అహం భవాస్మి
అహం భవాస్మి
రచన: కాలనాధభట్ట వీరభద్ర శాస్త్రి
క్షీరసాగర మధనం జరిగేటప్పుడు
ముందుగా హాలాహలం వుద్భవించింది
రాక్షసులతోసహా అందరూ హాహాకారాలు చేసారు
బోళాశంకరుణ్ణి ప్రార్దించారు
సారీ! స్తుతించారు
ఉబ్బులింగడు పొంగిపోయి నేనున్నానంటూ వచ్చి
హాలాహలాన్ని గుటుక్కున త్రాగాడు
అప్పుడు తెలిసింది కాబోలు రుచి
మింగలేక కక్కలేక
గొంతుదగ్గర నొక్కిపెట్టాడు
దాంతో గరళకంఠుడయ్యాడు
భావితరాలకు మార్గదర్శకుడయ్యాడు
ఈనాడు ప్రతివాడు పరమశివుడే
సాంబశివుడు ఆ నాడు ఒక్కసారి మాత్రమే విషం మింగాడు
నేడు మానవుడు
అనునిత్యం జరిగే దురంతాల పరిణామాల
హాలాహలాన్ని నిరంతరం గ్రోలుతూ
మింగలేక కక్కలేక
నిస్సహాయంగా చూస్తూ అనుభవిస్తూ
అపర గరళ కంఠుడవుతున్నాడు
అందుకనే కాబోలు అనుకొంటున్నాడు
అహం భవాస్మి