ఆంధ్రుల చరిత్రము - ప్రథమ భాగము/పదునొకొండవ ప్రకరణము

పదునొకొండవ ప్రకరణము.

ఆంధ్ర పల్లవులు.

- - -<>- - -

పల్లవుల చరిత్ర మగాధముగ నున్నది. పల్లవులు స్వదేశస్థులని కొందరును విదేశస్థులని మరికొందరు భిన్నాభిప్రాయాలై యున్నను మొదట నాంధ్రదేశమునుండియే దక్షిణమునకు బోయి యుండిరను విషయమును మాత్రము చరిత్ర కారులెల్లరు నంగీకరించిన వారు. విదేశస్థులని చెప్పెడి వారు దేశమతాచారముల నవలంబించిదేశములలో గలసి బహుశతాబ్దములు నివసించి యుండి తమతోంటి జన్మస్థానమును మరచి తాముండినదేశమే తమ దేశముగా భావించుకొనుచు దేశ పరిపాలనము చేసిన పల్లవులను విదేశస్థులనుగానే పేర్కొనుచుండుటయు, స్వదేశస్థులని చెప్పెడి వారు బహురాజ్యములను సంపాదించి రాజాధిరాజులై నిర్వక్రపరాక్రమమును జూపి దేశపరిపాలనము జేసిన వారిని దారిదోపిడి కాండ్ర తెగలలో చేర్చి పేర్కొనుటయు వింతగా గన్పట్టక మానదు. ఈ ద్విపక్షముల వారి వాదములను కేవలము సత్యములని యంగీకరింపరాదు; కేవలమసత్యమని నిరాకరింపనురాదు. కొంతవరకు సత్యములు నసత్యములుగూడానై యున్నవి. ఏదేశస్థులయినను, ఏజాతి వారయినను ఈ దేశమునకు వచ్చి ఈ దేశమతాచారముల నవలంబించి ఈ దేశనామముల నలంకరించుకొని ఈ దేశమే తమ మాతృదేశముగా భావించుకొనిన వారిని స్వదేశస్థులనుగానే పేర్కొనవలసి యుండునుగాని కడవరకు విదేశస్థులునుగానే భావించి అట్లు పేర్కొనచుండుట కేవలము బొరపాటని చెప్పదగును. గోదావరీనది నాసికాత్రయంబకముకడ జనించి సముద్రములో గలియువరకు నడుమ నెన్నో యుపనదు లెచ్చటెచ్చటనో పుట్టి వేర్వేరు నామములతో బ్రవహింపుచువచ్చి గోదావరీనది మహానదిలో గలియుచున్నవి కదా. అట్లు వరద, మంజీర, ప్రాణహిత, ఇంద్రావతి మొదలగు నుపనదులువచ్చి గోదావరిలో గలియుచున్నను, ఆగోదావరిలోని జలము గూర్చి ప్రసంగింపవలసి వచ్చినప్పుడు వరదానది జలముకాని,మంజీరానది జలమనికాని, ప్రాణహితానది జలమనికాని పిలువక గోదావరీజలమనే పిలుచుచున్నారము. అట్లు, ఏదేశస్థులయినను, ఏజాతివారయినను, ఆంధ్రదేశముకు వచ్చి, ఆంధ్రదేశమతాచారముల నవలంబించి, ఆంధ్రుల వేషభాషల నలవరించుకొని, ఆంధ్రులతో సంబంధ బాంధవ్యముల నెరపుచు, ఆంధ్రమహాసంఘములో గలిసిపోయిన ఆంధ్రులుగానే పరిగణింపబడుదగిన వారు గాని అన్యులుగా బరిగణింప బడదగిన వారు కారు. ఆంధ్రులలో కలిసిపోయిన పల్లవులయొక్క పూర్వులైన పహ్లవులయొక్క జన్మస్థానం పారశీకమై నంతమాత్రము చేత పల్లవులను పారశీకులునుగా భావించి విదేశీయులగా బరిగణించుట యొప్పిదమైన విషయము గాదు. కావుననే యాంధ్రులలో ఒక తెగగా నేర్పడిన పల్లవుల నాంధ్రులనియే భావించి చదువరులకు సులభముగా బోధపడులాగున నాంధ్రపల్లవులని పేర్కొనుచున్నారము. పహ్లవులే పల్లవులయి రనియు, ఆంధ్రదేశమున పల్లవులకు జన్మస్థానము పల్లవనాడనియు (పల్నాడు) ఏడవప్రకరణమున గొంచముగ సూచించియుంటిమి. పహ్లవులెవ్వరు? ఎక్కడి నుండి వచ్చిన వారు?వీరి చరిత్ర ఏమి? మన పూర్వగ్రంధములం దెచ్చటనైన వీరిని గూర్చి తెలుపంబడియెనా? అనుప్రశ్నంబులను మనము విచారింప వలయును.

పురాణములలోని పహ్లవులు.

మనపురాణాది పూర్వగ్రంధములలో బహ్లవులు పశ్చిమోత్తర జాతులలోని వారనియు, వారిదేశము సింధునదిని పారసీకమునకు నడుమనెచ్చటనో యున్నదని పురాణములలో బోర్కొనంబడియుండెను. మనుధర్మ శాస్త్రకారుడు పల్లవులను మ్లేచ్చులుగా జెప్పియున్నాడు. [1]పహ్లవులు మ్లేచ్చులని మహాభారతములోని భీష్మపర్వములో ఐదవ యధ్యాయమున జెప్పంబడి యెను. వారు సగరునిచేత జయింపబడిరి గాని కులగురువగు వశిష్టుడడ్డు పడుట చేత నిర్మూలము చేయబడక విడిచిపెట్టబడిరి. మాంధాతయను రాజు పహ్లవుల [2] విధులను గూర్చి యింద్రుని ప్రశ్నించినట్లుగ మహాభారతము లోని శాంతిపర్వములో 24వ యధ్యాయనం జెప్పబడినది. అచ్చట యవనులు, కిరాతులు, గాంధారులు, చీనులు, శబరులు, బర్బరులు, శకనులు, తుషారులు, కంకులు, ఆంధ్రులు, ముద్రకులు, పుండ్రకులు, పుళిందులు, రమతులు, కాంభోజులు మొదలగు వారితో పహ్లవులు చేర్పబడిరి?

వశిష్ట మహాముని కామధేనువు రంకెవేయునపుడు జనించిన పహ్లవులు మొదట క్షత్రియులయినను క్రమముగా శూద్రులయిరనియు హరివంశము రామాయణములలో జెప్పంబడియెను. అచ్చట వీరలు శకనులతోను, యవనులతోనూ, కాంభోజులతోనూ జేర్పబడి యాజాతికి ముఖ్యమైన గురుతుగడ్డమని [3]యు దానిని ధరించుటకు సగరుడనుమతించెననియు గూడ చెప్పబడియెను. విష్ణుపురాణమునందును యవన పహ్లాది కాంభోజులు మొట్ట మొదట క్షత్రియులయినను బ్రాహ్మణులనుండియు బ్రాహ్మణ వంశముల నుండియు వేరుపడిన వారగుట చేత శూద్రులయి పోయిరని చెప్పబడియెను. [4]మొదట వీరు క్షత్రియులేయనియు, పవిత్రకర్మలను విడనాడి బ్రాహ్మణాధికార మతిక్రమించుట చేత శూద్రు లయిపోయిరని మనువుగూడ వ్రాసియుండెను. కాళిదాసు తనరఘువంశమునందు రఘుమహారాజు దిగ్విజయము వర్ణించు పట్టున యవనులను హిందూదేశమునకు పశ్చిమదిశను బేర్కొని యున్నాడు. పారసీకులను జయించుటకై రఘుమహారాజు త్రికూటము నుండి మెట్టదారిన బోయెనని చెప్పియుండెను. యవనులను జయించిన తరువాత పారశీకులను జయించెనని చెప్పియుండెను.వీనింబట్టి పౌరాణిక కాలమునందు పహ్లవులు పరిపాలన భారము వహించిన ఒక జాతి వారని స్పష్టమగుచున్నది. వారు బ్రాహ్మణ కర్మలననుసరించుట లేదని చెప్పుట చేత వారు విదేశస్థులనియు, విజాతీయులనియు, వారి పూర్వులెప్పుడో యీదేశమునకు వచ్చి యుండిరనియు దేటపడుచున్నది.

శాసనములోని పల్లవ రాజవంశము.

పల్లవవమను సంస్కృతశబ్ధమునకు చిగురని యర్ధము. పల్లవ వంశములోని బూర్వికుడయిన పల్లవుడు పల్లవముల పల్లకిలో నాకస్మికముగా నశ్వత్థామకు జనించుట చేత నతనికా పేరు వచ్చినదనియు, వారి సంతతి వారలు పల్లవులయిరనియు కానకుడి తామ్రశాసనమున జెప్పబడియెను. ఇయ్యది నంది పల్లవమల్లునిచే వ్రాయించబడినది. పరమేశ్వరవర్మ కురము శాసనమునందును, ఉదయేంద్రము శాసనమందును ఆశ్వత్థామకు పల్లవుడు జనించెనని లిఖింపబడియెను.[5] కానకుడి తామ్రశాసనమందు అశ్వత్థామకు నప్సరసయగు మేనక యందు పల్లవుడు జనించెననికూడ చెప్పబడియున్నది. [6]. అయినను సింహవర్మ అమరావతీ శిలా స్థంభముపై వ్రాయించిన శాసనములో అశ్వత్థామకు మదనికయను నప్సరస వలన పల్లవుడు జనియించెనని గానంబడుచున్నది. [7]ప్రాచీన పల్లవరాజులు తమ శాసనములలో దాము పల్లవులమనియు భరద్వాజ గోత్రీకులమనియు వ్రాసికొని యుండిరి [8]కాని తరువాతి వారు పోయిన పోక లేవియు వారిశాసనములందు గానరావు. ఈ పల్లవరాజ వంశమైనను పలుశాసనముల యందు బలురీతులుగా నభివర్ణింపబడినది. ఈ పల్లవుడు క్షత్రియుడుగా జెప్పబడక బ్రహ్మకులము లోని వాడుగా జెప్పబడియెను. ఈ బ్రహ్మవంశము సహితము తాతలను మనుమలుగను, మనుమలను తాతలుగను జేయబడి బలు శాసనములలో వర్ణింపబడినది.

కాంచీపురము కైలాసనాధుని దేవాలయంలో నొకశాసనమున బ్రహ్మకునంగీరసుడు, వానికి బృహస్పతి, వానికి సంయువు, భరద్వాజుడు, వానికి ద్రోణుడు, వానికి అశ్వత్థామ, వానికి పల్లవుడు జనించెనని చెప్పియుండగా కుమారశాసనమున సంయువును నెగురగొట్టి బృహస్పతికి మనుమడుగ జెప్పబడిన భారధ్వాజుని, పుత్రునిగజేసి వర్ణించియుండెను. అమరావతీ శాసనమన్ననో బృహస్పతిని నెగురగొట్టి కురముశాసనమున నంగీరసునకు మనుమడుగా జెప్పబడిన భరధ్వాజుని నంగీరసునకు తండ్రిగాజేసి మధ్యసుధామానుడనువాని గల్పించి ద్రోణునకు దండ్రిగజేసెను. ఇంకనునిట్టివే వైచిత్య్రము లీశాసనము లోని వంశముల గన్పట్టుచున్నవి. పల్లవరాజులు కొందరు భారధ్వాజగోత్రికులమని చెప్పుకొనియున్నను మరి కొందరు సాలంకాయనులమనియు బృహత్పలాయనులమనియు జెప్పుకొనిరి. దక్షిణాపథమున రాజ్యాధికారముబూని పరిపాలనచేసినవారిలో పాండ్యచోళకేరళులు, చాళుక్యులు, గాంగులు, కాకతీయులు, మొదలగువారు తాము సూర్యవంశరాజులమని చంద్రవంశరాజులమని ఇక్ష్వాకువంశరాజులమని చెప్పుకొని యుండిరిగాని పల్లవుల వలె బ్రహ్మవంశజులమని చెప్పుకొనియుండలేదు. చోళులు సూర్యవంశజులమని చెప్పుకొని యుండిరి, పాండ్యులు చంద్రవంశజులమని చెప్పుకొని యుండిరి. కేరళులు తాము సూర్యవంశజులమని చెప్పుకొనిరి. చాళుఖ్యులు చంద్రవంశజులమనిరి. రాష్ట్రకూటులు అట్లే చెప్పిరి. మరియువీరలు పురాణకాలమున ప్రసిద్ధిగాంచిన పౌరాణిక రాజుల నుండి తాము జన్మించితిమని కూడ చెప్పుకొని[9] యుండిరి. మనువును, ఇక్ష్వాకును, మాంధాతను, ముచికుందుని, శిబిని తమ పూర్వులుగా చోళరాజులు చెప్పుకొనిరి. తమ వంశము పురూరవ చక్రవర్తి నుండి ప్రారంభమైనదని పాండ్యులు చెప్పుకొనిరి. సగరుడు, భగీరధుడు, రఘువు, దశరధుడు, రాముడు తమ పూర్వులని చేరరాజులు చెప్పుకొనిరి. చాళుక్యులును చంద్రవంశరాజులులను బెక్కండ్రను బేర్కొనిరి. రాష్ట్రకూటులు యదువంశజులమనియు సాత్యకి సంతతి వారమనియు జెప్పుకొనిరి. పశ్చిమగాంగులు తమది చంద్రవంశమనియు పురూరవుడు, ఆయువు, నహుషుడు, యయాతి, దుర్వసుడు తమ పూర్వులనియు జెప్పుకొనియుండిరి. తలకాడులోని పశ్చిమగాంగులు తమది సూర్యకులమనియు ఇక్ష్వాకుడు తమపూర్వుడనియు జెప్పుకొనియుండిరి. పల్లవ వంశమున బౌరాణిక రాజులలో నొక్కని పేరు మాత్రము గానంబడుచున్నది. అశోకవర్మ పల్లవుని గొడుకని చెప్పబడియున్నది. సూర్యవంశజుడగు అశోకచక్రవర్తి పేరే అశోకవర్మగా మార్పబడి యిందు చేర్చబడినదని డాక్టర్ హాల్‍ట్‍జ్(hultzseh)గారూ హించినది సరియైనదిగా నున్నది. [10] [11] [12] ఇట్లు పాండ్యచోళకేరళాదు లవలింబించిన పద్ధతికి విరుద్ధమైన పద్ధతి నవలంబించి వారలకు ప్రబలశత్రువులుగ నుండుట చేత పల్లవులు విదేశస్థులయిన జాతిలోని వారనియును పాండ్యచోళకేరళాదు స్వదేశస్థులయిన స్వజాతీయులలోని వారనియు రావుబహదూరు వెంకయ్యగారు వ్రాయుచున్నారు గాని పాండ్యచోళకేరళాదులు వెంకయ్యగారు తలంచుచున్నట్లుగా మొట్టమొదటి త్రివిష్టప (Tibet)ప్రాంతదేశముల నుండి వచ్చిన వారని నాలుగవ ప్రకరణమందు వ్రాసి యుంటిమి. కాబట్టి పల్లవులు విదేశస్థులయినచో పాండ్యచోళాదులును విదేశస్థులుగా చేసి పరిగణింప బడవలయును. పాండ్యచోళాదులు స్వదేశస్థులయిన స్వజాతీయులుగా బేర్కొనబడినప్పుడు పల్లవులను గూడ స్వదేశస్థులయిన స్వజాతీయులుగానే పేర్కొనవలసి యుండును.[13] పల్ల వులయినను పాండ్యచోళులయినను మఱి యెవ్వరయినను మొదట వారెక్కడ నండినను దక్షిణాపథమునకు వచ్చి యిచ్చటి భాషలను, ఇచ్చటి మతముల నవలంబించి దేశస్థులలో గలసిపోయిన వారగుట చేత స్వదేశస్థులుగా బరిగణింపబడవలసిన వారగుచున్నారు.

అశ్వత్థామ వంశమనుటకు గారణము.

పల్లవులకును, పాండ్యులకును గర్భశత్రుత్వముగలదు. పాండ్యులు తాము పాండవులసంతతి వారమని చెప్పుకొన మొదలు పెట్టిన నాటనుండియు బల్లవులును తమ పూర్వులు భారద్వాజ గోత్రులమని చెప్పుకొని యుండుటచేతను, పాండవుల బంధుపుత్రమిత్రవారమును నిర్మూలము చేసిన వాడశ్వత్థామయగుటచేతను, భారతమునందు నశ్వత్థామ ద్రోణపుత్రుడుగను భారద్వాజుని మనుమడుగను జెప్పబడియుండుటచేతను, ఆశ్వత్థామ పాండవ బలముల నిర్మూలమును చేసినట్లుగ బాండవుల సంతతివారయిన పాండ్యుల బలమును అశ్వత్థామ సంతతి వారయిన పల్లవులు నిర్మూలము చేయగలరని సూచించున దగుటచేతను, అశ్వత్థామకు బల్లవుడు జనించెననియు, ఆ పల్లవుని వంశమునందే తాము జన్మించుటచేత తమది పల్లవవంశమని చెప్పుకొనుచుండిరిగాని నిజముగా నశ్వత్థామకు జనించిన పల్లవుని వంశజులైనయడల నయదార్థములును వ్యత్యస్తములును నగువిషయములను వంశచారిత్రములందు జెప్పుకొనకయే యుందురు. అశ్వత్థామ బ్రహ్మచారియని మహాభారతమునుబట్టి మన మెఱుంగుదుము. అశ్వత్థామకు భార్యలేదుగనుక నప్సరసనొకదాని ముడివెట్టిరి. పల్లవులు బ్రాహ్మణులనాదరించి పోషించిరి. పాండ్యులు మొదటజైనమతావలంబికులుగ నుండిరి. తరువాత శైవులయరి. వీరు బ్రాహ్మణులుకు బ్రతిపక్షులుగ నుండిరి. కనుక బ్రాహ్మణులు తఱుచుగా బల్లవులపక్షమున నుండుచువచ్చిరి. పల్లవుల శాసనములను వ్రాసినవారు బ్రాహ్మణులే. తమ పక్షమునుబూని తమ్మునాదరించుట కొఱకు వారిని బ్రహ్మకులమని, భారద్వాజ గోత్రులని, అశ్వత్థామ సంతతియని పల్లవరాజవంశమని వారలకుల్లాసముగలుగునట్లుగా బొగడి యిట్టివెన్నియే గల్పించి వార లను వశపఱచుకొనిరి. బ్రాహ్మణులు తమ కార్యములను సాధించుకొని లాభమును బొందియుందురు. అశ్వత్థామ యాగ్రహము జూసి విజృంభించినతోడనే భీమార్జునకృష్ణులు భయంపడి పిఱికి పందలై యాయుధములను విడిచిపెట్టి చేతులు జోడించుకొని నిలంబడిరని కాసకుడి తామ్రశాసనమునం దశ్వత్థామ పరాక్రమము వర్ణింపబడినది. ఇట్టివర్ణన పల్లవులను సంతోషపెట్టుటకు గాక మఱియెందులకు?

పార్థియనులే పహ్లవులు.

పహ్లవశబ్దమునుండి పల్లవశబ్దమేర్పడినదని కన్పట్టుచుండగా పార్థియను శబ్దముయొక్క వికృతరూపమె పహ్లవమని విశ్వసింపబడుచున్నది. హిందూపార్థియనులు పహ్లవులని భాండార్కరు గారు నుడువుచున్నారు. పార్థియనులు క్రీస్తునకు బూర్వము 161 వసంవత్సరమున కాబూలుకనమలో స్థిరవసతులేర్పఱచుకొనిరని కన్పట్టుచున్నది. [14] [15] పార్థివులు కౌశికులులోనొక శాఖవారుగనున్నారు. వీరు విశ్వామిత్రునియొక్క సంతతిలోని వారు. పహ్లదపుర స్తంభము మీది శాసనములో శిశుపాలుడను రాజుపార్థివ రక్షకుండను బిరుదును గలిగియున్నట్లు వ్రాయబడినది.[16]

తొండైయారులు.

పల్లవులు తొండైయారులని ద్రవిడభాషాగ్రంథములలో బిలువబడినట్లుగా గన్పట్టుచున్నది. పల్లవరాజు "తొండైమాన్" అని పిలువంబడి యుండెను. ఎనిమిదవశతాబ్దమున పల్లవదేశము తుండకవిషయమని పిలువంబడియుండెను. ఈ నామోత్పత్తి యెట్లు గలిగినదో స్పష్టముగ దెలియరాదు. మొదటితొండై మానురాజు నాగ స్త్రీకిని చోళరాజునకు రహస్యముగాబుట్టిన (జారజుడు) కొడుకని గాథకలదు. ఈజారజుడయిన చోళరాజ కుమారునకు నొసంగబడిన దేశముయొక్క మొదటినిజమైనపేరు తొండయనికూడ సూచింపబడియెను, తొండారమండలమనుగా బానిసలదేశము. ఆయినను ఈ కథ పల్లవుల నిజస్థితిని దెలుపజాలకున్నది. నెడముడిక్కిళ్లి యను చోళరాజొకడు తన రాజధానీనగరముగు కావీరిపద్దినములోని యువవనములోనొక నాగకన్యకను గలిసికొనియెనని చెప్పబడినది. ఆమె పేరు పాలవలై యనునది. వలైమానను నాగరాజుయొక్క కొమార్తె. నాగరాజకుమారిక వలన జోళరాజునకు బుత్రుడు జనించెను. అయినను కాంచీపురదేశమే రాజకుమారునకొసంగినట్లుగ నిచ్చటనేమియు నుదాహరింపబడలేదు. కాబట్టి యాకథపైకథకు విరుద్ధముగాగన్పట్టుచున్నది. ఈ కథలు శాసనములలో నెచ్చటనుగనరావు. కాని గాంగపల్లవుడయిన స్కందశిష్యవిక్రమవర్మయొక్కరాయకోటశాసనములో గొంచెము సూచనగలదు. మఱియే శాసనమునందును వినరావు.

కురుంబాలుపల్లవలా.

సర్ వాల్టర్ ఎలియాట్ గారి యభిప్రాయము ప్రకారము ద్రావిడదేశములో విశేషభాగమునకు పూర్వము కురుంబభూమియని పేరుగలదు. ఈ ద్రావిడ దేశముయొక్క దూర్పుభాగము చోళులచేత జయింపబడినమీదట తొండైమండలమని పిలువంబడుచుండెను. ఇదికురంబాలవలన 24 కొట్టములుగా విభాగింపబడినది. కరికాలుడనుచోళరాజు కురుంబాలను జయించినవాడని చెప్పబడియెను. ఈ కురుంబజాతి యేశాసనమునందు నుదాహరింపబడి యుండలేదు. వరాహమిహిరాచార్యుని బృహత్సంహిత యందయిన నుదాహరింపబడియుండలేదు. వారలు యదువంశజులనియు, జైనమతావలంబికులనియు స్థానిక చారిత్రములందు మాత్రము పేర్కొనబడిరి. పల్లవులు తప్పకకురుంబాలని నిశ్చయింపవలనగాదు. ఎల్లియాట్ గారు కొన్ని నాణెములను కురుంబాలవనియు కొన్ని నాణెములను పల్లవులవనియు నిర్ణయించియున్నారు.

తుండకవిషయమె దండకనాడు.

తొండైమండలమనుపల్లవదేశమునకు నుత్తరమున తిరుపతి కాళహస్తి పర్వతములును, దక్షిణమును పాలేఱును, పడమటిఘాట్టు (గట్టు) లని తొండైమండల శతకమున జెప్పబడియెను. అన్యవిరచితమైనదని చెప్పు నొక పద్యములోను త్తరమున వెంగడమనియు (తిరుపతి) దక్షిణమున పినగైయను నదియు తూర్పున సముద్రమును, పశ్చిమమున దూర్పుకనమలనియు జెప్పబడియుండెను. తొండైమండలము దండకనాడుయొక్క రూపాంతరముగ గన్పట్టుచున్నది. దండకనాడనునది దండకారణ్యమును సంస్కృతమునుండి యేర్పడినిదిగ గన్పట్టుచున్నది.[17] [18]

పల్లవులాంధ్రులలోని వారెగాని యన్యులుగారు.

పల్లవులనుగూర్చి యెవ్వరెవ్వరెట్లెటు భావించినదియు గొంతవరకు దెలిపియుంటిమి. పల్లవులు తమిళజాతులలోని వారెంతమాత్రమును గారనియు, ఆంధ్రులలో నొక తెగవారనియును కొందఱి యభిప్రాయమైయున్నది. విన్సెంటు స్మిత్తుగారు తమ దక్షిణహిందూదేశచారిత్రమునందు బల్లవులనుగూర్చి కొంచెము వ్రాసియున్నారు గావున వారి యభిప్రాయమునొకించుక నీక్రింద నుదహరించుచున్నారము.

"పల్లవనామము పహ్లవనామము బోలియుండుటచేత డాక్టరు ప్లీట్(Dr Fleet) మొదలుగు చరిత్రకారులు పల్లవులు పహ్లవులొక్కరేయని యభిప్రాయపడి కాంచీపురము నేలిన దక్షిణపల్లవ వంశము పారసీకమునుండి జన్మగాంచినదని యభిప్రాయపడుచున్నారు. ఈ గ్రంథముయొక్క మొదటికూర్పునందట్టి యూహసంభవమని తలంచినను నూతన పరిశోధనమీయూహను బలపఱచుచుండలేదు. చెన్నపురి రాజధానికి నుత్తరభాగమున ననగా కృష్ణాగోదావరులకు నడుమనుండిన వేంగిదేశమున నేర్పడిన యొకతెగవారని గన్పట్టుచు న్నది. ద్రవిడరాజ్యములతో బల్లవులకు గల విడువని శత్రుత్వమును,పల్లవులకిదియని నిర్దేశింపదగిన దేశములేకుండుటయును, పల్లవులు తమిళులకంటె భిన్నమైన జాతివారనుటకు సంజ్ఞలుగానున్నవి. దక్షిణభాగమునంతయు నాక్రమించిన పాండ్యచోళ చేరరాజుల పైని వారియధికారమధికముగా గూడ విధింపబడుచువచ్చెను. పల్లవులు పదునెనిమిదవ శతాబ్దములోని మహారాష్ట్రులవలె గొల్లపెట్టెడుదోపిడి కాండ్రతెగగానుండి క్రమముగా స్వబలముచేత చోళరాజ్యము పై సంపూర్ణముగను, తక్కిన వానిపై గొంతవఱకును నధికారమును బూనియుండిరని మనమూహింతుమేని నింతవఱకు దెలియం బడిన విషయములా యూహకు సరిపోవునని తలంచెదను."

పల్లవులు దారిదోపిడికాండ్రతెగవారని యూహించుటకు హేతువు గానరాదు.వీరలు కృష్ణా గోదావరులకు నడుమ వేంగిదేశమునగాని మఱియేభాగమునగాని యాంధ్రదేశమునం దేర్పడిన యొక తెగవారనుట వాస్తవము. రెండవశతాబ్దమునుండి పల్లవరాజు లాంధ్రదేశమును బాలించుచుండిరని వారిశాసనములే వేనోళ్ల ఘోషించుచున్నవి. ఈ విషయమును జరిత్రకారులందఱు నంగీకరించి యున్నారు. ఈ తెగ యెట్లేర్పడనదను విషయములో మాత్రము చరిత్రకారులు భిన్నాభిప్రాయాలయి యున్నారు. పల్లవులు దారిదోపిడికాండ్ర తెగయనుటకంటెను పహ్లవులు పల్లవులయిరని యూహించుటకే హేతువు లెక్కువగ గానవచ్చుచున్నవి. పహ్లవుల ప్రదేశములు కందహారము, పెయిస్తాన్నులలో నేర్పడి గాండఫరేసు పరిపాలనములో అనగా క్రీస్తుశకము 20 దవసంవత్సరమునకును 60 దవ సంవత్సరమునకును నడుమ పంజాబుయొక్క పశ్చిమభాగమునకును సింధునది ప్రవహించు పల్లపు భూములకును వ్యాపించెను. [19] సింధూనది ప్రవహించు పల్లపుప్రదేశములు పార్థియనుల స్వాధీనములో నున్నవనియు, తమలో దాము పార్థియునులు పోరాడుకొనుచుండిరనియి క్రీస్తుశకము 80 దవసంవత్సరమున రచింపబడిన పెరిప్లస్సను గ్రంథమునుబట్టి తెలిసికొనుచున్నాము.[20] ఈ కాలముననే పహ్లవులలో శకనులకో సంబంధించిన క్షాత్రపులు సురాష్ట్రమాళవదేశములను వశముచేసికొని పాలించుచుండిరని మనమిదివఱకే తెలిసికొనియుంటిమి. ఈ కాలముననే యాంధ్రదేశమునుజొచ్చి యవనశక పహ్లవాదులు కల్లోలము బుట్టించిరనియు, ఆంధ్రుల స్వాధీనమందుండిన మహారాష్ట్ర దేశము సురాష్ట్ర క్షాత్రపులచే జయింపబడి యాక్రమింపబడినదనికూడ దెలిసికొని యుంటిమి. రెండవశతాబ్దప్రారంభము నందనగా 130 దవ సంవత్సరప్రాంతమున గోతమీపుత్రశాతకర్ణుడను నాంధ్రరాజు యవనశకపహ్లవాదులనోడించి సురాష్ట్ర క్షాత్రపుడగు క్షహరాటవహపానువంశమును నిర్మూలము చేసి తనపూర్వులు గోల్పోయిన రాజ్యమును మరల సంపాందించుటయెగాక శాత్రవభూములనుగూడ నాక్రమించెనని కూడ దెలిసికొని యుంటిమి. అంతకు బూర్వమాంద్రదేశమునకు వచ్చియుండిన యవనశక పహ్లవాదులు శివస్వాతికర్ణుడు గోతమిపుత్రశాతకర్ణుడు మొదలగు నాంధ్రరాజులయొక్క పరాక్రమమునకు నిలువంజాలక వశులైరనియు అదివఱకె విశేషముగా మార్పుజెందియుండిన యవనశకపహ్లవాదులు దేశమున స్థిరనివాసము లేర్పఱచుకొని దేశాచారమతాచారము లవలంబించి దేశీయులతో సంబంధబాంధవ్యముల నెఱపుచు గ్రమముగా దేశీయులలో గలిసిపోయి పల్లవులను తెగగా నేర్పడిరనియు వీరు మొదట నివసించిన ప్రదేశము పల్లవవాడయినదనియు అదియె యిప్పుడు పల్నాడను పేరబిలువంబడుచున్నదనియునుగూడ దెలిసికొనియుంటిమి. పహ్లవులు హిందూమతముల నవలంబించి హిందూనామములనలంకరించుకొనుచుండి రనుటకుగూడ శాసనములనుండి ప్రమాణవాక్యముల నెత్తిచూపవచ్చును. క్రీస్తుశకము 140 దవ సంవత్సర ప్రాంతమున మాళవదేశమును బరిపాలించుచుండి మహాక్షాత్రాపుడగు రుద్రదాముడు వ్రాయించిన జనగడ శాసనమునందు వాని మంత్రి సువిశాఖుడనువాడు పహ్లవుడుగా బేర్కొనబడియున్నాడు. [21] ఈ సువిశాఖుడు కేవలము మంత్రిమాత్రమెకాడు. రెండుపరగణాలకు బరిపాలకుడుగ నున్నవాడు. రుద్రదాముడు యజ్ఞ శ్రీశాతకర్ణినో వాసిష్టీపుత్రశాతకర్ణినో రెండుసారులు జయించెనని కూడా జెప్పబడియుండెను. ఈ క్షాత్రపులకు నాంధ్రులకు సంబంధ బాంధవ్యములు గలవని శాసనములు చాటుచున్నవి. రుద్రదాసుడు తన కుమార్తెను నాంధ్రరాజునకిచ్చి వివాహం చేసినట్లుగా శాసనముల బేర్కొనంబడియెను. కాబట్టి వీనినన్నింటిని పరిశీలించి చూచినప్పుడు పహ్లవులు దేశాచారమతాచారముల నవలంబించి దేశీయనామములనే ధరించి పల్లవులై యాంధ్రులకు క్షాత్రపులకు నూడిగములు సలుపుచుండి క్రమముగా సేనాధ్యక్షులుగాను మంత్రులుగా నేర్పడి రాజకుటుంబముతో సంబధబాంధవ్యములు నెరపుచు ప్రధాన రాజకుటుంబము బలహీనమై రాజ్య భారమును నిర్వహించజాలని కాలమున స్వతంత్రులై స్వతంత్రరాజ్యములు నెలకొల్పిరని యూహింపదగియున్నది. స్వదేశమును స్వమతమును మరచి పోయి హిందూమతములను బూని హిందూనామములను బెట్టుకొని వ్యవహరించుచు బహుకాలమునకు వెనుక నాంధ్రదేశమునకు వచ్చి వర్ణాశ్రమధర్మములంతగాబాటింపబడని కాలమున నొకశతాబ్దమువరకు నాంధ్రులనబడుచు నివసించుచుండి సంబంధబాంధవ్యముల నెరపుచుండిన వారాంధ్రులుగా గాక మరిఎవ్వరుగా బరిగణింపబడ వలసినది?

ఆంధ్రులనక తప్పదు. ద్రావిడదేశమునందలి కాంచీపురమును జయించి పరిపాలించినది యాంధ్ర పల్లవులుగాని పహ్లవులుగారు.కాంచీపురమునందు కట్టకడపట స్థిరముగా నిలిచిపోయినది యాంధ్రపల్లవులలో ఒక శాఖ వారుమాత్రమే గాని కొందరు తలంచునట్లు పల్లవులందరుగారు. ఇప్పటివరకు దొరికిన శాసనములను బట్టిచూడగా మొదటి పల్లవరాజు శివస్కందవర్మగా గానంబడుచున్నాడు ఇతడే మొదట కాంచీపురమునుండి శాసనములం బ్రకటించినవాడు "ఇతడాంధ్రుడా ? పల్లవుడా ? ఏకాలపు వాడు?" అనువిషయములను చర్చించి తెలుసుకొనవలసి యున్నది.

- - -<>- - -

  1. మనుధర్మశాస్త్రము, అధ్యాయము. 10 శ్లో. 44
  2. టి క్రిష్ణమాచారి, వ్యాసాచార్యులు గార్లచే ముద్రింపబడుచుండిన సంస్కృత మహాభారతములో పహ్లవశబ్ధమునకు బదులుగా పల్లవ శబ్ధమే గ్రహింపబడినదనియు, దక్షిణ హిందూదేశములోని వ్రాతపతునలను బట్టి తామా గ్రంధమును బరిష్కరించి ముద్రించుచున్నారమని సంపాదకులు తమతో జెప్పినట్లుగ రావుబహదూర్ వి.వెంకయ్య ,ఎం.ఎ గారు వ్రాయుచున్నారు.
  3. పాశ్చాత్యుల (అనగా యవనుల గడ్డములను గూర్చి కాళిదాసు గూడ తన రఘువంశము చతుర్ధసర్గమున 63వ శ్లోకమున బ్రశంశించి యున్నాడు.
  4. Muir Sanskrit Texts Vol. II. p. 259, and Indian Antiquary Vol. IV, p.;66
  5. రఘువంశము సర్గము 4 శ్లో 56 మొదలు 64 వఱకు
  6. South Indian Inscriptions Vol. I, p.152; Ibid Vol. II.p.370.
  7. Ibid Vol.II, p.355.
  8. Ibid Vol.I.p.27
  9. Ep.Ind. Vol. 5 text 2; line Vol. VIII p.145, text:line 2 and Vol VI.p.86 text line 2.
  10. Ind. Ant, Vol .XVIII p.170
  11. Mr. Rice's Mysore Gagetteer Vol. I, pp.308;
  12. South, Ind. Ins, Vol II, p. 342;
  13. Arch. Sur.Annual Report,1906-1907
  14. Bombay Gazetteer Vol I.part II,, p. 317f. and Ind Ant, Vol. X-p 224.
  15. Ind. Ant,Vol XVIII, b. 126.
  16. Dr. Fleet's Gupta Inscriptions p.250; See his article entitled "A peep into the Early Historyof India" published in the B. B. R. A. S. Vol xx, pp. 356 to 408.
  17. Taylor's Catologue Vol.Ill, p, 29.
  18. Bombay Gazetteer Vol.I, part p. 319.
  19. Prof. E. J. Rapsou's Indian Coins p. 15. Mr Smith's Catologue of Coins in the Indian Meusium, Calcutta p.36,
  20. Ind. Ant, Vol viii, p. 338.
  21. Ep. Ind, Vol. VIII, p.49.