ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచిక 1910/ఆంధ్ర రాజకవులు

ఆంధ్ర రాజకవులు.

(మ. రా. శ్రీ. మానవల్లి రామకృష్ణయ్య. ఎం. ఏ. గారిచే వ్రాయబడినది.)

లక్ష్మీసన్నిధానముననే సరస్వతీమహిమ ప్రకాశించుచున్నది గాని యేకపదావాసమును జెంది లక్ష్మీసరస్వతులు నిర్మాత్సర్యమున నుండుట మిక్కిలి యరుదు. బహుకార్యధురంధరులును భోగైకపరాయణులును వీరలక్ష్మీసంభావితులు నగురాజేంద్రులకు గాలాంతరఫలదాయకమై సద్యశ్శ్రమరూపమై గురుకులక్లేశమాత్రఫలంబగు విద్యాన్యసనము హృదయంగమము గాక సప్తవ్యసనములకంటెను హేయమగుచుండును. అయినను గవులకృతిపటములు లేక ప్రతాపాఢ్యులగు నరేంద్రులచరిత్ర చిత్రములు స్వప్నమునందును బుట్టనివి యగును. కావుననే స్వతస్తేజగముల నక్షత్రములవంటి కవిబ్రహ్మలఁ జేరఁదీసి రాజచంద్రులు తమయౌదార్య తేజముల విలసిల్లఁ జేయుదురు. అనుక్షణవిభాస్వరములగు ప్రజ్ఞా రత్నములనడుమ నాయకమణియు శోభాయమాన మగుట యాశ్చర్యముకాదు. రత్నసాన్నిధ్యమును గన్నస్ఫటికమును వెలుగుచుండును. భ్రమరముల నడుమఁ జిక్కినకీటకము భ్రమర మగుచుండలేదా? అదియునుంగాక వివిధరసాస్వాదనలుబ్ధులగు భూవరులకుఁ గావ్యరసము లేక తనివి గలుగదు. కావ్యామృతము తక్కిన రసములలోని నీరసత్వమును జూపి కృతిముఖమున రాజులకీర్తిశరీరముల నజరామరములుగఁ జేయును. కవిరత్నముల కాశ్రయణీయులగు ప్రభువులు నికషోపలములవంటివారు గాకున్న మహామతు లట్టివారిసభాభవనములు ద్రొక్కంజనరు. సంస్కృతమున రాజకవు లనేకులు గలరు. విక్రమాదిత్యుఁడును బ్రవరసేనుండును హర్షుఁడును సింధురాజును గర్ణుఁడును గులశేఖరపాండ్యుఁడును శాతవాహనుఁడును వాక్పతిరాజును జాలఁబ్రఖ్యాతులు. కావుననే వీరియాస్థానములఁ గాళిదాసబిల్హణగుణాఢ్యాదులు కీర్తిరూపములగు జ్యోతిర్మయశరీరములతో విహరించిరి.

ఆంధ్రభాషలో రాజకవులు పెక్కుఱు గలరు. వీరిలోఁ గొందఱు చక్రవర్తిపదమును మహారాజ పదవిని జెందినవారు. మఱికొందఱు రాజబంధువులై కావ్యరసమునే*గ్రోలుచు విద్యావిలాసమున నెగడ్త కెక్కిరి. ఇట్టిరాజకవులను గుఱించియు వారి కావ్యములగూర్చియు స్థూలరూపమున నిందుఁ జెప్పఁబడును.

వీరిలోఁ జరిత్రాంశముల శోధించి చూచినంతలోఁ బ్రాథమికుడు నన్నెచోడదేవుఁడు. ఇతఁడు కావేరీతీరమున నొరయూ రనుపురమురాజధానిగాఁ జోళమండలము నేలినవాఁడు. ఇతనికి దిగ్విజయమునుబట్టి టెంకణాదిత్యుఁ డనియుఁ గవిత్వకౌశలమువలనఁ గవిరాజశిఖామణి యనియు బిరుదములు గలిగెను. ఇతఁడు క్రీ. శ. 940 సంవత్సరమునఁ బాశ్చాత్యచాళుక్యులతో నెదిర్చి రణరంగమున నిహతుఁడయ్యెను.

             "క. పురుషుఁడు పురుషున కని న
                  స్థిరజీవితలోభ యుతమతిని వినమితుఁడై
                  స్మరకలహకుపితఁ బ్రాణే
                  శ్వరి నాయుధసమితిఁ దెలచువాఁ డటుమీఁదన్.
               ఉ మంచిగఁ బ్రీతిఁబాఁయక సమస్తజనంబులుఁదన్నుఁగొల్వఁజీ
                  వించినధన్యుఁ డామహిమవీడినజీవము మేన నిల్ప నా

        సించి విభుండు దా నొకట సేవకుఁడై మనుకంటె ముందఱా
        ర్జించినకీర్తి నిల్వ గతి సేకుఱఁగా ననిచావు సేగియే."

అని కవియే తనకుమారసంభవమునఁ జెప్పియున్నాడు. తత్పూర్వము రాజ్యపదభ్రష్టుడై యజ్ఞాతవాసము చేసి మరల లబ్ధరాజ్యుఁడై కొంతకాలము రాజ్యము చేసెను. ఇతనితండ్రి చోళపల్లి; తల్లి శ్రీపతి. ఇతఁడుకుమారసంభవ మనుపదిరెండాశ్వాసముల గ్రంథమును రచించెను. ఇది కాళిదాసు కావ్యమునకుఁ దెనుఁగు గాదు. ఆంధ్రభాషలో నూతన కావ్యసృష్టికి నిఁతడె ప్రాథమికుఁడు. దీనిలో గణపతిజననము, సతీదహనము, మదనసంహారము, పార్వతీవివాహము, కుమారోదయము, తారకాసురయుద్ధము, తత్పరాజయమును వర్ణింపఁబడినవి. ఈకవిశిఖామణికావ్యములోని వర్ణన లత్యద్భుతములై నూతనములై యున్నవి. ఏతత్కృతి చాలఁ బ్రాచీనమైనను సకలకావ్య లక్షణములకుఁ బుట్టినిల్లగుటచే నప్పుడ మెఱుగిచ్చి తీర్చినచిత్రమువలె మనోరంజకముగా నున్నది. రాజకవులలోను గవిరాజులలోను నిట్టివాఁడు లేఁ డనుట యంత యతిశయోక్తి గాదు. దీనిలో నుండి కొన్నిపద్యము లుదాహరించెదను.

మదనదహనసమయమున : _

     క. కని కోపించెనొ కానక,
        మును గోపించెనొ మహోగ్ర ♦ ముగ నుగ్రుఁడు సూ
        చినఁగాలెనొ చూడక యట
        మును గాలెనొ నాఁగ నిమిష ♦ మున నఱగాలెన్

     క. గిరిసుతమైఁ గామాగ్నియు
        హరుమై రోషాగ్నియుం ♦ దదంగజుమై ను
        ద్ధురకాలాగ్నియు రతిమై
        నురుశోకాగ్నియును దగిలి ♦ యొక్కటనెగసెన్.

రతిసహగమనోద్యుక్తయై చితిఁ జొరఁజనునప్పు డాకాశవాణి యాత్మహత్య వారించిన శోకాగ్నితప్త యగుచు : _

      క.కరువునఁ బూరితమై లో,
        హరిసము లోఁ గాలునట్టు ♦ లంగజుశోకో
        ద్ధురశిఖి రతితను విమ్ముగ,
        గరగియుఁ బొడపఱక లోఁనఁ ♦ గాలుచు నుండెన్.

     సీ. అలమట సెడి యుండె నిలువదు చిత్తంబు,
                మూర్ఛిల్లి వెడఁబాసి పోవదొండ
        నూఱట గొనయొండె నాఱదు శోకాగ్ని
                వొరిమాలఁ గొని కాలిపోవ దొండె
        ఘర్మాశ్రుజలము లొక్కటఁ గట్టుకొననొండె
                బొడవంతయుఁ గరంగి పోవదొండె
        బర్వునిట్టూర్పులు పట్టునఁ బడవొండెఁ
                బొం దిమ్ముగాఁ బాసి పోవదొండె

        నిట్టికడలేనిదు:ఖాబ్ధిఁ బెట్టిముంపఁ
        దలఁచియో కాక పోనీక బలిమి నాదు
        ప్రాణ మొడలిలో నాకాశవాణి దెచ్చిఁ
        మగుడఁ జెఱఁబెట్టె నని రతి మఱగుచుండె.

వీరపురుషులు యుద్ధమునకు వెలువడుచుండ నొక వీరపత్ని పచ్చవలువయుఁ గంరమాల్యములును వీరమద్దియలును ధరించి నిశ్చితహృదయుం డగుపతిం గనుంగొని చెప్పుచున్నది.ఁ

        ఓలములేదుకూర్చునని యూఱడియుండితిఁ గూర్మియెల్లనేఁ,
        డాలముసేసి నన్నుఁబెడయాకులఁ బెట్టి మన:ప్రియుండు త
        న్నాలములోనఁ బెట్టి దివిజాంగనలం గలయంగ నెత్తె ఁనే
        నాలనె బేల గాక చెలియా యని నెచ్చెలిమీఁదవాలుచున్

ఈకవి సర్వజ్ఞుఁడు.

(2) భద్రభూపాలుడు. (క్రీ.శ. 1150

ఇతఁడును నన్నెచోడునివలె "రవికులశేఖరుండుఁ గవిరాజశిఖామణి" ఇతఁడే సుమతిశతకమును నీతిశాస్త్రముక్తావళియు రచించినవాఁడు. కవిబ్రహ్మ యను బిరుదు గలవాఁడు.

      క. శ్రీవిభుఁడ గర్వితారి, క్ష్మావరదళనోపలబ్ధ ♦ జయలక్ష్మీసం,
         భావితుఁడ సుమతిశతకము, గావించినప్రోడఁ గావ్య ♦ క
         మలాసనుఁడన్.

బ్రాహ్మణకవులభావములకంటె లీలార్ధము వచించిన రాజకావ్యములు గంభీరగుంభనలకు మేలైన వనుట యేమియాశ్చర్యము శ్రీరంగనిభుఁడు చూడుకుడుత్త నాంచారమ్మను బరిణయమైనకథయే ప్రధానముగాఁ గలయిక్కావ్యమున ఋతువర్ణనాదికము లతివిపులములై ప్రాచీనకృతుల నెగఁజూచుచున్నవి దీనిని బెద్దన రచించె ననుట కేవలవాదమే నిర్దోషమై బంధపాటవము గలకవిత చెప్పుపెద్దన భావముల నిమిడింపలేక చచ్చిచావనిపాకమునఁ గూర్పఁజాలడు. ఆముక్తమాల్యద నామూలము శోధించి చూచి ద్రవిడసంస్కృతములలో నక్కాలపు వైష్ణవుల కావ్యములతో నించుక పోల్చిచూచినచోనెవ్వఁడో వైష్ణవశిఖామణి యాంధ్రరచనాలోభవలన రచించి కృష్ణరాయలపేరిటఁ నెలకొల్పెనేమో యనుసందియము తోఁచుచున్నది. ఈవిషయమై నిదర్శనములు తత్కావ్యమునఁ బెక్కులు గలవు.

(5) కట్ట-వరదరాజభూపతి. (1560. క్రీ.శ.)

ఇతఁడు కృష్ణరాయలయల్లుఁ డగురామరాయల పినతల్లికొమరుఁడు. ఇతఁడు శ్రీరంగమాహాత్మ్య మను దశాశ్వాసముల గ్రంథము రచించి శ్రీరంగపతి కంకితమిచ్చెను. అపారమాధుర్యము గలయితనికవిత చాల మృదువై జాతీయమై ప్రాచీనకవుల నడక ననుసరించి యున్నది. భైరవుం డనువిప్రకవియు శ్రీరంగమహత్వమును రచించెను. దుష్కలి ఘోరపిశాచము లదల్చు గురుభైరవుం డగు భైరవుని కవితాప్రవాహమున కిక్కవి వాక్పుష్పదామములు నులువఁజాల కున్నను వర్షాంతపు నదివోలె నదినీరసమగుచుండ నిత్యపరిమళశోభితంబగు వరదరాజకృతి సరసమై పండిత భృంగముల కాకర్షణ యంత్రమ వలె నున్నది. ఇతఁడు మఱియుఁ బరమభాగవత చరిత్రమును రామాయణ ద్విపదయు రచియించెను. ఇతని కావ్యములలోనుండి యొండు రెండుదాహరించుటయు మేలు.

              ఉ. ఏలతదన్యతీర్థముల కేల జవాళి మహాసరస్వతీ
                  కూలనికుంజమంజు రుగల్మలతావళి దెఱిచూచినన్
                  బాలిశకోటిజిహ్వలను భారతి తాండవ మాడు బ్రహ్మయి
                  ల్లాలట యమ్మహానది ప్రియాశయముల్ తమ కీయ జాలదే.

              సీ. కదలునో పూరేకు ♦ లదరి తేనెలు చిందఁ
                  దనయిచ్చఁ బవనకం ♦ దళచయంబు
                  మెదలవచ్చు నె మందు ♦ మించినెత్తమ్ములు
                  ముగిడింప జక్కవ ♦ పగఱకైనఁ
                  గాయునో బీఱెండ ♦ కామినీవదనముల్
                  చెమరింప వేసవిఁ ♦ గుముదవైరి
                  కురియునో సస్యవి ♦ స్ఫురణకై తగినట్టి,
                  వానమాత్రమ కాక ♦ వారిదములు

              తే. మిసుకవచ్చు నె రుజు ♦ లర్విమీఁద నిచటఁ
                  గిముకు మనవచ్చునో యమ ♦ కింకరులకు
                  నెపుడు మదనుగ్రహములేక ♦ యిహపరైక
                  మంగళప్రద మైన శ్రీ ♦ రంగమునను

_________

              సీ. అత్తమామల కెదు ♦ రాడుదుశ్చారిణి
                                వావివర్తన లేని ♦ వాడవదినె
                  కొండ్యాలఁ గొంపలు ♦ కూల్చుపాతకురాలు
                                బలిబిక్ష మెడనిని ♦ ర్భాగ్యనసతి
                  మగనితో నేవేళ ♦ జగడించు జగ జంత
                                పసిబిడ్డలను దిట్టు ♦ పాపజాతి
                  దినము నేబాసలు ♦ దెగిసేయునడిగొంటు
                                క్షుళ్ళకంబులు దెచ్చు ♦ ముళ్ళమారి

              తే. కాసు ప్రాణంబుగాఁ జూచు ♦ కష్టురాలు
                  పఱపకూఁతలు గూయు ♦ దబ్బరలదాని
                  వెలనిమేలు సహింపని ♦ చితివిషంబు
                  దీనికై నీవు కనికర్ద ♦ మానఁదగునె.

_______

(6) గంగప్పరాజు (1560 A.D.)

ఇతడళియరామరాయల పెదతండ్రికొమారుఁడు ఈకవిశిఖామణి సాంబోపాఖ్యాన మనుకృతి రచించి శ్రీరంగనాథున కంకిత మిచ్చెను. "అగువన నిక్కవిచంద్రుడు ! జగతి నపూర్వార్థశబ్దచారుకవితమై | నెగడిన బాణోచ్చిష్టం జగత్త్రయం బవిన పలుకు సఫలం బయ్యెన్" అనిన కేతనభావ మిక్కవి కన్వయ మగు నంతశబ్దార్థరచనావైశద్యమ ను జూపి

యుల్లములఁ జూఱగొనునట్టి సామర్థ్య మీకవికిఁ గలిగినను గాఢబంధమువలన మాధుర్య మించుక కొఱవడె ననుట నిజమునకు దవ్వుగాదు. దీనిలో జాంబవతీ వివాహాదులు చెప్పఁబడినవి. అన్నివర్ణనములను గవి ప్రౌఢిమను జూపుచున్నాఁడు. శ్రోతల కపూర్వపద సంయోగముచేతను అశిథిలబంధముచేతను గొంచెము క్లిష్టముగా నగపడును గాని భావరంజకత్వముచే శ్రమాపహారము గలుగును. దీనిలోఁ గొన్నిటి నుదాహరించెదను.

                చ. ఆలఘుకళానిధిం గువలయప్రియు రాజును జూడ రోసి బ
                    ల్దళములతల్పు బిగ్గ నిడి తామరమొగ్గల మూలయింటిలో
                    నలిచెలిగాఁ బరాగపటికావృత మైనసరోరుహేందిరన్
                    గిలకిల నవ్వుచుండ గిలిగింతలు పెట్టుదుగా దినాధిపా.
                                           __________
                చ. జడనిధి మేఖలాఘటిత సర్వమహీ తలవాసులందు నా
                    కడిఁదిప్రదాతచే ధనము గాననివాఁడు మొగిళ్ళక్రిందటన్
                    నడువనివాఁడు భానుకిరణంబులు సోఁకనివాఁడు వానలం
                    దడియనివాఁడు గాడ్పు మెయిఁ దాఁకనివాఁడును లేఁడ యెవ్వఁడున్.
                                           ___________

(7) తంజాపురి రఘునాథుడు.

ఇతఁడు శూద్రకులజుఁడు; అచ్యుతరాయల మఱఁదలిమగఁడు; చోళదేశపు మహారాజు. అనుదినమును బంచాశత్సహస్రభూసురుల కన్న దానముసేసియేభుజించువాఁడు; శ్రీరామభక్తుఁడు. ఇతడు రామసేతు, కుంభకోణ, మన్నారుగుడి, శ్రీరంగ, విజయరాఘవపుర, శ్రీముష్ణ ప్రదేశముల రామభద్ర దేవాలయములు స్థాపించి కీర్తి గన్నవాఁడు. ఇతని యాస్థానమున సంగీతసాహిత్యములు రెండును దులదూగుచు వన్నె కెక్కెను. ఈ కవిరాజునకే విజయవిలాసము, సారంగధరచరిత్ర, కృష్ణాధ్వరిరచిత మగు నైషధపారిజాతీయము, మధురవాణిరామాయణము, అచ్యుతాభ్యుదయము, అంకిత మీయఁబడినవి. విజయవిలాసమున వేంకటపతి రఘునాధరాయల కవితగూర్చి చెప్పిన,

              ఉ. తారసవృత్తి మై ప్రతిపదంబున జాతియు వార్తయుం జమ
                  త్కారము నర్థగౌరవముఁ గల్గ ననేకకృతుల్ ప్రసన్నగం
                  భీరగతిన్ వచించి మహిమించినచో నిఁక శక్తు లెవ్వ
                  రయ్యా రఘునాథ భూపరసికాగ్రణికిం జెవి సోఁక గబ్బముల్."

పద్యము రఘునాధరాయల కావ్యజాలములఁ జదివి చూచినవా రెట్టిస్వభావోక్తిగా గ్రహింతురో చిత్రము. ఇక్కవి వాల్మీక చరిత, రామాయణము, పారిజాతాపహరణము, జానకీ పరిణయము, అచ్యుతాభ్యుదయము, సావిత్రికథ మొదలగునవి పెక్కులు రచించినను రెండు మొదటివిమాత్రమే నాకు లభించినవి. ఇతఁడు

                 "చెప్పవలెఁ గప్పురంబునకు కుప్పలుగాఁ బోసినట్లు కుంకుమ
                  పైపై, కుప్పినక్రియ విరిపొట్లము విప్పినగతి ఘమ్మనం గవిత్వము సభలన్."

అని వాల్మీకి చరిత్రమునఁ చెప్పుకొనినట్లు సర్వజనసౌలభ్యమై యత్యంతమనోహరముగా నున్నది. విజయవిలాసములోఁ బోలె దీనిలో నేదోషములును గానరావు. ఇతని రామాయణమును మెచ్చి మధురవాణి యనువేశ్యారత్నము దానిని సంస్కృతమునకు మార్చెను. ఇట్లే వసుచరిత్రయు విష్ణుచిత్తీయమును, సంస్కృతమునకుఁ దేఁబడినవి. ఇతని రెండుగ్రంథములలోనుండియు నుదాహరించెదను. ఇతనిభావనాశక్తియుఁ గల్పనాశక్తియు సంభాషణ చాతుర్యమును శ్లాఘాపాత్రములు. హాస్యరసమున నితఁడుమిన్న. ఇట్టి చాతుర్యముగలవాఁడు కావుననే విజయవిలాసము నంత మెచ్చుకొనెను. ఎట్టివీర్యమును ఎట్టి కావ్యచాతుర్యము గలవాఁడయినను వేంకటపతి మొద లగు వేశ్యాపుత్రులనడుమను మధురవాణి శశిరేఖ మొదలగు నేఁబదియాఱు వెలయాండ్రనడుమ నితఁడు చిక్కి తననిర్మలకీర్తిపటమున భోగమువలని విషబిందువులఁ జిలికి మలీమసుఁ డయ్యెను.

              సీ. చెలువలు పన్నీరు ♦ చెంబు లిచ్చినఁ గాళి
                            కుప్పెలజల మంచు ♦ గ్రోల నెంచు
                  సతులు జవ్వాది యొ ♦ సంగ గోపిచందన
                            మని ఫాలమున దీర్ప ♦ నగ్గలించు

                  గాంతలు మరువంపు ♦ గాను కిచ్చినఁ దుల
                             సీదళం బనుచుఁ భ ♦ క్షింపఁ జూచుఁ
                  బొలఁతులు తెలిగంద ♦ వొడి యిచ్చిన విభూతి
                             యిది యటంచుఁ ద్రిపుండ్ర ♦ మిడఁ దలఁచు

                   నలరుఁబోడులు వజ్రాల ♦ హార మొసఁగఁ
                   బటిక పుజపాక్షసర మంచుఁ ♦ బాణిఁ బూని
                   మౌని జపియించఁ దివురు నెం ♦ దైనఁ గలరు
                   ముగ్ధ లగువార లిటువంటి ముగ్ధ గలఁడె.
                                 _________

(8) కదిరీపతి. (1620 క్రీ.శ.)

ఇక్కవిరా జనంతపురము జిల్లాలో నుండుకదిరి యనుపురమునకుఁ బ్రభువు;చతుర్థకులజుఁడు. ఇతని తండ్రి రామదేవరాయలయొద్ద సేనాపతిగా నుండెను. ఇక్కవిశుకసప్తతి యను ఱంకుటాండ్రయుబొంకుటాండ్రయుకథలు గల కావ్యము నొక్కటిరచించి స్వభావోక్తివర్ణనము లనువలలు పన్ని జాతీయ వచోరత్నము లనుగాలముల నిచ్చి దుర్ణీతివిముఖము లగు పండిత చిత్తముల సైతము బలాత్కారముగ నాకర్షించు నంతకవితాచాతుర్యము చూపియున్నాఁడు. ఇతఁడు జగచ్చక్షువు; సర్వేంద్రియవ్యాపారుఁడు.

                 "ఇఁక నొకసారి పల్కిన ఘటిల్లని చిందునొ నోటిముత్యముల్."

అతి సరస ప్రయోగములును జాతీయములును దేశీయములును దీనిలోఁ బెక్కులు గలవు. దీనిని రచించినకవి యద్వంద్వుఁడో లేక మన్మధుని జంత్రమో తెలియరాదు. దీనిని సరస్వతీపత్రికాధిపతు లిప్పుడ ముద్రించిరి కావున నుదాహరణము లనావశ్యకము.

(9) మల్లారెడ్డి. (1600 క్రీ.శ.)

ఇతఁడు భాగ్యనగర మనునన్వర్థనామము గలహైదరాబాదునకు 40 ది మైళ్ళుత్తరముగా నుండు బిక్కనవోలుపురమున కధీశ్వరుండు. ఇతనియన్న యగుకామినేని కామారెడ్డి డిల్లీ పట్టణమున నకబ్బరుచే సమ్మానింపఁబడినవాఁడు. అతని పేరిటనే సోమనాథకవి బ్రహ్మొత్తర ఖండమును సూతసంహితయును రచించెను. మల్లారెడ్డి సమీపముననుండు గోదావరీ తీరమున వేములవాడ యనుక్షేత్రమున రాజేశ్వరస్వామికిఁ బరమభక్తుఁడై శివదీక్షాపరుఁడై యుండెను. ఇప్పటికిని వీరిసంతతివారి శైవభక్తియు నిష్కాపట్యమునుజాలఁగొనియాడఁ దగినవి. ఇతఁడు షట్చక్రవర్తిచరిత్రయు, శివధర్మోత్తరఖండమునురచించెను. మొదటిదిప్రబంధము. రెండవదిశైవశాస్త్రాగమము. పై యదివర్ణ నాప్రధానమైనది. క్రిందటిదిప్రమాణ పూర్వకమైనది. అచ్చటచ్చట దోషము లున్నను గవిత్వ మించుక ప్రౌఢముగానే యుండును. శివధర్మోత్తరఖండ మెనిమిదాశ్వాసములు గలది. ఇతఁడు వ్యాకరణ వేదాంతశైవాగమాదుల జితపరిశ్రముఁడని తోచుచున్నది.

(10) సాయపవేంకటపతి. (1620. A.D.)

అప్పకవి యితనిపేరు తనకృతిషష్ఠ్యంతములలోఁ బేర్కొనెను. ఇతఁడు పెమ్మసాని చినతిమ్మభూపతికి నల్లుఁడు. కడపజిల్లాలోఁ బినాకినీతీరమున నుండు గండికోటదుర్గమునకుఁ బ్రభువు. ఇతఁడు సకలజనసంజీవనిపేరఁ బ్రసిద్ధుఁడగు రామానుజాచార్య చరిత్రమును స్వయముగా రచించెను. ఇక్కవికి ద్రమిళభాషలో నిరర్గళపాండిత్యము కలిగియున్నట్లు తద్గ్రంథములోనికొన్నిప్రదేశములు తిరుప్పావు మొదలగు వైష్ణవప్రబంధములతోఁ బోల్చి చూచినయెడల మనకుఁ దోఁచును. ముకుందమాల మొదలగుసోత్రములనితఁడక్కడక్కడఁదెనిఁగించి కావ్యమునఁజొప్పించుచున్నాఁడు. ఇది యైదాశ్వాసముల గ్రంథమైనను జాలఁ బెద్దది. కవిత యంతమనోహరమైనదికాదు. శృంగారరసమే ప్రధానముగాఁ గలయాంధ్రకవితలఁ జర్చించిన నాకు విష్ణుభక్తిప్రధాన మగుదీన స్వారస్యము గ్రహింప బుద్ధిమాంద్యము కలిగెనేమో? అనేకద్రవిడప్రబంధములు తెనిఁగింపఁబడి యుండుట యెవ్వరి కింకను దెలియరాదు. నమ్మాళ్వారులు ర చించిన తిరువాయ్ మొళియు, కులశేఖరులు, యామునులు, వీరలస్తోత్రములు రామానుజుల వారితత్త్వప్రకాశికయు బహుకాలమునకుఁ బూర్వమే యాంధ్రీకరింపఁ బడియున్నవి.

                 ఉ. కారణమస్తకస్థల విగాధసముత్కళికమ్యలబ్ధ భా
                     కారమునం గిరీటమణికాండ మెసంగఁ బొసంగ వీరశృం
                     గారతరంగపఙ్తు లనఁగాఁ గనకాంశుకగాంతకాంతు లెం
                     తే రహిఁ బన్ను నిన్నఖిలదేవవరేణ్యు శరణ్యు నెన్నెదన్.

(11) కళువె.వీరరాజు. (1645 A.D.)

ఇక్కవిరత్నము మహిసూరరాజాధిరాజగుదేవరాజునకును జిక్క దేవరాజునకును సేనాధిపతియై చోళపాండ్యమండలముల జయించి ముద్దళగిరిని గొంతకాలము తోలి మధురాపురమున నుండెను. ఇతఁడు భారతవచనకావ్యమును చిక్కదేవలీలయు రచించెను. ఇతనివచనభారతము వ్యాసరచితకథకుఁ దెనుఁగుగాని నన్నయఫక్కి ననుసరించినదికాదు. నన్నయభట్టారకుఁడే వచనమున మూలమును మార్పక తెనిఁగించి యున్నచో నది యెట్లుండునో యితనివచనము నంతగంభీరమై మిక్కిలి యింపుగా నున్నది. నాకాది పర్వముమాత్రమే చూడఁ దటస్థించినది. ఇతనికొమారుఁడును పెక్కులు వచనగ్రంథములు హాలాస్య, స్కాంధ, లైంగాదులు రచించెను. ఈవీరరాజున కంకితముగా నొకఛందోగ్రంథము వీరభూపాలీయము రచింపఁబడినది. అప్పకవి తనసామగ్రియంతయు నీ గ్రంథమునుండియే పూర్ణముగా గ్రహించుకొనె నని చెప్పుటకు మిక్కిలి లజ్జగా నున్నది. వీరభూపాలీయము పెద్దన లక్షణసారసంగ్రహము లేకున్న నప్ప కవీయమును, ముద్దరాజురామన కవిసంజీవనియు రత్నాకరము లేకున్నఁ గూచిమంచితిమ్మకవిలక్షణ సారసంగ్రహమును మనము చూచి నవ్వునంతటిభాగ్యము మనకు లేకుండును.

12. రేచర్ల.మాధవరాయలు (1680 A.D.)

ఇతఁడు జటప్రోలుసంస్థానవిభుండు. సర్వజ్ఞసింగమనాయని వంశజుఁడు. ఇతనిప్రపితామహు డగుమాధవరాయఁడు వాల్మీకిరామాయణమునకు సంస్కృతవ్యాఖ్యరచించెను. ఇతనితాతమల్లనృపతిబాలసరస్వతిచేభర్తృహరి తెనిఁగింపఁ జేసెను. ఇతఁడు చంద్రికాపరిణయమును రచించెను. బాలసరస్వతి రచించిన చంద్రికాపరిణయము సర్వవిధముల దీనికంటె శ్లాఘాపాత్రము. అనేకప్రబంధములను బిల్లవసుచరిత్ర లని పేర్కొనుచున్నారు గానియేల దీనిని వసుచరిత్రమునకుఁ బ్రతిబింబ మనిచెప్పనొల్లరో! దీని నిక్కవి తోరణాల చొక్కయ యనునియోగిపుంగవుని సాహాయ్యమున రచించినట్లు తెలియుచున్నది. అక్కవియు శూద్రోచ్ఛిష్టమునకుఁ బ్రతికల్పించుటకు సిగ్గుపడమిచే సహచరు లగువిద్వాంసులు

                     "తోరణాలచొక్క, దొంగకుక్క"

యనువసుచరిత్రపు పత్రమునుద్రోసిచెప్పిరఁట. అయిన నిక్కావ్యబంధము వసుచరిత్రవలె సులభముగాఁ గాక గాఢముగా నుండును. ఇదిచేపలబుట్ట యల్లినట్లు శిథిలబంధమున గూర్పఁబడక పదములబిగువు గలదుగాని యాదికవులకావ్యములోని పారిశుద్ధ్యము కాని తంజాపురితొండమాన్ మధురనాధుల రసస్ఫూర్తి గాని యిం దగపడదు. ఉత్ప్రేక్షాతిశయోక్తులకుఁ బుట్టినిల్లై శ్లేషలకు గని యైనను రాతికిం గోతికిం గలుగుబిడ్డలును గొండలఁ గాలిగోర నెగఁజిమ్ము మగలును నిందుఁ గానరారు. కృతి సుప్రసిద్ధమైనందున నుదాహరణము లనావశ్యకములు.

(13) గద్వాల సోమభూపతి (1700)

ఇతఁడు నైజామురాజ్యమున నుండుగద్వాలకుఁ బ్రభువు. ఇతనియాస్థానముననే భద్రాపరిణయము రచించిన కాణాదము పెద్దనసోమయాజి యుండినది. క్కవిహరిహరప్రణీత మగురతిశాస్త్రమును మూఁడా శ్వాసములుగా రచించెను.

(14) పామనృపాలుడు (1700)

ఇతఁడు నైజామురాజ్యమున నుండుసురపురసంస్థానమునకుఁ బ్రభువు. కాణాదము పెద్దనసోమయాజి శైషశైలేశలీల యనుపంచవర్గీయకృతియు మత్స్యపురాణమును ఇతని కంకిత మొసఁగెను. ఇక్కవి భార్గవ పురాణ మతిలలితముగాఁ దెనిఁగించెను.

(15) చిజ్జుళ-తిమ్మభూపాలుడు. (1700 A.D.)

ఇతఁడు కృష్ణాతీరమున నుండుప్రాకుటూరీపురవరుండు; వేమారెడ్డివంశజుఁడు. ఇతఁడు మురారిప్రణీతమగు ననర్ఘ రాఘవనాటకమును జంపూకావ్యముగాఁ దెనిఁగించెను. అయ్యది చాలఁబ్రౌఢమై నిరుపమానమై యున్నది. దీనినే నేఁటికాలమునఁ గొందఱు తెనిఁగించిరి కాని తిమ్మభూపాలునికృతి కీడు రాదు. చూడుఁడు కవిప్రౌఢిమ : _

               శా. జాతాపక్వపలాండుపాండిమ ధరచ్ఛాయంగనెన్ దారలు
                    ద్భూతింగైకొనెఁబ్రాచి కొన్ని కిరణంబుల్ పద్మజీవాతువుల్
                    లూతాతంతువితానవర్తులనభోలోలాత్మ బింబంబుతోఁ
                    బ్రాత:ప్రోషితరోచియై డిగియెఁ దారానాథుఁ డస్తాద్రికిన్
                                      _______
               సీ. లోకత్రయీచారు ♦ లోచనోత్పలపాళి,
                             కసమపీయూషధా ♦ రాగ్రయణము
                   నధ్వనీనోన్మాది ♦ హవ్యవాహోచ్చల,
                             దాలాతనిబిడలే ♦ ఖాపలంబు
                   ప్రకటతమ: పుంజ ♦ ముకుళితవిష్టపో,
                             ద్ఘాటనపాటవో ♦ దగ్రకుంచి
                   జగము లొక్కట గెల్వఁ ♦ జాలు వీరులలోనఁ,
                             గమలసాయకు నాద్య ♦ గణితరేఖ

              తే. సతతవికసనజాగ్రన్మ ♦ సారకచభ
                  రాముఖాంబుజశ్రీపతి ♦ రాజబీజ
                  మనుపమానందకల్పద్రు ♦ మాంకురంబు
                  నిదుఖండంబు గనుఁగొంటి ♦ యిందువదన.
                                   _________

(16) కోట-రాయరఘునాధుడు (1720 A.D.).

ఇతఁడు దక్షిణదేశమునఁ బుదుకోటసంస్థానాధీశుఁడు. తొండమాన్ చక్రవర్తివంశజుఁడు. ఇతని సభలోనుదుపాటి వేంకనకవిప్రఖ్యాతుఁడై యాంధ్రభాషార్ణవ మనునిఘంటువు రచించెను. రఘునాథుఁడు పార్వతీపరిణయము, కవిజనసంజీవనము అను రెండుకృతుల రచించెను. పార్వతీపరిణయమువ్యాకరణదోషముల కెల్లనిలయమనుట యొక్కటేయక్కవికి న్యూనతగాని మహాకవుల కావ్యగుణములన్నియు దీనఁ గలవు. అద్భుతభావకల్పనలకుఁగాని హాస్యరచనాకౌశలమునందుఁ గాని కృష్ణరాయలకాలమునకుఁ దరువాత నిట్టికవులు పెక్కురు లేరు. భావములు నూతనములై యుండుట తంజాపుర పుదుకోట మధురాపుర రాజకవుల కే చెల్లును. హాస్యరసచాతుర్యము, వ్యాజోక్తులును వీరికృతులలో స్వతంత్రముగా నెఱయుచున్నవి. ఇది ముద్రిత కావ్యము గావున నుదాహరణము లనావశ్యకము.

స్థలసంకోచముచే ననేకాంశములు ద్యజింపఁబడినవి. స్థలాంతరమున విరివిగా వ్రాయఁ దలఁచినారము. దామరవేంకటపతి, ఎల్లవిభుఁడు, ముద్దళిగిరి, ఎఱ్ఱభూపతి, విజయరాఘవుఁడు, విజయరఘునాధుఁడు, నంజరాజు, దొడ్డరాజు మొదలగు రాజకవు లనేకు లున్నారు.