ఆంధ్ర కవుల చరిత్రము - ప్రథమ భాగము/మంచన
మంచన
ఈ కవి కేయూరబాహుచరిత్ర మను నాలుగాశ్వాసముల గ్రంథమును రచించి నండూరి గుండన్నమంత్రి కంకితముచేసెను. ఈ గుండన్నమంత్రి యొక్క తాతకు తాత యైన గోవిందామాత్యుఁడు వెలనాటి గొంకరాజుమంత్రియైనట్టును, ముత్తాత యైన కొమ్మామాత్యుఁడు గొంకరాజుకొడుకైన కులోత్తుంగరాజేంద్రచోళుఁ డను నామాంతరము గల వెలనాటిచోడుని మంత్రి యైనట్టును కేయూరబాహుచరిత్రమునందీ పద్యములలోఁ జెప్పఁబడినది.
శా. ప్రాగ్దేశాపరదక్షినోత్తరదిశాభాగప్రసిద్దక్షమా
భుగ్దర్పాంతకుఁడేలె గొంకవిభుఁడీ భూచక్ర మక్రూరతన్
వాగ్దేవీస్తనహారనిర్మలయశో వాల్లభ్యసంసిద్ధితో
దిగ్దంతిశ్రవణానిలోజ్జ్వలరటత్తీవ్రప్రతాపాఢ్యుడై.
క. ఆ విభునకుఁ బ్రెగ్గడయై
భూవలయంబున యశోభిభూషణుఁ డయ్యెన్
గోవిందనప్రధానుం
డావాసము కౌశికాన్వయంబునఁ దనరెన్.
మ. విహితాస్థానమునందుఁ జూపుఁ దగ గోవిందాభిధానప్రభుం
డహితోర్వీధరవజ్రి గొంకవిభురాజ్యాధిష్ఠుఁడై సంధివి
గ్రహముఖ్యోచితకార్యసంఘటనతంత్ర ప్రౌఢియున్ బాఢస
న్నహనోదగ్రరిపుక్షితీశబహుసైన్యధ్వంసనాటోపమున్.
క. ధీరుఁడు తా గోవిందన
కూరిమినందనుఁడు వెలసెఁ గొమ్మన గొంక
క్ష్మారమణున కుదయించిన
వీరుఁడు రాజేంద్రచోడవిభు ప్రెగడయై,
సీ. నవకోటిపరిమితద్రవిణ మే భూపతి
భండారము" నెప్డుఁ బాయకుండు
నేకోనశతదంతు లే రాజుఘనశాల
నీలమేఘంబుల లీలఁ గ్రాలు
బలవేగరేఖ నల్వదివేలుతురగంబు
లే నరేంద్రునిపాగ నెపుడు నిలుచుఁ
బ్రతివాసరంబు డెబ్బదియేనుపుట్ల నే
యే విభుమందల నెపుఁడు గలుగు
నట్టి సమథిక విభుఁ డగు కులోత్తుంగరా
జేంద్రచోళవిభుని కిష్టసచివ
తంత్రముఖ్యుఁ డగుచు మంత్రిగోవిందనం
దనుఁడు కొమ్మనప్రధానుఁ డొప్పె
చ. ఇల వెలనాఁటిచోడమసుజేంద్రునమాత్యత యానవాలుగాఁ
గులతిలకంబుగా మనిన కొమ్మనప్రెగ్గడకీర్తి మాటలన్
దెలుపఁగ నేల ? తత్క్రియఁ బ్రతిష్టిత మైన తటాకదేవతా
నిలయమహాగ్రహారములు నేఁడును నెల్లెడఁ దామ చెప్పఁగన్'
వెలనాటిచోడుఁ డనెడి యీ కులోత్తంగరాజేంద్రచోడుని శాసనములు 1158-వ సంవత్సరము మొదలుకొని 1180-వ సంవత్సరమువఱకును గానఁబడుచున్నవి. ఈ రాజేం ద్రచోడుఁడే యుద్ధమునందు టేంకాణాదిత్యుఁడైన నన్నెచోడుని సంహరించి పాకనాఁడును గైకొన్నట్టు కనఁబడుచున్నది. నన్నెచోడుఁడు కుమారసంభవములో
చ. 'అరినరపాలమౌళిదళితాంఘ్రి యుగుం డయి పాకనాఁటియం
దిరువదియొక్కవేయిటి కధీశుఁడునాఁ జను చోడబల్లికిం
జిరతరకీర్తి కగ్రమహిషీ తిలకం బన హైహయాన్వయాం
బరశశిరేఖ యైన గుణభాసిని శ్రీపతికిం దనూజుఁడన్.'
మ. అరుదందన్ వెలనాటి చోడ మనుజేంద్రాజ్ఞాపనం బూని దు
స్తరశక్తిం జని యేకవింశతిసహస్ర గ్రామసంఖ్యాకమై
ధరణిం బేర్చిన పాకనాఁడు నిజదోర్దండైకలగ్నంబు గాc
బరిపాలించె నమాత్యకొమ్మన జగత్ప్రఖ్యాతచారిత్రుఁడై.'
అని రాజేంద్రచోడుఁ డను నామాంతరము గల వెలనాటిచోడమనుజేశ్వరుని యాజ్ఞానుసారముగా నిరువదియొక్కవేల గ్రామములు గల పాకనాఁటి నమాత్యకొమ్మన పరిపాలించినట్టు చెప్పెను. ఈ పాకనాటి రాజ్యమును కొత్తగా గెలిచి రాజేంద్రచోడుఁడు దాని పాలనమున కయి కొమ్మనామాత్యుని నియమించినట్టు కనుపట్టుచున్నది. ఈ విజయము 1170 వ సంవత్సరప్రాంతముల దయి యుండును. ఈ కొమ్మనామాత్యుఁడు మంత్రి యగుటయే గాక రణతిక్కనవలె దండనాధుఁ డయి మహాశార్యవంతుఁడయి కటకసామంతులు మొదలైనవారిని రణరంగమున భంగించినట్లీ క్రింది పద్యములవలనఁ దెలియవచ్చుచున్నది.
క. చలము మెయి. గటక సామం
తులు కరిహయబహుళసేనతో నే తేఱన్
దలపడియెఁ గొమ్మసచివుఁడు
బలియుండై కొత్తచెర్ల పరిసరభూమిన్.
సీ. సెలకట్టెవాటునఁ జెలఁగి రెంటిని మూఁటిఁ
గూడ గుఱ్ఱంబుల గుదులు గుచ్చుఁ
బ్రతి మొగంబగు నరపతుల కత్తళమునఁ
గడిమిమై వీఁపులు వెడలఁ బొడుచు
బందంపుగొఱియలపగిది నేనుంగుల
ధారశుద్ధిగ నసిధారc దునుముఁ
జిదియించు బగిలించుఁ జేతులతీఁట వో
పడిఁ గాండ మేసి మావతులతలలు
తలపుడికి వ్రేసి మావంతుతలలు శత్రు
రాజశిరములుఁ ద్రొక్కించు రాఁగెఁ దిరుగ
వాగె నుబ్బెడు తన వారువంబుచేత
మహీతశౌర్యుండు కొమ్మయామాత్యవరుఁడు.
చ. అరిగజకుంభపాటనవిహారము కొమ్మనమంత్రి సల్పుచో
నురలిన మౌక్తికవ్రజము లుర్విపయిం బొలిచెం దదీయసం
గరహతవీరదోర్గ్రహణకౌతుక సంభ్ర మఖేచరీపార
స్పరతనుమర్దనోద్గళితభాసురహారమణీచయం బనన్.
చోళరాజులు చాళుక్యచక్రవర్తులకు లోcబడిన సామంతమండలాధీశ్వరులయ్యును రాజ్యకాంక్షచేత నొండరులతోఁబోరాడిచంపుచc జచ్చుచు నుండిరి. ఈ వెలనాటిచోడుని పుత్రుఁడైన పృధ్వీశరాజును మనుమసిద్ధి తండ్రి యైనచోడతిక్కభూపాలుడు చంపెను, కృతిపతితాత యగు కేతన మంత్రి పృథ్వీశరాజునకు మంత్రిగా నుండెను. ఈ పృధ్వీశరాజునే మనుమసిద్దిరాజుయొక్క తండ్రియైన తిక్కనృపాలుఁడు చంపినట్లు నిర్వచనోత్తర రామాయణమునందీ పద్యమునఁ జెప్పఁబడినది.
ఉ. "కేశవసన్నిభుండు పరిగీతయశోనిధి గూడ తిక్కధా
త్రీశుఁడు కేవలుండె సృపు లెవ్వరి కాచరితంబు గల్గునే
శై_శవలీలనాఁడు పటుశౌర్యధురంధరబాహుఁ డై న పృ
థ్వీశనరేంద్రుమస్తకము నే డ్తెఱ గందుక కేళి సల్పఁడే."
తిక్కధాత్రీశ్వరుఁడు శైశవదశయందే పృధ్వీశనరేంద్రునిఁ జంపుటచే నిది పదమూడవ శతాబ్దారంభమునందు జరిగి, తిక్కనరాజు 1250 వ సంవత్సర ప్రాంతమువఱకును రాజ్యము చేసి యుండును. ఈ చరిత్రాంశముకూడ తిక్కనరేంద్రుని పుత్రుఁడై న మనుమసిద్ధికాలములో నుండిన తిక్కనసోమ యాజి 1250 వ సంవత్సరమునకుఁ దరువాత నున్నాఁ డన్న సత్యమును స్థాపించుచున్నది. పృధ్వీశరాజుమంత్రి మనుమడైన గుండనామాత్యునకుఁ గేయూరబాహుచరిత్ర మంకితము చేయఁబడి యుండుటచే నీ కవి తిక్కన సోమయాజికాలములోనో కొన్నియేండ్లు తరువాతనో యుండవలెను. కాcబట్టి యీ మంచనా మాత్యకవి 1300 వ సంవత్సరప్రాంతములయం దున్నాఁడని నిశ్చయముగాఁ జెప్పవచ్చును.
ఇతఁడు రాజమహేంద్రపురనివాసి. పయిని జెప్పఁబడిన వెలనాటిచోడుఁడు లోనయిన రాజులు చాళుక్యరాజప్రతినిధులుగా రాజమహేంద్రవరము రాజధానిగా వేఁగి దేశమును బాలించినవారే ! కృతినాయకుఁడు తన్నుఁ గూర్చి యన్నట్టుగా కవి యీ క్రింది పద్యమును వ్రాసికొని యున్నాఁడు.
క. తన యిష్టసఖుని విద్వ
జ్జనమాన్యుని నుభయకావ్యసరణిజ్ఞున్ మం
చన నామధేయు నన్నుం
గనుఁగొని యిట్లనియె వినయకౌతుక మెసఁగన్
* * * * *
క. సాయిరసము శృంగారం బై
యలవడఁ గధలు నీతులై యెడనెడ రాఁ
గేయూర బాహుచరితము
చేయుము నీ వంధ్రవాక్యశిల్పము మెఱయన్."
ఈ కేయూరబాహుచరిత్రమునందు
ఉ 'బాలరసాలసాలనవపల్లవకోమలకావ్యకన్యకన్
గూళల కిచ్చి యప్పడుపుకూడు భుజించుటకంటె సత్కవుల్
హాలికులైన నేమి మఱియంతకు నాయతిలేనినాఁడు కౌ
ద్దాలికులైన నేమినిజదారసుతాద్యభిరక్షణార్థమై.'
అను పద్యము ప్రథమాశ్వాసమునఁ గానఁబడుచున్నది. ఇటీవలివారు దీని కర్తృత్వమును బమ్మెర పోతరాజున కారోపించి వాడుకలో నున్న యా కధను గల్పించియుందురు. కావ్యకన్యను కూళల కియ్యఁగూడదు గాని మంచివారి కీయవచ్చునని కవి తాత్పర్యమైనట్టు దానిక్రిందనే యున్న యీ పద్యము తెలుపుచున్నది.
క. 'అని తగనివానిదెస నా
మన సెప్పుడు రోయుగాన మతి వజ్ఞనవ
ర్ణనలకు మిగిలిన సుగుణుని
నినుఁ బొంది మదీయ కవిత నెగడుం బుడమిన్.'
ఈ కేయూర బాహుచరిత్రకవిత్వము రసవంతముగా నున్నది. ఇందుండి కొన్ని పద్యముల నిం దుదాహరించుచున్నాను.
చ. దలముగ నెల్ల ప్రొద్దును లతానివహంబుల రాలు పుప్పొడుల్
పులినతిలంబులై చెలువపూనఁగ మీఁదటఁ దేలు కేతకీ
దళముల మొత్త మోడల విధంబు నటింపఁగఁ బాఱు బెద్దలై
ఫల రసవాహినుల్ పరియుపాంతవనంబులఁ గొన్ని చోటులన్. ఆ.1
ఉ. ఎప్పటియట్ల యింతిఁ గని యేడ్తెఱ మ్రొక్కిన దానివల్లభుం
డప్పుడు దిగ్గన న్నెగసి యచ్చటఁ దోచిన వాఁడు దిట్టఁడై
తప్పక యన్ని దిక్కులకుఁదా వెస మ్రొక్కి ప్రదక్షిణంబుతోఁ
జప్పుడుగాఁగ మెచ్చుచును జంద్రమరీచికి మ్రొక్కె బల్మఱున్. ఆ.2
మ. పగలెల్ల న్వెలి నిల్చి రాతిరి రహోభంగిన్ స్వగేహంబున
ట్టుగమీఁదన్ వసియుంచి భార్యపయి దృష్టల్నిల్పి యుండంగఁబ్రొ
ద్దగుడున్ గంజిమడుంగు పేర రజకుం డత్యాస్థ నేతెంచినన్
మృగశాబేక్షణ లోచనావరణము ల్మెల్లం దగ న్విచ్చుచున్. ఆ.3
చ. పనిచినఁ బోయి చూడ్కులకుఁ బండు వనందగు నుత్సవంబు నిం
పెనయఁగఁ జూచి మళ్ళి తన యిక్కువకుం బెడగాఁ బథాంతరం
బున మన మూని యింటి దెసఁ బోవుట మాని విభుండు మున్నుచే
సిన యుపకారము ల్కఱచి చేడియ చింత యొనర్చె నాత్మలోన్ ఆ.3