ఆంధ్ర కవుల చరిత్రము - రెండవ భాగము/అందుగుల వెంకయ్య

శా. కామాదు ల్గడు నీమదిం బెనగొనంగా నాదు నీతీరిత
   శ్రీమద్వాక్యము నీకు బథ్య మగునే శ్రీరామభీమాగ్నికీ
   లామేయాంబకరాజి నీతలలు నుగ్గాడంగ నావేళలన్
   నామాట ల్మది నీకు బథ్య మగు నన్నన్ రావణుం డుగ్రుడై. [యుద్ధకాండము]


ఉ. సర్వసురౌఘముల్ నను భుజాబలము ల్విడనాడి కొల్చు టా
   సర్వవిదుండు విష్ణుడు నిజంబుగ నాత డెఱుంగడే మహా
   గర్వితవిష్ణు డొక్కరుడెకా డలబ్రహ్మ యెదిర్చె నేని నే
   నోర్వక యుగ్రబాణముల కొక్కట నాహుతి చేసి వ్రేల్చెదన్. [యుద్ధకాండము]



55. అందుగుల వెంకయ్య

ఇతడు నియోగిబ్రాహ్మణుడు; అందుగుల సూరన్నకొమారుడు. ఈకవి కృష్ణదేవరాయల యల్లు డయిన రామరాజు తమ్ముడగు తిరుమలదేవరాయని మనుమని మనుమ డగు కోదండరామరాజు కాలములోనుండి యాతనిపేర రామరాజీయ మను నామాంతరముగల నరపతివిజయమను గ్రంథమును జేసెను. ఈగ్రంథమునందు రామరాజు పూర్వులయిన నరపతులచరిత్రమును విశేషముగా రామరాజుయొక్క చరిత్రమును జెప్పబడియున్నది. రామరాజు 1568 వ సంవత్సరమున తాళికోట యుద్ధములో మహమ్మదీయులచేత జంపబడెను. తదనంతరము మూడుతరములు గడచిన తరువాత నీగ్రంథము రచియింపబడిన దగుటచేత, ఇది 1650 వ సంవత్సరప్రాంతమున రచియింపబడినట్టు చెప్పవచ్చును. రామరాజు గుత్తి, పెనుగొండ, గండికోట, కందమాలు, ఆదవేని మొదలయిన ప్రదేశములు గెలిచిన ట్లీక్రిందిపద్యమున జెప్పబడినది.

గీ. సకలవిభు తిమ్మరాజుసేనలను ద్రుంచి
   గుత్తి పెనుగొండ మఱిగండికోట కంద
   నూలుపుర మాదవే నవలీల గెలిచి
   తొలుదొలుత రామనృపతి దోర్బలము మెఱసి.

ఈపుస్తకమునం దీరామరాజు నిజామువలన నహమదాబాదు గొనుట మొదలయిన మహమ్మదీయులతోడి యుద్ధములు కొన్ని వర్ణింపబడినవి. ఈరామరాజు పేరునకు సదాశివదేవరాయని మంత్రియని వ్యవహరింపబడినను, సింహాసనమునకు వచ్చినప్పుడు సదాశివరాయలు బాలు డగుటచేతను కర్ణాటకరాజ్యము నచ్యుతదేవరాయల యనంతరమున నాక్రమించుకొన్న సకలము తిమ్మరాజును బాఱదోలి సదాశివదేవరాయల రాజ్యమును స్థాపించినవా డగుటచేతను క్రీస్తుశకము 1542 వ సంవత్సరము మొదలుకొని 1564 వ సంవత్సరము వఱకును నితడే రాజ్యపరిపాలనము చేసెను. ఇతడు సలకము తిమ్మయను గెలిచిన కథను సూంచిచు నితనిప్రతాపము నరపతివిజయమునం దీక్రిందిరీతిని వర్ణింపబడినది.


చ. ఎలమిని రామరాజవసుధేశుప్రతాప మవార్యమై మహిన్
   జెలువుగ నిండబర్విశశిశేఖరదివ్యమహాశితాశుగ
   జ్వలనశిఖాసముత్కరముచందము నందమునొందె నెంతయున్
   సకలయ తిమ్మయప్రముఖశత్రుపురంబుల నెల్ల నారయన్.


ఈరామరాజుతండ్రియైన శ్రీరంగరాజు కృష్ణదేవరాయల తండ్రియైన నృసింహరాజునకు కర్ణాటకరాజ్యమును నిలుపుటలో సహాయుడుగా నుండినట్లు కానబడుచున్నది. ఈశ్రీరంగరాజుయొక్క శౌర్యము నరపతివిజయములో నీక్రింది పద్యమున వర్ణింపబడినది.

సీ. కడువిజాపురవరకామినీ గర్భముల్ భేదించు నెవ్వనిభేరిరవము
   దామిడి బోయి నిజాముపట్టణముల ధూళిగాజేయు నేదొరబలంబు
   గోలకొండవజీర్ల కోటులకాయముల్ చించు నేరాజేంద్రుచేతికత్తి
   సకల భూపాలకాస్థానసన్నుతి గాంచి వెలయు నేశూరునివిజయలక్ష్మీ
   యతడు కేవలనృపతియే యఘవిదూర
   చర్యు డాశ్రితరక్షావిచక్షణుండు
   జీర్ణ కర్ణాటభూపునర్జీవనుండు
   రమ్యగుణశాలి శ్రీరంగరాయమౌళి.

ఈనరపతివిజయము కవిత్వముకంటె జరిత్రమును జెప్పుటయం దెక్కువ ప్రసిద్ధమైనదైనను, కవిత్వముకూడ రసహీన మయినదికాదు. కవిత్వరీతిని దెలుపుట కయి రామరాజీయములోని రెండు పద్యముల నిం దుదాహరించుచున్నాను.


ఉ. ఇమ్మహిసోమదేవమనుజేంద్రుప్రతాపము నిండి దిక్కులం
   బమ్మిన జూతపోతనవపల్లవబింబఫలారుణాంబుజా
   తమ్ము లటంచు గోకిలకదంబము కీరచయంబు చంచరీ
   కమ్ములు క్రమ్ముచుండు నొడికంబుగ భ్రాంతివహించి పల్మఱున్.


చ. అతివిభవంబునన్ దితిసుతాహితరాజు మహాపరాక్రమో
   న్నతి మృగరాజు సోయగమున న్నలరాజు సమస్తధర్మప
   ద్ధతి నలధర్మరాజు పటుధైర్యమునన్ గిరిరాజు వాక్ప్రశ
   స్తత ఫణిరాజు నిర్దళితశాత్రవరా జగుబుక్క రాజిలన్.