అరుదైన రత్న సింహాసన మందు
పల్లవి:
అరుదైన రత్న సింహాసన మందుఁ గొలువాయె శ్రీరఘురాముఁడు
మెఱుపుతోఁ దగు నీలమేఘ మన సీతా సమేతుడై ఠీవి మీరె నేడు ||అరుదైన||
చరణం1:
సరిలేని మౌక్తిక ఛత్రంబు బహ్రతుఁడాసక్తి తోడుతఁ బట్టగ
వెఱవొప్ప లక్ష్మణుండు విల్లునమ్ములు దాల్చి వెనుకదిక్కున నిల్వగా
సరస శత్రుఘ్నుండు కరము లొయ్యనఁ జాచి చామరంబులు వీవఁగా
పరమభక్తుండైన పవమాన సుతుఁడు శ్రీపాదాంబుజము లొత్తఁగ నేడు ||అరుదైన||
చరణం2:
సారెసారెకు విభీషణుఁడు నాస్వామి హెచ్చరిక యనుచును దెల్పగా
కోరి సుగ్రీవాది వీరవానర వరులు గొలువు సేయుచునుండగా
జేరి మోదమున వశిష్ఠ గాధేయు లాశీర్వాదములు సేయఁగా
భూరిభేకశంఖ మొఱయు కాహళధ్వనులు భోరుకొల్పుచు మ్రోవగా నేడు ||అరుదైన||
చరణం3:
జిగి గుల్కు కమనీయ శీల దివ్యాంగనలు శృంగారములు సేయగా
పొగడొందు మాణిక్యవేదిక ప్రభలు దిక్పుంజము రంజిల్లగా
సొగసైన నుదుటఁ గస్తూరికా తిలకంబు నిగనిగను ప్రభ లీనగా
నగణితంబుగ నయోధ్యా నాయకుడు కోటి హరితేజమునఁ బొంగగా నేడు ||అరుదైన||