ఆంధ్ర కవుల చరిత్రము - ప్రథమ భాగము/తాళ్లపాక అన్నయాచార్యులు

తాళ్లపాక అన్నయాచార్యులు


ఈతఁడు నందవరీక బ్రాహ్మణుఁడు; తిరుపతి నివాసి. శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తుఁడు; ఇతనికి అన్నమాచార్యుఁడు; అన్నమయ్య, అన్నమయ్యంగారు అను పేర్లు ప్రసిద్ధములు. ఇతఁడు వైష్ణవమును పుచ్చుకొనెను. ఇతఁడు పెక్కు సంకీర్తనములను, శృంగారమంజరి, శృంగారలక్షణము, వేంకటేశ్వర శతకము మున్నగు గ్రంథములనురచించెను. ఈ శతకమునుండీ పద్యములను పెదపాటిజగన్నాథకవి తన ప్రబంధరత్నాకరమున నుదహరించి యున్నాడు. ఈతఁడు క్రీ.శ.1408 వ సం. న జన్మించి. 95 సంవత్సరముల ప్రాయమున క్రీ. శ. 1503 లోఁ గీర్తిశేషుఁడయ్యెనని తెలియవచ్చుచున్నది. ఇతని నివాసము తొలుత కడపమండలములోని రాజంపేట తాలూకాయందలి తాళ్లపాక గ్రామమనియు, ఆ గ్రామమును బట్టియే వీరి గృహనామ మేర్పడినదనియుఁ జెప్పుదురు.


రేవణూరి తిరుమల కొండయార్యుఁడు


ఇతఁడు తాళ్లపాక అన్నయాచార్యుల కల్లుఁడు. శకుంతలా పరిణయకర్త. రేవణూరి వేంకటాచార్యుల తండ్రి. శకుంతలా పరిణయగద్యను బట్టియే యితఁడు రామచంద్రోపాఖ్యానమను ప్రబంధమును వ్రాసినట్లు తెలియుచున్నది. ఆ గ్రంథ మిప్పుడు లభించలేదు.