ఆండ్రూ కార్నెగీ (జీవితచరిత్ర)/స్కాట్లండులోని పూర్వ రంగం
స్కాట్లండులోని పూర్వ రంగం
1
అప్పటికి ఇంకా అతడికి రెండేళ్ళయినా లేవని పెద్దవాళ్ళు రూఢిగా చెపుతున్నా, ఆండ్రూ ఆ సంగతి తనకు జ్ఞాపకం వున్నదని ఎప్పుడూ అంటుండేవాడు. అంతేకాదు, జ్ఞాపకమున్నదనే ఆయన గాఢ విశ్వాసం.
"ఏమైనా, అది నాకు జ్ఞాపకముంది" అని గట్టిగా అంటుండేవాడు.
"నాకు జ్ఞాపకమున్న మొదటి విషయమే అది" అనేవాడు.
ఈ సంఘటనలో ఉద్రేకం పొందదగి నంతటి దేమీలేదు. అతని తల్లిదండ్రులు, మేనమామ, పినతల్లి, విలియం మారిసస్, మిసెస్ ఆండ్రూ, ఐట్కిన్ తలలుచేర్చి షుమారు రెండు అడుగుల గుడ్డమీద అంటించినటువంటి మెరిసిపోతున్న ఒక కాగితాన్ని చూస్తున్నారు. దాన్ని చుట్టటానికి అనువుగా గుడ్డకు రెండు చివరలా రెండు కర్రముక్కలు అమర్చబడి వున్నవి. గుమిగూడి చూస్తున్న వాళ్ళదగ్గిరికి తప్పటడుగులు వేసుకుంటూ వచ్చి, చొచ్చుకొని ప్రవేశించే స్వభావంగల ఆండ్రూ, అదేమిటో తెలుసుకుందా మన్నట్లుగా వారి మధ్యన తానూ తలదూర్చాడు. తండ్రి, పినతండ్రి విలియం ఇద్దరూ నవ్వుతూ ఆతడు చూడటానికి వీలుగా దాన్ని కొంచెం క్రిందికి దించారు.
"ఆండ్రా, ఇది దేశపట" మన్నాడు తండ్రి.
"దేశపటం!" అని తిరిగి ఉచ్చరించాడు ఆండ్రూ.
"ఇది అమెరికా దేశపటం" అన్నాడు గంభీరంగా తండ్రి. అతడు చిన్న బిడ్డలతోకూడా ఎప్పుడూ పెద్దవాళ్ళతో మాటాడినట్లు మాటాడుతాడు. "అదిగో అక్కడ" అని ఒక చుక్కను చూపిస్తూ అతడు "అది పిట్స్‌బర్గ్ పట్టణం. అక్కడికే అంకుల్ ఆండ్రా, ఆంట్ అన్నాలు వెళ్లుతున్నారు. అంకుల్ విలియం ఇంకా పైకి ఓహెయో రాష్ట్రంలోకి వెళ్లుతున్నాడు.
పిట్స్‌బర్గ్ అన్నది తరువాత కాలంలో ఆండ్రూ తన సంపత్తిని పెంచుకొన్న నగరంపేరు. తల్లిదండ్రులు జ్ఞప్తిచేయటంవల్ల పిట్స్‌బర్గు అన్న పేరే అతని మనస్సులో ఈ సంఘటనను స్థిరంచేసి వుంటుందనటంలో సందేహం లేదు.
జీవితకాలం మొత్తంలో యే కొద్దిమంది వ్యక్తులో పదో లేక ఇరవైయ్యో మైళ్లు తప్ప ఎన్నడూ కదలి వెళ్ళని ఒక చిన్న స్కాబ్‌నగరంనుంచి కుటుంబం వొకటి కుదుళ్ళతో సహా లేచి, సముద్రాలు దాటి, చుట్టుప్రక్కల ప్రదేశాల్లో వుండి ఇంకా ఇండియన్లు ఆపదలు కల్పిస్తున్న విశాలమూ, అజ్ఞాతమూ అయిన దేశంలో దిగి నూతన జీవితాన్ని ఆరంభించటమంటే ఏమిటో అర్ధంచేసుకోటానికి ఆండ్రూ ఇంకా చాలా చిన్నవాడు.
"మీరుకూడా మాతో రావలెనని నా కోరిక!" అని ఆంట్ అన్నా ఐట్కిన్ నిట్టూర్చింది.
"వద్దు, వద్దులే అన్నా" అని ఆండ్రూ తండ్రి నిష్కర్షగా తలత్రిప్పాడు. "ఇప్పుడే ఈ క్రొత్త అద్దె యింట్లోకి మారాము. నావి నాలుగు మగ్గాలు నడుస్తున్నవి. ఇప్పుడు కాదు" అన్నాడు.
విలియం కార్నెగీ నారతో బుటేదారు పనితనాన్ని చూపించే బల్లగుడ్డలను, చేతిరుమాళ్ళను తయారుచేసే నేత పనివాడు తమ ఇంటిలోనే నేత నేసి జీవించే స్కాట్లండులోని వేలకొలది నేతపని వాళ్ళలో ఇత డొకడు.
ఆండ్రూ జన్మించిన డన్ఫ్‌ర్మ్‌లైన్ స్కాట్లండులోని బుటేదారు పని కంతటికీ కేంద్రంగా వుంటుండేది. అచటి వాళ్ళలో ఎక్కువమంది నేతపనివాళ్ళు. మంచి అభివృద్ధిలో వున్నప్పుడు ఆ నగరంలోని కుటీరాల్లోను, పరిసర గ్రామాల్లోను నాలుగు వేలకు పైగా వున్న మగ్గాల చప్పుళ్లు వినిపిస్తుండేవి. నేతపని వాడు కావలసిన వస్తువులకోసం, లేదా నమూనాలకోసం పని ఇచ్చేవాడిదగ్గిరికో, గుత్తవ్యాపారి దగ్గిరికో వెళ్ళి అవి తీసుకొని ఇంటికి తిరిగివచ్చి, ఆ తాను నేసి తిరిగి పని ఇచ్చినవాడి దగ్గరకు వెళ్ళి దాన్ని వొప్పచెప్పి, రావలసిన డబ్బు పుచ్చుకొని మరొక ఆర్డరు తెచ్చుకుంటాడు. విలియం కార్నెగీ 1834 లో మేరీ మారిసన్‌ను వివాహమాడాడు. అప్పటికే ఇతడు నేతపనివాడుగా పేరుపడ్డాడు. అంతస్తున్నర వున్న రాతికుటీరంలో వీరిద్దరికీ 1835 నవంబ్రు 25 న పెద్దకుమారుడు కలిగాడు. ఉత్సాహవంతుడైన ఆతని తాత గౌరవార్థం అతనికి 'ఆండ్రూ' అని వారు నామకరణం చేశారు. విలియం మగ్గం క్రింది అంతస్తులో వొక గదిని ఆక్రమించుకొని వుండేది. దానికి ప్రక్కగాఉన్న గదిలోను, ఇంటికి కొసన వున్న చిన్న గదిలోను వాళ్లు నివసిస్తూండేవాళ్లు. విలియం ఎప్పుడూ ఏవేవో కలలు కంటుంటాడు; అయినా మంచివాడు. నీతిమంతుడు. వొకసంవత్సరం అటూ ఇటూగా ఇతడు తన వ్యాపారాన్ని బాగా పెంపొందించాడు. వాళ్ళు పెద్దయింట్లోకి మారారు. అదనంగా మరి మూడు మగ్గాలు కొన్నారు. వాటిమీద పనిచేయటానికి మనుష్యులను పెట్టుకున్నారు. క్రింది అంతస్తంతా నేతగదులు. వారి నివాసం పై అంతస్తులో.
తరువాత చాలాకాలానికి ఆండ్రూ మహాధనవంతుడైనపుడు వంశ వృక్షాలను వ్రాయటం వృత్తిగా పెట్టుకొన్న వొకవ్యక్తి వచ్చి అతని వంశవృక్షాన్ని తయారుచేసే పని ఇవ్వవలసిందని కోరాడు. వాళ్ళను స్కాచ్ రాజకుటుంబపు సంతతివాళ్ళని అందులో నిరూపిస్తానని సూచన చేశాడు.
"ఇది వినటానికి నా కెంతో చింతగా వుంది" అని. ఈ మాటలు నచ్చని కోటీశ్వరుడు "నేను వొక నేతపనివాడి కుమారుడ నన్న భావంతోనే నా భార్య నన్ను వివాహం చేసుకున్నది" అంటూ ప్రతి సమాధాన మిచ్చాడు. అతడు స్కాబ్ రాజుకు మనుమణ్ని, మునిమనుమణ్ని చేస్తానని కూడా చేర్చి వుండేవాడు.
ఈ కుటుంబం వారు కొన్ని తరాలుగా నేత పనివాళ్లు తన కుటుంబం బలిష్టులు, నీతిమంతులు అయిన కర్మకారులు పుట్టిన కార్మిక కుటుంబమైనందుకు అతడు ఎంతగానో గర్వించేవాడు. నిజం! స్కాట్లండులో ప్రభు వర్గానికి చెందిన కార్నెగీలు వుండేవారు. కార్నెగీ అన్నది నార్తెస్క్, సౌతెస్క్ ప్రభువులకు కుటుంబ నామం. తరవాత కాలంలో ఆండ్రూ స్కాట్లండులో తన సౌధాన్ని నిర్మించుకొన్నప్పుడు అతడు నార్తెస్క్ ప్రభువు ఆప్తమిత్రులైనారు. తమ ఇద్దరికీ కుటుంబ సంబంధమైన బంధుత్వం లేదని తెలిసినప్పటికీ వాళ్లు కులాసాగా ఒకరి నొకరు 'సోదరా!' అని సంబోధించుకొనేవారు. ప్రభువులతో బంధుత్వకోసం కార్నెగీ ఎన్నడూ ప్రయత్నించలేదు.
చిన్ని ఆండూకు నాలుగైదేళ్ళ వయస్సు వచ్చినప్పుడు వాళ్ళ నాన్న కాళ్ళతో పలకలను త్రొక్కి ఆసుక్రోలిని అటూ ఇటూ త్రిప్పుతూ రవసెల్లాలమీద తెల్లనిపూలు, తీగలు, పక్షులు ఇతర దృశ్యాలు నేసి క్లిష్టమైన పనితనంగల అంచులతో వాటిని రూపొందిస్తుంటే మగ్గం ప్రక్కనకూచుని చూడటానికి ఎంతో సరదా పడేవాడు. మగ్గంమీద పనిచేస్తూ "బొయటీ రౌస్", "లోఛబర్ నో మోర్" లేదా.
"Scots who have for wallace bled,
Scots whom Bowse had often led,
Welcome to your glory bed,
Or to Victory." అన్న పాతకాలపు స్కాచ్ వీర గీతాలను, పాడుకుంటూ పాడటంకంటె గొణుగుకుంటూ ఉండే సిగ్గరి, సాధువు అయిన తన తండ్రి అంటే ఆండ్రూకు ఎంతో భక్తి.
"13 4లో బానాక్‌బర్న్ యుద్ధానికి ముందు ఇంగ్లీషు సైన్యానికి ఎదురుగా నిల్చిన తనసైన్యాన్ని ఉద్దేశించి రాబర్టు బ్రూస్ చేసిన ప్రసంగంగా ఈ 'స్కాట్స్...' అన్న గేయం ఊహింప బడుతున్నదని తన తండ్రి పాటను తొలిసారిగా మధ్యలో ఆపి తనకు చెప్పి తిరిగి ఎత్తుకొని ఎప్పుడు పాడాడో ఆండ్రూకు జ్ఞాపకంలేదు. కొన్ని సమయాలల్లో అతడు ఇది కూడా చేర్చి చెపుతుండేవాడు: "రాబర్టు బ్రూస్!" - మన మొదటి రాబర్టు బ్రూస్ రాజు అయినది ఇతడే. బుజ్జీ! నీకు తెలుసునా? అయిదు వందల సంవత్సరాలకు పూర్వం ఇంగ్లీషువారినుంచి స్కాట్లండ్ దేశానికి విముక్తిని కలిగించిన ఇద్దరిలో ఇత డొకడు. రెండవవాడు సర్ విలియం వాలెస్" అతడు ఆసుక్రోలిని ఎడమనుంచి కుడికి, మళ్ళీ వెనకకు ఆడించేవాడు. "భ్రూస్‌ను ఇక్కడే డంఫ్‌ర్మ్‌లైన్‌లోని అబ్బీలో ఖననం చేశారు...అతడు అతనిరాణి, అనేకమంది మన రాజులు రాణులు ఎంతోదూరం నుంచి మాల్కొ కాన్మోరుకు వచ్చారు. అతని రాణి మార్గెరెట్. ఆమే 1075 లో ఈ ఆబ్బీని స్థాపించింది" అని అతడు చెప్పేవాడు.
స్కాట్లండ్‌కు మధ్య యుగంలో రాజకీయ మత విషయిక ముఖ్యనగరం కావటంవల్ల ఊన్ఫ్‌ర్మ్‌లైన్ వాస్తవికంగా ఒక చరిత్రాత్మకమైన చిన్న నగరం. అందులోని రాజసౌధం మధ్యయుగపు మరికొన్ని కట్టడాలు ఈనాడు శిథిలావస్థలో వున్నవి ఒకప్పుడు స్కాబ్ రాజ కుటుంబం నివసించినదీ, ఇంగ్లండు రాజు ఛార్లెస్ I జన్మించినదీ అయిన రాజసౌధానికి సంబంధించిన ఒక గోడమాత్రం నేటికీ పడిపోకుండా నిలిచి వుంది. గౌరవనీయుడైన బ్రూస్ గోరీతో సహా రాజుల గోరీలకు, రాణుల గోరీలకు నీడ నిస్తూ అందమైన నలు చదరపు బురుజులతో, ఎత్తయిన శిఖరంతో వున్న అందమైన గొథిల్ ఆబ్బీ ఇంకా నిలిచివుంది. డన్ఫ్‌ర్మ్‌లైన్ నుంచి ఆగ్నేయ దిక్కుగా ఫిర్త్ ఆఫ్ ఫోర్త్ లోయగుండా చూస్తే, మబ్బులు లేని రోజున, పదిహేను మైళ్ళ దూరాన పొగల మధ్య కనిపించే ఎడింబరోలోని పొగ గొట్టాలు, గండశిలమీద ఉన్న దాని ఎత్తయిన దుర్గం కనిపిస్తవి.
వివాహం వల్ల అంకుల్ అయిన జార్జి లాడర్ ఇష్టుడయిన బంధువు ఇతడు చరిత్ర, జనశ్రుతిని బోధించే ఉపాధ్యాయుడు. అంకుల్ లాడర్ ఒక షాపు వ్యాపారి. అతని భార్య కొన్ని యేండ్లకు పూర్వం చనిపోయింది. ఇతడు ఆండ్రూను, తల్లిలేని తన కుమారుడైన జార్జిని నగరంలోను నగరం చుట్టుప్రక్కలా వున్న చరిత్రాత్మక ప్రదేశాలకు తీసుకొనిపోయి చూపిస్తుండేవాడు. బయలుదేరబొయ్యేముందు వారు చూడనున్న ప్రదేశాలకు గురించి కొంత తెలుసుకోమనేవాడు. అందువల్ల అతడు దేన్ని గురించి ప్రసంగించబోతున్నాడో వాళ్లకు ముందే తెలిసివుండేది. ఉదాహరణకు అతడు వాళ్ళను నగరానికి కొన్ని మైళ్ల దూరాన వున్న లోబ్ లెవన్‌ను తీసుకువెళ్ళినప్పుడు వాళ్ళకు సరస్సులోవున్న చిన్న ద్వీపంమీద నేడు శిథిలావస్థలో వున్న, దుర్గంలోనే ఎలిజిబెత్ రాణి ఏడవ హెన్రీ రాజుకు పెద్ద మనుమరాలిని గనుక వారసత్వం వల్ల రాజ్యం నాదని కోరిన దురదృష్ట వంతురాలు మేరీని ఖైదీ చేసిందన్న సంగతి వాళ్ళకు తెలుసు.
తరువాత చాలా సంవత్సరాలకు ఆండ్రూ, ఇక్కడా అక్కడా జనోపయోగ కృత్యాలను చేస్తున్నప్పుడు, లాడర్ టెక్నికల్ కాలేజీని కట్టించి తనకు ప్రియుడైన తన అంకుల్‌కు స్మృతిచిహ్నంగా దాన్ని దానం చేశాడు. జార్జి లాడర్ జూనియర్ ఆండ్రూలు జీవిత పర్యంతం పరస్పరమైన స్నేహానుబంధంతో వర్తించారు. అతి బాల్యదశలో వాళ్లు ఒకరిపేరు ఇంకొకరు పలకలేకపోయేవారు. ఎంతో బాగా అనగలిగితే ఆండీ జార్జిని 'డాడ్' అనీ, జార్జి కర్నెగీని కుదించి 'నైగ్' అనీ అనగలిగేవారు. తరువాతి జీవితంలో కూడా వాళ్లు ఒకరి నొకరు అలాగే పిలుచుకొన్నారు. ఆలాగే ఉత్తరాలల్లో సంతకాలు చేశారు.
వారి వయస్సు ఆరేళ్లు వున్నప్పుడు స్కాట్లండులోని ఉత్తర భాగంలో పర్యటించటానికివచ్చిన యువ విక్టోరియా రాణిని చూడటం కోసం వాళ్ళను తీసుకువెళ్ళటం జరిగింది. ఆమె ఆంగ్ల దేశీయురాలు. దాక్షిణాత్య. ఈ బాలురు దేశభక్తి పూరితులు. తమ దేశానికి దేశీయుడైన ఒక రాజు వుండాలని వీళ్ళ అభిప్రాయం. అందువల్ల ఈ స్కాబ్ బాలు రిరువురూ ఆమెను శీతలమైనవిమర్శక దృష్టితో చూశారు.
"ఆమె మీ అమ్మవలె పొడగరికా"దన్నాడు డాడ్.
"ఆమె గౌను ఏమంత అందంగా కూడాలే"దన్నాడు నైగ్. వాళ్ళ వెంట వచ్చిన తన అమ్మనుచూస్తూ.
వయసు వచ్చిన తరువాత ఇంగ్లండుయెడ అతని దృష్టి పక్వమైంది. అతడు ఉన్నతులు, బిరుదాంకితులు అయిన అనేకమంది ఆంగ్లేయులతోను, వారి కుటుంబాలతోను సన్నిహితమైత్రిని పెంపొందించుకున్నాడు. కాని అతడు బాల్యంలో సామరస్యంలేని స్కాచ్ పక్షపాతి.
డన్ఫ్‌ర్మ్‌లైన్ లోని కార్మికులు, వ్యాపారస్థులు బాగా చదువుతుండెవారు. ఆలోచనలు చేస్తుండేవారు. వర్తమాన విషయాలమీద అక్కడ మితవాదులు మొదలు అతివాదుల వరకూ అన్ని భావఛాయలున్నవారు ఉండటంచేత - చర్చలు చేస్తుండేవారు. ఈ చర్చలు ముఖ్యంగా రాజకీయమత విషయాలను గురించి సాగుతుండేవి. వాళ్ల చిన్ని పుస్తకాల షెర్ఫ్‌లలో ఉన్న పుస్తకాలను ఒకచోటికి చేర్చి చదువుదామని తృష్ణ ఉన్న ఎవరికైనా పుస్తకాలను ఎరువు ఇచ్చే అయిదుగురిలో విలియం కార్నెగీ ఒకడు. యీ కారణంవల్లనే కార్నెగీకి గ్రంథాలయాలను నెలకొల్పాలన్న ఆత్మోర్బోధ సహజంగా కలిగింది. అతడికి రాబర్టు బరన్స్ కావ్యాలమీద కేవలం స్కాచ్ వారికి మాత్రమే వుండదగ్గా, అందులో అతనికి మరీ విశిష్టమై అతనిదే అనదగ్గ శ్రద్ధాయుతమైన గౌరవం వుండేది. కార్నెగీలో ఇది జీవిత పర్యంతం ఇలాగే ఎట్టిమార్పును పొందకుండా నిలచి వుంది. యౌవనవేళ అతడు సాహిత్యంలో ద్వితీయసానాన్ని సర్ వాల్టర్ స్కాట్‌కు ఇచ్చాడు.
తండ్రికి వున్న గ్రంధపఠనాభిలాష కొన్ని వేళల్లో అతని పనికి అడ్డువస్తుండేది. అతడికి డికెన్స్ నవల లంటే గాఢమైన గౌరవం. అవి ముప్పదిరెండు పుటలలో చిన్న కరపత్రాలుగా, నెల కొక ప్రకరణంగా వస్తుండేవి. స్థానికంగా వార్తాపత్రికలను అమ్మే ఒకవ్యక్తి వాటిని పంచి ఇస్తుండేవాడు. ఇతడు "ఆండా! సుప్రభాతము! 'ది ఓల్లు క్యూరియాసిటీ షాఫ్' క్రొత్త సంచిక ఇదిగో!" అంటూ ఇంట్లో ప్రవేశించగానే లిల్లీ కార్నెగీ దాన్ని ఆతురతతో లాక్కునేవాడు. అంతటితో అతని మగ్గం ఆడటం మానేసేది. ఎంత తొందరైన నేతపని వున్నాసరే డికెన్సు అతణ్ణి అలా సమ్మోహితుణ్ణి చేసేవాడు. అయిదు...పది...పదిహేను నిమిషాలు కథను మ్రింగివేస్తున్నట్టుగా చదివి ఎలాగో యత్నంమీద త్రెంచుకుని బయటపడి మళ్ళీ ఆసుక్రోనిని అతివేగంగా ఆడించేవాడు. మళ్ళీ మగ్గం కోప తీవ్రతతో ధ్వనిస్తూ పని చేసేదిమధ్యలో అతడిభార్యపై అంతస్థులోకూచుని ఆసుక్రోనికి అందించటం కోసం నూలును కండెలకు చుడుతుండేది. లిల్లీకి మధ్యలో ఒక ఆడపిల్ల పుట్టిపోయిన తరువాత ఆండ్రా కలిగిన ఆరేండ్లకు మరొక మొగశిశువు జన్మించాడు. అందువల్ల ఆమె కొన్నివేళలలో నూలుకండె చుడుతూనే కాలితో ఉయ్యాలను ఊపుతుండేది.
ఇంటి నేత పరిశ్రమ పడిపోతున్నదని, ఆ స్థానాన్ని ఆవిరిమీద నడిచే మర మగ్గాలున్న కర్మాగారాలు ఆక్రమిస్తున్నాయని ఆండ్రా అతి బాల్యంలోనే గమనించాడు. చేనేతపనివారి ఆందోళని అతితీవ్రం కాజొచ్చింది. కొందరు జిల్లాలో మధ్యగా వేస్తున్న క్రొత్త రైలుమార్గంమీద పనిచేయటంకోసం పలుగు పార పుచ్చుకుని వెళ్లవలసివచ్చింది. కొందరు బొగ్గు గనుల్లో పనిచేయటానికి వెళ్లారు. మార్గరేట్ కార్నెగీకి సన్నిహిత కుటుంబంలోనివారు ముగ్గురు - సోదరుడు విలియం మారిసన్, ఇద్దరు సోదరీమణులు మిసెస్ థామ్సన్ హోగన్, మిసెస్ ఆండ్రూ ఐట్కిన్‌లు వారి భర్తలతో - అమెరికాదేశానికి వలసపోయినారు. లోకజ్ఞానం తక్కువయిన లిల్లీ కార్నెగీ, ఎంతగా సన్నగిల్లిపోతున్నా ఇంకా ఆశను చంపుకోలేక తన పాత వ్యాపారాన్ని, పాత దేశాన్ని అంటిపెట్టుకుని అలాగే వుండిపోయాడు. అయితే ఒకరోజున దీనవదనంతో ఇంటికి తిరిగివచ్చి తన నేతపనివాళ్ళలో ఒకడితో ఇలా అన్నాడు. "తమ్మాస్! నిన్ను పంపించి వేయవలసి వచ్చేటట్టుంది. పని చాలా తరిగిపోయింది" త్వరలోనే తన నేత పనివాళ్ళలో మరొకణ్ని, మరొకణ్నీ వరుసగా పంపించిచేయటం జరిగింది. విలియం ఒక్కడే చివరకు మిగిలాడు. మంచి విలువైనదిగా భావింపబడుతూ వచ్చిన ఇరవై పౌనుల ఖరీదుమగ్గాన్ని అమ్మవలసి వచ్చింది. కానీ దానివల్ల అతడికి లభించింది కొద్ది షిల్లింగులు మాత్రమే.
జీవిత వ్యయంకోసం మగ్గాలలో రెండోది మూడోది కూడా వెళ్ళిపోవటం తప్ప లేదు. కుటుంబం ఒక చౌక కుటీరంలోకి చేరింది. అందులోనే మిసెస్ కార్నెగీ చిన్న దుకాణం పెట్టి కూరగాయలు, పండ్లు, తీపివస్తువులు అమ్ముతుండేది. మధ్య మధ్య చి తమైన సమయాలలో సాయంతనవేళల్లో సోదరుడైన ధామస్ మో'సస్ కోసం ఆ అనురాగమూర్తి స్థిరసంకల్పంతో పాదరక్షులు కుడుతుండేది. మా'సన్ పాదరక్షల వ్యాపారి. ఇతడు కేవలం చెడిపోయిన వాటిని బాగుచేసి ఇచ్చేవాడు మాత్రమే కాడు. అనేకమంది పనివాళ్ళను పెట్టుకొని పాదరక్షలను ఉత్పత్తిచేసే పెద్ద వ్యాపారి. అప్పటికి ఇంకా పాదరక్షలను యంత్రాలమీద ఉత్పత్తి చేసే విధానం రాలేదు. ఆండ్రూ అమ్మ పక్కన కూర్చొని సూదులకు దారా లెక్కిస్తూ దారలకు మైనం రాస్తూ మధ్య మధ్య వీలు చిక్కినప్పుడల్లా కొంత కాలాన్ని చదువుకోటం కోసం వినియోగిస్తుండేవాడు. రోజల్లా అతనికి ఏదో పనివుంటుండేది. వీధికి పైగా ఒకటో రెండో ఇళ్ళ వరుసలుదాటి వెళ్లీ అక్కడ ఉన్న ఉమ్మడి బావినుంచి కడివెడు నీళ్లు తీసుకు రావటం అతని మొదటి కర్తవ్యం. అక్కడ అతడు స్త్రీలు, బాలురు, బాలికలతో వున్న ఒక వరుసలో చేరి అనేకమందిలో తనవంతు వచ్చేదాకా నిలచి వుండవలసి వచ్చేది. తరువాత ఎక్కువకాలం బళ్లొ గడపి ఇంటికి వస్తే చెప్పిన చిన్నపనులకోసం అటూ ఇటూ వెళ్ళి వచ్చేటప్పటికల్లా భోజనపు వేళ అయ్యేది.
'మాన్ వాజ్ మేడ్ టు మోరన్' అన్న బరన్స్‌కవి పద్యం కంఠస్థంచేసినందుకు మిష్టర్ మార్టిన్ అన్న గట్టిపట్టు దలగలవాడైన వృద్ధోపాధ్యాయుడు అతనికి పారితోషికంగా ఒక పెన్నీ ఇచ్చాడు. కుటుంబంలోని వాళ్లవల్ల కాకుండా బయటివాళ్ళ దగ్గర్నుంచి అతడు సంపాదించిన మొదటిపెన్నీ యిదే స్కాట్ పుర్గ్రంధాలలోనుంచి ఒకచిన్న కావ్యాన్నో లేక వచన భాగాన్నో కంఠస్థంచేయించి అంకుల్ లాడర్ అప్పుడప్పుడూ ఒకటో రెండో పెన్నీలు అతడికి ఇస్తుండేవాడు. కావ్యాలను కంఠస్థం చెయ్యడం ఆనాటి ఆచారం. కోరినపుడు వుపయోగించటానికి వీలుగా నాలుకతుదను వుత్తమకవిత్వసంపదను నిల్పుకొని జీవితాలను సంపన్నం చేసుకున్న ఆనాటి అనేకులలో ఆండ్రూ ఒకడుమాత్రమే.
నెలవాదిగా అయి, - నిశ్చయంగా తాము అమెరికా చేరటానికి యత్నించాలెనని మార్గరేట్ కార్నెగీ ఒప్పుదల చేసుకున్నది ధామస్ హోగన్లు, ఆండ్రూ ఐట్కన్లు - పిట్స్ బర్గుకు పైగా వున్న అలిఫనీ నదిమీద పిట్స్ బర్గుకు సోదర నగర (మైన అలిఘనిలొ-) ఇప్పు డిది పిట్స్‌బర్గులో ఒక భాగం ... నివసిస్తున్నారు. పెద్ద ధనికులు కాలేకపోయినప్పటికీ స్కాట్లండ్‌లో కంటే సుఖంగా అక్కడ వారి జీవితం గడచి పోతున్నది. పిట్స్ బర్గుకు పశ్చిమంగా ఎంతో దూరం కాని ఓహైయోలో ఆమె సోదరుడు మారిసన్ తన వ్యవసాయ క్షేతంలో కృషిచేస్తూ కొంత అభివృద్ధికి వస్తున్నాడు. వ్యవసాయ క్షేత్రంలో తన భర్త ఎందుకూ పనికిరాడని మిసెస్ కార్నెగీకి తెలుసు. అయితే పిట్స్‌బర్గులోగాని, అలిఘనీలో గాని తన భర్త ప్రవృత్తికి తగ్గపని ఏదైనా దొరికితీరుతుందని ఆమె ఊహించింది. అవకాశాన్ని తప్పక వినియోగించుకోవాలి అని విలియంకు ఆమె నెమ్మది నెమ్మదిగా వెంటబడి బోధించింది. అయితే మిగిలిన మగ్గాన్ని, గృహోపకరణాలను వేలములో అమ్మితే వచ్చిన మొత్తం శోచనీయమైనంతస్వల్పం, కార్నెగీల సముద్ర ప్రయాణానికి అవసరమైన మొత్తానికి ఇంకా ఎంతో తక్కువైంది. ఈనాడు మనం నమ్మలేనంత తక్కువ మొత్తంలో ఎవరైనా సరే తెరచాప పడవ లెక్కి ఆనాడే అట్లాంటిక్ సముద్రాన్ని దాటటానికి వీలున్నప్పుడు కూడా వారిని బయట పడవేయాలని మార్గరెట్‌కు జీవిత పర్యంత మిత్రురాలు ఒకతె పూనుకొని నంతవరకూ వారిస్థితి నిరాశాపూరితమై ఉంది. ఆ మిత్రురాలు మిసెస్ జాన్ హేన్డర్ సన్ - మార్గరెట్‌కు "అయ్‌లీఫార్గీ" కన్నెగా వున్నప్పుడు ఆమె పేరు ఆలిసన్ ఫెర్గుస న్ - ఈ పేరునె మార్గరెట్ చిన్నతనంలో "ఆలైఫార్గీ" అని ఉచ్ఛరించేది అయ్‌లీఆమె భర్త ఇల్లు కొనుక్కుందామని ప్రతి నెలా పదిషిల్లుంగులు, అంటే రెండున్నర డాలర్లు, తీసి విడిగా జాగ్రత్తపెడుతున్నారు. మిసెస్ హెన్డర్ సన్, ఎవరి మాటా వినకుండా చివరకు కార్నెరీలకు వినాశం తప్ప ఏమీ కలగబోదని ఊహిస్తున్న మార్గరెట్ సహోదరుడయిన థామస్ మాటనుకూడా తిరస్కరించి, తాము దాచుకున్న మొత్తం ఇరవై పౌనులూ మార్గరెట్‌కు ఇవ్వటానికి సంసిద్ధురాలైంది.
"ఓహో! అయ్‌లీ" అని తబ్బిబ్బుపడి ఆశ్చర్యాన్ని వెలిబుచ్చింది. "మరి మీ ఇల్లో!"
"అది ఆగవచ్చు. నా బాల్య మిత్రురాలికి నేను చేసే ఈ సాయం చాలా స్వల్పం" అన్నది మిసెస్ హెన్డర్ సన్. మిసెస్ కార్నెగీ కనులలో బాష్పబిందువులు క్రమ్మి వేశాయి. "మరి జాన్ ఇందుకు ఒప్పుకున్నాడా!" అని అడిగింది.
"అవును. అయితే ఇది చాలుతుందా అన్నదే మరి!"
"చాలు ననుకుంటాను. ఎలాగో ఇముడ్చుకొని గడుపుకొంటాము" అన్నది మార్గరెట్. "ఓహో! అయ్‌లీ! నీకు కృతజ్ఞతలు తెలుపుకోటానికి నాకు మాటలు రావటం లేదు. గీచి పోగుచేయగలిగి నంత తొందరలో తిరిగి ఇచ్చివేస్తామని వాగ్దానం చేస్తున్నాను"
మార్గరెట్ కార్నెగీ ప్రయాణం సన్నిహితమైనప్పుడు డన్ప్‌ర్మ్‌లైస్ దు:ఖంలో మునిగిపోయింది. ఎన్నో ఇళ్ళల్లో ఇందుకు కన్నీరు కార్చారు. ఎరిగినవా ళ్ళందరికీ ఆమె వివేకంగల సలహాదారుగను, మిత్రురాలుగను మెలగుతుండేది. ఆపద వచ్చినప్పుడు అమితమైన సాయం చెయ్యటానికి ఆమె ఎల్లవేళలా సంసిద్ధురాలై ఉండేది. అయితే అమెరికాకు వెళ్ళి పోవాలన్న విషయంలో కుటుంబంలోని ఇతర సభ్యులందరికంటే ఎక్కువ పట్టుదల ఆమెదే. ఆమె భర్త వెళ్ళిపోయినందుకు తగినంతగా చింతించాడు. తనకు అతి ప్రియుడయిన అంకుల్ లాడర్, డాడ్‌కి మరి ఇతర బంధువులకు దూరుడై నగరంనుంచి విడిపడిపోతున్నందుకు అత్యధికంగా చింతపడ్డవాడు ఆండ్రూ. నలభై సంవత్సరాలకు తరువాత అతడు ఇలా! వ్రాశాడు: "హిందువులకు వారణాసి ఎటువంటిదో, మహమ్మదీయునికి మక్కా ఎటువంటిదో, క్రైస్తవునికి జెరూ సలెం ఎటువంటిదో నాకు డన్ఫ్‌ర్మ్‌లైన్‌సర్వం అటువంటిది. అప్పుడు అమెరికాను గురించి అతడికి ఉత్సాహ భావమేమీ కలగలేదు - బ్రూస్ లేడు, వాలెస్ లేడు, బరన్స్ లేడు, పరికించి చూస్తే గర్వించి చెప్పదగ్గ వీరులు లేని దేశం. తుది రాత్రి, తుది ఉదయ భోజనం, తుదిగా వినిపించిన అబ్బీ గంటల తియ్యని చప్పుడు డన్ఫ్‌ర్మ్‌లైన్‌లోని ఆనాటి ప్రతి అంశం అతనికి హృదయవిదారక మైంది.
తన బాల్యాన్ని గడిపిన ఇంటివైపుకు వెన్ను త్రిప్పిన తారీఖును - మే 18. 1848 - అతడు ఎన్నడూ మరచిపోలేదు. అప్పుడు అతని వయస్సు పదమూడు సంవత్సరాలు. అందమయిన అతని చిన్న తమ్ముడు ధామస్ మోరిసన్ వయస్సు అయిదేండ్లు ఫోర్తు అ గంలో వున్న నౌకాశ్రయానికి వెళ్లుతున్న దారిలో పెట్టెబండి కిటికీలోంచి చెమ్మగిల్లేకన్నులతో అడ్డువచ్చిన కొండను క---గాదృష్టినిదూరంచేసిదాచివేస్తున్న డన్ఫ్‌ర్మ్‌లైన్‌లోని కొండ గుర్తులను అన్నిటినీ, తుదిగా అతిపురాతనమైన అబ్బీ శిఖరాన్ని వెనక్కితిరిగినిలబడి చూశాడు. అంకుల్ లాడర్, డాడ్, అంకుల ధామస్‌లు వారిని సముద్రతీరందాకా అనుసరించారు. రేవు చేరగానే ఆండ్రూ హఠాత్తుగా అతి వేగంతో అంకుల్ లాడర్ దగ్గిరికి వెనక్కు వెళ్ళి "అబ్బా! నిన్ను విడిచిపెట్టలేను, నిన్ను విడిచిపెట్టలేను" అని ఏడుస్తూ చేతులతో అతణ్ని చుట్టవేశాడు. ఎవరో నెమ్మదిగా అతణ్ని విడిపించి తీసుకుపోయి నావ ఎక్కించారు. స్వదేశాన్ని విడిచిపెట్టి నవ ప్రపంచంతో వారి యాత్ర ప్రారంభమైంది.