అహల్యాసంక్రందనము/తృతీయాశ్వాసము
శ్రీరస్తు
అహల్యాసంక్రందనము
తృతీయాశ్వాసము
శ్రీతరుణీనయనోత్పల
శీతమయూఖాభిరామ శ్రితజనవాంఛా
జాతప్రతిపాదన చణ
చేతోవ్యాపారనిరతి శ్రీరంగపతీ!1
వ. అవధరింపుము.2
క. శ్రీయుతుఁడగు జనమేజయుఁ
డాయతమతి నవలికథల నడిగిన మదికిన్
హాయి దలిర్పఁగ వైశం
పాయనుఁ డిట్లనియె లోకపావనచరితన్.3
క. ఇటులుండ నొక్కనాఁ డా
కుటిలాలక కడకు వచ్చెఁ గొంకక ఘటనా
ఘటనాకోవిదమతి యగు
జటినీమణి యోర్తు లలితసత్వరగతియై.4
చ. పదముల యోగవాగెలును బాణితలంబున నాగబెత్తమున్
నుదుట విభూతిరేఖయు మనోజ్ఞకటీతటిఁ గావిజీరె పొన్
బొదివినయట్టి యొక్కమొగపున్ రుదురాకలదండ సందిటన్
వదనమున్ మృదుస్మితము వర్తిలు యోగినిఁ గాంచి భక్తితోన్.5
క. వందనమొనర్చి పూజల్
పొందికగాఁ జేసి పీఠమున నునిచియు బా
లేందుముఖి! యెందుఁ బోయెదు
వెం దుండుదు విందు వచ్చు టేమి యటన్నన్.6
ఉ. ఉంచును సత్యలోకమున యోగబలంబున నెల్లదిక్కులన్
బొందుగ సంచరింతు శశిఖండకిరీటికిఁ దద్వధూటికిన్
మందరధారికిన్ రమకు మాటలబోటికి నవ్విరించికిన్
పొందికలం దెడాటములు పుట్టిన మాన్పుదు వారు మెచ్చఁగన్.7
క. నందనవని నిన్నన్ సం
క్రందనుఁ గనుఁగొంటి నతనిఁ గనినంతనె నా
డెందము భగీలుమనియెన్
దందడిఁబడు వానిదీనదశ యేమందున్?8
సీ. నిబిడోష్ణనిశ్శ్వాసనికరంబుచేఁ గల్ప
వనవాటి తాపింఛవన్నె గాఁగ
కల్పానలాకల్పకందర్పవహ్నిచే
నెసఁగు విర్వాక యిఱ్ఱింకులింక
ధారాళనేత్రాంబుధారాతివృష్టికి
జలదసందోహ మాశ్చర్యమొంద
నత్యంతకఠినదీనాలాపములచేత
వజ్రమేనియు గుండె పగిలి యెడల
తే. కరుణయెల్లఁ బుమాకృతిఁ గాంచినట్లు
విరహతాపంబు మూర్తీభవించినట్లు
తలఁచి పలుకంగరాని దుర్దశలఁబొందు
మఘవు నే నందుఁ గనుఁగొంటి మచ్చెకంటి.9
ఉ. ఎవ్వతెమీఁదనో హృదయ మీభువనత్రయనాథు నింతగా
రవ్వలఁ బెట్టినట్టి యలరక్కసి యెవ్వతొ చూతమంచు నే
నవ్వల మధ్యకుంజకుహరాంతరసీమ నణంగియున్నచో
నవ్వలశాసనుం డనియె నవ్వల నవ్వలమానవేదనన్.10
ఉ. 'ఏల సృజించె దాని నను నేల సృజించెను బ్రహ్మ దాని కీ
లాలితరూపయౌవనకళాలలితాంగవిలాసవిభ్రమం
బేల నొసంగె? బేలతని మేటికి నిచ్చె, మదీయబుద్ధికిన్?
బాలికతోడ నామనవి బల్కెడువారి జగానఁ గానఁగా.11
మ. 'కలలోఁ జూతునటన్న నిద్ర యెఱుఁగన్ గన్నారఁ జిత్తర్వునన్
దెలియం జూచెదనన్న బాష్పములచే నేత్రాబ్జముల్ క్రమ్మెడిన్
కలయన్ ధ్యానముఁ జేతునన్న మది నున్మాదంబు సంధిల్లెడిన్
ఇలలోఁ దాళఁగరానితాప మహహా యెట్లోర్చెదన్ దైవమా!12
చ. 'కులుకుటొయారపున్నడలు గుబ్బచనుంగవ గొప్పకన్నులున్
తొలుకరిక్రొమ్మెఱుంగుగమితో గమితోపమమైన మేనితో
నలయలివేణి లోవెలి నహర్నిశమున్ గనుపట్టుచుండియున్
జలగత చంద్రమండలము చాడ్పునఁ జేతికి నబ్బ దక్కటా!13
మ. 'ధనికున్ జేయును లోభివాని నెఱదాతన్ బేదఁగాఁ జేయు ర
త్యనభిజ్ఞుండగు నెడ్డెకున్ మదనతంత్రప్రౌఢయౌదాని భా
ర్యనుగాఁ జేయు నటన్న కోపమునఁ గాదా బ్రహ్మశీర్షంబు ద్రుం
చెను శంభుం డటువంటివానికి ననౌచిత్యం బనన్ జెల్లునే?'14
క. అని పలికి చిత్రఫలకం
బునఁ దనభావమున నున్న ముద్దులగుమ్మన్
దనువునఁ బులకలమొలకలు
పెనఁగొనఁగా వ్రాసి చూచి పేరెద నునిచెన్.15
క. 'ఆరూపము నీరూపము
సారూప్యముఁ జెంది యుండె జలజదళాక్షీ!
మారుఁడు స్వైరవిహారుఁడు
వీరనివారని మదిన్ వివేకము లణుచున్.16
ఉ. 'మోవిని మోవిఁ జేర్చు, నది ముద్దిడకున్నను మ్రొక్కుఁగేల, ని
చ్ఛావిధిఁ గౌఁగిలించు, నది చన్నులనొత్తమి వెచ్చనూర్చుఁ జే
నీవిక నంటు హత్తమికి నెవ్వగఁ బొర్లును బూవుఁబాన్పుపై ,
దైవముఁదిట్టు దిట్టుకొనుఁ ద న్నినుఁ దిట్టును బెట్టు మూర్ఛిలున్.17
చ. 'యమవరుణాదు లెవ్వనికటాక్ష మపేక్ష యొనర్తు రాగమా
గ్రములు యదీయరూపగుణకర్మము లెన్నును వందివైఖరిన్
హిమకరసోదరీరమణుఁ డెవ్వని వాకిటికార్యకర్త యా
యమరవరుండె గోరె నిను నంగన, నీదగుభాగ్య మెట్టిదో!18
చ. 'కొసరులొ చెక్కు నొక్కుటలొ కూకిరవల్ పలికించి పల్కుటో
యొసపరియల్కలో నయములో రతిసుద్దులొ వింతముద్దులో
పసఁ దొడసందుపొందికలొ వాతెరకూర్పులొ ప్రక్కమార్పులో
రసికతలేనిగేస్తురతి రామకు నేమిసుఖంబు దెల్పుమా!19
చ. 'వ్రతములఁ గృఛ్రకోటి నుపవాసములన్ దనువుల్ కృశింపఁగా
మతి నరతిన్ శిరోవృతిని మౌనముతో మొగమోరగా వడిన్
పితరులయప్పు దీరె[1]ననిపింతురు యౌవనమత్తకాశినీ
తతిహృదయంబు నేచుబలుతాపసులన్ బసులంచు నెంచుమా!20
సీ. 'నేఁటి కమవాస్య నేఁటికిఁ బున్నమ
నేఁటికి సంక్రాంతి నేఁడు విషువు
నేఁడు వ్యతీపాత నేఁటికి వైధృతి
నేఁటికి మన్వాది నేఁటికిఁ దిథి
నేఁటి కేకాదశి నేఁటికి ద్వాదశి
నేఁటికి శివరాత్రి నేఁడు వ్రతము
నేఁటికి ఋతుకాలనియమంబు దప్పెను
నేఁటికిఁ బోనిమ్ము నేఁటి కోప
తే. మనుచు దినములు గడపుచు నలసులైన
పాపజాతులు పెండ్లాడి పాలవంటి
వయసు వమ్మొనరింతురు వనితలకును
బుడమి నిల్లాలిపుట్టుక పుట్టనగునె?'21
చ. అనుటయు నర్మకోపదరహాసవిలాసలసన్ముఖాబ్జయై
యనియె నహల్య యిట్లనుచు “నమ్మకచెల్ల! యిటాడఁ జెల్లునే?
నను నటువంటిదానిఁగ మనంబునఁ నెంచెదొ యెంచకున్న నీ
యనువున నందువా యెఱుఁగవా మగువా, నను నాదుచిత్తమున్.22
ఉ. 'ఎవ్వరి నేను మున్ను మొగ మెత్తి కనుంగొనఁ జూచినావు! నే
నెవ్వరి చెంగటన్ నిలిచి, తెవ్వరితో నగి, తేమి చేసి తే
నెవ్వతె నింద్రుఁ డెవ్వఁడు బళీ! ననుఁ బోఁటికి నిట్టిసుద్దులా
యివ్వనిమూలనున్న నను నేటికి ముంగిటి కీడ్చెదే చెలీ!23
ఉ. 'వేది యలంకరించుటయొ వేల్మి కమర్చుటయో హవిస్సులన్
బ్రోదిగఁ జేయుటో కుసుమముల్ గొనితెచ్చుటొ దేవపూజ క
గ్రోదకమాహరించుటయొ యుగ్మలి, మా కిటువంటి సుద్దు లీ
బోదలదానఁ గాను ననుఁ జుల్కనఁగా నెదలోఁ దలంపకే."24
తే. అనిన యోగిని యెల నగ వంకురింప
“ఘనకచవు శైలకుచవు సైకతనితంబ
వేను నినుఁ జుల్కఁగా నెంతునే మృగాక్షి!
పంచకన్యలలో నెన్నఁ బ్రముఖ వీవు.25
ఉ. ఎంతతపంబు సేసిన మఱెంతపతివ్రతనిష్ఠ నున్నఁ దా
నెంతకృశించినన్ వ్రతము లెన్ని యొనర్చిన నెన్ని పుణ్యతీ
ర్థాంతరముల్ చరించిన నొయారికి రూపవిలాసవంతుఁడౌ
కాంతునిఁ గౌఁగిలించినసుఃఖంబు లభించునటే విలాసినీ!26
ఉ. ఎందును సంచరింప కఖిలేంద్రియముల్ సుఖమొంద డెందమున్
బొందుగఁ దన్నుఁ దా మఱవ బుద్ధి కగోచరమైనయట్టి యా
నందము బ్రహ్మ మందు రది నవ్యవయోనవమోహనాంగియౌ
చందనగంధికిన్ దొరకుఁ జక్కనిమక్కువకాఁడు చిక్కినన్.27
ఉ. చేతన మౌటయే యరిది చేతనమైన మనుష్యజన్మ మ
త్యాతతపుణ్యలభ్య మటు లైనను స్త్రీజననం బలభ్య మా
జాతికిఁ గామమున్ సురతసౌఖ్యము హె చ్చది పోవఁద్రోచినన్
పాతక మాత్మహత్యకు సమం బగుపాతక మొక్కటున్నదే?28
ఉ. వారక నత్తగారి కనుబ్రామి, నిజేశ్వరు మోసపుచ్చి యా
యారునుదూరు నై నఁబడి యందరికన్ని ఘటించి యాత్మఁ దా
గోరిననాథునిం గలసి కొల్లలుగా సుఖమందకున్న నా
సారసపత్రనేత్రి యెలజవ్వన మేటికి జన్మ మేటికిన్.29
సీ. కాంతుదంతక్షతిఁ గాంచనిమోవియు
మోవియే చల్లమ్ముగ్రోవి గాక
సరసుండు బట్టని చన్నులు చన్నులా
యల మేకమెడచన్ను లంతె గాక
ప్రాణేశుఁ డనుభవింపని యౌవనమ్ము యౌ
వనమటే నిజమ యవ్వనము గాక
పతిమేన మకరికల్ వ్రాయని వ్రేళ్లును
వ్రేళ్లటే కలజువ్వివేళ్లు గాక
తే. చంద్రకిరణమ్ము సోఁకిన చంద్రకాంత
మనఁగఁ బదియాఱుకళల జిమ్మనికరంగ
కరఁగి కరగించి కాంతునిఁ గవయకున్న
నారి నారియటే వింటినారి గాక.30
ఉ. ఏలనె జాలి సర్వజగదీశ్వరుడైన సురేశ్వరుండు ని
న్నేలఁదలంచె మేలు గనవే వినవే యరచేతికబ్బు లి
బ్బేలను బేలనుం బలె బలే పలుకందొరకొంటి వైన నీ
కీలు నొకేం తెఱుంగుదు వకీలొనరింతు వికీల వేటికే?31
చ. చిలుకలకొల్కి, నీ సొగసు చిత్తరువందునఁ జూచి కన్నులన్
[2]బలపల నీరునించి తల వంచి తలంచి భ్రమించి మించి హా
వలపుల కేమి సేతు నని పౌర్థన చేయు నుమామహేశులన్
బలరిపుఁ డమ్మహామహుని భావ మదేమి యెఱుంగఁబల్కవే.32
క. అనిన నహల్య యొకించుక
నునుజెక్కుల నవ్వుదోఁప నూల్కొన నీకన్
అనుఁ దా ననుతాపనతా
ననతావనతాంగి యగుచు నవమధురోక్తిన్.33
సీ. 'స్వర్ణచిత్రవిచిత్రవర్ణమందిరములా
యీపర్ణసదనంబు లింద్రునకును
సురసిద్ధసాధ్యభాసురదివ్యవీథులా
యీయాశ్రమంబు దేవేంద్రునకును
వరకల్పనాకల్పకరకల్పతరువులా
యీవృక్షములు నందనేశునకును
పటుదానసందానబహుమానగజములా
యీమృగావళులు మహేంద్రునకును
తే. రమ్యసౌందర్యవరకళా[3]ప్రౌఢిమలును
గలిగి చెలఁగినయింద్రాణిఁ గాను నేను
ప్రేమ నాపైని శక్రుఁ డేరీతిఁ బూనుఁ
గ్రొత్తవలపులు వలవరే కుతలపతులు.34
సీ. రంభ కైవడిఁ గంబురాగుల్కుపల్కులో
తమిఁగూర్చువలపులో తారరీతి
నూర్వశిచందాన నొరపొందుచిన్నెలో
రక్తిఁ గుల్కుటొ మదాలసవితాన
శశిరేఖయందాన సకలకళాప్రౌఢొ
ఎదురొత్తులిచ్చుటో హేమలీల
మంజుఘోషనిరూఢి మణితానుకూల్యంబొ
మానలీలలో ధాన్యమాలినివలె
తే. నెఱిఁ దిలోత్తమగతి నతిస్నేహగరిమ
నెనయుటో సాగరికరీతి యింతలేని
తపసియిల్లాండ్రపై బాళిఁ దగిలి మిగుల
వగలఁ జెందుదురే తమవంటిదొరలు.35
క. సతికిన్ మును జేపట్టిన
పతి నొక్కరుఁ దక్క నితరుఁ బాటించుట సం
గతియటవే నీ కెంతటి
మతిదిటవే యిట్లు నుడువ మర్యాదటవే!"36
ఉ. నావుడు యోగినీరమణి నవ్వుచు [4]నెచ్చెలి కొప్పు దువ్వుచున్
“నావచనంబు వేదవచనంబని యెన్నుము బొంకెఱుంగనే
నీవు జనించినప్పుడె సురేంద్రుఁడు నీదగుచెట్టఁబట్టినాఁ
డీవిధి యౌను గాదనిన నీవె మునీంద్రునిచే నెఱుంగుమా!37
క. అది సూక్ష్మరూపమంటే
నిది యాతనిస్థూలరూప మిదియదివేఱా!
మదనాశుగసదనాయిత
హృదనాగత ధైర్యవయ్యె దేలా బాలా!38
సీ. పతులఁ గాదనుచు గోపాలుతోఁ బోయిన
గొల్లయిల్లాండ్ర కేకొదువ వచ్చె
ధవు లేవు రుండ నారవవానిఁ గోరిన
నాళాయనికి నేమి నయము తగ్గె
ఘటికాద్వయికి నొక్కకాంతుచెంతకుఁ జేరు
పౌలోమి కేపాటి పదవి దప్పె
మగని న టుంచి మార్మగనివెంబడిఁ జన్న
తార కేయిల్లాలితనము తగ్గె
తే. వారి కెవ్వారికిని లేని యారు దూరు
నీ తలనె వ్రాసెనే ధాత నికృతిచేత
నిశ్చలానంద మొందుము నెమ్మి నేఁడు
నలినలోచన! దేవుఁ డున్నాఁడు నాఁడు.39
ఉ. ఇంతులపాపముల్ పతుల కింతయె గాని ప్రసక్తి లేదు కా
సంతయు వారి కంచు స్మృతు లన్నియుఁ బల్కును కా దటంచు నిం
తింతయుఁ గల్గెనేని ఋతువైన జనున్ మఱి చింత యేలనే
కాంతకు సమ్మతం బయిన కాంతునిఁ బొందుటె యొక్కనేరమా?40
క. రాజీవాక్షి, 'యహాల్యా
యై జార' యటంచు నాగమాగ్రస్తుతుఁడౌ
నాజిష్ణు నెనయవే 'యో
షాజారమిదంప్రియ' మను చదు వెఱుఁగవటే!?”41
క. జటినీమణి యిటులాడిన
కుటిలాలక యింద్రు నెనయుకోరిక వొడమన్
దటుకునఁ బతిభయ మెసఁగఁగ
నటునిటు ననలేక శబలితాశయ యగుచుఁ.42
ఉ. కూరలు కందమూలములు కూళ్లు తలంటులు గారనూనె మా
చీరలు నారపట్ట కయి చేయుట మాకులమందె లేదు కాం
తారమునన్ జరించుట తృణంబులమీఁదఁ బరుండుటల్ మముం
గోరెడువారలుం గలరె కోమలి, నీదువివేక మేమనన్.43
చ. మదనుని గుమ్మితీమొనలు మాటికి మర్మములంటఁ బాఱినన్
వదలనికోరికల్ మొలిచి వర్థిలి డెందమునందె డిందినన్
హృదయము ఱాయి చేసికొని యింపుఁ దలంపక యుండఁగాఁ దగున్
గదలఁ దరంబె యొక్కనికిఁ గంఠము జూపిన కంబుకంఠికిన్.44
ఉ. అద్దములోనఁ దోఁచు ముడు పందనిమ్రానిఫలంబు కోపపున్
గద్దరిచిల్వచేఁబడిన గందపుఁదీవె మహావిషంబులో
నద్దినపణ్ణెరంబు మగనా లది కొంచెమునన్ లభించునే
సుద్దులు వేయునేల బలసూదనుతోఁ దెలియంగఁబల్కవే.45
సీ. చక్కనివాఁ డింటిచాయకు వచ్చిన
మామగా రూరక మండిపడును
పుట్టింటిలో నొక్కపూట యుండఁగరాదు
కత్తికోతఁగఁబోరు నత్తగారు
నిమిషంబు పొరుగింట నిలిచియుండఁగరాదు
పటుకార్లఁ బట్టును వదినగారు
కడకుఁబోయిన నొక్కకడ నుండఁగారాదు
మఱఁదలు కొండేలమారిబసివి
తే. తోడికోడండ్రు చూపోప కాడుకొండ్రు
[5]పట్టపగ బట్టి పోరాడు బావగారు
జారసంగతిఁ గాంక్షించు చంద్రముఖికి
నత్తగారిల్లె కారాగృహంబు దలఁప.46
క. భావమున నేమికిటుకో
నావంకనె చూచుచుండు నామగఁ డెపుడున్
[6]రావశమో పోవశమో
[7]యీవని కెవ్వానికైన నిందునిభాస్యా!47
క. కాదని నీ మొగమోటకు
నేదయినన్ మంచి దంటినేనియు రతికే
ళీదక్షు నతని నెవ్వతె
మేదిని మెప్పింప నేర్చు మేలిమితోడన్.48
క. తారావధూటి యొక్కతె
తారాపతి యొక్కరుండు ధన్యులు జగతిన్
వారివలె సాహసింపఁగ
నేరికి శక్యంబు మగల కింతులకైనన్.49
క. నామనవిగఁ దనపై నిఁక
నీమమతలు మానుమనవె యెవ్వరి కెవరే
కామువెతల్ నావలె సు
త్రాముని సైరింపుమనుము తామరసాక్షీ!50
ఉ. చుక్కలఱేనిఁ గంతుని నుచుక్కను చక్కదనంబుగల్గు మా
చక్కనిసామి పాదజలజాతము లౌదలఁ జేర్చి మ్రొక్కితిన్
చిక్కఁగఁ గౌఁగిలించితిని సేమము వేఁడితి నేడనున్న నీ
ప్రక్కనె యున్నదాన నని భావమునన్ నెనరూనఁబల్కవే.51
సీ. తనగుణంబులు విని ఘనమైన పులకలఁ
గడిమిపూవులగుత్తికరణి నుందు
తనరూపు భావించి తనరినచెమటచే
మధుసిక్తపద్మినిమాడ్కి నుందు
తనవిలాసము నెంచి దర్పకజ్వాలచేఁ
గనకశలాకనఁ గరఁగుచుందు
తనపొందికఁ దలంచి తనువెల్ల జల్లనఁ
జిత్రార్పితాభనిశ్చేష్ట నుందుఁ
తే. జేతనంబయ్యు నేను నచేతనముల
సరణి విరహాఖ్యకల్పావసానజలధిఁ
జేత నీఁదుచుఁ బారంబుఁ జేరఁగాన
ధరణి మగనాలికంటెఁ బాతకియుఁ గలదె?52
మ. విరులెల్లన్ ప్రదరంబులయ్యె విధురుగ్వీచుల్ దలంపంగ బం
ధురహేతిప్రకరంబులయ్యె నళిసందోహంబు లెల్లన్ భయం
కరదుర్వారశిలీముఖప్రతతులై కన్పట్టె నేదిక్కులన్
మరుఁడయ్యెన్ సుఖ మెప్పుడో కలుగుటల్ నాతాపముల్ దీఱఁగన్.53
సీ. ఎన్నఁటికోకదా యెమ్మెకాని కరంబు
లెత్తి నాకన్నుల నొత్తుకొందు
నెన్నఁటికోకదా హృదయేశుసందిట
నివ్వటిల్లెడు ప్రేమఁ బవ్వళింతు
నెన్నఁటికోకదా వన్నెకానియురంబు
గబ్బిగుబ్బలఁ గ్రుమ్మి కౌఁగిలింతు
నెన్నఁటికోకదా యేలినసామికి
నందంపువాతెఱ విందొనర్తు
తే. నెన్నఁడోకద వగకాని కింపు మెఱయఁ
కంతుకయ్యంపువింతలు గానుపించి
హవుసు చెల్లింతుఁ జెలులలో నతిశయింతు
ననుచు నేనుందు నీయాన హంసయాన!54
తే. ఏఁబరాధీనఁ గావున నింతవంతఁ
గ్రాఁగుచుండంగవలసెను గాకయున్న
నెఱకలను గట్టికొనియైన నెగసివచ్చి
తనయెదను వ్రాల నాచిల్కతాళివలెను.55
ఉ. భారము లాయె నమ్మ కుచపాళికి హారము లేమిసేతు ని
స్సారము లాయె నమ్మ ఘనసారము మన్మథభూతభీమహుం
కారము లాయె నమ్మ కలకంఠనినాదము లమ్మచెల్ల, నా
ధారము లాయెనమ్మ పరితాపభరంబుల కెల్లఁ బ్రాణముల్.56
ఉ. పట్టఁగరాని మోహమునఁ బైకొని తోఁచినవెల్లఁ బల్కి తీ
మట్టునఁ గట్టిపెట్టు మిది మానసమందె ధరిత్రిలోపలన్
పుట్టని యట్టిబిడ్డలకుఁ బూసలు గట్టుదు రమ్మలక్క లే
గుట్టున నుండుదాన నతికోపనుఁ డింటిగృహస్థు యోగినీ!57
క. నాతల్లి వీవు నీతో
నాతలఁ పేమిటికి దాఁచ నాతీ మాయిం
టాతఁ డెపుడైనఁ గలసిన
నాతనిఁగాఁదలఁతు ముకుళితాక్షిద్వయనై.58
తే. అగ్నిహోత్రాల వేళాయె నమ్మ! నీవు
పోయిరమ్మని పంపి యా పొలఁతియుండ
సంభవించును దోషా[8]ధికార మింక
గనుఁగొన ననర్హమని సూరి కన్ను మొగిచె.59
సీ. కరిఘటాహలిపటాశరభటాయసకటా
హములనైల్యముపొంత నణఁగఁదొక్కి
హరిశిలాభరజలాకరపికార్భకకులా
మితకాంతిసంతతి మితము చేసి
ఉరగరాడ్లరదురాధరధరామితశరా
సితరుచిప్రాచుల చేరి చేరి
అళివిభాసురవిభాహరివిభాతులితభా
సంతతాభ్యుదయముల్ సంతరించి
తే. యినసుతాపింఛతాఫింఛవనదనికర
ఖంజనాంజనగిరి నీలకంజపుంజ
జంబుకాదంబసైరిభాడంబరములఁ
దాండవించెను దమము భూమండలమున.60
చ. తెలుపును నల్పు దిక్కులు విదిక్కులు మేరునగంబు సర్షపం
బిలయు నభంబు దూరము సమీపము హ్రస్వము దీర్ఘమన్న సం
జ్ఞలు గల సృష్టి నేమిటి కొనర్చితి నంచు విరించి యెంచఁగాఁ
బ్రళయపయోధు లొక్కమొగిఁ బర్వినటుల్ వెసఁబర్వెఁ జీఁకటుల్.61
చ. మదననిదాఘతాపముల మాన్చు ఘనాఘనసంఘమో యనన్
గదిసె మహాంధకారములు కారిశగవేషణతత్పరాత్మలై
కొదుకుచు సందులన్ దిరుగు కొమ్మలు బెళ్కుమెఱుంగు లై రిలన్
వదలనివర్షమయ్యె నిశి పాంథజనంబులకున్ దురంతమై.62
తే. తాపము లణంగె భూతసంతతు లెసంగ
నతనుధర్మపరిస్ఫూర్తు లతిశయించె
నుత్తమస్థితి మించెను నుత్తమముగ
ఖరకరాభావమే శుభంకరము ధరను.63
చ. ఒక మగనాలు మాఱుమగం డుండునికేత మెఱుంగ కేతమో
వికలత నొక్కెడన్ నిలువ వేఱొకతంచుఁ దదీయభర్త యా
సకియనె కౌఁగిలింప నది జారుఁ డటంచును జారయంచుఁ దా
రొకరొకరిం దమిం గలసి రుధ్ధతి మన్మథుఁ డుబ్బి యార్వఁగన్.64
చ. వెడవిలుకాని వేదనల వేఁగుచు దుర్విటు లేఁగఁ జీఁకటిన్
గుడిసెలు పంచలున్ వెడలి కుంటియు గ్రుడ్డియు భుగ్నరుగ్ణ ము
ట్లుడిఁగినయింతి మున్ను వలయోత్కరశబ్దనివేదితాత్మలై
బడిబడిఁ బైఁడిఁదీసిరి తమం బఖిలోత్తమమంచు నెంచుచున్.65
ఉ. కప్పులకప్పడంబులును గస్తురిపూఁతలు చాలు నిప్పు డే
చొప్పున నేఁగినన్ మనలఁ జూఁడగలండె త్రినేత్రుఁడేనియున్
ముప్పదినాళ్లు నీదృశతమోవృతి సేయఁగరాదె బ్రహ్మయం
చప్పెనుచీకఁటిన్ వెడలి రారటమై కులటల్ తటాలునన్.66
క. ఆయామవర్తి మునివరుఁ
డాయామము నిగమసంహితాభ్యాసకృత
వ్యాయామశ్రాంతమతిన్
సాయామతరుచ్ఛదాస్తృతాజినశయ్యన్.67
మ. పవళింపన్ రమణీశిరోమణి రతిప్రారంభసంరంభతన్
ధవుపాదంబులు పట్టి యెత్తెడువితానన్ గోరు సోఁకించినన్
‘నవలా, నీదుచెఱంగు మాసి పదియార్ నాళ్లాయెఁ గాలంబు ద
ప్పె వృథాదోష మిదేల మాను' మన నవ్వేళన్ విలోలాత్మయై.68
క. 'త్రిదశాధిపుఁడైతేఁ గద
యద నెఱుఁగుచుఁ గోర్కెఁదీర్చు' నని తనలోనన్
మదనాశుగ మదనాశుగ
మదనాశుగధాటి కదిరి మానిని మునితో.69
శా. “ఔ లెం డంతకుమున్నె మాకుఁ బనిలే దాచోదనే; నిద్రపై
బాళిన్ మీపదమూలమందు శయనింపన్ వచ్చితిన్ జోలి చాల్
చాలుం బొమ్మని యల్క మాఱుమొగమై చందాస్య నిద్రింప న
వ్వేళన్ శాంతమహార్ణవం బనఁగ సంవేశించె నమ్మౌనియున్.70
వ. తదనంతరంబ.71
ఉ. యోగిగతిన్ సురేంద్రుఁడును యోగ మొనర్చి తదీయసూక్తిపై
యోగజరాజగామిని వియోగదశన్ విని దాని చాతురీ
యోగము మెచ్చి కంతుని నియోగము నౌదలఁ దాల్చియంత సం
యోగము సాహసక్రియఁ బ్యోగము సేయఁగఁగూడదన్ మతిఃన్.72
తే. కోడిగపుఁ గంతుయాతన కోడి వజ్రి
కోడియై కూసె “గొక్కొరోకో" యటంచు
మౌని మేల్కని వామనస్మరణ దనరఁ
గాల మరయక మునుగంగ గంగ కరిగె.73
క. గౌతమవేషమున బెడం
గౌ తమకము మీఱ నిర్జరాధీశుఁడు బా
గౌ తమమునఁ జేరం జని
గౌతమసతికరముఁ బట్టె కౌతుక మెసఁగన్. 74
తే. "కొమ్మ యొకపుంజు తనపెంటికోడిఁ దలఁచి
కూసెఁగా కది వేకువకోడిగాదు
ప్రొద్దు వొడువంగఁ దద్దయుఁ బ్రొద్దుగలదు
ముద్దుగా శయ్య కరుదెమ్ము ముద్దుగుమ్మ!"75
వ. అనిన నహల్య శంక మది నంకుర మందఁగ మందహాసయై
యనియె 'మునీంద్రవేషమున నాశతమన్యుఁడొ కాక యన్యుఁడో
ననుఁ జెనకంగవచ్చె మునినాథుఁడు గాఁ'డని ప్రేమయున్ భయం
బెనయఁ గరంబుఁ దీసికొని యిట్లనియెన్ గిలికించితంబుగన్.76
చ. 'రతిపతి యంపఱంపముల రంపునఁ గంపమునొంది నేను మున్
రతికయి వచ్చి మచ్చిక లొనర్చినఁ బేర్చినచర్చ 'నొప్పునే
ఋతుదివసంబు దప్పెఁ గడ కేఁగు మ'టంటి విదేమి యిప్పు డీ
గతి బతిమాలె దెవ్వఁడవొ కల్లలు చెల్లవు పల్కు' నావుడున్.77
తే. 'అలశతానంద[9]గురుఁడ గోత్రాధికారి
పరుల శతకోటియుక్తుల భంగపఱతు
నాత్మభూసన్నిధిని నీకరాంబుజంబుఁ
గాంక్షఁ బట్టితి నన్నెఱుంగవె మృగాక్షి!78
చ. అతివల జాలిచేష్టితకళాస్పదమర్మవిభేదభేదియై
జతనగు జవ్వనంబు డిగజాఱకమున్నె యథేష్టభోగముల్
ప్రతిదివసంబుఁ జెందకయె బాలిశుఁడైన జనుండు పిమ్మటన్
గతజలసేతుబంధనము గాఁ దలఁచున్ విషయోపభోగముల్.79
క. ఋతుకాలదినములైనన్
ఇతరదినములైన మఱియు నేదినమైనన్
వితసేయక రతికేళీ
ప్రతియగుకృతి కఘము రాదు వనితా'యనుడున్.80
క. శ్లేషార్థముఁ దెలిసి నిజా
శ్లేషార్థము వచ్చె నలశచీపతి యనుచున్
యోహారత్నంబు తదా
భాషణకౌతూహలానుభావాన్వితయై.81
ఉ. "నాపయి నింత ప్రేమ మునినాథున కెన్నఁడుఁగానఁ గావునన్
నాపతి వీవుగావు కుహనాకృతి వెవ్వఁడవో యెఱుంగ నీ
రూపముఁ జూప కూఱక మరుల్ గొని బల్మి యొనర్చితేని నే
సైఁప నిజంబు పల్కు మిఁకఁ జల్లకు వచ్చియు ముంత దాఁతురే?"82
చ. అనుటయు జాళువామినుకుటంచులదుప్పటివల్లెవాటుతో
ననుపమతారహారకటకాంగదముఖ్యవిభూషణాళితో
ఘనఘనసారసంకుమదకల్పకమాల్యకదంబకంబుతోఁ
గనఁదగియెన్ శచీవిభుఁడు కంతువసంతగతిన్ నిజాకృతిన్.83
ఉ. ఆలలితాంగి యాసురుచిరాంగునిఁ గన్గొనినంతఁ జెమ్మటల్
గీలుకొనంగ మేను బులకించ నకించనధైర్యయై మదిన్
జాలియు బాళిఁ దత్తరము నానఁగ నానఁగ నా నగారి ను
న్మీలదపాంగనీల నలీనీదళరాజినిఁ బూజ చేయుచున్.84
ఉ. దేవ, శచీమనోరమణ, దేవర వచ్చిన దేమి?
నీదు శో
భావిభవంబుఁ జూడ;
వనవాసిని కేమిటి చెల్వు?
రత్న మే
తావున నున్న నేమి?
వనితానవమన్మథ, నాపయిన్ గృపో
ద్భావన నానతిచ్చెదవు!
భావజునాన నిజంబుపల్కితిన్.85
క. "నామగనివేషభాషల
నేమిటికి ధరించివచ్చి తెఱుఁగంజెపుమా”
“నీ మగనిరూప మౌటకు
పైమాటలు నడపవలదె పంకజగంధీ!"86
క. "తగవా యిటువలెఁ బల్కఁగ
మగనాలను నేను భువనమాన్యుఁడ వీవున్
నగరాజదమన, నిన్నున్
నగరా యిట్లయిన సురలు నగరావళులన్.87
క. అని పలికి యళుకుఁ గులుకున్
నునుసిగ్గును రాగరసము నూల్కొనుచూడ్కిన్
గనుఁగొనుచు నవలఁ బోవఁగఁ
జని యడ్డముసొచ్చి పాకశాసనుఁ డనియెన్.88
చ. నిలు నిలు మోలతాంగి, కరుణించవె చంపకగంధి, సిగ్గటే
చిలుకలకొల్కి, యంజకవె చిత్తజుపూవులముల్కి, నీపయిన్
పలచితినే మృగాక్షి, పెరవాఁడనటే శుకవాణి, యేనిఁకన్
నిలువఁగలేనె చాన, నను, నీదగుబంటుగ నేలవే చెలీ!89
శా. నామీఁదన్ దయసేయవే పలుకుపంతం బేల వే యేలవే
మోమోటం బొకయింక లేక సకీ, నీ మోమైననుం జూపవే
నీమో వించుక నొక్క నీయఁగదవే నీప్రక్కకున్ జేర్పవే
యేమైనా పలు కాదరించుచు వేత నే నెందాఁక సైరింపుదున్."90
క. అనుచున్ బలరిపుఁ డంతటఁ
జనవును బలిమియును నెనరు సైఁగలుఁ దోఁపన్
దనకరముల వనితామణి
చనుమొనలకు వేగఁ జాచఁ, జాన యిటాడెన్.91
చ. “సరసము చేయరాకు నునుజన్నులపైఁ జెయి వేయఁబోకు ని
ల్వరమని నల్వురున్ వినుకులన్ గడునిందలు గట్టి యెందుకున్
వెఱవక యాడుకొందు రవివేకమునన్ వల దేల వాదు ని
ర్జరపతి! చాలుఁజాలు మునిరాజు వినన్ మఱి మానమయ్యెడున్.92
చ. "మునిపతి కోపగించినను మోసమటంటివి మోసమేలనో
వనిత, యతండు నిష్కపటి వాహిని కేఁగెను దానమాడ నీ
మనసు కరంగఁగావలెను మక్కువతో ననుఁ గౌఁగిలించి నీ
ఘనగళశబ్దమంత్రములఁ గాయజభూతముఁ దొలఁగావలెన్.93
ఉ. దూరపుఁగొండలున్ నునుపు దోఁచునటన్నది నిక్కమాయె నో
వారిజగంధి, నీమనసు వచ్చునటంచని వచ్చినాఁడ ని
స్సారము చేయఁగాఁ దగదు చక్కన గా దిది లేనిపోని యీ
బీరములేల నాదుమనవిన్ వినవే ఘనవేణికామణీ!94
ఉ. చేర్పుము కౌఁగిటన్ వడిని జిక్కులు బెట్టకు కంతుకాక చ
ల్లార్పఁగ మోవిపానకము లానఁగ ని మ్మిదివేళ శయ్యకుం
దార్పుము జాగు సేయకవె తామరసాక్షి మరుండు సాక్షి కం
దర్పునిమందిరంబునకు దండము దండము మాటిమాటికిన్.95
చ. సతతము నీగుణంబులను జక్కఁదనంబును విందుఁగందు సం
గతిగ ననంగసంగరముఖంబునఁ గోరిక దీర్తువంచు నే
మతిని దలంచి నీకడకు మానిని, వచ్చితి కాదటంటివా
యతనుని యాన నీమగని యాన మఱిన్ మఱి యాన నాపయిన్.96
సీ. కొమ్మ, నీ కమ్మని కెమ్మోవి యీయవే
యమృతంబుఁ గ్రోలిన యరుచి దీఱ
కలికి, నీచనుగుబ్బకవఁ జేరనీయవే
కనకాద్రిపై నున్న కసటు దీఱ
సుదతి, నీకౌగిఁటఁ గదియింపవే కల్ప
సుమతల్పమున నున్న సొలపు దీఱ
వనిత, నీతొడజగ్గుఁ గనుఁగొన నీయవే
రంభతో నెనసిన రట్టుదీర
తే. మస్తుమీఱిన సురహస్తి మస్తకంబుఁ
గుస్తరించిన మామకహస్తములకు
హాయిగా నీ నితంబంబు లంటనియవె
కంటు నామీఁద నేల వాల్గంటి, నీకు.'97
ఉ. కురులకు వందనంబు తెలిగోముముఖంబునకున్ జొహారు నీ
యరుదగు కంబుకంఠమున కంజలి నీ కుచకుంభపాళికిన్
కరములు మోడ్చెదన్ బెళుకు కౌనుకు మ్రొక్కెద పంచబాణ మం
దిరమునకున్ సతీమణి! పదింబదిగా పదివేల దండముల్.98
క. అని చెలిపాదంబులపై
ఘనచింతామణిసురత్నకనకకిరీటం
బును మోపి లేవకుండిన
వనజానన సిగ్గువలపు వడ్డికిఁ బాఱన్.99
క. “దేవుఁడ వేలిన సామివి
పోవయ్యా! నీవు నాకు మ్రొక్కఁగఁ దగునా
లేవు” మని గుబ్బచనుమొన
లా విభునెద సోఁక నెత్తె నంగన ప్రేమన్.100
ఉ. ఎత్తిన పట్టువీడక సురేంద్రుఁడు తత్కుచకుంభపాళిపై
నత్తమిలన్ దురంతవిరహార్ణవపూరము నీదుకైవడిన్
హత్తి రసాలసాలమున నల్లెడు మల్లియతీవకైవడిన్
గుత్తపుగుబ్బలాడి చనుగుత్తులఁ దత్తను వొత్తె సొక్కుచున్.101
ఉ. అంతటఁ గొంతసేపటికి నంగన సిబ్బెపుఁ గుబ్బఁ గ్రుమ్మినన్
స్వాంతము జల్లనంగ బలశాసనుఁ డాసను మోవియాన నొ
క్కింత మొగంబు ద్రిప్పి "పడకింటికి రమ్మట కొన్ని సమ్మతుల్
కాంతుఁడ, నీ వొసంగినను గాని యొడంబడ" నంచుఁ బల్కుచున్.102
తే. చెట్టపట్టుక తనదు పూసెజ్జకడకు
వల్లభునిఁ దోడుకొని పోయి వలపు మెఱయఁ
దొడను దొడఁజేర్చి కూర్చుండి తోయజాక్షి
తోయజాక్షీణరసధార దొలుకఁ బలికె.103
సీ. 'మెఱుఁగువాతెఱ నొక్కకుర యెంగిలయ్యీని'
'యమృతాని కెంగిలి యనఁగ నేమొ!'
'సుద్దిగ నున్నాను వద్దుర మైవ్రాల'
'నతివ, బంగారాని కంటుగలదె?'
'గుబ్బచన్నుల నంటకుర యొక్కప్రొద్దురా'
'చెయ్యంటకయగోటఁ జెనకరాదె'
'జీకిన మడుపువద్దుర నేఁడు నోమురా'
'తరుణి, యైనను నీవె కొఱికియీవె'
తే. 'వ్రతము కలయిక కారాదు వాదు లేల'
'కలయకయె కళలయిక్కువల్ తెలిసి నొక్కి
దక్కి దక్కింతు నే నిన్నుఁ దరుణి! యనఁగ'
నిగ్గుమొగమునఁ గళ దేర నెలఁత యనియె.104
సీ. 'నేను నీ చెక్కులనెలవంక లుంతును
నీవు నాచన్నుల నిలుపరాదు
నేను నీ కేమ్మోవి నెఱగంటు సేయుదు
నీవు నామోవి కందించరాదు
నేను నీకురు లెల్ల నెఱిఁ జిక్కు వఱపుదు
నీవు నాకొప్పుఁ బట్టీడ్వరాదు
నేను నీగళమున మృగనాభి నలఁదుదు
నీవు నా నెమ్మేన నించరాదు
తే. గుటగుటల మీఱిగడిదేటి కూకిపల్కు
లీవు నేనునుఁ బల్కరా దిట్లు సమ్మ
తైన వచ్చెద నీవు రమ్మనినకడకు
వివిధశృంగారరసలోల విబుధపాల!'105
చ. అనుటయు నల్లనవ్వి విబుధాధిపుఁ 'డట్లనె నౌనుగాక యం
చన గురికట్టునిల్చునటె యంగజుకేళి' నటంచుఁ జేర్చె న
క్కున ననబోఁడి చన్మొనలఁ గ్రుమ్మె సురేంద్రుఁడు మోవియానెఁ గం
జనయన చెక్కుఁగీటెను గచాకచిఁ బోరిరి వార లిర్వురున్.106
వ. ఇట్లు మదనకదనారంభసముజ్జృంభమాణమనోభిలాషల
నయ్యహల్యాసుందరీపురండరు లమందానందకరచందనాదికస్తూరికా
పరిమళద్రవ్యంబులకు సొమ్మసిలియుండి రప్పుడమ్మందయాన బృందారక
బృందవందితపదారవిందుడగు నాసంక్రంచనునింగలయు మోహావేశంబునం
బట్టలానిగుట్టునం జిట్టాడుచు మట్టుమీఱి యతండు కౌఁగిటం జేర్చినం
జేర్పనీయక యబ్బురఁపు గబ్బిసిబ్బెంపుగుబ్బలనిబ్బరంబునఁ జెయిసోఁకిన
సోఁకనీయక కటికిచీఁకటికప్పులన్ గుప్పునన్ గప్పుకొప్పు నిమిరినన్ నిముర
నీయక మిక్కిలి యెక్కువయైన చక్కని చెక్కు గీటినం గీటనీయక మధుర
సుధారసధారాధురంధరంబైన బింబాధరంబు గ్రోలినం గ్రోలనీయక
కుందనపుటందంపుగెంటెనపూవునుం గుంటుపఱుచు తుంటవింటిపాదుసాహి
దివాణంబు నంటిన నంటనీయక మెండొడ్డుకొని యేమఱించి యొయ్య
నొయ్యన విరులశయ్యకుఁ జేర్చి లాలించి కౌఁగిలించి యదలించి బాహా
బాహిఁ గచాకచిం బెనంగి యల్లందులకుం గమకించి నీవి వదలించి చివురు
సవురు జవురు మోవితేనెలఁ గ్రోలి పైకొని కోకిలచందంబున శ్రవణా
నందంబుగా గుటగుటం బలుకుచు "మేలు, బళీ, హౌసు, శాబాస"ని మెచ్చి
యొకరొకరిమేను లప్పళించి వింతవింతపిలుపులం బిలుచుచుఁ గెందామరలం
బోలు కందామరల నరమోడ్పులు గావించుచు మన్మథబ్రహ్మానండంబు
నుం బొంది మఱియును.107
శా. 'ఔనే ముద్దులగుమ్మ, చూచి తవునే యందంపుఁబూరెమ్మ, మే
లౌనే చక్కఁదనాలయిక్క, యదెమేలబ్జాస్త్రుచేఢక్క, యౌ
దౌనే యింతులమేలుబంతి, భళి శిస్తౌనే కళల్ దొంతి, మి
న్నౌనే' యంచు మఱిన్ బురందరుఁ డహల్యాభామ నీక్షించుచున్.108
సీ. 'ఎన్నఁడు నేర్చితే యింతులమేల్బంతి,
పారావతారావపాటవంబు
యెపు డభ్యసించితే యిందుబింబానన,
వివిధచుంబనకళావిభ్రమంబు
యెచ్చోట నేర్చితే యేణీవిలోచన,
నఖరాంకవిన్యాసనైపుణంబు
యేనాఁ డెఱింగితే చీనిచక్కెరబొమ్మ,
పంచబాణాహవప్రౌఢిమంబు
తే. మూలనున్నట్టి జడదారి ముద్దరాల
వెన్నిచిన్నెలు నేర్చితే యెమ్మెలాడి,
మేలు మే'లని కాంతుఁడు మెచ్చి పొగడ
వింతవింతగ మఱియును సంతసమున.109
సీ. వెనుదీయకుమటంచు వెడవిల్తుఁ డాడించు
జాటిపోలికఁ గీలుజడ చలింప
స్మరసంగరంబునఁ గురియు పూవులవాన
తెఱఁగున సరులముత్తెములు రాల
మరుఁడను జగజెట్టి బిరుదువీణెలమాడ్కి
గళరవంబున జమత్కార మెసఁగఁ
జిత్తజరాజ్యాభిషేకాంబువులమాడ్కి
జల్లుగాఁ జెమటచిత్తళ్ళు గురియ
తే. మదనపరదేవతాధ్యానమహితనిష్ఠఁ
బోలి యఱమోడ్పుఁగనుదోయి పొలువు మీఱ
నంబుజేక్షణ పురుషాయితంబు సలిపె
నెలమి నమరావతీంద్రు దేవేంద్రుఁ గూడి.110
వ. అప్పుడు.111
ఉ. భావము లొక్కటయ్యెను బ్రపంచ మొకించుక తోఁచదాయె నే
నీ వను భేదమున్ జనె యనిర్వచనీయ మఖండ మాత్మసా
క్ష్యావిదితంబు నద్వయ మనంతమునౌ సుఖ ముప్పతిల్లె నిం
దీవరగంధికిన్ బతికి నిర్భరసౌరత మొంది పొందుచోన్.112
సీ. చంద్రమండలసుధాసార మూరినయట్లు
చెమటచే నెమ్మోము చెలువు మీఱ
అంకుశక్షతమదహస్తికుంభములన
గోటిపోటులఁ జిన్నిగుబ్బ లెసఁగ
మగతేఁటి వ్రాలిన మంకెనవిరిలీలఁ
గావిమోవినిఁ బంటికాటు తనర
గాలికిఁ గదలెడు కదళిక రీతిగా
గడగడమని తొడల్ వడఁకుచుండ
తే. జాళువాగట్టుమీఁదను వ్రాలినట్టి
నీలమేఘంబు చొప్పున నెరులు కటిని
వ్రాల సురతాంతమున లేచి లీల నిలిచె
నింపున నహల్య యవ్వేళ నింద్రుదెసను.113
ఉ. వేకువజాము దోఁచి నళిబృందగరుద్భవవాతసంహతి
స్తోకదళద్దగత్ స్ఫురితతోయరుహప్రసరన్మరందధా
రాకలితోదకద్విగుణితాంచదభంగతరంగభంగి ప
ద్మాకరశీకరాంతరవిహార ముదారసమీర మంతటన్.114
సీ. మరుసాముకండెముల్ గిరికొన్నతొడలతోఁ
దడబాటు చెందిన నడలతోడ
గుబ్బచన్నులను జిక్కులు వడ్డ సరులతో
నెరికొప్పునను జాఱువిరులతోడ
గజిబిజి పలుగంటిగమి కావిమోవితో
నెఱిఁ దప్పి వదలిన నీవితోడఁ
గెంపారు నెలవంకగుంపులటెక్కుతో
సోగకన్నుల నిద్రసొక్కుతోడ
తే. మిగులఁ జెదరినయలకల మెయిపులకల
కెలఁకు లరయుచుఁ జిలుకలకొలికి యపుడు
దురుసునడలను గేళిమందిరము వెడలె
నలరువిలుకాని మదహస్తి యౌ ననంగ.115
చ. వెలువడి యింతటంతటను వేగిరపాటున నొంటిపాటునన్
గలయఁగఁ జూచి చూచి శచికాంతుని మెల్ల నహల్య పిల్చి బల్
మెలఁకువతోడుతన్ బనుప 'మీఁదటి బుద్ధి యిఁకేమి పల్కితే
వెలఁదిరొ, పోయివత్తునటవే దిటవే' యని యింద్రుఁ డిట్లనెన్.116
మ. 'తరుణీ, యేమని పల్కుదున్ గమనవార్తల్ పల్కనోరాడదే
మఱి కాదంచని యెంచి పోదునన రామా, నేఁడు కాళ్ళాడదే
సరసన్ నిల్చిన వచ్చు నీపతి యథేచ్ఛన్ నిల్వఁగాఁ గూడదే
కఱవాయెన్ గదె ముచ్చటల్ మనకు రాకల్ పోక లిం కేడవే.117
ఉ. నీవును నేను నొక్కయెడ నెమ్మది నెమ్మదిగూడి యుండుటల్
భావమునందు సైఁపకను పాపపుదైవత మిట్లు చేసె నే
నేవహిఁ దాళఁజాలు దిఁక నెన్నఁడు మర్వకుమీ ననుం దయా
భావనచేత' నంచు సురవర్యుఁడు వల్కిన కల్కి ప్రీతిగన్.118
సీ. 'మోహనాకార, నీమోముఁ జూచినఁ జాలు
సొబగైన చందురుఁ జూడనేల?
మదనావతార, నీపెదవి యానినఁ జాలుఁ
గండచక్కెరపానకం బదేల?
సరస, నీనెమ్మేనిచాయ సోఁకినఁ జాలుఁ
గనకాభిషేకంబు కాంక్ష లేల?
శృంగారమూర్తి నీ చెట్టఁబట్టినఁ జాలు
నరిదితామరఁ గేల నంటనేల?
తే. కళల ననుఁ జాల మెప్పించి కౌఁగిలించి
నీవి వదలించి కదియించి నేర్పు మించి
రతులఁ దేలించి మదనసామ్రాజ్య మేలు
నేలికను నిన్ను నెడబాయఁజాల' ననుచు.119
చ. సరసిజపాళిఁ దుమ్మెదలు చాలుగ నిల్చినరీతి దేవరాట్
కరకమలంబులన్ దనదు కన్నులఁ గాటుకరేక దాకఁగా
హరు వమరంగ నొత్తుకొని యంగన కన్నుల నీరునించి 'యీ
విరహము నెట్లు ద్రోతుఁ దగవే యెడబాయుట' లంచుఁ బల్కఁగన్.120
చ. 'కలకంఠీమణి, పోయివచ్చెదఁ గటాక్షం బుంచు నామీఁదన ని
న్నెలమిన్ నమ్మినవాఁడ' నంచు సురరా జిట్లాడినన్ మందహా
సలసద్వక్త్రము వాడఁ బ్రోడ మదిలో సంతాపమున్ గూడఁ జం
చలమై ధైర్యము వీడ నింద్రుఁ గని వాంఛాలోలితస్వాంతమై.121
ఉ. 'నమ్మినదాన, నాతనువు నమ్మినదానను నీకు; నింక నే
నమ్మకచెల్ల, నన్ను విరహాగ్నికి బాల్పడఁజేసి పోవుటల్
సమ్మతమాయెనా, విడువఁజాలితివా, యెటులైన నిన్ను నేఁ
బొమ్మనఁజాలఁ, జాలినను బొందినిఁ బ్రాణము లుండనేర్చునే.122
చ. అని యిటు పల్కి పల్కి బిగియారఁగఁ గౌఁటఁ జేర్చిచేర్చి గ్ర
క్కున మధురాధరంబుచవిఁ గ్రోలుచుఁ గ్రోలుచుఁ బాకశాసనున్
బనుప నతండు మెల్లఁగను బ్రక్కలు చూచుచుఁ బోవుచుండగా
మునివరుఁడైన గౌతమునిముందఱ నింద్రుఁడు గానఁగాఁ దగెన్.123
ఉ. కంటికి నిద్రసొక్కు మయిఁ గాడిఁన గాజులనొక్కు మోవిపై
నంటిన పంటిరక్కు సొగ సైనసిగన్ బలుచిక్కు గోటిచే
గెంటినముద్దుచెక్కు రహిఁ గీల్కొనియుండినవానిగా మదిన్
గంటున గౌతముండు తెరగంటిదొరం గని యాగ్రహంబునన్.124
ఉ. చండకరాభుఁడైన మునిచంద్రుఁడు కోపముతోడ 'నోరి, యా
ఖండల, కండగర్వమునఁ గన్గొనలేక మదీయకాంత ను
ద్దండత నాదువేషమునఁ దద్దయుఁ బొందితి వట్లుగాన నీ
వండవిహీనుఁడై తిరుగు' మంచని మించి శపించె నెంచకన్.125
చ. ఇటు శపియించి గౌతమమునీంద్రుఁడు వేగ నిజాశ్రమస్థలిన్
గిటుకునఁ జేరి కోప మెదఁ గీల్కొన భార్యను బిల్వ నంతలో
దిటవెడలంగ నంగన మదిన్ దడబాటు చెలంగ మానిచెం
గట వినయంబుతో నిలిచెఁ గాళ్ళకు నీళ్ళును గొంచు గొబ్బునన్.126
ఉ. ఆతఱి నాలతాంగిని మహాగ్రహదృష్టినిఁ జూచి 'యోసి, నీ
చేతిజలంబు లంటనికఁ జెల్లునె యెంతటి జంతవే బలా
రాతిని గోరి కూడితివి రాతిరి జామునఁ గావునన్ బలా
రాతిశరీర మందు'మని రాజముఖిన్ సునఖిన్ శపింపఁగన్.127
క. గడగడ వడఁకుచుఁ దడఁబడి
పడఁతుక జడదారిచరణపంకజములపైఁ
బడి 'శాప మెపుడు గడతున్
నుడువు'మనన్ బలికెఁ గరుణ నూల్కొన మునియున్.128
సీ. 'బలువైన రావణప్రముఖుల సమయింప
హరి జగద్విఖ్యాతి నతిశయించి
చెలువుగా దశరథక్షితిభర్త కుదయించి
రామనామఖ్యాతి రహిని మించి
మునిమాట విని తాటకిని గీటణంగించి
యతని యాగము గాచి యతిశయించి
చతురుఁడై జనకరాజతనూజను వరించి
మహితకీర్తులు గాంచి విహిత మెంచి
తే. మౌనివరుతోడ నివ్వనమార్గమునను
వరుస నిఁకమీద రాఁగలవాఁ డతండు
నిజపదసరోజరేణుల నీదుశాప
మోచనము సేయఁగలఁ' డంచు మునియుఁ బలికె.129
ఉ. అంతట నమ్మహాత్ముఁడు నిజాశ్రమవాటిఁ బరిత్యజించి దు
ర్దాంతదురంతకేసరివితానమహెగ్రవరాహవాహజి
ద్దంతురదంతిపన్నగముఁ దాపసబంధితవల్కశాటికా
త్యంతవిలాసభృన్నగమునౌ హిమవన్నగ [10]మొందె నయ్యెడన్.130
వ. అంతఁ గొంతకాలంబునకు, నిక్ష్వాకువంశపయఃపారావారరాకా
చంద్రుండగు దశరథమహారాజేంద్రునకు, దేదీప్యమానమార్తాండమండల
సమధాముండును, వైరీకాంతారప్రళయకాలదావానలప్రభాసముద్దాముం
డును, అనంతకళ్యాణగుణాభిరాముండును నై శ్రీరాముండు విష్ణుమూర్తి
పూర్ణావతారంబున జనియించి, దినదినప్రవర్ధమానుండై యుండు నవసరం
బునఁ దనుప్రభావిజితమిత్రుండగు విశ్వామిత్రుండు చనుదెంచి, దశరథాను
మతంబున, విమతఖండనశౌండభుజదండసంపాదితకీర్తిసాంద్రుండైన
శ్రీరామచంద్రుని సకలాఘౌఘనివారణసుముఖంబగు మఖంబుఁ గాచుటకై
తోడ్కొనిపోవ, నమ్మహావీరుండు, సింహశరభశార్దూలప్రముఖనానావిధ
మృగయూధశరణ్యంబగు నరణ్యంబుఁ బ్రవేశించి, బహువిధకామరూప
నిరాఘాటసంచారితశృంగాటక యగు తాటకిన్ వధియించి, నీచులగు
సుబాహుమారీచుల నుక్కడంగించి, యమ్మౌనియాగంబుఁ గాచి నిరంతర
ప్రబోధధానియగు జనకరాజ రాజధానింగుఱించి వచ్చునప్పుడు, పురోభాగం
బున విజ్ఞానసూర్యప్రభాసరస్తతముని గౌతముని యాశ్రమంబుఁ గనుంగొని.131
చ. 'మునివర, యేమి యీవనము ముచ్చటగాఁ దగియుండియున్ వృథా
జనకులహీనమై యిరిణసన్నిభమై కనుపట్టె నేమకో
వినియెద' నంచు వేఁడు రఘువీరునికిన్ గుశికాత్మజుండు ప
ల్కెను మది సంతసం బలర లిలఁ దదాశ్రమవర్తమానముల్.132
ఉ. 'భూతలమందు మౌనికులముఖ్యుఁడు గౌతముఁ డంచనన్ దపః
ఖ్యాతిని దీటు లేదన జగత్త్రయమందుఁ బ్రసిద్ధినందు న
య్యాతనియాశ్రమం బిది మహాశ్రమవారణకారణంబు రా
చూతువుకాని యందు నొకచోద్యము హృద్య' మటంచుఁ బల్కుచున్.133
క. ఆరాముని గౌతమముని
యారామస్థానవాటికై పిల్చు చహ
ల్యారామశాపహృతిపై
యారామగతిన్ మునీంద్రుఁ చ్చటి కేఁగెన్.134
క. అందందుఁ జూచుకొనుచును
ముందఱ రఘురాముఁ డపుడు పోవుచునుండన్
కెందమ్మిఁ బోలుపాదము
లందలి రేణువులు ఱాతి నందినయంతన్.[11]135
మ. మృదువై మెల్లన కొంతసేపటికి సద్వృత్తంబుగా నౌచుఁ బెం
పొదవన్ గొంత కరంగి సోఁగయగుచున్ బొల్పొంది యారాయి చ
క్కదనం బేర్పడి మోహనాకృతి చెలంగఁ యౌవనశ్రీ తగన్
సుదతీరత్నముగాఁగ నిల్చెను మదిన్ జోద్యంబు వాటిల్లఁగన్.136
చ. వినయముగాను మౌనియలివేణియుదారపదారవిందముల్
కనుఁగొనుచుఁ రఘూద్వహుఁడు గ్రక్కునఁ దాను నమస్కరించె నా
వనిత యొసంగు దీవనలవల్లను నుల్లము పల్లవింపఁగా
మునిమునిమీసముల్ కులుకు మోమున నవ్వు దొలంకుచుండఁగన్.137
క. ఆతఱి గనుఁగొని బిరబిర
గౌతమముని యేఁగుదెంచి గౌరవ మొప్పన్
నాతిసమీపముఁ జేరిన
యాతనిఁ గని రామచంద్రుఁ డానందమునన్.138
చ. ముదము మదిన్ బొసంగ 'మునిపుంగవ, రాముఁడ నే' నటంచుఁ ద
త్పదయుగపాళికిన్ దనదు ఫాలము సోఁక సమస్కరించి యిం
పొదవఁగఁ జెంతఁ జేరిన రఘూద్వహునిన్ ముని యాదరించి సం
పద లిగురొ త్తఁ గౌశికుని పట్టు కనుంగొని పల్కెఁ బ్రేమతోన్.139
సీ. “జంభారిమణి వృత్తసంభారదోస్తంభ
భూషణుం డకలంకభాషణుండు
భాషాపతి మహామనీషావిశేషార్థ
ధారణుం డాప్తసాధారణుండు
చండభానురుచి ప్రచండకాండనిరస్త
తాటకుం డఖిలలోకాటకుండు
అధ్యాత్మవిద్యానిధిధ్యాసవిధ్యాత్మ
భావనుం డఖిలైకపావనుండు
తే. భద్రనిర్ణిద్రుఁడగు రామభద్రుఁ డస్మ
దీయభద్రేభయానను దీనశరణ
చరణసరసిజరేణులఁ బరమకరుణ
శాప మెడలింపఁ గంటివా తాపసేంద్ర!'140
క. అని పలుకుచు గౌతమముని
తనచెంత మెలంగు రామధరణీశ్వరుతో
మనమున సంతసమందుచు
ననియెను సమ్మతముగాఁగ నపు డందఱికిన్.141
సీ. 'బహుజన్మకర్మసంభవపాపజలరాశి
మరుభూమితలముగా మెఱయఁజేయు
నజ్ఞానపటలఘోరాగాధకూపంబు
నెడలేక పూడ్చి యేర్పడఁగఁ జేయు
నమితదుర్మోహకృత్రిమరత్నదీధితుల్
మరలనీయక క్రమ్మి మరుఁగుచేయు
నప్రాప్తితాపకృత్ర్యసనదిక్కోణంబు ?
తెలియకుండువిధంబుఁ గలుగఁజేయు
తే. నబ్జసంభవముఖనిఖిలామరాళి
మస్తకకిరీటవిన్యస్తమణిగణఘృణి
ఘటితభవదీయచరణపంకజపరాగ
రాజి వర్ణింప నెవరితరంబు రామ!142
ఉ. ఖ్యాతిని నీదుపాదకమలాంచితరేణురజంబుఁ దాల్ప ని
శ్చేతనమైన ఱాతి కొకచేతన మబ్బె నటన్న నట్టిచో
జేతనవృత్తినున్న సురసిద్ధులు సాధ్యులు మౌళిఁ దాల్చి యే
రీతిగ నుందురో తెలియ రెవ్వరు రామ, భవత్పదంబులన్.'143
క. ఇటు కొనియాడుచు నుండిన
జటిలుని వీడ్కొనుచు రామచంద్రుఁడు మిథిలా
పుటభేదనమున కేఁగెను
తటకాపడి కౌశికుండు తనతో రాఁగన్.144
ఉ. అంతటఁ బ్రేమ గౌతముఁ డహల్యయు నుల్లము లుల్లసిల్లఁగాఁ
జింతలు దీఱ నొండొరులు జిత్తజుకేళికళావిలాసముల్
వింతలుగా ఘటించుచును వేడుకతోడుతఁ గూడియుండి యిం
తంతనరాని సౌఖ్యముల నందిరి ముచ్చటమీఱ నెప్పుడున్.145
క. ఈకథఁ జదివిన వినినన్
బ్రాకటముగ వ్రాయఁగనిన బహుసంపదలన్
గైకొను మనుచున్ వారికి
శ్రీకరుఁడగు రంగవిభుఁడు ప్రేమ నొసంగున్.146
శా. కస్తూరీతిలకోజ్జ్వలస్మితముఖా కైవల్యలక్ష్మీసఖా
హస్తోదంచితశంఖచక్రరుచిరా హస్తీంద్రరక్షాపరా
అస్తోకామృతవర్షివేణునినదా యానందలీలాస్పదా
త్రస్తాస్తోకజనాభయప్రదకరా ధారాధరశ్రీకరా!147
క. సారఘనసారనవకా
శ్మీరపటీరాంగరాగశీతలతటదా
ధారమణీకుచదుర్గయు
గారోహవిహారలీల యదుకులబాలా!148
మాలిని. దళితవిపులమాయా ద్రావిడామ్నాయగేయా
జలరుహదళనేత్రా సవ్యసాచీష్టమిత్రా
బలివిభవవిరామా భానువంశాబ్ధిసోమా
కలశజలధిశాయీ కామితార్థప్రదాయీ!149
గద్య
ఇది శ్రీమత్పాండ్యమండలాధీశ్వర శ్రీ విజయరంగ చొక్కనాథ మహీ
నాథకరుణాకటాక్ష సంపాదిత గజతురంగ మాందోళికా ఛత్ర చామర
విజయదోహళ కాహళ భూరిభేరీబిరుదధ్వజ ప్రముఖాఖిల
సంపత్పారంపరీసమేధమాన సముఖ మీనాక్షీనాయక
తనూభవ శ్రీ మీనాక్షీదేవీ కటాక్ష
లబ్ధకవితాసాంప్రదాయక వేంకట
కృష్ణప్పనాయక ప్రణీతంబైన
యహల్యాసంక్రందనంబను
మహాప్రబంధంబునందుఁ
దృతీయాశ్వాసము.
సర్వంబును
సంపూర్ణము.
- ↑ ననిపించిన
- ↑ వలవల
- ↑ ప్రౌఢిమములు
- ↑ నచ్చెలి
- ↑ పంటపగ
- ↑ రావశమా పోవశమా
- ↑ యీపని
- ↑ భిసార
- ↑ గురుఁడు
- ↑ మొందెఁ బొందుఁగన్
- ↑ చెన్నపుర ప్రాచ్యలిఖితపుస్తకభాండాగారమునఁగల D 386 నెంబరు వ్రాత
ప్రతిలో గ్రంథ మింకమీద నీవిధమున ముగింపఁబడినది.
క. వనరాశిఁ జనించిన శ్రీ
వనజాక్షియొ యెదురుకొనిన వనదేవతయో
వనవసదావళిమించో
యని యెంచఁగ ఱాయి చెలువయై చెలు వగుచున్.136
సీ. మును దలమున్క లౌ మోహాంధకారంబు
వెనుక దీసినరీతి వేణి తనర
శాపరూపదినాంతచంద్రోదయములీల
మొలకనవ్వుల ముద్దుమోము మెఱయ
బహుకాలపరిచితోపలత యంటిన మాడ్కి
కఠినవక్షోజయుగ్మంబు గులుక
తదదృశ్యభావంబు తవిలి పోవని ఠీవి
గడుసన్నమౌ వలె గౌను వడక
తే. క్షితిని లోహంబులను పైఁడి చేయు స్పర్శ
వేది నొగి రామపాదారవిందరజము
పూని శిల పైఁడి చేసిన నాన మించ
కాంత యై నిల్చె గౌతమకాంత యపుడు.137
క. తన మునుపటి వృత్తాంతము
మునిపతి వీరలకుఁ దెలుప ముప్పే యనుచు
ఘనలజ్ఞానతముఖి యౌ
వనితకు రఘునందనుండు వందన మిడియెన్.138
తే. పెండ్లికొడుకవు గమ్మని ప్రేమ మౌని
రామ దీవించి శ్రీ రఘురామవిభునిఁ
బూజ గావించుచున్న నద్భుతము గాఁగ
గౌతముఁడు వచ్చి యా రాముఁ గాంచి పొగడె.139
(ఖడ్గబంధము)
క. సౌరధరధీర రఘువర
పారదధర నీరజారి భవకీర్తిరమా
మారీచమదవిరామా
నీరదనిభకాయ రామ నృపతిలలామా!140
ఉ. శ్రీరఘురామ నిన్ను నుతి సేయఁగ నెంతటివాఁడ నేను నీ
పేరు దలంచి నంత నతిభీకరదుష్కృతముల్ దొలంగు నీ
చారుపదాబ్జసంగతిని సంభవ యౌట పవిత్ర గాదె భా
గీరథిలీల విభ్రమరకేళిని నంచు నహల్యఁ గైకొనెన్.141
మ. దివి వర్షించె ప్రసూనవర్ష మపు డందెల్ మ్రోయ నాడెన్ సుధా
శి వధూబృందము దివ్య దుందుభులు మ్రోసెన్ ................
...............................................................................
...............................................................................142
తే. అంత సంతుష్టచిత్తుఁ డై యక్షపాదుఁ
డధిప కూకుదమయ్యె నీయంఘ్రిపద్మ
మనుచు పొగడుచు కాంతఁ దోడ్కొనుచుఁ జనియె
సంతసిల్లుచు మునికులచంద్రుఁ డపుడు.143
క. అని శ్రీ వైశంపాయన
మునిముఖ్యుఁడు దెలుప విని ప్రమోదాన్వితుఁ డై
జనమేజయమహిపాలుఁడు
అనురాగము పొందుచుండె ననవరతంబున్.144
ఉ. కౌస్తుభచారువక్ష సితకంజదళాక్ష కళిందకన్యకా
నిస్తులనీలవర్ణ కమనీయ చరాచరమాననీయ ప
ద్మాస్తనకుంకుమాంక నవమండన దానవదర్పఖండనా
కస్తురిరంగ రంగపురకైరవపూర్ణకురంగలాంఛనా!145
క. కుందారవిందసుందర
మందారసుకీర్తిహార మహితవిహారా
వందారుజనాభీప్సిత
బృందారకరత్న సమరభిన్నసపత్నా!146
మత్తకోకిల.
చంద్రపుష్కరిణీతటాంచలచార చారణసన్నుతా!
మంద్రనీరదమాలికాసుకుమార మారశతోపమా!
సాంద్రసత్కరుణానవామృతసార సారసలోచనా!
ఇంద్రచంద్రదినేంద్రముఖ్య సురేశ యీశవిభావితా!147
[గద్యము—సమానమే.]