ఆంధ్రకామందకము
తృతీయాశ్వాసము
క. |
శ్రీదేవచోళవంశమ
హోదధిపరిపూర్ణచంద్ర యురువిక్రమ సీ
తాదయితచరణసేవా
త్యాదర కొండ్రాజు వెంకటాద్రి నరేంద్రా.
| 1
|
స్వామ్యనుజీవివృత్తప్రకరణము
క. |
వినయంబు మంచినడవడి
యును సిరులును జేరఁ దగిన యుత్తమగుణముల్
దనరంగఁ గల్పవృక్షం
బనఁదగు పతిఁ గొలువవలయు ననిశము భృత్యుల్.
| 3
|
మ. |
కొనియాడం దగునట్టి సంపదలు గైకోవచ్చుఁ గాలాంతరం
బుననైనన్ ధర నెట్టివానివలనన్ మోదంబులౌ నట్టివా
నిని జాలంగ ధనంబు లేనియపుడు న్మేలెంచి కొల్వందగున్
ఘనతన్ సజ్జనసేవ్యుఁడై చతురుఁడై కన్పట్టినన్ బంట్లకున్.
| 4
|
క. |
కుటిలాత్ముఁ గొల్చి సిరిఁ గాం
చుటకంటెను నూరకుంట సుగుడిదనం బా
కటఁ జిక్కి స్రుక్కి తగ నె
చ్చటనైనను నిల్చి మొద్దుచందం బొందన్.
| 5
|
క. |
అనిశము నీతివిరోధము
నన మెలఁగుచు బుద్ధిలేని నరుఁ డరిసిరులన్
ఘనముగఁ బ్రబలఁగఁ జేయుచుఁ
దనకుంగల సిరులతోడఁ దాఁ గడు నొగులున్.
| 6
|
క. |
చతురుఁడు నవికారుఁడు ని
శ్చితమతికార్యుండు యత్నశీలుఁడు నగు భూ
పలి వేళ యెఱుఁగ నేర్చిన
సతతము దమ నెలవునం బొసంగఁగ నిల్చున్.
| 7
|
క. |
అప్పుడు మీఁదట శుభమై
చొప్పుడు పని బడచియైనఁ జొప్పడు సేయన్
దప్పక లోకవిరుద్ధము
లెప్పుడు సేయంగవలవ దెచ్చటఁ బతికిన్.
| 8
|
క. |
అడుసునఁ గలిసిన నువ్వుల
వడిసిన నూనియయు వడుసు వాసనచేతన్
జెడునటుల సకలగుణములఁ
బుడమిం గూటువగుణంబె పొదువుచు నుండున్.
| 9
|
క. |
చదలేటి జలములైనను
నుదరిం దగఁ గలసెనేని యుప్పనివ ట్లౌ
నది యెఱిఁగి కుపతిఁ గొలుచుట
విదితముగా విడువవలె వివేకుల కెల్లన్.
| 10
|
క. |
మతియుడుఁడు బదలియైనను
క్షితి దైన్యములేని బ్రతుకుఁ జెందఁగవలయున్
ధృతిమీఱ నట్లు నడచిన
యతని మహీవిభుఁడు మెచ్చు నందఱికంటెన్.
| 11
|
చ. |
కనుఁగొనఁ బొల్చి నిల్కడల గైకొని సజ్జనసేవ్యుఁడై కడున్
ఘనత వహించి పుణ్యములు గాంచి నుతించగ మించునేలికన్
వినయము నీతిమార్గము వివేకము కల్మిని గల్గఁగోరుచున్
జనములు గొల్వఁగాఁ జనుఁ ద్రిసంధ్య మవంధ్యము వింధ్యముంబలెన్
| 12
|
క. |
చెందంగరాని వస్తువు
లందును యత్నమ్ము సేయ నవి సిద్ధముగాఁ
జెందుం గావునఁ దాఁ జే
యందగు యత్నము వివేకి యగువాఁ డెందున్.
| 13
|
క. |
అనిశము వినయము విద్యయు
ఘనమగు శీలాదికంబుఁ గైకొనవలయున్
దనమతి జనపతి యనుగతి
దనరఁగ సేవించువాఁ డుదారప్రౌఢిన్.
| 14
|
అనుజీవి వర్తనము
సీ. |
కులము విద్యలు శిల్పములు నుదారత్వంబు
నలరు సత్త్వము నిల్క డంది తగుట
యందమౌ దేహంబు నారోగ్యమును బుద్ధి
వడిగలతనముఁ దావనత గలిగి
దుర్జనత్వంబును ద్రోహంబు భేదంబు
నత్యాశయును గల్లలాడుటయును
జపలత మ్రాన్పాటు శరతయుఁ బోఁ ద్రోచు
నతఁడు సేవ యొనర్ప నర్హుఁ డెందు
|
|
గీ. |
నోపిక దిటంబు గల్గుట యొప్పిదంబు
సంతసంబును శీల ముత్సాహ మాప
దలకుఁ గ్లేశములకు నోర్వఁగలుగుటయును
వన్నెఁ దెచ్చును నీచసేవకుల కెల్ల.
| 15
|
సీ. |
ఒకచోటఁ గూర్చుండి యుండుట పదరుట
మాయలు గ్రౌర్యంబు మచ్చరంబుఁ
బెద్దల నదలించి ప్రేలుటయును డంబు
జడత వంచనయును విడువవలయు
జనపతి పీఠంబె కనుఁగొనవలయు ది
క్కులు సారెకును జూడవలదు మఱియు
నన్యోన్యమును మాటలాడక యతనిము
ఖావలోకనము సేయంగవలయు
|
|
గీ. |
నచట నెవ్వార లున్నవా రనిన నేన
టంచుఁ జని పని యానతిమ్మంచుఁ బలికి
యతఁడు చెప్పిన పని యోపినటుల వేగఁ
జేయవలె వేడ్కతో ననుజీవిజనము.
| 16
|
సీ. |
తనయందుఁ బ్రేమ యెంతయుఁ గల్గి యుండెడు
నధిపతిచిత్తంబునందుఁ దగిలి
యతఁ డాడినట్టి వాక్యము నిర్వహింపుచుఁ
బలుకగావలె మంచిపలుకు లెపుడు
బతి నియోంగించినపట్టుల నొరులలోఁ
గలది గల్గినయట్లు పలుకవలయు
సుఖగోష్ఠివాదముల్ చూపుచో రాజుతో
నది యెఱింగియు నడ్డమాడ వలసి
|
|
గీ. |
దెంత నేరుపు గలిగిన యేనిఁ దా వి
వేకి యగువాఁ డహంకృతి విడువవలయు
వెల్లవిరియైన మాటయు విభునితోడ
వలయు మెల్లనె తెలుప సేవకుల కెల్ల.
| 17
|
సీ. |
వినయంబుఁ జేకొని వినుతింపఁ దగుప్రయో
జనము నందలి పతిచతురిమంబు
నాపదల్ చెందినయప్పుడు నేరని
నడకలు విడువక నడచునపుడు
కార్యభారంబులు గడపునప్పుడు తన్ను
నడిగిన శుభవాక్య మాడవలయు
నెపుడు పథ్యంబును హితవుగా నిజమాడ
యుక్తంబు ధర్మోపయుక్తరీతి
|
|
తే. గీ. |
నెట్టివేళల నమ్మనియట్టిమాట,
మఱియు సభ మెచ్చనటువంటి మాట, కర్ణ
కటువగుచునుండు మాట, యే కడలనైన
నాడఁగా రాదు సేవకుండైన యతఁడు.
| 18
|
సీ. |
అధిపతి యేకాంత మతని రహస్యంపుఁ
బనుల నెవ్వరితోను బలుకరాదు
ద్వేషంబు నాశంబు తెగులు నెవ్వేళలఁ
దనమది నైనను దలఁపరాదు
సుదతులతో వారిఁ జూచువారలతోడఁ
బాపకర్ములతోడఁ బరులదూత
జనులతో రాజుచేతను నిరాకృతిఁ గన్న
వారితో నేకాంతవర్తనములు
|
|
ఆ. |
వారితోడి పొందు వర్జింపఁగాఁ దగు
నధిపు వేషభాషలందు గలయఁ
బూని మెలఁగరాదు బుద్ధిచేఁ దనరెడు
సేవకులకు నెల్ల క్షితిఁ దలంప.
| 19
|
సీ. |
తగుసమయంబును దగినవేషంబును
దగుచోటు గైకొని ధరణిపతికి
దినదినమును బొడఁగనుచుండఁగాఁ దగు
నతని సోదరులకు నాత్మజులకు
జనవరులకు మ్రొక్కి సర్వసమ్మతుఁడునై
దేశకాలంబులు దెలిసి యొరుల
పనిని వహించి నేర్పరుల దక్షులఁ గూడి
తనపనులను జేసికొనఁగ వలయు
|
|
గీ. |
నీల్గుటయు నావులించుట (నేర్పు పొగడు)[1]
కొనుట నిందించుటయుఁ దగ్గికొనుట యుమియు
టయును గడు బెట్టుగా నవ్వుటయును విడిచి
భూవిభుని గొల్వఁగాఁ దగు సేవకుండు.
| 20
|
క. |
ఘనమగు సంపదచేతన్
గనుపట్టిన వారలైనఁ గడునేరుపు గ
ల్గిన బంటులు విరసింపం
జనదు ధరాధీశుసుగుణసంఘముతోడన్.
| 21
|
క. |
ఈరీతి సద్గుణంబుల
చే రంజిలి యర్థసిద్ధిచేఁ దగి మహిమో
దారుఁడగు విభుని సిరి చే
కూరుటకై విశ్వసింపఁ గొలువఁగవలయున్.
| 22
|
క. |
పనులయెడ మిగుల నేర్పరు
లన వినుతికి నెక్కి నృపతి యనురాగమునన్
దనరుట యటు గాకుండుట
ననువుగఁ గనవలయు నింగితాకారములన్.
| 23
|
అనురక్త రాజలక్షణము
సీ. |
కనినఁ బ్రసన్నుఁడై కనుపట్టుటయును మా
టాడిన నాదరమంది వినుట
డగ్గఱఁ గూర్చుండుటకుఁ జోటు విడుచుట
కడువేడ్కఁ బరిణామ మడిగి వినుట
యేకాంతములయందు నేకాంత మగుకొల్వు
లందు సందేహంబుఁ జెందకుండు
టతఁడు చెప్పిన పల్కు లతనికై చెప్పిన
పలుకు లెప్పుడు నింపు గలిగి వినుట
|
|
గీ. |
యెంచఁగలవారిలో నెల్ల నెంచుటయును
మించి వినుతించుతఱి సంతసించుటయును
బదరి యహితంపుఁ బలుకులు పలికినపుడు
నలుగమియు గుఱుతులు రక్తి గలుగుటకును.
| 24
|
క. |
తలఁచుట గుణములఁ బొగడుట
బలికినఁ బని సేయుటయును బడలుట వినినన్
బలుమఱు వగచుట ప్రబలిన
నలరుటయుం గరుణ గలుగునధిపుగుణంబుల్.
| 25
|
విరక్త రాజలక్షణము
సీ. |
మిగులంగ నద్భుతం బగునుపకారంబు
లొనరించి నప్పుడు నూరకుండు
టతఁడు చేసినపను లన్యులు గావించి
రనుట వైరుల రేఁచు టతని చేటుఁ
గడు నుపేక్షించుట కార్యంబుపట్ల నా
సలఁ బెట్టి ఫలము లొసంగకుంట
యించుక మంచి పల్కెసఁగింప నర్థంబు
చేత నిష్ఠురముగఁ జేయుటయును
|
|
ఆ. |
కుపితు నట్టులుంట కోపహేతువు లేక,
తఱిఁ బ్రసన్నుఁడయ్యు మెఱయు ఫలము
లిడక యున్కి, రక్తిహీనుఁ డౌవిభునకు
గుఱుతు లండ్రు నీతి నెఱుఁగువారు.
| 26
|
సీ. |
చెరంగఁ జనుదెంచి జీతంబు లడిగినఁ
జూచి వేగిరమున లేచి చనుట
మర్మముల్ నాటంగ మాటాడుటయు రహ
స్యమునందు సందేహ మందుటయును
లేని నేరములు గల్పించి దూషించుట
జీతంబు దిగద్రొబ్బి చేరుటెందు
ననుకూలగతి నిజమైన మాటాడిన
నాయెడ దబ్బఱ వేయుటయును
|
|
గీ. |
గడఁగి మాటాడ నడుమనే కాదనుటయు
శయనమందును యత్నంబు సమకొనంగఁ
బోయి సేవించినను నిద్రఁ బోవురీతి
నుండుటయు గుర్తు రక్తి లేకుండుపతికి.
| 27
|
క. |
సంతతమును గలగుణములు
చింతింపక దూషణంబె చేయుట కోపా
క్రాంతుఁ డయి వేఁడిచూపుల
నెంతయుఁ జూచుటయు గుఱుతు లితవెడయుటకున్.
| 28
|
గీ. |
ఇట్టి లక్షణములచేత నెపుడుఁ గరుణ
గలుగుటయు లేకయుండుట దెలిసి బంట్లు
కరుణ గల్గిన పతిఁ గొల్వఁ గడఁగవలయుఁ
గరుణ లేకున్నఁ గొలువఁగాఁ గాదు పతిని.
| 29
|
క. |
ఆపదవేళలఁ జెడుగై
దీపించిన రాజునైన దిగవిడువఁగ రా
దాపదవేళనె యేలికఁ
గాపాడినవాఁడు మిగుల ఘనుఁడు దలంపన్.
| 30
|
క. |
అలమటలు లేనివేళల
మెలఁకువ శౌర్యంబుఁ జూపి మించరు సుజనుల్
బలువగు నలమట వేళనె
మెలకువ శౌర్యంబుఁ జూపి మింతురు సుజనుల్.
| 31
|
క. |
వినుతింపఁ దగి ప్రమోదం
బనువుగ ఘటియింప నధికు లగువారికిఁ జే
సిన యుపకారము లల్పము
లన వెలసియు నధికశుభము లడరంజేయున్.
| 32
|
క. |
జనసతి యనుచితగతి నడ
చిన మాన్పుట మంచిపనులఁ జేసినయెడఁ దా
రును గూడుట సద్వర్తన
మనఁ దగు మిత్రులకు బంటులగు వారలకున్
| 33
|
క. |
మానినులఁ దగుల, మద్యం
బానుట విడకున్న, జూద మాడెడు నెడలన్
మానుపవలె భూమిపతిన్
మానితగతిఁ దగునుపాయమార్గంబులనేన్॥
| 34
|
క. |
చేయంగ రానికార్యము
జేయంగాఁ జూచు విభునిఁ జేయకయుండన్
జేయందగుఁ దా రటువలెఁ
జేయని నరు లతఁడుఁ దారుఁ జెడకుండుదురే.
| 35
|
క. |
నయమును వినయము భక్తియు
భయము వెలయ నయ్య యనుచు భటులు "జయాజ్ఞా
పయ దేవ నాథ జీవే
తి" యథార్థోక్తులను జనపతినిఁ గొల్వఁ జనున్.
| 36
|
క. |
తన విభుని మనసు రాఁ గొ
ల్చిన యట్టిద మంచినడక సేవకులకుఁ జె
ప్పినయటులఁ జేయునాతఁడు
తన వశముగఁ జేసికొనఁడె దానవునైన్.
| 37
|
క. |
బల ముత్సాహము బుద్ధియుఁ
గలఘనుల కసాధ్య మెద్ది గల దీధరణిన్
తల పెఱిఁగి తిరిగి తీయని
పలుకులు గలవారి కెందుఁ బగఱయుఁ గలఁడే.
| 38
|
క. |
ఎలమి గలతల్లి యైనను
నలుగదె తాఁ గూడువెట్టునపు, డటుమొగమై
యల బుద్ధి విద్య చెందని
యలసులపై నల్పరోషులగు వారలపైన్.
| 39
|
క. |
ఎవ్వరు శూరులు పండితు
లెవ్వరు సేవాప్రకార మెఱిఁగి కొలుచు వా
రెవ్వరు వారిదె సుమ్మీ
యివ్వసుధావరుల కలిమి యెంతయుఁ దలఁపన్.
| 40
|
క. |
అరయఁగ నప్రియుఁ డైనను
నిరతము బ్రియుఁడగుచుఁ దనరు నృసతుల కెందున్
ధర బుధులు చెప్పినటువలెఁ
జరియింపఁగ నెంచినట్టి సజ్జనుఁ డెలమిన్.
| 41
|
ఉ. |
మించుగ జీవనం బొసఁగి మేఘుని లీలఁగ నెల్లవారిఁ బో
షించఁ దగున్ మహోన్నతులఁ జేకొని మానవనాథుఁ డిట్లు పో
షించఁగ లేనిరాజులను జేరరు భూప్రజ లెందు లోకమం
దంచలు నీళ్ళులేక తగునట్టి కొలంకులఁ బాయుకైవడిన్.
| 42
|
క. |
కులమును శౌర్యంబును వి
ద్యలు శీలము నిట్టివెల్లఁ దలఁపరె యియ్యం
గలవానినె గుణహీనునిఁ
గులహీనునినైనఁ జేరి కొలుతురు భృత్యుల్.
| 43
|
క. |
ఇయ్యనివారలఁ గొలువరు
నెయ్యముతో నిచ్చువారినే కొల్తురు పా
లియ్యని యావులఁ జేరునె
పెయ్యలు దమ తల్లులైనఁ బ్రేమముతోడన్.
| 44
|
క. |
వేళఁ దలంపక ధరణీ
పాలుఁడు దనుఁ జేరి కొలుచుబంట్లకు వారం
జాలిన పనికొలఁదిని దా
వాలాయము జీత మీయవలయున్ వేడ్కన్.
| 45
|
క. |
కాలము దేశముఁ బాత్రముఁ
జాలంగా నెఱిఁగి యియ్యఁ జను జనపతి దా
నాలాగున నీ నేరని
పాలసుఁ డగురాజు నిందపాలై పోవున్.
| 46
|
క. |
అనిశంబును సుజనులు కా
దనెడి యపాత్రవ్రయంబు లవి గానివి రా
జున కందు నేమి ఫలమగుఁ
దనభండారంబె చెడుట దక్కఁగ నెందున్.
| 47
|
క. |
కులమును బ్రాఁతఱికము వి
ద్యలును స్వభావంబు శూరతయును వయోవ
స్థలు దెలిసి యాదరింపన్
వలయుఁ బతి మహాత్ములైన వారల నెల్లన్.
| 48
|
క. |
మనసరులగు సత్కులజుల
జనపతులు దిరస్కరింపఁ జన దెవ్వేళన్
ఘనముగఁ దిరస్కరించినఁ
దను నొవ్వఁగఁ జూతు రొండె తను విడుతు రిలన్.
| 49
|
క. |
ఇలఁ బేదలైన వారిం
గొలఁదిగఁ గలవారి సాధుగుణయుతు లైనన్
బలియింపవలయు వారల
బలిసినఁ బతి సిరుల మిగులఁ బ్రబలింతు రిలన్.
| 50
|
క. |
కులము గుణంబును గలవా
రల నీచుల సమత నడపరా దధిపతి కి
య్యిలఁ దారతమ్య మెఱిఁగిన
నలరుచుఁ బేదైనఁ గొలుతు రతనిన్ భృత్యుల్.
| 51
|
క. |
గాజును మణిసమముగఁ గను
రాజును బ్రజపట్టు లేనిరాజును గొలువుం
దేజంబు లేనిరాజును
రాజనుచుం గొలువ రండ్రు రసికులు ధాత్రిన్.
| 52
|
చ. |
అనుపమలీలఁ గల్పతరువందును బోలె మహాత్ము లెల్ల నే
జనపతిఁ జేరి సౌఖ్యమునఁ జాలఁగ మింతు రతండు సంపదన్
ఘనత వహించి సన్నుతులు గైకొనుచున్ బ్రతుకొందు నెట్టిచో
నెనయుచు సజ్జనుండు భుజియించుటెకా సిరికిన్ ఫలం బిలన్.
| 53
|
క. |
చెలులును బ్రాజ్ఞులుఁ జుట్టం
బులు నాప్తులు గలసి మెలసి భోగింపక ని
ష్పలమై దలమై చెలఁగెడు
కలిమియుఁ దానేల యట్టి ఘనతయు నేలా.
| 54
|
క. |
కలకొలఁదిఁ బంచిపెట్టుచుఁ
జెలికాఁడునుబోలె సంతసిలఁ బలుకుచు భృ
త్యులు గలుగ నడచు దొర కీ
యిల యెంత జగత్త్రయంబు నేలఁగ వచ్చున్.
| 55
|
చ. |
మునుపె పరీక్ష సేసి నయముం బ్రియముం దగ నాప్తులైన స
జ్జనముల నాయపెట్టునెడ సంతతముం దగ నిల్పి వారిచే
ననువుగ రాజవర్యుఁడు ధనాదులఁ గూర్చుట యొప్పు నీరముల్
దనకిరణాళిఁ బీల్చుచు ముదంబునఁ జెందెడు భానుఁడుం బలెన్.
| 56
|
క. |
తొలుత నధికారితనమున
నలవడి యావంక లెఱిఁగి యత్నము ధనముం
గలిగి శుచులైనవారల
నిలఱేఁ డాయాయి పనులయెడ నిల్పఁదగున్.
| 57
|
ఉ. |
మంచితనంబువారి జనమండలి మెచ్చినవారి లంచ మా
సించనివారి యత్నములు సేయుచు నుండెడివారిఁ దాఁ బరీ
క్షించినవారి నేరుపులఁ జెందినవారి నిజంబుచేఁ గడున్
మించినవారి భూవిభుఁడు నిల్పఁదగుం బనులందుఁ బొందుగన్.
| 58
|
క. |
ఏపను లెఱిఁగినవారల
కాపనులనె చెప్పి సేయుమనఁ దగుఁ బతి తా
రూపాదివిషయములకై
యేపట్టున నింద్రియముల నెసఁగించుగతిన్.
| 59
|
చ. |
కొలుచుకొటారులందు నృపకుంజరుఁ డెంతయు నాప్తు నిల్పి తాఁ
గలయఁ గనుంగొనన్‌వలయు గల్గినయాయము కొద్ది వెచ్చముం
దెలిసి యొనర్పఁగాఁదగు మదింపక యెందును భూమిభర్తకుం
గొలుచుకొటారులే కదయకుంఠితజీవనహేతువుల్ మహిన్.
| 60
|
చ. |
చెఱువులు గట్టుటల్ గృషులు సేయుట వాడల లెక్కచేయుటల్
కరులను బట్టుటల్ గనులు గైకొనుటల్ వనదుర్గసేతువుల్
పొరయుట బేరమాడుటయు భూస్థలి నిట్టివి యష్టవర్గ మౌ
నరపతి వీనిఁ గూర్చుటకు నమ్మినవారలఁ బంపగాఁ దగున్.
| 61
|
క. |
ఇలఱేఁ డీవ్యవహారము
వలనం గడుఁబేదలైనవారలు ప్రబలం
గల రా యా వ్యవహారం
బుల వారల కడ్డపాటు వోఁ జేయఁదగున్.
| 62
|
గీ. |
క్రంప గొట్టించి సేద్యముల్ గలుగఁజేసి
పైరు దలకొనఁ గాపాడఁ బంచి ఫలము
గలుగుచో దండయుక్తిని గాఁచియుండఁ
జేయఁగాఁదగు నటులైన సిరులఁ జెందు.
| 63
|
ఉ. |
వైరులచేత దొంగలగువారలచే నధికార్లచేత భూ
మీరమణుండు లోభమున మించుటచేఁ జనవర్లచేత ని
ద్ధారుణికిన్ భయంబులగు దా నిటు లైదువిధంబు లౌభయం
బారసి వేళయందె ఫలమందుట మేలు త్రివర్గవృద్ధికై.
| 64
|
క. |
బలసి యెదురొడ్డి గరువం
బులు గల యధికారిజనులఁ బుండ్లునుబలెఁ దా
నిలఱేఁడు చీల్చివేయఁగ
వలయుం గడు ధూర్తు లైనవారలు వెఱవన్.
| 65
|
క. |
జనపతియం దల్పంబై
దనరిన యపకారమైనఁ దాఁ జేయఁగడం
గిన జడుఁడున్ జెడును జితిం
గనుఁగొని పడి మిడుత మడియుకరణిన్ ధరణిన్.
| 66
|
ఉ. |
భూవలయంబునన్ విభుఁడు పోషణ మెందు నొనర్ప లెస్సగా
నావులు పాలు పిండుగతి నన్నిటఁ బ్రోది చెలంగఁ జేసినన్
దీవలు పూవు లిచ్చుగతి ధీరతఁ జేకొని ప్రోచెనేని తాఁ
గావలె నన్నయర్దములు గన్పడ నిత్తురు వేడ్కతోఁ బ్రజల్.
| 67
|
శా. |
భండారం బొనఁగూర్పఁగా వలయు భూపాలుండు యత్నంబుచే
నిండార న్మదియందు నాప్తుఁ జతురున్ నిల్పందగున్ గీర్తి బ్ర
హ్మాండంబంతయు మీఱనీవదెఁ ద్రివర్గాపేక్షతో వేళలన్
దండారం జితలోకుఁడై మిగుల నుద్దండప్రతాపోన్నతిన్.
| 68
|
మ. |
తనకుం గల్గినకల్మియంతయును దా ధర్మార్థమై వెచ్చ పె
ట్టిన భూపాలునిలేమియున్ మిగులఁగా ఠీవుల్ ఘటించుం ధరి
త్రిని జేజేలకునై కళల్వరుసతో దీపించఁగా నిచ్చు చం
ద్రునినిర్ పేదతనంబువోలె జగదారూఢప్రభావోన్నతిన్.
| 69
|
క. |
ఇతరులఁ గడు నమ్మక యే
గతిఁ గార్యం బొనరు నటులఁగా నమ్మఁదగున్
క్షితిపతికిం దలఁప 'బృహ
స్పలే రవిశ్వాస' యనెడి శాస్త్రముకల్మిన్.
| 70
|
ఉ. |
నమ్మఁగ రాక యుండెడుజనమ్ముల నమ్మఁగఁ బోల దెట్టిచో
నమ్మఁగ నర్హులై తగుజనమ్ములనైనను దాను మిక్కిలిన్
నమ్మఁగరాదు నమ్మిన ఘనమ్మగు సంపద వారిసొమ్మె యౌ
నిమ్మహిఁ గాన రాజులకు నెవ్వరి నమ్మఁగరాదు నెమ్మదిన్.
| 71
|
ఉ. |
ఎట్టి యుపాయమార్గముల నిమ్మహిలోన జనంబు చిత్తముల్
గట్టిగఁ గానుపించు వెలిఁ గన్పడువస్తుసమూహ మట్ల తా
నట్టి యుపాయమార్గముల నందఱిచిత్తము లెంచి చూచుచున్
నెట్టన యోగిరీతి ధరణీభవుఁడుం జెలువొందఁగాఁ దగున్.
| 72
|
మ. |
తనచారిత్రముచేత నెట్టియెడ మోదం బందుచు న్మించుభూ
జనులుం బంట్లును గల్గి దుర్ణయగతిం జాలింపుచుం దేనియల్
సిలుకం బల్కుచునుండు భూమిపతి దా శీలంబు నేర్పొందు నా
ప్తునిపై నెంతయు రాజ్యభార మిడినన్ బొల్పొందుఁ దేజస్వియై.
| 73
|
కంటకశిక్షణప్రకరణము
ఉ. |
సంతత మాదరంబునఁ బొసంగుచు లోకమునందు వేదమం
దెంతయు నేర్పుతో మెలఁగి యెయ్యెడ నేర్పరు లైనసజ్జనుల్
సంతసమంది కొల్వఁ దనసద్గుణముల్ గనుపట్టుచుండ బా
హ్యాంతరరాజ్యచింత వసుధాధిపవర్యుఁడు సేయఁగాఁ దగున్.
| 74
|
గీ. |
దేహ మాంతరరాజ్యంబుఁ దెలిసి చూడ
బాహ్యరాజ్యంబు రాష్ట్రమై పరగు నొకటి
కొకటి కాధారమై రెండు నుండుఁ గాన
యిట్టి రెండును నయవిదు లేక మండ్రు.
| 75
|
క. |
బలు వగురాజ్యాంగంబులు
గలుగుట రాష్ట్రంబువలనఁ గనుక ధరిత్రీ
తలనాథుఁడు యత్నముతో
నలువుగ రాష్ట్రంబుపాలనము సేయఁదగున్.
| 76
|
క. |
జనముల రక్షించుటయే
జనపతికిన్ ధర్మ మట్టిసద్ధర్మము ని
ల్పును జనపతితను వటుగనఁ
దనతను వనిశంబు బ్రోవఁదగు నాయమునన్.
| 77
|
క. |
ధర్మార్థం బగుహింసలు
ధార్మికులై మునులఁ బోలి తగురాజులు ము
న్నిర్మలులై యొనరిచి రిది
ధర్మము గావున వధింపఁదగు పాపాత్మున్.
| 78
|
క. |
జనపతి ధర్మముఁ దప్పక
ధన మార్జింపంగవలయు ధర్మముకొఱకై
జనులను బీడింపుదు రే
జను లనిశము వారిచేఁత శాసింపఁదగున్.
| 79
|
క. |
ఎట్టిది మెత్తురు సజ్జను
లట్టిదెపో ధర్మ మనఁగ నలరుం ధరలో
నెట్టిది మెచ్చరు సజ్జను
లట్టిదియ యధర్మ మనఁగ నలరుచునుండున్.
| 80
|
క. |
జనపతి సుజనుల మర్యా
దనె మెలఁగుచు వినయమునను ధర్మ మధర్మం
బును దెలియుచుఁ దా భూప్రజ
లను బ్రోవఁగఁ దగును దూష్యులం దునుమఁదగున్.
| 81
|
గీ. |
అధిపు చనవరులగుచు రాజ్యంబుఁ జెఱుచు
పాపకర్ముల మూఁకలై పరగువారి
నొక్కఁడొక్కఁడుగా నేని నుండువారి
దూష్యులని పల్కుదురు నయధుర్యు లెందు.
| 83
|
వ. |
అట్టి దూష్యజనంబులం జనంబు లెవ్వరు నెఱుంగకుండ ధనంబు
చేతనైనను గైదువులచేతనైన నుపాంశుదండప్రకారంబున
దండింపవలయు నొండె, లోకశత్రువులని సకలజనంబులచేత
నిందనొందించి ప్రకాశదండంబుచేతనైనను జంపవలయు నందు
నుపాంశుదండప్రకారంబు.
| 84
|
సీ. |
దూష్యుని గుట్టున దోడ్తేరగాఁ బంచి
పొడగని పొమ్మని పొంకపఱచి
కానరాకుండెడుకైదువుల్ గలవారి
నతని పిఱుంద రా ననువుపఱచి
తనకు నమ్మిక గలద్వారపాలకులచే
దూష్యునిబంటులఁ దొలఁగఁ దోలి
లోపలిచావడిలోనికి రప్పించి
యతనిఁ జంపగ నంపు నాయుధముల
|
|
గీ. |
వారిచే లెస్స నేరముల్ వాని కెఱుక
పడఁగ నొనరించి లోకంబు బ్రతుకవలసి
సిరుల మిక్కిలి నభివృద్ధిఁ జెందవలసి
వానిఁ జంపించవలయు భూవల్లభుండు.
| 85
|
ఆ. |
అధికదండనమున నలికిపోదురు ప్రజ
యల్పదండనమున నలుకకుందు
రిటులఁ గాకయుండ నిల నేలుపతి యుక్తి
దండనంబె కలిగి యుండవలయు.
| 86
|
క. |
తలకొలిపి మొలకపైరుల
బలియంగాఁ జేయ నవియు ఫలమిచ్చుగతిన్
చెలిమిఁ దగఁ బ్రోవ వేళనె
ఫల మొసఁగఁగ నేర్తు రెందు బ్రజలుం బతికిన్.
| 87
|
రాజపుత్రరక్షణము
క. |
కడు నర్థలోభములచేఁ
గొడుకు లెదిరి విభునిఁ జెఱుపఁగోరుదు రగుటన్
కొడుకుల మనుపఁగవలయుం
బుడమి జనంబులును దాను బొదలుట కెందున్.
| 88
|
క. |
మదయుతులు నిరంకుశులై
కొద వెడలినరాజతనయకుంజరముల నెం
దదయు లయి పరిభవించినఁ
జదుపరె తోఁబుట్టునైన జనకుని నైనన్.
| 89
|
క. |
ఏకడల మత్తులై డగు
రాకొమరులు నెఱుపుచుండురాజ్యముఁ బ్రోవన్
జేకుఱుట దుర్లభం బగుఁ
గైకొని పులివాతఁ బడినకండ యనంగన్.
| 90
|
క. |
తముఁ బ్రోచువారినై నను
దమకముతోఁ గొదువ గలుగుతఱిఁ జెఱుతురు రా
కొమరులు భువిలోపల సిం
హముకొదమలలీలఁ జాల నాలకు లగుచున్.
| 91
|
క. |
వినయము గలుగుచు మెలఁగఁగఁ
దనయుల శిక్షింపవలయు ధరణీపతికిన్
వినయులు గాకుండినతన
తనయులచేఁ గులము బలము దలముం జెడదే.
| 92
|
క. |
వినయము గలుగుకులస్త్రీ
తనయుని యువరాజు సేయఁ దగు నెయ్యెడలన్
వినయము లేనికుమారునిఁ
బనుపడ మదగజములీల బంధింపఁదగున్.
| 93
|
ఆ. |
ఓజగేడనైన రాజపుత్రుని వెళ్ళఁ
దోలఁ దగదు వెళ్ళఁ దోలెనేని
యతఁడు గడుఁ బ్రయాస మంది శత్రువు లైన
జనులఁ గూడి యతనిఁ జదుపుఁ గాన.
| 94
|
క. |
వెసఁ దండ్రి చెప్పనట్టులె
కసరక వర్తించునటులఁగా నెల్లపుడున్
వ్యసనాశ్రయజనములచే
వ్యసనము గలసుతుల వెతల నందించఁదగున్.
| 95
|
ఆత్మరక్షితప్రకరణము
క. |
ఇల ఱేఁడు మోసపోవక
తెలివిన్ విష మిడకయుండఁ దెలియందగుఁ బీ
టల వలువలఁ దొడవుల శ
య్యల భోజనపానవాహనాదులయందున్.
| 96
|
క. |
విషహర మగుమణు లిడికొని
విషహక మగుజలక మాడి విభుఁ డొందఁదగున్
విషరహితభోజనంబుల
విషహరు లగువెజ్జు లుండ వేడుకతోడన్.
| 97
|
విషపరీక్షావిధానము
క. |
ఇలలోఁ గోఁతులు గొరవం
కలు రాచిలుకలును విసము గనుకొనినం బా
ముల గనుగొనిను గడుఁ గూ
తలు బెట్టు నటండ్రు నీతితత్త్వవిధిజ్ఞుల్.
| 98
|
సీ. |
విషముఁ జూచినవేళ విషయుక్త మైనప
దార్థంబుఁ జూచిన యట్టివేళఁ
దలకబాఱుచును గోఁతులును రాచిలుకలు
గోరువంకలు సారెెెఁ గూఁత లిడును
కన్ను లెఱ్ఱఁగ బాఱుఁ గలహంసలకు నెల్ల
మఱి ముదంబును జెంది మలయుఁ గొంచ
మదకోకిలంబులు మరణంబుఁ జెందును
వెన్నెలపులుగులు వేగ బడలు
|
|
గీ. |
నిందు నొక్కటిదేనైన నెందు లెస్సఁ
దాఁ బరీక్షించి ధారుణీధవున కెపుడు
భోజనముఁ జేయఁదగు నిట్లు భోజనంబుఁ
జేయుచుండినఁ బతి హానిఁ జెందకుండు.
| 99
|
క. |
నెమిలియు దుప్పియుఁ బాముల
నమలుం గావున విభుండు నగరులలోఁ దా
నెమిలిని దుప్పిని సతతముఁ
దమితోడుతఁ బెంచి విడువఁదగు లీల నిలన్.
| 100
|
క. |
జగతీపతి భుజియింపఁగఁ
దగు నన్నము మున్ను వహ్నిఁ దా నిడి విషముల్
దగ నెఱిఁగినపక్షుల కిడి
తగులీలఁ బరీక్షఁ జేసి తగు భుజియింపన్.
| 101
|
గీ. |
ఎందు విషముండు నన్నంబు లిడినయపుడు
నల్లనంగుమంటచే నగ్ని నల్ల నగును
బొదలి చిటచిట మనెడి చప్పుడును బొడముఁ
బులుఁగులకు నెల్ల మరణంబు గలుగుచుండు.
| 102
|
క. |
వలువల నందుట పెఱచా
యలఁ జెందుట యెండియుండు టార్ద్రం బగుటన్
నలుపైన యావి గలుగుట
తలఁప విషాన్నంబునకును దగుచిహ్నంబుల్.
| 103
|
క. |
ఉడుకుతఱి నల్లనురుగులు
పొడముట తావియు రసంబుఁ బోవుట స్పర్శం
బుడుగుట యెండుటయును విష
మిడఁబడుకూరలకు గుఱుతు లివి యెఱుఁగఁదగున్.
| 104
|
క. |
ఘన మగు చాయలు గలుగుట
యును జాయలు లేకయునికి యూర్ధ్వముగాఁ బై
కొనురేకలు నురుగొందుట
లనిశము విషయుక్త మగుపదార్థముగుఱుతుల్.
| 105
|
క. |
జలములయెడ మధువునఁ గో
యిలచాయలఁ జెంది పాల నెఱుపై దధిలో
పల రసముల నలుపై విష
ములు గలసిన పైకి రేక మొనయుచు నుండున్.
| 106
|
క. |
ఉడుకక యుండుట మాడుట
గడుఁ జిముడుట నల్లచాయఁ గలుగుట తుటి య
ప్పుడ వాడొందుట విషముల
నిడునార్ద్రపదార్థములకు నివి చిహ్నంబుల్.
| 107
|
మ. |
భువిలో నెండినయట్టివానికి విషంబుం జెందినన్ సూక్ష్మజం
తువు లెల్లం బడి చచ్చుఁ జేరువకు రాఁ దోడ్తోనగుం జాయ మా
ర్దవయుక్తంబులు గట్టివౌ మఱి మృదుత్వం బందుఁ దా గట్టివ
స్తువు వేగంబ నలంగి తుందుమురులౌ దోషాశ్రయత్వంబునన్.
| 108
|
సీ. |
కప్పడంబుల రత్నకంబళంబులయందుఁ
బొగవన్నె మచ్చలు బొడమియున్న
దారంబు తెగుటయుఁ దగిన నూఁగునకును
రోమంబునకును జాఱుటలు గల్గు
మఱి లోహమునకును మణులకు నల్లని
యడుసుఁ బూసినయట్లు దొడరుటయును
కాంతిసంతతియును గౌరవం బుడుగుట
సామర్థ్యమును సుఖస్పర్శ మడఁగు
|
|
గీ. |
డాదిగాఁ గల్గియుండెడునట్టివెల్ల
గుఱుతు లగుచుండు విషములఁ గూడెనేని
యిన్నివిధముల విషమిడు టెఱుఁగవలయు
నీతిమార్గం బెఱింగిననృపవరుండు.
| 109
|
చ. |
పలుకులు కొంకి మ్రాన్పడుట, పల్మరు దొట్రిలి నాల్గుదిక్కులన్
గలయగఁ జూచుటల్, జెమట గ్రమ్ముట కంపము బుట్టు టావులిం
తలు మొగమెండి నల్లఁబడి తారుటలుం గడుఁ జంచలించుటల్
పెలుచఁదనంబునన్ విషముఁబెట్టిన వానికిఁ జిహ్నముల్ మహిన్.
| 110
|
క. |
నీరును మధు వౌషధములు
నారసి యొనరించువాని కవి మున్నిడి తా
నేరుపుతోఁ గొనవలయును
భూరమణుఁడు ప్రతిదినంబు భోజ్యాదులతోన్.
| 111
|
క. |
తొలుతఁ బరీక్షింపుచు ము
ద్రలు బెట్టినభూషణములు దావుల పూవుల్
గలపంబులు మొదలైనవి
యెలమిఁ గలుగు బంట్లు బతికి నీయఁగ వలయున్.
| 112
|
క. |
తనకుం బరరాజులు పని
చినవస్తువు లెల్ల వేగఁ జేకొన కెందున్
మునుపె పరీక్షింపుచుఁ గై
కొనఁగాఁ దగు నాత్మహితముఁ గోరెడిపతికిన్.
| 113
|
క. |
మిగులఁగ నితవరులగుచున్
దగునాప్తులు ప్రోవవలయు ధరణీవిభునిన్
బగవారివలన దన వా
రగువారలవలన హాని యడరక యుండన్.
| 114
|
గీ. |
పల్లకుల నందలంబుల భద్రకరుల
గుఱ్ఱముల వీని లెస్సఁగా గుఱుతు లెఱిఁగి
యెఱిఁగినటువంటివారు దే నెక్కవలయు
నాత్మరక్షణ మొందుట కవనివిభుఁడు.
| 115
|
క. |
దొర మిక్కిలి యిరుకట మగు
తెరవున నెవ రెఱుఁగకుండుతెరవున నెచ్చో
నరుగుట కొఱగా దందురు
ధరలోపల నీతిశాస్త్రతత్పరు లెల్లన్.
| 116
|
క. |
కనుగొనినపనుల నితవరి
తనమున బ్రాతఱికమునను దగువారల నెం
దును మంచివారిఁ దెలియుచు
జనపతి యేర్పఱచి యునుపఁజనుఁ దనచెంతన్.
| 117
|
గీ. |
ధార్మికులు గానివారలఁ దా నెఱుంగు
దోసకారుల నవమానితులను బరుల
వలన వచ్చినవారిఁ గ్రూరుల నెఱింగి
దూరమునఁ బాయవలయును దొరల కెల్ల.
| 118
|
గీ. |
ఆరులయోడలఁ జెదరఁగ నడ్డపెట్టఁ
బడెడునోడ బరీక్షింపఁబడనిపీలి
కాండ్రు గలయోడ పెనుగాలిఁ గదలునోడ
బ్రాఁతయోడయు నెక్కఁగాఁ బతికిఁ దగదు.
| 119
|
చ. |
నరపతి వెట్టబెట్టగు దినంబులఁ గ్రీడలు సల్పఁ బొల్పగున్
సరసులఁ బెద్దమీలను మొసళ్ళను వీడఁగఁ జేసి యాప్తతం
బరగిన సైన్యముల్ దనుఁగనన్ దగనుండ నొనర్చి కాచునా
దరములతో హితుల్ సతులు దాను వినోదము మోద మందఁగన్.
| 120
|
ఉ. |
కానకుఁ బోక చేరువునఁ గన్పడి కంటకశుద్ధి నొందును
ద్యానమునందు జవ్వనము నందుటకుం దగులీల భోగముల్
మానవనాథుఁ డొందఁదగు మారునిచేత మదించి యెంతయున్
దానటు మోసపోక లలనావలనాకలనాభిరాముఁడై.
| 121
|
గీ. |
ఉచితమై పోవ రావచ్చియుండి యాప్త
రక్షితంబగు నడవికి రాజు లక్ష్య
మెఱుఁగుటకు నల్పభోజనం బెసగువేఁట
కరుగఁదగు నుత్తమంబగు హయము నెక్కి.
| 122
|
ఉ. |
దిద్దుట గల్గి శుద్ధి గని దే యనినంత సమీరు మీరుచున్
ముద్దులు గల్కుతేజి నృపముఖ్యుఁడు వేడుకతోడ నెక్కి ము
న్నొద్దిజనంబు గావలిగ నుండెడుకానకు వేఁట పోఁదగున్
దద్దయు నాప్తసీమకును దాఁ జలలక్ష్యనిరీక్షణార్థమై.
| 123
|
క. |
అరసి సమీపకాననము నైనను గంటకశుద్ధి చేసి భూ
వరుఁడు నిజాప్తు లైనపరివారము లాయితపాటుతోడ రా
నరుగుట యొప్పు నందు బలువై తగుకానల నిక్కటైనచో
నిరతము నుండరాదు నృపనీతిరహస్యవిచారశాలికిన్.
| 124
|
క. |
తనతల్లి యింటికైనన్
జనపతి యెచ్చరికతోడఁ జనగాఁదగుఁ గా
వున నడవికి జనియెడిచోఁ
దనరఁగ నెచ్చరికె లేక తగునా యరుగన్.
| 125
|
గీ. |
ధూళిఁ జల్లుచు విసరెడి దొడ్డగాలి
కాలమందును జడివానకాలమందు
మండువేసవియందును మబ్బులోన
నరగరా దెందు సుస్థిరుఁ డైనపతికి.
| 126
|
చ. |
కలకల ముల్లసిల్ల నల కట్టికవా రిరువంక సందడిన్
దలగ నొనర్చి దూరముగఁ దారు భజింప బలంబుపెంపుసొం
పులు దగ రాజవీథులనె పోవుచు వచ్చుచు నుండఁగాఁ దగున్
జెలఁగి నిజోన్నతుల్ జనులు చెంతలఁ జూడ నృపాలమౌళికిన్.
| 127
|
క. |
ఇలఱేఁ డుత్సవముల యా
త్రల మూఁకలయందు నేఁగుతఱి సందడు ల
గ్గల మగుచోట్లకుఁ బోరా
చలవున వేగిరము చను టయముగా దెందున్.
| 128
|
క. |
తలపాఁగలు నరచట్టలు
గలిగిన మరుగుజ్జు లన్నగాండ్రును వేదిం
గొలిచి తిరుగఁగా మెలఁగన్
వలయును జనపతియుఁ దనదు నగరులలోనన్.
| 129
|
క. |
తల పెఱుఁగుచు శుచిభావము
గలిగిన లోపలియమాత్యగణములు శస్త్రా
గ్నులు మఱి విసములు వెలిగాఁ
గలక్రీడలఁ బ్రొద్దు గడపగాఁ దగుఁ బతికిన్.
| 130
|
మ. |
తమసన్నాహముచేఁ దనర్చి పనులం దక్షత్వముం జేర్చి యు
త్తము లౌవారలు సమ్మతింప మెలఁగన్ దా నెంతయు న్నేర్చి ని
త్యము నంతఃపురమందుఁ గాదుజనముల్ ధాత్రీపతిం గావ యు
క్తమగున్ లోనినగళ్ళనుండుతఱి నిక్కంబైననెయ్యంబునన్.
| 131
|
చ. |
ఎనుబదియేండ్లసత్పురుషు లేఁబదియేడులు గల్గునింతు లిం
దును జతనంబు మీఱు మదితోడుత నంతిపురంబులోని కా
మినుల శుచిత్వముం గనుచు మెల్కువ వచ్చుచుఁ బోవుచుండు నా
జనముల దా రెఱుంగఁ దగు పెంచడమున్ నరనాథుపంపునన్.
| 132
|
మ. |
జలకం బాడి మిటారి కుచ్చెలలు మించన్ వల్వముల్ గట్టి యిం
పులతోఁ దళ్కుదళుక్కనన్ మెఱయుసొమ్ముల్ బూని తావుల్ గుబుల్
కొలుపన్ గంధముఁ బూసి క్రొవ్విరులు టెక్కుల్ నిక్కగాఁ దాల్చి చెం
తలఁ గొల్వందగు వారకాంతలు మహీనాథుం బ్రమోదంబునన్.
| 133
|
శా. |
రాణింపం జలకంబు దీరిచి యొయారంబై మిటారించు పై
ఠాణీసేలలు గట్టి క్రొవ్విరుల దండల్ చుట్టి భూషాళి వి
న్నాణం బొప్పగఁ బెట్టి కప్పురపుగంధస్ఫూర్తి గన్పట్టి మేల్
జాణల్ గాణలు నైనవారవనితల్ రాజేంద్రుఁ గొల్వందగున్.
| 134
|
క. |
వెలి దిరిగెడి తొత్తుల వ
క్రుల జోగులఁ గపటజనులఁ గూడి చరించన్
వలదు నృపునంతపురమున
మెలఁగెడువారెల్ల మిగుల మెలఁకువతోడన్.
| 135
|
క. |
కొనిచను పదార్ధములు వ
చ్చిన పనులుం దెలివిఁబడగఁ జెప్పుచు యత్నం
బనువొందఁగ రాఁ బోవం
జను నంతిపురంబులోని జనముల కెల్లన్.
| 136
|
చ. |
కనుఁగొనినంత నంటికొనుఁగాన తెవుల్‌గలవారిఁ జూడ కెం
దును నొకపాటి నొప్పులను దూలెడు బంటులఁ జూచి యాదరం
బెనయఁగఁ బ్రోవఁగాఁ దగు మహీతలభర్తకు నెంచ నార్తులౌ
జనములఁ బ్రోచుకంటెను బ్రశస్తతరం బగుధర్మమున్నదే.
| 137
|
మ. |
తొలుతం దా జలకంబుఁ దీర్చి చలువల్ దోడ్తో విరుల్ సొమ్ములుం
గలపం బందుచు దేవియుం జలకమున్ గావించి రాఁ జల్వలుం
గలపంబుల్ మణిభూషలున్ విరులు జోకం దానె యిప్పించి నే
ర్పులఁ గూడందగు రాజు పెం పెసఁగఁ బ్రాపున్ సొంపుఁ గల్పించుచున్.
| 138
|
క. |
తనయింటనుండి జనపతి
తనదేవినివాసమునకు దా నరుగంగా
జనదు మఱి యెంతప్రియుఁడై
తనరిన వనితలను నమ్మఁ దగ దధిపతికిన్.
| 139
|
సీ. |
భార్యయింటికిఁ జని భద్రసేనుఁడు తొల్లి
యాపెతోఁబుట్టుచే హతుఁ డగుటయు
నాలిగృహంబున కరిగి కారూశుండు
తనతనూభవునిచేతనె పొలియుట
ప్రియురాలు విసముతోఁ బేలా లొసంగిన
వేగంబె కాళికావిభుఁడు పడుట
జడలోన దాఁచుకుండెడుకత్తిఁ దెలియక
రమణిచేతనె విదూరథుఁడు చెడుట
|
|
గీ. |
యటుల గరళాంజనముఁ బూసి యద్ద మందె
మేఖలయు నీయఁ జారూప్య మేదినీశు
లవనిపై రూప్యసంవీరు లగు టెఱింగి
యధిపుఁ డతివలయిండ్లకు నరుగరాదు.
| 140
|
క. |
వనితలచే విసములచే
జనపతి యటు మోసపోక శాత్రవతతులన్
వనితలచే విసములచే
ననిశము దా మోసపుచ్చు టర్హం బెందున్.
| 141
|
క. |
పరమాప్తజనులచేతనె
నరవరుభార్యలు సురక్షణముఁ జెందుదు దా
దొరకుం గైవసములు గా
దొరకున్ భోగైకయుక్తితో నిహపరముల్.
| 142
|
క. |
తనమది ధర్మము గోరుచుఁ
దనభార్యలనెల్లఁ గూడఁ దగు రాజు క్రమం
బున మధురాహారుండై
యనువొందగ నుచితరాత్రులం దింపొందన్.
| 143
|
చ. |
మనుజవిభుండు కార్యగతి మాపు విచారము చేసి కొల్వవ
చ్చిన ప్రజ నలచి లోనిగృహసీమల బామలు సేవఁజేయఁగా
ననుపమలీల నాయుధమునందని చేతఁ జెలంగి నిద్రపో
వను దన కాప్తులైన పరిచారులు నూరెల్ గాచియుండగన్.
| 144
|
ఉ. |
మేదురనీతిమార్గమున మేల్కనియుండెడు రాజు గల్గినన్
మేదినిలో జనంబు లెలమిన్ సుఖవృత్తిని నిద్రఁ గాంతు రే
వాదలు లేక మత్తుఁడయి పార్ధివుఁ డూరకె నిద్రవోయినన్
మోదముఁ జెంది భూమిజనముల్ సుఖవృత్తిని నిద్రఁ గాంతురే.
| 145
|
క. |
ఎటులను రాజరాజ్యముల కెల్లను రక్షణమండ్రు మౌను లెం
దటుగన నెట్టివేళల ధరాధిపవర్యుఁడు నీతియుక్తుఁడై
యటులనె ప్రోచుచుండి నెఱయం బరిపాలన మాచరించినన్
జటుల నిజప్రతాపమున శత్రులఁ గెల్చునుఁ బొల్పు సంపదన్.
| 146
|
చ. |
విలసితరాజధర్మయుత విశ్రుతభృత్యవిధానపాలనా
తులిత మనీషదూష్యజనధూర్తవిఖండనదక్ష సద్గుణా
కలితతనూజసంపదధికస్థిర యాత్మసురక్షణక్రమో
జ్జ్వలరిపుమౌళిరత్నరుచిజాలమనోజ్ఞపదాంబుజద్వయా.
| 147
|
క. |
భూనుత లక్ష్మణ చర్యా
శ్రీనియత నిజానుజన్మచినతిమ్మమహీ
శానపరత సంసేవిత
ధీనయ సుగుణాభిరామ తేజోధామా.
| 148
|
పంచచామరము. |
సరోరుహాప్తవంశసంగ సంగరాంగణార్జునా
ధరామరోల్లసద్రమానిదాన దానవైరవా
స్ఫురత్కరాగ్రజాగ్రదుగ్రభూరిధారసారస
త్కరాళచండఖడ్గదండదండితారిమండలా.
| 149
|
గద్యము. |
ఇది శ్రీమన్మదనగోపాలవరప్రసాదలబ్ధసారసారస్వత
భారద్వాజసగోత్ర జక్కరాజ యెఱ్ఱనామాత్యపుత్ర సుకవిజన
విధేయ శ్రీరామకృష్ణభక్తివైభవభాగదేయ వేంకటనామధేయ
ప్రణీతంబైన కామందకనీతిశాస్త్రంబున స్వామ్యనుజీవివృత్త
లక్షణంబును, గంటకశిక్షణంబును రాజపుత్రరక్షణంబును నాత్మ
రక్షావిచక్షణత్వంబును నున్నది తృతీయాశ్వాసము.
|
|