ఆండ్రూ కార్నెగీ (జీవితచరిత్ర)/పంపకం
పంపకం
13
న్యూయార్క్ ప్రజా గ్రంథాలయం డైరెక్టరు మిస్టర్ జె. యస్. బిల్లింగ్స్ మన్‌హట్టన్, బ్రాంక్స్ పేటల్లో శాఖాగ్రంథాలయాలను నెలకొల్పే విషయంలో కొంతకాలంనుంచి కార్నెగీతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతున్నాడు. 1901 లో ఒక్కొక్క దానికి 80,000 డాలర్ల ఖర్చుతో అరవై అయిదు శాఖలను యేర్పాటు చేస్తానని సద్దు లేకుండా సూచన చేశాడు. ఇతర ఖర్చులు కాక ఇందుకయ్యే మొత్తం యాబై రెండు లక్షల డాలర్లు.
"యాబైరెండు లక్షలు పెద్ద ఆర్డరు!" అన్నాడు. కార్నెగీ. కాని "ఈ భవనాలు అవసరమని తోస్తే తప్పక కట్టితీరవలసిందే" అందువల్ల నగరం తగిన నివేశన స్థలాలను వెదకటం ఆరంభించింది. డబ్బు లేకపోవటంవల్ల చాలా పర్యాయాలు ఆగటంవంటి సాధారణ ప్రతిబంధకాలు లేమీ లేకుండా డబ్బు ఇవ్వటానికి పారిశ్రామిక అల్లాడీస్ ఉండటం వల్ల పని వేగంగా జరిగింది. అయితే కావలసిన డబ్బు అంత మొత్తమే కాదు. ఇంకా మొదట అంచనాను అతిక్రమించి మరి మూడు క్రొత్త భవనాలు చేర్చబడ్డాయి. తరువాత మరొక ప్రత్యేక సంస్థ అయిన బ్రూకిలిన్ గ్రంథాలయానికి ఇరవై శాఖ లివ్వబడ్డాయి. ఈ గ్రంథాలయా లన్నింటికీ కొన్ని లక్షణా లుండాలి. ప్రతి ఒక్కదానికి రిఫరెన్స్ శాఖ, సంచారశాఖ వుండాలి. పిల్లల కక్ష్య. పత్రికల సంచికలు వుండాలి. బయటికి ప్రతి భవనం ఇది గ్రంథాలయమని ఎరుకపడే రూపంతో వుండాలి. అయితే వీటిలో ఒక్కటీ రెండో దాన్ని పోలివుండటానికి వీల్లేదు.
వీటిలో అనేక కట్టడాలలో అన్ని సౌకర్యాలు గల బేస్ మెంటు నాటక శాల లుండేవి. వీటిలో తరువాత కొన్ని సమయాలల్లో నాటక ప్రదర్శనలు జరిగేవి. తరువాత సంవత్సరాలల్లో వీటిమీద ఇంగ్లీషులోను ఇతర విషయాలల్లోను రాత్రి తరగతులు నడిచేవి. తరువాత కొన్ని సంవత్సరాలు ఒక లోకోపకారి అయిన న్యూయార్క్ నాటక ప్రదర్శకుడు జాన్ గోల్డెన్ లైబ్రరీ ధియేటర్ల పైనే పేరుపెట్టి కొన్ని నాటక సంస్థలను నడిపాడు. మంచి నటకులున్న సంఘాలకు ఉద్యోగా లిచ్చి నిలిపి ఈ లిటిల్ థియేటర్లుకు వెళ్ళి వీటిలో క్రొత్తగా బ్రాడ్వేలో ప్రదర్శించినట్టి నాటకాలను ప్రదర్శింప జేస్తుండే వాడు. ఈ నాటకాలు చూడటానికి, పరిమితమైన పట్టిలో స్థానాన్ని పొందిన, పోషకులకు ప్రవేశ రుసుం వుండేది కాదు.
1919 లో కార్నెగీ తన దాన ధర్మాలను పూర్తిగా నిలుపుదల చేసిన నాటికి 6,03,64,808 డాలర్లు ఖర్చుతో అతడు 2,811 స్వేచ్ఛా ప్రజా గ్రంథాలయ భవనాల ఏర్పా టుకి దానం చేశాడు. వీటిలో 1946, సంయుక్త రాష్ట్రాలలోను, మిగిలినవి విదేశాలలోను ఉన్నవి. ఈ గ్రంథాలవల్ల ప్రయోజనం అనేక వేల మిలియన్ల మానవులకు అవి ఇచ్చిన అపరితమయిన విజ్ఞానానందాలు.
ఈ దాతే ఇలా చెప్పాడు: "గ్రంథాలయం ముఖ్యమైన ప్రయోజనం తా నివ్వ లేనివారికి అది ఏమీ ఇవ్వదు. యువకులు తమంత తామే విజ్ఞానాన్ని సంపాదించుకోవాలి. దీనిలోనుంచి తప్పించుకో పోవటమంటూ ఏమీ లేదు. ఇంకా అత డిలా అన్నాడు: "నేను నా చిన్ననాటి అనుభవాన్ని బట్టే తమలో మంచి ఉండి దాన్ని వృద్ధిపొందించుకునే శక్తి ఆసక్తి ఉన్న బాల బాలికలకు శ్రేయాన్ని చేకూర్చే గ్రంథాలయాలను, పురపాలక సంఘాన్ని ఎలాగో అలా, సాయపడి నిలుపుకోగల ఇచ్ఛ వున్న సమాజ మధ్యంలో వాటిని స్థాపించటంకంటే డబ్బును వినియోగించుకోటానికి మంచి మార్గం లేదని నిశ్చయించాను. స్థాపించిన గౌరవాన్ని నాకు దక్కించిన ఈ గ్రంథాలయాల భవిష్యత్తు ఈ అభిప్రాయం ఎంత సత్యమైందో నిరూపించి తీరుతుంది. ఎందువల్లనంటే ప్రతి గ్రంథాలయాల్లో ఒక్క వ్యక్తి అయినా దానిని ఉపయోగించుకొని కల్నన్ ఆండర్ సన్ నాలుగు వందల మాసి పోయిన సంపుటాల గ్రంథాలయంవల్ల నేను పొందిన లాభములో సగమైనా పొంద గలిగితే వీటిని స్థాపించటం వ్యర్ధంగా నేను భావిస్తున్నాను." న్యూయార్క్‌లో ఈ గ్రంథాలయాలను నిర్మిస్తున్న దినాలల్లోనే 'వాషింగ్టన్ కార్నెగీ ఇన్ట్సిట్యూటు ప్రారంభమైంది. దానికి స్థాపనోత్సవం జరిగినది. జనవరి 28 , 1902 న "పరిశోధన, క్రొత్త విషయాలను కనుక్కోటం, మానవాభ్యుదయానికి విజ్ఞానాన్ని వినియోగించటం అన్న విషయాలను పెంపొందించటంకోసం" నిర్మాత దీనికి 2,50,00,000 (రెండు కోట్ల ఏభై లక్షల) డాలర్లు దానమిచ్చాడు. థియొడోర్ రూజ్ వెల్టు క్రింద సెక్రటరీ ఆఫ్ స్టేట్‌గా వున్న జాన్ హో దీని బోర్డుకు మొదటి అధ్యక్షుడు. వాషింగ్టన్ లోని దీని ఆర్థిక - సాంఘిక శాస్త్రము, చారిత్రక పరిశోధన, జియొఫిజికల్ డిపార్టుమెంటులే కాక, దీనికి సంబంధించిన కార్యక్రమాలు ఎన్నో చోట్ల నడుస్తుంటివి. ఆరీజోనా ఎడారిమీది బొటానికల్ లాబొ రేటరీ, ప్లోరిడో తీరానికి దూరంగా డ్రైటార్టుగస్ ద్వీపాల్లోని మెరైన్ బయొలాజికల్ లాబొరేటరీ, దాని గొప్ప టెలిస్కోపుతో కాలి ఫోర్నియాలోని మౌంట్ విల్సన్ లాబొరేటరీ, న్యూయార్క అల్బనీలోని అబ్జర్వేటరీ, సముద్రాలపై ప్రయాణం చేస్తూ పూర్వం రూపొందించబడ్డ సర్వే పటాలను సరొదిద్దుతున్న చిన్న నౌక - ఇంకా యిందులోనివి ఎన్నో వున్నవి.
తరువాత తనకు అతి ప్రియమైనది కానున్న హిరోఫండు కమీషను నెత్తుకున్నాడు. 1904 లో 50,00,000 (యాబై లక్షల) డాలర్లు ఇచ్చి దీనిని ప్రారంబించాడు. ఈ వంకకు ఆతని బుద్ధి మరలించినది పిట్సుబర్గుకు సమీపంలో ఉన్న బొగ్గు గనిలో జరిగిన విషాద సంఘటన. గనిలో ఒక ప్రేలుడు కలిగి లోపల వున్న జనమంతా సమాధి చెయ్యబడ్డారు. ఆ గనికి పూర్వపు సూపరింటెండెంటు మిష్టర్ టైలర్. ఇతడు ప్రస్తుతం మరొక వ్యాపారంలోకి వెళ్ళాడు. ఆ గనిని గురించి తనకున్న జ్ఞానం, అనుభవం ఎందుకైనా ఉపకరిస్తుందన్న ఆశతో అతివేగంగా ఆ దృశ్యం జరిగిన చోటికి వెళ్లాడు. అతడు నాయకత్వానికి పే రెన్నిక గన్న వాడు. ఆదుర్దాతో చుట్టూ మూగిన వాలంటర్లును చేర్చుకొని నాయకత్వం వహించి అతడు గనిలోనికి దారితీశాడు. వాళ్లు మృతి జెందకుండా అనేకమందిని బయటకు తీసి బ్రతికింప గలిగారు. కాని ధీరుడయిన టైలర్ మాత్రం ఆ చర్యలో తన ప్రాణాలను కోల్పోయినాడు.
మిత్రులకోసం తన ప్రాణాలను అర్పించిన ఈ వ్యక్తి కంటె ప్రేమ మరెవ్వరిలో అధికంగా వుండి వుండదు. యీ వాక్యం ఈ విషాద సంఘటన తరువాత చిర కాలం వరకూ కార్నెగీ మనస్సులో మారుమ్రోగుతుంది. గొప్ప సమయములో ఈ హిరోఫండు పుట్టింది. అతడు తరువాత ఇలా వ్రాశాడు. "నాకు దానిమీద పితృ ప్రేమ వుంది. ఎందువల్ల నంటే ఇది నాకు ఎవరూ సూచించింది కాదు. నాకు తెలిసినంతవరకూ దీన్ని గురించి ఎవరూ సూచించటం జరగ లేదు. నిశ్చయంగా ఇది నా మేధాప్రియ పుత్రిక.
ఇది యుద్ధ సమయంలోని వీరవరులకు, వీరనారీమణులకు కాకుండా శాంతి సమయంలోని వీర స్త్రీ పురుషులకు ఉద్దేశింపబడటం వల్ల దీని గుణాధిక్యాన్ని గురించి కొందరు శంకించారు. వీరోచిత కృత్యాలకు ఇది ఉద్భోధకముగా ఉండటంచేత బహుమతికోసం సాహాసచర్యలను ప్రేరేపించటం దీని ప్రయోజనమౌతుందని ఈ పధకాన్ని విమర్శించే వారు ఊహించారు. అయితే దాత మనసులోకి అటువంటి అభిప్రాయం ఎన్నడూ రాలేదు. "నిజమైన వీరు లెన్నడూ బహుమతిని గురించి ఆలోచించారు" అని కార్నెగీ అన్నాడు. వారు దివ్యోద్రేకం కలవాళ్లు. తమను గురించి కాకుండా ఎల్ల వేళలావారు ప్రమాదస్థితిలో వున్న తమవాళ్ళను గురించి ఆలోచిస్తారు.
పరిశీలకులు వెదికి తనముందుకు కొన్ని సంఘటనలు తీసుకో వచ్చినప్పుడే ఈ కమీషన్ వ్యవహరిస్తుంది. "మానవుల ప్రాణాలను రక్షించటంలో వీరోచితయత్నం చేసి దెబ్బతిన్న వాళ్ళకు తిరిగి పనిచేసుకో గలిగేటంతవరకూ ఇది ఆర్థిక సహాయమిస్తుంది. ఇటువంటి యత్నంలో మరణించినప్పుడు, ఆతని భార్యకు, బిడ్డలకు, ఇంకా అతనిమీద ఆధారపడే వాళ్ళకు - ఆమె పునర్వివాహం చేసుకుండేదాకా, పిల్లలు తమ్ము తామే పోషించుకునే వయస్సు వచ్చేదాకా జీవిత యాత్రకు వీలు కల్పిస్తుంది. వీరుడు గాయపడకపోయినప్పటికీ ఇటువంటి పారితోషికం ఇవ్వటం ఉచితమని కమీషన్ భావిస్తే అతనికి కొంత డబ్బును ఇవ్వ వచ్చు. ఆ వీర కృత్యాన్ని తెలియ జేసే రచనతో ఒక పతకాన్ని ఆ వీరుడికి గాని, అతని భార్యకుగాని, లేదా తరువాతి సన్నిహిత బంధువులకు గాని ఇవ్వవచ్చు. హీరోండ్ కమీషన్ కధ్యక్షపదవి పూర్వం కార్నెగీకి భాగస్థుడైన చార్లెస్ టైలర్ మీద పడ్డది. మనలోమాట - ఎవరి ఆత్మత్యాగం ఈనిధి నిర్మాణానికి కారణభూతమైందో ఆ వ్యక్తికి ఇతడు బంధువుకాదు. టైలర్ ఇంతకు పూర్వమే పూర్వపు ఉక్కు కర్మాగారంలోని కార్మికులకోసం ఏర్పాటు చేసిన రిలీప్ నిథిని. ఎంతో పూర్వం కార్నెగీ క్రింద పనిచేసిన పెన్సిల్వేనియా రైల్ రోడ్డు కార్మికులకోసం ఏర్పాటు చేసిన ఫండును చూస్తున్నాడు. ఎట్టి దుష్ప్రచారాలనైనా త్రోసిపుచ్చుతూ, ఏ పనికీ ఒక సెంటు ప్రతిఫలం పుచ్చుకోకుండా ఇప్పుడితడు తగిన శ్రద్ధతో, సమర్థతతో ఈ మూడు నిధుల వ్యవహారాలను చూస్తున్నాడు. ఆయనటువంటి వ్యక్తిమీద పూర్వయజమానికి అంతగాఢమైన అనురాగముండుట సహజం. లెహై విశ్వవిద్యాలయానికి భక్తిశ్రద్ధలుగల పూర్వ విద్యార్థి ఇతడు. ఆ విశ్వవిద్యాలయానికి క్రొత్త లాబారేటరీ కావలసి ఉందని చెప్పటం ప్రారంభించాడు. "ఓహో! చార్లీతోగూడా సంబంధం పెట్టుకోటానికి ఇది అవకాశం" అనుకున్నాడు, ఆ లోకోపకారి.
ట్రస్టీలు అలాబొరేటరీకి తాను పేరు పెట్టటానికి అంగీకరిస్తే దానికి కావలసిన ధనాన్ని తా నిస్తానని కార్నెగీ లెహై అధ్యక్షుడు డ్రింకరుకు లేఖ వ్రాశాడు. "తప్పక అంగీకరిస్తా" మని సమాధానం వచ్చింది. దాత దానికి "టైలర్ హాల్" అన్న పేరును ప్రత్యేకించి ఉంచాడు. తరువాత కొంతకాలానికి చార్లి తబ్బిబ్బులు పడుతూ కార్నెగీ దగ్గిరికి వచ్చాడు. "మిష్టర్ కార్నెగీ. ఈ పేరు వద్దు. ఆ భవనాన్ని నేను ఇవ్వటం లేదు. అదీకాక నేను ప్రసిద్ధి పొందిన ప్రముఖుడనుకాదు కేవలం ఈవిద్యాలయంలో విద్యార్థిని మాత్రమే. ఇంతటి గౌరవాన్ని పొందటానికి నేను చేసిందేమీ లేదు," అని అతడు అభ్యంతరం చెప్పాడు.
"ఈ భావాన్ని నాకు కల్పించినవాడివి నువ్వు" అని కార్నెగీ అడ్డుపడి అన్నాడు. నీవు నన్ను ఆ భవనానికి డబ్బు యిచ్చేదాకా నా వెంటబడి నేను సగం చచ్చేటంతగా పీడించావు. సెంటు అయినా పుచ్చుకోకుండా నాకు ప్రియమైన మూడు పథకాలకు ఆధిపత్యం వహించి నైలర్ లా (మేకులు చేసేవాడు) పనిచేస్తున్నావు. ఇంతకుమించి నేను నీకు ఏమీ చెయ్య లేదు."
"అటువంటి చిన్నపనులకు ప్రతిఫలం పుచ్చుకుండే వాణ్ణి కా"నని టైలర్ మీరు ఇటువంటి సంస్థలకు లక్షలాది ధనమిచ్చారు నేను దీనికోసం కొద్ది గంటల కాలాన్ని వినియోగించగలను. ఇది అదికాదు. ఆ భవనానికి నామరూపాలు లేని నాపేరు పెట్టటం, అన్న భావం. దానికి గాను నేను ఏమీ ఇవ్వలేదని అందరికీ తెలుస్తుంది. అప్పుడు నేను పరిహాసపాత్రుడ నౌతాను. క్రొత్తవాళ్ళెవరైనా ద్వారంమీద ఆ పేరు చూస్తే "ఈ టైలర్ వర్తమానకాలం వాడా, భూతకాలం వాడా అని అడగరా?
జేబుల్లో చేతులు పెట్టుకొని కార్నెగి వేడితగ్గి మాటలై పోయేటంతవరకూ వెనక్కువ్రాలి కుర్చీనానుకొని కూర్చు న్నాడు. అతని ప్రసంగం పూర్తి అయిన తరువాత అతని వంకకు వ్రేలునాడిస్తూ "నేను చెయ్య ననుకో, కాని నేను టైలర్ హాల్ అని పేరు పెట్టవలసిందే నని పట్టు పట్టితే అప్పుడు నీవు పరిహాసపాత్రుడివికావా? అయితే నీవు లేహై కోసం అట్టి ఆత్మత్యాగాన్ని చెయ్యటానికి అంగీకరించటానికి సిద్దపడవలసిందే! అది నీ విద్యామాతకు తోడ్పడుతున్నది. ఆ సందర్భంలో నిన్ను ఏదోగర్వం ఆవరించకపోయి నట్లయితే నీ పేరును ఎవరు ఎలా ఉపయోగించుకొన్నా నీవు పట్టించు కుండేవాడివి కావు. టైలర్ అన్న పేరులో ఏముంది యిక్కడ యిబ్బంది పెడుతున్న దల్లా నీ తాళలేని ఆత్మగర్వం. నీవు దాన్ని జయించి తీరాలి_"
"యజమానీ! ఇక ఆపండి యిలా వెర్రినిచేయటం అన్నాడు టైలర్ జేవురించిన మోముతో "విషయాన్ని పెడత్రోవ పట్టిస్తున్నారు. ఇది మీకు తెలుసు"
"సరే మంచిది. నీ వొక నిర్ణయానికి రా" చేయి ఊచుతూ అన్నాడు కార్నెగి. టైలర్ అన్న పేరును విడచి పెడతావో, లెహైని విడిచిపెడతావో నీ యిష్టం వచ్చింది చెయ్యి. కానీ టైలర్ లేకపోతే హాలు లేదు - చార్లీ ఇది నీ తుది నిర్ణయం."
టైలర్ చివరకు లొంగిపోయినట్లు చేతులెత్తాడు.
కార్నెగి ఇలా వ్రాశాడు. "తరువాత రోజుల్లో ఆ నిర్మాణాన్ని చూచి టలర్ ఎవరిని ఆశ్చర్యపడ్డారు. అతడు లెహైకి భక్తితత్పరతగల పుత్రుడని, సోదరమానవ సేవను గురించి కేవలం బోధలు చేసేవాడు కాక కార్యరూపంలో చేసి చూపించాడనీ, అతనిపై జీవించిన అత్యుత్తమ మానవుల్లో అత డొకడని నిశ్చయంచేసుకొన్నాడు."
మొదటి హిరోఫండ్ కమీషన్ యునైటెడ్ స్టేట్స్, కెనడా, న్యూఫౌండులాండులకు మాత్రమే వర్తించింది. కానీ 1908 లో కార్నెగీ గ్రేట్ బ్రిటన్, ఐర్ లండులకు హిరోఫండును నెలకొల్పాడు. గ్రేట్ బ్రిటన్ పాలకుడు కింగ్ ఎడ్వర్డు VII జర్మన్ పాలకుడు కైజర్ విల్హెల్మ్ II ఉన్నత వర్గంవారు అతణ్ని మెచ్చుకుంటూ స్వయంగా లేఖలు వ్రాశారు.
కొన్ని సంవత్సరాలపాటు, మధ్య మధ్య ఘనదానాలతో, సంవత్సరానికి ఒక నిర్మాణాన్ని ఉద్దేశించి దానాలు చేశాడు. చర్చిపీస్ యూనియన్‌కు 20,00,000 (ఇరవై లక్షలు) డాలర్లకుమించి, హోగ్‌లో పీస్ పాలెస్ నిర్మాణానికి 15,00,000 (పదిహేను లక్షల) డాలర్ లు, ఇంటర్ నేషనల్ బోరో ఆఫ్ అమెరికన్ రిపబ్లిక్స్‌కు 8,50,000 (ఎనిమిదిన్నర లక్షల) డాలర్ లు ఇతనికి ఘనదానాలు. ఇవికాక చర్చి ఆర్గన్లు, గ్రంథాలయాలు, కళాశాల భవనాలు, లాబొరేటరీలు, ప్రొఫెసర్ షిప్పులు ఎన్నో దానం చేశాడు.
కరుడుగట్టిన పూర్వవాసన విశేషంగాగల హైలాండ్ స్కాచ్ ప్రెస్పిటీయన్లు చర్చీలలో సంగీతవాద్యాలుండటం మత విశ్వాసానికి విరుద్ధమని భావించేవాళ్లు. వీరు కార్నెగి చర్చలలో ఆర్గన్లను ప్రవేశపెట్టి క్రైస్తవ పూజావిధానానికి నైతికపతనాన్ని కల్పిస్తున్నాడని గొణిగారు. 'మానవ కంఠంలో వినిపించే దే పవిత్రసంగీతం. 'క్రీస్తు వాద్య'పు ఈలలు అట్టివి కావని వా రన్నారు. దీన్ని గురించి ఎక్కువగా విన్న తరువాత కార్నెగీ స్కాట్లండుకు ఇలా వ్రాశాడు: "ఇది నన్ను చాలా బాధ పెట్టింది. ఇకముందు నేను చేయబోయే ఈ పాపానికి తోడుగా ఒక భాగస్వామి వుండాలి. ఇకనుంచి సమావేశాలను ఆర్గస్ ఖరీదులో సగ మిచ్చుకోమని కోరదలిచాను." ఇందువల్ల స్కాటిష్ పార్వ తేయుల్లో ఆర్గన్ వాద్యాల నిమ్మని కోరటం కొంత తగ్గింది.
కళాశాలలకు ఇచ్చే దానాలకు తాను గౌరవించే వాళ్ళ పేర్లుగాని, తన మిత్రుల పేర్లుగాని, స్మృతి పాత్రులైన వాళ్ళ పేర్లుగాని పెట్టటమంటే కార్నెగీకి ఇష్టం బ్రౌన్ యూనివర్సిటీలోని జాన్ హో గ్రంథాలయము, హామ్బిల్టన్ కాలేజీలో ఎలిహో పౌండేషను, వెష్టరన్ రిజర్వు యూనివర్సిటీలోని హెన్నాబైరు, వెలస్లీలోని ఫ్రాన్సిన్ క్లీన్‌లాండ్ లైబ్రరీ ఇందు కుదాహరణాలు.
ఓహెయోలోని కెన్‌యూస్ కాలేజీలో వున్న స్టాంటన్ భైర్ ఆఫ్ ఎకనమిక్స్, అధ్యక్షుడు లింకన్‌కు యుద్ధ కార్యదర్శి అయిన ఎడ్విన్ ఎం స్టాంటన్ పేర నెలకొల్పినది. ఇతడు మొదట, ముక్కోపి అని ఎక్కువమంది అభిప్రాయం: అయినా, ఉక్కు రాజు ఇతణ్ని పిట్స్‌బర్గులోని న్యాయవాదిగా జ్ఞప్తి కుంచుకున్నాడు. న్యాయవాదిగా వున్న ఆ రోజుల్లో ఇతడు ఆండ్రీ కార్నెగీ అన్న తంతి వార్తాహారి బాలుడితో ఎల్లప్పుడూ ఉల్లాసంగా మాట్లాడుతూ ఉంటుండేవాడు. అతడికి ఎక్కువ యిష్టమైన దానాలల్లో ఒకటి అతడు డన్ఫ్‌ర్మ్‌లైన్‌కు ఫార్కు, దానిలోవున్న చారిత్రాత్మక భవనాలను ఇవ్వటం అక్కడివారు పార్క్ కావాలని బహుకాలం నుంచి వ్యామోహ పడుతున్నారు. కొన్ని తరాలుగా హంట్సు లైయర్డ్, పిటిన్ కీప్‌ల యాజమాన్యం క్రింద ఉంటున్న తమ ప్రాచీన వారసత్వాన్ని - పాత్ర అబ్బీ, దాని మైదానాలు, రాజభవన శిధిలాలు - తిరిగి పొందటంకోసం తమ గ్రామస్థులు చేసిన దీర్ఘ యుద్ధాలను గురించిన కధలు, వాళ్లకు పెద్దలు చెప్పగా విన్నవి. వాళ్ళు చెప్పటంవల్ల తాను విన్నవి ఆండ్రూకు బాల్యస్మృతుల్లోని అంశాలుగా మిగిలిపోయినవి. పిట్టెన్ కీఫ్‌గ్లెన్ ఆ తగాదాకు చెందిన భూ భాగంలో చేరిందే. ఇది నగరానికి సంబంధించిన రెండు ప్రధాన వీధులచే చుట్టబడింది. అరవై యెకరాలకు మించిన అందమైన రాతి ప్రదేశం. ఇందులో చిన్న అడవి వుంది. ఆండ్రూ చిన్నవాడు ఇది అతనికి ఎంతో అందంగా కనిపించేది. అతనికి దీనితో పోల్చదగ్గది ఒక స్వర్గం మాత్రమే అని అనిపించేది. అతడు అందులో ప్రవేశించటానికి ఆటంకం వుంది. కనుక అతడు దాన్ని బయట నిలబడి మాత్రమే చూడగలిగాడు. హంట్స్‌మీద జరిగిన పోరాటానికి అతని మాతామహుడు మారిసన్ నాయకుడు ఇతని మేనమామ బైలీ తరువాత నడచిన కొర్టే యుద్ధానికి నాయకుడు. అంతే కాదు. అతడు లై యర్డు కట్టిన కంచెలు బ్రద్దలుకొట్టడానికి గుంపును కూర్చినందుకు శిక్ష అనుభవించాడు కూడాను ఆ తరువాత లై యర్డుగ్లెన్ లోపలికి ఏ మారిసన్‌ను ప్రవేశింప నీయరాదనీ ఆజ్ఞాపించాడు. ఈ మారిసన్ అన్న పేరుతో కార్నెగీకి ఒక వర్గం బంధువులుకూడా చేరుతారు అందువల్ల అంకుల్ లాడర్ డాడ్ నైగ్‌లను ఇద్దర్నీ ఒక ఆదివారం మధ్యాహ్న వేళ ఆగ్లెన్ అంచు చుట్టూ రా త్రిప్పి, దానిలోపలి భాగాన్ని చూడడానికి వీలయిన ఒక ఎత్తు ప్రదేశానికి తీసుకుపోయాడు.
కొంతకాలం డన్ఫ్‌ర్మ్‌లైన్ నివాసి, కార్నెగీ చేసిన కొన్ని ధర్మాలకు, యితరమయిన తన ఆస్తులకు అతని ప్రతినిధి - డాక్టర్ జాన్ రాస్ 1900 ప్రాంతంలో కార్నెగీలను చూడడానికివచ్చి, వారితో ఏకాంతంగా "కల్నల్ హంట్ డన్ఫ్‌ర్మ్‌లైనులోని తన ఆస్తులను అమ్మేసే సమయం వచ్చి నట్లు తెలిసింది" అన్నాడు.
"మంచిది" వాటిని నేను కొంటాను." అన్నాడు కార్నెగీ సంతోషంతో.
"అయితే, అతడు చెబుతున్న ధర చాలా ఎక్కువగా ఉన్నట్లు తోస్తున్నది" అన్నాడు రాస్.
ఇరువురు ఈ విషయాన్ని గురించి మరి కొంతసేపు చర్చించారు. పరిస్థితిని కనిపెట్టడానికి డాక్టర్ రాస్ స్కాబ్ జాగరూకతతో వ్యవహరించాలని ఇరువురు నిశ్చయించారు. ఒక సంవత్సరంకాలం కాచుకున్న తరువాత డాక్టర్ రాస్ కార్నెగీ దగ్గరకి వచ్చాడు.
అతడు "ఎడింబరులోని మిష్టర్ షాతో, (ఇతడు పూర్వం డన్ఫ్‌ర్మ్‌లైన్ వాడు) కల్నల్ హంట్ ఏజంట్లతో కదల్చమని మనం చెప్పవచ్చు ననుకొంటున్నాను" అన్నాడు.
"బాగుంది. నాకు ఇచ్చి వేయకపోవడంవల్ల తరువాత వారి యజమాని చింతపడవలసి వస్తుంది. దాన్ని కొనటానికి మరొక డెవ్వడూ అంత చులకనగా రాడు. నేను మనస్సును మార్చుకోటానికిగాని, మరణించటానికిగాని అవకాశముంది" అని వాళ్ళకు చెప్పండి అన్నాడు కార్నెగీ.
"ఆ విషయంలో ఎలా జాగ్రత్తపడాలో టాయ్‌షా బాగా ఎరిగినవాడు" అన్నాడు రాస్.
దీనితరువాత కొద్దికాలానికే కార్నెగీ న్యూయార్క్ వెళ్ళాడు.
కొన్ని వారాలు గడిచాయి. ఒకనాడు షా దగ్గర నుండి కేబిల్ వచ్చింది. "కల్నల్ హంట్ 45,000 పౌన్లకు ఒప్పుకుంటాడు. బేరం నిశ్చయించినా?"
"సరే. ఇది రాస్ పెట్టెషరతులన్నిటికీ అనుకూలంగా వుంటే అంగీకరించవచ్చు" అని సమాధాన మిచ్చాడు.
కొద్దిరోజులు గడిచాయి. మధ్యాహ్నం బాగా గడచిన తరువాత అది క్రిష్టమస్ సాయంత్రం. షా దగ్గరనుంచి మరొక కేబిల్ వచ్చింది. "హెయిల్, లైయర్డ్ ఆఫ్ పిట్టెన్ క్రీప్"
"పిట్టెన్ క్రీప్ ప్రభువుకు జయము!" ఇది ఒక కథను తెలియజేస్తుంది. "నేను యింతకంటే మంచి క్రిష్టమస్ బహుమానాన్ని పొందలేను." అన్నాడు లైయర్డ్. నేను జగత్తులోని బిరుదాలన్నిటిలోకి అత్యుత్తమమైన బిరుదునుపొందిన వాణ్ని. రాజా. అతడు కేవలం రాజుకుమాత్రమే. అతడికి మాల్కొంరాజు శిఖరం లేదు. సెయింటు మార్గరేటు ఆలయం లేదు. పిట్టెన్ క్రేస్ గ్లెన్ లేదు. అతడు ఏమీచూపలేడు నేను అతడు డన్ఫ్‌ర్మ్‌లైన్‌కు యాత్రకు వస్తే నేను దిగివచ్చి ఉదాత్తదోరణిలో అతడికి ఇవన్నీ చూపెడతాను. ఇది నాకెంతో ఆనందప్రదమైంది.
ట్రస్టీలలో రాస్ ప్రథముడు కావటం తప్ప దు కదా! వారికి వ్రాసియిచ్చిన పత్రంలో కార్నెగి తన వుద్దేశాన్ని ఇలా వెల్లడించాడు. "డన్ఫ్‌ర్మ్‌లైన్‌లో కష్టపడే శ్రామికజనుల విసుగుదలతో గూడిన జీవితానికి కొంత తీయదనాన్ని కొంత వెలుగును ఇవ్వటానికి ముఖ్యంగా యువకులకు ఇతర చోట్ల వసించేవారు పొందలేని కొంత తేజం, కొంత ఆనందం, కొంత ఉన్నతిని చేకూర్చేటందుకు, నా జన్మ స్థానంలో బిడ్డ తదనంతర కాలంలో తదనంతర జీవితంలో వెనుకకు చూచుకొని, ఇంటి దగ్గరనుంచీ ఎంత దూరం తిరిగినప్పటికీ కేవలం తాను అక్కడ ఉండటమే సుగుణంవల్ల జీవితాన్ని ఆనందప్రదంగాను ఉత్తమంగాను చేసుకొనేటట్లు కల్పింపబడ్డ దని భావించుకోటం కోసం" అనివ్రాశాడు.
ఆస్తిని పెంచి దాని నిత్య పాలన కోసం ఒక ఫండును ఏర్పాటు చేసేటందుకుగాను 25,00,000 (ఇరవయ్యైదులక్షల) డాలర్లు ఇచ్చి అతడు ట్రస్టీలను ఆశ్చర్యచకితులను చేశాడు. అతడు మరికొంత ఇచ్చిన తర్వాత ఆమొత్తం 37,50,000 (ముప్ఫయ్యేడు లక్షల యేభై వేల) డాలర్లు అయింది. ప్రజల ఆస్తి ఏదీ ఇంత జాగరూకతతో పాలింప బడ లేదు. ప్రజలకు ఏదీ ఇంత ప్రీతిపాత్రము కాలేదు.
విశ్వవిద్యాలయ ట్రస్టీగా ఉండటంచేత కార్నెగీ అక్కడ చదువు చెప్పేవారికి చాల తక్కువ జీతాలు ఇస్తున్నట్లు గమనించాడు. అతడు ఆతురతతో "ఇది అత్యుత్తమ వృత్తిగా పరిగణింపబడవలసింది అయినా అన్ని వృత్తులలోకి ఉపాద్యాయ వృత్తికి చాలా అన్యాయంగా, అవుట, నీచంగా ప్రతిఫలం ముడుతూంది. యువకులకు విద్య చెప్పటం కోసం జీవితాన్ని అంకితం చేసిన విద్యావంతులు మరీ అల్పభృతులను తీసుకొంటున్నారు. అందువల్ల అతడు ఏప్రియల్ 16, 1905 న విద్యాబోధనాభివృద్ధి కోసం అయిదు శాతంబాండ్లు రూపాన కోటి డాలర్లతో యునై టెడ్ స్టేట్స్ కెనడాల్లో వున్నతవిద్యకు దోహదమివ్వదలచి, విశ్వవిద్యాలయ కళాశాలలోపాథ్యాయులకు పింఛనుకు యేర్పాటుచేసి వారి విథనలకు పెన్షల్ల ఏర్పాటుతో కార్నెగి పౌండేషన్ ఏర్పాటు చేశాడు.
దాని ధర్మకర్తృత్వ సంఘంలో ఇరవై అయిదుమంది విశ్వవిద్యాలయాధ్యక్షులు, కళాశాలాధ్యక్షులు వున్నారు. వీరిలో చాలామంది అతనికి పూర్వమే మిత్రులైనవారు ఈ నిర్మాణసందర్భంలో వీరు కార్నెగీ గృహంలో సమావేశమై నప్పుడు వీరికి కలిగిన భావాల్లో ఒకదానిని తాను మెచ్చుకొని కార్నెగీ తాను ఎంతో ప్రీతిని వహించే మిత్రుల పట్టికలో వారిని చేర్చటం జరుగుతుండేది. కార్నెగీ మిత్రుల పట్టికకు ఎప్పుడూ అంతు అనేది లేదు.
రెండు సంవత్సరాలైన తరువాత మరికొంత మొత్తం 50,00,000 (యాబై లక్షల) డాలర్లు, తరువాత మరొకమారు 12,50,000 (పన్నెండు లక్షల యాబైవేల) డాలర్లు కార్నెగీ ఆ ఫౌండేషనుకు చేర్చాడు. 1918 లో కార్నెగీ కార్పొరేషను దానికి 1,20,00,000 (ఒక కోటి ఇరవై లక్షల) డాలర్లు విరాళమిచ్చింది. మొదటి పాతిక సంవత్సరాలల్లో ఇది పదకొండు వందలమంది ఉపాధ్యాయులకు వారి విధవలకు ఎలవెన్స్, పెన్షన్ల రూపంలో 2,00,00,000 (రెండు కోట్ల) డాలర్లు వినియోగించింది. కార్నెగీ ఫౌండేషను, జాన్ డి. రాక్ ఫెల్లర్ జనరల్ ఎడ్యుకేషన్ బోర్డు అన్న సంస్థలు ఒకటి చేస్తున్న పనినే మరి రెండవది చేస్తున్నట్లు కన్పించినప్పుడు మిష్టర్ రాక్ ఫెల్లర్ "మీరు మా బోర్డులో యెందుకు సభ్యులుగా చేరకూడదు. అప్పుడు రెంటిలో ఏమిజరుగుతుందో మీకు తెలుస్తుంది. దానివల్ల చేసిన పనిని తిరిగి చెయ్యటమనే దాన్ని నిలిపి వెయ్య వచ్చు" అని కార్నెగీతో అన్నాడు. కార్నెగీ ఉభయ నిధులకు ఉపయోగించేటందుకు గాను రాక్ ఫెల్లర్ జనరల్ ఎడ్యుకేషన్ బోర్డులో సభ్యుడైనాడు.
ప్రసిద్ధ సంపాదకుడు, విమర్శకుడు, అతనికి సన్నిహిత మిత్రుడు అయిన రిచ్చర్డు వాట్సిన్ గిల్డర్ ఒకమారు కార్నెగీ గురించి ఇలా వ్రాశాడు: "ఎ. సి. అనంతమైన సామర్థ్యం, అద్భుతమయిన భావనాబలం గలవాడు. అతని భావాలన్నీ అతి విశాలములైనవి. అంతేకాదు, భవిష్యదర్థ సూచకములు. నేను ఇచ్చే అభిప్రాయం పొరబాటైంది కాకపోతే అతడికి కళంకరహితమయిన నైతికశీల మున్నది. అతడు పరిపూర్ణుడు కాకపోవచ్చును. కానీ అతడు మన అభిలాషను చూరగొన్న గలవాడు. విశిష్టత గలవాడు. సత్యమైన ప్రజాస్వామిక పౌరుడు. అతని లోకోపకారకృత్యాలన్నిటికీ మూలం ఉత్తమ సిద్ధాంతాలు, శీలము, అన్న గుణాలు రెంటిలో కన్పిస్తుంది. అతడే మరొక సందర్భంలో వ్రాస్తూ "ఎ. సి. నిజంగా ఒక మహావ్యక్తి, రసాత్ముడు, పట్టుదల గలవాడు, దయాళువు. అనేక విషయాల మీద బుద్ధిని ప్రసరింప చేసేవాడు. కొన్ని సందర్భాలల్లో ఇతడు తన అభిప్రాయాన్ని రుద్దటానికి యత్నిస్తుంటాడు. ఆ సమయాలల్లో ఇతడు దరిదాపు క్రూరుడుగా వర్తిస్తుంటాడు. మల్లా కోమలహృదయం లేకపో లేదు. నిండు ప్రేమ గలవాడు ఉద్వేగి నిరంతర భావుకుడు. అసాధరణ విశాల దృక్పధం, అభిప్రాయాలూ గలవాడితడు. జీవిత చరిత్ర వ్రాయదగ్గవాడు. 'నీకు నీవే బాస్వెలువు కమ్మ'ని (జీవిత కథాకారుడు) నేను ప్రబోధిస్తున్నాను అతడిలోఅన్నివిషయాలల్లోను పరస్పర వ్యతిరేకత గోచరిస్తుంది. అయితే ఇది మహోన్నత విషయాలమీది అత్యంత ప్రీతివల్ల కలుగుతున్నది. మానవ సౌభ్రాత్రం, వివిధ జాతుల మధ్య శాంతి మత విషయకమైన పవిత్రత..." కార్నెగీ పరస్పర విరుద్ధ ధోరణిలో ప్రవర్తించి వుండవచ్చు. అయితే, అతడెల్లప్పుడు తన ఆత్మవిశ్వాసాలకు సన్నిహితుడయి జీవించాడు. అయినా తన అభిప్రాయాల విషయంలో ఎన్నడూ మొండిపట్టు కలవాడు కాడు. అతడిచ్చిన దానాల నన్నిటినీ దానోద్దేశాలను వెల్లడించిన తరువాత మిగిలిన పాలనావ్యవహారాల నన్నింటినీ పాలక వర్గంవారి నిర్నయాలకు విడిచిపెట్టేవాడు. అవి ఆచరణయోగ్యాలు కావని, ఎవరి అభిప్రాయాలకు అతడు విలువ యిస్తాడో వాళ్లు నిర్నయించినప్పుడు తనకు ప్రియమయిన పధకాలను ఎన్నింటినో అతడు వదులుకున్నాడు. కాన్ఫెడరేట్ బాండ్లు ఇందుకు వుదాహరణం. 1880 లో అంతర్యుద్ధపు చివరదశలో, ఓడిపోయిన అమెరికా కాన్ఫెడురేటెడ్ రాష్ట్రాలవారు ధనవిషయకంగా, ఆర్థికంగా, సంపూర్ణ వినాశనాన్ని పొందినపుడు వారు గవర్నమెంటు బాండ్లను ఇందులో ఎక్కువభాగం డబ్బు యూరప్‌ది - పరిత్యజించే విషయంలో నిర్భంధితులైనారు. దక్షిణరాష్ట్రాలను తరువాత తిరిగి సమాఖ్యలో ప్రవేశపెట్టిన తరువాత కార్నెగీ యూరప్‌లో సద్భావాన్ని కలిగిద్దామనే వుద్దేశంతో వాటికి చెల్లించి వేద్దా మన్నాడు. కాని రాజనీతిజ్ఞులు, ధనిక వర్గంవారు, న్యాయనిపుణులు అది చాలాకష్టమని దానివల్ల - సద్భావం కలగటంకంటే, కలత వృద్ధిపొందుతుందని దాన్ని నిర్వర్తించట మేమీ అసాధ్యకృత్యం కాకపోయినా అతికష్టమైన పని అని చెప్పినప్పుడు ఆ బాండ్లు విషయం కార్నెగీ తనకు ఇష్టంలేకపోయినా వదులుకున్నాడు. 1906 లో కొద్దికాలం గడిచిన తరువాత సెయింట్ ఆండ్రూస్‌కు కార్నెగీని మూడోమారు డైరెక్టరుగా ఎన్నుకున్నారు. ఆ వేసవిలో జరిగిన ప్రిన్సిపాల్స్ వారోత్సవాలల్లో మిస్ అగ్నిస్ ఇర్విక్ కార్నెగీల యింట్లో అమెరికన్ అతిథిగా వుంది. ఈమె రాడ్‌క్లిప్ కాలేజీకి డీన్ బెంజిమిన్ ప్రాన్‌క్లిన్‌కు మునిమనుమరాలు. సెయింట్ ఆండ్రూస్ ప్రిన్సిపాల్ డొనాల్డ్ సన్, అతడేకాదు మిగిలిన అతిధులందరూ, స్కి బోకు అతిథిగా వచ్చన ఈమెవల్ల ప్రభావితులైనారు. ఈమెరాక కెంతో సంతోషించారు. ఇందుకు కారణం సెయింట్ ఆండ్రూస్ 1759 లో బెంజిమిన్ ప్రార్స్‌క్లిన్‌కు అతని మొదటి గౌరవపట్టాన్ని ఇవ్వటం జరిగింది.
ఆ సంవత్సరమే ఫిలడల్పియాలో ప్రాన్‌క్లిన్ ద్విశత వార్సోత్సవం జరుగుతుంటే నూటనలభే యేడు సంవత్సరాలకు పూర్వం ఆమె ముత్తాతకు ఇచ్చిన గౌరవపట్టాన్ని మిస్ ఇర్విన్‌కు పంపించింది. ఆ విశ్వవిద్యాలయం తమరెక్టర్ పదవిని అనుభవిస్తున్న ఆండ్రూ కార్నెగీని ఆమె కా ఉత్సవ సందర్భంలో పరిచయంచేసి ఆమె భుజాలమీద ఆ హుడ్‌ను వుంచవలసిందిగా కోరారు.
ఇప్పుడు ఎ. సి. వింతైన సమయాలల్లో తన ఆత్మకథకు సంబంధించిన ప్రకరణాంతర్భాగాలను, ప్రకరణాలను వ్రాసుకుంటున్నాడు. ఈ సమయాలల్లో అతడు ఎవరిని గురించి తాను వ్రాయటం జరుగుతున్నదో అట్టి తన ప్రియమయిన మిత్రులు, బంధువులు, ఇతరు లనేకులు మృతినొందిన అంశాలని చింతతో స్మృతికి తెచ్చుకొన్నాడు. అతడు ఒక పర్యాయం ఇలా అన్నాడు: "నే నిప్పుడు ఏ ఉక్కు కర్మాగారాన్ని చూసి భరించలేకపోతున్నాను. అక్కడికి వెళ్ళితే నాకు నాకంటె ముందు వెళ్ళిపోయిన వ్యక్తు లెందరో జ్ఞప్తికి వస్తారు."
అందుచేత వెనుకటివలె ప్రగాఢప్రేమతో నాహస్తాన్ని బంధించగల నా తొలినాటి మిత్రులు కొద్దిమంది మాత్రమే నాకు అక్కడ మిగిలి లభిస్తారు. 'ఆండీ' అని నన్ను పిలిచేవృద్ధులు ఒకరో ఇద్దరో మాత్రమే అక్కడ వుంటారు.'