ఆంధ్ర కవుల చరిత్రము - ప్రథమ భాగము/నిశ్శంక కొమ్మన్న
నిశ్శంక కొమ్మన్న
ఈ కవి శివలీలావిలాసమును రచించెను. ఈ గ్రంథములోని మొదటి రెండాశ్వాసములు మాత్రమే శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారి యొద్ద నున్నవి. ఆందు మొదటి, రెండవ పత్రములు లేవు: మిగిలిన పత్రములు సహితము మిక్కిలి శిధిలములయి యున్నవి. ఈ కవిచే శివలీలా విలాసము వేమవీరభద్రారెడ్ల తమ్ముఁడును నల్లాడరెడ్డి పుత్రుఁడును నయిన దొడ్డారెడ్డి కంకితము చేయబడినది. పుస్తకావతారికయందల్లాడరెడ్డి పెదకోమటి వేమారెడ్డిని. గజపతిని జయించినట్టు చెప్పఁబడినది. కాటయవేముని యనంతరమున రాజమహేంద్రవరరెడ్డిరాజ్యము నాక్రమించుకోవలెనని యావల కొండవీటిరాజయిన పేదకోమటి వేమారెడ్డియు నీవల కటకాధీశ్వరుఁ డైన గజపతియుఁ బ్రయత్నించిరి. కాని వా రల్లాడ రెడ్డి యొక్క నిరంతర జాగరూకతవలనను పరాక్రమమువలనను విఫల ప్రయత్నులయి పరాజితులై వెనుక మరలవలసిన వారయిరి. వీరభద్రారెడ్డి రాజయిన తరువాత నాతని యగ్రజుఁడై న వేమారెడ్డియు ననుజుఁడయిన దొడ్డారెడ్డియు మహాబాహుపరాక్రమశాలు లయి శత్రురాజులతో యుద్ధములు చేసి సోదరుని రాజ్యమును పెంపుచెందించిరి. ఈ యిరువురి పరాక్రమములును కాశీఖండము నందిట్లు వర్ణింపఁబడెను
మ. కొనియం గంచుకముల్ సముద్భటనటద్ఘోటీభట ప్రౌఢిఁగై
కొనియె న్వేడుక జీడికోట యహీతక్షోణీశు లల్లాడఁ జే
కొనియె న్మాకవరంబు వీఁక మదవద్ఘోరారిసంహారియై
ఘనుఁ డల్లాడమహీశు వేమన నిరాఘాటైకధాటీగతిన్.
శా. ఔరా ! యల్లయరెడ్డి దొడ్డవసుధాధ్యక్షుండు ధాటీచమూ
భేరీభాంకృతి ఘోర ఘోషమున నిర్భేదించె నొడ్డాది శృం
గారంకోటయు లోఁతగడ్తయును నుద్ఘాటించె నత్యుద్దతిన్
[1]క్షీరాంభోధితటంబు సన్నిలిపె దిక్సీమాజయ స్తంభముల్.
వీరి తండ్రి యైన యల్లాడ రెడ్డి భీమనరపాలకునిపుత్రియైన వేమాంబికను వివాహ మాడినట్లు శివలీలావిలాసములో నీ క్రింది పద్యమునఁ జెప్పంబడినది
మ. భరితశ్రీనిధి యమ్మహీరమణుముఁ డొప్పన్ జోళభక్తిక్షితీ
శ్వరసూనుండగు భీమలింగమనుజేశ శ్రేష్టుసత్పుత్రి భా
స్వరకారుణ్యదశాజనావనవిధాసంధాత్రి వేమాంబికన్
వరియించెం బతిభ క్తి గౌరవదృఢవ్యాపారసత్యాంబికన్.
ఈ వేమాంబ యనవేమారెడ్డి దౌహిత్రి. అల్లాడభూపాలపుత్రుల కీ రాజ్యము పితృపితామహపరంపరాగత మయినది గాక వీరభద్రారెడ్డి భార్య (కాటయ వేమునిపుత్రి) యైన యనితల్లి మూలముననే లభించినదై నను
ఉ. తమ్ముని వీరభద్రవసుధాధిపు విక్రమవీరభద్రునిన్
సమ్మదలీల రాజ్యభరణస్థితిఁ బట్టముగట్టి బాహుద
ర్పమ్మున వేమభూవరుఁడు వ్రాసె జగద్విజయప్రశస్తివ
ర్ణమ్ములు దిగ్ధురంధరసురద్విపకుంభవిషాణమండలిన్.
అని భీమేశ్వరవురాణములోఁ జెప్పినట్లే
ఉ. తేజ మెలర్ప నవ్వసుమతీధవశేఖరుఁడొప్పు సర్వధా
త్రీజనరక్షణ క్రమధురీణుని దమ్ముని వీరధీమణిన్
రాజమహేంద్రనామనగరంబునఁ బట్టము గట్టె సంచిత
శ్రీజయకీర్తిసౌరభవి శేషవిజృంభీతదీక్సమేతుఁడై .
అని శివలీలావిలాసములోను, వేమభూపాలుడు తమ్ముఁడైన వీరభద్రుని దయదలఁచి సింహాసనముపైనిఁ గూర్చుండఁ బెట్టినట్టు చెప్పఁబడినది. శివలీలావిలాసములోని యాశ్వాసాంత గద్య మిట్లున్నది:
“ఇదీ శ్రీమదష్టభాషాకవితాప్రవీణ బుధజనస్తుత్య విశ్శంక కొమ్మనా మాత్య ప్రణీతంబయిన
శివలీలావిలాసంబునందు"
శివలీలావిలాసము 1435 వ సంవత్సరప్రాంతమునందు రచియింపఁబడి యుండును. అందుచేత నిశ్శంక కొమ్మనామాత్యకవి 1430వ సంవత్సరము మొదలుకొని 1470వ సంవత్సరప్రాంతమువఱకును కవియై యుండి యుండును. ఈ కవిచేఁ రచియింపఁబడిన వీరమాహేశ్వరములోనివని యనేక పద్యము లాంధ్రపరిషత్పత్రికవారి యుదహరణ గ్రంధమునం దుదాహరింపఁబడి యున్నవి. ఈ శివలీలావిలాసమునకే వీరమాహేశ్వరమన్నది నామాంతరమో, యది వేఱు గ్రంథమో తెలియరాదు. గ్రంథము దొరకు వఱకును వీరమాహేశ్వరము ప్రత్యేక గ్రంథ మనియే భావింతము. కృతిపతి వంశజులు కొండవీటి రెడ్డివంశజులవలెనే దేసటివారు. ఇరువురును పంట కులమువారయి దాయాదు లయి యుందురు. శివలీలావిలాసములో వీరు దేసటివా రయినట్లీ పద్యములోఁ జెప్పఁబడినది :
ఉ. అందు జనించి మించిరి సమగ్రనిరూఢి గ్రమక్రమంబునన్
మందరధీరు లాగతసమస్త (విచా) రులు సంతత ప్రజా
నందనకార్యకారులు గుణస్ఫుటహారులు ధర్మరక్షణా
మందవిచారు లంగజితమారులు దేసటు లత్యుదారులై .
కొమ్మనామాత్యుని కవిత్వ మనర్గళధార కలదయి బుధజనమనోరంజకముగా నుండును. శైలి తెలియుటకయి యీతని గ్రంధములలోని పద్యముల గొన్నిటిని నిందుదాహరించుచున్నాను
ఉ. శ్రీవిభు సెజ్జ మేదినికిఁ జెల్వగు పుట్టము దివ్యనవ్యర
త్నావళిమన్కిపట్టు దివిజారులదుర్గము వాహినీపతుల్
భావముగట్టురావు బడబాజ్వలనంబున (వంటయిల్లు) నాఁ
గా విలసిల్లు నా వనధిగాఢమహత్వము చెప్ప గొప్పగున్.
చ. వరయశుఁ డింకఁ గల్గు గురువంశమునన్ జనమేజయుండు నాఁ
బరఁగి బరీక్షితాత్మజుఁడు పాయక యాతఁడు సర్పయాగ ము
ద్ధురమతిఁ జేయునప్పు డతిదుస్సహతద్దహనార్చులందు సో
దరహితపుత్రపౌత్రసహితంబుగ మ్రగ్గుఁడు మీర లందఱున్.
ఉ. అశ్వముజాడ గానక భయంపడి యా సగరాత్మనందనుల్
నిశ్వసనాహుతిన్ వదననీరజము ల్గమలంగ మొత్తమై
యాశ్వనురూపయానమున నక్కడ కక్కడ కేఁగి యేఁగి యీ
విశ్వవసుంధరాస్థితి గవేషణ చేసిరి పెక్కు భంగులన్.
ఉ. తన్మదిరాక్షవిభ్రమము దక్కక కన్నులఁ గ్రోలఁ జొచ్చెఁ బ్రే
మన్మరుచే బిట్టడరి మానస మాకుల మయ్యె నిట్లు గ
న్నున్మనసున్ వశంబులయి నూల్కొనమిన్ బహిరంతరంబులన్
దన్మఱచెం గరం బజుఁడు దందడి వేడ్కలు సందడింపఁగన్.
పయి పద్యములు శివలీలావిలాసములోనివి. ఈ క్రింది పద్యముల వీర మాహేశ్వరములోని వని యుదాహరింపఁబడినవి
సీ. పులుఁగురాయఁడు తమ్మికొలకలచెలికాని
బండిబోయనితోడిపాలివాఁడు
పన్నగశ్రీలకుఁ బాలిండ్ల పనవాస
మగడింప నోపిన మగలమగఁడు
దంభోళి కోకయీఁకఁతాఁకు కానిక చేసి
యమృతంబుఁ దెచ్చిన యవఘళండు
వినతముద్దులపట్టి వనధిచెంగట బోయ
పగకు నాఁకలి గొన్నభవ్యబలుఁడు
పక్షములు దాల్చి వచ్చిన పసిఁడికొండ
యట్టు విలసిల్లుమేటి వాహనము గాఁగ
నడచె హతశేషదైవసైన్యములు దాను
నసురకులమర్దనుండు జనార్దనుండు.
సీ. తల్లిదండ్రులతోడితగు లొల్ల కుండియుఁ
దల్లి దండ్రులతోడి తగులు వలచి
కందర్పుమీఁది యక్కటికంబు చెల్లియుఁ
గందర్పుమీఁదియక్కటిక మొదవి
సంసారకేళీప్రసక్తి పోఁ దట్టియు
సంసారకేళిప్రసక్తి కలిగి
సగుణవిశేషయోజనము లఘించియు
సగుణవిశేషయోజనము మరిగి
సగము పురుషుండు కంజాక్షి సగము గాఁగ
నర్ధనారీశ్వరాకృతి ననువుపఱిచి
హరుఁడు తల్లింగమధ్యంబునందు నుండి
హరివిరించుల కంతఁ బ్రత్యక్ష మయ్యె.
శా. ఆజ్ఞాసిద్ధికరంబు ముక్తిదము చిత్తానందసంధాయి శై
వజ్ఞానాంకురశిష్టబీజము ప్రభావప్రౌఢసంచిత్కళా
జిజ్ఞాసావిభవప్రదాయకము లక్ష్మీకారణం బూర్జీతో
పజ్ఞామూలము భక్తలోకమునకుం బంచాక్షరం బిమ్మహిన్.
సీ. కమలజాండంబులు కందుకంబులు చేసి
యొండండ తాటింప నోపువారు
విలయవహ్నలఁ బట్టి వెస దండలుగఁ గ్రుచ్చి
యురమున ధరియింప నోపువారు
తివిరి సంహారభైరవుపైనఁ బొలివోవ
నొకమాత్ర వసి మాల్ప నోపువారు
కాలచక్రక్రియాఘటనంబు ద్రిప్పి యొం
డొకలాగు గావింప నోపువారు
ప్రమథవీరులు వివిధరూపములతోడ
హసన.... ....ద్యలఘుగతులు
వెలయఁ గోటానకోటులు గొలిచి వచ్చి
రతఁడు హరుఁ గొల్వ నేతెంచునవసరమున.
సీ. కంకుచీఁకటులమూఁకల నుగ్గు నూచగ |
మఱచి నూఱక త్రాగు నెఱతనంబు
పొట్టేటిరాయనిబొళయంబు గదలించి
వాహ్యాళి గదలెడి వైభవంబు
క్రతుభాగములు తెచ్చి కై తప్పు గాకుండ
వేల్పుల కందించు వెరవుసొంపు
మూడుమూర్తులు దాల్చి మురువుతో జన్నంపు
వేదిపై గొలుపుండు విభ్రమంబు
నీక చెల్లు నొరుల నీతోడిసాటికి
బేరుగ్రుచ్చి యెన్న లేరు జగతి
వశమె నిన్నుఁ బొగడ స్వాహావధూకుచా
భ్యున్నత ప్రకాశ ! యో హుతాశ !
- ↑ క్షీరంభోధితటంబున్ సరియైన పాఠము, కీరాంభోధి యనఁగా చిల్క సముద్రము .