ఆంధ్ర కవుల చరిత్రము - ప్రథమ భాగము/నన్నయభట్టు
ఆంధ్ర కవుల చరిత్రము
పూర్వకవులు
నన్నయ భట్టు
నన్నయభట్టారకుఁడు *[1]సంస్కృతభారతమును దినిఁగింప నారంభించిన కవి. ఇతఁడు ముద్దలగోత్రజాతుఁడగు వైదికబ్రాహ్మణుఁడు. ఒకానొకరీతఁడు వైదిక బ్రాహ్మణుఁడు కాcడనియు, తెలుఁగు కవిత్వమునకు మొదటినుండియు నియోగులే ప్రసిద్దులయి యుండుటచేత నీతఁడును నియోగియేయయి యుండుననియు, భట్ట శబ్దధారణ మాత్రముచేత నీతఁడు వైదికియని భ్రమింపగూడదనియు, నియోగియైన శ్రీనాధ కవి గూడ తన కాశీఖండము లోని "చిన్నారిపొన్నారి చిఖతకూఁకటినాఁడు" అను పద్యములోఁ దన్నుఁ గూర్చి " శ్రీనాథ భట్టసుకవి " యవి చెప్పికొనియెననియు, వ్రాసియున్నారు. నన్నయభట్టారకుని కొలమునాఁటికే యాంధ్రస్మార్త బ్రాహ్మణులలో వైదిక నియోగి భేద మేర్పడియుండినను, నియోగివైదికుల కిరువురకును సమానము గానే "భట్ట" శబ్దము చెల్లుచుండినను, నన్నయభట్టు తాను రాజు యొక్క కులబ్రాహ్మణుఁ డయినట్టు " తన కులబ్రాహ్మణు ననురక్తు నవిరళ జప హోమతత్పరు . . . ...నన్నపార్యు జూచి పరమధర్మవిదుఁడు వరచళుక్యాన్వయాభరణుఁ డిట్టు లనియెఁ గరుణతోడ" నని యాదిపర్వములోఁ జెప్పుకొని యుండుటచేత నన్నయ వైదికశిఖామణి యనియే నిశ్చయింప వలసియున్నది. కుల బ్రాహ్మణులయి వంశపరంపరగా రాజపురోహితత్వము నిర్వర్తించుచుండుట వైదికులలోనే కాని నియోగులలో లేదు. ఇంకొకరు, చాళుక్యులు పశ్చిమమునుండి వచ్చినవా రగుటచేత నన్నయభట్టు మహారాష్ట్ర దేశ ప్రాంతములనుండి రాజరాజనరేంద్రుని పూర్వుల వెంట వచ్చిన బ్రాహ్మణులసంతతివాఁ డయి యుండునని వ్రాసి యున్నారు. అదియు విశ్వసనీయము కాదు. *[2] నన్నయ వేఁగినాటి బ్రాహ్మణుఁ డని యూహించుటకుఁ దగిన నిదర్శనములు నన్నయార్య విరచితమైన భారత భాగములోనే కనుపట్టుచున్నవి. ఇతఁ డర్జునుని తిర్ధయాత్రలను వివరించటంలో నీ క్రింది వర్ణనము నాదిపర్వమునందుఁ జేసియున్నాఁడు.
" సీ. దక్షిణగంగ నాఁ దద్దయు నొప్పిన గోదావరియు జగదాది యైన
భీమేశ్వరంబును బెడఁగగుచున్న శ్రీపర్వతంబునుజూచి యుర్విలోన
ననఘమై శిష్టాగ్రహారభూయిష్టమై ధరణీసురోత్తమాధ్వరవిధాన
పుణ్యసమృద్దమై పొలుచువేఁగీదేశవిభవంబుఁజూచుచు విభుఁడు దక్షి
గీ. ణాంబురాశితీరంబున కరిగి దురిత
హారియైన కావేరీమహా సముద్ర
సంగమంబున భూసురేశ్వరుల కభిమ
తార్థదానంబుఁ జేసి కృతార్థుఁ డగుదు."
స్వదేశమునం దభిమాన మెల్ల పారికిని సహజ మయి యుండును గదా ! ఈతఁడు వేగిఁనాటివాcడగుటచేతనే మూలగ్రంథమైన సంస్కృత మహాభారతములో లేని వేఁగిదేశ మహత్త్వవర్ణనము నుత్తమ విశేష గుణములతోఁ దెలుఁగు భారతమునఁ జొప్పించి తనయనూనదేశాభిమానమును గనఁబఱిచి యున్నాఁడు.
నన్నయ వేదాధ్యయన సంపన్నుఁడు. ఇతఁడు సంస్కృతాంధ్రభాషల యందసమాన పాండిత్యము కలవాఁడయి, ఉభయభాషలయందును గవిత్వము చెప్పటకు సమర్ధుఁడయి యుండెను. తక్కిన తెలుఁగు గ్రంథములయందువలెఁ గాక యితఁడాంధ్రభారతాదియందు దేవతా స్తుతి నిట్లు సంస్కృతశ్లోకముతోఁ జేసి యున్నాడు
శ్లో. శ్రీవాణీగిరిజా శ్చిరాయ దధతో వక్షోముఖాంగేషు యే
లోకానాం స్థితి మావహన్త్యవిహతాం స్త్రీపుంసయోగోద్భవామ్
తే వేదత్రయమూర్తయ స్త్రీపురుషా స్సంపూజితా వస్సురై
ర్భూయాసుః పురుషోత్తమాంబుజభవశ్రీకంధరా శ్శ్రేయసే
ఇతఁ డవతారికలో షష్ట్యంతపద్యములు వేయలేదు. భాస్కరరామాయణ మీ విషయమున దీనిని బోలి యున్నది. స్వప్నకధను షష్ఠ్యంతములను మొట్టమొదట జేర్చినవాఁడు తిక్కనసోమయాజియే. ఆతనిని జూచి యించుమించుగాఁ దరువాతికవు లందఱును దమకు స్వప్నములో నిష్ట దేవతా సాక్షాత్కారమును షష్ట్యంతపద్యములను దమ గ్రంధములలో వెఱ్ఱిగా నేఁటి వఱకును వేసికొనుచున్నారు. నన్నయభట్టారకుఁడు భారతములోఁ దన్ను గూర్చి యీ యొక్క పద్యమును మాత్రము వేసికొన్నాఁడు.*[3]
సీ. తన కుల బ్రాహ్మణుల ననురక్తు నవిరళ
జపహోమతత్పరు విపులశబ్ద
శాసను సంహితాభ్యాసు బ్రహ్మాండాది
నానాపురాణవిజ్ఞాననిరతుఁ
బాత్రు నాపస్తంబసూత్రు ముద్గలగోత్ర
జాతు సద్వినుతావదాతచరితు
లోకజ్ఞ నుభయభాషా కావ్యరచనాభి
శోభితు సత్ప్రతిభాభిభియోగ్యు
ఆ. నిత్యసత్యవచను మత్యమరాధిపా
చార్యు సుజను నన్నపార్యుఁ జూచి
పరమధర్మవిదుఁడు వరచళుక్యాన్వయా
భరణుఁ డిట్టులనియెc గరుణతోడ.
ఈ భారతమును దెనిఁగించుటలోఁ దనకు నారాయణభట్టు*[4] సహాయుఁడుగా నున్నట్లు కవియే చెప్పుకొనుచున్నాడు. నన్నయ వేఁగి దేశమునకు రాజయిన రాజనరేంద్రుని యాస్థానపండితుఁడు. పూర్వ మాంద్రదేశమునకుఁ గొంతకాలము వేఁగిదేశ మని వ్యవహారము కలచు. నిజమైన వేఁగి దేశము (వేంగినాడు) 8౦౦౦ చదరపుమైళ్ళ వైశాల్యము కలదయి పడమటను తూర్పుకనుమలకును, తూర్పున సముద్రమునకును, ఉత్తరమున గోదావరీ నదికిని, దక్షిణమునఁ గృష్ణానదికిని మధ్యస్థమయిన తెలుఁగుదేశము. మొట్టమొదట నీ వేఁగి దేశమునకు వేఁగి యను పట్టణము రాజధానిగా నుండెను. ఆ వేఁగీపురము హేలాపుర మనబడెడి యేలూరున కుత్తరమున నేడుమయిళ్ళ దూరమున నున్నది ఇది పూర్వము రెండు క్రోశముల పొడవును వెడల్పును గల గొప్ప పట్టణమయి యుండియు, మహమ్మదీయులు దండెత్తి వచ్చి నాశనము చేయుటచేతనో మఱి యే హేతువుచేతనో యిప్పడు బొత్తిగా పాడుపడిపోయి పూర్వ పట్టణము యొక్కరెండుకొనలయందును వరుసగా పెదవేగి చినవేఁగి యసు పల్లెలను మాత్రము కలిగియున్నది. ఇక్కడ నిప్పటికిని పాడుపడిపోయిన దేవాలయము లేఁబదికంటె నధికముగా నున్నవి. ఇక్కడి దేవాలయములను పడగొట్టి మహమ్మదీయు లాఱాళ్ళతో నేలూరునం దొక కోటను గట్టిరి. ఈ పెదవేఁగి రాజమహేంద్రవరమునకు దక్షిణమున నలుబదియైదు మైళ్ళ దూరమున నున్నది. పెదవేఁగి కైదుమైళ్ళ దూరములో నున్న దెందులూరివఱకును గూడ పడిపోయిన దేవాలయాదుల చిహ్నములు కొన్ని కనఁబడుచున్నవి. వేఁగీరాజ్యము నిజమైన వేఁగినాటను మాత్రమేకాక దక్షిణమునఁ గాంచీపురము రాజధానిగాఁగల పల్లవవంశజులదైన చోళ మండలము వఱకును, నుత్తరమున గంగా వంశజుల దయిన కళింగరాజ్యము వఱకును వ్యాపించి యుండెను. రాజ్యమునకు మధ్యగా నుండునిమిత్తమయి రాజధాని వేంగీపురమునుండి రాజమహేంద్రవరమునకు రాజమహేంద్రుఁడను బిరుదు నామము వహించిన యమ్మహారాజుకాలములో మార్పcబడినదని చెప్పదురు. ఈ పట్టణమునకు రాజమహేంద్రవరపుర మన్నపే రీతనిని బట్టియే వచ్చినదనియుఁ జెప్పచున్నారు " వేఁగీ దేశంబునకు నాయక రత్నంబునుబోని రాజమహేంద్రపురంబునందు" అని భారతమునందుc జెప్పఁబడుటచేతనే చాళుక్యరాజులచేఁ బాలింపఁబడుచుండిన వేఁగీరాజ్యములో రాజమహేంద్రపురము మధ్యభాగమున నున్నట్టు స్పష్టమగుచున్నది. ఆ కాలమునందు వేఁగి దేశమున కధీశ్వరుఁడును చళుక్యవంశ సంభవుఁడును విమలాదిత్యుని పుత్రుఁడును నగు రాజరాజనరేంద్రుఁడు రాజమహేంద్ర వరము తనకు రాజధానిగాగా విష్ణవర్ణనుఁడను బిరుదు పేరితోఁ జిరకాలము రాజ్యము చేసెను. ఈ పట్టణమునందలి కోటను కట్టినవాc డితడే. ఇతఁడు విమలాదిత్యుని పుత్రుఁ డయినట్టును చాళుక్యవంశజుఁడయినట్టును భారతము లోవి యీ క్రింది పద్యము చెప్పచున్నది.
క. విమలాదిత్యతనూజుఁడు,
విమలవిచారుఁడు కుమారవిద్యాధరుఁడు
త్తమచాళుక్యుఁడు వివిధా
గమవిహితశ్రముఁడు తుహినకరుఁ డురుకాంతిన్.
ఈ రాజమహేంద్రుఁడు శివభక్తుఁడును జంద్రవంశ్యుఁడును నయినట్టు కవిని గూర్చి యతఁడు పలికినరీతిగా నాదిపర్వమునఁ జెప్పఁబడిన యీ పద్యముల వలనఁ దెలియవచ్చు చున్నది.
మ. ఇవి యేనున్ సతతంబు నాయెడఁ గరం బిష్టంబులై యుండుఁ బా
యపు భూదేవకులాభితర్పణమహీయ8 ప్రీతియున్ భారత
శ్రవణాసక్తియుc బార్వతీపతిపదాబ్దధ్యానపూజామహో
త్సవమున్ సంతతదానశీలతయు శశ్వత్సాధుసాంగత్యమున్.
చ. హిమకరుఁదొట్టి పూరు భరతేశ కురుప్రభు పాండుభూపతుల్
క్రమమున వంశకర్త లనఁగా మహి నొప్పినయస్మదీయవం
శమునఁ బ్రసిద్ధులై విమలసద్గుణశోభితు లైనపాండవో
త్తములచరిత్ర నాకు సతతంబు వినంగ నభీష్ట మెంతయున్.
ఆపస్తంభసూత్రుఁడును భారద్వాజగోత్రుఁడును నయిన చీదమార్యుఁడను బ్రాహ్మణునకు రాజరాజనరేంద్రుఁడు చంద్రగ్రహణ పుణ్యకాలమునందు గోదావరీ మండలములోని కోరుమిల్లి యగ్రహారము నిచ్చినప్పటి తామ్రదాన శాసనమునుబట్టి చూడఁగా రాజరాజనరేంద్రుఁడు సింహాసనమునకు వచ్చిన కాలము మొదలగునవి తేటపడుచున్నవి. ఆ శాసనమందు రాజరాజనరేంద్రుని పూర్వఁడైన విజయాదిత్యుఁ డయోధ్యానగరమునుండి దక్షిణ దేశము మీఁద దండెత్తి వచ్చి యీ దేశమును పాలించుచుcడిన త్రిలోచనపల్లవునితో యుద్ధము చేసి రణనిహతుఁ డయినట్టును, భర్త వెంట వచ్చిన యాతని భార్య గర్భవతియై యుండియు నా యాపత్సమయములోఁ బురోహితునిని గొందఱు పరిచారికలను వెంటఁగొని ముదివేము అగ్రహారమునకుఁ దప్పించుకొని పాఱిపోగా విష్ణుభట్టసోమయాజి యను బ్రాహ్మణుఁ డామె నాదరించి తన యింటఁ బెట్టుకొని తానుగన్న కొమార్తెనువలెఁ జూచి యామె గర్భమున జనించిన పురుష శిశువునకు రాజోచితము లయిన జాతకర్మాది సంస్కారములు నడిపి విష్ణువర్ధనుఁ డని పేరుపెట్టి పెంచినట్టును, ఆతడు తన తల్లి వలన సర్వవృత్తాంతమును విని చళుక్యపర్వతమునకుఁ బోయి తపస్సుచేసి తన తండ్రి రాజ్యమును వహించి, కదంబులను గాంగులను జయించి నర్మద మొదలుకొని సేతుపు వఱకునున్న యేడుకోట్ల యేఁబదిలక్షల గ్రామములుగల దేశమునంతను పాలించినట్టును, చెప్పఁబడి యున్నది. అప్పటినుండియు నాతని వంశమువారికి విష్ణువర్ధనుడను బిరుదు పేరు పరంపరగా వచ్చుచున్నది. ఈ చళుక్యవంశపురాజులు రెండు శాఖలవారయి యెుక శాఖవారు కళ్యాణపురమునందును రెండవశాఖవారు రాజమహేంద్రవరమునందును రాజ్యము చేయుచుండిరి. వీరిలోఁ గళ్యాణపురము రాజధానిగాఁగల పడమటి చాళుక్యులు కుంతలరాజులనియు, రాజమహేంద్రవరము రాజధానిగాఁగల తూర్పుచాళుక్యులు వేఁగిరాజు లనియు వ్యవహరింపఁబడుచు వచ్చిరి. ఈ విష్ణువర్ధనునిముమ్మనుమడయిన కుబ్జవిష్ణువర్షనుఁడు క్రీస్తుశకము 615 వ సంవత్సరమునందు వేఁగిదేశమునకు మొదటఁ దనయన్నమైన సత్యాశ్రయునిచేఁ బాలకుఁడుగా నియమింపఁబడి పిమ్మట దానేఁ రాజయ్యెను. అతని కిరువదియేడవతరమువాఁడయిన విమలాదిత్యుఁడు 1015 వ సంవత్సరమున సింహాసనమునకు వచ్చి యేడుసంవత్సరములు రాజ్యముచేసి మృతినొందఁగాఁ దెలుఁగుభారతమును గృతినందిన యాతని కొడుకు విష్ణువర్ధనుఁడను రాజనరేంద్రుఁడు శాలివాహనశకము 644 వ సంవత్సరము శ్రావణ బహుళ ద్వితీయాగురువారమునాఁ డుత్తరభాద్రానక్షత్రమున *[5]
సింహాసన మెక్కినట్టు చెప్పఁబడి యున్నది. లెక్కవేసిచూడఁగా నీకాలము క్రీస్తు శకము 1022 వ సంవత్సరము జులాయి నెల పందొమ్మిదవ తేదితో సరియగును. రాజనరేంద్రుని ముమ్మనుమడైన రెండవ కులోత్తుంగచోళ దేవుఁడు గోదావరీమండలము లోని కోరంగికి సమీపముననుండు చెల్లూరు గ్రామమును కొలనికాటమ నాయకుని కిచ్చినట్టియు, కాలెరగ్రహారమును దాక్షారామపీఠికాపురసత్రములను జరుపుటకయి ముద్గలగోత్రుఁడును పోతనార్యపుత్రుఁడును నయిన మేడమార్యుcడను బ్రాహ్మణున కిచ్చినట్టియు, దానశాసనములనుబట్టి రాజరాజనరేంద్రుని పుత్రుఁడైన ప్రధమ కులోత్తుంగచోళదేవుఁడు శాలివాహనశకము 986 వ సంవత్సర మనఁగా క్రీస్తుశకము 1063 వ సంవత్సరమున రాజ్యమునకు వచ్చినట్టు చెప్పఁబడి యున్నది. ఇందువలన రాజరాజనరేంద్రుఁడు 1022 వ సంవత్సరము మొదలుకొని 1063 వ సంవత్సరము వఱకు 41 సంవత్సరములు రాజ్యపాలనము చేసినట్లు సిద్ధాంత మేర్పడుచున్నది. కనుక. *[6] తదాస్థానపండితుcడయిన నన్నయభట్టారకుఁడును 1022 వ సంవత్సర ప్రాంతము మొదలుకొని యున్నవాఁడనుట స్పష్టము. ♦[7] కాబట్టి నన్నయభట్టు కాల మిప్పటికి 860 సంవత్సరము లయి యున్నది. భారత రచనమునందు నన్నయభట్టున కత్యంత సహాయుఁడుగా నుండిన నారాయణ భట్టునకు రాజరాజనరేంద్రుఁడు తన రాజ్యపాలనముయెుక్క ముప్పది రెండవ సంవత్సరమునందు నందమపూడి యను గ్రామము నగ్రహారముగా నిచ్చెను. ఈ గ్రామము గౌతమీ వైనతేయనదుల మధ్యమున నప్పడు రెండేరులవాడి విషయమనఁబడెడి యిప్పటి యమలాపురము తాలూకాలో నున్నది.
"ద్వాత్త్రింశత్తమే విజయ రాజ్యవర్షే వర్ధమానే కృత మిదం శాసనమ్" అని ముప్పది రెండవయేట ననియు, 'సోమగ్రహణనిమిత్తే . . . దత్తమ్" అని చంద్రగ్రహణసమయమునం దనియు, దానశాసనమునందుఁ జెప్పఁబడి యుండుటచేత దానకాలము శాలివాహనశకము 975 వ సంవత్సరము మార్గశీర్ష శుద్ద పూర్ణిమాభానువారమనఁగా క్రీస్తుశకము 1053 వ సంవత్సరము నవంబరునెల 28 వ తేది యగుచున్నది. ఈ శాసనమునందు నారాయణభట్టిట్లు వర్ణింపఁబడి యున్నాడు.
ప. య స్సంస్కృతకర్ణాటప్రాకృత పైశాచికాంధ్రభాషాసు
కవిరాజశేఖర ఇతి ప్రథిత స్పుకవిత్వ విభవేన
ప కవీ న్మనీషాలవదుర్విదగ్ధాన్ మనోహరాభి ర్నిజసూక్తిభి ర్యః
కుర్వన్న గర్వా న్పటుభి ర్విభర్తి కవీభవజ్రాంకుశనామసార్ధమ్
గ. తస్మై సకలజగదభినుతగుణశాలినే సరస్వతీకర్ణావతంసా యాష్టా
దశావధారణచక్రవర్తి నేనన్ని నారాయణాయ భవద్విషయే నందమ
పూణ్డినామగ్రామోగ్రహారీకృత్య సోమగ్రహణనిమిత్తే ధారాపూ
ర్వక మస్మాభి స్సర్వకరపరిహారేణ దత్త మితి విదిత మన్తు వః *[8]
ఇతఁడు సుకవిత్వవిభవముచేత సంస్కృతకర్ణాటప్రాకృత పైశాచికాంధ్ర భాషాకవిశేఖరుఁ డనియు, మనీషాలవదుర్విదగ్ధు లయిన కవులను మనోహరము లైన నిజసూక్తులచేత గర్వభంగము నొందినవారినిగాఁ జేసి కవీభవజ్రాంకుశ బిరుదమును సార్ధకము చేసికొన్నవాఁ డనియు, అష్టాదశావధానచక్రవర్తి యనియు, పయి వాక్యములు తెలుపుచున్నవి ఇతఁడు హారీతగోత్రుఁడును ఆపస్తంబసూత్రుఁడును పురోడాశపవిత్రవక్త్రుడుఁను నగు కాంచనసోమయాజి ప్రపౌత్రుఁడును, కందనార్యుని పౌత్రుఁడును శౌచాంజనేయసామికాంబలపుత్రుఁడును, అయినట్టు పై శాసనమే చెప్పచున్నది. ఈ నారాయణభట్టాంధ్రసంస్కృతముల యందుమాత్రమేకాక కన్నడమునందును మహాకవి యయి యుండెను. చాళుక్యులు కర్ణాట దేశమునకును వేఁగిదేశమునకునుగూడ పరిపాలకులయి యుండుటచేత రాజాస్థానముల యందుండిన యాకాలపు విద్వాంసులు సాధారణముగా కర్ణాటాంధ్రభాషా పండితు లయి కన్నడము నందును తెనుఁగు నందును గవిత్వము చెప్పగలవా రయి యుండిరి. కర్ణాటక భాషయంది. సుప్రసిద్దకవియైన నాగ వర్మ తన ఛందోంబుధిలోఁ దన జన్మ స్థలము వేఁగిదేశమని చెప్పకొనెను. బహుభాషల యందసమానపాండిత్యము గల నారాయణభట్టు భారతాంధ్రీకరణమునందు భారతరణమునం దర్జునునికి శ్రీకృష్ణుడు సహాయుఁ డయినట్టే విశేష సహాయుఁడయి యుండును. భారతాంధ్రీకరణమునందు సాహాయ్యపడు చుండిన హేతువుచేతఁ గూడ రాజరాజనరేంద్రుఁడు నారాయణభట్టున కీ దానము చేసియుండవచ్చును ! ఈ దానశాసనమును రచించినవాఁడు నన్నయభట్టు: రాగిఱేకులమీఁదఁ జెక్కినవాఁడు గండాచార్యుఁడు. "కావ్యానాం కర్తానన్నియభట్టో లేఖకోగండాచార్య?" అని శాసనము యొక్క- కడపటిభాగమునం దున్నది. దీని వలన రాజరాజనరేంద్రుని పరిపాలనము నందు ముప్పది రెండేండ్లవఱకును నన్నయభట్టారకుఁడు జీవించియుండుట నిశ్చయము. ఇతఁడిప్పటికే భారతాంధ్రీకరణము నారంభించి యుండును. ఈతని మరణముచేతనో కొందఱు చెప్పినట్టు మతిభ్రమణముచేతనో రాజనరేంద్రుని జీవితకాలములోనే యాంధ్రభారతరచనము నిలిచిపోయియుండును. ఈ విషయమయి చెప్పఁబడెడు కథ లన్నియు విశ్వాసార్హములు కాకపోయినను, తరువాత రాజరాజనరేంద్రుఁడు తెనుఁగుభారతమును బూర్తిచేయింపఁ బ్రయత్నించె నన్నకధను స్థాపించుచున్నవి. మరణమునకుఁ గాని మతిభ్రమణమునకుఁ గాని మనవారు కధలలోఁ జెప్పిన కారణములు గాక వేఱుకారణము లుండవచ్చును. మరణము గాని మతిభ్రమణము గాని కవి యొక పర్వమును సాంతముగా విరచించువఱకును నిలిచియుండవు. అవి కవిని సగము చేయుచుండఁగానే నడుమ నెప్పడో వాతవేసికొన వచ్చును. ఆశ్వాసమధ్యములో 'శారదరాత్రు' లన్న పద్యమును రచించు నప్పటికే మృత్యువాసన్నమయి నన్నయభట్టారకుని గ్రంథరచనమున కసమర్థుని జేసి యుండును. ఈ శాసనానంతరమున రాజనరేంద్రుఁడు సహితము చిరకాలము జీవింపక తొమ్మిది సంవత్సరములలోనే మృత్యుముఖగతుఁడయ్యెను.రాజనరేంద్రుఁడు నారాయణభట్టునకు నందమపూడి యగ్రహారమును, పావులూరి మల్లన్నకు నవఖండవాడ యగ్రహారమును, ఇచ్చినను నన్నయభట్టన కగ్రహారాదు లేవియు నిచ్చినట్టు కనబడదు. భారతాంధ్రీకరణసమాప్తి యైనతరువాత నియ్యఁదలఁచెనేమో ! ఇట్లియ్యక పోవుట రాజు కాలములోనే నన్నయభట్టాంధ్రభారతరచన మధ్యమున లోకాంతరగతుఁ డగుటను సూచించుచున్నది. తిక్కనసోమయాజి విరాట పర్వము నందు
ఉ. ఆదరణీయసారవివిధార్ధగతిస్పురణంబు గల్గి య
ష్టాదశపర్వనిర్వహణసంభృత మై పెనుపొంది యుండ నం
దాదిఁ దొడంగి మూడుకృతు లాంధ్రకవిత్వ విశారదుండు వి
ద్యాదయితుం డొనర్చె మహితాత్ముఁడు నన్నయభట్టు దక్షతన్
అని చెప్పుట నాధారము చేసికొని యిప్పటివారు కొందఱు నన్నయభ ట్టారణ్యపర్వమునంతను సంపూర్ణముగానే చేసెననియు, అందుచేతనే తిక్క_న విరాటపర్వముతో నారంభించె ననియుఁ దిక్కన కొలమునాఁటి కారణ్యపర్వాంతమువఱకు నుండినను దరువాత కారణముచేతనో యది నశింపఁగాఁ ఎఱ్ఱాప్రగడ నన్నయభట్టునందలి గౌరవముచేత నాతని పేరనే పూరించెననియు, ము న్నెవ్వరు కనని వినని కొత్త వాదము నొకదాని నారంభించిరి. ఈ వాద మపూర్వమయినదే నన్నయభట్టు మరణానంతరమున నిన్నూఱు సంవత్సరములకుండిన తిక్కనసోమయాజి వఱకును నారణ్యపర్వము సంపూర్ణముగానే యుండిన దcట. అట్లయినచో వీరి వాదానుసారముగా
ఉ. సారకథాసుధారస మజసము నాగళపూరితంబుగా
నారఁగఁ గ్రోలుచున్ జనులు హర్ష రసాంబుధిఁ దేలునట్లుగా
భారతసంహితన్ మును త్రిపర్వము లెవ్వఁ డొనర్చె నట్టివి
ద్యారమణీయు నంధ్రకవితాగురు నన్నయభట్టఁ గొల్చెదన్
అని మారన తన మార్కండేయపురాణములో నన్నయభట్టును స్తుతించుచు నతఁడు త్రిపర్వము లొనర్చెనని చెప్పి యుండుటచేత, ది 1323 వ సంవత్సరము వఱకును రాజ్యము చేసిన ప్రతాపరుద్రుని దండనాధుఁ డైన నాగనగన్నదండనాధున కంకితపు చేయఁబడిన మార్కండేయపురాణ గంధకర్త కాలము వఅకు ననగా 1323 వ సంవత్సర ప్రాంతము వఱకు నన్నయభట్టకృతారణ్యపర్వము పూర్ణముగ నుండెనని చెప్పవలెను. ఎఱ్ఱాప్రగడ వలన హరివంశమును గృతిఁగొన్న పోలయవేమారెడ్డి 1349 వ సంవత్సరము వఱకు రాజ్యపాలనము చేసినవాఁడు. వీరి వాదమును బట్టి తిక్కనసోమయాజి తరువాత నేఁబదిసంవత్సరముల కుండిన ఎఱ్ఱాప్రెగడ కాలమునాఁటికిఁ దిక్కన భారతము పదునేను పర్వములు నశింపకుండఁగా, గతించిన యిన్నూట యేబదిసంవత్సరములనుండి నన్నయభారతములోని రెండు పర్వముల మూఁడా శ్వాసములు నశింపకుండఁగా, నిరువది ముప్పదిసంవత్సరముల లోపల నారణ్యపర్వము నాల్గవయాశ్వాసములోని "శారదరాత్రు" లన్న పద్యము నుండి మాత్రము కారణము లేకయే యొక్కసారిగా నాంధ్రదేశములో నున్న యన్ని ప్రతులలోను మాయ మయ్యె నఁట ! ఇది వివేకులు నమ్మఁదగిన మాట గాదు. నన్నయభట్టు మూఁడవపర్వమునఁ గూడ మూఁడా శ్వాసములు పైగా రచియించి యుండుటచేతఁ దిక్కనసోమయాజి రెండుపర్వముల మూఁడా శ్వాసముల 542 పద్యము లని విశేషముగాఁ చెప్పక సామాన్య ముగా మూడుకృతులని చెప్పినవాఁడు. అంతే కాని వేఱేమియు లేదు. లోక వ్యహారమునందు సహిత మొక సభకు వచ్చిన జనులు లెక్కకుసరిగా 836 గురే యున్నను మనము సామాన్యముగా వేయిమంది వచ్చిరనియే చెప్పుదుము. మిగిలిన భాగమును రచియించిన ఎఱ్ఱాప్రెగడ,
క. ధీరవిచారుఁడు తత్కవి
తారీతియుఁ గొంతదోఁపఁ దద్రదనయకా
నారణ్యపర్వశేషము
పూరించెఁ గవీంద్రకర్ణపుట పేయముగాన్.
ఉ. ఆదిని శబ్దశాసనమహాకవి చెప్పిన భారతంబులో
నేది వచింపఁగాఁబడియె నెందును దానినె కాని సూత్రసం
పాదన లేమిచేఁ దెలుఁగు బల్కు మ ఱొక్కటి గూర్చి చెప్పఁగా
రా దని దాక్షవాటికవిరాక్షసుc డీనియమంబు చేసినన్.
క. ఆమూఁడుపర్వములలో
నామాన్యుఁడు నుడువుతెనుఁగు లరసికొని ? కృతుల్
తాము రచించిరి తిక్క
సు ధీమణి మొద లైన తొంటి తెలుcగుకవీంద్రుల్.
అని ఎఱ్ఱాప్రెగడ యారణ్యపర్వశేషమును రచించిన తరువాత నున్న యప్పకవి మొదలైనవారు సహితము మూఁడుపర్వము లని సామాన్యముగాcజెప్పుచున్నారే కాని మూఁడుపర్వములు పూర్తిగా నని చెప్పుట వారియద్దేశ మెంతమాత్రమును గాదు. పూర్వకాలమునుండియు లిఖింపఁబడుచు వచ్చిన భారత తాళపత్రపుస్తకము లన్నిcటిలోన "స్ఫురదరుణాంశురాగరుచి" యన్న పద్యమునకు ముందు " ఇక్కడనుండి ఎఱ్ఱాప్రెగడ కవిత్వము" అని వ్రాయC బడుచువచ్చుటచేత నన్నయ భట్టంతవఱకు మాత్రమే చేసె నని తెల్లమగుచున్నది. కలియుగాదిని భారతము తెనిఁగింపఁబడె నని కాకునూర్యప్పకవి వ్రాసి యున్నాఁడు, కాని యావ్రాఁత కాధారము లేవియుఁ గనcబడవు.
[ఆంధ్రభారతములోని యేయే భాగముల నెవ్వరెవ్వరు పూరించిరి ? అను విషయమున పలువురు రచయితలు విభిన్నములను, విచిత్రములు నగు నభిప్రాయములను వెల్లడించి యున్నారు. నన్నయభట్టు భారతములోని యాది, సభాపర్వములను, అరణ్యపర్వము లోని కొంతభాగమును తెలిఁగించెననియు. ఎత్థాపెగడ అరణ్యపర్వశేషమును పూర్తి చేసెననియు, తిక్కనసోమయాజి విరాటపర్వము మొదలు పదునైదుపర్వముల నాంధ్రీకరించి, భారతమును పూర్తిచేసెననియు సామాన్యముగ నందఱు నంగీకరించుచున్నారు. కవి కవుల చరిత్రములను రచించిన కొందఱు వేఱువిధముగఁ దలఁచుచున్నట్లు తెలియుచున్నది. Biographical sketches of Dekkan Poets' రచించిన శ్రీ కావలి వేంకటరామస్వామిగారు నన్నయ మరణము వలనఁ బూర్తికాక నిలిచిపోయిన అరణ్యపర్వము నాతని శిష్యుఁడగు బాలసరస్వతి పూరించెనని యభిప్రాయపడిరి. వారి మాటలను గమనింపుఁడు - “This poet also translated two Volumes of the Mahabharat into Telugu ın conjunction wıth Narain bhat, a bramin of the Indra sect but while employed in translating the third Volume, Nannaya unfortunately died, and as no other poet would undertake to complete the translation, a disciple of Nannaya Bhatt named Balasaraswati who was a fellow student, with Sarangadhara, the son of RajaRajanaraindra completed the work after intense labour and application" [Page 80]
ఇది విశ్వాసార్హము కాదు. రాజరాజునకు సారంగధరుఁడను పుత్రుఁడే లేనట్లును, చిత్రాంగి వృత్తాంతము కల్పితమైనట్లును చరిత్రకారులు నిర్ణయించి యున్నారు కాఁగా ఆతఁడు నన్నయభట్టునకు శిష్యుఁడై యుండుటయు పొసఁగదు. అప్పకవి తన గ్రంథమున "సిద్ధు డయిన సారంగధరుఁడు బాలసరస్వతి కాంధ్రశబ్దచింతామణి నొసగగా, ఆతఁడు దానికి టీకను వ్రాసె" నని చెప్పగా, శ్రీ వేంకటరామస్వామిగా రింకను ముందునకు సాగి, బాలసరస్వతి సారంగధరుని సహపాఠియనియు, తన గురువైన నన్నయభట్టు పూర్తి చేయక విడిచిన యరణ్యపర్వమును తెనిఁగించె ననియుఁ జెప్పుటలో వింతలలో వింత !
" కవి జీవితము " లను రచించిన శ్రీ గురజాడ శ్రీరామమూర్తిగారు అధర్వణునికిఁ దాను చేసిన ద్రోహమును దలంచి పశ్చాత్తప్తుఁడై విరాగిమై భారత ఆంధ్రీకరణమునకు వేరొకఱిని నియమింపఁగోరినట్లును, తిక్కనను ప్రార్ధింపఁగా-ఆతఁడు సమ్మతించి విరాటపర్వమునుండి ప్రారంభించి భారతము నాంధ్రీరించినట్లును-పిదప ఎఱ్ఱాప్రెగడ అరణ్యపర్వమును పూర్తి చేసినట్లును తెలిపియున్నారు.
కాని యిట్లూహించుట సరికాదు. నన్నయ, తిక్కనలు సమకాలికులు కానందునను. వీరిర్వురికిని నడుమ రెండు శతాబ్దులకాలము వ్యవధానముండుటఁ బట్టియు యూహ యుక్తము కాదు.
అరణ్యపర్వము కొంతవఱకునువ్రాయునప్పటికి నన్నయ మృతిఁ జెందెనని కాని, అతనికిఁ జిత్తవిభ్రాంతి కలిగెనని కాని కొందఱందురు.
నన్నయభట్టు మృతికిఁ బూర్వమే రాజరాజు మరణించుటవలనను, ఆతని కుమారుఁడగు కులోత్తుంగచోడుఁడు దక్షిణదేశమునందే యుండుటవలన, అతని కాంధ్రభాషయం దభిమానము లేకుండుటవలనను నన్నయభట్టునకు విరక్తి కలిగి భారతరచన నిలిచిపోయి యుండవచ్చునని ' ఆంధ్రకవి తరంగిణి" రచయిత లభిప్రాయ పడుచున్నారు.
నన్నయ భారతరచనను క్రీ. శ. 10-11 శతాబ్దుల నడుమ సాగించెనని "ఆంధ్ర కవి తరంగిణి" లోఁ గలదు. (పుట. 18] కీ శే నడకుదుటి వీరరాజుగారు, నన్నయ క్రీ. శ. 1055 ప్రాంతమున మరణించెనని యభిప్రాయపడిరని, అందే తెల్పcబడినది. భారతరచన క్రీ. శ 1025-1030 ల నడుమ జరిగిన దనియు, నన్నయభట్టు నందంపూఁడి శాసనరచయితకంటె భిన్నుఁడనియు శ్రీమారేమండ రామారావుగా దభిప్రాయపడుచున్నారని "ఆంధ్రకవితరంగిణి' [పుట 14 లో దెల్పఁబడినది.]
ఆంధ్ర భారతరచనారంభకాలమునం దాంధ్ర దేశమునకుఁ బ్రభువుగా నుండిన రాజనరేంద్రుని యొక్క పూర్వులరాజ్యక్రమము నిందు సంక్షిప్తముగాఁ దెలుపుట యనావశ్యకము కాదు. విష్ణుశర్మ చేత సంరక్షింపఁబడి చళుక్య పర్వతమున గౌరిని గూర్చి తపస్సుచేసి సేనలను గూర్చుకొనివచ్చి దక్షిణ హిందూస్థానము నంతను జయించిన (విజయాదిత్యపుత్రుఁడగు) విష్ణువర్ధనుఁడు తాను పొందిన జయములను బట్టి జయసింహుఁడను బిరుద నామమును బొందినట్టు కనఁబడుచున్నది. ఈ విజయములు నాల్గవశతాబ్దాంతమున జరిగి యుండును. ఇతఁడు కాంచీపురము రాజధానిగాఁ గల పల్లవరాజు కొమార్తెను వివాహ మాడి, యామెవలన విజయాదిత్యుఁ డనుకుమారుని గనెను. ఈ విజయాదిత్యునికి రణరాగుఁడను బిరుదనామము కలదఁట. విజయాదిత్యునికుమారుఁడు పులికేశివల్లభుఁడు. ఈ పులికేశివల్లభుని జ్యేష్ట పుత్రుఁడు కీర్తివర్మ పృధివీవల్లభుఁడు. ఇతడు క్రీస్తుశకము 563 వ సంవత్సరము వఱకును రాజ్యము చేసెను. కీర్తివర్మ యొక్క ప్రధమపుత్రుఁడగు సత్యాశ్రయుఁడన్న బిరుదనామము గల (రెండవ) పులికేశివల్లభుఁడు తన పినతండ్రియైన మంగళేశుని తరువాత 610 వ సంవత్సరమున రాజ్యమునకు వచ్చెను. ఈ సత్యాశ్రయుఁడు మిగుల బలవంతుఁడయి బహు దేశములనుజయించి, యాకాలమునందు సిద్ధపుర మనఁబడెడి పీఠికాపురమునందలి దుస్సాధ్యమయిన దుర్గమును బట్టుకొనెను. ఈ యుద్ధములయం దీతనికిఁ దమ్ముఁడు ను యువరాజు నయిన కుబ్జవిష్ణువర్ధనుఁడు మిక్కిలి సహాయుఁడయి యుండెను కీర్తివర్మ యొక్క ద్వితీయపుత్రుఁడయిన కుబ్జవిష్ణువర్ధనుఁడు 615 వ సంవత్సరమునందు వేఁగి దేశమును బాలించుట కయి యన్నగా రయిన సత్యాశ్రయునిచే నియమింపబడెను. కాని యతఁడు కొంతకాలము లోనే స్వతంత్రుఁడయి తూర్పుచాళుక్యరాజులకు మూలపురుషుఁ డయి పూర్వ చాళుక్యరాజ్య స్థాపకుఁడయ్యెను. వేఁగిదేశము బౌద్దమతస్థులగు సాలంకాయనరాజులనుండి కైకొనబడినదగుటచే, ఈ కుబ్జవిష్ణువర్ధనుని రాజ్యములోనే యాంధ్రదేశమునందు బౌద్దమతమునకు క్షీణత్వమును బ్రాహ్మణ మతమునకుఁ బ్రాబల్యమును ప్రారంభ మయ్యెను. ఈ చాళుక్య రాజులు శైవులగు బ్రాహ్మణ మతస్తులు, మానవ్యగోత్రులు.
1. కుబ్జవిష్ణువర్ధనుఁడు - ఇతఁడు పైనిజెప్పినట్టు 615 వ సంవత్సరమున చైత్రశుద్ద పూర్జిమ తరువాత రాజ్యమునకు వచ్చి 6౩౩ వ సంవత్సరము వఱకును బదునెనిమిదిసంవత్సరములు రాజ్యము చేసెను. ఇతఁడు మొదటి విష్ణువర్ధనుఁడు. ఈ విష్ణువర్ధనుఁడు దిమిలిసీమలోని కలవకొండ గ్రామమును దనరాజ్య కాలముయెుక్క- పదునెనిమిదవ సంవత్సరమున శాలివాహనశకము 555 శ్రావణ శుద్ధ పూర్ణిమనాఁటి ( క్రీస్తు శకము 632 వ సంవత్సరము జూలయినెల యేడవ తేది) చంద్రగ్రహణ సమయమునందు విష్ణుశర్మ మాధవశర్మ యను బ్రాహ్మణులకు దానము చేసినట్లున్న దానశాసనమునుబట్టి యీతని రాజ్యము విశాఖపట్టణమండలములోని సర్వసిద్ధితాలూకాలోని దిమిలిసీమ పై వఱకును వ్యాపించి యుండినట్టు స్పష్టమగుచున్నది. కుబ్జవిష్ణువర్ధనుకును తత్పూర్వులకును రణాధిదేవత యయి షాణ్మాతురుఁడయిన కార్తికేయుఁడు (కుమారస్వామి)ను, ఆదిశక్తులైన మాతృకలును, కులదైవతము లయినట్టును, తత్కులమువారు వారిచే రక్షింపఁబడుచుండునట్టును 616 వ సంవత్సరమునందుఁ జేయఁబడిన సతారా దానశాసనము చెప్పుచున్నది. బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇందాణి, చాముండ -సప్తమాతృకలు,
2. జయసింహుఁడు-విష్ణువర్షనుని జ్యేష్టపుత్రుఁడయిన (మొదటి) జయసింహుఁడు 633 వ సంవత్సరము మొదలుకొని 663 వ సంవత్సరము వఱకును ముప్పది యేండ్లు రాజ్యము చేసెను. ఇతనికి సర్వసిద్ధి యను బిరుదనామము కలదు. ఇతఁడు గుడివాడ తాలూకాలో పెణుకపఱ్ఱు గ్రామము నొక బాహ్మణుని కిచ్చినట్లు దానశాసనమున్నందున, ఇతని రాజ్యము నెల్లూరిమండలము వఱకును వ్యాపించి యుండెను
3. ఇంద్రభట్టారకుcడు— ఇతఁడు కుబ్జవిష్ణువర్ధనుని ద్వితీయ పుత్రుఁడు; జయసింహుని తమ్ముఁడు. ఈ యింద్రరాజు 663 వ సంవత్సరములో నేడుదినములు మాత్రమే రాజ్యము చేసి మృతుఁడయ్యెను.
4· విష్ణువర్ధనుఁడు- ఇతఁ డింద్రభట్టారకుని కొడుకు. ఇతనికి సర్వలోకాశ్రయుఁ డనియు విషమసిద్ది యనియు బిరుదు పేళ్ళు గలవు. ఇతఁడు 664 వ సంవత్సరము మొదలుకొని 672 వ సంవత్సరము వరకుసు తొమ్మిది సంవత్సరములు రాజ్యము చేసెను. ఇతcడు చేసిన యొక దాన శాసనమునందు "ఆత్మనో విజయరాజ్యపంచమే సంవత్సరే ఫాల్గుణ మాసే అమావాస్యాయాం సూర్యగ్రహణ నిమిత్తం" అని శకసంపత్సరము 590 ఫాల్గుణ బహుళామావాస్యకు సరియైన 668 వ సంవత్సరముతేదీ ఫిబ్రవరి నెల 17వ తేదీ యితనిరాజ్యములో నైదవయేడని చెప్పఁబడి యుండుటచేత, ఈతనిరాజ్యము 664 వ సంవత్సరము ఫాల్గుణ బహుళములో నారంభ మయినట్టు తోఁచుచున్నది. 5. మంగియువరాజు- ఇతcడు రెండవ విష్ణువర్ధనుని పుత్రుఁడు. సర్వలోకాశ్రయుడనియు విజయసిద్ధి యునియు బిరుదనామములు గలవాఁడు. ఇతఁడు 672 వ సంవత్సరము మొదలుకొని 696 వ సంవత్సరము వఱకును, ఇరువదియైదు సంవత్సరములు రాజ్యపరిపాలనము చేసెను.
6. జయసింహుఁడు - ఇతఁడు మంగియువరాజునకు ప్రధమపుత్రుఁడు; మొదటి జయసింహుని పౌత్రుఁడు. ఈ రెండవ జయసింహుఁడు 696 మొదలుకొని 709 వఱకును పదుమూడు సంవత్సరములు రాజ్యపాలనము చేసెను.
7. కొక్కిలిరాజు. ఇతఁడీ రెండవ జయసింహుని సవతితమ్ముడు మంగి యువరాజునకు ద్వితీయ కళత్రమువలనఁ బుట్టిన రెండవకొడుకు; ఇతఁడు 709 వ సంవత్సరములో *[9] తొమ్మిదినెలలు మాత్రము ప్రజాపాలనముచేసెను.
8. విష్ణువర్ధనుఁడు- ఇతఁడు కొక్కిలికి జ్యేష్ఠభ్రాత, సవతియన్నయగు జయసింహుని మరణానంతరమున రాజ్యము నక్రమముగా నాక్రమించు కొన్న కొక్కిలిరాజును సింహాసనవిహీనుని జేసి 709 మొదలుకొని 746 వఱకును ముప్పదియేడు సంవత్సరములు దేశమునేలెను. ఇతఁడు మూడవ విష్ణువర్ధనుఁడు.
9. విజయాదిత్యుఁడు - ఇతఁడు మూcడవ విష్ణువర్ధనుని కొడుకు. విక్రమరాముఁడనియు విజయసిద్ధి యనియు బిరుదములు గలవాఁడు. 746 మొదలుకొని 764 వఱకును పదునెనిమిదేండ్లు భూపరిపాలనము చేసెను. ఇతఁడు విజయాదిత్యనామముగల వారిలో మొదటివాఁడు
10. విష్ణువర్ధనుఁడు-ఇతఁడు విజయాదిత్యుని కుమారుడు. 764 మొదలు 799 వఱకు ముప్పదియాఱుసంవత్సరములని రాజ్యభారము వహించెను. ఇతఁడు నాల్గవ విష్ణువర్ధనుఁడు. 11. విజయాదిత్యుఁడు - ఇతఁడు నాల్గవ విష్ణువర్ధనుని కొడుకు; విజయాదిత్యుని మనుమఁడు. ఈ రెండవ విజయాదిత్యుఁడు నరేంద్రమృగరాజనియు, సమస్త భువనాశ్రయుఁడనియు, చాళుక్యార్జునుఁడనియు బిరుదు పేరులు వహించి, 799 మొదలు 843 వఱకును నలువదినాలుగు సంవత్సరములు రాజ్యపాలనము చేసెను ఇతఁడు గాంగులతోను రాష్ట్రకూటులతోను బహు యుద్దములు చేసి వారిని జయించి, తన రాష్ట్రమునందు నూటయెనిమిది శివాలయములు గట్టించెను
12. విష్ణువర్ధనుఁడు - ఈ యైదవ విష్ణవర్షనుఁడు విజయాదిత్యుని కొడుకు. సర్వలోకాశ్రయుఁడు, విషయసిద్ధి యను బిరుదాంకములను గలవాఁడు.ఇతఁడు 843 మొదలు 844 వఱకు పదునెనిమిదినెలలు రాజ్యము చేసెను. ♦[10] ఈతని కాలమునఁ బుట్టిన శాసనములలోఁ గొంతభాగము తెలుఁగు భాషలో నున్నది.
13. విజయాదిత్యుఁడు - ఈ మూడవ విజయాదిత్యుఁడు (ఐదవ) విష్ణువర్ధనుని పెద్దకొడుకు. ఇతఁడు గణితశాస్త్రమునందు పండితుఁ డగుటచేత గణకవిజయాదిత్యుఁడని పిలువఁబడుచు వచ్చెను. *[11] ఇతఁడు రాష్ట్రకూటులను జయించి, మంగిరాజు శిరస్సు ఖండించి,844 మొదలు 888 వఱకు నలువదినాలుగు సంవత్సరములు ప్రజాపరిపాలనము చేసెను -ఈతనికి యుజరాజవిక్రమాదిత్యుఁ డనియు, యుద్ధమల్లు డనియు నిద్దఱు తమ్ములుండిరి.
14. చాళుక్యభీముఁడు - ఇతఁడు యువరాజవిక్రమాదిత్యుని కొమారుఁడు. ఇతఁడు తన పెద్దతండ్రియైన విజయాదిత్యుని పిమ్మట రాజ్యమునకు వచ్చి రాష్ట్రకూటరాజయిన రెండవ కృష్ణుని జయించి యావఱ కన్యాక్రాంతమైన వేఁగిదేశము యొక్క భాగమును మరల నాక్రమించుకొని, 888 మొదలు 918 వఱకు ముప్పది సంవత్సరములు నేల యేలెను.
15. విజయాదిత్యుఁడు - చాళుక్యభీముని జ్యేష్ట పుత్రుఁడై న యీ నాల్గవ విజయాదిత్యుఁడు కళింగులను జయించి, 918 వ సంవత్సరములో నాఱు మాసములు రాజ్యముచేసి దేహవియోగము నొందెను. ఈతఁడు కొల్లభిగండ విజయాదిత్యుఁడని పిలువఁబడుచుండెసు
16. అమ్మరాజ విష్ణువర్ధనుడు - ఇతఁడు నాల్గవ విజయాదిత్యుని పెద్ద కుమారుఁడు. ఈతఁడు రాజమహేంద్రుఁడన్న బిరుదనామము గలవాఁడు. ఈతని కాలములోనే రాజధాని వేఁగీపురమునుండి రాజమహేంద్రవరమునకు మార్పఁబడెననియు, ఈతని పేరనే యా పట్టణమున కాపేరు కలిగినదనియు చెప్పదురు. ఆఱవ విష్ణువర్ధనుఁడైన యీ యమ్మరాజు 918 మొదలు 925 వఱకు నేడేండ్లు భూపరిపాలనము చేసెను.
17. విజయాదిత్యుఁడు - ఈ యైదవ విజయాదిత్యునికి బేటరాజని నామాంతరము గలదు. ఇతఁ డమ్మరాజుయొక్క. జ్యేష్టపుత్రుఁడు. 925 వ సంవత్స రములో పదునేను దినములు రాజ్యము చేసిన తరువాత నీతనిని యుద్దమల్లుని కొడుకైన ♦[12] తాళరాజు రాజ్యపదభ్రష్ణుని జేసి చెఱసాలయందుఁబెట్టి రాజ్యమును గైకొనెను
18. తాళరాజు - యుద్ధమల్లుని కొడుకై న యీ తాళరాజు రాజ్యమాక్రమించుకొని 925 వ సంవత్సరములో నెల దినములు రాజ్యపాలనము చేసిన తరువాత చాళుక్యభీముని ద్వితీయపుత్రుఁడును నాల్గవ విజయాదిత్యుని యనుజుఁడు నైన విక్రమాదిత్యుఁ డీతనిని జంపి రాజ్యమును గైకొనెను.
19. విక్రమాదిత్యుఁడు- చాళుక్యభీమునికొడుకై_న యీ రెండవ విక్రమాదిత్యుఁడు వేఁగి త్రికళింగ దేశములను 925-26 సంవత్సరములలో పదునొక్క మాసములు పాలించినతరువాత ఆమ్మరాజ విష్ణువర్ధనుని కొడుకగు భీముఁ డీతనిని సింహాసనవిహీనుని జేసి రాజ్యముఁ గై కొనెను. 20. భీముఁడు- అమ్మరాజవిష్ణువర్షనుని కొడుకును నయిదవ విజయాదిత్యుని తమ్ముఁడును నైన యీ మూఁడవ భీముఁడు విక్రమాదిత్యుని జయించి 926 -27 సంవత్సరములలో *నెనిమిది మాసములు రాజ్యము చేసిన తరువాత, తాళరాజు కొడుకైన యుద్దమల్లుఁ డీతనిని జcపి రాజ్యమును జేకొనెను.
21. యుద్దమల్లుఁడు- -ఈ రెండవ యుద్ధమల్లుఁడు తాళరాజు కొడుకు. ఇతఁడు 927 మొదలుకొని 934 వఱకు నేడు సంవత్సరములు రాజ్యము చేసినతరువాత నాల్గవ విజయాదిత్యుని ద్వితీయపుత్రుఁడై_న చాళుక్య భీమునిచే జయింపఁబడి రాజ్యపదభ్రష్టుఁ డయ్యెను. ఈతని కాలపు బెజవాడ శాసనములో తెలుఁగు పద్యములున్నవి. [(మొదటి) యుద్ధమల్లుఁడు ప్రసిద్ధిగల మల్లపరాజు బెజవాడలోఁ గుమారస్వామికి ఒక ఆలయమును, దానింజేర్చి యొక మఠమును కట్టించెను. ఈ యంశములుగల శాసనమే యుద్ధమల్లుని బెజవాడ శిలా శాసనముగా బ్రసిద్ధము. ఈ (రెండవ) యుద్ధమల్లుఁ డతని మనుమcడు. ఇతఁడు పయి గుడికి ముఖమండపమునో, గోపురమునో కట్టించెను.]
22. చాళుక్యభీమవిష్ణువర్ధనుడు - రెండవ చాళుక్యభీముఁడును నేడవ విష్ణువర్ధనుఁడునైన యితఁడు నాల్గవ విజయాదిత్యుని రెండవ భార్య కొడుకు: అమ్మరాజు విష్ణువర్ధనుని సవతితమ్ముఁడు. ఇతఁడు గండ మహేంద్రుఁడు, రాజమార్తాండుఁడు, అను బిరుదులు గలవాఁడై, చోళరాజైన లోవబిక్కి, రాష్ట్రకూట ప్రభువైన యైదవగోవిందరాజు మొదలైన వారిని జయించి, 934 మొదలు 945 వఱకు పండ్రెండు సంవత్సరములు రాజపాలనము చేసెను.
23. అమ్మరాజవిజయాదిత్యుఁడు- రెండవ యమ్మరాజును నాఱన విజయాదిత్యుఁడును నైన యితఁడు రెండవ చాళుక్యభీముని చిన్నకొడుకు. ఈతని కాలమునందలి యెుక దాన శాసనములో నితcడు శాలివాహనశకము 884 వ సంవత్సరము మార్గశీర్ష బహుళత్రయోదశీ శుక్రవారమునాఁ డనఁగా
[*రెండు నెలలు మాత్రమే రాజ్యమేలెనని కవితరంగిణి.(96)] క్రీస్తుశకము 945 వ సంవత్సరము డిసెంబరు నెల 5 వ తేదిని పట్టాభి షిక్తుడయినట్టు చెప్పఁబడి యున్నది. ఇతఁడు రాజపరమేశ్వరత్రిభువనాంకుశాదిబిరుదాంకములను గలవాఁడై 945 మొదలు 970 వఱకు నిరువదియైదు సంవత్సరములు భూపరిపాలన మొనర్చెను.
24. దానార్ణవుఁడు- ఇతఁడు రెండవ చాళుక్యభీముని జ్యేష్టపుత్రుఁడు; అమ్మరాజ విజయాదిత్యుఁని సవతియన్న, ఇతఁడు 970 మొదలు 973 వఱకును మూఁడు సంవత్సరములు రాజ్యము చేసెను. ఒక శాసనములో నితఁడు ముప్పది సంవత్సరములు రాజ్యము చేసినట్లుస్నదిగాని 973 మొదలు 1003 వఱకు ముప్పది సంవత్సరములు దేశ మరాజకమై యున్నట్లు బహుశాసనముల వలనఁ దెలియ వచ్చుచున్నది ఈ కాలములో చోళు లీ దేశమునకు దండెత్తివచ్చి గెలిచినట్టును, కొంతకొలము వేఁగిదేశమును పాలించినట్లును కనcబడుచున్నది*
25. శక్తివర్మ- ఇతఁడు దానార్ణవుని పెద్దకొడుకు. చాళుక్యచంద్రుఁ డన్న బిరుదు పేరు గలవాఁడు. ఇతఁడు 1003 మొదలు 1015 వఱకు పండ్రెండేండ్లు దొరతనము చేసెను. ఈతని బంగారునాణెములం ఆరకాను దేశమునందును సయాము దేశమునందును గనఁబడినవి.
26. విమలాదిత్యుఁడు- ఇతఁడు శక్తివర్మ తమ్ముఁడు. దానార్ణవుని రెండవకొడుకు ఇతఁడు రాజేంద్రచోడుని చెల్లెలును గంగయికొండ రాజరాజ రాజకేసరివర్మ కూఁతురును నగు కుండవాంబాదేవి** యను చోడరాజ కన్యను వివాహమాడి యామెవలన నాంధ్రభారత కృతిపతి యగు రాజ నరేంద్రునిఁ గనెను. ఈ రాజనరేంద్రునిది మాతామహుని పేరు విమలా దిత్యుఁడు. 1015 మొదలు 1022 వఱకు నేడు సంవత్సరములు ప్రభుత్వము చేసెను.
27.రాజరాజవిష్ణువర్ధనుడు- ఇతడే భారతకృతిపతి. విమలాదిత్యుని పుత్రుఁడై_న యితఁడు రాజరాజు లనఁబడెడువారిలో మొదటివాఁడును,
*రాజ్యమరాజకమైనదేకాని, చోళులు దీనిని జయించి పాలించిరనుట నిరాధారమని 'ఆంధ్రకవితరంగిణి' (పుట 101)
- ఈమె కుందవ దేవి యని కవితరంగిణి (పుట 108) విష్ణువర్ధనులలో నెనిమిదివాఁడును అయి యుండెను "విష్ణువర్ధనుండు వంశవర్ధనుండు" అని యాంధ్రభారతములో సహిత మీ రాజనరేంద్రునకు విష్ణువర్ధననామ మున్నట్లు చెప్పఁబడియున్నది. ఇతఁడు తన మేనమామ యగు రాజేంద్రచోళునికూఁతు రయిన యమ్మంగదేవిని వివాహ మాడెను. ఈ రాజరాజు శకసంవత్సరము 944 భాద్రపద బహుళ ద్వితీయాగురువారము ఉత్తరాభాద్రపదనక్షత్రమున ననఁగా క్రీస్తుశకము 1022 సంవ
త్సరము ఆగష్టు నెల 16 వ తేదిని పట్టాభిషిక్తుఁఁ డయ్యెను. ఇతని తమ్ముఁడు విజయాదిత్యుఁడు ఈ యేడవ విజయాదిత్యుఁడు. కులోత్తుంగచోడ దేవుని కాలములో 1063 సంవత్సరము మొదలుకొని 1077 వ సంవత్సరము వఱకును వేఁగి దేశమునకు పాలకుఁడుగా నుండెను. ఈ రాజనరేంద్రుఁడు 1022 మొదలుకొని 1063 వఱకు నలువదియొక్క సంవత్సరములు రాజ్యపాలనము చేసెను. ఈతని పేరు గల యీతని రాజ్యకాలపు బంగారు నాణెము లీ నడుమను ఆరకాను, సయాము దేశములలోఁ గనిపెట్టబడినవి.
28. కులోత్తంగ చోడ దేవుఁడు- ఇతఁడు రాజనరేంద్రుని ప్రధమ పుత్రుఁడు. ఇతcడే రాజేంద్రచోడుఁడు. ఇతని మొదటి పేరిదియే యైనను, ఇతఁడు వేఁగి దేశరాజ్యభారమును వహించిన మొదటి సంవత్సరము లోనే చోళ దేశమునకు దండెత్తి దానిని జయించి స్వాధీనపఱచుకొన్న తరువాత కులోత్తుంగచోడదేవుఁ డనcబడుచు వచ్చెను. ఇతనికి రాజనారా యణుఁడని బిరుదు పేరు. ఈతనిని కరీకాలచోళుఁడనియు వాడుచు వచ్చిరి. మూడు తరములనుండి చోళరాజులకూఁతులను వివాహమాడుచు వచ్చుటచేత తమ తల్లులనుబట్టియు భార్యలనుబట్టియు చాళుక్యుల కంతకంతకు వేఁగి దేశమునకంటె చోళ దేశముమీఁద నభిమాన మెక్కువగుచు వచ్చెను. విమలాదిత్యుఁడు రాజరాజు కూతురై న కుండవాంబాదేవిని వివాహమాడి తన కుమారునకు రాజరాజని పేరుపెట్టెను; రాజరాజు తన మేనమామ మైన రాజేంద్రచోళుని కూతురైన అమ్మంగదేవిని పెండ్లియాడి తన పుత్రునకు రాజేంద్రచోడు డనియే నామకరణము చేసెను. తరువాతి రాజేంద్ర చోడుఁడును రాజేంద్రచోడుని కూతురైన మధురాంతక దేవిని పరిణయము చేసికొని, చోళ దేశముమీఁదనే యధికాదరము గలవాఁడయి తా నా దేశమును జయించినతోడనే తన రాజధానిని చోళ దేశమునకు మార్చుకొని, వేఁగి దేశమును పాలించుటకయి పాటరులను నియమించి రాజ్యాధికారమును వారికి విడిచిపెట్టెను. 1063 వ సంవత్సరమునందు వేఁగి దేశమును పాలించుట కయి కులోత్తుంగ చోడదేవుఁడు తన పినతండ్రియైన విజయాదిత్యుని నియమింపఁగా నతఁడు పదునేను సంవత్సరములు రాజ్యపాలనము చేసి వార్థకదశలో 1077 వ సంవత్సరమునందుc జోడ దేశమునకుఁబోయి చేరెను; అటుతరువాత 1077 వ సంవత్సరములోనే వేఁగిదేశ పరిపాలనము నిమిత్తము తన రెండవకొడుకైన రాజరాజును బంపి యతఁడక్కడ నుండ నొల్లక మరుసటి సంవత్సరములోనే తల్లిదండ్రులవద్దకు లేచి రాఁగా, 1078 వ సంవత్సరమునందు శ్రావణమాసములో తన మూడవ కొడుకైన వీరచోడదేవుని వేఁగి దేశ పాలకునిగాఁ బంపెను. ఈవీరచోడ దేవుఁడు(తొమ్మిదవ) విష్ణువర్ధనుఁడను బిరుదుపేరితో 1100 సంవత్సరము వఱకును వేఁగిదేశాధిపుఁడుగా నుండెను. కులోత్తంగచోడ దేవునికి విక్రమ చోడుఁడు, రాజరాజు, వీరచోడ దేవుఁడు మొదలుగాఁ గల కొడుకులును, రాజసుందరి యను కూఁతురును గలిగిరి. ఈ రాజసుందరి కళింగరాజయిన రాజరాజునకు భార్యయయ్యెను. కులోత్తంగచోళ దేవుఁడు 1063 మొదలు 1112 వఱకును నలువదితొమ్మిది సంవత్సరములు రాజ్యపాలనము చేసెను. చాళుక్యులు తాము చంద్రవంశజుల మనియు, చోళులు తాము సూర్య వంశజుల మనియు, చెప్పకొనుచుండినవారయినను, తండ్రివంశమున శుద్దచాళుక్యుఁ డయి చోళమండలమును జయించి చోళరాజ్యమును పాలించుచు చోళరా జనcబరఁగిన కరికాలచోడుఁడను కులోత్తుంగచోడుని సంతతివారు తాము సూర్యవంశ్యుల మని చెప్పకొనసాగిరి. ఆ కాలమునందు చరిత్రాంశములను తెలిపెడు పుస్తకములు రెండు పుట్టినవి. అందొకటి జయనకొండనిచే నఱవములోఁ జేయcబడిన 'కళింగట్టుపరణి'; మఱి యొకటి బిల్హణునిచే సంస్కృతమునఁ జేయబడిన "విక్రమాంకదేవచరిత్ర" ఇందు మొదటిది 1063 మొదలుకొని 1112 వ సంవత్సరము వఱకును చోళదేశమును పరిపాలించిన కులోత్తంగచోడ దేవుని విజయములను దెలుపు చున్నది. రెండవది 1076 మొదలుకొని 1136 వ సంవత్సరము వఱకును కుంతల దేశమును పాలించిన పశ్చిమచాళుక్యరాజయిన (యాఱవ) విక్రమాదిత్యుని విజయములను దెలుపుచున్నది. ఈరాజు లిద్దఱును జిరకాలము సమకాలీనులుగా నుండుటయేకాక 1076 మొదలుకొని 1112 వరకును 36 సంవత్సరములు సమకాలిక ప్రజాపాలకులుగాcగూడ నుండిరి. "కళింగవిజయ" మను నర్థమిచ్చెడి పూర్వోక్తమయిన యఱవకావ్యములో రెండు సంవత్సరములు కళింగరాజు కప్పము కట్టుట మాని వేయఁగాఁ గులోత్తుంగచోడదేవుఁ డతనిని దండించుటకయి తన దండనాధులలో నొకఁ డయిన కరుణాకరపల్లవుని సైన్యముతో దండయాత్ర పంపినట్టొకచోటఁ జెప్పఁబడినది. చోళరాజ్య విషయమున విక్రమాదిత్యునకును గులోత్తంగచోడునికిని పలుమాఱు యుద్దములు జరుగుచు వచ్చి జయాపజయములు పర్యాయమున మాఱుచు వచ్చెను. తండ్రియైన ప్రధమసోమేశ్వరుఁడు రాజ్యపాలనము చేయుచుండఁగానే యన్న యయిన ద్వితీయ సోమేశ్వరుఁడు యువరాజుగా నుండఁగానే యీ విక్రమాదిత్యుఁడు చోళదేశము మీఁదికి జనకునిచే విజయయాత్రకుఁ బంపఁబడినట్టు విక్రమాంకదేవచరిత్రము చెప్పుచున్నది. మఱియొకసారి యితఁడు చోళులపై దండయాత్ర వెడలి నప్పుడు చోళమండలాధీశ్వరుఁ డీతని ధాటికి భయపడి తనకూఁతు నాతని కిచ్చి వివాహము చేసి సంధిచేసికొన్నట్టు చెప్పఁబడియున్నది. ఇటీవల నత్యల్పకాలములోనే దేశవిప్లవము సంభవించి చోళరాజు మరణము నొంది దేశ మరాజకముకాఁగా వెంటనే విక్రమాదిత్యుఁడు కాంచీనగరమునకు సేనలతో వచ్చి రాజద్రోహులను పాఱఁద్రోలి తనభార్య సోదరుని చోళ సింహాసనమునందు నిలిపి కంచిలోఁ దాను నెలదినములుండి స్వరాజ్యసీమ యైన తుంగభద్రాతీరమునకుఁ బోయెను. ఆతఁ డట్లడుగు తీయఁగానే కొన్ని దినములలోపలనే మరల నూతన దేశ విప్లవ మొకటి తటస్థించి యందు రాజయిన తన శ్యాలకుఁడు ప్రాణములు గోలుపోయెననియు, వేఁగి దేశా ధీశుఁడయిన రాజేంద్రచోడుఁడు కాంచీపురరాజ్య మాక్రమించుకొనియెననియు, వార్త యాతని చెవిసోఁకెను. ఇది 1063 వ సంవత్సరమున ననుటకు సందేహము లేదు. ఈసారి శత్రుఁడల్పుఁడు కాకుండుట తలపోసి మహాప్రయత్నము చేసి విక్రమాదిత్యుఁడు వెంటనే తన యన్నయైన ద్వితీయ సోమేశ్వరునితోఁ గలిసి రాజేంద్రచోడుఁ డనఁబడెడు కులోత్తంగ చోడదేవునిమీఁదికి దండెత్తివచ్చెను. ఇరువురు రాజులకును ఘోరసంగ్రామము జరిగిన మీఁదట తాత్కాలిక జయము విక్రమాదిత్యునకే కలిగి రాజేంద్రచోడుడు పలాయనము నొందవలసినవాఁ డయ్యెను; కాని సోమేశ్వరుఁడు ప్రతిపక్షి చేతిలోఁ జిక్కి కారాబద్ధుఁడుగాc జేయబడెను. ఇటీవల చోళులకును చాళుక్యులకు ననఁగా పూర్వ చాళుక్యులకును పశ్చిమ చాళుక్యులకును చోళరాజ్యసంబంధమున యుద్దములు పలుమాఱు జరగుచు వచ్చెను. ఈ యుద్ధములు చోళ దేశముతో నిలువక వేంగీదేశమువఱకును గూడ వ్యాపించినట్టు కనఁబడుచున్నవి. ఈ యుద్ధములలో నొకసారి విక్రమాదిత్యుఁడు వేంగీదేశమును సహితము స్వాధీనము చేసికొన్నట్టు చెప్పఁబడినది. గోదావరీమండలములోని దాక్షారామములోఁ గల శాలివాహనశకము 1045, 1052 సంవత్సరములనాఁటి విక్రమాదిత్యుని శాసనములీ విషయమును గొంత స్థిరపఱచుచున్నవి. సాధారణముగా 'కళింగట్టుపరణి" కులోత్తుంగచోడుని విజయములను, 'విక్రమాంక దేవచరిత్ర" విక్రమాదిత్యుని విజయములను పొగడుచుండును.
29. విక్రమచోడుఁడు- ఇతఁడు కులోత్తంగచోడు డనఁబడెడు రాజేంద్రచోడుని జ్యేష్ఠకుమారుఁడు. ఇతఁడు కొంతకాలము వేఁగి దేశ పాలకుఁడుగా నుండెను. ఇతcడు తండ్రి యొక్క- మరణానంతరమున వేఁగి దేశము విడచి చోళరాజ్యమును వహించుటకుఁ బోయెనని యొక శాసనమున నున్నది. ఈతఁడు 1112 మొదలు 1127 వఱకు పదునేను సంవత్సరములు రాజ్యము చేసెను.
30. కులోత్తుంగ చోడదేవుఁడు - ఈ రెండవ కులోత్తుంగుఁడు విక్రమ చోడుని కొడుకు ఇతఁడు 1127 వ సంవత్సరమున రాజ్యమునకు వచ్చెను. ఇతcడు చోళరాజ్యమును 1158 వ సంవత్సరము వఱకును పాలించెను. ఇతని కొడుకు రాజేంద్రచోడుఁడు పండ్రెండవ శతాబ్ద్యంతము వఱకును, రాజేంద్రచోడుని కొడుకు రాజరాజచోడుఁడు 1232 వ సంవత్సరము వఱకును, చోడరాజ్యమును పాలించినట్టు కనఁబడుచున్నది. ఈ రెండవ కులోత్తుంగచోడ దేవుని కాలములోనే వేఁగిదేశ మితర చాళుక్యుల యధీన మయినట్టు స్పష్టముగాc గనఁబడుచున్నది. 1202 వ సంవత్సరము నందు మల్లవిష్ణువర్ధనుఁడు వేంగిదేశప్రభువుగా నుండినట్టొక శాసనము నందున్నది. ఆ శాసనమునందే యాతని తండ్రి విజయాదిత్యుఁడు చిర కాలము వేఁగిదేశమును బాలించినట్టును జెప్పఁబడియున్నది. దీనినిబట్టి చూడఁగా రెండవ కులోత్తుంగ చోడ దేవునికాలములోనే విజయాదిత్యుఁడు వేంగిదేశరాజ్యమును వహించినట్టు తోఁచుచున్నది. ఈ విజయాదిత్యుఁడు పైని వివరింపఁబడిన పదునేఁడవ తూర్పుచాళుక్యరాజగు బేటవిజయా దిత్యుని కాఱవతరమువాఁడు. బేటవిజయాదిత్యుని కొడుకు సత్యాశ్రయుఁడు; సత్యాశ్రయునికొడుకు విజయాదిత్యుఁడు, విజయాదిత్యునికొడుకు విష్ణువర్షనుఁడు; విష్ణువర్ధనునికొడుకు మల్లప్పదేవుఁడు; మల్లప్పదేవుని కొడుకు వేంగిదేశ ప్రభువైన విజయాదిత్యుఁడు. 1228 వ సంవత్సరము నందు కృష్ణాగోదావరీ మధ్యమునందున్న వేఁగి దేశమంతయు గణపతిరాజుల యధీన మైనది. కులోత్తుంగచోడదేవుని కాలమునుండియు చాళుక్య చోడు లందఱును తాము వేఁగి దేశమును విడిచి చోళుల బిరుదావళులను వహించి తాము చోళులుగానే పరిగణింపఁబడుచు వచ్చుటచేత వారినిగూర్చి యిందు వివరించుట యనావశ్యకము. చాళుక్యులు చంద్రవంశపురాజులు; చోళులు సూర్యవంశపురాజులు; *[13] ఈ క్రిందిది చాళుక్యుల వంశవృక్షము. [ యీ వంశవృక్షములో నీయcబడిన రాజులకాలము "ఆంధ్రకవితరంగిణి" లో క్రిందిరీతి నీయఁబడియున్నది.
1) కుబ్జవిష్ణువర్ధనుండు 616-633 2) జయసింహుఁడు 634-666, 8) ఇంద్ర భట్టారకుఁడు 666. 4) విష్ణువర్ధనుఁడు 667-675. 5) మంగి యువరాజు 676-700. 8) జయసింహుఁడు 701-713. 7) కొక్కిలి 714. 8) విష్ణువర్ధనుఁడు 714-750 9) విజయాదిత్యుఁడు (751-768 10) విష్ణువర్ధనుఁడు 768-803 11) విజయాదిత్యుఁడు 804-848. 12) విష్ణువర్ధనుఁడు 849 13) గణక (గుణగ) విజయాదిత్యుఁడు 850-892, 14) చాళుక్యభీముఁడు 892-918, 15) విజయాదిత్యుఁడు 919. 18) అమ్మరాజవిష్ణవర్షనుఁడు 919-925. 17) బేటవిజయాదిత్యుఁడు 926. 18) తాళరాజు 925, 19) విక్రమాదిత్యుఁడు 925–926, 10) భీముఁడు 926. 2) యుద్దమల్లుఁడు 925–933 22) చాళుక్యభీముఁడు 934-945 28) అమ్మరాజవిజయాదిత్యుఁడు 945-970 24) దానార్ణవుఁడు 970–973 25) శక్తివర్మ I 1000-1011 28) విమలాదిత్యుఁడు 1011-1022, 27) రాజరాజు 1022-1063)
ఈ నన్నయభట్టారకుఁడు భారతమునందలి యాదిపర్వమును, సభాపర్వమును, ఆరణ్యపర్వములోని నాల్గవ యాశ్వాము మూడవవంతు వeవికిపను రాజ నరేంద్రున కంకితముగా తెనిఁగించెను. ఈతఁడు రచించిన దానిలో ఉ. శారదరాత్రు లుజ్జ్వలలసత్తర తారకహారపంక్తులన్
జారుతరంబులయ్యె వికసన్నవకై_రవగంధబంధురో
దారసమీరసౌరభము దాల్చి సుధాంశువికీర్యమాణక
ర్పూరపరాగపాండురుచిపూరము లంబరపూరితంబులై.
అనునది కడపటి పద్యము. ఈ పద్యమునందలి నాల్గవ చరణములోని "రుచిపూరము లంబరపూరితంబులై " యని యున్నచోట ' రుచిపూరములు + అంబరపూరితంబులై " యనుటకు మాఱుగా 'రుచిపూరములం + బరపూరితంబులై " యని పదవిభాగము చేసి యక్కడనుండి పయి పద్యము లన్నియు నన్నయవి గాక పరపూరితము లన్న యర్ధము స్ఫురించుచున్న దని యొకానొకరు చమత్కారముగా వ్రాసియున్నారు. ఈతనిది మృదు వయిన సులభశైలి; కవిత్వము ద్రాక్షాపాకమయి మిక్కిలి రసవంతముగా నుండును. ఈయన కవనమందించుమించుగా రెండు వంతులు సంస్కృత పదములను, ఒకవంతు తెలుఁగుపదములును నుండును. ఈ యంశము లీయనకవిత్వధోరణిని జూపుటకయి యిందు క్రింద నుదాహరింపఁబడిన పద్యములవలనఁ దెలిసికోవచ్చును.
క. అడవులు నేఱులు నవి నీ
పడసినయవి యెట్లు పుణ్యభాగీరధి యి
ప్పుడమిఁ గలవారి కెల్లను
నెడపక సేవ్యంబకాక యిది నీయదియే. [ఆది. అ 7-41]
ఉ. వీరుఁడు వీఁడు పాండవుఁడు వృష్ణికులోత్తములై న సీరిదై
త్యారు లెఱుంగకుండఁగ మహారధుఁడై తరుణిన్ సుభద్ర నం
భోరుహనేతఁ దోడ్కొనుచుఁ బోయెడు నీతనిబోవ నిచ్చినన్
ధీరుఁడు మాధవుండు బలదేవుఁడు నల్గుదురంచు నడ్డమై
(ఆది.ఆ 8 -199)
మ. కురు వృద్దు ల్గురువృద్ధబాంధవు లనేకు ల్చూచు చుండ న్మదో
ద్ధరుఁడై ద్రౌపది నట్లు చేసిన ఖలున్ దుశ్శాసనున్ లోకభీ
కరలీలన్ వధియించి తద్విపులవక్షశ్శైలర క్తౌఘని
ర్ఘర ముర్వీపతి చూచుచుండ నని నాస్వాదింతు నుగ్రాకృతిన్. (సభా. ఆ 2 -233)
ఈయనకవిత్వమంతయు మొత్తముమీఁద రసపుష్టి కలదిగానే యున్నను, ఆరణ్యపర్వమునందలి కొన్ని భాగములు మాత్రము నిస్సారములుగాఁ గనఁబడుచున్నవి. అవసానకాలమునకు ముందు రోగబాధచేతనో చిత్తవైకల్యముచేతనో బుద్ధిబలము తగ్గియున్నప్పడవి చేయబడియుండవచ్చును. కవిత్వనైపుణి యెట్లున్నను కధమాత్రము మూలగ్రంధమగు వ్యాస విరచితసంస్కృతభారతమునకు సరియైన భాషాంతరముకాదు. ఈ కవి యొక్కఁడు మాత్రమే గాక సంస్కృతపురాణములను తెనిఁగించిన యాంధ్ర కవు లందఱునుగూడ తమయిష్టానుసారముగాఁ గొన్నిచోట్ల మూలగ్రంధములోని కధలను సంగ్రహపఱిచియు కొన్నిచోట్ల పెంచియు, కొన్నిచోట్ల కథలను మార్చి వేఱుకధలను చేర్చియు, కొన్నిచోట్ల కధలు తాఱుమాఱు చేసియు, కొన్నిచోట్ల నూతనకథలను గల్పించియు, కొన్నిచోట్ల మునుపున్నవానిని బొత్తిగా తీసివేసియు యధేచ్ఛములయిన వర్ణనలుపెట్టియు ప్రధానకథాంశమునుమాత్రము వదలక నానావిధముల మూలగ్రంధముల కంటె తమ గ్రంధములు భిన్నములుగా నుండునట్లు చేసిరి. ఈ హేతువు చేతనే సంస్కృతమున లక్ష యిఱువదియైదువేలు గల భారతము తెనుఁగున నేఁబదివేల గ్రంధమునకు దిగినది. ప్రతిపదార్ధభావప్రథానము లైన కావ్య నాటకములందు మాత్రమే భాషాంతరము సరిగా మూలానుసారముగా నుండ వలెను గాని కేవలకథామాత్రప్రధానములై న పురాణేతిహాసములయందట్లు గాక వినువారి వీనుల కింపుగా నుండునట్లు కధను యధేచ్చముగా వ్రాయుటయే సముచితమని కొందఱనుచున్నారు. అట్లే కావచ్చును. నన్నయ భట్టాదిపర్వమునందు సంస్కృతమున శకుంతలకధ తరువాత నున్న యయాతి చరిత్రమును శకుంతలోపాఖ్యానమునకు ముందుంచుటయు, ధృతరాష్ట్రునకు కణికుఁడు చెప్పినట్లున్న జంబుకాదులకథ మొదలయినవానిని తెనిఁగింపక విడిచివేయుటయు, పయిపొనికి దృష్టాంతములుగా గ్రహింపవచ్చును. తిక్కనసోమయాజినిగూర్చి వ్రాయునపు డీ విషయము కొంత వివరింపఁబడును. దుష్యంతునికంటె యయాతి యెంతో పూర్వcడగుటచేత ముందుగా యయాతిచరిత్రమును జెప్పటయే సమంజసము కావచ్చును. నన్నయకాలపు భారతప్రతులలోఁ గూడ నొకవేళ పార మట్లే యుండిన నుండ వచ్చును. ఈ కవులు సంస్కృతశ్లోకములను తెలిఁగించెడు రీతిని తెలుపుట కయి రెండు మూడు శ్లోకములను, వానికి సమములయిన పద్యములను మాత్రమిక్కడ నుదాహరింపఁబడుచున్నవి -
సంస్కృత సభా పర్వము శ్లో. కదళీ దండసదృశం సర్వలక్షణసంయుతమ్, గజహస్తప్రతీకాశం వజ్రప్రతిమగౌరవమ్. అభ్యుత్మ్సాయిత్వా రాధేయం మాథర్షయ న్నివ. ద్రౌపద్యాః ప్రేక్షమాణాయా స్సవ్యమూరు మధర్షయత్.
భీమసేన స్తమాలోక్య నేత్రే ఉ(?)త్ఫాల్య లోహితే ప్రోవాద రాజమధ్యే తం సభాం విశ్రావయ న్నివ. పితృభి స్సహ సాలోక్యం మా స్మ గచ్ఛేద్వృకోదర8, యద్యేతమూరుం గదయా న భేద్యాం తే మహాహవే.
తెలుఁగు సభాపర్వము
ఉ. అమ్ముదిత న్విభీతహరిణాక్షిఁ గలాపవిభాసికేశభా రమ్మున నొప్పుదానిఁ దన రమ్యపృథూరుతలంబు నెక్కఁగా రమ్మని సన్న చేసె ధృతరాష్ట్రసు తాగ్రజుఁ డప్డు దాని దూ రమ్మునఁ జూచి కౌరవకురంగమృగేంద్రుఁడు భీముఁ డల్కతోన్.
క. లయసమయ దండధర ని ర్దయుఁడై ధరణీశు లెల్లఁ దన పలుకులు వి స్మయసంభ్రమసంభృతులైభయమున వినుచుండ నా సభం దగఁ బలికెన్,
ఉ. ధారుణి రాజ్యసంపదమదంబునఁ గోమలిఁ గృష్ణఁ జూచి రం
భోరు నిజోరు దేశమున నుండఁగఁ బిల్చిన యిద్దురాత్ము దు
ర్వార మదీయబాహుపరివ ర్తితచండగదాభిఘాతభ
గ్నోరుతరోరుఁజేయుదు సుయోధను నుగ్రరణాంతరంబునన్.
(సభా.అశ్వా.248 -249 )
సంస్కృతమున మొదటిశ్లోకమునందుఁ గదళీ స్తంభసదృశమనియు సర్వ లక్షణసంయుత మనియు గజహస్తప్రతీకాశ మనియు వజ్రప్రతిమగౌరవ మనియు దుర్యోధనునితొడ వర్ణింపబడినది. దాని తెనుఁగు నందో రమ్య పృధూరుతలం బని మాత్రము చెప్పఁబడినది. చూచుచున్న ద్రౌపదికని సంస్కృతమున నుండఁగా తెనుఁగున ద్రౌపదికి విభీతహరిణాక్షి యనియు కలాపవిభాసికేశభారమున నొప్పుదాని ననియు కొత్తవిశేషణములు చేర్చఁబడినవి. రెండవ శ్లోకముయెుక్క పూర్వార్ధములోని రాధేయన కుబ్బు పుట్టించి భీమునకుఁ దిరస్కారము కలుగునట్లుగా నన్నమాటలు బొత్తిగా వదలివేయcబడినవి. మూఁడవ శ్లోకములోని భీమసేనుఁడు కనులెఱ్ఱచేసి దానిని తేఱిపాఱఁ జూచి యన్న వాక్యము 'దానిదూరమ్మునఁజూచి కౌరవ కురంగమృగేంద్రుఁడు భీముఁ డల్కతో' నని తెనిఁగింపఁబడి మూలములో లేని 'కౌరవకురంగమృగేంద్రుc' డను విశేషణ మధికముగాఁ జేర్పఁబడి నది. అటుతరువాత సభవారు వినునట్లుగా రాజమధ్యమునం దిట్లు పలికె నని యున్న శ్లోకముయొక్క యుత్తరార్ధమునకు "లయసమయదండధర నిర్ణయుఁడయి, ధరణీశు లెల్లఁ దనపలుకులు విస్మయ సంభ్రమసంభృతులై భయమున వినుచుండ నా సభన్ దగcబలికె" నని తెనుఁగుచేయబడినది. ఈ వాక్యము 'లయ సమయదండధరనిర్దయుఁ డయి' యనియు "విస్మయ సంభ్రమసంభృతులయి' యనియు మూలములో లేని మాటలు కవిచేc గల్పింపఁబడినవి. నీ యిూ తొడను గదచేత మహాయుద్ధమునందు విఱుగC గొట్టనియెడల వృకోదరుఁడు పితృపితామహాదులతోడి సాలోక్యమునకుఁ దప్పినవాఁ డగునన్న కడపటి శ్లోకమును "ధారుణి రాజ్యసంపదమదంబున" నన్న పద్యమునుగాఁ దెనిఁగించుచో 'ధారుణి రాజ్యసంపద మదంబునఁ గోమలిఁ గృష్ణఁజూచి రంభోరునిజోరు దేశమున నుండగఁ బిల్చిన ఇద్దురాత్ము" నన్నంతవఱకు కొత్తగాఁ జేర్పఁబడినది. గదతోనని మూలములో నున్నదానికీ 'దుర్వారమదీయబాహుపరివర్తిత చండగదాభిఘాత"ముచేత నని పెంచి చెప్పఁబడినది. పితృపితామహులలోకమునకుఁ దప్పినవాఁడ నగదు నన్న మూలములోని వాక్యము విడువcబడినది. పరిశీలించి చూచిన పక్షమున భాషాంతరమంతయు నిదే ప్రకారముగా నుండునుగాని సరిగా మూలము ననుసరించి యుండదు. మూలముతో సరిపోల్పక ప్రత్యేకముగాఁ జూచునప్పడు మాత్ర మాంధ్రభారతము మనోహరముగా నుండుననుటకు సందేహము లేదు. కొన్నిచోట్ల మూలమునకంటెను హృద్యతరముగానుండి రసాతిశయము పుట్టించుననుటయు నిర్వివాదాంశమే!
నన్నయభట్టారకుఁడు తాను రచియింప నారంభించిన శ్రీమహాభారతమును సంపూర్ణముగా నాంద్రీకరింపలేకపోవుటకుఁ గారణములు పలువురు పలు విధములుగాఁ జెప్పదురు. కొందరు వేములవాడ భీమకవి శాపముచేతఁ గలిగిన మరణము కారణ మందురు. మఱికొందఱధర్వణాచార్యులు తెలిఁ గించుచుండిన భారతమును తగులఁబెట్టించుట చేతఁ గలిగిన చిత్తచాంచల్యము కారణ మందురు. ఈ రెండు కారణములలో నేది నిజమైనను, ఈకవి పరోత్కర్షము సహింపఁజాలని దుస్స్వభావము కలవాఁడయిన ట్టూహింపఁదగి యున్నది. ఈయనతోడి సమకాలికుఁడైన వేములవాడ భీమకవి రాఘవపాండవీయమును, కవిజనాశ్రయములోఁ జేర్చి యెుక వ్యాకరణమును జేసి రాజసన్మానమును బొందుటకయి రాజమహేంద్రపురమునకుఁ దెచ్చి విష్ణువర్ధనుని యాస్థానపండితుఁడయియున్న నన్నయభట్టునకుఁ జూపఁగా నతఁ డాతనికవిత్వము మిక్కిలి శ్లాఘాపాత్రముగా నుండుట చూచి యోర్వలేక యా పుస్తకములు లోకములో వ్యాపించిన యెడలఁ దన పుస్తకములకుఁ బ్రసిద్ధి రానేరదనియెంచి వానిని తగులఁ బెట్టించినట్లును, అటు మీఁదట నతఁడింట లేనప్పడు భీమకవి వచ్చి యాతనిభార్యను నీభర్త యేమి చేయుచున్నాఁ డని యడిగి యామె తనభర్త రహస్యస్థలమున నుండి యరణ్యపర్వము రచించుచున్నాఁ డని చెప్పినమీఁదట నతఁ డింకను నరణ్యములోనేయున్నాఁడా ? యట్లే యుండునుగాక" యని శపించి తన పుస్తకముల నడఁగద్రొక్కె నన్న కోపముచేత నన్నయభట్టు రచించిన ఛందస్సును, వ్యాకరణమును అతని భార్య నడిగి పుచ్చుకొని వానిని చించి గోదావరిలోఁ గలిపివేసి తాను చిరకాలము కష్టపడి చేసిన గ్రంథములు పోయినవన్న దుఃఖముచేత బెంగపెట్టుకొని కాలధర్మము నొందినట్లును, ఆతని శాపము తగిలి నన్నయభట్టు వనములో మృతినొందినట్లును, అట్లు నశించిన వ్యాకరణము సిద్దులలోఁ గలిసిన సారంగధరుఁడు తాను చిన్న తనములో నేర్చుకొని యుండుటచేత మరల బాలసరస్వతి యను బ్రాహ్మణు నకుఁ జెప్పినట్లును, లోకప్రవాదము కలిగియున్నది. దీని కుపబలముగా నప్పకవీయమునందు
గీ. ఆంధ్రశబ్దచింతామణి వ్యాకరణము
ముందు రచియించి తత్సూత్రములఁ దెనుంగు
బాసచేఁ జెప్పె నన్నయభట్టు తొల్లి
పర్వములు మూఁడు శ్రీమహాభారతమున [ఆ 1-42 ]
గీ. భారతముఁ దెనిఁగించుచుఁ దా రచించి
నట్టి రాఘవపాండవీయము నడంచె
ఛందము నడంప నీఫక్కి- సంగ్రహించె
ననుచు భీమన యెంతయు నడఁచె దాని [ఆ 1 -44]
గీ. రాజరాజనరేంద్రతనూజుఁ డార్య
సఖుఁడు సారంగధరుఁడు శై_శవమునందు
నన్నయ రచించునెడఁ బరసం బొనర్చె
నన్యు లెవ్వ రెఱంగ రీయాంధ్రపక్కి. [ఆ 1-48 ]
క. ఆ లోకనుతుఁడు మొన్నటి
కీలకసమ నామతంగగిరికడ నొసఁగెన్
బాలసరస్వతులకు నతఁ
డోలిఁ దెనుఁగుటీక దాని కొప్పుగఁ జేసెన్ [ఆ 1-50 ]
క. ఆదిని భీమకవీంద్రుడు
గోదావరిలోనఁ గలిపెఁ గుత్సితమున నా
మీఁదట రాజనరేంద్ర
క్ష్మాదయితునిపట్టి దాని మహి వెలయించెన్ [ ఆ.1-51 ]
అను పద్యములు కనఁబడుచున్నవి. అంతేకాక పింగళి సూరకవి విరచితమైన రాఘవపాండవీయమునందును దత్కృతివతి యగు వేంకటాద్రిరాజు కవి నుద్దేశించి,
"శా. రెండర్థంబులపద్య మొక్కటియు నిర్మింపంగ శక్యంబు గా
కుండుం దద్గతిఁ గావ్య మెల్ల నగునే నోహో యనం జేయదే !
పాండిత్యం బిఁక నందునుం దెనుఁగు కబ్బం బద్భుతం బండ్రు ద
క్షుం డెవ్వాఁ డిల రామభారతకథ ల్జోడింప భాషాకృతిన్.
ఉ. భీమన తొల్లి చెప్పె నను పెద్దలమాటయెకాని యందు నొం
డేమియు నేయెడ న్నిలుచు టెవ్వరుఁ గాన; రటుండ నిమ్ము
నా నా మహితప్రబంధరచనా ఘనవిశ్రుతి నీకుఁ గల్గుటన్
నా మదిఁ దద్వయార్ధకృతినై పుణియుం గల దంచు నెంచెదన్."
[రాఘవ-పీఠిక–10, 11]
లని యన్నట్టు చెప్పఁబడి యున్నది. ఈ రెండు పుస్తకములలోను వ్రాయఁ బడినదానినిబట్టి చూడఁగా భీమకవి రాఘవపాండవీయమును రచించినట్టును అది యే హేతువుచేతనో నశించినట్టును స్పష్ట మగుచున్నది. ఆ పుస్తకము నశించుట కప్పకవి చెప్పినదానినిబట్టి యొక వేళ నన్నయభట్టు కారకుఁడయిన నయి యుండు ననుకొన వచ్చును గాని యీ యిరువురు కవులును సమకాలీనులు కాకపోవుటచేత నీయూహ కవకాశము లేశమును లేదు.
ఈ ప్రకారముగానే యధర్వణాచార్యుని భారతమును గూడ నన్నయభట్ట డఁగఁద్రొక్కినట్టు లోక ప్రతీతి కలదు. అధర్వణాచార్యుఁడు భారతమును దెనిఁగించి దానికి రాజనరేంద్రుని కృతిభర్తనుగాఁ జేసి బహుమానమును పొందవలయునని రాజమహేంద్రవరమునకు వచ్చి నన్నయభట్టునకు గ్రంథమును జూపి తనకు రాజసందర్శనము చేయింపమని వేఁడె ననియు, ఆ గ్రంథము సర్వోత్కృష్ణముగా నున్నందున దానిని ప్రకటనపఱిచినయెడల స్వగ్రంథ ప్రాశస్త్యము చెడు నవి యతఁడాలాగుననే యని చెప్పి త్రిప్పుచు నొకనాఁ డధర్వణాచార్యుఁడింట లేని సమయమునం దతఁడు బసచేసియున్న యింటివారికి లంచ మిచ్చి యాపుస్తకమును గాల్పించెననియు, ఇల్లు విడిచి పోవునప్ప డధర్వణాచార్యుఁడెవ్వరికో చూపుటకయి తనతోఁగూడఁ దీసికొని పోయిన విరాటపర్వమొక్క-టి మాత్రము నశింపక మిగిలె ననియు, ఈ దుర్నయము నన్నయభట్టువలన జరగిన దని తెలిసికొని యధర్వణా చార్యుఁ డాతనిని శపించుచు దుఃఖముతో లేచిపోయె ననియు, సాధుపురుషునకు నిష్కారణముగ ద్రోహము చేసిన చింతచేత నన్నయభట్టు మతిచెడి వెఱ్ఱివాడయి గ్రంధరచనకు సమర్ధుఁడు కాకపోయె ననియు చెప్పుదురు. కాని యీ కధ యెంత మాత్రము విశ్వాసార్థమయినది కాదు. అధర్వణా చార్యుఁడును నన్నయభట్టును సమకాలీనులని నిర్ణయించుటకుఁ దగిన నిదర్శనము లేవియుఁ గానరావు. అధర్వణాచార్యకృతమయిన వికృతి వివేక మను వ్యాకరణకారికావళిని నన్నయభట్టవిరచిత మనెడి యాంధ్ర శబ్దచింతామణిని విమర్శించి చూడఁగా నధర్వణాచార్యుఁడు నన్నయభట్టు నకుఁ దరువాతివాఁ డని యూహింపc దగియున్నది. అయినను ఈ యూహను వేఱువిధముగాఁ గూడ చేయవచ్చును. నన్నయభట్టారకుఁడు భారతము నారణ్యపర్వమువఱకును దెనిఁగించి కాలధర్మము నొందిన తరవాత తిక్కనసోమయాజి పూరింపఁ బూనుకొనకమునుపో, పూనుకొన్న సంగతి యెఱుఁగకమునుపో మిగిలిన భాగమును తా నాంధ్రీకరింపఁ బూని విరాటపర్వమును మాత్రమే చేసి యధర్వణాచార్యుఁడు తక్కినభాగమును ముగింపకయే లోకాంతరగతుఁ డయి యుండవచ్చును.
నన్నయభట్టు రచియించిన వన్న యితర గ్రంధములు లక్షణసార మను తెలుఁగుఛంద స్సొకటియు, ఆంధ్రశబ్దచింతామణి యనఁబడు తెలుఁగు వ్యాకరణ మొకటియు, ఇంద్రవిజయ మను గ్రంధము నొకదానినిఁగూడ నన్నయ రచియించిన ట్లానందరంగరాట్ఛందములో నుదాహరింపఁబడిన యొక పద్యమువలనఁ దెలియవచ్చుచున్నది. భీమన నశింపఁజేయుటచేతఁ గాకపోయినను మఱియే హేతువుచేతనో నన్నయభట్టకృత మైన ఛందస్సిప్పుడెక్కడను కానబడదు నన్నయభట్ట విరచితమైన లక్షణసార మిప్పడున్నదనియు, దానిలో నితరలాక్షణికు లుదాహరించిన పద్యము లన్నియు నున్న వనియు తిక్కనకృతమైన కవివాగ్బంధనమునందువలెనే దీనియందును విశేషవిషయము లేవియు లేవనియు శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రులవారు వ్రాయుచున్నారు. లక్షణసారమును, ఇంద్ర విజయమును, నన్నయభట్ట విరచితములుగాక యన్నయభట్ట విరచితములని మఱియొక మిత్రులు నా పేర వ్రాయుచున్నారు వేఱొకరు నన్నయభట్టు రాఘవాభ్యుదయములోని దని యొక పద్యము నుదాహరించి యున్నారు. ఆంధ్రశబ్దచింతామణికి ప్రక్రియాకౌముది యని మఱియొక పేరు కలదు. దీనిని రచించుట చేతనే నన్నయ భట్టునకు వాగనుశాసనుఁ డను బిరుదు పేరు కలిగినదందురు, గాని, యీ యంశము విశ్వసనీయము కాదు. ఈ తెలుఁగు వ్యాకరణము సంస్కృతభాషలో నెనుబది రెం డార్యావృత్తములలో రచియింపఁ బడినది. దీనిని నన్నయభట్టీయ మని సాధారణముగా జనులు వాడుదురు. ఈ యాంధ్ర వ్యాకరణమున "కెలకూచి బాలసరస్వతి యను పండితుఁడు మొట్టమొదట తెలుఁగున టీక యొకటి వ్రాసెను. దానికి బాలసరస్వతీయ మని పేరు అటుతరువాత వాసుదేవుఁడను మఱియొక పండితుఁడీ వ్యాకరణమునకు వార్తిక మొక్కటి వ్రాసెను. దానిని వాసుదేవవృత్తి యని వ్యవహరింతురు. తదనంతరము కాకుసూర్యప్పకవి యీ వ్యాకరణమును దెనిఁగింపఁ బూని సంజ్ఞా సంధిపరిచ్చేదములను మాత్రము తెనుఁగున నయిదా శ్వాసములుగల పద్యకావ్యమునుగా రచించెను. ఈతనియనంతర మహోబలపండితుఁ డాంధ్రశబ్దచింతామణికి సంస్కృతభాషలో నొక వ్యాఖ్యానము చేసి దానికిఁ గవిశిరోభూషణ మని పేరుపెట్టెను. దానినిప్పు డహోబల పండితీయమని పిలుతురు. పిమ్మట నృసింహపండితుఁ డను నొకండుకూడ నన్నయభట్టీయమున కొక వ్యాఖ్యానము చేసెను. దానికి నృసింహ పండితీయమను నామము ఆంధ్రశబ్దచింతామణి నన్నయభట్టారకవిరచితము కా దనుటకుఁ గల హేతువులనుగూర్చి యిచ్చట గొంత విమర్శింతము. అప్పకవీయము పంచమా శ్వాసమునందు శబ్దానుశాసన మూలసూత్ర మని “ను మ్చోతో హల్యధ్వరణాచార్యమతాత్' అని యొక సూత్ర ముదాహరింపఁబడి యున్నది. ఇది నిజముగా నన్నయభట్టీయసూత్రమే యయినయెడల, అధర్వణాచార్యుఁడు నన్నయభట్టునకుఁ బూర్వకాలికుఁ డనియే చెప్పవలెను. అదియే నిజ మయినపక్షమున, 'ఆప్రయుక్త త్వదోష స్తున విరుద్ధా హరే ర్మతే" యనివి యధర్వణకారికలలోఁ జెప్పఁబడి యుండుటచేత హరికారికలును నన్నయ భట్టియమునకుఁ బూర్వపువే యయి యుండవలెను. ఇప్పడు శిష్టు కృష్ణమూర్తి గారిచేత వ్యాఖ్యానము చేయఁబడి చిన్నయసూరిగారి బాలవ్యాకరణములోని సర్వాంశములను గలిగి యున్న హరికారికలే * నిజమయిన హరికారికలయి యీ హరికారికలును అధర్వణకారికలును గూడ నన్నయభట్టీయ వ్యాకరణమునకుఁ బూర్వపు వయినవశమున నన్నయభట్టీయమున కంత ప్రసిద్దివచ్చుటకుఁ గాని విశేషాంశములతో నిండియున్న యటువంటి యుత్తమ కారికావళు లుండగా నల్పాంశములను మాత్రమే కలిగి వాని ముందర నిష్ప్రయోజకమని చెప్పఁదగిన యాంధ్రశబ్దచింతామణి నన్నయభట్టు రచించుటకుఁ గాని హేతువుండదు. శబ్దానుశాసన మూలసూత్రమవి యప్పకవీయములోఁ బేర్కొనబడిన, పయి సూత్రమును, మరి కొన్ని సూత్రములను ప్రత్యేకముగా నున్న యిప్పటి యాంధ్రశబ్దచింతామణియందుఁ గానఁబడకపోవుటచేత నప్పకవి యుదాహరించిన యాసూత్రములు ప్రక్షిప్తములని కొందఱు చెప్పుచున్నారు. ఈ సూత్రముమాత్రమే కాక గ్రంధమంతయి ప్రక్షిప్తమగుట మరింత యుక్తముగా నుండును. ఈ ప్రకారముగానే శిష్టుకృష్ణమూర్తిగారును బాలవ్యాకరణము రచియింపబడిన తరువారనే హరికారికలని పేరుపెట్టి తానాగ్రంధమును రచించి **వ్యాఖ్యానము __________________________________________________________________________ [*(ఈ హరికారికావళి శిష్టుకృష్ణ మూర్తిశాస్త్రి రచన. ఆది యాంధ్రశబ్దచింతామణికి వివరణమని, జ్యోత్స్న్య నామాంతరమని తెలియనగును ) (** శిష్ట కృష్ణమూర్తిశాస్త్రి గారు కారికలను రచించి రేగాని, వానికి వ్యాఖ్యానము చేయలేదు.)] చేసెననియు, అట్లు కానియెడల కేతన, తాతంభట్టు, ముద్దరాజు రామన్న, అప్పకవి, కూచిమంచి తిమ్మకవి, మొదలయిన లక్షణగ్రంధకర్త లొక్కరయిన నీ హరికారికల మాటయయినఁ దలపెట్టకపోరనియు, ఇప్పటివారుకొందఱనుచున్నారు. ఇది యట్లుండఁగా కొంద రాంధ్రశబ్దచింతామణి నన్నయభట్ట విరచితము కాదనియు, అతఁడు చేసినదైన పక్షమున కేతనాది కవుల కది తెలియక పోవుటయు, కేతన తన యాంద్రభాషాభూషణమునందు
క. మున్ను తెలుఁగునకు లక్షణ
మెన్నఁడు నెవ్వరును జెప్ప, రేఁ జెప్పెద వి
ద్వన్నికరము మది మెచ్చఁగ
నన్నయభట్టాదికవి జనంబుల కరుణన్
గీ. సంస్కృత ప్రాకృతాదిలక్షణము చెప్పి
తెలుఁగునకు లక్షణము మున్నుదెలుప కునికి
కవిజనంబులనేరమి గాదు నన్ను
ధన్యుఁ గావింపఁ దలచినతలఁపు గాని,
అని చెప్పట తటస్థింప దనియు, అప్పకవి చెప్పినట్లుగా భీమన యాంధ్ర శబ్దచింతామణిని గోదావరిలోఁ గలిపినయెడల నాలుగయిదువందలసంవత్సరములవఱకు నడఁగి యుండి యిప్పటికి మూఁడు నాలుగు వందల సంవత్సర ముల క్రిందట బయలఁబడుట సంభవింప నేరదనియు, బాలసరస్వతులో మరియెవ్వరో దీనిని రచించి తమ గ్రంధ ప్రసిద్దికై కర్తృత్వమును నన్నయభట్టునం దారోపించి సారంగధరుడు తమకిచ్చెనన్న కథ కల్పించి రనియు, అభిప్రాయపడుచున్నారు. ఇది సత్యమనియే తోఁచుచున్నది. కాని యెడల, "నుమ్చోతో " ఇత్యాదిసూత్ర మాంధ్రశబ్దచింతామణియందు జొచ్చుటకు "హేతువు లేదు. * ఈ యసందర్భము నాలోచించియే యిటీవలి వారీ సూత్రమును పుస్తకమునుండి తొలగించి యుండ వచ్చును.
( * అథర్వణుని కారికావళి చింతామణి శేషగ్రంథమని పలువురి యభిప్రాయము.) మొట్టమొదట రాజరాజనరేంద్రునకు సారంగధరుఁడన్న కొడుకుండె నన్న మాటయే సంశయింప వలసి యున్నది . *రాజనరేంద్రుని శాసనము లలోఁ గాని యాతని సంతతివారి శాసనములలోఁ గాని రాజనరేంద్రునకు రత్నాంగి యను భార్య కాని సారంగధరుఁ డను పుత్రుఁడు గాని యుండి నట్లెచ్చటను జెప్పఁబడి యుండలేదు. ఆందుచేతసారంగధరనామము గల రాజరాజపుత్రుఁడే లేఁడనియు, ఇటీవలి కవులు చమత్కారార్థముగా సారంగధర చరిత్రమును సారంగధరునిఁ గూడా గల్పించిరనియు చెప్పవలసి యున్నది. మొదట సారంగధరుఁడే లేనప్పుడు వ్యాకరణము సతఁడు పఠించు టయు, బాలసరస్వతి కిచ్చుటయు కల్ల లే యగును. వేములవాడ భీమకవి నన్నయభట్టు కాలమునకుఁ దరువాత బహు సంవత్సరములకుఁగాని యుండిన వాడు కాకపోవుటచేత నా తcడా వ్యాకరణమునుగోదావరిలోఁ గలిపెననుటయు పెద్దకల్లయే.
నన్నయభట్టు క్రీ. శ.1023 వ సంవత్సర ప్రాంతముల యందున్న వాఁడు. ఆ కాలమునం దాంధ్రశబ్దచింతామణి రచియి కనబడ్డ ట్లెవ్వరు నెఱిఁగినట్టు నిదర్శనము కానరాదు. తరువాత రెండువందల సంవత్సరము లకుఁ బిమ్మటఁ దిక్కనసోమయాజి కాలములో నున్న యభినవదండి యా వఱకెవ్వరును దెనుఁగునకు శబ్దలక్షణమును (వ్యాకరణమును) జెప్పలేదు గనుక నాంధ్రభాషాభూషణంబును రచియించెద ననుటచేతఁ దిక్కనాదుల కాలమునందును నన్నయభట్టీయ వ్యాకరణము లేదు. శ్రీనాధులకాలము వఱకును ఆంధ్రభాషాభూషణమే లక్షణగ్రంధముగా వాడబడుచుండఁగా కేతనకు రెండు వందల సంవత్సరముల తరువాత వెల్లంకి తాతంభట్టు 'కవి చింతామణి’ __________________________________________________________________________ (*సారంగధరుని చరిత్రను బోలిన కథలు భారతదేశము నందలి వివిధ ప్రాంత ములకు సంబంధించినవి కలవు.గౌరన నవనాధ చరిత్రము నందును, చేమకూర వేంకట కవి "సారంగధర చరిత్ర" యందును ఇయ్యది మాళవ దేశమునకు సంబంధించి నట్లు చెప్పబడినది. సారంగధరుని తండ్రి రాజమహేంద్రుఁడగుట చేత వేఁగి ప్రభు వగు రాజ రాజున కీకథ యంటగట్టబడి యుండవచ్చును. సారంగధరుఁడు రాజరాజు పుత్రుడు కాఁడని చరిత్ర కారులు నిర్ణయించి యున్నారు ) యను లక్షణ గ్రంధమును వ్రాసెను. అప్పటికి నన్నయభట్టీయముయొక్క యునికి యెవ్వరికిని దెలియదు. తరువాత నూఱు సంవత్సరములకు రాఘవ పాండవీయమునకు వ్యాఖ్యానముచేసిన ముద్దరాజు రామన్న కాలమునందుఁ గూడ కవిచింతామణియు, నాంధ్రభాషాభూషణంబును దప్ప తెలుఁగునకు వేఱు లక్షణ గ్రంథములు లేవు. ముద్దరాజు రామన్న 'కవిలోక సంజీవని' యను లక్షణమును రచియించెను. తరువాత నేఁబది సంవత్సరముల కుద్ఫవించిన బాలసరస్వతుల కాలమునం దనఁగా నన్నయభట్టారకుని మరణానంతరమున దాదాపుగా నాఱు వందల సంవత్సరముల కాంధ్రశబ్దచింతామణి బయలఁబడినది. అది బాలసరస్వతులకు లభించిన దన్న విధము కూడ మిక్కిలి యాశ్చర్యకరముగా నున్నది *[14] ఆప్పకవీయములోని యూ క్రింది పద్యములనుబట్టి నన్నయ భట్టీగ్రంధమును రచించుట యొక్క సారంగధరుఁడు తప్ప మఱిిియెవ్వరు నెఱుంగరఁట ! అతఁడు దండ్రిచేతఁ గాళ్ళు చేతులు నఱిిికి వేయఁబడి సిద్ధులలోఁ గలిసిన యైదువందల యేcబది సంవ త్సరములకుఁ దరువాత నెల్లూరి మండలములోని మతంగగిరియొద్దకు వచ్చి పుస్తకము రచింపబడునప్పడు తాను జిన్ననాఁడు పఠించి జ్ఞప్తినిబట్టి దానిని బాలసరస్వతుల కేకరువు పెట్టెనఁట ! నిపుణముగాc బరిశీలించినచో నింతకంటె విరుద్ధమైన కధ మఱిిియొకటి యుండదు. అప్పకవీయములోని పద్యములను జూడుcడు --
గీ. రాజరాజనరేంద్రు తనూజుఁ డార్య
సఖుఁడు సారంగధరుడు శై_శవమునందు
నన్నయ రచించు నేడఁ బఠనం బొనర్చె
నన్యు లెవ్వ రెఱుంగ రీ యాంధ్రఫక్కి. [ఆ. 1 - 48 ]
క. ఆ లోకసుతుఁడు మొన్నటి
కీలక సమ నామతంగగిరికడ నొసఁగేన్
బాలసరస్వతులకు నతఁ
డోలిఁ దెలుఁగుటీక దాని కొప్పుగఁ జేసెన్. [ఆ. 1 - 50 ]
గీ. సమసనమున నామాంతశృంగముల కెల్ల
హల్లు గదియ స్వార్థంబున బొల్లుద్రుతము
వికృతి నాగమమై ద్రుత ప్రకృతిపగిది
గాంచు సంధి నధర్వణకవి మతమున.
అని తెనిఁగించుటచేతను నన్నయభట్టారకుని తరువాతి కాలపు వాఁడైన యధర్వణాచార్యునిపే రాంధ్రశబ్ద చింతామణియం దుండుట యొక్కటియే యది నన్నయభట్ట విరచితము కాదని స్థాపించుచున్నది. ఈ బాధకమును తొలగించుటకై తరువాతివారు పయి సూత్రములోని "యధర్వణా చార్యమతా" త్తను భాగమును దీసివేసినారు. భారతమును జదివిన బాలురకు సహితము తెలుఁగున పదాదియందు యకారము లేదని నన్నయభట్టమత మగుట కరతలామలక మగును. అట్లయ్యు నాంధ్రశబ్ద చింతామణి యందు "ఆద్యః క్రియాసు భూతార్ధ ద్యోతిన మాద్యగం వినా సర్వః" అను సూత్రములోఁ బదాది యకారమున్నట్లు చెప్పఁబడినది.
"సర్వత్రాణ్వ త్కార్యం జ్ఞేయం యస్య ద్రుతపకృతి కేభ్యః"
అని యీ ఆంధ్రశబ్ద చింతామణి సూత్రము దృత ప్రకృతికముల కంటె బరమయిన య కారమున కంతట నచ్చువలెఁ గార్యమగునని చెప్పచున్నది. ఇది భారతప్రయోగముల కెల్ల విరుద్దమయినదని యెల్లవారికిని దెలియును. కాఁబట్టి యీ రెండు నూత్రములును నన్నయభట్ట వయి యుండవు.
"నిత్య మను త్తమ పురుష క్రియా స్వితః"
ఆనెడి యూ యాంధ్రశబ్ద చింతామణి సూత్రము ప్రధమ మధ్యమ పురుష క్రియాపదములయం దికారమున కచ్చు పర మగునప్పడు సంధి నిత్యమని చెప్పుచున్నధి. ప్రధమ పురుషక్రియాపదముల యికారమునకు సంధి వైకల్పిక మయినట్లు భారతమునందలి నన్నయభట్టారకుని ప్రయోగములే చెప్పచున్నవి. ఆ ప్రయోగములకు విరుద్దముగా నున్నయిది నన్నయభట్టు సూత్రము కానేరదు. అరణ్యపర్వములోని యూ క్రింది పద్యభాగమును జూడుఁడు-
"అంతఁ గొంద అధిక హాస్యంబు చేసిరి
యడవి నేమి రోసె దనిరి కొంద
ఱవ్వ నీవు వేల్ప వౌ దని కొందఱు
మోడ్పుఁగేలితోడ మ్రొక్కిరంత"
సమస్తభాషల యందును గ్రియలలో ననుబంధ మక్కఱలేకయే వర్తమానార్ధకమును దెలిపెడి రూప ముండును. "పలికెడు' అనునది వర్తమానార్ధక రూపకముగాను, 'పలుకును" అనునది భవిష్యదర్ధక రూపము గాను, ఉన్నట్టు భారతాది గ్రంధములలోని ప్రయోగములు తెలుపుచున్నవి.
క. అఱపొఱడు కుఱచచేతులు
నొఱవ శరీరంబ గలిగి యొరులకుఁ జూడం
గొఱ గాకుండియు మన్మథు
నొఱపులఁ బడియెడు నితండు యువతీ ప్రియుఁడై
[ఆరణ్యపర్వము, 2 - 134 ]
క. నాయొద్ద నుండు దేనియుc
జేయు రథాశ్వముల గతులు చిత్రంబులుగా
నీయెడ నావుడు నట్టుల
చేయుదు నని నలుఁడు వాని సేవించెఁ దగన్.
[ఆరణ్యపర్వము. ఆ. 2-130 ]
అని నన్నయభట్టారకుఁ డారణ్యపర్వమునందు వర్తమానార్థమున "పడి యెడు" ననియు భవిష్యదర్ధకమున 'చేయుదు' ననియు, వాడియున్నాఁడు ఈ ప్రకారముగానే సభాపర్వమునందును
చ. ఇది యుచితంబుగాదనక యిక్కురు ముఖ్యుఁడు చూచుచుండ దు
ర్మదుఁడయి వీఁడు నన్ను నవమానితఁజేసెడి, సర్వధర్మ సం
విదు లన నున్న యీ భరతవీరులవంశము నేఁ డధర్మసం
పద నతినింద్య మయ్యెనని భామిని కృష్ణుఁ దలంచె భీతయై
[ఆ. 2- 219 ]
అని వర్తమానార్థమునఁ "చేసెడి" ననియు.
మ. కురువృద్దు ల్గురువృద్ధబాంధవు లనేకుల్ చూచుచుండ న్మదో
ద్ధురుఁడై ద్రౌపది నట్లుచేసిన ఖలున్ దుశ్శాసనున్ లోకభీ
కరలీల న్వధియించి తద్విపులవక్షశ్శైల రక్తౌఘ ని
ర్ఝర ముర్వీపతి చూచుచుండ నని నాస్వాదింతు నుగ్రాకృతిన్
[ఆ. 2 - 233 ]
అని భవిష్యదర్ధమున "నాస్వాదింతు" ననియు, ప్రయోగించెను ఈ రీతినే యాదిపర్వమునందును
చ. అమిత జగద్బయంకర విషాగ్నియు నవ్రతిహన్యమానవీ
ర్యముఁ గలయట్టి సర్పముల కా జనమేజయు చేయు సర్పయా
గమున నుదగ్రపావక శిఖాతతులం దొరుఁగంగఁ గారణం
బమల చరిత్ర ! యేమి చెపుమయ్య వినం గడు వేడ్క యయ్యెడున్.
ఆని వర్తమానార్థకమున 'నయ్యెడు" ననియు
క. తనసతి కపకారము చే
సిన పాముల కలిగి బాధ చేయుదు నని చి
క్కని దcడము గొని పాములఁ
గనినప్పుడ యడువఁ దొడఁగె గహనములోనన్. [ఆ. 1-52 ]
అని భవిష్యదర్ధమున "చేయదు" ననియు, నన్నయభట్టు ప్రయోగించెను. శబ్దశాసను కవిత్వములో నుండి వర్ధమానార్థకమున కున్నానుబంధముగాని, భవిష్యదర్ధమునకు కలానుబంధముగాని, వచ్చిన రూపము నొక్కదానినై_నను జూపగలరా ? ఇది యొక్కటికయే యాంధ్రశబ్ద చింతామణి నన్నయభట్ట విరచితము కాదని స్థాపించుటకుఁ జాలినంత ప్రబల ప్రమాణము కాదా ?
"ఉ. ఆదిని శబ్దశాసనమహాకవి చెప్పిన భారతంబులో
నేది వచింపఁగాcబడియె నెందును దానినే కాని సూత్రసం
పాదనలేమిచేఁ దెలుగుఁపల్కు మఱొొక్కటి గూర్చి చెప్పఁగా
రాదని దాక్షవాటికవిరాక్షసుఁడే నియమంబు చేసినన్."
క. ఆ మూఁడు పర్వములలో
నామాన్యుఁడు నుడువు తెలుఁగు లరసికొని కృతుల్
దాము రచించిరి తిక్కసు
ధీమణీ మొదలై న తొంటి తెలుగు కవీంద్రుల్.
[అప్పకవీయము, పీఠిక 46. 43}
అనునట్లు తెలుఁగు వ్యాకరణము లేకపోవుటచేత నన్నయభట్టారకుఁడు చేసిన
ప్రయోగానుసారముగానే కాని వేఱు విధముగా పదప్రయోగము చేయఁగూడ దని కవిరాక్ష సుఁడు చేసిన నియమమునుబట్టి తన్మతానుసారముగానే తిక్కనాదులు తెలుఁగుకావ్యములు రచించి రనుటయు,
"శ్లో. అధర్వణాని కాణ్వాని బార్హస్పత్యాని సంవిదన్
కౌముదీ మాంధ్రశబ్దానాం సూత్రాణి చ కరోమ్యహమ్"
అని యాంధ్రకౌముది కర్తయు,
"శ్లో. బార్హస్పత్యాని సర్వాణి కాణ్వం వ్యాకరణం విదన్
కరో మ్యాధర్వణం శబ్దం సర్వలక్షణలక్షితం."
అని త్రిలింగ శబ్దానుశాసనకర్తయు, లక్షణ గ్రంధకర్తలైన యితరాంధ్ర లాక్షణికులును, పూర్వాంధ్ర వ్యాకరణ కర్తలపేరు లుదహరించి బాలసరస్వతి
తిక్కనసోమయాజి కాలమునం దివియే వర్తమాన భవిష్యదర్ధక రూపము లుగాఁ బరిగణింపబడుచున్నట్లు కేతన కృతియైన యాంధ్రభాషా భూషణ మీ క్రింది పద్యములతో ఫెూషించుచు
క. డును, దరు,లొరులకు, నెదిరికిఁ
దనరంగాదు, దవు, దరులు, తనకుఁ దను, దముల్,
చను నేకబహువచనముల
మనుసన్నిభ! క్రియల వర్ధమానార్థములన్. [ప.142 ]
క. అడిగెడు నడిగెద రనఁగా
నడిగె దడిగెదవు ధనంబు నడిగెద రనఁగా
నడిగెద నడిగెద మనఁ బొ
ల్పడరంగా వరుసతో నుదాహరణంబుల్. [ప.143]
క. ఉను, దురు, లొరపలొరులకుఁ జెప్పను;
ననరఁగ దువు, దురు, లేదిరికిఁ దనకు దును, దుముల్
తనరఁగ నీవి యేకబహువ
చనము లగు భవిష్యదర్ధకసంసూచకముల్. [ప.144
క. పలుకును బలుకుదు రనఁగాఁ
బలుకుదువు పలుకుదువు రనఁగఁ బలుకుదు నర్థీన్
బలుకుదు మనఁగా నిన్నియు
నలఘుమతీ ! వరుసతో నుదాహరణంబుల్. [ప, 145]
ఈ ప్రకారముగానే విన్నకోట పెద్దన తన కావ్యాలంకార చూడామణి యందు
" వ ప్రధమ పురుషంబునకు వర్ధమానార్ధమునందు నేకవచన బహువచనంబులకు నెడినెదరు లును మధ్యమపురుషంబులకు నెదవేదరులును నుత్తమ
క. అరిగెడి నరిగెత రనఁగా
నరిగెద వరిగెద రనంగ నధిపతిపురికై
యరిగెద నరిగెద మనఁగాఁ
బరువడి నిది వర్గమానఫణితార్థ మగున్.
వ. ప్రథమపురుషంబునకు భవిష్యదర్థంబునందు నేకవచన బహువచనంబులకు నుదురులును మధ్యమపురుషంబునకు దుదువుదురులును వరుస నాదేశంబులయ్యెఁ దన్నిరూపణంబు లెట్లనిన-
క. చేయును జేయుదు రనఁగాఁ
జేయుదు చేయుదువు మీరు చేయుదు రనఁగాఁ
జేయుదుఁ జేయుదు మనఁగాఁ
నాయనముగ నిది భవిష్యదర్థం బయ్యెన్.
[నవమోల్లాసము - పరిషత్ప్రతి పుటలు 64, 65]
అని చెప్పియున్నాఁడు. ఇది యిట్లుండఁగా నాంధ్రశబ్ద చింతామణియందు
"వసతి రనుబంధక స్స్యాద్యత్ర లడర్థో వివక్షిత స్త్రత్ర"
అని క్రియాపదంబునకు వర్తమానార్థము వివక్షిత మగునప్పుడు 'వసా ధాత్వర్థమైన "యున్న" యనుబంధక మగు ననియు
"అస్తి రనుబంధన స్స్యాద్యత్ర లృడర్థో వివక్షితోధాతోః?
అని క్రియాపదంబునకు భవిష్యదర్థము వివక్షిత మగునప్పుడు 'అస ' ధాత్వర్థమైన "కల" యనుబంధక మగుననియు చెప్పఁబడియున్నవి. అనుబంధము లేక వర్తమాన భవిషయదర్థక రూపము లున్నట్టు చెప్పనట్టియు భవిష్యదర్థ మునం దెప్పడో గాని రాని కలజ్యను బంధమును నిత్యముగా విధించు నట్టియు నివి నన్నయసూత్రము లయి యుండవు.
"కవిభల్లటైః క్రియాణాం నామ్నాం చోల్లోవ ఇష్యతే హ్యేషు,
ప్రధమైక వచనమాత్రేవికృతౌ నాన్తాదయోపి కధ్యన్తే "
అనెడి యాంధ్రశబ్ద చింతామణి సూత్రము (చూడర్జనులు, విల్సూని, ఇత్యాది స్థలములలో) క్రియాపదముల యొక్కయు నామపదముల యొక్క_యు ఉకారము లోపించునని కవిభల్లటులచేత విధింపఁబడినట్లు చెప్పు చున్నది. నన్నయ్యభట్టునకుఁ బూర్వమునందే యిట్టి సూక్ష్మాంశములను సహితము దెలుపు తెలుగుఁ వ్యాకరణము లుండిన యెడల నాంధ్ర శబ్ద చింతామణితో బ్రయోజనమే యుండదు. కవిభల్లటుఁడు నన్నయ్యభట్టునకుఁ దరువాతివాఁ డయినట్లు తెలియ వచ్చుచున్నది. ఈ కవి విక్రమార్కచరితమును రచించి యున్నాఁడు. ఇట్లాంధ్రశబ్ద చింతామణిలో నిటీవలివారి పేరు లుండుట యది నన్నయభట్టవిరచితము కాదని నిర్వివాదముగా స్థాపించు చున్నది. __________________________________________________________________________ ( * ఆంధ్రశబ్ద చింతామణి నన్నయభట్ట విరిచితమే యని శ్రీవజ్ఝల సీతారామస్వామిశా స్త్రిగా రభిప్రాయపడుచున్నారు. శ్రీ శాస్త్రి గారు తమ 'చింతామణి విషయ పరిశోధ నము'లో శ్రీ వీరేశలింగము పంతులుగారు చూపిన యాక్షేపణ లకు సమాధానములను వ్రాయుచు నిట్లనుచున్నారు. 'సర్వత్రాజ్వత్కార్యం జ్ఞేయం యస్య ద్రుతపకృతి కేభ్యః ' అను సూత్రము ద్రుతప్రకృతికము కంటె బరమందున్న యకారమున కంతటను నచ్చువ లెc గార్యమగునని చెప్పుచున్నదనియు, నిది భారత ప్రయోగ విరుద్ధమగుటచే చింతామణి నన్నయ రచితము కానేరదనియు నొక యుక్తిని పంతులు గారు చెప్పిరి. ఎప్పడు మొదలగు శబ్దములలోఁ బదాది నచ్చే యున్నదని కొందఱ యాశయము అచట యకార ము పదము కంటె బరమగునపుడు సంధి వేళలో లోపించుననియుఁ జింతామణికారుని యభిప్రాయము ఉచ్చారణములోనున్న యకారము లేదనుట సరికాదని తలచి చింతామణికారు దద్దానిని నంగీకరించుచుఁ జ్రయోగ విషయమున బాధ లేకుండఁ బైరీతిని సరిపెట్టెను. [చూ. విషయము 47]
'చింతామణి ప్రథమ పురుషేకార సంధియు నిత్యమే యని చెప్పుచున్నదనియు నయ్యది నన్నయ భారతప్రయోగములకు విరుద్ధమనియు మఱొక యుక్తిని జెప్పుచు వీరేశలింగం పంతులుగారు దాహరించిరి . . తెలుగునఁబాదాంతమగు నవుడు
8 ఇవి యన్నియు నాంధ్రశబ్దచింతామణి నన్నయకృతము కాదని యూహించుటకుఁ దోడుపడుచున్నవి. బాలసరస్వతికిఁ బూర్వము నందుండిన కవులు కొందఱు నన్నయభట్టారకుని "శబ్దశాసన" పదముతోను తదర్థబోధకము లయిన "వాగనుశాస" నాది పదములతోను వ్యవహరించుచు వచ్చినందున నాంధ్రశబ్ద చింతామణియొక్క యునికి వారికిఁ దెలియునని కొందఱు భ్రమ పడుచున్నారు. వ్యాకరణము జేయుటచే నీ బిరుదాతనికి వచ్చినట్లు దేని వలనను గనఁబడదు. భాషననుశాసించి సలక్షణ మయిన యాంధ్రకవిత్వము నకు దారి చూపుటచేతనే యీ బిరుదము నతఁడు వహించి యుండవచ్చును. జక్కనకవి తన విక్రమార్కచరిత్రమునందు నన్నయభట్టు నీ క్రింది పద్యముతో స్తుతించి యున్నాఁడు - __________________________________________________________________________ వాక్యాంత మయ్యెనేవి సంధి వైవక్షిక మని నన్నయాభిప్రాయము [చూ. విషయము 48]
'నన్నయ భారత భాగములోని ప్రయోగములకు సరిగా నాంధ్ర భాషా భూషణము, కావ్యాలంకార చూడామణి మున్నగు ప్రాచీన లక్షణ గ్రంథములలో 'ఎడ్యెడు' ప్రత్యయాంత రూపములును, ఎదగాగను యుక్తరూపములును వర్తమానార్థకములనియు, దుగాగమ యుక్తరూపములు భవిష్యదర్ధము లనియు జెప్పఁబడియున్నట్లును, నాంధ్రశబ్ద చింతామణిలో నట్లు ప్రాచీన పద్ధతిని చెప్పఁబడక 'ఉన్నాను బంధ' యుక్తరూపములు వర్తమానార్థకములనియు, 'కలానుబంధ' యుక్తరూపములు భవిష్యదర్ధకములనియు, నవీన పద్ధతిని జెప్పఁబడినట్లును. నక్కారణమున నాంధ్రశబ్ద చింతామణి ప్రాచీన మనుటకు వలను పడనట్లును నాంధ్రకవుల చరిత్రమున వ్రాయబడియున్నది.
'ఆంధ్ర భాషా భూషణ, కావ్యాలంకార చూడామణికర్తలు భారతమునేగాక యా కాలము నిందలి యాంధ్ర వాఙ్మయమునే బాగుగఁ బరిశీలింపక యే క్రియారూప ముల కాలముల నుపదేశించిరనుట సాహసము కాదు. వీరేశలింగము పంతులుగారు స్వవాదోపయుక్తములగు ప్రయోగములను మాత్రమే భారతము నుండి చూపి బాధక ప్రయోగములను జూపకుండుట యుక్తము కాదు. పురాతనాధునాతన వాఙ్మయములో నెచ్చటను దుగాగమ యుక్తరూపములకుఁగాని, ఎదగాను యుక్తరూపములకు గాని కాలనియమ మగపడదు ద్వివిథరూపములను వర్తమాన, భవిష్యత్కారములు రెండింటి యందును నన్నయభట్టారకుఁడే వాడి యున్నాఁడు. ఇంకను దుగాగమ యుక్తరూప ములకు భూత కాలమునందును నరుదుగ వాడుక కలదు [విష.59, 60]
ఉ. వేయి విధంబులందుఁ బదివేవురు పెద్దలు సుప్రబంధముల్
పాయక చెప్పి రట్ల రసబంధురభావభవాభిరామ ధౌ
రేయులు శబ్దశాసనవరేణ్యులు నాఁగఁ బ్రశస్తి కెక్కిరే
యేయెడ నన్నపార్యుగతి నిద్ధర నట్టి మహాత్ముఁ గొల్చెదన్.
(ఆశ్వా. 1-12)
ఈ కవి నన్నయభట్టును స్తుతించిన పయిపద్యములో సుప్రబంధములుచేసిన వారు పదివేవు రుండఁగా వారెవ్వరును గాక యతఁ డొక్కcడే శబ్దశాసనవరేణ్యుc డయ్యెనని వర్ణిం చుటచేతఁ గొందఱనుకొను నట్లాతనికి శబ్దశాసన బిరుదము వ్యాకరణ రచనచేత రాలేదనియు, సలక్షణమైన ప్రౌఢ కవిత్వ రచనచేతనే వచ్చినదనియు స్పష్టపడుచున్నది *[15] తాను విపుల శబ్దశాసనుఁడ నని భారతములోనే నన్నయభట్టారకుఁడు చెప్పకొని యున్నాడు. ఈ పద ప్రయోగమునుబట్టియే యాతని కితర కవులు వాగనుశాసనాది విశేషణములు చేర్చి యున్నారు. ఇటీవల నాంధ్రశబ్ద చింతామణిని రచియించినవారుసు "విపుల శబ్ద శాసను’ నన్న ప్రయోగము నాధార పఱచుకొనియే యది నన్నయభట్టకృతమని లోకమును మోహపెట్టి యున్నారు. 'విపులశబ్దశాసన' బిరుదము వ్యాకరణ రచనచేతనే వచ్చిన ద నెడు పక్షమున, ఆంధ్రశబ్ద చింతా మణిలోని "ఇతి శ్రీసకల భాషావాగను శాసన నన్నయభట్టు విరచితాంధ్ర శబ్ద చింతామణౌ" అను పరిచ్ఛేదాంత గద్యమునుబట్టి యతఁడు సకల భాషలకును వ్యాకరణములు చేసెనని చెప్పవలసి వచ్చుగదా ! అట్లతఁడు చేసి యుండక పోవుట స్పష్టము. అతఁడు తనకుఁగల పాండిత్య విశేషాదులను భారతములోనే తెలుపుకొని యుండుటచేతఁ దద్విరుద్ధముగా నున్న "సకల భాషావాగను శాసన" పదప్రయోగమువలననే యా పుస్తకము నన్నయభట్ట విరచితము గాక తదన్య కల్పిత మనియు, పుస్తకమున కౌత్కృష్ణ్యమును కలిగించుటకయి గ్రంధకర్త లీ విశేషణమును నన్నయభట్టునకుఁ జేర్చి రనియు, గ్రంధము నన్నయభట్ట కృతి యేయయిన పక్షమున, నిట్టి విశేషణ ముండదనియు, దీనినిబట్టిఁ సులభముగాఁ దెలిసికొనవచ్చును. ఆంధ్రశబ్ధ చింతామణి నన్నయభట్టవిరచిత మని తమ స్వప్నదర్శన వృత్తాంతమునుబట్టి మొట్టమొదటఁ జెప్పినవారుకూడ నేతద్గ్రంథ రచనము నొక్క సారంగధరుఁడు తక్క నన్యు లెవ్వరు నెఱుఁగ రనియు, దాని నతఁ డొక్క బాల సరస్వతి కిచ్చెననియునే కదా చెప్పచున్నారు ! వారి మాటలను విశ్వసించినను, నన్నయభ ట్టాంధ్రశబ్ద చింతామణిని రచించిన ట్లాతని తరువాతకవుల కెవ్వరికిని దెలిసి యుండనట్టు స్పష్టమగుచున్నది. ఇది యిట్లుండగా నప్పకవికిఁ తరువాత నాంధ్రశబ్ద చింతామణికి సంస్కృత వ్యాఖ్య చేసిన యహోబల పండితుఁడు "నుమ్చోతో " ఇత్యాది సూత్రమునందుఁ గల "హల్య ధర్వణాచార్యమతాత్" అను భాగమును వదలివేసి (హల్యధర్వణ స్యమత ఇత్యప్పకవి పుస్తక పారస్తు నైతత్పార సామంజస్యం లభ్యత ఇత్యుపేక్షిత:) హల్లథర్వణ మతప్రకారముగా లభించిన దన్న యప్పకవి పాఠ మీ పాఠముతో సరిపోవనందున నుపేక్షింపఁ బడినదని వ్రాసి యున్నాడు. అంత యల్పకాలములో నిన్ని పాఠభేదము లెట్టు గలిగెనో దురూహ్యముగా నున్నది. అప్పకవి మతానుసారముగా సారంగధరుని యనుగ్రహము వలన బాలసరస్వతి కొక్క పుస్తకము మాత్రమే లభించి యతఁడు చేసిన తెలుగుఁ టీకతో నతని కది స్వప్నములో సాక్షాత్కరించిన గోపాలకృష్ణుని యనుగ్రహమువలన నొక బ్రాహ్మణునిచే లభించినది. అప్పటికిఁ బాఠ భేదములు లేవు. అంతటి యల్పకాలములో బహుపాఠ భేదములు కలుగుట కవకాశము సహితము లేదు. ఇంక నహోబల పండితుని మతానుసారముగా (పాఠ భేదాస్తు బహవోదృశ్యంతేపుస్తకద్వయేమయా ప్రాయస్సరస్వత్యాః పుస్తకం గృహ్యతే) పాఠ భేదము లనేకములు కనబడుచుండగా నందు బాలసరస్వతి పాఠమే యతనిచేఁ దఱచుగా గ్రహింపబడుచు వచ్చినది. ఈ రెండు మతములలో నప్పకవి చెప్పినట్లు సారంగధరుఁ డొక్కపాఠము నొక బాలసరస్వతి కిచ్చిన మాట నిజమో ! ఆహోబలపండితుఁడు చెప్పినట్లు పెక్కుపాఠ భేదములుండి యందు బాలసరస్వతి దొక్కటి యగుట నిజమో ! ఏది యెట్టి దయినను బాల సరస్వతినో, మఱియెవ్వరిచేతనో యాంధ్రశబ్ద చింతామణి యా కాలము నందే రచియింపఁబడుట మాత్రము నిజము. అందుఁ గనఁబడుచు వచ్చిన దోషముల నప్పుడప్పుడు వారువారు తమకుఁ దోచినట్లుగా దిద్దుచు వచ్చుట చేత నేర్పడినవే యీ పాఠ భేదము లయియుండును. 'అద్యః క్రియాసు భూతార్థద్యోతిన మాద్యగం వినా సర్వః' అను దానిలోని దోషమును గనిపెట్టి యప్పకవిదానిని'ఆద్యః క్రియాసుభూతాద్యర్ధసముద్యోతి సంవినా సర్వః"అని సంస్కరించినాఁడు అట్లే యహోబల పండితుఁడును మఱియొక దోషమును గనిపెట్టి 'హల్యధ్వరణాచార్యమతాత్" అన్న దానిని వదలివేసి యింకొక సంస్కారమును జేసినాఁడు. కలవన్న పాఠ భేదము లన్నియు నిట్టివే. ఈ పాఠ భేదములను గూర్చి యిందింత కంటె నధికముగా చర్చించుట యనావశ్యకము. ఆంధ్రశబ్ద చింతామణి నన్నయ కృతము కాదని చూపుట కింతయే చాలియుండును. ఇది యిట్లుండఁగా నీ నడుమ ననంతపురమండల పండితు లిరువురు తమకుఁ గ్రొత్తగా నన్నయభట్టీయ ముద్రాపకులు మొద లైన వారి కెవ్వరికిని దొరకని బాలసరస్వతి కృతటీకాసహితాంధ్రశబ్ద చింతా మణి లభించినదనియు, తన్మూలమున నప్పకవి మొదలై న వారికథ లబద్దములయి సత్యము తేటపడినదనియు, ఆ గ్రంథమును జూచి యుండిన యెడల నేను నా కవులచరిత్రములో నట్లు వ్రాసియుండననియు, నుడువుచు బాలసరస్వతి కా గ్రంధము లభించిన మార్గమునుగూర్చి యప్పకవ్యాదులనిచెప్పిన దానికంటెను నెక్కువ యసంగతముగా నున్న కథతోఁ గూడిన యీ క్రింది యవతారిక నుదాహరించుచు నాంధ్రసాహిత్య పరిషత్పత్రిక కొక వ్యాసము వ్రాసియున్నారు.*
"ఉ. ఏమి మహాద్భుతం బది ! హరీహరి ! యెక్కడియాంధ్రశబ్ద చిం
తామణి ఫక్కి? యొక్క_డి మతంగనగంబు ? యుగాదిసంభవుం
డై మని చన్ననన్ననమహాకవి యెవ్వడు ? సిద్ధుఁ డెవ్వడా
హా ! మదగణ్యపుణ్యసముదగ్రతఁ జేకుఱెగాదె యిన్నియున్.
మ. ఇలఁ బ్రజ్ఞానిధులౌ కవు ల్మునుపు లేరే ? వారు వ్యాఖ్యాన క
ర్తలు గానోపరె ? పెక్కువత్సరము లంతర్భూతమై యున్నయీ
తెలుఁగువ్యాకరణంబు నా కొనఁగె ప్రీతిం డీక గావింపుమం
చల సిద్ధుండు మదిష్టదేవత విరూపాక్షుండు నిక్కంబుగన్.
వ. ఆంధ్రశబ్ద చింతామణిఁ దెనిఁగించెద నిది తొల్లి సకల కవితా ప్రవర్త
కుండగు శబ్దశాసనుండు సకలహితంబుగా యధోచిత సూత్రగర్భితంబు
లగు నార్యావృత్తంబుల బంచ పరిచ్ఛేదంబుగా సమకట్టె. నేను నా
నేర్చుకొలఁదిఁ దత్సూత్ర విభాగంబును, దత్ప్రమేయ వివరణంబును,
దదుదాహరణ స్వరూపంబులునునంధ్రమయ గద్యపద్యంబుల నేర్పరించి
నా యాత్మదేవత యగు నంబాదేవి కర్పించువాఁడ."
(*మల్లాది సూర్యనారాయణ శాస్త్రిగారు, శ్రీరాళ్ళపల్లి గోపాలకృష్ణ శర్మగారును అనంతపుర మండలమున సంపాదించిన బాల సరస్వతీయము 1982లో ఆంధ్ర సాహిత్య పరిషత్తు వారిచేఁ బ్రకటితము)
పయి వాక్యము లందుండినవో లేవో కాని బాలసరస్వతీయము మాత్రము వా రనుకొన్నట్లుగాక యెల్లవారికిని నెల్లచోటులను లభ్యమగుచునేయున్నది. బాలసరస్వతీయము చెన్నపురి ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారమునం దున్నది. పూర్వ మాంధ్రశబ్దచింతామణిని చెన్నపట్టణములో ముద్రించినవారు పుస్తక ముఖపత్రమునందు
"ఆంధ్రభాషను సలక్షణముగా నభ్యసించుటకు
ముఖ్యసాధనముగా నుండెడు నన్నయభట్ట ప్ర ణీ
తాంధ్రశబ్ద చింతామణి
యను నాంధ్ర వ్యాకరణ గ్రంథము
ఎలకూచి బాలసరస్వతి యను నుత్తమ పండితునిచే
నాంధ్రంబున రచియింపంబడిన బాలసరస్వతీయమను
టీకతోఁ జేర్చి
పురాణం హయగ్రైవ శాస్త్రులుగారిచే
లేఖక ప్రమాదజనిత దోషంబులవల్లం బరిష్కరింపంబడి
ప్లవంగసంవత్సరాశ్వయుజ శుద్దాష్టమియందు
వివేకాదర్శ మనుస్వకీయ ముద్రాక్షరశాలలో
అచ్చు వేయింపంబడెను.
దీని మూల్యము అణాలు 12"
అనియు, పుస్తకాంతమునందు
"బాలసరస్వతీయ టీకా సహీతాంధ్రశబ్ద
చింతామణి గ్రంధము సంపూర్ణము"
అనియు, ముద్రించి యున్నారు, అది యటుండనిండు.
ఆప్పకవియు నహోబలపండితుడును చెప్పిన ప్రకారముగా నన్నయభట్టు రచించి నప్పడు పఠించిన సారంగధరుడే సిద్దులలో గలిసి తనకు ముఖస్థ మయి స్వాధీనములో నుండిస పుస్తకమును దెచ్చి మతంగగిరికడ బాలసరస్వతుల కిచ్చెను. ఈ పుస్తక పీఠికను బట్టి పుస్తకముతో సంబంధమేమియు లేని సిద్ధుఁడొక్కడు తిక్కన కేతనాది సుప్రసిద్ధాంధ్రకవులకును పెద్దనాది లక్షణవేత్తలకును నెవ్వరికిని బహుశత సంవత్సరముల నుండి పేరైనను దెలియకుండిన తెలుఁగు వ్యాకరణ సూత్రములను దెచ్చి డీక చేయు మని మతంగగిరికడనే తానా వఱకెఱుఁగని బాలసరస్వతుల కిచ్చెను. దేశాటనము చేయుచుండిన సిద్ధుఁ డీ యవూర్వాంధ్ర వ్యాకరణమును మోక్షదాయకమైన యోగసిద్ధాంత గ్రంధమని సంపాదించి తెచ్చి యిచ్చెనా ? తనకుఁ గల సామాన్యాంధ్ర భాషాభిమానమునుబట్టి వెదకి తెచ్చి యిచ్చెనా ? మఱియే హేతువుచేత తెచ్చి యిచ్చెను ? నిజ మారయఁగా బాలసరస్వతియే తాను దీనిని రచియించి గ్రంధ ప్రామాణ్య సంసిద్ధిని కధను గల్పించి యుండును. గ్రంధ ప్రాశస్త్యార్థమైన యెడల, కర్తృత్వమును తానే వహించి యాకీర్తిని తానే పొందక నన్నయభ ట్టుకే యేల యారోపింపవలయుననియు, ఆరోపింప దలఁచిన యెడలఁ దనవంశములోనివాఁడైన నన్నయ కారోపింపక నన్నయ భట్టునకే యేల యారోపింపవలయుననియు, మన మిత్రు లడుగుచున్నారు. పుస్తకమునకుఁ గలిగిన ప్రమాణత్వ మంతయు నన్నయభట్టుయొక్క గొప్ప తనమువలన వచ్చినదే కాని స్వయో గ్యత వలన వచ్చినది కాదు. దీనినే బాలసరస్వతి కృతమని కాని తత్ప్రపితా మహకృతమని కాని చెప్పినచో నెవ్వరు ప్రామాణిక బుద్ధితో నాదరించి దానిని బహూకరింతురు ? గ్రంథము యొక్క యర్హతను బట్టియే చూచెడు పక్షమున, అధర్వణకారికావళి దీనికంటె శతగుణము లధిక గౌరవార్హమయినదిగా నుండును నే నీ పుస్తకము నన్నయ కృతము కాదన్నది పుస్తకములోని యంతస్సాక్ష్యమునుబట్టిగాని బీఠికలోఁ జెప్పఁబడిన దానినిబట్టి కాదు. ఇఁకఁ బీఠికలోని విషయ విచారమునకు వత్తము.
మొదటి పద్యములో "యుగాది సంభవుండై మని చెన్ననన్నన మహాకవి యెవ్వఁడు ? " అని యున్నది. అప్పటి కయిదాఱునూఱుల సంవత్సరముల క్రిందట నుండిన నన్నయ యెక్కడ ? యుగాది యెక్కడ ? ఈతడు కలిగించిన భ్రమలోనే పడి యప్పకవి కలియుగమున కాదిని నన్నయ రాజమహేంద్రవరములో నుండెనని చెప్పెను. రెండవ పద్యములో "పెక్కు వత్సరము లంతర్భూతమైయున్న యీ తెలుఁగు వ్యాకరణంబు నాకొసఁగె" నని యున్నది. పెక్కు సంవత్సరము లనఁగా నచ్చట పెక్కువందల సంవత్సరము లని యేమో ! రచియింపఁబడిన తరువాత గ్రంథము నిజము గానే పెక్కు సంవత్సరము లంతర్భూతమై యుండెనేమో ! తెలుఁగు వ్యాకరణ మనుచో మొదటి దేగణము ? గువర్ణ మెట్లు గురువగును ? కడపటి వచనములో 'సకల కవితా ప్రవర్తకుండగు శబ్ద శాసనం" డనుట ఆంధ్రశబ్ద చింతామణి గద్యములో నున్న "సకల భాషావాగనుశాసన"యను దాని కనుకూలముగా నుండుట కొఱకా ? మఱి యెందుకొఱకు ? "తత్సూత్ర విభాగంబును . .... దదుదాహరణ స్వరూపంబును నంధ్రమయ గద్య పద్యంబుల నేర్పరించి" యని యున్నది గదా? ఇది సత్యమా యసత్యమా సూత్ర విభాగములు మొదలయినవి యెన్ని పద్యములుగా నున్నవి ? పుస్తకములోని యంతస్సాక్ష్యమును నిరాకరించి యీ పీఠికలోఁ చెప్పఁబడిన దానినే వేదవాక్యముగా నంగీకరించుట యీ కల్లపలుకులను నమ్మియా ? నన్నయ భట్టారకుఁడు భీమకవి యెుక్క- రాఘవపాండవీయము నడఁచుటచే నతఁడు నన్నయభట్టీయమును గోదావరిలోఁ గలిపె నన్న యప్పకవి కధ కల్పిత మనుటను గూర్చి యిూ సందర్భమున నిఁక గొంచెము చెప్పవలసి యున్నది. ఈ క్రింది శ్లోకములతో నప్పకవి కధనే యహోబలపండితుఁడును జెప్పి యున్నాడు.
శ్లో. నే యం కృతి ర్వేములవాడ భీమ ప్రబంధకర్త్రా హితమత్సరేణ
గోదాజలే నాశ మవాపితాభూ దిత్యుద్గతాసీ ద్భువి కింవదంతీ
* * * * *
రాజరాజ తనూజాతః సారంగధర బాలకః
న కృతః పాణినాదేవ రహితోజని హేతునా
మత్స్యేంద్ర నామసిద్ధేంద్ర మహిమా సిద్ధతాంగతః
జగ్రాహ వ్యాక్రుతిం తస్మా త్కవిబాలసరస్వతీ
ఎలకూచి కులాంభోధిశరద్రాకానిశాకర
సమస్త కవితాదక్షో వత్సరే కీలకాహ్వయే
ఈ కథ యబద్దమని చూపుటకు భీమకవి కృత మైన కవిజనాశ్రయ ఛంద మొకటి కనబఁడు చున్నది. ఈ ఛందస్సు మల్లయ రేచఁ డను కోమటిపేర భీమకవిచే రచియింపబడినది ఈ కవిజనాశ్రయము లో
క. పరఁగిన విమలయశోభా
సురచరితఁడు భీమనాగ్రసుతుఁ డఖిలకళా
పరిణతుఁ డయ్యెను భూసుర
వరప్రసాదోదిత ధ్రువ శ్రీయుతుడై
(కవిజనాశ్రయము అధస్పూచిక పుట. 2)
క. అసమానదానరవితన
యసమానోన్నతుఁడు వాచకాభరణుడు ప్రా
ణ సమానమిత్రుఁడీ కృతి
కి సహాయుఁడుగా నుదాత్తకీర్తి ప్రీతిన్
(కవిజ. పుట. 2 అధస్పూచిక
క. అనవద్య కావ్యలక్షణ
మొనరంగాఁ గవిజనాశ్రయుఁడు మల్లయరే
చనసుకవి కవిజనాశ్రయ
మను ఛందముఁ దెలుఁగు బాస నరుదుగఁ జెప్పెన్,
(కవిజ ప. శ్రీ)
గీ. వికటకవులు కొన్ని వింతలు గల్పించి
కవిజనాశ్రయమున గలిపినారు
వానిఁ గైకొనంగ వలదప్రయుక్తంబు
నేల చెప్పు భీముఁ డెఱిఁగి యెఱిఁగి
ఇట్లప్పకవి లోనగువారు చెప్పిన వచనము లన్నియు నిరర్థకము లగును గదా ? ఇందలి గద్యమునందు " ఇతి శ్రీ వాగీంద్ర చూడామణి చరణ సరసీరుహ మధుకరాయమాన శ్రావకాభరణాంక విరిచితం బయిన కవి జనాశ్రయంబు"నని యున్నది కచిజనాశ్రయములో భీమన కొన్నిచోట్ల
క. విత్రస్తాఘ పవిత్రచ
రిత్ర త్రిదశవర వరధరిత్రీ సురస
న్మి త్రాంబుజ మిత్ర గుణా
మాత్ర యనుప్రాస మిదియు మల్లయరేచా
( కవిజ సంజ్ఞాదికారము 8 )
అని యిట్లు మల్లయరేచని సంబోధించియు, కొన్నిచోట్ల,
సీ. వివిధచతుష్ఠష్టి విద్యల నజుఁ డని
విపులనయోపాయవిమల బుద్ధి
నమరేంద్రగురుఁ డని యధిక తేజంబున
నాదిత్యుఁ డని సుందరాంగయుక్తి
నంగజుం డని యీఁగి నంగాధిరాజని
యలవున నభిమన్యుఁ డని సమస్త
జనులు ముదంబున శ్రావకాభరణాంకు
సత్కవికవిజనాశ్రయగుణాంకు
బొగడుచుండుదు రని యిట్లు పూర్వరచన
నలరఁ జెప్పిన పడి సీస మయ్యె దీని
పశ్చిమార్థంబు వడి యొండుపాట నిలువ
నదియె యంకిలివడిసీస మయ్యెఁ గృతుల
సీ. ప్రాసంబు నాలుగు పాదంబు లందును
బన్నుగా నిడి పెఱపాదములను
బ్రాసంబు లిడక తత్పాదంబులం దెల్లఁ
బన్నుగా వడు లిట్లు పరఁగ నిలిపి
తెలిసి తెలుంగునఁ దియ్యనినుడువులఁ
దెల్లంబుగా నర్థదృష్టి దెలుపc
బ్రాససీసము దీని పశ్చిమార్ధంబునఁ
బ్రాసంబు వేరొక ప్రాసమైన
శ్రీసమేతుఁడైన శ్రీపాదపంకజ
వాసమధుకరుండు వాసవప్ర
హాసభాసి రేచఁ డను పండితుం డిటు
ప్రాససీస మరసి పఁరగఁ జెప్పె.
(కవిజనా - జాత్యధికారము 16 )
అని రేచcడు రచించినట్లు చెప్పియు, నానావిధ పద్యములను జేర్చియున్నాడు. ఇట్టి భీమకృతమైన కవిజనాశ్రయములోని యతిచ్ఛందోధికారమునందు
క. ద్వీపమునకు నాకమునకు
నాపై శాస్త్రోక్తి నచ్పు లా దేశ సమా
సాపత్తి గలుగుటయు వళు
లాపాదింపుదురు కొంద ఱచ్చును హల్లున్. 86
అను లక్షణమును జెప్పి లక్ష్యము లనుగఁ గావ్యాలంకార చూడామణి నుండి
ఉ. ద్వీపుల ద్రుంచి విశ్వజగతీపతి యుత్తమశక్తి జాంబవ
ద్వీపమునందు గోవులకు నిమ్ముగఁ జేయుటకుం బ్రసన్నయై
గోపతిధేను నవ్విభునకుం దనవైభవ మిచ్చెఁ గాక యే
భూపతు లీ వదాన్యగుణబుద్ధుల నిట్లు వహించి రుర్వరన్.
క. నీకరవాలము పాలై
నాకంబున కరిగి రాజనారాయణ యా
భూకాంతు లెంతచనువో
నాకవితో త్తముల దూల నడఁదురు కడిమిన్ *
రాధా అను పద్యములను కవియుదాహరించి యున్నాఁడు. దీనినిబట్టి వేములవాడ భీమకవి కావ్యాలంకార చూడామణిని కృతి నందిన విశ్వేశ్వరరాజు కాలము లోనో, తరువాతనో యుండి యుండవలెను విశ్వేశ్వరరాజు రాజారాజనరేంద్రున కేడవ మనుమఁడగుటచేత రాజరాcజనరేంద్రుని కాలములోనున్న నన్నయ భట్టాఱుతరముల తరువాతఁ బుట్టిన విశ్వేశ్వరరాజు కాలములో నుండిన భీమకవి చేసిన రాఘవపాండవీయము నడఁచుట సంభవింపనేరదు కాcబట్టి తన రాఘవపాండవీయము నడఁదిన గ మనసులోఁ బెట్టుకొని భీమకవి నన్నయభట్టారకుని యాంధ్రశబ్దచింతామణిని గోదావరిలో గలిపెననుటయు దానిని సారంగధరుడు మరల నుద్దరించె ననుటయు నిరాధారము లయిన యసత్య కల్పనము లనుటకు లేశమాత్రమును సందేహము లేదు. కవి జనాశ్రయములోని యీ పద్యములు భీమకవి నన్నయభట్టున కాఱుతరముల ననఁగా నించుమించుగా నిన్నూఱు సంవత్సరముల తరువాత నున్నట్టు నిరాక్షేపముగా స్థాపించుచున్నవి. భీమకవియు నధర్వణాచార్యుఁడును గూడ నన్నయభట్టారకునికిఁ దరువాతి కాలము వారని యేర్పడుటచేత నీర్ష్యాగ్రస్తు డని జనులన్యాయముగా నారోపించిన నిందనుండి విముక్తుఁడయి, నన్నయభట్టారకుఁడనింద్య చరిత్రుఁడగుచున్నాఁడు.
నన్నయభట్టే యాదికవి యైనట్టుగా నిటీవలి తెలుఁగుకవులచేత గొనియాడఁబడుచు వచ్చినను, వాగనుశాసనునకుఁ బూర్వమునందుఁ దెలుగుఁకవులు లేకపోలేదు. అయినను పూర్వకవులు చేసిన గ్రంధములు మాత్ర మిప్పుడేవియు నేత్రగోచరములు కాకున్నవి. ఏ హేతువుచేతనో యా కాలపు పుస్తకము లన్నియు నశించి యుండును. ఆంధ్రదేశమంతయు నొకసారి __________________________________________________________________________ * ఈ లక్ష్యములు కొన్ని ప్రతులలో లేవనియు, తరువాత నెవ్వరో కవిజనాశ్రయములోఁ గలిపినారనియు, ఒకరు వ్రాయుచున్నారు, పరరాష్టాధిపతులచేత దగ్ధము చేయబడినట్టును, అందుచేతనే యీ దేశము నకు దగ్ధరాష్ట్రమనియు, వేగి దేశ మనియు నామములు కలిగినట్టును చెప్పఁ బడి యున్నది. ఆ మహాదహనసమయమునం దావఱకున్న పుస్తకము లన్నియు తగులఁబడిపోయి యుండవచ్చును. అట్లుగాక యావఱకేమియుఁబుస్తకములే లేక యుండిన పక్షమున నన్ని కట్టుదిట్టములతో నంత నిర్దుష్ట ముగా నూతనముగా గ్రంధరచన చేయుట నన్నయభట్టునకు గాని మరియవ్వరికి గాని సాధ్యమై యుండదు. అయినను మనవారు కొందఱు భారత మునకుఁ బూర్వము తెనుఁగు కవిత్వము లేదనియు, నన్నయభట్టే భారత రచనచేత నాంధ్రకవనమును బుట్టించెననియు, పట్టుదలతో వాదించుచున్నారు. భారతరచనారంభమునకు ముందే రాజరాజ నరేంద్రుఁడుభయ భాషాకావ్య రచనాభిశోభితుఁ" డని తన్నుఁగూర్చి భావించినట్లు నన్నయభట్టే చెప్పకొని యుండుటచేత నప్పటికే సంస్కృత కవిత్వమువలెనే తెనుఁగు కవిత్వముకూడ నున్నట్టు స్పష్టమగుచున్నది. ఇది గాక నన్నయ కాలమునందే గణితమును రచించిన పాపలూరి మల్లన్నయ, ఆంధ్రభారత రచనకుఁ తోడుపడిన నారాయణభట్టును, తెనుఁగుకవు లుండి యున్నారు. కుమారసంభవమును రచిం చిన నన్నెచోడుఁడు తన పుస్తకమునందుఁ బ్రధమాశ్వాసములో
"క. మును మార్గకవిత లోకం
బున వెలయఁగ దేశికవిత బుట్టించి తెనుం
గు నిలిపి రంధ్ర విషయ*మున
జనసత్యాశ్రయుని దొట్టి చాళుక్యనృపుల్," ( ప. 23 )
అను 23 వ పద్యమున సత్యాశ్రయాదులై న చాళుక్యరాజులు తెలుఁగు కవిత్వమును బుట్టించి వెలయఁజేసి రని చెప్పియున్నాఁడు. ఇక్కడ మార్గకవిత యనఁగా సంస్కృత కవిత్వ మని యర్థము. ** _________________________________________________________ ( * గున నిలిపి రంధ్ర విషయంబున చళుక్యరాజు మొదలుగఁబల్వుర్ − సరియైన పాఠము.)
( ** ఈ విషయమును గూర్చి మద్రాసు విశ్వవిద్యాలయమువారు ప్రకటించిన "కుమార సంభవము" యొక్క- 'పాఠ భేదములు-లఘు వ్యాఖ్య' లో నిట్లున్నది ) శ్లో. మార్గదేశివిభాగేన సంగీతం ద్వివిధం మతిమ్|
ద్రుహిణేన యదుద్దిష్టం యదుక్తం భరతేన చ |
తద్దేశీ హి యయా రీత్యా యత్స్యాల్లోకాసురంజసమ్ |
దేశేదేశే ను సంగీతం తద్దేశీత్యభిధేయతే ||
అని సంగీత దర్పణమునం దుదాహరింపబడినది. బ్రహ్మచేతిను భరతుని చేతను సంస్కృతమున విధింపబడినది మార్గకవిత యనియు, కర్ణాటాది దేశములయందు నా యా దేశభాషలలో నేర్పఱుపఁ బడినది దేశికవిత యనియు, పయిదానితాత్పర్యము. ఈ సత్యాశ్రయుడు పూర్వ చాళుక్య రాజ్యమును స్థాపించిన కుబ్జవిష్ణువర్థనుని యన్నయే యైనచో నన్నయభట్టునకుఁ బూర్వ మాఱు నూఱుసంవత్సరముల క్రిందటనే తెలుఁగు కవిత్వ మారంభమయినట్లు తెలియవచ్చుచున్నది. కుబ్జవిష్ణువర్థనుఁడు వేంగీదేశము నకుఁ బరిపాలకుఁడుగా నియమింపఁబడుటకు ముందు సత్యాశ్రయుడు కర్ణాట వేంగీ దేశములకు రెంటికిని నేకచ్చత్రాధిపతియయి, తన రాజ్యకాలములో కర్ణాటాంధ్ర భాషలను రెంటిని బ్రోత్సాహపఱచెను. ఈతని తరువాతి వారైన కుబ్జవిష్ణువర్థనాది చాళుక్యరాజులు సహిత మట్లే చేయుచు వచ్చినందున వారియాస్థానములయందలి విద్వాంసులు సామాన్యముగ సంస్కృత కర్ణాటాంధ్రభాషావేత్తలగు చుండిరి. నారాయణభట్టు వలెనే నన్నయభట్టును తెలుఁగునందు మాత్రమే కాక కన్నడమునందున పాండిత్యము కలవాcడయి యుండెను. కర్ణాటక భాషా సంపర్కము చేతనే యా కాలము నందలి కవిత్వములో నక్కరలు మొదలైనవి విశేషముగా వాడబడుచుండెను. రాజరాజనరేంద్రునకుఁ బూర్వము నూఱుసంవత్సరముల క్రిందట బేట విజయాదిత్యుని కుమారుడైన వేఱొక సత్యాశ్రయు ( డుండెను గాని యతఁడు __________________________________________________________________________ * మార్గ కవిత - ప్రాచీన సంస్కృత సాహిత్య మార్గానుసార లక్షణ లక్షితమగు దేశ భాషా కవిత -దేశి కవిత - దేశీయ సంప్రదాయ బహుళంబగు కవిత మును మార్గ కవిత లోకమున వెలయగా దేశి కవితయను తెనుంగునఁ బుట్టించి ఆంధ్ర దేశమున నిలిపిన వాటు చాళుక్యరాజులు. వీరు మొదలుగ పలువురు(చోళాదులును) అట్లు చేసిరి. ఆంధ్రము విషయము, అందు తెనుంగన దేశి కవిత ఫుట్టించి తెనుంగు భాషను నిలిపిన వారు చాళుక్యరాజులు, 'సత్యాశ్రయయిని చొట్ట' యను 'చా' లోని పాఠమునకు మూల మెట్టిదో తెలియరాదు ) రాజుగాక కేవలమాండలిక పరిపాలకుఁడై యుండుటచేతఁ కుమారసంభవము నందుఁ బేర్కొనఁబడిన సత్యాశ్రయుడీతడయి యుండడు. క్రీస్తు శకము 927 మొదలుకొని 934 సంవత్సరము వఱకు ననఁగా రాజరాజనరేంద్రుని కంటె నూఱు సంవత్సరములు ముందుగా రాజ్యము చేసిన యుద్దమల్లుని దానశాసనములలో నొక దానియందు
మ ధ్యా క్క ర లు
1. స్వస్తి నృపాంకుశాత్యంతవత్సల సత్యత్రిణేత్ర
విస్తరణ శ్రీయుద్ధమల్ల డనవద్య విఖ్యాతకీర్తి
ప్రస్తుతరాజాశ్రయండు త్రిభువనా భరణుండు సకల
వస్తు సమేతుండు రాజసల్కిభూవల్లభుం డరి.
2. పరగంగ బెజవాడ గొమరుసామికి భక్తుఁడై గుడియు
నిరుపమ మతి నృపధాము డెత్తించె సెగిదీర్చె మఠము
గొరగ ల్గా లిందు విడిచి, బృందంబు గొనియుండువారు
..రిగాక యవ్వారణాసి వ్రచ్చిన పాపంబు గొండ్రు.
3. వెలయంగ నియ్యొట్టు డస్సి మలినురై విడిసిన బ్రోల
గల తానపతులను రాజు పట్టముం గట్టిన పతియు
గలియం బై వారల వెల్వరించిన నశ్వమేధంబు
..ల ముపేక్షించి నాగలింగబడసిన పాపంబు దమకు.
4. జననుత చేబ్రోలనుండి బెజవాడ జాత్రకు వచ్చి
త్రిణయనసుతుఁ డొండుచోటు మెచ్చక తివిరి యిన్నెలన
యనఘుండు చేకొని యిందు ప్రత్యక్షమై యున్న సచ్చ
గని మల్ల డెత్తించె గుడియు మఠమును గార్తికేయునకు.
5. రమణతో బెజవాడ కెల్ల బెడగును రక్షయం గాను
దమతాత మల్లపరాజు వేర్వేఱు దాను గట్టించె
గ్రమమున దానికి కలశ మిడ్డట్లుగా మొగమాడు
నమరంగ శ్రీయుద్ధమల్ల డెత్తించె నమిత తేజుండు.
నన్నయభట్టకృతము లయిన లక్షణ సారములోనిదియు నింద్రవిజయములోనిదియునగు రంగరాట్ఛందమునం దుదాహరింపబడిన పద్యములలో నొక్కొక్క దానినిం దుదాహరించుఁ చున్నాను :
గీ. అచ్చు హల్లును లాపశబ్దాది వర్ణ
మునకుఁ జెప్పిన ఘఙ్ యతి యనగఁ దనరు
నంబురుహ గేహిని సమనులాప యనగ
లక్ష్మి వాగ్జితకోకిలాలాప యనగ
--లక్షణసారము
చ. ఒకపలు వాతఁ గొన్న కిటియన్ దల లోనిడు కూర్మ భర్త నా
లిక లిరుగొన్న సీదరపు ఱేడు బయోధరధారఁ బొట్ట పెం
చుకులనగాళి యీడు ప్రతి జోడని యెంచఁగ గూడ దేరి కె
న్నికగ యయాతియందె ధరణీభర ముంచి చెలంగుదానికిన్
-- ఇంద్ర విజయము
ముందు జెప్పినట్లు నన్నయభట్టు రాఘవాభ్యుదయ మను నొక గ్రంధమును జేసినట్టు వ్రాసి యా గ్రంధములోని దని యీ క్రింది పద్యము నొకానొక రుదాహరించి యున్నారు.
క. వికలుని ఖరదూషణముఖ
సకలవనచరులు పొదివిరి సమ్మదముగ ని
ప్పుకకుప్పకు మూఁగెడు మిడు
తుకపిండువితాన భాఁతి తోచెడు బుద్దిన్.
ఈ పద్యము నన్నయ్యభట్టారకుని కవిత్వమును బోలి యుండక పోవుట చేత నీఁత డా నామము గల మఱిియొక యప్రౌఢకవి యయి యుండ వచ్చును
సీ. వ్యాసాదిఋషులకు వందన మొనరించి
కవిమల్లులను జాల ఘనత నెంచి
సుకవీశ్వరుల నెల్ల సాంపగా వినుతించి
గురుపాదయుగ్మము ల్సరవిఁ గొలిచి
యిష్ట దేవాళి సంతుష్టత సేవించి
మంత్రాధిదేవత మది దలంచి
సర్వజనాళికి సంతోష మొనరించి
పార్థివసభల వైభవము గాంచి
యాంధ్ర వాక్యాను శాసనం బతిశయిల్ల
జేసి లోకోపకారార్థసిద్ధిఁ చేసి
ఘనత రాజనరేంద్రునికరుణఁ బడసి
నట్టివాడను నన్నయభట్ట నేను.
(1) నన్నయభట్టుకాలము మొదలుకొని యించుమించుగా తిక్కనకాలము వఱకునుగల కవులు తమగ్రంధమున కాదియం దొక సంస్కృత శ్లోకమును వేసి తరువాత తెలుఁగు పద్యములను వేయుట యాచార మయి యున్నది. నన్నయభట్టాది పర్వము మొదట
"శ్రీవాణీ గిరిజా శ్చిరాయ దధతో వక్షోముఖాంగేషు యే" ............................................
భూయాసుః పురుషోత్తమాంబుజభవశ్రీకంధరా శ్శ్రేయసే "
అను శ్లోకమును వేసెను. ఆ కాలములోనే యున్న *[16] పావులూరి మల్లన్న తన గణితశాస్త్రమునందు మొదట "శ్రీకంఠం సగుణం సమస్త జగతాం కర్తారమీశం గురుం
భూతోయానలచంద్రసూర్యపవనవ్యోమాత్మూమమూర్తిం విభుమ్
నిత్యానందమయోపయో గిరిజయా సార్ధం ప్రజాపృద్ధయే
మాయాయోగ ముపైతి తం శివకరం వందే శివం శ్రేయసే
అను శ్లోకమును వేసెను. కావ్యాలంకారచూడామణిని రచియించిన విన్నకోట పెద్దన్న తన పుస్తకము మొదట
"శ్రీవాగాస్పదయోః పరస్పరయుజోః శ్రుత్యుత్సవశ్లాఘయోః
రాగాలాపనిరూఢయో ర్యతిగణవ్యాపారపారీణయోః
సారస్యంగిరిజేశయో రివ సదా సంగీతసాహిత్యయో
ర్విద్వద్విశ్రమ హేతుకం విరహతాం చాళుక్యవిశ్వప్రభౌ "
అను శ్లోకమును వేసెను. తిక్కన తన నిర్వచనోత్తరరామాయణము మొదట
శ్రీరాస్తాం మనుమక్షితీశ్వరభుజా స్తంభే జగన్మండల
ప్రాసాదస్థిర భారభాజి దధతీసా సాలభంజీ శ్రియమ్
శుండాలోత్తమగండభిత్తిషు మదవ్యాసంగవశ్యాత్మనాం
యాముత్తేజయతేతరాం మధులిహా మానందసాంద్రా స్థితిః"
అను శ్లోకమును వేసెను. ఇట్లుండగా చాముండికావిలాసమునం దాదిని సంస్కృత శ్లోకము లేకుండుటచే నది నన్నయకాలపుది కాదనుట స్పష్టము.
(2) నన్నయభట్టకాలమనం దాచారములో లేని షష్ట్యంత పద్యము లిందుండుట.
(3) నన్నయ్యభట్టుకాలమునందు విశేషముగా వాడఁబడుచుండిన మధ్యా క్కర మొదలగు పద్యము లిందు లేకపోవుట.
(4) నస్నయ సీసపద్యములకంటె భిన్నవిధమైన సీసపద్యము లిందుండుట నన్నయ సాధారణముగా తన సీసపద్యమును వడితో నారంభించిన పక్షమునఁ దుదవఱకును వడులనే పెట్టియు, ప్రాసముతో (ప్రాసయతితో) నారంభించిన పక్షమునఁ దుద వఱకును ప్రాసములనేపెట్టియు యున్నాడు. దీని కొక్కొక్క లక్ష్యమును జూపెదను.
వడిసీసము
సీ. అడవిలో నేకాంత మతిఘోరతపముమై
నున్నమా గురులపై నురగశవము
వైచుట విని యల్గి వారి తనూజుండు
శృంగి యన్వాఁడు కార్చిచ్చువంటి
శాపంబు నీ కిచ్చె సప్తాహములలోన
నా పరిక్షితుఁడు నా యలుకఁ జేసి
తక్షకువిషమున దగ్ధుఁ డయ్యెడు మని
దానికి గురులు సంతాప మంది
భూతలేశ ! నన్నుఁ బుత్తెంచి రిప్పుడు
తద్భయంబు లెల్లఁ దలఁగునట్టి
మంత్ర దంత్రవిధు లమర్చి యేమఱకుండు
నది నిరంతరంబు ననియుc గఱప. (అ. 1 -181 )
ప్రాస సీసము
సీ. పాండు కుమారులు పాండుభూపతిపరో
క్షంబున హస్తిపురంబునందు
ధృతరాష్ట్రనొద్ద దత్సుతులతో నొక్కటఁ
బెరుఁగుచు భూసురవరులవలన
వేదంబులును ధనుర్వేదాది విద్యలుఁ
గఱచుచుఁ గడలేని యెఱుుకఁ దనరు
చున్నఁ దద్విపులగుణౌన్నతి సైపఁక
దుర్యోధనుండు దుష్కార్య మెత్తి
దుర్జయమున శకుని కర్ణ దుశ్శాసనుల్
గఱపఁ బాండవులకు నఱయ చేయఁ
గడఁగె బాండవులును గడు ధార్మికులు గానఁ
బొరయ రైరి వారిదురిత విధుల ( ఆ 3- 12 )
పయి రెండు సీసపద్యములును జదివినచో నాది పర్వము ద్వితీయాశ్వాసము లోని మొదటి దానియందు మొదటినుండి కడవరకును వడులే యుండుటయు, తృతీయాశ్వాసములోని రెండవ దానియందు మొదటినుండి కడవరకును ప్రాసములే యుండుటయు, మీరు కనిపెట్టి యందురు. నన్నయ భట్టారకుని సీసపద్యము లిట్లుండగా, చాముండికావిలాసములోని సీసపద్యములు వడిప్రాససంకరము లయి యుండునట్లు మీరీ క్రింది సీసపాదముల వలనఁ దెలిసికోవచ్చును.
సీ. పా. ఇష్టదేవాళి సంతుష్టత సేవించి
మంత్రాధిదేవత మదిఁ దలంచి --ఆ. 12 పద్యము 5
సీ. పా. ఫెూరంబులై న యాకారము ల్గను నట
భయపడి భీషణబాహుయుద్ధ --ఆ. 22 పద్యము 5
నన్నయ నియమమునకు కేవల విరుద్ధముగా పయి సీసపాదములు పూర్వార్థమునందు ప్రాసమును, ఉత్తరార్ధమునందు వడిని, కలవిగా నున్నవి.
(5) రాజమహేంద్రవరపు తెలుఁగును గాక దత్తమండలములలో వాడుకలో నున్న "బుద్ధి బుద్ధీ" త్యాది పదప్రయోగములను దరచుగాఁ గలిగియుండుట
1. దేవా ! బుద్దిబుద్ది మహాప్రసాదంబనియట్లనే యొనర్చెదము ఆ2 - 40.
2. తల్లీ ! బద్దిబుద్ధి మహాప్రసాదంబ నీ యాజ్ఞాధారకులము ఆ3 - 8
1. "ఒకయాడుఁబడుచు పుట్టె నెట్టు లనిన.
సీ. ఘనకరాళవరాస్యగహ్వరంబులు గల్లి
పరఁగ చతుశ్శీర్ష పంక్తి మెరయ
- * * * *
రూప యైనట్టి పడుచును రూడి గాఁగఁ
దాము దర్శించి పూర్వంబు దలఁచి తలఁచి" ఆ - 2 - 20
2. అట్టి దానియందు మహాశక్తి యుదయించి వచ్చె నెట్లనిన.
ఉ. భీకరసింహ వక్త్రములు పేర్మిఁ జతుష్టయ మొప్పచుండఁగా
లోక భయంకరంబు లయి లోచనముల్డనరారఁ బాటల
ప్రాకటవర్ణము ల్గలిగి భాసిలి మీఱుచు నాల్గు హస్తముల్
వీఁక నెసంగఁగా నపుడు వీరమహాద్బుత శక్తి చెల్వుగన్." ఆ - 3 - 3
*తా మంతఃపురంబులకు బోయి రెభ్భంగి ననిన
చ. వదలిన కేశబంధములు వట్రువగుబ్బల మీఁది హారఘుల్
చెదరిన కుంకుమంబులును జెక్కుల వ్రాసిన పత్రవల్లులున్
బ్రిదిలిన నీవిబంధములు విశ్రుతమైన ముసుంగు లెంతయుం
గదలఁగ లేదుముందనుచు గాంతలు పోయి గృహాంతరంబులన్."
ఆ- 3 - 22
చాముండికా విలాసములోని మూఁడా శ్వాసములలోను బ్రథమాశ్వాసమునం దాఱువేల వారియొక్కయు, నందవరీకుల యొక్కయు వృత్తాంతమును, ద్వితీయ, తృతీయాశ్వాసములయందు తొలగు కులమువారనఁ బడెడి దేవాంగుల కథయు చెప్పఁబడినవి. ఇందు వెుదటి యాశ్వాసమునందు 50 పద్యములును, రెండవ యా శ్వాసమునందు ౩౦ పద్యములను, మూఁడవ యాశ్వాసమునందు 3ం పద్యములును మొత్తముమీఁద పుస్తకమునందు 125 పద్యగద్యము లున్నవి. "ఇది శ్రీసకల భాషావాగను శాసన శ్రీ నన్నయభట్ట విరచితంబై న చాముండికావిలాసంబునందుఁ బ్రధమాశ్వాసము" అనియు, "ఇది శ్రీసకల సుకవిజన శ్రేష్ఠ నన్నయభట్ట విరచితంబైన చాముండికావిలాసంబను మహాప్రబంధంబునందు ద్వితీయాశ్వాసము"అనియు "ఇది శ్రీ సకల కవి బుధవినుత సర్వవిద్యా విచక్షణ నన్నయభట్ట విరచితం బై న చాముండి కావిలాసం బను మహాప్రబంధంబునందుఁ దృతీయాశ్వాసము. అనియు, ఆశ్వాసాంత గద్యములు వేఱువేఱు విధముగా నున్నవి పయిని జెప్పఁబడిన హేతువులనుబట్టి విచారింపఁగా నీ చాముండికా విలాసమును నూఱు సంవత్సరముల క్రిందట దత్తమండలములలోని నందవరీకు లెవ్వరో నన్నయభట్టు పేరుపెట్టి రచించినట్టు నాకుఁ దోఁచుచున్నది. కర్నూలులోని చంద్రమౌళీశ్వర ముద్రాయంత్రములో 1916 వ సంవత్సరమునందు ముద్రింపఁబడిన 'చౌడేశ్వరీ విలాస" మను పుస్తకమును నేను గొన్ని దినముల క్రిందటఁ జూడ తటస్టించినది. ఈ చౌడేశ్వరీవిలాసము సరిగా చాముండికావిలాసమే: చాముండికావిలాసమని యున్నచోట్లనెల్ల చౌడేశ్వరీ విలాస మని మార్చఁబడి యుండుట తప్ప భేదమేదియు లేదు. వ్రాఁత పుస్తకము నందువలెనే యచ్చుపుస్తకమునందును తప్పులు కుప్పలుగా నున్నవి. ఇది నన్నయభట్టు కవిత్వ మగునో కాదో తామే నిర్ణయించు కొనఁగలుగుట కనుకూలముగా నుండునని యీ రెండు పుస్తకములనుబట్టి సవరించి నందవరచరిత్రము నిందు క్రిందఁ బొందుపఱచుచున్నాను.
". . . . . . . . . సోమవంశంసంభవుండైన నందచక్రవ ర్తి యన్మహా, రాజ శ్రేష్ఠుండు నందవరపురంబున సకల ధర్మాభిజ్ఞుండై సర్వవేదవేదాంగ పురాణేతిహాసార్థజ్ఞ కౌశలమనీషావిరాజిత మహాయశుండై యొక్కనాడు విబుధకవిగాయక సార్థకమాగధవంది బృందసమేతంబుగాఁ బేరోలగంబున్నసమయంబున 26
సీ. వెన్నెల నదలించి విఱ్ఱవీఁగు విభూతి
పూఁత శృంగారమై పొల్పు మీఱ
మహనీయదండ కమండలంబులు హస్త
పద్మంబులను రూఢిఁ బరిఢవిల్ల
మేఘంబులో నుండు మెఱుపుదీగలరీతిఁ
బరఁగుచుండెడి జటాపంక్తి మెఱయ
సిద్ధౌషధంబులఁ జెలువొందు కంధయు
గాషాయ వస్త్రముల్గరిమఁ జెలఁగఁ
గీ. జూపరులకు నద్భుతంబుగఁ జూచుచుండ
నాకసంబుననుండి తా నతిముదమున
వచ్చు తపసునిభంగి సభాస్థలంబుఁ
జేర వచ్చెను నపు డొక్క సిద్ధయోగి.
వ. వచ్చిన నాశ్చర్యానందభయభక్తి సమేతుండై దిగ్గన లేచి యెదుర్కొని జాంబూనదరత్నమయ సింహాసనమున సుఖాసీనుంజేసి యర్ఘ్య పాద్యంబు లొసంగి తత్పాదోదకంబు శిరంబున నిడుకొని పుణ్యశరీరుండునైతి. దేవా మీరు వేంచేయుటకు నిమిత్తం బెయ్యది యది సవిస్తరంబుగ నానతీయుండని విజ్ఞాపన పూర్వకంబు గాcబలికిన నమ్మహాసిద్ద లోకేశ్వరుం డిట్లనియె. 28
మ. కమనీయాత్ములఁ జూచి తెంతయును నే గాళింగకాంభోజ
మత్స్యమహారాష్ట్ర పుళిందహూణ శకవంగాంగాదిభూమీశులన్
క్షమలో వారలు నిన్ను వంటి సుగుణ స్థైర్యాధికుల్గారు నిన్
గొమరొప్పన్మరి గంటి సంతసిలి నీ గోష్ఠంతయుం జూచితిన్. 29
మ. అతc డాశ్చర్యముతోడ దారుమయమౌ నప్పాదు కాద్వంద్వ మా
తతభక్తిం గయికొంచుఁ బూర్వకృత విస్తార ప్రపుణ్యంబు నం
చితమై కన్పడురీతి నీతఁడెవడో సిద్దేంద్రుఁ డత్యంత స
మ్మతితో న న్గరుణించి యిచ్చె నవి నమ్మన్వచ్చుఁ జిత్తంబులోన్
వ. అని మనంబున వితర్కించుకొనియే నీ మేటిమంత్రంబు పఠియించిన నిదర్శనంబు గనిపించెనేని సులభంబున గంగాస్నాన ఫలంబు లభియించు నని విచారం బొనర్చుకొనియస్నయంతమధ్యాహ్నంబున గగనమధ్యంబున దినమణి ప్రకాశమానుండయ్యె నట్టియెడ సమీప స్థితులైనవారలు దేవా ! స్నానంబునకు వేంచేయవలయునని విన్నవించిన లేచి సకల సామంత కవి గాయకాది సభాస్థితులై న వారలను గృహcబులకుఁ బొండని యనుజ్ఞ యొసంగి తానును గృహాంతరంబునకు వచ్చి జలంబులాడి ధౌతవస్త్రధరుండై వేఱొక సద్మంబున నూర్డ్వ పుండ్రాలం కృతుడై మధ్యాహ్న విహిత సంధ్యాతర్పణాదికాలోచితకృత్యంబులునిర్వర్తించి ................నేఁగిపత్నీకరపచనంబై న షడ్రసోపేతంబై_న ............. బారగించి లేచి ప్రక్షాలిత గదనకర పదుండై ... యొక్క విహిత స్థలంబున గూర్చుండి జాంబూ .......... యావికాసినాగ వల్లిదళంబును మౌక్తిక చూర్ణ ...........తాంబూలంబు మెసవిముహూర్తంబు వామభాగంబున శయిని ................నిద్రించి మగుడి లేచి యాస్థానమండపంబున గూర్చుండి ఇష్టాలాపంబున బ్రొద్దు పుచ్చుచున్న యెడ నీ రాజు రాక నెఱింగించి ..... వేగఁ గాశికింబోయి ...... వాసులకు యేగెనో యనఁ బ్రద్యోతను దస్తగిరి శిఖరంబున నంతర్ధానంబునొందె, సంధ్యారాగా క్రాంత విచిత్రంబైన గగనంబునందు నక్షత్రంబులు గననయ్యె;నంత పూర్వదిక్భాగంబున నుదితుండయ్యె. ధాత్రీవుండు కొలువు చాలించి సదనంబునకేగి భోజనంబు చేసి యొప్పు డెప్పుడని తిమురుచు శయ్యపై బవళించి భార్య పాదఘట్టనం బొనర్ప నీషన్నిద్రాభరంబన మేల్కాంచిదిగ్గనలేచి ప్రభాతం బయ్యనోయని తలంచి బహిరంగణంబులకువచ్చి నక్షత్రదర్శనంబు సేసి ప్రహర త్రయంబగుట నికాయంబునకుం బోయి నిష్కాది ద్రవ్యం బనేకంబు గ్రహించి యా సిద్ధోక్త ప్రకారంబుగా నాచమనీయం బొనర్చి యర్థ నిమీలితలోచనుండై తన్మంత్రపఠనం బొనర్చిన విశ్వేశ్వర మాధవడుండిదండపాణి భైరవ విరాజితంబైన వారణాసిం జేరి తద్గంగాతీరంబున సూర్యోదయం బగుటయు మదీయ పూర్వపుణ్యఫలంబని యత్యంతాశ్చర్యంబునొంది కృతస్నానుండై సంధ్యాద్య నుష్ణానంబులు నిర్వర్తించి తత్తీరస్థితులైన మేదినీ నిర్జరులకు బహుసువర్ణ ముద్రిక లొసంగి వారివలన అశీర్వచనంబులు గైకొని మగుడి యొక్క రహస్య స్థలంబునకు వచ్చి పావలు మెట్టి కన్నులు మొగిడ్చి మంత్రపఠనం బొనర్చి తన పురంబునకు వచ్చి యధాప్రకారంబున నొరులకు దేటపడకుండ వర్తింపుచు నిట్లు బహుదినంబులు సంతోషంబున నుండె నొక్క దినంబున
స్నానప్రయాణంబు చేయుచున్న పతిం జూచి,
గీ. ఏకశయ్య యందు జోకతో శయనించు
..............................
మాయయో యటంచు మన్ననతోడ నా
తనికి నిట్ట లనియె వినయముసను.
33
వ. నిరంతరం బరుణూదయపూర్వంబున నెక్కడ కేగెద లీ యాశ్చర్యం బేమి ? యిది సవి స్తరంబు గాఁ దెలియజెప్పమనిన నతండు దరహసితవదనుండై స్త్రీలకు.......లెఱింగింపఁగూడదనియును గామినుల బుద్ధులు నమ్మరాదనియును బెక్కులై న నీతిమార్గంబులుచిత్తంబునఁదలపోసియేమియు ననక యూరకున్న నతని భార్య యత్యంతానుకూలిని గావున నీతోడుతఁ పుణ్యపాపంబులకు బాధ్యనై న నన్ను నిర్దయ చేయుట ధర్మంబే ? ప్రాణ నల్లభా ! యని బహువినయోక్తులఁ బలికిన నతండు ప్రత్యుత్తరంబుతోఁచక యుండి యెట్టకేలకు నిట్లనియె.
గీ. ఎవ్వరికిఁ జెప్పరాదు సుమీ రహస్య
మిదియు నీ కెఱిగించెద నిష్టమునను
సిద్దవర్యుఁ డొక్క-cడు కాశిస్థలంబు
నందు స్నానం బొనర్పు మం చతిశయముగ.
35
వ. మంత్రంబు చెప్పి యిప్పావ లొసంగి చనియె, నాఁటనుండియు గాశికిం బోయి గంగ నాడి వచ్చి సుఖంబు గా నుండినవాఁడ నిప్పడును దత్కార్యార్థినై పోయి వచ్చెద ననిన "నన్నెడఁబాసి పోవుట నీకు ధర్మంబగునే ? యని బహుకరినోక్తులు పలికి వచ్చెదననిన నతండు కూడదని పల్కి వినక పోవ నేమగునో యని తలంచి యరుణోదయ సమయం బగుటయు భార్య తోడన మంత్రపఠనం బొనర్చి నిమిషమాత్రంబున వారణాసీ స్థలంబుఁ జేరి జలంబులాడి విప్రులకు ననేక దానంబులొనర్చి శీఘ్రంబున ముగిడగమనంబు
దలంచుచున్న సమయంబున. 36
గీ. పొల్పుగాc దీరమున శుచిర్భూతయైన
యతనిసుందరి పుష్పిణియై ప్రియుండు
వినిన నే మనునో యని ప్రేమ దక్కి
పిలిచినను బల్కకుండెను బ్రియనితోడ. 37
వ. ఆది యెఱుంగక యా రాజు సమీపంబునకు వచ్చి పోదము లెమ్మన్న నేను పుష్పవతినై తినని సదరహసితభయంబుగఁ బలికిన విని గుండె జల్లన ధరిత్రీపతి రాజ్యంబుపరుఁ లాక్రమించుటకు సమయంబయ్యె నిక్కడ నాల్గు దినంబులునికికి హేతువయ్యెగదా యని చింతించుచున్న యతనిం జూచిఁ యక్కడ నుండెడు బ్రాహ్మణు లిట్లవిరి. 38
గీ. నీదు భార్య పుష్పిణియైన నిత్యదోష
మెల్లఁ బరిహార మొనరించి మేము శీఘ్ర
ముగను బరిశుద్దఁ జేసెద మొగిని మాకు
నేమి యొస(గంగఁ గలవాఁడ వీవు చెపుము
గీ. నేఁడు నానోము ఫలియించె నిక్కముగను
నేఁ గృతార్దండ నైతి నిన్నిపుడు చూచి
నన్నుఁ బ్రోవుము నాతల్లి విన్ను భజన
చేయుచుండుదు నేవేళఁ జిత్తమునను. 41.
వ. అని బహుస్తోత్రంబు లొనర్చి మీరిందు వసియింపవలయు. వీరల కర్థరాజ్యం బొసంగెద; గంగాస్నానంబునకు వచ్చి బహుప్రయాసంబు నొందుట మీకుఁ దెలియుంగదా యని నాటనుండి రాకుండితి మీ దర్శనం బపేక్షించి యీ బ్రాహ్మణులతో ననృతంబు పలికి మిమ్ముం దోడ్కొని రండనిన సమర్ధులైన వారలగుటంజేసి మిమ్ముందోడ్కొని వచ్చిరది కారణం బుగ మీర లీ స్థలంబున యునికి యొనర్ప వలయునని బహుభంగులఁ బ్రార్ధించినఁ బ్రసన్నయై యమ్మహాశక్తి యట్లగాక యనియె దత్క్షణంబున వారల కర్థరాజ్యం బొసంగి నందపురంబు నొసంగి తాను దద్గ్రామంబునకు నిమిత్తమాత్రుండై చాముండికా దర్శనంబు నిరంతరంబును జేసికొనుచు సంతోషంబున నుండె. నంత నవ్విప్రులు నందవరం బగ్రహారంబుగా వరించుట నందవరీకులను సంజ్ఞగలవారలైరి; మున్ను వారి వెంబడిం బోక నిల్చిన వార లార్వేల వారనం దగిరి."
పయి నుదాహరింపఁ బడిన పుస్తక భాగమునుబట్టి యొక్కొక్క చిన్న పద్యమును, పద్యమునకుఁ దరువాత బెద్దవచనమును నుండుచు వచ్చినట్టు చదువరులు తెలిసికొని యుందురు. ఈ ప్రకారముగానే పుస్తకమంతయు నత్యల్ప పద్యభాగముతోడను నత్యధిక గద్యభాగముతోడను గూడి యున్నది. నన్నయభట్టారకుని గూర్చి:
శ్లో|| వాచా మాంధ్రమయీనాం యః
ప్రవక్తా ప్రధమో భవత్
ఆచార్యం తం కవీంద్రాణాం
వందే వాగనుశాసనమ్
అను శ్లోకము పండితులలో పరంపరగా వాడబడుచున్నది.
* * *
- ↑ * భారతమునందలి యొక పద్యము (ఆది-1-25] ను బట్టి యితనికి నన్నయభట్టు అనియు ఆదిపర్వమునందలి వేఱొక [1-9] పద్యమును బట్టి నన్నపార్యుఁడనియు నామములు ప్రసిద్దములైనట్టు తెలియుచున్నది. శాసనములంబట్టి 'నన్నియభట్ట'ను నామమున్నట్లు తెలియుచున్నది. కొందఱు విమర్శకులు భారత రచయితయగు నన్నయ కంటె శాసనరచయిత భిన్నుఁడను నభిప్రాయమును తెల్పియున్నారు. కాని యిర్వురు నభిన్నవ్యక్తులు. ' నన్నియ' ప్రాచీనరూపము; 'నన్నయ' ? నవీనరూపము.
- ↑ * నన్నయభట్టు కర్ణాటకుఁడని కొందఱు తలంచుచున్నారు, ఈ యభిప్రాయము కూడ సరికాదు.
- ↑ * నన్నయభట్టు తన పూర్వులను గూర్చి ఏమియు తెలుపలేదు. నన్నయ రణస్థిపూఁడి శాసనమును వ్రాసిన భీమన భట్టు యొక్క కాని, కోరుమిల్లి శాసనమును రచించిన. బేత నభట్టు యొక్క కాని కుమారుఁడయి యుండునని 'ఆంధ్రకవి తరంగిణి' కర్త శ్రీ చాగంటి శేషయ్యగారు తెలిపియున్నారు.
- ↑ *
ఉ. పాయక పాలక శాసనిక్షి భారతఘోరరణంబునందు నా రాయణునట్టు, తానును ధరామరవంశ విభూషణుండు నా రాయణభట్టు వాఙ్మయధురంధరుఁడుం దవకిష్టుడు న్సహా ధ్యాయుcడు నైన వాc డభిమతంబుగఁ దోడయి నిర్వహింపఁగన్" |ఆది పర్వము|
- ↑
స్రగ్ధర. తస్మాచ్చాళుక్యచూడామణి రథ విమలాదిత్య దేవా న్మహీశా
చ్చోడక్ష్మాపాలక్ష్యా ఇవ రచితనోః కూండవాయాశ్చ దేవ్యా
జాతశ్రీరాజరాజో రజనికరకులశ్రీమదంభోధిరాజో
రాజద్రాజన్య సేవ్యా మభృత భుజబలా ద్రాజ్యలక్ష్మీం పృధివ్యాఃసవంతతిలక. యో రక్షితుం వసుమతీమ్ శకవత్సరేషు
వేదాంబురాశి విధివర్తిషు సింహ గేర్కే
కృష్ణ ద్వితీయదివసోసోత్తరభాద్రికాయాం
వారే గురోర్వణిజలగ్న వరేభిషిక్తః.
శ్లో. యాస్యోత్తమాంగం పట్టేన సమబంధి మహీయసా
భర్తుం విశ్వంభరాభారం జనై రారోపితం చిరమ్
* * * * *శా. పిత్రోర్వంశోగురూ బభూవతు రలం యస్య స్పురత్తేజసౌ
సూర్యాచంద్రమసౌ నిర స్తతమసౌ దేవౌ జగచ్చక్షుషీ
దంష్ట్రాకోటి సముద్ధృతాఖిలమహీచక్రం మహత్క్రీడయా
విష్ణోరాదివరాహరూప మభవ ద్యాచ్ఛాసనే లాంఛనమ్.
స్రగ్ధర. ఆద్యం తాత్యంతదూరాత్ సమజని జగతాం జ్యోతిషో జన్మ హేతు
ర్బ్రహ్మాధామప్రజా నా నుభవ దధ కరః కాశ్యపో నామవేధాః
భారద్వాజస్తతో భూన్ముని రధికతపస్త్య గోత్రే పవిత్రే
తత్రాపస్తంబసూత్రే శ్రుతిని థిరుదగా చ్చీదమార్యక్రమేణ
గద్య ..............సకలమునిగణనుతాపస్తంభసూత్రాయ తత్ర సంగీత భార ద్వాజగోత్రాయ.........ధారాకరేణాగ్రహరీకృతః కోరుమల్లి నామాగ్రామ ఇందూపరాగేదత్తో మయాచంద్రతారకం హితిష్ఠేత్. - ↑ * తదనుజో విమలాదిత్య స్సప్త, తత్పుత్రో రాజరాజ దేవ ఏకచత్వారింశత్". తత్పత్రశ్శ్రీకులోత్తంగచోడ దేవ ఏకోనపంచాశత్" . . . . రాజ్యంప్రశాసతి.
- ↑ ♦ ఇది క్రీ. శ 1022 వ సం.రము ఆగస్టు నెల 16వ తేదీకి సరిపడునని చరిత్ర కారుల యాభిప్రాయమైనట్టు ' ఆంధ్ర కవితరంగిణి ' లో గలదు.[పుట 109 ] ఈ ఆంధ్రకవుల చరిత్రమునను 23-వ పుటలో నిట్లే కలదు.
- ↑ * ఈ శాసనము శాలివాహన శకము 976 న చంద్రగ్రహణమునాఁడు - అనఁగా క్రీ.శ. 1053 నవంబరు 3వ తేదిని వ్రాయcబడినట్లు తేలుచున్నదని ఆంధ్రకవి తరంగిణి? యందుc గలదు [చూ. పుట 106]
- ↑ [* 6 మాసములు మాత్రము రాజ్యము చేసి నట్లాంధ్రకవితరంగిణిలో గలదు. (పుట 84)]
- ↑ [♦ ఈతడొక్క సంవత్సరమే రాజ్యము పాలించెనని ఆంధ్రకవితరంగిణి (పుట 89)
- ↑ * గణక విజయాదిత్యుఁ డనుటకుఁ దగిన యాధారములేదనియు, ఇతఁడు గుణాంక విజయాదిత్యుఁడు, గుణగాంక విజయాదిత్యుఁడు నని చెప్పబడుచున్నాc డనియు 'ఆంధ్రకవితరంగిణి' (పుట 39)]
- ↑ [♦ ఈతనికే తాళపుఁడు, తాడపుఁడు నను నామాంతరములు గలవని 'ఆంధ్ర కవితరంగిణి' (పుట 95)]
- ↑ * ఈ చాళుక్యులు సూర్యవంశమువారు గాని, చంద్ర వంశమువారు కాని కారనియు, వీరు దక్షిణాత్యులును, ద్విజేతురులునైయుండి తమ వంశమునకు గౌరవము నాపాదించుటకై యీ గాథలను కల్పించుకొని వానిని శాసనములలోని కెక్కించికొనిరనియు నవీన చరిత్ర కారులను చున్నారనియు అది సత్యమే కావచ్చుననియు 'ఆంధ్రకవి తరంగిణి'లోఁగలదు (పుట 71)
- ↑ (* చింతామణిలో అప్పకవి పాఠములు వేఱు, బాలసరస్వతి పాఠములు విభిన్న ముద్రణములలో విభిన్నరీతుల నున్నవి.)
- ↑ (* శ్రీనిడుదవోలు - వేంకటరావుగారి "తెనుఁగు కవుల చరిత్రలో క్రిందిజి యాశయమును వెల్లడించు చున్నారు నన్నయ భారతమునఁ దాను శబ్దశాసనుఁడ నని చెప్పుకొనుటచే, నాతఁడు వ్యాకరణ రచయిత యని చెప్పవీలులేదు. శబ్దశాసన బిరుదము నన్నయకు లేదు. అది తర్వాతి వారిచే నాతని కారోపింపఁ బడియున్నది. నన్నయ వ్యాకరణమును రచించినచో - అనగా 'అనుశాసనము' చేసినచో శబ్దాను శాసనుడు కావలయును. శాసనుఁడు, అనుశాసనుcడు అనునవి వేఱువేఱర్థములు కలవి. శబ్దశాసనుఁడనునది బిరుదమని నన్నయ చెప్పకొనలేదు, ఇది బిరుదైనచో ' జపహోమ తత్పరుఁడు, సంహితాభ్యాసుఁడు, నానాపురాణ విజ్ఞాననిరతుండు' మున్నగు నవియు నతని బిరుదులే యని యనవలసి వచ్చును. నన్నయకు ' శబ్దశాసన ' బిరుద మున్నట్లు తిక్కన, ఎఱ్ఱాప్రెగ్గడ, మడికి సింగన, పోతన - మున్నగువారు చెప్పలేదు. వసుచరిత్రను రచించిన రామరాజభూషణుఁడు 'మహిమున్ వాగానుశాసనుండు సృజి యింపన్' అని 'శబ్దశాసనండు' అను దానిని 'వాగనుశాసనుఁడు' గా మార్చెను. అప్పటినుండియు నిదియే నన్నయ బిరుదుగా వాడుకలోనికి వచ్చెను. నిజముగా 'శబ్ద శాసనుఁడు బిరుదైనచో దానికి బర్యాయపదముండుటకు వీలు లేదు. బిరుద పదవులు పర్యాయపదా సహిష్ణువులగుట భాషా సంప్రదాయాభిజ్ఞులకు గ్రొత్త కాదు. పర్యాయములను వాడవచ్చుచున్నచో 'శంభు దాసు'ను 'శంకరదాసు'గను, ఉభయ కవిమిత్రుని " ద్విభాషా కవిమిత్రుఁడనియు నీరీతిగాఁ జెప్పవలసి వచ్చుచుండును కాన 'శబ్దానుశా సనుఁడు ' బిరుదు కాదనియే చెప్పవలెను )
- ↑ (* పావులూరి మల్లన్న 12- వ శతాబ్ది వాడని విమర్శకుల యాశయము. ఆయంశమతని చరిత్రమున వివరింపఁబడును.)