ఆండ్రూ కార్నెగీ (జీవితచరిత్ర)/వివాహం ఐశ్వర్య సువార్త

వివాహం ఐశ్వర్య సువార్త

10


కార్నెగీకి గుర్రపుస్వారీ అంటే చాలా యిష్టం. రకరకాల యువతులతో కలిసి అతడు కేంద్రారామంలో (Cen-tral Park) స్వారిచేశాడు. ఈయువతుల్లో లూయీవిట్ఫీల్డ్ ఒకతె. ఈమె న్యూయార్క్‌లో ఒక టోకు వ్యాపారస్థుని కుమార్తె. ఈమె అంటే ఆండ్రూకు ఎక్కువ మక్కువ. ఒకటి రెండు సంవత్సరాల సాహచర్యం కలిగిన తరువాత ఆమె అంటే తనకు ప్రేమ వున్నట్లు అతడు గ్రహించాడు. జీవితంలో ఈ ప్రేమభావమంటూ కలగటం అతని కిదే మొదటిసారి. ఆమెతో పూర్వానురాగ ప్రేమోదంతం ప్రశాంతంగా నడిచింది. చివరకు మిస్ విట్ఫీల్డు అతడు చేసిన వివాహ సూచనకు అంగీకరించింది. కొంతకాలం వారుఒడంబడిక సమయంగా గడిపారు.

ఈ మధ్య కాలంలో కార్నెగీ ప్రతి సంవత్సరం చేసే విదేశయాత్రల సందర్భాలలో గ్రేట్ బ్రిటనులోని అనేకులతో స్నేహసంబంధాలు, ఇతర సంబంధాలు ఏర్పరచుకొ న్నాడు. మాధ్యూ ఆర్నాల్డు, తాత్నికుడు హెర్బర్టుస్పెన్సర్, వై కౌంట్ మోర్లే, ఎరల్ ఆప్ ఎల్జిన్, సర్ విలియంవెర్నాస్, హార్ కోర్ట్, నార్డు బ్రైస్, గ్టాడ్ స్టన్, రోజ్ బరీ, బాల్పోర్, కాంబల్ బానర్ మన్ ప్రభృతులయిన ప్రధానమంత్రులు, తప్పనిసరిగా ప్రముఖులయిన పారివ్రామికులు, బ్యాంకర్లు అతని ఆప్తమిత్రవర్గంలోని వారయినవారు. అతడు ఒకమారు బ్రిటిష్ ఐరన్ అండ్ స్టీల్ ఇన్‌స్టిట్యూటుకు అధ్యక్షపదవిని నిర్వహించారు. అనేక విషయాలమీద తన అభిప్రాయాలను వెల్లడిస్తూ బ్రిటిష్ పత్రికల కెన్నిటికో వ్యాసాలు వ్రాశాడు. 1886 లో ప్రకటితమైన అతని "ట్రయం ఫేంట్ మార్చి" అన్న గ్రంథంలో అతడు పూర్వ ప్రపంచంకంటె అమెరికాకున్న ఆధిక్యాన్ని విశేషంగా పొగడినప్పటికీ అతనిమీద బ్రిటన్‌ లో జనానురాగం ఇంచుకైనా తరగ లేదు. అనేకమంది బ్రిటిష్ మంత్రులతో అతడు సంభాషించిన సమయాలల్లో అతడు రాచరికాన్ని రద్దుచేసి గణతంత్ర రాజ్య వ్యవస్థను నెలకొల్పుకోవలసిందని యెంతో తీవ్రంగా వాదించాడు. తన అతివాద భావాలను ప్రచారం చెయ్యటంకోసం అతడు యునై టెడ్ కింగ్డం లోని అనేక పత్రికలను కొన్నాడు. అతని దృష్టిలో బ్రిటిషువారు కేవలం మితవాదులు. అయినప్పటికీ అతడు ఆ బ్రిటిషువారి ప్రేమను విశేషంగా చూరగొన్న అమెరికన్ అని అనిపించుకొన్నాడు. ఇంగ్లీషు, స్కాచ్, ఐరిష్ జాతులవారు, ఒకరి తరువాత ఒకరు, అతనికి "ఫ్రీడం ఆఫ్ ది సిటీ" ఇచ్చి గౌరవించారు. ఈ సమయంలో వారు సుదీర్ఘాలైన 'స్క్రోల్సు' [ సన్మాన పత్రాలు ] ఇచ్చి అవసరమయిన తంతును అతిఘనంగా జరిపించారు. ఇతరు లందరికంటె ఇతడు ఈ జాతి గౌరవాలను విశేషంగా పొందాడు. అవి ఏబదితొమ్మిది. ఈ గౌరవాలను పొందిన వారిలో ఇతని తరువాతివాడు మిష్టర్ గ్లాడ్‌స్టన్. ఇతని కబ్బిన ఇట్టి గౌరవాలు పది హేడు మాత్రమే. ఈ అమెరికన్ ఘన వ్యాపారిని పార్ల మెంటుకు ఎన్నుకోవాలన్న వదంతి కూడా ఇంగ్లండులో బయలు దేరింది.

మిస్ లిట్ఫీడ్డ్ ఇదంతా చూసి భయపడిపోయింది. ముఖ్యంగా ఆమె భీతికి కారణం ఇతడు బ్రిటిష్ పార్లమెంటులో కూర్చోబోతున్నాడని వినటం. చివరకు ఇంత విశేషంగా విస్తృతిని పొందిన అతని జీవితానికి తాను ఉపకరించ లేదనే నమ్మకంతో ఆమె ఒడంబడికను (Engagement) భగ్నంచేసింది.

1886 లో క్రెస్సన్ పర్వత శిఖరంమీద ఉన్నప్పుడు కార్నెగీకి టైఫాయిడ్ జ్వరం పట్టుకున్నది. ఆ సమయంలో దు:ఖం అతణ్ని విశేషంగా క్రుంగ దీసింది. ఆతని తల్లి, సోదరుడు ఇరువురూ జబ్బుచేసి మరణించారు. మిసెస్ కార్నెగీ మరణానికి విశేషంగా వృద్ధాప్యం కారణం. కానీ నలభై మూడేళ్ళ వయసులోనే టామ్ చనిపోవటం ఆండ్రూకు అనుకోని ఉపద్రవం. ఈ వార్తను అతనికి తెలియజేసినప్పుడు అతడు ఇక తాను జీవిస్తేనేం మరణిస్తేనేమన్నంత నిస్పృహచెందాడు. అఖిల ప్రపంచంలో అతని కత్యంత ప్రియతములయిన ఇద్దరినీ అతడు కోల్పోయినాడు. ఆ ఇరువురూ అతనికి విలువయిన సలహాదారులు, సహాయకులు, టామ్‌కార్నెగీ సంస్థ లన్నింటికీ అధ్యక్షుడు. అతనికి కుడిభుజం. అతడు లేకుండా జీవితాన్ని ఎలా సాగించాలో అతనికి అర్థంకా లేదు.

కొంతకాలం అతడు ఎంతగానో క్రుంగిపోయాడు. క్రమంగా అతడు శారీరక మానసిక బలాలను రెంటినీ కొద్దిగా పొందుతున్నాడు. అతడికి మరొక "ప్రియతమయిన వ్యక్తి లూయీ విట్ఫీల్డ్. ఆమెను గురించి మరల మరల వచ్చే మనోభావాలను త్రోసిపుచ్చ లేకపోతున్నాడు. బహుశ: ఆమె ఇప్పుడు కొంత దు:ఖపడి వుండవచ్చు. జబ్బునుంచి, దు:ఖం నుంచి తేరుకొని లేచి కూర్చోగలిగిన వెంటనే అతడు తమ ఒప్పందాన్ని పునరుద్ధించవలసిందని కోరుతూ ఒక లేఖ వ్రాశాడు. అతనికి ప్రయాణం చేయగల పరిస్థితి చేకూరింది. అప్పుడు అతనికి వైద్యంచెయ్యటంకోసం ఆహ్వానింపబడ్డ అతి సమర్ధుడయిన న్యూయార్క్ వైద్యుడు డాక్టరు ఎప్. ఎస్ డెన్నీ అతణ్ని న్యూయార్క్‌లోని డెన్నీహోమ్‌కు తీసుకొనిపోయాడు. అక్కడ ఆ వైద్యుడు, అతని భార్య చూపిన శ్రద్ధవల్ల అతడు బాగా కోలుకోవటం జరిగింది. మిసెస్ విట్ఫీల్డు అక్కడికి వచ్చి అతని దుస్థితిని, దైన్యాన్నిచూసి, పున:పరిసీలన చేశానని ఇప్పుడు అతణ్ని వివాహమాడటానికి తన కిష్ట మేనని చెప్పింది. ఆమె అతణ్ని ప్రేమించింది కదా మరి! "ఇప్పుడు నా అవసరం నీ కున్నదని నేను భావిస్తున్నాను. ఇప్పుడు నేను నీకు నిజమైన సహాయకురాలినిగా ఉండగలను" అని ఆమె అతనితో చెప్పింది.

ఏప్రియల్, 1887 న వా రిరువురూ వివాహం చేసు కున్నారు. విగ్ట్‌ద్వీపంలో 'హనీమూన్‌' గడిపారు. అంకుల్ లాడర్, మరొక మారిసన్ కజిను అక్కడికి కొలదికాలం విహారయాత్ర కోసం వచ్చారు. అంకుల్ లాడర్ వారికోసం స్కాట్లండ్ లోని గ్రాంపియన్ కొండల్లోని గ్రాంటుల పూర్వీకుల ఇల్లయిన కిల్‌గ్రాష్టన్ కాజిల్‌ను వేసవిగృహంగా ఉపయోగించుకోటానికి అద్దెకు సంపాదించి పెట్టాడు. ఉత్తర దిక్కుగా పయనిస్తున్నప్పుడు మార్గమధ్యంలో వారు పూర్వం నగరానికి వచ్చిన గ్రంథాలయానికి కార్నెగీ శంఖుస్థాపన చేసిన ఎడింబరోలో ఆగారు. అతనికి "ప్రీడమ్ ఆఫ్ ది సిటీ" అనే గౌరవాన్ని ప్రసాదిస్తున్నప్పుడు లార్డు సాలిస్ బరీ ముఖ్య ప్రసంగం చేశాడు. ఎడింబరోనుంచి వారు డన్ఫ్‌ర్మ్‌లైన్‌కు వెళ్లారు. అక్కడ వధువు ఆ నగరాన్ని, బంధువర్గాన్ని చూసి ఆనందించింది. బంధువర్గంకూడా ఆమెను చూచి యెంతో సంతోషించారు. వాళ్ళలో చాలామంది ఆమె భర్తతో అన్నారు. "ఆండ్రూ! ఆమె నిన్ను వివాహం చేసుకొన్నందుకు నా కాశ్చర్యంగా ఉంది" అని. అందుకు అతడు "మీరు నాకంటే విశేషమైన ఆశ్చర్యాన్ని పొంది ఉండరు!" అని ప్రతిభాషణం చేశాడు.

ఈ వివాహంకంటే ఏదీ ఆనందప్రదంగా వుండదు. మిసెస్ కార్నెగీ తనకంటెకూడా ఎక్కువ స్కాబ్ అయిపోతున్నదని ఆమె భర్తే అన్నాడు. ప్రాత నగరాలు, కొండలు, సరస్సులు, పూలు అన్నీ ఆమెకు సంతోషప్రదాలైనాయి. ఆమెకు ముఖ్యంగా బాగ్‌పైప్ సంగీతమంటే ఇష్టం కలిగింది. నిద్ర మేల్కొనేటప్పటికల్లా ప్రతిదినం బాగ్‌పైప్ సంగీత జ్ఞుడు తమకు పాడుకుంటూ ఎదురురావటం, భోజనవేళల్లో ఆ వాద్య సంగీతాన్ని వినిపించటం ఎంతో ఉల్లాసకరాలుగా ఉంటాయని ఆమె సూచించింది. ఆమె కోర్కె వెంటనే తీర్చబడింది. తన శాఖకంతటికీ ప్రముఖుడయిన క్లరీమెక్ఫర్ సన్ గొప్పగా సిఫారసు చేస్తూ ఒక లేఖను వ్రాసియిచ్చి పైపరొకణ్ణి కార్నెగీల దగ్గరికి పంపించాడు. వారు కిల్గ్రాష్టన్ దుర్గంలో ప్రవేశిస్తున్నప్పుడు తన సంగీతంతో అతడు వారికి ముందు నడిచాడు.

ఆ వేసగి ఎంతో సంతోషంగా గడిచిపోయింది. గుంపులు గుంపులుగా అతిధులు వారి సౌధంలో మూగుతున్నారు. డన్ఫ్‌ర్మ్‌లైన్ బంధువర్గంకూడా వారితో చేరారు. వీరందరూ వస్తూ పోతూ ఉండటంతో కాలం గడచిపోతూండది. ఆకురాలు కాలంలో కార్నెగీలు న్యూయార్కుకు తిరిగి వచ్చేటప్పుడు వెంట పైపరునుకూడా తీసుకువచ్చారు. ఫిప్టీ ఫస్టు స్ట్రీట్ లో ఫిప్త్ ఎలెన్యూలో అతి విశాలమైనదీ, ఆడంబరం లేనిది అయిన తమ యింట్లో అతణ్ని ఒదిగించటం కొంచెం కష్టమని వారు గమనించినప్పటికీ అతణ్ని తీసుకువచ్చారు. తరువాతవచ్చిన వేసగికు మెక్ ఫర్ సన్ దగ్గరనుంచి క్లనీ కాజిల్‌ను అద్దెకు పుచ్చుకొని అక్కడికి వచ్చినప్పుడు కార్నెగీలు తిరిగి వారి దేశంలోకి వచ్చినట్లు భావించారు. ఇలా వారు పది వేసగి ఋతువులు గడిపారు.

కొన్ని సంవత్సరాలనుంచి కార్నెగీ పెద్దమొత్తాలుగా డబ్బుదానం చేస్తున్నాడు. 1887 లో గ్లాడ్‌స్టన్‌తో ఒకమాటు "ఒక మనిషి ధనికుడిగా మరణించటం అవమానకరమైన విషయ" మన్నాడు. ఇది జీవితాంతంవరకూ నిలుపుకోలేక పోయిన ప్రకటన అని అతడు గుర్తించాడు. 1889 లో అతడు నార్తు అమెరికన్ రివ్యూలో రెండు వ్యాసాలు వ్రాశాడు. వీటిలోని సారాంశమే చివరకు అతని "ఐశ్వర్య సూత్రం" (Gospel of Wealth) అన్న పేరుతో ప్రసిద్ధి కెక్కింది. అతడు ధనాన్ని బంధువులకు తన తదనంతరం వారసత్వంగా చెందేటట్లు ఇచ్చి వెయ్యవచ్చు. తన మరణానంతరం ప్రజా సంక్షేమ కార్యాలకు దానిని వినియోగించుటంకోసం విడిచిపెట్టవచ్చు. లేదా దాన్ని తన జీవితకాలంలోనే ఇచ్చి వేయవచ్చు. ఈ మూడింటిలో కార్నెగీ చివర మార్గాన్ని మిగిలిన రెంటి కంటె మంచిదిగా భావించాడు. ధనాన్ని ప్రజావారసత్వంగా విడిచిపెట్టి వెడితే దాతకుగల వాస్తవమైన ఆదర్శంగానీ, లేదా ఆకాంక్షగాని కొన్ని సందర్భాలలో సఫలం కాకపోవచ్చు, ఏమయినా అత డిలా అన్నాడు. "లోకానికి ఎక్కువ ప్రయోజనకారి కాకపూర్వమే అతడు మరణించేటంతవరకూ ఆగి వుండటానికి తృప్తివహించగలిగితే ఆస్తిని మరొకరి పరం చేయడానికి ఇది ఒక సాధన మాత్రమే ఔతుంది." ఇటువంటి ఆచారాలను నిరుత్సాహపరచటం కోసం వారసత్వాల మీద విశేషంగా పన్నులు విధించాలనీ అతడు అభిప్రాయ పడ్డాడు. "తనవెంట తీసుకుపోలేని దానిని విడిచి పోయినందుకు ఒక వ్యక్తిని స్తుతించటం అసాధనం, వ్యక్తి మరణవేళ ఎంత విడిచిపెట్టి వెళ్ళినా అది పరిగణీయమయింది కాదు. అట్టి ధనం అతడి దగ్గరనుంచి బలవంతంగా లాగుకోబడ్డది గాని దాన మివ్వబడినది కాదు" అన్నాడతడు.

నగరం కనుక 15,000 డాలర్లు ప్రతిసంవత్సరం కేటాయించి దానితో సక్రమ నిర్వహణకు ఏర్పాటు చేయిస్తామంటే తాను ఒక ప్రజాగ్రంధాలయానికి 2,50,000 డాలర్లు ఇస్తానని కార్నెగీ పూర్వం 1881 లోనే పిట్స్‌బర్గు మేయరుకు ఒక లేఖ వ్రాశాడు. నగర ప్రముఖులు కొందరు ఈ సూచనకు వ్యతిరేకించటం చాలా వింతయిన విషయం. పిట్స్‌బర్గు టైమ్స్ పుస్తకాలు, మాగజిన్లు, వార్తా పత్రికలు పెద్దఖరీదు లయ్యేవి కావు కాబట్టి గ్రంథాలయం అనవసరమని ప్రజాపార్కు అవసరమని అందువల్ల కార్నెగీ దానికి ఇస్తే బాగుంటుం దీసంపాదకీయం వ్రాసింది. అంతేకాకుండా గ్రంథాలయంకోసం పన్నులువేసి డబ్బుచేకూర్చటానికి నగరానికి అధికారంకూడా లేదని అది సూచించింది. అందువల్ల శాసనసభ గ్రంథాలయాన్ని నెలకొల్పి దానిని పాలన చేయించే విషయంలో ఒక శాసనం చేసేటంత వరకూ ఈ విషయం ఆ రేళ్ళపాటు వెనకబడ్డది. అప్పటికి ఇంకా పిట్స్‌బర్గుతో చేరిపోని అలీఘను ఈ మధ్య కాలంలో కార్నెగీని అభ్యర్థించి కల్నల్ ఆన్డర్ సన్ మెమోరియల్‌తో బాటుగ దానినికూడ పొందింది. ఆ వుత్సవ సమయంలో ప్రసంగించటానికి ప్రెసిడెంటు బెంజిమిన్ హారిసస్ వాషింగ్టన్ నుండి వచ్చాడు.

పిట్స్‌బర్గు 1887 చివరిలో ఆ దానాన్ని పుచ్చుకోటానికి సంసిద్ధమైనప్పుడు కొలది సంవత్సరాలలోనే ఆ నగరం బాగా వృద్ధి పొందనున్న దన్న అంశాన్ని గమనించి దానికి ఆ దానశీల తాను ముందు భావించిన దానికంటె పరిశోధన, సంచరణ (Circulation) గుణాలకు అవకాశాన్నిచ్చే బృహద్గ్రంధాలయము, కళాఖండ నివేశనగృహం. (Art Gallery) ఆడిటోరియింలు అవసరమని గుర్తించాడు. నగరం పాలనకోసం 40,000 డాలర్లు వ్యయంచేస్తానని వాగ్దానం చేస్తే తాను పదిలక్షలడాలర్లు ఇస్తానన్నాడు. తరువాత త్వరలోనే దానికి మరో 1,00,000 [ లక్ష ] డాలర్లు చేర్చాడు. ఆర్టు గ్యాలరీకోసం ఒక పదిలక్షల డాలర్లు యిచ్చాడు. కార్నెగీ ఇన్‌స్టిట్యూట్ పెరిగిపోయింది. ఒక షాపు శతాబ్దిలో దాని దాత దానికోసం 2,80,00,000 [ రెండుకోట్ల ఎనభై లక్షలు ] డాలర్లు వ్యయం చేశాడు.

అతని దానాలు విస్తృతిలోను, సంఖ్యలోను క్రమంగా పెరిగిపోతున్నవి. కొంతకాలంగా అతడు క్రొత్త భవనాలలో నిర్మించుకోటానికి గ్రంథాలయాలను ఇతరమయిన అవకాశాలను చేర్చుకునేటందుకు కళాశాలలకు 10,000 మొదలు 1,00,000 డాలర్లవరకూ కొన్ని సందర్భాలలో ఇంకా ఎక్కువ మొత్తాలు ఇస్తూ వచ్చాడు. అతడు నగరంలో ఇదివరకే ఉన్న గ్రంథాలయాలను పెంపొందించుకొనేటందుకు డబ్బు ఇచ్చిన సందర్భా లెన్నో వున్నాయి. ఉదాహరణకు అట్లాంటాలో యంగ్ మెన్స్ లైబ్రరీ ఎసోసిఏషన్ ముప్పది సంవత్సరాలనుంచి ఒక ప్రజా గ్రంథాలయాన్ని నెలకొల్పి నడిపించటానికి ఎంతగానో తికమక పడుతున్నది. దాన్ని పెంపొందించి మంచిస్థితిలో నిలపటం కోసం కార్నెగీ వారికి 1,25,000 డాలర్లు ఇచ్చాడు. వారి కీ పనిని పూర్తి చేయ టానికి చాలా సంవత్సరాలు పట్టింది. ఆ భవనాన్ని తిరిగి తెరచి నపుడు అల్తూనాలోని చిన్న పిల్లలు పెన్నీలు పెన్నీలుగా ఇచ్చిన ద్రవ్యంతో తయారు చేయించిన చిన్న పాలరాతి కార్నెగీ విగ్రహం, ఊర్ధ్వకాయం (Dust) కృపాళువయిన ఆ దాత జ్ఞాపక చిహ్నంగా ప్రవేశద్వారానికి వెనక ప్రక్కన ఉంచ బడింది.

అతడు న్యూయార్క్‌లోని ఇంజనీరింగ్ సంస్థలకు, ప్రతి ఒక్క స్థలం ప్రత్యేక నివేశనాన్ని ఏర్పాటుచేసుకోటానికి, గ్రంథాలయము, ఆడిటోరియం ఏర్పాట్లతోసహా, కేంద్ర మన్హట్టన్‌లో పదునైదంతస్తుల క్లబ్బ్‌ను నిర్మించే ఉద్దేశములో 1,00,000 డాలర్లు దానమిచ్చాడు.

ఎల్లవేళలా సంగీతమంటే అతనికి ఎంతో ప్రీతి కనుక సంపాదించుకో లేక కష్టపడుతున్న చర్చీలకు 'పైపు' వాద్యాలను ఇవ్వటం ప్రారంభించాడు. అతని దానాలల్లో కల్ల కోట్లజనాలకు సంతోషాన్ని కలిగించింది న్యూయార్క్ యాభైయేడవ వీథిలో ఏడవ ఎవెన్యూలో అతడు కట్టించిన సంగీత సౌధం. కొన్ని సంవత్సరాలవరకు సంగీత ప్రపంచంలో ప్రముఖులైనవారి సంగీతం అందులో వినిపించింది. దాత దానికి న్యూయార్క్ మ్యూజిక్ హాల్ అని పేరు పెట్టాడు. కానీ చిరకాలం జనం దాన్ని "కార్నెగీ హాల్‌" అని వ్యవహరించటంవల్ల తరువాత ధర్మకర్తలు అదే పేరును దానికి నిర్ణయించారు. ప్రసిద్ధుడయిన రష్యన్ వాగ్గేయకారుడు పీటర్ ట్కైకోలి స్కీని అతడు 1891 లో, దాని ప్రారంభోత్సవ సమయంలో ఏర్పాటైన సంగీత సమ్మేళనాన్ని నడిపించటానికి పిలిపించాడు. అతడు ఏర్పాటుచేసిన సంగీత సమ్మేళనంలో ఆ రష్యన్ సంగీతజ్ఞుడు కూర్చిన తౌర్యత్రికాలు [ Symphonies ] కూడా ఉన్నాయి. ట్కైకోవిస్కీ బృందాన్ని కార్నెగీ తన యింటికి విందుకు పిలిచాడు. అందులో అతడు పూర్వం సంగీత సౌధ ప్రారంభోత్సవ సమయంలో విన్పించిన సంగీతాన్ని కార్నెగీ అనుకరించి విన్పించాడు. ఇలా అతిథేయి విన్పించిన సంగీతాన్ని గురించి తరువాత త్కైకోవిస్కీ "నేనే మహానందపడేటట్లుగా, అంత ఉదాత్తముగా అసలు నేనే సంగీతాన్ని వినిపిస్తున్నట్లుంది" అనివ్రాశాడు.

ఉక్కును, ఆయుధసామగ్రులను నిర్మించేవాళ్లు స్వలాభాలకోసం యుద్ధాలను తెచ్చి పెడుతుంటారు. ఇది సత్యమయినా కాకపోయినా ఆండ్రూ కార్నెగీ యుద్ధోత్సాహి కాడు. యుద్ధాలను కల్పించేవాళ్ళలో ఒకడు అతడు ఎన్నడూ కాలేడు. అతడు కాంగ్రెస్ లోతనతో బాటు సహప్రతినిధి అయిన మిస్సోరీ సెనెటర్ హెన్డర్ సన్‌ను కలుసుకొన్నాడు. అతడు అప్పుడే షోర్ హోమ్ హోటల్ లో ప్రవేశిస్తున్నాడు. వాళ్లు మాట్లాడుతుండగా వీథిలో ఒకవంకకు చూస్తూ "అడుగో అధ్యక్షుడు. నిన్ను పిలుస్తున్నాడు" అన్నాడు.

ఆ రోజుల్లో అమెరికా అధ్యక్షులు ఒకడైనా అంగరక్షకుడు ప్రక్కన లేకుండానే తమ ఇష్టంవచ్చినచోటికి, తమ ఇష్టంవచ్చిన సమయంలో వెళ్లుతుండేవాళ్ళు. వీధిని అడ్డంగా దాటి అధ్యక్షుడి దగ్గిరకు వెళ్ళి కార్నెగీ ఆతని కరచాలనం చేశాడు.

"ఓహో! కార్నెగీ ఎప్పుడు వచ్చావు?" అన్నాడు అధ్యక్షుడు.

"ఇప్పుడే హోటల్‌లోకి రిజిష్టరు చేయించుకోటానికి వెళ్లుతున్నాను"

"నీవు ఇక్కడికి ఏం పనిమీద వచ్చినట్లు?"

"మీతో మాట్లాడటానికి"

"అయితే రా!" అని అతడి చేయిని చేతిలోకి తీసుకొని "నడుస్తూ మాట్లాడుకుందాం. మాట్లాడు" అన్నాడు అధ్యక్షుడు.

సాయంత్రం చీకటి పడబొయ్యేటంతవరకూ వాళ్ళు వీధుల్లోగుండా నడుస్తూనే మాట్లాడుకున్నారు. ఇరువురిమధ్య చర్చ యెంతో ఉల్లాసకరంగా సాగింది.

"మిష్టర్ ప్రెసిడెంట్, అ శాంతి సమావేశం దరిదాపుగా విఫలమయినట్లే. అయినప్పటికీ శాంతివహించి క్షమించటం మనకు కర్తవ్యమనుకుంటాను. మీరు లాటిన్ అమెరికన్ ప్రతినిధులతో, వారి గౌరవార్థంగా ఆ చిన్ని సైనిక సమీక్షచేసి చూపించాయేగాని ఇంత సైన్యం మన కుందని చూపించటం కాదు. పయిగా మనకు సైన్యం లేదనీ, అవసరం లేదనీ చూపించటంకోసమే అని నిష్కర్షగా చెప్పారు. ఇది మీకు జ్ఞప్తి వుందనుకుంటాను. మనది గణతంత్ర రాజ్యకుటుంబంలో జ్యేష్ఠ సోదరుడివంటిది మాత్రమే. అని వారితో చెప్పారు. యిలా చెప్పిన మీరు విభిన్న మార్గాన్ని స్వీకరించి వ్యవహరించటం చూసి నేను ఆశ్చర్యపడటమే కాదు యెంతో చింతిస్తున్నాను."

"అయితే ఇది తగాదా. కేవలం అభిప్రాయభేదం కాదు." అని అధ్యక్షుడు అభ్యంతరం చెప్పాడు. "మన పౌరులను వాళ్లు కావాలని చంపారు. గాయపరిచారు, విదేశాలలోని మన పౌరులకు రక్షణ కల్పించే విషయంలోమనకు యెంతో ప్రఖ్యాతి వుంది"

"ఆ మాటకు వస్తే ఆనావికుల్లో చాలామంది అమెరికన్లు కాదు. విదేశీయులు. ఒక చిన్న వీధి కలహాన్ని ఆధారం చేసుకొని చిలీవంటి చిన్న దేశంమీద కఠినచర్య తీసుకుందామని మీరు ఆలోచిస్తున్నట్లు విన్నందుకు నేను యెంతో చింతిస్తున్నాను"

న్యూయార్క్ పురవాసులు వ్యాపారం, డాలర్లను గురించి తప్ప మరొక విషయాన్ని దేన్నిగురించీ ఆలోచించరని అన్నాడు అధ్యక్షుడు లౌభ్యంతో. "ఇదే న్యూయార్క్ వారి రీతి. గణతంత్ర రాజ్యగౌరవంకంటే వారు తమ ధనపు సంచీలను గురించి ముందు ఆలోచిస్తారు"

"మిస్టర్ ప్రసిడెంట్ యుద్ధంవస్తే విశేష లాభాలను పొందే యునై టెడ్ స్టేట్సు వాళ్ళల్లో నే నొకణ్ని. ఉక్కును వుత్పత్తి చేసేవాళ్ళలోకల్లా పెద్ద వాణ్ణి కావటంవల్ల యుద్ధం నా జేబుల్లో కోట్లు క్రుమ్మరిస్తుంది" అని కార్నెగీ నెమ్మదిగా మనసు కెక్కేటట్లు మాట్లాడాడు. "బహుశ: ఇది నీ విషయంలో సత్యమయి వుండవచ్చు" అని అధ్యక్షుడు హారిసన్ అంగీకరించాడు.

"కానీ పోరాడుటమంటూ వస్తే నేను సరివుజ్జీనిచూచు కుంటాను"

"చిన్నదిగదా అనీ నిన్ను యేదేశమయిన అవమానిస్తే ఊరుకుంటావా?"

"నన్ను నే నవమానించుకోవలసిందే గాని ఇతరులు ఎవరూ నన్ను అవమానించ లేరు. గౌరవానికి సంబంధించిన గాయాలను ఎవరికి వారే చేసుకుంటుంటారు"

"మన నావికుల నిద్దరిని తీరంమీద ఎదుర్కొని వాళ్లు చంపివేశారు. అయితే నీ వీ చర్యను సహించగల వన్నమాట"

"మిస్టర్ ప్రసిడెంట్ త్రాగుబోతులయిన నావికుల మధ్య జరిగిన చిన్న కలహంవల్ల యునైటెడ్ స్టేట్స్ అవమానితమయిందని నేను అనుకోను. ప్రజాశాంతి భంగమయి నగరంలో కొట్లాటలు జరుగుతున్నప్పుడు నావికులను తీరం మీదికి దిగి తిరగనిచ్చినందుకు నేనయితే ఆ నావ కెప్తానును కాల్చేయిస్తాను"

వైట్ హౌస్ ద్వారందగ్గిర వాళ్ళిద్దరూ విడివిడి పోయే వేళకు చీకటి పడ్డది. "ఇవాళ రాత్రికి నే నో విందుకు వెళ్లుతున్నాను. రేపు సాయంత్రంవచ్చి నాతో భోజనం చెయ్యి. అప్పుడు నా కుటుంబం తప్ప ఇంట్లో ఎవ్వరూ వుండరు. మనం విపులంగా మాటాడుకోవచ్చు" అన్నాడు అధ్యక్షుడు. మరునాటి ఉదయం రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి బ్లెయిన్ ఆఫీసుకు వెళ్ళి కార్నెగీ అతణ్ణి పిలిచాడు. అతడు సంతోషంతో అతణ్ని ఆహ్వానించాడు.

"గడచిన రాత్రి నీవు యిక్కడ వున్నట్లు మాకు తెలియ జేయ లేదేం?" అని అడిగా డతడు. "అధ్యక్షుడు మిసెస్ బ్లెయిన్‌తో నీవు నగరంలో వున్నావని చెప్పినప్పుడు ఆమె ఎంతో చింతపడ్డది. మిష్టర్ కార్నెగీ నీవు ఎప్పు డీ నగరానికి వచ్చినా, మా గృహంలో నీకు ఒక ఖాళీ స్థానమున్నదని భావించు."

"రాత్రి మీ ఇంటి విందును పొంద లేక పోయినందుకు ఎంతో చింతిస్తున్నాను" అన్నాడు కార్నెగీ. "కానీ నిన్ను నిన్నటిరాత్రి కలుసుకోకపోవటం ఒక విధంగా నా అదృష్టం. ఇప్పుడు చూడటంవల్ల నేను అధ్యక్షుడు హారిసన్ తో చేసిన చర్చను గురించి విడిగా నీకు చెప్పడానికి అవకాశం కలిగింది"

"అవును అది అదృష్టమే" అని కార్యదర్శి అంగీకరించాడు.

"అప్పుడు మనం కలిసి వున్నట్లయితే అధ్యక్షుడు ముందుగానే మనం కలసి కూడబలుక్కున్నామని అనుకునే అవకాశముండేది."

అలా వాళ్లు పిచ్చాపాటిగా మాట్లాడుకునే సమయంలో పశ్చిమ వర్జీనియా సెనేటర్ ఎల్కిన్స్ లోపలికి వచ్చాడు. వచ్చిన ఆవ్యక్తి కార్నెగీని చూడగానే నవ్వాడు. "నేను అధ్యక్షుడి దగ్గరనుంచి ఇప్పుడే వస్తున్నాను" అని అతడు "ఆయన చీలీ విషయంలో నిన్ననీతో దీర్ఘమైన సంభాషణ చేశానని ఆవిషయాన్ని గురించి నీవు ఆయనమీద విరుచుకు పడేటందుకు వచ్చావనీ అన్నాడు. శాంతినిగురించి కార్నెగీ అతి తీవ్రంగా భావిస్తాడు అని నే న్నాను. అతడు మీతో అంతగట్టిగా మాట్లాడితే నాతో ఎలా మాట్లాడుతాడో వినాలని ఉంది, నాతో మాట్లాడినట్లుగా మీతో అతడు అంత స్వేచ్ఛగా మాట్లాడడు. మాట్లాడినప్పుడు కొంత దాచుకొన్నట్లు మాటాడివుంటా డనుకొంటాను అన్నాను. అధ్యక్షుడు "అతనిదగ్గర దాచుకోటమన్న ఆగుణం అణుమాత్రమైనా నాకేమీ కనిపించ లేదని చెప్పాడు" అన్నాడు.

ఆ తరువాత బ్లెయిన్ ఎల్కిన్స్‌లు ఇద్దరూ హృదయ పూర్వకంగా నవ్వుకున్నారు.

మరునాటి సాయంత్రం భోజనం దగ్గిర ఈ విషయం చర్చకు వచ్చింది. అయితే చర్చ ఎంతో మృదువుగా నడిచింది. అధ్యక్షుడి ఉద్రేకం కొంతగా చల్లబడుతున్నట్లు కార్నెగీ గమనించాడు. కార్యనిర్వాహకవర్గంవారు కూడా అధ్యక్షుడికి అనుకూలంగా లేనట్లు అతనికి అర్ధమైంది.

"ఈ విషయాన్ని తెచ్చినందుకు క్షమించండి మిష్టర్ ప్రసిడెంట్. మీరు బాగా అలసిపోయినట్లున్నారు. మీకు మంచి మంచి విశ్రాంతి అవసర మనిపిస్తున్నది. మీరు కొంత సెలవు తీసుకొని ఎక్కడికైనా దూరంగా కొన్నాళ్లు ఎందుకు వెళ్ళగూడదు?" అన్నాడతడు.

"పన్ను వసూలుచేసే పడవమీద కొన్నాళ్ళు ఎక్కడికైనా వెళ్లుదా మనుకుంటున్నాను. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బ్రాడ్లీ కొద్దిరోజులకు పూర్వమే మరణించాడని నీకు తెలుసుననుకుంటాను. న్యాయవృత్తిని అనుసరించే వాళ్ళల్లో అతనికి 'అనుగామి'గా ఉండదగ్గవాడు ఎవడా అని నిశ్చయించడం కోసం ఆలోచిస్తున్నాను" అన్నాడు అధ్యక్షుడు హారిసన్ సమాథానంగా.

"ఆస్థానానికి తగిన యోగ్యతగలవాడు పిట్స్‌బర్గ్‌లో ఒకడున్నాడు. అతడూ నేను పూర్వం చేపలు పట్టటంలో సహచరులం. అందువల్ల అతనిమీద నేను అనుచితమైన పక్షపాతాన్ని వహిస్తున్నానని మిత్రులయిన మీరు అనుకోకుండా వుంటే ఈ ఉద్యోగానికి అతణ్ని నేను సూచిస్తున్నాను. అయితే అతడు నాకు అతిసన్నిహితుడైన మిత్రుడు కావటంవల్ల అతణ్ణిగురించి నేను సక్రమమైన పరిశీలనచేసి ఉండకపోవచ్చు. అతడు బాగా చదువుకున్న వాడు, సత్య నిరతుడైన న్యాయవేత్త అని మాత్రం ఎరుగుదును," అన్నాడు కార్నెగీ.

"అతని పేరు?"

"జార్జి షిరాన్"

అధ్యక్షుడు తల పంకించాడు. "నీ సలహా తీసుకొని అతణ్ణి పరిశీలిస్తాను" అన్నాడు. అధ్యక్షుడు అలాగే చేశాడు. ఒక సుప్రసిద్ధు డయిన సుప్రీంకోర్టు న్యాయమూర్తిని నియమించటం ఈ రీతిగా జరిగింది. మధ్య కాలంలో బీలీ తగాదా సద్దుమణిగింది. సౌమనస్యం వల్ల అది పరిష్కారమైంది. అంతర్జాతీయ శాంతికి తానుగూడా కొంత తోడ్పడ్డానన్న తృప్తి కార్నెగీకి కలిగింది. ఇలా అతని వాషింగ్టన్ ప్రయాణం ఎంతో ప్రయోజనకారి అయింది.