ఆంధ్ర కవుల చరిత్రము - ప్రథమ భాగము/పరిచయం
పరిచయం
శ్రీ కందుకూరి వీరేశలింగంగారు ఆంధ్ర కవుల చరిత్ర రచనను 1886-వ సంవత్సరంలో ఉపక్రమించి 1894-వ సంవత్సరంలో పరిపూర్తి చేసినారు.వారు కవుల చరిత్రను వ్రాస్తూ ఎప్పటికప్పుడు " వివేకవర్ధని ", "చింతామణి", పత్రికలలో ప్రచురిస్తూ వచ్చారు.
ఆంధ్రకవుల చరిత్ర ప్రథమభాగమును నేను 1887-వ సంవత్సరమునందు ప్రకటించితిని" అని శ్రీ కందుకూరి వారు తమ జీవితచరిత్రలో పేర్కొన్నారు.1894-వ సంవత్సరములో ఒకసారి, 1897-వ సంవత్సరములో మరి యొక సారి ప్రచురించినారు.
ఆంధ్రకవుల చరిత్రను - పూర్వాంధ్రకవులు - మధ్యకాలపుకవులు-ఆధునిక కవులు- అని మూడు భాగాలుగా విభజించి 189౦-వ సంవత్సరములో ఒకే ఒక్క సంపుటముగా వెలువరించినారు. ఆనాడు ఆంధ్రకవుల చరిత్రమీద వచ్చిన సమీక్షల్ని పరికించి, పండితమిత్రుల సలహాలను పాటించి శ్రీ వీరేశలింగంగారు కొన్ని మార్పుల్ని చేర్పుల్ని చేసి నన్నపార్యుని మొదలు కవిరాక్షసుని వరకు పూర్వాంధ్రకవులుగా విభజించి 1917-వ సంవత్సరంలో ప్రథమభాగముగా ప్రకటించారు. వృద్ధాప్యకారణముచేత ఆంధ్రకవుల చరిత్ర తక్కిన రెండుభాగాల్ని శ్రీ వీరేశలింగంగారు తమచేతిమీదుగా పరిష్కరించ లేకపోయినారు.
శ్రీ వీరేశలింగంగారికన్నా మున్నుగా గురుజాడ శ్రీరామమూర్తిగారు, ఆంధ్రకవుల జీవితాల్ని రచించి 1876 వ సంవత్సరంలోనే ప్రచురించారు. పెద్దాపురంనుండి ప్రకటింపబడే " శ్రీ ప్రబంధ కల్పవల్లి " అనే పత్రికలో ప్రచురిస్తూ ఉండేవారు. వారికవుల జీవితరచనలో కాలక్రమాన్ని పాటించలేదు. భారతాంధ్ర కవులు-రామాయణాంధ్రకవులు-ఆంధ్రపంచకావ్యకవులు- ఇత్యాదిగా విభాగించి రచించారు. ఆ కవుల జీవితరచన సమగ్రంగా లేక జనశ్రుతిలోని కధలతో గాథలతో నిండి ఉంది, అయినా గురజాడ శ్రీరామమూర్తిగారి కవి జీవితాలు శ్రీవీరేశలింగంగారి కవులచరిత్ర రచనకు ప్రేరకమని చెప్పవచ్చు.
శ్రీ కందుకూరి వారు తమ కవులచరిత్రలో కవులకాలనిర్ణయాలకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు. కవుల కావ్యాల గుణదోషాలను కూలంకషంగా కాకపోయినా దిఙ్మాత్రంగా నయినా సమీక్షించారు వారు నిర్ణయించిన కొందరి కవుల కాలనిర్ణయాలను ఆధునికులంగీకరింపక విమర్శించారు. ఆ విమర్శనల్ని పరికించిన శ్రీ వీరేశలింగంగారు అలా జరగడానికి హేతువుల్ని తమ కవుల చరిత్ర పీఠికలోను తమ జీవితచరిత్రలోను ఉల్లేఖించు కొన్నారు. ప్రధమ ప్రయత్నంలో ప్రమాదాలు దొరలడం వింతకాదు. విమర్శనీయం కాదు.
ఆనాటికి-అనగా శ్రీవీరేశలింగంగారు కవులచరిత్ర వాసేనాటికికన్నా నేడు అనేక శిలాశాసనాలు, తామ్రశాసనాలు బాహిరిల్లినవి. అనేక తాళపత్ర గ్రంధాలు వెలుగులోనికి వచ్చాయి. కొంగ్రొత్త రీతులలో విశిష్ట పరిశోధనల దారులు తీశాయి. స్థిరంగా కవుల కాలనిర్ణయాలు, చేయడానికి వలను పడుతున్నది. అయినా యింకా కొందరి కవుల కాలనిర్ణయాలు ఊహగానాలే. ఆనాటికవులు తమకావ్యాల్ని నృపాలాంకితంచేస్తూ వారి సాహసౌదార్యాంకాలను వారివంశానుక్రమణికలను తమరచనల్ని తమవంశాల్ని ఉటంకించుకొన్నారే కాని తమ జీవితచరిత్రాంశాలను లవలేశమైనా ఉల్లేఖించుకొన్నారుకాదు. ఆకారణంగా వారి అభిరుచులు, అలవాట్లు, దినచర్య జీవితంలోని రసవత్తర ఘట్టాలు, ఆన్నీ విస్మృతి కుహరంలోనే వుండిపోయినాయి, అది ఆంధ్రుల దురదృష్టం. ఈనాటి వారివలె ఆ నాటి కవీశానులు స్వీయచరిత్ర ప్రస్తావనా ప్రలోభలోలుపులుగారేమో.
శ్రీ వీరేశలింగంగారి మరణానంతరం వారి ఆంధ్రకవులచరిత్ర సమగ్రంగా సంస్కరింపబడకుండగానే 1937 వ సంవత్సరంలో యధాతధంగా ముద్రణ పొందింది. తదుపరి 1940 వ సంవత్సరంలో ఆంధ్రకవులచరిత్ర ద్వితీయ భాగాన్ని 1950వ సంవత్సరంలో తృతీయ భాగాన్ని హితకారిణీ సమాజం అచ్చొత్తించింది. ఆంధ్రకవుల చరిత్రలో కొట్టవచ్చినట్లు కానిపిస్తున్న కొన్ని లోపాలను చక్కదిద్ది ప్రచురించాలనే ఉద్దేశంతో మధురకవి శ్రీ నాళము కృష్ణారావు, శ్రీ దంగేటి నారాయణస్వామి అధ్యక్ష కార్యదర్శులుగానున్న హితకారిణీ సమాజం 1950 వ సంవత్సరంలో ఆంధ్రకవుల చరిత్రను పరిష్కరించే బృహత్కార్యభారాన్ని ఆంధ్రచరిత్రపరిశోథక వైదుషీధురంధులయిన శ్రీ మల్లంపల్లి సోమశేఖర శర్మగారి భుజస్కంధాలమీదనుంచింది. సహృదయంతో ఆకార్యభారాన్ని స్వీకరించి సువిమృష్టంగా పరిశీలించి వారాంధ్ర కవుల చరిత్రను సంస్కరించి 1952 వ సంవత్సరప్రాంతాలలో ఆవతారికతో పాట హితకారిణీ సమాజం వారికందచేశారు.
ఆనాటినుండి హితకారిణీ సమాజంవారు ఆంధ్రకవులచరిత్రను పునః ముద్రించడంకోసం బహుళప్రయత్నాలు చేసినారు. నేటికి దైవమనుకూలించింది. ఆంధ్రప్రదేశ ప్రభుత్వం ఆర్థికసహాయం చేసింది. ఆంధ్రకవుల చరిత్ర ప్రథమభాగం వెలుగుచూచింది.
శ్రీ మల్లంపల్లి సోమశేఖరశర్మగారు ఆంధ్రకవుల చరిత్రలో నూతనంగా సంతన చేసిన కవుల నామాలముందు విషయసూచికలో చుక్కల గుర్తులుంచినాము.
వారిందులో చేర్చిన నూత్న విశేషాల్ని, అధస్సూచికల్ని [ ] ఈ బ్రాకెట్లచే సూచించినాము.
వారు చేర్చిన విశేషాంశాలు, అధస్సూచికలు ఎంత అమూల్యాలో విద్వద్వర్యులకు వివరింపనక్కరలేదు.
ఓం తత్ సత్
రాజమహేంద్రవరం
12-2-1978
విద్వాన్ సహదేవ సూర్యప్రకాశరావు
ఉపాధ్యక్షులు
హితకారిణీ సమాజము