ఆంధ్ర కవుల చరిత్రము - ప్రథమ భాగము/దూబగుంట నారాయణకవి
దూబగుంట నారాయణకవి
ఇతఁడు పంచతంత్రమును పద్యకావ్యమును రచియించి తమ్మభూపాలుని పుత్రుఁడైన బసవభూపాలుని కంకితము చేసెను. కృతిపతి పిలిపించి తన్నుఁ గూర్చి పలుకుట మొదలైన విషయములను పుస్తకములో కవి ఇట్లు చెప్పుకొని యున్నాడు.
చ. హరిహరభక్తు నార్యనుతు నాంధ్రకవిత్వవిశారదు న్మహే
శ్వరవరమాననీయుఁ గులవర్ధను శాంతుఁ బ్రబంధవాచకా
భరణము నాగమాంబికకు బ్రహ్మయమంత్రికి నాత్మసంభపున్
సరసుని దూబగుంటపురశాసను సారయనామధేయునిన్.
క. తలఁపించి హితులు చెప్పఁగఁ
బిలిపించి కవిత్వగోష్ఠిఁ బ్రియ మెసఁగంగాఁ
బలుకుచు నితాంతకాంతిం
దళుకొత్తంగ నంకురించు దరహాసమునన్.
క. తన ముఖచంద్రమరీచులు
జననయనచకోరములకు సాంద్రానందం
బొనరింప వేడ్క నన్నుం
గనుఁగొని యిట్లనియె వినయగౌరవ మెసంగన్.
చ. సురుచిరమైన నీ కవిత సూరిసభాంతరయోగ్యతామనో
హరసరసార్థగుంభనల నందము గావున నారనార్య సు
స్థిరమతిఁ గీర్తి నన్నొరయఁ జేసి సమస్తజగత్ప్రసిద్ధిమై
బరఁగుచునుండ మాకొక ప్రబంధ మొనర్పు ప్రియం బెలర్పఁగన్.
గీ. పంచతంత్రి యనఁగ నంచితగీర్వాణ
భాషమున్ను చెప్పఁబడినయట్టి
కావ్యమాంధ్ర భాషఁ గర్ణామృతంబుగాఁ
గూర్పవలయు నీదునేర్పు మెఱయ.
కృతిపతియింటిపేరేమో యే కాలమునం దుండినవాఁడో యీ గ్రంథమునుబట్టి తెలియరాలేదు; గాని యితర గ్రంథములనుబట్టి తెలియవచ్చుచున్నవి. కృతిపతి యయిన బసవక్షితీశ్వరుఁడు శ్రీరాముని కుమారుఁడగు కుశునివంశమువాఁడగు మాధవవర్మసంతతివాఁడయినట్లు చెప్పి, కవి మాధవవర్మ నిట్లు వర్ణించి యున్నాఁడు
చ. మును బెజవాడ దుర్గమున ముగ్ధుతనంబున మెచ్చఁజేసెఁ బెం
పున రథదంతివాజీభటభూరిబలంబులచేఁ గళింగభూ
జనపతిఁ ద్రుంచి చేవఁ దన సంతతికై మహిఁ బాడి నిల్పి గ్ర
మ్మనఁ జిరకీర్తులం గనిన మాధవవర్మనిజాన్వయంబునన్.
పూసపాటివారు మొదలైన ప్రాంతములయందలి క్షత్రియసంస్థానాధి పతులందఱును దామీ మాధవవర్మ సంతతివార మనియే చెప్పుకొనుచున్నారు. ఈ మాధవవర్మవంశమునందు కొమ్మావనీశుఁడు పుట్టినట్టును, ఆతని కబ్బలదేవుఁ డుద్భవించినట్టును, అతనికీ సింగభూపాలుఁ డుదయించినట్టును, అతనికి తమ్మరాజు కలిగినట్టును, అతనికిఁ గృతిపతి యైన బసవధరాధినాధుఁడు జనియించినట్టును చెప్పఁబడి
మ. మనుమార్గుడగు తమ్మభూపతికి దేమాజాంబకుం బుత్రుఁడై
జనియించెన్ బసవేంద్రుఁ డర్థిజనభాస్వత్కల్ప భూజాతమై
వనితామన్మథుఁడై వివేకనిధియై వారాశిగాంభీర్యుఁడై
యనతారాతి మహాంధకారపటలీహంస ప్రతాపాఢ్యుడై
సీ. రమణీయదానధారాప్రవాహంబులు
పాధోది కతివిజృంభణముగాఁగ
నిరుపమాన ప్రభానిర్మలసీతకీర్తి
త్రిభువనసాంద్రచంద్రికలు గాఁగ
నతులవిక్రమబలోద్యత్ప్రతాపస్పూర్తి
పరులకునుగ్రాతపంబుగాఁగ
సమధికశృంగార సౌందర్యరేఖ దాఁ
దరుణీలతావసంతంబుగాఁగ
రామరఘురంతిసగరధర్మజదిలీప
భోజసర్వజ్ఞసోమేశరాజసరణి
ధాత్రిఁ బాలించెదమ్మభూధవసుతుండు
శాశ్వతంబుగ బసవభూమీశ్వరుండు
ఇత్యాది పద్యములతో గ్రంధమునందుఁ గృతిపతి వర్ణింపఁబడెను. నెల్లూరి మండలములోని యుదయగిరియందు [1] కుంటమరాజు వల్లభయ్య కుమారుఁడు తమ్మరాజు 1460 వ సంవత్సరమున గోపాలకృష్ణ దేవాలయము కట్టించినట్టొక శిలాశాసనమువలనఁ దెలియవచ్చుచున్నది. ఈ తమ్మరాజే మనకృతిపతితండ్రియైన తమ్మరాజవి తోఁచుచున్నది. అతఁడే యితఁడయినపక్షమునఁ బసవనృపాలుని యింటిపేరు కుంటమరాజు వారనియు బసవనృపాలునికాలము 1470-80 సంవత్సరప్రాంతమనియు స్పష్టమగుచున్నది. ఈ బసవనృపాలునిమంత్రి యనంతయ గంగామాత్యుఁడు
గీ. వసుధ నెగడిన మాధవవర్మవంశ
వర్ధనుఁడగు తమ్మభూవరునిబసవ
పార్థివున కాప్తుడై కృపాపాత్రుఁడగుచు
ఘనత మెరసె ననంతయగంగవిభుఁడు.
అని దగ్గుపల్లి దుగ్గనకవి రచియించి గంగనామాత్యున కంకితముచేసిన నాచికేతూపాఖ్యానమునందుఁ జెప్పఁబడినది. ఈ దుగ్గనకవి శ్రీనాథ మహాకవి మఱఁది యగుటచేత నాచికేతూపాఖ్యానకర్తయు, భర్తయు పదునైదవ శతాబ్ది యుత్తరార్థమున నుండి యుండవలెను. ఈ యనంతయ గంగామాత్యునకే 1480-90 సంవత్సర ప్రాంతము నందుండిన నరసింహరాయనికి వరాహపురాణ మంకిత మొనర్చిన నంది మల్లన ఘంట సింగన కవులు ప్రబోధచంద్రోదయము నంకితము చేసిరి. ప్రబోధ చంద్రోదయమునందు
గీ. అట్టి గుణశాలి తమ్మరాయనికుమార
వీరబసపక్షమాచక్రవిభునిచేత
మన్ననలు గాంచి మించిన మహితుఁ డితఁడు
మనుజమాత్రుండె గంగయామాత్య వరుఁడు.
అని చెప్పఁబడినది. 1480 మొదలు 1490 వ సంవత్సరమువఱకు నుండిన యనంతయామాత్యుని కాప్త ప్రభువైన తమ్మయ బసవభూపాలుఁడు 1470-80 సంవత్సర ప్రాంతములయందు దప్పక యుండినవాఁడు. అందుచేత తమ్మయ బసవభూపాలునికి పంచతంత్రము నంకితమొనర్చిన దూబగుంట నారాయణకవి 1470-80 వ సంవత్సర ప్రాంతములయందుండె ననుటకు సందేహములేదు. నారాయణకవి దూబగుంటకరణము: [2] ఆపస్తంభసూత్రుఁడు; మైత్రావరుణ గోత్రుఁడు, బ్రహ్మయామాత్యు పుత్రుఁడు; ఆఱువేలనియోగి కులపవిత్రుడు, ఈతని పంచతంత్రము వేంకటనాథుని పంచతంత్రమంతటీ రసపుష్టి కలది కాకపోయినను, సలక్షణమయ చక్కని లోకోక్తులతోను మృదువులయిన తెలుఁగుపదములతోను నిండి తేనెలొలుకునదిగా నున్నది. ఈతని పంచతంత్రమునుండి కొన్ని పద్యముల నిందుదాహరించు చున్నాను
చ. శరనిధి దాఁట నావయును నంతమసం బడఁగింప దీపమున్
వరకరిశిక్ష కంకుశము వాయువుఁ గూర్పఁగఁ దాళవృంతమున్
వెరవునఁ జేసె బ్రహ్మపదివేలవిధంబుల మూర్ఖచిత్తవి
స్ఫురణ మడంపలేక తలపోయుచు నిప్పుడు నున్నవాఁ డొగిన్
మిత్రభేదము.
చ. మిగుల హితుండు నావలన మేలును బొందె వితండు నాయెడం
నెగఁడని ధూర్తు నమ్మి చెడుఁ దెల్లము సజ్జనశబ్ద మాత్రమే
నెగడును గాని యప్పు డవనిన్ సుజనుం డనువానిఁ గాన ని
మ్ముగ ధనలేశమాత్రమున మోహనిబద్ధము లోకమంతయున్
సుహృల్లాభము.
చ. అతులితసత్ప్రతాపమహిమాస్పదుఁడైన విరోధి దూరసం
స్థితుఁ డగునేనిఁ దద్విపుల తేజముఁ దా నడఁగించు; నల్పుఁడా
యతశితశస్త్రహస్తుఁడయి యౌదలదగ్గఱ నుండె నేనియున్
జతురుఁడు గాఁడు వైరిజన సంహరణంబునకు న్నిజంబుగన్
సంథివిగ్రహము.
ఉ. గుండియ పుచ్చి పెట్టుకొని కొమ్మపయిఁ బదిలంబు చేసి నే
నుండుదు నట్టిభారమున కోర్వక యెప్పుడు; నేఁడు నే నభా
గ్యుండను నీకు నక్కఱకుఁ గూర్చిన సొమ్మని మున్నెఱింగి తే
కుండుటఁజేసి యేమని ప్రియోక్తులు పల్కుదు? నేమి చేయుదున్.
లబ్ధనాశనము
ఉ. అక్కఱలెల్లఁ దీఱవు నృపాగ్రణికిం బొడచూపకున్న నా
కిక్కడ వెన్నపాపనికి నెవ్వరు కాఁ పిఁక వేళ దప్పెఁబో
నక్కడనే ప్రయోజనము లబ్బు మనంబున మానవుండు దా
నొక్కటి చింత చేయ విధి యొక్కటి వేఱ తలంచు నక్కటా. [3]
అసంప్రేక్ష్యకారిత్వము.
- ↑ [ కంఠమరాజని ఆంధ్రకవి తరంగిణి. (సం, 4 పుట 91 ).వీరు పూసపాటివారని శ్రీ టేకుమళ్ళ అచ్యుతరావు గారు]
- ↑ [నారాయణకవి యింటిపేరు దూబగుంటవారని చెప్పట కవకాశము లేదనియు,'హరిహరభక్తు-’ నను పద్యమునుబట్టి 'వాచకాభరణము'గాని, 'ప్రబంధ వాచకాభరణము' అని కాని యింటిపేరై యుం డవచ్చునని, ఒకవేళ 'బ్రబంధ వాచకాభరణము' కవివిశేషణమైనఁ గావచ్చునని, 'ఆంధ్రకవి తరంగిణి' (సం. 6 పుట 86)]
- ↑ [బైచరాజు వెంకటనాధుఁడు, శిష్టు కృష్ణమూర్తిశాస్త్రి, భానుకవి కూడ పంచతంత్రమును పద్యకావ్యములు గా వ్రాసినట్టు తెలియుచున్నది.]