అమ్మనుడి/సంపుటి 7/మార్చి 2021/పదనిష్పాదనకళ

మాటల నిర్మాణం

(గత సంచిక తరువాయి...)

-వాచస్పతి

పదనిష్పాదనకళ

The joy of coining new words!

నాలుగో అధ్యాయం

తెలుగులో క్రియాకల్పన సాధనాలు

తెలుగువారి పూర్వీకులు క్రియాకల్చన చేసిన విధానం :

మన ప్రాచీన తెలుగుపూర్వీకులు రెండక్షరాల నామవాచకాలకీ, విశేషణాలకీ కొన్ని ప్రత్యయాలు చేర్చడం ద్వారా వాటిని క్రియాధాతువులుగా మార్చారు. మనం ఇప్పటికీ వాటిని వాడుతూనే ఉన్నాం. ప్రతి మూడక్షరాల తెలుగు క్రియాధాతువూ ఇలా ఏర్పడినదే. వారు చేర్చిన ప్రత్యయాలు

(i) యు, చు, ఇంచు, ఇల్లు మొ. “యు" చేఱిన పదాలు కొన్ని :

పులి = పులుపు; పులియు = పులుపుగా అగుట
తడి = చెమ్మ; తడియు = చెమ్మగా అగుట
తడ = ఆలస్యం; తడయు = ఆలస్యం చేయు; తడవు = సేపు, కాలవ్యవధి (ఇంత తడవు మొ.)
తెలి = తెలుపు; తెలియు = తెలుపుగా అగుట
విరి = పువ్వు; విరియు = పువ్వులా విచ్చుకానుట
మెఱ = ప్రకాశము; మెఱయు = ప్రకాశవంతమగుట

(ii) “చు" చేఱిన పదాలు కొన్ని :

మొల = కింద; మొలచు = కింద నుంచి వచ్చు
నెఱ =నేర్సు; నెఱచు- నేర్చు = అభ్యసించుట
వెఱ = భయం; వెఱచు = భయపడుట (-వెఱపు)
చెఱ = బంధనం; చెఱచు = బంధించి అనుభవించుట
తల = మెదడున్న శరీరభాగము; తలచు = తలతో పనిచేయుట
వల = ప్రేమ/శృంగారభావము; వలచు = శృంగారపరముగా ప్రేమించు
కల = అలజడి; కలఁచు = అలజడి కలిగించు (కలఁత)
మల = ఱాయి; మలచు = ఱాతి మీద పనిచేయు
పొడ = శరీరం (రూపాంతరం = పొడలు - ఒడలు)
పొడచు = శరీరములోకి దించుట
కోఱ = పదునైన పక్క పన్ను; కోఱచు- కఱచు = పంటితో పట్టుకానుట
నడ = కదలిక (నడపీనుఁగు = కదిలే శవం); నడచు = కాళ్ళతో కదులుట
తెఱ = అడ్డుగా కట్టిన గుడ్డ; తెఱచు = అడ్జుగా కట్టినవాటిని తీయుట
ముడి = పొడవు-వెడల్పులను తగ్గించుట; ముడుచు = సంకోచింపజేయుట
నిల = నేల; నిలచు = నేలపై ఉండు

(iii) “గు" చేఱిన పదాలు కొన్ని :

కల = అలజడి; కలఁగు = అలజడికి లోనగు (కలఁత/కలఁక)
నలి = సూక్ష్మం, కృశించుట; నలుగు = ముడతలు పడి కృశించుట (నలఁత = జబ్బు)
వెలి = తెలుపు; వెలుఁగు = తన పరిసరాల్ని తెల్లగా చేయుట
మొఱ = చప్పుడు మొఱఁగు = (కుక్క ) చప్పుడు చేయుట మొయు/మోగు = చప్పుడు చేయుట
కొఱు = పై భాగం; కొఱుగు - గొఱుగు = పై భాగాన్ని తొలగించు; గొఱగ = గొఱగబడ్జవాడు, శివభక్తుడు (తల

గొఱిగించుకున్నవాడు) (కొఱితి మరన్‌ మాన్‌ -కొత్తిమెర = ఆకుల పై భాగాలు కోసుగా ఉన్న మొక్క)

(iv) “కు" చేఱిన పదాలు కొన్ని :

కోఱ = పదునైన పక్క పన్ను; కోఱకు - కొఱకు = పంటితో గ్రుచ్చు
వెద = విత్తనం; వెదకు = విత్తనాలు ఏరడం
పల్లు = పన్ను; పలుకు = ఉచ్చరించుట
కుఱు = కింద/చిన్న కుఱుకు - కూర్ము - కులుకు = పడుకొనుట కుఱుంకు = క్రుంకు = సూర్యుడు అస్తమించుట

కుఱుంగు = క్రుంగు = మనిషి తగ్గిపోవుట

ఇవి కాక రెండక్షరాల విశేషణాల (adjectives)కి “ఇల్లుక్‌ ఇంచుక్‌ " చేర్చి క్రియాధాతువుల (verb-roots)ని నిష్పాదించారు:

సన్న + ఇల్లుక్‌ = సన్నగిల్లు; ఏవ = అసహ్యం (ఇప్పుడు యావ అంటున్నారు); ఏవ+ఇంచుక్‌ = ఏవగించు

ఈ చర్చ ఎందుకు చేశామంటే ఇంగ్లీషులో లాగా తెలుగులో కూడా ఏ నామవాచకాన్నెనా క్రియాపదంగా మార్చి వాడుకునే సౌలభ్యం ఉందని తెల్పడానికే! సౌలభ్యాలకేం, ఎన్నో ఉన్నాయి సిద్ధాన్నంలా! కాని వినియోగించుకునేవారే కఱువయ్యారు. ఒకవేళ వినియోగించినా చెవులకేదో కొత్తగా వినిపిస్తోందని వాడడం మానేస్తున్నారు. ఇలాంటి భాషాఖేషజాల నుంచి బయటపడి స్వేచ్చగా, నిర్మొహమాటంగా తెలుగుపదాల్ని ప్రయోగించే మంచిరోజులు రావాలని ఆశిద్దాం.

మనం 3 రకాల పదాల్ని కల్పించాల్సి ఉందని ఇదివఱకు అనుకున్నాం. వాటిల్లో మొదటి విభాగం క్రియాధాతువులు. ఏ భాషలోనైనా ప్రాథమికక్రియలు కొన్నే ఉంటాయి. మిగతా క్రియలన్నీ నామవాచకాల (nouns)నీ, విశేషణాల్నీ (adjectives) రూపాంతరించగా ఏర్పడ్డవై ఉంటాయి. ఇలా క్రియల్ని కల్పించడానికి తెలుగు అందిస్తున్న సౌకర్యాల గుఱించి మనం ఇప్పుడు చర్చిస్తున్నాం.

తెలుగులో క్రియా ధాతువులు అంతమయ్యే విధానాన్ని ముందు అధ్యయించాలి..

1. “చు" తో అంతమయ్యే రెండు అక్షరాల క్రియాధాతువులు. ఉదా :- కాచు, గీచు, చాచు, తోచు, దాచు, దోచు, పాచు, రాచు, వాచు, వీచు, వేచు మొదలైనవి.

2. అనుస్వార పూర్వకమైన (సున్న ముందు గల) "చు" తో అంతమయ్యే రెండు అక్షరాల క్రియాధాతువులు. ఉదా :- దంచు, దించు, తెంచు, మించు, ఉంచు, ఎంచు, పంచు, వంచు మొదలైనవి.

౩. ద్విరుక్త (వత్తు) “చు" తో అంతమయ్యే రెండు అక్షరాల క్రియాధాతువులు. ఉదా :- తెచ్చు, గుచ్చు, నచ్చు, నొచ్చు, పుచ్చు మొదలైనవి.

4. “చు" తో అంతమయ్యే మూడు అక్షరాల క్రియాధాతువులు. ఉదా :- నడచు, ఒలుచు, పొడుచు, విడచు మొదలైనవి.

5. “ఇంచుక్‌ " ప్రత్యయంతో అంతమయ్యే అచ్చతెలుగు క్రియాధాతువులు. ఉదా :- గుఱించు(addressing), ఆకళించు(explain), సవరించు (amend), సవదరించు(edit) మొదలైనవి.

6. “ఇంచుక్ " ప్రత్యయంతో అంతమయ్యే ప్రేరణార్థక క్రియాధాతువులు. ఉదా :- చేయించు ("చేయు” కు ప్రేరణార్థకం); కదిలించు ("కదులు”కు ప్రేరణార్థకం) మొదలైనవి.

7. “ఇంచుక్‌ " ప్రత్యయంతో అంతమయ్యే తత్సమ (సంస్కృత/ప్రాకృత) క్రియా ధాతువులు (ఇవి లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి) : ఉదా :- ధరించు, బోధించు, సంహరించు మొదలైనవి.

8. "యు" తో అంతమయ్యే రెండు అక్షరాల క్రియాధాతువులు. ఉదా :- ఏయు, కాయు, కోయు, కూయు, దాయు, తీయు (తివియు), తోయు, మోయు, మైయు, వేయు మొదలైనవి.

9. "యు" తొ అంతమయ్యే మూడు అక్షరాల క్రియాధాతువులు. ఉదా :- తడియు, వడియు, జడియు, అలియు, తెలియు, పులియు, ఉమియు, విరియు మొదలైనవి.

10. “ను" తో అంతమయ్యే క్రియాధాతువులు. ఉదా :- తిను, కను, విను, మను, అను, చను, కొను మొదలైనవి.

'11. సామాన్య క్రియాధాతువులూ ఉదా :- సాగు, వెళ్ళు, అదురు వదులు, పగులు, మిగులు మొదలైనవి.

12. విశేష క్రియాధాతువులు (special verbs) ఉదా :- ఉండు, పోవు, చూచు, అగు, వచ్చు, ఇచ్చు, చచ్చు, తెచ్చు మొదలైనవి.

13. కొన్నిసార్లు ఉనికిలో అప్పటికే ఉన్న రెండక్షరాల క్రియాధాతువులకి మళ్లీ కు, గు ఇత్యాది ప్రత్యయాల్ని అదనంగా చేర్చి కొత్త ధాతువుల్ని నిష్పాదించడం జరిగింది. ఉదా:

ఉబ్బు + కు = ఉబుకు; అద్దు + కు + అదుకు/ అతుకు;
మెత్తు + కు = మెదుగు; ఒత్తు + గు = ఒదుగు; ఎత్తు +గు= ఎదుగు మొ


మఱోక విషయం :- తెలుగులో క్రియలు రెండు విధాలుగా ఉంటాయి. 1. సకర్మక క్రియలు (transitie erbs) 2. అకర్మక క్రియలు (intransitie erbs). సూత్రం-1. సకర్శక క్రియలకి మాత్రమే చివఱ “ఇంచుక్‌” ప్రత్యయం వస్తుంది.

అంటే చేయడాన్ని ఇంచుక్‌ సూచిస్తుంది.

ఉదా :- ధరించు- ఆయన కిరీటం ధరించాడు. (ఇక్కడ ధరించు అనే క్రియకు కిరీటం కర్మ కనుక ఇది కర్మ గలిగిన సకర్మక ధాతువు) సూత్రం-2. అకర్శక క్రియలకి చివణ “ఇల్లుక్‌ “వస్తుంది.

అంటే, కావడాన్ని ఇల్లుక్‌ సూచిస్తుంది.

ఉదా :- ఆమె అతని హృదయేశ్వరిగా విరాజిల్లింది. (ఈ వాక్యానికి కర్మ లేదు కనుక “విరాజిల్లు” అకర్మక ధాతువు)

ఈ మార్గంలో కల్పించదగిన కొన్ని పదాలు :

సన్నగిల్లు = సన్నగించు (సన్నగా అయ్యేలా చేయు); పరిఢవించు= పరిఢవిల్లు తొందఱించు = తొందఱిల్లు మొదలైనవి.

“ఇంచుక్‌, ఇల్లుక్‌" లని సమయోచితంగా పదాలకు చేర్చడం ద్వారా అంతులేనన్ని కొత్త క్రియాధాతువుల కల్పనకి తెలుగు భాష అవకాశమిస్తోంది. రెండూ ముఖ్యమైనవే. “ఇల్లుక్‌" చేర్చు తెలుగు నుడికారానికి స్వాభావికం కాని కర్మార్థక (passie oice) ప్రయోగాల అవశ్యకతని గణనీయంగా తగ్గిస్తుంది.

1. ఉదా (సవరిత వాడుక - modified usage): - ఆ వేగుతో అతను హెచ్చఱిల్లాడు = హెచ్చఱించబడ్డాడు - మేలుకున్నాడు (He got alert with the mail)

2. ఉదా (నిష్పన్న వాడుక - Coined usage) :- భవిష్యత్తులో వంద డాలర్ల లోపలే కంప్యూటర్లు అందుబాటిల్లుతాయి. (అందుబాటులోకి వస్తాయి = దొఱుకుతాయి. (Future PCS could be accessed/accessible at just $ 100)

ఇక్కడ కొన్ని నియమాలు ప్రవర్తిస్తాయి. మనం కల్పించే పదాల శ్రావ్యతని బట్టి వాటిని పాటించడమో మానుకోవడమో చెయ్యొచ్చు.

3. ఉర్దూ పదాలకు “ఇంచుక్‌/ఇల్లుక్‌” చేర్చడానికి ముందు ఆ పదాల చివర 'ఆయ్‌” చేఱుతుంది. ఉదా :- ఉడ్ (ఎగరడం) - ఉడ్+ ఆయ్‌ = ఉడాయ్‌ + ఇంచుక్‌ = ఉడాయించు (to decamp) బనా(తయారు చెయ్యడం) - బనా + య్‌ = బనాయ్‌ + ఇంచుక్‌ =బనాయించు (to frame a criminal charges)

అభ్యాసకార్యములు

I. రెండక్షరాల నామధాతువుల్ని క్రియాధాతువులుగా మార్చడం- వ్యాకరణకార్య సూచనలు (grammar hints)

(అ) ప్రత్యయాల్ని చేర్చేముందు రెండో అక్షరం ద్విత్వమైతే ఆ ద్విత్వాన్ని తొలగించాలి.

(ఇ) ఆ అక్షరం కచటతపల్లో ఒకటైతే దాన్ని గసడదవలుగా మార్చాలి.

(ఉ) అది ఏ అచ్చును కలిగి ఉన్నప్పటికీ అంతిమంగా దాన్ని అకారసహితం చేయాలి.

ఉదా:- పెచ్చు= (విశే.) హెచ్చు, అదనం; పెచ్చు + పు = పెచ్చపు = పెచపు =పెసపు నేను దీనికి ఇస్తున్న అర్ధం - మఱింత పదార్ధాన్ని సామగ్రినీ మీద పేర్చి బలోపేతం చేయడం 10 19010106.

ఈ అధ్యాయంలోని సూచనల్ని అనుసరించి ఈ క్రింద ఇచ్చిన అచ్చతెలుగు నామవాచకాల్ని క్రియాధాతువులుగా మార్చి మీరు అనుకుంటున్న అర్ధాన్ని జోడించండి :

1.అడి = అధికము, వ్యర్థము 2. అని = యుద్ధము 3. అబ్బ= తండ్రి 4. అబ్బి = మనిషి (మగవాడు) 5. అఱ = సగము 6.అరి = పన్ను 7. అఱ = ముసలి ఆవు 8. అల = చిఱుకెఱటం 9. అల్ల = మందము 10. అవ్వ = తాతభార్య 11. ఇడి = సేమియా 12. ఇట్టి = మగజింక 13. ఇల్లి = ఉపవాసము 14. ఉడ్డ = రాశి 15. ఉట్టి = కప్పుకు వేలాడదీసిన పాలకుండ మొ॥ 16. ఉల్లి = ఒక శాకము 17. ఉరి = ఉద్బంధనము 18. ఉమ్మ = అవిరి 19.ఉలి = శిల్పాలు చెక్కే పనిముట్టు 20. ఎడ = చోటు, అంతరం, మనస్సు, హృదయం, సమయం 21. ఎద = మనస్సు,హృదయం 22. ఎన = సాటి, సమం 23. ఎమ్ము = ఎముక 24. ఎర = బలి, ఆహారము 25. ఎల = లేత, యౌవనములోని 26. ఎల్ల = అన్నీ 27. ఎస = మిక్కిలి 28 ఒగి = వరుస, క్రమము 29. ఒజ్జ్ఞ =గురువు 30. ఒర = కత్తిని ఉంచే కోశం. 31. బరి = ప్రక్మన 32. గఱి = ఱెక్క 33.అల = చిఱుకెఱటం 34. ఆన = ఒట్టు 35. బాన= గుండ్రని కాగు 36. వాన = వర్షం 37. జేన (జాన) = వయోజనుల (20019) అరిచేతిని పూర్తిగా చాపినప్పుడు బొటనవేలి కొస నుంచి మధ్యవేలి కొస దాకా వచ్చే పొడవు ౩8 చెఱ = బంధనం 39. అర= కొయ్యసామగ్రిలోని గడి 40. మర = యంత్రం 41. వల = చేపలుపట్టడానికి వాడే అల్లికపని 42. కడ = అంతం 43. వడ =మినప్పప్పుతో చేసే ఒక భక్ష్యం 44 తెగ = ఉపజాతి 45. నగ = ఆభరణం 45. పగ = ప్రతీకారవాంఛ 46. గది = ఇంటిలో ఒక భాగం 47. రొద = రణగొణధ్వని 48 పొద (పొదరు) = మొక్కల గుబురు. 49. చెద = తెల్ల పురుగుల గూళ్ళు 50. వెల= మూల్యం


శ్రద్దాంజలి

అమ్మకు విప్లవ వందనాలు

ప్రభలకుమారికి కుమార్తె బీనాదేవి కన్నీటి వీడ్కోలు

తిరుపతి మావోగా ప్రసిద్ది పొందిన త్రిపురనేని మధుసూదనరావు సతీమణి(73) ఈ జనవరి 13న తీవ అనారోగ్యానికి గురై మరణించడం బాధాకరం. ఆమెకు కొడుకు విజయకుమార్‌ కుమార్తె బీనాదేవి వున్నారు. కృష్ణాజిల్లా గుడివాడ సమీపంలోని నందివాడకు చెందిన ప్రభలకుమారి త్రిపురనేని జీవిత సహచారిగా ఆయన విప్లవ సాహిత్య రాజకీయ అడుగు జాడల్లో నడిచారు. ఎమర్షైన్సీ సమయంలోనూ, చిత్తూరు, సికింద్రాబాదు కుట్రకేసుల్లో త్రిపురనేని అరెస్టు అయి లెక్చరర్‌ ఉద్యోగం నుంచి సస్పెండ్‌ అయినప్పుడూ, ఇతర నిర్భంధ సమయాల్లోనూ ఆమె ఎన్నో కష్టాలు, బాధలు భరించారు. ఎన్నడూ థైర్యం కోల్పోలేదు. పశ్చాత్తాపం చెందలేదు. పిల్లల భవిష్యత్తును భర్త పట్టించుకోకున్నా కుటుంబం ఎంతో- విప్లవమూ అంతే అని నమ్మింది. ఆమె ఉద్యమంలో చేసే విద్యార్దులు, రచయితలు ఆమెకెంతో ప్రీతిపాత్రులు. వాళ్ళ బాగోగులు, ఉద్యమకార్యక్రమాల గురించి మాతో వెళ్ళినప్పుడంతా మాట్లాడేది ప్రభలకుమారి. సాధారణ గృహిణేకాదు అసాధారణ మహిళ కూడా. సంప్రదాయం ఆచారాలకు భిన్నంగా తిరుపతి గోవిందధామంలో ఆమె అంత్యక్రియలను కుటుంబ సభ్యులు నిర్వహించారు. ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ త్రిపురనేని కుటుంబంతో తనకు విడదీయరాని అనుబంధం వుందని గుర్తుచేసుకున్నారు. ప్రభలకుమారి భౌతికకాయంపై చంద్రశేఖర్‌, జ్యోతి, శ్రీరాములు ఎర్రజెండా కప్పి నివాళి అర్చించారు. దహనపేటిక మీద అమ్మను చూస్తూ బీనాదేవి 'మా అమ్మ లేకుండా మా నాన్న లేరు. అమ్మా నన్ను కన్నందుకు విష్లవాభినందనాలు" అని కన్నీళ్ళతో వీడ్కొలు పలికారు. -సాకం నాగరాజు

సీమ వాకిట... కథా నిలయం 'కారా 'బాటలో “అరా”!

మంచి పనుల్ని కొంతమంది మంచివాళ్ళు అందిపుచ్చుకుంటారు. అలాంటి మంచివాళ్ళలో జనవరి 31న కన్నుమూసిన అబ్బిగారు రాజేంద్రప్రసాద్‌ ఒకరు. కారా మాస్టారు “కథానిలయం” స్థాపించారని చాలా మందికి తెలుసు. అలా తెలుసుకున్న అబ్బిగారి రాజేంద్రప్రసాద్‌(అరా) ఓ కథానిలయాన్ని నందలూరులో స్థాపించి అందులో వేలాది పుస్తకాలను సేకరించి పెట్టారు. కానీ కాళీపట్నం కథానిలయంతో అబ్బిగారి కథానిలయానికి పోలిక తగని కార్యం. కథానిలయం పేరు - ఓ ముచ్చట అబ్బిగారికి. ఆ పేరు మీద 15 సం॥రాల పాటు కవుల జయంతులు, వర్థంతులు, పుస్తక ఆవిష్కరణలు, రచయితల సత్కారాలు, ఆవిష్మరణలు,.... లెక్కేలేదు. విద్యార్థి దశలో వామపక్షభావవైతన్యం, కడప ఆర్ట్స్‌ కళాశాల విద్యార్ధి సంఘం చైర్మన్‌ పదవి రాజేంద్రకు పేరు తెచ్చిపెట్టింది. ఎదుటి మనిషిని పలకరించడంలో ఆత్మీయత గుబాళించడం ఇంకో గొప్పదనం. పుస్తకాన్ని రచయితను నెత్తిన పెట్టుకాని ఊరేగిన వ్యక్తిగా గుర్తింపు ఫొందిన ధన్యజీవి అ.రా. 1962 జూన్‌ 15న పుట్టిన రాజేంద్రప్రసాద్‌ అరవై ఏళ్లలోపే కనుమరుగు కావటం సమాజంలో ఎంతో లోటును మిగిల్సింది. -సాకం నాగరాజు