ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగం 2020-21

శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్,

గౌరవనీయ ఆర్థిక శాఖామాత్యుల వారి ప్రసంగం

16 జూన్, 2020

గౌరవనీయ అధ్యక్షా! గౌరవ సభ్యులారా!

2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెటును మీ అనుమతితో గౌరవ సభా సదుల ముందు ప్రతిపాదించబోతున్నాను.

1. వరుసగా రెండవ సంవత్సరం కూడా రాష్ట్ర వార్షిక బడ్జెటును ప్రతిపాదించే అవకాశాన్ని నాకు అందించిన గౌరవ సభాపతి వర్యులకు, సభా నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాన్య ముఖ్యమంత్రి శ్రీ వై.యస్. జగన్ మోహన్ రెడ్డిగారికి, గౌరవ సభ్యులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.

2. ఇప్పుడు ప్రపంచం అంతా కోవిడ్-19 అనే మహమ్మారితో కనీవిని ఎరుగని సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ఇంతవరకు మనకు తెలిసిన జీవన వ్యవహారం ప్రపంచం అంతటా ఒక్కసారిగా ఆగిపోయింది. కోవిడ్-19 మహమ్మారితో సాగిస్తున్న సమరంలో మన ప్రభుత్వం ముందు వరుసలో నిలబడడమే కాక, మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై.యస్. జగన్ మోహన్ రెడ్డిగారి సమర్థ నేతృత్వంలో పూర్తి అంకితభావంతో శాయశక్తులు ఒడ్డి పోరాడుతున్నది.

అన్నిటికన్నా ముందు ఈ సమరంలో ముందువరుసలో నిలబడి నిస్వార్థంగా విధి నిర్వహణ చేస్తున్న వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి, గ్రామ, వార్డు వాలంటీర్లు మరియు సచివాలయ సిబ్బందికి, పోలీసు సిబ్బందికి, పంచాయత్ రాజ్, మునిసిపల్ శాఖల సిబ్బందికి, ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు చెందిన సిబ్బందికి, వారి కుటుంబాలకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియచేస్తున్నాను.

3. గత కొద్ది రోజులుగా కోవిడ్-19 వలన విధించిన నిర్బంధమును అంచెలంచెలుగా సడలిస్తూ, ఆర్థిక వ్యవస్థ కుంటుపడకుండా మన ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకుంటున్నది. ఈ విషమ పరిస్థితులలో కూడా 2020-21 కి సంబంధించిన ఆర్థిక కార్యాచరణ ప్రణాళిక ద్వారా ప్రజల ఆకాంక్షలను నేరవేరుస్తామని తెలియచేస్తున్నాను.

'అన్ని రకాల సంపదల్లో పేదలకు భాగం కల్పించిన వాడే నిజమైన నాయకుడు'

4. అనే మాటలను స్ఫూర్తిగా తీసుకొని అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం మేనిఫెస్టోని తయారు చేసి, ఆ మేనిఫెస్టోలోని వాగ్దానాలలో 90 శాతము మొదటి సంవత్సరంలోనే నెరవేర్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై.యస్. జగన్ మోహన్ రెడ్డిగారికి ప్రజల తరపున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ అద్భుత విజయం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. జాతిపిత మహాత్మాగాంధీగారి స్ఫూర్తిదాయక పలుకులు ఈ సందర్భంగా గుర్తు చేసుకుందాం:

'మన చర్యలే మన ప్రాధాన్యతలను ప్రదర్శిస్తాయి'

5. మన ప్రియతమ నాయకులు కీ॥ శే॥ శ్రీ వై.యస్. రాజశేఖర్ రెడ్డి గారు నమ్మిన ఈ దృక్పథాన్నే వారసత్వంగా అందిపుచ్చుకున్న మన గౌరవ ముఖ్యమంత్రిగారు ప్రజల జీవితంలో మేలి మార్పులు తెచ్చినప్పుడే మన ముందుచూపుకు సార్థకత అని భావిస్తారు. ప్రియతమనేత అడుగు జాడలలోనే మన ప్రభుత్వం కూడా రైతులు, కౌలు రైతులు, తల్లులు, యువత, స్వయం ఉపాధిలో ఉన్నవారు, బడుగువర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న ముఖ్య సమస్యలపై దృష్టి పెట్టి, వారి ఆకాంక్షలను నెరవేర్చడానికి నిరంతరం అంచనాలకు మించి కృషిచేస్తున్నది.

6. మన ప్రభుత్వం జూన్ 2019 లో అధికారాన్ని అందుకునేటప్పటికీ మనం పరిష్కరించవలసిన ఎన్నో సమస్యలు, అడ్డంకులు మన ఎదుట ఉన్నాయి. ఎన్నో పెను సవాళ్ళకు మనం ఎదురీదవలసి వచ్చింది. అప్పటికే నీరసిస్తున్న మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ భారం మన భుజాలపై పడింది. 2018-19 సం॥లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి కేవలం 8.8% మాత్రమే పెరిగింది. అప్పటికే గత ప్రభుత్వం పదేపదే ఘనంగా చెప్పుకుంటూ వున్న రెండంకెల వార్షిక ప్రగతి అవాస్తవమని తేలింది. గత ప్రభుత్వం వదిలిపెట్టి వెళ్ళిన బకాయిలు దాదాపు రూ. 60,000 కోట్ల మేరకు పెండింగ్ బిల్లుల రూపంలో సునామీలా వచ్చి పడుతూనే ఉన్నాయి. 2019-20, 2020-21 సంవత్సరాల్లో కేంద్ర పన్నుల బదలాయింపులో తగ్గుదల, 2020-21 సంవత్సరానికి సంబంధించిన డివిజబుల్ పూల్ లో తగ్గిన వాటాతో పాటు, కోవిడ్-19 వల్ల ప్రకటించిన లాక్ డౌన్ చర్యల వల్ల తగ్గుముఖం పట్టిన ఆదాయ వనరులు మన ఆర్థిక సమస్యను మరింత తీవ్రతరం చేశాయి. అయితే నేను ఈ సమస్యలను మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళినప్పుడు వారు నెల్సన్ మండేలా గారి క్రింది వ్యాఖ్యల్ని గుర్తుచేశారు.

'ఎవరైనా తాము చేపట్టాలనుకుంటున్న మార్పుని సాధించడానికి పరిపూర్ణంగా అంకితమైతే ప్రతికూల పరిస్థితుల్ని అధిగమించి విజయం సాధిస్తారు'

7. నేను ఇంతదాకా విన్నవించిన ప్రతికూల పరిస్థితుల ముందు మరొక ప్రభుత్వం ఏదైనా ఉండి ఉంటే పూర్తిగా చేతులు ఎత్తివేసి ఉండేది. కానీ, గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ వై.యస్. జగన్ మోహన్ రెడ్డిగారి వజ్ర సంకల్పం, అజేయ సామర్థ్యాల ముందు ఈ ప్రతికూలతలు నిలబడలేకపోయాయి. సామాజిక చట్రంలో అట్టడగున ఉన్న ప్రజలను ప్రత్యక్ష ఆర్థిక సహాయం ద్వారా పైకి తీసుకురావాలని, అదే విధంగా మౌలిక సదుపాయాల కల్పనలో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఆర్థిక వ్యవస్థ రూపురేఖలను మార్చాలని వారు తీసుకున్న నిర్ణయాలు పరిపాలనా సవాళ్ళకు ఎదురీది నిలబడ్డాయి.

8. గత ప్రభుత్వం ఇష్టానుసారంగా ప్రభుత్వ ధనాన్ని వ్యయపరిచే అలవాటును మన ప్రభుత్వం వ్యతిరేకించింది. అందుకు బదులుగా మనం ప్రభావశీలమైన లక్ష్యసాధనకు నిర్దేశించుకున్న కార్యాచరణ పైనే దృష్టి పెడుతూ వచ్చాం. ప్రభుత్వం అంటే ప్రజా ధనానికి ధర్మకర్త అని ఈ ప్రభుత్వం విశ్వసిస్తున్నది. తమ పట్ల ప్రజలు చూపుతున్న విశ్వాసాన్ని నిలబెట్టుకోవడానికే అహర్నిశలు కృషి చేస్తున్నది. ఆర్థిక సంస్కరణల ప్రాధాన్యతలను రాష్ట్ర అభివృద్ధి ప్రయోజనాలతో మేళవించి ముందుకు సాగవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. ఈ క్రమంలో బీద ప్రజలు, బడుగు జీవుల ప్రయోజనాలను సంరక్షించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. అదే సమయంలో ప్రజలకు మరింత మెరుగైన జీవితాన్ని అందించే దిశగా పెట్టుబడులను, సంతులిత ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించవలసిన అవసరం కూడా ఉంది.

9. ఈ క్రమంలో మనకు ఎదురవుతున్న సవాళ్ళను గుర్తించిన తరువాత మన ప్రభుత్వం వాటికి సార్థకమైన పరిష్కారాలను సమకూర్చే దిశగా తన శక్తియుక్తులను మోహరిస్తున్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ఉజ్జ్వల భవిష్యత్తును సాధించుకునే దిశగా ఒక దీర్ఘకాలిక వ్యూహాన్ని రూపొందించుకునే పని మనం ఇప్పటికే మొదలు పెట్టాం. మన కార్యాచరణ పథం ఏ విధంగా ఉంటుందో, మన మేనిఫెస్టోలో తేటతెల్లం చేశాం. మన ప్రియతమ ముఖ్యమంత్రి గారి సమర్థవంతమైన నేతృత్వంలో మన ప్రభుత్వం మేనిఫేస్టోలో ప్రకటించిన వాగ్దానాలను ఇప్పటికే నవరత్నాల ద్వారా అమలు చేయటం మొదలుపెట్టింది. మేనిఫేస్టో అంటే ఎన్నికలు అయిపోగానే మర్చిపోయే ఒక కాగితం కాదని నేను గత ఏడాది నా బడ్జెటు ప్రసంగంలో చెప్పిన మాటల్ని మరొకసారి గుర్తుచేస్తున్నాను. మన ప్రభుత్వానికి మేనిఫేస్టో అనేది మనం దారి తప్పిపోకుండా ముందుకు తీసుకుపోగల దిక్సూచి అని మన గౌరవ ముఖ్యమంత్రిగారు అనుక్షణం గుర్తు చేస్తుంటారు.

'మాట ఇచ్చేముందు ఆలోచిస్తాను
 ఇచ్చాక ఆలోచించేది ఏముంది
ముందుకు వెళ్లాల్సిందే' అన్నారు డా|| వై.యస్.ఆర్.

అభివృద్ధి ప్రాధాన్యతలు

10. అభివృద్ధి దిశగా మన ప్రభుత్వం నిర్దేశించుకున్న నమూనాలను, వ్యూహాలను ఇప్పుడు నేను వివరించబోతున్నాను. ఆ ప్రాధాన్యతా క్రమంలో మన బడ్జెటు ప్రతిపాదనలను ఏ విధంగా రూపకల్పన చేశామో వివరించబోతున్నాను.

11.

'కష్టాల్లో ఉన్న ఐదుగు-బలహీన వర్గాల ప్రజలకు సాయం చేయనప్పుడు, వారి ముఖాల్లో చిరునవ్వు వెలిగించనప్పుడు, వారి జీవితాలకు కొత్త వెలుగు ప్రసాదించనప్పుడు అభివృద్ధికి అర్థమే లేదు'

ఈ ఆలోచనతో పేద ప్రజల కష్టాలను తీర్చడానికి మన ప్రభుత్వం 'నవరత్నా'లను మేనిఫెస్టోలో పొందుపరచి తూచతప్పకుండా అమలు చేస్తున్నది. ఈ సంవత్సరం కూడా 'నవరత్నాల' అమలు పట్ల అదే అంకిత భావంతో, బీద ప్రజలకు వై.యస్.ఆర్. పెన్షన్ మొదలగు పథకాల ద్వారా సామాజిక భద్రతను మరింత సమగ్రంగా అమలుపరుస్తున్నది.

'ప్రజా ప్రయోజన కాంక్షేగానీ-ప్రచార కాంక్ష లేకుండా బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే నినాదంగా జగన్ మోహన్ రెడ్డిగారి సారథ్యంలో ప్రభుత్వం ప్రజల ఉన్నతికోసం వ్యయం చేస్తున్నది.

12. ప్రభుత్వ సంస్థలను బలోపేతం చేయకపోతే అభివృద్ధిని, సంక్షేమాన్ని మనం సాధించలేం అన్నది నేను చెప్పదలచుకున్న రెండవ అంశం.

'దేశ ప్రజలు గొప్పవాళ్లయితేనే, దేశం గొప్పదవుతుంది. అలాగే పాలకులు, కార్యశీలురు మరియు ప్రజా సేవాపారాయణులు అయితేనే మంచి పనులు జరుగుతాయి. ప్రజలు మెచ్చే మంచి పనులు చేసేందుకు పాలకుడికి ఉత్సాహం, పట్టుదల, నిబద్ధత, ప్రయత్నం ఉంటే చాలు... తండ్రి వెంట బిడ్డల్లా జనం పాలకుడితో కదిలి వస్తారు... అడగకుండానే స్నేహహస్తం అందిస్తారు.' అన్నారు స్వామి వివేకానంద

వికేంద్రీకరణ పథంలో మేం వేసిన గొప్ప ముందడుగు గ్రామ వాలంటీర్లు మరియు గ్రామ సచివాలయాలు. గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.2 లక్షల కన్నా ఎక్కువమంది యువతను ఉద్యోగులుగా నియమించడం ద్వారా మరియు 2.5 లక్షల కన్నా ఎక్కువ మంది వాలంటీర్లను మోహరించటం ద్వారా ప్రభుత్వం గ్రామ స్థాయిలో పాలనా వ్యవస్థను మరింత పటిష్టపరచింది. వివిధ ప్రభుత్వ శాఖలు అందిస్తున్న 536 రకాల సేవలను ఈ సచివాలయాల ద్వారా ప్రజలు తమ ఇంటి గుమ్మం దగ్గరే అందుకోగలుగుతున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ సచివాలయముల ద్వారా మరిన్ని సేవలను అందించడానికి ప్రభుత్వం ప్రణాళికతో ముందుకు వెళుతుంది.

13. మూడవది. ఉత్పత్తి శక్తులను మరింత సార్థకంగా వినియోగించుకోవటం, వివిధ రంగాల్లో ఉత్పాదకత పెంపొందించడానికి అవసరమైన అన్ని చర్యలు చేపట్టడం ఈ వార్షిక బడ్జెటు తాలూకు ప్రధాన లక్షణంగా చెప్పవచ్చు. సరిగ్గా ఈ కారణం వలననే అన్నదాత లైన మన రైతులు మొదటి ప్రాధాన్యతను పొందుతున్నారు. 'రైతు భరోసా' ద్వారా రైతులకు ఆర్థిక సహాయాన్ని గణనీయంగా అందించడం ద్వారా ప్రాథమిక రంగానికి మూలాలు చేకూర్చటం ఈ దిశగా వేస్తున్న ముఖ్యమైన అడుగు. అలాగే మౌలిక సదుపాయాల కల్పన, ఋణ సదుపాయం అందుబాటులోకి తీసుకురావడం, పారిశ్రామిక రంగంలో మధ్య తరహా, చిన్న తరహా పరిశ్రమలకు సముచితమైన ప్రోత్సాహకాలు మొదలైన వాటి ద్వారా ఆర్థికాభివృద్ధిని సాధించబోతున్నాం.

14. నాలుగవది. మౌలిక సదుపాయాల కల్పనలో పెట్టుబడులు పెట్టడం వలన సాధించగల బహుళార్ధ ప్రయోజనాలను మనమెవ్వరం కాదనలేం. మానవ వనరులు, వస్తువుల తయారీ, సేవలు తదితర రంగాలు ప్రపంచంలో ఎక్కడ అభివృద్ధి చెందినా వాటికి నాణ్యమైన మౌలిక సదుపాయాలే పునాది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కీలక ప్రాధాన్యత కలిగిన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి, అలాగే దుర్భిక్ష నివారణను సాధ్యం చేయగల కొత్త ప్రాజెక్టులను మొదలు పెట్టడానికి చర్యలు తీసుకున్నది. అదే సమయంలో వ్యవసాయం, పరిశ్రమలు, గృహ వినియోగానికి నాణ్యమైన విద్యుత్తు సరఫరాను అందించే లక్ష్యంతో విద్యుత్తు రంగంలో చేపట్టిన సంస్కరణల వల్ల రాబోయే లాభాలను మరింత పటిష్ట పరిచే ప్రతిపాదన చేస్తున్నాము.

15. అధ్యక్షా! ఈ సందర్భంగా నేను అసలు మూలధన వ్యయం అనే భావనపై మళ్ళీ ఆలోచించవలసిన అవసరం ఉందని గౌరవ సభకు తెలియచేస్తున్నాను. మన రాష్ట్ర ప్రజలు వారి జీవన అవకాశాలను మెరుగు పరచటం కోసం వారిపైన వినియోగించే ప్రతి ఒక్క పైసా కూడా మానవ వనరుల పెంపుదలను ఉద్దేశించి పెడుతున్న పెట్టుబడే అని విన్నవించు కుంటున్నాను. ఈ వార్షిక బడ్జెటు ప్రధాన విషయం మరియు మన మేనిఫెస్టో తాలూకు సారాంశం ఇదే. ఇందువలనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మన గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ వైయస్. జగన్ మోహన్ రెడ్డిగారి నాయకత్వంలోనూ మరియు వారి ముందు చూపులోనూ నమ్మకం కనబరుస్తున్నారు. కాబట్టి మనం మానవ వనరుల అభివృద్ధి ప్రాధాన్యతలను ‘అమ్మఒడి', 'జగనన్న విద్యాదీవెన', 'జగనన్న వసతిదీవెన’ పథకాల ద్వారా మరింత బలంగా నొక్కిచెప్పాము. పిల్లలు మరింత చక్కగా చదువుకోవటానికి అనువుగా ఉండే వాతావరణం కల్పించడం కోసం, పాఠశాలల్లో తొమ్మిది మౌలిక అవసరాలను ఏర్పాటు చేయడం కోసం ప్రభుత్వం 'మనబడి నాడు-నేడు' పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల సదుపాయాలను బలోపేతం చేస్తున్నది. అలాగే, గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో ప్రభుత్వ వైద్య సంస్థల మౌలిక సదుపాయాలను ఆధునీకరించడం కూడా ప్రభుత్వ ప్రాధాన్యతలలో అన్నిటికన్నా ముందు ఉన్నది.

16. అధ్యక్షా! ఇప్పుడు నేను వివిధ రంగాల వారీగా చేపట్టిన బడ్జెటు కేటాయింపులను వివరించబోతున్నాను.

మానవ వనరుల అభివృద్ధి

17. ఒక ఆర్థిక వ్యవస్థ రూపురేఖలు మార్చడానికి పౌరులందరికీ ఒక ఉత్పాదకశీల జీవితాన్ని సమకూర్చుకోవటానికి మానవ వనరుల అభివృద్ధిలో పెట్టే పెట్టుబడులు అత్యంత కీలకం. విద్య, వైద్యం, సాంఘిక సంక్షేమం, ఆర్థికాభివృద్ధి రంగాలలో పెట్టే పెట్టుబడుల ద్వారా మన మానవ వనరులు మరింత తొందరగా మరింత శ్రేష్ఠంగా అభివృద్ధి చెందుతాయి.

విద్యారంగం



'దివా వశ్యతి నోలూకః కాకో నక్తం న వశ్యతి
విద్యావిహీనో మూఢస్తు దివా నక్తం న వశ్యతి'


గుడ్లగూబ పగలు చూడలేదు. కాకి రాత్రివేళల్లో చూడలేదు. చదువులేనివాడు రేయింబవళ్ళూ చూడలేదన్నది ఈ శ్లోకం అర్థం. పిల్లలకు బతుకునిచ్చే విద్యను నేర్పాలని మా ప్రభుత్వం సంకల్పించింది. పై మాటలే మాకు స్ఫూర్తి. రాష్ట్రాన్ని చదువుల బడిగా మార్చేందుకు ఎంత ఖర్చుకైనా వెనకాడరాదన్నది ముఖ్యమంత్రిగారి ఆదేశం.

భారతరత్న డా. బాబాసాహెబ్ భీంరావ్ అంబేడ్కర్ గారి ఈ మాటలు ఎన్నడూ నా మదిలో మెదులుతూ ఉంటాయి.

'మానవ మనోవికాసమే మనిషి మనుగడకు పరమార్ధం కావాలి'.

ఈ భావనకి ఎంతో సన్నిహితంగా రూపుదిద్దుకున్నదే మన గౌరవ ముఖ్యమంత్రి గారి మనస్సులో రూపుదిద్దుకున్న 'జగనన్న అమ్మఒడి' కార్యక్రమం.

18. ఈ పథకం ద్వారా దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న (బి.పి.ఎల్) కుటుంబాలకు ఆర్థిక సహాయం కల్పించబడుతుంది. కుల, మత, వర్గ, ప్రాంత వివక్ష లేకుండా వారి పిల్లలు 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు గుర్తింపబడిన ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలో చదువుకోవడం సాధ్యమవుతుంది.

19. పిల్లల్లో ప్రతిభా సామర్థ్యాలు పెంపొందించడానికి ప్రోత్సాహకాలు కల్పిస్తే సరిపోదు. వారు చదువుకోవడానికి అనుకూలంగా ఉండే సదుపాయాలు కల్పించడం కూడా అంతే అవసరం. అందుకు గానూ మొదటి దశలో ఎంపిక చేసిన 15,715 ప్రభుత్వ పాఠశాలల్లో 9 సౌకర్యాలకు సంబంధించిన పనులను తల్లిదండ్రుల భాగస్వామ్యం ద్వారా 'మనబడి నాడు-నేడు' పథకాన్ని అమలు పరచడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. 2020-21 ఆర్థిక సంవత్సరానికిగాను ఈ పథకం కింద రూ. 3,000 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను.

20. 2020-21 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలలో 1వ తరగతి నుండి 10వ తరగతి దాకా విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు 3 జతల యూనిఫారములు, నోటు పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, ఒక జత బూట్లు, 2 జతల సాక్సులు, ఒక బెల్టు, స్కూలు బ్యాగ్ మొత్తం ఒక స్టూడెంట్ కిట్ గా 'జగనన్న విద్యాకానుక' పేర అందించడానికి ప్రభుత్వం నిర్ణయించింది.

21. పాఠశాలలలోనూ, అంగన్‌వాడీ కేంద్రాలలోనూ హాజరవుతున్న మన చిన్నారుల ఆరోగ్య ప్రమాణాల పెంపుదల పట్ల మన గౌరవనీయ ముఖ్యమంత్రి ఎంత శ్రద్ధ కనబరుస్తారో 'జగనన్న గోరుముద్ద' పథకం ద్వారా అర్థమౌతుంది. ఒక తండ్రి తన పిల్లలకు నాణ్యమైన, రుచికరమైన, పుష్టికరమైన ఆహారం అందాలనీ ఎంతగా తపిస్తాడో అంత శ్రద్ధ కనబరుస్తూ గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మధ్యాహ్న భోజన పథకం మెనూ అమలుకు ఆదేశాలు జారీ చేశారు. పుష్టికరమైన ఆహారాన్ని అందించడం కోసం రూపకల్పన చేసిన ఈ కొత్త మెనూ 2020 జనవరి 21 నుంచి అమలవుతున్నది. ఇందులో బెల్లం చిక్కి పులిహోర, పొంగలి, కూరగాయల పలావు మొదలైనవి పిల్లలకి వడ్డించడం జరుగుతోంది. వీటితో పాటుగా మధ్యాహ్న భోజనం వండి పెట్టే వంట మనుషులకు ఇచ్చే నెలవారీ పారితోషికాన్ని రూ.1,000 నుండి రూ.3,000కు పెంచడం జరిగింది.

22. సెకండరీ మరియు ఇంటర్మీడియట్ విద్యాశాఖల నిమిత్తం 2020-21 సంవత్సరానికి గానూ మొత్తం రూ. 22,604 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను.

23. విద్యార్థుల ఉన్నత విద్యావకాశాలను మెరుగుపరచడం కోసం 'జగనన్న విద్యాదీవెన', మరియు 'జగనన్న వసతిదీవెన' పథకాలను అమలు చేయడంతో పాటు, ఈ ప్రభుత్వం ఉన్నతస్థాయి నిపుణుల సంఘం వారి సూచనల ప్రకారం పారిశ్రామిక అవసరాలకు తగ్గట్లుగా ఇంజనీరింగ్ కరికులంను సరిదిద్దింది. రాష్ట్ర విశ్వవిద్యాలయాలలోనూ, వాటి అనుబంధ కళాశాలలలోనూ ఈ కొత్త కరికులం 2019-20 విద్యాసంవత్సరం నుండి అమలు జరుగుతున్నది.

24. ఈ సందర్భంగా ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని యూజిసి వారు 'ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్'గా ఎంపిక చేశారని గౌరవ సభకు సంతోషంగా తెలియచేసుకుంటున్నాను. ఆంధ్ర విశ్వవిద్యాలయానికి రూసా పథకం నుండి నిధులు అందబోతున్నాయి.

25. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను ఉన్నత విద్యా రంగానికి రూ. 2,277 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను.

ఆరోగ్యం

నా చిన్నప్పుడు పెద్దలు

'ఆరోగ్యం పరమం భాగ్యం స్వాస్థ్యం సర్వత్ర సాధనమ్'

అంటూ ఉండగా వినేవాణ్ణి. దాని అర్థం ఆరోగ్యం అన్నిటికన్నా గొప్ప సంపద. దేన్ని సాధించడానికైనా ఆరోగ్యమే నిజమైన సాధనం అని అర్థం.

26. రాష్ట్ర ప్రజలందరికీ ఆరోగ్య సేవలు విస్తరింప చేసే ఉద్దేశ్యంతో ఈ ప్రభుత్వం డా. వై.యస్.ఆర్. ఆరోగ్యశ్రీ పథకం పరిధిని విస్తరింప చేసింది. ఇప్పటికే అందుబాటులో ఉన్న 1059 ఆరోగ్య విధానాలతో పాటు, అదనంగా 1000 ప్రాథమిక ఆరోగ్య విధానాలను కూడా జతపరచడం జరిగింది. 2020 జనవరి నుండి స్మార్ట్ హెల్త్ కార్డుల పంపిణీ మొదలయింది. దాదాపు 1 కోటి 42 లక్షల మేరకు కార్డులు పంపిణీ కానున్నాయి. దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు చెందిన రోగులు శస్త్ర చికిత్సలకు లోనైనప్పుడు వారు కోలుకోవటానికి పట్టే కాలంలో ఉపాధి లభించడం కష్టం కాబట్టి, ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి డా.వై.యస్.ఆర్. ఆరోగ్య ఆసరా పథకం కింద రోజుకు రూ.225 ల మేరకు శస్త్రచికిత్స అనంతర భత్యాన్ని మంజూరు చేయడం జరుగుతున్నది. రాష్ట్ర సరిహద్దుల్లో నివసిస్తున్న దారిద్ర్యరేఖ దిగువన ఉన్న కుటుంబాల సౌకర్యం కోసం తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా డా.వై.యస్.ఆర్. ఆరోగ్యశ్రీ పథకం కింద 130 ఆసుపత్రులను ఎంపిక చేయడం జరిగింది.

అధ్యక్షా!

'సర్వేంద్రియాణాం నయనం ప్రధానం'

అన్ని ఇంద్రియాలలో నేత్రాలు ప్రధానం అని అర్థం.

27. అందరికీ కంటి పరీక్షలు నిర్వహించి తగిన చికిత్సలు, సదుపాయాలు అందించే ఉద్దేశ్యంతో 2019 అక్టోబరు 10వ తేదీన ప్రభుత్వం 'కంటి వెలుగు' కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో మొదటి విడతగా 69 లక్షల మంది పాఠశాల విద్యార్థులను పరీక్షించడం జరిగింది. రెండవ విడతగా 4 లక్షల 60 వేల మంది పిల్లలకు పరీక్షలు చేపట్టాం. మూడవ దశలో 60 ఏళ్ళు పైబడిన వారందరికీ పరీక్షలు చేపట్టబడతాయి. కళ్ళద్దాలు అందించబడతాయి. ఆ పరీక్షల్లో అవసరమని నిర్ధారణ అయిన వారికి శస్త్ర చికిత్సలు చేపట్టబడతాయి. తదనంతర దశల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలందరూ 'కంటి వెలుగు' పథకం కింద లబ్ది పొందనున్నారు. ఇందుకు గాను 2020-21 సంవత్సరానికి గాను రూ.20 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను.

28. అత్యవసర వైద్యసేవలను సకాలంలో అందించడానికి ఈ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నది. ఇందుకు గాను ప్రస్తుతం 108 అంబులెన్స్ పథకం కింద ఉన్న 439 అంబులెన్సులను ప్రతి మండలానికి ఒక్కొక్క అంబులెన్సు వచ్చు విధంగా, అలాగే 292 ఉన్న సంచార వైద్య వాహనాలను ప్రతి మండలానికి ఒక్కొక్క సంచార వైద్య వాహనం వచ్చు విధంగా పెంచనున్నాం. మొత్తం మీద 1,000 కొత్త వాహనాలు ఈ సంవత్సరంలో ప్రారంభించబతాయి. 108 మరియు 104 సేవల కింద ఇందుకు గాను 2020-21 సంవత్సరానికి రూ.470.29 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను.

29. వైద్య, ఆరోగ్య రంగంలో 'నాడు నేడు' పథకం కింద సబ్ సెంటర్ల నుండి టీచింగ్ హాస్పిటల్స్ దాకా మౌలిక సదుపాయాలు, వైద్య సామాగ్రి, అదనపు మానవ వనరుల కల్పనను ప్రభుత్వం చేపట్టింది. గ్రామ, వార్డు స్థాయిలో 11,000 కు పైగా డా.వై.యస్.ఆర్. హెల్త్ క్లినిక్ లను నెలకొల్పుతున్నది. రాష్ట్రం అంతటా దశలవారీగా 15 కొత్త వైద్య కళాశాలలను ప్రారంభించబోతున్నది. కాన్సర్, మూత్రపిండ సంబంధిత సమస్యల చికిత్స మీద ప్రత్యేక శ్రద్ధతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను కూడా 'నాడు నేడు' పథకం కింద చేపట్టనున్నది. ఈ పథకం కింద మొత్తం 1145 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 195 కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు, 28 ప్రాంతీయ వైద్యశాలలు, 13 జిల్లా ఆసుషత్రులు, 11 బోధన ఆసుషత్రులలో మౌలిక సదుపాయాలు ఆధునీకరించబడనున్నాయి. ఇందుకు గాను వైద్య ఆరోగ్యశాఖలో ఉన్న ఖాళీలన్నింటిని నింపడానికీ, పని ఒత్తిడి ఎక్కువగా ఉన్న కేంద్రాల్లో సేవలను మరింత బలోపేతం చేయడానికీ 9,700 మంది ఆరోగ్య సిబ్బందిని నియమించబోతున్నాం. వైద్య ఆరోగ్య శాఖలో ఇంత పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టబోవడం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమం .

30. ఇందుకు గాను ఆరోగ్యశాఖకు 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.11,419.44 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను.

వ్యవసాయం

థామస్ జెఫర్ సన్ చెప్పిన ఈ మాటలు సుప్రసిద్ధం. ఆయన ఇలా అన్నారు:

'మనం చేపట్టే పనులలో వ్యవసాయం అన్నిటికన్నా ఎంతో వివేకవంతమైంది. ఎందుకంటే అది మనకి నిజమైన సంపదనీ, విలువలనీ, సంతోషాన్ని ఇస్తుంది'

'పండించేవాడు పస్తుంటే పరమాత్మకూ పస్తే' అంటారు

అన్నం పెట్టే రైతన్న ఆకలితో అలమటించ కూడదని లక్ష్యంగా నిర్దేశించుకుని మా ప్రభుత్వం అన్నదాతకు అండగా నిలుస్తోంది. లాభాలొస్తున్నాయా లేదా అన్న లెక్కా-పత్రాలతో సంబంధం లేకుండా రైతన్న ఆరుగాలం సేద్యాన్నే నమ్ముకొని కష్టపడుతున్న ఫలితంగానే ఆహార భద్రత సాధ్యమైంది. మరి రైతు భద్రత మాత్రం దశాబ్దాలుగా ఎండమావిగానే మిగిలింది.

కొంత ఎరువు వేసి, కడివెడు నీళ్లు పోస్తే చెట్టు నీడనిస్తుంది, మంచి ఫలాలనిస్తుంది. ఎండిపోయిన తరువాత కూడా ఏదో విధంగా ఉపయోగపడుతుంది. తన పుట్టుకను సార్థకం చేసుకుంటుంది. మరి అన్నం పెట్టి ప్రాణం నిలబెడుతున్న రైతుపట్ల మనం ఎంత కృతజ్ఞతగా ఉండాలి.

'దున్నేవాడు లెక్క చూస్తే నాగలి కూడా మిగలదన్నది' సామెత.

వారి బాగోగులకోసం ఎన్ని కష్టనష్టాలనైనా ఎదుర్కొని పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటిస్తున్నాం. అందుకే మాది రైతుల ప్రభుత్వమని చెబుతున్నాం...

31. రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రధానంగా వ్యవసాయిక ఆర్థిక వ్యవస్థగా మారిపోయింది. వ్యవసాయ రంగం మన ఆర్థికాభివృద్ధిలో ప్రధానపాత్ర వహించడమే కాకుండా, మనకు ఆహార భద్రతను సమకూరుస్తున్నది. నాలుగింట మూడువంతుల కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నది. ఇందువలన రైతు సంక్షేమం కోసం మన ప్రభుత్వం కొత్త పథకాలను ప్రారంభించడమే కాక, మరెన్నో పథకాలకు ఆర్థిక సహాయాన్ని పెంపుదల చేసింది.

32. డా. వై.యస్.ఆర్. రైతు భరోసా - పి.ఎం. కిసాన్ పథకం 2019 అక్టోబరు 15న ప్రారంభించడం జరిగింది. ఇందులో భాగంగా ప్రతి రైతు కుటుంబానికి వారి వ్యవసాయిక అవసరాల నిమిత్తం రూ.13,500 వార్షిక పెట్టుబడి సమకూర్చబడుతున్నది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 46 లక్షల 51 వేల అర్హులైన రైతు కుటుంబాలకు ఈ పథకం కింద ఆర్థిక సహాయం అందింది. ఇందులో 1 లక్ష 58 వేల కౌలుదారు కుటుంబాలు కూడా ఉన్నాయి. ఈ పథకం కింద రైతులకు ఆర్థిక సహాయం కొనసాగించడానికి 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.3,615.60 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను.

33. డా. వై.యస్.ఆర్. పంటల ఉచిత బీమా పథకం - పి.ఎం.ఎఫ్. బి.వై.మరియు ఆర్.డబ్ల్యు. బి.సి.ఐ.ఎస్.ల కింద గుర్తించబడిన అన్ని పంటలకు 2019 ఖరీఫ్ కాలానికి బీమా నిమిత్తం రైతు వాటా ప్రీమియం చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పంటల బీమా పథకాన్ని ఇన్సూరెన్స్ కంపెనీలకు బదులు రాష్ట్ర ప్రభుత్వం తన భుజస్కంధాల మీదకు తీసుకున్నది. డా.వై.యస్.ఆర్. పంటల ఉచిత బీమా పథకం కింద రైతులకు మేలుచేకూర్చే లక్ష్యంతో 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.500 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను.

34. వడ్డీలేని ఋణాలు - పంటల నిమిత్తం తీసుకున్న అప్పులను సకాలంలో చెల్లించే అలవాటు రైతులలో పెంపొందించడానికి లక్ష రూపాయల వరకు పంట ఋణాలపై ప్రభుత్వమే వడ్డీ చెల్లిస్తోంది. ఇందుకు గాను 2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ.1,100 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను.

35. రైతు భరోసా కేంద్రాలు నెలకొల్పడం వెనుక ప్రధాన సూత్రధారి గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులే. రాష్ట్రంలోని అన్ని గ్రామ సచివాలయాలలోనూ 11,158 రైతు భరోసా కేంద్రాలు నెలకొల్పాలనీ సంకల్పించాం. ఈ కేంద్రాలు ఒకవైపు రైతులకు అవసరమైన వస్తు సామాగ్రి సరఫరా బాధ్యతతో పాటు, మరొకవైపు ఉత్తమ వ్యవసాయిక విధానాలకు సంబంధించిన పరిజ్ఞానాన్ని రైతులకు చేరవేసే బాధ్యత కూడా నిర్వర్తిస్తాయి. మల్టీ బ్రాండ్ నాణ్యమైన ఇన్‌పుట్‌ సరఫరా, యం.ఎస్.పి. సమాచారం, సాంకేతిక వ్యవహారాలలో మార్గదర్శకత్వం, వ్యవసాయ పనిముట్లు అద్దెకు తీసుకోవటం, నేల మరియు విత్తనాల పరీక్ష, బ్యాంకు నుంచి ఋణాలు తీసుకోవటంపై శిక్షణ మొదలైనవి కూడా ఈ కేంద్రాలు చేస్తాయి. ఇటువంటి రైతు భరోసా కేంద్రాల స్థాపన నిమిత్తం 2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ. 100 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను.

36. వ్యవసాయానికి అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు మొదలైన వస్తు సామాగ్రి సరఫరాలో నాసిరకమైన నకిలీ సరఫరా జరగకుండా చూడాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఇందుకు గాను వ్యవసాయ క్షేత్రాలకు సమీపంలోనే నాణ్యతా పరీక్షా కేంద్రాలను నెలకొల్పడానికి నిశ్చయించింది. రాష్ట్రం అంతటా 160 డా.వై.యస్.ఆర్. వ్యవసాయ పరీక్షా కేంద్రాలను నెలకొల్పడానికి ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇందులో 147 లేబొరేటరీలు గ్రామీణ ప్రాంతాల్లోని శాసనసభ నియోజకవర్గాల కేంద్రాలలోనూ, 13 జిల్లా కేంద్రాలలోనూ నెలకొల్పబడతాయి. వీటితో పాటు విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల నాణ్యతను పరిశీలించటానికి 4 ప్రాంతీయ కోడింగ్ కేంద్రాలు కూడా నెలకొల్పనున్నాం. ఈ విధంగా డా.వై.యస్.ఆర్. అగ్రి టెస్టింగ్ లేబొరేటరీల ఏర్పాటకు గాను 2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ. 65 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను.

37. కనీస మద్దతు ధర కలిగిన పంటలకు అమ్మకానికి అవకాశాలు పెంపొందించడానికీ, కనీస మద్దతు ధర లేని పంటలు సాధారణ ధర కన్నా తక్కువగా అమ్ముడు పోకుండా ఉండటానికి ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసింది. రూ.3,000 కోట్ల ఈ నిధి ఏర్పాటు రాష్ట్ర చరిత్రలో ఒక చారిత్రాత్మక నిర్ణయం. అంతేకాక ఉల్లి, మిర్చి, పసుపు, అరటి, నారింజ, చిరు ధాన్యాలకు కనీస మద్దతు ధర ప్రకటించిన ఏకైక ప్రభుత్వం మనదే. రైతుల సమస్యలను తెలుసుకొని పరిష్కరించడం కోసం ప్రభుత్వం 1907 పేరిట ఒక టోల్ ఫ్రీ నెంబరును కూడా ఏర్పాటు చేసింది. ధరల స్థిరీకరణ నిధి ద్వారా పచ్చిశనగ రైతులకు రూ. 96.11 కోట్ల మేరకు, ఉల్లి రైతులకు రూ. 63.12 కోట్ల మేరకు సకాల ఆర్థిక సహకారాన్ని అందించ గలిగాం. మార్క్ ఫెడ్ ద్వారా రూ.2,188 కోట్ల వ్యవసాయ ఉత్పత్తులను అందులో రూ.1500 కోట్ల ఉత్పత్తులు ఈ కోవిడ్-19 లాక్ డౌన్ సమయంలో సేకరించడం జరిగింది.

'వర్షంబు లేకున్న ధాన్యంబులగునా' అని మహాభారతంలో ఒక మాట ఉంది. ఈ మాట అర్థం, వర్షంలేని పక్షంలో మనం ఎన్ని విత్తనాలు వేసినా పంట పండదు.

మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదే వర్షాలు సమృద్ధిగా కురిశాయి, పంటలు ఏపుగా పెరిగాయి. రైతన్న మొహాలలో ఆనందం వెల్లివిరిసింది.

ధర్మపాలనకు, అధర్మపాలనకు తేడా ఇదే. అందుకు భగవంతుడు రాసిన స్క్రిప్ట్ సాక్ష్యం .

38. 2020-21 ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ రంగానికి రూ.11,891.20 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను.

పశుగణాభివృద్ధి - మత్స్య పరిశ్రమ

మన గ్రామాలలో 'పాడిలేని ఇల్లు, పేడలేని చేను ఉండదు'

అన్న మాట వినిపిస్తూ ఉంటుంది. దేశం బాగుండాలంటే రైతు బాగుపడాలి. పాడి అవసరాలతో పాటు వ్యవసాయానికి విత్తనాలు, ఎరువులు, కూలీలతో పాటు పశువులు అవసరం కూడా ఉంది.

‘గొడ్డువచ్చిన వేళ... బిడ్డ వచ్చిన వేళ' అని మన రైతులు సంతానంతో సమాన స్థాయిని పశు సంపదకు ఇచ్చి-పశువులను కొనేందుకు మంచిరోజు కోసం ఎదురుచూస్తుంటారు.

'ఆవులేనింట అన్నం కూడ తినరాదని' కూడా కొన్ని చోట్ల అంటుంటారు.

ఇంతటి కీలకమైన పశుపోషణను ప్రోత్సహించవలసిన అవసరాన్ని మా ప్రభుత్వం గుర్తించింది. ఆర్థిక పశుపోషణకు ఉన్న ప్రాధాన్యాన్ని, దాని అవసరాన్ని అవగతం చేసుకొని చేయూతగా నిలవాలని నిర్ణయించింది.

39. ప్రాథమిక రంగం మీద ఆధారపడ్డ కుటుంబాలలో అత్యధిక సంఖ్యాకులకు పశు గణాభివృద్ధి నిశ్చితమైన ఆదాయ వనరును సమకూరుస్తుంది. నవరత్నాలలో భాగంగా రూ. 50.00 కోట్ల మేరకు పశుగణ నష్టపరిహార నిధిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఆవులు, గేదెలు మొదలైన వాటికి రూ.15,000 నుండి రూ.30,000 ల దాకా, మేకలు, గొర్రెలకు రూ. 6,000 ల దాకా నష్టపరిహారం రైతులకు అందచేయబడుతుంది.

జలంపై ఆధారపడి బతికే జనం మత్స్యకార సోదరులు. ప్రాణాలకు తెగించి సముద్రంలోకి వెళ్ళి చేపల వేట సాగించి, వచ్చే డబ్బుతో కుటుంబాన్ని పోషించుకుంటున్న జీవితాలు వారివి. తీరాన్ని నమ్ముకుని బతుకుతున్న మత్స్యకార
బిడ్డల జీవితాలలో గుణాత్మక మార్పు తీసుకురావాలని మా ప్రభుత్వం సంకల్పిస్తోంది. మత్స్యకారులకు అండగా నిలిచేందుకు ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. మత్స్యకారుల జీవితాలకు ప్రభుత్వం సంపూర్ణమైన భరోసాగా నిలుస్తోంది.

40. ఆంధ్రప్రదేశ్ లో మత్స్య రంగం దాదాపు 14.5 లక్షల మందికి ఉపాధి సమకూరుస్తున్నది. దేశం నుండి ఎగుమతి అవుతున్న సముద్ర సంబంధమైన ఆహార ఉత్పత్తులలో 36% రాష్ట్రం నుంచే ఎగుమతి అవుతున్నవి. మత్స్య రంగం మీద ఆధారపడ్డ కుటుంబాల సంక్షేమం కోసం ప్రభుత్వం డా.వై.యస్.ఆర్. మత్స్యకార భరోసా పథకాన్ని అమలు చేస్తున్నది. చేపలు పట్టడం మీద నిషేదాజ్ఞలు అమలు అయ్యే కాలంలో మత్స్యకార కుటుంబాలకు అందించే ఆర్థిక సహాయాన్ని రూ.4,000 నుండి రూ.10,000కు పెంచడం జరిగింది. ఈ పథకం కింద ఇంతదాకా 1,02,332 సముద్రతీర మత్స్యకార కుటుంబాలు లబ్దిపొందాయి.

41. అంతేగాక ఫిషింగ్ బోట్ల డీజిల్ ఆయిల్ మీద ఇచ్చే సబ్సిడీలను కూడా ప్రభుత్వం లీటరుకు రూ.6.03 నుండి రూ.9 కి పెంచింది. తద్వారా 2019-20 ఆర్థిక సంవత్సరంలో 19,796 బోట్లు లబ్ది పొందాయి. ఆక్వా రైతులందరికీ విద్యుత్ చార్జీలలో కూడా మినహాయింపులు అందచేయబడ్డాయి. వారి విషయంలో విద్యుత్తు చార్జీలు ప్రతి ఒక్క యూనిట్‌కు రూ.3.86 నుండి రూ.1.50 కి తగ్గించబడ్డాయి. తద్వారా 53,500 మంది ఆక్వా రైతులు లబ్ధి పొందారు. చేపలు పట్టే సమయంలో ఆకస్మికంగా మృతి చెందే మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున అందించే ఆర్థిక సహాయాన్ని రూ. 5.00 లక్షల నుండి రూ. 10.00 లక్షలకు పెంచడం జరిగింది.

42. 974 కిలోమీటర్ల పొడవైన తీర రేఖతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో రెండవ స్థానంలో నిలుస్తున్నది. మత్స్యరంగాన్ని మరింత అభివృద్ధి పరచడం కోసం జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ, బుడగట్లపాలెం, పూడిమెడక, కొత్తపట్నం, బియ్యపుతిప్పల్లో ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టనున్నాం. ఇందుకు గాను 2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ.142.66 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను. 43. పశుగణాభివృద్ధి, మత్స్యరంగాల అభివృద్ధి నిమిత్తం 2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ.1,279.78 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను.

గృహ నిర్మాణం

రాబర్ట్ మాంట్ గొమరీ మాటల్లో చెప్పాలంటే

'ఇల్లు ఈ ప్రపంచంలో అన్నింటికన్నా అత్యంత ప్రియమైన, మధురమైన, సౌభాగ్యవంతమైన స్థలం. తక్కినవన్నీ దాని తరువాతే'.

'పేదవాడికి సొంతిళ్ళు తీరని స్వప్నం. జాగా ఉంటే ఇళ్లు కట్టేందుకు డబ్బు లేకపోవడమో, డబ్బుంటే గృహనిర్మాణానికి అవసరమైన జాగా లేకపోవడమో ఏదో ఒక సమస్య ఎప్పుడూ వారిని వేధిస్తూ ఉంటుంది. దేశవ్యాప్తంగా ఇళ్ల కొరత తీవ్రమవుతున్న తరుణంలో ప్రభుత్వాలు తమ విధానాలను పేదవాడి అవసరాలకు అనుగుణంగా మార్పు చేసుకోవాల్సిన అవసరాన్ని మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే గుర్తించింది. నిరుపేదల సొంతింటి కల నిజం కావాలంటే ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉండాలి. ఈ దిశగా మా సంకల్ప శుద్ధిని, నిబద్ధతను మొదటి ఏడాదే నిరూపించుకున్నాం. రాష్ట్రంలో గృహ అవసరాలను తీర్చే క్రమంలో నిర్మాణాత్మక విధానాలతో ముందుకెళుతున్నాం.

44. అర్హులైన బీద కుటుంబాలు అన్నింటికి గృహ సదుపాయం కల్పించడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ. 678.26 కోట్ల వ్యయంతో 40,841 గృహాల నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. పేదలందరికీ ఇళ్లు అనే పథకం కింద ప్రభుత్వం ఇళ్లు లేని అర్హులైన బీదలందరికీ 30 లక్షల ఇళ్ల పట్టాలు రూ.8,000 కోట్లతో అందించాలనే కృతనిశ్చయంతో ఉంది. దానితో పాటు 2020-21 ఆర్థిక సంవత్సరంలో 6,25,000 గృహాలు నిర్మించాలని కూడా ప్రతిపాదిస్తున్నాం. గృహనిర్మాణ కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయడం కోసం గ్రామ, వార్డు సచివాలయాల పర్యవేక్షణతో అనుసంధానిస్తున్నాం.

స్త్రీ సాధికారికత, శిశు సంక్షేమం

డాక్టర్ బాబా సాహెబ్ బీం రావ్ అంబేడ్కర్ ఒక మాట అన్నారు.

'ఒక సమాజం ఎంత పురోగమించింది అనే దానికి ఆ సమాజంలో స్త్రీల పురోగతినే నేను కొలమానంగా తీసుకుంటాను'

45. ప్రభుత్వ విధాన లక్ష్యాల్లో అత్యంత ముఖ్యమైన వాటిలో స్త్రీ అభ్యున్నతి కూడా ఒకటి. ఈ దిశగా ప్రభుత్వం చేపట్టే చర్యల్లో, మాతా శిశు మరణాల తగ్గింపు, తొలి శైశవ సంరక్షణ, విద్యాభివృద్ధికి ప్రోత్సాహకాలు, స్వయం సహాయక సంఘాల ద్వారా ఋణ సదుపాయం అందుబాటు, నైపుణ్యాభివృద్ధి ద్వారా ఆర్థిక ప్రయోజనం ఉన్నాయి.

46. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 257 ఐ.సి.డి.ఎస్. ప్రాజెక్టులను నిర్వహిస్తున్నది. వీటి పర్యవేక్షణలో పట్టణ, గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో 48,770 అంగన్ వాడీలు, 6,837 మినీ అంగన్‌వాడీలు పనిచేస్తున్నాయి. పిల్లల్లో పోషణ లోపం, పెరుగుదల ఆగిపోవటం, తక్కువ బరువు ఉండటం, అలాగే స్త్రీలలో రక్తహీనత రాష్ట్రంలో, కొన్ని ప్రాంతాల్లో మరీ ప్రత్యేకంగా ప్రబలి ఉంది. పేదరికం, నిరక్షరాస్యత, వైద్య ఆరోగ్య పద్ధతుల పట్ల పరిజ్ఞానం లేకపోవటం, పోషక ఆహారం గురించి జాగ్రత్తలు తెలియకపోవటం, పరిసరాల అపరిశుభ్రత మొదలైనవి ఇందుకు కారణాలు.

47. ఈ పరిస్థితులను మెరుగు పరచడం కోసం ప్రభుత్వం వై.యస్.ఆర్. సంపూర్ణ పోషణ పథకాన్ని ప్రారంభించింది. దీని ద్వారా 7 సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థల పరిధిలో విస్తరించిన 77 గిరిజన ఉషప్రణాళిక, షెడ్యూల్డు మండలాలలోని 0.66 లక్షల గర్భిణీ బాలింత స్త్రీలు, 6 నుండి 72 నెలలలోపు వయసు కలిగిన 3.18 లక్షల మంది చిన్నారులు లబ్ది పొందుతున్నారు. వై.యస్.ఆర్. సంపూర్ణ పోషణ కార్యక్రమానికి 2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ.1,500 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను. అలాగే స్త్రీలు, శిశువులు, విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ నిమిత్తం 2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ.3,456 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను.

వై.యస్.ఆర్. సున్నా వడ్డీ

48. స్వయం సహాయక బృందాల మీద ఉన్న వడ్డీ భారాన్ని తగ్గించటం ద్వారా వారిలో ఎప్పటికప్పుడు ఋణాలు తిరిగి చెల్లించే సంస్కృతిని ప్రోత్సహించటం కోసం వై.యస్.ఆర్. సున్నా వడ్డీ పథకం ప్రారంభించడం జరిగింది. ఇందుకు గాను 2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ.1,365.08 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను.

స్త్రీల భద్రత

ఈ సమాజం బలంగా పెరిగిందంటే, శాఖోపశాఖలుగా విస్తరించిందంటే, ఫలపుష్పాలతో శోబిల్లుతోందంటే అందుకు కారణం తల్లివేరులా నిలిచిన స్త్రీమూర్తి గొప్పదనమే. మహిళా సాధికారత దిశగా జగన్మో హన్ రెడ్డి ప్రభుత్వం గడచిన ఏడాది కాలంలో అనేక చర్యలు తీసుకొంది. భారతీయ సంస్కృతికి ప్రాణశక్తిగా నిలిచిన మహిళాలోకంపై అన్ని చోట్లా జరుగుతున్న దాడులను, దుర్మార్గాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అరికట్టాలన్నది ప్రభుత్వ సంకల్పం. మహిళలు అపహరణలకు, అత్యాచారాలకు, రకరకాల వేధింపులకు గురవుతున్న ఈ రోజుల్లో ఈ ఆకృత్యాలను తక్షణం అరికట్టి, అక్రమార్కులకు గట్టి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ఈ సంకల్పంతోనే ఈ ప్రభుత్వం 'దిశ' చట్టం తీసుకువచ్చింది.

49. ఆంధ్రప్రదేశ్ దిశా చట్టం 2019ని తీసుకురావడం ద్వారా, స్త్రీల రక్షణకు, భద్రతకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. నేర పరిశోధన, విచారణ మొత్తం 21 పని దినాల్లోనే పూర్తి చేసి స్త్రీల పట్ల, శిశువుల పట్ల లైంగిక అత్యాచారాలు పాల్పడే వారి విషయంలో మరణశిక్ష విధించే విధంగా భారతీయ శిక్షా స్మృతి, నేర విచారణ స్మృతులకు సవరణలు చేపట్టడం జరిగింది. , 50. ఆంధ్రప్రదేశ్ దిశా చట్టం 2019 ని సమర్థవంతంగా అమలు చేయడం కోసం ప్రభుత్వం 13 ప్రత్యేక న్యాయ స్థానాలను కేవలం ఈ కారణం నిమిత్తమే నెలకొల్పింది. అదే విధంగా 13 ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించింది. ఉమెన్ పోలీసు స్టేషన్లను దిశా పోలీసు స్టేషన్లుగా ఉన్నతీకరించడం, దిశా ఫోరెన్సిక్ లేబొరీటరీల ఏర్పాటుకు సదుపాయాలను సమకూర్చడం, దిశా కాల్ సెంటర్, దిశా యాప్‌లను ప్రారంభించడం, జిల్లా ఆసుపత్రులలోనూ, బోధనా ఆసుపత్రులలోనూ దిశా సౌకర్యాల ఏర్పాటులతో పాటు స్త్రీల పట్ల, పిల్లల పట్ల లైంగిక అత్యాచారాల విచారణకు సంబంధించి నిర్ధిష్ట నియమ నిబంధనలను రూపొందించడం కూడా జరిగింది.

ప్రజా పంపిణీ వ్యవస్థ

51. ప్రస్తుతం దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న 1,47,25,346 కుటుంబాలకు రేషన్ కార్డులు ఉన్నాయి. 'వై.యస్.ఆర్. నవశకం' పథకంలో భాగంగా ప్రభుత్వం దారిద్ర్యరేఖకు దిగువున ఉన్న అర్హులైన కుటుంబాల వారికి కొత్త రైస్ కార్డులను జారీ చేయాలని నిర్ణయించింది. అర్హతా ప్రమాణాలు రూపొందించి చాలా ఏళ్ళు కావస్తున్నందు వలన వాటిని సవరించడం జరిగింది. పాత ప్రమాణాలు ప్రకారం పరిగణనలోకి రాకుండా ఉండిపోయిన అర్హత కలిగిన కుటుంబాలు అన్నింటినీ ఇంటింటి సర్వే ద్వారా గుర్తించడం ఈ కొత్త ప్రమాణాల ఉద్దేశ్యం.

52. ప్రస్తుతం ఉన్న పౌర పంపిణీ వ్యవస్థను సంస్కరిస్తూ, తద్వారా ప్రజలకు మరింత ఆహార పోషణ భద్రతను కల్పించడం కోసం అన్ని కుటుంబాలకు పౌర సరఫరాలు నూటికి నూరు శాతం అందేటట్లు చూడటం కోసం ప్రభుత్వం కొత్తగా డోర్ డెలివరీ వ్యవస్థను ప్రవేశ పెట్టింది. 5, 10, 15, 20 కేజీల బరువు గల సోర్టెక్స్ క్వాలిటీ బియ్యంతో పాటు, పంచదార, కందిపప్పు కూడా ఇప్పుడు ప్రజల ఇంటి ముంగిటకు చేరుతున్నాయి. గ్రామ, వార్డు కార్యకర్తల ద్వారా ఈ పౌర పంపిణీ ఎటువంటి అవకతవకలకు తావులేని విధంగా చేపట్టబడుతుంది.

53. ఈ పథకాన్ని 2019 సెప్టెంబరు 6న గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీకాకుళం జిల్లాలో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. రానున్న రోజుల్లో దశల వారీగా ఈ పథకం అన్ని జిల్లాలకు విస్తరించబడుతుంది.

సంక్షేమం

54. మానవ వనరుల అభివృద్ధిలో ఇంతవరకు వెనుకబడిన సామాజిక వర్గాల అవసరాల పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టడం తప్పనిసరి. అన్ని సామాజిక వర్గాలూ ప్రధాన స్రవంతిలో పాలు పంచుకునే విధంగా కార్యక్రమాలు చేపట్టాలనేది మా ప్రయత్నం. కుల, మతాలకూ, లింగ, వృత్తి వివక్షతకూ అతీతంగా, సమాజంలోని అన్ని వర్గాల శ్రేయస్సుకూ మన ప్రభుత్వం కట్టుబడి ఉంది. పెన్షన్లు

55. అర్హులైన అందరి లబ్ధిదారులకు వారి ఇంటి గుమ్మం దగ్గరే వై.యస్.ఆర్. పెన్షన్లను పెంపుదల చేసిన రేట్ల ప్రకారం ప్రభుత్వం అందిస్తున్నది. వృద్ధాప్య పెన్షన్ల వయో పరిమితిని 65 ఏళ్ళ నుండి 60 ఏళ్ళకు తగ్గించడం జరిగింది. 2019 జూన్ నుండి పెన్షన్లు పొందుతున్న వారి సంఖ్య 55,99,024 కు పెరిగింది. ఈ పథకం పారదర్శకంగా అమలు జరగడం కోసం పెన్షన్లు పొందడానికి అర్హులైన వారి జాబితాను గ్రామ సచివాలయాల్లో రైస్ కార్డుల అర్హుల జాబితాతో పాటు ప్రకటించడం జరుగుతుంది. లాక్ డౌన్ సందర్భంలో కూడా పెన్షన్లను గుమ్మంవద్దనే పంపిణీ చేసిన గ్రామ/వార్డు వాలంటీర్ల వ్యవస్థ పటుత్వం తెలుస్తుంది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను వై.యస్.ఆర్. పెన్షన్ కోసం రూ.16,000 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను.

జగనన్న అమ్మ ఒడి

56. బడి ఈడు పిల్లలు నూటికి నూరు శాతం బడిలో చేరాలనీ, వాళ్ళు బడి మానకుండా ఉండాలనీ, వారి ఆరోగ్య ప్రమాణాలు మెరుగుపడాలని కోరుకుంటూ గౌరవనీయ ముఖ్యమంత్రి గారు రూపకల్పన చేసిన కార్యక్రమం ఇది. దారిద్ర్యరేఖకు దిగువున ఉండి తమ పిల్లల్ని 1వ తరగతి నుండి ఇంటర్మీడియట్ దాకా బడికి పంపిస్తున్న 42,33,098 మంది తల్లులకు ఒక్కొక్కరికి ఏడాదికి రూ.15,000 చొప్పున ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమం చేపట్టిన మొదటి ఏడాదే ఈ పథకం కింద 8,68,233 మంది షెడ్యూల్డు కులాల తల్లులకు, 19,65,589 మంది వెనుకబడిన తరగతులకు చెందిన నిరుపేద తల్లులకు, 2,76,155 మంది గిరిజన మాతృమూర్తులకు, 4,03,562 మంది ఆర్థికంగా వెనుకబడిన వారికి, 3,95,870 మంది కాపు సామాజిక వర్గానికి చెందిన వారికి, 2,95,540 మైనారిటీ వర్గాలకు చెందిన వారికి ఈ ఆర్థిక సహాయం అందించడం జరిగింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గానూ 'జగనన్న అమ్మఒడి' పథకం కింద నేను రూ. 6,000 కోట్లు కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.

వై.యస్.ఆర్. చేయూత

57. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 45 నుండి 60 సంవత్సరాల మధ్య వయస్కులైన స్త్రీలకు ఆర్థిక సహాయాన్ని పరిపుష్టం చేయడం కోసం గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు నిర్విరామంగా చేపడుతున్న చర్యల్లో వై.యస్.ఆర్. చేయూత ముఖ్యమైన కార్యక్రమం. ఈ పథకం కింద 2020-21 ఆర్థిక సంవత్సరంతో మొదలైన నాలుగు సంవత్సరాల పాటు షెడ్యూల్డు కులాల, షెడ్యూల్డు తెగల, వెనుకబడిన తరగతుల, మైనారిటీ సామాజిక వర్గాలకు చెందిన మహిళలకు రూ.18,750 వార్షిక సహాయం అందించబడుతుంది. ఇందు నిమిత్తం 2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ.3,000 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను.

వై.యస్.ఆర్. ఆసరా

58. రాష్ట్రంలో స్వయం సహాయక బృందాల వ్యవస్థ చుట్టూ రాష్ట్రంలోని గ్రామీణ, అసంఘటిత ఆర్థిక వ్యవస్థకు చెందిన స్త్రీలు ఆధారపడి ఉన్నారు. స్వయం సహాయక ఆర్థిక బృందాల కార్యకలాపాల్లో నిరంతరాయంగా ఎప్పటికప్పుడు నగదు మార్పిడి జరుగుతుండాలి. వారి పొదుపు సార్థకం కావాలి. ఈ ఉద్దేశంతో వై.యస్.ఆర్. ఆసరా పథకాన్ని చేపట్టాం. ఈ పథకం కింద 2019 ఏప్రిల్ 11 నాటికి పోగుపడ్డ బ్యాంకు ఋణం సుమారు రూ.27,168.83 కోట్లను 2020-21 నుండి 4 విడతలుగా చెల్లించడం జరుగుతుంది. ఇందుకుగాను 2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ. 6,300 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను.

జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన

59. ఉన్నత విద్య కొనసాగించే విద్యార్థుల నిష్పత్తిని పెంచడం కోసం, విద్యార్థులకు ఫీజులు పూర్తిగా తిరిగి చెల్లించడానికి జగనన్న విద్యాదీవెన కార్యక్రమాన్ని, వారి ఆహార, వసతి అవసరాలను తీర్చడం కోసం జగనన్న వసతి దీవెన కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్నది. జగనన్న విద్యాదీవెన పథకం ద్వారా పాలిటెక్నిక్, ఐటిఐ, మెడికల్, ఇంజనీరింగ్, డిగ్రీ మరియు పై చదువులకు పూర్తి ఫీజు రియింబర్స్ మెంట్ మన ప్రభుత్వం చేస్తున్నది. షెడ్యూల్డు కులాల, షెడ్యూల్డు తెగల, వెనుకబడిన తరగతుల, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల, కాపు సామాజిక వర్గానికి చెందిన, అల్ప సంఖ్యాకుల వర్గానికి చెందిన మరియు విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థులకు ఈ పథకాలు వర్తిస్తాయి. వీటి కింద ఐటిఐ విద్యార్థులకు ఏడాదికి రూ.10,000 చొప్పున, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15,000 చొప్పున, డిగ్రీ, అంతకన్నా పై చదువుల విద్యార్థులకు రూ.20,000 వార్షిక సహాయం అందుతున్నది. 12 లక్షల పై చిలుకు విద్యార్థులు ఈ పథకం కింద లబ్ది పొందారు. ఇందులో వెనుకబడిన తరగతులకు చెందిన 8,21,354 మంది విద్యార్థులు, ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు చెందిన 1,19,027 మంది విద్యార్థులు, కాపు సామాజిక వర్గానికి చెందిన 1,96,817 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ పథకాల నిమిత్తం 2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ. 5,009 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను.


ఉచిత విద్యుత్ పథకం

60. షెడ్యూల్డు తెగల, షెడ్యూల్డు కులాలకు సంబంధించిన కుటుంబాలకు గృహ అవసరాల నిమిత్తం 200 యూనిట్ల దాకా ప్రభుత్వం ఉచిత విద్యుత్తును సమకూరుస్తున్నది. దాదాపు 21 లక్షల కుటుంబాలు ఈ మేరకు లబ్ది పొందుతున్నాయి. వీరితో పాటు గ్రామీణ ఉద్యానవన నర్సరీలు, దోబీ ఘాట్లు, దారిద్ర్యరేఖకు దిగువన గల రజక కుటుంబాలు మరింత వెనుకబడిన తరగతులకు చెందిన కుటుంబాలు, చేనేత కార్మికులు, క్షార శాలలు, ఇమిటేషన్ జ్యూయలరి యూనిట్లు మొదలయినవి ఉచిత విద్యుత్తు లేదా తక్కువ

చార్జీ విద్యుత్తు సదుపాయం పొందుతున్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను ఉచిత విద్యుత్ పథకం కింద రూ.425.93 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను.

వై.యస్.ఆర్. వాహన మిత్ర

61. ఆటో, టాక్సీ డ్రైవర్ల ఖర్చులలో కొంతమేరకు ప్రభుత్వం భరాయిస్తుందని గౌరవ ముఖ్యమంత్రి గారు వారికి వాగ్దానం చేశారు. ఈ వాగ్దానాన్ని నేరవేర్చడం కోసం ప్రభుత్వం వైయస్.ఆర్. వాహనమిత్ర పథకాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా ఆటోలు, టాక్సీలు, మాక్సీ కాబ్‌లు సొంతంగా కలిగి ఉండి నడుపుకుంటున్న డ్రైవర్లకు ఇన్సూరెన్సు, ఫిట్ నెస్ ధృవపత్రాలు, మరమ్మత్తులు మొదలైన వాటి నిమిత్తం రూ.10,000 వార్షిక సహాయం అందించడం జరుగుతున్నది. ఈ పథకం కింద 2,36,340 మంది డ్రైవర్లు లబ్ధి పొందారు. ఇందులో అన్ని సామాజిక వర్గాలకు చెందినవారు ఉన్నారని నేను సంతోషంగా సభకు తెలియ చేసుకుంటున్నాను. వీరిలో షెడ్యూల్డు కులాలకు చెందిన వారు 54,488 మంది, షెడ్యూల్డు తెగలకు చెందిన వారు 8,763 మంది, వెనుకబడిన తరగతులకు చెందిన వారు 1,05,932 మంది, అల్ప సంఖ్యాక వర్గాల వారు 25,517 మంది, కాపు సామాజిక వర్గానికి చెందిన వారు 27,109 మంది, ఆర్థికంగా వెనుకబడ్డ తరగతులకు చెందిన వారు 13,091 మంది ఉన్నారు. ఈ సరికొత్త పథకాన్ని కొనసాగించే నిమిత్తం 2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ.275.52 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను.

వై.యస్.ఆర్. నేతన్న నేస్తం

యంగ్ ఇండియాలో మహాత్మాగాంధీ చేసిన వ్యాఖ్య ఇది.

'నేను ప్రతిసారీ రాట్నం మీద దారం తీసినప్పుడు భారతదేశంలోని పేదవారి గురించి ఆలోచిస్తాను... రాట్నం వడకడం ఒక తపస్సు, ఒక సంస్కారం. నేను రాట్నం మీద వడికే ప్రతి నూలు పోగులోనూ దేవుడిని చూస్తాను'.

జీవితాంతం చేనేతను ప్రోత్సహించి, నేతపనివారి పురోభివృద్ధిని కోరుకున్న మహాత్ముడి ఆశయమే జగన్ మోహన్ రెడ్డిగారి ప్రభుత్వ ఆదర్శం. అందుకే చేనేత కార్మికుల పెద్దన్నగా ముఖ్యమంత్రి స్పందిస్తున్నారు.

62. సాంప్రదాయిక వృత్తులను అవలంబిస్తున్న వివిధ వృత్తి పనివారల కోసం ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నది. దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న నేత కుటుంబాల్లో నేత మగ్గం కలిగి ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి వై.యస్.ఆర్. నేతన్న నేస్తం పథకం కింద రూ. 24,000 వార్షిక ఆర్థిక సహాయం అందించబడుతున్నది. తద్వారా ఆయా నేత కుటుంబాలు వారి మగ్గాలను ఆధునీకరించుకుని మరమగ్గాలతో పోటీపడటానికి వీలవుతుంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం కింద 81,709 చేనేత కుటుంబాలు లబ్దిపొందాయి. వీరిలో వెనుకబడిన తరగతుల వారు 75,011 మంది, షెడ్యూల్డు కులాల వారు 888 మంది, షెడ్యూల్డు తెగలకు చెందిన వారు 329 మంది, ఇతర వర్గాల వారు 5,555 మంది ఉన్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను వై.యస్.ఆర్. నేతన్న నేస్తం కింద రూ. 200 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను.

జగనన్న తోడు

63. మేనిఫెస్టోలో వాగ్దానం చేసిన విధంగా బడుగు వర్గాలకు చెందిన వీధి వర్తకులు మరియు తోపుడు బండ్ల వ్యాపారులకు రూ.10,000 ల చొప్పున జగనన్న తోడు పథకం ద్వారా ఆర్థిక సహాయం చేస్తున్నాము. గ్రామ స్థాయిలో 7 లక్షల మందికి మరియు పట్టణ స్థాయిలో 2.3 లక్షల మంది లబ్ధిదారులకు ఆర్థిక సహాయం కోసం సుమారు రూ. 930 కోట్లు కేటాయించడం జరిగింది.

జగనన్న చేదోడు

64. రజకులు, నాయీ బ్రాహ్మణులు, కుట్టు వృత్తిని అవలంబిస్తున్న అన్ని కులాల టైలర్ల సంక్షేమానికి ఒక్కొక్క కుటుంబానికి రూ.10,000 చొప్పున వార్షిక ఆర్థిక సహాయం అందించబడుతున్నది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ. 247 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను.

గిరిజనుల విద్య మరియు వైద్యం

మైదాన ప్రాంతంవారితో పోలిస్తే ఈ రాష్ట్రంలో గిరిజనుల అవసరాలు మరియు వారి జీవన విధానం పూర్తిగా వేరు. చిన్న చిన్న సమూహాలుగా అటవీ ప్రాంతాల్లో కొండల్లో నివసించే వీరిది ప్రత్యేక ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక నేపధ్యం. ప్రకృతే వీరికి పాఠశాల, వైద్యశాల. వందల సంవత్సరాలుగా అడవుల్లో కొండల్లో నివసిస్తున్న గిరిజనుల సంక్షేమం కాయితాల్లో కనిపిస్తోందేగానీ వారి జీవితాల్లో మాత్రం మార్పు రావడం లేదు. గిరిజనం బతుకుల్లో వెలుగులు నింపాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సర్కారు గట్టి సంకల్పంతో ఉంది.

65. గిరిజన ప్రాంతాలలో ఆరోగ్య సేవలకు సంబంధించిన మౌలిక సదుపాయాలను మెరుగు పరచడం కోసం ప్రభుత్వం పాడేరులో డా. వై.యస్.ఆర్. వైద్య కళాశాలను మంజూరు చేసింది. దీనితో పాటు సీతంపేట, పార్వతీపురం, రంపచోడవరం, చింతూరు, కె.ఆర్.పురం, శ్రీశైలంలో అదనంగా 6 మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులను కూడా ప్రతిపాదిస్తున్నాం. ఉన్నత విద్యను గిరిజన విద్యార్థులకు మరింతగా అందుబాటులోకి తీసుకురావడానికి గిరిజన సంస్కృతి, కళలు, ఆర్థిక వ్యవస్థలకు సంబంధించిన పరిశోధనలు చేపట్టడానికి విజయనగరంలో నెలకొల్పుతున్న గిరిజన విశ్వవిద్యాలయం మరింత ఉపయోగపడుతుంది అనడంలో సందేహం లేదు.


కాపు నేస్తం

66. కాపు సామాజిక వర్గ సంక్షేమం మన ప్రభుత్వ విధానాలలో ఒక ముఖ్యమైన ఉద్దేశ్యం. 2019-20 ఆర్థిక సంవత్సరంలో కాపు సామాజిక వర్గానికి చెందిన వివిధ సంక్షేమ పథకాల అమలు కోసం ప్రభుత్వం స్పష్టమైన కేటాయింపులు చేపట్టింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర సాంఘిక ఆర్థికాభివృద్ధిలో కాపు సామాజిక వర్గం సముచితమైన పాత్ర నిర్వచించాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యం. అదనంగా కాపు నేస్తం పథకం క్రింద సంవత్సరానికి రూ.15000/- చొప్పున 5 సంవత్సరాలదాకా ప్రతి కాపు మహిళకు జీవనోపాధి నిమిత్తమై రూ.350 కోట్లు బడ్జెట్ కేటాయించడమైనది.

మైనారిటీల సంక్షేమం

67. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీ ఆర్థిక సహకార సంస్థ ద్వారా మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రైస్తవ అల్ప సంఖ్యాక వర్గాల ఆర్థిక సంస్థ ద్వారా 15,830 మంది నిరుద్యోగ యువతకు శిక్షణను అందించడం జరిగింది. ఇమామ్ లకు, మౌజన్లకు ప్రభుత్వం వరుసగా రూ. 5,000, రూ.3,000 నెలవారీ గౌరవభృతి చెల్లిస్తున్నది. జెరూసెలం పుణ్యభూమికి చేపట్టే తీర్థయాత్రలకు అందించే సహాయాన్ని కూడా మేము పునరుద్ధరించాం. ఈ తీర్థయాత్రకు అందించే సబ్సిడీ మొత్తాన్ని కూడా రూ. 20,000 నుండి రూ.40,000 కు పెంపుదల చేసాం.


వై.యస్.ఆర్. లా నేస్తం

68. మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానం ప్రకారం వై.యస్.ఆర్. లా నేస్తం ద్వారా జూనియర్ లాయర్లకు ప్రతి నెల రూ. 5000/- ల స్టెఫండ్ ఇవ్వటం కోసం రూ.12.75 కోట్లు కేటాయించడం జరిగింది.

ప్రస్తుతం ఉన్న వసతి గృహాలు మరియు రెసిడెన్షియల్ విద్యాలయాలకు సంబంధించిన పథకాలకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ పై పథకాలు అమలుచేస్తున్నాము.

69. షెడ్యూల్డు కులాల సంక్షేమం కోసం 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.15,735.68 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను.

70. అన్ని గిరిజనాభివృద్ధి పథకాలను సమర్థవంతంగా నిర్వహించడానికి గిరిజన ఉపప్రణాళిక కింద 2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ.5,177.54 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను.

71. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను వెనుకబడిన తరగతుల ఉప ప్రణాళిక నిమిత్తం రూ.25,331.29 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను.

72. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను మైనారిటీల సంక్షేమం కోసం రూ.2,050.23 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను.

73. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను కాపు సామాజిక వర్గ సంక్షేమం కోసం రూ.2,846.47 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను.

గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం

74. ప్రభుత్వం తన ముందు ఉంచుకొనే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కార్యాచరణను ఆ కార్యాచరణ విధానాలు నిర్దేశిస్తాయి. సమాజంలోని పౌరులకి ప్రభుత్వం అందిస్తున్న సేవల నాణ్యత, ఆ సేవలను అందించే ఉపకరణాల నాణ్యత మీద ఆధారపడి ఉంటుంది. కానీ, గ్రామస్థాయిలో అత్యవసర సేవల, పౌర సేవల నిర్వహణలో దశాబ్దాలుగా చెప్పలేని స్తబ్దత, జడత్వం గూడుకట్టుకొనిపోయాయి. ఈ స్తబ్దతను ఛేదించడం కోసం గ్రామ స్వరాజ్యాన్ని కలగన్న మహాత్ముని దార్శనికతకు స్ఫూర్తిగా గౌరవనీయ ముఖ్యమంత్రి గ్రామ, వార్డు సచివాలయాలను నెలకొల్పారు. ప్రభుత్వ సేవలను సాధారణ పౌరుడి ఇంటి గుమ్మం ముందుకు తీసుకుపోవడం ఈ సంస్థల ముఖ్య ఉద్దేశ్యం. ప్రభుత్వ పాలనను సుపరిపాలన మరియు సుసాధ్యం చేసే దిశగా ఈ సచివాలయాలు రూపుదిద్దుకోవాలన్నదే ప్రభుత్వ ఆకాంక్ష.

యువత సంక్షేమం - నైపుణ్యాభివృద్ధి కల్పన

భవిష్యత్తు తరాల అభివృద్ధి ప్రస్థానాన్ని నిర్దేశించే సృజనాత్మకత, పరిశోధనలకు ప్రాధాన్యం ఇవ్వకపోతే పారిశ్రామికంగా అట్టడుగుకు చేరి ఒక దేశంగా పూర్తిగా వెనకబడే ప్రమాదం ఉంది. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి వెయ్యి రేకులతో విచ్చుకోవడానికి ప్రభుత్వ ప్రయత్నాలు పునాది రాళ్లవుతాయనడంలో సందేహం లేదు. పారిశ్రామిక విప్లవంతోనే మానవ జాతి చరిత్ర కొత్త మలుపు తిరిగింది. ప్రజల సగటు ఆదాయం, జీవన ప్రమాణం అపూర్వమైన మార్పులను తీసుకువచ్చిన విప్లవమది. విభజన తరవాత ఆర్థికంగా కుదేలైన రాష్ట్రాన్ని గాడిన పెట్టేందుకు పరిశ్రమలకు ప్రాణం పోయడం అత్యవసరం. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన పారిశ్రామిక విధానం కొత్త చరిత్రను లిఖిస్తోంది.

75. రాష్ట్రంలో వివిధ రకాల పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్న మానవ వనరులు పెంపొందించే దిశగా చేపట్టవలసిన శిక్షణా కార్యక్రమాలను గుర్తించటం కోసం ప్రభుత్వం ఒక సమగ్ర విశ్లేషణను చేపట్టింది. తద్వారా ఆంధ్రప్రదేశ్ లో నెలకొల్పబడుతున్న వివిధ పరిశ్రమలకు నిపుణులైన కార్మిక శక్తిని సమకూర్చడంతో పాటు, స్థానికులకు ఉద్యోగ అవకాశాల కల్పనను మరింత మెరుగు పరచడం సాధ్యమవుతుంది. ఈ దిశగా ప్రభుత్వం 'ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయ్ మెంట్ ఆఫ్ లోకల్ కాండిడేట్స్ ఇన్ ద ఇండస్ట్రీస్ / ఫ్యాక్టరీస్ యాక్ట్, 2019' ని తీసుకొచ్చింది. దీని ద్వారా పరిశ్రమలలో 75% ఉద్యోగాలు స్థానికులకే చెందుతాయి. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొల్పిన, రానున్న రోజుల్లో నెలకొల్పనున్న పరిశ్రమలు తమ ఉద్యోగాల్లో 75% స్థానికులకు ఇవ్వడం తప్పనిసరి. రాష్ట్రంలో తిరుపతిలో ఒక స్కిల్స్ విశ్వవిద్యాలయంతో పాటు, 30 స్కిల్ కళాశాలలు కూడా నెలకొల్పాలని ప్రతిపాదించడమైనది. ఈ కళాశాలలు ప్రతి ఒక్క పార్లమెంటు నియోజక వర్గంలోనూ ఒక్కొక్కటి చొప్పున ఏర్పాటవుతాయి. వీటితో పాటు 4 ట్రిపుల్ ఐటిల్లోనూ, పులివెందుల లోని జె.ఎన్.టి.యూ.లోనూ కూడా స్కిల్ కళాశాలలు నెలకొల్పబడతాయి. ఈ కార్యక్రమాల నిమిత్తం ఈ రంగానికి 2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ.856.62 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను.

గ్రామీణాభివృద్ధి

76. గ్రామీణ ప్రాంతాలలో ప్రతీ ఒక్క కుటుంబానికి ఉపాధిహామీ కింద మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మొత్తం 13 జిల్లాలలోనూ అమలవుతున్నది. గ్రామీణ నిరుపేదలకు జీవనోపాధిని నిలకడగా సమకూర్చేందుకూ, చిరకాలం ఉండిపోయే గ్రామీణ సంపదను సృష్టించేందుకూ ప్రభుత్వం ఈ పథకాన్ని వివిధ శాఖలతో అనుసంధాన పరచి అమలు చేస్తున్నది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 42.35 లక్షల కుటుంబాలకు చెందిన 69.14 లక్షల వేతన ఉద్యోగార్థులకు ఉపాధి అవకాశం కలిగింది. వీరందరూ కలిసి 1679.68 లక్షల పని దినాల మేరకు పనులు చేపట్టారు. ఇందులో షెడ్యూల్డు కులాలకు సంబంధించిన వారికి 362.74 లక్షల పని దినాలు, షెడ్యూల్డు తెగలకు 190.27 లక్షల పని దినాలు, వెనుకబడిన తరగతులకు 831.34 లక్షల పని దినాలు లభించాయి. ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న వారిలో 96.14% మందికి 15 రోజుల్లోనే చెల్లింపులు జరిగాయి. వివిధ ప్రభుత్వ శాఖల అనుసంధానంతో వస్తు సామగ్రి విభాగం కింద ఈ పథకం ద్వారా రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్లు, గ్రామ సచివాలయ భవన నిర్మాణాలు చేపట్టాలని ప్రభుత్వం ఉద్దేశిస్తున్నది. తద్వారా క్షేత్ర స్థాయిలో పాలనా పద్ధతులు మరింత బలోపేతం కానున్నాయి.

77. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను గ్రామీణాభివృద్ధి కింద రూ.16,710.38 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను.

పట్టణాభివృద్ధి

78. ఒక రాష్ట్రం సాధించే ఆర్థిక పురోగతికి ఆ రాష్ట్రంలోని పట్టణ పాలన ఒక ముఖ్యమైన కొలమానం. పట్టణ ప్రాంత స్థానిక సంస్థల ద్వారా అందే మొత్తం 110 పౌర సేవల్ని వార్డు సచివాలయాలు, వార్డు వాలంటీర్ల వ్యవస్థ ద్వారా అందించడం జరుగుతున్నది. తద్వారా సమర్థవంతమైన, పారదర్శకమైన, జవాబుదారీ తనం కలిగిన పాలన సాధ్యపడుతున్నది. ఈ సేవల నిమిత్తం 2019-20లో 35 వేల మందికి పైగా వార్డు సచివాలయ సిబ్బంది, 70 వేల మందికి పైగా వార్డు వాలంటీర్లను నియమించటం జరిగింది.

79. అన్ని పట్టణ ప్రాంత స్థానిక సంస్థల పరిధిలోనూ రక్షిత మంచినీటి సరఫరాను అందించడానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తున్నది. ఇందుకు గాను ప్రస్తుతం ఉన్న సదుపాయాలను మెరుగుపరచడం, సేవల నాణ్యతను పెంపొందించడం మీద దృష్టి పెడుతున్నది. అమృత్, యు.ఐ. డి.ఎస్.ఎస్.ఎం.టి. పథకాలతో అనుసంధాన పరచడం ద్వారా ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్టిమెంట్ బ్యాంకు, హడ్కోల ద్వారా, ఆర్థిక వనరులు సమకూర్చుకోవడం ద్వారా పట్టణ ప్రాంతాల్లో భూ గర్భ డ్రైనేజికి, మురుగునీటి ప్రక్షాళనకు, రక్షిత మంచినీటి సరఫరాకు సంబంధిచిన ప్రాజెక్టులను ప్రభుత్వం అమలు పరుస్తున్నది.

80. రాజధాని ప్రాంత సామాజిక భద్రత నిధి కింద రాజధాని నగర ప్రాంతంలోని భూమి లేని నిరుపేద కుటుంబాలకు ఒక్కొక్కరికి నెలవారీ పెన్షన్ రూ.2,500 చొప్పున నేరుగా వారి ఖాతాలకు నగదు బదిలీ జరుగుతున్నది. 2019 డిసెంబరు దాకా 20,092 మంది పెన్షనర్లకు రూ. 52.50 కోట్లు పంపిణీ జరిగింది.

సాగునీటి వనరులు

81. ఆంధ్రప్రదేశ్ వంటి వ్యవసాయిక ఆర్థిక వ్యవస్థ పురోగతి చెందడానికి సాగునీటి వనరుల కల్పన తప్పనిసరి. ఇందుకు గాను ప్రభుత్వం జలయజ్ఞం కింద చేపట్టిన, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న అన్ని ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయడానికి, నదుల అనుసంధానానికి, భూతల, భూగర్భ జలవనరులను సక్రమంగా వినియోగించడానికి చర్యలు చేపడుతున్నది. తద్వారా రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు తగినంత సాగునీరు అందించాలని ప్రయత్నిస్తున్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవధార అని చెప్పదగ్గ పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నది.

82. ఒక వైపు రాయలసీమలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు పదే పదే పునరావృతమవుతూ ఉండగా, కృష్ణానది నుండి మనకి కేటాయించబడ్డ మనవాటా నీళ్ళని మనం వాడుకోలేక పోవడం ఒక వైరుధ్యం. కృష్ణానదికి వరదలు సంభవించే కొద్దిపాటి కాలవ్యవధిలోనే ఆ జలాల్లో మన వాటా మనం పొందటానికీ, చెన్నై నగరపు దాహార్తి తీర్చడానికి మనమిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుకోడానికి రాయలసీమ దుర్భిక్ష నివారణ మిషన్ ఏర్పాటయింది. ఈ పథకం రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా రాయలసీమకి వరం అని చెప్పవచ్చు.

83. అలాగే గోదావరి-పెన్నా నదుల అనుసంధానం తో పాటు, పల్నాడు రైతుల సంక్షేమార్థం వరికసెలపూడి ఎత్తిపోతల పథకాన్ని వై.యస్.ఆర్ పల్నాడు దుర్భిక్ష నివారణ మిషన్లో విలీనం చెయ్యడం జరుగుతుంది.

84. జగ్జీవన్ రాం ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం, వంశధార-నాగావళి అనుసంధాన పథకాల మీద మరింత దృష్టి పెట్టడం ద్వారా ఉత్తరాంధ్ర రైతులకు ఒక బాసట కల్పించడానికి వీలవుతుంది. వీటితో పాటు పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు, గాలేరు నగరి సుజల స్రవంతి, గండికోట రిజర్వాయరు, హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు, చింతలపూడి ఎత్తిపోతల పథకాలు కూడా ప్రభుత్వ ప్రాధాన్యతలే. కృష్ణా, గోదావరి జలాల్లో రాష్ట్రానికి దక్కినవాటాను పూర్తి స్థాయిలో వినియోగించుకోడానికి ఈ పథకాల ద్వారా వీలవుతుంది. తద్వారా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి సాధ్యపడుతుంది.

85. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను సాగునీటి వనరుల నిమిత్తం రూ.11,805.85 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను.

అడవులు-పర్యావరణం

'మనం అడవుల కోసం ఏం చేస్తున్నాం అన్నది మనం మనకోసం ఏం చేసుకుంటున్నాం అన్న దానికి ప్రతిరూపమే' అన్నారు మహాత్మాగాంధీ.

86. ఈ లబ్ధినంతటిని ప్రభుత్వం మరింత పటిష్టపరచాలని భావిస్తున్నది. రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో అడవుల శాతం 33 ఉండేలా చూడడానికి మనం ఒక వినూత్న కార్యక్రమానికి అంకురార్పణ చేశాం. ప్రతి ఒక్క పౌరుడు తనకంటూ ఒక మొక్కను నాటాలనే నినాదంతో సీనియర్ సిటిజన్లను భాగస్వాములను చేస్తూ ఒక వన మహోత్సవాన్ని మొదలు పెట్టాం. ఇందుకు అవసరమైన మొక్కల పంపిణీలో, మొక్కల్ని నాటడంలో గ్రామ సచివాలయాలు, గ్రామ వాలంటీర్లను కూడా భాగస్వాములుగా చేస్తున్నాము. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను అడవులు, పర్యావరం, సైన్సు టెక్నాలజీ శాఖకు రూ.457.29 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను.

రవాణా రహదారి సదుపాయాలు

87. తాను ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుకుంటూ, మన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన ఉద్యోగులందరినీ ప్రభుత్వంలో విలీనం చేస్తూ వారిని కొత్తగా ఏర్పరచిన పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు డిపార్టుమెంటు పరిధిలోకి తీసుకు వచ్చింది.

88. విశాఖపట్నం మెట్రోపాలిటన్ ప్రాంతంలో రవాణా సదుపాయాన్ని మెరుగు పరచడం కోసం 140.11 కిలోమీటర్ల పొడవు గల మాస్ రాపిడ్ ట్రాన్సిస్ట్ సిస్టంను అభివృద్ధి పరచడానికి ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా విశాఖపట్నానికి ఉత్తరాన అభివృద్ధి చెందుతున్న భోగాపురం విమానాశ్రయ ప్రాంతం నుండి దక్షిణాన గల అనకాపల్లి వరకు రహదారి సదుపాయం మరింత అభివృద్ధి చెందుతుంది. 140.11 కిలోమీటర్ల మేరకు ఏర్పరచనున్న ఈ రహదారిలో 79.91 కిలోమీటర్ల మేరకు కారిడార్లు లైట్ మెట్రో రైల్ సిస్టం అభివృద్ధి కోసం, మిగిలిన 60.20 కిలోమీటర్ల మేరకు కారిడార్లు కాటినరీ ఫ్రీ మోడరన్ ట్రామ్ | మెట్రో లైట్ సిస్టం కోసం వినియోగించబడతాయి.

89. రవాణా రంగానికి 2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ. 6,588.63 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను.

90. రాష్ట్రంలో రాష్ట్ర రహదారులు, జిల్లా రహదారులు, గ్రామీణ రహదారులను ఎప్పటికప్పుడు ఉన్నతీకరించడానికి, అభివృద్ధి పరచడానికి, వెడల్పు చేయడానికి ప్రభుత్వం ఎన్నో పనులు చేపడుతున్నది. ఇందుకు బడ్జెటు కేటాయింపులతో పాటు, నాబార్డు నుండి ఇతర సంస్థల నుండి నిధులను సమకూర్చుకుంటున్నది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 256 కిలోమీటర్ల మేరకు జాతీయ రహదారులను అభివృద్ధి పరచడంతో పాటు, 3 వంతెనల నిర్మాణం కూడా జరిగింది. సి.ఆర్.ఎఫ్. పథకం కింద 505 కిలోమీటర్ల మేరకు రహదారుల్ని అభివృద్ధి పరచారు. వీటితో పాటు 2020-21 ఆర్థిక సంవత్సరంలో మరొక 700 కిలోమీటర్ల రహదారుల్ని అభివృద్ధి పరచటానికి ప్రతిపాదించడమైనది.

91. న్యూ డెవలప్ మెంట్ బ్యాంకు - ఆర్థిక సహాయంతో 70:30 నిష్పత్తిలో ఖర్చులు భరించే పద్ధతి మీద ప్రభుత్వం 2 ప్రాజెక్టులను మొదలు పెట్టింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ రోడ్డు & బ్రిడ్జెస్ రికన్స్ట్రక్షన్ ప్రాజెక్టు రాష్ట్ర రహదారుల్ని, వంతెనల్ని అభివృద్ధి పరచడం మీద దృష్టి పెడుతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ మండల్ కనెక్టివిటి & రూరల్ కనెక్టివిటి ఇంప్రూవ్ మెంట్ ప్రాజెక్టు జిల్లా, మండల, కేంద్ర కార్యాలయాల మధ్య రెండు వరుసల రహదారి వ్యవస్థను మెరుగుపరచడానికి ప్రయత్నాలు చేస్తున్నది. ఇందుకు గాను రోజుకి 2,000 పి.సి.యు. ల కంటే ఎక్కువ ట్రాఫిక్ ఉన్న రహదారులను ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ 2 పథకాల ద్వారా మొత్తం 3,104 కిలోమీటర్ల పొడవు గల రహదారులను 479 వంతెనలను నిర్మించడం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది.

మౌలిక సదుపాయాల కల్పన

92. నానాటికీ పెరుగుతున్న సరుకుల రవాణా అవసరాలను దృష్టిలో పెట్టుకుని రామాయపట్నం దగ్గర ఒక గ్రీన్ ఫీల్డ్ రేవు పట్టణాన్ని అభివృద్ధి పరచాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నది. ఈ విధంగా ప్రతిపాదిస్తున్న రేవుపట్నం పృష్ట భూమిలో ఆంధ్రప్రదేశ్ కి చెందిన ప్రకాశం, గుంటూరు, కర్నూలు జిల్లాలు, తెలంగాణకు చెందిన మహబూబ్ నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలు ఉన్నాయి. ఈ రేవు పట్టణాన్ని లాండ్ లార్డ్ మోడల్ లో అభివృద్ధి పరుస్తారు. ఇక్కడ సముద్ర తీరానికి ఎదురుగా ఒక ఆర్టిఫిషియల్ డీప్ హార్బర్‌ను నిర్మించడం జరుగుతుంది. దాని వెనుక బ్రేక్ వాటర్స్ రక్షణ ఉంటుంది. ఈ రేవు పట్టణానికి నావలు రావటానికి వీలుగా 14 కిలోమీటర్ల పొడవైన కాలువ ఉంటుంది. ఇందులో 65 వేల డి.డబ్ల్యు.టి. బరువు మోయగల నౌకలు ప్రయాణించవచ్చు. ఈ రేవు పట్టణం నిర్మాణం మొదటి దశలో 802 ఎకరాల పరిధిలో 4 బెర్త్ లుగా రూ.3,736 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణాలు చేపట్టడబతాయి. అలాగే, భావనపాడు రేవు పట్టణం కూడా లాండ్ లార్డ్ మోడల్ తరహాలోనే నిర్మించబడుతుంది. అక్కడ 800 ఎకరాల పరిధిలో మొదటి దశలో 3 బెర్తుల్లో రూ.3,200 కోట్ల అంచనా వ్యయంతో అభివృద్ధి జరుగుతుంది. ఈ రేవు పట్టణానికి 1.25 వేల డి. డబ్ల్యు.టి. బరువు మోయగల నౌకలు సరుకుల రవాణా చేపడతాయి.

93. విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పి.పి.పి. పద్ధతిలో భోగాపురం వద్ద అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందించడమైనది. ఈ విమానాశ్రయం సుమారు 2,203 ఎకరాల పరిధిలో నెలకొల్పబడుతుంది. ఇందులో 1,910 ఎకరాల మేరకు విమానయాన సదుపాయాలు, 293 ఎకరాల మేరకు వాణిజ్య నివాస సముదాయాలు ఉంటాయి. వీటితో పాటు విమానాల నిర్వాహణ, మరమ్మత్తులు మొదలైన అంశాలతో పాటు ఒక ఏవిషయేషన్ అకాడమీని కూడా తప్పనిసరిగా నెలకొల్పవలసి ఉంటుంది. ఇందులో అభివృద్ధి అవసరాల కోసం 500 ఎకరాల మేరకు ప్రభుత్వ ఆధీనంలో ఉంది.

ఎనర్జీ రంగం

94. రాష్ట్రంలోని వినియోగదారులందరికీ 24X7 చొప్పున చౌక ధరకు నాణ్యమైన విద్యుత్తు సరఫరాను అందించాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యం. కానీ, ఈ ప్రభుత్వం అధికార బాధ్యత చేపట్టాక విద్యుత్తు రంగ పరిస్థితుల్ని పరిశీలిస్తే అవి, మామూలుగా ప్రజలు భావిస్తునట్లుగా కాక, తీవ్ర సంక్షోభంలో కూడుకుపోయి కనబడ్డాయి. దాదాపు 20 వేల కోట్ల మేరకు విద్యుత్తు కొనుగోళ్ళ బకాయిలు పోగుపడ్డాయి. వీటితో పాటు రూ.29,147 కోట్ల మేరకు డిస్కంల నష్టాలు, రూ.15,500 కోట్ల మేరకు డిస్కంలకు ప్రభుత్వం చెల్లించవలసిన బకాయిలు కూడా పేరుకు పోయి కనబడ్డాయి. ఇంత తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదురైనప్పటికి మేము విద్యుచ్ఛక్తి రంగం కుప్పకూలిపోకుండా నిలబెట్టగలిగాం. 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ. 13 వేల కోట్ల మేరకు నిధులు విడుదల చేశాం. ఈ మొత్తం గత 5 సంవత్సరాల్లో విద్యుత్తు రంగానికి విడుదల చేసిన నిధులన్నిటి కన్నా ఎక్కువ. విద్యుచ్ఛక్తి రంగంలో 75% కన్నా ఎక్కువ వ్యయం ప్రధానంగా విద్యుత్తు కొనుగోలుకు సంబంధించిన ఖర్చులే. కాబట్టి అన్నింటికన్నా ముందు గతంలో చేపట్టిన విద్యుత్తు కొనుగోలు ఒప్పందాల్లో ఎక్కడెక్కడ అధిక ధరలకు ఒప్పందాలు కుదుర్చుకున్నారో వాటన్నిటిని ప్రభుత్వం సమీక్షిస్తున్నది. దీర్ఘకాలం పాటు వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్తు సరఫరా కొనసాగించడానికి వీలుగా ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్‌ను నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు గాను 8 వేల మెగావాట్ల నుండి 10 వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన సౌర విద్యుత్తు ఉత్పాదనను చేపట్టనున్నది.

95. రాష్ట్ర విభజన అనంతరం మన ఇంధన భద్రత కుంటుపడింది. ఇందుకు కారణం మనం మన బొగ్గు గనులను, జల విద్యుత్తు ఉత్పాదక సామర్థ్యాన్ని కోల్పోవలసి రావటమే. దానివల్ల ప్రభుత్వం ఇతర రాష్ట్రాల్లో తన బొగ్గు గనులను సమకూర్చుకోవటం కోసం, అలాగే భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని విద్యుత్తు ఉత్పాదన వ్యయాన్ని తగ్గించడం కోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది. అంతేకాక, వ్యావసాయిక అవసరాలకు అందించే విద్యుత్తులో నాణ్యతను మెరుగుపరచడం కోసం గ్రామీణ ప్రాంతాల్లో ఫీడర్ సెపరేషను కూడా మొదలు పెట్టింది.

96. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను విద్యుచ్ఛక్తి రంగానికి రూ. 6,984.73 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను.

పరిశ్రమలు

97. ఆర్థికాభివృద్ధిలోనూ, ఉద్యోగ కల్పనలోనూ అందరికీ చోటు దక్కే విధంగా ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. రాష్ట్రంలో వస్తువుల తయారీ, వ్యవసాయిక ఆహార పదార్థాల ప్రొసెసింగ్, జౌళి వస్త్ర పరిశ్రమ, ఆటోమొబైల్ వస్తువుల తయారీ, ఖనిజాల మీద ఆధారపడ్డ పరిశ్రమలు, రక్షణ రంగం, గగన తలం, ఎలక్ట్రానిక్స్, బయోటెక్నాలజీ, పెట్రోలియం, షెట్రో రసాయనాల రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించే అవకాశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉంది.

98. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చేవారికి అవసరమైన అన్ని రకాల పారిశ్రామిక అనుమతులు, మంజూరులు ఒక్కచోటనే లభించేలాగా ఒక సింగిల్ డెస్క్ పోర్టల్ ను బలోపేతం చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని బలపరుస్తున్నది. 2020 మార్చి 31 నాటికి 31,202 సూక్ష్మ, చిన్నతరహా, మధ్యతరహా పరిశ్రమల కోసం సింగిల్ డెస్క్ పోర్టల్‌కు దరఖాస్తులు చేరాయి. వీటి ద్వారా 1,07,583 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించగల పెట్టుబడులు రూ.9,842 కోట్ల మేరకు కనిపిస్తున్నాయి. అలాగే 55,368 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించగల రూ.37,582 కోట్ల మేరకు పెట్టుబడులతో 229 భారీ మెగా పరిశ్రమల స్థాపనకోసం కూడా దరఖాస్తులు నమోదయ్యాయి. 2020 మార్చి 31 నాటికి ఆయా విజ్ఞప్తులకు అవసరమైన అనుమతులన్నీ 21 రోజుల వ్యవధిలో 99.05% ఎస్.ఎల్.ఎ.తో మంజూరవుతున్నాయి.

99. 2020 ఏప్రిల్ మాసాంతానికి 13,122 సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు స్థాపించబడ్డాయి. రూ.2,503 కోట్ల మేరకు పెట్టుబడులు కలిగిన ఈ పరిశ్రమల ద్వారా 63,897 మందికి ఉద్యోగ అవకాశాలు లభ్యం కానున్నాయి. అదే విధంగా 36,810 కి ఉద్యోగ అవకాశాలు కల్పించగల 39 భారీ మెగా పరిశ్రమలకు సంబంధించిన 39 యూనిట్లు రూ. 24,170 కోట్ల పెట్టుబడితో నెలకొల్పబడ్డాయి.

100. అధ్యక్షా! సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను (యం.ఎస్.యం.ఇ.) ప్రోత్సహించే దిశగా మొదటి అడుగుగా ప్రభుత్వం వన్ టైం రీస్టక్చరింగ్ (ఒ.టి.ఆర్) పథకాన్ని ప్రవేశపెట్టింది. డాక్టర్ వై.యస్.ఆర్. నవోదయం పేరిట ప్రారంభించిన ఈ పథకం యం.ఎస్.యం.ఇ.లు అభివృద్ధి చెందటానికి తగిన వాతావరణాన్ని ఏర్పాటు కోసం ఉద్దేశించబడింది. గత ప్రభుత్వము యం.ఎస్.యం.ఇ.లకు ఇవ్వవలసిన ప్రోత్సాహకాలు చెల్లింపు చేయకపోవడం వలన తగిన పెట్టుబడి లేక చాలా పరిశ్రమలు కష్టాల్లో ఉన్నాయి. ఈ సమయంలో పరిశ్రమలను ఆదుకోవడానికి మన ప్రభుత్వం రీస్టార్ట్ ప్యాకేజిని మంజూరు చేసింది. ఈ ప్యాకేజి క్రింద రూ.904.89 కోట్లు 11,238 యం.ఎస్.యం.ఇ.లకు తయారీ మరియు అనుబంధ యూనిట్లు ప్రోత్సాహకాల బకాయిలను రెండు దశలలో ఇవ్వటం, ఒప్పందం కుదుర్చుకున్న డిమాండ్ బదులుగా కొంత స్థిర డిమాండ్ 3 నెలల పాటు ఏప్రిల్, 2020 నుండి జూన్, 2020 వరకు చెల్లించటం, మూలధన ఋణాలు మరియు మార్కెట్ అందుబాటులో ఉంచటంలాంటివి ఉన్నాయి.

101. మనం కలకన్నట్లుగా కడపలో కొత్త స్టీల్ ప్లాంట్ తయారీ నిమిత్తం ఆంధ్రప్రదేశ్ హైగ్రేడ్ స్టీల్ లిమిటెడ్ ను కంపెనీల చట్టం 2013 క్రింద ప్రారంభించింది. ఈ సంస్థ 100% ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యాజమాన్యంలో ఉంది. అలాగే ఎన్.యం.డి.సి.తో ఓర్ ఒప్పందం చేసుకున్నాము.

102. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి నిమిత్తం 2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ.2,075.56 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను.

పర్యాటక రంగం

103. పర్యాటకుల్ని రాష్ట్రానికి ఆకర్షించే విధంగా ముఖ్య పర్యాటక స్థలాలను సమగ్రంగా అభివృద్ధి చేయటం కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జాతీయ పర్యాటక పటం పైన ఆంధ్రప్రదేశ్ కు సుస్థిర స్థానాన్ని సముపార్జించడం కోసం హోటల్ రంగంలోనూ, రిసార్టుల రంగంలోనూ పెట్టుబడుల్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది.

అగ్రిగోల్డ్ స్కాం బాధితులకు పరిహారం

104. గౌరవనీయ ముఖ్యమంత్రి వారు వారి పాదయాత్ర సందర్భంగా తనను కలుసుకున్న అగ్రిగోల్డ్ స్కాం బాధితులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ హామీ నెరవేర్చడంలో భాగంగా రాష్ట్రంలోని అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు రూ.264 కోట్ల మేరకు పరిహారాన్ని చెల్లించడం జరిగింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను అగ్రిగోల్డ్ స్కాం బాధితులకు రూ.200 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను.

శాంతి భద్రతలు

105. పోలీసు సిబ్బంది సంక్షేమంలో భాగంగా గ్రూపు పర్సనల్ ప్రమాద బీమా పరిమితిని ప్రస్తుతం ఒక్కొక్కరికి రూ.13 లక్షలుగా ఉన్నదాన్ని ఒక్కొక్కరికి రూ. 20 లక్షలుగా పెంచటం జరిగింది. విధి నిర్వహణలో భాగంగా ప్రాణాలు అర్పించిన అన్ని తరగతుల పోలీసు సిబ్బందికి ఈ పరిమితి పెంపుదల వర్తిస్తుంది. 2019 అక్టోబరు 1వ తేదీ నుండి హోం గార్డుల విధి నిర్వహణ భత్యాన్ని రోజుకు రూ.600 నుండి రూ.710 కి పెంచటం జరిగింది. పోలీసు శాఖకు 2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ.5,988.72 కోట్లు కేటాయింపు ప్రతిపాదిస్తున్నాను.

ఆర్థికాభివృద్ది తీరుతెన్నుల సమీక్ష

106. 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను మొదట సవరించిన అంచనాల ప్రకారం రూ.8,62,957 కోట్ల రాష్ట్ర స్థూల అభివృద్ధి ఉత్పత్తి మలి అంచనాల ప్రకారం ప్రస్తుత ధరల వద్ద 2019-20 సంవత్సరానికి గాను రూ. 9,72,782 కోట్లుగా నమోదయింది. తద్వారా 12.73% వృద్ధి కనిపిస్తున్నది. 2011-12 స్థిర ధరల ప్రకారం 2019-20 సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర స్థూల అభివృద్ధి ఉత్పత్తి రూ. 6,72,018 కోట్లు. ఇది 2018-19 (మొదట సవరించిన అంచనాలు)కు చెందిన రూ. 6,21,301 కోట్లుకన్నా 8.16% ఎక్కువ. ప్రస్తుత ధరల ప్రకారం రాష్ట్ర తలసరి ఆదాయం 2018-19 (మొదట సవరించిన అంచనాలు) కి చెందిన రూ.1,51,173 నుంచి 2019-20 లో రూ.1,69,519 కి పెరిగింది. తద్వారా 12.14% పెరుగుదల నమోదయింది.

2018-19 లెక్కలు

107. ఆంధ్రప్రదేశ్ అకౌంటెంట్ జనరల్ వారు క్రోడీకరించిన ఆర్థిక లెక్కల ప్రకారం 1 ఏప్రిల్ 2018 నుండి 31 మార్చి 2019 మధ్య కాలానికి రూ.13,898.59 కోట్ల మేరకు రెవెన్యూ లోటును, రూ.35,440.87 కోట్ల మేరకు ఆర్థిక లోటును చూపిస్తున్నవి. 1 ఏప్రిల్ 2018 నుంచి 31-3-2019 మధ్య కాలంలో రెవెన్యూ లోటు, ఆర్థిక లోటు రాష్ట్ర స్థూల అభివృద్ధి ఉత్పత్తిలో వరుసగా 1.51%, 3.86% గా ఉన్నాయి.

సవరించిన అంచనాలు 2019-20

108. సవరించిన అంచనాలు ప్రకారం రెవెన్యూ వ్యయం రూ.1,37,518.07 కోట్లు, క్యాపిటల్ వ్యయం రూ.12,845.49 కోట్లు. 2019-20 సంవత్సరానికి రెవెన్యూ లోటు దాదాపుగా రూ.26,646.92 కోట్లు, అదే కాలానికి ఆర్థిక లోటు దాదాపుగా రూ.40,493.46 కోట్లు. ఇవి రాష్ట్ర స్థూల అభివృద్ధి ఉత్పత్తిలో 2.47%, 3.75% గా ఉన్నాయి.

బడ్జెటు అంచనాలు 2020-21

109. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను నేను రూ.2,24,789.18 కోట్ల వ్యయాన్ని ప్రతిపాదిస్తున్నాను. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.1,80,392.65 గా అంచనా వేయడం జరిగింది. ఋణాల చెల్లింపులు, ఇతర కాపిటల్ చెల్లింపుల తో కూడిన క్యాపిటల్ వ్యయం రూ. 44,396.54 అంచనా వేయడం జరిగింది.

110. కోవిడ్-19 మహమ్మారి మూలంగా ఆర్థిక వ్యవస్థ మందగించినందువల్ల 2020-21 బడ్జెటు అంచనాలు, 2019-10 బడ్జెటు అంచనాలు కన్నా 1.4 % తరుగుదల చూపిస్తున్నాయి. ఇందులో రెవెన్యూ లోటు రూ. 18,434.14 కోట్ల మేరకు ఉండవచ్చునని, ఆర్థిక లోటు దాదాపు రూ.48,295.58 కోట్లు ఉండవచ్చునని అంచనా వేయటమైనది. రాష్ట్ర స్థూల అభివృద్ధి ఉత్పత్తిలో ఆర్థిక లోటు 4.78% గానూ, రెవెన్యూ లోటు 1.82% గానూ ఉండవచ్చును.

ముగింపు మాటలు

111. అధ్యక్షా!


2019-20 ఆర్థిక సంవత్సరం మన ప్రయాణంలో తొలి అడుగు మట్టుకే. మనం మన మాతృభూమిని, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉజ్జ్వల భవిష్యత్ దిశగా నడిపించడానికి గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యుల క్రియాశీలక నాయకత్వంలో మన ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తున్నది. రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి పరచడం, మానవాభివృద్ధి సూచికల ప్రకారం రాష్ట్రాన్ని అత్యున్నత స్థానంలో నిలపడం కన్నా మించిన కర్తవ్యం మన ప్రభుత్వానికి మరొకటి లేదు.

112. 5 కోట్ల జనంతో కూడిన మన రాష్ట్రమనే కుటుంబ ఆకాంక్షలను నిలబెట్టడానికి మనం శాయశక్తులా కృషిచేస్తూనే ఉందాం. మన లక్ష్యాలను సాధించుకోవడానికి, మన పిల్లలను విద్యావంతులుగా తీర్చిదిద్దడానికి, మన రైతులకు బాసటగా నిలబడడానికి, మన ఆడబిడ్డలకు, తల్లులకు, అక్క చెల్లెళ్లకు సాధికారికత పొందడానికి, అస్వస్థులకు, రోగులకు అవసరమైన సంరక్షణ కల్పించడానికి, అణగారిన వర్గాలను అభ్యున్నతి పథంలో నడిపించడానికి రాష్ట్రంలోని ప్రతి ఒక్క పౌరుడు సగర్వంగా తల ఎత్తుకుని నిలబడడానికి మనం చేయవలసినదం

113. అధ్యక్షా !

మనల్ని చుట్టు ముట్టిన కోవిడ్-19 మహమ్మారి ఎదుట ధైర్యంగా నిలబడ్డ ఈ సందర్భంలో మనం ఈ పెను సవాలును మరింత సమర్థవంతంగా ఎదుర్కోగల శక్తిని మనకి ప్రసాదించమని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.

'మంచి చెడ్డలు లోకమందున
ఎంచి చూడగ రెండే కులములు'
- అన్న మహా కవి గురజాడ పలుకుల సారాన్ని ఆచరణలో నిబద్ధంగా ఆచరిస్తూ పేదవాడి సంక్షేమమే ఆదర్శంగా ముందుకు వెళ్ళుతున్నాము.

'పాలకుడు
బలహీనులకు బలం కావాలి,
అనాథలకు అండగా నిలవాలి,
అంధులకు కంటిచూపు కావాలి,
నడవలేనివారికి నడిచే కాళ్లు కావాలి.'

'నాయకుడి విలువలు, నిబద్ధత ఆదర్శంగా ఉండాలి.
ఆయన ఆశయాలు మిగిలిన వారికి ఆదర్శాలుగా నిలవాలి'
మన ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు మనం అనుసరించాల్సిన ఆదర్శాలను గుర్తు చేస్తూ, సాధించాల్సిన లక్ష్యాలు సూచిస్తున్న ఫలితంవలనే పాలన రథం సంక్షేమ పథంలో ముందుకు సాగుతోంది.

'ఉత్తములను వివేకం, మధ్యములను అనుభవం, అధములను అవసరం, జంతువులను స్వభావం నడిపిస్తాయని' సిసిరో చెప్పారు.

'ధర్మం, సత్యం నిదానంగా పెరుగుతాయి.... బలపడతాయి.
సమాజానికి మేలు చేస్తాయి.
కానీ ఆధర్మం, అసత్యం అతి వేగంగా పెరుగుతాయి.
 చివరకు పతనమవుతాయి'

ఈ సందర్భంగా గురుదేవులు విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ అడుగుజాడల్లో వారి వాక్యాల స్ఫూర్తితో నేను నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను.

ఎక్కడ మనస్సు నిర్భయంగా ఉంటుందో,
ఎక్కడ శిరస్సు సగర్వంగా తల ఎత్తుకుని నిలబడుతుందో,
ఎక్కడ జ్ఞానం స్వేచ్ఛగా ఉంటుందో,
ఎక్కడ ఆరోగ్యం అన్నిటికన్నా ముఖ్యమో,
ఎక్కడ సమాజం శకలాలుగా విడిపోదో,
ఎక్కడ స్త్రీలు శిశువులు సాధికారికంగా నిలబడతారో,
ఎక్కడ ఉద్యోగ అవకాశాలు పుష్కలమో,
ఎక్కడ నిర్విరామ ప్రయత్నమే ఒక జీవన విధానమో,
ఎక్కడ రైతన్నలు కృషి కొనసాగిస్తారో,
ఎక్కడ గ్రామాల్లో స్వరాజ్యం సిద్ధిస్తుందో,
ఎక్కడ నేను అనే ఇరుకు పదం కన్నా మనం అనే విశాల పదం ముఖ్యమౌతుందో
అక్కడికి,ఆ స్వేచ్ఛా స్వర్గంలోకి
నా తండ్రీ, నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మేల్కొల్పు!

ఈ మాటలతో నేను నా బడ్జెటు ప్రతిపాదనలను గౌరవ సభా సదుల ఆమోదానికి సమర్పిస్తున్నాను.

జై ఆంధ్రప్రదేశ్

జై హింద్.

Annexure-I Secretariat Department Wise Budget Estimates 2020-21 (Rs In Crores)

S.NO DEPARTMENT BE 19-20 RE 19-20 BE 20-21 GROWTH % ON BE 19-20
1 Agriculture Marketing and Co- Operation 18327.94 5986.82 11891.2 -35.12
2 Animal Husbandry, Dairy Development and Fisheries 1912.29 719.87 1279.77 -33.08
3 Backward Classes Welfare Secretariat 7271.45 18986.21 26934.82 270.42
4 Environment, Forest, Science and Technology 446.77 322.22 457.32 2.36
5 Higher Education 2595.87 1556.68 2276.97 -12.28
6 Energy 6861.03 11638.86 6984.72 1.8
7 Secondary Education Secretariat 29772.79 17971.24 22604.01 -24.08
8 Food and Civil Supplies 4429.43 352.78 3520.85 -20.51
9 Finance 46858.82 53273.84 50700.03 8.2
10 General Administration 1010.78 764.29 878.01 -13.14
11 Gram Volunteers/Ward Volunteers and Village Secretariats /Ward Secretariats - - 46.46 -
12 Health, Medical and Family Welfare 11399.23 7408.75 11419.48 0.18
13 Home 7461.92 6386.07 5988.72 -19.74
14 Housing 3617.37 963.4 3691.79 2.06
15 Water Resources 13139.05 5345.69 11805.74 -10.15
16 Infrastructure and Investment 569.65 172.04 696.62 22.29
17 Industries and Commerce 3416.39 852.83 2705.14 -20.82
18 Information Technology, Electronics and Communications 453.56 69.67 197.37 -56.48
19 Labour, Factories, Boilers and Insurance Medical Services 713.35 267.21 601.37 -15.7
20 Law 937.37 714.19 913.76 -2.52
21 Legislature Secretariat 121.17 104.62 102.09 -15.75
22 Municipal Administration and Urban Development 6587.09 4801.93 8150.24 23.73
23 Minorities Welfare 952.47 1562.18 2055.63 115.82
24 Public Enterprises Secretariat 1.85 1.25 1.55 -16.06
25 Planning 1439.55 -279.26 515.87 -64.16
26 Panchayat Raj and Rural Development 31564.75 11661.62 16710.34 -47.1
27 Revenue 9496.93 8784.56 7964.08 -16.1
28 Department of Real Time Governance 145.75 44.08 54.51 -62.6
29 Department of Skills Development and Training 1054.41 599.84 856.64 -18.8
30 Social Welfare 5919.07 7776.21 12465.85 110.6
31 Transport, Roads and Buildings 6202.98 3043.19 6588.58 6.22
32 Women, Children, Differently Abled and Senior Citizens 2689.36 2491.87 3456.02 28.51
33 Youth Advancement, Tourism and Culture 604.55 412.71 273.66 -54.7
Total 227975 174757.46 224789.18 -1.4

Annexure-II

Sector Wise Budget Estimates 2020-21 (Rs in Crores)

S. NO. SECTOR BE 19-20 % IN TOTAL BUDGET BE 20-21 GROWTH% % in Total Budget
A Economic Services 86185.63 37.8 61562.18 -28.57 27.39
I) Agriculture And Allied Services 20677.08 9.07 13617.55 -34.14 6.06
Ii) Rural Development 29329.98 12.87 15112.74 -48.47 6.72
Iii) Irrigation And Flood Control 13139.04 5.76 11805.73 -10.15 5.25
Iv) Energy 6861.02 3.01 6984.72 1.8 3.11
V) Industry Minerals 3416.39 1.5 2705.14 -20.82 1.2
Vi) Transport 6726.89 2.95 7231.27 7.5 3.22
Vii) Science Tech, Environment 9.92 0 10.72 8.05 0
Viii) General Eco Services 6025.27 2.64 4094.27 -32.05 1.82
B Social Services 75465.02 33.1 96662.52 28.09 43
Ix) General Education 32772.98 14.38 25201.35 -23.1 11.21
X) Sports And Youth Services 329.68 0.14 150.81 -54.25 0.07
Xi) Technical Education 425.76 0.19 348.31 -18.19 0.15
Xii) Art And Culture 77.67 0.03 23.99 -69.1 0.01
Xiii) Medical 11399.23 5 11419.48 0.18 5.08
Xiv) Water Supply, Sanitation 2234.76 0.98 1644.05 -26.43 0.73
Xv) Housing 3617.37 1.59 3691.78 2.06 1.64
Xvi) Urban Development 6587.09 2.89 8150.23 23.73 3.63
Xvii) Information & Public Relations 191.02 0.08 265.91 39.21 0.12
Xviii) Welfare 14142.99 6.2 41456.29 193.12 18.44
Xix) Labour And Employment 978.57 0.43 830.61 -15.12 0.37
Xx) Social Security & Welfare 2707.86 1.19 3479.65 28.5 1.55
C General Services 66324.34 29.09 66564.47 0.36 29.61
Xxi) General Services 66324.34 29.09 66564.47 0.36 29.61
Grand Total 227975 100 224789.18 -1.4 100

Annexure-III

State Development Schemes Expenditure (Rs in Crores)

Name of the Scheme BE 2018-19 BE 2019-20 BE 20-21 Growth %
Total State Development Schemes Expenditure 49103 92050.05 84140.97 -8.59
Scheduled Castes Component (SCSP) 11228.1 15000.85 15735.68 4.9
Schedule Tribes Component (TSP) 4176.61 4988.52 5177.53 3.79
Backward Classes Component 12200 15061.64 25331.3 68.18
Minorities Welfare 1100.14 948.73 2050.22 116.1
Kapu Welfare 1000 2000 2847 42.35

DBT Scehemes

1. Abstract

Name of the Scheme Exp. 19-20 BE 20-21
YSR Pension Kanuka 14883.16 16000
YSR Aasara - 6300
Amma Vodi 6301.98 6000
Jagananna Vidya Deevena (RTF) 1999.32 3009
YSR Cheyuta - 3000
Jagananna Vasati Deevena (MTF) 993.61 2000
YSR Kapu Nestham - 350
YSR Vahana Mitra 236.46 275.51
YSR Jagananna Chedodu - 247.04
YSR Nethanna Nestham 194.12 200
YSR Matsyakara Bharosa 102.32 109.75
Jaganna Thodu - 100
Incentives to Imams and Mouzans - 50
Law Nestham - 12.75
Visit to Holy land Jerusalem - 5
Total 24710.97 37659.05
2. ST Welfare
S,No Name of the Scheme Exp. 19-20 BE 20-21
1 YSR Pension Kanuka 838.06 894.34
2 Amma Vodi 412.68 391.42
3 YSR Cheyuta 0 202.38
4 YSR Aasara 0 171.46
5 Jagananna Vidya Deevena (RTF) 59.22 93.21
6 Jagananna Vasati Deevena (MTF) 26.31 55.83
7 YSR Vahana Mitra 8.76 10
8 Jaganna Thodu 0 5
9 YSR Jagananna Chedodu 0 2.99
10 YSR Nethanna Nestham 0 1
11 Law Nestham 0 0.63
12 YSR Matsyakara Bharosa 0.45 0.45
13 Other Expenditure 155.1 12
Total 1500.58 1840.71

3. SC Welfare

S.No Name of the Scheme Exp. 19-20 BE 20-21
1 YSR Pension Kanuka 2307.44 3064.56
2 YSR Aasara - 1285.59
3 Amma Vodi 1302.35 1230.63
4 YSR Cheyuta - 930.83
5 Jagananna Vidya Deevena (RTF) 417.83 524.2
6 Jagananna Vasati Deevena (MTF) 180.56 367.04
7 YSR Vahana Mitra 54.49 61.11
8 YSR Jagananna Chedodu - 18.08
9 Jaganna Thodu - 17
10 YSR Nethanna Nestham 0.79 3
11 Law Nestham - 2.23
12 YSR Matsyakara Bharosa 0.74 0.75
13 Other Expenditure 113.86 20
Total 4378.06 7525.04
4. Kapu Welfare
S.No Name of the Scheme Exp. 19-20 BE 20-21
1 YSR Pension Kanuka to Kapus 1042 1042.4
2 Amma Vodi 571.78 561.11
3 YSR Kapu Nestham - 350
4 YSR Aasara - 315.37
5 Jagananna Vidya Deevena (RTF) 173.81 301
6 Jagananna Vasati Deevena (MTF) 91.83 183.06
7 YSR Vahana Mitra 27.11 30.34
8 YSR Jagananna Chedodu - 13.92
9 Jaganna Thodu - 10
10 Law Nestham - 0.41
11 Grant for Self Employment Schemes / Overseas Studies / Vidyonnati etc.., 108.12 38
Total 2014.65 2845.6


5. BC Welfare

S.No Name of the Scheme Exp. 19-20 BE 20-21
1 YSR Pension Kanuka to Backward Classes 10063.76 10315.66
2 YSR Aasara - 4217.01
3 Amma Vodi 3539.19 3358.04
4 YSR Cheyuta - 1693.47
5 Jagananna Vidya Deevena (RTF) 1146.88 1868.18
6 Jagananna Vasati Deevena (MTF) 620.06 1240.3
7 YSR Jagananna Chedodu - 197.65
8 YSR Nethanna Nestham 193.33 196
9 YSR Vahana Mitra 118.1 134.92
10 YSR Matsyakara Bharosa 101.13 108.55
11 Jaganna Thodu - 60
12 Law Nestham - 8.02
13 Other Expenditure 18 9.02
Total 15800.45 23406.81
6. Minority Welfare
S.No Name of the Scheme Exp. 19-20 BE 20-21
1 YSR Pension Kanuka 562.58 607.65
2 Amma Vodi 449.73 433.84
3 YSR Aasara - 294.96
4 Jagananna Vidya Deevena (RTF) 201.58 213.41
5 Jagananna Vasati Deevena (MTF) 74.86 149.2
6 YSR Cheyuta - 173.32
7 YSR Vahana Mitra 26 38.15
8 YSR Jagananna Chedodu - 14.07
9 Incentives to Imams and Mouzans - 50
10 Jaganna Thodu - 8
11 Visit to Holy land Jerusalem - 5
12 Law Nestham - 0.96
13 Other Expenditure 1.46 10
Total 1316.21 1998.55


Annexure-V

Important Major and New Schemes


YSR Rythu Bharosa 3615.6
Price Stabilization Fund 3000
Y.S.R Interest free Loans to Farmers 1100
YSR - PM Fasal Bima Yojana 500
Rashtriya Krushi Vikasa Yojana (RKVY) 237.23
Supply of Seeds to Farmers 200
National Horticulture Mission 150.99
Rythu Bharosa Kendralu 100
Agriculture Market Infrastructure Fund (AMIF) 100
YSR - Agri Testing Labs 65
Exgratia to Farmers 20
Other Schemes 2802.37
Grand Total 11891.2
2. Education
Teaching Grants 13124.37
Naadu - Nedu 3000
Samagra Shiksha 1937.02
Jagananna Gorumudda 974.86
Jagananna Vidya Kanuka 500
Government Junior Colleges 493.84
Rashtriya Madhyamika Shiksha Abhiyan (RMSA) 242.5
English Medium in Government Schools 55.15
Prathibha Scholarships 10.54
Government Schools and Residential Institutions 1633.65
Other Schemes 632.09
Grand Total 22604.01


3. Health

Dr. Y.S.R Aarogyasri 2100
National Health Mission (NHM) 1808.03
Naadu - Nedu 1528
Medical Colleges 1122.66
Primary Health Centres 743.24
Assistance to APVVP 710
Centralized Purchase of Drugs and Medicines 400
108 Services 266.17
Family Welfare Centres 242.51
104 Services 204.12
Honorarium to Asha Workers & Other Schemes 2294.74
Grand Total 11419.48


4. Housing

YSR Gruha vasati(House Pattas) 3000
Pradhan Manthri Awas Yojana (Urban) 2540.12
Pradhan Manthri Awas Yojana (Grameen) 500
Weaker Section Housing Programme 150.21


5. Civil Supplies

Subsidy on Rice 3000
Infra for Rice Packets 100
6. Village & Ward Secretariats
Village Volunteers 1104
Grama Sachivalayam 1633
Municipal Ward Volunteers 404
Municipal Ward Secretariat 657

7. SHG Women

Interest Free Loans to DWACRA Women (Vaddileni Runalu) 975.19
Y.S.R Interest free loans to urban Self Help Groups 389.89


8. Industries

Incentives for Industrial Promotion for Micro Small and Medium Enterprises (MSMEs) 905.24
Industrial Incentives 735.38
Kadapa Steel Plant 250
Incentives for Industrial Promotion 185.42
Andhra Pradesh Industrial Infrastructure Corporation 180.77
Infrastructure Development of Micro Small and Medium enterprises (MSMEs) 100


9. Infrastructure & Development

Special Development Package 175
Creation of Essential Infrastructure for new Capital City 500
Chief Minister Development Fund 100
Convergence Schemes under Mahatma Gandhi National Employment Guarantee Act 200
Construction of Panchayat Raj Roads under PMGSY 839.19
Panchayat Raj Roads 360
Cost sharing with Railways for construction of New Railway Lines (50%) 150
Smart Cities 300
Kadapa Annuity Projects 350
Pulivendula Area Development Agency 100
Amaravathi Ananthapuram National Highway 100
Capital Region Social Security Fund 65


10. Women and Child Welfare

YSR Sampoorna Poshana 1250
YSR Sampoorna Poshana & Plus 250
Disha 50
11. Other Schemes
YSR Bima 262
Trust for Welfare of Lawyers 100
Andhra Pradesh Digital Corporation Limited (APDC) 100
Re-Survey of Land 100