అళియ రామరాయలు/మూడవ ప్రకరణము

మూఁడవ ప్రకరణము

సదాశివరాయల పట్టాభిషేకము

ఎంతబలవంతుడయ్యును దుష్ర్పతాపమువలన విగత విభవుం డగుట నిశ్చయము. రాజ్యలక్ష్మి వివేకవిహీనుల జిరకాలము నాశ్రయించి యుండదని పెద్దలునుడివెడుమాటయు సత్యము. ఇట్లవివేకియు, దుష్ర్పతాపమువలన మదోన్మత్తుడయినద్రోహియు నగునాసలకముచినతిమ్మరాజు, ఆయతభుజవీర్యులును, మహాయోధులును, అనిర్జేయులును, పరస్పరస్నేహాయత్తచిత్తులును, మహాసేనాన్వితులు నగునాయారవీటిసోదర త్రయమును బ్రతిఘటించి ఘోరసంగ్రామముసలిపియు నిలువ జాలక వెన్నిచ్చి పాఱి శిరచ్ఛేదనము గావింపబడిన సమాచారము విన్నమీదట దక్కనుసుల్తానులు యుద్ధరంగము నుండి తొలగి పోయిరి. అంత:పురమున నున్నకృష్ణదేవరాయలవారిరాణు లీవార్త వినివిద్యానగరద్వారములను దెఱువ నాజ్ఞాపించిరి. అళియరామరాయ లేయడ్డంకునులేక విద్యానగర ప్రవేశము గావించి యంతటితో దృప్తిజెందక దక్కను సుల్తానులవలన నెట్టియుపద్రవమును మరల గలుగకుండుటకై తగుసేనానులకు వలసినంతసైన్యము నొసంగివారలను దఱుముకొనిపోయి పోరాడి జయించి వశ్యులను గావించుకొనవలసిన దిగా నాజ్ఞ నిచ్చి సంతుష్టాంతరంగు డగుచు గాలయాపనముసేయక యొకశుభముహూర్తమున బాలుడయినసదాశివదేవరాయని విద్యానగరరత్నసింహాసనముపై గూరుచుండ బెట్టి మహావైభవముతో సకలసామంతమంత్రి పురోహితవిద్వజ్జనబంధుజన సమక్షమున బట్టాభిషేకము గావించి తానుకార్యకర్తగా నుండి వీరప్రతాపకఠారి సాళువవీరసదాశివరాయదేవరాయ మహారాయలే సామ్రాజ్యసార్వభౌము డనిప్రకటించి మున్ముందువిధేయ ప్రణామంబులాచరించి శ్వేతచ్ఛత్రమును బట్టుకొనియెను. తమసమ్మతమునుజూపుచు మహామండలేశ్వరులయిన సామంతనృపతు లెల్లరును మహానందముతో విధేయులై కృతప్రణాము లయిరి. సదాశివదేవరాయ లిదివఱకు విజయనగరసామ్రాజ్యమును బరిపాలించి ప్రఖ్యాతులైన కృష్ణదేవరాయలకును, అచ్యుతదేవరాయలకును తమ్ముడైనరంగరాయలకు తిమ్మాంబయందుజనించినపుత్త్రుడు. అళియరామరాయల పెదతమ్ము డైనతిరుమలరాజునకు భార్య యైనవెంగళాంబకు దమ్ముడు[1] సామ్రాజ్యసింహాసన మధిరోహింప నర్హులయిన వారిలోమిగిలినవా డితడొక్కడే యగుటచేతను, మేదాశక్తియు రాజ్యతంత్రజ్ఞానము నతిశయించినవా డగుటచేతను, అళియరామరాయ లీరీతిగా సదాశివరాయలను దగ్గిరకు జేరదీసి తొలుత తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామివారి సాన్నిధ్యమున బట్టాభిషేకము జరిగించియు రెండవమారు సామ్రాజ్య రాజధానియగు విద్యానగరమున సకలరాజ సమక్షమున యధోచిత విధానమున బట్టాభిషేక మహోత్సవమును గావించెను.

ఈపట్టాభిషేకమహోత్సవ మేనాడు జరిగినదియు దెలియ దగుప్రమాణమేదియు నింతవఱకు మనకు లభింపకపోయినను క్రీ. శ. 1542 వ సంవత్సరములో ప్రథమభాగమున జరిగియుండు ననినిశ్చయింప వచ్చును. ఎందుకన, 1542 వ సంవత్సరము జూలై 27 వ తేది గలయొక శాసనము సదాశివదేవరాయలపేరుతో గన్పట్టుచున్నందున నంతకు బూర్వమెపట్టా భిషేకము జరిగియుండవలయు ననిస్పష్టమగుచున్నది.[2] వీరప్రతాపకఠారిసాళువ వీరసదాశివరాయ దేవరాయ మహారాయలు బాలుడైనందున నాతనిప్రధానకార్యకర్తగానుండి యళియరామరాయలవారా సంవత్సరముననే సామ్రాజ్య పరిపాలనా భారమువహించి కృష్ణదేవరాయలనాటి కీర్తివైభవముల పునస్థాపనము గావించి యఖిలకర్ణాట సామ్రాజ్యము యొక్కవిజృంభణము మఱికొంతకాలము భూమిపై సుస్థిరముగావించి శత్రుపక్షమువారి విద్వేషములకు నపనిందలకు బ్రధానకారణభూతు డయ్యును అశేషసామ్రాజ్య ప్రజల మన్నలకు బాత్రుడై మించెను. అజేయపరాక్రమంబున గృష్ణదేవరాయలను, అమేయబుద్ధికౌశలమున దన్మంత్రి శేఖరుడగు తిమ్మరుసును మించినప్రతిభాశాలిగాని సామాన్యుడు గాడు.

దక్కను సుల్తానులను జయించి యదపులోనుంచుట.

విప్లవసమయమున సలకముతిమ్మయకు దోడ్పడవచ్చిన విజాపురసుల్తా నగుఇబ్రహీమ్‌ఆదిల్‌షా, బీదరుసుల్తానగు అమీర్‌బరీదుషా, అహమ్మదునగరసుల్తానగు బురహాన్‌నిజామ్‌షా, గోల్కొండ సుల్తానగుజమ్షీకుతుబ్‌షా, అను దక్కనుసుల్తానులు పల్వురును స్వసైన్యములతో నేతెంచి విద్యానగరమునకు నొక క్రోసుమేరదూరమున దండువిడిసిరిగాని విద్యానగరమును బ్రవే శించి యుండలేదని హండేవారి అనంతపురచరిత్ర మనుస్థానిక చరిత్రమును బట్టి దెలియుచున్నది. వీరుసలకము తిమ్మయను వానిసైన్యములను ముందుబెట్టుకొని వానివెనుక తాము తమ సైన్యములతో నిలువంబడి యుద్ధసన్నద్ధు లైరి. అళియరామరాయల సైన్యములం దలపడి తిమ్మయసైన్యములు హతముకాగా దిమ్మయ రణరంగమును విడిచి పాఱుచుండ శిరచ్ఛేదనము గావింపబడె నన్నవార్త చెవినిబడినతోడనే వీరును యుద్ధభూమిని విడిచి తొలగిపోవ విడిచిపెట్టక, అళియరామరాయల సైన్యములు వీరినివెంబడించిపోయె ననియింతకు బూర్వమె దెలిపి యున్నాడను.

ఇక్కడ విమర్శనీయ మగునొకముఖ్యాంశము గలదు. దక్కనుసుల్తానులను జయించిన తరువాత సదాశివరాయనికి బట్టాభిషేకము జరిగినదా? అంతకు బూర్వమే పట్టాభిషేకముజరిగినదా? ఇందునుగూర్చి చరిత్రపరిశోధకులలో భిన్నాభిప్రాయములు గలవు.

"విజయనగరచరిత్రమునకు మూలప్రమాణము" (Cources of Vijayanagar History) లనుగ్రంథమునకు నవత్యార్నికను వ్రాసినవారు మొదట నొకపేరాలో నిట్లువ్రాసిరి. "హండేవారి అనంతపుర చరిత్రమునుబట్టి సోదరత్రయము మొదట పిచ్చివానిని గెల్చి వానినిసంహరించి తరువాత అహమ్మదునగరముబీదరు, గోల్కొండసుల్తానుల సైన్యములగలిసికొనుటకు ముందునకు సాగిపోయి యుద్ధములో వారినిజయించి సోదరులు రాజధానికి వచ్చి సదాశివరాయని బట్టాభిషిక్తుని గావించిరి."

పైవిధమున వ్రాసినవీరే తరువాతిపేరాలో నిందుకుభిన్నముగా నిట్లవ్రాసిరి.

"వారు విజయనగరముపై దండెత్తి పోయి, రాజధానికి వెలుపల సలకముతిమ్మయను నోడించి నగరములో బ్రవేశించి క్రమముగా సదాశివరాయనిసింహాసనముపై గూరుచుండ బెట్టిరి. ఇదిజరిగినవెనుక నదివఱకు దిమ్మయచే నాహ్వానింపబడివచ్చిన యహమ్మదునగరముబీదరు, గోల్కొండసుల్తానుల సైన్యములను విజయనగరసామ్రాజ్యసీమలనుండి తఱిమి వేయుటకై వారిసైన్యములను గలిసికొనుటకుగాను ముందునకుసాగిపోవలసి యుండెను."[3] హండేవారి అనంతపుర చరిత్రమునందు సదాశివరాయని పట్టాభిషేకముసంగతి యెత్తికొని యుండలేదు. సలకముతిమ్మయ సమరములో సంహరింపబడిన వెనుక విద్యానగరము కృష్ణరాయలరాణులయాజ్ఞా ప్రకారము స్వాధీనపఱుచ బడినదనియు దరువాతనే యళియరామరాయలు దక్కనుసుల్తానులపై యుద్ధములు సాగించె ననియుమాత్రము దెలుపబడి యున్నది. ఇట్లుండినను నిందుకుభిన్నముగా తాముమొదట వ్రాసినవిధముగా నందున్న దనితెలుపుట వారికి బరిశోధనమునందలి యలక్ష్యభావమును సూచింపుచున్నది.


(1)Sources of Vijayanagar History, India p. 15 and 16 కావున వారుసత్య మిదియని నిర్థారించి వ్రాసినవ్రాతలు గావు. ఆరవీటివంశచరిత్రమును వ్రాసిన హీరాసుఫాదిరి తనగ్రంథములో విజయనగరమునకును మహమ్మదుమతస్థులకును పోరాటము సదాశివరాయని పరిపాలనాప్రారంభకాలమున దాదాపుగా నతనిపట్టాభిషేకదినముననే ప్రారంభ మయ్యె ననివ్రాయుచు, "రాజ్యమాక్రమించుకొన్న సలకము తిమ్మయను సింహాసనమునుండి తొలగించుటకై విజయనగరమునందు సంభవించిన విప్లవమును, తరువాత విజయనగరచక్రవర్తిగా సదాశివరాయని నెన్నుకొనుటయు విన్నవాడై యయ్యది తనకు మంచిసమయ మనియోజించి విజాపురసుల్తానగు ఇబ్రహీమ్‌ఆదిల్‌షా ప్రాముఖ్యత గాంచినయాదవానిదుర్గమును స్వాధీనపఱచుకొనుటకై అసాదుఖానుని నియోగించి వానిసైన్యములో నధికభాగము వానిపరముచేసె" నని ఫెరిస్తా వ్రాసినవాక్యముల నుదాహరించి యున్నాడు.[4] ఇయ్యది షడ్రసోపేతమైన భోజనము భుజింపుమని సమస్తమధుర పదార్థములతో గూడినవిస్తరిని గృహయజమాని తనముంగట నుంచగా గాలదన్ని వీథిలోనికి గిరవాటు వేసినవిస్తళ్లలోని యెంగిలినాకుటకు బఱుగిడినబిచ్చగాని కథను జ్ఞప్తికి దెచ్చుచున్నది. అళియరామరాయలు సోదరద్వయముతో విజయనగరము నుండి పాఱిపోయియున్నప్పుడు సలకముతిమ్మయ తన్నాహ్వానించి విద్యానగరమునకు రప్పించి లక్షలకొలది హొన్నులద్రవ్యమును సమర్పించుకొని విజయ


(1) The Aravidu Dynasty of Vijayanagar. p.74 నగర రత్నసింహాసనముపై గూరుచుండ బెట్టి సకలసామంత సమేతముగా దనకుభృత్యుడనయి యుందుననిచెప్పి పాదాక్రాంతుడై యుండి యామహానగరమున నేడుదినములు మహోత్సవములు సలిపి, సకలసామ్రాజ్యము సమర్పించిన నాడదిమంచిసమయముగా దోచక విడిచివచ్చిన మహనీయునకు సకలసేనాసమన్వితుడై యళియరామరాయలు భీమార్జునులం బోలిన వీరసోదరద్వయముతో సలకముతిమ్మయసైన్యమునను జయించి, సమరంబున వానిజిక్కాడి, విద్యానగరమున బ్రవేశించి, సదాశివదేవరాయని బట్టాభిషిక్తుని గావించి, యజేయుడై తనకీర్తిని నల్గడల బ్రసరింప జేయుకాలము మంచిసమయముగా దోచి, యాదవాని దుర్గముపై దండయాత్ర సాగించనా డనిరామరాయలకు బ్రబలద్వేషియైన ఫెరిస్తా వ్రాసిన వ్రాయుగాక! నిష్పక్షపాతముగ నారవీటి వంశచరిత్రమును వ్రాయగడంగిన హీరాసుఫాదిరి వంటిచరిత్రకారుడు ఫెరిస్తాస్వభావము నెఱింగినవా డయ్యు నిట్లసంగతముగ జరిత్రము తలక్రిందుజేసి వ్రాయుట యత్యాశ్చర్యకరముగా నున్నది. అచ్యుత దేవరాయలకుమారుని బట్టాభిషిక్తు డయినవాని దనమేనల్లు డయినచిన్నవేంకటాద్రిని వాని పినతండ్రియగు రంగరాయని సంహరించి తానురాజ్య మాక్రమించుకొని సామ్రాజ్యమునకు శత్రువులగు వారిని జేరదీసి హిందూ సామ్రాజ్యమును భ్రష్టముగావింప దలపెట్టిన సలకముచిన్నతిమ్మరాజు విప్లవకారకు డనిపించు కొనునా? చిన్న వేంకటాద్రికి బిమ్మట బట్టాభిషిక్తుడుగా దగినహక్కుగలవాడు, చిన్నవేంకటాద్రికి బినతండ్రికుమారుడునగు సదాశివదేవరాయని బట్టాభిషిక్తుని గావించిన యళియరామరాయలు విప్లవకారకు డనిపించుకొనునా? సలకముతిమ్మయను సింహాసన భ్రష్టునిగా జేయుటకై యళియరామరాయలు విప్లవము కల్గించినా డని వ్రాయుట యెంతవిపరీతమైన విషయముగా నున్నది? అళియరామరాయలు సదాశివరాయనికి గలన్యాయ్య మైనహక్కు నిప్పించినవాడుగాని వానిసార్వభౌమునిగా నెన్నుకొని లేనిహక్కును గల్పించినవాడు గాడు.

కారణ మెవ్వరేవిధముగా వక్కాణించినను అళియరామరాయల సైన్యములకును, దక్కనుసుల్తానుల సైన్యములకును 1542 వ సంవత్సరమున బోరాటము ప్రారంభమైనసంగతి సత్యము. విజయనగరమున సదాశివరాయని బట్టాభిషిక్తుని గావించినవెనుక నళియరామరాయలు నగరరక్షణమునకు మూలసైన్యముగా గొంతవిజయనగరమున నిలిపి సార్వభౌముని రక్షణమునకుగా విశ్వాసపాత్రులయిన సేనానుల నియోగించి మఱికొంతసైన్యముతో దానుగూడ వెడలిపోయి దక్కను సుల్తానులజయించుటకై యిదివఱకే పంపబడిన తన సైన్యములదక్కనుసుల్తానుల సైన్యములతో దలపడియుద్ధము జేయుచుండ గలిసికొనియెను. విజయనగర సైన్యములకును దక్కనుసుల్తానుల సైన్యములకును ఘోరయుద్ధము జరిగినది. ఆకాలమున విజయనగరసామ్రాజ్య మలంకరించి ప్రఖ్యాతి జెందియున్న మేటియోధులలో మొదట నెన్నదగినవాడు రామరాయల కడగొట్టుతమ్ముడు వేంకటాద్రి. ఇతడు వీర పురుషలక్షణములతో నొప్పెడు సుందరదేహము గలవాడు. 'ఆహవగాండీవి' యని ప్రతిపక్షయోధవరులుగూడ బ్రశంసించు నట్లుగా నాహవరంగమున నశదృశశౌర్యప్రతాముల జూపుచు విజృంభించి శత్రుసైన్యముల నురుమాడి భీభత్సముసేయు వారలు యుద్ధరంగమున నిలువ జాలక చెల్లాచెదరై పాఱిపోవ మొదలుపెట్టిరి. నరపతి విజయము నందలి యీతని తొలియుద్ధమున గొన్నజయ మీక్రింది విధమున వర్ణింపబడినది.

       "సీ. కందుకక్రీడగా గదనరంగస్థలి
                  గడువజీరులమస్తకముల దునిమి
           హరులను బొరిగొని కరులను దునిమి త
                  దారోహకుల ద్రుంచి వీరభటవి
           దళనంబుసేసి దుర్భరపతాకల గూల్ప
                  గనుగొని కాందిశీకత వహించి
           వీడుబట్టనునాస విడిచి నిజాము యే
                  దులఖాను కుతుపశాహులదళంబు

        తే. విచ్చ వెన్నిచ్చి కనుకని యిచ్చ బఱచి
           మెచ్చ జొచ్చిన నభయంబు నిచ్చి విజయ
           కాహళులు మ్రోయ నియమించి క్ష్మాజనంబు
           లభినుతు లొనర్పగా వేంకటాద్రిరాజు."

అంత దక్కనుసుల్తానులు తమతమరాజ్యముల సంరక్షించుకొనవలయు నన్నయాతురముతో దమదమ సైన్యములతో విడిపోయి యెవరిమార్గముల వారుపలాయనులై పోవుచుండిరి. అళియరామరాయలు వారుపోయెడివిధమును గాంచి తనసైన్యములను మూడువిభాగములుగ జేసి తనసోదరులతో నొక్కొకభాగమున కాధిపత్యమువహించి తానుగోలకొండ సుల్తా నగుజమ్షీదుకుతుబ్షాను, తిరుమలరాయలు అహమ్మదు నగరసుల్తా నగుబురహాన్‌నిజాముషాను, వేంకటాద్రి విజాపురము బీదరుసుల్తానులగు ఇబ్రహీమ్‌ఆదిల్‌షా, అమీర్‌బరీదుషాలను వెంబడించిపోయి వారలను జయించివారలతో సంధిగావించు కొనవలయు ననినిశ్చయించుకొని వారలను వెంబడించి యడవులమార్గముల తఱుముకొని పోవుచుండిరి.

వేంకటాద్రి నవాబరీదుల యుద్ధము

నవాబరీదులను దఱుముకొనిపోవుచుండిన వేంకటాద్రి సైన్యములతో నాతని పెదతండ్రియు, వేద్ధుడును నౌకు దుర్గాధ్యక్షుడును నగుతిమ్మరాజును, వానిపుత్రులగు నప్పలరాజాదు లున్నట్టి బాలభాగవతమున వర్ణించిన విషయములను బట్టి గ్రహింప నగును. వీరిసైన్యములకును నవాబరీదుల సైన్యములకును ఆదవానికడ నొకయుద్ధమును, కూరకచెర్లకడ నొకయుద్ధమును, మానువకడ నొకయుద్ధమును జరిగినట్లుగ దెలియుచున్నది. సలకముతిమ్మయకు దోడ్పడ వచ్చినప్పుడే విజాపురసుల్తాను ఆదవాని దుర్గమును స్వాధీనము జేసికొని కొంతసైన్య మచటనిలిపి అసాదుఖాను సంరక్షణముననుంచెను. ఆదవాని సమీపించినతోడనే ఇబ్రహీమ్‌ఆదిల్‌షా, అమీర్‌బరీదుషా సైన్యములు వేంకటాద్రిసైన్యముల మరలయెదుర్కొని యుద్ధముసేయ సాహసించెను. విజయనగర సైన్యాధిపతియగు వేంకటాద్రి దమసైన్యములను దఱుముకొనివచ్చుచున్నా డనివిని అసాదుఖాను ఆదవానిదుర్గమును విడిచి కొంత యాశ్వికసైన్యమును మాత్రము దనతోనుంచుకొని తక్కిన సైన్యములను ఇబ్రహీమ్‌ఆదిలషా సైన్యములతో గలిసికొన నుత్తరువుచేసెను. తరువాతవేంకటాద్రిసైన్యము లాదవానిదుర్గము నాక్రమించుకొనిరి గాని అసాదుఖాను కానుపింపకపోయెను. అతడు ఆదిల్‌షాను గలిసికొనియుండు ననినిశ్చయించి విజాపురసైన్యములను దఱుముచునే యుండెను. ఒకనాటిరాత్రి ఆదిల్‌షాసైన్యము లొకచోట విశ్రమింప విడిచిన వనివిని తానును వానికి వెనుక నెనిమిదిమైళ్ల దూరములో విశ్రమించి వేంకటాద్రిసైన్యము లేమరియుండెను. వారితో గొనిపోయిన వస్తువాహన సామగ్రియు, స్త్రీజనబృందముతో వేంకటాద్రిమొదలగు సేనానుల కుటుంబములును డేరాలలో విశ్రమించి యున్నకాలమున పగలాసమీపమున నెచటనో దాగియున్న అసాదుఖాను మూడువేల గుఱ్ఱపుదళముతో వచ్చి పై బడియెను. వెనుకప్రక్కనున్న వేంకటాద్రిసైన్యము లావైపరీత్యమును గాంచి బెదరి చెల్లాచెదరై పోయెను. వాహన వస్తుసామగ్రియు, రాచకుటుంబములు వారివారిడేరాలతో గూడ నసాదుఖాను పాలయ్యెను. అంతదెల్లవాఱిన పిమ్మట వేంకటాద్రి చెదరిపోయిన సైన్యముల మరలసమ్మేళనము గావించి అసాదుఖానును వానిసైన్యములను ముట్టడింపవలయునని ప్రయత్నింపగా నతడునవాబరీదులను జేరుకొనియెను. అసాదుఖానుచేసిన ద్రోహమునకు గుపితుడై వేంకటాద్రి వానిమున్ముందు నడ్డగించి వానిని శిక్షించి తమకుటుంబముల కేవిధమైన నపకారముజరుగకమున్న వారిని చెఱనుండి విడిపింపవలయునను నాతురముతో నారవీటిరాచవీరకుమారవర్గము దోడ్పడ బదివేలగుఱ్ఱపురౌతులతో శత్రుసైన్యములను వెన్నంటివచ్చి కూరకచర్లకడ దలపడియుద్ధము చేసెను. కూరకచర్లయెచట నుండెనో దెలియరాదుగాని బాలభాగవతమునందు కూరకచర్లకడ నవాబరీదులతో యుద్ధము జరిగియున్నటుల చెప్పబడి యుండుటచేత నుభయసైన్యములు మరల గలిసికొని పోరాడిన ప్రదేశము కూరకచర్లయై యుండునని నేనుతలంచుచున్నాను. వేంకటాద్రి పెదతండ్రికుమారుడు అప్పలరాజిచట నవాబరీదులతో జరిగినఘోరాహవమున వారినిజయించియు మృతినొందినటుల బాలభాగవతమున జెప్ప బడియెను.[5] ఈయుద్ధము నప్పలరా జొక్కడేజరిపినదికాదు. ఇతడును, ఇతనితండ్రియు గూడవేంకటాద్రిని వెంబడించివచ్చిన వారగుటచేతను వారుగూడ నీయుద్ధమును జరిపిజయముగొన్నవా రగుటచేతను అప్పలరాజు జయముగొనియు యుద్ధములో మరణము జెందెనని బాలభాగవతగ్రంథకర్త చెప్పియున్నాడు. ఇక్కడగూడ వేంకటాద్రికి సంపూర్ణవిజయము లభించిన దనిచెప్పక తప్పదు.

వేంకటాద్రితోబుట్టువు లక్కమాంబపుత్త్రుడును, తొరగంటిదుర్గాధ్యక్షుడు నగుపోచిరాజునరసింహరాజు కూడవేంకటాద్రికిని నవాబరీదులకును జరిగిన యీయుద్ధమున దోడ్పడియున్నట్టు నరస భూపాలీయములోని యీక్రింది పద్యమువలన విదితముకాగలదు.

        "క. గర్వితబరీదసేనా
            సర్వస్వహరానివార్యశౌర్యునకుసమి
            ద్ధూర్వహసపాదభయదా
            ఖర్వమహావిజయభేరికాభాంకృతికిన్."

ఈయుద్ధమునందు వేంకటాద్రి పరిపూర్ణవిజయమును బొందెను. గర్వితుడగుబీదరుసుల్తాను అమీర్ బరీదుషా యోడింపబడి బిరుదుమేళంబుతో గూడబట్టుపడినట్లుగా నరసభూపాలీయము, వసుచరిత్ర, నరపతివిజయములవలన దెలియుచున్నది.

        "గీ. అనుచుయవనుల దెగడితన్నాశ్రయించు
            వారిసామ్రాజ్యలక్ష్మినెవ్వాడుగొనియె

         నాహవోగ్రబరీదసప్తాంగహరణు
         డతడువిలసిల్లుశ్రీవేంకటాద్రివిభుడు."
                        (న. భూ.)

ఇచట బరీదును బట్టుకొనుటయెగాదు, అసాదుఖాను చెఱగొన్నరాజకుటుంబములనుగూడ జెఱనుండివిడిపించుకొనియె ననిభట్టుమూర్తి తనవసుచరిత్రములో వేంకటాద్రిని నభివర్ణించుచు జెప్పినయీక్రిందిసీసపద్యములో సూచించి యున్నాడు.

     "సీ. నిరతంబు దుర్మార్గనిరతులౌ తురకల
                 నతులసన్మార్గసంగతుల జేసె
         ననియత మోహాంధులౌ పారసీకుల
                 న్వస్త్రీసుఖైకనిశ్చలుల జేసె
         నతినిర్ద యాత్ములౌ యవనుల భూత
                 సంతానతృప్తిప్రదాత్మకుల జేసె
         ద్విజపక్షపాతంబుదెగడుపాశ్చాత్యుల
                 ద్విజపక్షపాతభావితుల జేసె

      గీ. ననుచు గడుమెచ్చి జయలక్ష్మి యాజిరంగ
         కాతరబరీదకేతనఘటితభద్రకలశ
         మెదురుగ బూని యేఘనుని జెందె
         నతడుసామాన్యుడే వేంకటాద్రివిభుడు."
                            (వ. చ.)

        "ఆ. అసదృశోరుశౌర్యు డాహవగాండీవి
            వేంకటాద్రి రాజవిబుధరాజు
            అనిబరీదుగెలిచియాతనిబిరుదుమే
            ళమ్ముగొనియెభూజనమ్మువొగడ."

ఇట్లుబీదరుసుల్తా నగుఅమీరుబరీదుషా విజితుడై శరణాగతుడై వశ్యు డయినవెనుక విజాపురసుల్తాను స్వసైన్య యుతముగ బలాయను డయ్యెను. ఇట్లుపలాయనుడై ఇబ్రహీమ్‌ఏదిల్‌షా పఱువిడుచున్నను వేంకటాద్రి వానిని విడిచి పెట్టక యాతనిసైన్యముల వెన్నంటి కూడ బోయెను. అట్లు పఱువిడిపోయి విజాపురసుల్తాను తుంగభద్రానదికి నుత్తరభాగమున రాచూరుదుర్గమునకు నైౠతిమూలను ముదిగల్లుదుర్గమునకు నాగ్నేయమూలను రెండుదుర్గములకునడుమ నున్న మానువదుర్గముకడ సుస్థిరముగా నిలిచి తనసైన్యముల మోహరింప జేసికొని మరలనెదుర్కొని యుద్ధము చేసెను. ఇచట వీనిని వేంకటాద్రి పెదతండ్రియగు నౌకుతిమ్మరాజు జయించి విజయముగొన్నవా డనికోనేరునాథకవి విరచితములయిన ద్విపదబాలభాగవతము, పద్యబాలభాగవతములలోని యీక్రింది వాక్యములనుబట్టి మనము తెలిసికొనగలుగుచున్నాము.

           "కడిమిమైమానువకడరణక్షోణి
            గడుసరినేదులఖానుజయించె." ద్వి. బా.

           "మానువకడ నవాబూనిపోరను బరా
            జయము నొందించె నేశౌర్యశాలి." ప. బా.

ఇట్లువేంకటాద్రియు వానిసైన్యములును శత్రురాజ్యమున బ్రవేశించి జయములుగొనుచు దండయాత్రను ముగింపకవెంటాడించి విడిచిపెట్టక యిబ్రహీమ్‌ఆదిల్‌షా శరణాగతుడై వచ్చి సంధిచేసికొనువఱకును వేంకటాద్రిదీక్షతో బోరాడుచునే యుండెను. బలవంతుడగు ఇబ్రహీమ్‌ఏదిల్‌షా కడసారి భీమరధీనది ప్రాంతమున వేంకటాద్రిసైన్యమునెదిరించి భయంకరమైన సమరము సలిపియు గెలుపుగొన లేకపోయెను. ఇచట వేంకటాద్రికి బరిపూర్ణవిజయములభించె ననిభట్టుమూర్తి తననరసభూపాలీయ మనుగ్రంథమున నీక్రింది రెండుపద్యములలో విస్పష్టముగా వర్ణించి యున్నాడు.

      "మ. బలధుర్యుండగువేంకటేంద్రునిమహాబాహాబలాటోపవి
           హ్వలుడై మున్నతిధావనక్రియసపాదాభిఖ్యుడై నట్టియే
           దులఖానుం డిదేనేడు గ్రమ్మఱసపాదుం డయ్యెనానర్మిలిన్
           దలదత్పాదము దాల్చె భీమరథిపొంత న్గాన నిత్యోన్నతిన్."

      "మ. స్థిర సంగ్రామజయాభిరాముడగునా శ్రీవేంకటక్ష్మావరుం
           డరయ వ్రాజశిఖావతంసు డగు దధ్యంబు గాకున్న నీ
           ధరణీపాలకు లెల్లమెచ్చగ సపాదక్షోని భృత్ర్పాప్తి భా
           సురదుర్గాధిపతిత్వవైభవభవస్ఫూర్తి న్విజృంభించునే."

ఇట్లు వేంకటాద్రితోనైన యుద్ధములయందు బరాజయము నొంది విహ్వలుడై పోయి విజాపురసుల్తాను శరణాగ తుడై వేంకటాద్రి కాళ్లుపట్టుకొని సంధిచేసికొనవలసి వచ్చెను. అప్పుడు "సపాదక్షోణిభృత్ర్పాప్తి భాసురదుర్గాధిపతిత్వవైభవ" మనగా విజాపురరాజ్యములోని రాచూరు ముదిగల్లు మానువదుర్గముల నొసంగి సంధిచేసికొని తనరాజ్యము పరాదీనము గాకుండ గాపాడుకొన గలిగెను. వేంకటాద్రికిని నవాబరీదులకును జరిగినయుద్ధ మీవిధముగా ముగింపబడి యుండగా ఫెరిస్తా యీచరిత్రమునంతను దలక్రిందుగా మార్చి యెట్లు వ్రాసినాడో దానింగూడ దెలిసికొన్నయెడల చదువరులకిందలి సత్యము గ్రాహ్యముగాక మానదు. సలకముతిమ్మయను సింహాసన భ్రష్ఠునిగావించుటకై యళియరామరాయలు విద్యానగరమున మహావిప్లవమును గలిగించి సదాశివరాయని పట్టాభిషిక్తుని జేసినకాలము తనదండయాత్రకు మంచికాలము వచ్చె నని తలంచి యాదవానిదుర్గమును బట్టుకొనుటకై అసాదుఖానుని విజాపురసుల్తాను పంపించినా డనిఫెరిస్తా వ్రాసినదానిని నింతకు బూర్వముదెలిపి యున్నాను. అట్లు అసాదుఖాను ఆదవేనిదుర్గమును ముట్టడింప నావార్త విద్యానగరముననున్న యళియరామరాయలకు దెలియవచ్చి యాముట్టడిని విడిపించి యసాదుఖానుని జయించుటకై కొంతసైన్యముతో దనతమ్ముని వేంకటాద్రిని బంపె నట. అసాదుఖాను వేంకటాద్రి వచ్చుచున్నా డనివిని యాదవాని దుర్గమును ముట్టడించుట మాని వేంకటాద్రి నెదుర్కొనియె నట. అంతగొంచెము కాలము యుద్ధముజరిగినది గాని తనకునోటమి కలుగు నన్నభీతి చేత సక్రమముగా వెనుదీయ బ్రారంభించె నట. ఒకనాటి రాత్రి అసాదుఖా నొకచోట విశ్రమించినా డట! అతడు పాఱిపోకుండ జూచుటకుగాను వేంకటాద్రికూడ 8 మైళ్లదూరములో దండువిడిసి విశ్రాంతిగొనుచుండె నట. ఆమఱునాడు సూర్యోదయముకాకపూర్వమే అసాదుఖాను ప్రశస్తమైన నాలుగువేల యాశ్వికసైన్యముతో వచ్చిపైబడి యాశ్చర్యము గొలిపె నట. ఆత్మవిశ్వాస మెక్కువగా గలవాడగుటచేత వేంకటాద్రి యేమరియుండె నట! వారుగన్నెత్తి చూచుసరికి తురకరౌతులు హిందూగుడారముల నడుమనుండిరట! వేంకటాద్రి కెంతమాత్రము తప్పించుకొన సావకాశము లేక తనధనాగారమును, కుటుంబమును, ఏనుగులు మొదలుగా గల వాహనాదికములను వారికి విడిచిపెట్టి పాఱిపోయెనట. తెల్లవారి సూర్యోదయమైన తోడనే వేంకటాద్రి చెల్లాచెదరై పోయినసైన్యములను నొక్కచోటికి మరలచేర్చుకొని యుద్ధముచేయుటకు సంసిద్ధుడై యున్నవానిపగిది నటించుచు బ్రయత్నించినను, తనకుటుంబమునకు నేమివిపత్తు కలుగునో యన్నభయముచేత యుద్ధముచేయుటకు నిష్టపడక కొన్నిమైళ్ల దూరముగా వెనుకకు బోయి యచట నివసించి తనదురవస్థను దెలుపుచు దనసోదరుడైన రామరాయలకు గొంతసైన్యము బంపుమని వర్తమానముచేసె నట. అంతరామరాయ లతడు కోరినప్రకారము ధనమును సైన్యములను బంపి యుద్ధముచేయవలసినదని బహిరంగముగా నాజ్ఞాపించుచు రహస్యముగా నొకజాబు వ్రాసెనట. ఆజాబులోనివిషయ మిట్లుండె నట! ఇబ్రహీమ్ ఆదిల్‌షా బుద్ధిపూర్వకముగా దండెత్తిరావలె నని వచ్చి యుండడు. అచటిజమీందారులెవ్వరో కుట్రచేసియతనిరప్పించి యుందురు. నీసైన్యములోనివారు కూడ వారిపక్షమున బనిచేయ వచ్చును. కావున నేదో సామోపాయముచేత ప్రస్తుతము సంధిచేసికొని భార్యను బిడ్డలను అసాదుఖానునుండి విడిపించు కొనవలయునని వ్రాసె నట.

ఇట్టిసలహా ననుసరించి వేంకటాద్రి అసాదుఖానునకు విశేషముగా లంచమునొసంగి వానిని మధ్యవర్తిగా జేసివాని ద్వారా విజాపురసుల్తానుతో మాట్లాడింపగా నాతడు సంధిచేసికొన ననుజ్ఞ నొసంగె నట! ఆసంధిషరతు లెట్టివో ఫెరిస్తా దెలుపలేదు గాని యుభయపక్షములకు సంతృప్తికరములుగా నున్న వట! ఇది ముగిసిన వెనుక అసాదుఖాను తనయజమానిని గలిసికొని విజాపురమునకును, వేంకటాద్రి తనకుటుంబమును దీసికొని విజయనగరమునకును వెడలిపోయి రట. ఈపయి చెప్పినది ఫెరిస్తావ్రాతవైఖరిని దెలుపుచున్నది. విజయనగర విప్లవమున ద్రోహియైన సలకముతిమ్మయకు దోడ్పడవచ్చి యీరీతిగా బరిభవమునొందినా డనిభావిప్రపంచము చేయు నిందనుండియు నపకీర్తినుండియు దప్పించుటకై మహమ్మదు ఖాశింఫెరిస్తా పైరీతిగా గల్పనముచేసి వ్రాసినవ్రాతగాని మఱియొండుగాదు. భీమరధివఱకు వేంకటాద్రిపోయి యుద్ధములు చేసి యున్నట్లుగా హిందువుల గ్రంథములు ఘోషించుచుం డగా వీనిని విస్మరించి హీరాసుఫాదిరి ఫెరిస్తాను విశ్వసించి వ్రాయుట తెలుగుభాషనాత డెఱుగకుండుటయేకారణము. ఈగ్రంథకర్తలు కవు లయినపాపముచేత వీరుచెప్పిన సత్యాంశములనుగూడ ద్రోసిపుచ్చ నగునా? వర్ణనాంశములలో నతిశయోక్తు లుండిన నుండుగాక! వారుసమకాలికులై యుండి చెప్పినవిషయములను గూడ ద్రోసిపుచ్చ నగునా? ఆరవీటివంశచరిత్రము నందునెచ్చట సత్యచరిత్రాంశమునకు గౌరవము ముఖ్యముగా నీయదగియుండెనో యాగౌరవము నచటనుండి హీరాసుఫాదిరి తొలగించివేయుట మిక్కిలి శోచనీయము.

ఇట్లు సంధిచేసికొని విజాపురసుల్తాను దనరాజధాని జేరినకొలదికాలములోనే అహమ్మదునగరసుల్తా నగుబురహాన్ నిజాముషావలన నాహ్వానింప బడియతనితో గుట్రకావించి బీదరు, విజయనగరములపై దండయాత్రలుసాగించుటకు నిశ్చయించుకొని రట! ఆప్రకారము బురహాను బీదరురాజ్యముపై దండెత్తివచ్చెనట! బీదరుసుల్తా నగుబరీదుషాయీ సంధివిషయమెఱుంగక బరీదుషా తనపూర్వమిత్రు డగు ఇబ్రహీమ్‌ఆదిల్‌షాకడకు సహాయార్ధ మఱిగె నట! అతడు వెంటనే యాతని జెఱబెట్టె నట! ఆదిల్‌షా తరువాతవిజయనగరరాజ్యముపై దండెత్తి విజయముగాంచి విజయనగరరాజ్యములోని పెక్కుభాగములను తనరాజ్యములో గలుపుకొన్నాడని ఫెరిస్తావాక్యముల నుదాహరింపుచు హీరాసు విజయనగరరాజ్యములోని భాగములను కలుపుకొన్నదిమాత్ర మసత్య మని వ్రాయుచున్నాడు. ఆకాలమున విజయనగరమునకు నట్టి దేశనష్టము కలిగినసంగతి వినరాదని యీవిషయములకు దరువాత రామరాయల హమ్మదునగరసుల్తా నగుబురహాన్ నిజాముషాతో యుద్ధమునకు దలపడియున్నవాడు గనుక ఫెరిస్తా వ్రాసిన దతిశయోక్తి యనిమాత్ర మొప్పుకొనుచున్నాడు.

అసలు హీరాసుయెత్తిన యెత్తుగడయె సక్రమమైనది గాదు. విజాపురసుల్తాను సంధిచేసికొన్న తరువాత బురహాన్ నిజాముషాతో జేరి బీదరు విద్యానగరములపై యాసంవత్సరమె మరల దండయాత్ర సాగించినా డనుటసత్యవిరుద్ధము. ఫెరిస్తా వ్రాసిన వాక్యముల దుర్ర్భమలో దగుల్కొని చరిత్రబద్ధములు కానివిషయములకు బ్రాముఖ్యత నొసంగి తనతో యుద్ధముచేయ ఇబ్రహీమ్ ఆదిల్‌షాను బ్రేరేపించినవా డని యీసుగలిగి బురహాన్ నిజాముషాపై రామరాయలు దండెత్తి పోయినవా డనిహీరాసువ్రాసినది సత్యముకాదు. సలకముతిమ్మయ సంభవింప జేసిన విప్లవకాలమున నాతనికి దోడ్పడవచ్చినవా రనితక్కినసుల్తానులపై దండయాత్ర సాగించి నట్లే రామరాయలీతనిపై గూడ దండయాత్రసాగించినవా డుగాని మఱియన్యకారణముచేత గాదనిభట్టుమూర్త్యాదులు వ్రాసిన వ్రాతలవల్లనే తెలియుచున్నది. అళియరామరాయలును వాని తమ్ముడు తిరుమల దేవరాయలును, జమ్షీదు కుతుబ్‌షాను బురహాన్‌నిజాముషాను వెంబడించిపోయి యుండిరని యింతకు బూర్వము దెలిపియున్నాను. అళియరామరాయలు జమ్షీదు కుతుబ్షా సైన్యములను పానుగల్లుదుర్గముకడ సంధించి యతని నోడింపగా నాతడుగోలకొండకు బాఱిపోయెను. అంతటితో దృప్తినొందక గోలకొండవఱకు దఱుముకొనిపోయి యాదుర్గమును ముట్టడింపగా జమ్షీదుసంధిచేసికొనుట యుక్తముగా భావించి యళియరామరాయలతో రాయభారములు జరుప దూరదృష్టితో నతడందుల కంగీకరించి సంధి గావించుకొనియెను. తిరుమలరాయల సైన్యములు కళ్యాణ నగరదుర్గముకడ బురహాన్ నిజాముషా సైన్యములతో దలపడిపోరాడుచున్న కాలమున నళియరామరాయల సైన్యములు తూర్పుదిక్కుననుండియు, వేంకటాద్రిసైన్యములు పడమటిదిక్కున నుండియు దమతమ విజయయాత్రలను ముగించుకొని మధ్యభాగమున నున్న తిరుమలరాయల సైన్యములను గలిసికొనియెను. ఇట్లుగలిసికొన్న సోదరత్రయముతో బోరాడుట బురహాన్ నిజాముషాకు దుర్భరమై పోయి కళ్యాణినగరమును శత్రువులకు విడిచిపెట్టి పలాయనుడై యహమ్మదునగర మార్గమునుబట్టెను. కళ్యాణి బట్టుకొన్నవిషయము వసుచరిత్రమునం గానరాదని హీరాసుఫాదిరి తలంచినది సత్యముకాదు.వసుచరిత్రమునందా విషయము వక్కాణింపబడినది. చూడుడు.


[6]

      "శా. విశ్వామిత్రుని గొల్చి రాము డత డుర్విం జెందె గళ్యాణము
          న్విశ్వామిత్రులు గొల్వరాము డిత డుర్వి జెందె గళ్యాణమున్
          శశ్వత్కీర్తులురాములయ్యిరువురున్ సాధించుకళ్యాణలా
          భైశ్వర్యంబులుధర్మనిర్మధనధర్మాలంబనవ్యగ్రముల్."

అళియరామరాయలీకళ్యాణనగరమును బురహాన్‌నిజాముషానుండి బలాత్కారముగా గైకొనియుండుటచేతనే యాతనిబిరుదుగద్యములో 'గళ్యాణనగరసాధక' యన్న బిరుదముగూడ జేర్ప బడినది. ఇంతటితో దృప్తినొందక బురహాన్‌నిజాముషా వంటిశత్రువును స్వాధీనపఱచుకొన కుండవిడిచి పెట్టుట ప్రమాదహేతు వగుననిచింతించి యళియరామరాయలు తనసోదరులతో బర్యాలోచించి యహమ్మదునగరముపై దండెత్తిపోవుటకు నిశ్చయించుకొని సోదరత్రయమును దమతమసైన్యములతో వానిని దఱుముకొనుచు బోయిరి. అహమ్మదునగరసమీపమున బురహాన్‌నిజాముషాఘోరసంగ్రామమును జరిపెను. ఇచట బురహాన్‌నిజాముషాకు బరాజయము సంభవించుటయెగాక యీయుద్ధమునుండి పాఱిపోవుచున్న వానిని పొన్నలాపురము హండేహనుమప్ప నాయడు పట్టుకొని వాని సైన్యములు జయఘోష మిడుచుండ వానినిగొనివచ్చి యళియరామరాయలముందు బెట్టెను. అళియరామరాయలసైన్యము లహమ్మదునగరమున బ్రవేశించి కోటలనాశనము గావించి నగరమునాగళ్లతో దుక్కిదున్నించి యాముదాలుచల్లించి రని యాంధ్రకవులు వర్ణించిరి. ఇతడహమ్మదునగరమునువిడిచి యచటికి నలుబదియేబదిమైళ్ల దూరమున నున్న గోదావరినిదాటి పోయె ననియు నచటికి నీసోదరత్రయమును శత్రువర్గమును నురుమాడుటవలన రక్తసిక్తములయిన తమ ఖడ్గములను గోదావరిలోనగడిగి రనికవులువ్రాసిరి. బహుశ: హండేఅనుమప్పనాయడు గోదావరిని దాటి పారిపోవుచున్న కాలముననే బురహాన్‌నిజాముషాను బట్టుకొని యుండు నని విశ్వసింప వచ్చును. అహమ్మదునగరవినాశము నరపతివిజయ మనుగ్రంథమున నిట్లువర్ణింప బడినది.

         "సీ. హరిశౌర్యుడగుతిర్మాలాధీశ్వరుండు ద
                   దవరజుం డగువేంకటాద్రి రాజు
             భుజయుగంబుగ బలస్ఫురణతో గరిహరి
                   వరవీరభటులతో దొరలతోడ
             దనయాజ్ఞ మీఱినకినుక నిజాముపై
                   దండెత్తి తఱిమి యుద్దండవృత్తి
             నత డేలుచున్నట్టి యామదానగరంబు
                   చాలెత్తి మఱి యామదాలు వేసి.

          ఆ. సేతు కాశిమధ్యభూతలనుతజయ
             శ్రీవరించివేడ్కచే జెలంగె
             రామమూర్తియైనరామరాజేంద్రుడు
             సాంద్రవిభవజిత సురేంద్రు డెలమి."

       "మ. కడిమివ్వేంకటరాయశౌరినెదురంగలేక సత్యాహితం
            బడరన్ గౌతమిదాటువేళ నిజకాంతాశ్రుప్రవాహాప్తిగా
            ల్నడ దప్పన్ జడుడై నిజాముడుడుపాలంబున దాటి యె
            క్కడగన్న న్భజియించు నయ్యుడుపరేఖన్నామమోహంబునన్."

        "ఉ. ఆయనుజు ల్విసుద్ధహరిదంత మహాకరిదంత కాంతిరే
            ఖాయతకీర్తులై కొలువ గౌతమినీటనరాతిఘాతి కౌ
            క్షేయకరక్తము ల్గడిగి శ్రీరమణీవరమూర్తి రామభూ
            నాయకు డుర్వి నేలె భువనస్తనీయ జయాభిరాముడై."

ఈకార్యముల నిర్వర్తించుటచేతనే యీతని బిరుదు గద్యములో 'ఆమదానగరసాలభంజన' యనియు, 'గౌతమీస్నానపావనాకార' యనియు బిరుదములు చేర్ప బడినవి.

అళియరామరాయలు బురహాన్ నిజాముషా స్వాధీనుడయినవాడుగనుక నతనికి నిభరామునకు గలమైత్రి మాన్పుకొన వాగ్దత్తముగైకొని యాతనినిర్బంధమునుండి విడిచిపెట్టెను. ఇట్టివిజయములనుగాంచి నట్టితనప్రభువగు నళియరామరాయలను భట్టుమూర్తి తన వసుచరిత్రమునం దట్లభివర్ణించి యున్నాడు.

         "సీ. ప్రజలావలేపవి గ్రహజాయమానాగ్ర
                   హముడించి బహుదానవాప్తిగాంచు

           బురమెల్ల బ్రత్యగ్రభూతిపాలుగ జేసి
                  యచలాసనాభ్యాసియై కృశించు
           రతినిభరామానుగతమైత్రిపైరోసి
                  కలనైన గళ్యాణ కాంక్షయిడడు
           నరవి బ్రాణాయామసంసిద్ధికై సారె
                  సారెకు గుండలిస్థాన మంటి

        గీ. మానకనిజాముడపవర్గమార్గవృత్తి
           బెరయుపరబుద్ధినెవ్వాని పేరుదలచి
           యతడు శ్రీరాము డఖిలసన్నుతికి దగడె
           సేతు కాశీతలాంతర భ్యాతయశుడు."

ఈప్రథమ సంవత్సరమున జరిపినదండయాత్రల నన్నిటి యందు మహావిజయములను గాంచి యళియరామరాయలును వానిసోదరు లిర్వురును సకలకర్ణాట సామ్రాజ్యమును సముద్ధరించి జగన్నుతి గన్నవారలగుచు సుఖముగా మరలి రాజధానియగు విద్యానగరము బ్రవేశించిరి.

రామరాయలు సుల్తానులపట్ల చూపిన రాజనీతి పద్ధతి దక్కనుసుల్తానులకు దమతమ సరిహద్దులలో నుండుదుర్గములనుగూర్చిన తగవులచే నైకమత్యము లేక పరస్పరాసూయలతోను గలహములతోను గాలము గడపుటయేగాక యప్పటప్పట యుద్ధములుగూడ జేయుచుండిరి. అళియరామరాయ లీదక్కను సుల్తానులెల్లరు నైకమత్యముతోనున్న నెప్పటికైన హిందూ సామ్రాజ్య మగువిద్యానగర సామ్రాజ్యము నకుముప్పుగలుగకమాన దనినిశ్చయించుకొని వారిపోరాటము లలో దానుగూడ బాలుగొని తనపరిపూర్ణమైన రాజ్యతంత్రజ్ఞానముతోగూడిన రాజనీతినంతయు వినియోగించి తనశత్రురాజ్యములలో నైకమత్యము లేకుండ జూచుటయె వృత్తముగా గలిగి యుండెను. తక్కినసుల్తానులతో యుద్ధముచేయుటకై యొకప్పు డొకనితోను, ఇంకొకప్పుడు మఱియొక్కనితోను జేరుచు యుద్ధములు సలిపెను. ఈరీతిగా దనయిరువదిమూడు సంవత్సరముల పరిపాలనములోను నెల్లరతోను బోరాడి మహమ్మదుమతస్థులయిన యాసుల్తానుల నోడింపుచు నెప్పుడును విజయభేరీ మ్రోగింపుచు విజయనగరమునకు మరలి వచ్చుచుండెను.

అహమ్మదునగరసుల్తాను ఒకసంవత్సరకాలము మౌనము వహించి యూరకున్నవాడై 1544 వ. సంవత్సరప్రారంభమున గోల్కొండసుల్తానగు జమ్షీదు కుతుబ్షాకడకు 'షాతహీర్‌' అను రాయబారిని విజాపుర సుల్తానుతో యుద్ధముచేయుటకై రహస్యముగా రామరాయలుతో నొడంబడిక చేసికొనవలసినదిగా మాట్లాడుటకై పంపించెను. ఎన్నడో తన రాజ్యమునుండి విజాపురసుల్తాను గైకొన్న యైదుమండలములను తిరిగి స్వాధీనము చేసికొనవలయు ననిబురహాన్‌నిజాముషా యొక్కతలంపట. అహమ్మదునగరసుల్తాను, గోల్కొండసుల్తాను, అళియరామరాయలు సంధిపత్రములపై సంతకములు చేసిరి. విజాపుర రాజ్యముయొక్క దక్షిణభాగమును విద్యానగరసైన్యములును, తూర్పుభాగమును గోలకొండ సైన్యములును, పశ్చిమోత్తరభాగమును ఆలీబరీదుషా, క్వాజాజహానుల సైన్యములతో బురహాన్‌ నిజాముషాయును ముట్టడించుటకు నిశ్చయించుకొని రట!

ఇట్టియొడంబడిక జరిగినవెనువెంటనే బురహాన్‌నిజాముషాతన సైన్యములతో విజాపురరాజ్యమున బ్రవేశించి చాలవఱకు నష్టము గలిగించుటయెగాక ఇబ్రహీము ఆదిల్‌షాను యుద్ధములలో బెక్కుతడవులు జయింపుచు వచ్చెనట! ఈకాలముననే గోలకొండసైన్యములు తూర్పు భాగమును ముట్టడించి కాక్నిమండలమును స్వాధీనపఱచుకొని యచటనొక కోటను నూతనముగా నిర్మించి కలుబరిగి దుర్గప్రాకారముల వఱకు: గలదేశమంతయు నాక్రమించుకొని కడపట నగరదుర్గమునకు సమీపమునం దున్నయాతగిరిదుర్గమును ముట్టడించెనట! అళియరామరాయల పక్షమున వేంకటాద్రి రాచూరు దుర్గమును ముట్టడించుటకై దండయాత్రవెడలి భీమరథిప్రాంతమున విజాపురసుల్తానును దలపడి యాతనినోడించి తఱిమెనట! ఈయుద్ధవర్ణనమె నరసభూపాలీయము నందు కలదని హీరాసుఫాదిరి వక్కాణించెనుగాని నరసభూపాలీయము నందలి యుద్ధ మింతకుబూర్వ మనగా 1542 వ సంవత్సరములో జరిగినదిగాని 1544 వ సంవత్సరమున జరిగినది కాదని యిదివఱకే తెలిపి యున్నాను. ఇట్లు చిక్కులలో దగుల్కొని తన్నును తనరాజ్యమును సంరంక్షించుకొనుటకు వెరవుగానక దూరమున బెల్గాముమండలమున నున్నతనవృద్ధసేనాని యగుఅసాదుఖానుని దనకడకు రప్పించుకొని యికముందు చేయదగు కార్యమునుగూర్చి యతనితో నాలోచించెను. అనుభవజ్ఞుడగు నామహాసేనాని దీనికంతకు గారణభూతుడైన శత్రువు గోల్కొండసుల్తానుగాని తదితరులుగా రనియు, వీనిప్రేరేపణచేతనే తదితరులు శత్రుత్వమున వహించినవారుగా నుందురని యూహించి యతనితో సంధిచేసికొన్న దక్కినవారిని నేయుపాయముచేతనైన వశ్యపఱచుకొనవచ్చు నని చెప్పెను. ఈయుద్ధమునకు గారణములుగా నెన్నబడు సోలాపురమండలముతో జేరిన యైదుమండలములను బురహాన్‌నిజాముషాకు నిచ్చివేయుచు వెంటనే రామరాయలకు గొంతధనము నొసంగి వానితోగూడ సఖ్యము గావించుకొనవలసినదనియు, ఈయిర్వురు శత్రువులతాకిడి నుండి తప్పించుకొన్న యెడల దాను కుతుబ్షానెదుర్కొని విజాపురరాజ్యమునుండి యాత డాక్రమించుకొన్న దేశము నంతయు జయించి యిప్పించుటకు బాధ్యతను దాను వహింతు నని విన్నవించెను. విజాపురసుల్తాను వాని సలహాను మన్నించి యతడు చెప్పిన విధముగా బురహాన్‌నిజాముషా తోను రామరాయలతోను సంధి చేసికొనియెను. అసాదుఖాను తానుచేసిన వాగ్దత్తముప్రకారము గోల్కొండసుల్తానుపై దండెత్తిపోయి గోల్కొండదుర్గ ప్రాకారములకడ కుతుబ్షా సైన్యముల నోడించి విడిచి పెట్టెను. ఇట్లీయుద్ధము ముగిసినను పిమ్మట నొకప్పుడు రామరాయలచే బ్రేరేపింపబడి బురహాన్ నిజాముషాహ ఇబ్రహీమ్‌ఏదిల్‌షాపై దండెత్తిపోయి కలుబరగిదుర్గమును ముట్టడించియు జయింపలేక విజాపురసుల్తానుచే నోడింపబడి మరలి యహమ్మదు నగరమునకు వచ్చేసె ననియు, దక్కనుసుల్తాను లెప్పుడు నైకమత్యముతో నుండకుండునటుల చూచెడు రామరాయల తంత్రములు నెఱవేఱుచు వచ్చిన వనిఫెరిస్తా వ్రాయుచున్నాడు. తరువాత విజయనగర రాజ్యమునకును దక్కనుసుల్తానుల రాజ్యములకును 1549 వ సంవత్సరము వఱకును యుద్ధము లేవియు జరిగియున్నట్టు గానరాదు.

కళ్యాణి కలుబరగి దుర్గముల ముట్టడి

ఆసంవత్సరమున విజాపురమునందు బెల్గాముదుర్గాధిపతియును, సుల్తానుకార్యకర్తయు, సైన్యాధ్యక్షుడును వృద్ధసేనానియు నగు అసాదుఖాను మరణము జెందెను. ఈవార్త అహమ్మదు నగరమున దెలియగనే అహమ్మదు నగరసుల్తాను కుట్రప్రారంభించి తనపక్షమున నుండుటకై రామరాయల కడకు రాయబారులను బంపెను. ఈసుల్తానులలో నైకమత్యము లేకుండ జూచుటయే రాజనీతిగా బరిగణించుచున్నవా డగుటవలన సంతోషించి యతనితోడిమైత్రి కంగీకరించి యొడంబడిక గావించుకొనె నట. ఈసంగతి విజాపుర సుల్తానునకు దెలియవచ్చి యతడు తనయాస్థానమునం దున్నవిజయనగర రాయబారుల నవమానించెనట. వార లెట్లోతప్పించుకొని విజయనగరమునకు విచ్చేసి యాదుష్కృత్యమును రామరాయలకు విన్నవించి రట. [7] అంతరాయలాగ్రహముతో బీదరుసుల్తానగు ఆలీబరీదుషా విజాపురసుల్తా నగు ఇబ్రహీము ఆదిల్‌షాతో సఖ్యము చేసికొన్నాడు గనుక మున్ముందు కళ్యాణి దుర్గమును ముట్టడించుట మంచి' దని అహమ్మదునగర సుల్తానుకు దెలియ జేసెనట. ఈయుద్ధమును గూర్చి వ్రాయుచు ఫెరిస్తా రామరాయలుగాని హిందువులుగాని నిర్వహించిన కార్యమును లేశమాత్ర మైన నుదాహరించిన వాడుకాడు. శివతత్త్వరత్నాకర మనుగ్రంథమున నీయుద్ధమును గూర్చి ప్రస్తావించుచు నహమ్మదునగరసుల్తానున కిందుప్రవేశ మున్నట్లే యాగ్రంథకర్త చెప్పి యుండలేదు. ఇక్కేఱిమండలాధిపతి యగుసదాశివరాయకు డీయుద్ధమును సాగించుటకై అళియరామరాయనిచే నియమితుడై విజయనగర సైన్యముల కాధిపత్యము వహించి తొలుత కలుబరగిదుర్గమును ముట్టడింపగా విజాపురసుల్తాను బహుళసేనాసమన్వితుడై యెదుర్కొని యుద్ధము చేసెనట. ఈయుద్ధమున సదాశివనాయకుడు సంపూర్ణ విజయమును గాంచెను. విజాపురసుల్తాను పలాయను డయ్యె నట. ఇట్లు మొదటియుద్ధమున విజయమును గాంచిన సదాశివ నాయకుడుత్సాహ సంభరితుడై కళ్యాణిదుర్గమును ముట్టడింప బోవుచుండ మార్గమధ్యమున నళియరామరాయలువచ్చి వానినిగలిసికొనెనట. అటుపిమ్మట విజయనగర సైన్యములును, అహమ్మదునగర సైన్యములును కళ్యాణిదుర్గమును ముట్టడింపగా విజాపురసుల్తాను చెదరిపోయిన సేనలను మరల సమకూర్చుకొని మఱికొంతమూలసైన్యముతో దరలివచ్చి కళ్యాణిదుర్గమును ముట్టడించిన శత్రుసైన్యములకును, శత్రుస్కంధా వారమునకు నడుమ బ్రవేశించి శత్రుసైన్యములకు భోజనపదార్థములుగాని యాయుధసామగ్రిగాని లభింపకుండునటుల ప్రయత్నించెను. ఈకార్యమును నిర్వహించుటకై ప్రశస్తమైన విజాపురాశ్విక సైన్యమును నియోగించె నట. ఆహారపదార్థము లేవియు జేరకుండ మార్గము నరికట్టుటవలన శత్రువులసైన్యములకు దుర్భరమైన దుస్థితి సంభవించెను. అప్పుడు సుల్తాను పక్షమునను విజయనగరపక్షమునను ప్రతినిధిప్రముఖులు కొందఱు సమావేశమై ముట్టడి వీడి వెడలిపోవుట యుక్తమా? సాహసించి శత్రువులతో బోరి జయముగొనుట యుక్తమా యని యోజింప మొదలుపెట్టిరి. అహమ్మదునగర సుల్తానుపక్షమున నున్న 'షాజాఫర్, ఖాశింబేగు' అనువీరులును, విజయనగరమువారిపక్షమున సైన్యాధిపతి యగుసదాశివ నాయకుడును రెండవమార్గ మనుసరించుట యుక్తమని తెలుపగా నెల్లవారంగీకరించిరి. ఒకనాడు సూర్యోదయమైన వెంటనే యాయుభయసైన్యములవారు నాకస్మికముగా బోయి, ఇబ్రహీమ్‌ఆదిల్‌షా సైన్యములపై బడిరి. అపుడు విజాపుర సుల్తాను అభ్యంగన స్నానము చేయుచున్నవా డగుటచేత దప్పించుకొని పాఱిపోవుట కడుగష్టసాధ్యమయ్యెను. వానిసైన్యము లాశ్చర్యమును వెఱవునుగొని మందుగుండు సామాను సయితము యాపద్వస్తుసామగ్రిని శత్రువులకు విడిచిపెట్టి చెల్లాచెదరై పాఱిపోయి రట. ఈసమయమునందే సదాశివనాయకుడు ధైర్యసాహసముల జూపి శత్రువులతో బోరాడి కళ్యాణిదుర్గమును వశపఱచుకొని అళియరామరాయలవలన 'కోటికోలాహల' బిరుదమును గాంచె ననిశివతత్త్వరత్నాకర మను గ్రంథమువలన దెలియు చున్నది.[8] ఇప్పటినుండి యీదుర్గము రామరాయలవశమునం దున్నట్లే కనబడు చున్నది.

జమ్షీదుకుతుబ్షామరణము

క్రీ. శ. 1550 సంవత్సరమున గోల్కొండసుల్తా నగు జమ్షీదుకుతుబ్షా యనారోగ్యస్థితి యందుండి చంచలస్వభావుడై చీటికిమాటికి జిరాకుపడుచు స్వల్పదోషములకై ప్రజలననేకుల జంపించ నారంభించెను. వీనిదౌర్జన్యమును గాంచి ప్రజలు కంపిల్లు చుండిరి. వీనిసోదరు లయిన 'హైదరుఖాన్, ఇబ్రహీమ్‌' అనువారు బీదరునకు బఱు విడిరి. అచట హైదరుఖాను మరణము జెందెను. ఇతడు మరణించుటకు బూర్వము బీదరుసుల్తా నగు 'ఖాశింబరీదుషా' అహమ్మదు నగరము, గోల్కొండ, సుల్తానులతో యుద్ధముచేయుచు నోడిపోయి పాఱివచ్చుసందర్భమున ఇబ్రహీముయొక్క దుస్థితిని నందుగా జేసికొని యాతిథ్యమర్యాద నతిక్రమించి యాతని యేనుగులను, ధనమును చూఱగొన బ్రయత్నించెను. వీని దురాలోచనమును విని వెంటనే యిబ్రహీము విజయనగరమునకు బాఱిపోయి రామరాయలమైత్రి నపేక్షించెను. ఇబ్రహీము విజయనగరము ప్రవేశించినపుడు వీనితో సయ్యదుహై అబ్సీనియాదేశస్థుడును, హమీదుఖా ననుబిరుదమువహించిన రైహాన్, బ్రాహ్మణు డగుకాణాజియు, మఱికొందఱుసేనకులును కూడ నుండిరి. అళియరామరాయలు మిక్కిలిసంతోషించి యీగోల్కొండరాజకుమారుని నర్హోచితమర్యాదలచే నాదరించి వానిజీవనార్ధ మదివఱకు అబ్సీనియాదేశస్థు డగు అంబరుఖాను క్రింద నున్నజమీని ఇబ్రహీమున కొసంగెను. ఈకార్యము వలన ఇబ్రహీమునెడ అంబరుఖానును ద్వేషమును బుట్టించెను.

ఇట్లంబరుఖాను తనసంస్థానమునుగోల్పోయి విచారముతో దిరుగుచు నొకనాడు విజయనగరవీధులలో ఇబ్రహీమురాజకుమారునిం గలిసికొని తనజమీ నపహరించినవా డని దూషించెను. చక్రవర్తులు తమసొత్తును తమయిచ్చవచ్చి నటుల వినియోగించుకొందురు. రామరాయలుజమీనా కిచ్చుటకు నిచ్చగించె' నని ప్రత్యుత్తర మిచ్చి వెడలిపోవుచుండ నాయబ్సీనియాదేశస్థుడు ఇబ్రహీమును జూచి 'నీహక్కును కత్తితోసాధించి స్థాపించుకొనలేనిపిఱికిపంద' వని మరల దూఱెను. అంత నారాజకుమారుడు వానిని వివేకహీనునిగా గ్రహించెను. వీనిశాంతము వానికోపము నినుమడింప జేసెను. అంబరుఖా నధిక దూషనమునకు గడంగి వానిమనస్సు నొప్పింప జేసెను. ఆవెనువెంటనే ఇబ్రహీము గుఱ్ఱమునుండి క్రిందికి దుమికి కత్తి దూసెను. అంబరుఖాను వానిపై బడెను. ఇబ్రహీము తనప్రతిపక్షిని ఖండించి వైచెను. అంబరుఖాను సోదరుడుకూడ నిబ్రహీముపైకి లంఘింప నాతనిగూడ మట్టుపెట్టెను.

ఆసంవత్సరమె జమ్షీదుకుతుబ్షా గోల్కొండనగరములో మృతి బొందెను.

ఇబ్రహీముపట్టాభిషిక్తుడగుట

గోల్కొండనగరములోని ప్రభుపుంగవులు జమ్షీదుకుమారు డైన 'సుఖాన్‌కూలీ' అనువానిని వానితల్లికోరిక ననుసరించి పట్టాభిషిక్తుని గావించి 'సెయిఫ్‌ఖాను' పాలనకర్తగా నియమించిరి. ఈపాలనకర్త యదివఱకు జమ్షీదుకుతుబ్షాచే నొకప్పుడు ప్రపానశిక్షను బొంది యహమ్మదునగరమునకు బంపబడినవాడు. ఇతడు 'సుఖాన్‌కూలీ' కి సంరక్ష కుడుగ నుండుట గొందఱ కిష్టము లేకుండెను. ఈక్రొత్తసుల్తాను పదేండ్లయిన వయస్సులేని బాలుడు. అందువలన గొందఱుప్రభుపుంగవు లందుముఖ్యముగా బ్రధానమంత్రి యగు 'ముస్తఫాఖాను' వెంటనే బయలుదేఱి గోల్కొండకు రావలసినదిగా నిబ్రహీమున కొకజాబు వ్రాసి విజయనగరమున కొకరాయబారిని బంపెను. ఇబ్రహీ మాజాబును గైకొని కష్టకాలమున దనతోగూడ నున్న తనయిర్వురుమిత్రు లయిన సయ్యదుహై, హమీదుఖానులకు జూప వారలును సంతోషముతో గోల్కొండకు బోవ సమ్మతించిరి. ఇబ్రహీము తనకు మిత్రుడుగానుండి యాదరించిన రామరాయలతో గూడ నాలోచింప నతనియభీష్టమున కనుకూలముగానే ప్రత్యుత్తరమిచ్చుటయెగాక యాతనికి దోడ్పాటుగ నుండుటకై పదివేలయాశ్విక సైన్యమును ఇరువదివేలపదాతిసైన్యమును దీసికొని యిబ్రహీమువెంట బోవలసిన దనితనసోదరు డయినవేంకటాద్రి కుత్తరు వొసంగెను. ఈసందర్భమునగూడ ఫెరిస్తావ్రాయుచు దనకు రామరాయలయెడ గలయసూయను ద్వేషమును జూపక మానలేదు. ఇబ్రహీము మిత్రు లిర్వురును "రామరాయలు రాజ్యము నపహరింపగోరి యింతగొప్పసైన్యముతో సోదరుని పంపుచున్నాడుగావున నాతని సాహాయ్యమును దిరస్కరించి రావలసినదిగా నిబ్రహీమునకు బోధించి రనియు నత డట్లే గావించె ననియు వ్రాయుచున్నాడు. అతనివ్రాత విశ్వాసపాత్ర మైనదికాదు. హీరాసుఫాదిరి ఫెరిస్తావ్రాతను ఖండిం చినవా డయినను, ఇబ్రహీము వెంటవేంకటాద్రి విజయనగరసైన్యములతో వెంబడించిపోయినను పానుగల్లుచేరినవెనుక 'మీర్‌జుమ్లా' యగు 'ముస్తఫాఖాన్‌' మూడువేల యాశ్వికసైన్యముతో 'సలాబత్‌ఖాను' వచ్చి కలిసికొనుటచేత హిందూసైన్యములసహాయముతో నింకనిమిత్తములే దనివేంకటాద్రిని వానిసైన్యములను వెనుకకు బంపివేసె ననిక్రొత్త యూహను గల్పించి వ్రాయుచున్నాడు. ఏవిధమైనయడ్డంకును లేకుండ ముస్తఫాఖాను కుండుజనరంజకత్వముచేత నిబ్రహీము పట్టాభిషిక్తు డయ్యెనట! [9]

అయినను భట్టుమూర్తి తన 'నరసభూపాలీయము' నందు

          "నతుని వర్ధితుని దత్సుతుని బట్టముం గట్టి
           కుతుపనమల్కన క్షోణి నిలిపె" అని

తనరక్షణకోరివచ్చినవాని సంరక్షించి కుతుపనమల్కను పట్టాభిషిక్తుని గావించె ననిచెప్పి యున్నాడు. ఈమహాకార్యము రామరాయలసౌశీల్యతను దెలుపుటయెగాక యాతడెంతటియుదారహృదయుడో తేటపఱుపక పోదు.

విజాపురసుల్తానుతో మఱియొకయుద్ధము విజయనగరము అహమ్మదునగరసుల్తానుతో జేరి విజాపురసుల్తానుపై గడపటిదండయాత్రసలిపినవెనుక శాంతి నెక్కొలుప బడియుండ లేదు. 1551 సంవత్సరాంతమున విజాపురసుల్తాను కళ్యాణిదుర్గమును స్వాధీనపఱచుకొనుటకై పున:ప్రయత్నముసేయ మొదలుపెట్టెను. ఈసమాచారము బురహాన్‌నిజాముషాకు దెలియవచ్చినతోడనే యతడు రామరాయలకు దెలియ జేసెను. అంతరామరాయలు తాను రాచూరుదుర్గముకడ బురహాన్‌నిజాముషా సైన్యములతో గలిసికొందు ననియు నచటినుండి యుద్ధసన్నాహములు జరుపవచ్చు నని రాయబారులకు బ్రత్యుత్తర మొసంగి వారలను బంపివేసి తనవాగ్దత్తము నెఱవేర్చుకొనుటకై తనసేనలను సమకూర్చుకొని దండయాత్ర సాగించి రాచూరుకడ నహమ్మదునగరసుల్తాను సైన్యములను గలిసికొని తాను రాచూరు, ముదిగల్లుదుర్గములను వశపఱచుకొనుటకును, షోళాపురము, కలుబరిగెదుర్గములను వశపఱచుకొనుటకై బురహానుకు దోడ్పడుటకు నేర్పాటు చేసి కొనియెను. ఉభయసైన్యములును రాచూరుదుర్గమును వశపఱచుకొన్న వెనువెంటనే ముదిగల్లుదుర్గముకూడ నెట్టియాటంకమును నిరోధమునుజూపకయె స్వాధీన మయ్యెను. రామరాయలు తనపిన్నతమ్ముని వేంకటాద్రిని నిజాముషాకు దోడ్పడనియమించి తానుమాత్రము విజయనగరమునకు మరలివచ్చెను. బురహాన్‌నిజాముషా వేంకటాద్రితోడ్పాటుతో గొలదికాలము షోళాపురమును వశపఱచుకొని యాదుర్గమును బలపఱచుకొని యహమ్మదునగరమునకు మరలిపోయెను. విజాపురసుల్తానులచరిత్రమును వ్రాయునపుడు ఫెరిస్తా కలుబరిగె సమాచారము నెత్తియుండలేదుగాని యహమ్మదునగరసుల్తా నుల చరిత్రము వ్రాయునపుడు నిజాముషాకలుబరిగెను జయింపలేదనియు: గారణముహిందూసేనాని వేంకటాద్రి తొలగిపోవుటయే యని తెలిపియున్నాడు. ఏదియో అభిప్రాయభేదము గలిగి వేంకటాద్రి విజయనగరమునకు మరలి యుండును. అందువలన నిజాముషా తనకోరికను నెఱవేర్చుకొన లేకపోయి యుండును. అయిననుబురహాను నిజాముషా యావెనుకస్వల్పకాలములోనే మరణము బొందెను. అతనివెనుక సింహాసన మధిష్టించిన హుస్సేనునిజాముషా విజాపురసుల్తా నగుఇబ్రహీముఆదిల్‌షాతో సంధి చేసికొని స్వస్థచిత్తుడుగా నుండెను. అహమ్మదునగరము, విజాపురము నడుమ జరిగినయుద్ధములలో రామరాయలు తొరగల్లుదుర్గమునుగూడ వశపఱచు కొనియె ననిఫెరిస్తా వ్రాసి యున్నాడు.

ఇంతవఱకు విజాపు రాహమ్మదునగరసుల్తానుల నడుమ జరుగుచువచ్చిన యుద్ధములలో నహమ్మదునగరసుల్తాను పక్షమున జేరి రామరాయలు విజాపురసుల్తానుతో యుద్ధములు చేయుచుండెనుగాని 1551 సంవత్సరాంతము నుండి విజాపురసుల్తానుపక్షము నవలంబించి గోలకొండసుల్తా నగుకుతుబ్షాతోను, అహమ్మదునగరసుల్తా నగునిజాముషా తోను యుద్ధములు సలుపుచుండెను.

కలుబరిగె యుద్ధము

1555 సంవత్సరమున గోలకొండసుల్తానగు ఇబ్రహీమ్‌కుతుబ్షా అహమ్మదునగరసుల్తా నగు హుస్సేనునిజాముషా విజాపుర రాజ్యములోని కలుబరిగెదుర్గమును ముట్టడించుటకును, అందుకొఱకు దానుదోడ్పడుటకు నాతనితోనొడంబడికచేసికొని యుభయులును గలిసి కలుబరిగెదుర్గమును ముట్టడించిరి. కలుబరిగెదుర్గము సమభూమియందు నిర్మింపబడిన దయినను బలాడ్యమైనదిగ నుండెను. ఒకనెలదినములు మాత్రము దుర్గములోని సైన్యములు శత్రువులదాడిని నిలువరింప గలిగినవిగాని యటుపిమ్మట సుస్థిరముగా నిలుచుండి పోరాడుటకు శక్తిలేనివై తమదుస్థితి నంతయు సుల్తానునకు విన్నవించుచు దుర్గమును సంరక్షించుకొనవలసిన దనివర్తమానము పంపిరి. అంతనతడు తానొంటరిగ వారితో దలపడిన ప్రయోజనము లేదని తలపోసి తనకు దోడ్పడవలసినదిగా గోరుచు రామరాయలకడకు విజయనగరము రాయబారులను బంపెను. అతడు పంపినబహుమానములను గైకొని రామరాయల లశేషసైన్యములతో దానేయాధిపత్యమును వహించి ఇబ్రహీముఆదిల్‌షాకు దోడ్పడ బయలుదేఱెను. అట్లుబయలుదేఱిపోవుచు నీక్రింది జాబును గోలకొండసుల్తా నగుఇబ్రహీముకుతుబ్షాకు బంపించెనట !

"అనేక సంవత్సరములనుండి విజాపురరాజ్యమువారును అహమ్మదునగరరాజ్యమువారును దమలో దాము పోరాడుచుండెడివా రనియు, వారెదుగుబొదుగులులేక సమానబలము గలవార లయి ప్రతిసంవత్సరము వారిలో నెవ్వరో యొకరు ప్రతిపక్షమువారి సరిహద్దులలో యుద్ధమునకు సంసిద్ధులై యుం డుటయు, అట్లయ్యు నదియెవ్వరికి లాభకారిగా నుండకుండుటయు మీ రెఱుంగనిది కాదు: ఇదివఱ కెన్నడును మీపూర్వులెవ్వరు నిట్టివివాదములలో నెట్టిజోక్యమును కలిగించు కొనలేదు. అయినను ఇప్పుడు మీరు విజాపురసుల్తాను ఇబ్రహీమ్‌ఆదిల్‌షా మీకుశత్రువుగాకపోయినను అహమ్మదునగర సుల్తాను హుస్సేనునిజాముషాను గెలిపించుటకై వానిపక్షము వహించినారు. ఇబ్రహీమ్ ఆదిల్‌షా మాసహాయ్యమును కోరెను. మీరును మేమును కొంతకాలమునుండి సఖ్యతగా నుంటిమి. మీరీదండయాత్రలో హుస్సేనునిజాముషాకు దోడ్పడక శాంతముగా మీరాజధానికి మీరు మరలిపోయినయెడల యాయుభయరాజ్యములవారును వైరములను బెంచుకొనక సంధిచేసికొని సుఖముగా నుందు రనుతలంపుతో మాయీవాదమును ముందుగామీకు నివేదించుచున్నాము."

ఇట్టిబావమును దెలుపుజాబు తనమిత్రు డయినరామరాయలవద్దనుండియును, అట్టిదే మఱియొకజాబు విజాపురసుల్తాను వద్దనుండియును, ఒక్కమాఱుగా వచ్చుట సంభవించి యిబ్రహీమ్‌కుతుబ్షామనస్సును గలవరపఱిచెను. ఇంతియగాక రామరాయలతమ్ముడు తిరుమలరాజు తనయాశ్విక సైన్యముతో విజాపురసైనికుల దోడుచేసికొని పానుగల్లుమండల మాక్రమించుకొను చున్నా డనుసమాచారముగూడ దెలియవచ్చెను. అంతధైర్యము చెదరి గోలకొండసుల్తాను తనదండయాత్రను విరమించి యర్థరాత్రమువేళ తానదివరకుహుస్సే నిజాముషాతో జరిపిన సంధిషరతులతోగూడి యున్నప్రమాణపత్రమును భంగపరచి తనరాజధాని యైనగోలకొండదారి బట్టెను. ఉదయమున నీవార్త అహమ్మదునగర సుల్తానుకు దెలియరాగానే యింకనుయుద్ధముసాగించుట నిష్ర్పయోజనమనియెంచి యాతడు తనసైన్యములను మరలించుకొని యహమ్మదు నగరమునకు వెడలి పోయెను. ఇందు పైనివివరించిన జాబు వాస్తవ మయినదిగా మనము విశ్వసింపరాదు. గోలకొండసుల్తాను దర్బారులో నున్నయొక యనామక చరిత్రకారుడు తనప్రభువుగౌరవమును నిలువ బెట్టుటకై కల్పించినదిగా గన్పట్టుచున్నది. తిరుమలదేవరాయలు తనరాజ్యమును (గోలకొండ) నాక్రమించుకొను నన్నభయముచేత ఇబ్రహీముకుతుబ్షా కలుబరిగె ముట్టడినివిడనాడి స్వరాజధానికి బఱువెత్తి ననుట నిశ్చయ మనిచెప్పవచ్చును. [10]

మఱియు విజాపురసుల్తానుపై దిరుగబడిన 'ఐన్ - ఉర్‌ముల్కు'ను విజాపురరాజ్యమునుండి తఱుముటకై రామరాయలు తనతమ్ముని వేంకటాద్రిని నియోగించెను. ఇట్లునియోగింపబడి వేంకటాద్రి యాతనినోడించి రాజ్యమునుండి వెడల గొట్టగా నత డహమ్మదునగరమునకు బాఱిపోయెనుగాని హుస్సేనునిజాముషా యచట వాని జంపించెను. 1557 వ సంవత్సరమున విజాపురసుల్తాను ఇబ్రహీమ్‌ఆదిల్‌షా మరణము జెందుటయు, వానికుమారుడు 'ఆలీఆదిల్‌షా' పట్టాభిషిక్తుడగుటయు సంభవించెను. ఈయువకుడు తనతండ్రికాలమున రాజ్యమునకు సంభవించిన నష్టములను కూడదీసికొని రాజ్యమును బలపఱచుకొనుటకై రామరాయలతో నత్యంతమైత్రి నెఱపుటకు బ్రయత్నించెను.

ఆలీఆదిల్‌షాపిన్నవా డగుట సందుచేసికొని హుస్సేనునిజాముషా యసంఖ్యాకము లగుసైన్యములతో విజాపురరాజ్యముపై దండయాత్ర వెడలెను. యువకు డయినవిజాపురసుల్తాను భయపడి స్వరాజ్య సంరక్షణమునువీడి నూర్గురురౌతులతో రామరాయలరక్షణము నాశించి విజయనగరమునకు వెళ్లెనట. ఆకాలమున రామరాయలపుత్త్రు డొకడు మరణించుటచేత నాసమయమును బురస్కరించుకొని పుత్రదు:ఖోప శాంతికై తానే స్వయముగా వచ్చితి ననిచెప్పి దు:ఖోప శమనవాక్యముల రాయల నోదార్చె ననియు, ఆత్యడు దయతో నాదరించెననియు, ఆతనిపట్టమహిషి ఆలీఆదిల్‌షాను దత్తపుత్త్రునిగా స్వీకరించె ననియు, సమ్మానార్హ సంభాషణంబులతోడను పరస్పర బహుమాన సత్కారములతోడను మూన్నాళ్ల ముచ్చటలు ముగిసినవెనుక తనయావద్విశిష్ట సైన్యములతో నహమ్మదునగరముపై దాడివెడల బ్రేరేపింప బడెననియు ఫెరిస్తావ్రాసియున్నాడు. కాని యింతచేసినను రామరాయలు వానికిదోడ్పడలే దనియు, ఆలీఆదిల్‌షా యొక్కడే విజయనగరమును విడిచివచ్చె ననియు, అప్పటినుండి విజాపురసుల్తాను దానిని మనస్సులోనుంచుకొని వానిపై పగవహించి యుండెనని ఫెరిస్తా వ్రాసియుండెను. ఇదివట్టియబద్ధమైనది. వానచినుకుల సంఖ్య కంటె నధికసంఖ్యకల సైనికులతో వారిరువురును నిజాముషారాజ్యముపై దాడివెడలి రనియు, వానిరాజ్యమునంతయునాశనము చేయగా దేశములోనిప్రజలు పరస్థలములకు వలసపోవుటచే బెక్కుమైళ్లు బీడుపడిపోయె ననియు, హుస్సేనునిజాముషా వారల నెదుర్కొనలేక అహమ్మదు నగరమును విడిచి పైఠనునకు బాఱిపోయె ననియు, తరువాత కొంతకాలమునకు, కళ్యాణిదుర్గమును ఆలీఆదిల్‌షాకు సమర్పించుకొని సంధిగావించుకొనె ననియు, 'బురహాన్ - ఈ - మాసీర్‌' అను గ్రంథమున వక్కాణింపబడి యుండెను. మఱియు

           "పదిలుడై రాచూరుముదిగల్లుగప్పంబు
            సేయ గాంచ సపాదు సీమనిలిపె"

నని, రాచూరు, ముదిగల్లుదుర్గములు గప్పముగాగైకొని విజాపురసుల్తానును మరల నిజరాజ్యమున నిలిపె నని భట్టుమూర్తికూడ తన 'నరసభూపాలీయ' మనుగ్రంథమున స్పష్టముగనుడివి యున్నాడు.

మఱియొక యుద్ధము

శత్రుసైన్యము లహమ్మదునగరమును విడిచివెళ్లినతోడనే హుస్సేనునిజాముషా ఇబ్రహీమ్‌కుతుబ్షాతో సంధిగావించుకొని తనశత్రువుని కర్పించినకళ్యాణిదుర్గమును స్వాధీనపఱచు కొనుటకై దండయాత్ర సాగించెను. ఆలీఆదిల్‌షా యీవార్త విన్నవాడై రామరాయలసాహాయ్యమునకై వెంటనే కిన్వరఖానును, ఆబూ తురాబును విజయనగరమునకు బంపించెను. అంతరామరాయ లుపేక్షవహింపక గొప్పసైన్యముతో విజాపురసుల్తానును గలిసికొనుటకై బయలుదేఱి వచ్చెను. అప్పుడు రాయలును, విజాపురసుల్తానును గలిసి తమపూర్వసంధినిబంధనల ననుసరించి తమకు వచ్చితోడ్పడవలసిన దనిగోల్కొండ సుల్తా నగుఇబ్రహీమ్‌కుతుబ్షాకు నొకజాబును బంపిరి. ఇబ్రహీముకుతుబ్షా తనమిత్రు డయినహుస్సేనునిజాముషాకు వ్యతిరేకముగ వ్యవహరించుటకు తనకెంతయిష్టములేకున్నను సంధి షరతులను నిరాకరించి ప్రవర్తించినా డన్ననిందనుబొందుట రాజనీతిలక్షణము కాదని తలంచి తానుగూడ కొంతసైన్యముతో బయలుదేఱివచ్చి రాయలసైన్యములను గలిసికొనియెను. వీరలతో బీడరుసుల్తా నగుఆలీబరీదుషాకూడ వచ్చి చేరుకొనియెను. ఇట్లసంఖ్యాకము లగుమిత్రసైన్యము లహమ్మదునగరమును ముట్టడించుటకై బయలుదేఱెను. విజయనగరసైన్యములు దారిపొడవునను పట్టణములనక పల్లెలనక యహమ్మదునగరరాజ్యము నంతయు ధ్వంసముచేయు చుండిరట. ఇట్టిబలాడ్య మగుశత్రుసైన్యమును నిరోధించుట తనకు సాధ్యముకాకపోవుటచేత హుస్సేనునిజాముషా రాజధానీ సంరక్షణార్ధము తగినంతసైన్యమును, సమృద్ధికర మైనయాహారసామాగ్రిని కోటలో నుంచి తాను తప్పించుకొనిపోయి జూనారు దుర్గమున దాగి యుండెను. ఇట్లుండ నతనియాంతరంగికమిత్రు డయినఇబ్రహీమ్‌కుతుబ్షా తాను రాజనీతిప్రాముఖ్యత ననుసరించి వానిశత్రుపక్షమున జేరినను తనహృదయము హుస్సేనునిజాముషా పక్షముననే యుండె ననియు, తాను శత్రుపక్షమున నున్నను వానికి దోడ్పడుదు ననియు, సాధ్యమగునంతకు దనశక్తియుక్తులను బ్రయోగించి శత్రువులను యుద్ధవిముఖులను గావించి మరలిపోవు నట్లుచేయుచు ననియురహస్యముగా నొకజాబువ్రాసి నిజాముషాకు బంపించెను. ఇట్లే అహమ్మదునగరదుర్గమును గాపాడుచున్నసేనాధిపతికి వ్రాయుచు, దుర్గమును వశపఱచక కడవఱకు బట్టుదలతో సంరక్షింపవలసిన దని ప్రోత్సాహపఱచుచు మఱియొకజాబు బంపించెను.

మిత్రసైన్యము లహమ్మదునగరదుర్గమును ముట్టడించి మిక్కిలిపట్టుదలతో రెండుమాసములవఱకు విడువకయుండుట చూచి ఇబ్రహీముకుతుబ్షా యుపేక్షాపరుడై యూరకుండక విజయనగరసేనానులకు లంచముల నొసంగుచు వర్షాకాలము సమీపించుచున్నదిగావున ముట్టడిమాని వారివారిసైన్యములు వారివారిదేశములకు బోవుటమంచి దనిరామరాయలకు జెప్పి మరలింపవలసిన దనిప్రోత్సాహ పఱచుచుండెను. మొదటరామరాయలు తనసేనానులు చెప్పెడుసలహాలనుబాటించి వెనుదీయుట కంగీకరించెనుగాని విజాపురసుల్తాను దీని నంతనుగ్రహించి రామరాయలకడకువచ్చి ముట్టడివిడనాడిపోవల దనియు, దుర్గములోనివారికి భోజనపదార్థములు సన్నగిలిపోవుచున్నం దున ద్రొక్కటపడుచున్నారనియు, కనీసపక్షమింకొకమాసమయిన ముట్టడివిడువక కృషిసలుపవలయు ననియు బహువిధముల బ్రార్థింపగా రామరాయ లంగీకరించి దుర్గమును స్వాధీనపఱచుకొనుటకై గట్టిప్రయత్నము సేయవలసిన దనితనసేనానుల కెల్లరకు నుత్తరు వొసంగెను. అంతటితో నిరుత్సాహము జెంది యూరకొనక గోలకొండసుల్తా నగు ఇబ్రహీముకుతుబ్షా అహమ్మదునగరమునుండి దుర్గములోనివారికి నాహార పదార్థములు తనసైన్యమునడుమనుండిచేర్చుటకును, ఫిరంగులు కాల్చెడుమనుష్యులు దుర్గములోనికి బోవుటకును రహస్యముగా మార్గముల నేర్పాటు గావించెను. కాని విజయనగర సైన్యములు మిగులదీక్షతో బోరాడుచు దుర్గప్రాకారములను సమీపించుటనుగాంచి సహింపజాలక అహమ్మదునగరమును గొప్పవిపత్తునుండి తప్పించవలయు నన్నదృడనిశ్చయముతో ఇబ్రహీమ్‌కుతుబ్షా కడపటిప్రయత్నము గావించెను. తనకు ముఖ్యమంత్రియు సైన్యాధ్యక్షుడును నగుముస్తఫాఖానుని రప్పించి యెట్లయినను ముట్టడిమాను నట్లురామరాయలను బ్రేరేపింపవలసిన దనియు, వినకున్న తమసైన్యములు ముట్టడినిమాని గోల్కొండకు మరలిపోగల వనిచెప్పి రావలసినదిగా రాయలకడకు బంపించెను. అట్లారాయబారమును శిరసావహించి రాయలకడకు బోయి శక్తికొలదియుక్తి వాదములను సర్వవిధముల గావించి తుదకురహస్యముగా దనప్రభువుపక్షమున ముట్టడిమాని మరలిపోయినపక్షమున కొండపల్లిసర్కారును తద్దుర్గము నొసంగుదు మని వాగ్దత్తముచేసెను. రామరాయలందునకు సమ్మతించి వెంటనే ముట్టడిమానివేయవలసిన దని సేనానుల కాజ్ఞచేసి యావిషయమును విజాపురసుల్తానుకు దెలియజేసెను. అంతరామరాయలును, విజాపురము, గోల్కొండ, బీడరుసుల్తానులును తమతమసైన్యములను మరల్చుకొనిపోయి సురక్షితముగా దమతమరాజధానులను జేరుకొనిరి.

కాని యిట్టిసాహాయ్యమును ఇబ్రహీమ్‌కుతుబ్షా చేసి నందుకు హుస్సేనునిజాముషా పరమానందమునుబొంది యామరుచటిసంవత్సర మనగా 1558 సంవత్సరమున కుతుబ్షాతో వివాహసంబంధము కలిగించుకొన గోరి మౌలానా ఇనాయతుల్లాను గోల్కొండనగరమునకు బంపించెను. ఉభయసుల్తానులు నాసంవత్సరమున కళ్యాణిదుర్గసమీపమున గలిసికొనుటకును, అచ్చట తనకొమార్తను హుస్సేను ఇబ్రహీమున కిచ్చివివాహము చేయుటకును, ఆమహోత్సవము ముగిసిన వెనుక నుభయులసైన్యములును కళ్యాణిదుర్గమును ముట్టడించి స్వాధీనపఱచుకొనుటకును మఱియొకసంధి గావించుకొనిరి.

ఆప్రకార మేర్పాటుచేసికొన్న కాలమునకు సరిగానుభయసుల్తానులు నదివఱకే సమకూర్చుకొన్న సైన్యములతో వచ్చి నియమితస్థానమున గలిసికొనిరి. అచటవారనుకొన్న రీతిని హుస్సేనునిజాముషా తనపెద్దకొమరిత 'బీబీజామల్లీ' అనునామెను మహావైభవముతో ఇబ్రహీముకుతుబ్షాకు నొసంగి వివాహముగావించెను. ఇట్టిమహోత్సవములతో నొక నెల పోనిచ్చి యుభయసుల్తానులును కళ్యాణదుర్గమును ముట్టడించుటకై ప్రయాణభేరి మ్రోగించిరి. ఈవృత్తాంతము నంతయు జారులవలన విన్నవాడై విజాపురసుల్తా నగుఆలీఆదిల్‌షా భయకంపితచిత్తుడై వెంటనే విజయనగరమునకు బోయి రామరాయలను దోడ్పడరావలయు ననిప్రార్థించెను. రామరాయ లెంతమాత్రమును జాగుసేయక యసంఖ్యాకములగు సైన్యములతో బయలుదేఱి వచ్చెను. మార్గమధ్యమున నదివఱకే యాహ్వానింపబడిన బీడరుసుల్తా నగుఆలీబరీదుషాయును, బీరారుసుల్తా నగుబురహాన్ ఇమద్‌షాయును, తమ తమసైన్యములతో వచ్చి గలిసికొనిరి. వీరిస్థితి యిట్లుండగా నచట నహమ్మదునగర గోల్కొండసుల్తానులు నానావిధములయినవగు 700 ఫిరంగులతోడను, ఏనూ రేనుంగులతోడను బయలుదేఱి కళ్యాణిదుర్గమునకు 12 మైళ్ల దూరమున దండు విడిసిరి. వీరలాదుర్గమును సమీపించి శిబిరముల నేర్పాటుచేసి కొనకపూర్వమె దైవవశమున నొకగొప్పగాలివాన సంభవించి నల్లరేగడభూమితో గూడియున్న యాప్రదేశము నంతయు బెనురొంపిగ మార్చివేసెను. బండ్లు, పశువులు, ఫిరంగులు మొదలగునవి బురదలో గూరుకొనిపోయి కదల్పుటకు సాధ్యముగాక నిరుపుయోగము లయ్యెను. గుడారము లన్నియు నెగిరిపోయి బురదనేలను బొరలాడు చుండెను. ఇట్టిస్థితియందుండగానే రామరాయలసోదరుడు ప్రసిద్ధ సేనాధిపతి వేంకటాద్రియు, జగదేవరావును, పదునైదువేల యాశ్వికసైన్యము తోడను ముప్పదివేలు పదాతిసైన్యములతోడను గోల్కొండపై దండెత్తి వచ్చుచున్నా రన్నవిషయము ఇబ్రహీముకుతుబ్షాకు దెలియవచ్చెను. అతడు భయకంపితచిత్తుడై కాలమనుకూలముగ లేదనిచింతించి హుస్సేనునిజాముషాతో జక్కగా నాలోచించి కల్యాణిదుర్గమును ముట్టడించుట మానుకొని స్వరాజధానులకు జేరుకొనుట క్షేమదాయక మని నిశ్చయించుకొనిరి. అయినను హుస్సేనునిజాముషా రామరాయలతో సంధి గావించుకొనుటకై ఖాసింబేగును, మౌలానాఇనాయతుల్లానం రామరాయలకడకు బంపెను.

అప్పుడు రామరాయ లీక్రిందినిబంధనలకు నిష్టపడినయెడల సంధి కుదురు ననివక్కాణించెనట.

(1) కళ్యాణిదుర్గమును విజాపురసుల్తానుకు విడిచిపెట్టి యందునిమిత్తము మరల వివాదము సలుపకుండుట.

(2) దురియాఇమ్మదుముల్కు సైన్యముల కధిపతిగానున్న జహంగీరుఖానును సంహరించుట.

(3)హుస్సేనునిజాముషా రామరాయలయాధిక్యత నంగీకరించి నట్లుగాగ్రహించుటకుగా నతడు రామరాయలను సందర్శించుటకును, అతడు తనహస్తములతో నొసంగిన తమలపాకులను వక్కలను (తాంబూలమును) హుస్సేనునిజాముషా స్వహస్తములతో గైకొనుట. తనరాజ్యమును సంరక్షించుకొనుటకై హుస్సేనునిజాముషా యీషరతుల కంగీకరించెను. ఇట్లంగీకరించి జహంగీరుఖానుని వానిగూడారములోనే సంహరించుటకై హంతకులను నియమించి యాకార్యమును ముగించెనట. ఒకపాషండుని మాట విశ్వసించి తనకు మిక్కిలి విశ్వాసపాత్రుడైన భక్తుని సంహరించి హుస్సేనునిజాముషా రాజులనెన్నడువిశ్వసింపరా దన్న లోకసామెతను సార్థకపఱచినా డనిఫెరిస్తా నిందించినాడు. తరువాత హుస్సేనునిజాముషా రాయలను సందర్శించి మూడవనిబంధనను నెఱవేర్చెను.

కాని యతడు దురహంకారముతో హిందూరాజగు రామరాయల హస్తస్పర్శవలన దనహస్తమునకు గలిగినమాలిన్యమును బోగొట్టుకొనుటకై వెంటనే నీళ్లు తెప్పించుకొని చేతులు కడుగుకొనె నట.

రామరాయలును హుస్సేనునిజాముషా నాకతిథియైనందున సహించితినిగాని లేనియెడల నాతనిచేతులను నఱికి వానిమెడకు వ్రేలాడగట్టియుందు ననితనబాషలో పలికి తానుగూడ నుదకములను దెప్పించుకొని చేతులను కడుగుకొనెనట. ఇదియెట్టిదైనను వారిరువురకు బద్ధవైషమ్యము గలదని చదువరులకు దేటపఱచక పోదు. హుస్సేనునిజాముషా పక్షమున ఖాశింబేగు, మౌలానాఇనాయతుల్లాయును, విజయనగరము పక్షమున తిరుమలవేంకటాద్రులు నుండి సంధిపత్రమును వ్రాసి చేవ్రాళ్లు చేసి ముగించిరి. విజయనగర హిందూపాషండు నిదివఱ కెన్నడును జేయని ఘోరకృత్యముల నీరెండు దండయాత్రల యందును గావించి రనిఫెరిస్తా వ్రాసి యున్నాడు.

మహమ్మదీయ దండయాత్రలలో మహమ్మదీయులు హిందువులపట్ల చూపినదుష్టమార్గములనే విజయనగర హిందువులును ఈదండయాత్రలలో మహమ్మదీయులపట్ల జూపియుందు రనిమనము విశ్వసింపవచ్చును. ఇట్టిపద్ధతులు మహమ్మదీయు లవలంబించినను హిందువు లవలంబించినను నర్హనీయములే యనుసత్యమును ఫెరిస్తా గ్రహించి యుండినయెడల తానువ్రాసినచరిత్రమున కెంతోమెఱుగు గల్పించినవా డయి సర్వజనశ్లాఘాపాత్రుడై యుండును. హింసహింసను వృద్ధి గావించును. ద్వేషముద్వేషమునే పెంచునుగాని సఖ్యత నొనగూర్ప జాలదు.

అబ్దుల్లాతో యుద్ధము

ఈకాలముననే విజాపురసుల్తానుకు పక్కలోబల్లెముగా నుండి భయమునుపుట్టించెడు జ్ఞాతిసంబంధమయిన వివాదము మఱియొకటి విజయనగరమువారితోడ్పాటువలన దుదముట్టినది. ఇబ్రహీమ్‌ఆదిల్‌షా బ్రదికియున్న కాలముననే వానియన్న కుమారుడు 'అబ్దుల్లా'యను నాతడు తనసోదరుడు పెట్టుబాధలనుండి తప్పించుకొని గోవానగరమునకు బోయినవెనుక వానిమిత్రులచే విజాపురసుల్తానుగా బ్రకటించుకొనవలసినదని ప్రేరేపింప బడియెను. ఆదిల్‌షా సామంతులలో బ్రముఖుడుగా నున్నవాడును బెల్గాముదుర్గాధిపతియు నగునసాదుఖాను వారిలోనొకడుగా నుండెను. ఇతడు గోవాకెప్టె నగు 'డోమ్ గర్సియా' (Dom Garcia) తో నిందువిషయమై యుత్తర ప్రత్యుత్తరములు జరుపు చుండెను.

విజాపురసుల్తానగు 'ఇబ్రహీముఆదిల్‌షా' కు బదులుగా ఘూర్జరమునకు (Guzarat) వలసపోయిన 'అబ్దుల్లా' రాకొమరుని రప్పించి విజాపురమునకు నిజమైనసుల్తానుగా నిలిపినయెడల కొంకణదేశము నంతయు బుడతకీచులకు (Portuguese) వశపఱతు ననివాగ్దత్తము చేసెను. ఇందుకునాతడు మిక్కిలిసంతోషించి కాంబేలో నున్నయాతనికి నొకలాతీన్‌చేకబురు పంపెను. అంత అబ్దుల్లా కొంతకాలమునకు దనకుటుంబముతో గోవానగరమునకు వచ్చెను. ఆకెప్టెను ఒకమహారాజునకుస్వాగత మొసంగి నట్లుగానాతనికి మన:పూర్వక మైనస్వాగతము నొసంగి జెన్యూటుకాలేజికి సమీపమున నున్నయొక దివ్యసుందరభవనమున నాతని బ్రవేశపెట్టి యొకగొప్పవిందు గావించెను. ఎవ్వనిస్థానమున డోమ్‌గర్సియా కెప్టెనుగా నియమింపబడెనో యాస్థానాధిపతి యైన 'డోమ్‌మార్టిన్‌ఆఫాంచోడిసౌజా' (Dom Martin Affonso De Souza) గోవానగరమునకు వచ్చి తనయుద్యోగమును మరల వహించెను. ఇబ్రహీముఆదిల్‌షా తనపూర్వస్నేహమును బాటించి తనసోదరుని గోవానగరమునుండి వెడల జేయవలయు ననివెంటనే రాయబారులను బంపెను. ఆవెనువెంటనే అసాదుఖానుగూడ తనపూర్వవాగ్దత్తమును జ్ఞప్తికి దెచ్చుచు రాయబారులను బంపెను. అందువిషయమై వారిరాజ్యాంగసభలో తీవ్రమైనచర్చ జరిగెను. విజాపురసుల్తానుతో గలపూర్వసాంగత్యమును బురస్కరించుకొని 'అబ్దుల్లా' వ్యవహారమును వదలుకొనుటయె పర్యవసానముగ నేర్పడియెను. ఇయ్యది ఇబ్రహీమునకు సంతృప్తికలిగింప జాల దయ్యెను. అబ్దుల్లా గోవానగరముననుండుటయె తనకపాయకర మనియెంచి తనసోదరుని తనవశముచేయ వలసిన దనియతడు కోరెను. అతడు తన ప్రభుత్వమున కతిథిగా నుండుటవలన వారందుల కియ్యకొన రైరి. అతనిదూరదేశమునకునైన బంపివేయవలసిన దనియిబ్రహీము ప్రార్థించెను. అందునకు వారంగీకరించి విజాపురరాజ్యమున కెట్టియపాయము కలుగకుండునటుల వానిని కన్ననూరునకు బంపిరి. అప్పుడు విజాపురసుల్తాను 1546 వ సంవత్సరము ఆగష్టు 22 వ తేదీని సాల్‌సెట్టి, బర్డెజ్, పర్గాణాలను పోర్చుగీసు వారికి నొసంగెను. అయినను కొంతకాలమైనవెనుక అబ్దుల్లా గోవానగరమున మరల గానిపించెను. అబ్దుల్లాను మలాకాద్వీపమునకు బంపెద ననిసుల్తానుకు గోవాగవర్నరు వాగ్దత్తము చేసెను గాని యెన్నడును నెఱవేర్ప దలంపలేదు.

కొన్నిసంవత్సరములయిన వెనుక 'డోమ్‌పెడ్రోమాస్కెరెనుహాను' గోవాగవర్నరుగానియమింప బడెను. అహమ్మదునగరసుల్తా నగుబురహాన్‌నిజాముషా దురదృష్టవంతు డయిన అబ్దుల్లాను విజాపురసుల్తానుగా బట్టాభిషిక్తుని గావించి పెండాదుర్గమును స్వాధీనపఱచు కొనవలసిన దనిగవర్నరును కోరెను. ఎట్లయిన తనపొరుగువా డయినవిజాపురసుల్తానుని నాశనము జేయవలయు ననినిజాముషా తలపోయు చుండెను. ఈపద్ధతిగోవాగర్నరు తలకెక్కినవెంటనే యాతడు తనమందిరమున కెదుటనున్న యొకచదరమున బంగారుపూతవేయబడిన యొకపట్టువస్త్రమును బరిపించి మహోన్నత మైనయొక రంగమును నిర్మాణముచేసి గోవాపౌరులను, పోర్చుగీసువారిని, ఇంకను అబ్దుల్లామిత్రు లయినవిజాపుర సామంతులను నాహ్వానించి వారలసమక్షమున రాజకుమారు డయిన అబ్దుల్లా ఆదిల్‌షా విజాపురసుల్తా ననివక్కాణింపుచు తానేకిరీటమును వానిశిరస్సున నిడెను. ఇందునకు క్రొత్తసుల్తాను తనకృతజ్ఞతను దెలుపుచు 'సాల్ సెట్టి, బర్డెజ్‌' పరగణాలపై దనకుగలహక్కు నంతయు వదలుకొంటినని ఉచ్ఛైస్వరమునఘోషించెను. ఈయ పూర్వమహోత్సవము ముగిసినవెనుక గవర్నరుగారు 3000 పదాతిసైన్యమును 200 గుఱ్ఱపుదళముతోడ్పాటుతో విజాపురసుల్తాను స్వాధీనముననున్న పెండాదుర్గమును వశపఱచుకొనవలసినదిగాబంపెను. ఆశ్వికసైన్యము గోవాకెప్ట నగుగస్పారు 'డిమెల్లొ' గారియాధిపత్యమున మొదట పంపబడెను. అటుపిమ్మటపదాతిసైన్యము "ఫెర్నాండోమార్టిన్సుఫ్రీరి, మార్టిమ్‌అఫాంసోడిమిరాండా, డోమ్‌ఫెర్నాండొమాన్‌రాయ్, డోమ్‌అంటానియోడినొరోన్‌హా, సెబాస్టియోడిసా," అనునైదు గురుసేనానులయాధిపత్యముక్రింద నునిచి పంప బడియెను. ఇట్లీసైన్యములు వెడలిపోయి పెండాదుర్గమును ముట్టడించిరి. ఆదుర్గములోనివారు పెక్కుదినములవఱకు దానిని గాపాడుకొనలేక కొన్నిదినములుగడిచినవెనుక దుర్గమును వశపఱతు మని వర్తమానము పంపిరి. ఈవర్తమానమును వారలుగవర్నరునకు దెలియజేయగా నాతడు క్రొత్తసుల్తానునువెంటబెట్టుకొని వచ్చెను. అబ్దుల్లాయాదుర్గమును స్వాధీనపఱచుకొని తక్కిన రాజ్యము నాక్రమించుకొనుటకై దండయాత్ర సాగించెను. పోర్చుగీసుగవర్నరు పెండాదుర్గమున 600 సైనికుల 'నొరోన్‌హా' యాధిపత్యమున నిలిపి తాను గోవానగరమునకు మరలివచ్చెనుగాని స్వల్పకాలములోనే మరణించెను. 1555 సంవత్సరమున 'డొమ్‌ఫ్రాన్సిస్కోబర్రెటో' గవర్నరుగా బూర్వపుప్రభువువలెనె అబ్దుల్లాకు దోడ్పడు చుండెను.

ఈసమాచార మంతయు దెలిసికొని పోర్చుగల్ దేశపు రాజు చాలసంతోషించి యాసంతోషమును గోవానగరములోని తనప్రతినిధికి 1557 వ మార్చి 20 తేదిగలజాబుమూలమున దెలియజేసె నట. ఇట్లుండ అబ్దుల్లా పోర్చుగీసువారి సహాయముతో విజాపురముపై దండెత్తి వచ్చుచుండెను. విజాపురములోని సామంతప్రభువు లీసమాచారము దెలిసికొని క్రొత్తసుల్తానుపక్షముననుందు మనివెల్లడింప సాగిరి. ఇంతకుముందే విజాపురసుల్తాను మృతిజెందుటయు ఆలీఆదిల్‌షా రాజ్యమునకువచ్చుటయు నీతడుబాలు డగుటయు వారిసాహ సమును రెట్టింప జేసెను. ఆలీఆదిల్‌షా రామరాయలును శరణువేడుచు రాయబారులను బంపెను. రామరాయలు పదునైదువేలసైన్యములను బంపగా నాసైన్యములతో ఆలీఆదిల్‌షా అబ్దుల్లాను పూర్తిగా నోడింప నాతడు అహమ్మదునగరమునకు బాఱిపోయెనుగాని నిజాముషా నూతనముగా రామరాయలతోను, ఆదిల్‌షాతోను ఇంతకు బూర్వముననే సంధి గావించుకొనియుండుట చేత అబ్దుల్లాను బ్రూలాకొండలలో జెఱబెట్టి యుంచెను. బురహాన్‌నిజాముషామరణానంతరము గోల్కొండసుల్తాను కోరికమీద హుస్సేనునిజాముషా యాతనిచెఱనుండి విడిచిపుచ్చెను. అతడు గోవానగరమునకు వెడలిపోయి యచట మరణించెను. 1611 లో నతనిమనుమడు క్రైస్తవమతమును స్వీకరించెనట! ఈవిధముగా అబ్దుల్లాచరిత్రము కడముట్టినది.[11]

విజయనగర గోల్కొండ యుద్ధము

ఇబ్రహీముకుతుబ్షా నాడువేంకటాద్రిజగదేవరావుతో గోల్కొండరాజ్యముపై దండయాత్రసాగించుచున్నవా డని విన్నమాత్రమున భయకంపితగాత్రుడై కళ్యాణిదుర్గమును ముట్టడించుట మానుకొని వేగమున స్వరాజధానికిబఱుగిడివచ్చి తనసేనానులలో సుప్రసిద్ధుడుగా నున్న ముజాహీదుఖానుని వారల నెదుర్కొన బంపెను. ఇత డింతగాభయపడుట కొక ముఖ్యకారణము గనుపట్టుచున్నది. రాణవంశీయుడును సుప్రసిద్ధనాయకుడును, సేనాని యగుజగదేకరావు తనకుసామంతుడుగానుండియు విజయనగరపక్షమున గుట్రసాగించి తానులేనికాలమున విజయనగరసైన్యములో జేరి వేంకటాద్రితో గలిసి తనరాజ్యముపై దండెత్తి వచ్చుటయె యని తలంప నవకాశ మిచ్చుచున్నది. ఇట్లు తోరగల్లుసమీపమున ముజాహీదుఖానుసైన్యములకును, వేంకటాద్రిసైన్యములకును ఘోరమైనసంగ్రామము జరుగుచుండెను. ఇంతమాత్రమున సంతృప్తి జెందనివాడై అళియరామరాయలు తనమేనల్లుడును, కొండవీటిరాజ్యమున కధిపతియు నగుసిబ్ధిరాజుతిమ్మరాజును కొండపల్లిసర్కారు నాక్రముంచుకొనుటకై ఏబది వేలయాశ్విక సైన్యములతో బంపించె నట. మఱియొక మేనల్లు డగుజయతిమ్మరాజును ఇరువదివేలయాశ్వికసైన్యముతో దేవరకొండ, ఇంద్రకొండదుర్గములను బట్టుకొన నియమించెను. తాను తన సైన్యములతో గోల్కొండచుట్టు నున్నప్రదేశము నంతయు నాక్రమించుకొని యుండెను. సుల్తానుసైన్యములకును రాయల సైన్యములకును పోరు ఘోరముగా నుండెను. రాజమహేంద్రవరమునుండి సీతాపతియు వేదాద్రియు నేలూరుసర్కారు నాక్రమించుకొను చుండిరి. వెలుగోటిచిన్నప్పనాయుడు, వాని కుమారుడు తిమ్మానాయుడు గండికోటదుర్గము నాక్రమించిరి. ఇట్లన్నిదిక్కులను సులానుసైన్యములకును, రామరాయల సైన్యములకును బోరాటము జరుగుచు కుతుబ్షాగోల్కొండ సామ్రాజ్య మస్తమించు దైన్యస్థితి యేర్పడియెను.

ఈవిధముగా నాలుగుమాసములు గడచినవెనుక జగదేవరావు పానగల్లు, రావెలకొండ, గణపురదుర్గములను రామరాయలకు వశపఱపు డనితద్దుర్గాధిపతు లగుతెలుగునాయకుల బ్రోత్సహించెను. ఇంద్రకొండదుర్గముయొక్క బీగములను తద్దుర్గాధిపతి యగుకాశీరావు రాయల కొసంగివేసెనట.

అప్పుడు రామరాయలపక్షమున నున్నబీడరుసుల్తా నగు ఆలీబరీదుషాకు గూడభయము పుట్టి సంధిగావింతు ననియు, నతనిప్రధానమంత్రి యగుముస్తఫాఖానుని తనవద్దకు బంపవలసిన దనియు రహస్యముగా నొకలేఖనువ్రాసి ఇబ్రహీమ్‌కుతుబ్షాకు బంపెనట. ఆప్రకార మాపత్తులోమునిగియున్న ఇబ్రహీము ముస్తఫాఖానుని ఆలీబరీదుషాకడకు బంపెను. అప్పుడు జగదేకరావును నెట్లయినసామవిధానమున వశ్యపఱచుకొనవలసిన దనిహితోపదేశము గావింపబడియె నట. ముస్తఫాఖాను వానియుపదేశమును బాటించి జగదేకరావుతోడిమైత్రిని సంపాదించె నట. అతడువానిని ఆలీఆదిల్‌షాకడకు గొనిపోవ వారెల్లరు నాలోచించి ముస్తఫాఖానును, ఆలీబరీదుషాయును, ఆలీఆదిల్‌షాయును, జగదేకరావునురామరాయలకడకు గొని వచ్చి సంధికార్యమునుగుఱించి ప్రశంసలు జరిపి రట. మనస్సులో నంతగా నిష్టములేకున్నను రామరాయలు గణపురము, పానుగల్లుసీమలను విజయనగరమునకొసంగుపద్ధతిని సంధికొడంబడియె నట. ఇట్లీవిధముగా యుద్ధము సమాప్తి జెందినది.

ఇట్లాపత్తునుండి తప్పించుకొని యిబ్రహీము ముస్తఫాఖానుతో దనరాజ్యమును బలపఱచుకొనుటకు సాధనముల నారయుచుండెను. తనసైన్యమంతయు దెలుగునాయకుల స్వాధీనముననుండుటయు వారలతో బ్రముఖుడైనజగదేవరావు రాజద్రోహియై పన్నినపన్నుగడకు రామరాయలుసమ్మతించుటయు, అందువలన తెలుగునాయకు లందఱుదనకుద్రోహులై ప్రవర్తించి రనితెలుసుకొని యెట్లయిన వారి నా యాధిపత్యములనుండి క్రమముగా దప్పించవలయు ననిదృడమైనసంకల్పము బూనిముస్తఫాఖానుతో గుట్రచేసి తొలుదొల్త తాము చేయవలసినకృత్యము ఇంద్రకొండదుర్గాధిపతి యగు కాశీరావును సంహరింపవలయు ననినిశ్చయించుకొనిరి. ఈసంగతి గోల్కొండదుర్గములోనిసైన్యముల కధికారిగ నున్నసూర్యారావు దెలిసికొనితక్కిననాయకులతో నాలోచించి యీక్రింది విధానము తనలో నిశ్చయించుకొనె నట.

ఇబ్రహీముకుతుబ్షా వేటకుబోయినప్పుడు దుర్గముల భద్రపఱచుకొనుటకును, సూర్యారావు సుల్తాను ధనాగారమును ముట్టడించి దుర్గములోని మహమ్మదీయుల నెల్లరనుసంహరించుటకును తీర్మానించుకొని రట. ఈతీరుమానమును రామరాయలకు దెలియజేయగా నాతడు వారిసహాయముకొఱకు గొంతసైన్యమునుబంపుదు ననివాగ్దత్తము చేసెనట. అట్లువేటాడుకాలము సమీపింపగా నొకనాటివేకువను వేటకాండ్రతో నిబ్రహీము గోల్కొండదుర్గమును విడిచిపోయె నట. అతడు వెడలిపోయినవెంటనే దుర్గద్వారములు మూసివేయబడిన వట. నాయకు లెల్లరును తమసంకల్పము నెఱవేర్చుకొన గోరిమహమ్మదీయుల నెదుర్కొని సంహరింప మొదలుపెట్టి రట. మహమ్మదీయులలోనిరువు రెట్లోతప్పించుకొనిపోయి యాదు:ఖసమాచారమును సుల్తానుకు నివేదింపగా ఇబ్రహీము తక్షణమె తనతోనున్నసైన్యములకు రాజధానికి మరలవలసినదని యుత్తరువుచేసి తనసైన్యములతో మరలివచ్చి దుర్గముచుట్టును విడిసియుండె నట. కుట్రదారులగు నాయకులు బురుజులపైకివచ్చి యాసైన్యము నంతయునుగాంచి వార లీవిధముగా నిబ్రహీమునకువర్తమాన మంపిరట.

"సుల్తాను ముస్తఫాఖానుని తమవశ్యముగావించినయెడల వెనుకటివలెనె యాతనికి విధేయులమై తమవిధులను నెరవేర్పనున్నార మనియు, ముస్తఫాఖాను మంత్రిత్వపదవికి వచ్చినప్పటి నుండియు కొందఱునాయకులపట్ల బహుక్రూరముగా బ్రవర్తించి హింసించె ననియు దమగతియు నట్లేయగు ననిభయపడుచున్నార మనియు గావునముస్తఫాఖానును దమపరము చేయవలసినదిగా గోరుచున్నాము."

అప్పుడుసుల్తాను ముస్తఫాఖానుని రప్పించి నీపరిపాలన మెట్టిదుస్థితికి దెచ్చినదో చూచితివా యని యావిషయమును వానికి వినిపించె నట. అపుడు ముస్తఫాఖాను "మహాప్రభూ ! నామరణము నీసామ్రాజ్యమునకు క్షేమదాయక మని దేవరవారు తలంతురేని యిదిగో నేను కుట్రదారులకు లోబడుటకు సిద్ధముగా నున్నా" నని సుల్తానుకు నివేదించుకొనియె నట. కాని సుల్తాను నాయకులప్రార్థనము నంగీకరింపకుండె నట. మఱికొన్ని దినములకు బలాత్కారముగా నాయకు లెల్లరులోపడవలసివచ్చెనట. అప్పుడు సూర్యారావు మొదలగునాయకులెల్లరు సంహరింపబడి రట. ఇయ్యవి ఫెరిస్తావ్రాసినవ్రాతలు. ఇందెంత సత్యమున్నదో భావిపరిశోధనల మూలమున దెలిసికొనవలసియుండును.




  1. ఈవెంగళాంబ కృష్ణదేవరాయలకు చిన్నాదేవియందు బుట్టిన కూతు రని 'హండే అనంతపురచరిత్ర' మను నొకస్థానికచరిత్రమునందు దెలుపబడి యుండెను గాని, బాలభాగవతమునగాని, వసుచరిత్రమున గాని, నరపతివిజయము నందుగాని మరియెచ్చటను దెలుపబడి యుండ లేదు. అళియరామరాయలను కృష్ణదేవరాయని యల్లుడని వ్రాసినవారిదివాస్తవ మయినయెడ తిరుమలరాయనిగూడ నతనియల్లుడనియె వ్రాసియుందురు. సదాశివరాయల సోదరియగు వెంగళాంబను అళియరామరాయల తమ్ముడు తిరుమలరాయలు వివాహమైనట్టు హంపీక్షేత్రమునందలి చండేశ్వరీదేవాలయమునందలి యొకశాసనమువలన దెలియవచ్చుచున్నది. కృష్ణదేవరాయనికూతురైనను, అతనితమ్ముడు రంగరాయలకూతురైనను సదాశివదేవరాయల సోదరియని చెప్పవచ్చును. ఎట్లయినను నీయిర్వురును పూర్వరాజకుటుంబమున కల్లుండ్రని విశ్వసింపదగును. (See A. D. V. p. 22 Notes 6 and 7)
  2. Epigraphia Carnatika III. Sr. 42.
  3. Sources of vijayanagar History, Intrs. p. 15 and 16.
  4. The Aravidu Dynasty of vijiayanagar, p. 74.
  5.         "అమితవైభవుడయినయప్పలరాజు
             రమణీయమైనకూరక చర్లయొద్ద
             కడుమించుసాజరంగంబునగడిమి
             దొడరినట్టిసవాబరీదులనిర్జయించి
             తరణిమండలవిభేధనపూర్వకముగ
             సురలోకమునకురాజులుమెచ్చనరిగె." బా. భా. (ద్విపద)

  6. (The Vasucharitramu does not give any information about the capture of Kalyani, Which belonged to the Sultan of Ahmadnagar). The Aravidu Dynasty of Vijayanagar, p. 76.
  7. ఇచ్చట హీరాసుఫాదిరి క్రొత్తవిషయమును బేర్కొను చున్నాడు. విజాపురసుల్తాను రామరాయలకడ రాయబారిని బంపగా రామరాయలు వానిని ఱాళ్లతో గొట్టించి చంపించె ననికోరియా వ్రాసినాడని 'కుక్కకాటుకు చెప్పుదెబ్బ' యన్నట్లు విజాపురసుల్తా నట్లుజరిగించినాడని హీరాసుపాదిరి వ్రాయుచున్నాడు. తనరాయబారులను రప్పించుకొనకముందే రామరాయలు విజాపురసుల్తాను రాయబారిని ఱాళ్లతో గొట్టి చంపించినా డనిచెప్పుట విశ్వాసపాత్రము గాదు.
  8. Sources of vijayanagar History p. 195, 199.
  9. The Aravidu Dynasty of Vijayanagar, p. 83, 84, Note No. 1.
  10. The Aravidu Dynasty of vijayanagar, p. 86 Note I.
  11. The Aravidu Dynasty of vizianagar page. 93, 94