శ్రీరామ

అవతార మీమాంస
సౌజన్యము ఆర్కైవ్.కాం

శ్రీ పరమేశ్వరాయనమః
దివ్యవాణీ సుకృతి ప్రాసాదము 13వ సుకృతి

అవతార మీమాంస

గ్రంధకర్త:
ముదిగొండ మల్లికార్జునరావు

ప్రకాశకులు:
దివ్యవాణీ సుకృతి ప్రాసాదము
శికింద్రాబాద్

సోల్ ఏజెన్సీ:
శ్రీ రామా బుక్ డిపో
మార్కెట్ స్ట్రీటు, సికింద్రాబాదు
సర్వస్వామ్యములు
ప్రకాశకులవి
వెల 0-6-0


  ఈ “అవతార మీ మాంస” యను గ్రంథము యశః కాయ ముదిగొండ మల్లికార్జున రావుగారిచే వ్రాయబడి దివ్యవాణీ సుకృతి ప్రాసాదమునందు పదమూడవ సుకృతిగా ప్రకాశపరుపబడినది. ఇందవతారావశ్యకత వివిధావతార ప్రయోజనములు. తత్కృత్యములు, తత్తత్వములు చక్కగా దెలుపబడినవి. భగవదవతారములంగూర్చి యాక్షేపించువా రిది చదువదగినది. తదవతార విశ్వాసము గలవారికి గూడ నిది పాఠ్యమని యెంచెదము.
28-8-46
సికింద్రాబాద్
చివుకుల అప్పయ్యశాస్త్రి
సంపాదకుడు.


అవతార మీమాంస

1భగత్కలా విచారము

  సర్వవ్యాపకుడును, నిరాకారుడునగు పరమాత్మను స్థూల లౌకిక రూపమున ప్రదర్శించుట యనునది యొక అపూర్వ విషయమై యున్నది. కావుననే, అవతార విషయమున అనేక సందేహా లుత్పన్నము లగుచున్నవి. ఇచ్ఛారహితుడగు భగవానుని అంతఃకరణమునందు సంసారికివలె ప్రపంచమునందు లీలారూపము ధరింపవలయుననెడి ఇచ్చ ఎట్లు జనించినది? మాయారహితుడగు నిరాకార పరమాత్మ మాయామయుడగు స్థూలదేహము నెట్లు ధరించెను? దేశకాల వస్తువులనలన సీమారహితుడై సర్వవ్యాపకుడగు పరమాత్మ ఒకచోటినుండి మరియొక చోటికి వచ్చెననునది, అసమంజసము కదా! కారణమేమన - వారు అంతకు క్రితము లేనిచోటికే కదా రావలయును? ఉన్నచోటునుండి ఇక్కడికి వచ్చినప్పుడు అక్కడ లేడనియే కదా భావము? ఇట్లు ఒక చోటునుండి మరియొక టోటికి ఈ స్థూల శరీరముతో పరమాత్మ పరుగెత్తవలసిన కారణము మాత్రమేమున్నది? ఆతడు సర్వశక్తి సమన్వితు డైన యెడల తన ఇచ్ఛా మాత్రముననే దుష్టులను సంహరింపజాలడా?

అలౌకిక భావమయమగు అవతార తత్వమును గూర్చి ఇట్టి శంకలెన్నియో కలుగుచున్నవి. కావున, ఈ పుస్తకమునందు పైప్రశ్నల కన్నింటికి సంక్షిప్తముగ జవాబులు చెప్పి అవతారతత్త్వ నిరూపణ మొనర్పబడును. అవతార విషయమున శాస్త్రముల యందనేక ప్రమాణము లున్నవి.
ఋగ్వేదము మం. 6, అ, సూ. 47, శి లో:-
రూపంరూపం ప్రతిరూపోబ భూవతదస్యరూపం ప్రతిచక్షణాయ
ఇంద్రోమాయాభిః పురురూపఈయతేయుక్తా హ్యాస్యహరయఃశతాదశ॥

భక్తులయొక్క ప్రార్థన ననుసరించి భగవంతుడు మాయా సంయోగముతో జీవ, అవతారాది అనేకరూపములను ధరించును. అట్టి రూపము లనేకములున్నవి. కాని 10 మాత్రమే ముఖ్యమైనవి.
భగవద్గీతయందిట్లున్నది:-

అజోపిసన్నవ్యయాత్మా భూతానామీశ్వరోzపిసన్
ప్రకృతింస్వామవష్టభ్య సంభవామ్యాత్మమాయయా।
యదాయదాహిధర్మస్య గ్లానిర్భవతిభారత
అభ్యుత్థానమధర్మస్య తదాత్మానంసృజామ్యహమ్॥
పరిత్రాణాయసాధూనాం వినాశాయచదుష్కృతామ్
ధర్మసంస్థాపనార్థాయ సంభవామియుగేయుగే॥

అజన్ముడును, అవ్యయుడును, సర్వభూతేశ్వరుడు ఐనను మాయయొక్క ఆశ్రయమువలన పరమాత్మ ప్రపంచమునం దవతరించుచున్నాడు. ధర్మగ్లానియును, అధర్మవృద్ధియును కలిగిన వెంటనే భగవంతుడు అవతారమును ధరించుచున్నాడు. సాధువులను రక్షించుటకొరకును, దుష్టులను నాశనమొనర్చుటకును, ధర్మమును సువ్యవస్థిత మొనర్చుటకును, పరమాత్మ ప్రతి యుగమునందును అవతరించును. ఈవిధముగా ఆర్యశాస్త్రములయందు అవతారమును గురించిన అనేక ప్రమాణములు లభించుచున్నవి.

పరమాత్మ సర్వశక్తి మంతుడును, సర్వవ్యాపకుడు నగుటచే, అతడు ఒకచోటనుండి మరియొక చోటికి వచ్చెననుట మాత్రము విజ్ఞాన విరుద్థమేయగును. కాని, అవతార విషయమునందు మాత్ర మేమియును అసంభవత కానిపించుటలేదు. అవతారమనగా ఒకచోటనుండి మరియొక చోటికివచ్చుట యని అర్థమెంత మాత్రమును కాదు. కాని, సర్వవ్యాపకుడగు పరమాత్మయొక్క శక్తి, ఒకానొక విశేష కేంద్రమునుండి ప్రకటమగుటకే అవతారమనిపేరు. అవతార శబ్దమందలి అవతరణము (క్రిందికిదిగుట) భావమూలకము మాత్రమే. పరమాత్మయొక్క విశేషశక్తి, మాయద్వారా సంబంధింపబడి ప్రకటింపబడుటకే భావరాజ్యమునందు అవతరణ మనబడును.

పరమాత్మ సర్వవ్యాపకుడగుటచే అతని శక్తికూడ సర్వవ్యాపినియై యున్నది. అతని పై ఆధారపడియున్న జడచేతనాత్మకమగు దృశ్యప్రపంచముద్వారా ఆశక్తి వికాసమును పొందుచుండును. కావుననే జడచేతనాత్మకముల యందెల్లడల కాన్పించు శక్తియంతయును అతని శక్తియే; అతనియొక్క ఈ శక్తియే అగ్ని యందును, జలము నందును, ఓషధుల యందును, వనస్పతుల యందును, ప్రపంచము నందంతటను వ్యాపించి యున్నది.
పంచ దశీకారుడిట్లనుచున్నాడు:—
సర్వశక్తిమయంబ్రహ్మ నిత్యమాపూర్ణమద్వయమ్
యధోల్లసతిశక్త్యాసౌప్రకాశమధిగచ్ఛతి॥

అద్వితీయ బ్రహ్మమునందు శక్తి నిండియున్నది. ఈ శక్తి ఎప్పుడు దృశ్యమును ఆశ్రయించి ఉల్లసించుచున్నదో, అప్పుడు ఇది దృశ్య జగత్తునందు ప్రకాశించు చున్నది. వికాసమును పొందిన ఈ శక్తియే, శాస్త్రములయందు “కళ” యని పిలువబడును. “షోడశ” శబ్దము పూర్ణత్వ ప్రతిపాదక మగుటచే పూర్ణశక్తి వికసించినచోట షోడశ కళాశక్తులును ప్రకటమైనట్లు భావింపబడును. పూర్ణ చంద్రుడు షోడశ కళాపూర్ణశక్తి యని చెప్పబడును. పరమాత్మయందు పూర్ణశక్తి యుండుటచే, పరమాత్మ షోడశ కళాపూర్ణుడని చెప్పబడుచున్నాడు,
ఛాందోగ్యము నందిట్లున్నది.
“షోడశ కలః సోమ్యపురుషః”

పరమాత్మ షోడశ కళాశక్తి యుక్తుడై యున్నాడు.
తైత్తరీయ బ్రాహ్మణయమునం దిట్లున్నది.
“షోడశకలోవై పురుషః”

పరమాత్మకు షోడశ కళలున్నవి. పరమాత్మయొక్క ఈ షోడశ కళాత్మక శక్తియే జడచేతనాత్మకమగు సమస్త జగత్తునందును ప్రాప్తమై యున్నది. జీవుడు తన యోని యందు ఉన్నతినందిన కొలదియును, పరమాత్మయొక్క ఈ కళ జీవుని ఆశ్రయమువలన వికాసమును పొందుచున్నది. కళావికాసమందలి హెచ్చుతగ్గలే జీవయోనియందలి ఉన్నతి, అవనతి సూచకములని కూడ చెప్పవచ్చును. ఒకయోనిలోని —-
(ఇక్కడ ఒకపుట కనిపించుటలేదు)
———
చెదరు. మనుష్యుని యందైనను, అంతకన్న తక్కువ యోనియందలి జీవునియందైనను, ఈ అలౌకిక శక్తియున్నయెడల వారి శరీరము సామాన్య శరీరముగా కానుపించినను, వారిని అవతారములుగా ఎరుంగవలయును. సాధారణ జీవుల యందీ అలౌకికశక్తి ధరింపగల సామర్ధ్యముండదు. ఇదియే శాస్త్రములయందలి అవతార సిద్ధాంతము! 9 కళలలో నుండి 15 కళల వరకును అంశావతారమనియును, 16 కళలతో నిండిన కేంద్రమునకు పూర్ణావతారమనియు పేర్లు.

ఓషధి, వనస్పతి, వృక్ష, లతాదులయందు ప్రాణాధారణమొనర్చు శక్తియును, పుష్టినొసంగు శక్తియు నుండుటచే వీనియందు భగవచ్ఛక్తిలోని ఒక కళమాత్రమున్నదని తెలియవలెను. స్వేదజ, అండజ జరాయుజ, పశు, మనుష్య, దేవతాదులకు సహితము అన్నమయకోశము ద్వారా ఉర్భిజగణమే తృప్తి నొసంగుచున్నది. ప్రపంచమునందలి దివ్య సౌందర్యమును, బ్రహ్మాండ ప్రకృతియందలి అపూర్వమగు స్థితిదశలును, శోభయును, భగవానుని చిత్రవిచిత్రరూప విలాసములును, ఉర్భిజములలోని ఏక కళావికాస ఫలమని ఎరుంగవలయును. ఉర్భిజములయందు కేవలము ఒకకళ ప్రకటితమగుటచేతనే, వానియందు జీవభావమును, సకలేంద్రియ క్రియలును కాన్పించుచున్నవి. ఈ విషయములను నేటి సైంటిష్టులు సహితము యంత్రములద్వారా రుజువుల చేయుచునే యున్నారు.

ఇక స్వేదజమునందు రెండు కళలు వికసించినవి, దీనియందు అన్నమయ ప్రాణమయ కోశములు రెండును కాన్పించుచున్నవి. ఉర్భిజమునందు, ప్రాణమయకోశము లేకపోవుటచేత ఉర్భిజములు అటునిటు తిరుగజాలకున్నవి. కాని, స్వేదజములు బాగుగా తిరుగగలవు. చెదపురుగువంటి పురుగులలో అత్యద్భుతమగు గృహనిర్మాణ శక్తియును, కలరా, ప్లేగు క్రిములలో క్షణమాత్రమున మనుష్యుల ప్రాణములను హరింపగలశక్తియును రక్తాణువులయందుగల రోగనిరోధక శక్తియును, వీర్యకీటక(కణ)ములయందుగల ప్రజోత్పాదక శక్తియును, స్వేదజములోని భగవచ్ఛక్తియొక్క రెండు కళలవికాస ఫలమని ఎరుంగవలయును.

ఇక, అండజమునందు 3 కళలు వికసించినవి. అన్నమయ ప్రాణమయ కోశములతోపాటు, మనోమయ కోశము కూడ అండజములయందు వికాసము నందినది. కావుననే, వానియందు మిక్కుటమగు మానసిక ప్రేమ కాన్పించుచున్నది. ఆడపావురము మగపావురములు, శుకశారికలు చక్రవాకీ చక్రవాకములును, ఒండొంటిని ప్రేమించు కొనుటను చూచుచున్నాము. పక్షులయందు మనోమయ కోశము వికసించుటచేతనే వానియందు వాత్సల్యభావము సహితము అపూర్వముగ వికసించినది. పక్షులు తమ సంతానమును గాఢముగా ప్రేమించును. “వైనతేయశ్చ పక్షిణామ్” అని అండజముల యందు సహితము తన విభూతియున్నదని భగవానుడు చెప్పుచున్నాడు.

ఇక జరాయుజాంతర్గతమగు పశుయోనియందు 4 కళలు వికసించినవి. వీనిలో అన్నమయ, ప్రాణమయ, మనోమయ కోశములతో పాటు, విజ్ఞానమయ కోశముకూడ పశువులయందు కాన్పించుచున్నది. ఉత్కృష్ట పశువులనేకములు మనుష్యులవలనే అనేక పనులొనర్చుచున్నవి. మనోమయకోశము మరింత వికసించుట చేత, ప్రేమించుట, ప్రేమనుపొందుట, స్నేహము చేయుట మొదలగు పనులను చేయుచున్నవి. ఇతిహాసమును పరిశీలించిన యెడల, ప్రభుభక్తిగల గుఱ్ఱములు, కుక్కలు, ఏనుగులు మొదలగు జంతువులు అనేక పర్యాయములు తమ యజమానిని విపత్తునుండి రక్షించుచినట్లును, తమ యజమానికొరకు ప్రాణములను సహితము త్యజించినట్లును, యజమాని మరణించిన పిదపను వాని శవము వద్ద నిరాహార దీక్షనుబూని కడకు ప్రాణములను వదలినట్లును, తెలిసికొనగలము. ఇవి అన్నియు, పశుయోనియందు భగవచ్ఛక్తి యొక్క 4 కళలు వికసించుట చేతనే కలిగెనని తెలియవలెను.

ఇక, మనుష్యులయందు నిమ్నోన్నత తారతమ్యము ననుసరించి, ఈ ఈశ్వరీయ కళలు 5 నుండి 8 వరకును వికసించును. 5 కళలు గలవాడు సామాన్యమానవుడు. 6 కళలు నుండియును విశేషశక్తిగ పరిగణంచబడును. దీనిని శాస్త్రములయందు “విభూతి” యందురు.
గీతాశాస్త్రమునందిట్లున్నది:—
యద్ యద్ విభూతిమత్ సత్త్వం శ్రీమదూర్జితమేనవా
తత్తదేవానగచ్ఛత్వంమమతే జోంzశసంభవాత్॥

ప్రపంచమునందున్న ఐశ్వర్యయుక్త, తేజోయుక్త, శక్తియుక్త పదార్థము లన్నియు భగవచ్ఛక్తియొక్క వికాసమువలన జనించినట్లు భావింపవలయును. భగవానుని విశేష శక్తివలన పొందిన విభూతులద్వారా ప్రపంచమునందనేక ధార్మిక కార్యములు నెరవేరుచున్నవి. అవతారముయొక్క ఆవశ్యకత కలుగనంతవరకును, సామాన్యముగా ఈ విభూతులవలననే ధర్మము రక్షింపబడుచుండును. ప్రవక్తలును, శక్తి సంపన్నులగు దేశ నాయకులును ఈ శ్రేణియందే గుణింపబడెదరు. కాని, ఒక విషయమును మాత్రము ముఖ్యముగ గ్రహింపవలసియున్నది. ఈ విభూతులయందు అసంపూర్ణశక్తి మాత్రమే ఉండుటచేత వీరివలన జరుపబడెడి కార్యములు సహితము ఆయా దేశకాలములకు మాత్రమే అనుకూలించి యుండును.

షోడశకళాప్రపూర్ణుడును, సర్వశక్తివంతుడునగు భగవానుని 8 కళల వరకును లౌకికమగు మనుష్యాదులయందు ప్రకటమగుట కవకాశమున్నది. కాని 8 కళలకుపైన ఆశక్తిని ధరించుటకు లౌకిక కేంద్రములు అసమర్థములై యున్నవి. కావున, 9 నుండి 16 కళలవరకును భగవచ్ఛక్తి ఏ యే మనుష్య పశ్వాదులయందు ప్రకటితమగునో వారందరును అవతారములని పిలువబడుదురు.
భగవద్గీత యందిట్లున్నది.:—
భావయత్యేషసత్యేనలోకాన్ వైలోకభావనః
లీలావతారాసురతోదేవ తిర్యజ్నిరాదిషు॥

లోకపాలకుడగు భగవంతుడు దేవ, తిర్యక్, మనుష్యాది శరీరములద్వారా లీలావతారమును ధరించి ప్రపంచమును రక్షింపుచుండును.

2అవతారములెన్ని?

ఇట్టి అవతారము లెన్నిఉండును? ఈ ప్రశ్నకు జవాబు చెప్పుచు భాగవత ప్రథమస్కంధము తృతీయాధ్యాయము నందిట్లు చెప్పుచున్నాడు.
అవతారాహ్యసంఖ్యే యాహరేః సత్త్వనిధేర్ద్విజాః
యధానిదాసినఃకుల్యాః సరసఃస్యుఃసహశ్రః॥
ఋషయోమనవోదేవా మనుపుత్రామహోజనః
కలాఃసర్వేహరేరేవ సప్రజాపతయస్మతాః॥
ఏతేచాంశకిలాఃపుంసః కృష్ణస్తుభగవాన్ స్వయమ్
ఇంద్రారివ్యాకులంలోకం మృడయన్తియుగేయుగే॥

అగాధ జలయుక్త మగు సరస్సునుండి పెక్కువేలకాలువలు ప్రవహించునట్లు, సత్త్వగుణాశ్రయుడగు భగవానుని నుండి అనేక అవతారము లుత్పన్నములగుచున్నవి. ఋషిగణము, మనుగణము, దేవగణము, మనుపుత్రగణము, ప్రజాపతి గణము మొదలగువా రందరియందును భగవంతుని కళలు విభూతిరూపమున ప్రకాశించుచున్నవి. ఇతర అవతారముల యందు భగవానుని ఆంశిక శక్తి వికసించియున్నది. కాని శ్రీకృష్ణునియందు సంపూర్ణ భగవచ్ఛక్తి వికాసమొంది యుండుటచే శ్రీకృష్ణుడు భగవత్స్వరూపుడని పిలువబడుచున్నాడు. దైత్యులచే ప్రపంచము అల్లకల్లోలమైనపు డిట్టి అంశావతారములును, పూర్ణావతారములు నుద్భవించుచుండును. ఇక శాస్త్రములయం దిట్టి అవతారములలో 24 ముఖ్యమనియు, ఆ ఇరువదినాల్గింటిలోను 10 మాత్రమే అత్యంత ముఖ్యములనియు వ్రాయబడియున్నది.
మత్స్యః కూర్మో వరాహశ్చ నృసింహో వామనస్తథా
రామో రామశ్చ రామశ్చ బుద్ధః కల్కిర్దశాస్మృతాః

మత్స్య, కూర్మ, వరాహ, నృసింహ, వామన, పరశురామ, రామ, కృష్ణబలరామ; బుద్ధ, కల్కి ఈ పదియును అవతారములై యున్నవి. శాస్త్రములయందు సామాన్యముగా 10 అవతారములనియు, 24 అవతారములనియు వ్రాయబడుటయేగాక, అసంఖ్యావతారము లున్నవనికూడ చెప్పబడియున్నది. శైవపురాణమునందు అనేక శివావతారములు వర్ణింపబడియున్నవి. గణేశపురాణము నందు గణపతియొక్క అనేక అవతారములును, శాక్తేయ పురాణములందు శక్తియొక్క అనేక అవతారములును, సుర్యోపాసనా గ్రంథములయందు సూర్యుని అవతారములను, విష్ణుసంబంధమగు గ్రంథములయందు విష్ణుభగవానుని అవతారములను వర్ణింపబడియున్నవి. కావున పంచోపాసనా సిద్ధాంతము ననుసరించి విష్ణు, శివ, గణపతి, సూర్య, దేవీ అవతారము లనేకములున్నవని శాస్త్రములయం దనేక ప్రమాణములున్నవి. జగత్కారణుడగు జగదీశ్వరు డొక్కడేయైనను, వాని అవతార తత్త్వరహస్యము సహిత మొక్కయేయైనను, పంచగుణోపాసకుల ఉపాసనా మహత్త్వమువలన పంచోపాసనయొక్క స్వతంత్ర స్వతంత్రభావములను తీసుకొని, జగద్రక్షణకొరకు స్వతంత్ర స్వతంత్రభావపూర్ణమగు స్వతంత్ర స్వతంత్రకళలలో భగవానుని అవతారములు అప్పుడప్పుడు ప్రకటిపబడినవి, ప్రకటింపబడుచున్నవి. మహావిష్ణు భావముచేనైనను, మహాశక్తి భావముతోనైనను, మహాగణపతి భావముతోనైనను, మహాదేవ భావముతోనైనను, మహాసూర్యభావముతోనైనను, ఏ భావముతో అవతరించినను, అవిఅన్నియును సర్వశక్తిమంతుడును, అద్వితీయుడు నగు నా బ్రహ్మముయొక్క అవతారముగా గ్రహించవలయును. ఇక అవతారవిషయమున కొన్ని వేదప్రమాణములను చూపించి, తర్వాత అవతార కారణమును, అవతారలీలా వర్ణనము నొనర్చెదముగాక

3అవతార విషయము వేదశాస్త్రములందు గలదా?

శతపథబ్రాహ్మణము కా 1, అ 8, బ్రా 1, కండిక 1, 6 లో మాయావతారమును గురించి బాగుగా వర్ణింపబడియున్నది.
అధర్వవేదము 12, అను 1 లో ఇట్లున్నది.:—
“వరాహేణ పృథివీ సంవిదానా శూకరాయ విజిహీతేమృగాయ”

వరాహరూపుడగు భగవానుడు ఈ పృథ్వి నుద్ధరించెను.
ఋగ్వేదసంహిత మ 1, అ 21, సూ 154 నందిట్లు వర్ణింపబడియున్నది.
ప్రతద్విష్ణుః స్తవతే వీర్యేణమృగో నభీమః కుచరోగిరిష్ఠాః

నృసింహ రూపధారియును, భయంకరుడు నగు భగవంతుడు స్తుతింపబడుచున్నాడు.
సామవేదము 18-2-8-2-5-1-2 లో ఇట్లున్నది.:—
“త్రీణిపదా విచక్రమేవిష్ణుర్గోపా అదాభ్య ॥ అతోధర్మాణిధారయన్”
“ఇదం విష్ణుర్విచక్రమేత్రేథా నిదధేపదమ్” 18-2-1

ప్రపంచమును రక్షించెడి భగవంతుడు ధర్మరక్షణము కొరకు వామనావతారమునందు 3 పాదములతో 3 లోకములను ఆవరించుచున్నాడు.
ఐతరేయబ్రాహ్మణము 3-5-34 నందట్లున్నది:—
“ ప్రోవాచరామో భార్గవేయో విశ్వన్నరాయ”

భృగుకులతిలకుడగు పరశురాముడు విశ్వన్నరునితో చెప్పెను.
సామవేదసంహిత ఉత్తరార్చికము 15-2-1-3 నందిట్లున్నది.
భద్రోభద్రాయ సచమాన ఆగాత్ స్వసారంజారో అధ్యేతిపశ్చాత్

శ్రీ రామచంద్ర భగవానుడు సీతాదేవితో అరణ్యమునకు పోయెను. దుర్మార్గుడగు రావణుడు రామచంద్రుని పరోక్షమున సీతను అపహరింపవలయునని వచ్చెను.
ఛాందోగ్యము పరి 3, ఖండము 17 నందిట్లున్నది:-
“ఏతద్ఘోర అంగిరసః కృష్ణాయ దేవకీపుత్రాయోక్త్వావాచేతి”

అంగిరసుడు ఈమాటలను దేవకీపుత్రుడగు కృష్ణునితో చెప్పి నాతోచెప్పెను.
“సమిష్టి కర్మాధీనంతత్”

అవతారము ఏదో ఒక జీవియొక్క కళ్యాణముకొరకు జరుగదు. సమిష్టిజీవుల కళ్యాణముకొరకే జరుగును. అవతారములు 5 విధములై యున్నవి.:-
“కళాభేదేనా పూర్ణాంశత్వమ్”
నిమిత్తాద్ విశేషావిశేషౌ”
“అంతరావిర్భావస్య నిత్యత్వమ్”

కళాభేదమువలన పూర్ణావకృతారములనియు, అంశావతారములనియు రెండువిధములు. తొమ్మిది కళలనుండి 15 కళళ వరకుని అంశావతారమనబడును. 16 కళలుగల అవతారము పూర్ణావతారమనబడును. నిమిత్త భేదమువలన విశేష అవతారములనియు, అవిశేష అవతారములనియు రెండు విధములుగా నుండును. అంతఃకరణమునందు ప్రకటమగు శ్రీభగవానునకు మత్స్యావతారమని పేరు. ఈ ప్రకారముగా, పూర్ణావతారము, అంశావతారము, విశేషావతారము, అవిశేషావతారము, నిత్యావతార మని, అవతారము లైదు విధములై యున్నవి.

ప్రతి యుగమునందును ధర్మముయొక్క వికాసము ఆ యుగమందలి మనుష్యుల సమిష్టికర్మ ననుసరించి యుండును. ఈ నియమమునందు బాధకలుగనంతవరకును అవతారముయొక్క ఆవశ్యకతలేదు. ఒకానొకప్పుడట్టి అసామంజస్య మొదవినను, 8 కళలకు లోపలనేగల భగవద్విభూతిద్వారా ధర్మము సువ్యవస్థిత మొనర్చుటకు వీలుగాని యెడల ఏదో ఒక విశేష కేంద్రముద్వారా 8 కళలకుపైగా గల భగవచ్ఛక్తి ప్రవహించి, ధర్మమును నిరాటంక మొనర్పవలయును. రామావతారమునుగూర్చి రామాయణము.
బాలకాండమునందిట్లు చెప్పబడినది
సహితేపేతపస్తీవ్రం దీర్ఘకాలమరిందమః
యేనతుష్టోzభవద్భ్రహ్మ లోకకృల్లోకపూర్వజః
సంతుష్టః ప్రదౌతస్మై రాక్షసాయవరంప్రభుః
నానావిధేభ్యోభూతేభ్యో భయంనాన్యత్రమానుషాత్
అవజ్ఞాతాఃపురాతేన వరదానేహిమానవాః॥ ఏవంపితామహత్తస్మాత్
వరదానేనగర్వితః॥ ఉత్పాదయతిలోకాంస్త్రీన్ స్త్రీయశ్చావ్యుపకర్షతి
తస్మాత్తస్యవధోదృష్టో మానుషేభ్యఃపరంతప
ఉద్వేజయతిలోకాం స్త్రీనుచ్ఛ్రితాన్ ద్వేష్టి దుర్మతిః॥
శక్రంత్రిదశరాజానం ప్రధర్షయితుమిచ్ఛతి॥
ఋషీన్ యక్షాన్ సగంధర్వాన్ బ్రాహ్మణానసురాంస్తథా
అతిక్రామతిదుర్థర్షో వరదానేనమోహితః॥
నైనంసూర్యఃప్రతపతి పార్శ్వేవాతినమారుతః
చలోర్మిమాలీతందృష్ట్వా సముద్రోపినకంపతే॥
తన్మహన్నోభయంతస్మా ద్రాక్షసాత్ ఘోరదర్శనాత్
వధార్ధంతస్యభగవన్ను సాయంకర్తుమర్హసి॥

రాక్షసరాజగు రావణుడు చాలకాలము కఠినమగు తపమాచరించెను. దానివలన బ్రహ్మదేవుడు సంతుష్టిజెంది “నీకు మనష్యులవలన తప్ప ఇతరప్రాణులవలన ఏ విధమైన అపాయము లేకుండుగాక” యని వరమొసంగెను. ఈ వర ప్రభావమువలన గర్వించి రావణాసురుడు స్త్రీలను బలాత్కరించి ప్రజలను బాధింపసాగెను. కావున, వానిని వధింపవలసినయెడల మనుష్యుడే వధింపవలసియుండును. రావణుడు సమస్తలోకములను, స్త్రీలను, ఋషి యక్ష గంధర్వ బ్రాహ్మణాదుల నందరను బాధింపుచుండెను. వానినిచూచి సూర్యుడు భయపడి సరిగా ప్రకాశింపజాలకుండెను. వాయువు సరిగా వీయజాలకుండెను. సముద్రము భయముతో కంపించుచుండెను అందరును భగవంతుని ప్రార్థించిరి. ఇక భగవంతుడే వీనిని సంహరించుటకు అవతరించవలసి వచ్చెను.

4మత్స్యావతారము

ఇక, 10 అవతారములగురించి సంక్షిప్తముగ వివరించెదను. ఈ పది అవతారములలోను, మొట్టమొదటిది మత్స్యావతారము నైమిత్తిక ప్రళయ సమయమున, సృష్టి యంతయును జలమగ్నమైనయపుడు, సృష్టిబీజమును రక్షించుట కీయవతారము ఆవిర్భవించును. జలమునుండి సృష్టిని రక్షింపవలయును. కావున జలచరమగు చేపరూపమున భగవదవతారము జరుగవలసియున్నది. ఈ విషయమును గురించి యగ్నిపురాణమునందిట్లు వర్ణింపబడియున్నది.:— పూర్వకల్పాంతరమునందు నైమిత్తిక ప్రళయము జరిగిన పిదప పృధ్వివ్యాది లోకములన్నియు జలమగ్నములయ్యెను. ఆ సమయమునకు క్రితమే వైవస్వతమనువు ఘోరమగు తపమొనర్చుచుండెను. ఒకరోజు అతడు కృతమాలా నదియందు తర్పణమొనర్చుచున్నపుడు, ఒక చిన్నచేప అతని దోసిలిలోనికి వచ్చెను. మనువు దానిని మరల నీటియందు వదలివేయబోయెను. కాని ఆ మత్స్యమిట్లనెను, “రాజా; నన్ను నదియందు పారవేయకుము. నేను నదియందలి “మొసలి” మొదలగు జంతువులను చూచి చాల భయపడుచున్నాను.” అనెను. ఆమాటలనువిని మనువు దానిని తన చెంబులో పడవైచెను. కొంచెము సేపున కామత్స్యము మరింత పెద్దదిగానై నాకు మరియొక స్థానము చూపింపుమని అడిగెను. మనువు దానిని ఒక సరస్సునందు పడవైచెను. కాని, అది క్రమక్రమముగా పెరుగుచు సరస్సునంతయు కప్పివైచెను. మనువు దానిని చూచి, “దేవా! నీవు భగవానుడవుకాని, సామాన్యమత్స్యమువుకావు. నన్ను భ్రాంతియందు పడవేయకుము” అని ప్రార్థించెను. అప్పుడా మత్స్యరూపమందున్న భగవానుడు “నేను దుష్టులను నాశనమొనర్చి ధర్మమును రక్షించుటకై అవతరించినాను. నేటికి ఏడవదినమున ప్రళయము సంభవించి ప్రపంచమునంతయును జలమగ్నమగును. అప్పుడు నేనొక నావను పంపెదను. దానియందు నీవును, సప్తఋషులును నివసింపవలయును” అని సెలవిచ్చెను. అటులనే 7 వ దినము ప్రళయము జరిగెను. నావవచ్చెను. నావయందు సప్తఋషులును, మనువును కూర్చుండి సృష్టిబీజములను కాపాడిరి.

<h3 id="qam=5కూర్మావతారము

కూర్మావతారము దైవరాజ్యావతారమై యున్నది. ఒకానొకప్పుడు దైవీశక్తి అసురీశక్తివలన ఓడింపబడెను. దీనివలన ప్రపంచమునందు అధర్మము పెరిగిపోయెను. అపుడు భగవంతుడు దేవతలతో “మీరు రాక్షసులతో సంధిచేసుకొని, యిరువురును కలిసి సముద్రమును మధించుడు, దానినుండి వెలువడెడి అమృతమును త్రాగినయెడల మీరు జయించి ధర్మమును పునఃస్థాపన మొనర్చగలరని” చెప్పెను. అటులనే సముద్రమును మధించునపుడు మందర పర్వతము క్రిందికి కృంగిపోవుచుండగా భగవానుడు కూర్మరూపమును ధరించి ఆ పర్వతమును తన వీపుపై నిడుకొని కాపాడెను. అపుడు లక్ష్మి, పారిజాతము, ధన్వంతరి, అమృతము మొదలగునవి ఉద్భవించెను. ప్రపంచమునందు సహితము రెండు విరుద్ధ శక్తుల సంఘర్షణ వలననే ఏదైన కార్యము జరుగును. కాని, దాని సామంజస్యమును కాపాడుటకొరకు ధర్మశక్తి వానిని తన వీపుపై ధరించినపుడే, ఉత్తమ వస్తువులన్నియు ఉద్భవించును.

6వరాహావతారము

మూడవ అవతారము వరాహావతారమై యున్నది. పాతాళమునకు పోయిన పృధ్విని కాపాడుటకొరకు ఈ అవతారముధ్భవించినది. జయవిజయులను ద్వారపాలకులు సనకాది బ్రహ్మఋషులశాపమువలన హిరణ్యాక్ష హిరణ్యకశిపులను రూపములు ధరించిరి. హిరణ్యాక్షుడు పృధ్విని పాతాళమున తీసికొనిపోయెను. దానిని ఉద్ధరించుటకొరకే వరాహావతార ముద్భవించెను.

7నృసింహావతారము

నాల్గవతారము నృసింహావతారము బ్రహ్మవలన అనేక వరములను పొంది గర్వించి ప్రపంచమును అల్లకల్లోలమొనర్చుచు, పరులచేతను పశువులచేతను మరణము లేదనెడి అహంకారముతోనున్న హిరణ్యకశిపుని సంహరించుటకే నృసింహావతార మవతరించెను.

హిరణ్య కశిపునకు ప్రహ్లాదుడనెడి కుమారుడుండెను. ఒకరోజు తండ్రి కుమారుని పిలిచి పాఠమును ఒప్పగించమని కోరగా ప్రహ్లాదుడిట్లు జవాబిచ్చెను.
తత్సాధుమన్యేzసురవర్యదేహినాం
సదాసముద్విగ్న థియామసద్గ్రహాత్
హిత్వాత్మపాతం గృహమంధకూపం
వనంగతో యద్ధరిమాశ్రయేయం॥

“ఓ రాక్షసరాజా। ఆత్మనాశన మొనర్చెడి అంధకూపతుల్యమగు గృహమును పరిత్యజించి అరణ్యములకు పోయి భగవానుని ధ్యానించుటయే శ్రేష్ఠమైన కార్యమని నేను భావింపుచున్నాను.”

ఈ మాటలను విని హిరణ్యకశిపుడు కోపించి, విష్ణుభక్తిని వదలవలసినదిగా ప్రహ్లాదుని అనేకవిధముల బాధించెను. కడకు కత్తిని తీసికొని “దేవుడున్న యెడల ఈ స్తంభమునందు చూపు”మని స్తంభముపై దెబ్బకొట్టెను. అపుడు భయంకరమగు శబ్దము కలిగెను. అప్పుడు:-
సత్యంవిధాతుంనిజ భృత్యభాషితమ్
వ్యాప్తించభూతే ష్యఖిలేచాత్మనః
అదృశ్యతాత్యద్భుత రూపముద్వహన్
స్తంభేసభాయం నమృగంనమానుషం॥

తన భృత్యుడగు ప్రహ్లాదుని వాక్యమును సత్యమొనర్చుట కొరకు భగవానుడు నరసింహావతారమెత్తి ఉద్భవించి హిరణ్యకశిపుని తన గోరులతో చీల్చి చంపివైచెను.

8వామనావతారము

అయిదవ అవతారము వామనావతారము. బలిచక్రవర్తి తన పరాక్రమమువలన దేవతల నందరును స్వర్గచ్యుతుల నొనర్చి సృష్టిక్రమమునందు ఆటంకము కల్గించెను. అందువలన భగవానుడు వామనావతారమెత్తి 3 అడుగులమేరను దానము తీసుకుని, బలిచక్రవర్తిని పాతాళలోకమునకు పంపివైచెను.

9పరశురామావతారము

ఆరవ అవతారము పరశురామావతారము. ఈ అవతారమునందు బ్రాహ్మణద్వేషులగు క్షత్రియులనందరను భగవానుడు నాశనమొనర్చెను.
మనుసంహితయందిట్లున్నది:—
నాబ్రహ్మక్షత్రమృధ్నోతి నాక్షత్రంబ్రహ్మవర్థతే
బ్రహ్మక్షత్రశ్చసంపృక్త మిహచాముత్రవర్ధతే॥

బ్రహ్మశక్తి లేనిదే క్షాత్రశక్తి పుష్టి నొందజాలదు. క్షాత్రశక్తి లేనిదే బ్రాహ్మణశక్తి వృద్ధినొందజాలదు. రెండింటియొక్క పరస్పర సహాయ సహానుభూతులవలననే ప్రపంచకళ్యాణము జరుగగలదు. కాని, త్రేతాయుగమునం దొకానొకప్పుడు బ్రాహ్మణ క్షత్రియుల యందలి పరస్పర సహానుభూతి నశించెను. క్షత్రియులు అధికార మదోన్మత్తులై, నిరపరాధులగు బ్రాహ్మణులను హింసింపసాగిరి. ఈ కారణమున ధర్మమునందు గ్లాని సంభవించెను. దత్తాత్రేయుని వరప్రభావమువలన గర్వించి కార్తవీర్యార్జునాదులు తమతపోబలమును ధర్మనాశనమునందు వినియోగింపసాగిరి. అప్పుడు భగవానుడు అవతారమును ధరించి అధార్మికమగు క్షాత్రశక్తిని నాశనమొనర్చి ప్రపంచమునందు శాంతిని, ధర్మమును స్థాపించెను. కావుననే పరశురాముడు 21 మారు భూలోకమందలి దుష్టక్షత్రియులనెల్లరను వధించెను. కాని, శ్రీరామచంద్రావతార ముద్భవించిన వెంటనే, పరశురాముని శక్తియంతయును శ్రీరామునియందు ప్రవేశించెను.
రామాయణమునందిట్లున్నది.
తతఃపరశురామస్య దేహన్నిర్గత్యవైష్ణవమ్
పశ్యతాంసర్వదేవానాం తేజోరామముపాగమత్॥

పరశురామునిలోని శక్తి రామచంద్రునియందు ప్రవేశించెను. దేవతలందరును ఈ అలౌకిక దృశ్యమును చూడసాగిరి.

10శ్రీరామావతారము

ఇక, ఏడవ అవతారము రామావతారమైయున్నది. ఈ రామావతారమువలన ఆదర్శజీవితమున కొక దృష్టాంతము చూపింపబడినది. ఇదియే ప్రపంచమునందలి మానవుల కెల్లరకును అనంత కాలమువరకు కళ్యాణ మార్గమైయున్నది.
రామాయణము బాలకాండయందిట్లు చెప్పబడియున్నది.
కౌసల్యాజనయద్రామం దివ్యలక్షణసంయుతం
విష్ణోరర్థంమహాభాగం పుత్రమైక్ష్వాకునందనం॥
భరతోనామకైకేయ్యాం జజ్ఞేసత్యపరాక్రమః
సాక్షాద్విష్ణోశ్చతుర్భాగః సర్వైఃసముదితోగుణైః॥
అథలక్ష్మణశత్రుఘ్నౌ సుమిత్రాజనయత్ సుతౌ
వీరౌసర్వాస్త్రకుశలౌ విష్ణోరర్దసమన్వితౌ॥

దశరధునకు ముగ్గురు భార్యలుండిరి. అందు కౌసల్యాదేవి దివ్యలక్షణ సంయుతుడును, విష్ణుభగవానుని అర్ధాంశము నగు శ్రీరామచంద్రుని ప్రసవించెను. కైకేయియు సర్వగుణ సంపన్నుడును, విష్ణుభగవానుని చతుర్థాంశమునగు భరతుని ప్రసవించెను. సుమిత్రాదేవి వీరులును, అస్త్రవిద్యానిపుణులును విష్ణుభగవానుని అష్టమాంశములునగు లక్ష్మణ శత్రుఘ్నలను ప్రసవించెను. ఈ విధముగా నలుగురును కలసి విష్ణుభగవానుని పూర్ణరూపమాయెను. మాయ పరమాత్మయొక్క నిత్యసంగినియైయున్నది. కావున మహామాయ సీతాదేవి రూపమును ధరించి స్త్రీజాతికొక సంపూర్ణమగు ఆదర్శమును చూపించి యున్నది.
రామోత్తర తాపన్యుపనిషత్తునందిట్లున్నది.
శ్రీరామసాన్నిధ్యవశా జ్జగదాధారకారిణీ
ఉత్పత్తిస్ధితిసంహారకారిణీ సర్వదేహినామ్
సాసీతాభవతిజ్ఞేయా మూలప్రకృతిసంజ్ఞితా॥

పరమాత్మ స్వరూపుడగు శ్రీరామునిసాన్నిధ్యమునందు జగత్తునకంతకును ఆధారరూపిణియును. సృష్టి స్థితి ప్రళయకారిణియును, మూలప్రకృతి స్వరూపిణియునగు సీతాదేవి యుండెను. ఆదర్శమానవ జీవితము రామావతారమునందు చక్కగా ప్రదర్శింపబడెను. ఆదర్శ సతీజీవనము సీతాదేవి ద్వారా చక్కగా చూపింపబడినది. కావుననే అంశావతారము లన్నింటిలోను రామావతారమే ముఖ్యమైనది. కావుననే, ప్రపంచమునందు రామావతారము ఇంతగా పూజింపబడుచున్నది. రామావతారమందలి దేశకాలపరిస్థితులను పరిశీలించినయెడల రామావతారముయొక్క ఆవశ్యకత గోచరింపగలదు. పూర్వావతారమగు పరశురామావతారము వలన ప్రపంచమునందలి క్షత్రియు లందరును నశించిరి. క్రమక్రమముగా బ్రాహ్మణశక్తి అన్యమార్గములను పట్టుటచే, రావణునివంటి అత్యాచారులు సహితము బ్రాహ్మణ వంశమునందు జన్మింపసాగిరి. ఆసమయమున, ఏదైనా ఒక భగవచ్ఛక్తి ఆవిర్భవించి క్రుంగిపోవుచున్న క్షాత్రశక్తిని ఉద్ధరించి, బ్రాహ్మణ క్షాత్ర శక్తులకు సామంజస్య మొదవించి, ప్రపంచమునకొక ఆదర్శమానవ జీవితమును చూపించ వలసిన అవసరము కలిగినది. కావుననే శ్రీరామచంద్రమూర్తి క్షత్రియకులమునం దుద్భవించవలసి వచ్చినది. రావణాసురుని వలన పతివ్రతలగు స్త్రీలనేకులు చెడగొట్టబడిరి. పతివ్రతల హృదయవిదారకరోదనము భూనభోంతరాళముల భేదించుచుండెను. అప్పుడు మహామాయయే సీతారూపమున అవతరించి, రావణుని నాశనమునకు సహాయపడి స్త్రీజాతికొక ఆదర్శ జీవితమును చూపించెను.

అన్నదమ్ములగు రామలక్ష్మణ భరత శత్రుఘ్నుడులు ప్రపంచమునకొక గొప్ప ఆదర్శము చూపెట్టిరి. రామచంద్రుని యందు సంపూర్ణ మానవత్వమును, సీతాదేవియందు ఆదర్శ నారీతత్వమును ప్రకటింపబడినవి.
రామాయణము బాలకాండమునందిట్లున్నది
ఇక్ష్వాకువంశప్రభవో రామోనామజనైశ్మ్రుతః
నియతాత్మా మహావీరో ద్యుతిమాశాధృతిమాన్ వశీ॥
బుద్ధిమాన్ నీతిమాన్ వాగ్మీశ్రీమాన్మత్రునిబర్హణః
విపులాంసోమహాబాహుః కంబుగ్రీవోమహాహనుః॥
మహోరస్కోమహేష్వాసో గూఢజత్రురరిండమః
ఆజానుబాహుఃసుకరాః సులలాటః సువిక్రమః
సమఃసమవిభక్తాంగః స్నిగ్థవర్ణఃప్రతాపవాన్
పీనవక్షోవిశాలాక్షో లక్ష్మీవాంచ్ఛుభలక్షణః॥
ధర్మజ్ఞఃసత్యసంధశ్ఛ ప్రజావాంచహితేరతః
యశస్వీజ్ఞానసంపన్నః శుచిర్వశ్యఃసమాధిమాన్
ప్రజాపతినమఃశ్రీమాన్ ధాతారిపునిషూదనః
రక్షితాజీవలోకస్య థర్మస్యపరిరక్షితా॥
రక్షితాస్వస్య స్వస్య స్వజనస్యచరక్షితా
వేదవేదాంగతత్త్వజ్ఞో ధనుర్వేదేచనిష్ఠీతః
సర్వశాస్తార్థతత్త్వజ్ఞః స్మృతిమాన్ ప్రతిభానవాన్
సర్వలోకప్రియఃసాధు రదీనాత్మావిచక్షణః॥
సర్వదాభిగతఃసద్భిః సముద్రఇవసింథుభిః
ఆర్యఃసర్వసమశ్చైవ సదైవప్రియదర్శనః॥
సచసర్వగుణోపేతః కౌసల్యానందవర్థనః
సముద్రఇవగాంభీర్యే ధైర్యేణహిమవానివ॥
విష్ణునాసదృశోవీర్యే సోమవత్ ప్రియదర్శనః
కాలాగ్నిసదృశఃక్రోధే క్షమయాపృధివీసమః
ధనదేవసమస్త్వాగే సత్యేధర్మఇవాపరః॥

ఇక్ష్వాకు వంశమునందు జగత్ప్రసిద్ధుడగు శ్రీరామచంద్రు డుత్పన్నమాయెను. వానియందు సంపూర్ణ మానవుని కుండవలసిన సమస్త సద్గుణములును నిండియుండెను. అతడు మహావీర్యవంతుడును, కాంతిమంతుడును, ధృతిమంతుడును, జితేంద్రియుడును, బుద్ధిమంతుడును, రాజనీతియందు పరిపూర్ణ జ్ఞాతయును, వక్తయును, శ్రీమంతుడును, బహిరంతర శత్రునాశకుడును, విపులమస్తకుడును, మహాబాహుడును, శంఖమువలె రేఖాత్రయ విశిష్టగ్రీవము గలవాడును, విశాలవక్షము గలవాడును, మహాధనుర్థరుడును, సుశీలుడును, విశాలనేత్రములు గలవాడును, స్నిగ్ధశ్యామలవర్ణము గలవాడును, ప్రజాహితపరాయణుడును, కీర్తి సంపన్నుడును, శౌచ సంపన్నుడును, బాహ్యభ్యంతర శుద్ధిగలవాడును, వినయశీలుడున, యోగయుక్తుడును, ప్రజాపోషణ సామర్థ్యయుక్తుడును, జీవరక్షకుడును, ధర్మరక్షకుడును, స్వజనరక్షకుడును, వేదవేదాంగ మర్మజ్ఞుడును, ధనుర్వేద పరిజ్ఞాతయును, సర్వలోక ప్రియమగు మృదుమధుర స్వభావముగలవాడును, దైన్యస్వభావము లేనివాడును, లౌకికాలౌకిక సర్వక్రియాశీలుడును, సర్వసత్పురుష సంసేవితుడును, సుఖదుఃఖాది ద్వంద్వవికారరహితుడును, సర్వసద్గుణ సంయుతుడును, రాజునకుండవలసిన యోగ్యతలు గలవాడును, క్రోధమునందు కాలాగ్ని రుద్రుడును, క్షమయందు పృధ్వీతుల్యుడును, ధనదానమునందు కుబేరుడును, సత్యపాలనమునందు సాక్షాత్ ధర్మరాజునై యుండెను. ఇన్ని సద్గుణము లాతనియందు కేంద్రీకరించుటచేతనే అతడు సమస్త మానవులకును, సమస్త క్షత్రియులకును, సమస్త గృహస్థులకును, ఆదర్శప్రాయుడై యున్నాడు. ప్రజలందరును బాగుగా సుఖించునపుడే రాజు నిజముగా సార్థకుడగును.

11రామరాజ్య వర్ణనము

రామరాజ్యమునందు ప్రజలెట్లు సుఖించిరో రామాయణ యుద్ధకాండాంతమునందిట్లు చెప్పుచున్నాడు:-
నపర్యదేవన్ విధవానచ వ్యాలకృతం భయమ్
నవ్యాధిజం భయం చాసీద్రామేరాజ్యం ప్రశాసతి॥
నిర్ధస్యురభవల్లోకో నానర్ధం కశ్చిదస్పృశత్
నచస్మవృద్ధా బాలానాం ప్రేతకార్యాణికుర్వతే॥
సర్వంముదితమేవాసీత్ సర్వోధర్మపరోభవత్
రామమేవాను పశ్యంతోనాభ్యహింస స్పరస్పరమ్॥
ఆసన్ వర్షసహస్రాణి తథా పుత్రసహస్రిణః
నిరామయా విశోకాశ్చరామేరాజ్యం ప్రశాసతి॥
నిత్యమూలా నిత్యఫలాస్తరవస్తత్ర పుష్పితాః
కామవర్షీ చపర్జన్యః సుఖస్పర్శశ్చమారుతః॥
స్వకర్మ సుప్రవర్తన్తే తుష్టాఃస్త్వైరేవకర్మభిః
ఆసన్ ప్రజాధర్మపరా రామేశాసతినానృతాః॥
సర్వే లక్షణసంపన్నాః సర్వేథర్మపరాయణాః

శ్రీరామచంద్రుని కాలమునందు స్త్రీలు వైధవ్యము నందలేదు. ప్రజలకు సర్పభయ, రోగభయాదులు లేవు, దొంగల ఉపద్రవమేమియును లేదు. వృద్ధులగు తల్లితండ్రులు తాము జీవించియుండగానే తమ పుత్రులకు శ్రాద్దకర్మ నాచరింపవలసిన అవసరములేదు. ప్రజలందరును ఆనందపూర్ణులును, ధర్మ పరాయణులునై యుండిరి. శ్రీరామచంద్రుని ఆదర్శ ధార్మిక భావమును ఆదర్శముగా నుంచుకొని, ప్రజలు అన్యోన్య హింసా నిమగ్నులు కాకుండిరి. వేలకొలది పుత్రులతో వేలకొలది సంవత్సరముల వరకును మనుష్యులు జీవింపగలిగి యుండిరి. వృక్షము లెల్లప్పుడును ఫలపుష్పమూలములతో శోభిల్లుచుండెను. ఇచ్ఛామాత్రముననే మేఘము వర్షించుచుండెను. శీతలమందసుగంధవాయువు వీచుచుండెను. ప్రజలందరును స్వధర్మముతో తృప్తిని వహించి స్వధర్మనిరతులై యుండిరి. మిధ్యా వ్యవహార ప్రచారము లేకుండెను.

ఆదర్శ నరపతియగు శ్రీరామచంద్రుని రాజ్యమునందిట్లు ప్రజలు సుఖించుచుండిరి. ప్రజాపాలనమును, ప్రజారంజనము నొనర్చుటకు అష్టలోకపాలకుల అంశములను సేకరించి రాజు జన్మించుచున్నాడు. ప్రజారంజన మొనర్చెడి రాజు నిజముగా దేవతయే! ప్రజాపీడన మొనర్చెడిరాజు అసురాంశవలన జన్మించెనని శాస్త్రములు చెప్పుచున్నవి! ప్రజలే రాజునకు ప్రాణము. ప్రజాభిమానమును చూరగొనజాలని రాజు జీవించుట వ్యర్థము. ఈ పరమధర్మము శ్రీరామచంద్రుని జీవితమునందు పరిపూర్ణత నందినది. అతడు ప్రజలను ప్రేమించెను. ప్రజారంజనమే అతని ఏకైకలక్ష్యమై యుండెను. ప్రజాసుఖమున కాతడేపనినైనను చేయుటకు సంసిద్ధుడై యుండెను. అతని సమస్త ప్రాణములును, సమస్త సుఖములును, ప్రజారంజనరూపమగు హోమాగ్నియందు ఘృతమువలె ఆహుతి యైపోయెను. కేవల ప్రజారంజనము కొరకు నిర్దోషియును, పరమ ప్రేమాస్పదయును, పతివ్రతయును, సహధర్మచారిణియునగు భార్యను సహితము పరిత్యజింపగల రాజు ప్రపంచమునందు మరిఎవ్వడైన ఉన్నాడా? ఆమె సంపూర్ణముగా నిర్దోషియని ఎరింగియును, ఆమె యందపూర్వానురాగ మున్నను, కేవల ప్రజారంజనము కొరకు ఆమెను వనవాసమునకంపెను. ఇదియే ఆదర్శక్షత్రియునకును, ఆదర్శనరపతికిని లక్షణమైయున్నది.

నిజముగా, అట్టి ప్రజాపాలకుడు, అట్టి ప్రజాహితప్రాణి యగు రాజు, ఇప్పుడు భారతదేశమునకు లభించిన యెడల, ఈ భయంకర క్షామములు, ఈ అకాలమృత్యువులు, ఈ రోగములు, ఈ అశాంతి యంతయును ఒకసారిగా శాంతించి, భారతదేశమొక నందనకాననమై ప్రకాశింపగలదు. అప్పుడు భారతదేశమెల్ల ఆనందముతో నిండిపోవును. శాంతిరూపిణియగు మందాకిని ప్రవహించి ప్రజల దగ్ధహృదయములకు శాంతిని ప్రసాదించును. భారతీయుల భాగ్యాకాశమునందట్టి శుభనక్షత్ర మెప్పుడుదయించునోకదా?

ఆదర్శ నరపతి యందుండవలసిన లక్షణములేకాక, ఆదర్శ మానవుని యందును, ఆదర్శ గృహస్థునందును, నుండవలసిన లక్షణములు అన్నియు నున్నవి. వాని పిత్రుభక్తి, మాతృభక్తి, భ్రాతృప్రేమ, జితేంద్రియత, ఏకపత్నీవ్రతము, సహనశీలత, ధైర్యము, భక్తవాత్సల్యము, శరణాగతరక్షణ, ఉదారత, సచ్ఛరిత్రత, నిష్కపటప్రేమ, సత్యవాక్యపరిపాలన మొదలగు గుణములన్నియు ప్రతిగృహస్థునకును ఆదర్శప్రాయములై యున్నవి. శ్రీరామచంద్రుడెంతటి వర్ణాశ్రమాచార తత్పరుడో తెల్పుటకొక్క నిదర్శనము చాలును. పరశురాముడు యుద్ధమొనర్చవలసినదిగా శ్రీరామచంద్రుని కోరినప్పుడు శ్రీరాముడిట్లనుచున్నాడు:-
బ్రాహ్మణోzసీతి పూజ్యోమే విశ్వామిత్ర కృతేనచ
తస్మాచ్ఛక్తో నతేరామ మోక్తుం ప్రాణహరంశరమ్

నీవు బ్రాహ్మణుడవగుటచే నాకు పూజ్యుడవై యున్నావు. విశ్వామిత్రమహర్షియొక్క సంబంధముచేత సహితము నీవు నాకు పూజ్యుడవై యున్నావు. కావున నేను మీపై బాణమును విడువజాలను.

శ్రీ రామచంద్రుని ఈ అపూర్వ ఆదర్శములను యథాశక్తి ననుష్ఠించిన యెడల ప్రపంచము ధన్యముకాగలదు.

12వానరులెవరు?

రామావతారమునందు వానరములు గొప్ప సహాయ మొనర్చి యుండెను. ఆ వానరములెవరు? రామాయణము బాలకాండ 17వ సర్గయందిట్లున్నది:-
పుత్రత్వంతుగతే విష్ణౌరాజ్ఞస్తస్యమహాత్మనః
ఉవాచదేవతాః సర్వాః స్వయంభూర్భగవానిదమ్॥
సత్యసంధస్య వీరస్య సర్వేషాంనో హితైషిణిః
విష్ణో సహాయాన్ బలినః సృజధ్వంకామరూపిణః॥

విష్ణుభగవానుడు దశరథ పుత్రుడగు శ్రీరామచంద్రమూర్తి రూపమున అవతరించిన పిదప బ్రహ్మదేవుడు దేవత లందరితోడను “మీరు మీశక్తివలన కామరూపములను సృజించి భగవానునకు సహా మొనర్పు”డని చెప్పెను. బ్రహ్మయొక్క ఆజ్ఞ ననుసరించి ఇంద్రుడు వాలిని, సూర్యుడు సుగ్రీవుని, కుబేరుు గంధమాదనుని, విశ్వకర్మ నీలుని, వాయుదేవుడు హనుమంతుని సృజించిరి. వారందరును కామరూపులే సుడీ!
రామాయణము యుద్ధకాండమునందిట్లున్నది:-
తేకృత్వామానుషంరూపం వానరాః కామరూపిణః
కుశలం పర్యపృచ్ఛంస్తే ప్రహృష్టాభరతంతదా॥
నవనాగ సహస్రాణి యయురాస్థాయవానరాః
మానుషం విగ్రహం కృత్వా సర్వాభరణభూషితాః॥

కామరూపులగు వానరములు మనుష్యరూపమునుధరించి భరతుని కుశలమడిగిరి. అనేక భూషణ భూషితులగు వానరులు మనుష్యరూపమునుధరించి తొమ్మిదివేల ఏనుగులపైనెక్కి వెళ్ళిరి.
రామాయణము సుందరకాండ ద్వితీయ సర్గ యందిట్లున్నది:-
సూర్యోచాస్తంగతే రాత్రౌ దేహంసంక్షిప్యమారుతిః
వృషదంశకమాతోzథ బభూవాద్భుతదర్శనః

సూర్యాస్తమయ మైనపిదప హనుమంతుడు శరీరమును చిన్నదిగానొనర్చి పిల్లిరూపమును ధరించెను. ఈ అపూర్వరూపముతో నాతడు రావణుని అంతఃపురమును ప్రవేశించెను. దేవతాస్వరూపులగు వానరులు కామరూపులనుటకీ ప్రమాణములు చాలును.

13వాలినిజంపుట పాడియా?

రాముడు దొంగతనముగా వాలిని చంపెనని కొందరు అధిక్షేపించుచున్నారు. కాని వాలిని వధించిన విధానమునం దేమియును దోషములేదు. కారణమేమన:-
(1) వానరములు శాఖామృగములు, మృగమును చంపుటయందు క్షత్రియులు యుద్ధనీతిని పాటింపనవసరములేదు. కావున శాఖామృగమగు వాలిని రాముడు దాగియుండి బాణముతో కొట్టుట దోషము కాజాలదు.
(2) వాలికి ఎదురుగా నిల్చుండి యుద్ధమొనర్ప దలంచినవానిలోని సగముబలమును వాలి ఆకర్షించగలడు. కావున యుద్ధనీతిననుసరించి రాముడు దాగియుండియే బాణమును వదలినాడు.

14బలరామకృష్ణావతారములు

ఇక 8 వ అవతారము బలరామ, కృష్ణావతారములై యున్నవి. ఇందు బలరాముడు అంశకళావతారమును, శ్రీకృష్ణుడు పూర్ణకళావతారమునై యున్నారు. భాగవతమునందిట్లున్నది:-
ఏతేచాంశకలాః పుంసఃకృష్ణస్తుభగవాన్ స్వయం.

కృష్ణుడుమాత్రమే పూర్ణకళావతారమై యున్నాడు. మిగతా అవతారము లన్నియు అంశావతారములై యున్నవి.

ద్వాపర కలియుగ సంధికాలమునందు ప్రపంచమెల్ల పాపభూయిష్టమై పోయెను. ఒకవైపు జరాసంధాధి రాక్షసులు ప్రజలను పీడించుచుండిరి. ఒకవైపు కౌరవులు దుర్మార్గము లొనర్చుచుండిరి. మరియొకవైపు కంసుడు శిశువధ సహిత మాచరించుటకు వెనుదీయకుండెను. అట్టిసమయమున దుష్టులను శిక్షించి, ధర్మమును స్థాపించుట కొరకు కృష్ణావతార ముద్భవించెను. పూర్వజన్మయందు, భగవానుని పుత్రునిగా బడయవలయునని తప మొనర్చిన దేవకీవసుదేవులకు భగవానుడు పుత్రరూపమున జనించెను. అటులనే కొందరు ఋషులు భగవానుని ప్రతిరూపమున దర్శింపవలయునని తపమొనర్చిరి. వారందరును గోపికలై ఉద్భవించినారు. పద్మపూరాణము, పాతాళఖండమునం దిట్లున్నది:-
మానసేసరసిస్థిత్వా తపస్తీవ్రముపేయుషామ్
జపతాం సిద్ధిమంత్రాశ్చధ్యాయతాం హరిమీశ్వరమ్॥
మునీనాం కాంక్షతాం నిత్యంతస్య ఏవపదాంబుజం
ఏకసప్తతి సాహస్రసంఖ్యాతానాం మహౌజసామ్॥
తదహం కధయాన్యుద్యతద్రహస్యం పరంపనే

మానససరోవరమునందు, భగవానుని చరణసేవ యందిచ్ఛ గలవారై 71 వేలమంది మునులు తీవ్రముగ తపమాచరించిరి. వారు సిద్ధిమంత్రములను జపించుచు, హరిని ధ్యానించిరి. వారిలో ఏమునీశ్వరులు తమ శరీర, మనః, ప్రాణ, ఆత్మల ద్వారా భగవానుని తీవ్రముగ వాంఛించిరో వారందరును గోపవంశమునందు గోపీరూపమున జన్మించిరి. ఇటులననే అనేక శ్రుతులు కూడ గోపీరూపమున జన్మించెను. “భవద్భిరం శైర్య దుషూపజన్యతామ్” అని భాగవతమునందు. దేవతలుకూడ యదువంశమునందు జన్మించినట్లు చెప్పబడియున్నది. కావున, గోపగోపీ గణమంతయును సామాన్యమానవులు కారనియును, దేవతాంశచే జన్మించినవారనియు పాఠకులు తెలిసికొందురు గాక!

15శ్రీకృష్ణావతారప్రశంస

శ్రీకృష్ణావతారమునందు భగవానుడొనర్చిన కార్యములన్నింటిని ప్రతిహిందువుడును ఎరింగియే ఉన్నాడు. కావున, వానినిగూర్చి వివరింపవలసిన అవసరములేదు. కాని, కొన్ని ముఖ్యవిషయములను మాత్ర మిచట విశదీకరించెదము. భగనానుడు సచ్చిదానంద స్వరూపుడగుటచే ఆతని అవతారము నందు సహితము సత్ భావము, చిత్ భావము, ఆనంద భావములను 3 భావములునుండును. సత్ భావమునకు కర్మతోడను, చిత్ భావమునకు జ్ఞానముతోడను, ఆనందభావమునకు భక్తితోడను, సంబంధమున్నది. కావున పూర్ణావతారమునందు కర్మ, జ్ఞాన, భక్తులను 3 లీలలును ప్రదర్శింపబడినవి. ఆతడు పూర్ణకర్మిష్ఠియును, పూర్ణజ్ఞానియును, పూర్ణరసికుడు నైనప్పటికిని, త్రిగుణాతీతుడగుటచే నిర్లిప్తుడైయుండును. శ్రీకృష్ణుడు పూర్ణావతారమగుటచే ఆతని జీవితమునందు కర్మ, జ్ఞాన, భక్తిభావముల, సర్వోత్తమ అలౌకిక ఆదర్శము చక్కగా ప్రదర్శింపబడినది. అంశావతారమునందు అంశకళలుమాత్ర ముండుటచే వానిపనులన్నియు ఏదొ ఒక ముఖ్యభావమును మాత్రమే ఆశ్రయించియుండును. శ్రీ రామచంద్రునియందు మర్యాదాభావమే ముఖ్యమగుటచే సీతాదేవి నిర్దోషియని ఎరింగియును, కేవల వంశమర్యాదా రక్షణముకొరకు ఆమెను వనముల కంపినాడు. కాని పూర్ణావతారము భావాతీతమగుటచే ఏదో ఒక భావము నాశ్రయించి కార్యము లొనర్పవలసిన అవసరములేదు. వారు కేవల జగత్కళ్యాణము కొరకును, సమిష్టి ధర్మరక్షణముకొరకును కార్యము లొనర్చెదరు. కావుననే ధర్మరాజుచేత అసత్యములను పల్కించి ద్రోణుని చంపించినను శ్రీ కృష్ణునకు పాపమురాలేదు. అటులనే ఆతడొనర్చిన అనేక కార్యములను లౌకికదృష్టితో చూచినప్పుడు చెడుగా కాన్పించినను జగత్కళ్యాణదృష్టితో పరిశీలించినప్పుడుమాత్రము అది సంపూర్ణ నిర్దోషయుతములుగానే కాన్పించును. ఇదియే పూర్ణావతారమందలి కర్మరహస్యమై యున్నది. ఇక ఆతని భక్తిలోని రహస్యమేమన:- అన్నిరసములలోని భక్తులును ఆతని విభిన్నలీలలను ఆశ్రయించి తమకు అనుగుణ్యముగ స్వీకరింపవచ్చును. కారణమేమన ఆతడు పూర్ణావతారమగుటచే ఆతనియం దన్నిరసములును నిండియున్నవి. కావుననే ఆతనిభక్తులయం దన్నిరసములవారును ఉన్నారు. పాండవులు సఖ్యరసమందలి భక్తులు! విదురాదులు దాస్యరసమందలి భక్తులు! యశోదాదులు వాత్సల్యరసమందలి భక్తులు! భీష్మాదులు వీరరసమందలి భక్తులు! వ్రజగోపికలు కాంతారసమందలి భక్తులు!

16శంకా సమాధానములు

ఈ కాంతారసమునందలి రహస్యము లెరుంగజాలక కొందరుమూఢులు శ్రీకృష్ణుని మహోన్నత చరిత్రముపై కళంకము నారోపింప ప్రయత్నించుచున్నారు. కావున రాసలీలను గురించి కొంచెము వివరించుట సమంజసమని భావింపుచున్నాము.
శ్రీమద్భాగవతమునందిట్లున్నది.:—
యోగేశ్వరేణ కృషేనతాసాం మధ్యేద్వయోర్ద్వయోః
ప్రవిష్ఠేన గృహీతానాం కంఠేస్వనికటం స్త్రీయః

రాసలీలా సమయమున యోగీశ్వరుడగు శ్రీకృష్ణుడు అనేక శరీరములను ధరించి, ఇద్దరిద్దరు గోపికలమధ్య తాను ఒక్కక్కడుగా నిల్చుండెను. గోపికలు తమతమ యిండ్లనుండి పారిపోయి వచ్చిరి. కావున, శ్రీకృష్ణుడు గోపికారూపములను ధరించి, వారిపతులకు అనుమానము కలుగకుండ వారిగృహములయం దుండెను.

గొప్ప యోగియగువాడుతప్ప ఇన్నిరూపములను ధరించి ఇట్లు మెలంగగలడా? కావుననే వేదవ్యాసుడిచట శ్రీకృష్ణుని “యోగీశ్వరు” డని వ్రాసినాడు. కామేశ్వరుడనియో, రతీశ్వరుడనియో వ్రాసియుండలేదు. ఇక ముఖ్యముగ ఆలోచింపవలసిన విషయమేమన, స్వయముగా తానొక్కడే స్త్రీరూపములను పురుషరూపములనుకూడ ధరింపగలిగిన యోగీశ్వరునియందు కామముద్భవించునా, లేదా, యనునదియే ఆలోచనీయాంశము. తనపై తనకు కామము కలుగదనియు, ఇతరులపై మాత్రమే కామము కలుగుననియు, పాఠకులకందరకును, తెలిసియేయున్నది. రమించుట యనునది ద్వైతమునందే సంభవించును కాని అద్వైతమునందు సంభవింపజాలదు. ఆత్మారాముడగు యోగిమాత్రమే తనయందు తాను రమించును. కాముకుడగువాడు ఇతరులతో రమించును. వాడు తనతో రమింపజాలడు. కావున ఒకే కృష్ణుడు స్త్రీరూపమునందును పురుషరూపమునందును అద్వితీయముగా నున్నప్పుడు, అతని యోగస్థితి కామదశకన్న ఉన్నతమై యున్నదని నిస్సందేహముగా చెప్పనగును. భాగవతమునందిట్లు వ్రాయబడియున్నది:-
గోపీనాం తత్పతీనాంచ సర్వేషాం చైవదేహినాం
యాzస్తశ్చరతి సోzధ్యక్షః క్రీడనేనేహదేహభాక్
అనుగ్రహాయ భక్తానాం మానుషం దేహమాశ్రితః
భజతైతాదృశీః క్రీడాయాః శ్రుత్వాతత్పరోభవేత్॥

ఏభగవానుడు గోపికలయందును, గోపికల భర్తలయందును నిండియున్నాడో, ఆభగవానుడు శరీరమునుధరించి ఇట్టి లీల లొనర్చుటకు కేవలము భక్తవాత్సల్యమే కారణమైయున్నది. కావున కృష్ణునియందు కామాదిభావముల నారోపించుట సమంజసముకాదు. వేదవ్యాసుని “యోగీశ్వరేణ కృష్ణేన” అను వాక్యమే దీనిని ఋజువుచేయగలదు.

కానీ, స్థూలసంభోగ ద్యోతకములగు భాగవతశ్లోకముల భావమేమని కొందరు ప్రశ్నించవచ్చును. పూర్వజన్మయందు భగవానుని సంయోగము నాశించి తపమాచరించిన ఋషులందరును గోపికలై యుద్భవించిరి. వారు శ్రీకృష్ణుని మధురమోహనమూర్తిని దర్శించినపుడు, స్థూలరూపమున వానితో కలియవలయు ననెడి కోరిక వారికి కలుగుట స్వాభావికమే యగును. కాని, భాగవతమునం దిట్లు చెప్పబడియున్నది:-
నమయ్యావేశిత ధియాంకామః కామాయకల్పతే
భర్జితః క్వథితోథానః ప్రాయోబీజాయనేవ్యతే॥

భగవానునియెడ కామభావముతో ప్రీతి కలిగినప్పటికిని, ఆ కామము దగ్ధబీజమువలె అంకురము నుత్పన్న మొనర్పజాలదు. అది ఎట్లు సంభవమగునని పరీక్షిత్తు ప్రశ్నించగ బ్రహ్మర్షియగు శుకుడిట్లనుచున్నాడు.:-
కామంక్రోధం భయం స్నేహమైక్య సౌహృదమేవచ
నిత్యం హరౌ విదధతోయాన్తి తన్మయతాంహితే॥
నచైవం విస్మయః కార్యోభవతా భగవత్యజే
యోగేశ్వరేzశ్వరే కృష్ణేయత ఏతద్ విముచ్యతే॥

కామ, క్రోధ, స్నేహ, భయాది భావములలో ఏదో ఒకదానిద్వారా భక్తుడు భగవానునియం దాసక్తుడై క్రమక్రమముగా తన్మయతనంది, ఆ తన్మయతద్వారా భగవానునియందు లవలీనమై, భక్తుడు ముక్తినందుచున్నాడు. గోపికలు సహిత మటులనే పూర్వ సంస్కారముననుసరించి శ్రీకృష్ణుని యందాసక్తులై స్థూలసంభోగమును వాంఛించిరి. కాని శ్రీకృష్ణుని అలౌకికశక్తివలన ఆకర్షింపబడి కొలదిసేపటిలోనే తన్మయులయ్యెడివారు. వారు తన్మయులైనపిదప, తమనుతామే మరచినపిదప, మనస్సే నశించినపిదప, మనస్సులోని కామాదులెట్లు నిలువగలవు. ఈవిధముగా తన్మయతద్వారా, మనస్సును మనోవృత్తులను పోగొట్టుకొని భగవానునియందు లవలీనులై గోపికలు ఉన్నతగతినందిరి. ఇదియే రాసలీలలోని గూఢరహస్యము.

ఇటులనే వస్త్రాపహరణమును గురించియును కొందరు అనేకవిధముల శంకించుచుందురు. దీనిలోని రహస్యమేమన, గోపికలు శ్రీకృష్ణుని పతిగా పొందవలయుననెడి తలంపుతో కాత్యాయనీవ్రత మాచరింపుచుండిరి. భాగవతమునం దిట్లున్నది:-
“నందగోపసుతందేవి పతింమే కురుతేనమః॥“

తల్లీ! కాత్యాయనీ నందకుమారుడగు శ్రీకృష్ణుని నాయొక్క భర్తగా అనుగ్రహింపుము; నేను నీకు నమస్కరింపుచున్నాను.

శ్రీకృష్ణుడు పరమాత్మయగుటచే, పరమాత్మనుపొందుటకెన్ని యోగ్యత లుండవలయునో అన్ని యోగ్యతలును లేనియెడల శ్రీకృష్ణుడు వారికి భర్త కాజాలడు. కావున, వస్త్రాపహరణముద్వారా శ్రీకృష్ణుడు గోపికల యోగ్యతను పరీక్షించి యున్నాడు. జీవునకు శరీరముపై అభిమాన మున్నంతవరకును, పరమాత్మను పొందజాలడనుట శాస్త్రీయసిద్ధాంతమై యున్నది. కామ, భయ, లజ్జాదులు శరీరముపై అభిమాన మున్నంతవరకును మనుష్యుని ఆశ్రయించి యుండును. కాని, బాలునియందు కామములేదు; కావుననే దిగంబరిగా నుండుటకు బాలుడు సిగ్గుపడుటలేదు. అటులనే పరమహంసలగు మహాత్ములు సహితము పరమాత్మనుపొంది శరీరాభిమానమును త్రెంపుకొనుచున్నారు. కావున, వారుకూడ నగ్నముగానే తిరుగుచున్నారు. ఎంతవరకిట్టిస్థితి లభించదో, అంతవరకును కామక్రోధాదులు వీడజాలవు.; అంతవరకును పరమాత్మలభింపడు; అంతవరకును వస్త్రములతో తనసిగ్గును కాపాడుకొను చుండవలయును. గోపికలు పరమాత్మను పొందవలయునని వాంఛించుచుండిరి. కాని, వారికి దేహాభిమానము నశింపలేదు. ఈ విషయమునే శ్రీకృష్ణుడు “వస్త్రాపహరణము” ద్వారా స్పష్టీకరించెను. ఎంతవరకు దిగంబరిగా నుండుటకు సిగ్గుపడుదురో అంతవరకును పరమాత్మ లభింపజాలడని ప్రబోధించెను. ఈవిధముగా కృష్ణునియందు భక్తిలోని అన్నిరసములును సంపూర్ణత నందినవి. ఇక ఆతని జీవనమునందు జ్ఞానమెట్లు పూర్ణత్వమందెనో, కొంచెము గీతాశాస్త్రమును పరిశీలించిన యెడల తెలియగలదు.

పురుషధర్మవిజ్ఞానము రాజధర్మవిజ్ఞానము, సమాజనీతి విజ్ఞానము, సాధారణధర్మవిజ్ఞానము, ఆపద్ధర్మవిజ్ఞానము, ధర్మయుద్ధనీతివిజ్ఞానము, వర్ణాశ్రమధర్మవిజ్ఞానము, మొదలగు జ్ఞానకాండయందలి అన్ని అంగములును, లీలావిగ్రహుడగు భగవానుని కథలవలనను, ఉపదేశములవలనను, చక్కగ గ్రహింపవచ్చును. ఇదియే శ్రీకృష్ణుని జ్ఞానమయ జీవితమందలి అపూర్వ ఆదర్శమైయున్నది. కావున, పూర్ణావతారమగు శ్రీకృష్ణునియందు కర్మ, ఉపాసనా, జ్ఞానములు సామంజస్యము నందినవి.

17బుద్ధావతారము

ఇక 9 వ అవతారము బుద్ధావతారము. శ్రీమద్భాగవతమునం దిట్లు వ్రాయబడియున్నది:-
తత:కలౌ సంప్రవృత్తే సమ్మోహాయ సురద్విషామ్
బుద్ధో నామాంజనసుతః కీకటేషు భవిష్యతి॥

బుద్ధావతారము కలియుగమునం దవతరించినది. కీకట ప్రదేశము (ఇప్పటి గోరఖ్ పూర్ జిల్లా) నందు శుద్ధోనునకు పుత్రుడై బుద్ధభగవాను డుదయించెను.

బుద్ధావతార ముదయించుటకుపూర్వము ప్రపంచమంతయు అల్లకల్లోలముగా నుండెను. జ్ఞానహీనమగు కర్మకాండయును, ఉపాసనయును విపరీతముగా వ్యాపించెను. మూర్ఖులగు వారు వైదికయజ్ఞములను పేరుతో లక్షలకొలది పశువులను వధించుచుండిరి. నరబలులుసహిత మొసంగబడుచుండెను. జీవహత్య పెరిగిపోవుటచే ధర్మమునకు గ్లాని సంభవించెను. అసురభావము వృద్ధినందెను. అప్పుడు బుద్ధభగవాను డవతరించి, ఘోరమగు పశుహత్యలను ఆపి, రాక్షసభావమును, నాశనమొనర్చెను. బుద్ధుడు భగవదవతారమైనను, వేదవిరోధమగు మతమును స్థాపించుట కొకకారణమున్నది! అంశావతారమందలి కార్యములన్నియు దేశకాలముల ననుసరించి యుండుననియు, వారు స్థాపించిన ధర్మము ఏక దేశీయమగుటచే, అది పరివర్తనశీలమై యుండుననియు ఇంతకుక్రితమే మనవిజేసి యున్నాము. దేవునిపేరిట జరుగుచున్న అత్యాచారముల నాపుటకు బుద్ధుడప్పు డట్టిమతమునే స్థాపింపవలసియుండెను. అంతకన్న గత్యంతరమేమియును లేదు. విషము ప్రాణోపద్రవకరమగు వస్తువైనను, కఠినరోగగ్రస్తునకు విషమును కూడ ఔషధరూపమున త్రాగించినట్లే, బుద్ధావతారకాలమందలి జీవహత్యారూపమగు భయంకర జాతీయరోగమును నాశనమొనర్చుటకు నాస్తికతయను విషమును బుద్ధుడు ప్రయోగింపవలసివచ్చెను. దీనివలన అతడు ఆసమయమునందు జీవహత్యారూపమగు పాపమును తొలగించి జ్ఞానమూలకమగు బౌద్ధధర్మమును వ్యాపింపజేసెను. కాని, రోగావస్థయందు పుచ్చుకోవలసిన విషమును ఆరోగ్యావస్థ యందు సేవించినయెడల ప్రాణోపద్రవకర మైనటులనే, ఈ నాస్తికధర్మము తాత్కాలికముగ ఫలవంతమైనను క్రమక్రమముగా భయంకరరూపమును ధరించి పాపమును వృద్ధిజేయదొడంగెను. అప్పుడు భగవానుడగు శంకరుని కళవలన అంశావతారముగ శంకరాచార్యు డవతరించి, తన ప్రచండ శాంకరీ ప్రతాపమువలన భారతదేశమునందు బౌద్ధధర్మమును అణచివైచి వైదికధర్మమును పునఃప్రతిష్టిత మొనర్చెను.

18కల్క్యావతారము

ఇక 10 వ అవతారము కల్కిఅవతారము.ఈ అవతారమింకను ఆవిర్భవింపలేదు. కలియుగము 4 లక్షల32 వేలసంవత్సరముల పరిమాణము కలిగియున్నది. అదిప్పటికి 5 వేలసంవత్సరములు మాత్రమే గడచినది. కావున కల్కిఅవతార ముద్బవించుటకు కింకను చాలాకాలము గడువవలసి యున్నది. ఇంకను ధర్మమునకు సంపూర్ణమగు గ్లాని సంభవింపలేదు. అనేకవిధములగు భగవద్విభూతులవలనను, ఆవేశావతారములవలనను, ఋషులవలనను, కొంతవరకు ధర్మము కాపాడబడుచునే యున్నది. కావున, ఇప్పుడే భగవంతుడు అవతరింపవలసిన ఆవశ్యకత కలుగలేదు. ఆ అవతార ముద్భవించెడి సమయమునందు దేశకాలపరిస్థితు లెట్లుండునో ఆవిషయమంతయును శ్రీమద్భాగవతాది గ్రంథములందు స్పష్టముగా వివరింపబడి యున్నది. అప్పుడు ప్రపంచమంతయును మహాపాపభూయిష్టమై యుండును. మనుష్యులందరును ధర్మచ్యుతులగుదురు. రాజులు ప్రజాపీడన మొనర్చెదరు. మ్లేచ్ఛులకు రాజ్యాధికారము లభించును. అప్పుడు కల్కి అవతార ముద్భవించి మ్లేచ్ఛులను, పాపులను నాశనమొనర్చి పుణ్యాత్ములను రక్షించును. అతడవతరించినపిదప మరల సత్యయుగము ప్రారంభించి ధర్మము వ్యాపించును. ఇదియే అంశావతార, పూర్ణావతారముల సంక్షిప్త వివరణమై యున్నది.

ఈ అంశావతార పూర్ణావతారములేకాక, ఇంకను 3 విధములగు అవతారములున్నవని ఇంతకుక్రితమే చెప్పి యున్నాము.
“నిమిత్తాద్ విశేషా విశేషా”
“అంతరావిర్భావ నిత్యత్వం

ఏదేని ఒక నిమిత్తమువలన విశేష, అవిశేషావతారము లుద్భవించును. అంతఃకరణమునందు భగవానుని నిత్యావతారముండును. విశేషావతారమునే ఆవేశావతారమనికూడ చెప్పెదరు. పద్మపురాణ ప్రమాణమును చూడుడు:-
“అవిష్టోzభూత్ కుమారేషునారదే చహరిర్విభుః”
“ఆవివేశపృథుందేవః శంఖీ చక్రీ చతుర్భుజః”

భగవానుడు సనత్కుమారాది మునులయందును, నారదాదుల యందును, పృథునందును ఆవిష్టుడైయున్నాడు. కావున వీరందరును ఆవేశావతారములు. ఒక్కొక్కప్పుడు భగవద్భావ మావేశించి, అన్యసమయములయందు ప్రాకృతజనమువలె నుండెడివారే అంశావతారము లనబడుదురు. ఇదియే శాస్త్రోక్తమగు విశేష , అవిశేషావతార రహస్యమై యున్నది. దీక్షనొసంగునప్పుడు గురువులో అవిశేషావతారమే ప్రకటమగును. గురువు సాక్షాత్తు భగవంతుడని ఆర్యశాస్త్రములయందు చెప్పబడియున్నది. భగవానుడు నిరాకారుడగుటచే, మనుష్యునకు ప్రత్యక్షసంబంధమును కలిగియుండజాలడు. కావున “ గురువు” అను మనురూపమగు కేంద్రముద్వారా భగవంతుడు తన జ్ఞానశక్తిని ప్రకటమొనర్చి, శిష్యుని తనవైపు ఆకర్షించును.

ఈవిధముగా విశేష, అవిశేషావతారములవలన అధర్మనాశనమును, ధర్మోన్నతియును జరుగుచుండును.

సర్వవ్యాపియును, సర్వశక్తిమంతుడును, జ్ఞానమయుడునగు పరమాత్మ సర్వాంతర్యామి యగుటచే ప్రతిజీవియొక్క హృదయమందును విరాజమానుడై యున్నాడు. ఆ హృదయాసనమునందుండియే భగవానుడు జీవులను పాపకర్మమునుండి మరల్చును. పుణ్యకర్మములవైపు చిత్తవృత్తిని ప్రేరేపించుచు, జీవుడు అధోగతినందకుండ కాపాడుచుండును. దీనికే నిత్యావతారమని పేరు. పైన ఉదహరించిన పూర్ణకళావతార, అంశావతారములకువలెనే, ఈ యవతారముల యందు సహితము కళలలో వ్యత్యాసముండును. ఉదాహరణముగా:-
ఆవేశావతారమగు చైతన్యునకును, నారదునకును చాల వ్యత్యాసముండును. కారణమేమన, భగవానుడు నారదుని ఆవేశించినసమయమున షోడశకళలతో ఆవేశింపవచ్చును. అటులనే గురువునందును సంభవించవచ్చును. అటులనే, నిత్యావతారమునందు సహితము విబిన్నవ్యక్తులయందు వ్యత్యాసము లుండవచ్చును. ఒకనియందు యంతరాత్మ పాపకార్యము లొనర్పవలదని బోధించుచున్నను వాడు వినకపోవచ్చును. మరియొకడు క్రమక్రమముగా భగవానుని ప్రబోధమును స్వీకరించి ఉన్నతి నందవచ్చును. సామాన్యమానవునికన్న శరునజ్ఞుడగు వానియందెక్కువ కళలుండును. వానికంటెను భక్తునియందు ఎక్కువ కళలుండును. వానికన్నను పూర్ణజ్ఞానియగు జీవన్ముక్తునియందు ఎక్కువ కళలుండును. ఇదియే సర్వశక్తిమంతుడును, షోడశకళాపూర్ణుడునగు భగవానుని 5 విధములగు యవతారములలోని తత్త్వమైయున్నది. భగవచ్ఛక్తియొక్క వికాసకేంద్రము లగుటచే వీరందరును పూజ్యులైయున్నారు. కావున “అవతారోపాసన” నవధా విభక్త ఉపాసనలోని ఒక ప్రధానాంగమై యున్నది. కాన నీ పై విషయములను గుర్తెరింగి భగవదావతారములను నిందింపక యుపాసించి యైహికాముష్మిక సుఖంబులం బొందెదరుగాక।

అవతారమీమాంస సంపూర్ణము.


మూలాలు మార్చు

సౌజన్యము ఆర్కైవ్.కాం - అవతార మిమాంశ