అళియ రామరాయలు/ఆఱవ ప్రకరణము
ఆఱవ ప్రకరణము
రక్షస్థ్సగిడి యుద్ధము
అళియరామరాయ లింతవరకు దక్కనుసుల్తానులతో నడపినయుద్ధములలో నెపుడును నపజయమును బొందియుండ లేదు. తానుసామ్రాజ్యభారము వహించిన యిరువదిసంవత్సర ములకాలములో దక్కనుసుల్తాను లైదుగురులో నొక్కడైనను హిందూసామ్రాజ్యముపై దండెత్తి రాకుండునటులు రామరాయలు మిగులభయంకరమైన యొకరాజనీతిపద్ధతి నవలంబించి యాప్రకారము నడచుచుండెను. ఈదక్కనుసుల్తానులలో నైకమత్యము లేకుండుట గనుపెట్టి వారికలహములలోదాను జోక్యము కలిగించుకొని యెవరిపక్షముననో యొకపక్షముననుండి వారికి దోడ్పడుచు బ్రతిపక్షము వారిని గదనరంగమున నోడింపుచు వారలను గ్రుకద్రిప్పుకొనకుండజేసి యెప్పుడును దానులాభముపొందుచు దనసామ్రాజ్యమును గాపాడుకొనుచు వచ్చెను. ఇత డవలంబించిన యిట్టి రాజనీతియె తుదకు దక్కనుసుల్తానులు పరస్పరకలహములను విడిచి యెల్లరు నేకీభవించి హిందూసామ్రాజ్యము నెదుర్కొను నట్లు గావించెను. ప్రతిసుల్తానుకు దాను ప్రత్యేకముగా విజయనగరసామ్రాజ్యముపై దండెత్తిపోయి రామరాయలను జయించుట సాధ్యముకాదని గ్రహింప గలిగిరి. మఱియు దమలో దా మైకమత్యములేక పరస్పరవిరోధములతో నుండి యుద్ధములు చేయుచున్నంతవఱకు రామరాయలను జయించు నట్టిశక్తికలుగదనికూడ దోచినది. ఇంక వారు చేయవలసినపని యేమి? ఐకమత్యము సంపాదించుకొన బ్రయత్నింపవలయును. వారిలో ముఖ్యముగా నహమ్మదునగరసుల్తా నగుహుస్సేను నిజాముషాకును, విజాపురసుల్తా నగుఆలీఆదిల్‌షాకు సరిహద్దుదుర్గముల విషయమై వివా దములు కలుగుచునే యుండెను. అళియరామరాయలపై హుస్సేనునిజాముషాకు గలద్వేష మత్యంతరోషా నలపూరితమైయుండెను. 'ఎప్పుడు రామరాయలనుజంపి వానిసామ్రాజ్యమును భగ్నముచేయ గలుగుదునా' యని త్రాచుబామువలె బగబట్టి బుస్సలుకొట్టుచున్నవా డగుటవలన నీమహాకార్యమును నిర్వహించుటకై శక్తివంచనలేకుండ దొలుదొల్త బ్రయత్నించిన వా డితండనుటకు లేశమాత్రము సందియము లేదు. ఆలీఆదిల్‌షా మొట్టమొదట నీమార్గమాలోచించినవాడని ఫెరిస్తావ్రాసినది విశ్వాసపాత్రము కాదు. ఆలీఆదిల్‌షాకును, ఇబ్రహీమ్‌కుతుబ్షాకును ప్రాణరక్షణము నొసంగి వారిరాజ్యములపై నిలువబెట్టినవాడు రామరాయలని వారెఱింగి యుండకపోలేదు. కాని హుస్సేనునిజాముషాతో జేసినయొడంబడికల మూలమునను సంబంధబాంధవ్యముల మూలమునను వీరు వానితో గలియవలసిన వారయిరి గాని వాస్తవముచేత రామరాయలను వానిసామ్రాజ్యమును నాశనము గావింపవలయునంతద్వేషము వారికున్నట్లు గానరాదు. మఱియును గొందఱుచరిత్రకారులు వ్రాసినట్టు లీయుద్ధము కేవలము మతావేశపరవశత్వమువలన గలిగినదని చెప్పుటకును సాధ్యపడదు. ఆనెగొందిపురములో హిందువులకు బవిత్రమైనయొకకోనేటిలో తురకఫకీరును వానియనుచరులిర్వురును స్నానముచేయగా వారిని జావగొట్టి పంపుటయె కారణమని వ్రాయుటకూడ నంతవిశ్వాసపాత్ర మైనదిగా గను పట్టదు. ఇయ్యవివట్టికల్పనలుకాని సత్యములగు కారణములు గావు. హీరాసుఫాదిరి వ్రాసినట్లు కడపటజరిగిన యుద్ధములలో హిందువులు మహమ్మదుమతస్థుల మశీదులు మొదలగువాని జెఱచి యవమానపఱచుటయుగూడ గారణములు గావు. దక్కనుసుల్తానులరాజ్యాంగ వ్యవహారములలో నితడుజోక్యము కలిగించుకొని తానుజయశీలుడై వారినదిమిపట్టి యుంచుటయె ప్రధానకారణముగా గ్రహింపవలసియుండును గానిమఱియన్యము కాదు.
కారణమెద్దియైనను ఆలీ - ఇబు - అజీజువ్రాసినట్టు హుస్సేనునిజాముషా యైననేమి, మహమ్మదుకాశిం ఫెరిస్తావ్రాసినట్లు ఆలీఆదిల్‌షాయైననేమి దక్కనుసుల్తానుల నేకీభవింపజేయుటకై గోల్కొండసుల్తానగు ఇబ్రహీమ్‌కుతుబ్షా యిందుకు బ్రయత్నించినటుల ప్రేరేపించిరి. ఇబ్రహీమ్‌కుతుబ్షా ప్రయత్నములు తుదకు ఫలించినవి. హుస్సేనునిజాముషా తనకూతురు చాందుబీబీని విజాపురసుల్తానగు ఆలీఆదిల్‌షాకిచ్చి పెండ్లిచేయుటకును, ఆదిల్‌షాచెల్లెలగు 'ఫలాబీబీహద్యసుల్తానా' అనునామెను హుస్సేనునిజాముషా పెద్దకుమారుడగు షహజడామూర్తజాకు నిచ్చి పెండ్లిచేయుటకును, షోలాపురము కట్నముగా నిచ్చుటకు నేర్పాటుచేసి గోల్కొండసుల్తాను అహమ్మదునగర విజాపురసుల్తానుల కిర్వురకు బొత్తు కలిపెను. అహమ్మదునగరసుల్తానగు హుస్సేనునిజాముషా తన కొమార్తెలలో మరియొకకొమార్తెను గోల్కొండసుల్తానగు ఇబ్రహీమ్‌కుతుబ్షా కిచ్చిపెండ్లిచేసినటుల కోటో వ్రాయుచున్నాడు. వారిలో వారికైకమత్యము బలపడుటకును, రామరాయల విజృంభణము నడంచుటకును నిట్టిసంబంధ బాంధవ్యములొన గూర్పబడినవి. ఇంక బీడరు, బీరారుసుల్తానులుగూడ వీరితో జేరిరి. గోల్కొండసుల్తానుపక్షమున ముస్తఫాఖాను, అహమ్మదునగర సుల్తానుపక్షమున మౌలానాఇనాయతుల్లాయును, రాయబారులుగా విజాపురమునకు బోయి యచట కిన్వరుఖాను మొదలగువారితో నాలోచించి వివాహసంబంధములను స్థిరపరచుటయెగాక ప్రమాణపూర్వకముగా సంధి పత్రములపై సంతకములు చేయబడినవట. అటుపిమ్మట యధావిధిగా వివాహములు జరుపబడి విజాపురమునను, అహమ్మదునగరమునను మహోత్సవములు జరుపబడినవట ! బీరారుసుల్తా నిందుచేరలేదని 'బసాతిన్ - ఉస్ - సలాతిన్' అను గ్రంథము తెలుపుచున్నది. బీదరుసుల్తా నిందుచేరలేదని ఫెరిస్తా వ్రాయుచున్నాడు. ఐదుగురుసుల్తానులు చేరినారని కోటో వ్రాయుచున్నాడు. అందరుసుల్తానులు నేకీభవించిరని మనము విశ్వసింపవచ్చును.
వీరిసమాచారము నంతయు జారులవలనవిని యెంత మాత్రమున జాగుసేయక సామ్రాజ్యములోని సామంత మడలాధిపతుల కందఱకును దెలియజేసి యుద్ధసన్నాహ ప్రయత్నములను జేయ మొదలుపెట్టెను. కృష్ణానది మొదలుకొని సింహళవరకు గలయావద్దేశమునుండియు సామంత మండలాధిపతులు, దుర్గాధిపతులు తమతమసైన్యములతో విజయనగరమున కరుదెంచిరి. మధురాపురమండలాధీశ్వరుడయిన విశ్వనాథనాయకునికుమారుడు కృష్ణప్పనాయకుడు తాను రాజ్యాభిషిక్తు డయినకాలము స్వల్పకాలమెయై యుండుట వలన దానుబోక తనసైన్యాధ్యక్షుడయిన అరియనాధ మొదలారిని నసంఖ్యాకసైన్యములతో బంపెనట ! సామ్రాజ్యసంరక్షణకై వీనితో 'బసవరా' జను మఱియొకముఖ్యనాయకుడు వెడలియుండె నట. అళియరామరాయ లిట్లుయుద్ధప్రయత్నములో యున్నకాలముననే విజాపురసుల్తానునుండి యొకరాయబారినిబంపి అదివరకు విజాపురసుల్తానునుండి వేఱ్వేఱుకాలములందు గైకొనిన యాతగిరి, బగ్రకోట, రాచూరు, ముదిగల్లు దుర్గములను విడిచిపెట్టవలసినదని యడిగించెనట ! ఇదియె విజాపురసుల్తాను విజయనగరముతో గలమైత్రిని విడిచిపెట్టినట్లుగ సూచించుచున్నదని ఫెరిస్తా వ్రాయుచున్నాడు. రామరాయలా రాయబారిని నవమానించి పంపివేసెననియు నిదియె కారణముగా జేసికొని యిస్లామునకు శత్రువయిన రామరాయలను సాధించుటకై వారలత్యంతవేగముతో సైన్యముల సమకూర్చుకొన బ్రోత్సహించెనని ఫెరిస్తా తెలుపుచున్నాడు.
ఎట్లయిననేమి? దక్కనుసుల్తానులు సమరోత్సాహసంభరితులై తమతమసైన్యములతో విజాపురప్రాంత దేశమునందలి బయళ్లలో గలిసికొనిరి. అచట విజాపురసుల్తానగు ఆదిల్‌షా వారికి గొప్పవిందు గావించెను. అచటనుండివారు 1564 సంవత్సరము డిసెంబరు 26 తేదీని దక్షిణముగా నడచుటకు బ్రారంభించిరి. వీరందఱును తల్లికోటసమీపమునకు జేరుకొనిరి. వీరిలో గోల్కొండసుల్తానగు ఇబ్రహీమ్‌కుతుబ్షా యొక్కమంత్రియు, సైన్యాధ్యక్షుడునగు 'కమల్‌ఉద్దీన్ - హుస్సేను' ఆతనికి 'ముస్తఫాఖా' ననుబిరుదము గలదు. ఇతడు రాజకార్య తంత్రజ్ఞుడు మాత్రమెగాక మహాయోధుడుగూడ నైయున్నవాడు. మహాసమర్ధుడు. అహమ్మదునగరసైన్యములకు మౌలానాఇనాయతుల్లా సైన్యాధ్యక్షుడు. విజాపుర సైన్యములకు 'కిన్వర్‌ఖాన్' సైన్యాధ్యక్షుడు. గోల్కొండసైన్యములతో 'రిఫత్‌ఖాన్' అనుగొప్పసేనాని యొక డుండెను. వీరిచే సైన్యములు పాలింపబడుచుండెను. మఱియు విజాపురసైన్యములతో నాఱువేల మరాటా యాశ్వికసైనికులు గలరు. ఈసైన్యమునకు ముఖ్యనాయకులు 'యశ్వంతరావు, భోజమల్లనాయక్, దేవనాయక్, బస్వంతరావు, విశ్వేశ్వరరావు, కాశీరావు' అనువారలని తెలియుచున్నది. ఈదక్కనుసుల్తానులసైన్యములు మహారాష్ట్ర కర్ణాటాంధ్రదేశములను బాలించువారుగనుక వీరిసైన్యములో గేవలము మహమ్మదీయులేగాక హిందువులుగూడ నుండిరని మనము విశ్వసింపవచ్చును. పోర్చుగీసుగ్రంథకర్తలు తురక సైన్యములో నేబదివేలయాశ్వికులును, మూడువేలపదాతు లును గలరనిహీరాసుఫాదిరి వ్రాసినది సత్యమని విశ్వసింపరాదు. లక్షలకొలదిపదాతిసైన్యము గలదు. హిందూసైన్యము డెబ్బదివేల యాశ్వికులతోడను, తొంబదివేల పదాతులతోడను గూడుకొని యుండెనని ఫెరిస్తావ్రాయుచు మఱియొకతావున నింతకన్ననధికముగా నున్నట్టువ్రాసియున్నాడు. ఒకఅనామధేయ చరిత్రకారుడు లక్షయాశ్వికులును, మూడులక్షల పదాతులును గలరని వ్రాయుచుండగా గొందఱు పోర్చుగీసు గ్రంథకర్తలు గుఱ్ఱపుదళముసంఖ్య నొప్పుకొనుచు పదాతిసైన్యము లాఱులక్షలుండెనని వాక్రుచ్చుచున్నారు.[1] ఈసైన్యమునంతయు మూడువిభాగములను జేసి రామరాయలు, తిరుమలరాయలు, వేంకటాద్రి మూవురును మూడుభాగముల కాధిపత్యము వహించిరి. రామరాయలు యుద్ధమునాటికి మిక్కిలివృద్ధుడుగా నున్నట్లు చరిత్రములన్నియు నైకకంఠ్యముగా దెలుపుచున్నవి. రామరాయలు డెబ్బదేండ్ల వయస్సు వాడని ఫెరిస్తాగ్రంథమును ఎనుబదేండ్లవయస్సువాడని 'బురహాన్ - ఈ - మాసీర్' అనుగ్రంథమును దెలుపుచుండగా బోర్చుగీసు చరిత్రకారులు రామరాయలు తొంబదియాఱు సంవత్సరముల వయస్సుగలవాడని కంఠోక్తిగా దెలుపుచున్నారు. వీరుచెప్పినదానిలో సంఖ్యయెట్టిదైనను రామరాయా దులు వృద్ధులనుట సత్యమని మనము విశ్వసింపవచ్చును. వారుత్తమరాజవంశములలో బుట్టినవారు గనుక వయోవృద్ధులయినను, దేహదార్డ్యము, మనోధైర్యము, పౌరుషముగలిగి పరాక్రమశక్తిసంపన్నులరై యుందురనుట కెంతమాత్రమును సంశయింప బనిలేదు. ఈయుద్ధమునుగూర్చి చండావర్కరుగారు మరాఠీభాషలో బ్రకటించిన 'విజయనగర వినాశన' మను గ్రంథమునుండి యెత్తి హీరాసుఫాదిరి తనగ్రంథమునందు బ్రకటించిన విషయములు గొన్ని కేవలము నసత్యములని స్పష్టముగా జెప్పవచ్చును.
"ఈయుద్ధమునకై రామరాయలు విజయనగరము నుండి బయలుదేరుటకు ముందు స్వకీయాంత:పురమునకుజని తనపట్టమహిషియగు సత్యభామాభాయికి విలువగల యాభరణములను బహుమానము చేసెనట ! పిమ్మట దేవచింతామణిత్రివేగల యనుభార్యకడకు బోయి యామెతో సంతోషమున గొంతకాలము గడపి కొన్నిబహుమానములను గావించె నట ! అటుపిమ్మట 'మానమోహిని నిజస్వరాపి' యను మూడవభార్య మందిరమునకు బోయెనట ! అనేక విధములుగా నామె రాయలను సంతోషపఱచుటకై ప్రయత్నించెనట ! అతడు తనయారామములనుండి యిరువదివిధములయిన ఫలములను దెప్పించి భార్యలకు బంచిపెట్టించె నట! తరువాత నతడు తనతల్లియగు చంద్రశాల గదికిబోయి యామెను సందర్శించె నట ! అతనికి చెడుగు కలుగ కుండుటకై యామెవెంటనే పెక్కునగలను తలచుట్టు దిగదుడుపు తుడిచెనట ! అప్పుడు రామరాయ లామెకు సామ్రాజ్యవ్యవహారములను విశదపఱచి యెట్లు దక్కనుసుల్తానులునల్వురు నేకమై తన్ను నెదుర్కొన నున్నారో, ఎట్లుదేవళములు, ధర్మశాలలు, బ్రాహ్మణులు వారిపాలబడి కడగండ్లబడ సిద్ధముగ నుండెనో యావిధమునంతయు బూసగ్రుచ్చునటుల నివేదించి వారినిశిక్షించి వారిప్రయత్నములను భగ్నపఱచుటకు దా నవలంబించినమార్గమును వినిపించి యుద్ధమున కనుజ్ఞ నీయవలసినదని యామెకాళ్లపై బడి ప్రార్థించెనట ! అందునకామె యియ్యకొనక 'మనమువారికి హానికలిగింపలేదు; అయినను వారెల్ల నేకీభవించి మనపైదండెత్తి వచ్చుచున్నారు; వారితో సంధిచేసికొనుట తగు' నని పలికెనట ! ఆమెచెప్పిన దాతనికిష్టములేక వెడలిపోయెనట ! అందుమీద నామె తనకుమారునిసంతోష పెట్టుటకై ప్రయత్నించె నట ! ఆరాత్రి రాయలుతనగదిలో విశ్రాంతిగైకొనియె నట ! అతడారాత్రి తనచెవికుండలము లెవరో చూఱగొని తన్ను సింహాసనమునుండి పడద్రోచినట్లుగా స్వప్నము గాంచె నట ! అప్పుడాతడు దైవజ్ఞశిఖామణులను రప్పించి వారలకు దనస్వప్న వృత్తాంతమును విన్పింపగా వారలుభయములేదనియు శత్రువులను జయించి బహుకాలము రాజ్యపరిపాలనము చేయగలవని యాతనినోదార్చి మనశ్శాంతి గలిగించిరట. పిమ్మట వారలకు నూతనవస్త్రములను గట్ట బెట్టి కొబ్బరిముక్కలను, ఐదువేలహొన్నులను బ్రాహ్మణులకు బంచిపెట్టెనట !'
ఇయ్యవి వట్టిపిచ్చికూత లనివిశ్వసింపవచ్చును. అళియరామరాయల భార్యలలో "సత్యభామాభాయి, దేవచింతామణి, త్రివేగల, మానమోహిని నిజస్వరాపి" యనువారలు లేనేలేరు. అళియరామరాయలకు నల్వురుభార్యలు గలరనియు నందొకామె కృష్ణదేవరాయల కొమార్తయగు తిరుమాలాంబ యనియు, ఇంకొకయామె జిల్లేళ్ల పెదనంది రాజయ్యదేవమహారాజుకూతురగు నప్పలాంబయనియు, తక్కినయిర్వురును పోచిరాజు తిమ్మరాజయ్య దేవమహారాజు కూతుండ్రగు కొండమ్మ, లక్ష్మమ్మయను వారనియు, రామరాజీయాది గ్రంథములవలన దెలిసికొన గలుగుచున్నాము. అళియరామరాయలతల్లి తిమ్మాంబకాని చంద్రశాలకాదని మనమెఱిగియె యున్నాము. తొంబదియాఱేండ్లవయస్సుగల రామరాయ లామెకు మూడవకుమారుడుగాని మొదటివాడు కాడు. అప్పటికాతనితల్లి బ్రతికియున్నదనికాని భయంకరమైన యుద్ధమాసన్నమైయున్నకాలమున భార్యలతో సరససల్లాపములాడుచు విలువగలనగల బహుమానము చేయుచుండెనని చెప్పెడివారు చెప్పినను విశ్వసించెడివారికి మతు లుండవనుకొనిరి కాబోలు ! ఇట్టిపిచ్చికూతలనే హీరాసుఫాదిరి ప్రామాణ్యములుగ బరిగణించి గ్రంథస్థవచేయుట మిక్కిలి శోచనీయముగ నున్నది. స్వప్నవృత్తాంతముతో గూడి నీకథ నవిశ్వసనీయమని చదువరులు గ్రహింపవలయును.
తల్లికోట కృష్ణానదినుత్తరభాగమున నిరువదియైదుమైళ్ల దూరమున నుండుటచేతను, యుద్ధము కృష్ణానదికి దక్షిణ భాగమున 'రక్షస్సు, థగిడి' యనురెండు గ్రామములసమీపమున జరిగియుండుట చేతను తల్లికోటయుద్ధ మనుటకుమారుగా 'రక్షస్థ్సగిడి' యుద్ధమని హీరాసుఫాదిరి పేర్వేట్టుట యెంతయు సమంజసముగా నున్నది.
అట్లు రామరాయ లసంఖ్యాకము లగుసైన్యములతో యుద్ధయాత్రసాగించి మున్ముందిరువదివేల యాశ్వికులతోను, వేయియేనుగులతోను, లక్షమందికాల్బలముతోను బోయి కృష్ణానదియొక్క యుత్తరపుటొడ్డు నాక్రమింపవలసిన దని తనపెద్దతమ్ము డయినతిరుమల రాయని కాజ్ఞనిచ్చి పంపెను. వానివెనుక నంతేసంఖ్యగలసైన్యముతో బోయి తిరుమలరాయనికి దోడ్పడవలసినదిగా గనిష్ఠసోదరుడైన వేంకటాద్రికి నుత్తరువుచేసి కొదువసైన్యమును దాను నడిపించుకొనిపోయెను. వీరిసైన్యములు కృష్ణానదిచేరునప్పటికే సుల్తానులసైన్యములు కృష్ణానది కుత్తరభాగమున విజయనగరసామ్రాజ్యమునకు సంబంధించిన ప్రదేశములను నాశనము గావించి కృష్ణాతీరమునకు జేరుకొనియెను. తిరుమల రాయలును, వేంకటాద్రియు దక్షిణపుటొడ్డున దండువిడిసిరి. నదిని దాటుటకు ననుకూలమైనరేవు హిందూసైన్యములచే నాక్రమింపబడి యుండుటచేత శత్రుసైన్యము నదిని దాటుటకై తగినరేవునకై పరిశోధింప వలసివచ్చెనుగాని హిందూసైన్యముల కెదురుగనున్నదియె ముఖ్యమైన రేవుగనుండుటచేత వారినాయకులెల్లరు నొకచోట సమావేశమై యాలోచించి యానదిని దాటుటకై యొకయుక్తిని బన్నిరట ! మఱియొకరేవున దాటుటకై తాము ప్రయత్నించుచున్నట్లుగా శత్రువులకు గన్పట్టుటకై తమసైన్యములతో నదిపొడుగున బ్రయాణము సల్పుటకును, హిందూసైన్యములు తమస్థానములను విడిచి తమ్మెదుర్కొనుటకు వచ్చునపుడు తమవెనుకవచ్చెడుసైన్యము వెంటనే వెనుదిరిగివచ్చి యాముఖ్యమయినరేవుననే నదినిదాటుటకు నిశ్చయించుకొని మరునాడుదయమున తమసైన్యములతో బయలుదేఱి మూడుదినములు ప్రయాణముసాగించి రట ! ఈమోసమునకు లోనయి హిందూసైన్యములు వారికెదురుగ దక్షిణపుటొడ్డున బ్రయాణము సాగించినవట. మూడవనాటిరాత్రి హిందూసైన్యములు తమస్థానము విడిచిపోవుటను గాంచి హుస్సేనునిజాముషా సైన్యములు గిఱ్ఱున వెనుకకు మరలి తమ్మెదురించు హిందూసైన్యములు గానరానందున నత్యంతవేగముతో నదినిదాటి మఱునాటియుదయమున సుస్థిరముగా నిలిచిపోయిరట ! ఇట్లని ఫెరిస్తా వ్రాయుచున్నాడు. ఎట్లయిననేమి ? సుల్తానులసైన్యములు కృష్ణనుదాటి దిగువనకు వచ్చినవి. అయినను దక్కనుసుల్తానులు తాము రామరాయల యసంఖ్యాక సైన్యములనుజయించుట కష్టసాధ్యమని భావించి తమతో సంధిచేసికొన్నయెడల తామదివఱకు నాక్రమించుకొన్న ప్రదేశములను మరల యాతనికిచ్చివేసెదమని రామరాయలకు దెలియ జేసిరటకాని యాతడు సంధికార్యమున కొడంబడలేదని ఫెరిస్తా తనగ్రంథమునందు వ్రాసియున్నాడుగాని యిదివట్టియసత్యమని 'హీరాసుఫాదిరి' యె యొప్పుకొనుచున్నాడు.
ఇంతలో రామరాయలు తనసైన్యములతోవచ్చి సోదరసైన్యములను గలిసికొనియెను. శత్రుసైన్యములు కృష్ణను దాటివచ్చినసంగతి దెలిసికొని రామరాయ లొకింతసంభ్రమముజెందినను ధైర్యముతో దనసైన్యములో గదనరంగమున నారితేఱినబంట్లగు రాచవారి నెల్లరను ముంగలిమునుముగా నేర్పాటుగావించి ముంగలిప్రదేశమున శత్రుసైనికులు చేరకుండ జూడవలసినదని యుత్తరువు గావించెను. అట్లే దక్కనుసుల్తానులు ఖురాసాని యాశ్వికదళముతో 'ఇఖాన్‌ఖాను' ముంగలిమునుముగా నుండునటుల యేర్పాటు చేసిరట. ఈరెండుముంగలిమునుములకు ప్రప్రథమున యుద్ధము ప్రారంభ మయ్యెననియు నీతొలియుద్ధమున ఖురాసానియాశ్వికదళము హిందూసైన్యములను దాకి పాషండుల ననేకులను మట్టుబెట్టెనని 'బురహాన్ - ఈ - మాసీర్' అనుగ్రంథమున వ్రాయబడియుండగా చండావర్కరుగారి 'విజయన గరవినాశ' మనుగ్రంథమునందు తురుష్కుల మునుమునందును రాచవారి మునుమునందును బెక్కండ్రు మడిసిరిగాని తుదకు తురుష్కులమునుము వెనుదీసె ననివ్రాయబడి యున్నది. అదియెట్టిదైనను భయంకరమైనసంగ్రామము ప్రారంభమయ్యెను. రామరాయ లెంతమాత్రమును భయపడక వృద్ధు డయ్యును నొకయువకునివలె నావేశపరవశుడై తన సైన్యములను బ్రోత్సహింప జేయుచు యుద్ధోన్ముఖుడై యుండెనని ఫెరిస్తా వ్రాయుచున్నాడు. రామరాయలు తన సైన్యములను మూడుభాగములుగా విభజించి కుడిభాగమును తిరుమలరాయలును, ఎడమభాగమును వేంకటాద్రియును, మధ్యభాగమున దానును గైకొని యెదురుగ రెండువేలయేనుగులను, అచటచట వేయిఫిరంగులను మొదటి పంక్తిలో నుండునటుల నియమించె నట. విజయనగరసైనికులు దిగంబరులుగనుండి శత్రువులకు జులకనగా బట్టువడకుండునటుల యొడలినిండ నూనె పూసికొని యుండిరని ఫెరిస్తా వ్రాయుచున్నాడు. వీరివలెనె సుల్తానుల సైన్యములు మూడు భాగములుగా విభాగింపబడి కుడిభాగమున ఆలీఆదిల్‌షా యుండి వేంకటాద్రి సైన్యముల నెదిరించుటకును, ఎడమభాగమున ఇబ్రహీమ్‌కుతుబ్షాయును, ఆలీబరీదుషాయును నుండి తిరుమలరాయలసైన్యముల నెదిరించుటకును, మధ్యభాగమున హుస్సేనునిజాముషాయుండి రామరాయల నెదిరించుటకును నేర్పాటుచేసికొని నిలిచిరట. ఖురాసానీ విలుకాండ్రధిష్ఠించిన యాశ్వికదళముతో ఇభాన్‌ఖానుని, ఆఱువందలఫిరంగులతో ఏశియామైనారు యూరోపదేశములలో బ్రఖ్యాతిగాంచిన 'చలబీరుమీఖా' ననువానిని హుస్సేనునిజాముషా తనముందుంచుకొనియె నట ! ఈయుద్ధము ప్రారంభ మగుటకు బూర్వమె తిరుమలరాయలును, వేంకటాద్రియు దమయన్నను సమీపించి 'మీరువయోవృద్ధులరు' ఈభయంకరయుద్ధమున మీరునిలుచుట ప్రమాదకరమని మేము భావించుచున్నాము. సైన్యాధిపత్యమును మాకు విడిచిపెట్టుడని ప్రార్థించినను రామరాయలు వినక ముప్పదేండ్లయువకునివలె లేచి మాఱుమాటాడక మీమీమునుములను గాపాడుకొనుడని యాజ్ఞాపించెనట. అంతటితో దనివిచెందక జయము సంపాదింప దృడమనస్కులరై సుస్థిరముగా నిలిచి తురకలతో బోరాడవలసిన దనితనసైనికులను హెచ్చరింపుచు, ఎనుబదేండ్లునిండియు జీవితాంత్యకాలమున బిఱికిదనముతో దనబ్రదుకును నవమానపఱచుకొనజాల ననియు, ఎవరైనను సరే యుద్ధరంగమున నిలుచుటకు భయపడిరేని వారు తత్క్షణమె తొలగిపోయి తమప్రాణములను రక్షించుకొనుటకు స్వేచ్ఛ నొసగుచున్నానని బిగ్గరగా బలికెనట. వానిసోదరులును ముప్పదివేల యాశ్వికులును తాముమరణము పొందునంతవఱకు బోరాడుచుందుమని ప్రతిజ్ఞ బూనినట్లుగా 'బురహాన్ - ఈ - మాసీర్' అనుగ్రంథమున జరిత్రకారుడొకడు వ్రాసియున్నాడు. భీష్మాచార్యునివలె నీవృద్ధవీరు డిట్టిపౌరుషవచనంబు లాడుచుండినపుడు వీరు డైనయువకయోధు డెవ్వడు వెనుదీయుటకు సాహసించును ?
ఈవృద్ధవీరుడు యుద్ధరంగమున బల్లకినెక్కియుండుట కంటె హయారూడుడై యుండుట సురక్షితమని వీరవర్గమును తనసేనానులు నెంతప్రార్థించినను వినక 'బిడ్డలతో బోరాడునపుడు సురక్షితస్థానములకై వెదకికొన నక్కరలేదనియు, ఇదియు నొకయుద్ధమేనా యనియు, మొదటిదెబ్బతోనే యీగలవలె జెల్లాచెదరై యెగిరిపోవుదు రనియు బలికె' నని ఫెరిస్తా వ్రాయుచున్నాడు.
రామరాయలును వానిసోదరులును తురుష్కసైన్యములను జూచి భయపడిపోయి యాదినమున వారితో బోరాడుట కిష్టపడక మరలిరనియు, అదిసందుచేసికొని హుస్సేనునిజాముషాయును తక్కినవారును యుద్ధమునకు డీకొనక తామును తమసైన్యములును కొంతవిశ్రాంతిని తీసికొన నిశ్చయించి మఱునాటియుద్ధమున కెదురుచూచుచు నారాత్రి సుఖముగా విశ్రమించిరని 'అలీ - ఇబు - అజీజు' వ్రాసియున్నాడుగాని యిదియంతగా విశ్వాసపాత్రముకాదు. మఱునాడు మధ్యాహ్నముపండ్రెండు గంటలకు యుద్ధముప్రారంభింపబడినది. వేంకటాద్రి యధ్యక్షతక్రింద నడుపబడుచున్న యెడమ పార్శ్వమునున్న హిందూసైన్యములు తొలుదొల్త విజాపురసుల్తానుసైన్యముల నెదుర్కొనియెను. వేంక విడుటకు సంసిద్ధుడైయుండ హుస్సేనునిజాముషా మరల తనసైన్యములను బురికొల్పుకొనివచ్చి హిందూసైన్యముల మఱియొకమా రెదుర్కొన బోరుఘోర మయ్యెనట ! రుమీఖాను నాధిపత్యము క్రిందనున్న డిరంగులవారు తాముగానుపింపకుండ 'ఇఖాసుఖాను ఖురాసాను' సైన్యముల వెనుకనుండి శతఘ్నులవర్షము గురిపింపగా రాయలసైన్యములు తఱుముకొనివచ్చి పైబడగా ఖురాసానుసైన్యములు వెనుకకు బాఱి హిందూసైన్యములు ఫిరంగులసమీపమునకు వచ్చినతోడనే యాకస్మికముగా ఫిరంగిగుండ్లను ప్రేల్చ బ్రారంభించిరట ! అపుడురాయలసైన్యములు విశేషనష్టముతో వెనుదీయ వలసివచ్చెను. ఈసందర్భమున ఇఖ్లాన్‌కాను, రుమీఖానులధైర్య సాహసములను మెచ్చుకొనదగినదని ఆలీ - ఇబూ - అజీజు వ్రాయుచున్నాడు. ఈసమయమున హుస్సేనునిజాముషా తన గుడారమును శత్రువులకెదురుగ నెలకొల్పి జయముకలుగువఱకు బోరాడ నిశ్చయించుకొనియె నట. ఇంతియగాక హుస్సేనునిజాముషా తనభార్యలను, ఉంపుడుకత్తెలను తనస్కంధావారమునకు రప్పించి తనకపజయముకలిగి మరణము సంభవించినపక్షమున వారలనుసంహరింప వలసినదిగా ఖొజ్జాలకు నుత్తరువుచేసి వారలకు గాపు పెట్టెనట.
రామరాయలు తనకియ్యది యవమానకరమని భావించి తానుగుఱ్ఱమునుండిదిగి యచట నొకరత్న కంబళమును బఱపించి రత్నసింహాసనమునుబెట్టి దానిపైనధిష్టించి తనయెదుట నగలరాసులను, ధనరాసులను, ముత్యముల రాసులనుపోయించి జయము పొందుచుండిన సైనికులకు బహుమానములుగ నొసంగుచుండె నట. రాయలయౌదార్యమునకు సైనికులత్యంత సంతోషమునుజెంది ఫిరంగివ్రేటులవలన గలిగినకలవరమునుండి శాంతినిబొందినవారై శత్రువుల కుడియెడమ ప్రక్కలనుండు సైన్యములనుదాకి భీభత్సముసేయ ఆదిల్‌షాయు, కుతుబ్షాయు నింకజయము కలుగుట దుస్సాధ్యమని తలంచిరని ఫెరిస్తా వ్రాయుచున్నాడు. తమకింక నపజయము తప్పదని తలచిరని ఆలీ - ఇబూ - అజీజు వ్రాయుచున్నాడు. తురకలసైన్యములో బార్శములనున్న రెండుభాగములును బూర్తిగా నోడింపబడినవని హిందువులువ్రాసిన చరిత్రము వలన దేటపడుచున్నది. ఫరియా - డి - సౌజా యను నాతడు గూడ రామరాయలు శత్రువుల దాదాపుగా నోడించెనని వ్రాయుచున్నాడు. వేసవి కాలమున జెట్లయాకులు రాలి కుప్పతిప్ప లయినట్లుగా తురకసైనికులశవములు కుప్పలుకుప్పలుగ గూలిపోయి రాసులగుచుండెననియు, పాషండులు (హిందువులు) తమయాధిక్యతయు బరాక్రమంబును నెఱపిరని 'మీర్జాఇబ్రహీమ్‌జబిరీ' యనునాతడు 'బసాతిన్ - ఉస్ - సలాతిన్' అనుగ్రంథమున వ్రాసియున్నాడు. [2]
అయినను హుస్సేనునిజాముషా సుస్థిరముగా మధ్యభాగమున నిలిచియుండెనని ఫెరిస్తా వ్రాయు చున్నాడు. ఫిరం గులయధికారి యగు రుమీఖాను రాగినాణెముల ఫిరంగులలో బోయించి హిందూసైన్యములు సమీపించినతోడనే ప్రేల్చుచునమిత నష్టమును గలిగించుచుండెను. ఇందువలన ఫిరంగుల సమీపమున నైదువేలహిందూసైనికుల శవములు పడియుండె నట. అప్పుడుహిందూసైనికులుచెదరి పరువిడుచుండ విజాపురసుల్తాను సేనాధిపతియగు 'కిశ్వర్‌ఖానులారీ' యను నాతడాఱువేల యాశ్వికులతో వచ్చి హిందువులపై బడి తఱుమనారంభించె నట. ఇట్టిసమయముననే హిందూసైన్యములో నొకగందరగోళము పుట్టినది. ఇంతవఱకు విజయనగరసామ్రాజ్యము క్రిందసేవకులుగ నున్నయిర్వురు తురకసేనానులు రాజద్రోహులై తమప్రభువయిన రామరాయలను విడిచి తమమతస్థులయిన సుల్తానులపక్షమునకు దమతమసైన్యములతో బోవుట సంభవించెను. ఈద్రోహవృత్తాంతమును ఫెరిస్తాగాని, ఆలీ - ఇబూ - అజీజుగాని తెలిపియుండలేదు గాని యుద్ధముజరిగిన యొకసంవత్సరమునకు విజయనగరవీథులలో దానుసంచరించునపు డచటివారు చెప్పగా దాను వినియుంటినని ఫ్రెడరిక్కను నొకపోర్చుగీసు లేఖకుడు వ్రాయుచున్నాడు. ఈతురకసేనాను లిరువురును చిక్కుసమయములో ద్రోహులై శత్రుపక్షములో జేరి యాకస్మికముగా దమప్రభువు నెదుర్కొని పోరాడుట మూలముననే రామరాయలపజయము గాంచెనుగాని లేకున్న నపజయము గాంచువాడు గాడని ఫ్రెడరిక్కు తెలుపుచున్నాడు. [3] ఈవిషయమును "ఆంక్విటిల్ - డు - పెర్రాన్' అనునాతడుగూడ దెలుపుచున్నాడని హీరాసుఫాదిరి తెలుపుచున్నాడు. ఈయిర్వురిలో నొకడు రామరాయలు తనసోదరునిగా భావించికొనెడు 'ఎయిన్ - ఉల్ - ముల్కు' అనునతడయి యుండునని హీరాసు తలంచుచున్నాడు. ఇయ్యదినిజమై యుండవచ్చును. ఇతనిప్రేరేపణమూలముననే సదాశివదేవరాయలు బెవినిహల్లిగ్రామమును బ్రాహ్మణులకు దానముచేసి యుండెను. [4]
వీరుచేసిన ద్రోహమువలననే రామరాయల సైన్యములో బెద్దకలవరము పుట్టుటయు, రామరాయలకు గాయముతగులుటయు సంభవించెను. అతడు వెంటనె రణరంగమునుండి తొలగిపోవలయునని పల్లకినెక్కె నటగాని పల్లకిమ్రోయుబోయీలు హుస్సేనునిజాముషా సైన్యములోని యొకమదపుటేనుగ ఘీంకారము సేయుచు పై బడ భయపడి పల్లకి నచటవిడిచిపెట్టి పాఱిపోయిరట. అట్టినంకుల సమరమున నావృద్ధవీరుడు కాలినడకను వప్పించుకొనిపోదమని తలంచి పల్లకినుండి దిగుచుండగా నాయేనుగ రాయలను తొండముతో బట్టుకొని పై కెత్తెనని ఫెరిస్తావ్రాయుచుండగా 'ఆలీ ఇబు - అజీజ్' రామరాయలు గుఱ్ఱముమీదనుండగా బట్టువడె నని వ్రాయుచున్నాడు. ఎక్కడపట్టుబడిననేమి ? పట్టుబడినమాట వాస్తవము. అంత రాయలు చలబీరుమిలాను కడకు గొనిపోబడెను. అతడు వానినిచంపబోగా వానిసమీపమున నున్న హిందూదళవాయియగు 'దళపతిరాయి' యనుబ్రాహ్మణసేనాని యాయనను జంపకు మాతడేరామరాయలు; దివానుబరీదుకడకు గొనిపొమ్మని పలికెనట ! ఇయ్యది తెలిసికొని రుమీఖాను రామరాయలను హుస్సేనునిజాముషాకడకు గొనిపోయెనట. అతనితల వెంటనే కొట్టివేయు డనిహుస్సేనునిజాముషా యాజ్ఞాపించినట్లుగా మహమ్మదీయ చరిత్రకారులు వ్రాసియున్నారుగాని 'కోటో' యను పోర్చుగీసుచరిత్రకారుడు హుస్సేనునిజాముషా తానుస్వయముగా దనఖడ్గముతో నాతనితల ద్రుంచివైచెనని వ్రాయుచున్నాడు. ఈదుష్కార్యమును జేయునపుడు 'హుస్సేనునిజాముషా' 'ఇప్పడునీమీదనేను బగదీర్చుకొనుచున్నాను; నాకు దేవు డేమిచేయునోచేయ నిమ్ము' అనియుద్ఘోషించె నట. ఇట్లు శత్రువులదుర్మంత్రముల వలనను మాయోపాయముల వలనను 1565 సంవత్సరము జనవరి 25 తేదీని నీమహావ్యక్తి తన తొంబదియాఱవయేట రణరంగమున వీరస్వర్గమును గాంచెను. పాపము హుస్సేనునిజాముషా యిట్లక్రమముగా దనచేత జిక్కిన వృద్ధశత్రువును తలద్రుంచినందుకు మిక్కిలిపశ్చాత్తాపము జెందియుండును. ఇట్టిమహావిజయమును బొందిన సంతోషవైభవము నేమియు ననుభవింపకయే మనోవిచారముతో సంవత్సరమైన గడవకమునుపే వ్యాధిగ్రస్థుడై మరణము జెందుట తటస్థించెను. ఆహా ! విధిచెయ్దముల రహస్యములం దెలిసికొనుట నెట్టివారికి సాధ్యముగదా ?