అహల్యాసంక్రందనము/ప్రథమాశ్వాసము
శ్రీరస్తు.
అహల్యాసంక్రందనము
ప్రథమాశ్వాసము
. శ్రీ సొబగొందు నిందుసర
సీసరసీరుహకేసరద్యుతిన్
వీసరవోక మీసరపు
నిగ్గుల జగ్గుల దుప్పటిన్ దటి
ద్భాసితనీలమేఘ మన
భాసిలు రంగనివాసుఁ గౌస్తుభో
ల్లాసు రమాధివాసు సవి
లాసమతిన్ నిరతిన్ నుతించెదన్.
ఉ. రంగమహీశుకొమ్మ జిగిరంగులబంగరుబొమ్మ సంపదల్
పొంగుచు నిచ్చు గుమ్మ పతిఱొ మ్మెడబాయని ముద్దుగుమ్మ య
య్యంగజుఁ గన్నయమ్మ శరణార్థికి వేలుపు మ్రానికొమ్మ నె
మ్మిం గరుణించి యిచ్చు నెలమిన్ గలిమిన్ బలిమిన్ దిరంబుగన్.2
ఉ. బంగరుగట్టు సింగిణియుఁ బంకజలోచన దివ్యబాణమున్
రంగుగఁ దాల్చి వ్రేల్మిడిఁ బురంబులు ద్రుంచి జగంబుఁ బ్రోచు ప్రాక్
జంగము క్షీరవారిధి నిషంగము భక్తజనావనక్రియా
చంగముఁ గీర్తిరంగ మల సౌందరలింగము నాశ్రయించెదన్.3
చ. కరమునఁ జిల్కఁ బల్కఁ జిగికమ్మలు చెక్కులఁ గుల్కఁ గన్నులన్
వరకృప చిల్క మోవిఁ జిఱునవ్వుల వెన్నెల దొల్క ధాత్రికిన్
వర మొసఁగన్ గదంబవనవాటిఁ జెలంగెడిమేటి సుందరే
శ్వరుని వధూటిఁ గొల్తుఁ గృతబంధవిమోచనఁ బద్మలోచనన్.4
ఉ. అంబ జగత్త్రయంబును దయం బరిపాలనచేయు సద్గుణా
లంబ సహాసకోమల కళాలలితాననచంద్రబింబ హే
రంబుని గన్నయంబ సురరత్నసమాధరబింబ మాకు ని
త్యం బఖిలాండనాయిక జయం బనయంబు నొసంగుఁ గావుతన్.5
ఉ. ప్రాంచితవేదనాదము సమంచితమున్ నలుమోములన్ మరుత్
ప్రాంచిత కాంచనాచల గుహాంచలతన్ రహిమించ నీరుఁబాల్
పంచు గురాని వేడ్క మిగులన్ నడిపించు విరించి నెంచి భా
వించి నమస్కరించెద సమీహితసాహితి సేకరించఁగన్.6
ఉ. సౌరతరంగిణీ కనకసారసరాజమరాళి కైవడిన్
హారి హిరణ్యగర్భ వదనాంతరసీమ వసించువాణి శృం
గార సరోజపాణి నవకంధర వేణి విలాసధోరణిన్
వారక నిచ్చ నిచ్చలు నివాసముచేయు మదీయజిహ్వికన్.7
చ. కుడుములు చాల మెక్కి కలుగుంబలులాయపుఁదేజి నెక్కి ప్రా
నుడువుల వన్నె కెక్కి మహి నూల్కొను విఘ్నములెల్లఁ జెక్కి య
య్యుడుపతి మౌళిపాదముల కున్నతభక్తిని మ్రొక్కి భక్తులన్
విడువక ప్రోచు భవ్యమతి విఘ్నపతిన్ సుమతిన్ భజించెదన్.8
సీ. రామకథా సుధారసములు వెదచల్లు
సర్వజ్ఞు వాల్మీకి సన్నుతించి
బహువేదశాఖలఁ బల్లవింపఁగఁ జేయు
భారతకవి వ్యాసుఁ బ్రస్తుతించి
నవరసవర్షణానందహేతువులైన
కాళిదాసాదుల గణన చేసి
తెనుఁగున భారతం బొనరించి మించు న
న్నయ దిక్కమఖి నెఱ్ఱనం దలంచి
తే. ఇలను సకలరహస్యముల్ దెలుపఁజాలు
భాస్కరుని సోము నెంతయుఁ బస్తుతించి
అర్థి ఘనమార్గదర్శనులైన కవుల
సంతతంబును మన్మానసమున నెంతు.9
ఉ. షండున కేల రంభ; కడు జారున కేల కులప్రచింత; పా
షండున కేల సాధుజనసంగతి; కష్ట నికృష్ట లోభియౌ
చండికి నేల నిర్మలయశంబులు; వేశ్యకు నేల సిగ్గు; దు
ష్పండితు డైనవానికిని సత్కవితారసగోష్టి యేటికిన్?10
వ. ఇవ్విధంబున నిష్టదేవతావందనంబును సుకవిజనానందనంబును
గుకవినిందనంబునుం గావించి సకలకలికలుషతిమిరభాస్కరోదయంబును,
నుల్లసితసంపత్పల్లవాసంతికావాసంబును, నవరసనిగూఢగంభీరంబునుంగా
నెద్దియేనియు నొక్కమహాప్రబంధంబు రచియింపఁ బూనియున్న యప్పు
డొక్కనాఁటి ప్రభాతకాలంబున:11
ఉ. కస్తురిబొట్టు నెన్నుదుటఁ గౌస్తుభరత్నము పేరురంబునన్
బ్రస్తుత శంఖచక్రములు బాహువులన్ నతనాభిఁ దమ్మియున్
సిస్తుగ నొప్ప భూసతియు శ్రీసతియున్ దనుఁజేరి కొల్వఁగాఁ
గస్తురిరంగసామి కలఁ గానఁబడెన్ గరుణాతిభూమియై.12
వ. ఇవ్విధంబునం గనుపట్టిన యద్దేవునింగాంచి సమంచితవినయసం
భ్రమంబులు మనంబునం బెనంగొనఁ బులకితగాత్రుండనై సాష్టాంగదండ
ప్రణామం బాచరించి కరకమలపుటంబు నిటలతటంబున ఘటియించి
యానందభరితుండనై యుండ నన్నుఁ గనుంగొని యద్దేవుండు గంభీరమధుర
భాషణంబుల నిట్లనియె.13
తే. సముఖమీనాక్షినృపగర్భవిమలజలధి
చంద్ర, వేంకటకృష్ణేంద్ర, శౌర్యసాంద్ర,
మునుపు జైమిని భారత మనఁగ వచన
కావ్య మొనరించినట్టి సత్కవివి గావె!14
శా. వాసిన్ రంగవిభుండు నేను, ధరణిన్ వాక్ ప్రౌఢిమన్ నీ వహ
ల్యాసంక్రందన మన్ బ్రబంధము రసోల్లాసంబుగాఁ జేయ బే
రాసం గోరి వినంగ వచ్చితిఁ బ్రియం బౌనట్లు నాపేరిటన్
భాసిల్లం దగ నంకితంబు నొనగూర్పన్ నీకు మేలౌ నికన్.15
వ. అనియానతిచ్చుటయును దోడన మేలుకాంచి మేలుకాంచినహృద
యంబున నుదయంబునఁ గాల్యకరణీయంబులు నిర్వర్తించి యంత దందడి
మెఱయ బురోహితభృత్యామాత్యసామాజికబంధువర్గంబులు గొలువం
గూర్చుండి యుభయభాషాకవితావిశేషులైన శేషము వేంకటపతి, బుణిగె
కృష్ణకవీంద్రుఁడు నాకాప్తసఖులుఁ గావున వారిం బిలిపించి, యీశుభస్వ
ప్నంబు వినిపించుటయు, వారలు సంతోషభరితాంతరంగులై శ్రీరంగ
వల్లభుండు శ్రీభూమిసమేతుండై నీకుం గనుపట్టెం గావున నితోధికధనధాన్య .
కరితురగభటకదంబకాది నానావిధసంపదలును, బహుగ్రామభూములునుం
గలుగు; సప్తసంతానంబులలో నతిశ్లాఘ్యం బైన ప్రబంధసంతానంబు నిర్మింపు
మనియెం గావున శీఘ్రంబె మీతండ్రికి నీవు జనియించినచందంబున సకల
గుణాధారులైన కుమారులు నీకుం గలుగుదురు; స్వామిహితకార్యఘటనా
ధుర్యుండవు, బంధుజనపోషకుఁడవు, శ్రీరంగపతిపదారవిందమిళిందాయమా
నమానసుండవుం గావున నీ కిట్టిశుభస్వప్నంబు గలిగె; భవదీయవంశావ
తారక్రమంబు వర్ణించెద మాకర్ణింపుమని యిట్లనిరి:16
క. శరణంబులు జగముల కా
భరణంబులు వేదములకుఁ బంకజలక్ష్మీ
కరణంబులు నారాయణ
చరణంబులు నెసఁగు శూద్రజాతికి నిరవై.17
క. నాలవవర్ణం బనియెడి
పాలసముద్రంబునందు భావుకలక్ష్మీ
లోలుఁడు లోకావనకరు
ణా[1]లీలుఁడు కేశవప్పనాయఁడు వెలసెన్.18
ఉ. ఇంద్రుంు భోగ సంపద, నుపేంద్రుఁడు రూపముచేత, నా హరి
శ్చంద్రుఁడు సత్యవాక్యమునఁ, జంద్రుఁడు కాంతినిరూఢి, చాపని
స్తంద్రత రామచంద్రుఁడు, లసన్మతి చాతురిచేత శేషభో
గీంద్రుఁడె యంచు భూమిజను లెన్నఁగఁ గేశవనాయఁ డొప్పగున్.19
క. ఆ కేశవనాయనికిన్
రాకేశవదాతకీర్తిరాజితపుణ్య
శ్లోకుఁడు వేంకటనాయఁడు
శ్రీకాంతున కబ్జభవుని చెలువునఁ గలిగెన్.20
ఉ. చందురు ఱొమ్ముమెట్టి యరచందురుతాలుపు నఱ్ఱుగిట్టి యా
నందిని ముక్కు గుట్టి సురనాయకదంతిని జెక్కు గొట్టి య
స్పందితలీల సీరి యొడిఁ బట్టి చెలంగుచుఁ గీర్తి వీనులన్
విందొనరించు నార్యులకు వేంకటనాయఁడు భూపమాత్రుఁడే!21
క. పెదగురువపనాయఁడు త
త్సదమలమూర్తికిని బుట్టి శాశ్వతకీర్తిన్
గుదురై యీవిని జదురై
యెదురైన విరోధినృపుల నెల్ల జయించెన్.22
క. అతనికి గలిగెను బాదా
నతశాత్రవుఁ డెల్లిసెట్టినాయఁడు రేఖా
రతిపతి భాషావాచ
స్పతి భోగానుభవమున దివవస్పతి యనఁగన్.23
క. శంకరకైంకర్యపరుం
డంకభయంకరుఁడు గల్గె నతనికి నుర్వీ
సంకటహరసాయకుఁ డగు
వేంకటనాయకుఁడు భువనవిశ్రుతయశుఁడై.24
సీ. ధన్యుఁడై నృపతిమూర్ధన్యుఁడై నిర్ధూత
దైన్యుఁడై నృపసంఘమాన్యుఁ డగుచు
గేయుఁడై సుజనాళిగేయుఁడై దానరా
ధేయుఁడై విద్వద్విధేయుఁ డగుచు
ధీరుఁడై కనకాద్రిధీరుఁడై కదనహం
వీరుఁడై సద్గుణహారుఁ డగుచు
శీలుఁడై హరిభక్తిశీలుఁడై సంగీత
లోలుఁడై కవిబృందపాలుఁ డగుచు
తే. సకలబాంధవసంతోషి సత్యభాషి
స్వామిహితకారి స్వజనరక్షణవిహారి
వెలయు బహుసంపదలచేత విబుధభాగ్య
దాయకుండైన వేంకటనాయకుండు.25
క. ఆనరపతి వేంకటమా
మానినిఁ బెండ్లాడి వరకుమారునిఁ బడయన్
దానతపోధ్యానాదు ల
నూనగతిన్ పెద్దకాల మొనరించుతఱిన్.26
క. భూనుతు లాదంపతులకు
మీనాక్షీసుందరేశ మృదుపదపద్మ
ధ్యానాక్షయవిభవుం డగు
మీనాక్షయనృపతి గల్గె మేదురయశుఁడై.27
సీ. మక్కువ మీఱంగఁ జొక్కనాథస్వామి
తనమహాలింగమధ్యంబు వెడలి
చంద్రరేఖాజటాశార్దూలచర్మాహి
డమరుత్రిశూలముల్ కొమరుమిగులఁ
గలలోనఁ గనుపట్టి కరుణాకటాక్షముల్
చెలఁగఁ గటాక్షించి చేరఁ బిల్చి
కేలిశూలమ్ము డాకేలఁ గైకొని హస్త
మస్తకసంయోగ మాచరించి
తే. ఆయురారోగ్యపుత్రపౌత్రాభివృద్ధి
ధనకనకవస్తువాహనతతుల విమల
తత్త్వవిజ్ఞాన మొసఁగె నేధార్మికునకు
నతఁడు కేవలనృపుఁడె మీనాక్షివిభుఁడు.28
సీ. కప్పుమీఱినకందిపప్పులకుప్పలు
రాజ్యంబు వెలసేయు నాజ్యములును
బహుపుణ్యఫలపరిపాకముల్ శాకముల్
నిచ్చమెచ్చుల నిచ్చుపచ్చడులును
విప్పడంబుల నొప్పు నప్పడంబులరాసు
లతిరసంబులు వడ లతిరసములు
చంద్రమండలసుప్రసన్నము లన్నముల్
ప్రతిసుధారసములు పాయసములు
తే. వెలయ మృష్టాన్నసత్రముల్ వెట్టె సేతు
బాట నల్లూరులోపలఁ దేటతీయ
నీటిమేటితటాకంబు నిధి యొనర్చె
మేదినీశ్వరమాత్రుఁడే మీనవిభుఁడు.29
సీ. ఈలంపునీలంపు మేలికంబంబులు
కులశైలజాలంబు కొమరుఁదాల్ప
రంగారుబంగారు వ్రాఁతచిత్రంబులు
కిన్నరనరసురాకృతులు గాఁగ
నేతులజోతులనెఱి దీపమాలికల్
తారకాగ్రహములదారి మీఱ
నెఱమట్టుకఱిపట్టు నిగ్గుచందువపొందు
ఘనఘనాఘనముల గరిమఁబూన
తే. నిండుమెండున బ్రహ్మాండమండలంబు
రహి మహామంటపంబు సద్భక్తియుక్తి
సుందరేశ్వరుసన్నిధిఁ జంద మొంద
నమరఁ గట్టించె సముఖమీనాక్షివిభుఁడు.30
క. బంగారుబొమ్మయుం బలె
రంగారన్ వన్నెవాసి రాణింపంగా
రంగగు నలమేలమయను
నంగన నాఘనుఁడు పెండ్లియై విలసిల్లెన్.31
చ. కులమును శీలమున్ విభునికూర్మియు బాంధవపోషణంబు ని
శ్చలపతిభక్తి సత్యమును జక్కఁదనంబును గల్గి యొప్పుచున్
జలధరనీలవేణి నవసారసపాణి మనోజ్ఞవాణి యా
మెలఁతలమేలుబంతి యలమేలమయింతి చెలంగెఁ గీర్తులన్.32
సీ. పంకజాతము డించి పతి డెంద మలరించి
కలుముల వెదచల్లు కమలపాణి
వృత్తభేదము లేక విభుసమ్ముఖాలోక
మాన్యయై పొలుపొందు మంజువాణి
వామవర్తన డిందివరు నైక్యముం జెంది
మహనీయయౌ సర్వమంగళాఖ్య
ఒకచాయఁ జేయక యొగి నాథుఁ బాయక
రాజద్గుణాఢ్యయౌ రమ్యసంజ్ఞ
తే. యనుచుఁ బొగడఁగఁదగిన తొయ్యలులమిన్న
సరసవాగ్జితనవమాధ్వి పరమసాధ్వి
ఘనయశోపల్లి యాశ్రితకల్పవల్లి
మహితగుణపేటి యలమేలమావధూటి.33
సీ. పలికెనా కపురంపుఁబలుకులరాసులు
ఘుమఘుమ వాసించి కొమరుమించుఁ
గనువిచ్చి చూచెనా కఱికల్వరేకుదొం
తరవసంతములసంతనలు మీఱుఁ
జిఱునవ్వు నవ్వెనా నెఱచందమామ వె
న్నెలకన్న మిన్నవన్నెలు చెలంగు
కలికినెన్నడ ముద్దు గులికెనా రాయంచ
కొదమజొంపముల సంపదలు పొదలు
తే. సరససంగీతసత్కళాశారదాంబ
వినుతపాతివ్రతిఁ గుమారుఁ గనినయంబ
సకలజనమాన్య సాధురక్షణవదాన్య
వెలయు నలమేలమకు సాటి కలిమిబోటి.34
శా. ఆరామామణి మీనభూవిభుఁడు దా మత్యంతభక్తిన్ సదా
శ్రీరాజిల్లఁగ వేంకటాచలపతిన్ శ్రీకృష్ణునిం గొల్వఁగా
వీరాగ్రేసర, నీవు గల్గితి జగద్విఖ్యాతకీర్తిప్రభల్
మీఱన్ వేంకటకృష్ణభూప సుకృతీ లీలామనోజాకృతీ!35
సీ. చిగురుజిరారౌతుఁ జెనఁకుచక్కఁదనంబు
కదనంబు రిపులఁ బుల్గరవఁజేయుఁ
జేయుదన్వత్కర్ణశిబిదానశీలంబు
శీలంబు ధర్మదాక్షిణ్యశాలి
శాలిధాన్యసువర్ణసహితమ్ము భవనమ్ము
నమ్మువారికి నిధానమ్ము మాట
మాటఁజూచును ధైర్యమహిమ జాళ్వాగట్టు
గట్టురాయల్లునిఁ గదుముఁగడఁక
తే. కడకనులయందె వసియించుఁ గమలవాస
వాసవ పురారి మురవైరి భక్తి దొరలు
దొరలు నీసరి యగుదురె దరహసముఖ
సముఖ వేంకటకృపేంద్ర, శౌర్యసాంద్ర!36
సీ. చదువఁగా నేర్తువు శారదాశారదా
బ్జాననానూపురార్భటుల ధాటిఁ
బాడఁగా నేర్తువు పండితాపండితా
కర్ణనానందసంఘటన పటిమఁ
బలుకఁగా నేర్తువు భావజాభావజా
టాపగాటోపనిరర్గళోక్తి
దగ వ్రాయనేర్తువు తారకాతారకా
నీకరేఖాసమానేకలిపుల
తే. మెచ్చనేర్తువు కవితలమేల్మిఁ దెలిసి
యిత్తు వేనుఁగు పాఁడిగా నెలమిఁ గవుల
కన్నిగుణములు నీయందె నమరె నౌర!
రిపుజయాధార వేంకటకృష్ణధీర!37
ఉ. ఎంతయొయార మెంతసొగ సెంతపరాక్రమ మెంతరాజసం
బెంతవిలాస మెంతనయ మెంతవదాన్యత యెంతఠీవి మేల్
సంతతశౌర్యధాటి విలసద్గుణపేటికిరీటి వన్నిటన్
కంతజయంతరూప, కవికల్పక, వేంకటకృష్ణభూవరా!38
సీ. వింటివా నీవంటి వింటివాని ధరిత్రి
గంటి నే నల్ల ముక్కంటి నొకని
సారిగా నీ వొక్కసారి గాటపువీథి
దూరుచోఁ బొదలలోఁ దూరు రిపుఁడు
వింతమీఱంగ నీ వింత మీటినఁ దేజి
మంతుకృద్వైరిసామంతు నణఁచు
వేదండ మెక్కి నీ వే దండ వచ్చినా
వే దిక్కు సొచ్చు దా వేది పరుఁడు.
తే. ఉన్నతోన్నతి నెన్నుచో మిన్న వీవె
నిన్ను సన్నుతి సేయును బన్నగపతి
విమలచారిత్ర మీనభూవిభునిపుత్ర
సముఖ వేంకటకృష్ణేంద్ర శౌర్యసాంద్ర!39
సీ. ధైర్యమా శౌర్యమా దాక్షిణ్యమా పుణ్య
మా నయమా జయమా ప్రతాప
మా శుభరూపమా మహితవిజ్ఞానమా
దానమా భోగమా శ్రీనిరూఢ
యోగమా యాశ్రితవ్యూహసంరక్షణ
రాజద్విలాసమా రమ్యమంద
హాసమా మహితసౌహార్దస్వభావమా
భావమా భూరిప్రభావమాన్య,
తే. నీకె తగునంచుఁ బాండ్యభూనేత విజయ
రంగచొక్కేంద్రుఁ డత్యంతరంగసబహు
మానసామాజికత్వ మిం పూన నొసఁగె
సముఖ వేంకటకృష్ణేంద్ర శౌర్యసాంద్ర!40
మ. నలనాసత్యవసంతులం(?) గెలుచు సౌందర్యంబు ధైర్యంబు దో
ర్బలమున్ స్వామిహితానువృత్తి దయయున్ ప్రౌఢత్వమున్ విద్యయున్
వెలయన్ బాల్యమునందె నీవు మధురోర్వీనాథు మెప్పించవా
భళిరా, వేంకటకృష్ణభూవరమణీ, భాషాఫణిగ్రామణీ!41
క. అందముగ నహల్యాసం
క్రందనమున్ రచన సేయఁగా నేరుతువౌ
పొందుగ మధురిమ జగదా
నందము ఘటియింపు మనుచు నను నిట్లనఁగన్.42
వ. నేనును బ్రమోదభరితమానసుండనై.43
షష్ఠ్యంతములు
క. హారికి నవనవనీతా
హారికి సకలగుణరత్నహారికి మురసం
హారికి మందరధారికి
క్ష్మారమణీమణిమనోనుసారికి హరికిన్.44
క. హాటకమయచేలునకున్
ఘోటకచటులప్రచారగుణశీలునకున్
పాటితరిపుజాలునకున్
నాటితనానాప్రపంచనటజాలునకున్.45
క. చూటీకుడుత్త నాచ్చా
ర్చూడాసంబంధగంధి సుమసరధృతికిన్
క్రీడాపల్లవవపతికిన్
నీడజకులసార్వభౌమ నిర్భరగతికిన్.46
క. అభిసరణరమిత నిచుళా
ప్రభుకన్యామణికిఁ గైటభద్విపసృణికిన్
వభసదురస్స్థలశుభకౌ
స్తుభవాసరమణికి దమితదుర్దమఫణికిన్.47
క. శస్తునకున్ రక్షణకృత
హస్తునకున్ వాసవునకు నాత్మీయతనూ
విసారితభువనునకున్
కస్తూరీరంగపతికిఁ గరుణాకృతికిన్.48
వ. అంకితంబుగా నాయొనర్పంబూనిన యహల్యాసంక్రందనంబను
మహాప్రబంధంబునకుఁ గథాక్రమం బెట్టిదనిన:49
శా. శ్రీరంజిల్ల నహల్య మౌనిసతియై వృత్రారిపై మోహ మే
దారిం గూరిచెఁ దానఁ గల్గిన దురంతం బైన శాపంబునున్
శ్రీరామాంఘ్రిరజంబు లెవ్విధము దీర్చెన్ బల్కుమం చీసమా
చారంబున్ జనమేజయుం డడుగ వైశంపాయనుం డిట్లనున్.50
మ. పదియార్వన్నియరెక్కపక్కి నొకరాబాబావజీరుండు సాం
ద్రదయాంగీకృతయౌవరాజ్యభరతన్ రక్షింప లోకత్రయీ
విదితంబై యమరావతీపురము శోభిల్లున్ వియద్వాహినీ
మృదువాతూలవినీతదివ్యయువతీక్రీడాపరిశ్రాంతియై.51
చ. సురమణి ముద్దుమోవి సుధ చొక్కపునవ్వు బలారివాహముల్
కురులు, సురద్రు గుచ్ఛములు గుబ్బలు, వేలుపువాఁక యచ్చపున్
మెఱుఁగు మణుంగునై , చికిలి మించఁగఁ దత్పురలక్ష్మి కాంతివి
స్ఫురణభవిష్ణు విష్ణుపదభూషణమై చెలువొందు నిచ్చలున్.52
తే. మండలీభూతశక్రకోదండ మనఁగ
దైత్యచక్రాంగకంపనోద్దండ మగుచు
రమ్యఘృణిజాత నూత్నచిరత్నరత్న
ఝాటమై దీటుమీఱు నవ్వీటికోట.53
ఉ. రాణఁ జెలంగునప్పురవరంబున నుండు జనుల్ నిజాశ్రిత
త్రాణధురాధురంధరులు దానయశఃపరిశోభితాత్మకుల్
ప్రాణిదయాళు లౌట యొకబాఢమె యచ్చట నుండునట్టి పా
షాణము వృక్షముల్ పసులు సైత మభీష్టము లిచ్చుచుండఁగన్.54
సీ. అచ్చటికలభంబు లజుపీఠకమలంబుఁ
జేనంటి నైషాదశిక్ష నుడుగు
నచ్చటి తురగంబు లభ్రకేశునిమౌళిఁ
గుప్పించి సాదులు ద్రిప్ప మరలు
నచ్చటి యరదంబు లవ్విష్ణురథమును
దలమీఱి సారథుల్ నిలుప నిలుచు
నచటిభటు లజాండ మవియవ్రేయఁ దలంచి
యది నీరు బుగ్గయం తనుచునెంతు
తే. రచటి పాత్రలు నృత్తవిద్యానిరూఢిఁ
బూని శారద వెలవెల వోవ నాడి
యాదిగురువని మ్రొక్కుదు రమరపురముఁ
గోరి వర్ణింపఁబూన నెవ్వారితరము?55
చ. వసువులకెల్ల సంతతనివాసము విశ్వవిభూతి కాశ్రయం
బెసఁగు ననంతరత్నముల కిమ్ము మహాసుమనఃప్రకాండ సం
వసతి మరుద్గణాంచితము వల్గుసుధర్మము సౌమ్యజీవహ
ర్షసదనమై చెలంగు నమరావతి నెన్నఁదరంబె యేరికిన్?56
మ. వరబృందారకగర్భయౌ పురరమావామాక్షికిన్ బ్రహ్మ భీ
కరదైత్యగ్రహశాంతికై సలిలచక్రవ్యాజ వర్ణాంకశం
ఖరథాంగాంకిత శుద్ధరూప్యమయ రక్షాపట్టికన్ గట్టెనా
హరిపాదాంబుజసంగ గంగయె యగడ్తై యొప్పు నవ్వీటికిన్.57
సీ. కలిగించు నొకకొమ్మ కలమాన్నపరమాన్న
బహుపూపఘృతసూపపానకములఁ
గల్పించు నొకకొమ్మ ఘనసారహిమనీర
పాటీరకాశ్మీరపంకములను
దొరకించు నొళదళం బురుహేమమణిదామ
శాటికాపేటికాసముదయముల
నిచ్చు నొక్కొకసుమం బెలమించుతుల మించు
ప్రాయంపు గరువంపుఁ బద్మముఖుల
తే. నీగతి సమస్తవస్తువు లీఁగఁ దివురు
వేల్పుమానులుఁ దీవలు వేనవేలు
దనర విలసిల్లుఁ దత్పురోద్యాన మగుచు
నందనంబు జగత్త్రయానందనంబు.58
ఉ. శ్రీ లుదయింప దిక్పతులు చేతులు మోడ్చి భజింపఁ దమ్ముఁడై
శ్రీలలనామనోహరుఁ డశేషభరంబును నిర్వహింపఁ బా
తాళమువట్టి శాత్రవులు తద్దఁ గృశింప నిలింపపట్టణం
బేలును భోగసాంద్రుఁడు సురేంద్రుఁడు భూరిమహోదినేంద్రుఁడై.59
సీ. వృత్రగర్వస్ఫూర్తి విదళించినయినుండు
పాకసామజమదోత్పాటనహరి
పరమహీభృత్తుల భంజించు జిష్ణుండు
తఱియైన శరవృష్టి గురియు ఘనుఁడు
మఘశతయాజియౌ మహితసుధర్ముండు
భువనైకభారంబుఁ బూనువృషుఁడు
కరమున శతకోటి గలస్వస్థజీవనుఁ
డమరభోగినులతో నలరుభోగి
తే. శచికుచంబుల మకరికాసముదయంబు
వ్రాయు లేఖర్షభుం డనవద్యహృద్య
మాఘ్యవిచికిలరుచిరసమాఖ్య గాంచు
దేవతాసార్వభౌముండు తేజరిల్లు.60
చ. అతఁ డొకనాఁడు కుందనపుటందపుదుప్పటి వల్లెవాటుతో
సతతముఁ దావులీను హరిచందనపున్ జిగి మేనిపూఁతతో
నతులకిరీటహారకటకాంగదముఖ్యవిభూషణాళితో
రతిపతిమీఱుసోయగము రాజసమున్ దళుకొత్తు ఠీవితోన్.61
చ. చిలుకలకొల్కి యొక్కరుతు చేరి పరాకు పరా కటంచనన్
జలరుహపాణి యోరు సరసన్ కయిదండ యొసంగ ముంగలన్
హళహళి నొక్కగంధగజయాన బరాబరి చేయ వాలునుం
బలక కలాంచి కుంచె యడపం బొకకొందఱుఁ బూనికొల్వఁగన్.62
సీ. వేవన్నెబంగారు వింతగోడలచాయ
పగలింటి యెండలభ్రమ లెసంగ
ఇంద్రనీలస్తంభసాంద్రరోచిచ్ఛటల్
బహుళాంధకారవిభ్రాంతి నీయఁ
బద్మరాగాంకురప్రాంశువితర్దికల్
జ్వలదగ్నిమండలజ్ఞప్తి నింప
నిర్మలవజ్రమణీకుట్టిమంబులు
స్వచ్ఛాంబుపూరసంశయము నింప
తే. నుద్యదితరేతరప్రతియోగవస్తు
సంగతులు శక్రకార్ముకశక్తి యొక్కొ
యనఁదగిన కాంచనాంచితయవనికావి
తానపరికర్మయైన సుధర్మయందు.63
చ. కరమునఁ గంకణాలు విడిగాజులు గల్లనఁ బల్లవాధరల్
వరుసగ నిల్చి చామరలు వైవ మహోన్నతభద్రపీఠిపై
సురగరుడాహిచారణవసుప్రముఖుల్ శుచిధర్మదైత్యరా
డ్వరుణసమీరయక్షపురవైరులు సూరెలఁ జేరి కొల్వఁగన్.64
క. కొలువున్న తఱిఁ బరాశర
కలశోద్భవ కణ్వ కండు కవి గాధేయా
దులు వచ్చి యతనిచే మ్రొ
క్కులుగొని కనకాసనములఁ గూర్చుండిరటన్.65
తే. నలపురూరవు లాదిగాఁ గలుగు చక్ర
వర్తులు పదాఱుగురు రాజవర్యు లమిత
కీర్తిధుర్యులు వైభవస్ఫూర్తి మెఱయ
నన్నగాహితుసభను గూర్చున్న తఱిని.66
సీ. అతిరాత్రయాజుల యరిదికుండలములు
మెట్టె మించులుగాఁగ నెట్టుపఱిచి
సత్రయాజుల వెల్లజన్నిదంబులు దీసి
సన్నగజ్జెలు గూర్ప సంఘటించి
ఉక్థయాజుల కనకోత్తరీయంబుల
మేలుముసుంగుగాఁ గీలుకొల్పి
అల వాజపేయయాజుల యాతపత్రంబు
లెండకు మఱుఁగుగా నేర్పఱించి
తే. తలిరువిలుకాని బిరుదుపతాక లనఁగ
నోరపైఁటలు జీర నొయ్యార మెసఁగ
వత్తు రింద్రుని కొలువుకు వారకాంత
లచ్చెరువునొంది సురలెల్ల మెచ్చి పొగడ.67
సీ. "సోమయాగఫలంబు సుదతి నీ కిచ్చేను
మొగ మిషు ద్రిప్పవే ముద్దుగాను
సోమపానఫలంబు భామ నీ కిచ్చేను
ఆనంగ నాకు నీ యధర మీవె
కలికిరో సాన్నాయ్యకలశాలఫల మిత్తు
బటువైన కుచములఁ బట్ట నీవె
రమణిరో నా మహావ్రతఫల మిచ్చేను
రతుల న న్నేలవే బ్రతికి పోదు”
తే. ననుచు శౌండిల్య కౌండిల్యముని పరాశ
రాత్రి గార్గేయ గౌతమ చ్యవన భార్గ
వౌర్వ జమదగ్ని శాకల్య పర్వతాది
ఋషులు మోహింప నప్పరస్త్రీలు మఱియు.68
సీ. "అషు ఇషు బోవకే యిషువులచే నిన్ను
విషమాస్త్రుఁ డేచీని వెఱ్ఱిపడుచ
వాజపేయఫలంబు వలదషే యో యోష
యింద్రుఁ డే మిచ్చీని యిషు నిలువవె
మేము శుంఠల మషే , మీరు [2]నేర్చినపాటి
యెరుగ మషే వేదమెల్ల జదివి
యతివ నీవు [3]ద్వరోష్ట యయ్యేదినము లయ్యె
నగరికిఁ బోవకే నడుమ నెషులొ"
తే. అనుచు ఛాందసు లగు సోమయాజివరులు
వెంట నంటంగ మధుమయవినయభరిత
మంజుభాషల చేత సమ్మతులు చెప్పి
వెడలి రప్పుడు వేలుపువెలవెలఁదులు.69
మ. గొనబుంజందురుకావిపావడలపైఁ గొమ్మించురాయంచడాల్
మినుకుంజీరలకుచ్చెలల్ గులుకఁగా మిన్నేటిపొందమ్ము ల
ల్లన వక్త్రాంబుజుపాళికిన్ మఱుఁగుగా హత్తించుచున్ గంతుమో
హనదివ్యాస్త్రములోయనన్ వెడలి రొయ్యారంబుతో నచ్చరల్.70
ఉ. చిన్నిమిటారులో చికిలిచేసిన మారునిచిక్కటారులో
వెన్నెలగుమ్మలో మెఱుఁగువెట్టిన కెంపుకడానిబొమ్మలో
పొన్నలబంతులో మగుడఁబోవనిమిన్నుమెఱుంగుకాంతులో
యెన్నఁగనంచు నభ్రచరు లిచ్చల మెచ్చఁగ వచ్చిరచ్చరల్.71
సీ. అశ్రాంతనవయౌవనారంభయౌ రంభ
శృంగారరసరేఖ చిత్రరేఖ
రతిరహస్యజ్ఞానరాశియౌ నూర్వశి
అంగజాతాగ్నికి నరణి హరిణి
పాటిలాధరజితపానక మేనక
హాటకసమరోచి యా ఘృతాచి
తరుణులం దెల్ల నుత్తమ యా తిలోత్తమ
మణితమంజులభాష మంజుఘోష
తే. రామణీయకవిభ్రమరామ హేమ
సరసనుతగీత నృత్యప్రచార తార
మఱియుఁ దక్కినవేలుపుమచ్చెకంటు
లెలమి నరుదెంచి రపుడు దేవేంద్రుసభకు.72
క. అంజలులు సేసి వేలుపు
లంజలు నిలిచిరి బలాసురధ్వంసికడన్
రంజనఁ బూజించి రహిన్
గంజాస్త్రుఁడు నిలిపినట్టికైదువు లనఁగన్.73
ఉ. వారిజపత్రలోచనల వాసవుఁ డల్లనఁ దేరఁజూచి శృం
గారపు వింతలేనగవు కల్గొనలన్ దళుకొత్తఁ గొల్వులో
వారల నెల్లఁ గాంచి “యిటువచ్చిన యచ్చర గచ్చురాండ్రలో
నే రుచిరాంగి చక్కనిది , యెవ్వతె విద్యలమేటి” నావుడున్.74
క. దేవేంద్రుఁ జూచి వరుణుఁడు
"దేవా! దేవరకుఁ దెలియదే సకలంబున్
నీవడిగినచో నుత్తర
మీవలె నటుగానఁ బలుకు దేఁ దోఁచినటుల్.75
ఉ. ఆటదియన్న నూర్వశి యథార్థము పల్కుదు నింతెకాని మో
మోటమి నాకు సైఁపదు బుధోత్తమ! పాటల నాటలందు స
య్యాటలమేటి చక్కదనమా గొనమా యలబోటికే తగున్
పాటలగండులెల్ల నల భామిని గోటికి సాటివత్తురే!”76
చ. అనవుడు మిత్రుఁ “డౌనవు, జలాధిపువాక్యము నిక్క మూర్వశీ
ఘనకచ రూపసంపద జగన్నుత మెంతని సన్నుతింప నా
ఘననయదేశ్య రక్తి పరికల్పన మేరితరం, బదేమి యీ
మునివరు లిప్పురూరవుఁడు మున్నగు రాజులు ము న్నెఱుంగరే?"77
క. అనినఁ బురూరవుఁ డచ్చటి
జననాథుల మొగముఁ జూచి "సర్వజ్ఞనిధుల్
ఘను లీమిత్రావరుణుల్
కని పలికిరి నిజ మిదే యఃఖండిత" మనినన్.78
శా. ఆకంధీశ్వరుమాటకున్ నగుచు యక్షాధీశపుత్త్రుం డనున్
"మీ కీయూర్వశిమీఁది యాస దురుసై మి మ్మిట్టు లాడించెనో
కాకున్నన్ గుణగుంభరంభను వినాగా నోర్తు నగ్గింతురా
నాకాధీశుఁడు తక్కువా రెఱుఁగరా నారీషు రంభా యనన్."79
ఉ. ఏచినప్రేమ యక్షసుతుఁ డీగతిఁ బల్కినఁ గండుమౌని దా
సైచక "యింద్రుసన్నిధి నసత్యము లేలర, ప్రేలె దోరి, ప్ర
మ్లోచకు నూరుకాండజితమోచకు లేశము సాటి వత్తురే
ఖేచరసిద్ధసాధ్యఫణికింపురుషామరచంపగాంగులున్?80
ఉ. పున్నమచందురుం గెలుచు ముద్దుమొగంబును దేటమాటలున్
సన్ననికౌను మేనుజిగిచందముఁ దీయనిమోవియందమున్
కన్నులతీరు నీలములకప్పును మించినకొప్పుసౌరు నా
యన్నులమిన్నకే తగు నటన్నది విన్నది లేదె యెన్నఁడున్."81
క. నాగంబుల నాగంబుల
నాగంబులఁ గెల్చు కురులు నాభియు నడలున్
భోగంబుల భోగంబుల
భోగంబులఁ దరుణియారు బొమ చను లేలున్.82
క. చేరలకు మీఱుకన్నులు
బారెడుకీల్జడయు ఱొమ్ము పట్టవుకుచముల్
బేరజముల నారజముల
నీరజముఖు లెనయె దాని నీటుకు" ననినన్.83
చ. బలిమిని గండుమౌని నొకప్రక్కకుఁ దోచి విభాండకుం డనున్
"నెలఁతలమేలుబంతి హరిణీహరిణాక్షియె యాలతాంగి దాఁ
గిలకిల నవ్వుచున్ దివిరి కిన్నర మీటుచు వచ్చుముచ్చటల్
కులుకులు పావురాలపలుకుల్ బెళుకుల్ మఱి కోటి సేయవే?84
చ. పెదవిని వింతకావి నునుపెక్కినకీల్జడఠీవి కల్వలన్
జెదరఁగఁజేయు కన్నులును సిస్తగు జక్కవ నేలుచన్నులున్
మదకరినేలు నెన్నడలు మల్చినరీతిని నొప్పు నున్దొడల్
ముదముగఁ జూచినంత నల బోటికి జోటులు సాటి లేరెటన్.85
ఉ. దాని యొయారపున్ సొగసు దాని మిఠారి కఠారి చూపులున్
దాని కడానిమేనిజిగి దాని చనుంగవలో పటుత్వమున్
దాని గళంబుఠీవియును దాని కరంబుల సోఁగ వీఁగెయున్
దాని శిరోజకాంతియును దానికిఁ గాని మ ఱెందు లే దొకో."86
క. వార లిటుపల్కుపల్కులు
సైరింపక కౌశికుండు జడముడి వీడన్
దూరంబున జపమాలికఁ
బారంగా వైచి యమరపతి కభిముఖుఁడై.87
ఉ. "ఆనిక చేసి పల్కెద హా హా, కసుమాలపుఁ బంజలంజెలన్
గానకళావిశారద మొగానఁ గళానిధిఁబోలుచాన యా
మేనక యుండు దానిజిగిమే నకలంకసువర్ణకాంతికిన్
దానక; మింతి విభ్రమవితానక మచ్చెరువిచ్చు నిచ్చకున్.88
ఉ. కన్నులు చేరలన్ గొలువఁ గాఁదగుఁ గౌ నరపేద చన్నులా
కిన్నర కాయలంగెలుచుఁ గీల్జడబారకు మీఱు మోము క
ప్పున్నమచందమామ యొకపోలిక వాలికతూపు చూపు నా
కన్నులయాన, దాని కెన గాన జగాన మొగానఁ బల్కెదన్.89
క. భూమియు నాకాశంబును
గామినికటిరుచికిఁ గౌనుకాంతికి సాక్షుల్
పామును బట్టెద నే నా
భామిని నూఁగారు కెందుఁ బ్రతిలేదనుచుఁన్.90
చ. వదలనినిష్ఠ మీఱఁగఁ దపంబున వర్తిలు మేము సైతమున్
మదిమది దానితోఁ దగిలి మానము మౌనము నేటిపాలుగా
నదెయిదె ఱేపుమా పనుచు హాయనముల్ [4]పడి యుంటి మన్నచో
మదవతి రూపరేఖలను మాటికి మాటికి నెన్న నేటికిన్?”91
చ. అనుటయు మాండకర్ణిముని "యంద ఱటుండఁగనిండు మెండుగా
జననుత కామజన్య సహజన్య సరోచి ఘృతాచి యున్నత
స్తనకటిభార తార వనితాజనతానుతనామ హేమ ర
త్యనుపమలాలసాలస మదాలస యిప్పురి పంచరత్నముల్."92
క. నావిని పరాశరుం డను
“నీ వేలుపుఁ జెలులు చిలువయింతులు మర్త్య
స్త్రీవితతి దాశకన్యక
లావణ్యముఁ బోలలేరు లక్షాంశంబున్.93
ఉ. మాటలు వేయు నేమిటికి మన్మథమోహనవిద్యయైన యా
పాటలగంధియూరు లలబంగరుబొమ్మవెడందకన్ను లా
గాటపుగబ్బిగుబ్బెతచొకాటపునెన్నుదు రెన్ని చూచుచో
నేటికి రంభ యాహరిణి యేటికి నాశశిరేఖ యేటికిన్?94
శా. ఫాలక్షోణి చెమర్పఁ గౌను బెళుకన్ బాలిండ్లు వొంగార దో
ర్మూలంబుల్ దళుకొత్త నూరురుచి సొంపుల్ గుల్క నేత్రప్రభల్
మీలందోలఁగ నేటవాలువగ నమ్మీనాక్షి యాయేటిలో
నేలేలోయని పాడు చోడఁగడవే యింపొక్కటే చాలదే?"95
సీ. “అంజనాసతిఁ బోలు, కుంజరగామిని
కలుగునే” యనె మరుద్గణవిభుండు
"తప్పుమాట లివేల దారుకావనినుండు
నతివలే యతివ”లం చనె హరుండు
"చాలించవయ్య, సృంజయునికూఁతురి కెన
గారు పోపొ"మ్మనె నారదుండు
“శరవణంబునను గొందఱుకాంత లున్నారు
వారు మీసర"మని వహ్ని పలికె
తే. మఱియు సభలోని మునులును సురలు నృపులు
దారుచూచిన చెలుల వేర్వేఱఁ బొగడి
“రంత రంతాయెఁ గద మహారాజసభ"న
టంచుఁ గంచుకి వారల నమరబట్టె.96
క. అత్తఱిఁ బురూరవుం డను
"మెత్తురె యొకపాటిదాని మిత్రావరుణుల్
పుత్తడిబొమ్మకు గుమ్మకుఁ
జిత్తజుచార్వసికి నూర్వశికి సరిగలరే?"97
క. ఆరాజరాజనందనుఁ
డారాజుం జూచి "కొంటె లనుకొంటేనే
నారీమణి రంభారం
భోరుకు నూర్ రోసినట్టి యూర్వశి సరియే?"98
శ. అనుటయుఁ జందురు మనుమఁడు
కనుదమ్ములు జేవురింపఁ గరకరిమీఱన్
ధనరాజకుమారకునిన్
గనుఁగొని యిట్లనుచుఁ బలికెఁ గాంతాళముతోన్.99
క. “ఉండ్రా, యక్షాధమ, నీ
తండ్రిం గని తాళుకొంటిఁ దగఁ గాకున్నన్
తీండ్రంబగు కత్తిని నీ
జీండ్రపు నాలుకదళంబు ఛేదింతుఁ జుమీ!"100
చ. అనినఁ గుబేరనందనుఁ “డహా"యని బెట్టుగఁ గేక వైచి క్రొ
మ్మినమిసలీను కప్పుజిగిమీసముపై జెయివైచి "యోరి ఛీ
చెనఁటి, గరాస, యీసభను జెప్పినటుల్ మఱి నీవు చేయకుం
డిన విడ రాచకోఁచ, ధగిడీ!" యని దిగ్గన లేచి వీఁకతోన్.101
మ. రమణీరత్నము రంభఁ జూడ బురుసారంగున్ జెఱంగున్ నెఱా
కొమరుం దుప్పటి కాసెగా బిగిచి జగ్గుల్ మీఱు గ్రొం బైరుమాల్
జముదాడింబరుఁజంది యేది మఱి రాజా, లెమ్ము వా ల్గొ"మ్మనన్
బొమ లల్కన్ ముడివెట్టి వీరరసవిస్ఫూర్తిన్ విజృంభించుచున్.102
క. “రూకలకోమటికొడుకా,
పోకలఁ బోయెదవదేర, పోరా పోరా,
నీకున్ మత్తే కొరడా
చేకొని కొట్టింతుఁ గొంటె చెనఁటి గరాసా!103
క. "మొగమున మీసముఁ గలిగిన
మగవాఁడైతే కడింది మగఁటిమి మీఱన్
తెగఁబడిపోట్లాడవలెన్
బిగువేమిర, రాచములుచవిడుతునె నిన్నున్.104
ఉ. "పందగులామ, నీవు నొక బంటవె? గెంటనికిన్కతోడఁ బౌ
రందరి చిక్కటారిని గొలారిక మంపిననాఁటి కెచ్చటన్
పొందుగ దాగియుంటివిర పోర, ధనంబులు గూడఁబెట్టువాఁ
డెందును సంగరంబునకు నేర్పడి ప్రాణము దెంపు చేయునే?105
ఉ. "బంటుతనంబు లాడుకొని పారకు; రావణుచేతి పెట్టునన్
కంటికి నీరు గ్రమ్మఁ గలకంబడిపారెను నీదుతండ్రి నీ
యింటను లేదు పౌరుష మొకింతయు; బీరములేల చేతిక
త్తంటకు కోడెకాఁడ! చురు కంటఁగ వెంటనె చెంపఁగొట్టెదన్.”106
చ. అని మొలవంక డుస్సి సమరార్భటిఁ జావడిక్రిందికిన్ గుభా
లన దుముకన్ ధనేశసుతుఁ డట్లనె చేయ జయంతుఁ డిద్దఱిన్
బనివడి రెండు బాహువులఁ బాయఁగఁ ద్రోయుచు “మీర లిర్వురున్
దనుజులమీఁద మార్కొని ప్రతాపముఁ జూపు" డటంచు నిల్పఁగాన్.107
క. “నీకేమి యాతఁ డాతఁడుఁ
బైకొని మార్కొనిన నిన్నుఁ బ్రార్థించిరటో
యీ కొట్లాటలు దీర్పఁగ
నాకాధిపతనయ" యనుచు నారదుఁడనియెన్.108
సీ. అపుడు విభాండకుం డాగ్రహంబున లేచి
బలిమిచేఁ దన కమండలువుఁ గొట్టె
చెయిమించి మాండకర్ణియుఁ జేతిదండంబు
పెళ పెళాలనఁ ద్రొక్కి విఱిచివైచె
పొటుకునఁ బర్వతజటిలుండు జడచుట్ట
విదళించి యట త్రెంచి విసరివైచె
కండుమహాముని కడుఁగోపగించుక
పడుపాటుగాఁ గక్షపాల చించె
తే. కండ్ల నెఱచేసి పటపటఁ బండ్లు కొఱికి
గోచు లెగఁగట్టి జందెముల్ కుఱుచబట్టి
అట్టహాసంబు లొనరించి యౌడుఁగఱచి
మునులు గుంపులు గూడుక మొనసి రంత.109
సీ. ‘తారతమ్య మెఱుంగలే రింద’ ఱని లేచె
గాధేయుఁ డంత లోకములు బెదర
‘నీవేమి తెలిసి వర్ణించితో మేనక’
నని యాతని విభాండుఁ డదిమెఁ గేల
‘హరిణితోఁ దిరిగిన యడవిమెకంబ వీ'
వని కండు వతనిమే నప్పళించె
‘గండువుకేకాని కాదు ప్రమ్లోచ'యం
చతని వెన్ దట్టె మహర్షి యొక్కఁ
తే. డదియె పెదపెదమాటలై యలుకవొడమి
జడలు వీడఁగ వల్కలాచ్ఛాదనములు
జార దండకమండలుల్ పాఱవైచి
గజిబిజిగఁ బోరుచుండ నాఖండలుండు.110
ఉ. "అచ్చరమచ్చెకంటులకునై కడుహెచ్చిన మచ్చరంబుతో
విచ్చలుగాను మెచ్చగువివేకము లెల్లను వెచ్చపెట్టి వి
రిచ్చట దొమ్మిగూడి కలహించినఁ దేరుగడేల పుట్టు నీ
రచ్చ లణంచఁగా వలయురా” యని యింద్రుఁడు చేయమర్చుచున్.111
ఉ. గాధిజుఁ జేరి వేడుకొని, కండుమహామునికిం బ్రియోక్తులన్
బోధనచేసి, శక్తిసుతు పొంతకుఁ బోయి, విభాండకున్ "వృధా
గాథ [5]య”టంచుఁ బల్కి భయకారి మునీంద్రుని వాదణంచి స
క్రోధుల మిత్రు నప్పతిఁ బురూరవు యక్షజుఁ దాళఁ బట్టుచున్.112
కం "ఏకాంత ఎవరి కితవో
యాకాంతను వారు పొగడు టదియుక్తం బే
మీకేల వాదు మీలో
‘లోకో భిన్నరుచి’ యనెడు శ్లోకము వినరే.”113
చ. అనుటయు నొక్కతాపసుఁ "డహా! పదివేలయినా తిలోత్తమే
వనిత" యనంగ, వేఱొకఁడు , "వామ” యనంగ, నొకంకడు “చిత్రరే
ఖ"న మఱికొంద ఱందుఁ "బదహాటకమాలిని భీమ పుండరీ”
కన, వెసం బుట్టెఁరేఁ బెట్టు కలహంబులు నారదుఁ డుబ్బియార్వగన్.114
క. " రాజానుమతో ధర్మో'
నా జను లనుకొండ్రు గాన నవ్యప్రతిభన్
మాజగడముఁ దీర్పఁగను బి
డౌజా, నీవె”యని మౌను లందఱు వేఁడన్.115
క. “నలువగల సృజించిన య
న్నలువ గలఁడు నిర్ణయింప నలినాక్షుల మి
న్నలువగ లటపోవుద"మని
నలువగలన్ ఠీవి మెజయ నగరిపుఁ డంతన్.116
చ. ఉఱుముల బండికండ్లరొద యొప్పగు వాల్మెఱుపుం బతాకలున్
చిఱుమెఱుపుం ధ్వజంబులును జేరుబలాకలబారు చామరల్
శరమణిచాపముల్ వెలయ సౌరగు నభ్రరథంబు నెక్కి భా
సురసురదుందుభుల్ మొఱయ సూరెల సూరులు సన్నుతింపగన్.117
సీ. గంధర్వు లొకవంక గాంధారపంచమ
బంధురగాంధర్వపటిమఁ జూపఁ
జారణు లొకక్రేవ ధోరణుల్ మీఱఁ గై .
వారముల్ సారెకు సారెఁ జేయ
నచ్చర లొకచాయ హెచ్చుకోపుల మెచ్చు
లచ్చెర్వుగాఁగ నాట్యములు సలుప
సంయము లొకయిక్క సామజయస్తోమ
నామాభిరామమంత్రములు బొగడఁ
తే. ద్రిభువనైకాధిపత్యంబుఁ దెలుపఁజాలు
గొప్పముత్తెంపు జంపులగొడుగు నీడఁ
దరుణు లిరుగడఁ దెలచామరలు వీవ
వెడలె జేజేలయెకిమీఁడు వేల్పువీడు.118
క. కసవులు మేసియు నని మొన
నసువులఁ బాసియు విరోధు లలయంగ యశో
వసువులగు వసువు లుజ్జ్వల
వసువులొలయ వెడలిరపుడు వాసవుమ్రోలన్.119
మ. కుడిగోరొత్తులగుబ్బచన్ను గని సిగ్గుల్ గుల్కు డాకంటితో
నెడదౌ కీల్జడపాటుఁ జూచి పులకల్ హెచ్చంగ మువ్వన్నెప
చ్చడ మొప్పన్ నెలవంకతోఁ గనకభాస్వన్నాగభూషాళితో
మృడు లేతెంచిరి వేడ్కఁ బద్మభవునిన్ వీక్షింప జంభారితోన్.120
తే. తరణికిరణంబు లచ్చర మెఱుఁగుఁబోండ్ల
మెఱుఁగుసొమ్ముల కొకవింతమెఱుఁగు వెట్ట
బారసూరులు సలిపిరి బారు సూరు
లాగమంబుల నుతియింప నాగమంబు.121
చ. అల వినువాక కుందనపుటందపుఁదామరతావిఁ గుల్కుచున్
సొలయు మరుత్కుమారకులు సొంపుమెయిన్ వెనువెంట నంటఁగా
నలకలు వీడఁ గౌను లసియాడ సురాంగన లేగుదెంచి రు
త్పలశరుఁ డూర్ధ్వలోకములపై నిగుడించిన యమ్ములో యనన్.122
క. నగరిపుఁ డివ్విధమునఁ జని
నగరీతివిశాలసాలనయనోత్సవదన్
ప్రగుణితనవరత్నధగ
ద్ధగితన్ వాగ్జాని రాజధానిం గనియెన్.123
సీ. ఏప్రోలు వాణీవరేధితాశోకంబు
శోకంబు మోదంబు సుడియ దెందు
ఏపురి రవికోటిఘృణియుతాభోగంబు
భోగంబు మోక్షంబు పొసఁగు నెందు
ఏపురం బంబరశ్రీపరమాకల్ప
మాకల్పము వసింతు రార్యు లెందు
ఏపూర్మతల్లి యహీనతరానంద
రానందదఘకర్మరతుల కెందు
తే. సంతతవసంతసరసరసాలసాల
ఫలరసాలోలకీరాదిపత్త్రి జాల
గదితఋగ్యజుషంబు నిష్కల్మషంబు
నగుచు నవ్వీడు జోడులే కలరు నెపుడు.124
చ. వరజగదండభిత్తికల వన్నియకోట బహిస్థితాంబువుల్
పరిఘ లతఃపరప్రకృతిఁ బాదమహావనదుర్గమై తగన్
కరమరుదారు నేపురము కామరుషాపరుషారికోటులన్
దరియఁగనీయ దన్నలువ నాల్గుమొగాలఁ బరామృశింపఁగన్.125
శా. ఆలోకంబునఁ గోటిసూర్యనిభదివ్యాస్థానమధ్యంబునన్
శ్రీలింపొందు చిరత్నరత్నవిలసిత్సింహాసనాగ్రంబునన్
బాలాదిత్యమహత్సహస్దళయుక్ పద్మోజ్జ్వలత్కర్ణికన్
హేలాస్పష్టజగత్త్రయుండు కొలువుండెన్ ఛాత చేతోధృతిన్.126
సీ. క్షణకళాఘటికాదికాలంబు సాకార
మై గడియార మందంద పల్క
గ్రహతారకారాశిగణము లల్లనఁ జేరి
పంచాంగదినశుద్ధిఁ బల్కరించ
సకలదిగ్దేవతల్ సభికుల నెల్లను
జోటు లెఱింగి కూర్చుండ ననుప
పంచభూతంబులు ప్రణమిల్లి యే సృష్టి
నేమించునో యని మోముఁ జూడ
తే. వేదములు వందిజనములై వినుతిసేయ
శాస్త్రములు వేత్రపాణులై సంచరింప
జెలఁగి కొలువున్న త్రైలోక్యసృష్టికర్త
నగరివాకిట నిజవాహనంబు డిగ్గి.127
క. ప్రతిహారి తోడరా న
ప్రతిహారివిభూతి మెఱయ నమరేంద్రుఁడు దా
శతధృతిసన్నిధికిం జని
నతి చేసి సమున్నతాసనంబున నుండెన్.128
ఉ. సారసపత్రనేత్ర విలసన్నవనీరదగాత్ర పావనో
దారచరిత్ర కంసమురదానవజైత్ర రమాకళత్ర శం
పారుచినేత్ర బోధరసమాత్ర పృథాసుతమిత భక్తహృ
న్నీరజబాలమిత్ర వరనీరజపత్రపవిత్రకీర్తనా!129
క. కస్తూరీతిలకాంకిత
నిస్తులముఖచంద్ర వదననిందితచంద్రా
అస్తోకద్యుతివిస్తృత
కౌస్తుభమణివక్ష విమలకమలదళాక్షా!130
స్రగ్విణీ. వారణాధీశదుర్వార భీవారణా
ధారణా యోగిహృద్వాసనిర్ధారణా
కారణశ్రేణీకాకల్పనా కారణా
చారణక్షేమవైశాల్య దోచ్చారణా.131
గద్య
ఇది శ్రీమత్పాండ్యమండలాధీశ్వర శ్రీ విజయరంగ చొక్కనాథ మహీ
నాథకరుణాకటాక్ష సంపాదిత గజతురంగ మాందోళికా ఛత్రచా
మర విజయకాహళ భూరిభేరీబిరుదధ్వజ ప్రముఖ నిఖిల
సంపత్సారంపరీసమేధమాన సముఖ మీనాక్షీనా
యక తనూభవ శ్రీమీనాక్షీదేవీ కటాక్ష
లబ్ధకవితాసాంప్రదాయక వేంకట
కృష్ణప్పనాయక ప్రణీతంబైన
యహల్యాసంక్రందనంబను
మహాప్రబంధంబునందుఁ
బ్రథమాశ్వాసము.