట విస్తరించి వ్రాయుట యనావశ్యకము. అయినను దృష్టాంతము చూపుటకయి యొక్క పద్యమునుమాత్ర మిందుదాహరించు చున్నాను:-
నీ. నీలమేఘముడాలు డీలుసేయగ జాలు
మెఱుగు జామనచాయ మేనితోడ
నరవిందములకచ్చు లడగించుజిగిహెచ్చు
నాయితంబగు కన్నుదోయితోడ
బులుగురాయని చట్టుపలవన్నె నొరవట్టు
హొంబట్టుజిలుగు రెంటెంబుతోడ
నుదయార్కబింబంబు నొఱపువిడంబంబు
దొరలంగ నాడుకౌస్త్య్భముతోడ
జయజయధ్వని మౌళి నంజలులుచేర్చు
శర్వ శతధృతి శతమన్యు శమన శరధి
పాలకై లబిలాది దేవాళితోడ
నెదుట బ్రత్యక్ష మయ్యె లక్ష్మీశ్వరుండు. [మనుచరిత్ర. అ.6]
మనుచరిత్రము యొక్క యాఱవయాశ్వాసమునందు స్వారోచిష మనువు విష్ణునిగూర్చి తపస్సు చేయగా నతడు ప్రత్యక్ష మయినట్టు జెప్పబడిన పయిపద్యమునే దీర్ఘ పాదముల నేమియు మార్పక యెత్తు గీతమునుమాత్ర మీక్రిందిరీతిగా మార్చి యాముక్తమాల్యద ప్రథమాశ్వాసమునందు గృష్ణదేవరాయడు తనకు శ్రీకాకుళాంధ్రదేవుడు ప్రత్యక్షమయినట్లు చెప్పినఘట్టమునందు వేసికొనియున్నాడు:సీ. నీలమేఘముడాలు.......................కౌస్తుభముతోడ
గీ. దమ్మి కే లుండ బెఱకేల దండయిచ్చు
లేము లుడిపెడు లేజూపులేమతోడ
దొల్కు దయదెల్పు చిఱునవ్వుతోడ గలద
దంధ్రజలజాక్షు డిట్లని యానతిచ్చె:- [ఆముక్తమాల్యద. 1]
కృష్ణరాయలను గూర్చి బహుకవులు చాటుపద్యము లనేకములు కూర్చియున్నారు గాని గ్రంథవిస్తార భీతిచేత వానినన్నిటి నిందువ్రాయక రెండుమూడు పద్యములనుమాత్రము చూపుచున్నాను:-
1.శా.శ్రీలీలాత్మజ కృష్ణరాయ సమరోర్వి న్నీదువై రిక్షమా
పాలు ర్వీగి హయాధిరూడు లగుచుం బాఱన్ వనీశాఖిశా
ఖాల్నగాయతకేశపాశు లయి యూగన్ గేకిసల్గొట్టి యు
య్యాలో జొంపము లంచు బాడుదురు భిల్లాంభోజప్రత్యేక్షణల్.
2 చ. పెనిమిటిచేయు పుణ్యజనపీడనవృత్తియు దండ్రిభంగమున్
దనయు ననంగబావమును దమ్మునికార్శ్యము జూచి రోసి స
జ్జనపరిరక్షు శౌర్యనిధి జారుశరీరు గళాప్రపూర్ణు న
వ్యననిధికన్య చేరె జితవై రినికాయుని గృష్ణరాయనిన్.
3.చ.కాయమువంగి తా ముదిసెగన్నులునుం బొరగప్పె గాలు పే
దాయె నటంచు రోసి నరసాధిపనందన కృష్ణరాయ యీ
భూయువతీలలామ నిను బొందిన నాదిభుజంగ భర్తకున్
బాయనిచింతచేత దలప్రాణము తోకకు రాకయుండు నే?
ఈకడపటి పద్యముయొక్క కర్తృత్వమును తెనాలిరామకృష్ణున కారోపింతురు. రాజు మాత్రమేకాక కృష్ణరాయని కొమార్తలును సంగీతసాహిత్యములయందు నిపుణురాండ్రనియు, రామరాజుభార్యయైన మోహనాంగి యనునామె "మారీచిపరిణయ" మను నై దాశ్వాసముల శృంగార ప్రబంధము రచియించె ననియు, ఒకరు వ్రాసియున్నారు గాని మా కాగ్రంథము లభింపకపోవుటచేత నిది యిట్లని నిశ్చయింప జాలకున్నాము. కృష్ణరాయని యల్లుడయిన రామరాజు భార్యపేరు మోహనాంగి యైనట్టుసైతము గానబడును. అయినను మోహనాంగి యనుపేరు తిరుమలాంబకు నామాంతరమయి యుండవచ్చును.
మంత్రియైన తిమ్మరుసుయొక్క బుద్ధిబలముచేతను మంత్రశక్తిచేతను కృష్ణదేవరాయని కధికవిఖ్యాతి కలిగెనని చెప్పుదురు. ఇంటిపేరు సాళువవా రయిన ట్లనేక శిలాతామ్రశాసనములవలనను కృష్ణరాజవిజయము వలనను దెలియవచ్చుచున్నందున, ఈమంత్రిశిఖామణి క్షత్రియుడై నట్లు కొందఱు తలంచుచున్నారు. అయినను కృష్ణామండలములోని కొండకాపూరి దేవాలయములోని యొక శిలాదాన శాసనములోమాత్ర మాతనిపేరు సాళువతిమ్మరుసయ్యంగారని వ్రాయబడియున్నది. అయ్యంగారని యుండుటనుబట్టి కొంద ఱాతడు బ్రాహ్మణుడని భ్రమపడినను, "సాళువ" యనెడి యింటి పేరునుబట్టియు నితర నిదర్శనములను బట్టియు నతడు బ్రాహ్మణుడు కాడనియు "అయ్యంగా" రని గౌరవార్థముగా నుపయోగింపబడెననియు నిశ్చయింపవలసియున్నదని స్యూయల్ దొరవారు వ్రాసియున్నారు. మాదయ్యగారి మల్లన్న యీ మంత్రిశిఖామణి యల్లు డగునప్పామాత్యున కంకిత మొనర్చిన రాజశేఖరచరిత్రమువలన నితడు బ్రాహ్మణుడే యనియు నాఱువేలనియోగి యనియు నిస్సందేహముగా దెలియవచ్చుచున్నది. ఈసాళువతిమ్మరాజు కృష్ణరాయని తండ్రి యైన నరసింహరాజు తమ్ముడని కొందఱు చెప్పిరి. ఈసంగతి యథార్థము కాకపోయినను, అతడు నృసింహరాయని యొద్ద మంత్రిగా నుండెను. ఈర్ష్యచేత నృసింహరాయని పట్టమహిషి సవితికొడుకైన కృష్ణదేవరాయని జంపింప యత్నించినపు డాతనిని దనయొద్ద నుంచు కొని కాపాడిన దీసాళువ తిమ్మరుసే. ఈహేతువునుబట్టియే కృష్ణదేవరాయలు తిమ్మరుసు నప్పాజీ యని పిలుచుచుండుటయు సుప్రసిద్ధము.ఈమంత్రిశిరోమణి 1515 వ సంవత్సరమునందు రాజు కొండవీటి మీదికి దండెత్తినప్పుడు తాను సేనాపతిగానుండి సేనలను నడిపి కొండవీటిదుర్గమును జయించెను. ఈతడు కృష్ణదేవరాయలకంటె మూడుసంవత్సరములు ముందుగా ననగా హూణశకము 1527 వ సంవత్సరము నందు మృతినొందెను. తిమ్మరుసు బ్రాహ్మణుడనియు చిన్నతనములో మిక్కిలి బీదవాడయి విద్యలేక తిరుగుచుండెననియు చెప్పెడుకథ యొకటి కొంతకాలము నుండి పరంపరగా వచ్చుచున్నది. ఆకథయొక్క సత్య మెట్టి దయినను వినువారికి వినోదకరముగా నుండునని యెంచి యిందు సంగ్రహముగా వ్రాయుచున్నాను:-
"తిమ్మరుసు నియోగిబ్రాహ్మణుడు. ఈతడు బాల్యమునందే తల్లిదండ్రులను బోగొట్టుకొని నిరాధారుడై చదువును సంధ్యయులేక తిరుపతి సమీపమున పసులగాచి బ్రతుకుచు, పిమ్మట గుత్తికిబోయి యచ్చట బుల్లెలుకుట్టి కొంతకాలము జీవించి, తరువాత చంద్రగిరిలో గొంతకాలము మాధుకరవృత్తిచే దినములుపుచ్చి, అనంతరము పెనుగొండలో సత్రములో నుద్యోగము సంపాదించి తద్దుర్గాధీశ్వరుని తాంబూలపుతిత్తులు మోచి తదనుగ్రహమువలన గ్రమక్రమముగా వృద్ధినొంది గొప్పయుద్యోగములు సంపాదించి, కడపట తనబుద్ధిబలము వలన మంత్రిపదమును బొందెను. ఇతడు చిన్నతనములో తిరుపతి సమీపమున బసులను గాచుచు బడలి యొకనాటి మధ్యాహ్నసమయమున నొకచెట్టునీడను విశ్రమించెను. అంతట సూర్యుడు పశ్చిమమున వ్రాలుటచే సూర్యకిరణము లాతని మీదబడినను మెలకువరాక యతడు మైమఱచి గాడనిద్రను పొందుచుండుట చూచి యొక కృష్ణసర్పము చేరవచ్చి తనఫణమువిచ్చి యాచిన్నవాని ముఖమున కెండ సోకకుండ గొడుగువలె నడ్డముపెట్టెను. ఈయద్భుతచర్య నప్పుడు దారిపట్టిపోవుచున్న బట్టుమూర్తి యనుబట్రాజు చూచి యీతడు శీఘ్రకాలములోనే మహైశ్వర్యవంతుడు కాగలడని తెలిసికొని, సమీపమునకు బోగా సర్పమాతనీ విడిచి పాఱిపోయెను. ఆబట్రాజు తరువాత నా చిన్నవాడు మేల్కొనువఱకును వేచియుంచి లేచినతరువాత "అయ్యా! నీ కచిరకాలములోనే గొప్పయైశ్వర్యము పట్టును. అప్పుడు నన్ను మఱచిపోకుము" అని చెప్పి సెలవుగై కొని స్వగ్రామమునకు బోయెను. అటుపిమ్మట తిమ్మరుసు పయిని జెప్పినరీతిని క్రమక్రమముగా వృద్ధినొంది విద్యాబుద్ధులు సంపాదించి కొంతకాలమునకు మంత్రి పదము నొందెను. అప్పుడు బట్టుమూర్తి తిమ్మరుసు దర్శనార్థముపోయి యతడు తగినంత యాదరముచూపి గౌరవింపక యుపేక్షించుటచూచి,
శా. గుత్తిం బుల్లెలు కుట్టి, చంద్రగిరిలో గూ డెత్తి, పెంగొండలో
హత్తిన్సత్రమునందు వేడి, బలుదుర్గాధీశు తాంబూలపుం
దిత్తు ల్మోసి, పదస్థులైన ఘనులన్ దీవించ
అనునంతవఱకు బద్యము చెప్పునప్పటికి భయపడి తిమ్మరుసు తనకు గృష్ణదేవరాయలు పట్టాభిషేక మహోత్సవసమయమునం దిచ్చిన పచ్చలపతకమును బట్టుమూర్తి మెడను వేసెను. అదియందుకొని యాబట్టు తక్కిన పద్యభాగము నీరీతిని బూరించెను -
.........................................దీవించెదన్
మత్తా రాతియయాతి నాగమసుతు న్మంత్రీశ్వరుం దిమ్మనన్.
అనిచదివి యప్పుడే యీక్రింది పద్యమునుగూడ జెప్పెను:-
క. అయ్య ననిపించుకొంటివి| నెయ్యంబున గృష్ణరాయనృపపుంగవుచే
నయ్యా నీసరియేరీ| తియ్యని విలుకాడవయ్య తిమ్మరుసయ్యా. అట్లు గారుత్మతహారమును బట్టున కిచ్చుటచే నాప్రధానచంద్రుడు "బట్టుమూర్తికి గిన్క రెట్టింప బచ్చలహార మర్పించె దిమ్మరుసుమౌళి" యని ప్రసిద్ధిగాంచెను.
ఈతనికిని బట్టుమూర్తికినిగల కాలవ్యత్యాసమునుబట్టి కూడ బయికథ విశ్వాసార్హ మయినదికాదు. కృష్ణదేవరాయనికి బుత్రసంతానము లేనట్టే యనేక స్థలములయందు జెప్పబడియున్నది. అచ్యుతదేవరాయలే కృష్ణదేవరాయని పుత్రుడని యొక చోటను, సదాశివదేవరాయలు కృష్ణదేవరాయని పుత్రుడని యొకచోటను, చెప్పబడెను గాని వానిసత్యమునుగూర్చి యింకను సందేహింప వలసియున్నది. కృష్ణదేవరాయని మరణకాలమునం దాతని కిద్దఱుకొమార్తలుండిరి. వారి కప్పటికి వివాహముకాలేదు. తరువాత తిరుమలదేవికొమార్తెను రామరాజును చిన్నాదేవికొమార్తెను దదనుజుడైన తిరుమల దేవరాయుడును పరిణయమైరి. ఇట్లు కర్ణాటరాజ్యమును మహోచ్చదశయందుంచి కృష్ణదేవరాయలు శుక్ల సంవత్సర వైశాఖమాసము మొదలుకొని వికృతిసంవత్సరము వఱకును ఇరువదియొక్క సంవత్సరములు రాజ్యముచేసి హూణశకము 1530 వ సంవత్సరమునందు గీర్తిశేషుడయ్యెను. అచ్యుతదేవరాయ లా సంవత్సరమున రాజ్యమునకువచ్చి, పండ్రెండుసంవత్సరములు పరిపాలనముచేసి, తిరుణపల్లి మొదలైన దేశములను జయించి పరలోక గతుడయ్యెను.