ఆంధ్ర కవుల చరిత్రము - ప్రథమ భాగము/బద్దెనకవి
బద్దెనకవి
ఆంధ్రచోడులలోనివాఁ డై_న యీ బద్దెనృపాలుఁడు నీతితిశాస్త్రముక్తావళి యను గ్రంథమును జేసెను. ఈ గ్రంధమును బ్రహ్మశ్రీ మానవల్లి రామకృష్ణకవిగారు 1910 వ సంవత్సరమునందు పెద్ద పీఠికతోఁ బ్రచురించిరి. ఈ బద్దెననృపతి కృష్ణానదీతీరమునందున్న దక్షిణ షట్సహస్రదేశమును పాలించిన యొక చిన్న సామంతరాజు. శ్రీరామకృష్ణకవిగారీ బద్దెనకవిని గూర్చి "కృష్ణవేణానదీతీరదక్షిణషట్సహస్ర విషయాధీశ్వర వీరమాహేశ్వర కీర్తి సుధాకర గుణరత్నాకర వేంగి చాళుక్య మూల స్తంభ రిపుదళిత కుంభికుంభ బలయాంగనాగృహతోరణ నన్నన గంధవారణనామాది ప్రశస్తిసహితం శ్రీమహామండలేశ్వరబద్దచోళనరేంద్ర" మను శాసనము నుదాహరించి, దానినిబట్టి యతఁడు క్రీస్తుశకము 10౩౦ వ సంవత్సరములో నుండవచ్చు నని యూహించి, ఆ శాసనము "చెన్నపట్టణపు లైబ్రరీలోని చరిత్రముల లోనిది గావున నమ్మఁదగినది కా" దని దానిని నిరాకరించి, ఇట్టి బిరుదులు గలవాఁడు కేవలసామంతరా జగునా ? యని సందేహించిరి. ఇట్లు సంశయపడవలసిన పని లేదు. మనలోని సంస్థానాధిపతుల కనేకులకుఁ దమకు గల గ్రామములకంటె బిరుదనామములే యెక్కువగా నుండును. ఉన్న రాజ్యము చిన్నదే యయినను బిరుదావళి మాత్రము పెద్దదిగానున్న రాజు లనేకులు గలరు. ఈ కవికాలవిషయమున రామకృష్ణకవిగారు చేసిన యూహ సరియైనది కాదు.ఈ కవి కాలము నించుమించుగాఁ దెలిసికొన దగిన యాధార మొకటి కవియొక్క నీతిశాస్త్రముక్తావళియందే కానవచ్చుచున్నది.
సీ. 'రాజనీతియు నసద్రాజలక్షణమును
మంత్రిమార్గంబు దుర్మంత్రివిధము
నధికారవిధియుఁ గార్యవిచారము నుపాయ
గతియును రాజ్యరక్షాక్రమంబు
నిల నరాజకవృత్తి హితసేవకస్థితి
దుస్సేవక క్రియ దుష్టరాజ
సేవా బలము దానశీలతా మహిమ వి
వేకసంగతియును లోకనీతి
పద్దతులు చేసి భువి నతిప్రజ్ఞ వెలయ
బద్దెనీతియుఁ గోమటి డుచునోళ్ల
కతన దబ్బఱపారంబు గదియ గవులు
తప్పు లెడలింప నెంతయు నొప్పు భువిని'.
అను మొదటిపద్యము క్రిందనే యొక ప్రతిలో రామకృష్ణకవిగారు 3ం వ పుట లో నుదాహరించిన యీ క్రింది పద్యమున్నది.
చ. "పరువడి నాంద్రభాష గల బద్దె ననీతియు,సంస్కృతంబు లోఁ
బరఁగఁ బ్రతాపరుద్ర నరపాలునిచే రచింపఁబడ్డ యా
నరవరు నీతిసారము వినం జదువం గడు మంచిదంచుఁ జే
చ్చెరఁ గవి నీతిపద్దతులు చేసె వినోదము బాలబోధకున్."
దీనినిబట్టి బద్దెనకవి ప్రతాపరుద్రుని తరువాతివాఁడని స్పష్టముగాఁ దెలియ వచ్చుచున్నది. పయి పద్యము నందుఁ బేర్కొనఁబడిన మొదటి ప్రతాప రుద్రుడు 1140 మొదలుకొని 1196 వ సంవత్సరమువఱకును రాజ్య పాలనము చేసినవాఁ డగుటచే బద్దెనరపాలుఁడు నిస్సంశయముగా క్రీస్తు శకము 1196 వ సంవత్సరమునకుఁ దరువాతివాఁ డయి యుండవలెను. ఈ నడుమను బహ్మశ్రీ రామయ్యపంతులుగారు,రాక్షసనామ సంవత్సర భాద్రపదమాసమునందు (సెప్టెంబరు1916 ) ప్రచురింపఁబడిన యాంధ్ర సాహిత్యపరిషత్పత్రిక నాల్గవ సంపుటము 3 -వ సంచికలోఁ బ్రకటించిన రెండు శాసనములను బట్టి కవికాలము 1261 వ సంవత్సరప్రాంత మని స్పష్టపడినది. ఈ శాసనములు కృష్ణా మండలములోని గన్నవరము తాలూకాలో కొండనాయనివర మను గ్రామమునందు బ్రహ్మేశ్వరస్వామి యాలయములో నొక రాతిపలకమీఁదఁ జెక్కఁబడి యున్నవి. ఇందలి మెదటి శిలా శాసనము 'స్వస్తి సమస్తప్రశస్తిసహితం శ్రీమన్మహామcడలేశ్వరవీర నారాయణ చోడబద్దిగ దేవరాజులు శతశవర్షంబులు 1183 ణ్డగు నేంటి కర్కాటక సంక్రాంతినాండు ...................' అనునంతవఱకు నుండి తరువాత శిధిల మయినది. ఉత్తరపువైపున పడమటి వైపున నున్న రెండవ శిలాశాసనము
శ్లో, 'శ్రీనాధనాభినీరేజసంభూత బహ్మణ8 పురా
జాతా విశ్వగుణాక్షీణలక్ష్మీ రాజపరంపరా
తస్యాం బద్దిగభూపో౽భూద్వీరనారాయణాంకితః
చోడదోరయ (భూపో) స్యపుత్రో .. దస్య నందనః
శ్రీ శాకాబ్దే పురాష్టాదశ శశిగణతే కర్కసంక్రాంతికాలే
స ప్రాదా ద్దీప మిష్ట ప్రద మనవరతం చోడ బద్దిక్షితీశః
శ్రీమద్బ్ర హ్మేశ్వరాయా శశి రవి విశదంగోంకనాంకస్య (వేః) తే
స్తద్దీపార్థం చ వేలేటిజనపదమహీం వింశతి ద్రోణసంఖ్యాం."
అని పూర్తిగా నున్నది. ఇందుఁ జెప్పఁబడిన శాలివాహనశకము 1183 క్రీస్తుశకము1261 అగుచున్నది. "ఈ శాసనములు పుట్టిన కాలమునందు కాకతీయరాజ్యము రుద్రమదేవి పాలించుచుండెను. ఆమె క్రింద సామంతుడుగా నుండి బద్దెన కృష్ణాతీరమం దొక చిన్న రాజ్యమును బాలించుచుండినట్టు కనుపట్టుచున్నది." అని రామయ్యపంతులుగారు వ్రాసియున్నారు.[1] బద్దెన తననీతిశాస్త్రముక్తావళితుద నీక్రింది గద్యమును వేసికొనియున్నాఁడు.
గద్య. "ఇది శ్రీలక్ష్మీవల్లభ శ్రీపాదపద్మారాధకకమలాప్తకుల పవిత్ర
నన్ననగంథవారణ, రాజరాజమనోజాంకబద్దెనాఖ్య ప్రణీతంబైన రాజ
నీతిప్రకారం బన్నది సర్వము సంపూర్ణము."
ఈ నీతిశాస్త్రముక్తావళి, రాజనీతిపద్దతి, అసద్రాజపద్దతి, మంత్రిపద్దతి,
దుర్మంత్రిపద్దతి, అధికారపద్దతి, నియోగపద్దతి, కార్యవిచారపద్ధతి, ఉపాయపద్దతి, రాజ్యరక్షాపద్దతి, అరాజకపద్దతి, హితసేవకపద్ధతి, దుష్టసేవకపద్దతి, దుష్టరాజ సేవనపద్దతి, దానశీలతాపద్దతి, లోకనీతిపద్ధతి, అని పదునైదు పద్ధతులుగా భాగింపఁబడినది ఈ పద్దతులను ముగించి కడపటC కవి తన పుస్తకము ని ట్లాశీర్వదించుకొనెను.
ఉ. "శ్రీవిభుఁడైన బద్దెనృపశేఖరుచేసిన నీతి శాస్త్రము
క్తావళి శిష్టలోకహిత మయ్యెడుఁ గా వుత నాఁడునాఁటి కిం
దీవరగర్భుడున్ శశియుఁ దిగ్మ మరీచియు భూతధాత్రియున్
దేవగణంబులున్ బుధులు దిక్పతులుం గల యంతకాలమున్"
చ. "వనరుహనాభు కుద్దవుఁడు వజ్రికి జీవుఁడు వత్సధారుణీ
శునకు యుగంధరుండు దితిసూతికి దైత్యగురుండు విక్రమా
ర్కునకును భట్టి రీతి నధికుండగు నన్నయగంధవారణం
బునకుఁ బ్రధానుఁడై నుతులఁబొందెను సిద్ధనమంత్రి యిద్ధరన్."
1156 వ సంవత్సరము మొదలుకొని 1163 వ సంవత్సరమువఱకును రాజ్యపాలనము చేసిన వెలనాటి చోడుఁ డనఁబడెడు రాజేంద్రచోడునిచే నగ్రహరాదికమును బడసిన సూరనసోమయాజికి మనుమఁడగుటచే సిద్దన మంత్రి గా 1240-50 సంవత్సరప్రాంతములనుండి యుండవలెను. అప్పుడు సిద్ధనమంత్రి ప్రభువయిన నన్నయగంధవారణుcడును నించుమించుగా నా కాలమునందే యుండును. ఈ కాలము బద్దెనృపాలుని శాసనకాలముతో దాదాపుగా సరిపోవును. కాcబట్టి యీ నన్నయగంధవారణుఁడే బద్దెనృపతి యేమో ! అట్లయినచో బద్దెనకు నన్నయ యను నామాంతరము కూడఁ గలిగి యుండును. అప్పుడీతఁడు చోడుఁడు గనుక నన్నె (నన్నయ) చోడుఁడనియుఁ బిలువఁబడవచ్చును[2]
నీతిశాస్త్రముక్తావళిని రచించుటకుఁ బూర్వము కవి సుమతి శతకమును రచించినట్లీ క్రిందిపద్యమునఁ జెప్పకొనెను.
క. 'శ్రీవిభుఁడ గర్వితారి
క్ష్మావరదళనోపలబ్ధజయలక్ష్మిసం
భావితుఁడ సుమతి శతకముఁ
గావించినప్రోడఁ గావ్యకమలాసనుఁడన్."
పైనిఁ బేర్కొనఁబడిన బిరుదావళులు గాక యీ పద్యమువలనఁ గవికి కావ్యబ్రహ్మ యన్న బిరుదవిశేష మొకటి కనఁబడుచున్నది. ఈతనికిఁ బూర్వము నందుఁ బ్రతాపరుద్ర దేవుcడు సంస్కృతమున నీతిసారమును రచియించినట్లు చెప్పఁబడెనుగదా ! దానిని ప్రతాపరుద్ర దేవుఁడే తెలిఁగించెనో మఱియెవ్వరు తెలిఁగించిరో గాని రామకృష్ణకవిగారు పోలిక పద్యము లని నీతిసారము లోనిబద్యములను పదింటికంటె నెక్కువగా నుదాహరించి యున్నారు. వానిలోని పద్యములను రెంటిని వానిని పోలియున్నవన్న బద్దెనీతిలోని పద్య ములను రెంటిని నిచ్చట నుదాహరించు చున్నాను.
గీ. 'విమతులా వెఱింగి వెఱఁపేది తొడరుట
మిడత లగ్గిమీఁదఁ బడినయట్లు
తోడులేక యధికుఁ దొడరుట యంబుధిఁ
గలము లేక యీదఁ గడఁగినట్లు' (నీతిసారము)
ఉ. వారని యల్కఁజేసి కడవం బలవంతుఁడు విగ్రహించినన్
దూరము పోవుటొండె వినతుండయి వానిన చొచ్చుటొండెఁ గా
కీరసమెత్తి కోల్మతివిహీనత నేనుఁగుతోడ లావునన్
బోరగు నెన్ముచంద మది బుద్ధియె రాజమనోజభూభుజా !
(నీతిశాస్త్రముక్తావళి)
క. దూరము వ్యవసాయకులకు
భారంబు సమర్ధులకును భాసురవిద్యా
పారగులకును విదేశము
వైరము ప్రియవాదులకును వసుమతిఁ గలదే ? (నీతిసారము)
చ. అమరఁగ విద్య గల్గిన మహాత్మున కెద్దెస వోయినన్ స్వదే
శమ కడవన్ సమర్థున కసాధ్యమయొద్ది కడంగి చేసినన్
సమధురవాణియైన గుణశాలికి నెయ్యురె యెవ్వరున్ బటు
త్వముగలవానికిం గొలువు తద్దకురంగట బద్దె భూపతీ
(నీతిశాస్త్రముక్తావళి)
ఈ కడపటి పద్యములు రెండును
శ్లో. 'కో౽తిభార స్సమర్థానాం కిం దూరం వ్యవసాయినాం,
కో విదేశః సవిద్యానాం క8 పరః ప్రియవాదినామ్.'
అను శ్లోకమునకుఁ దెనుఁగు
ఉ. 'ఎత్తినకాలకొని సిరి కెన్నఁడు నిల్చిసకాల నిల్వఁగాఁ
జిత్తము లేదు గాన సిరి చెందిననాఁడ పరోపకారముల్
హత్తి కడంగి చేయుఁ డెడరై నఁ బదంపడి వేcడుకొందమన్
చిత్తమె కాని యిత్త మను చిత్తము పుట్టునె యెట్టివారికిన్ ?
ఉ. వాన సమస్తజీవుల కవశ్యము ప్రాణము ప్రాణ మైన య
వ్వానయుఁ బల్మఱుం గురియవచ్చిన దిట్టుదు రెల్లవారలున్
హీనమనస్కుఁడై యొరులయిండ్లకుఁ బల్కఱుఁ బోవునేనియున్
మానిసి కట్ల వచ్చు నవమాన మునూనము మానభంగమున్.'
సుమతి శతకము
క. ఎప్పుడు సంపద గలిగిన
నప్పుడు బంధువులు వత్తు రది యెట్లనిన్
దెప్పలుగఁ జెఱువు నిండినఁ
గప్పలు పదివేలు చేరుఁ గదరా సుమతీ !
క. ఎప్పటి కెయ్యది ప్రస్తుత
మప్పటి కామాటలాడి యన్యులమనసుల్
నొప్పింపక తా నొవ్వక
తప్పించుకు తిరుగువాఁడు ధన్యుఁడు సుమతీ ! [3]
- ↑ శ్రీరామకృష్ణకవిగారు తెల్పిన 'రాజనీతియు, పరువడి' అను పద్యములు రెండును బద్దెన కృతములు కావననియు బాలబోధకై వేఱొక గ్రంథమును వ్రాసిన వేఱొక కవివని యు, ఆకవిని గూర్చియు, గ్రంథమును గూర్చియు తెలియదనియు 'ఆంధ్రకవి తరంగిణి' కారులు వ్రాయుచున్నారు [మూcడవ సంపుటము. పుటలు 18,19] శ్రీరామయ్య పంతులుగా రిచ్చిన శాసనములను బట్టి రామకృష్ణకవిగా రిచ్చిన కాలము సరియైనది కాదని, తేలును. వీనింబట్టి బద్దెనృపాలురు తాతయు మనుమఁడు నగుదురు. శాసనకర్త మనుమఁడగును, తాతకాఁడు, నీతిశాస్త్రముక్తావళికర్తయు, శాసనకర్తయు నభిన్ను లనుట కింకను తగిన యాధారములు లభింపలేదు. తాత గ్రంథకర్తయైనచో క్రీ. శ.1200 ప్రాంతము వాఁడగును; శాసనకర్తయే గ్రంథకర్తయగునేని క్రీ.శ.1260 ప్రాంతము వాఁడగును.
- ↑ [శ్రీ వీరేశలింగము పంతులు గారి యూహ సరికాదనియు, సిద్ధమంత్రి కుమారుఁడైన జన్నయమంత్రి క్రీ.శ.1406-1422 నడుమ కర్ణాట రాజ్యమును పరిపాలించిన దేవ రాజులయెద్ద నుద్యోగి గానుండినట్లు విక్రమార్క చరిత్రమునందే యుండుటంబట్టి తండ్రి, కుమారుల నడుమ 160 సంవత్సరముల యంతరముండదనియు 'ఆంధ్రకవి తరంగిణి' లోఁ గలదు (మూఁడవ సంపుటము పుట 25)]
- ↑ [ఈ పద్యములు బద్దెన రచించిన 'సుమతిశతకము లోనివని చెప్పటకుఁదగిన యాధారములు లేవు. ముద్రిత ప్రతిలో లేని పద్యములు కొన్ని ప్రాఁత ప్రతులలోఁ గా నవచ్చుచున్నవి. వీని శైలియు భిన్నముగా నున్నది.
'సుమతిశతకము' భీమనకృత మొకటి యున్నదని తిమ్మకవి రచించిన సర్వ లక్షణ సారసంగ్రహమునుబట్టి తెలియుచున్నది అయ్యది లభింపలేదు. ఆ భీమకవి 'వేములవాడ భీమకవి'యని యనుటకును ఆధారములు లేవని 'ఆంధ్రకవి తరంగిణి' (రెండవ సంపుటము పుట 17) ప్రస్తతను ప్రచారములోనున్న సుమతీశతకము బద్దెన కృతికంటె విభిన్నము కావచ్చును.]