1. ముగ్గురు మనువుల వృత్తాంతము

గజేంద్ర మోక్షణ కథా ప్రారంభము

వ. మానవాధీశ్వర: మనువు నాలవవాడు

తామసుం డనగ నుత్తముని భ్రాత

పృథ్వీపతులు కేతు వృషు నర ఖ్యాత్యాదు

లతని పుత్రులు పద్గు రధికబలులు

సత్యకహరి వీర సంజ్ఞులు వేల్పులు

త్రిశిఖనామమువాడు దేవవిభుడు

మునులు జ్యోతిర్వ్యోమ ముఖ్యులు; హరి పుట్టె

హరి మేధునకు బ్రీతి హరిణియందు;


ఆటవెలది:

గ్రాయబద్దు డయిన గజరాజు విడిపించి

ప్రాణ భయము వలన బాపి కాచె

హరి దయాసముద్రుడఖిలలోకేశ్వరు

డనిన శకుని జూచి యవనివిభుడు.


కందము:

నీరాటవనాటములకు

బోరాటంబెట్లుగలిగె పురుషోత్తముచే

నారాటమెట్లుమానెను

ఘోరాటవిలోన భద్రకుంజరమునకున్..."


కందము:
మునినాధ: యీ కథాస్థితి
వినిపింపుము వినగ నాకు వేడుక పుట్టెన్;
వియెద గర్ణేంద్రియముల
పెనుబండువు సేయ మనము బ్రీతింబొందన్.

కందము:
ఏ కథల యందు బుణ్య
శ్లోకుడు హరి సెప్పబడుని సూరిజనముచే
నా కథలు పుణ్య కథలని
యాకర్ణింపుదురు పెద్ద లతి హర్షమునన్.

వచనము:
ఇవ్విధంబున బ్రాయోపవిష్టుండైన పరిక్షిన్నరేంద్రుండు బాదరాయణి నడిగెనని చెప్పి సభాసదులయిన మునుల నవలోకించి సూతుండు
పరమహర్ష సమేతుండై చెప్పె:నట్లు శుకుండు రాజునకిట్లనియె.

సీసము:
రాజేంద్ర: విను సుధారాశిలో నొక పర్వ
తము త్రికూటంబనదనరుచుండు
యోజనాయుతమగు నున్న తత్వంబును
నంతియ వెడలువు నతిశయిల్లు
గాంచనాయస్సారకలధౌతమయములై
మూడు శృంగంబులు మొనసియుండు;
దట శృంగబహురత్న ధాతుచిత్రితములై
దిశలు బూనభములు దేజరిల్లు;

తేటగీతి:
భూరిభూజలతా కుంజ పుంజములును
మ్రోసిపఱతెంచు సెలయేటి మొత్తములును
మరగి తిరిగెడు దివ్య విమానములుని
జఱులగ్రీడించు కిన్నరచయము గలిగి.

వచనము:
అది మఱియును మాతులుంగ లవంగ లుంగ చూత కేతకీ భల్లాత కామ్రాతక సరళ పనస బరరీ వకుళ వంజుల వట కుటజ కుంద కురవక
కురంటక కోవిదార ఖర్జూర బారికేళ సిందువార చందన పిచుమంద మందార జంబూ జంబీర మాధవీ మధూక తాల తక్కోల హింతాల రసాల
సాల ప్రియాళు బిల్వామలక క్రముక కదంబ కరవీర కదళీ కపిత్థ కాంచన కందరాళ శిరీష శింశు పాశోక పలాశ నాగ పున్నాగ చంపక శతపత్ర
మరువక మల్లికామతల్లికా ప్రముఖ నిరంతర బసంతనమయ సౌభాగ్య సంపదంకురిత పల్లవిత కోరకిత కుసుమిత ఫలిత లలిత విటప విటపి
వీరున్నిపహాలంకృతంబును, మణివాలుకానేక విమల పులినతరంగిణీ సంగత విచిత్ర విద్రుమలతా మ్హోద్యాన శుక పిక నికర నిశిత సముంచిత
చంచూపుట నిర్దళిత శాభిశాఖాంతర పరిపక్వ ఫలరంధ్రప్రవర్షిత రసప్రవాహ బహుళంబును, గనక మయ సలిల కాసార కాంచన కుముదకహ్లార
కమల పరిమళ మిళిత కబళాహార సంతతాంగీకార భార పరిశ్రాంత కాంతా సమాలింగిత కుమార మత్త మధుకర విటసముదయ సమీపసంచార
సముదంచిత శకుంత కలహంస కారండవ జకుక్కుట చక్రవాక బక బలాక కోయప్టిక ముఖర జలవిHఅంగ విసర వివిధ కోలాహల బధిరీబూత
భూనభోంతరాళంబును దుహినకరకాంత మరకత కమలరాగ వజ్రవైదూర్య నీల గోమేధిక పుష్యరాగ మనోహర కనక కధౌత మయూనేక శిఖరతట
దరీవిహరమాణ విద్యాధరవిబుధ సిద్ద చారణ గరుడ గంధర్వ కిన్నర కింపురుష మిధున సంతత సరససల్లాప సంగీత ప్రసంగ
మంగళాయతనంబును, గంధగజ గవయ గండబేరుండ ఖడ్గ కంఠీరవ శరభ శార్దూల శశ చమర శల్య భల్ల సారంగ సాలాపృక వరాహ మహిష
మర్కట మ్హోరగ మార్జాలాది నిఖిల మృగనాధ సమూహ సమర సన్నాహ సంరంభ సంచకిత శరణాగత శమన కింకరంబునై యొప్పు న ప్పర్వత
సమీపంబునందు.

కందము:
భిల్లీ భిల్ల లులాయక
భల్లుక ఫణి ఖడ్గ గవయ వలిముఖ చమరీ
ఝిల్లీ హరి శరభక కిటి
మల్లాద్బుత కాక ఘూక మయమగు నడవిన్.

శార్దూలము:
అన్యాలోకన బీకరంబులు జితాశానేక పానీకముల్
వన్యేభంబులు గొన్ని మత్తతనులై ప్రజ్యావిహారాగతో
దన్యత్వంబున బూరి బూధరదరీ ద్వారంబులందుండి సౌ
జన్య క్రీశల నీరుగాలి పడి కాసారావగాహార్ధమై.

ఆటవెలది:
అంధకార మెల్ల నద్రిగుహాంతర
వీధులంద బగలు వెఱచి డాగి
యెడరు వేచి సంధ్య నినుడు వృద్దత నున్న
వెడలె ననగ నుహలు వెడలె గరులు.

కందము:
తలగవు కొండలకైనను
మలగవు సింగములకైన మార్కొను కడిమిం
గలగవు పిడుగుల కైనను
నిల బలసంపన్న వృత్తి నేనుగు గున్నల్.

సీసము:
పులుల మొత్తంబులు పొదరిండ్లలో దూఱు
ఘోరభల్లూకముల్ గుహలు సొచ్చు;
భూదారములు నేల బొఱియలలో డాగు;
హరిదంతముల కేగు హరిణచయము;
మడువుల జొరబాఱు మహిషసంఘంబులు
గండశైలంబుల గవులు ప్రాకు;
వల్మీకములు సొచ్చు వనభుజంగంబులు
నీల కంఠంబులు నింగి కెగయు;




తేటగీతి:
వెఱచి చమరీమృగంబులు విసరు వాల
చామరంబుల విహరణశ్రమము వాయ
భయదపరిహేల విహరించు భద్రకరుల
గాలి వాఱిన మాత్రాన జాలి బొంది.

కందము:
మదగజ దానామోదము
గదలని తమకముల ద్రావి కడుపులు నిండన్
బొదలుచు దుమ్మెదకొదమల
కదుపులు జుంజుమ్మటంచు గానము సేసెన్.

కందము:
తేటి యొకటి యొరు ప్రియుకును
మాటికి మాటికిని నాగ మదజల గంధం
బేటి కని తన్ను బొందెడి
బోటికి నందిచ్చు నిండు బోటు దనమునన్.

కందము:
అంగీకృత రంగ న్మా
తంగీ మదగంధ మగుచు దద్దయువేడ్కన్
సంగీత విశేషంబుల
భృంగీగణ మొప్పె మ్రానుపెట్టెడి మాడ్కిన్.

కందము:
వల్లభలు పాఱి మునుపడ
వల్లభ మని ముసరి రేని వారణదానం
బొల్లక మధుకర వల్లభు
లుల్లంబుల బొందిరెల్ల యుల్లాసంబుల్.

వచనము:
అప్పుడు

మత్తేభము:
కలభంబుల్ సెరలాడు బల్వలము లాఘ్రాణించి ముట్టాడుచున్
ఫలభూజంబులు రాయుచుం జివురు జొంపంబుల్ వడిన్ మేయుచుం
బులులం గాఱెనుపోతులన్ మృగములం బోనీక శిక్షించుచుం
గొలకుల్ సొచ్చి కలంచుచున్ గిరులపై గొబ్బిళ్లుగోరాడుచున్.
కందం:
తొండంబుల మదజలవృత
గండంబుల గుంభములను ఘట్టన సేయం
గొండలు దలక్రిందై పడు
బెండుపడున్ దిశలు చూచి బెగడున్ జగముల్.

కందము:
ఎక్కడజూచిన లెక్కకు
నెక్కువయై యడవి నడచు నిభయూధములో
నొక్కకరినాధు డెడతెగి
చిక్కె నొక కరేణుకోటి సేవింపంగన్.

వచనము:

ఇట్లు వెనుక ముందట నుభయ పార్శ్వంబుల దృషార్దితంబులై యరుగుదెంచు నేనుంగు గములం గానక తెఱంగు దప్పి తొలంగుడుపడి
యీశ్వరాయత్తంబైన చిత్తంబు సంవిత్తంబు గాకుండుటంజేసి తానును దనకరేణు సముదయంబును నొక్క తెరువై పోవుచు.

సీసము:
పల్వలంబుల లేతపచ్చిక మచ్చిక
జెలుల కందిచ్చు నచ్చికము లేక;
ఇవురుజొంపముల గ్రొవ్వెలయు పూగొమ్మల
బ్రాణవల్లభలకు బాలువెట్టు,
ఘనదానశీతల కర్ణతాళంబుల
దయితల వెమటార్పు దనువు లరసి;
మృదువుగా గొమ్ముల మెల్లన గళములు
నివురుచు బ్రేమతో నెఱవు వలపు;

తేటగీతి:
పిఱుదు చక్కట్ల డగ్గఱి ప్రేమతోడ
డాసి మూర్కొని దివికి దొండంబు సాచు
వెద వివేకించు గ్రీడించు విశ్రమించు
మత్తమాతంగ మల్లంబు మహిమతోడ:

సీసము:
తన కుంభముల పూర్ణతకు డిగ్గి యువతులు
కుచములు పయ్యెదకోగు లీగ
దన యానగంభీరతకు జాల కబలల
యానంబు లందెల నండగొనగ
దన కరశ్రీ గని తలగి బాలల చిఱు
దొడలు మేఖలదీప్తి దోడు పిలువ
దన దంతరుచికోటి తరుణుల నగవులు
ముఖచంద్ర దీప్తుల ముసుగు దిగువ

తేటగీతి:
దనదు లావణ్య రూపంబు దలచి చూడ
నంజనాభ్రము కపిలాదిహరిదిభేంద్ర
దయిత లందఱు దన వెంట దగిలినడవ
గుంభివిభు డొప్పె నొప్పుల కుప్పవోలె.

వచనము:

మఱియు నానాగహన విహరణ మహిమతో మదగజేంద్రంబు మార్గంబు దప్పి పిపాసా పరాయత్త చిత్తంబున మత్త కరేణువుల మొత్తంబునుం
దానునుంజని చని.



మత్తేభము:
అట గాంచెం గరిణీవిభుండు నవపుల్లాంభోజకల్హారమున్
నటదిందిందిర వారముం గమఠమీన గ్రాహ దుర్వారమున్
వట హింతాల రసాల సాల సుమనో వల్లీ కుటీతీరముం
జటులోద్దూత మరాళచక్రబక సంచారంబుగాసారమున్.

వచనము:
ఇట్లనన్య పురుష సంచారంబై నిష్కళంకంబైన య ప్పంకజాకరంబు బొడగని

తోయజగంధంబు దోగిన చల్లని
మెల్లని గాడ్పుల మేను లలర
గమల నాళాహార విమల వాక్కల హంస
రవములు సెవుల పండువులు సేయ
పుల్లదిందీవరాంభోరుహా మోదంబు
ఘ్రాణరంధ్రంబుల గారవింప
నిర్మల కల్లోల నిర్గతాసారంబు
వదన గహ్వరముల వాడు దేర్ప

తేటగీతి:
ద్రిజగ దభినవ సౌభాగ్య దీప్తమైన
విభవ మీక్షణములకును విందు సేయ
నరిగి పంచేంద్రియ వ్యవహారములని
మఱచి మత్తేయూథంబు మడుగుజొచ్చె.

కందం:
తొండంబుల బూరించుచు
గండంబుల జల్లుకొనుచు గళగళరవముల్
మెండుకొన వలుదకడుపులు
నిండన్ వేదండకోటి నీటిం ద్రావెన్.

వచనము:
అప్పుడు

మత్తేభము:
ఇభలోకేంద్రుడు హస్తరంధ్రముల నీరెక్కించి పూరించి చం
డభ మార్గంబున కెత్తి నిక్కివడి నుడ్డాడించి పింజింప నా
రభటిన్ నీరములోన బెల్లెగసి నక్రగ్రాహ పాఠీనముల్
నభమందాడెడు మీనకర్కటములన్ బట్టెన్ సురల్ మ్రాన్పడన్

వచనము: మఱియు నగ్గజేంద్రంబు నిరర్గళవిహారంబున.

సీసము:
కరిణీకరోజ్ఝితకంకణచ్చటదోగి
సెలయీటి నీలాద్రి చెలువుదెగడు
హస్తినీ హస్త విన్యస్త పద్మంబుల
వేయుగన్నులవాని వెరవు సూపు
గలబసముత్కీర్ణ కల్హార రజమున
గనకాచలేంద్రం Hఅనత దాల్చు
గుంజరీ పరిచిత కు?దకాండంబుల
ఫణిరాజ మండన ప్రభ వహించు

ఆటవెలది:
మదకరేణు ముక్త మౌక్తికశుక్తుల
మెఱుగు మొగిలుతోడమేలమాడు
నెదురులేని గరిమ నిభరాజ మల్లంబు
వనజగేహకేళి వ్రాలునపుడు.

వచనము:
మఱియు నా సరోవరలక్ష్మి మదగజేంద్ర వివిష విహారవ్యాకులిత నూతన లక్ష్మి విభవయై యనంగ విద్యానిరూడ పల్లవ ప్రబంధపరికంపిత
శరీరాలంకార యగు కుసుమ కోమలియునుం బోలె వ్యాకీర్ణ చికురమత్త మధుకర నికరయు, విగతరసపదనకమ,లయు, నిజస్థాన చలిర
కుచరథాంగయుగలయు, లంపటిత జఘనపులినతలయునై యుండె; నంత

సీసము:
భుగభుగాయితభూరి బుద్బుదచ్చటలతో
గదలుచు దివికి భంగంబు లెగయ;
భువన భయంకరపూత్కార రవమున
ఘోరనక్రగ్రాహకోటి బెగడ,
వాలవిక్షేప దుర్వార ఝుంఝూనిల
వశమున ఘమఘమావర్త మడర
గల్ల్Zఓలజాల సంఘట్టనంబుల దటీ
తరులుమూలములతో ధరణీ గూల

తేటగీతి:
సరసిలోనుండి పొడగని సంభ్రమించి
యుదరి కుప్పించి లంఘించి హుంకరించి
భాను గబళించి పట్టు స్వర్భానుపగిది
నొక్క మకరేంద్రుడిభరాజు నొడిసి పట్టె.

కందము:
వడి దప్పించి కరీంద్రుడు
నిడుదకరం బెత్తి వ్రేయ నీరాటంబుం
బొడ వడగినట్లు జలముల
భడి కడువడి బట్టె బూర్వపదయుగళంబున్.

చంపకమాల:
పదముల బట్టినం దలకుబా టొకయింతయు లేక శూరతన్
మదగజవల్లభుండు ఢ్ర్తిమంతుడు దంతయు గాంత ఘట్టనం
జెదరగ జిమ్మె నమ్మకరిచిప్పలు పాదులు దప్పనొప్పఱన్
వదలి జలగ్రహంబు కరివాలముమూలముజీరె గోఱలన్.

.



కందము:
కరి దిగుచు మకరి సరసికి
గరి దరికిని మకరి దిగుచు గరకరి బెరయన్
గరికి మకరి మకరికి గరి
భర మనుచును నతల కుతల భటు దరుదు పడన్.

వచనము:


ఇట్లు కరి మకరంబులు రెండును నొండొండ సముద్దండదండంబులై తలపడి నిఖిల లోకాలోకన భీకరంబులై, యన్యోన్య విజయశ్రీ
వశీకరంబులై, సంక్షోభిత కమలాకరంబులై, హరి హరియును, గిరి గిరియునుం దాకి పిఱుతివియక పెనంగు తెఱంగున న్రాటం బయిన
పోరాటంబునం బట్టుచు వెలికి లోనికిం దిగుచుచు గొలంకు గలంకంబంద గడువడి నిట్టట్టు వడి తడబడక బుడబుడానుకారంబులై బుగులు
బుగుల్లను చప్పుళ్లతో బురువులు గట్టుచు జలంబు లుప్పరం బెగయం జప్పరించుచు దప్పక వదన గహ్వరంబుల నప్పళింపుచు నిశితనితాంత
దురంతదంత కుంతంబుల నింతింతలు దునియలయి నెప్పళంబునం బునుక చిప్పలు గుదుళ్లు దప్పి రక్తంబులు గ్రమ్ముదేర హుమ్మని
యొక్కమ్మడిం జిమ్ముచు నితరేతర సమాకర్షణంబులం గదలక వదంబుల మొదలిపట్టు వదలక కుదురై వర్తించుచు బరిభ్రమణ వేగంబున
జలంబులం దిరుగుచు మకర కమ

ఠ కర్కట గండకమండూకాది సలిల నిలయంబుల ప్రాణంబులు క్షీణంబులుగా నొండోటిం దాకు రభసంబున నిక్కలువడ మ్రక్కం ద్రొక్కుచు
మెండుచెడి బెండువడి నాచు గుల్లచిప్పతండంబులం బరస్పర తాడనంబులకు నడ్డంబుగా నొడ్డుచు నోలమాసగొనక గెలుపు దలంపులు
బెట్టిదంబులై రెట్టింప నహోరాత్రంబులుం బోలె గ్రమక్రమ విజృంభమాణంబులై బహుకాల కలహ విహారంబులై నిర్గత నిద్రాహారంబులై
యవక్రపరాక్రమఘోరంబులై పోరుచున్న సమయంబున.


జపమును జలమును బలమును
వివిధములుగ బోరు కరటివీరతకు భువిన్
దివి మకరమీన కర్కట
నివహము లొక్కటన మిత్రనిలయము బొందెన్.

శార్దూలము:
ఆటోపంబున జిమ్ము ఱొమ్మగల వజ్రాభీల దంతంబులం
దాతించున్ మెడ జుట్టిపట్టి హరి దోర్దండభ శుండాహరిన్
నీటన్ మాటికి మాటికిం దిగువగా నీరాటమున్ నీటి పో
రాట న్నోటమిపాతు జూపుట కరణ్యాటంబు వాచాటమై.

ఆటవెలది:
మకరితోడ బోరు మాతంగ విభుని నొ
క్కరుని డించి పోవ గాళ్లు రాక
కోరి చూచు చుండె గుంజరీయూథంబు
మగలు దగులు గారె మగువలకును.

ఆటవెలది:
జీవనంబు దనకు జీవనంబై యుంట
నలవు జలము నంతకంత కెక్కి
మకర మొప్పె డస్సె మత్తేభమల్లంబు
బహుళపక్ష శీతభాను పగిది।

మత్తేభము:
ఉఱుకుం గుంభయుగంబుపై హరి క్రియన్ హుమ్మంచు; బాదంబులన్
నెఱయం గఠము వెన్నుదన్ను; నెగయున్ హేలాగతిన్; వాలముం
జఱచున్; నుగ్గు గదాకు; ముంచు; మునుగున్; శల్యంబులున్ దంతముల్
విఱుగన్ వ్రేయుచు బొంచిపొంచి కదియున్ వేదండయూథోత్తమున్.

మత్తేభము:
పొడగానం బడకుండ డాగు వెలికిం బోబంగ దా నడ్డమై
పొడచూపుం జరణంబులం బెనగొనుం బో రాక రారాక బె
గ్గడిలం గూలగదాచు లేచుతఱి నుద్ఘాటించు లంఘించు బ
ల్విడి జీరుం దలగున్ మలంగు నొదియన్ వేధించు గ్రోధించుచున్.

వచనము:
ఇట్లు విస్మితనక్రచక్రంబయి నిర్వక్రవిక్రమంబున నల్ప హృదయజ్ఞాన దీపంబు నతిక్రమించు మహా మాయాంధకారంబునుంబోలె నంతకంతకు
నుత్సాహ కలహ సన్నాహ బహువిధ జలావగాహం బయిన గ్రాహంబు మహాసాహసంబున.

శార్దూలము:
పాదద్వంద్వము నేలమోపి పవనున్ బంధించి పంచేంద్రియో
న్మాదంబుం బరిమార్చి బుద్దిలతకున్ మాఱాకు హర్రించి ని
ష్ఖేదబ్రహ్మపదావలంబనరతిం గ్రీడించు యోగీంద్రు మ
ర్యాదన్ నక్రము విక్రమించె గరిపాదాక్రాంతనిర్వక్రమై.


ఆటవెలది:
వనగజంబు నెగుచు వనచారి బొడగని
వనగజంబ కాన వజ్రిగజము
వెల్ల నై సురేంద్రు వేచి సుధాంధుల
బట్ట వట్టనీక బయలు ప్రాకె.

ఉత్పలమాల:
ఊహ గలంగి జీవనపుటోలమునం బడి పోరుచున్ మహా
మోహలతా నిహద్దపదమున్ విడిపించుకొనంగ లేక సం
దేహముబోదు దేహిక్రియ దీనదశన్ గజ ముండె భీషణ
గ్రాహదురంత దంత పరిఘట్టిత పాద ఖురాగ్ర శల్యమైన్.

వచనము: ఇ వ్విధంబున.

కందము:
అలయక సొలయక వేసట
నొలయక కరి మకరితోడ నుద్దండత రా
త్రులు సంధ్యలు దివసంబులు
సలిపెం బోరొక్కవేయి సంవత్సరముల్



మత్తేభము:
పృధుశక్తిన్ గజ మా జల గ్రహముతో బెక్కేండ్లు పోరాడి సం
శిధిలంబై తన లావు వైరి బలముం జింతించి మిధ్యామనో
రధమిం కేటికి? దీని గెల్వ సరి పోరం జాలరా దంచు స
వ్యధమై యిట్లను బూర్వపుణ్యఫల దివ్యజ్ఞాన సంపత్తితోన్;

శార్దూలము:
ఏ రూపంబున దీనిగెల్తు? నిట మీ దేవేల్పు జింతింతు? నె
వ్వారిం జీరుదు? నెవ్వరడ్డ? మిక ని వ్వారి ప్రచారోత్తమున్
వారింపం దగువార లెవ్వ? రఖిలవ్యాపార పారాయణుల్
లేరే: మ్రొక్కెదదిక్కుమాలిన మొఱాలింపం బ్రపుణ్యాత్మకుల్.

శార్దూలము:
నానానేకపయూధముల్ వనములోనం బెద్దకాలంబు స
న్మానింపన్ దశలక్షకోటి కరిణీనాధుండనై యుండి మ
ద్దానాంభ: వరిపుష్ట చందన లతాంతచ్చాయలం దుండలే
కీ నీరాశ నిటేల వచ్చితి, భయం బెట్లోకదే యీశ్వరా:

ఉత్పలమాల:
ఎవ్వనిచే జనించు జగ; మెవ్వని లోపల నుండు లీనమై;
యెవ్వని యందు డిందు; పరమేశ్వరు డెవ్వడు; మూల కారణం
బెవ్వ; డనాదిమధ్యలయుడెవ్వడు; సర్వము దానయైన వా
డెవ్వడు వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడెదన్.

కందము:
ఒకపరి జగములు వెలి నిడి
యొకపరి లోపలికి గొనుచు నుభయము దానై
సకలార్ధ సాక్షి యగు న
య్య కలంకుని నాత్మమూలు నర్ది దలంతున్.

కందము:
లోకంబులు లోకేశులు
లోకస్తులు దెగిన తుది నలోకం బగు పెం
జీకటి కవ్వల నెవ్వం
డే కాకృతి వెలుగు నతని నే సేవింతున్.

కందము:
నర్తకుని భంగి బెక్కగు
మూర్తులతో నెవ్వడాడు? మునులు దివిజులుం
గీర్తింప నేర రెవ్వని
వర్తన మొరు లెఱుగ రట్టి వాని నుతింతున్.

ఆటవెలది:
ముక్తసంగులైన మునులు దిదృక్షులు
సర్వభూత హితులు సాధుచిత్తు
లసదృశ వ్రతాడ్యులై కొల్తు రెవ్వని
దివ్య పదము వాడు దిక్కు నాకు.

భవము దోషంబు రూపంబు గర్మంబు నా
హ్వయమును గుణము లెవ్వనికి లేక
జగముల గలిగించు సమయించు కొఱకునై
నిజమాయ నెవ్వడిన్నియునుదాల్చు
నా పరేశునకు ననంత శక్తికి బ్రహ్మ
కిద్దరూపికి రూపహీనునకును
జిత్రచారునికి సాక్షికి నాత్మరుచికిని
బరమాత్మునకు బరబ్రహ్మమునకు

ఆటవెలది:
మాటలను నెౠకల మనముల జేరంగ
గాని శుచికి సత్త్వగమ్యుడగుచు
నిపుణుడైన వాని నిష్కర్మతకు మెచ్చు
వాని కే నొనర్తు వందనములు.

సీసము:
శాంతున కపవర్గసౌఖ్య సంవేదికి
నిర్వాణ భర్తకు నిర్విశేషు
నకు, ఘోరునకు గూడునకు గుణధర్మికి
సౌమ్యున కధికవిజ్ఞాన మయున
కఖిలేంద్రియ ద్రష్ట కధ్యక్షునకు బహు
క్షేత్రజ్ఞునకు దయాసింధుమతికి
మూలప్రకృతి కాత్మ మూలున కఖిలేంద్రి
య జ్ఞాపకునకు దు:ఖాంత కృతికి

ఆటవెలది:
నెఱి నసత్య మనెడి నీడతో వెలుగుచు
నుండు నెక్కటికి మహోత్తరునకు
నిఖిల కారణునకు, నిష్కారణునకు న
మస్కరింతు నన్ను మనుచు కొఱకు.

కందము:
యోగాగ్ని దగ్దకర్ములు
యోగీశ్వరు లే మహాత్ము నొండెఱుగక స
ద్యోగ విభాసిత మనముల
బాగుబ వీక్షింతు రట్టి పరము భజింతున్.




సీసము:
సర్వాగమామ్నాయ జలధికి నపవర్గ
మయునికి నుత్తమ మందిరునకు
సకల గుణారణిచ్చన్న బోధాగ్నికి
దనయంత రాజిల్లు ధన్యమతికి
గుణలయోద్దీపిత గురు మానసునకు సం
వర్తిత కర్మ నిర్వర్తితునకు
దిశ లేని నాబోటి పశువుల పాపంబు
లడచువానికి సమస్తాంతరాత్ము


ఆటవెలది:
డై వెలుంగువాని కచ్ఛిన్నునకు భగ
వంతునకు దనూజపశునివేశ
దారసక్తు లయినవారి కందగరాని
వాని కాచరింతు వందనములు.

వచనము:
మఱియును.

సీసము:
వరధర్మకామార్థ వర్జితకాములై
విబుధు లెవ్వాని సేవించి యిష్ట
గతి బోందుదురు? చేరి కాంక్షించువారి క
వ్యయ దేహ మిచ్చు నెవ్వాడు కరుణ?
ముక్తాత్ము లెవ్వని మునుకొని చింతింతు?
రానందవార్ది మగ్నాంతరంగు
లేకాంతు లెవ్వని నేమియు గోరక
భద్రచరిత్రంబు బాడుచుందు?

ఆటవెలది:
రామహేశు నాదు నవ్యక్తు నధ్యాత్మ
యొగగమ్ము బూర్ణు నున్న తాత్ము
బ్రహ్మ మైన వాని బరుని నతీంద్రియు
నీశు స్థూలు సూక్ష్ము నే భజింతు.

వచనము:
అని మఱియు నిట్లని వితర్కించె.

సీసము:
పావకుం డర్చుల భానుండు దీప్తుల
నెబ్భంగి నిగిడింతు రెట్లడంతు
రాక్రియ నాత్మకరావళిచేత బ్ర
బ్మాదుల వేల్పుల నఖిలజంతు
గణముల జగముల ఘన నామ రూప భే
దములతో మెఱయించి తగ నడంచు
నెవ్వడు మనము బుద్దీంద్రియమ్ములు దాన
యై గుణ సంప్రవాహంబు బఱపు

తేటగీతి:
స్త్రీ నపుణ్సక పురుష మూర్తి యును గాక
తిర్య గమర నరాది మూర్తియున గాక
కర్మ గుణ ఖేద స దసత్ర్పకాశి గాక
వెనుక నన్ని యు దా నగు విభు దలంతు.

కందము:
కల డందురు దీనుల యెడ
గల డందురు పరమయోగి గణములపాలం
గలడందురన్నిదిశలను
గలడు కలం డనెడు వాడు గలడో లేడో;

సీసము:
కలుగడే నాపాలి కలిమి సందేహింప
గలిమిలేములు లేక కలుగువాడు;
నా కడ్డపడ రాడె నలి న సాధువులచే
బడిన సాధుల కడ్దపడెడువాడు
చూడడే నా పాటు జూపుల జూడక
చూచువారల గృపజూచువాడు;
లీలతో నా మొఱాలింపడే మొఱగుల
మొఱ లెఱుంగుచు దన్ను మొఱగువాడు;

తేటగీతి:
అఖిలరూపముల్ దనరూపమైన వాడు
నాదిమధ్యాంతములు లేక యడరువాడు
భక్తజనముల దీనుల పాలివాడు
వినడె చూడడె తలపడె వేగ రాడె;

విశ్వకరు విశ్వదూరుని
విశ్వాత్మకు విశ్వవేద్యు విశ్వు నవిశ్వున్
శాశ్వతు నజు బ్రహ్మప్రభు
నీశ్వరునిం బరమపురుశు నే భజియింతున్

వచనము:
అని పలికి తన మనంబున నగ్గజేంద్రుండీశ్వర నస్సిధానంబు కల్పించుకొని యిట్లనియె.

శార్దూలము:

లా వొక్కింతయు లేదు; ధైర్యము విలోలంబయ్యె; బ్రాణంబులున్
ఠావుల్ దప్పెను; మూర్చ వచ్చె; దనువున్ డప్పెన్; శ్రమబయ్యెడిన్;
నీవె తప్ప నిత:పరం బెఱుగ; మన్నింపందగున్ దీనునిన్;
రావె ఈశ్వర; కావవె వరద; సంరక్షింపు భద్రాత్మకా;




కందము:
విను దట జీవుల మాటలు
చను దట చనరానిచోట్క్ల శరణార్థుల కో
యను దట పిలిచిన సర్వము
గను దట సందేహ మయ్యె గరుణావార్థీ:

ఉత్పలమాల:
ఓ కమలాప్త: యోవరద: యో ప్రతిపక్ష: విపక్షదూర: కు
య్యో కవి యోగివంద్య సుగుణోత్తమ యో శరణాగతామరా
నోకహ యో మునీశ్వర మనోహర యో విపులప్రభావ రా
వే కరుణింపవే తలపవే శరణార్ధిని నన్ను గావవే.

వచనము:
అని పలికి, మరియు .........

ఆతవెలది:
విశ్వమయత లేమి .........

మత్తేభము:
 అల వైకుంఠ పురంబులో నగరిలో నామూల సౌధంబు దా
 పల మందార వనాంతరామృతసరః ప్రాంతేందుకాంతోపలో
 త్పల పర్యంక రమావినోది యగు నాపన్న ప్రసన్నుండు వి
 విహ్వల నాగేంద్రము 'పాహి పాహి' యనఁగుయ్యాలించి సంరంభియై

మత్తేభము:
సిరికిం జెప్పడు; శంఖ చక్ర యుగముంజేదోయి సంధింపడే
పరివారంబును జీర డభ్రగపతిం బన్నింప డాకర్ణికాం
తర ధమ్మిల్లము జక్క నొత్తడు వివాదప్రోత్థిత శ్రీ కుచో
పరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహియై.

వచనము:
ఇట్లు భ్క్తజన పాలన ప్రాయణుండును, నిఖిల జంతు హృదయారవింద సదన సంద్థితుండును నగు నారాయణుండు కరి కులేంద్ర విజ్ఞాపిత
నానావిధ దీనాలాపంబు లాకర్ణించి లక్ష్మీకాంతా వినోదంబులం దగులు సాలించి సంభ్రమించి దిశలు నిరీక్షించి గజేంద్రరక్షాపర్వతంబు నంగీకరించి
నిజ పరికరంబు మరల నవధరించి గగనంబున కద్గమించి వేంచేయు నప్పుడు;


మత్తేభము:
తనవెంటన్ సిరి, లచ్చి వెంట నవరోధవ్రాతమున్, దాని వె
న్కను బక్షీంద్రుడు, వాని పొంతను ధను:కౌమోదకీ శంఖ చ
క్రనికాయంబును, నారదుండు, ధ్వజినీకాంతుండు రా వచ్చిరొ
య్యన వైకుంఠపురంబునం గలుగువా రాబాలగోపాలమున్.

దస్త్రం:Gajendra moksham1.JPG
వైకుంఠం తరలి వచ్చే చిత్రం

వచనము:
తదనంతరంబ ముఖారవింద మకరంద బిందు సందోహ పరిష్యందమానానందదిందిందిరయగు నయ్యిందిరాదెవి గోవింద కరారవింద సమాకృష్యమాణ సంవ్యానచేలాంచల యై పోవుచు
మత్తేభము:
తన వేంచేయు పదంబు వేర్కొన; డనాథస్త్రీ జనాలాపముల్
వినెనో, మ్రుచ్చులు మ్రుచ్చిలించిరో ఖలుల్ వేద ప్రపంచంబులన్,
దనుజానీకము దేవతానగరిపై దండెత్తెనో, భక్తులం
గని చక్రాయుడు డేడి చూపుడని దిక్కారించిరో దుర్జనుల్.

వచనము:
అని వితర్కించుచు.

శార్దూలము:
తాటంకాచలనంబుతో, భుజనటద్దమ్మిల్ల బండంబుతో,
శాటీముక్త కుచంబుతో, సదృఢచంచత్కాంచితో, శీర్ణలా
లాటాలేపముతో, మనోహరకరాలగ్నోత్తరీయంబుతో
గోటీందుప్రభతో, సురోజభర సంకోచద్విలగ్నంబుతోన్,

కందము:
అడిగెద నని కడు వడి జను
నడిగిన దను మగుడ నుడుగ డని నడ యుడుగున్
వెడవెడ చిడిముడి తడబడ
నడు గిడు; నడుగిడదు జడిమ నడు గిడునెడలన్

సీసము:
నిటలాలకము లంట నిపుర జుంజుమ్మని
ముఖసరోజము నిండ ముసరు దేంట్లు;
నళుల జోపగ జిల్క లల్ల నల్ల జేరిన
యోష్టబింబద్యుతు లోడియ నఱుకు;
శుకముల దోల జక్షుర్మీనములకు మం
దాకినీ పాఠ్నలోక మెగుచు;
మీన పంక్తుల దాట మెయిదీగతో రాయ
డమ్పాలతలు మింట సరణి గట్టు;

ఆతవెలది:
శంపలను జయింప జక్రవాకంబులు
కుచయుగంబు దాకి క్రొవ్వు సూవు:
మెలత మొగిలు పిఱిది మెఱుగుదీవయు బోలె
జలదవర్ణు వెనక జనెడు నపుడు.

మత్తేభము:
వినువీథిం జనుదేర గాంచి రమరుల్ విష్ణు సురారాతి జీ
వనసంపత్తి నిరాకరిష్ణు గరుణావర్థిష్ణు యోగీంద్ర హ్ఋ
ద్వనవర్తిష్ణు సహిష్ణు భక్త జనబృంద ప్రాభవాలంకరి
ష్ణు నవోడోల్ల సదిందిరా పరిచరిష్ణున్ జిష్ణు రోచిష్ణునిన్.

వచనము:
ఇట్లు పొడగని

మత్తేభము:
చనుదెంచెన్ ఘనుడల్లవాడె; హరిపజ్జం గంటిరే లక్ష్మి? శం
ఖ నినాదం బదె; చక్ర మల్లదె; భుజంగధ్వంసియున్ వాడె క్ర
న్నన నేతెంచె నటంచు వేల్పులు నమోనారాయనాయేతి ని
స్వనులై మ్రొక్కిరి మింట హస్తిదురవస్థావక్రికింజక్రికిన్.

వచనము:

ఆ య్యవసరంబునం గుంజరేద్ర పాలన పారవశ్యంబున దేవతా నమస్కారంబు లంగీకరింపక మనస్సమానసంచారుండైపోయి పోయి
కొంతదూరంబున శిండుమార చక్రంబునుం బోలె గురుమకరకుళీరమీన మిథునంబై, కిన్నరేంద్రుని భాండాగారంబునుంబోలె స్వచ్చ
వకచ్చపంబై, భాగ్యవంతుని భాగధేయంబునుం బోలె సరాగజీవనంబై, వైకుంఠంబునుంబోలె శంఖచక్ర కమలాలంకృతంబై, సంసార
చక్రంబునుం బోలె ద్వంద్వసంకుల పంక సంకీర్ణంబై యొప్పు న ప్పంకజా కరం బొడగని.



మత్తేభము:
కరుణా సింధుడు సౌరి వారి చరమున్ ఖండింపగా బంపె స
త్వరితాకంపిత భుచక్రము మహోద్యద్విస్పులింగచ్ఛటా
పరిభూతాంబర శుక్రమున్ బహు విధ బ్రహ్మాండ భాండచ్చటాం
తర నిర్వక్రముబాలితాఖిల సుధాంధస్చక్రముం జక్రమున్.

వచనము:
ఇట్లు వంచిన.

శార్దూలము:
అంభోజాకర మధ్య నూతన నలిన్యాలింగన క్రీడనా
రంభుండైన వెలుంగుఱేని చెలువారన్ వచ్చి నీటన్ గుభుల్
గుంభధ్వానముతో గొలంకును గలంకం బొందగా జొచ్చి దు
ష్టాంభోవర్తి వసించు చక్కటికి డాయంబోయి హృద్వేగమై.

శార్దూలము:
భీమంబై తల ద్రుంచి ప్రాణముల బాపెం జక్ర మాశు క్రియన్
హేమక్ష్మాధర దేహముం జకితవన్యేభేంద్ర సందోహముం
గామ క్రోధన గేహమున్ గరటి రక్త స్రావ గాహంబు ని
స్పీమోత్పాహము వీత దాహము జయశ్రీ మోహమున్ గ్రాహమున్.


వచనము:
ఇట్లు నిమిష స్పర్శనంబున సుదర్శనంబు మకరి తల ద్రూచు నవసరంబున.

కందము:
మకర మొకటి రవి జొచ్చెను
మకరము మఱియొకటి ధనదు మాటున డాగెన్;
మకరాలయమున దిరిగెడు
మకరంబులు కూర్మరాజు మఱువున కరిగెన్.

మత్తేభము:
తమముం బాసిన రోహిణీ విభుక్రియన్ దర్చించి సంసారదు:
ఖము వీడ్కొన్న విరక్త చిత్తుని గతిన్ గ్రాహంబు పట్టూద్చిన పా
దము లల్లర్చి కరేణుకావిభుడు సౌందర్యంబుతో నొప్పె సం
భ్రమదాశాకరిణీ కరోజ్ఝిత సుధాంభస్స్నాన విశ్రాంతుడై.

శార్దూలము:
పూరించెన్ హరి పాంచజన్యము గృపాంభోరాశి సౌజన్యమున్
భూరిధ్వాన చలాచలీకృత మహాభూత ప్రచైతన్యమున్
సారోదారసిత ప్రభాచకిత వర్జన్యాది రాజన్యమున్
దూరిభూతవిపన్నదైన్యమును దిర్దూతద్విషత్సైన్యమున్.

మత్తేభము:
మెరసెన్ నిర్జరదుందుభుల్; జలరుహామోదంబులై వాయువుల్
దిరిగెం; బువ్వుల వాన జల్లు గురిసెన్; దేవాంగనాలాస్యముల్
పరగెన్; దిక్కులయందు జీవజయశబ్దధ్వానముల్ నిండె, సా
గర ముప్పొంగె దరగ చుంబిత నభోగంగాముఖాంభోజమై.

కందము:
నిడుద యగు కేల గజమును
మడువున వెడలంగ దిగిచి మదజల రేఖల్
దుడుచుచు మెల్లన పుడుకుచు
నుడిపెన్ విష్ణుండు దు:ఖ ముర్వీనాథా!

కందము:
శ్రీ హరి కర సంస్పర్శను
దేహము దాహంబు మాని ధృతి గరిణీ సం
దోహంబు దాను గజపతి
మోహన ఘీంకార శబ్దములతో నొప్పెన్.

కందము:
కరమున మెల్లన నివురుచు
గర మనురాగమున మెఱసి కలయం బడుచుం
గరి హరికతమున బ్రదుకుచు
గర పీడన మాచరించె గరిణుల మరలన్.


శ్రీమద్భాగవతమందున గజేంద్రమోక్ష స్తోత్రం మార్చు

శ్రీమద్భాగవతమందు అష్టమ(8వ) స్కంధమున పరిక్షిత్తు మహారాజు విన్నపమును మన్నించి శుకమహర్షులవారు ఉపదేశించిన గజేంద్రమోక్ష స్తోత్రమిది:

శ్రీ శుక ఉవాచ
ఎవం వ్యవసితో బుద్ధ్యా సమాధాయ మనో హృది |
జజాప పరమం జాప్యం ప్రాగ్జన్మన్యనుశిక్షితం || ೧ ||

గజేంద్ర ఉవాచ
ఓం నమో భగవతే తస్మై యత ఎతచ్చిదాత్మకం |
పురుషాయాది బీజాయ పరెశాయాభిధీమహి || ೨ ||

యస్మిన్నిదం యతశ్చేదం యేనేదం య ఇదం స్వయం |
యోస్మాత్పరస్మాచ్చ పరస్తం ప్రపద్యే స్వయంభువం || ೩ ||

యః స్వాత్మనీదం నిజమాయయార్పితం
క్వచిద్విభాతం క్వచ తత్తిరోహితం |
అవిద్ధదృక్సాక్ష్యు భయం తదీక్షతె స
ఆత్మమూలోవతు మాం పరాత్పరః || ೪ ||

కాలేన పంచత్వమితేషు కృత్స్నశో
లొకేశు పాలేషు చ సర్వహేతుషు |
తమస్తదాసీద్గహనం గభీరం
యస్తస్య పారేభివిరాజితే విభు || ೫ ||

న యస్య దేవా ఋషయ: పదం
విదుర్జంతు: కోర్హతి గంతుమీరితుం |
యథా నటస్యాకృతిర్విచేష్టతో స
ఆత్మమూలొవతు మాం పరాత్పరః || ೬ ||

దిదృక్షవో యస్య పదం సుమంగలం
విముక్తసంగా మునయ: సుసాధవ: |
చరంత్య లోక వ్రతమవ్రణం వనే
భూతాత్మ భూతా: సహృద: స మే గతి: || ೭ ||

న విద్యతే యస్య చ జన్మ కర్మవా
న నామరూపే గుణదోష ఏవ వా |
తథాపి లోకాప్యయ సంభవాయ
య: స్వమాయయా తాన్యనుకాలమృచ్ఛతి || ೮ ||

తస్మై నమ: పరేశాయ బ్రహ్మణేనంతశక్తయే |
అరూపయోరురూపాయ నమ ఆశ్చర్యకర్మణే || ೯ ||

నమ ఆత్మప్రదీపాయ సాక్షిణే పరమాత్మనే |
నమో గిరాం విదూరాయ మనశ్చేతసామపి || ೧೦ ||

సత్త్వేన ప్రతిలభ్యాయ నైష్కర్మ్యేణ విపశ్చితా |
నమ: కైవల్యనాథాయ నిర్వాణసుఖసంవిదే || ೧೧ ||

నమః శాంతాయ ఘోరాయ మూఢాయ గుణధర్మిణే |
నిర్విశేషాయ సామ్యాయ నమో జ్ఞానఘనాయ చ || ೧೨ ||

క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం సర్వాధ్యక్షాయ సాక్షిణే |
పురుషాయాత్మమూలాయ మూలప్రకృతయే నమ: || ೧೩ ||

సర్వేంద్రియ గుణద్రష్ట్రే సర్వప్రత్యయ హేతవే |
అసతాచ్ఛాయాయ యోక్తాయ సదాభాసాయ తే నమ: || ೧೪ ||

నమో నమస్తేఖిలకారణాయ
నిష్కారణాయాద్భుతకారణాయ |
సర్వాగమామ్నాయ మహార్ణవాయ
నమోపవర్గాయ పరాయణాయ || ೧೫ ||

గుణారణిచ్ఛన్నచిదూష్మపాయ
తత్క్షోభవిస్ఫూర్జితమ్ఆనసాయ |
నైష్కర్మ్యభావేన వివర్జితగమ
స్వయంప్రకాశాయ నమస్కరోమి || ೧೬ ||

మాదృక్ప్రపన్న పశుపాశవిమోక్షణాయ
ముక్తాయ భూరికారణాయ నమోలయాయ |
స్వాంశేన సర్వతనుభృన్మనసి ప్రతీత
ప్రత్యగ్దృశే భగవతే బృహతే నమస్తే || ೧೭ ||

ఆత్మాత్మజాప్తగృహవిత్తజనేషు సక్తై
ర్దుష్ప్రాపణాయ గుణసంగవివర్జితాయ |
ముక్తాత్మభి: స్వహృదయే పరిభావితాయ
జ్ఞానాత్మనే భగవతే నమ ఈశ్వరాయ || ೧೮ ||

యం ధర్మకామార్థవిముక్తకామా
భజంత ఇష్టాం గతిమాప్నువంతి |
కిం త్వాశిషోరాత్యపి దేహమవయం
కరోతు మేదభ్రదయో విమోక్షణం ||೧೯ ||

ఏకాంతినో యస్య న కంచనార్థం
వాంఛంతి యే వై భగవత్ప్రపన్నా: |
అత్యద్భుతం తచ్చరితం సుమంగలం
గాయంత ఆనందసముద్రమగ్నా: || ೨೦ ||

తమక్షరం బ్రహ్మ పరం పరేశ
మవ్యక్తమాధ్యాత్మికయోగగమ్యం |
అతీంద్రియం సూక్ష్మమివాతిదూర
మనంతమాద్యం పరిపూర్ణమీడే || ೨೧ ||

యస్య బ్రహ్మాదయోదేవా వేదా లోకాశ్చరాచరా: |
నామరూపవిభేదేన ఫల్గ్వ్యా చ కలయా కృతా: || ೨೨ ||

యథార్చిషోగ్నే: సవితుర్గర్భస్తయో
నిర్యాంతి సంయాంత్యసకృత్స్వరోచిష: |
తథా యతోయం గుణసంప్రవాహో
బుద్ధిర్మన: ఖాని శరీరసర్గా: || ೨೩ ||

స వై న దేవాసురమర్త్య తిర్యక్
న స్త్రీ న షండో న పుమాన్నజంతుః |
నాయం గుణ: కర్మ న సన్నచాస
న్నిషేధశేషో జయతాదశేష: || ೨೪ ||

జిజీవిషే నాహమిహాముయా
కిమంతరబహిశ్చావృత్తయేభయోన్యా |
ఇచ్ఛామి కాలేన న యస్య విప్లవ:
తస్యాత్మలోకావరణస్య మోక్షం || ೨೫ ||

సోహం విశ్వసృజం విశ్వమవిశ్వం విశ్వమేదసం |
విశ్వాత్మానమజం బ్రహ్మ ప్రణతోస్మి పరం పదం || ೨೬ ||

యోగరంధితకర్మణో
హృది యోగవిభావితే |
యోగినో యం ప్రపశ్యంతి
యోగేశం తం నతోస్మ్యహం || ೨೭ ||

నమో నమస్తుభ్యసహ్యవేగ
శక్తిత్రయాయాఖిలాధీగుణాయ |
ప్రపన్నపాలాయ దురంతశక్తయే
కదింద్రీయాణామనవాప్యవర్త్మనే || ೨೮ ||

నాయం వేద స్వమాత్మానం యచ్ఛక్త్యా హంధియా హతం |
తం దురత్యయమాహాత్మ్యం భగవంతమితోస్మ్యహం || ೨೯ ||

శ్రీ శుక ఉవాచ
ఏవం గజేంద్రముపవర్ణిత నిర్విశేషం
బ్రహ్మాదయో వివిధ లింగ భిదాభిమానా: |
నైతే యదోపసృపుర్నిఖిలాత్మకత్వతాత్
తత్రాఖిలామరమయో హరిరావిరాసీత్ || ೩೦ ||

తం తద్వదార్త్తముపలభ్య జగన్నివాస:
స్తోత్రంనిశమ్య దివిజై:సహ సంస్తువద్బి: |
ఛందోమయేన గరుడేన సముహ్యమానొ
శ్చక్రాయొధోభ్యగమదాశు యతో గజేంద్ర: || ೩೧ ||

సోంతస్సరస్యురుబలేన గృహీత ఆర్తో
దృష్ట్వాగరుత్మతి హరిం ఖ ఉపాత్తచక్రం |
ఉత్క్షిప్య సాంబుజకరం గిరిమాహ
కృచ్ఛాన్నారాయణాఖిలగురొ భగవన్నమస్తే || ೩೨ ||

తం వీక్ష్యపీడితమజ: సహసావతీర్య
సగ్రాహమాశు సరస: కృపయోజ్జహార |
గృహాద్విపాటిత ముఖాదరిణా గజేంద్రం
సంపశ్యతాం హరిరమూముచదుస్రీయాణాం || ೩೩ ||

|| శ్రీకృష్ణార్పణమస్తు ||