ఆంధ్రభాషాభూషణము/ఏకాశ్వాసము

శ్రీః

ఆంధ్రభాషాభూషణము


శా.

శ్రీవాణీగిరిజేశ దంతిముఖ రాజీవాప్తులం గొల్చి వా
గ్దేవిం జిత్తములోన నిల్పుకొని శక్తిం భక్తిఁ గీర్తించి నా
నావిద్వ[1]త్సభలన్ వలం గొనువినూత్నప్రౌఢకావ్యక్రియా
ప్రావీణ్యంబున నుల్లసిల్లుకవులన్ బ్రార్థించి ధన్యుండ నై.

1


క.

వివిధకళానిపుణుఁడ నభి
నవదండి యనంగ బుధజనంబులచేతన్
భువిఁ బేరుఁ గొనినవాఁడను
గవిజనమిత్రుండ మూలఘటికాన్వయుఁడన్.

2


క.

ఖ్యాతశుభచరిత్రుఁడ వృష
కేతనపాదద్వయీనికేతనుఁ డనఁగాఁ
గేతన సత్కవి యనఁగా
భూతలమున [2]నుతిశతంబుఁ బొందిన వాఁడన్.

3

క.

మ్రానయకును నంకమకును
సూనుఁడ మిత సత్యనయవచో విభవుఁడవి
జ్ఞానానూనమనస్కుఁడ
నానాశాస్త్రజ్ఞుఁడను గుణాభిజ్ఞుండన్.

4


ఆ.

కవితఁ జెప్పి యుభయకవిమిత్రు మెప్పింప
నరిది బ్రహ్మకైన నతఁడు మెచ్చఁ
బరఁగ దశకుమారచరితంబుఁ జెప్పిన
ప్రోడ నన్ను వేఱె పొగడ నేల.

5


క.

మున్ను తెనుఁగునకు లక్షణ
మెన్నడు నెవ్వరును జెప్ప రేఁ జెప్పెద వి
ద్వన్నికరము మది మెచ్చఁగ
నన్నయభట్టాదికవిజనంబులకరుణన్.

6


తే.

సంస్కృతప్రాకృతాదిలక్షణముఁ జెప్పి
తెనుఁగునకు లక్షణముఁ జెప్పు కునికి యెల్లఁ
గవిజనంబుల నేరమి గాదు నన్ను
ధన్యుఁ గావింపఁదలఁచినతలఁపుగాని.

7


క.

భాషావేదులు నను విని
యాషణ్ముఖపాణినులకు నగు నెన యని సం
తోషింప నాంధ్రభాషా
భూషణ మనుశబ్దశాస్త్రమున్ రచియింతున్.

8


క.

ఒప్పులు గల్గిన మెచ్చుఁడు
తప్పులు గల్గిన నెఱింగి తగ దిద్దుఁడు త

ప్పొ ప్పనకుఁ డొప్పు త ప్పని
చెప్పకుఁ డీ కవు లుపాస్తి చేసెద మిమ్మున్.

9


క.

గుణదోషంబు లెఱిఁగి యిది
గుణమిది దోష మనిపూజఁ గొందురు సుకవుల్
గుణదోషము లెఱుఁగక దు
ర్గుణములె గుణములనిపూజఁ గొందురుకుకవుల్.

10


ఉ.

క్రొత్తగ నాంధ్రభాషకు[3]ను గొండొకలక్షణ మిట్లు [4]చెప్పెనే
యుత్తమబుద్ధి [5]వీఁడ యని యోరలు వోవక విన్న మేలు మీ
రొత్తిన మీకు మాఱుకొని యుత్తర మిచ్చుట చాలవ్రేఁగు మీ
చిత్తమునందు [6]న న్నెరవు సేయకుఁడీ కవులార మ్రొక్కెదన్.

11


క.

నేరములు కాళిదాసమ
యూరాదుల కైనఁ గలుగ నొరులకు లేవే
సారమతు లైన సుకవుల
కారుణ్యము కలిమి నేర్పు కవిజనములకున్.

12


తే.

కంచి నెల్లూరు మఱి యోరుఁగ [7]ల్లయోధ్య
యనుపురంబులపై గంగ కరుగు మనిన

    పగిది నొకత్రోవఁ జూపెద బహుపథంబు
    లాంధ్రభాషకుఁ గల వని యరసికొనుఁడు. 13

ఆ. తల్లి సంస్కృతంబె యెల్లభాషలకును
    దానివలనఁ గొంత గానఁబడియెఁ
    గొంత తాన కలిగె నంతయు నేకమై
    తెనుఁగుబాస నాఁగ వినుతి కెక్కె. 14

క. తెలుఁగునఁ గల భేదంబులుఁ
   దెలుఁగై సంస్కృతము చెల్లు తెఱఁగులుఁ దత్సం
   ధులును విభక్తులు నయ్యై
   యలఘుసమాసములుఁ గ్రియలు నవి యెఱిఁగింతున్. 15

క. ఆదులు స్వరములు నచ్చులు
   కాదు లొగి న్వ్యంజనములు హల్లులు ననఁగా
   మేదిని నెల్లెడఁ జెల్లును
   కాదుల నైదైదు కూర్ప నగువర్గంబుల్. 16

క. యరలవలును శషసహలును
   నరయఁగ నంతస్థ లూష్మ లనఁగాఁ జెల్లున్
   సరవి నివె పేళ్లు పెట్టుదుఁ
   దిరముగఁ దల్లక్షణములు దెలిపెడిచోటన్. 17

క. [8]ఆఱు సమాసము లిరువది
   యాఱంతము లాఱుసంధు లవ్యయములు పె
   క్కాఱింటిసగము రీతులు
   నాఱింటికి నొక్కఁ డెక్కు డౌను విభక్తుల్. 18

ఆ. తత్సమంబు నాఁగఁ దద్భవం బన నచ్చ
    తెనుఁగు నాఁగ మఱియు దేశ్య మనఁగ
    గ్రామ్యభాష నాఁగఁ గల వైదుతెఱఁగులు
    వేఱె వేఱె వాని విస్తరింతు. 19

క. మును సంస్కృతపదములపైఁ
   దెనుఁగువిభక్తులు ఘటించి తేటపడఁగఁ జె
   ప్పిన నది తత్సమ మనఁ జను
   వనము ధనము పురుషుఁ డబల వసుమతి యనఁగన్.

క. లచ్చి యన లక్ష్మిపే రగు
   నచ్చం బన నచ్ఛమునకు నభిధానము వి
   వ్వచ్చుఁడు బీభత్సుఁడు వి
   ద్వచ్చయ మనునిట్టితెనుఁగు తద్భవ మయ్యెన్.

సీ. అర్ఘంబె యగ్గువ దీర్ఘక డిగ్గియ
             గుణములు గొనములు కులము కొలము

     స్నిగ్ధంబు నిద్దంబు శ్రీ సిరి భంగంబు
              బన్నంబు దిశ దెస భాష బాస
    యక్షులు జక్కులు యముఁడు జముం డగు
              నాజ్ఞప్తి యానతి యాజ్ఞ యాన
    ద్యూతంబు జూదంబు దోషంబు దోసంబు
             ముగ్థుండు ముగుదుండు ముఖము మొగము

తే. పసదనంబు ప్రసాదనం బసము యశము
    సమ్మెటయ చర్మయష్టి కర్జంబు కార్య
    మీరసం బీర్ష్య వేరంబు వైర మిట్టి
    పగిది పల్కులు తద్భవపదము లయ్యె. 22

క. తల నెల వేసవి గుడి మడి
    పులి చలి మడుఁ గూరు పేరు బూరుగుమగవాఁ
    డలుక యని యెల్లవారికిఁ
    [9]దెలిసెడియాపలుకు లచ్చతెనుఁగనఁబరఁగున్.

సీ. ఎఱుకువ నెత్తమ్మి యెరగలి యెసకంబు
            నొస లింతి తేఁటి వెక్కసము నెమ్మి
    మక్కువ చెచ్చెర మచ్చిక పొచ్చెము
            కదిమి యేడ్తెఱ లగ్గు కలవలంబు

    వెన్ను విన్నదంబు వీనులు వెన్నడి
         యెక్కలి తివురుట యుక్కు మేటి
    బాగు తొయ్యలి బోఁటి ప్రన్నన సరి జోటి
         వేనలి పొలపంబు విన్ను మన్ను

తే. నెల్లి కొఱలుట వీచోపు లుల్ల మువిద
    వీఁక కాఱియ గ్రద్దలు వేఁట గ్రేణి
    కౌను పాలిండు లొగి మొగి గనయ మిట్టి
    తెఱఁగుపలుకులు [10]ధర దేశితెనుఁగు లయ్యె.

సీ. తెమ్మెర లెలమావి తెలిగన్ను క్రొన్నన
          నలరాజు రేఱేఁడు వాలుఁగంటి
    యలరులపిండు తెక్కలికాఁడు క్రొమ్మించు
          కెమ్మోవి కెంజాయ కమ్మతావి
    కడలి తామరకంటి వెడవిల్తుఁ డెడకాఁడు
          నలువ కలువకంటి నాన సెగ్గ
    మెలనాఁగ ముద్దియ చెలువ చిగురుబోఁడి
          తెఱవ తలిరుబోఁడి మెఱుఁగుబోఁడి

తే. పదరు విసువుట పరి గమి పసలు నసదు
    పొద్దు రేయెండ తబ్బిబ్బు పోటు ముట్టు

     తనివి వలవంత చెంత మంతన మనంగఁ
     దేరనాడిన దేశ్యంపుఁదెనుఁగు లయ్యె. 25

సీ. పంచాకుమయ్య తోపించాకుమయ్య వా
           టీదెచ్చుతారు మమ్మూదలంచి
    యేగ గొంటూరమ్ము యేదాలు వోదాలు
           మోనేటివా రానసేసువారు
    వాడి విరాళితో బాడిగ వోకుమీ
           యీడేకదా మమ్ము యినుతిసేసె
    పంపేరు తెంపేరు పాడేరు సూసేరు
           యిందాము కందాము పొందు మిస్తి

ఆ. అటుకు దవ్వు వెగడు నషువలె నిషువలె
    నాడ నీడ నేడ నచ్చ నిచ్చ
    నోయ గాయ వేయ కుండాడు బామ్మఁడు
    గద్ద గుద్ద నాఁగ గ్రామ్య మయ్యె. 26

ఆ. తత్సమంబు దక్క తక్కిన నాలుగు
    నచ్చ తెనుఁగు లందు రఖిలజనులు
    నందులోన గ్రామ్య మనఁగ నెవ్వరు నొప్ప
    రొరులఁ దెగడుచోట నొప్పు నదియు. 27

వ. అనంతరంబ సంస్కృతపదంబులు తెనుంగు గావించుతెఱం గెఱింగించెద. 28

సీ. వృక్షేణ దక్షాయ పక్షిభిః పుత్త్రస్య
           యనువిభక్తులు దెనుంగునకుఁ జొరవు
    అస్తి ప్రయాతి గాయంతి భుంక్తే సంతి
           నయతి స్మరతి యనుక్రియలు సొరవు
    గత్వా హసిత్వా ప్రకాశ్య సంత్యజ్య నాఁ
           దనరు త్వాంతల్యబంతములు సొరవు
    గంతుంపురీం రిపుంహంతుం సుతంపాతు
          మనుతుమున్నంతంబు లరయఁ జొరవు

తే. అపి చ తు హి వై న వా నను లనఁగఁ బెక్కు
    లవ్యయంబులు చొర వెందు నాంధ్రకవితఁ
    బెఱపదంబులతోడను దొరలినిల్చు
    నవి తెనుంగులు గావింతు నభిమతముగ. 29

క. ఇల సంస్కృతపదములపై
   నెలకొని నిల్చినవిసర్జనీయంబులు సు
   న్నలు నిలువవు తెనుఁగులలో
   నలవడఁగాఁ బల్కుచోట నభినవదండీ. 30

క. లలి నేకాక్షరపదములు
   వెలిగాఁ దక్కినపదముల వెలసినతుదయ
   చ్చుల[11]నిడుపు లుడుపఁ దెనుఁ గగు
   నిల నెప్పటియట్ల యుండు నీయంతంబుల్. 31

క. స్త్రీ యన ధీ యన శ్రీ యన
   నీయేకాక్షరపదంబు లీక్రియఁ జను గౌ
   రీ యన గౌరి యగున్ వా
   ణీ యన వాణియగు మణి మణీ యనుచోటన్. 34

క. లక్షణములు దెలిపెడిచో
   నక్షరములు దెలియుకొఱకు ననువైనక్రియన్
   శిక్షార్థముగాఁ బల్కెద
   లాక్షణికులు తప్పుగాఁ దలంపకుఁడు మదిన్. 33

క. వుఱ్ఱగు నుఱ్ఱంతముపై
   ముఱ్ఱగు నఱ్ఱంతశబ్దములపై రెంటన్
   డుఱ్ఱగుఁ బురుషాఖ్యలపై
   న ఱ్ఱు ఱ్ఱగు నట్టియెడల నభినవదండీ. 35

క. వానునకున్ వంతుండును
   మానునకును మంతుఁడును గ్రమంబున నగు శ
   బ్దానీకాంతనకారము
   మానించి విభక్తు లెక్కుమఱియొక్కొకచోన్. 36

క. తరువు తనువు ధన మర్థము
   గురుఁడు పురుషుఁ డుత్తముండు గుణవంతుఁడు సు
   స్థిరమతిమంతుఁడు యశమున
   నరుడుగ హనుమంతుఁ డన నుదాహరణంబుల్. 37

    బూరితాత్ముఁ డనఁగఁ బుణ్యకర్ముఁ డనంగఁ
    బుష్పధన్వుఁ డనఁగఁ బొలుచు జగతి. 39

ఆ. గురువు ప్రభువు నాఁగ గురుఁడు ప్రభుం డన
    శర్మ వర్మ నాఁగ శర్ముఁ డనఁగ
    వర్ముఁ డనఁగఁ జెల్లు వటువును మనువును
    జటువు డులకుఁ బాసి పరఁగుచుండు. 40

తే. ద్విట్పదమునకు ద్విషుఁ డగు విద్విషుండు
    విత్పదమునకు విదుఁ డగు వేదవిదుఁడు
    భుక్పదమునకు భుజుఁ డగు భూభుజుండు
    దిక్పదమునకుఁ గుఱ్ఱగుఁ దెలియు దిక్కు. 41

క. తెలుఁగున సంస్కృతపదములు
   పలికెడి తెఱఁ గెఱిఁగినంత ప్రవ్యక్తముగాఁ
   దెలిపితిఁ దెలుపనిపదములు
   గల నవి సంస్కృతముతోడఁ గలయుఁ దెనుఁగునన్.

ప. అనంతరంబ సంధు లెఱింగించెద. 43

క. వెందలిపదము తుదివర్ణము
   వదలక పైపదము మొదలివర్ణముతోడం
   గదియఁగ సంధులు నాఁ దగు
   విదితపుఁదత్సంధు లెల్ల వివరింతుఁ దగన్. 44

క. ఉత్వము క్రియల కినులపై
   నిత్వము పెఱరూపు దాల్చు నీవే ననఁగా
   సత్త్వముఁ గలిగెడి నూరి క
   తిత్వరితము పొండు నాఁగఁ దెల్లం బగుచున్.

క. అచ్చుగ నఱ్ఱి ఱ్ఱు ఱ్ఱలు
   నచ్చులె యంతమునఁ దెనుఁగుటభిధానములన్
   విచ్చలవిడిఁ బలుకులఁ బెఱ
   యచ్చులు చనుదెంచుమానవాఖ్యలయందున్.

వ. తత్సంధిక్రమం బెట్టిదనిన.

తే. అవనినాథుఁడు దయఁ జూడ కనిపినాఁడు
    రాజు దయలేక యున్నాఁడు రమణియెడను
    అలరుబం తిది మేల్బంతి యది యనంగ
    నెల్లకృతులను మిక్కిలి చెల్లుఁ గాన. 48

క. అచ్చుగఁ బెఱయచ్చుల పై
   నచ్చు యకారంబుఁ దాల్చు నబలా యేలే
   యిచ్చ యపూర్వమొకో యిది
   యచ్చెరువై యునికి నా నుదాహరణంబుల్. 49

తే. ఒనర నుఱ్ఱంతషష్ఠిపై నున్నయచ్చు
    మొదలఁ బొల్లునకారంబు గదిసి నిల్చు

    కొడుకునా ల్గూఁతునొడమి నాఁ గూడుఁ గాని
    కూఁతొడమి కొడుకా లనఁ గూడ దెందు. 50

క. అది యిఱ్ఱంతముమీఁదన్
   గదిసిన నాద్యచ్చుడుగు వికల్పముతోఁ గా
   లిది కాలియది యనఁగఁ జే
   తిది చేతియది యని పలుకఁ దెల్లం బగుచున్. 51

క. అచ్చుగఁ బై హ ల్లుండక
   యచ్చుండినఁ దద్ద్వితీయ కంత్యనకారం
   బచ్చోఁ బాయక నిల్చును
   విచ్చలవిడిఁ బోవు నచ్చు వేఱొక టైనన్. 52

క. సుతు నడిగె సుతుని నడిగెను
   సుతు ననిచె న్సుతుని ననిచె సుతునిం గెలిచెన్
   సుతు గెలిచెఁ బోరిలో ను
   ద్ధతుఁ డొకఁ డనవరుసతో నుదాహరణంబుల్. 53

క. నాంతం బైనపదంబుల
   పొంతం బై నున్నశబ్దముల కచటతపల్
   దొంతి గజడదబ లగు న
   య్యంతనకార మగు సున్న యభినవదండీ. 54

ఆ. వానిఁ గనియెఁ జేరె వానిఁ డక్కరిఁ జేసె
    వానిదానిఁ దెగడె వానిఁ బొదివె

    ననఁగ వరుస నివి యుదాహరణంబులు
    నుతగుణాభిరామ నూత్నదండి. 55

క. కుఱుచలతుది హల్లులకున్
   బిఱుఁద న్నెలకొన్నయట్టిబిందువు లెల్లన్
   నెఱయఁగ నూఁదుచుఁ దేలుచు
   నొఱపై యిరుదెఱఁగుఁ జెల్లుచుండున్ గృతులన్. 56

క. ననుఁ గను నన్నుం గను దా
   ఘనుఁడు ఘనుం డనఁగఁ జెల్లుఁ గవ్యనుమతిచేఁ
   దను బోఁటి లోభివాఁ డితఁ
   డన నిడుపులమీఁదిబిందు లరబిందు లగున్. 57

క. [12]కుఱుచలపై యరబిందులు
   నెఱయఁగ నూఁదినను జెల్లు నిడుపులమీఁదన్
   నెఱయవు గద్యంబులలో
   నెఱబిందువు లూఁదుబద్యనికరములోనన్. 58

క. నన్నును నిన్నునుఁ దన్నును
   న న్నందుల కునుల కినులయందును మును పై
   నున్న నకారపుఁ బొల్లులు
   పన్నుగఁ [13]బోఁ జూపు నచ్చుపై నున్నయెడన్. 59
   

క. న న్నెఱుఁగు నన్ను నెఱుఁగున్
   దన్నెఱుఁగుచుఁదన్ను నెఱుంగుఁదత్త్వజ్ఞుఁడిలన్
   ని న్నెఱుఁగు నిను నెఱుంగును
   నన్నం బరువడిగ నివి యుదాహరణంబుల్. 60

క. తన కెనయె తనకు నెనయే
   ముని కెనయే మునికి నెనయె మూర్ఖుం డనఁగాఁ
   గునులకుఁ గినులకు జగతిన్
   దనరంగా వరుసతో నుదాహరణంబుల్. 61

క. [14]పొసఁగం బల్కెడునెడ బొ
   ల్పెసగినప్రథమాంతములపయిం గదిసి కడున్
   బస నారుకచటతపల ను
   గసడదవల్ ద్రోచి వచ్చుఁ గవిజనమిత్రా! 62

తే. సుతుఁడు గడువేగమున వచ్చె సుతుఁడు సనియె
    సుతుఁడు డక్కరితోఁడఁ దాఁ జుట్ట మయ్యె
    సుతుఁడు దండ్రికిఁ బ్రణమిల్లె సుతుఁడు వుట్టె
    ననఁగ నివి యుదాహరణంబు లయ్యెఁగృతుల. 63

క. లెలుఁగులలో నచ్చంబులు
   [15]డులు రులు సులు పదముతుది నడమఁ గలిగిన ని

    మ్ముల దానిమీఁది యుత్వము
    పొలుపుగ హ ల్లుండెనేనిఁ బోపు న్నిలుచున్. 64

ఆ. మారుమండఁ జొచ్చె మార్మండె వ్రే ల్మట్టె
    వ్రేలు మట్టె వేడ్క వేడు కయ్యె
    కాఱుకాల మనఁగఁ గార్కాల మనఁ గాన్పు
    కాను పనఁగ నెల్లకడలఁ జెల్లు. 65

ఆ. ఏకపదము నడిమియిత్వ మొక్కొకతఱి
    నచ్చతెనుఁగులోన నడఁగుఁ బొడముఁ
    గూర్మి తాల్మి యనఁగఁ గూరిమి తాలిమి
    యనఁగ గృతులఁ జెల్లు చునికిఁ జేసి. 66

క. అ ఱ్ఱి ఱ్ఱంతంబులపై
   యుఱ్ఱగు నన్నయును దల్లియును ననుక్రియ నా
   యుఱ్ఱంత మొందుచోటుల
   నుఱ్ఱగు మనుమఁడును నందనుండును ననఁగన్. 67

వ. అనంతరంబ విభక్తులు చెప్పెదఁ బ్రథమయుఁ ద్వితీయయుఁ దృతీయయుఁ జతుర్థియుఁ బంచమియు షష్ఠియు సప్తమియు సంబోధనంబు నన నెనిమిదితెఱంగుల విభజింపఁబడుటం జేసి విభక్తు లనంబరఁగె. చేయువాఁడు ప్రథమయుఁ, జేయంబడినది ద్వితీయము, నుపకరణంబు తృతీయయుఁ, జేయించుకొనువాఁడు చతుర్థియుఁ, బాయుటకు న్బట్టయినది పంచమియు, నొడయందు షష్ఠియు, నునికిపట్టు సప్తమియు, సమ్ముఖంబు సేయునది సంబోధనంబును నగు. వానికి నేకవచనబహువచనభేదంబులన్ బ్రత్యేకంబు రెండువిధంబులఁ జెందు నందుఁ బ్రథమ యెట్లనిన. 68

క. పలు కనుట యేకవచనము
   పలుకుపయి న్లులను నిలుప బహువచనంబుల్
   నెల నెల లనఁ దల తల లనఁ
   జిలుక చిలుక లనఁగ జగతిఁ జెల్లుటవలనన్. 69

క. డుల నెల్లయెడల ద్రోచును
   దెలుఁగువిభక్తులక్రమంబుఁ దెలిపెద ననఘుల్
   బలవంతులు ధనవంతులు
   కులజులు నయవిదులు భావుకులు ననఁ జనుటన్. 70

క. లులమీఁద లులకు రుఱ్ఱగు
   నిలఁ బెక్కిట బాలు రన మహీపాలు రనన్
   లలితదయాళు రనంగా
   నలవడ వర్తిల్లుఁ గాన నభినవదండీ. 71

క. సోఁడిగ బహువచనంబులు
   వీఁ డనుచో వీండ్రు వీరు వీరలు నయ్యెన్
   కాఁ డనఁ గాం డ్రనఁ గా ఱన
   వాఁడునకున్ వాండ్రు వారు వారలు నయ్యెన్. 72

ఆ. కొఱను నెఱను నాఁగఁ గొలను నా మ్రా ననఁ
     గలను గనను కెలను వలను నాఁగఁ
     బరఁగుశబ్దములకు బహువచనంబుల
     నులకుఁ గులు విధించె నూత్నదండి. 73

క. కొఱఁకులు నెఱఁకు లనంగా
   మఱియుం గొలఁకులును రేఁగుమ్రాఁకులనంగా
   మెఱయున్ గలఁకులు గవఁకులు
   నెఱకెలఁకులు వలఁకు లనఁగ నెగడెడికతనన్. 74

ఆ. ఇల్లు కల్లు ముల్లు పల్లు వి ల్లన నివి
    బహువచనము లగుచుఁ బరఁగు నెడల
    నిండ్లు కండ్లు ముండ్లు పండ్లు విం డ్లనఁ జను
    నుతగుణాభిరామ నూత్నదండి. 75

తే. పేను చేను మీ ననునివి పెక్కులైనఁ
    బేలు చేలు మీలు ననఁగఁ బోలు జగతి
    యిలకుఁ దులువొందు నొకకొన్ని యిలనడంచి
    లులబహుత్వమునం దుది మెలఁగుచుండు. 76

తే. చేయి వాయి నేయి యనుచుఁ జెప్పుచోటఁ
     బ్రీతిఁ జేతులు వాతులు నేతు లయ్యె
     రాయి రేయి వేయి యనుచో రాలు రేలు
     వేలు నా నొప్పు బహువచోవేళయందు. 77

క. రులుడుదు లంత్యము లైనన్
   లుల నడఁచి తదంత్యములకు ళుఱ్ఱగు బహుతం
   బలుగొళ్లని కొనవేళ్లని
   కలగూళ్లున్ లేళ్లు నాఁగఁ గ్రమమై యునికిన్. 78

క. పదము తుది యిత్వ ముత్వము
   పదిలంబుగ బహువచనముపై నొందినచో
   నది దెలియుఁడు మణులు ఘృణులు
   సుదతులు సన్మతులు సఖులు సుకవు లనంగన్. 79

తే. పరఁగుఁ చెక్కిట నొకటె తెమ్మెరలు నీళ్లు
    పఱలు కొలుచులపేళ్లెల్ల బహువచనము
    గోదుమలు వడ్లు జొన్నలు కొఱ్ఱ లాళ్లు
    చోళ్లు ననుములు పెస లనఁ జెల్లుఁ గాన. 80

క. చెలియ లన నా లన మఱం
   దలు కోడలు నాఁగ జనుపదంబులతుదలన్
   లులకుం డ్రలగుం బెక్కిటఁ
   జెలియం డ్రన నాం డ్రనంగఁ జెల్లుటవలనన్. 81

క. జంగమపదములుఁ దక్క ధ
   రం గలపదములద్వితీయ ప్రథమయు నగు రా
   జంగదము లూడ్చెఁ బతినూ
   త్నాంగదములఁదాల్చెననఁగ ననువై యునికిన్. 82

తే. వలసినప్పుడు చేత కై వలన యొక్క
    యందు ననునివి యగుఁ దృతీయాదులందు
    స్త్రీపురుషశబ్దములయందు జేత వలన
    నందు ననునివి యగుఁ దృతీయాదులందు. 83

తే. దులకు నిను నేకవచనము తెలుఁగులందు
    నిలుచుఁ దత్సమపదముల నిలుచుఁ బోవు
    లలు ద్వితీయాదు లగువిభక్తులకు నెల్ల
    బహువచనములై చను నెల్లపదములందు. 84

క. కమియంగ నికి నకులు త
   త్సమములఁ బోఁద్రోచి నిలుచు షష్ఠి చతుర్థిన్
   గ్రమమునఁ గుఱ్ఱగు నఱ్ఱం
   తమునకు నుఱ్ఱంతమునకుఁ దగు నఱ్ఱు లలిన్. 85

క. గురునికి గురునకు ననఁగాఁ
   బరఁగఁగ బాలునికి ననఁగ బాలున కనఁగా
   గరగకు గొరవకు ననఁగాఁ
   దరమున కురమునకు నా నుదాహరణంబుల్. 86

క. ఇ ను డు రు లు ఱ్ఱంతములకు
   కినులగు వారిథికి చేనికిని నాడికి నో
   లిని యూరికి వ్రేలికి నన
   కును లగు బహువచనములకుఁ గొడుకులకు ననన్. 87

వ. తత్సమపదాంతంబు లగుసప్తవిభక్తులందు నేకవచన బహువచనము లెట్టివనిన. 88

క. సుతుఁడు సుతు సుతుని గనియెన్
   సుతుచేతన్ సుతునిచేత సుతునకు నిచ్చెన్
   సుతునికిని సుతునివలనన్
   సుతువలనన్ సుతునిధనము సుతుధన మెలమిన్. 89

క. సుతునందు సుతునియందున్
   సుతులు సుతుల సుతులచేత సుతులకు నిచ్చెన్
   సుతులవలన సుతులధనము
   సుతులం దన నేక బహువచోనియతి యగున్. 90

వ. ముఱ్ఱంతములకు. 91

క. వృక్షము మొలచెను నఱికెను
   వృక్షము వృక్షమున బ్రతికె వృక్షమునకు నీ
   వృక్షమునఁ బండు వడియెను
   వృక్షముతుది వృక్షమున దవిలెనాచూడ్కుల్. 92

క. వృక్షంబులు వృక్షంబుల
   వృక్షంబులచేత బ్రతికె వృక్షంబులకున్
   వృక్షములవలనఁ బండును
   వృక్షంబులతుదలఁ గలవు వృక్షములందున్. 93

వ. లాంతములకు. 94

క. తలయొప్పెన్ దల దిగిచెన్
   దల దాల్చెన్ దలకుఁ జీడ తలవిరి దొలఁగెన్
   తలవెండ్రుక తలసొమ్ములు
   తలలం దన నిట్లు బహువిధంబులఁ జెల్లున్. 95

క. తల లొప్పెఁ దలలు దునిమెను
   తలలన్ ధరియించెఁ జీరతలలకునాడెన్
   దలఁ జుట్టె పెడతలవడెన్
   దలలకు మణిభూషణములు తలలం దనఁగన్. 96

వ. ర్యంతములకు. 97

క. కరివచ్చెన్ గరినెక్కెను
   గరిచేతం జచ్చెఁ గరికిఁ గవణమువెట్టెన్
   గరివలననుఁ గరికుంభము
   కరియందు మదాంబుధార కడుబెడఁ గయ్యెన్. 98

తే. టడల రేఫకారముల్ దొడరెనేని
    యొక్కెడన రెండుమాత్రల లెక్క కెక్కు

    బంట్లు బంటులు నా బండ్లు బండు లనఁగ
    గుంట్ర గుంటర నా గుండ్ర గుండ రనఁగ. 99

క. కూఁతురుపదము రుకారము
   బ్రాఁతిగఁ దాఁ జెడు విభక్తి పైఁ బెట్టినచోఁ
   గూఁతురు కూఁతుం గనియెను
   గూఁతులచేఁ గూఁతువలనఁ గూఁతులధనముల్. 100

వ. అనంతరంబ సంబోధనంబు లెఱింగించెద. 101

తే. ఏకవచనపుఁదుదలందు నెలసి నిలుచు
    నుత్వ మత్వ మౌ నిత్వంబు నీత్వ మొందు
    నార బహువచనంబు పైఁ జేరి నిలుచు
    హ్రస్వములు నిడుపు లగుఁ గవ్యనుమతమున. 102

క. సుతుఁడ సుతుండా యనఁగ సు
   దతి సుదతీ యనఁగ విమలతరమతులారా
   హితకారులార యనఁగా
   నతిశయముగ వరుసతో నుదాహరణంబుల్. 103

క. అమర డు సంబోధనత
   త్సమములఁ బొడచూపు నొక్కతఱి నోపురుషో
   త్తమ యోపురుషోత్తముఁడా!
   విమలయశా విమలయశుఁడ వినుమని చనుటన్. 104

వ. యుష్మదస్మత్పదంబు లెఱింగించెద. 105

ఆ. ఎలమి నీవు మీరు నే నేము ప్రథమలు
    నిన్ను మి మ్మనంగ నన్ను మమ్ము
    నన ద్వితీయ లయ్యె నని యుష్మదస్మత్ప
    దములు దెలియ నూత్నదండి సెప్పె. 106

క. నీమీలకు నామాలకు
   ధీమహితా వరుసతోఁ దృతీయాదులయం
   దేమఱక చేతనాది
   స్తోమం బిడ నేకబహువచోనియతి యగున్. 107

క. దేవా నీచే నీకున్
   నీవలనన్ నీధనంబు నీయం దనఁగా
   దేవా మీచే మీకున్
   మీవలనన్ మీధనంబు మీయం దనఁగన్. 108

క. దేవా నాచే నాకున్
   నావలనన్ నాధనంబు నాయం దనఁగా
   దేవా మాచే మాకున్
   మావలనన్ మాధనంబు మాయం దనఁగన్. 109

వ. అనంతరంబ సమానంబు లెఱింగించెద మొదలిపదంబు విభక్తులఁ బుచ్చి మీఁదిపదంబులతోడ సమ్యక్సంసక్తంబు లగుటం జేసి సమాసంబు లయ్యె నని పూర్వపదార్థప్రధానంబును నుత్తరపదార్థప్రధానంబును నన్యపదార్థప్రధానంబును నుభయపదార్థప్రధానంబును ననం జతుర్విధంబులై వర్తిలు నందుఁ బూర్వపదార్థ ప్రధానం బెట్టి దనిన. 110

క. పెడతలయును క్రేఁగన్నులు
   నడురే యెడకాలు మనుజనాథుఁడు రిపుఁ దా
   నెడగాలఁ బెట్టె ననఁ బొలు
   పడక నుదాహరణము లగు నభినవదండీ. 111

వ. ఉత్తరపదార్థప్రధానం బెట్టి దనిన. 112

క. చలిగాడ్పు నల్లగలువలు
   వలవంతలు తెల్లదమ్మి వలిక్రొవ్విరియె
   తైలమావిమోక జెంజిగు
   రలరమ్ములు నాఁగ నివి యుదాహరణంబుల్. 113

క. అని యగు గుణిపిఱుఁద గుణం
   బనువుగ బోధించుచోట నది గాదే న
   ట్ల నకార ముండు నల్లని
   కనుఁగవ యన నల్లగన్నుఁగవ యనఁ జనుటన్. 114

వ. అన్యపదార్థప్రధానం బెట్టి దనిన. 115

తే. చలివెలుఁగు వేఁడివెలుఁ గనఁ బులుఁగుపడగ
    నలువ యన మచ్చెకంటి నా నలరువిల్తుఁ

    డనఁగ వాతివాడియు జేతలాడి యనఁగఁ
    దనరు నన్యపదార్థప్రధానచయము. 116

వ. ఉభయపదార్థప్రధానం బెట్టి దనిన. 117

ఆ. తల్లిదండ్రు లన్నదమ్ములు గూడ్కూర
    లెలమి నాలుబిడ్డ లెద్దుబండ్లు
    బంటుఱేఁడు లాటపాటలు నుభయప్ర
    ధానమునకు నివి యుదాహరణములు. 118

క. ధీనిధి గుణపదములపై
   మానుగ హల్లున్న నంతిమము లగు ములకున్
   బూని పునాదేశం బగు
   భూనుత పైనచ్చు లున్నఁబుట లగు ములకున్. 119

క. వాదపుఁబంతంబులును బ్ర
   మోదపుశృంగారములును ముత్యపుసరులున్
   జూదపుటాటలు నెయ్యపు
   టాదరములు ననఁగ నివి యుదాహరణంబుల్. 120

ఆ. ఇల్లు కల్లు ముల్లు పల్లును విల్లును
    కన్ను మున్ను వెన్ను చన్ను నాఁగఁ
    బరఁగు శబ్దములకుఁ బైహలాదులతోడ
    నదుకు నపుడు జడ్డ లడఁపఁ జెల్లు. 121

క. విలుకాఁ డిలువడి గలుపని
   ములుపొద పలువరుస లెస్స మునుగా ల్చనుము
   క్కులు గనుగొనలు వెనుస్రా
   పలవడు నని చెప్ప నివి యుదాహరణంబుల్.

తే. ఓలి రెండును మూఁడును నాలు గనఁగఁ
    బరఁగుపదములఁ బట్టిన నిరు ము నలులు
    పొరయు ములమీఁద జడ్డలౌ నిరువదియును
    ముప్పదియు నలువదియు నా నొప్పుఁ గాఁగ.

క. తెనుఁగులఁ గొన్నిఁటిలో మును
   కొని జడ్డలతోడ నిలిచి క్రొన్నెలు కృతికిన్
   బనివడి క్రొత్తయు నెఱయును
   ననుటఁ దెలియఁ జెప్పు వరుస నవి యెట్లనినన్.

క. క్రొన్నెల క్రొమ్మెఱుఁగులు నాఁ
   గ్రొన్నన క్రొక్కారు నాఁగఁ గ్రొత్తమ్ములు నా
   నెన్నడుము నెమ్మొగము నా
   నెన్నడ నెత్తావి యనఁగ నెన్నుదు రనఁగన్.

క. తెలుఁగున కెంచెమ్ములు మును
   గలవాక్యము లరుణకాంతి గావించును గెం
   దలిరులు కెందమ్ములు నాఁ
   జెలువుగఁ జెంగల్వ లనఁగఁ జెందొవలనఁగన్.

క. వే రనియెడుశబ్దం బే
   పారం దెనుఁగులకు మొదల నధికత దెలుపున్
   బేరాఁకలి పేరామని
   పేరాముదపాకు లనఁగఁ బేరింపనఁగన్. 127

క. తన నా నీ యనుపలుకుల
   నెనయంగ హలాదు లదుకునెడ దుఱ్ఱు నగున్
   తనదుధనము నాదుగుణం
   బన నీదుయశంబు నాఁగ ననువై యునికిన్. 128

క. నెరిఁ గులజులపై సరి దా
   నెరయఁగ బహువచనషష్ఠి నిలుపఁగ నగుఁ గ
   మ్మరిగడి మేదరిగడి కం
   చరిగడి మూసరితెఱంగునను ననఁ జనుటన్. 129

తే. పెక్కుసంస్కృతశబ్దంబు లొక్కపదము
    క్రిందఁ దద్విశేషణము లిం పొందఁ గూర్చి
    తెలుఁగు తత్సమాసముక్రిందఁ గలుపునప్పు
    డగ్రపదముతో నిల నగు నర్థఘటన. 130

తే. తనవిశిష్టకులాచారధర్మ మనఁగఁ
    దనజగద్గీతసాధువర్తన మనంగఁ
    దనదిగంతరవర్తిప్రతాప మనఁగ
    నివి యుదాహరణంబు లై యెందుఁ జెల్లు. 131

క. దినకరకొడుకునకును సరి
   యనిమిష మొదవునకు సాటి యని యిబ్భంగిన్
   దెనిఁగింప సంస్కృతములం
   దెనుఁగులు సంధించిరేనిఁ దెగడుదు రార్యుల్. 132

క. తెనుగుపదంబులపైఁ బెం
   పొనరఁగ సంస్కృతముచెల్లు నొక్కొకచోటన్
   మును సుకవీంద్రులు గృతులన్
   బనిగొని రచియించినట్టిపరిపాటిమెయిన్. 133

క. వాఁడిమయూఖము లనఁగా
   వేఁడిపయోధార లనఁగా వింజామర నా
   మూఁడస్త్రంబు లనంగాఁ
   బోఁడిమిఁ గఱకంఠనామము న్బోలి తగున్. 134

క. నీ సంస్కృతంబుతోడ స
   మాసించును నీవినూత్నమణినూపురశ
   బ్దాసక్తచిత్తహంస
   త్రాసకరాంబుదము నాఁగఁ దఱుచై యునికిన్. 135

క. ముదమున నా యీ యేలను
   పదములతుద నూష్మ లుడుగఁ బైవర్ణముతో
   నదుకునెడఁ గుదియు సాగును
   గుదియునెడన్ జడ్డవ్రా లగున్ బైహల్లుల్. 136

క. ఆకామిని యక్కామిని
   యీకొడు కిక్కొడుకు నాఁగ నీయూ రియ్యూ
   రేకార్యం బెక్కార్యం
   బాకథ యక్కథ యనఁగ నుదాహరణంబుల్. 137

వ. అనంతరంబ క్రియాపదంబు లెఱింగించెద. 138

క. ఇల నొరుఁడు నీవు నేనును
   నలిఁ జేసినపనులు క్రియలు నానావచనం
   బులు కాలత్రితయంబున
   నలవడి యీక్రియలు చెల్లు నభినవదండీ. 139

క. ఎన్నఁగ భూతార్థమునెడ
   నెన్నగువర్తించునర్థ మెఱుఁగఁ బలుకుచో
   నున్నగు భవిష్యదర్థము
   నున్నంగాఁ బలుకుచోట నూతనదండీ. 140

క. ఒరులకు నెను నిరి యగును నె
   దిరికిఁ దివితికారములును దిరి యగుఁ దనకున్
   బరువడిఁ దినియున్ దిమియున్
   బొరయు నుభయవచనములకు భూతక్రియలన్. 141

క. పలికెను బలికి రనంగాఁ
   బలికితివి పలికితి మఱియుఁ బలికితి రనఁగాఁ

    బలికితిని బలికితి మనఁగ
    నలఘుమతీ వరుసతో నుదాహరణంబుల్. 142

క. డును దరు లొరులకు నెదిరికిఁ
   దనరంగా దు దవు దరులు తనకు దను దమున్
   జను నేకబహువచనములు
   మనుసన్నిభ క్రియల వర్తమానార్థములన్. 143

క. అడిగెడు నడిగెద రనఁగా
   నడిగె దడిగెదవు ధనంబు నడిగెద రనఁగా
   నడిగెద నడిగెద మనఁ బొ
   ల్పడరంగా వరుసతో నుదాహరణంబుల్. 144

క. ఉను దురు లొరులకుఁ జెప్పను
   దనరఁగ దువు దురు లెదిరికిఁ దనకు దును దుముల్
   దనరఁగ నివి యేకబహువ
   చనము లగు భవిష్యదర్థసంసూచకముల్. 145

క. పలుకును బలుకుదు రనఁగాఁ
   బలుకుదువు పలుకుదు రనఁగఁ బలుకుదు నర్థిన్
   బలుకుదు మనఁగా నిన్నియు
   నలఘుమతీ వరుసతో నుదాహరణంబుల్. 146

క. స్థావరతిర్యక్ప్రతతుల
   కేవెరపునఁ గ్రియలు పొందు నేకవచనమున్

    దేవమనుష్యాదిక్రియ
    భావింపఁగ నేకవచన బహువచనంబుల్. 147

క. శిల గదలె శిలలు గదలెను
   బులి గఱిచెం బులులు గఱిచె బోటి చనియె బో
   టులు చనిరి ముని యలరె మును
   లలరిరి నా వరుసతో నుదాహరణంబుల్. 148

క. [16]ఉటపరపదములె క్రియ లగు
   చుటలొక్కెడ యుటలు వుటలు చుట్టంబులఁద్రో
   వుట ద్రోయుట యన చుటలున్
   బుటలును నగు సంస్కృతంబు పొందినచోటన్. 149

క. పుటచేతనైన నొరుఁ బం
   పుట చుటచే నైన నొరులఁ బుత్తెంచుట చే
   యుట యుటచే నగు నని యా
   పటుమతి యగునూత్నదండి ప్రకటముచేసెన్. 150

క. పలుకుట పలికించుటయును
   నలుగుట యలిగించుటయును నబలలు మదిలో

    వలచుట వలపించుటయును
    తలఁచుట తలపించుటయు నుదాహరణంబుల్.

క. అసమస్త లఘుద్వ్యక్షర
   లసితము లగు తత్సమంబులం జెప్పెడిచో
   పొసఁగు నియించుటయున్ గ్రియ
   లసదృశ యించుటయె క్రియల నగు పెఱయెడలన్.

క. వరియించుటయు వరించుట
   తిరముగ నుతియించుటయు నుతించుట బలిమిన్
   బరు భంజించుటయును సం
   హరించుటయు వరుసతో నుదాహరణంబుల్.

తే. ప్రార్థనార్థంబుచోటను బ్రశ్నచోట
    సంశయం బుండుచోట నిశ్చయముచోటఁ
    దెగడుచోటను నేత్వంబు తెనుఁగునందు
    నోయొ లొందును సంశయం బొందుచోట.

క. పోవే వానలు గలవే
   నీవే ననుఁ బిలిచి తిపుడు నియతుం డతఁడే
   నీవు పొలియవే యమృతమొ
   త్రావును విషమోయనఁగ నుదాహరణంబుల్.

క. ఎంచఁగ నేఁగుపదముతుదఁ
   దెంచుట యగుఁ గ్రియల నరుగుదెంచుటపై కే

    తెంచుట చనుదెంచుట నడ
    తెంచుట తోతెంచు టనఁగఁ దెల్లం బగుచున్.

క. ఒకకర్త చేయుపనులకుఁ
   బ్రకటితముగ మొదలయినపని యిత్వాంతం
   బకృతం బైనను కాంతం
   బకుటిల కర్తవ్యకార్య మన్వంత మగున్. 157

ఆ. ఆడఁబోయి చూచి యలిగెఁ బెట్టక త్రోచె
    వినక పలికె నియ్యకొనక చనియె
    కుడువ నేఁగె వేఁడుకొన నాసతో వచ్చె
    నన నుదాహరణము లయ్యెఁ గృతుల. 158

క. తినుటకును తింట యగు మఱి
   కొనుటకుఁ గొంట యగుఁ గనుటకుం గంట యగున్
   వినుటకు వింట యగున్ దా
   ననుటకు నంట యగు వలసినప్పుడు కృతులన్. 159

క. ఉటలకును వక లగు తెనుఁగు
   చటులకు వక లగును గదియుచో మును దాఁజే
   యుటకున్ జేయక మును ద్రో
   చుటకున్ ద్రోవక మునును బ్రచురమై యునికిన్. 160

క. దీవెన కెడమయుఁ గాతయుఁ
   గావుతయున్ దెనుఁగుకవులకబ్బంబులలో

    శ్రీవెలిఁగెడ మధిపుఁడు మేల్
    గావించుంగాత మేలుగావుత యనఁగన్. 161

తే. ఏపదముపైఁ గాఁడు నేర్పెల్లఁ దెలుపు
    గొనబుకాఁడు బలిమికాఁడు కొండెకాఁడు
    చనవుకాఁడు చెలిమికాఁడు జాడగాఁడు
    బందికాఁ డన నెల్లెడఁ బరఁగుచుండు. 162

ఆ. ఈఁడు బాస దెల్పు నీఁడు గుణము దెల్పు
    నీఁడు కులము దెల్పు నెల్లయెడలఁ
    గన్నడీఁడు నాఁగఁ గపటీఁడు నాఁగ సా
    లీఁడు నాఁగ వేరులేక చనుట. 163

క. ఇండి యనుట లే దనుటయె
   యొండొకయర్థంబు గలుగ నోపదు ధర ము
   క్కిండియు వెరవిండియు వ్రా
   యిండియు ముప్పిండి యనఁగ నేర్పడియునికిన్. 164

తే. ఆఁడు నరియును నధమకార్యములఁ దెలుపు
    బొంకులాఁడు తగవులాఁడు ఱంకులాఁడు
    పెంటిపెనపరి ముండరి తుంటరియును
    గల్లరియు నన నెల్లెడఁ జెల్లుఁ గాన. 165

క. అమి లేమికి నిమి కల్మికి
   నమరంగాఁ దనము ధర్మ మగుటకుఁ దగుఁ గా

    నమి వినమి తాల్మి కూరిమి
    తమమంచితనంబు లోభితన మనఁ జనుటన్. 166

క. ఆఁడును నీఁడును గత్తెయుఁ
   గాఁ డనుచోఁ గర్త యగు జగం బెఱుఁగంగా
   బోఁడి యనఁగ నెల్లెడలను
   నాఁడుం బేళ్లకును జెల్లు నభినవదండీ. 167

క. అలికి రా లగు దిగువ గు
   ణాలి నిలిపి పలుకుచోట నను వగునెడ గొ
   డ్రాలు జవరాలు పాతకు
   రాలు గెడపురాలు ముద్దరా లనఁ జనుటన్. 168

అ. అచ్చతెలుఁగుమాట నను వైనచో వకా
    రము గకారరూప మమరఁ దోఁచుఁ
    దీవె తీగె యనఁగ జేవ చేగ యనఁగఁ
    బవలు పగలు నాఁగఁ బరఁగుఁ గాన. 169

తే. ఆతఁ డిట్టివాఁ డెట్టివాఁ డట్టివాఁడు
    నాఁగఁ జనునట్టిత్రితయమునకుఁ గ్రమమున
    నాతఁ డిట్టిఁడు నెట్టిఁడు నట్టిఁ డనఁగఁ
    దగుల నిమ్మెయి నభినవదండి చేసె. 170

తే. అన్యుఁ బిలుచుచో నిడుద లౌ నక్షరములు
    కుఱుచ లై జడ్డముల మోదుఁ గొన్నియెడలఁ

    కొడుక రా మఱి కొడుక పో కొడుక రమ్ము
    కొడుక పొ మ్మన జగతిలోఁ గూడుఁ గాన. 171

తే. అన్యుఁ బనుపుచో నుఱ్ఱంత మైనశబ్ద
    మచ్చు పైనున్న ముఱ్ఱంత మగుట నిజము
    మొనసి పొడు వరిసేనల ననఁగఁ జనదు
    పొడువు మరిసేన ననుటయె పోలుఁ గాని. 172

తే. చునులపై నకారము పొడచూపుఁ బోవు
    నొప్ప నచ్చులు పై డాసి యుండెనేని
    యొదవుచున్నచో నొదవుచునున్న చోట
    పొడుచుచడరెను బొడుచుచునడరె ననఁగ. 173

ఆ. అందు నిందు నెందు ననునర్థములు మఱి
    యటయు నిటయు నెటయు నగుఁ గ్రమమునఁ
    గ్రియలు రాక పోక లయి మీఁదనుండిన
    నుతగుణాభిరామ నూత్నదండి. 174

క. అటపోయెడి నిటవచ్చెడి
   నెటకరిగెడి ననుట యుచిత మిటువలెఁ గాదే
   నటయాడెడి నిటపాడెడి
   నెటగూర్చున్నాఁ డనంగ నెసఁగవు గృతులన్. 175

క. సల్లలితైకపదముపై
   నిల్లు నిలును గ్రియలఁ గొన్నియెడలను దగ సం
   ధిల్లుట శోభిల్లుటయుఁ బ్రభ
   విల్లుట యన జగతిలోన బెడఁ గై యుండున్.

క. మల్లెయు లంజెయు గద్దెయు
   నొల్లెయు ననుపగిదిపలుకు లొప్పవుఁ గృతులన్
   మల్లియ లంజియ గద్దియ
   యొల్లియ యని పలికి రేని యొప్పున్ గృతులన్.

క. ఱవ డవలపై వకారము
   కవియనుమతిఁ బోవు ఱడలు కడునిడుపు లగున్
   శివు మఱవండు మఱాఁడు గ
   డవఁబలికెను వాఁడు శివు గడాఁ బలికె ననన్.

క. దూయుట దాఁగుట దొంగయు
   దాయుట యని చెప్పిరేని దనరును గృతులన్
   డూయుట డాగుట డొంగయు
   డాయుట యని చెప్పినను బెడంగగుఁగృతులన్.

క. ఇన భూతార్థముఁ దెలుపును
   గనుఁగొనఁగాఁ గర్తృకరణకర్మంబులఁ బం


1. సర్వలక్షణసారసంగ్రహము - తిమ్మకవి

    డినవాఁ డనఁ బొడిచినవా
    లనఁ బండినకొలుచు నాఁగ ననువై యునికిన్. 180

క. ఇనపై నుండునకారం
   బును పై వాఁ డనుపదంబు మొదలినకారం
   బును జడ్డనకారం బగుఁ
   గనినాఁ డభిమతములోలిఁ గన్నాఁ డనఁగన్. 181

క. వినెఁ గనెఁ గొనె ననుపగిదిన్
   జనుపలుకుల నుండు నడఁగు సంబంధంబుల్
   వినియెఁ గనియెఁ గొనియె ననఁగ
   ననువై వర్తిల్లుఁ గాన నభినవదండీ. 182

క. మానుగ నఱ్ఱి ఱ్ఱంతము
   లైనపదము లూఁదఁబలుక నగు నె ఱ్ఱుఱ్ఱం
   తానేకశబ్దజాలము
   దా నఱ్ఱంత మగు నూది తగఁ బల్కునెడన్. 183

క. దాతయె కల్పమహీజము
   నీతియె బ్రతుకునకుఁ దెరువు నిఖిలకళాని
   ష్ణాతుఁడ మహాత్ముఁ డన ని
   ట్లాతతముగఁ జెల్లుఁ గాన నభినవదండీ. 184

క. ఉత్తమగుణసూచక మగు
   నెత్తమ్మియు నెమ్మొగంబు నెత్తావియు నా
   నిత్తెఱఁగున రసికులు దమ
   చిత్తము రుచియించుచోటఁ జెప్పుదు రొప్పన్.

క. పెక్కిటి కొకక్రియ యిడుచో
   నొక్కటఁ దుదినొండె మొదలనొండెను మఱి యొ
   క్కొక్కటి కొండెను బెట్టుదు
   రక్కట క్రియ నడుమఁ బెట్ట రాంధ్రకవీంద్రుల్.

క. కరి యరిగెఁ దురగ మరిగెను
   గరియున్ దురగంబు నరిగెఁ గ్రక్కున నరిగెన్
   గరియును దురగము ననఁ దగుఁ
   గరియరిగెన్ దురగ మనినఁ గైకొన రార్యుల్.

క. తీవెల మ్రాఁకులపేరులు
   పూవులకున్ బేళ్లు మొగలిపువ్వులు దక్కన్
   గ్రోవుల మల్లెలు జాజులు
   దా విరివాదు లని చెప్పఁ దగుఁ బెక్కులుగన్.

క. మానయు జేనయు లోనగు
   నానాపరిమాణములు జనము గొలుచునెడన్

    మానెఁడు జేనెఁడు ననుక్రియ
    మాన కెఁడులనొందుమీఁద మ్రానయకేతా.

క. తెలుఁగు.............క్షణము భువి
   ................దండి చెప్పె నభిథానములో
   ...........................లన్నియు
   దెలియుఁడు సత్కవులు మేలు దేటపడంగన్.

క. తప్పులు దీర్పుడు కవులం
   దొప్పులు గైకొనుడు దీనికోపనివారల్
   తప్పొప్పని వెడబుద్దులు
   విప్పకు డీయన్నలారవేడెద మిమ్మున్

ఆ. పాలునీరువేఱు పఱచునా కలహంస
    రీతిమ్రాన యార్యకేతనకవి
    ఆంధ్రలక్షణంబు నలరంగనాచంద్ర
    తారకంబుఁగాఁగఁ దా రచించె.

గద్యము. ఇది శ్రీమదభినవదండివిరచితం బైన యాంధ్రభాషాభూషణంబునందు సర్వంబును నేకాశ్వాసము.


చెన్నపురి : వావిళ్ల రామస్వామిశాస్త్రులు అండ్ సన్స్‌వారి వావిళ్ల ప్రెస్సున ముద్రితము. - 1949

  1. జ్జనుల న్మదిందలచి
  2. నతిశయంబు
  3. నొకొండొక
  4. చెప్పునే
  5. నీతఁ డని.
  6. ‘నన్ను కవి’ పాఠాంతరము.
  7. 'ల్లవంతి' అని పాఠాంతరము గలదు.
  8. కొన్నిప్రతులలో, లేదు.
  9. తెలివిడిగంబలుక నచ్చ
  10. దేశ్యంపు
  11. ముద్దరాజు రామన రాఘవపాండవీయ వ్యాఖ్య.
  12. ఇందలిపాఠభేదాదులు పీఠికలో జూపఁబడినవి.
  13. బొడసూపుసున్న; బొడసూపు నొకఁడు.
  14. ముద్దరాజు రామున రాఘవపాండవీయవ్యాఖ్య
  15. డులు రును బెరపదము.
  16. క. 'పుటచుటపదములు క్రియలగు
          చుటలును యుటతలును బెద్దచుట్టంబులు త్రో
          చుట త్రోపు కోఁతకొనుటయు
          తలపుటయు సుటలును సంస్కృతము లొందినచోన్.' అని పాఠాంతరము.