ఆంధ్రుల చరిత్రము - ద్వితీయ భాగము/అవతారిక

అవతారిక

“క. వినదగు నెవ్వరు సెప్పిన
వినినంతనె వేగపడక వివరింపదగున్
కని కల్ల నిజము దెలిసిన
మనుజుడె పో నీతిపరుడు మహిలో సుమతీ”

జనాదరము

చిన్ననాటనుండియు దేశచరిత్రమునం గల యభిరుచిచేత దానినే యభిమాన విద్యగా నభ్యసించి దేశాభిమానము నన్ను బురికొల్ప నస్మద్ధేశ చరిత్రమును మాతృభాషలో వ్రాసి భాషాసేవయు దేశసేవయు సలుపవలయునన్న సంకల్పముదయించిన మాత్రాన సామర్థ్యాసామర్థ్యముల నించుకయు నాలోచింపక బుద్ధిచాపల్యమును మరల్చుకొనలేక యిక్కార్యమును నిర్వహింప సమర్థులగు విద్యాధికులుపేక్షాపరులై యుండుటచేత నేమయిన గానిమ్మని సాహసించి చరిత్ర రచనకుం గడంగి శ్రీ విజ్ఞాన చంద్రికా మండలివారి యనుగ్రహంబునంజేసి రెండేండ్లనాడు ప్రథమభాగమును బ్రకటించగలిగితిని. తలపెట్టిన కార్యము ప్రాథమిక మగుటచేతనో, కష్టసాధ్యమని యెరింగియుండుటచేతనో, కేవలము నా యెడల గల వాత్సల్యాతిశయము చేతనో, నా గ్రంథమునందలి దోషములను బరిగణింపక గుణములనే గ్రహించి నా యుద్యమమును ఘనముగా శ్లాఘించి యాంధ్రభాషాపత్రికలు నాకత్యంతమును ప్రోత్సాహమును గలిగించినవి. ప్రథమభాగముయొక్క ద్వితీయ ముద్రణ పీఠికలో నా పత్రికాధిపతులకెల్లరకు నా కృతజ్ఞతను దెలుపుకొనియుంటిని.

జయంతి రామయ్యగారి జాబు

అప్పుడు డిప్యూటీకలెక్టరు హోదా వహించియుండి ఇప్పుడు చెన్నపురిలో నాలుగవ ప్రెసిడెన్సీ మేజిస్ట్రేటుగా నున్న శ్రీజయంతి రామయ్య పంతులు బి.ఏ., బి.ఎల్., గారికి నా గ్రంథమును బంపుకొనగా గ్రంథస్వీకారమును జేసిన విషయమును మూడు మాసములకు వెనుక నీ క్రింది జాబు మూలమున దెలిపియున్నారు.
Naidu Peta
Nellore
28.8.1910
Dear Sir,
Please allow me to thank you heartily for the copy of your ఆంధ్రులచరిత్ర which I shall read with great interest. I am more than ordinarily interested in the subject matter of your book, being fellow-worker in the same field.
I received your book some time ago but could not acknowledge in immediately not knowing your correct address. I am now writing in the hope of this letter finding you.It is a happy sign of the times that young men of your type are coming forward to study and expand the past history of their mother land.
Yours very truly
(Sd.) J.Ramayya.
(ఆంధ్రులచరిత్రమును నాకు పంపినందులకు నేను మీకు హృదయపూర్వకముగా వందనము చేయుచున్నాను. నేను మిక్కిలి సంతోషముతో దానిని బఠించెదను. ఒకే కృషియందు మీవలె నేనును పాటుపడుచున్న వాడనగుటచేత మీ గ్రంథములోని కథాంశమునందాసాధరణమైన శ్రద్ధ గలవాడనై యున్నాను. కొంతకాలము క్రిందటనే మీ గ్రంథము నాకు చేరినది కాని మీ సరియైన చిరునామా నాకు తెలియనందున వెంటనే గ్రంథస్వీకరణమునుగూర్చి మీకు తెలుపలేదు.
ఈ జాబు మీకు చేరునన్న యూహతోనిపుడు వ్రాయుచున్నాను.
తమ మాతృదేశముయొక్క పూర్వచరిత్రమును బఠించి విస్తరింపజేయుటకు మీవంటి యౌవనవంతులు ముందుకు వచ్చుట కాలముయొక్క శుభచిహ్నమని చెప్పదగియున్నది.)
శ్రీ రామయ్య పంతులు గారు వ్రాసిన పై జాబు నాకు వెంటనే చేరగలిగినందుల కెంతయు సంతసించితిని. ఈ చరిత్రమును మిక్కిలి సంతోషముతో బఠించెదనని వ్రాసినందులకు నేనును మిక్కిలి సంతసించితిని. తరువాత రెండుమాసములకు జెన్నపురిలో ప్రెసిడెన్సీ కాలేజీ భవనమున నన్నయభట్టారకుని వర్ధంతి మహోత్సవము జరుగుటకు బూర్వమా కాలేజి భవనమున వారి దర్శనము లభించెను. అట్టి ప్రథమ సందర్శన కాలమున జరిగిన సంభాషణములో బంతులుగారు చరిత్ర మింకను జదువవలెనని ముచ్చటించిరి. అనంతరమనేక సందర్భములలో వారితో గలిసి సంభాషించుట సంభవించినను ప్రథమ చరిత్ర గ్రంథమును గూర్చిన ప్రశంస వచ్చియుండలేదు. ఏయే చరిత్రాంశముల నాతో నేకీభవింతురో ఏయే చరిత్రాంశముల నాతో నేకీభవింపరో తెలిసికొనవలయున్న యపేక్ష గలిగియుంటిని గాని యెప్పుడును గ్రంథమును జదివినట్లు చెప్పియుండనందున నట్టి యపేక్షను వదలుకొని మిన్నకుండవలసినవాడనైతిని.

ఆంధ్రపత్రిక యొక్క రెండవయుగాది సంచిక

ఇట్లుండ ఆంధ్రపత్రిక యొక్క రెండవ యుగాది సంచికలో “ఆంధ్రభాషామహాసంఘ”మను శీర్షికతో రామయ్య పంతులు గారు వ్రాసినయొక చిన్న వ్యాసము ప్రకటింపబడియెను. ఆంధ్రులచరిత్రమును గూర్చి యందిట్లు వ్రాయబడినది.
“సమగ్రమును, సప్రమాణమునగు నాంధ్రదేశచరిత్రము వ్రాయుట మిక్కిలియగత్యము. అట్టి గ్రంథములు ప్రస్తుతము బొత్తిగా లేవు. కాని చరిత్ర వ్రాయుటకు గావలసిన సాధనములనేకములు గలవు. సర్వజ్ఞుడగు నీశ్వరుని సంకల్పమువలన మన పూర్వకవులు ప్రాయశఃనిర్ధనులై తమతమ కాలములందుండిన భూపతులను వారి మంత్రులు మొదలుగా గల ఇతర ధనవంతులను నాశ్రయించి వారిని తమ కృతులకుబతులుగా నొనర్చుటయు నట్లు చేయునప్పుడా కృతిపతులను వారి పూర్వులను స్తుతించుటయు సమకూరినవి. ఈ స్తవములలో నతిశయోక్తుల క్రింద గొంతభాగమును గొట్టివేసినను చరిత్రోపయోగములగు నంశములు గలవు. కృతులయందు బహుశః కాలనిర్ణయము లేదు. కాలనిర్ణయము కలిగి యితర విషయములలో గృతుల బోలియున్నవి తామ్రశిలాశాసనులు. మరియు నీ శాసనములు, తొలుత లిఖించబడినవె కాని వాటి ప్రతులు కాకయుండుటబట్టి పరమప్రమాణములుగా నంగీకరించపదగియున్నవి. ఇట్టి శాసనములు వేలకొలది గలవు. శాసనములు, కృతులు, పురాణములు మొదలగు సాధనములను సావధానముగా నిష్పక్షపాత బుద్ధితో బరిశీలించినయెడల దేశవృత్తాంతము చాలావరకు దేలును. తేలినప్పుడు ప్రస్తుతము పలువురనుకొనునట్లు మన దేశము పూర్వకాలమందంధకారబంధురమగు ప్రాకృతస్థితిలో నుండినది కాదనియు, నాయా కాలములయం దసాధారణ ప్రజ్ఞావంతులును లోకహితైక పరాయణులునగు మహాపురుషులుండిరనియు, నట్టి మహనీయుల వంశమునందు బుట్టిన తమ భాగ్యమనల్పమనియు, బ్రతియాంధ్రునకు దోచుటయెగాక యుత్తర రామచరిత్రలోని ఈ క్రింది పద్యముయొక్క భావమెంతమందుని డెందమునకయిన బోధ కలుగక మానదని చెప్ప సాహసించెదను.
శ్రీరాముడు :-
"చం. అలఘుత రార్క వంశకలశాబ్ధి శశాంకులు సర్వలోకపూ
జ్యులు నగు పార్థివుల్ తమ నిశబ్ధ చరత్రముచేత బండు వె
న్నెల గతి లోకమెల్లెడల నింపిన తోరపు కీర్తికియ్యెడన్
గలుష మొకింత నావలన గల్గినచో నిక నన్ను గాల్పనే"

రావుసాహెబ్ కృష్ణశాస్త్రి, బి.ఏ., గారి అభిప్రాయము

చెన్నపురి రాజధానిలో దొరతనమువారి శాసనపరిశోధకులుగానున్న రావుసాహెబ్ హెచ్.కృష్ణశాస్త్రి, బి.ఏ., గారు నాచే రచింపబడిన కృష్ణదేవరాయచరిత్రమును గూర్చి 1911వ సంవత్సరము జూను 20వ తేదీని నాకు వ్రాసిన జాబులో ఆంధ్రులచరిత్రమును గూర్చి వారి యభిప్రాయమీక్రింది వాక్యములలో దెలిపియున్నారు. “Already from your Andhracharitramu a copy of which was kindly made over to me for perusal by the Hon'ble Mr.N.Subba Rao Pantulu. I had come to judge of your beautiful style, correctness of statements and laborious research as being eminently fixed for the sort of work that you have undertaken to do”

(మాననీయులైన ఎన్.(న్యాపతి) సుబ్బరావుపంతులు గారి వలన మీ యాంధ్రులచరిత్రము యొక్క ప్రతి యొకటి పరిశీలనార్థము నా కొసంగబడినందున మీయొక్క చక్కనిశైలియు, యదార్థకథనమును, విశేషపరిశ్రమతోడి పరిశోధనయు చూడ మీరు పూనినటువంటి పనిని నిర్వహించుటకు మీరు మిక్కిలి తగియున్నారని తలంచియే యుంటిని) కృష్ణశాస్త్రిగారితో నాకు పరిచయము లేకపోయినను, ఆంధ్రులచరిత్రముయొక్క ప్రతిని వారికి పంపకపోయిన దోషము నాయందున్నను, నేను కోరియుండకపోయినను నా గ్రంథమును జదివిన మీదట వారికి కలిగిన యభిప్రాయమును ఆదరపురస్సరముగా దెలిపినందుకు వారికి నా కృతజ్ఞతావందనములను దెలుపుకొనుచున్నాడను.

ఇతర విద్యాధికులయభిప్రాయములు.

ఇతర విద్యాధికులనేకులనుకూలాభిప్రాయము లొసంగి యనేక విధములుగా బ్రోత్సాహమును గలుగజేసియున్నారు. వానినన్నిటిని గ్రంధవిస్తరణభీతిచే నిందుదాహరించుటమాని నెల్లూరులో న్యాయవాదులుగా నున్న శ్రీయుత వంగోలు వేంక టరంగయ్య పంతులు బి.ఏ., బి.ఎల్., గారు పంపిన యభిప్రాయమును మాత్రమీ క్రింద నుదాహరించుచున్నాను. "విజ్ఞానచంద్రికామాలియక యందు తాము చేర్చిన నాయకమణిగా నొప్పెడి యాంధ్రులచరిత్రము జదివితిని. మీ విమర్శ విస్తృతియు, పరిశీలనానైపుణ్యమును కడు శ్లాఘనీయములుగనున్నవి. తెలుగుబాస నిదివరకు ప్రాయశః సాహిత్యమూలము లగు కావ్యములును కాదాచిత్కముగ వైద్యముననొండె ధర్మవిషయమున నొండె రాజవంశచరిత్ర ప్రస్తుతి మెండె గ్రంథములుండినవి కాని భాషాంతరాపేక్ష లేక మన యూర మన యింట గూర్చుని మన మాతృభాషలో సకల శాస్త్రేతిహాసాది విషయపరిచయముం బొందగలిగిన యవకాశము యుష్మదాదులగు దేశికుల మూలమున నాంధ్రప్రపపంచమునకు సమకూడుచున్నది`` ఈ రీతిగా బరిచయములేని విద్యాధికులనేకులు నా చరిత్ర గ్రంథమును చదివి నేను కోరియుండకపోయినను నాకు తెలియజేసినందులకు నా కృతజ్ఞతావందనములను దెలుపుకొనుచున్నాడను. ఇట్లు దొరతనము వారి శాసనపరిశోధకులు, ఇతర విద్యాధికులు, ఆంధ్రపత్రికాధిపతులు సదభిప్రాయములొసంగియుండుటచేత నాంధ్రపత్రిక 2వ యుగాది సంచికయందు శ్రీజయంతి రామయ్యపంతులుగారు వ్రాసిన వాక్యములకు, వారి భావములకు నిరుత్సాహపడవలసిన పని లేదని యెంచి యీ ద్వితీయచరిత్రభాగ రచనకు గడంగ సాహసించితిని. ఆంధ్రదేశము పూర్వ మంధకారబంధురమైన దండకారణ్యముగా నుండలేదనియు, ఆ కాలమునందీ దేశమును బరిపాలించుచు సర్వలోక పూజ్యులై తమ విశుద్ధ చరిత్రముచేత దమకీర్తిని లోకమెల్లెడల వ్యాపింపజేసినట్టి యర్కకుల కలశాబ్ధి శశాంకులెవ్వరో వారియుదంతమెట్టిదో వివరించుచు సమగ్రమైనట్టియు సప్రమాణమైనట్టియు స్వహస్తలిఖితమైన చరిత్రమును రామయ్యపంతులు గారాంధ్ర ప్రపంచమునకు గరుణించినయెడల మహోపకారమును జేసినవారగుదురు. అప్పుడా చరిత్రకారుడు తన యభిప్రాయమును మార్చుకొనుటకును సందియము లేదు.

చర్చలు

చరిత్రగ్రంథములలో చర్చలతోగూడిన భాగములుండిన బఠనీయములుగా నుండవని కొందరు చెప్పుదురు. ఇది కొంతవరకు వాస్తవమే కాని చరిత్రము వ్రాయబడకయున్న దేశముయొక్క చరిత్రము మొట్టమొదట వ్రాయునప్పుడు చర్చచేసి సందిగ్ధములుగ నున్న యనేకాంశములను సిద్ధాంతము చేసి స్థిరపరచిన గాని కాలనిర్ణయమునకు యదార్థకథనమునకు విషయవర్ణనమునకు గడంగిన చరిత్రకారుడు పరిహాసపాత్రుడగును. కాబట్టి మొదట వ్రాయబడు గ్రంథము విమర్శలతో గూడియుండక తప్పదు. ఇట్టి విమర్శిత చరిత్ర గ్రంథములు భావికాలపు చరిత్రకారుల కెన్ని విధములనో తోడ్పడగలవు.
సమగ్రము - సప్రమాణము

సమగ్రమును, సప్రమాణమునగు నాంధ్రదేశచరిత్రము వ్రాయుట మిక్కిలియగత్యమె కాని యొక్కసారిగా సమగ్రమును సప్రమాణమునగు చరిత్రము వ్రాయుట సాధ్యముగాదు. ఒకనికి సప్రమాణముగ గన్పట్టినది యింకొకనికి నప్రమాణముగ గన్పట్టుచుండును. ఒక కాలమునందు సమగ్రరమనిపించుకొన్నది మరియొక కాలమునందసమగ్ర మనిపించుకొనును. కాలము గడిచినకొలది, జనసామాన్యమునకు స్వదేశచరిత్రమునందభిరుచి పుట్టిన కొలది, విద్యాభివృద్ధి కలిగిన కొలది, చరిత్ర సాధనములు పెంపొందిన కొలది, చరిత్ర పరిశోధన మభివృద్ధి గాంచిన కొలది, ఉత్కృష్ట మేధావంతులు జనించిన కొలది, దేశచరిత్రము దినక్రమప్రవర్ధమానమై వన్నెగాంచుచుండును. అంతియకాని సమగ్రమును సప్రమాణమునగు చరిత్రమొకనిచే గాని బహుజనులచేగాని యేకకాలమునందు వ్రాయనలవికాదని తెలిసికొనవలయును. ఆంధ్రదేశచరిత్రము వ్రాయుటకు శాసనములు ముఖ్యాధారములు. ఇయ్యవి వేలకొలది కలవు. కొన్ని ప్రకటింపబడినవి. మరికొన్ని ప్రకటింపబడవలసియున్నవి. ఇంకను వేలకొలది ప్రతు లెత్తుకొనబడవలసియున్నవి. వీని నన్నింటిని పరిశోధించి సమన్వయించుకొన వలయును. ఇంకను భావికాలమున శిలాశాసనముల తామ్రశాసనములు బయలుపడి క్రొత్తచరి త్రాంశములను వెల్వరించవచ్చును. అట్లగుటవలన సమగ్రమయినట్టియు, సప్రమాణమైనట్టియు దేశచరిత్రము వ్రాయుటకెవ్వనికి సాధ్యమగును? నాయాంధ్రులచరిత్రము సమగ్రమయినదని నేనెప్పుడును చెప్పియుండలేదు. నేనపేక్షించున దెల్ల జరిత్రజ్ఞులగువారు నా గ్రంథమును జదివి గుణదోష పరిశీలనము చేసి యనురాగముతో నాకు దెలిపి సుకరమైన మార్గమును జూపితోడ్పడవలసియుననియె.

భాగవివరణము

ఈ ద్వితీయ భాగమునందు కొండవీటి పంటరెడ్ల చరిత్రమును గూడ జేర్చుటకు మొదట సంకల్పించింనవాడనైనను, విజ్ఞాన చంద్రికా మండలివారు ద్వితీయ భాగము 400 పుటలకన్నా మించి యుండరాదని శాసించియున్నందున, కాకతీయ చరిత్రము ముగించునప్పటికే 324 పుటలు నిండి యుపోద్ఘాతాదులతో 400 పుటలగుచున్నందున, పంటరెడ్ల చరిత్రమునిందు జేర్చుటకు సాధ్యపడకపోయినది. అదియునుంగాక పంటరెడ్లచరిత్రము విస్తరించి వ్రాయవలసియున్నది కావున దానిని మూడవ భాగములో జేర్చి సాధ్యమయినంత శీఘ్రకాలములో ననగా 5, 6 మాసములలోనే ముద్రింప బ్రయత్నించెదను. కాబట్టి యీ భాగమునందు క్రీ.శ.1100 సంవత్సరము మొదలుకొని క్రీ.శ.1350 వ సంవత్సరమునకు అనగా కాకతీయ చక్రవర్తుల సామ్రాజ్యాంతము వరకును గల చరిత్రము మాత్రమే వ్రాయబడినది.

పరస్పర విరుద్ధాంశములు

ఈ చరిత్రము రెండేండ్ల నుండి వ్రాయబడుచు వ్రాసిన భాగమెప్పటిదప్పుడు ముద్రింపబడుచు వచ్చుటచేత నొక కాలమునం దెలియని విషయములు మరియొక కాలమునం దెలిసికొనుట తటస్థించుట చేత నట్టి విషయములు కడపటి ప్రకరణములలో జేర్పబడుచువచ్చినవి. అట్టి సందర్భములయందు గడపటి ప్రకరణములలోని విషయములే ప్రామాణ్యములుగా నంగీకరింపదగినవని చదువరులకు మనవి చేయుచున్నాడను.

నన్నెచోడ కవి రాజశిఖామణి

నన్నెచోడ కవిరాజశిఖామణి కాలము నేను నిర్ణయించినదే సరియైనదని చెప్పజాలను. శ్రీబుర్రా శేషగిరిరావు పంతులు ఎం.ఏ., గారు పండ్రెడవ శతాబ్దము మధ్య నున్న త్రిభువనమల్ల చోడదేవుని చోడబల్లినిగా భావించి యతని జ్యేష్ఠపుత్రుడైన నన్నెచోడుడే నన్నెచోడకవియని సిద్ధాంతము చేసినారు కాని త్రిభువనమల్లుడు చోడబల్లి కాజాలడు. అదియునుగాక త్రిభువనమల్లుని కొడుకైన నన్నెచోడుని తల్లి మాబలదేవి యని శాసనములం గన్పట్టుచున్నది. కుమారసంభవమున దన తల్లి శ్రీసతియని నన్నెచోడకవి చెప్పుకొనియున్నాడు. కుమారసంభవ కృతపతియైన జంగమ మల్లికార్జునుడు బ్రహ్మచారిగా వర్ణింపబడియె ననియు, నేను పేర్కొనిన గురుమల్లికార్జున పండితారాధ్యుడు గృహస్థుడు కుమారసంభవ కృతిపతి కాజాలడనియు, ఆ జంగమ మల్లికార్జునుడు కాలాముఖి మఠశాసనములో నుగ్గడింపబడెననియు, అతని పేర కుంభకోణములో నొక మఠము కట్టబడినదనియు, అతడు నన్నయభట్టారకునకు బూర్వపువాడనియు, శ్రీయుత మానవల్లి రామకృష్ణకవి ఎం.ఏ., గారు వాదించుచున్నారు. మరియు కుమారసంభవములో

“శా|| భర్గుండంతక వాహనుల్శరహతిన్ భంజించునట్లెమ్మెయిన్
దర్గంగా రథపత్రముల్ విరిగ వేదండాంకురానీకముల్
నుర్గాడన్ భటకోరకంబు లలరన్ నూత్నాశ్వపుష్పౌహఘముల్
మర్గింతున్ బరసైన్యపద్మవనముం మద్బాణవర్షంబునన్"

అను పద్యములో "తర్గంగా, నుర్గాడన్, మర్గింతున్” అని భారతములో లేని ప్రయోగములవంటి ప్రయోగములు గలవనియు,
"క్రౌంచపద వృత్తము :-
చంచుల నాస్వాదించుచు లేదూండ్ల కరువు ప్రియలకు నలరుచు మైరో మాంచలములొలింగంచుకితంబై వొడమగ నడరుచు బులినమూలం డించుచు సంభాషించుచు బ్రీతిబొలుచుచు జెలగుచు బొలయు సముద్య
త్ర్కౌంచగతులు వీక్షించుచు భాస్వజ్జ్వలనుడు శరవణసరసికి వచ్చెన్ ”<br?>

అను వృత్తము భారతములోని క్రౌంచపదవృత్త లక్షణమునకును, కవిజనాశ్రయము, లక్షణసారము మొదలగు లక్షణగ్రంథములలో నుదాహరింపబడిన క్రౌంచపదవృత్త లక్షణమునకు విరుద్ధ లక్షణము కలిగియున్నదనియు, నన్నయకు బూర్వము కర్నాటకభాషలో నిట్టి క్రౌంచవృత్తములు గలవనియు,

"శా. ముక్తాముక్త ఘనానురాగ మదసమ్మోదైక సంసేవ్యసం
త్యక్తాకర్మ పద ప్రభేదమతి విద్యాదేహశోషైకహా
భక్తాలంబక మంత్రతంత్రమయ సద్భావస్థితై స్పృశా
శాక్తేయో ముని చింత్యమాన భరతా సంతాపహా సద్యశా"

అను చక్రబంధములో కృతికర్త, కృతిపతుల నామములు గానరావనియు, పదునొకండవ శతాబ్దమునకీవల చక్రబంధములలో నవశ్యముగా గృతిపతి యొక్కయు, కవియొక్కయు నామములుండుట యాచారమై యున్నదనియు, కాబట్టి నన్నయకు బూర్వమునందిట్టి యాచార మున్నదనియు,

నన్నయకు బూర్వము ముప్పదియారలంకారములు మ్రాతమె కలవని భామహుడు దండి మొదలగువారు పేర్కొని రనియు, అట్లే నన్నెచోడుడు కూడ తన కుమారసంభవమున ముప్పదియారలంకారముల బేర్కొనియున్నవాడనియు,

కాబట్టి పై హేతువులచేత నన్నెచోడకవి నన్నయభట్టారకునకు బూర్వుడని చెప్పుచున్నారు. ఇప్పటికీ విషయమున నాకే సిద్ధాంతమును స్థిరపడియుండలేదు. ఇంకను బరిశీలింప వలసి యున్నదని నా యభిప్రాయము.


కాకతి - రుద్రాంబ విషయము.

కాకతి రుద్రాంబ కాకతిగణపతి దేవచక్రవర్తి కూతురు కాని భార్య కాదని మల్కాపురశాసనముం బట్టి సిద్ధాంతపరచి యున్నాను. మల్యాల గుండయ దండనాథుని బూదువూరు శాసనములో గూడ రుద్రదేవుడను పేరుతో రాజ్యము చేసి రుద్రాంబిక గణపతి కూతురనియె యీ క్రింది శ్లోకములలో సూచింపబడియెను.

"తస్యాతిశస్యః క్షితి పోషదక్ష స్సదా స్వకె ()ర్మణి ధర్మమూతె
సుతస్సమాసీ దసమాన భూతిర్భూవల్లభః శ్రీగణపాభిదానః
శత్రూ నాశు పిపేష వీరనిరతా న్బంధూ న్పుపోసాత్మనో
దారే ష్వేవతుతోష నిత్యవిలసన్నీ త్యోన్మిమేషాక్షిణీః
(స)ద్ధర్మం విశిశేష యః పరహితం తోషాది యేష ప్రభు
తద్రాజభుని సద్భద్రముద్రే రుద్రమహీపతౌ

అస్మే న్విస్మితవిక్రాంతౌ గుర్వీముర్వీ మ్ప్రశాపతి
వెలుగోటివారి వంశచరిత్రము

శ్రీవేంకటగిరి సంస్థానాధీశ్వరులైన మహారాజశ్రీ శ్రీ మహారాజా గోపాలకృష్ణయాచేంద్ర బహాదూర్ కె.సి.ఐ.ఇ. వారు నా ప్రార్థన నంగీకరించి వెలుగోటివారి వంశచరిత్రముయొక్క ప్రతి నొకదానిని దయచేయగా వందనపూర్వకముగా స్వీకరించి యామూలాగ్రముగా బఠించితిని. అందు చరిత్రబద్ధములు కాని విషయములనేకములుండుట చేత నా యభిప్రాయభేదమును తెలుపవలసి వచ్చినది. అందులకు మిక్కిలి చింతించుచున్నాను. చరిత్రమునందు వారి వంశవిషయమై నే జేసిన సిద్ధాంతములను సహేతుకముగా దోషములని నిరూపించినయెడల వానిని దీనికనుబంధముగా ప్రకటింతును.

రాచకొలమువారు

ఈ చరిత్రమును జదివినప్పుడు వర్తమాన కాలమున నాంధ్రదేశమునందు క్షత్రియులనియు, రాజపుత్రులనియు వ్యవహరింపబడుచున్న రాచవారు బలిజ, కమ్మ, వెలమ, రెడ్డి తెగలలోనుండి యేర్పడిన యొక ప్రత్యేక కులమని బోధపడగలదు. వీరి ప్రాచీనులు శాసనములలో జతుర్థకులము వారమని చెప్పుకొనియున్నారు. ఇయ్యది నేను తెచ్చిపెట్టిన కల్పనముకాదు. వీరి ప్రాచీనులు జనరంజకముగా బరిపాలనము చేసి రాజులనిపించుకొన్నట్లు శాసనములు ఘోషించుచున్నవి. అట్టి రాజులయొక్కయు వారి బంధువర్గము యొక్కయు సంతతి వారగుట జేసి రాచవారయిరి. ఇక్కాలమునందు వీరిని రాజపుత్రులనుట ధర్మమగును. ఉత్తరదేశమునందలి రాజపుత్రులును వీరి వలెనే చతుర్థకులము నుండి వచ్చినవారే యగుట చేత నీరాచవారు వర్ణమునందు దాము తక్కువవారమనియు, ఉత్తర దేశపురాజ పుత్రులెక్కువ వారని చింతింపనక్కరలేదు. ఇట్లని యొరులు వీరిని నధిక్షేపింపరాదు. గుణకర్మములచేత వర్ణవిభాగమేర్పడినది కాని వర్ణాశ్రమధర్మము లేర్పడుటకు బూర్వమునందరు సమానులే యని యెరుంగవలెను.

చరిత్రసాధనములు

ఈ చరిత్ర రచనమునందు నాకు విశేషముగా దోడ్పడినవి శాసనములు, ప్రబంధములు. శాసనములు ఇండియన్ అంటిక్వేరి, ఎపిగ్రాఫికాఇండికా, ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారములో మెకంజీ, ఎల్లియాట్, మొదలగువారిచే భద్రపరుపబడిన "లోకల్ రికార్డ్స్"అను సంపుటములలోనుండి గ్రహింపబడినవిగా నెరుంగవలయును. కొన్ని శాసనములు శ్రీమానవల్లి రామకృష్ణకవి, ఎం.ఏ.,గారు దయచేసినారు. ఈ చరిత్ర రచనమునందు వీరి సాహాయ్యము నాకు బ్రధానమైనదిగా నున్నది గావున వీరికి నేను మిక్కిలి కృతజ్ఞుడనై యుండవలయును. రావుబహదరు వి.వెంకయ్య, ఎం.ఏ., గారు ఇండియన్ ఆంటిక్వేరీలో వ్రాసినదానిని నాధారముగా జేసికొని నెల్లూరు శాసనసంపుటములను ఆంధ్రప్రబంధములను బరిశీలించి నెల్లూరు చరిత్రమును వ్రాసినాడను. కాకతీయులచరిత్ర రచనమునందు శాసనపరిశోధకులగు రావు సాహెబు హెచ్.కృష్ణశాస్త్రి బి.ఏ.గారి యనుమకొండ శాసనవ్యాఖ్యానము గూడ తోడ్పడినది. పల్నాటివీరులను గూర్చిన చరిత్రము ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారములోని ద్విపద ప్రబంధములను జదివి యందలి కథాసారమును గ్రహించితిని. మనోహరముగా నుండుటకై శ్రీయుతులైన అక్కిరాజు ఉమాకాంతము గారు విశేషపరిశ్రమ చేసి వ్రాసిన ఉపోద్ఘాతముతో గూడిన పల్నాటి వీరచరిత్రములోని బాలచంద్రయుద్ధభాగమునుండి ద్విపద పంక్తులనచ్చటచ్చట నుదాహరించుచు వచ్చినాడను. మరికొన్ని భాండాగారములోని ప్రతులనుండి గ్రహించితిని. ఉమాకాంతము గారు ప్రకటించిన భాగము శ్రీనాథవిరచితమైన గ్రంథములోనిదియేనాయని యొక గొప్ప సందేహము కలుగుచున్నది. ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారములోని ప్రతులయోమయావస్థలోనున్నవి. రావు వంశీయ చరిత్రము యొక్క ప్రతిని శ్రీ బొద్దికూరపాటి వేంకటరంగము నాయుడు గారు దయతో నాకొసంగిరి. ఈ గ్రంథమును రచించినవారు కీర్తిశేషులయిన గురజాడ శ్రీరామమూర్తిపంతులుగారు. ఈ గ్రంథకర్తలకందరకును కృతజ్ఞుడనగుచున్నాడను.


ఈ చరిత్రములో బ్రకటించిన దేవాలయ పటములందు ఓరుగల్లునుండి పంపిన నా మిత్రులగు శ్రీయుత మాడపాటి హనుమంతరావుపంతులుగారికి గృతజ్ఞతావందనములు చెప్పుచున్నాను.

మరియు నీ చరిత్రమును ముద్రించెడి శ్రీజ్యోతిష్మతీ ముద్రాశాలాధికారులును విద్వత్కవి సింహులునైన బ్రహ్మశ్రీ వేదము వేంకటరాయశాస్త్రులువారు శాసనములలోని యనేక సందిగ్దాంశములను దెలిపియు, అపరిశుద్ధములై యున్న శ్లోకములను దిద్దదగినపట్ల దిద్దియు, వాని భావములను దెలిపియు ననేక విధములుగా దోడ్పడినందులకును నేను గ్రంథమును త్వరగా ముగింపక కాలయాపన చేయుచున్నను ఓపిక వహించి గ్రంథమును ముద్రింపజేసినందులకును, వారికిని, శాసనములం జదువుటయందు దోడ్పడిని బ్రహ్మశ్రీ చెన్నాప్రగడ భానుమూర్తి పంతులు, బి.ఏ., గారికిని మనఃపూర్వకములైన యనేక వందనములాచరించుచున్నాడను.

చెన్నపురి.
30-5-1912.
ఇట్లు విధేయుడు

చిలుకూరి వీరభద్రరావు.