ఆండ్రూ కార్నెగీ (జీవితచరిత్ర)/వార్తాహారి బాలుడు

వార్తాహారి బాలుడు

3

ఆండూ దాన్నిగురించి తరువాతి కాలంలో వెనుదిరిగి చూచుకొన్నప్పుడు ఆ రోజు అతనికి తన జీవితంలో ఒక మైలు రాయిలా, ఒక పరివర్తన బిందువుగా కనిపించింది. చీకటికొట్టులో నుంచీ, కంపుకొట్టే నూనెతొట్టి దగ్గరనుంచీ బయటపడి ఇప్పుడు అతడు మంచి వెలుగులో, తంతికార్యాలయ కలకలంలో, నగరవీధుల్లో, కర్మాగారాల్లో, గిడ్డంగుల్లో, స్వేచ్ఛతో సంచరిస్తున్నాడు. ఇంటిదగ్గర ఎప్పుడో గాని తిండి తినటం పడటం లేదు. దాన్ని గురించి కుటుంబంలో వారికి చెప్పటానికైనా అతనికి అవకాశం దొరకటం లేదు. వెంటనే వీధుల అమరికను, వాటిల్లో నడుస్తున్న వ్యాపారాలను, నగరాన్ని గురించినదంతా తెలుసుకోటానికి అతడు పూనుకున్నాడు. నగరంలోని ప్రముఖులను - వ్యాపారస్థులను, వ్యాపార కార్యనిర్వాహకులను, వృత్తి నిర్వాహకులను - అందరినీ తెలుసుకున్నాడు. అతని పరిచయస్తులలో తరువాత కాలంలో అధ్యక్షుడు లింకన్‌కు యుద్ధ కార్యదర్శి అయిన ఎడ్విన్ యం స్టాస్టన్ ఒకడు. ఆయనతో పరిచయం కలిగినందుకు అతడు ప్రత్యేకంగా గర్విస్తుండేవాడు.

తంతికార్యాలయం వారి వ్యాపారం వృద్ధిపొందుతుండుటంవల్ల మరొక కుర్రవాడు అవసరమై ఉండటాన్ని గురించి మిస్టర్ బ్రాక్స్ ఆండ్రూతో మాటాడాడు. "ఆర్యా ! నేను ఒకణ్ని, తీసుకురాగలనని చెప్పి అలిఘనీ నుంచి తన యిరుగుపొరుగు కుర్రవాడయిన డెవిడ్ మెక్కారోను తీసుకొచ్చాడు. జార్జి మెక్లయిన్ వెళ్ళిపోయినాడు. తరువాత ఆండీ బాటమ్ హూషీర్లలోనుంచి ఒకరి తరువాత ఒకరిని ముగ్గురు కుర్రవాళ్ళను - రాబర్టు పిట్కైరన్, హెన్రీ ఆలివర్, లిల్లీ మోర్లా డీ లను - తెచ్చి ఒప్ప జెప్పాడు. వారు వంతుల ప్రకారం కార్యాలయంలో వ్యాపారసమయం ప్రారంభం కాకముందే వూడ్చి బాగుచేయటానికి పెందలకడ వస్తుండేవారు. ఈష్టరనే టెలిగ్రాఫ్ కంపెనీ సూపరంటెండెంటు రైడ్ - ఇతడుకూడా డన్ఫ్‌ర్మ్‌లైన్ వాడే - పర్యవేక్షణకోసం ఫిట్స్‌బర్గ్‌కు వచ్చినప్పుడు ఈ స్కాచ్ వార్తాహారి బాలదళాన్ని చూచి ఎంతో సంతోషించి వారందరికీ ఒకేరకమైన దుస్తులు ఏర్పాటు చేయించాడు - ముదురుపచ్చ జాకెట్లు, ట్రౌజర్లు. ఈ వేషంతో వాళ్ళ నగరంలోని వీధుల్లో వెడుతున్నప్పుడు విశేషంగా జనులదృష్టిని ఆకర్షిస్తుండెవాళ్లు.

ఒక పరిమితి దాటిన తరువాత తంతివార్తలను అంద జేసినందుకు వార్తాహార బాలురకు అదనంగా పదిసెంట్లను పారితోషికంక్రింద వసూలుచేసుకునే అవకాశ మిచ్చారు. ఈ జాతి తంతివార్తలను అందజేయటంలో ఇతరులకంటె ఎక్కువవంతు తెచ్చుకొనే విషయంలో ఆ బాలురకు ఆలోచనలు చర్చలు ప్రారంభమైనవి. వాళ్ళ మైత్రికి భంగం కలగబోయేటంతగా కలతలు పెరుగుతున్నట్లు కనిపించాయి. అప్పుడు ఆండి అతనికి నైజమైన నీతి నిపుణతతో ఒకనాటి ఉదయం ఆ బాలబృందాన్ని వుద్దేశించి ఇలా అన్నాడు: "మనం ఇలా పోటీపడటం తగదు వార్తలను ఎవరు అంద జేస్తున్నా రన్నది మనం పెట్టుకోవద్దు. ఈ పదిసెంట్ల మొత్తాలను అన్నింటిని సమిష్టినిధిలో వేసి నెలాఖరుకు అందరము సమానంగా పంచుకుందాము*"

వ్యాపారంలో ఉపయోగింప బడుతున్న అర్ధంతో 'సమిష్టి' (Pool) అన్న పదంతో ఇతనికి ఇంకా పరిచయం కలగలేదు. కానీ అతడు చేసినది మాత్రం అదే. మిగిలిన బాలు రందరూ ఈ సూచన గురించి యోచించి, ఆండియే ఆ నిధికి కోశాధికారిగా వుండాలనే షరతుతో, అంకీకరించారు. దీని తరువాత దగ్గరలో ఉన్న ఒక తినిబండారాలమ్మే వాడి దగ్గర ఖాతాపెట్టి ఈ పదిసెంట్ల డబ్బులతో కొనుక్కుంటున్న కాండీ, కేకులను గురించి తప్ప మళ్ళీ ఎన్నడూ వాళ్ళమధ్య తగాదా రాలేదు. కొందరు తమకు రావలసినదానికంటే తినుబండారాలను ఎక్కువ వాడుకున్నప్పుడు ఆ వ్యాపారి నెలలోవచ్చె వారి వాటాలుపోను మిగిలిన డబ్బు చెల్లించవలసిందని కోరితే ఆండీ ఇద్దరు ముగ్గురు అతిగా వాడుకుంటున్న వాళ్ళ అదనపు అప్పుడబ్బులను గురించి బాధ్యతవహించ వలసివచ్చింది. తీపివస్తువులంటే అతిలోభాన్ని చూపించే కుర్రవాళ్ళల్లో మిక్కిలి చెడ్డవాడు బాబ్‌పిట్కైరస్. ఇతని దుబారాతనాన్ని గురించి హెచ్చరించి ఆండీ చీవాట్లు పెట్టినప్పుడు "ఇతడు నా కడుపులో జీవజ్జంతువు లున్నాయి ఆండీ! తీపివస్తువులను పెట్టి వాటిని మేపకపోతే అవి నా డొక్కలు కొరికేస్తా"యని గంభీరంగా సమాధాన మిచ్చాడు.

వీరంతా ఎటువంటి బాలదళం ! ఇందులోని రాబర్టు పిట్కైరన్ మధ్య మధ్య తన డబ్బును పెట్టుబడులలో పెట్టి, తరువాత పెన్సిల్వేనియా రైల్‌రోడ్ కంపెనీకి ఉపాధ్యక్షుడైనాడు. డేవిడ్ మెక్కార్టో రైలుమార్గాలను నిర్మించటానికి పూనుకొని ఇతరులతో తలిసి అలిఘనీ వాలీ రైల్వే నిర్మాతల్లో ఒకడయినాడు. హెన్రీ ఆలివర్ ఒక పెద్ద ఉత్పత్తి సంస్థకు ప్రముఖుడయి మిన్నసోటాలోని లోహఖనిజ ప్రాంతాన్ని వృద్ధిపొందించటంలో సహకరించి చివరకు ఒక కోటీశ్వరుడిగా మరణించాడు. విలియం మోర్‌లాండ్ ఫిట్స్‌బర్గులో ఒక ప్రముఖుడయి, ఆటార్నీ పదవిని నిర్వహించిన వాడయి, అధిక సంపన్ను డయినాడు.

వార్తావహుడుగా ఆండ్రూ కార్నెగీ ఒక సంవత్సరం పనిచేసిన తరువాత ఒకనాడు మిస్టర్ గ్లాన్ పైనుంచి ప్రజా కార్యాలయంలోకి దిగివచ్చి మిస్టర్ బ్రాక్స్‌తో "నేను ఒక పనిమీద వెళ్లుతున్నాను. యువకార్నెగీని కొన్ని క్షణాలపాటు కార్యాలయంలో ఉండమనండి" అన్నాడు. అందు వల్ల పెద్దదైన ఆ కర్తవ్య నిర్వహణకు హఠాత్తుగా పిలుపు తనకు వచ్చినందుకు ఆండి కొంతగా చకితుడయినాడు. పంపవలసిన తంతి వార్తలను అందుకుంటున్నాడు. ఆపరేటర్ గదినుంచి బయటికి వచ్చిన వాటిని అంద జేయటంకోసం వార్తాహారులకు పంచియిచ్చాడు. మిష్టర్ గ్లాస్ అప్పుడప్పుడే రాజకీయాలల్లో ప్రవేశిస్తుండటంవల్ల అతడు లేనిసమయాలల్లో కార్యాలయ వ్యవహారాలను చూడవలసిందని ఆండూలను తరువాత పదేపదే పిలవటం జరిగింది.

ఇప్పుడు బాలురకు పదకొండుం బాతికి డాలర్లు ఇస్తున్నారు. తరువాత వచ్చిన జీతపు - రోజున పుచ్చుకోవటం కోసం బాలురందరూ వరుసగా నిలబడ్డారు. ఆండీ తల్లడిల్లినట్లుగానే అందరికీ జీతం బట్వాడా చేయటం జరిగింది. భీతివల్ల అతడి తల తిరిగిపోతున్నది. అతణ్ని అవసరంలేదని పంపించి వేస్తారా ఏమిటి? అతని తప్పేమిటి? మిగిలిన పిల్ల లందరూ గది విడిచి పెట్టి వెళ్ళిన తరువాత మేనేజరు నీకు రెండుంబాతికి డాలర్లు అదనం వస్తుందని చెప్పి అతడి చేతికి పదమూడున్నర డాల ర్లిచ్చాడు.

అది ఒక శనివారం సాయంత్రం. తరువాతి కాలంలో ఆండీ ఇది బాగా గుర్తుపెట్టుకొన్నాడు. అతడు ఇంటికి రావటంలో చాలాభాగం పరుగెత్తుకుంటూ వచ్చాడు. నడిచేవాళ్ళతో బాట క్రిక్కిరిసి ఉండడంవల్ల కోరినంత వేగంగా పరుగెత్తే అవకాశం లేకపోయింది. అందువల్ల అతడు బండ్లు వెళ్ళె మార్గాన అలిఘనీ బ్రిడ్జికి అడ్డంగా పడి పరుగెత్తి ఇల్లు చేరుకున్నాడు. మధ్యలో ఒక నాటకీయమైన చిన్ని పథ కాన్ని ఆలోచించాడు. రెబెక్కా వీథిని చేరుకోగానే ఉచ్ఛ్వాసంకోసం కొంత వేగాన్ని తగ్గించాడు. ఇంట్లోకి వెళ్ళి ఎప్పుడూ ఇస్తున్న పదకొండు డాలర్ల ఇరవైయైదు సెంట్లను తల్లిచేతికి ధైర్యంగా ఇచ్చాడు. తనకోసమని అతడు ఎప్పుడూ డబ్బు ఖర్చు పెట్టక పోవటంవల్ల మిగిలిన పిల్లవాళ్లు అతణ్ని గురించి పిసినిగొట్టని అనుకుంటుండెవాళ్లు. కార్నెగీ కుటుంబసభ్యులమధ్య ఎంతటిసాన్నిహిత్యమున్నదో కుటుంబములో సంపాదించే ముగ్గురు ఇంటిలోకి వస్తు సామాగ్రిని. ఫర్నిచరు దుస్తులను కొనటానికీ, స్కాట్లాండులోని పూర్వ మిత్రురాలయిన మిసెస్ హెస్టర్ సన్ ఇచ్చిన ఇరవై పౌనుల అప్పును తీర్చివేయటానికి పెన్నీలతో సహా ఎంత జాగ్రత్తగా కూడబెట్టుతున్నారో వారికి తెలియదు.

ఆండీ తల్లి అవకాశ మున్నప్పుడల్లా ఒక వెండి అరడాలరును సంగ్రహించి ఈ నిధికి చేరుస్తుండేది. చివరకు ఇవి రెండు వందలు అయినప్పుడు ఆండీ వీటిని ఫిట్స్‌బర్గ్‌కు మోసుకుపోయి ఇరవై పౌనులకు డ్రాప్టు కొని మిసెస్ హెస్టర్ సన్ కు పంపించాడు. ఆనాడు మహానంద సమయం. కార్నెగీ కుటుంబం ఋణవిముక్తి పొందింది.

ఆనాటి రాత్రి తన రహస్యంతో ఉబ్బితబ్బిబ్బులవుతున్నా తాను తన తొమ్మిదేళ్ళ తమ్ముడు టామ్ ఇంటివెనక భాగంలోని పడక గది లోపలికి వెళ్ళేటంతవరకూ ఆండ్రూ తన అదృష్టాన్ని గురించి ఏమాత్రం చెప్ప లేదు. తన రహస్యాన్ని ఏదో నణిగినట్లు బయటపెట్టి రెండు వెండి డాలర్లను ఇరవై యైదు సెంట్లను విడి విడి జేబుల్లోనుంచి తీసి తమ్ముడికి చూపించినప్పుడు అవి ఒకదాని కొకటి తగిలి చప్పుడు కావటము కాని, వాటిని గురించి అతడు ప్రశ్న లడగటం కాని ఇష్టపడ లేదు. టామ్ ఆ సంఘటనలోని ఘనతకు అబ్బురపడ్డాడు. చివర కడిగాడు : "ఆండీ ! వీటితో నీ వేమి చెయ్య దలిచావు !"

ప్రక్క మీదికి వాలుతూ "ఎప్పటికయినా అమ్మ కే ఇస్తాను" అని సమాధానం చెప్పాడు. "మనవా ళ్ళందరికీ గొప్ప ఆశ్చర్యాన్ని కలిగించదలుచుకొన్నాను. అంతే టామ్ పైకి పోవటం ఆరంభించాను. ఎప్పుడో ఒకరోజున మన మిద్దరమూ "కార్నెగీ బ్రదర్స్" అన్న పేరుతో వ్యాపారము చేద్దాము.

"ఎటువంటి వ్యాపారం ?" టామ్ తెలుసుకోదలచుకున్నాడు.

"తప్పక చేద్దాం. నేను ఇంకా నిశ్చయం చేసుకోలేదు. కానీ మనం ధనాన్ని సంపాదించి తీరుతాం. నాన్న, అమ్మ మంచి బండి ఎక్కి తిరుగుతారు". గురక వినిపించి తాను చెప్పేది తమ్ముడు వినటం లేదని తోచేటంత వరకూ అతడు అలాగే భావ వీధుల్లో సంచరించాడు.

మరునాడు ఉదయకాల భోజన సమయంలో అతడు రెండుంబాతికి డాలర్లు బల్లమీద వుంచినప్పుడు తల్లిదండ్రులు తమ కళ్ళను తామే నమ్మలేకపోయినారు. తల్లి కన్నుల్లోసంతోషాశ్రువులు ఒక్కమారుగా పొంగి సుళ్లు తిరిగాయి. భుజంమీద చెయ్యివేసి తండ్రి "ఆండ్రూ ! నిన్ను చూచి పుస్తకాలు మాత్రమే చదివాడు. కార్నెగీ కుటుంబానికి పుస్తకాలను కొనుక్కొనేటందుకు ఖర్చుపెట్టగల అవకాశం లేదు. కల్నల్ జేమ్స్ ఆండర్ సన్ అనే ఉద్యోగాన్ని విరమించుకొన్న ఒక ఉత్పత్తిదారు నాలుగువందల సంపుటాలున్న ఒక గ్రంధాలయాన్ని చేకూర్చుకొన్నాడు. ఆదివారంనాడు ఆ కల్నలే లైబ్రేయన్‌గా పనిచేస్తున్నప్పుడు కుర్రవాడు గ్రంధ మొకటి తీసుకొని మళ్ళీ వచ్చే శనివారందాకా దాన్ని తనదగ్గిర వుంచుకోవచ్చు. సక్రమంగా అతడు దాన్ని తిరిగి ఇస్తే మళ్ళీ మరొకదాన్ని పుచ్చుకోవచ్చు. కల్నల్ పెట్టిన ఈ పధకం బాగా ప్రాకిపోయింది. అందువల్ల ఉదార స్వభావుడయిన కల్నల్ దీనికి విస్తృతం చెయ్యటానికి నిశ్చయించాడు. న్యూయార్క్‌కు వెళ్ళొ అతడు మరిన్ని పుస్తకాలు కొన్నాడు. గ్రంధసంఖ్య పద్ధెనిమిది వందలదాకా పెరిగింది. వాటితో ఆయన నగరం ఒక నివేశనాన్ని చూపిస్తే "మెకానిక్స్ అండ్ ఎప్రంటిసిస్ లైబ్రరీ" అన్న పేరుతో ఒక గ్రంథాలయాన్ని నెలకొల్పటానికి నిశ్చయించు కున్నాడు. కౌన్సిల్ వెంటనే అందుకు అంగీకరించింది. జీతమిచ్చి ఒక లైబ్రేరియన్ నియమించటంతో పని నడిచిపోతుంది.

అయితే ఈ క్రొత్తసంస్థ ఆండ్రూకు దెబ్బతగిలే ఒక నిబంధనను పెట్టింది. అది ఎల్లప్పుడు ఎ పంటిస్ లుగా వున్నవాళ్ళే ఈ గ్రంథాలయాన్ని ఉచితంగా వుపయోగించుకోవచ్చు ఇతరులు అందులో నుంచి పుస్తకాలను తీసుకొనే అవకాశమిచ్చినందుకు సంవత్సరానికి రెండు డాలర్లను చెల్లించాలన్నది. ఆండీ ఆ గ్రంథాలయానికి వెళ్లాడు. "తంతి వార్తాహారి బాలుడు డబ్బు చెల్లించకుండా పుస్తకాలను తీసుకొనే వీలు వున్నదా !" అని లైబ్రేరియన్‌ను ప్రశ్నించాడు.

"నీవు ఎపంటిస్‌గా బౌండ్ అయినావా." అనిలైబ్రేరియన్ ప్రశ్నించాడు.

"లేదు. కాని..."

"వార్తాహారి బాలురు చేతులతో పనిచేసేవాళ్లుకారు" ఇది తుది నిర్ణయంగా లైబ్రేరియన్ సమాధానం చెప్పాడు.

కాకపోవచ్చు అయితే వాళ్లు చాలా పని కాళ్ళతో చేస్తారు" ఆండీ వెంటనే ప్రతిగా సమాధానం.

"ఏమయినా రెండూ ఎన్నటికీ ఒకటి కాజాల"వని లైబ్రేరియన్ అన్నాడు. బాగా విసిగిపోయి ఆండీ ఈ విషయాన్ని జనమందరికీ తెలియజేయాలని నిశ్చయించుకొన్నాడు. బౌండు కానంతమాత్రంచేత స్టోర్స్‌లలో పనిచేసే పిల్లలను దాత వేరుగా ఊహించారని భావించేటందుకు వీలు లేదు. వీరిలో చాలామంది నిర్ణీతమయిన రెండుడాలర్ల సుంకాన్ని యిచ్చుకోలేరు. కనుక గ్రంధాలయాన్ని వినియోగించుకోటం కేవలం ఎప్రంటిస్ లకు మాత్రమే పరిమితం చేయటంలో క్రొత్త మేనేజర్లు దాత వుద్దేశాన్ని అపార్ధం చేసుకొన్నారని లోపాన్ని ఎత్తిచూపుతూ అతడు వ్రాసిన లేఖను 'ఫిట్స్‌బర్గు డిస్పాచ్‌' పత్రిక ప్రకటించింది. ఆ వుత్తరం చివర అతడు 'బౌండు కాని శ్రామిక బాలుడు' అని సంతకం చేశాడు. ఇది ముద్రణవిషయంలో అతడు చేసిన మొదటి సాహసం. ఒకమారు చవిచూశాడు గనుక తరువాత అతడు తరుచుగా పత్రికలకు వ్రాస్తుండేవాడు. లైబ్రేరియన్ వెంటనే 'దానం ఎవరికోసమయితే వుద్దేశింపబడ్డదో ఉచిత వినియోగదారుల పట్టికను వారివరకే పరిమితం చెయ్యవలసి వచ్చింది' అని పత్రికద్వారానే సమాధానమిచ్చాడు. ఊహించటానికి వీలున్నట్లే అతడు దీన్ని ఖండిస్తూ మరొక లేఖ వ్రాశాడు. అందులో అత డిలా వ్రాశాడు. "ఈ దానం ఎప్రంటిస్‌ల కొర కన్నప్పుడు శబ్ధార్థాన్ని నిష్కర్ష చేయటం జరిగిందా! వ్యాపారాన్ని నేర్చుకొంటూ బౌండు అయిన వారికి మాత్రమే వుద్దేశింప బడ్డదా లేక బౌండు అయినా కాక పోయినా శ్రామిక బాలుర కందరికీ వుద్దేశింపబడ్డదా అన్నది ప్రశ్న. ఇందులో మొదటిదే సత్యమని అంటే మేనేజర్లు ఉదారుడైన దాత ఉద్దేశాన్ని అపార్థంచేసుకొన్నారన్నమాటే - శ్రామిక బాలుడు."

ఈ లేఖ ప్రచురితమయిన తరువాత లై బ్రేరియన్ కల్నల్ ఆండర్ సన్‌తో బేటీ జేసి వుంటాడు. తరువాత మూడు రోజుల్లో డిస్పాచ్ పత్రిక సంపాదకీయపు పుటలో "బౌండు కాని శ్రామిక బాలుడు ఈ కార్యాలయానికి విచ్చేయవలసిందని ప్రార్థన" అన్న పంక్తి ఒకటి ప్రచురితమయింది.

ఆండి వెళ్లాడు. అతణ్ని లై బ్రేరియన్‌ను కలుసుకోవలసిందనీ, పై సూత్రాన్ని సడలించారనీ, అందువల్ల ఎప్రంటిస్ లు కాకపోయినప్పటికీ కార్మికబాలు రందరూ ఉచిత వినియోగదారుల పట్టికలో చేరుతారనీ చెప్పటం జరిగింది. జాతి కంతటికీ గొప్ప శ్రేయస్సును చేకూర్చిన కార్నెగీ ఉచిత ప్రజా గ్రంథాలయ భావానికి మూలభూతుడైన కల్నల్ జేమ్స్ ఆన్డన్‌సన్‌కు మనం ఎంతగానో కృతజ్ఞులమై ఉండవలసి ఉంది. కార్నెగీ తరువాత కాలంలో ఇలా వ్రాశాడు. "మానవుడు నేటివరకూ కూడబెట్టిన కోటానకోటి ద్రవ్య సంపదనంతటినీ ఇచ్చినా దానికి ప్రతిగా దేనిని ఇవ్వలేనో అటువంటి సాహిత్యాభిరుచిని నాకు కలిగించిన అతనికి" ధనవంతుడైన తరువాత కార్నెగీ అలిఘనీకి ఇచ్చిన గ్రంథాలయంలో హాలుకుముందు కల్నల్ స్మృతి చిహ్నంగా ఆతడు ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. దానిక్రింద ఉన్న రచనలో కొంతభాగం ఇలా ఉంది.

"పశ్చిమ పెన్సిల్వేనియాలో ఉచితగ్రంథాలయ స్థాపకుడైన కల్నల్ ఆండర్ సన్‌కు... ఇది వేటి మూలంగా యువకులు ఆరోహింపగలరో అట్టి అమూల్య జ్ఞాన భావనా నిధులు ఎవరికి ఆరీతిగా విస్తృతం చెయ్యబడ్డవో ఆ "కార్మిక బాలకు"లలో ఒకడైన ఆండ్రూ కార్నెగీ కృతజ్ఞతా పూర్వకంగా నెలకొల్పిన స్మృతి చిహ్నం."

తన చెలికాండ్రయిన జాన్ ఫీప్స్, టామ్ మిల్లర్, జిమ్మీ విల్సిన్, విల్లీ కౌలీలతో బాటు మిష్టర్ ఫిప్స్ పాదరక్ష నిర్మాణశాలలో గడిపేది తప్ప మిగిలిన సాయంతనాల నన్నింటిని-ఇంటిదగ్గిర ఉండే ప్రతి రెండో సాయంతనాల నన్నింటినీ-ప్లూటార్క్‌లైవ్స్ మెకాలే లాంబుల వ్యాసాలు మెక్సికో పెరూలమీద స్పైనీయులు చేసిన విజయాత్రలను గురించి ప్రెస్ కాట్ రచించిన చరిత్రలు, మిగిలిన అన్నింటికంటె అతి శ్రద్ధతో పఠించిన బాన్ క్రాఫ్ట్ కృతి హిష్టరీ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ చదవటంతో అతడు గడిపివేసేవాడు. అతడు కొన్ని సాంకేతిక గ్రంధాలను, ముఖ్యంగా లోహ నిర్మాణాన్ని (Iron Making) గురించినవి, అతిజాగరూకతతో బఠించాడు. అప్పుడు ఎవరూ గ్రహింపక పోయినప్పటికీ ఇది అతని భవిష్యత్తు కొక సూచికగా కనిపిస్తున్నది.

అంకుల జార్జి లాడర్ తోను, యువ జార్జితోను, బాల్యంలో తన ప్రీతికి పాత్రుడైన కజిన్ డాడ్ తోను అతడు ఎప్పుడూ ఉత్తర ప్రత్యుత్తరాలు నడుపుతుండేవాడు. ఆ లేఖల్లో అమెరికా సంయుక్త రాష్ట్రాలల్లోని స్వేచ్ఛా సాహసాలను గురించి అత్యుక్తులు, గర్వోక్తులు ఉంటుండేవి. ఈ లేఖలే కజిన్ డాడ్ మనస్సులో బీజాలను నాటి తరువాత కొలది సంవత్సరాలల్లో నే అతడు అమెరికాకు వలసవచ్చేటట్లు చేశాయి.

విలియం కార్నెగీ స్వెడెన్ బోర్జియన్ చర్చిలో చేరాడు. అతనిభార్య మతవిషయాలల్లో తాను దూరంగా ఉంటున్నా అతని విశ్వాసాలతో ఎట్టి ప్రమేయం పెట్టుకోలేదు. ఆండీ కొన్నిసంవత్సరాలు అక్కడి సండే స్కూలుకు వెళ్లాడు. అప్పుడు అతడు విశేషంగా స్వెడెస్ బోర్జియన్ విషయాలమీద వ్రాసిన పుస్తకాలున్న సండే స్కూల్ లోని చిన్ని గ్రంథాలయానికి లై బ్రేరియన్‌గా ఉన్నాడు. 'డ్యూడ్రాప్‌' అనే పేరుగల ఆ సండే స్కూల్ పత్రికకు అప్పు డప్పుడూ చిన్న చిన్న రచనలు చేస్తుండేవాడు. ఈ చిన్న రచనల్లో ఒకటి యుద్ద వ్యతిరేకతను నిరూపించేది అయి వుండటం ముఖ్యంగా గమనింపదగ్గ విషయం దీనిని అతడుతన పద్ధెనిమిదౌ యేట క్రిమియాలో ఇంగ్లండు రష్యామీద యుద్ధం చేస్తున్న మొదటి సంవత్సరం వ్రాశాడు. అతడు చర్చిలో పాట పాడుతుండేవాడు. సంగీతం వినటమంటే అతడికి మంచి ఆసక్తి, అయితే చర్చి సంగీతపు నాయకుడు ఒప్పుకొన్నట్టు అతడి కంఠంలో ఆశించదగ్గది ఏదో కొంత ఉంది. ఏమైనా, ఎప్పటిలాగేనే అతనికి ఈ అనుభవంవల్ల కొంత లాభం కనిపించింది. అది తరుచుగా పాడే 'బాఖ్‌కోరల్స్‌' మీద క్రొత్త అభిలాష కలగటం, మంచి సంగీతాన్ని ప్రశంసించగల శక్తి పెరగటం, మంచి సంగీతమంటే అభిరుచి ఏర్పడటం.

స్కాచ్ వారైనప్పటికీ అతని తలిదండ్రులు ఆలోచనారీతిలో ఉదారత ఉన్నవాళ్ళని చలికాలంలో ఒక శనివారంనాడు అలిఘనీనది గట్టిగానురుపుగా గడ్డకట్టినపుడు నిరూపితమైంది. ఆదివారంనాడు ఆటపాటలంటే స్కాచ్ వారు ఎంతపట్టుదల వహిస్తారో జ్ఞప్తికుండి కూడా స్కేటింగ్ అంటే అతిప్రీతిగల ఆండీ ఆనాటి సాయంత్రం కొంత అనుమానిస్తూనే తల్లిదండ్రులతో "రేపటి ఉదయం చర్చికి వెళ్ళబోయేముందు కొద్దిసేపు నేను స్కేటింగ్ చేయవచ్చునా" అన్నాడు. విశాల హృదయంగల తల్లి అన్నది. "నీ కెంతసేపు ఇష్టమైతే అంతసేపు స్కేట్ చేయవచ్చు."

"అంతసేపు నేను ఒప్పుకోను" అని ఆమె అభిప్రాయానికి తండ్రి ఒక సవరణ చేశాడు. తండ్రి "ఆండ్రా ! ఉదయం కొంతసేపు స్కేటింగు చెయ్యటంలో నాకేమీ అభ్యంతరం లేదు. కాని, నీవు నాతో కలిసి చర్చికి పోవటానికి సకాలళ్లో ఇంటికి తిరిగి వచ్చేయాలి.

అందువల్ల ఆండీ పెందలకడనే లేచాడు. గడ్డకట్టిన నదిమీద కొన్ని గొప్ప మహిమగల గంటలను గడిపాడు.