అశ్వలక్షణసారము/ప్రథమాంకురము

శ్రీరస్తు

అశ్వలక్షణసారము

ప్రథమాంకురము



రమణీముఖపద్మ
స్మేరస్మితమధురాసానుసేవానిపుణో
దారబ్రమరవిహార
స్వారుడు కృతిపతికి నిత్యసంపద లొసగున్.

1


చ.

అనఘుడు శాలిహోత్రుఁడు హయంబులకున్ మును జెప్పినట్టియా
యనుపమలక్షణంబులు వయఃపరిమాణము రోమజంబులన్
దెనుగున నెల్లవారలకు తేటపడన్ రచియింతు సత్కవుల్
వినికొనియాడ దానగుణవిశ్రుత కన్నయమేదినీశ్వరా.

2


హయలక్షణవేత్తయగు శాలివాహనుఁడు మున్ముందుగా చెప్పిన అశ్వలక్షణములను, ఆయుఃప్రమాణమును గురించి తెలుగున సర్వజనులకు దెలియునట్లుగను - సత్కవీశ్వరులు గొనియాడునట్లుగను జెప్పెదను. అని కృతికర్తయగు మనుమంచిభట్టారకుడు జెప్పియున్నాడు. ఈగ్రంథము సాళువ కంపభూపాలున కంకిత మీయబడినది.


క.

జలనిధిమథనావసరమున
జలజభవునిమేనిపద్మజలకణములు గా

డ్పులసంగమమున బావకు
వలె హరులు పుట్టె గన్న వసుధాధీశా!

3


దేవదానవులు సురకొఱకై సాలసముద్రమును మందరపర్వతముచే తరుచుచున్నప్పుడు- బ్రహ్మదేవుని యొక్క స్వేదబిందువులు గాడ్పులతో గలసెను. అప్పుడు హయము లుద్భవమందెను.


సీ.

తొలుతదంతంబులు తోచిన నొకనెల
             నెలలు రెం డగు నవి [1]నెరసి నిగుడ
నడిమిదంతములు గానగనైన మూణ్ణెల్లు
             [2]యవి వెస గూడంగ నైదునెలలు
కడమదంతంబులు వొడమ నెన్మిదినెలల్
             యవి గూడ తొమ్మిది యయ్యె నెలలు
దశనంబు లారును విశదమైనను నేడు
             యేళ్లు రెం డగు నవి ఎర్రనైన
మొదటి రెండును బది గూడ మూడుయేండ్లు
నడిమి రెండును పది గూడ నాలుగేండ్లు
అవియు రెండును బది గూడ నైదు యేండ్లు
యరయ హరులకు గన్నదండాధినాథ.

4


ముందరిదంతములు బొడసూపిన గుర్రముయొక్క ప్రాయ మొకనెల. ఆముందరి రెండుదంతములును బలసినవై పొడవైన యెడల రెండునెలలు గుర్రమగును. మధ్యదంతములు గాన్పించిన మూడుమాసములు. అవి స్ఫుటమైన వైనచో నాల్గునెలలు. మిగిలినదంతములు వచ్చిన గుర్రముయొక్క ప్రాయ మెనిమిదినెలలు. ఆరుదంత

ములు విశదము లైయున్న యేడునెల లగును. ఆదంతము లెర్రనయిన రెండేండ్లు అన్ని పండ్లును గలియుట కయిదేండ్లు పట్టును.


క.

దంతముల తెలుపు చిత్త
క్షాంతియు కన్నులమెఱుంగు జవసత్వములన్
సంతతమును దక్షతయును
కాంతియు నైదేండ్లఘోటకంబున కలరున్.

5


దంతములు తెల్లనగుట, స్థిరచిత్తము కలుగుట, కన్నులలోని వెలు గతిశయించుట, బలము, పనిచేయు నేర్చును శరీరమునందలి తేజస్సును గలతురగముయొక్క వయస్సు అయిదు వత్సరములు.


క.

ఇది విచారించుటయును
విదితంబుగ సశ్వములకు నినువ్యంజనముల్
మొదలుకొని వరుస జెప్పెద
సదమలగుణయూధ కన్న జగతీనాథా!

6


పైన చెప్పబడిన విషయముల నిరూపించుటయును, వ్యంజనముల క్రమంబును యొకటొకటిగా చెప్సెదను.


ఉ.

నల్లనిరేఖ కృష్ణహరిణంబు సువర్ణవిభాతి శుక్లమున్
తెల్లని కాచగాజుపగిదిన్ జనుపక్షికయీగె యట్లు శో
భిల్లును శంఖచంద్రుగతి బెద్దయు గృంత లులూఖలం బగున్
బెల్లుగ నూడుటంబడుట బేర్కొన తొమ్మిదివ్యంజనా లగున్.

7


చూడుము మూడవయాశ్వాసము. కృష్ణవ్యంజనము, శుక్లము, హరిణవ్యంజనము, మక్షిక, శంఖఉలూఖలము, చలనవ్యంజనము, పతనవ్యంజనము, కాంచవ్యంజనము.


క.

నెట్టున మొదలిరదంబులు
బుట్టిన నొకయేడునడిమి పళ్ళును నొనరన్

బుట్టిన రెండేడులు తుద
బుట్టిన మూడేండ్లు యిట్లు పరువడి నడచున్.

8


మొదటిరదనములు తోచినయెడల నొకసంవత్సరమును, మధ్యపండ్లు బుట్టిన రెండేడ్లును, వెనుకటి రెండుదంతములును బుట్టిన మూడేన్లును యుండును.

9


గీ.

ఈనవవ్యంజనంబులు యిట్లు నడువ
నెలమి యిరువది యేడేళ్ళు యిందులోన
తొలుత నైదేండ్లుగూడి తురగమునకు
నరయ ముప్పదిరెండేండ్లు యాయువయ్యె.

10


పైన చెప్పబడిన తొమ్మిదివ్యంజనములును గడచుటకు యిరువదియేడు వత్సరములగును. ఆయిరువదేడు వత్సరములును బాల్య మైదేడులును కలసి గుర్రమునకు ముప్పదిరెండు వత్సరములు పూర్ణాయువయ్యెను.


గ్రంథపాతము యితరప్రతులలో నున్నదేమో తెలియదు.

10


క.

ఉరమున నుపరంధ్రంబుల
శిరసున రంధ్రంబులందు జెలువుగ రెండే
సరయగ కుదుటను మూతిని
బరువడి యొకటొకటియున్న పదిధృవులయ్యెన్.

11


సులభసాధ్యము. గుర్రమునకు తప్పక పదిసు ళ్లుండవలయును.


క.

ధృవులు పది యశ్వజాతికి
నవి తక్కువయైన తురగ మల్పాయువగున్
సవరించు పతి కరిష్టము
సవరించరు గాన బుధులు సహియింపరుగా.

12


ధృవులు పది యుండవలయును. పదికంటె తక్కువయైనయెడల నాయశ్వము అల్పజీవి యగును. ఇంతియేగాక ఆగుర్రముయొక్క

యజమానునకు గూడ కీడుగల్గును. అందువలన హయశాస్త్రవేదు లెవ్వరును యట్టిగుర్రమును కొనరు.


క.

మస్తకహీనము బహుదుర
వస్థంబడి జచ్చు నైదువర్షంబులలో
స్వస్తపడి నిలిచెనేనియు
మస్తకమును ద్రుంచు పతిని మర్త్యులచేతన్.

13


చిన్నిమస్తకము (తల) గలిగియున్న గుర్రము పెక్కుచిక్కులకు లోనై యైదువత్సరములలోపలనె మరణించును. అట్లు మరణింపకున్న నాహయము తన్ను పాలించువానియొక్క మస్తకమును రిపులచే ద్రుంపఁజేయును.


చ.

స్థిరముగ రోచమానమును దేవమణిందగ గూడియున్న యా
తురగము పూర్వభాగ గతదోషములన్నియు ద్రుంచునెట్టినన్
బరిగినయట్లు మేఘవిక పశ్చిమభాగము దోషరాసులన్
బొరిబొరిద్రుంచు మాడ్కి మరి భూవరకడ్పున దక్క నన్నిటన్.

14


మెడమీదనుండునట్టి జూలునందు సుడియును దేవమణియను సుడియును గల తురంగము యితరదోషములను బోకార్చి శుభంబుల నొసంగును.


క.

చుంచున కేశాంతంబుల
నంచితముగ నెలవులందు నావర్తములన్
మెంచలర దాల్చు హయములు
పంచాయుధజనక శుభము పతి కొనరించున్.

15


ముట్టెయందును, కేశాంతమునందును, నెలవుయందును, (నోటి కిరుప్రక్కలనుండు మూలలందును) సుళ్ళు గలిగిన హయము తన్ను పరిపాలించు యజమామనకు శుభము నిచ్చును.

క.

బాహువులను సుళ్ళు గలిగిన
బాహావర్తంబులనగ ప్రభులకు నెపుడున్
బాహులను దొడుగు దొడవులు
యాహవమున జయము నొసగు నరిబలభేదీ.

16


ముందరకాళ్ళ సుళ్ళు గలిగియున్న తురగము బాహావర్తతురంగ మనబడును. దానిని పాలించు యధికారి యుద్ధములందు జయలక్ష్మిచే వరింపబడును.


సీ.

ఇప్పుడు జెప్పిన ముప్పదిరెంటిలో
             నుత్తమూవక్త్రంబు నుండునెడల
నిటలతటంబున నిశ్రేణిత్రేతాగ్ని
             బాతురంతికము ప్రఖ్యాతి మెఱయ

  • * * * * * *

రోచమానంబు గదియంగ రోమజముల
చాలు గుఱ్ఱమునకు గల్గి చాలమేలు
తొలుత పదిసుళ్ళు గూడంగ నలుబదేను
మేలు చాతుర్యభోజ లక్ష్మీతనూజ.

17


సీ.

ముందరికాళ్ళను మోకాళ్ళు జంఘల
             విడిపట్లమణుగుల మడుగులందు
తొలగులబిరుదున తొడలందు సగుల
             నటక్రిందిపిక్కల యండములను
కాశదేశంబున గుదమున ప్రక్కల
             బొడ్డున వీపున బొమలమీద
కుత్తుక కన్నుల కొలకుల రెప్పల
             కర్ణమూలములను కటములందు

దండమున ముక్కుజమరుల క్రిందిపెదవి
చెక్కులను మూతిమీదను జెవులతుదల
కన్నుగవ నాసికమునకు గలిగియొనర
నున్నసుళ్ళొప్ప నిన్నియు గన్నభూప.

18


ముందరికాళ్ళయందునను, మోకాళ్ళయందునను, జంఘలు కలియుచోట్లను, మణుగులందును, పిరుదునందునను, తొడలయందునను, అడుగులయందును, పిక్కలయందును, అండములయందును, యోనిదేశమునను, బొడ్డునను, వీపుమీదను, కనుబొమలమీదను, కనుకొలకులందును, రెప్పలందును, చెవిమూలములందు, గండభాగమునందును సుళ్ళుండదగు సులభసాధ్యము.


క.

కకుదంబున హల్లకమున
ద్రికమున సందులను సుళ్ళు దిరమై యున్నన్
బ్రకటికదోషం బగు నిది
నకులాదులమతము దండనాయకతిలకా.

19


మూపుమీదను హల్లకమునను గుదస్థానమునందును చంకలయందును సుళ్ళుగలిగిన వాజి దోషయుతమగును.


గీ.

జలజకులిశకలశ చామరతోమర
చక్రముసలముకుర శంఖచంద్ర
మణిసితానఖడ్గ నుచ్ఛాంకుశాదులు
గతులలొల్లు మేలు గన్ననృపతి.

20


పద్మము కులిశము చెంబు దామరము తోమరము చక్రము ముసలము రోకలి ముకురము (మొగ్గ) శంఖము చంద్రుఁడు మణిఖడ్గము అంకుశము మున్నగువానివలె నుండు తెల్లనిబొల్లి యుండుట మంచిది.

గీ.

శూలపాశనిగళ నీలపీతారుణ
గతులబొల్లుగీడు గడిమదలను
క్రిందిపెదవి జమర రుజలందు నెడతెగి
యున్నపుండ్రరేఖ యొప్పదండ్రు.

21


శూలము పాశము నిగళము (శృంఖలు-అరదండములు.) నీలివన్నె పచ్చనివన్నెగల బొల్లులుండరాదు, అందువలన కీడు సంభవించును. తలయందును క్రిందిపెదవియందును ముక్కుజెమరలందును బొల్లియుండరాదు.


సీ.

దంతాధికంబును దంతకనమును హీ
             రాళియైనను విరాళియైన
బిల్లికన్నులు నేకపింగళియును నొంటి
             బీజంబు లెమ్మును బిల్లిచెవియు
దినమునబుట్టిన గనయుద్భవిల్లిన
             జనుబొట్టు కరగుఱ్ఱమునకునున్న
కృష్ణతాలువలు మిక్కిలియైన గొరిజలు
             నల్లని కడు పెల్ల వెల్ల
..............................................
అట్టిహయముల సాలల గట్టజనదు
మల్లయామాత్యపుత్ర నిర్మలచరిత్ర
అహితహృద్భల్ల రాయసౌహత్తిమల్ల.

22


ఎక్కువదంతములు తక్కువదంతములు గలిగిన గుర్రమును కరాళినికరాళిని (వీనియర్ధము ముందు వివరరింపబడును.) పిల్లిగండ్లు కలదియు యేకపింగళి (ఒకకన్నుదృష్టి) ఒకబీజము కలది పిల్లిచెవులు రెండు పిల్లల నీను గుర్రము నల్లని తాలువలు గలది పెద్దపెద్దగిట్టలు గలది మున్నగు దోషంబులుగల గుర్రములను పెంచకూడదు.

కరాళి = భయంకరమైనది.
వికరాళి = భయంకరమైనదానికి వ్యతిరేకము.


గీ.

మూడుకాళ్లును గల్గినముసలి యొక్క
పదము నలుపైన నది విషపాది యంద్రు
సన్నమగుచున్న దోషంబు లెన్నియైన
నుదుట బొల్లుంట మేలు సమ్ముదితహృదయ.

23


మూడుగాళ్ళను తెలుపైన బొల్లియుండి నాలుగవపాదము నలుపైనయెడల నాగుర్రము విషపాది యగును. కాళ్ళు సన్నమైనయెడల దోషముల నెన్నిటినేని బోకార్చును.


క.

మెఱుగారిక్రాలు మేనును
నెరిసిన తమ్మిమాడ్కి నెమ్మొగమున గ్రొ
మ్మెరుగుల దెగడెడి కన్నులు
నెరివాలము గలుగు హరులు నివి యోగ్యంబుల్.

24


మెఱుగెక్కియున్న శరీరమును, సగము విడిచిన పద్మమువలె నుండు నెమ్మొగమును, కాంతివంతములైన కన్నులును చక్కనివాలమును గలహయములు శుభము చేకూర్చును.


క.

ఛాయావిహీనమైనను
వాయసఖరగృధ్రముఖ్యస్వరమైనను ద్వై
న్యాయపదగదితవదనము చి
రాయువు గలుగవని విందు మట్టి హరులకున్.

25


కాంతివిహీనమైనను కాకి-గాడిద-గుడ్లగూబ మొదలగువాని స్వరముబోలిన స్వరముగల కురంగములు చిరాయువులుగ నుండవనిపెద్దలమతము.


క.

వరగినమొగమును నాలుగు
చరణంబులు తెలుపు గలుగ జయ మొసగునరే

శ్వరునకు నత్తురగం బిల
ఖరకరనిభతేజ పంచకల్యాణి యగున్.

26


నాలుగుకాళ్ళను తెలుపు గలిగియున్న హయము పంచకల్యాణి యనందగును. అయ్యది రౌతునకు సర్వదా జయము కలిగించును.


క.

నాలుగుకాళ్ళుం గొనచెవి
వాలము వదనము విశాలవక్షము తెలుపై
క్రాలునది యష్టమంగళి
నేలినపతి యేలు ధరణి నేలినపతులన్.

27


నాలుగుకాళ్లును చెవులయొక్క కొనలును తోకయును ముఖమును విశాలమైన వక్షస్థలమును తెల్లనివై యున్నయెడల నాగుర్రమును యష్టమంగళి యందురు. ఆగుర్రమును పాలించువాడు ధరణీపతుల నేలును.


క.

హేషారవంబు గజగళ
ఘోషానక పయోధిఘోషణ భేరీ
ఘోషణ దిక్కరిబృంహిత
ఘోషణగతి నుండవలయు ఘోటకములక్కున్.

28


గుర్రములయొక్క ధ్వనినిగూర్చి చెప్పుచున్నాడు. సులభసాధ్యము.


క.

తొల్లి శతాయువు హరులకు
ఎల్లను దుర్జనుల మోవ నేహ్యంబని తా
రొల్లక ముప్పదిరెండే
ళ్ళల్లన తురగములు వడసె నమరులచేతన్.

29


పూర్వము బ్రహ్మ గుర్రములు దుర్జనులగువారిని గూడ మోయుచుండుట జూచి విచారపడి వాని యాయుఃప్రమాణమును ముప్పదిరెండుసంవత్సరములుగా నేర్పరచెను.

క.

వన్నె సుధాధవళంబై
చెన్నారగ నల్లనైనచెవి కల్గిన యా
సన్నత తురగము యీభువి
గన్నయధరణీశ నామకర్ణాంక మగున్.

30


తెల్లనిశరీరము గలదై నల్లనైనటువంటి చెవి గలిగిన యశ్వమును కర్ణాంక మందురు.


చ.

హరి యని నర్కబింబుని శుకాంగుని గొంగుని గొంగుపాణినా
తరగనికత్తలాని ప్రమదంబున నెక్కడిచోట భూపతుల్
సురపతి కృష్ణ వహ్ని శివ సూర్య పితామహ వాయు సోములన్
వరుస దలంచి మ్రొక్కు నది వారకదైవతకోటి గావుతన్.

31


హరి, అర్కబింబము, శుకాంగు, కొంగ, గొంగుపాణి, తరగిణి, కత్తలాని ఈపేర్లు గలిగిన గుర్రముల నెక్కునప్పుడు ఇంద్రుని కృష్ణుని అగ్నిని శివుని సూర్యుని బ్రహ్మను వాయు చంద్రుని దలచి వారికి నమస్కరించి ఎక్కవలయును.


క.

నీలిని నలగని శోణిని
నీలోత్సంహయము బన్ని నృపు లెక్కినచో
మేలుగ నదియును త్వష్ట్రల
కీలినివాయువు దలంప గెలుపుగు బోరన్.

32


నీలి సలగ శోణి నీలోత్సలము ఈనాలుగుపేర్లుగల గుర్రములు నెక్కునప్పుడు అగ్నిని వాయుదేవుని దలంచికొనిన శుభము చేకూరును.


క.

చతురమగు నొసల నాలుగు
వితతముగా నశ్వములకు పెలసిన ధృవులన్
మతిదలంప మేలునిచ్చును
పదునాలుగుదేశములకు బట్టము గట్టున్.

33

గుర్రముయొక్క నొసటను చతురాకారముగ నాలుగుధృవు లున్నయెడల నాగుర్రము తన్నేలినదానిని పదునాలుగుదేశములకు పట్టభద్రుని చేయును.


క.

పట్టముక్రియ ఫాలంబున
వెట్టణముసుళ్ళుమూడు నేర్పడియున్నన్
గట్టుము హయమును శాలను
సృష్టికి పతి యతఁడు సువ్వె స్థిరమతి దలపన్.

34


పటకావలె నుదిటిపై మూడుసుళ్లుగలిగిన యా తురగమును శాలలోనికిఁ జేర్చుము. ఆగుర్రము నేలిననవాడు బహ్మతో సమానుఁ డగును.


క.

ఒండొంటి మీద దొంతిని
రెండున మూడైనధృవులు రుజలైయున్నన్
గండత నిజముగ నిలుపుము
భండగమున నశ్వ మిచ్చు బతికి జయములన్.

35


సులభ సాధ్యము.


క.

నిటలమున దొంతివలసయు
పటుతరముగ సుళ్ళుమూడు ప్రభవించినచో
నిటలాక్షు డడ్డగించిన
చెటులత ననిలోన వైరి శిరమును దృంచున్.

36


క.

సులభ సాధ్యము.


క.

మిక్కిలి దోరణములక్రియ
జక్కగ రోమజయము లశ్వసంఘము నుదుటన్
నిక్కము గల్గిన శుభమౌ
ఎక్కుము రణరంగభీమ యెంతయు బ్రీతిన్.

37

అధికముగా సుళ్లు దోరణమువలె నున్నయెడల శుభదాయక మగును. దానిని యధిరోహించు యజమానునకు శుభము చేకూరును.


క.

తురగంబు నొసలినిూదను
బరికింపగ రెండుధృవులు ప్రభునకు శుభమౌ
నరనుత నిలువగవలయును
ధరణీశ్వరకాంతనృపతి దానవినోదీ.

38


గుర్రముయొక్క నొసటను రెండుధృవులు గలిగినయెడల తన్నేలినవానికి శుభము చేకూర్చును.


క.

కుత్తుకసుడిగల తురగము
చిత్తజనిభుడైన నేమి సిద్ధము దలపన్
ఉత్తమపురుషులు నిలువరు
నిత్తంత్యంబును జూడ జమునినిలయము కేగున్.

39


సులభసాధ్యము. కుత్తుకమీద సుడి యుండరాదు.


క.

ఉభయగళములకు నెల్లను
నభిముఖముగ ధృవులు గల్గు నశ్వము నిలువన్
శుభమగుకంఠాభరణము
ప్రభునుత భీమాంబపుత్ర పరమపవిత్రా.

40


గళమునకు రెండుప్రక్కలనుగాని యెదుటనుగాని సుళ్ళుగలతురగము కొనవలయు. అట్టిగుర్రము శుభముచేయు.


క.

మేలుగ గళంబుక్రిందను
నాలుగుయంగుళముల రెట్టి నగు సుడి యున్నన్
యేలుమది దేవమణి యని
బాలార్కసమానతేజ బంధునిధానా.

41


సులభసాధ్యము. గళముక్రింద ఎనిమిదంగుళములకు క్రింద సుడియున్న యిది దేవమణియను సుడియగును. దాని నేలవలయును.

క.

దేవమణి క్రిందసుడియును
భావింపఁగ రోచమాన మగునని ధాత్రిన్
భావజసన్నిభ నిలువుము
భూవనితాప్రియుడ కన్న భూపలలామా!

42


దేవమణి క్రిందగానున్న సుడిని రోచమానమందురు. అట్టిగుర్రమును భదాయము. తప్పక కొనవలయును.


గీ.

రోచమానంబుక్రింద నిరూఢమగుచు
నమరసుడి జెర్రిప్రాకిన నట్టిరేఖ
పేరుహరికి జూడ ధారుణిలో శత
పాది యనిరి యశ్వభావవిదులు.

43


రోచమానముక్రింద జెర్రివలె గొన్నిటిసుడి యుందును. అట్టి గుర్రమును శతపది యందురు.


బాహుల వక్షస్థలముల
నూహింపగ ధృవులు గలుగ నుచితము విలువన్
ఆహవభీము డపాత్రత
దేహీజనకల్పభోజ దినకరతేజా.

44


ముందరి కాళ్ళమీదను వక్షస్థలంబునను ధృవులు గలిగియున్న యశ్వమును గొనవచ్చును.


సీ.

త్రికమున వీపున కకుదాంగకములను
             భృకుటిపై నాసాగ్ర పుటముమీద
హృదయమునను నాభి యుదరము కుత్తుక
             చెక్కున ముక్కున ప్రక్కలందు
గుదమున విత్తుల కోశము మెడలపై
             నేత్రాల నాలుగు గోత్రములను

మస్తమధ్యను మానుగాకటములన్
             నేకవింశతి ధృవు లెరుగజనులు
యిట్టిదోషంపుహయములు గట్టదగదు
గట్టినంతనె చెట్టలు బుట్టుచుండు
బుధజనస్తోత్ర సద్గుణపూర్ణగాత్ర
వంశకులదీప శ్రీకన్నవసుమతీశ.

45


క.

అవయవములందు నెడలక
ధ్రువులుండగ వలయు మరియు తురగంబులకున్
దివిరి యొండొంటి నెడలక
సువిచారు డనామతంబు సుభగమనోజా.

46


గుర్రము యొక్క యవయవములందు తప్పక సుడియుండవలయును. ఆసుళ్ళు విచ్చిన్నముగాక యుండవలయును. ఒక్కొకసుడి రెందపదానిని తాకి దానిని వికలమగునట్లు చేయకుండవలయును. అని మనుమంచిభట్టు తనయభిప్రాయము జెప్పెను.


క.

మిక్కిలి నశుభములైనను
దక్కున శుభధృవులు గల్గ దగ దెక్కంగా
ఎక్కుమురుజులకు శుభములు
మిక్కిలి గలుగంగ జూచి మృగపతిశౌర్యా.

47


అశుభసూచికంబులగు సుళ్ళధికముగను శుభసూచికంబులగు సుళ్ళు స్వల్పముగనుయున్న యశ్వమును గొనదగదు. శుభసూచకము లధికముగానున్న పరిశీలించి దాని నెక్కవలయును.


క.

కలియుగమున తురగములకు
సలలితముగ బాహుయుగము సన్నములైనన్
బిలువుము తురగము శుభ మిని
యిలతలమున కొంకణపతి యిభరిపుశౌర్యా.

48

గుర్రమునకు ముందటి కాళ్లు సన్నములై యుండుట మేలు.


క.

వాలంబు బాహుజంఘుల
మేలుగ కంఠాననంబుమేదినిమీదన్
ఫాలము కర్ణము మేడయును
జాలగ దీర్ఘంబులైన జనమాని యగున్.

49


తోకయు కాళ్లును జంఘలును కంఠము ముఖము చెవులు మెడయును మిక్కలి పొడవైనతురగము మిక్కిలి జనసత్వముగలది యగును.


క.

బాహులు జంఘలు మద్యము
వాహనపతి నెరుగుముఖము వాలము జెవులున్
నూహింప కురుచ లైనను
ఆహవభీముండ సత్వ మధికముసుమ్మీ.

50


కాళ్లును జంఘలును మధ్యభాగము (కటిప్రదేశము) ముఖము తోకయు జెవులును కురుచ లైయున్న యశ్వము వేగముగా పోవునది గాకున్నను బలముకలది యగును.


క.

ముష్కములు కురుచ లై కడు
శుష్కంబులు నైన జూచి సుజనుడ విలువన్
నిష్కముల లెక్క చేయక
దుష్కరముల పొంద డెంతదూరం బైనన్.

51


ముష్కములు (వృషణములు) కురుచ గలిగి ఎండిపోయిన ట్లున్నయెడల రూప్యములు ఖర్చు పడునని లెక్క సేయక తప్పక గొనవలయును. ఎంతధనము వెచ్చించినను నష్టములేదు.


క.

పలువరుసనేడు దంతాలు
కలిగిన జవసత్వహీన కాంతివిహీనన్

విలువరుపతులకు నెక్కడ
కులజలనిధిపూర్ణసోమ గుణరత్ననిధీ.

52


ఏడుదంతములు గలదానిని బలము జవము లేనిదానిని శాంతిలేనిదానిని భూపతు లెక్కకూడదు. దానిని కొనరు.


క.

బలువై కొలది వెన్నును
వలుదగుమధ్యంబు నిడుదవాలము నైనన్
వెలయగ వట్రువలైనను
గలుగుయెడ గుర్రములను గట్టుము సాలన్.

53


బలమైనట్టియు కురచయైనట్టియు వీపును బలముగలిగి లావైనమధ్యమును పొడుగుపాటితోకయు గలిగినటువంటి గుర్రమును సాలయందు గట్టియుంచుము.


క.

బడపల బోలెడిరూపము
కడుగుర్రము పతుల కెక్క కడుయోగ్యము దా
కడువర్ధి నిలువవలయును
కలియుగమున సిరియొసంగు కన్ననృపాలా!

54


ఆడుగుర్రము ముఖమువలెనున్న మొగగుర్రము శుభదాయకము తప్పక నిలుపవలయును.


క.

వదనంబును భ్రూలంఘ్రులు
విదితంబుగ దెల్ల నైన నిలువుము హయమున్
కదనమున నెక్క నతనికి
నెదురారిపు ఘోటకము నేనుగుఘటముల్.

55


ముఖమును అంఘ్రులును భ్రూయుగమును తెలుపైయున్న యశ్వమును గొనుము. దాని నెక్కినవానికి శత్రుసేనలోని గుర్రములు యేనుగులు సులభసాధ్యములు.

క.

భూపాలయపరగాత్రము
నేపారగ దెల్ల నైన నెక్కుము హయమున్
యేపై నిలువగ వలయును
యేపొందుం లచ్చిమిగుల వినయగుణాఢా.

56


కంఠముయొక్క క్రిందిభాగముగాని మీది భాగముగాని దెల్లనైన గుర్రమును నధిరోహించుము. అట్టిహయమును కొనినవానిగృహంబును నైశ్వర్యములు సర్వదా నిలచియుండును.


గీ.

నొసల జుక్క లేక శశికాంతి నొకకాల
మూడుకాళ్లు గలుగు మొసలి యండ్రు
దీని నిలుపవలదు మానవులకు
వంశదీప కన్న వసుమతీశ.

57


నొసటిమీద తెల్లనిమచ్చ లేకను, మూడుకాళ్లును తెలుపుండి యొకకాలను తెలుపు లేకున్న నాయశ్వమును మొసలి యందురు. దానిని గొనవలదు.


క.

వలపలికాళ్ళును రెండును
వెలయగ సితవర్ణమైన విలువుము హయమున్
సలలితవామాంగంబులు
వెలయగ దెలుపైన గాదు విమలవిచారా.

58


వలపలికాళ్ళు రెండును తెల్లని వైనయెడల నాహయమును తప్పక గొనుము, ఎడమభాగము తెల్లనైన నాహయంబులను గొనవలదు.


క.

పాదములు మూడు గడగిన
భేదింపగ మొసలియండ్రు పెద్దలు హయమున్
మేదినిలొ జూడగ నొక
పాదంబడి గడగవిషమపాదిది యయ్యెన్.

59

మూడు పాదములు తెలుపై యొకపాదము నలుపైన మొసలి యండ్రు. అటుగాక మూడు నలుపై యొకటి తెలుపైన నది విషపాది యని పిలువబడును.


క.

ఎక్కగ జన దమ్మొసలిని
నిక్కంబుగ విషమపాది నిందితమయ్యెన్
ఎక్కుము నుదుటను హయముకు
చక్కగ బొల్లుండెనేని సౌజన్యనిధీ.

60


ఆమొసలి యని పిలువబడు తుగంగమును యెక్కబోవకుము. అది విషపాదియగుటచే నింద్యము. నుదుటను చక్కనిబొల్లి యున్న యశ్వము నెక్కుము.


క.

పట్టరు గోడిగ నేక్రియ
సృష్టిశ్వర వెనుకపడము సితమైయున్నన్
నెట్టనమూత్రము విడినను
బుట్టవు దోషంబులండ్రు బొల్లరిలేమిన్.

61


గుర్రముయొక్క పృష్ట భాగము వెల్లనై యున్నయెడల నాగుర్రమును కొనరు. అధికముగ మూత్రమును విడుచు హయమును గూడ దోషము కలుగునని తలంచి గొనసాహసించరు.


క.

పురుషాశ్వమునకు ముందట
సరసిజరిపువర్ణమైన చరణము గలుగన్
స్థిరమతి విలువగవలయును
యరుదుగ మూత్రంబు దాకి యరుగుంఋజులన్.

62


మగగుర్రమునకు ముందటిభాగము సూర్యుని యొక్క వర్ణమైనచో బుద్ధిమంతులు దాటిపోనీయరు. తప్పక స్థిరచిత్తముతో గొందురు

.

క.

శ్రీజన్మసదనరాజ
వా జికయసమాననయన రాజీవునకున్
రాజులకు దుగ్ధవారధి
రాజునకున్ కుమారకంపరాజున కెలమిన్.

63


షష్ఠ్యంతములలోనిది గావచ్చును. పెక్కులగు మాత్రుకలలొ నీపద్యము గానరాదు.


వ.

అభ్యుదయపరంపరాభివృద్ధిగా నాయొనర్పంబూనిన హయలక్ష
ణవిలాసంబను కృతికి కథానిధానం బెట్టిదనిన నశ్వప్రశంసయు
నావర్తలక్షణంబును దశాక్షేత్రవిభాగంబును ప్రావేశప్రమా
ణంబును వయోజ్ఞానంబును వర్ణలక్షణంబును ఛాయాలక్షణంబును
గంధలక్షణంబును గతిలక్షణంబును సర్వలక్షణంబును పుండ్ర
లక్షణంబును సామాన్యదోష మహాదోష దోషతమప్రకారంబు
ను నుత్తమాశ్వలక్షణంబును విహీనలక్షణంబును చికిత్సయు లవణ
విధియు ఉకకవిధియు గడ్డికపణప్రకారంబును క్రమంబున జెప్పెద
నందు నశ్వప్రశంస యెట్టిదనిన.

64


అశ్వములకు సంబంధించిన వివిధములగు లక్షణముల చెప్పెనేని సూచించినాడు. సులభసాధ్యము.


ఉ.

అంబుధివేష్టితావనియు తాజి జయంబు మహాయశఃప్రతా
పంబును నిత్యలక్ష్మియు సంసారసుఖంబుల నొందునందు ధ
ర్మంబును వైభవోదయ సమగ్రముదంబులు గల్లి యొప్పువా
హంబులు చాలగల్గు వసుధాధిపు డెప్పుడు నింద్రతుల్యుఁడై.

65


గుర్రము లధికముగా నేభూపాలునియొద్ద నుండునో యాభూపాలుఁడు చతుస్సముద్రముద్రికధరావలయంబు పరిపాలించుచు యశఃసాంద్రుడై లక్ష్మీయుతుఁడై సర్వసౌఖ్యంబుల నొందుచు అధికవైభవము గలవాఁ డగును.

చ.

అరయగ సర్వలక్షణసమంచితమైన తురంగరత్న మీ
నరుని గృహంబునం దొకదినంబుననుం దగురీతి నుండునా
పరమపవిత్రగేహమున బాయకనిల్చు రమావధూటు శ్రీ
ధరు యురస్థలింబలె ముదం బెసలార ప్రసన్నచిత్తయై.

66


సర్వశుభలక్షణములను గల్గిన గుఱ్ఱ మేనూనపునియింట నొకదిన౦బు యున్నను యామానవునకు యధికంబులగు ధనంబులు లభించి స్థిరమై నిలిచియుండును.


మ.

జనసత్వాన్వితవైభవావళులచే సంపూర్ణమైయుండు నే
యవనీపాలునిసైన్య మాతని సముద్యత్కీర్తి బెంపారియున్
ననపర్యంతవసుంధరావలయమున్ మానంబుతో నేలుశా
త్రవ ...................................................................

67


గ్రంథపాతముచే గడమపాదము నశించినది. అర్ధము స్ఫురించుటలేదు.


చ.

................................................................
త్రవధరణీధరేశ్వరుని దానముపాలిటి లచ్చియై మహో
త్సవములుగల్తగూర్చు రణధామములో మహరాజకోటికిన్
శివశివఘోటకంబులు విచిత్రపు దూలికలే తలంపగన్.

68


గ్రంథపాతము పైపద్యముతో కలిసి పెక్కుమాత్రుకలందు కలదు.


చ.

దూరము బోవునప్పుడును దుర్దమశత్రునృపాలసైన్యముల్
బోరున గెల్చుచున్నపుడు బొంకముతో మృగయావినోదవి
ద్యారతి దేలునప్పుడు నరాధిపకోటికి వాజులట్లు బెం
పార జయాదికారణము లారసిచూడగ గల్గనేర్చునే.

69


దూరదేశముల కేగవలసివచ్చినప్పుడును శత్రువులను జయింపబోవు నప్పుడును వేటాడుటకుమున్న విద్యాప్రసంగముల దేలునప్పుడు

ను రాజులకు గడుంగడు సహాయ మొనరించి జయము చేకూర్చును. యిట్టి సహాయ మొనర్పదగిన వేమైన గలవా?


ఉ.

వారణసేవ లెన్నయిన వాజిబలుండగు రాజు కెప్పుడున్
వైరుల బోర గెల్తురని వారణరాజలు నిక్కువంబు దు
ర్వారపువాజి యొక్కటి నివాసమునం కలిగున్న ఱేనికిన్
వారక శంకనొందుదురు వైరులు మున్నుగ కంపభూవరా.

70


శా.

విశ్వంబందు వసుంధరాపతులకున్ విఖ్యాతిబీజంబులై
యశ్వంబుల్ గడునాథుకార్యములు చేయంజాలుచందంబునన్
శశ్వద్దాన వమాంపటీనిలసనస్తంబేరమం బుల్కడున్
యైశ్వర్యాఢ్యపదాతిలోకములు సేయంజాలునే క్రమ్మరన్.

71


చ.

కరిరథవీరభీషణవికారజలగ్రహకోటిచేత దు
స్తరమగు వైరిభూరమణ |సైన్యపయోధి నెన్నశశ్వమం
దరగిరి ద్రచ్చెగాక మరి తక్కినరీతులు ద్రచ్చవచ్చునే
యరయగ వీరలక్ష్మి నిలనొభశతంపధరాతలేశ్వరా.

72


గజబలములు రథములు పదాతులు జలములతో నింపబడిన కందకములు గల్గి తరింప శక్యమి కాకయుండు శత్రురాజుల సైన్యమను పాలసముద్రమును ద్రచ్చుటకు నశ్వమె మందరపర్వతము. అదియే లేనిచో శత్రుసైన్యపయోధి ద్రచ్చుట యెట్లు?


మ.

ధరణీమండల మెల్ల నశ్వముల చేతం జాల సిద్ధించు న
ద్ధరణీమండల సిద్ధియైన వలనం ధర్మార్థకామంబులన్
ధరణీ పాలకమండలంబులకు హస్తప్రాప్తమౌ గాన య
ద్ధరణీరాజుల లాభసంపదకు గంధర్వంబులే మూలముల్.

73


రాజ్యభోగములు అశ్వముల చేత లభించును. రాజ్యమువలన ధర్మార్థకామమోక్షంబులను చతుర్విధ ఫలంబులు లభించును. కా

వున రాజుల జయమునకు సౌఖ్యమునకు (యిహపరసౌఖ్యమునకు) మూలకారణము లీయశ్వములె గదా.


శా.

దావానేక పరోహిరంబు ధరవోత్తాలంబు శాంతాపశం
సానూనద్యుతీ దుర్నిరీక్షమురుబాణాపారముద్యద్విష
త్సేనావారధిమండలంబు గరిమం జెండాడు నుద్దండతన్
భూనాధుండు హయాధిరూఢు లగుచున్ బోరున్ సమీరాకృతిన్.

74


చ.

పరశుభలక్షణంబులను వర్ణనకెక్కిన ఘోటకంబులన్
ధరణిపు డెక్కిబోవలయు దజ్జగతీపతి గోరివచ్చు నిం
పరుదున శత్రులక్ష్మి విభవాన్వితయై యభిసారికాకృతిన్
దురమున గంపభూరమణ దోర్బల భీమకుమార మన్మథా.

75


క.

వర్జితదుష్కృతసుకృతో
సాక్ర్జితవివిధార్ధనిష్టరాహవకేళిన్
నిర్జితశత్రుసముత్కర
మార్టితవైభవ సముఖతాయతకీర్తిన్.

76


సీ.

చెలగి దేవాసురాదులకు నయ్యింద్రుడు
             సామంబులను దేసపాతసమితి
నాత్మ భాష్యంబున ననిల దేవుని యందు
             నమృత పూరంబుల పండములును
వాజుల సృజియించి వనజాసనుడు వాని
             కన్నుల కమలారి కమలహితుల
వాతెర సురనది వాణి జిహ్వికయందు
             యెద నగ్ని మణుగు యెడల దిశల
పసరునుక్కున నంగము నసలు నిలిపి
కాన హరులను వేల్పులుగా దలంచి
నెమ్మి పూజించి యెక్కిన నృపుల కెచట
జయము చేకూరు గంపనక్ష్మాతలేంద్ర.

77

మ.

సుమనోవాహిని రోమరాజి జలధి స్తోమంబు కాంచీకళా
పము శైలంబులు చన్నుగుబ్బలు పురప్రాకారముల్ తారహా
రములై యొప్పుగ నొప్పుచున్న యతుల ప్రారంభ విశ్వంభరా
ప్రమదం బార సుఖించు యశ్వపతియున్ ప్రసావర శ్రీగతిన్.

78


చ.

తురగము నాజి నెక్కి నిజదోర్బలలీలల జూపి విద్విష
త్సరకరవాలధార దెగగాంచిన పుణ్యుడు సందగాంచు త
త్తురగము మేనిపై గలయ దోచిన రోమము లెన్ని యన్నివ
త్సరములు నాకలోక వనితాసుఖ ముఖ్య విశేషసౌఖ్యముల్.

79


ఉ.

నెమ్మది లోన నెంతయును నిశ్చలభక్తి చరింపరేవు నే
మమ్మున సర్వలక్షణసమన్వితమైన హయంబు నిష్టదై
వమ్ము దిభాతినే నృపతి వందన కృత్యము లాచరించు ని
త్యమ్మును నామహీపతికి నాయువలును నగ్గలంబగున్.

80


చ.

సమవిష మాజి రంగముల శత్రుశరంబుల దూరి పారుచో
గమిగొని ప్రేవులెల్ల దెగి కాళ్ళను దాకుచు వ్రేలుచుండినన్
దనుక మొకింత లేక నుచితస్థితి నేలిక నుద్ధరింపు చి
త్తమతురగంబు దాని నుతి దామరసూతియు జేయనొప్పునే.

81


మాలిని.

పరిహృతరిపు గర్వా ప్రాప్త గర్వాప హర్వా
భరణ విపులసేనా ప్రఖ్య నాఖ్యాభిరామా
పరిచిత న్నపనిద్యా ప్రస్పురద్గద్య పద్యా
చరణ పతిత భూపా చాళుకీవంశదీపా.

82

గద్యము..................................................
భైరవాచార్యపుత్ర మనమంచిభట్టు ప్రణీత
మైన హయలక్షణవిలాసంబునందలి
ప్రథమాంకురము

  1. బలిసి నిగుడ అని పాఠాంతరము
  2. యవి లెస్సగుటయును నైదునెలలు పా.