ఆంధ్ర కవుల చరిత్రము - ప్రథమ భాగము/పిల్లలమఱ్ఱి పినవీరన్న
పిల్లలమఱ్ఱి - పినవీరన్న
పిల్లలమఱ్ఱి పివవీరన్న యనెడి యీ కవి నియోగి బ్రాహ్మణుఁడు; గాదయామాత్యునకును, నాగాంబకును పుత్రుఁడు; పెదవీరన్న తమ్ముఁడు; భారతీ తీర్థుల శిష్యుఁడు; నిరుపమానమైన కవిత్వధార గలవాఁడు. ఇతఁడు తాను రచియించిన జైమినిభారతాశ్వమేధపర్వమునకు సాళువగుండ నృసింహనృపాలుని నాయకునిఁగాఁ జేసెను. అతడు కృష్ణ దేవరాయల పూర్వులయిన బుక్కరాజాదుల సంతతివాఁ డయినట్టును. బళ్ళారిమండలములోని యానేగొంది సంస్థానమును పాలించుచుండినట్లును తెలియవచ్చుచున్నది. సాళువగుండరా జొకఁడు హూణశకము 1390 వ సంవత్సరము మొదలుకొని 1397 వ సంవత్సరమువఱకును రాజ్యపాలనము చేసినట్టును, రెండవ సాలవ గుండరాజు 1421 వ సంవత్సరము మొదలుకొని 1428 వ సంవత్సరమువఱకును రాజ్యము చేసినట్టును బళ్ళారిమండలచరిత్ర సంగ్రహ మువలనఁ దెలియవచ్చుచున్నది. ఈ కడపటఁ జెప్పఁబడిన సాళువగుండ రాజునకు జైమినీభారతము కృతి నందిన నరసింహభూపాలుఁడు పుత్రుఁడైనట్టు కానఁబడుచున్నది గనుక, పిల్లలమఱ్ఱి పినవీరన్న 1428 సంవత్సరమునకుఁ దరువాతనే యున్నట్టు స్పష్టమగుచున్నది. సాళువగుండనరసింహరాజు 1465 మొదలుకొని 1478 వ సంవత్సరము వఱకును రాజ్యముచేసిన విరూపాక్షరాయని సేనానాయకుడుగానుండి 1478 వ సంవత్సరమునం దాతనిరాజ్యము నాక్రమించుకొని 1487 వ సంవత్సరము వఱకో 149౩ వ సంవత్సరమువఱకో స్వతంత్రముగా రాజ్యముచేసెనని చరిత్రకారులు చెప్పుచున్నారు. 1483 వ సంవత్సరము మొదలుకొని [1] తుళువ నరసింగరాయని శాసనములు కనఁబడుచున్నందున నప్పటితోనే యీతని రాజ్యసమాప్తి యయి యుండును. సాళువ నరసింహరాజు పూర్వులు సహితము బుక్కరాజాది కర్ణాటాధీశ్వరుల దండనాథులయి
యుండి ప్రభుదత్త సంస్థాన పరిపాలకులయి యుండిరి. పిల్లలమఱ్ఱి పినవీరన్న 1480 వ సంవత్సర ప్రాంతమున జైమినిభారతము నీతని కంకితముచేసి యుండును. వరాహపురాణమునందలి యవతారికనుబట్టి సాళువ గుండ నర సింహునికాలము స్పష్టమగా దెలియవచ్చుచున్నది. కృష్ణ దేవరాయల తాత యైన యీశ్వరరాజీనరసింహనృపాలునియొద్ద దండనాథుఁడుగా నున్నట్లా పురాణపీఠికయందుఁ జెప్పఁబడినందున, సాళువగుండ నరసింహరాజును తధాస్థానకవీశ్వరుఁ డయిన పిల్లలమఱ్ఱి పినవీరభద్రుఁడును గ్రీస్తుశకము 1450 - 80 వ సంవత్సరప్రాంతముల యందున్నట్లేర్పడుచున్నది. ఈ కవికాలమును నిర్ణయించుట కొక విధమైన యాధార మింకొకటి కానఁబడు చున్నది. శ్రీనాధుఁడు రాజమహేంద్రపురెడ్ల యాస్థానములోఁ జేరకమునుపు సాంపరాయని కుమారుఁ డయిన తెలుఁగురామునివద్దకుఁ బోయ కస్తూరి వేఁడినట్లీ క్రిందపద్యము తెలుపుచున్నదిగదా?
శా. అక్షయ్యంబుగ సాంపరాయని తెలుంగాధీశ కస్తూరికా
భిక్షాదానము చేయురా సుకవీరాడ్బృందారకస్వామికిన్
దాక్షారామపురివిహారవరగంధర్వాప్సరోభామినీ
వక్షోజద్వయకుంభకుంభముల పై వాసించుఁ దద్వాసనల్.
ఈతెలుఁగురాయనితండ్రి యగు సాంపరాయనికి జైమినీభారతకృతిపతియగు సృసింహరాజుయొక్క ముత్తాత యగు సాళువమంగరాజు రాజ్య ప్రతిష్టాపనము చేసినట్లు జైమినిభారతములో నీ క్రింది పద్యమునఁ జెప్పఁబడినది.
సీ. దురములో దక్షిణసులతాను నెదిరించి
కొనివచ్చి సాంపరాయనికి నిచ్చి
సామ్రాజ్యమున నిల్పి సాంపరాయస్థాప
నాచార్యబిరుదవిఖ్యాతి గాంచె
శ్రీరంగవిభుఁ బ్రతిష్టించి యర్వదివేల
మాడ లద్దేవు నుమ్మడికి నొసఁగె
మధురాసురత్రాణు మడియించి పరపక్షి
సాళువబిరుదంబు జగతీ నెరపె
గబ్పితనమునఁ దేజి మొగంబు గట్టి
తఱిమి నగరంపుగవఁకులు విఱుగఁద్రోలి
తాను వేసిన గౌరు నుద్దవిడిఁ దెచ్చె
సాహసంబున నుప్పొంగు సాళ్వమంగు.
ఈ సాళ్వమంగు వీరబుక్కరాయని పుత్రుఁ డైన కంపరాయఁడు తండ్రి యాజ్ఞానుసారముగా 1367 వ సంవత్సర ప్రాంతమున దక్షిణదిగ్విజయ యాత్ర వెడలినప్పుడు సేనానాయకుడుగా నుండెను. నృసింహరాజుయొక్క ముత్తాతచే రాజ్యమున నిలుపఁబడిన సాంపరాయఁడు నృసింహరాజుతాత కాలములోఁగూడ రాజ్య మేలి యుండును. అప్పు డాతని పుత్రుఁడగు తెలుగుఁరాయఁడీ సృసింహరాజుయొక్క తండ్రి తాతల కాలములో నుండి యుండుటకు సందేహ ముండదు. యౌవనదశలోఁ దెలుఁగురాయనివద్దకుఁ బోయి కవిత్వము చెప్పి యాతనిని మెప్పించిన శ్రీనాధుఁడు నృసింహరాజు యొక్క తండ్రికాలములోనే కాక కొంతవఱకీ నృసింహరాజుయొక్క రాజ్య కాలములోఁ గూడ నుండి యుండును. కాఁబట్టి కృతిభర్త యైన యీ సాళువ నృసింహరాజును. కృతికర్త యైన పినవీరన్నయు శ్రీనాథుని యంత్యకాలములోను, తదనంతరకాలములోను జీవించియుండిన ట్లిందువలనఁ దేలుచున్నది. ఈ మహాకవి 1480 వ సంవత్సరప్రాంతమువఱకును జీవించి యుండవచ్చును గనుక, శ్రీనాధకవి వార్థకదశలో నున్నప్పు డితఁడు యౌవనదశయందుండి యుండును. దానినిబట్టి చూడఁగా శ్రీనాథుఁడు తానాంధ్రీకరించిన నైషధమును గొనిపోయి యిప్పుడు జనులనుకొనునట్లు కవిజనాగ్రగణ్యుఁడని యభినవముగాఁ బేరొందుచుండిన మహావిద్వాంసుఁడయిన పినవీరన్నకుఁ జూపి యుండును. పినవీరభద్రుని జీవితకాలములోనే శ్రీనాథుఁ డాతనికిఁ బూర్వకవి యయినందున శృంగార శాకుంతలకృతిపతి యయిన వెన్నమంత్రి "సీ. శ్రీనాథభట్టభాషానిగుంభంబుల పరిమళంబులఁ గూడఁ బఱవ నేర్చు” నని పినవీరనకవిత్వమును శ్లాఘించెను. ఈ వీరభద్రకవి యా కాలమునందు మిక్కిలి సుప్రసిద్దుఁ డయినట్లు నరసింహ
రాజుతో నాతని యాస్థానమునందలి పండితు లన్నట్లు జైమినిభారతము నందుఁ జెప్పఁబడిన యీ క్రింది పద్యమువలనఁ దెలియవచ్చుచున్నది.
క. తాతయుఁ దండ్రియు నగ్ర
భ్రాతయునుం దాను భువనభాసురకృతిని
ర్మాతలు పిల్లలమఱివి
ఖ్యాతునిఁ బినవీరుఁ బోలఁగలరే సుకవుల్.
సీ. అమృతాంశుమండలం బాలవాలముగాఁగ
మొలచే నొక్కటి జగన్మోహనముగఁ
జిగురించె విలయసింధు గతకైతవిడింభ
శయనీయవరపలాశములతోడఁ
బితృదేవతలకు నంచితసత్రశాలయై
చెట్టు గట్టెను గయాక్షేత్రసీమ
నిలువ నీడయ్యె నిందీవరప్రియకళా
కోటిరునకు భోగికుండలునకు
మఱ్ఱిమాత్రంబె పిల్లలమఱ్ఱిపేరు
పేరువలెఁ గాదు శారదాపీఠకంబు
వారిలోపలఁ బినవీరువాక్యసరణి
సరసులకు నెల్లఁ గర్ణ రసాయనంబు
శ్రీనాథాదులకుఁ దరువాతి కాలములో నుండిన వెల్లంకితాతంభట్టను లాక్షణికుఁడు తన కవిలోక చింతామణియందుఁ బినవీరనపద్యముల నుదాహరించుట కూడ నీ మహాకవి యించుమించుగా శ్రీనాథాదుల కాలమువాఁ డనుటను స్థాపించుచున్నది. కాఁబట్టి యిప్పటి కితఁడు నాలుగు వందల నలువది సంవత్సరముల క్రిందట నున్న వాఁడని చెప్పవచ్చును.
ఈ కవిమహిమలనుగూర్చి కొన్ని కధలు చెప్పుదురు, ఈతని యన్న నిష్ఠా పరుఁడయి జపతపములయందుఁ కాలక్షేపము చేయుచుండఁగా నితఁడు
స్నానసంధ్యాదులు లేక నోట మెతుకులు వడుటయే తడవుగా బోయి వేశ్యలయింటఁ గూరుచుండుచు వచ్చెననియు, అన్నగారు జపసమయము నందు దన భార్య కాభరణములు చేయించుట కాలోచించుచుండఁగా, తమ్ముడది గ్రహించి యాతనికోసర మెవరో వచ్చి 'మీ యన్న గారేమి చేయు చున్నా' రని యడిగినప్పుడు మా యన్నగారు భార్య కాభరణములు చేయించుటకయి యాలోచించు చున్నాఁడని యుత్తర మిచ్చె ననియుఁ జెప్పుదురు. అంతేకాక రాజు జై మీనీభారతమును జేయుటకై పినవీరభద్రున కాజ్ఞ యిచ్చి పంపునప్పు డతఁడు గడువులోపల సావకాశముగాఁ బుస్తకము రచియింపక యు పేక్ష చేసి యహోరాత్రములు భోగభామినుల యింట కాలక్షేపము చేయుచు వచ్చెననియు, మితిదినమునాఁటికీ గ్రంథమును జేసి సమర్పింపనియెడల రాజుచేత మాటవచ్చునని యన్నగా రెన్ని విధముల హితోపదేశము చేసినను, లక్ష్యముచేయక యాతని మాటలు పెడచెవులఁ బెట్టి యధేష్టముగాఁ దిరుగుచు వచ్చెననియు, పుస్తకము ముగింపవలసిన దినము ఱేపనఁగా నాటిరాత్రి తనగది యలికించి లోపల దీపము పెట్టించి పెందలకడ భోజనము చేసి గదిలోఁ బ్రవేశించి తలుపు లోపల వేసికొనఁగానే పదిమంది చేరి లోపల పుస్తకము వ్రాయుచున్నట్లు గంటముచప్పుడు వినఁబడెననియు, అద్భుతజనకమయిన యా చప్పుడు విని మనసు పట్టలేక పెదవీరన్న తలుపుసందునుండి తొంగి చూడగా సర్వాభరణభూషితురాలై దీపము వెలుతురున శరవేగముగ వ్రాయుచున్న యొక స్త్రీ బావగారు చూచు చున్నారని చివాలున లేచి తొలఁగిపోయెననియు, అటుపిమ్మటఁ బుస్తకమునఁ గొంచెము భాగము మిగులఁగాఁ బినవీరన్న దానిని పూర్తి చేసి మఱునాడు రాజసభకుఁ గొనిపోయెననియు, అతఁడు వాణీ నారాణి యని పంతము పలుకఁగాఁ గొలువులోనివారు సహింపక యాతని నిరాకరించి నప్పుడు వాణి నవరత్నఖచితము లయిన కంకణములు గదల తనహస్తము తెరలోనుండి పయికిఁ జాఁపి చూపి యాతనిమాట సత్యమని యశరీర వాక్కునఁ బలికె ననియుఁ జెప్పుదురు. ఆతడాశుధారగా కవిత్వము చెప్పఁగలవాఁడనియు, వాణి యతనికి పశ్య యనియు, చూపుటకై యీ కథ
కల్పింవఁ బడినది. ఈ కవి తనకు భారతీతీర్ధగురుకృపావిశేషముచేతఁ గవిత్వము వచ్చినట్లు జై మినిభారతమునందీ పద్యముచేతఁ జెప్పినాఁడు,
సీ. పరగంగ మల్లమాంబాకుమారునకు సో
మకులాంబునిధిపూర్ణిమావిధునకు
భరతకీర్తికిఁ దులాపురుషాదిదానాంబు
జంబాలితాస్థానసౌధునకును
బరరాజభీకరధరణీవరాహున
కాత్రేయగోత్రపవిత్రునకును
గుండయనరసింహమండలేశ్వరునకు
నభ్యుదయపరంపరాభివృద్ధి
కరముగా భారతీతీర్థగురుకృపాస
మృద్ధసారస్వతుఁడు సత్కవీంద్రసఖుఁడు
కుకవిమల్లకషోల్ల సత్కులిశహస్త
పల్లవుఁడు చెప్పెఁ బినవీరభద్రసుకవి.
ఈ కవి యనేక గ్రంథములను రచించెను గాని వానిలో నీ జైమినిభారతము గాక శృంగార శాకుంతల మొక్కటిమాత్రమే యిప్పుడు కానఁబడుచున్నది. కవి యా వఱకుఁ జెప్పిన గ్రంథములు శృంగారశాకుంతలములోఁ గృతిపతి కవిని గూర్చి చెప్పిన యీ క్రింది పద్యమునఁ బేర్కొనఁబడినవి.
సీ. రచియించినాఁడవు రమణీయవా గ్రీతి
[2]నవతారదర్పణం బభినవముగఁ
బలికినాడవు తేటపడఁజేసి నారదీ
యము సత్కవిశ్రేణి యాదరింపఁ
జెప్పినాఁడవు శేముషీవిశేషంబున
మాఘమాహాత్మ్యంబు మంజుఫణీతిఁ
గావించినాఁడవు ఘనబుద్దీ మానసో
ల్లాససారము సముల్లసితశయ్య
భారతీతీర్థయతిసార్వభౌమగురుకృ
పాతిశయలబ్దకవితావిభూతి గలిగి
గౌరవము గాంచినాఁడవు కవులచేత
విపులచోటూక్తినిర్ణిద్ర ! వీరభద్ర !
ఈ పద్యమును జూచియే కాఁబోలును నిన్నూఱేండ్లకుఁ దరువాత సీమంతినీ కళ్యాణ మను సోమవార వ్రతకథను రచియించిన యీతనివంశపువాఁడగు సోమనామాత్యుఁడు పినవీరభద్రుని పుస్తకములను గూర్చి తన కావ్యములో నీ క్రింది పద్యమును జెప్పెను.
సీ. అవతార దర్పణం బన్న కావ్యముఁ జేసె
నారూఢి నారదీయంబు బలికె
మహనీయమగు మాఘమాహాత్మ్యము రచించె
శాకుంతలముఁ జెప్పె సరసఫణితి
నొక్కరాతిరియందు నొనరించె మధురవా
క్ప్రౌఢిచే జైమిని భారతంబు
లలితమౌ మానసోల్లాససారంబన్న
కబ్బంబు భాషించె నబ్బురముగ
మఱియు బహురూపకావ్యనిర్మాణానిపుణుఁ
డగుచు నుతిఁగాంచె సకలదిగంతరములఁ
గుకవిజనగర్వతిమిరసంకోచకృత్ప్ర
భాతరవి యైన పినవీరభద్రసుకవి
ఇందులోని యొక్క రాత్రిలో జైమినిభారతము రచియించె ననుట మొదలయినవి వాడుకలోనున్న కట్టుకథల ననుసరించి వ్రాయఁబడి యుండును. ఈ కవియే తన పుస్తకమునందుఁ బినవీరభద్రుని తండ్రియైన గాదిరాజు చిరకాలము సంతానము లేనివాఁ డయి కడపట వీరభద్ర ప్రసాదము వలన
నిరువురు కవల బిడ్డలను గాంచి, వారికి వీరభద్రనామములు పెట్టెననియు, వారిలోఁ బెదవీరభద్రుఁడు కర్ణాటరాజుల మంత్రి యయ్యె ననియు బిన వీరభద్రుఁడు కవి యయ్యెననియు నీ క్రిందిపద్యములలోఁ జెప్పెను.
క. ఆ గాదిరాజువనిత మ
హాగుణవతి పరమసాధ్వి యన విశ్రుతమౌ
నాగాంబ రూపలీలా
భోగాడ్యులఁ గవలవారిఁ బుత్రులఁ గాంచెన్.
సీ. అతిలాలితాకారు లాకుమారులు పెద
వీరభద్రుఁడు పినవీరభద్రుఁ
డన్ననామములచే నధిక ప్రసిద్దులై
యభివృద్ధి గాంచి రనంతరమునఁ
బెదవీరభద్రుడు పృథ్వి ధీనుత కార్య
దక్షుఁడై కర్ణాటధరణి కరిగి
వాసిగా రాయసింహాసనమున నుండి
యధికులౌ రాయదాయాదులకును
మఱియు డెబ్బదివేల సామంతులకును
దానె యధికారియై మహాస్థానులందు
సకలమంత్రి వరేణ్యులు సన్నుతింప
భూనుతంబైన కీర్తివిస్ఫూర్తిఁ గనియె
సీ. మహనీయపిల్లలమఱ్ఱివంశభవుండు
గాదిరాజసుతుండు ఘనయశుండు
వీరేశ్వరుని యవతారమై యిలలోన
జను లెన్నఁదగిన సౌజన్యశాలి
పినవీరభద్రుఁడు పిన్నప్రాయమునంద
యఖిలశాస్త్రంబులు నభ్యసించి
కాళిదాసాదిసత్కవులకు హెచ్చుగా
బహుకావ్యవిరచన ప్రౌఢిఁ గాంచె
వాణి యిల్లాలుగాఁ గవిశ్రేణి కెల్ల
బృథుతరాశ్చర్యకరమైన బిరుదు పూనె
తుహినగిరిరాజరామసేతువులనడుమ
నితని కెనయైన కవివరుం డెందుఁ గలఁడు
పూర్వోదాహృతపద్యములోఁ జెప్పఁబడిన యవతారదర్పణము, నారదీయము, మాఘమాహాత్మ్యము, మానసోల్లాససారము, అను నాలుగు పుస్తకములును గాక పిల్లలమఱ్ఱి పినవీరభద్రకవి 'పురుషార్థసుధానిధి' యను వేఱొక పుస్తకమును గూడ రచించిన ట్టాంధ్రసాహిత్యపరిషత్తువారి పుస్తక భాండాగారములో నున్న యుదాహరణ గ్రంధమునం దుదాహరింపఁబడిన యీ క్రింది పద్యములవలనఁ దెలియవచ్చుచున్నది.
సీ. కాళకర్పూరనీకాశగా భావింపఁ
గవితానిరూఢి ప్రఖ్యాతి నెసఁగు
యావకారుణదేహయష్టిగాఁ జింతింప
మదకుంభియానల మరులుగొలుపు
నీలజీమూతసన్నిభగా విలోకింప
సకలమాయా ప్రపంచంబు నడచు
కనకచంపకదామగౌరిగా శీలింప
నంహస్సమూహంబు సంహరించు
శంభుదేవి విశాలాక్షి సదనుకంప
యోగిజన సేవ్య యోగపయోదశంప
శ్రీకరకటాక్షలేశరక్షితనిలింప
ముజ్జగంబును మొలపించు మూలదుంప.
సీ. భర్గభట్టారకపర్యాయమూర్తికి
షాణ్మాతురుని కూర్మి జనకునకును
మేషరాజము నెక్కు మేటిరౌతున కమ
రాధీశు పొరుగుదిశాధిపతికి
హరిణవాహనుని నెయ్యపుసంగడీనికి
సామిధేనీప్రియస్వాంతునకును
యాయజూకులయి డ్లయనుఁగుజుట్టమునకు
స్వాహాస్వధాప్రాణవల్లభునకు
దండములు పెట్టెదము మోడ్చెదము కరములు
సేవ యొనరించెదము మమ్ముఁ గావు ప్రోవు
యాగవేదికి విచ్చేయు మారగింపఁ
బ్రథమజన్ములయింటి కల్పద్రుమంబ.
శృంగార శాకుంతలము నెల్లూరు మండలములో బిట్రగుంటకు సమీపము నందున్న సోమరాజుపల్లి నివాసుఁడును, భూస్వామియు, ధనసంపన్నుడు నైన చిల్లరవెన్నమంత్రి యనఁబడెడు నియోగి ప్రభువున కంకితముచేయఁబడెను. శాకుంతలములో సోమరాజుపల్లి యిట్లు వర్ణింపఁబడెను.
సీ. లవణాబ్దివేలహేలాకాంచి యగు నంధ్ర
ధరణి మండలికి ముత్యాలజల్లి
సంగ్రామపార్థరాజన్యరాజశ్రీకిఁ
బెంపుమీఱిన జగజంపువెల్లి
దాతలు సముదంచిత ప్రసూనములుగాఁ
గామితార్థములిచ్చు కల్పవల్లి
యఱువదినాల్గు విద్యలకు నపూర్వఘం
టాపథంబైన పట్టణమతల్లి
పంటనృపకౌస్తుభములకుఁ బాలవెల్లి
కదనజయలక్ష్మి తొలుచూచు గన్నతల్లి
విపులభుజగర్వదర్పితవిమతరాజు
రాజహృద్భల్లి ధర సోమరాజుపల్లి.
పైతామహంబైన సోమరాజుపల్లి యందుండిన
సీ. సకలభూపాలకాస్థానసౌధంబుల
వర్ణింతురే మంత్రివాగ్విభూతి
సంతానసురధేనుచింతామణుల పెంపు
దట్టంచు నే మంత్రిదానమహిమ
యాశాంతదంతిదంతాఘాటములమీద
విహరించు నే మంత్రివిమలకీర్తి
సుకవిగాయకబహుస్తుతిఘోషణంబున
నలరు నే మంత్రిగేహాంగణంబు
వాఁడు కౌండిన్యగోత్రాభివర్ధనుండు
మదవదరినైన్యపతిమానమర్దనుండు
నాగయామాత్యతనయుడు నయవిశేష
విజితసురమంత్రి చిల్లర వెన్నమంత్రి.
కవినిగూర్చి
సీ. నన్నపార్యుఁడు ప్రబంధ ప్రౌఢవాసనా
సంపత్తిసొంపు పుట్టింప నేర్చుఁ
దిక్కనయజ్వవాగ్ఫక్కికామోదంబు
చెలువు కర్ణముల వాసింప నేర్చు
నాచిరాజుని సోమువాచామహత్త్వంబు
సౌరభంబులు వెదచల్ల నేర్చు
శ్రీనాథభట్టుభాషానిగుంభంబుల
పరిమళంబులఁ గూడఁ బఱవ నేర్చు
మహితగుణశాలి పిల్లలమఱ్ఱి వీర
నార్యుఁ డా యింటఁ బైతామహాం బగుచును
వెలయుచున్నది నేఁడు కవిత్వలక్ష్మి
యఖిలసత్కవినికరంబు లాదరింప
అని విచారించి, కవిని బిలిపించి సంబోధించి
గీ. కలదు చాలంగ బ్రేమ నీవలన నాకు
వేడ్క వడిగెదఁ గవులెల్ల వేడ్కపడఁగ
షట్సహస్రకులోద్భవసచివులందు
సుకృతిగాఁ జేయు నా కొక సుకృతిఁ జేసి.
*** *** *** ***
సీ. సరపువ్వులుగ మారి పెక్కుతెఱగుల
విరుల నెత్తులుగఁ గావించునట్లు
కర్పూరకస్తూరికావస్తువితతిచే
శ్రీఖండచర్చ వాసించునట్లు
ఒడికంబుగా గందవోడికి నానాసూన
పరిమళంబులు గూడఁ బఱిచినట్లు
సరఘలు వివిధపుష్పమరందలవములు
గొనివచ్చి తేనియఁ గూర్చినట్లు
భారతప్రోక్తకథ మూలకారణముగ
గాళిదాసుని నాటక క్రమము కొంత
తావకో క్తికి నభినవశ్రీ వహింపఁ
గూర్మిఁ గృతిచేయు నాకు శాకుంతలంబు.
అని ప్రార్థించెను. "వినుతక్ష్మాపాలకామాత్యవేదండానీకమృగేంద్ర" అని ప్రథమాశ్వాసాంతపద్యమునను. "శీత శైలాబ్ధివేలామధ్యక్షితిపాలమంత్రిమకుటాలంకారహీరాంకురా ” అనియు. “సదాస్వామికార్య ప్రియచారనీతి క్రియా " అనియు తృతీయాశ్వాసాంతపద్యములయందును, కృతిపతియైన వెన్నమంత్రి సమస్త రాజమంత్రాలను మించినట్టును. స్వామిహితకార్య తత్పరుఁడై నట్టును కవి యెంత వర్ణించినను వెన్నయామాత్యుఁడే రాజున కమాత్యుఁడో, యెక్కడను జెప్పలేదు. ఈ కృతిపతినిబట్టి రెండవ కృతిపతి
యైన సాళువ గుండనృసింహరాజునుబట్టి తెలియవచ్చినట్టు కవికాలనిర్ణయాదులైన చరిత్రాంశము లేవియుఁ దెలియరావు. ఈ నరసింహరాజు కృతి భర్త యగుటయే కాక కృతికర్తసహితమయి సంస్కృతమున రామాభ్యుదయమను గ్రంథమును జేసెను. శ్రీనాథుని కాలములో నుండిన గౌడ డిండిమకవిసార్వభౌమబిరుదాంకితుని కుమారుఁ డగు రాజనాధుఁ డను తృతీయడిండిమకవిసార్వభౌముఁ డీసాళువగుండ నరసింహునినాయకునిగాఁ జేసి సంస్కృతమున సాళువాభ్యుదయ మను కావ్యమును జేసెను. ఈ సాళువ నరసింహరాజు మహాప్రసిద్ధుఁ డగుటచేత నాతనిమీఁదఁ గవులనేకులు పద్యములు చెప్పిరి. అట్టి పద్యములలో రెంటి నిందుదాహరించెదను.
సీ. దినదినంబును నెల్లడివిరాజులఁ బోషించుఁ
గైరవబంధుఁ డే కార్యకాంక్ష?
అప్పటప్పటికి లోకాంధకారము మాన్చు
నినుఁ డేమి లాభంబు నిచ్చగించి ?
సచరాచరంబైన జగతి యెల్ల భరించు
ఫణిపతి యే ఫలప్రా ప్తిజూచి ?
అదనున వర్షించి యఖిలజీవులఁ బ్రోచు
జలధరంబే ప్రయోజనముఁ గోరి ?
పరహితం బాత్మహిత మని పరమపుణ్యు
లన్యు లోనరించు మేలు తా మాసపడరు
సకలభాగ్యోదయ! కరారి సాళువాంక
గుండ భూపాలనరసింహమండలేంద్ర!
సీ. బంగారునకు సౌరభము జనించినయట్టు
కులజుఁడు త్తమగుణకలితుఁ డేని;
కస్తూరి నికరంపుఁగాంతిఁ జెందినయట్టు
లుత్తమోత్తముఁడు శ్రీ నొందెనేని:
భావింపఁ జెఱకునఁ బండుపండినయట్టు
నెఱదాత ప్రియవచోనిరతుఁ డేని;
అలరుగందపు మ్రాన నలరు పూచినయట్టు
శ్రీమంతునకు గీర్తి చెందెనేని;
భవ్యగుణసాంద్ర ! సకలవైభవసురేంద్ర
సహజదానశిబీంద్ర ! భాషాఫణీంద్ర !
సాళువక్షోణిపతివంశజలధిచంద్ర!
గుండభూపాలనరసింహమండలేంద్ర !
ఇతనికవిత్వ మనర్గళధారగాఁ బ్రవహించుచు, నాతికఠినమయి రసపుష్టి కలిగి యుండును. కవిత్వశయ్య బోధపడుటకయి కొన్ని పద్యము లిందుదా రింపఁబడుచున్నవి.
1. జైమినిభారతము.
ఉ. కాఁక నెదిర్చి సంగరముఖంబున హెచ్చిన రాజవంశమున్
గూఁకటివేళ్ళతోఁ బెఱికి గోత్రవధంబును జేసినట్టి యా
వ్రేకపుఁగీడు గాక ప్రజ వేఁచఁ దలంచిన గోరుచుట్టుపై
రోఁకటిపోటుచందముగ రోసి జను ల్ననుఁ జూచి తిట్టరే.
ఉ. క్రమ్మెడు చిమ్మచీఁకటులు కార్కొన మార్కొనుచోఁ బరస్పరా
స్యమ్ములు గానరాక విరసమ్ముగఁ గై కొనునట్టి సాంపరా
యమ్మునఁ జెంగలించి లవుఁ డన్నకుఁ దోడయి దీప్తబాణజా
లమ్ముల నంధకార పటల మ్మఖిలమ్ము ఖిలము చేయుచున్
ఉ. పట్టిన కార్య మీశ్వరుఁడు పట్టి పెనంగినఁ జేరనీక చే
పట్టుట రాజధర్మ మని పల్కెడు నీతిఁ దొఱంగి కీర్తికిం
బట్టగు సాహసంబు నిజాబాహుబలంబును వీటిఁబుచ్చి యీ
పట్టిన వాహముం దిరుగఁ బంపిన నవ్వరె తోడిభూపతుల్.
మ. నను నే మన్నఁ గొఱంత లేదు సభలోనం బుణ్య చరిత్ర మ
జ్జననిం దప్పఁగ నాడి తీ నికృతిన్ సైరింపఁగా నేర నా
వినయం బింతకుఁ దెచ్చెఁ జాలుఁ బలుకు ల్వేయేల నే క్షత్రియుం
డనొ వైశ్యుండనొ చూడుమంచు మగిడెన్ సంగ్రామసంరంభియై
2. శకుంతలాపరిణయము
మ. జననం బొందితి దుగ్ధవారినిధి నా సర్వేశుజూటంబు పై
జను లేప్రొద్దుఁ బ్రశంస సేయ నవతంసం బైతి నీప్రాభవం
బునకుం బాంధ జనాపకారి యగు నా పూవిల్తునిం గూడి వా
రని దిష్కీర్తిగ దిట్టులం బడకు చంద్రా! రోహిణీవల్లభా !
మ. నవలావణ్యపయోధిఁ జిత్త మనును మంథానాద్రికిం జంద్రికా
పవనాశిం దరి త్రాడుగాఁ బెనఁచి యబ్జాతాసనుం డేర్చినన్
రవళిం గోకిలకీరముల్గరువ నా రత్నాకరంబందు ను
ద్భవముం బొందిన లక్ష్మి గావలయు నప్పద్మాక్షి వీక్షింపఁగన్.
చ. కొనకొని తావి మూర్కొనని క్రొవ్విరి యెయ్యెడ వజ్రసూచి రా
యని రతనంబు జిహ్వ చవియానవి తేనియ గోరు మోసి గి
ల్లని చిగురాకు లాలితవిలాసని కేతన మా లతాంగి తా
ననుభవకర్త యే ఘనుఁడొ యా విధి యత్న మెఱుంగ నయ్యెడున్.
ఉ. నాపయికూర్మి తద్గురుజనంబులపై నడి మౌనికన్యకా
స్థాపితవృత్తి బంధువనితాతతియందు ఘటించి యిష్టస
ల్లాపములందు నిచ్చటుఁ దలంపక నిచ్చలుఁ బ్రాణనాథసే
వాపరతంత్రవై యెటులు వన్నియఁ దెచ్చెదొ నాకుఁ బుత్రికా [3]
- ↑ [ఇతఁడు నరసరాజని ప్రసిద్దుఁడు.]
- ↑ [కొందఱు 'నవరస దర్పణం'బను పాఠమును గ్రహించిరి. కాని యా పాఠము సరియైనది కాదు. ]
- ↑ [పినవీరన నివాసము నెల్లూరు జిల్లా బిట్రగుంట సమీపమండలి సోమరాజుపల్లెగాఁ దోఁచినను, నిజాము రాష్ట్రమునందలి పిల్లలమఱ్ఱియే నివాసమై యుండవచ్చునని శ్రీ చాగంటి శేషయ్య గారు తెల్పుచు న్నారు. ఇతఁడ నియోగియనియు, భారద్వాజ గోత్రుఁడనియు శ్రీ శేషయ్య గారు నిర్ణయించి యున్నారు. (ఆంధ్రకవి తరంగిణి, సం. 6, పినవీరన్న చరిత్ర) శ్రీ సాళ్వ నరసింహరాయని పేర నవరత్నములు, రాజ్యాంగ పద్దతులు రచింపఁబడినవని, వానికర్త పినవీరన్న కావచ్చునని శ్రీ ప్రభాకర శాస్త్రిగారు వ్రాసి నారు ]