ఆంధ్ర కవుల చరిత్రము - మూడవ భాగము/కోటి వెంకనార్యుడు
కోటి వెంకనార్యుడు.
ఇతడు "ఆంధ్రభాషార్ణవము" అను పేరు గల మంచి యచ్చతెలుగు నిఘంటువును పద్యములుగా జేసెను. దీనితో సమానమైన యచ్చతెనుగు నిఘంటువు మఱి యొకటి లేదు. ఈకవి ఈపుస్తకమును శ్రీవిజయరఘునాథునిపుత్రు డైనరఘునాథరాజు ప్రేరణముచేత జేసి యాతని కంకితము చేసెను. ఈరఘునాథరాజు రామనాథ సేతుపతి యయినవిజయరఘునాథరాజుకుమారు డని తోచుచున్నది. అట్లయిన పక్షమున రఘునాథరాజు 1734వ సంవత్సరము మొదలు 1747వ సంవత్సరము వఱకును రాజ్యము చేసినందున గవియు నాకాలమునం దుండియుండవలెను. కవి గద్యమునందు దనబిరుదావళి నీప్రకారముగా వ్రాసికొనియున్నాడు.--
"ఇది శ్రీమత్పరమేశ్వరకరుణాకటాక్షసంప్రాప్త సర్వజ్ఞత్వాది కతిపయగుణస్వసామ్యతదితరసకలగుణనిరౌప మ్యాసేతుహిమాచలఖ్యాత మహోద్దండ కవిబిరుదప్రశస్త సీతారామార్యవర్యతనూజాత శౌర్యధైర్యస్థైర్యాది సకల గుణచిరత్నరత్నాకర కోటిసమాఖ్యవంశసుధాపయోధిరాకాశశాంక ఘటికా తురంగ నీలాతపత్ర హనుమద్ధ్వజ మకరకేతన దీవాదీప నవవిధ భేదకాది నిఖిల బిరుదాంక బృహదంబికాకటాక్షసంజాత సామ్రాజ్యధురంధర విమలయశోబంధుర కర్ణాటపాండ్యచోళ మహీపాలాదిసంస్తూయమాన శ్రీరాయ రఘునాధమహీనాధసభాంకణ బిరుదాయమానార్యనుతచర్య వెంకనార్యప్రణీతం బైన &c."
కవితాధోరణిని జూపుట కయి నిఘంటువునుండి పద్యముల నుదాహరించుట యుచితము కాదుకావున గృతిపతిని వర్ణించినపద్యము నొకదాని నిం దుదాహరించుచున్నాను.--
ఉ. శ్రీరఘునాధరాయ నృపశేఖర నీదుకరాసి భీమకా ళోరగతుల్య మాటను రణోర్విని దుర్మదమత్తచిత్తులౌ వీరులప్రాణవాయువుల బీల్చుట యుక్త మి దెంతవింత య య్యారె సముద్రమయ్యు నిసుమంతయు భంగము గాంచ దెప్పుడున్.
అడిదము సూరకవి.
ఈకవి నియోగిబ్రాహ్మణుడు; అడిదము బాలభాస్కరుని పుత్రుడు. ఈయడిదము బాలభాస్కరుడు శుద్ధాంధ్రరామాయణమును రచించినట్లు కవిజనరంజనములో సూరకవి వేసికొన్న