ఆంధ్ర కవుల చరిత్రము - ప్రథమ భాగము/కవిభల్లటుఁడు

కవిభల్లటుఁడు


ఈ కవి యొక లక్షణ గ్రంధమును, విక్రమార్క చరిత్రమును రచియించెనని చెప్పుచున్నారు ఈ గ్రంధములు నాకు లభింపలేదు. ఈతఁడు సంస్కృతమున నిఘంటువులు రచియించెను. ఇతని పదమంజరియందీ శ్లోకమున్నది

         శ్లో. లక్ష్మీరుబద్దనృపాలేన యం ప్రాప్తా కవిభల్లటమ్
            తేన కావ్యదృశా ప్రోక్తా సప్రాసా పదమంజరీ

దీనినిబట్టి యితఁడు బుద్ధనృపాలుని కాలములో ననఁ గా 1230 వ సంవత్సర ప్రాంతముల రంగనాధరామాయణకాలములో నుండినట్టు తెలియ వచ్చుచున్నది.[1]

            "శ్రీమద్ద్రాక్షారామభీమనాథవరప్రసాదలబ్ధసకలభాషాకవితా
             నిర్వాహకకవిభల్లటవిరచితా గణమంజరీ సమాప్తా"

ఆని యాతని గణమంజరి కడపట నున్నందున నితఁడు గోదావరీమండలములోనివాఁడనియు, తన పుస్తకములను ద్రాక్షారామ భీమేశ్వరస్వామి కంకితము చేసెననియు తెలిసికొనవచ్చును. ఈ క్రింది పద్యము కవిభల్లటుని విక్రమార్క చరిత్రములోని దఁట.

       ఆ.వే. చెప్పకున్న నీవు జీవంబు విడుతువు
             జెప్పినప్పుడు తనకు జీవహాని
             చెప్పి మున్న నీకు జీవంబు విడిచెద
             నీవు చన్న వెనుక నిలువలేను.

[ఈ కవినిగూర్చి 'తెనుఁగుకవుల చరిత్ర' లో నిట్లున్నది. "తెలుగున ప్రాచీన కవుల నామములను పరిశీలించిన నవి కొన్ని ప్రసిద్ద సంస్కృత కవుల నామములని తెలియఁదగి యున్నది. అవి బిరుదములై నను - బిరుదనామముతో వ్యవహార ముండుటవలన నా యా వ్యక్తుల నిజనామములు మఱుగుపడి యున్నవి.... .... వారిలో నీ కవిభల్లటుఁడు నొకఁడు. ఈతఁడు సంస్కృతమున భల్లట శతకమును రచించి కాశ్మీర దేశమున ప్రఖ్యాతికెక్కిన కవిభల్లటుని పేర వెలసినవాఁడు. తెలుగు భల్లటకవి శూద్రకరాజ చరిత్రమును, బేతాళ పంచవింశతిని రచించినట్లు లక్షణ గ్రంధములు చెప్పుచున్నవి. ఈతఁడే రచించిన 'పదమంజరి' యను సంస్కృత గ్రంథమునుబట్టి యీతని కాలము 1060–70 ప్రాంతమని చెప్పవచ్చును.] (పుట. 306.)
  1. [ఈ బుద్దరాజు గోన బుద్దరాజని చెప్పుట కాధారములు లేవు. కొండ పడమటి బుద్దరాజని 'తెనుఁగు కవులచరిత్ర' (పుట 306)
    'ఆంధ్రకవి తరంగిణి' కారులు కవి భల్లటుని గూర్చిన విద్వాంసుల యభిప్రాయములను విపులముగఁ జర్చించి - చివఱ కితని గ్రంథములను గూర్చియు, కాలమును గూర్చియు నేమియు నిశ్చయింపక విడిచిరి.]