ఆంధ్రుల సాంఘిక చరిత్ర/6 వ ప్రకరణము

6వ ప్రకరణము

క్రీ.శ. 1600 నుండి 1757 వరకు

విజయనగర పతనముతో అనగా క్రీ.శ. 1630 తో ఆంధ్రుల పతనము పరిపూర్తి యయ్యెను. హిందువుల పతనమునకు ముసల్మానుల విజృంభణమునకుగల కారణములు ఆయా సందర్బములందు ఇంతకుపూర్వపు ప్రకరణములందు నిరూపితములయినవి. విన్సెంటు స్మిత్‌గారు తమ ఆక్సుఫర్డ్ ఇండియా చరిత్రలో ఈ విషయమునే చర్చించెను. అతని భావములు నేను నిరూపించిన భావములతో సమానము లగుటచే నీ సందర్బమున వాటిని ఉదహరింతును.

మలిక్ కాఫిర్ దక్షిణమున మధురవరకు ఎత్తిన జండాను దించకుండా రాజ్యాలను జయించుతూ వెళ్లెను. అంతకన్న నాశ్చర్య జనక మగున దేమనగా మహమ్మద్ ఖిల్జీ అను సేనాని 200 మంది సవార్లతోనే బిహారును క్రీ.శ. 1197 లో జయించెను. అంతకన్నను ఆశ్చర్యకరమయిన విషయ మేమన ఆ సేనానియే 1199 లో 18 మందు సవార్లతోనే బెంగాలు రాజధానియగు నడియాపై బడగా వంగరాజు తొంగిచూడకయే దిడ్డితలుపునబడి పారిపోయెను. ఆ కాలములో బిహార్, బెంగాల్ రాజులును విశేషముగా బౌద్ధులు అహింసా ధర్మము వారి నీగతికి తెచ్చెను. హిందూ బౌద్ధుల పతన మత్యంత లజ్జాకరమని యొప్పుకొనక తప్పదు. ఖిల్జీ సుల్తానులు, బహమనీ సుల్తానులు లక్షల హిదువులను ఈగలనువలె చంపిరి. ఫిరోజిషా అను బహమనీ సుల్తాను 20,000 హిందువులను చంపుట పరిపూర్తియైనప్పుడంతయు మూడుదినములు చంపుడు విందు చేసెడివాడు. ఒకతడవ అయిదు లక్షల హిందువుల ప్రాణాల తీసిన తర్వాతనే "రోజా" (ఉపవాస వ్రతమును) వదలెను. లక్షల హిందువులు ప్రాణాలు దక్కించుకొన ముసల్మానులైరి. దీని కంతయు కారణమేమి? స్మిత్ గారిట్లు వ్రాసిరి. 'యుద్ధతంత్రమందు ముస్లిం సుల్తానులు హిందువులకన్న నిస్సందేహముగా నిపుణులై యుండిరి. వారు విషయ లోలురు కానంతవరకు వారిని జయించుటకు హిందువులకు సాధ్యాముకాకుండెను. చలికొండల నుండి దిగి వచ్చిన తురకల శారీరక శక్తి చాలా హెచ్చు. వారి మాంస బుక్తి శాకాహారులను నిర్జించు శక్తి నిచ్చెను. వారిలో కులభేదాలు లేవు. అంటు ముట్టు, భోజన నిషేధాలు వారికి లేవు. కాఫిర్లను చంపిన నేరుగా స్వర్గ మబ్బుననియు, యుద్ధాలలో మతానికై చచ్చిన 'షహీదు'లై సూటిగా జన్నత్ లోనికి జొరబడుదురనియు వారికి బోధించి యుండిరి. వారు పరదేశమునుండి వచ్చినవారు. ఓడితే సర్వనాశనమని వారికి తెలియును. కాన జయోవా మృత్యుర్వా అన్న సిద్దాంతమును గట్టిగా నాశ్రయించిరి. ఘోరకృత్యాలతో హిందువులను బాగుగా బెదరించి యుంచిరి. దేవాలయాలలో, నగళ్ళలో, పట్టణాలలో అపారమగు ధనము, రత్నములు, బంగారు దొరకునని వారెరిగినందున తమ సాహసానికి గొప్పప్రతిఫలము దొరకునని ఉత్సాహముతో యుద్ధము చేసెడివారు. హిందువుల యుద్ధతంత్రము పురాణకాలము నాటిది. ప్రాచీన నీతిశాస్త్రాలపైననే వారింకను ఆధారపడి యుండిరి. కొత్త పరిస్థితులకు తగినట్లు తమ తంత్రాలను మార్చుకొన్నవారు కారు. తమ ప్రతిపక్షుల విధానాలను వారు గమనించినవారు కారైరి. హిందూ సైన్యములో కులభేదా లుండుటయే కాక నానారాజుల కూటమిచే సైన్య మొక నాయకునికి గాక పలువురి నాయకులకు లోబడినదై నానా ముఖాల నడిచెను. విదేశి సైన్యము ఏక నాయక పరిపాలితము, ఆ సేనలు హిందువుల నేరీతిగ కాతరులనుగా జేయవలెనో ఆ కీలకా లెరిగి యుండెను. ముఖ్యముగా తమ ఆశ్విక దళములతో భయంకరముగా హిందువులపై బడి వారిని చెల్లా చెదరు చేసెడివారు. ప్రాచీన యుద్ధ తంత్ర ప్రకారము హిందువు లేనుగులపై ఎక్కువగా నాధారపడిరి. అది వారి పొరపాటు. ఘోటకముల దాటి ముందు ఏనుగుల మందగమనము పనికిరానిదయ్యెను. హిదువులు సహితము గుర్రముల సేనకలవారై యున్నను దానిని వారు వృద్ధి చేసుకొన్న వారు కారు." (పుట 257)

ఈ చరిత్రకారుని నిర్ణయములో ప్రత్యక్షరము సత్యమే యని చెప్పవలెను.

అది విజయనగర రాజులు బహమనీ సుల్తానుల రాకకు తట్టుకొన జాలని వారైరి. రెండవ దేవరాయలు (1421-48) ముసల్మాను సవార్ల ఆధిక్యతను వారి దానుష్కుల చతురతను గుర్తుంచుకొని తమ సైన్యములో ముసల్మానులనే భర్తీ చేసుకొనెను. వారి నాకర్షించుటకై వారికి మసీదులు కట్టించి వారు కోరిన వరాలను ఇచ్చెను. 'కాని లాభము లేకపోయెను. తుదకు దేవరాయలు సంధిచేసుకొని బహమనీ సుల్తానులకు కప్పము కట్టెను.' (స్మిత్ Oxford History of India P. 303)

తళ్ళికోట లేక రక్షసతగడీ యుద్ధము క్రీ.శ. 1565 లో జరిగెను. దాని తర్వాత ఆంధ్రదేశమ లో రాజకీయ దౌర్బల్య మేర్పడుచు వచ్చెను. కొంత కాలము పెనుగొండలో ఆంధ్రరాజులు నిల దొక్కు కొనిరి. కాని అక్కడి నుండి పీఠము చంద్రగిరికి కదలగానే ఆంధ్రుల రాజకీయౌన్నత్యము పరిసమాప్తి అయ్యె నన్నమాట. క్రీ.శ. 1600 వరకు ఆంధ్రదేశములో ఒక గోలకొండ సుల్తానులు తప్ప తక్కిన తురక లెవ్వరును రాజ్యము చేయలేదు. గోలకొండ సుల్తానులు షియ్యాలగుట చేతను వారియాధిక్య మిప్పటి తెలంగాణములో వలెనే యుండినందునను వారికి ప్రక్కననే ప్రబల విజయనగర చక్రచర్తు లుండుటచేతను వా రాంధ్రులను దుష్టముగా పాలించినవారు కారు. కాని తళ్ళికోట యనంతరము తెనుగుదేశములో తురకల విజృంభణము ఎక్కువయ్యెను. అంతవరకు కాకతీయులు, విజయనగర చక్రవర్తులు, రెడ్డిరాజులు తురకలను నిరోధించుచు వారిని తెనుగు సీమలోనికి రానీయనందున ఆంధ్రులకు ఉత్తర హిందూస్థాన హిందువులకు కలిగిన కష్టాలెట్టివో కానరాకుండెను. తటాలున క్రీ.శ. 1600 తర్వాత 150 ఏండ్లవరకు తురకల దాడు లెక్కువై కర్నూలు, కడప, గుంటూరు నవాబు లేర్పడి ఉత్తర సర్కారులు వారి వశమై వారి దుష్పరిపాలన మొకదిక్కు సాగుచుండగా, మరొకదిక్కు పిండారీలు, దోపిడిగాండ్లు, తురకల దండులు ఎక్కువై జనుల హింసించి చంపి దోచి చెరచి, గుళ్ళను కూలద్రోసి నానా ఘోరాలు చేయగా ఆంధ్రులు హాహాకారాలు చేసి చాలా బాధపడిరి. ఆ బాధలు పద్యాలలోను, కావ్యాలలోను, ప్రబంధాలలోను, చాటువులలోను ప్రతిఫలించినవి. గోగులపాటి కూర్మనాథుడను కవి విశాఖపట్టణ మండలములో తురకలదండు ప్రవేశించి బీభత్సములు చేయగా సింహాద్రి నారసింహస్వామినే నానావిధాల తిట్టుచు సింహాద్రి నారసింహ శతకమును వ్రాసెను. ఆ కవి క్రీ.శ. 1700-1750 ప్రాంతమువాడు. తురకదండు పొట్నూరు, భీమసింగి, జామి, చోడవరం మున్నగు ప్రాంతాలలో దూరి దోచుకొని దేవాల యాలను ద్వంసము చేయుచు వీరవిహారము చేసెను. వారి దుండగాలను కవి యిట్లు వర్ణించెను.

          "ఎలమితో సోమయాజుల పెద్దఝారీలు
           గుడిగుడీలుగా జేసికొనెడివారు
           యజ్ఞవాటికలలో నగ్ని హోత్రంబుల
           ధూమపానము చేసి త్రుళ్ళువారు
           యాగపాత్రలు తెచ్చిహౌసుగా, వడి,
           లుడికి చిప్పలుగ జేసి కేరువారు
           స్రుక్స్రువముఖ్యదారుమయోపకరణముల్
           గొని వంటపొయినిడుకొనెడివారు
           నగుచు యవనులు విప్రుల దెగడుచుండ
           సవనభోక్తపు నీవిట్లు సైపదగునె
           తినదినగ గారెలైనను కనరువేయు
           వైరిహరరంహ సింహాద్రి నారసింహ!"

(ఝారీలు=ఝరీవలె ధారపడు నాళముకల చెంబులు ఉర్దూలో టూటీదార్ లోటా అందురు. గుడిగుడీ=హుక్కా.)

ఆ కాలపు తురకల వేషా లెట్లుండెనో పై కవియే వర్ణించినాడు. నరసింహస్వామిని తన హిందూవేషమును మార్చుకొని తురకవేషము వేసుకొమ్మని యిట్లు సంబోధించుచున్నాడు :-

          "జడవిప్పి జులుపాలు సవరింపు మిరువంక
           బలుకిటికీదారు పాగ జుట్టు
           బొట్టునెన్ను దుటిపై బొత్తిగాతుడుచుకో
           పోగులూడ్పుము చెవుల్ పూడవిడువు
           వడిగ నంగీ యిజార్దొడుగు దట్టీ జుట్టు
           కైజారుదోపు డాల్కత్తి బట్టు
           బీబినాంచారిని బిలిపింపు వేగమే
           తుద కభ్యసింపుమీ తురక భాష

          శక్తిలేకున్న నిట్టివేషంబు పూను
          మన్న సురలోకవంద్యుడవైన నీవు
          నీచులకు సలాంసేయ నే సహింప॥
'వైరి"..."

తురకలు చేసిన దౌష్ట్యములను యిట్లు వర్ణించినాడు:-

   
     'కనిపించు కోవుగా ఖలులు మార్గస్థుల
      కొంకక ముక్కులు గోయునపుడు
      ఆలకింపవుగదా యయ్యయో ప్రజఘోష
      ధూర్తులు వడి నిళ్ళు దోచునపుడు
      జాలిగాదాయెగా చటులతురుష్కులు
      భామినులను చెరల్ పట్టినపుడు...."

మరియు:-

          గ్రామముల్ నిర్దూమధామమ్ము లయ్యెను
          సస్యంబు లెల్ల నాశనము చెందె
          దొడ్లలో శాకముల్ దుంపశుద్ధిగ బోయె
          దోచిరి సర్వంబు గోచిదక్క

తురకదండు సింహాద్రిపైకి వెళ్ళగా అక్కడ తుమ్మెదలదండు వచ్చి వారిని కరచి పారిపోవునట్లు చేసెనని అట్టి తావును తుమ్మెదల మెట్ట అందురని కవి వర్ణించి ఒక పద్యాంతమందు ఇట్లు దేవుని సంబోధించినాడు :-

      "(కాక) రోషంబు గలిగిన కఠినయవన
       సేన నిర్జించి యీ యాంధ్ర సృష్టి నిలుపు"

(ఇక్కడ సృష్టి అనగా (culture). సంస్కృతి అనే అర్థమును నేను గ్రహిస్తున్నాను. అదే కవిభావ మనుకొందును.)

కాంచీ నగరవాసియగు వెంకటాధ్వరి క్రీ.శ. 1600 ప్రాంతమువాడని యందురు. బహుశ 1650 ప్రాంతమువాడై యుండును. అతడు వ్రాసిన విశ్వగుణాదర్శనము అను సంస్కృత కావ్యములో కూడ తురకలు చేసిన ఘోరాల నిట్లు వర్ణించినాడు. తెనిగించిన భాగాలే యుదహరింతును.

. "అయ్యో! ఈ ఆంధ్రదేశములందు నమందదురితనిరతులై యెల్లప్పుడు బెల్లుగ తురకలే తిరుగుచున్నవారు :

        యవను లింద మంద జవనాశ్వముల నెక్కి దేవతాలయాల దీర గూల్చి
        సవనధర్మ సమితి సమసిపోవగ జేసి భువనభీకరులుగ భువి జరింత్రు॥

యవనులు ఒక్కొక్కడు కోపముతో సవారియై కత్తి తిప్పుతూ మైదానములో దూకిన ఒకవేయి (ఆంధ్ర) యోధులు కూడా భయపడి పారిపోతున్నారు. మరియు:-

        త్రావగనిమ్ము కల్లు, పర దారల బెల్లు హరింపనిమ్ము, నా
        నావరదేశముల్ తిరిగి నాశనము సేయగనిమ్ము, నేమముల్
        వావిరి ద్రోవనిమ్ము మృద వాటి దృణమ్మను బోలే మాని మే
        నే, విబువేంద్ర పట్టణ వినిష్ట కవాటము ప్రక్కలింత్రె పో॥
""

భద్రాచల ప్రాంతమువాడేమో క్రీ.శ. 1750 ప్రాంతమువాడయినట్టి భర్లా పేరకవి యనునతడు భద్రగిరి శతకములో పూర్తిగా గోగులపాటి కూర్మనాథునివలెనే తురకలవలన చాలా బాధపడి భద్రాద్రిరాముని చెడ దిట్టినాడు. ఆ పద్యాలన్నియు నుదాహరించిన గ్రంథము పెరుగును కాన తురక సర్దారులు, సేనానులు, స్థానికాధికారులు చేసి దుండగాలను వర్ణించిన భాగాంశములను కొన్నింటి నుదాహరింతును.

           'అచ్చిద్రకర్ణుల యాజ్ఞ నుండగలేక
            తురకల కెదురుగా నరుగలేక
            చేరి ఖానులకు తాజీము లీయగలేక
            మును నమాజు ధ్వనుల్ వినగలేక'

      'కాడు చేసిరికదా కల్యాణమండపాగార వాహన గృహాంగణము లెల్ల'
      'సంస్కృతాంధ్రోక్తుల సారంబు లుడివోయె వపసవ్య భాషలనమరె జగము'
      'సత్రశాలాంగణల్ చలువ పందిరులు బబ్బరటటఖానుల చప్పరము లయ్యె'
      'పారిపోవగనైన పట్టెలు నాకక విడురురే వైష్ణవ వితతి నెల్ల'

పేరకవి తన శతకములో 'ధంసా'ను పేర్కొన్నాడు. ధంసాయుండినది హైద్రాబాదులోని నిర్మలలో, కావున కవి నిర్మల ప్రాంతమువాడై యుండునేమో? ఆంధ్రదేశమునకు మూడవ మూలయగు తిరుపతిలోకూడ ముసల్మానుల అక్రమాలు జరుగగా ఇదేకాలమున 'శత్రుసంహార వేంకటాచల విహార' యని ఒకశతకములో వడ్డికాసుల వెంకన్నను ఒకకవి చీవాట్లు పెట్టెనట: ఈ విషయాలను చూడగా ఈ కాలములో ఆంధ్ర దేశ మెంతటి దిక్కులేని దేశమై, అరాచకమునకు గురియై, ఎంతటి ఆవేదన పడెనో ఊహించుకొనవలెను.

ఉత్తరమునుండి తెనుగుదేశముమీదికి కష్టపరంపరలు ఒకదిక్కు దిగుమతికాగా, దక్షిణ దిక్కులో మరొకమూలనుండి ఇంకొక ఈతిబాద ప్రారంభ మయ్యెను. అది సముద్రాంతరమునుండి ఎగుమతి చేయబడి నట్టిది. అదే క్రైస్తవ మతస్థుల దౌర్జన్యము. తంజావూరును ఆంధ్రరాజులు పాలించెడు కాలము వరకే పోర్చుగీసువారు కాలికట్టులో కొలదిగా ప్రబలులై కాలుసాపి తీరమంతయు వ్యాపించుకొని కత్తితో కాక తుపాకీ గుండ్లతో క్రైస్తవ మత ప్రచారము ప్రారంభించిరి. ఆదిలో తంజావూరు రాజగు చెవ్వప్ప నాయకుడు పోర్చుగీసు వారికి ఆశ్రయ మిచ్చెను. క్రమముగా పోర్చుగీసువారు తమ దౌర్జన్యము సాగించిరి.

వారితోపాటు డచ్చివారు (హాలెండు దేశమువారు) తంజావూరు రాజ్యమునందలి జనులను పట్టుకొనిపోయి విదేశాలలో బానిసలుగా అమ్ముకొనిరి. ఇంతేకాక ముసల్మానులుకూడ తంజావూరు నాక్రమించుకొని దేశమునంతయు బీభత్సము పట్టించి, ప్రజల చంపి దోపిడులు చేసిరి. ఇదంతయు రంగీలా రాజగు విజయరాఘవ నాయకుని (అనగా క్రీ.శ. 1633-1673) కాలములో జరిగెను. ఈ పిచ్చివిజయరాఘవుడే తురకసైన్యముపై జపించిన తులసితీర్థము చల్లితే వారు భస్మమగుదురని దానిని పంపెనట. కాని అతడే సమూలముగా స్త్రీ శిశు సమేతముగా నాశనమయ్యెను.

అట్టి పిరికి కాలములో ఒక్క రాచవారు మాత్రమే ఆంధ్రుల కీర్తిని నిలువ బెట్టిరి. వారు కత్తులతోనే శత్రువులపై బడి తాము నిశ్శేషముగా హతమగువరకు పోరాడి వీరస్వర్గ మలంకరించిరి. (చూ. తంజావూరాంధ్ర నాయక చరిత్ర. కు॥

సీతారామయ్యగారు.)

అట్టి సన్నివేశములలో అనగా తురక, క్రైస్తవుల విజృంభణ కాలములో ఆంధ్రదేశమును రక్షించినది రాజులు కారు; తత్త్వబోధకులే రక్షించినవారు. దేశమంతటా వేదాంతులు బయలుదేరి గేయాలతో మతావేశమును కలిగించుచు సంఘలోపాలను సంస్కరించుచు వచ్చిరి. అట్టివారిలో ముఖ్యులు వేమనయోగి, పోతులూరి వీరబ్రహ్హ్మముగారు.

పోతులూరి వీరబ్రహ్మము కమసాలివాడు. క్రీ.శ. 17-వ శతాబ్ద మధ్యమువాడు. కర్నూలులోని పోతులూరను గ్రామవాసి, చిన్నప్పుడు బనగానపల్లెలోని వెంకట రెడ్డి అనువాని యింట పశుల గాసినవాడు. "ఇతడు విగ్రహారాధనలు, జాతిభేదములు మున్నగువానిని ఖండించి, ప్రజలకు హితోపదేశము చేసెను. ఇతడు సంసారి. భార్య గోవిందమ్మ. ఇతని కనేక శిష్యులు గలరు. అందు దూదేకుల సిద్దయ్య అను తురక ముఖ్యశిష్యుడు." (రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మగారు - వేమన)

వేమన జగమెరిగిన వేదాంతి. సంఘ సంస్కారి. అందరిని తిట్టుచునే నవ్వించి, బుద్ధిచెప్పి చక్కనిబాట చూపినవాడు. వేమనకాలములో లింగాయతులు, వైష్ణవులు తమతమ మతప్రచారములు చేసుకొన్నవారు. ఆయిరువురిలోని లోపాలను వేమన బయట పెట్టినవాడు.

          'లింగ మతములోన దొంగలుగా బుట్టి
           యొకరి నొకరు నింద నొనరజేసి
           తురకజాతిచేత ధూళియై పోదురు
           విశ్వదాభిరామ ! వినుర వేమ !'

తురకమతవ్యాప్తి నిట్లు వేమన వర్ణించెను.

          "పసరపుమాంసము బెట్టియు
           మసకల సులతాను ముసలిమానుల జేసెన్".

వైష్ణవుల నిట్లు తూలనాడెను.

          "ఎంబెరుమతమందు నెసగ మాంసము దిని"
          "మారుపేర్లు పెట్టి మదువు ద్రావి
           వావి వరుస దప్పి వలికి పాలౌదురు ॥
విశ్వ॥
"
          "రంగధామమునకు హంగుగా తానేగి
           కల్లుకంపు సొంపు కలిగియుండు."

పై నాలుగుపద్యాలు వేమనవి కావని నా అనుమానము. వేమన పేరుపెట్టి పరస్పరము దూషించుకొన్నవారి హస్తలాఘవముగ కనబడుచున్నది. వేమన క్రీ.శ. 17-వ లేక 18-వ శతాబ్దములో నుండి యుండును.

ఆకాలములోని ఆంధ్రమందలి బ్రాహ్మణుల స్థితిగతులను గూర్చి వెంకటాధ్వరి తన విశ్వగుణాదర్శమం దిట్లు వ్రాసెను.

"ఈ ఆంధ్రదేశములో ఒక్కొక యూరియందు శూద్రుడు గ్రామాధి కారి (యజమానుడు) గాను, వాని ప్రక్కన బ్రాహ్మణుడు భృత్యుడై గణకవృత్తిని (కరణము పనిని) అవలంబించి నాడు, నీరులేనిచోట తటాకమువలె వేదాధ్యాపకుడొక్కడే ఉన్నను ఇక్కడ వాడు మురికి పాత్రలు తోమెడి పనిలో నియమింపబడి యున్నాడు.' ఈ వాక్యముల వల్ల అ కాలములో రెడ్డి, కమ్మ మున్నగు జాతులవారు గ్రామాధికారు లని ఆరువేల నియోగులు వారికి లో బడినవారై కరణీకాలు చేయచుండిరనియు, వైదిక బ్రాహ్మణులు (ఇప్పటి మంథేనలోని పలువురు వలె) వంటలు చేయుచు జీవించుచుండిరనియు కవి అభిప్రాయముగా కనబడుచున్నది.

'ఆంధ్రదేశస్థులగు బ్రాహ్మణులు యజ్ఞాలు చేయరు. వేదాలు చదువరు. అయినా ఈ దేశములో దేవతాభక్తి, బ్రాహ్మణపోషణ బాగా కలదు' అనియు, 'ఇక్కడి బ్రాహ్మణులు గోదావరీ స్నానముచేసి ఇసుక లింగములో శివుని ధ్యానించి తిలాక్షతసుమముల తోను, బిల్వపత్రాలతోను పూజలు సేతురు' అనియు, 'గోదావరీతీర బ్రాహ్మణులు శివపూజలు చేసి వేదాధ్యయనముచేసి పరిశుద్ధులైనవా' రనియు, కృష్ణగోదావరీ మధ్య దేశ వాసులగు వైదికులు యజ్ఞ యాగాలుచేసి ఉత్తమజీవితముల గడుపుచున్నా" రనియు అతడు వర్ణించి యున్నాడు.

వెంకటాధ్వరికాలమువరకే ఇంగ్లీషువారు మద్రాసులో బలపడి తమ వ్యాపారమును బాగుగా వృద్ధిచేసి తమ యధీనములోనున్న మద్రాసులో న్యాయస్థాన మేర్పాటుచేసిన ముచ్చటను అతడు ఇట్లు వర్ణించినాడు.

'తిరువళిక్కేణి ప్రసిద్ధమగు క్షేత్రము. దానిని పార్థసారథిక్షేత్రమనిరి. ధానినే కైరవిణి (తెల్లకలువకొలను) అన్నారు. (బహుశ: అప్పుడు పార్థసారథి కొలనులో తెల్లకలువ లుండెనేమో ? ఇప్పుడు అందు నాచు, మురికిక్రిములు నిండియున్నవి.) తిరువళిక్కేణిలో ఇంగ్లీషువారి ప్రాబల్య ముండెను'. హూణులలో అనగా ఇంగ్లీషువారిలో చెడ్డగుణా లేవనగా :

       'హుణా: కరుణాహీనా: తృణవబ్రహ్మణగణం న గణయంతి
        తేషాం దోషా: పారేవాచం యే నా చరంతి శౌచమపి'

ఇంగ్లీషువారిలో కరుణయే కానరాదు. బ్రాహ్మణులనైతే వారు గడ్డి పోచలవలె చులకనగా చూతురు. వారిదోషాలు చెప్ప నలవికావు. వారు శౌచము నైనా చేయరు, అని పై శ్లోకభావము. ఇప్పటికినీ ఇంగ్లీషు వారును తక్కిన తెల్లవారును కాలకృత్యముల తీర్చుకొన్న తర్వాత జల ప్రక్షాళనము చేసుకొనువారు కారు.

            "శౌచత్యాగిషు హూణకాదిషు
             ధనం శిష్టేమ న క్లిష్టతాం'

అని మరొకమారు కవి తెలిపినాడు.

అట్టి శౌచరహితులగు ఇంగ్లీషువారికి సంపన్నత నిచ్చిన హతవిధిని అతడు దూరినాడు.

ఇక ఇంగ్లీషు వారిలోని మంచిగుణాల నిట్లు వర్ణించినాడు.

'ఈ హూణులు పరులసొత్తులను కోరిక, అబద్దములాడక, అద్బుతములగు వస్తువులను సిద్దముచేసి అమ్ముకొనువారు. తప్పుచేసిన వారిని విచారించి శిక్షిస్తున్నారు."

అయితే వెంకటాధ్వరి యీ కాలములో ఉండి నట్లయితే తమ సామ్రాజ్య స్థిరతకై ప్రచారముచేయు వీరిని 'పరులసొత్తులను అన్యాయముగా బలాత్కరించి వీరు తీసుకొనరు; అబద్ధాలు ఆడరు" అని వ్రాసియుండడు.

అడిదము సూరకవి క్రీ.శ. 1750 లోపలివాడని అందురు. అతని కాలములో ఫ్రెంచివారు, ఇంగ్లీషు వారు, తురకలు దేశమందు అల్లకల్లోలములు చేసిరని కవి యిట్లు చాటువును రచించెను.

            "పచ్చిమాంసము కల్లు భక్షించి మత్తెక్కి
                 రాణించి తిరుగు పరాసులైన
             గంజాయి గుండ హుక్కాలుడికెడి నీళ్ళు
                 త్రాగిమ్రాన్పడెడు తురుష్కులైన

           గోవుల పడమొత్తి కోసిముక్కలు మెక్కు
                సమదాంధులగు కొండసవరులైన
           తెరవాట్లు కొట్టి కత్తెర దొంగలై
           ..... ..... .....
                 చాల పాలించి తిరుగు చండాలురైన
                 ..... ..... .....
                 ఘాతుకత్వంబు సేయు ముష్కరులు గలరె"

ఆ కాలములో గట్టి కేంద్రరాజ్యము లేక తెనుగు దేశము చిల్లర పాలెగాండ్ర వశమయ్యెను. వారును పరరాజుల సామంతులైరి. ఇంగ్లీషు, ఫ్రెంచి, ముస్లిములు రాజ్యాలకై పోట్లాడుచుండిరి. అందుచేత దేశమంతయు అరాచకమై బందిపోటు దొంగతనాలు ఎక్కువయ్యెను. క్రీ.శ. 1600 ప్రాంతాన వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు అను ప్రభువు అమరావతిలో చిన్న రాజ్యమేలెను. మహాదాత యనియు, శూరుడనియు ఖ్యాతిగాంచెను. 'అటునుండి కొట్టుకరా' అనే సామెత ఇతని నుండే పుట్టినదట. 'ఆ కాలమందు దారి దోపుడుగాండ్రు మెండుగా ఉండిరట. అనేకుల ప్రాణ, ధనముల గొనుచు ప్రజలకు మిక్కిలి పీడ గలిగించుచున్న యా దొంగలను బహు ప్రయత్నమున వెంకటాద్రినాయుడు నూర్గురను పట్టి తెప్పించి వరుసగా నిలువబెట్టి తలలు నరుక తలారుల కాజ్ఞ యిచ్చెనట. ఒక కొననుండి నరుక ప్రారంభింపబోగా నచ్చటివాండ్రు అటు నుండి కొట్టుకొనుచు రమ్మని కోరిరట. కొందరిని నరికిన తర్వాతనేని జాలి వొడమక పోదని దలచిరి. కాని నాయుడుగారు అందరిని నరికించి ప్రజలకు చోరభీతి మాన్పిరట.' (చాటుపద్య మణిమంజరి)

మనము సమీక్షించు కాలములో ఆంధ్రులవేషా లెట్లుండెనను విషయము మనకంతగా తెలియకున్నను ఈనాడు మారుమూలలలో నుండే ముసలివారికి 300 ఏండ్ల క్రిందటి వారికి అంతబేదము లేకుండెనని చెప్పవచ్చును. ఇప్పుడు క్రాపులు, జుట్లు, అంగీలు, కోట్లు, సెల్లాలు టోపీలు ఎక్కువైనవి. ఆ కాలములో పురుషులు విశేషముగా గుండు రుమాలనో లేక వంకర పాగల (షమ్లావంటి చుంగుకల మెలికల లపేటాల) నో కట్టుకొనుచుండిరి. అంగీలు చాలా తక్కువ. కాని అవి ఆచారములోనికి వచ్చియుండెను. బొందెలముళ్ళు 6 తావుల వేసి అంగీలుతొడుగు చుండిరి. వాటినే బారాబందీ అనిరి. అది అపభ్రంశమై బాదరబందీ అయ్యెను. తరువాత నాలుగు తావుల ముళ్ళు వేయసాగిరి. కాని బారాబందీ పదమట్లే నిలచెను. జనసామాన్యము మోటు దుప్పటి మాత్రమే కప్పుకొనుచుండెను. పురులకు చెవులకు పోగులుండుట సర్వసాధారణము. అందులో థనికులగువారు చెవుల పై భాగములో కూడ ముత్యాలతో లేక రత్నాలతో కూడిన పోగులను ధరించువారు. చాలామంది దండకండెములను ధరించెడివారు వేమన పలుమారు లిట్లు వ్రాసియున్నాడు.

            తలను పాగ, పైని తగు పచ్చడము, బొజ్జ,
            చెవులపోగు లరసి చేరు నర్థి
            శుద్ధ మూర్ఖులనుచు బుద్ధిలో నరయక ॥
విశ్వ॥


            పాగ, పచ్చడంబు పైకి కూసంబును.
            పోగు లుంగరములు బొజ్జకడుపు
            కలిగినట్టివాని కందురు చుట్టాలు ॥
విశ్వ॥

వేమన కాలములోని కొన్ని సాంఘిక జీవిత విశేషములు ఆతని పద్యాల వల్ల స్పురిస్తున్నవి.

'గజపతింట నెన్న గవ్వలు చెల్లవా' అన్నాడు, గవ్వలుకూడా నాణెముగా నుండెను. 'గవ్వ సేయనివాడు' అని పరమ నీచుని తిట్టుటకే తెనుగులో సామెత యయ్యెను.

           "ఆశచేత దనము నార్జింపగానేల
            మట్టి క్రిందబెట్టి మరువనేల"

ఇనుప పెట్టెలు బ్యాంకులు లేని కాలములో భూమిలోనే ధనము పాతి పెట్టెడి ఆచారముండెను.

           'ఊసరిల్లి పిచ్చి యుపమున రసమున
            చేర్చి నూరి సతులు చెలువముగను
            వశ్యమగును మగని వరియించి పెట్టంగ
            రోగ మమరి నీల్గు రూడి వేమ'

నేటికిని "మరులుమందు"ను ఒల్లని భర్తలకు భార్యలు కొందరు పెట్టుటయు, ఆ మందుతో ఆ భర్తలు చచ్చుటయు వింటున్నాము. (కాని పై పద్యము వేమనది కాదని శైలియే తెలుపుచున్నది.)

           నేయిలేని కూడు నీయాస కపవది
           కూరలేని తిండి కుక్కతిండి॥

నేయి, కూర ముఖ్యముగా జనుల భోజనములో చేరియుండె ననుట సాధారణ విషయమే.

       'నాగుబాముగన్న నంబి బ్రాహ్మణుగన్న
        చెవులపిల్లిగన్న చేటువచ్చు
        గరుడుని గనుగొన్న గలుగును కోరికల్ ॥
విశ్వ॥

ఇప్పటికినీ జనులలో అవే విశ్వాసాలున్నవి. (కాని మూడ విశ్వాసాలను ఖండించిన వేమన ఈ పద్యము వ్రాసియుండడు.)

'ముండమోపి కేల ముత్యాల పాపట' అనుటచే సంపన్నులగు కొందరు ముత్తైదువలు పాపటలో ముత్యాలసరము నుంచుకొనిచుండి రనవచ్చును.

వేమన, బసివిరాండ్రను పలుమారు పేర్కొనెను. బసవశబ్దము వృషభ శబ్దభవము. ఇంటిలో ఒక యాడుబిడ్డను వివాహము చేయక వదలుట కొందఱి వీరశైవులలో నిప్పటికిని కలదు. వారు వ్యభిచారపు వృత్తిచే జీవింతురు. వారికి బసివి యని పేరు కల్గినది. తాతాచార్యులవారి వైష్ణవము రాకమునుపు ఈ యాచార ముండెను. వైష్ణవ గురువులు శిష్యులలో బసివిరాండ్రకు భస్మ రుద్రాక్షలకు తిరుమణి తులసిపూసల నిచ్చి దాసర్లగుంపులో వారిని చేర్చినారు. (అనంత కృష్ణశర్మ-వేమన.)

వేమన కాలములో చిత్రములు వ్రాయుట కొంతయైన నుండినట్లు కాన వచ్చును. "చిత్తరువు ప్రతిమ కైవడి చిత్తమ్మును గల్ప మడచి చిరతర బుద్ధిన్" అని వర్ణించెను. మరియు,

           "ఇంగిలీకమహిమ హేమింపనేరక
            చిత్రపటము వ్రాసి చెరచినారు."

అనియు వ్రాసినారు. ఇంగిలీకాన్ని చిత్తరువుల రంగులకు వాడినారు, వేమన కాలములోని ఆయుర్వేద దేశీయవైద్య మెట్లు సాగెనో కొంతకొంత జాడ కానవస్తున్నది.

          "కుక్క గఱచెనేని కూయనీయక పట్టి
           ప్రక్కవిరుగదన్ని పండబెట్టి
           నిమ్మకాయదెచ్చి నెత్తిన రుద్దిన
           కుక్క విషము దిగును కుదురు వేమ."

నేడుకూడా పిచ్చిలేచినవారికి నెత్తి గొరిగించి, కాట్లు పెట్టించి, ఆ కాట్లలో నిమ్మరసముతో బాగుగా మర్దింతురు.

       "కాంతసిందురంబు కడు పిత్తరోగికి
        ఒనర మధువుతోడ నొసంగినంత
        తనదు దేహబలము ధన్యుడై గట్టెక్కు ॥
విశ్వ॥


        ఉక్కుకళ్ళు దిన్న నొగి తేటగా నుండు
        ఉక్కుచూర్ణము దిన మడుగు క్షయము
        ఉక్కుకళ్ళకన్న నుర్వి కల్పము లేదు ॥
విశ్వ॥


        ఉక్కు శుద్ధిచేసి యుంచి తినెడు వాడు
        ఉక్కుదిటవువలెనె యుండు జగతి
        ఉక్కుచూర్ణము దిను టొప్పగు కల్పంబు ॥
విశ్వ॥

ఈ పద్యాల శైలిని చూడగా ఇవి వేమనవని నమ్మను. ఇక పశువైద్య మానా డెట్లుండెనో ఈనాడును అట్లే కలదు.

            దొమ్మమాయుకొరకు అమ్మవారికి వేట
            లిమ్మటండ్రిదేమి దొమ్మతెవులొ
            అమ్మవారిపేర నందరు తినుటకా ॥
వి॥

వేమన కాలములో గాజు కుప్పెలు (Glass) చేయుచుండిరేమో! 'గాజు కుప్పెలో వెలుగుచు దీపంబు' అనుటచే ధనికులు గాజు గిన్నెలలో దీపాలు వెలిగించుచుండిరని యూహింపవచ్చును. శ్రీనాథుడు తన భీమేశ్వర పురాణములో 'గాజుకుప్పెల గస్తూరికా జలంబు | కర్ణికారాంబ పైనించె గర్ణమోటి' అని వర్ణించెను.

చంద్రశేఖర శతకము రచించిన కవి యెవ్వరోకాని బ్రాహ్మణు డని మాత్రము తోచును. అతడు నెల్లూరివాడని భాషనుబట్టి స్పష్టమగుచున్నది. అక్కడి బ్రాహ్మణేతరులను వారి యాచారాలను అతడు వెక్కిరించి హేళన చేసినాడు. అతని కాల మేదో తెలియదుకాని ఇంచుమించు క్రీ.శ. 1700 ప్రాంతమువా డని విపులముగా ఊహించుకోవలసినదే.

మన దేశములో పొగాకును ప్రవేశ పెట్టి దేశమును నాశనం చేసిన మహనీయులు పోర్చుగీసువారు. అది క్రీ.శ. 1600-1650 ప్రాంతములో ప్రవేశ పెట్టబడెను. ఈ శతకములో దాని ముచ్చటవచ్చినందున ఈకవి 1650 నుండి 1750 లోపలివాడుగా నుండియుండును.

      సీ. దగిడీల బాపల పసిద్ధినరే, పోగ నిప్పుకంట, పొమాదుగులింటి
         కోయి, బతి మాలితి, మూడు నెగళ్ళు మండుతై, లేదనితిట్టె,
         పాపపు కలిగ్గము, యింత పరాక' దాట్లొ యీ
         రాదట, యంద్రసహ్యులు దురాత్ములు మూర్ఖులు చంద్రశేఖరా.'

మన చిన్నతనమువరకు పల్లెలలో భాగవత, భారత, రామాయణ పురాణాదులను చదువుట చెప్పుట పల్లెజనులు వినుట ఆచారముగా నుండెను. ఈ శతక కాలములో భాగవతము, రామాయణము గరుడ పురాణము చెప్పువాడుక అతని ప్రాంతమున యుండెననవచ్చును. గ్రామాలలోని జనులకు ధనికులయిన గ్రామ ముఖ్యులు ఉచితముగా వినోదాలను ఏర్పాటు చేస్తుండిరి. గ్రామరెడ్డి ఏర్పాటు చేసిన దొమ్మరాటయే ఆకాలపు 'సర్కసు'.

        'మెడ్డుగ దొమ్మరెక్కగన మించిన యిద్దె మరేడ లేదు నా
         తెడ్డొకబాప నిద్దెలని తిట్టును మూర్ఖుడు చంద్రశేఖరా!'

బాపల విద్యలేవికూడ దొమ్మరివిద్యతో సరిపోలవట;

తందాన కథలను జంగము కథలనీ, బుర్రకథలనీ అందురు. ఆ కథలు జనుల కత్యంత ప్రీతికరములై యుండెను.

        'ఇంటిని తిమ్మరాజుకత, యింటిని యీర్ల కథాప్రసంగముల్
         ఇంటిని పాండులాలి, యిబమింటిని నాయకురాలి శౌర్రెమె
         ప్పంటికి నందివాక్కముల పాండు చెరిత్రల నామభాగ్యమె
         న్నంటికి గల్గునోయను నవజ్ఞుడు మూర్ఖుడు చంద్రశేఖరా.'

(యీర్లకథ=వీరులకథ, నాయకురాలి శౌర్రెము=పల్నాటివీరుల సుద్దులలోని ఆర్వెల్లి నాయకురాలి. చరిత్ర) పల్లెజనులకు బయలునాటకాలు మరొక ఆనందకరమగు వినోదము. విశేషముగా భాగవత కథలను ప్రదర్శిస్తూ ఉండినందున నాటాకాలాడువారిని భాగోతులు (భాగవతులు) అని అనుచుండిరి.

         రాతిరి సూస్తి యేసములు రమ్మెముగా గురులాన, మొన్న బా
         గోతుల సత్తెబామ, యనగూడని తాపములెల్ల సేసె, మా
         పాతకురాలు రాద, వలపచ్చము రుక్మిణిసుద్ది కిష్టమం
         టీ తెరుగానడంచు వచియించును మూర్ఖుడు చందరశేఖరా॥


        "దస్తుగ మొన్ననే బురళదాసళచేత గడించి నాట్యమాడిస్తిని"

అనుటచేత దాసళ్లే ఎక్కువగా బయలు నాటకాలాడు చుండిరని తోస్తున్నది.

నాటికిని నేటికిని జాతర లన పల్లెజనులకు చాలా వేడుక.

        'ఇరిదిగ సూస్తి తీరతము లెన్నెనొ, ఆవనగొండ గంగజా
         తరసరిరావు, పంబలును తప్పెటలున్ కొముగాండ్ల సిండ్లసం
         బరమెరి దెల్పు మింకొక పబావము రంకుల రాటమెక్కెనే
         తిరిగిన సాటిరాదని నుతించును మూర్ఖుడు చంద్రశేఖరా॥

జాతర్లలో నేటికిని పై రెండు వేడుకలు జరుగును.

ఆ కాలములో ఓనమాలు, ఎక్కాలు కా గుణితము ఇసుకలో దిద్దించి చెప్పించుచుండిరి. నేటికిని దాని జాడలు పెక్కు పల్లెలలో కలవు. పేర్లు వ్రాయడము నేర్పినపిమ్మట పలక పట్టించేవారు. తర్వాత భాగవత భారతాలు చదివించేవారు. ఆ ముచ్చటనే కవి యిట్లు వర్ణించినాడు :

        నన్ను సదించె బాబు సినవాడు, తమాసగా భాగవతంబు రా
        మాన్నము, బారతంబును, తమామును కిందివి ముందెవచ్చె, నే
        విన్ని సదుండగానే బపుయెత్తుము నోరిక బాపనాండ్లు నా
        కన్నను లొజ్జటండ్రు, పలుగాకులు ముర్ఖులు చంద్రశేఖరా.

(క్రిందివి ముందెవచ్చె=నేలపై ఇసుకలో నేర్చుకొను చదువు ముందుగానే వచ్చెను.)

బడికాలము తెల్లవారుజామునుండియే చీకటి యుండగానే ప్రారంభమయ్యెడిది. గురువు వద్ద బరిగయో కొరడాయో ఉండెడిది. మొదట వచ్చిన వాని చేతిలో శ్రీకారము ఆ యాయుధముతోనే వ్రాసి పంపి రెండవ వానిచేతిలో ఆయుధమును ఊరక తాకించి (చుక్కపెట్టి) పంపి మూడవవాని కొక దెబ్బ, నాల్గవ వానికి రెండు ఈ ప్రకారముగా ఆలస్యముగా వచ్చిన వారికి శిక్ష యిచ్చేవారు.

'చెలియ నఖాంకురాళినెల చేడియసైకము తాను చుక్కనున్‌' అని విజయ విలాసములో చేమకూర వేంకటకవి సూచించినాడు. నక్షత్రాలు ఆమె గోళ్ళ తళుకుముందు రెండవ స్థానము నొందినవే అని కవి చమత్కరించినాడు.

వర్షమునకు ఎండకు గొడుగులు పట్టుకొనుట ఆకాలమందు కానవస్తున్నది. కాని ఇప్పటి బట్ట గొడుగులు కాకపోవచ్చును. నేటికిని తిరువాన్కూరులో, కొచ్చిన్‌లో వెదురుకట్టెకు తాటియాకులను గుండ్రముగా ఛత్రవలె కట్టి వాడుదురు. వాటిని కొడే అందురు. అ పదమే మన గొడుగుపద మనుటలో సందేహము లేదు. అయితే బట్ట ఛత్రీల వాడుక మన పూర్వీకులకు తెలియదని కాదు. దేవతా విగ్రహాలను ఊరేగింపు కాలములోను, రాజుల ఊరేగింపు కాలములోను రెండు గజాల పొడవు కట్టెకు రంగుల పట్టుబట్టలతో ఛత్రీలనుగా కుట్టి వాడుచుండిరి. క్రీ.శ. 1700 ప్రాంతపువాడగు భాస్కర శతకకారుడు ఇట్లు వ్రాసినాడు.

      కులమున నక్కడక్కడ నకుంఠిత ధార్మికు డొక్క డొక్కడే
      కలిగెడుగాక పెందఱుచు గల్గగనేరరు చెట్టుచెట్టునన్
      గలుగగ నేర్చునే గొడుగు కామలు చూడగ, నాడనాడ నిం
      పలరగ నొక్కటిక్కటి నయంబున జేకురు గాక భాస్కరా.

ఆ కాలపు జనుల వేడుకలలో తోలుబొమ్మలాట ఒకటి.

ద్విపద ప్రబంధాలు వివిధములగు పాటలు, తోలుబొమ్మ లాటలు, మన తెనుగువారిలో ఆదికాలము నుండియు ఉండినట్టివని యిదివరకే తెలుపనైనది. చాలా ప్రాచీనుడగు పాలకురికి సోమనాథుడు తన పండితారాధ్య చరిత్రలో ఇట్లు వ్రాసినాడు.

      భ్రమరాలుజాళెముల్ బయనముల్ మెఱసి
      రమణ పంచాంగపేరణి యాడువారు

      ప్రమథపురాతన పటుచరిత్రములు
      క్రమమొందు బహునాటకము లాడువారు

  • * * *

      అమరాంగనలు దివినాడెడుమాడ్కి నమరంగ గడలపై నాడెడువారు
      ఆ వియద్గతి యక్షులాడెడునట్టి భావన మ్రోకులపై నాడువారు
      భారతాది కథలు చీరమరుగుల నారంగ బొమ్మల నాడించువారు
      నాదట గంధర్వ యక్ష విద్యాధరాదులై పాత్రల నాడించువారు'

భాస్కర శతకకారు డెవ్వడో తెలియదు. అతని కాలములోను తోలుబొమ్మలాట. వ్యాప్తిలో ఉండినది.

     'ఇంచుక నేర్పు చాలక విహీనత జెందిన నా కవిత్వమున్
      మించు వహించె నీకతన మిక్కిలి యెట్లన తోలుబొమ్మలన్
      మంచి వివేకి వాని తెరమాటున నుండి ప్రశస్తరీతి నా
      డించిన నాడవే జనుల డెందము నింపవె ప్రీతి భాస్కరా'

భాస్కర శతకమును జంటకవులు రచించిరని కొందరు విమర్శకులు వ్రాసినారు. ఈ పద్యములో 'నా కవిత్వము' అన్న మాటతో ఆ కథ యెగిరి పోయినది.

తెనుగు దేశములో మరొక వినోద విశిష్టత కానవస్తున్నది. అది విప్ర వినోదము అనునట్టిది. ఒక జాతి బ్రాహ్మణులు ఏదో క్షుద్రదేవతోపాసనవలననో మంత్ర తంత్రాల వలననో చిత్రమగు గారడి చేయుదురు. ఇప్పటికినీ ఆ వినోదము చేయు విప్రులున్నారు. గుంటుపల్లి ముత్తరాజు అను సర్దారు గోలకొండ సుల్తానుల తుదికాలములో ఉండెను. అతని గూర్చి యొక చాటు విట్లున్నది.

     "సంతత మారగించునెడ సజ్జనకోటుల పూజసేయు శ్రీ
      మంతుడు గుంటుపల్లికుల మంత్రి శిఖామణి ముత్తమంత్రి దౌ
      బంతియె బంతిగాక కడుపంద గులాముల బంతులెల్ల నూల్
      బంతులు, దుక్కిటెడ్ల మెడ బంతులు, విప్రవినోదిగారడీ
      బంతులు, దొంగవాండ్ర ములు బంతులు సుమ్ము ధరాతలంబునన్

క్రీ.శ. 1700 తర్వాత తెనుగు దేశములో భూవ్యవహార మంతయు మహారాష్ట్ర పద్ధతిపై సాగినట్లున్నది. ఒక చాటు విట్లున్నది.

        గురు యశశ్శాలి యగునట్టి గుంటుపల్లి
        మంత్రి నరసింగరాయ సన్మందిరమున
        ఒక్కనాటి వ్యయంబగు తక్కినట్టి
        దేశ పాండ్యాల యొకయేటి ప్రాశసంబు.

దేశముఖు దేశపాండ్యాల నియామకము మహారాష్ట్ర పద్ధతియే.

పెమ్మయ సింగరాజు అను నతడు ప్రౌడ దేవరాయల నాటివాడని యందురు. ఉండవచ్చును. ఎందుకనగా అతని కాలము నాటికి మన హిందూ స్థానములో మిరపకాయలు నెగడలేదు. వాటిని క్రీ.శ. 1600 ప్రాంతములో అమెరికానుండి తెచ్చి మన ప్రాంతములో నెగిడించిరి.

        పెమ్మయ సింగరాజును గూర్చి ఒక చాటు విట్లున్నది.
       'మిరియములేని కూరయును
        మెచ్చు నెరుంగనివాని యీవి యున్‌'

ఈ విషయమును బట్టి కూడ క్రీ.శ. 1600 తర్వాత మిరపకాయలు మన దేశములో వ్యాపించెనని తెలియగలదు.

తెనుగు దేశములో కొంత భాగము సముద్రతీరమందుండుటచేత ప్రాచీనమునుండియు గొప్ప వ్యాపారము జరుగుచుండెను. కాని మన సమీక్షాకాలములో దేశము అరాచకమైనందున వ్యాపారమునకు రక్షణ లేకుండెను. గోలకొండ రాజ్యము పడిపోయెను. కర్నూలు కడపలలో ఆప్గన్ నవాబులు రాజ్యము చేసిరి. దక్షణమున ఆర్కాటు నవాబు లేర్పడిరి. ఉత్తర సర్కారులలో ఇంగ్లీషు, ఫ్రెంచివారు వ్యాపారముతోపాటు యుద్ధాలు కూడ చేయుచుండిరి. తెల్లవారు వ్యాపారము చేసినచోట మన దేశ వ్యాపారము నాటికిని నేటికిని ముందుపడుట లేదుకదా:

క్రీ.శ. 1611 లో ఇంగ్లీషువారు మచిలీబందరులో ఒక ఫ్యాక్టరీ పెట్టిరి. అప్పుడు మచిలీబందరు బట్టలు చాలా ప్రసిద్ధి కెక్కియుండెను. ఇంగ్లీషులోని మస్లిన్ పదము మచిలీనుండియే వచ్చెను. గోలకొండ రాజ్యమున్నపుడు అక్కన్న మాదన్నల నాశ్రయించి వారికి నజరానా లిచ్చి బహుమానా లిచ్చి ఇంగ్లీషువారు మదరాసులో వ్యాపారము సాగించుచుండిరి. గోలకొండ పడిపోగానే ఔరంగజేబునుండి చెన్నపట్టణములో, మసూలాలో, మోటుపల్లిలో, విశాఖపట్టణములోను నున్న తెనుగు తీరపు మరికొన్ని స్థలాలలోను కౌలుపద్ధతిపై వ్యాపారము చేసికొనుటకు సెలవు పొందిరి.

తెనుగుసీమ మొత్తము భారత దేశములో వజ్రాలగని యని ప్రఖ్యాతి పొందెను. గోలకొండరత్నాలు అని యూరోపునందంతటను మారుమ్రోగిపోయెను. కాని నిజముగా గోలకొండ పట్టణము చుట్టును ఎక్కడా రత్నాలు లేకుండెను. గోలకొండ నుండి దక్షిణముగా అయిదు దినాలు ప్రయాణము చేసినచో కృష్ణా తీరములో రావులకొండ అనేతావున వజ్రాలగని యుండెనని ఆ కాలమందు సంచారము చేసిన టావర్నియర్ అనే తెల్లవాడు వ్రాసినాడు. అప్పు డందు 60,000 మంది గనిలో పనిచేయుచుండిరనియు వ్రాసినారు. కృష్ణాతీరములో కొల్లూరు అనేతావున రత్నాలగని క్రీ.శ. 1534 లో కనిపెట్టిరి. అక్కడనే కోహినూరు వజ్రము దొరికెను. ఈ కొల్లూరు ప్రఖ్యాతి ఎక్కువై ఒక శతాబ్దములోనే అచ్చటి గనులు మూతబడెను. అప్పటి వైభవమును తర్వాత శైథిల్యమును గూర్చి జనులలో ఒక చిత్రమగు కథ బయలుదేరెను. 'కొల్లూరు పట్నము వలె వెలిగిపోయింది.' అని సామెతగా అనెదరు. దానిపై పుట్టిన కథ యేమనగా :-

కొల్లూరు పట్టణములో ఒకదేవుడు వెలిసెను. ప్రతి జనుడు ధాన్యమును తన మూత్రములో తడిపి ఆ దేవతా విగ్రహముపై వేసిన అవన్నీ రత్నాలై రవ్వ లవుచుండెనట. అందరును ఆ క్రియను చేయుచు మేడలు కట్టిరి. ఆ పట్టణములో ఒక పేద బాప డుండెను. అందరివలె నీవును చేసి సుఖపడరాదా అని అతనిభార్య తొందరపెట్టుచుండెను. ఏమైననుకాని నేనా తుచ్చపుపని చేసి అపచారము చేయనని అ శిష్టు డనుచుండెను. ఒకనాటి మద్యరాత్రి మరొక వృద్ధ బ్రాహ్మణు డా పేదబాపని కుటుంబ సహితముగా పట్టణము బయటకు పిలుచుకొని పోయి అదిగో కొల్లూరుపట్టణ వైభవము చూడు అని ధగద్ధగితముగా మండుచుండే పట్టణమును వారికి చూపి మాయమయ్యెనట. అది కొల్లూరు పట్టణం వలె వెలిగినది అనేకథ. ఆ కథ నిజముగా ఈ వజ్రాలగనికి సంబంధించినదని పైననే కనబడుచున్నది.

హైదరాబాదునుండి మచిలీబందరుకు పొయ్యేమార్గంలో పరిటాల (Paritala) కలదు. అది బందరునుండి 50 మైళ్ళ దూరములో కలదు. అందునూ ఉస్తిపల్లి జగ్గయ్యపేటలోను రత్నాలగను లుండెను. హైదరాబాదు నగరమునకు 30 మైళ్ళ దూరములో షంషాబాదుకు 20 మైళ్ళ దూరములో ఉన్న నర్కోడాలో 'నిజాంరత్నం' అనునది దొరికెను. అది 335 క్యారట్ల తూకముది. దాని వెల 2 లక్షల 20 వేల పౌనులు. పై ప్రదేశాలలో కాక కర్నూలు జిల్లాలోని రామళ్ళకోటలో రవ్వలు దొరకుచుండెను. రవ్వలకోటయే రామళ్ళకోటయయ్యెను. రాయలసీమలో వజ్రకరూరు అను గ్రామము కలదు. అందుకూడ వజ్రాలు దొరకుచుండెను. నేటికిని అచ్చట పలువురు వర్షాలు కురిసినవెంటనే వరద పారిపోయిన తావులందు రత్నాలకై వెదుకుచుందురు. వారి కప్పుడప్పుడు రత్నాలు దొరకుచునే ఉండును. ఇప్పుడీ ప్రదేశాలలో వెచ్చటను గనులు త్రవ్వుటలేదు. గుత్తివద్ద మునిమడుగులోను రత్నాల గనులుండెను.

వేణుగోపాల శతకములోని

           అవనీశ్వరుడు మందుడయన నర్థుల
           కియ్యవద్దని వద్ద దివాను చెప్పు
           మునిషి యొకడు చెప్పు బకిషి యొకడు
           చెప్పు తరువాత ముజుందారు చెప్పు
           తలద్రిప్పుచును శిరస్తా చెప్పు
           వెంటనే కేలు మొగిడ్చి వకీలు చెప్పు
           దేశపాండ్యాతాను తినవలెనని చెప్పు
           ముతనద్ధి చెవిలోన మొనసి చెప్పు.

అను పద్యములోని పై పదాలనుబట్టి నవాబుల ప్రభుత్వము బాగా తెనుగుసీమలో పాదుకొన్నదని తెలియరాగలదు. ఈ శతక కారుడు తన కాలపు తెనుగు క్షత్రియులను వర్ణించినాడు. వారు రాజులు రాచవారు అయియుందురు.

          'కొండసిగల్ తలగుడ్డలు పాకోళ్ళు
           చలువ వస్త్రములు బొజ్జలు కఠార్లు
           కాసెకోకలు గంపెడేసి జందెము
           లును తలవారు జలతారు డాలువార్లు
           సన్నపు తిరుచూర్ణ చిన్నెలు కట్ణాలు
           జొల్లువీడెములును వల్లెవాటు
           దాడీలు వెదు రాకు తరహాసొగసు కోర్లు

           సంతకు దొరగార్లటంచు పేర్లు
           సమరమును జొచ్చి రొమ్ముగాయ
           మున కోర్చి శాత్రవుల ద్రుంచనేరని
           క్షత్రియులకు నేలగాల్పన యావట్టి యెమ్మె లెల్ల ॥
మదన॥
'

      వంకరపాగాలు వంపుముచ్చెలజోళ్ళు
      చెవిసందు కలములు చేరుమాళ్ళు
      మీగాళ్ళపైపింజె బాగైనదోవతుల్
      జిగితరంబుగను పార్సీ మొహర్లు
      చేపలవలెను పుస్తీమీసముల్ కలందాన్
      పెట్టెయును పెద్ద దస్త్రములును
      సొగసుగా దొరవద్ద తగినట్లు కూర్చుండి
      రచ్చ గాండ్రకు సిఫారసులు జేసి
      కవిభటులకార్యములనువిఘ్నములు చేయు
      రాయకాల్పిండములు తినువాయసాలు ॥
మ॥

ఆ కాలములోని కొన్ని కులాలను ఆ కులాల నాశ్రయించి బ్రతుకు మరి కొన్ని కులాలను అడిదము సూరకవి తన రామలింగేశ శతకములో ఇట్లు వర్ణించినాడు.

            జంగాలపాలు దేవాంగుల విత్తంబు
            కాపువిత్తము పంబకానిపాలు
            బలిజీలవిత్తంబు పట్టెదాసరిపాలు
            గొల్లవిత్తము పిచ్చుగుంటిపాలు
            వ్యాపారి విత్తంబు వారకాంతలపాలు
            కల్జువిత్తము రుంజకానిపాలు
            పరజాలపాల్ శిష్టుకరణాలసొమ్ము
            ఘూర్జరుల విత్తంబు తస్కరులపాలు
            కవులకీగలజాతి యొక్కటియులేదు
            వితరణము వైశ్యులకు పెండ్లి వేళగలదు
            కొంగుబరచిరి నృపతులా కూటికొరకు
            రామలింగేశ రామచంద్రపురవాస.

(పంబకాడు=కొమ్ముపట్టుమాల, కల్జు, రుంజకాడు=బవనీడు అనుమాల, పరజాల అన నేమో తెలియదు.)

ఆడిదము సూరకవి కాలమువరకే పూర్వాచారాలు మాసిపోవుచు వచ్చెనని కవి యిట్లు వాపోయినాడు.

          అగ్రహారములు నామావశిష్టములయ్యె
          మాన్యంబులన్నియు మంటగలిసె
          భత్యంబునకు దొంటి పడికట్టుతప్పెను.
          బుధజనంబుల రాకపోకలుడిగె
          వర్షాశనంబులు వరదపాలై పోయె
          మలవతీలను ప్రజల్ మాసిచనిరి
          నశించిపోయె వంటరులు తురుష్కులు
          గజతురంగములు తాకట్టుపడియె
          ధార్మిక స్థానమున కిట్టి తళ్ళుబుట్టె
          కఠిన చిత్తుని రాజ్యాధికారి జేసి
          యింత పీడించితివి సత్కవీంద్రకోటి॥
రా॥

క్రీ.శ. 1600 నుండి ఆంధ్రులు రాజకీయ పతన మయ్యెనని చెప్పవచ్చును. దక్షిణములో రఘునాథ రాయలకాలములో (1614-1633) తంజావూరులో ఆంధ్రులగొప్పదనము నిలిచియుండెను. ఆతని కాలములో తెనుగువారిపై మహమ్మదీయుల అక్రమములుకాని, యుద్ధాలుకాని సాగనేరక పోయెను. వారిని రఘునాథుడు ఓడించి ఆంధ్రుల సృష్టిని (Culture) మరికొంత కాలము నిలిపెను.

అతని కాలములో దక్షిణమున తెనుగు యక్షగానాలు చాలా వృద్ధికి వచ్చెను. నాటకాలు, నాట్యకళ, సంగీతకళ ప్రశస్తి కెక్కెను. ఇతర ప్రాంతాలలో తెలుగువారు తమ పూర్వులు నిర్మించిన శిల్పాలను కోలుపోయిరి. కాని తంజావూరులో ప్రాతవి నిలుపుటయేకాక రఘునాథ రాయలు చక్కని శిల్ప సౌందర్యముకల దేవాలయాలను, రాజభవనాలను, కోటలను నిర్మింపజేసెను. అతడు సంగీత విద్యానిధి. అత డొక క్రొత్త వీణను కనిపెట్టెను. దానిపేరు రఘునాథ మేళ. ఆంధ్ర సరస్వతి ముత్యాల శాలలో అచ్చట నాట్యమాడెను. ఈ విధముగా సంగీతాలు, కవిత్వాలు, శిల్పము తంజావూరులో వృద్ధిపొందెను. కాని అతని కుమారుని రాజ్యకాలము తంజావూరులో స్వాతంత్ర్యము కూడా మట్టిలో కలిసెను.

మన సమీక్షా కాలములో ముసల్మానుల నీడలు తెలుగు వారిపై బాగుగా పారెను. ఆనాటి కవుల కవితలలో ఫార్సీపదా లెక్కువగా మిళిత మయ్యెను. క్రీ.శ. 1700 తర్వాత తెనుగువారి పతనము పూర్తి అయ్యెను. అటు తర్వాత చిల్లర పాలెగార్లే మనకు మిగిలిరి. వారి దర్జా యెంతటిదో అంత మేరకే మన కళలన్నియు నిలిచిపోయెను.

ఈ విధముగా ఆంధ్రదేశ సాంఘిక స్థితి క్రీ.శ. 1600 నుండి 1757 వరకుండెనని స్థూలముగా చెప్పవచ్చును.

__________

ఈ ప్రకరణమునకు ముఖ్యాధారములు

1. వేమన పద్యములు : వేమన పద్యాలు పెరుగుతూ వచ్చినవి. తమకు సరిపడనివారిని దూషించి వినురవేమ అన్నవారు పలువురు, రసవాదాలు కల్పించి విశ్వదాభిరామ అన్న వారు పలువురును బూతులు వ్రాసి నోటితీటను వదిలించుకొన్నవారు తమ పేరు తెలుపుకొను ధైర్యములేక వెర్రి వేమన్నకు వాటి నంటగట్టినవారు కొందరును ఉండినట్లూహించవలెను. వేమన ఆటవెలదిలోనే, సరిగా యతిస్థానములో విరుపుచేసి చక్కని కవితను చెప్పినాడని నమ్ముదును. అట్టివానిని మొదలేరి వేరుగా ప్రకటించుట యవసరము.

2. వెంకటాధ్వరి - విశ్వగుణాదర్శము. మూలము సంస్కృతము, తెనుగు పద్యాలను వ్రాసినవారు మంచి కవిత వ్రాయలేదు.

3. గోగులపాటి కూర్మ నాథుడు - సింహాద్రి నారసింహ శతకము.

4. భల్లా (ఛల్లా?) పేరకవి - భద్రాద్రి శతకము. ఈ తుది రెండు శతకాలు పూర్తిగా తురకలు తెనుగు దేశమందు చేసిన ఘోరాలను వర్ణించును. ఆ వివరములను తెలుసుకొనగోరువా రా రెంటిని పూర్తిగా చదువవలెను. 5. చంద్రశేఖర శతకము, కవి తన పేరు చెప్పుకోలేదు. ఇది హాస్య రసముతో నిండినది. నెల్లూరి గ్రామ్యము ఏస ఇతర ప్రాంతాల వారికి తెలియనందున అట్టి పదాల కర్థము వ్రాసి ప్రకటించుట బాగు.

6. అడిదము సూరకవి - రామలింగేశ్వర శతకము,

7. వేణుగోపాల శతకము.

8. భాస్కర శతకము.

ఈ ప్రకరణానికి అన్నియు శతకాలే (వేమన శతకమందురు కాన అదియు నిందే చేరును.) ఆధారభూతములైనవి.

మంచి కవు లీ కాలములో అరుదైరన్నమాట : అది యీ సమీక్షా కాల మందలి దుస్థ్సితి కొక తార్కాణ.