ఆంధ్ర కవుల చరిత్రము - ప్రథమ భాగము/ఫణిభట్టు

ఫణిభట్టు


ఈ కవి పరతత్త్వరసాయనమును నైదాశ్వాసములవేదాంత గ్రంథమును రచించెను. ఇందు ప్రధమాశ్వాసమున కర్మయోగప్రకారము, ద్వితీయాశ్వాసమున ననాత్మవివేకము, తృతీయాశ్వాసమున నాత్మవివేకము, చతుర్దాశ్వాసమున యోగత్రయలక్షణము, పంచమాశ్వాసమున రాజయోగప్రకారము చెప్పఁబడినవి. శ్రీ మహాభారతమునందు భీష్ముడు ధర్మరాజున కుపదేశించినట్లున్న హరసనత్కుమారసంవాదమునే తాను ప్రబంధరూపముగా రచించినట్లు కవి చెప్పెను గాని భారతమునందలి హరసనత్కుమారసంవాదములో నిందలి యుపదేశములు గానరావు. ఈ కవి సకలవేదాంత సిద్ధాంతమైన యద్వయ బ్రహ్మవిద్యారహస్యమును తన కుపదేశించిన సదానందయతి కీ కావ్యము నంకిత మొనర్చెను. సదానందయోగి తన గృహమునకు విచ్చేసి తనవలన నర్ఘ్య పాద్యాదిసంపూజనముల నొంది తనకు వేదాంతోపదేశము చేసినట్లు కవి చెప్పుకొన్నాఁడు.

      గీ. ఏ మునీంద్రుని కరుణామయేక్షణంబు
         లాశ్రితాఘౌఘరోగరసాయనంబు
         లాతఁ డలరసదానందయతి యనంగ
         నవనిం బెంపొందు భువనత్రయంబుఁ బొగడ


         **** **** **** **** ****


      గీ. తనదుసల్లాపరుచి పార్శ్వ జనులశ్రుతుల
         దప్పి దీర్పంగ వేంచేసెఁ దగ మదీయ
         మందిరంబున కల సదానందమౌని
         విభుఁడు మత్పూర్వభవపుణ్య' భవమునను.

ఈకవి తన వంశము నిట్లు చెప్పుకొనెను--

     క. శ్రీకరకవిత్వవిద్యా
        సాకల్యం బఖిలశాస్త్ర చతురము నిగమ

          
           వ్యాకీర్ణ మీశ్వరాన్వయ
           మాకల్ప యశోభిరామ మై ధర వెలయున్.

ఈ శ్రోత్రియవంశమునందు


       సీ. సురుచిరాపస్తంభసూత్రుఁ డీశ్వరవంశ
                        పాత్రుఁడు గార్గ్యసగోత్రుఁ డఖిల
           వేదశాస్త్రపురాణవిఖ్యాతుఁ డభినవ
                        వ్యాసుండు సద్యశోభాసురుండు
           ఫణిపతిభట్టనఁ బ్రఖ్యాతుఁ డతనికి
                        లక్ష్మమ్మ యను శుభలక్షణాంగి
           పరమపాతివ్రత్యగరిమచే గిరిజాత
                      యన నుతిగన్న యయ్యతివ పత్ని

   .... .... .... .... .... .... .....

       క. ఆ దంపతులకుఁ బుట్టెను
          మేదిని వెలుగొందు విబుధమి త్రుం డనఁగా
          వేదవిదుం డీశ్వరభ
          ట్టాదరమున నరణులందు నగ్నియపోలెన్.

      గీ. విద్యలకు బ్రహ్మ ప్రావీణ్యవిభవమునకు
         విష్ణుఁ డమలత కీశుండు పేదవిత్త్వ
         మున కల వసిష్ఠుఁ డగు జ్ఞానమునకు గురుఁడు
         వక్తృత కహీశుఁ డీశ్వరభట్టు జగతి

      గీ. ఆతని కొసఁగెను దోర్ణాలచతురుఁ డనఘుఁ
         డమలవాధూలగోత్ర తిరుమలభట్టుఁ
         డఖిలవిదుఁ డల లక్ష్మమ్మ యందుఁ గనిన
         కన్య రామమ్మ నధికసౌజన్య నెలమి

      క. ఆ మిధునమునకుఁ బుట్టితి
         మేము {త్రిమూర్తులును బోలె నిల మువ్వుర ము
         ద్దామయశుడు కొండయ శో
         భామణి నారాయణయ్య ఫణితిప నేనున్.

పయి పద్యములయందీశ్వరాన్వయమున నాపస్తంభసూత్రుఁడును గార్గ్యసగోత్రుఁడును నయిన ఫణిభట్టు పుట్టినట్టును, తద్వంశమున జనించిన యీశ్వరభట్టునకును తత్పత్నియైన రామమ్మకును తానును తనయన్నలైన కొండుభట్టును, నారాయణభట్టును జనన మొందినట్టును కవియైన ఫణిభట్టు చెప్పుకొనెను. పుస్తకమునం దాశ్వాసాంతగద్య మిట్లున్నది.

          “ఇది శ్రీమదద్వయ బ్రహ్మవిద్యారహస్యావబోధననిపుణతాధురీణ సాక్షాన్మహేశ్వర
          శ్రీసదానందసద్గురురాయపట్టభద్రకరుణాతరంగిణీ రంగత్తుంగాభంగతరంగహోలాందోళిత
          హంసడింభాయమానేశ్వరా న్వయసంభూతేశ్వరభట్టతనూజ ఫణిభట్టప్రణీతంబైన
          పరతత్త్వరసాయనంబను మహాకావ్యంటు నందు ... పంచమాశ్వాసము"

కృతికర్తవంశానువర్ణనమునుబట్టి గాని కృతిభర్తవర్ణనమునుబట్టి గాని కవికాలమును నిర్ణయించుకు నా కాధారమేదియుఁ గానరాలేదు. అందఱు నీతఁడు పూర్వకవి యనుచున్నారు గనుక కాఁ డనుటకు దగినకారణ మేదియుఁ గఁనబడనందున నేనును నీతనిఁ బూర్వకవిగానే పరిగణించెదను. శ్రీమానవల్లి రామకృష్ణకవిగారు ముద్రింపించి ప్రకటించిన పరతత్త్వరసాయనము యొక్క పీఠికలో వారు కవికాలనిర్ణయమును జేసి యుందురన్న భ్రమతోనేనా పుస్తకమును సంపాదించుటకు బహు ప్రయత్నములు చేసితిని గాని యింతవఱకునునా కృషి సఫలముకాలేదు.[1]

కవికాలనిర్ణయమునకు గ్రంధములోని యీ కవిస్తుతిపద్యమే ముఖ్యాధారమని చెప్పుచున్నారు.

      సీ ప్రథమకవిత్వహేవాకిని వాల్మీకి
                      భారతాదికథావిభాసు వ్యాసుఁ
         గావ్యత్రయీ ప్రవికాసు గాళిదాసు
                      హరికథాదళితమహాఘు మాఘు
         వివిధ ప్రబంధవాగ్విశ్రాణు బాణువి
                      సారార్థవిజ్ఞానధీరుఁ జోరు
         నఖిలవిద్యామనోహారు మయూరుని
                      సన్నుతకవివర్యు నన్న పార్యుఁ

         దిక్కయజ్వాదిపూర్వ ప్రధితకవుల ను
         తించి యేతత్కవీంద్రుల నెంచి భావి
         కావ్యకరుల బహం క్రియాకలన నుంచి
         పని చేసెదనొక కృతి పుణ్యనియతి

దీని నాధారము చేసికొని కవి నన్నయతిక్కనలను మాత్రమే స్తుతించి నందున మిక్కిలి (ప్రాచీనకవి యనియు, తిక్కయజ్వాదిపూర్వ ప్రధిత కవులనుటచేతఁ దిక్కనాదులకుఁ దరువాతఁ గొంతకాలమున కుండెనవియు చెప్పుదురు. కర్తృకాలమును నిర్ణయించుట కిట్టీవే యాధారములైనయెడల తమ పుస్తకములలోఁ గవిస్తుతులను చేయని వారందఱును నన్నయాదులకే పూర్వులని చెప్పవలసి వచ్చును. [2] ఫణిభట్టారకుని కవిత్వము

మొత్తముమీఁద రసవంతమయి పండితజనశ్లాఘపాత్రముగా నున్నది. ఈతని శైలి తెలియుటకయి పరత త్త్వరసాయనములోని పద్యములఁ గొన్నిటి నిందు క్రింద నుదహరించుచున్నాను.

మ. చిరమై నిర్మలమై మహావిభవమై చిన్మాత్రమై సత్యమై
     పరమై సంతతసంయమీశ్వరమనఃప్రత్యక్షమై నిత్యమై
     దురితారణ్యదవార్చియై మదిని భక్తుల్గోరునర్థంబునై .
     స్థిరభావంబునఁ దోఁచు బ్రహ్మము మదిన్ సేవింతుదత్త్వార్థినై.

చ. అవికలభక్తి నెవ్వని మహాత్ములు చిత్తములందుఁ జేర్చి బా
    హ్యవిరతిఁ బూని సత్కృతి సమర్పణ లొప్పఁగ నర్థిఁ జేయుచుం
    దవిలి సమాధియోగములఁ దత్పరులై భజియించి మృత్యుపా
    శవిరహులై సుఖింతు రనిశంబును నా హరి కేను మొక్కెదన్.

                     మత్త కోకిల
    పాయరాని యపాయమున్ బహుపంకహేయ మమేయదో
    షాయనంబు విషాదసంహిత మంతికస్థితమృత్యు వీ
    కాయ మేమి నిజంబు ? నమ్మఁగఁ గాదు దీనిని జంచలం
    బేయడన్ సతమండ్రు బుద్ధివిహీనచిత్తులు మూఢతన్ ఆ.2
  
చ. మదమున దుర్జనుం డితరుమాన మెఱుంగక నింద సేయుఁ బెం
    పు దఱుఁగు కిల్బిష క్రియలఁ బూని యొనర్చును సాధు సేవకుం
    గుదురఁడు సద్గుణాళి మదిఁ గూరఁడు దుర్విషయాభిలాషలం
    బొదలెడిఁ గాని సద్గురుసు బోధితమార్గము నంట డెన్నడున్

ఉ. ఓ మహితాత్మ! నీకరుణ నుజ్జ్వలమైన వివేక మాత్మ్యమై
    మామకచిత్తసన్నిహితమంజులమై మది గల్క దేఱ లోఁ
    దామసవృత్తి మానె హరితత్పరమౌచు మనంబు గోరెడిన్.
    నీ మహనీయవాక్సురభినిర్గతదేవమహత్వతత్త్వముల్ ఆ. 3.

    చ. అలయక సాసికాగ్రమున నంటఁగఁ జూపులు గూర్చి భానుమం
        డలగత చిత్ప్రకాశ మచటం గని చిత్తము తద్గతంబుగా
        నిలిపి నిరంకుశ క్రమవినిర్గతవాయునిరోధనంబునం
        దొలఁగక యోగి పొందుఁ బరితోషపహామృతవార్ధి మగ్నతన్

    మ. అతి తేజోమహనీయు నాత్మహృదయాభ్యంతస్థు నీశున్ సుని
        శ్చితబుద్ధిం గురుబోధచే నెఱింగి పూజింపందగుం గానిచో
        హితబుద్ధిం దృఢలోహమృచ్ఛిలల నూహింపగ నొంటన్ మనో
        హితమూర్తిన్ రచియించి పూజలిడు టౌ నెన్నంగ నీశార్చనల్.

    మ. పరమబ్రహ్మమె సద్గురుం డగుఁజుమీ భావింప నెట్లన్న దు
        స్తరమాయాంధులలో నొకం డెఱిఁగి తత్పాదాశ్రయుండైనచోఁ
        గరుణ న్వానికి నొక్కయు క్తినె మహాకల్పంబులంబోని దే
        హరతిం ద్రోసి భవంబుఁ ద్రుంచి ఘనమోహచ్చేదముం జేసెడిన్.

    చ. ఇది యది యిందు నం దపుడు నిప్పుడు నా నెడలేక పట్టుటల్
        వదులుట లేమి లేక తన వర్తన లేరి కెఱుంగనీక పెం
        పొదపు వినోదలీలల మహోత్సవము ల్వెలయించుచుండఁగా
        సదమలమూర్తి పూర్వభవసంచితపుణ్యసమాధి పూర్ణుఁడై ఆ.5

    చ. అనఘ ! యనేకజన్మసముపార్జితమైన వివేకసంపదం
        గననగుఁ గాని యీనెఱి వికల్పమతిం బహువేదశాస్త్రముల్
        పనివడి యారయన్ మదికిఁ బ ట్టగునే సుకరంపుఁదెల్వి దా
        దినకరుఁబోలె సద్గురుఁడు తెల్సినఁగాక యవిద్యఁ ద్రోయుచున్

    ఉ. నే నను నాకు నే నన ననిత్యశరీరము తోఁచు భ్రాంతిచే
        నే ననునేన నే ననిన నిర్మతనిత్యత గల్గుగావునన్
        నే ననుదాని కాది యగునేగద ! యాత్మన దానిఁ గన్గొనన్
        బూని యొనర్చుయోగమునఁ బొందఁగవచ్చు సమాధిసౌఖ్యమున్;

                **** **** **** ****

  1. [రామకృష్ణకవిగారు 1910 వ సంవత్సరము ఏప్రియల్ నెలలో ప్రకటించిన నీతిశాస్త్రముక్తావళియొక్క యాచ్ఛాదనపత్రము పైని దీని వెల మూడణాలయినట్టు ప్రచురించి;1912 వ సంవత్సరము జూన్ నెలలో ప్రకటించిన శ్రీరంగ మహత్వము తుది పుస్తక ప్రకటనములో పరతత్త్వరసాయనము యొక్క వెలను మూడణాల నుండి పండ్రెడణాలకు పెంపు చేసిరి, తరువాత 1914 వ సంవత్సరము ఆగష్టు నెలలో ప్రకటించిన నన్నెచోడుని కుమారసంభవము ద్వితీయ భాగము యొక్క యాచ్ఛాదనపత్రము పైని దాని వెలపండ్రెడణాల నట్టే యుంచిరి. పరతత్త్వరసాయన సంపాదకులు గాని, ముద్రాపకులు గాని, ముద్రిత గ్రంథమునుగొని తమ యొద్దనుంచుకొన్న వారుగాని నా కొక ప్రతిని వీ. పీ.గా బంపి నా కృతజ్ఞతకు బాత్రు లగుదురు అగుదురు గాక !]
  2. [పరతత్త్వ రసాయనమున బమ్మెర పోతురాజుయొక్క పోలికలు కానవచ్చు చుండుట చే ఫణిభట్టు పదు నేనవ శతాబ్ది చివఱనుండి యుండవచ్చునని, దాని ముద్రితప్రతి పీఠిక లో శ్రీపాద లక్శీపతి శాస్త్రిగారు తెలిపియున్నారు ]