అమ్మనుడి/సంపుటి 7/ఏప్రిల్ 2021/విద్యామాధ్యమంపై వీడుతున్న వలసవాదపు నీడలు
విద్యామాధ్యమం
జె.డి.ప్రభాకర్ 8500227185
విద్యామాధ్యమంపై వీడుతున్న వలసవాదపు నీడలు
సమాజంలో ప్రజలు స్థానికంగా అమ్మనుడులను పలుకుతూ జీవనం సాగించే సహజ వాతావరణంలో ఇతర బాషలు ఉపయోగించే సందర్భాలు కలగడానికి అనేక కారణాలు ఉండవచ్చు. ఒక ప్రాంతానికి పక్కనే వేరొక భాషా సమూహం సరిహద్దులు పంచుకున్నప్పుడూ, ప్రకృతి వైపరీత్వాలూ, వలసలూ, వ్యాపారాలూ మొదలగు కారణాలచేత ఒక భాషా సమూహం వారు మరొక భాష నేర్చుకునే పరిస్థితులు నెలకొంటాయి. అలా కాకుండా వ్యాపారం పేరుతో దేశాలను రాజకీయ చతురతతో దురాక్రమణ చేసి, ఆ దేశంలో నివసిస్తున్న ప్రజల శ్రమశక్తిని దోచుకుంటూ, అధికారాన్ని విస్తరింప చేస్తూ వారి భాషనూ, సంస్కృతినీ, మతాన్నీ ఇతరులపై బలవంతంగా రుద్దే క్రమం 15వ శతాబ్దంలో యూరోపియన్లు ప్రారంభించారు. మన భారతదేశంలో ఈ వలసవాదం 18వ శతాబ్దంలో ప్రారంభమైంది. చరిత్రకారుడు ఫిలిప్ హాఫ్మన్ చెప్పినట్లు 1914 సంవత్సరం నాటికి బ్రిటిష్ వలసవాదులు 84 శాతం భూగోళాన్ని దమననీతితో ఆక్రమించారు.
ఆచార సంస్కృతులలో మార్పులు:
వలనవాదానికి గురైన అనేక ప్రాంతాలూ, దేశాలూ వారి ఆచారాలూ, కట్టుబాట్లూ, సంస్కృతీ, సంపదా, భాషలూ సంకట స్థితిలోకి వెళ్లాయి. మొదట, బ్రిటిష్ ప్రభుత్వంలో ముఖ్యులైన వారెన్ హేస్టింగ్స్ మతమూ, సామాజిక ఆచారాల విషయాలలో జోక్యం చేసుకోకూడదు అనే ఉద్దేశంతో “ప్రతి సమాజంలో దాని సహజ చట్టాలూ, దాని ఆచారాలూ, అభ్యాసాలూ ఉన్నాయని, వాటిని కొనసాగించడానికి అనుమతించాలి” అని ఆదేశించారు. 1781 లో మొహమ్మడన్ కాలేజ్ 1782 లో హిందూ కాలేజీలను స్థాపించి, మన దేశం యొక్క సాహిత్యమూ, చట్టమూ, మతాన్నీ పరిరక్షించాలని ఆదేశించారు. కొద్దికాలంలోనే, అంటే జూలై 10వ తారీకు 1800 సంవత్సరంలో కాలేజ్ ఆఫ్ ఫోర్ట్ విలియంని బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్ స్టాపించి- ఓరియంటల్ భాషలపై దృష్టి కేంద్రీకరించారు. భారత దేశంలో ప్రజల సాంఘిక మరియు సాంస్కృతిక జీవితంలో ఉద్దేశపూర్వకంగా జోక్యం చేసుకోని బ్రిటిష్ విధానం- 1813 తరువాత గణనీయమైన మార్పుకు గురైంది. పారిశ్రామిక విప్లవం రూపంలో ఇంగ్లాండ్‌లో జరిగిన భౌతిక మార్పు దీనికి ప్రధాన కారణం. ఈ మార్పులో భాగంగా, బ్రిటీష్ ఇండియా యొక్క అన్ని అధికార పరిధులలో సతి ఆచారాన్ని నిషేధించిన బెంగాల్ సతీ రెగ్యులేషన్ 1829 డిసెంబర్ 4 న అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ విలియం బెంటింక్ ప్రేరణతో ఆమోదించడం జరిగింది. సతీ సహగమనం మానవ స్వభావం యొక్క భావాలకు విరుద్దం అని నియంత్రణ విధించింది. బాల్య వివాహాలు కూడా 19 వ శతాబ్దపు భారతదేశంలోని మరో దురాచారం. భారతీయ సంస్కర్తలు కేశవ్ చంద్ర సేన్, బిఎమ్ మలబరి ఈ పద్దతిని భారతీయ సమాజం నుండి నిర్మూలించడానికి కృషి చేశారు. స్త్రీ శిశుహత్యలు మరొక అమానవీయ పద్ధతి. దాన్ని కూడా అరికట్టడానికి బ్రిటీషువారు 1795, 1802, 1804 తరువాత 1870 లో ఈ సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా చట్టాలను రూపొందించారు. అయినప్పటికీ భారతదేశంలో ఉన్న సంఘ సంస్కర్తలైన మహాత్మ జ్యోతిబా పూలే, రాజా రామ్మోహన్ రాయ్, కందుకూరి వీరేశలింగం పంతులు మొదలగువారు భారతదేశంలోని సతీసహగమనమూ, బాల్య వివాహమూ, అస్పృశ్యతా వంటి సామాజిక దురాచారాలను అధ్యయనం చేసి వాటికోసం స్థానిక భాషలలో ప్రజలను విద్యావంతులను చేసి వీటిని అరికట్టడంలో ముఖ్య పాత్ర పోషించారు.
బ్రిటిష్ పరిపాలనలోని విద్య - అర్థిక దోపిడి:
వ్యాపారం చేసుకోవడానికి ఈస్టిండియా కంపెనీ పేరుతో బ్రిటీషు వారు భారత దేశంలోకి అడుగుపెట్టి, క్రమేణా భారతీయులకు విద్యను అందించడానికి గల ప్రధాన కారణం- ఆర్థిక లాభాలను ఆర్జించడానికే అని చెప్పవచ్చు. ఇక్కడ భారతీయులను బానిసలుగా చేసుకుని వారి శ్రమను దోపిడీ చేసి, తద్వారా సంపదను భారతదేశం నుండి తరలించి, తమ దేశానికి ఎగుమతి చేసుకోవడానికి ఉపయోగించుకున్నారు. 1.వ్యాపారం విస్తరింపచేయడానికీ, 2.దేశంలో ఉన్న ప్రజలందరినీ రాజకీయంగా పరిపాలించడానికీ, 3.బ్రిటిష్ ప్రభుత్వానికీ భారతీయులకూ మధ్యవర్తులుగా పనిచేసే ఒక వర్ణం కావాలని భారతీయులకు విద్య నేర్పించడం జరిగింది. కైస్తవ మిషనరీల సహాయంతో ప్రైవేట్ పాఠశాలలనూ మరియు ప్రభుత్వ పాఠశాలలనూ ఏర్పరిచారు. బాంబే ప్రెసిడెన్సీలో, మౌంట్‌స్టూవర్డ్ ఎల్సిన్‌స్టోన్, 1827లో గవర్నర్‌గా ఉన్నప్పుడు, భారతీయులకు చదువు మాతృభాషలో కల్పించాలని బొంబాయి ఎడ్యుకేషన్ సొసైటీని ప్రోత్సహించారు. మాతృభాష ద్వారా పాశ్చాత్య శాస్త్రం మరియు జ్ఞాన వ్యాప్తిని ప్రోత్సహించడానికి అనేక జిల్లా ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు చేయబడ్డాయి. అయినప్పటికీ చాలా మంది ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులు ఇంగ్లీషు బోధనా మాధ్యమంగా ఉండాలని కోరుకున్నారు. అయితే బాంబే ప్రెసిడెన్సీ విద్యావిధానం స్థానిక భాషలకు విరుద్ధంగా ఉండడంతో ఈ నిర్ణయం వివాదానికి తెరలేపింది. ఇంగ్లీష్‌లో చదువుకున్న వారికే కొలువుల్లో పనిచేయడానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చారు. వారి ప్రభుత్వం కోసం పనిచేసే వారిని ఎంపిక చేసుకోవడం మెకాలే మినిట్ అన్ ఇండియన్ ఎడ్యుకేషన్ 1885 లో పేర్కొన్నట్టుగా “మనకూ, మనం పరిపాలించే లక్షలాది ప్రజలకూ మధ్య వ్యాఖ్యాతలుగా ఉండే వర్గాన్ని రూపొందించండి వర్గపరంగా, రక్తం మరియు రంగులో భారతీయులూ, కానీ రుచి అభిప్రాయాలు, నైతికత, తెలివితేటలలో ఇంగ్లీషు వారిగా ఉండాలి, వాళ్లనే బ్రిటిష్ ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ఉండేవారు. ఈ వర్గాన్ని ఉపయోస్తూ అనేకమంది శ్రమను దోచుకున్నారు. భారతీయులను బానిసలుగా మలిచారు. ఇంగ్లీషు భాషను ఎర చూపి ఈ వర్గానికి భారతీయత అనే భావన లేకుండా చేశారు. దేశాన్ని ఆర్థికంగా కొల్లగొట్టారు.
ఇంగ్లీషు భాషా వ్యాప్తికి ఆర్థిక కారణాలు:
బ్రిటీషువారికి తమ వ్యాపారం విస్తరించాలన్నా, రాజకీయంగా దేశాన్ని నియంత్రించాలన్నా భాష ముఖ్య సాధనంగా నిలిచింది. తమకు తెలియని భారతీయ భాషలు నేర్చుకొని వ్యాపారం కొనసాగించడం కష్టమని భావించి, భారతీయులను అనేకమందికి తమ భాష నేర్పించి శ్రామిక వర్గాన్ని తయారుచేసుకొన్నారు. ఇంగ్లీషు భాషా వ్యాప్తి బ్రిటిష్‌వారి వ్యాపార వ్యాప్తికి సారూప్యతను కలిగి ఉంది. దోపిడీకీ, రాజకీయ నియంత్రణకూ భాషే ఆధారమైంది. భారతీయులకు పాఠశాలలు స్థాపించి ఇంగ్లీషు భాషలో విద్య నేర్పించడాన్ని తమ అక్రమార్జనకు పెట్టుబడిగా భావించారు. భారతదేశ సంపదను వారి దేశానికి ఎగుమతి చేయడానికి ఇంగ్లీషు భాషను ఒక వాహనంగా వాడుకున్నారు.
భారతదేశంలోని ఎగువ మధ్యతరగతీ, మధ్యతరగతీ వర్గాలు బ్రిటిష్ ప్రభుత్వానికి పని చేయడం వలన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్న ఆశతో ఇంగ్లీష్ నేర్చుకోవడం ఆరంభించారు. ఆనాటి భారతీయులకు ఇంగ్లీషు నేర్పించడం ఈస్టిండియా కంపెనీ నియంత్రణలోనే ఉండేది. 19వ శతాబ్దం నాటి ఎగువ మధ్య తరగతీ, మధ్యతరగతీ భారతీయులు ఉద్యోగాలు చేసుకోవడం వల్ల తమ ఆర్థిక పరిస్థితి మెరుగవుతుందని, చక్కటి జీవన విధానం ఏర్పడుతుందన్న ఆశతో తమ పిల్లల్ని ఇంగ్లీషు మాధ్యమ పాఠశాలలకు పంపించేవారు. బ్రిటిషు పాలకులతో ఇంగ్లీషులో మాట్లాడమే గొప్పగా భావించేవారు.
బ్రిటిష్ ఇంగ్లీషు విద్య - స్వతంత్ర భారతదేశంపై ప్రభావం:
బ్రిటిష్‌వారు అందించిన ఇంగ్లీషు విద్యను ఒక భాషా కోణంలో మాత్రమే చూడకూడదు. మన దేశ ఆచారాలనూ, సంస్కృతినీ, దేశీయ సాహిత్యాన్నీ మరుగుపరిచే విధంగా - పాశ్చాత్య విద్యను అమల్లోకి తీసుకువచ్చారు. భారతీయ భాషలలో వ్రాయబడ్డ మన సాహిత్యాన్నీ అధ్యయనం చేయడానికి తావు ఇవ్వలేదు. మన భావాలను మన భాషల్లో వ్యక్తీకరించడానికి ఆనాటి విద్యలో అవకాశం కల్పించలేదు. మన నీరు తాగుతూ, మన ఆహారాన్నీ తింటూ, మన నేల మీద ఉంటూ, యూరోపియన్ల సాహిత్యమూ, వారి కళలనూ, శాస్తాలనూ అభ్యసింపచేశారు. స్థానికంగా మనకుండే సమస్యలూ, కళల మీద అధ్యయనం కొరవడింది. పూర్తిగా మన దేశం యొక్క స్థితిగతుల మీద అవగాహన లేకుండా ఆనాటి విద్య పెడదొవ పట్టించిందనే చెప్పాలి. కాలక్రమేణా మన దేశ భాషల స్థానే న్యాయస్థానాల్లోనూ, ఇతర అధికార కార్యకలాపాలలోనూ ఇంగ్లీషుతో భర్తీ చేశారు.
73 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో నేటికీ వాటి నీడలు అలాగే నిలిచిపోయాయి. బ్రిటీష్ వారు పరిపాలించిన అన్ని దేశాల్లోనూ విద్యా రంగాల్లో ఇంగ్లీష్ మాధ్యమంగా ఉంటోంది. ఆర్థిక దోపిడీ నుంచి అన్ని దేశాలూ బయట పడుతున్నా బ్రిటీషువారు వదిలి వెళ్లిన భాషను మాత్రం విద్యా రంగంలోనూ, అధికార కార్యాలయాలనూ కొనసాగిస్తూనే ఉన్నారు. ఆనాడు ఈస్టిండియా కంపెనీ వారు విద్యను నియంత్రించే స్థాయిలో ఉంటే - ఈనాడు విద్యా మాధ్యమంలో ఏ భాష ఉండాలనేది ప్రైవేటు కంపెనీలూ, మార్కెట్లూ నిర్ణయించే స్థాయిలోకి వచ్చింది. విద్య పూర్తిగా వ్యాపారమయమై. పోయింది. ఇంగ్లీష్ వస్తేనే ఉద్యోగాలు వస్తాయి అనే భ్రమలోకి నేటి సమాజాన్ని తీసుకెళ్లారు.బ్రిటీషు కాలంలో వారికి పనిచేసిన వారిలాగే, రక్తంలోనూ, రంగులోనే భారతీయులుగా ఉంటూ, భావాలలోనూ, నైతికతలోనూ, తెలివితేటల్లోనూ ఇంగ్లీషు వారిగా నేటికీ మన సమాజంలో చదువుకున్నవారు ఉండటం శోచనీయం. ఇంగ్లీషు నేర్చుకుని బ్రిటిష్ వారికి సేవ చేసి ఆర్థికంగా లాభపడాలని ఎగువ మధ్యతరగతీ, మధ్యతరగతీ వర్గాలు ఆనాడు ఏ విధంగా అయితే అనుకున్నాయో, నేడు కూడా నేర్చుకున్న ఇంగ్లీషు విద్యతో విదేశాలకు వెళ్లి వారికి సేవ చేసి ఆర్థికంగా బలపడాలని ఆలోచిస్తూ పనిచేస్తున్న వారూ ఉన్నారు. అయితే, ప్రపంచంలోని సమాచారం, సాహిత్యం ఎక్కువగా ఇంగ్లీష్ భాషలో ఉండటం వలన వాటిని అభ్యసించడానికి, జ్ఞానార్జనకు ఇంగ్లీషు భాషలో చదువుతున్నారు. ఉద్యోగ అవకాశాల కోసం కూడా ఇంగ్లీషు ప్రధానాధారం అని ఇంగ్లీషు మాధ్యమంలో చదువుతున్నారు. కానీ నేడు అభివృద్ది చెందుతున్న కృత్రిమ మేథతో (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) యంత్రానువాద సహాయంతో ఒక భాష నుంచి అనేక భాషలకు అనువాదం జరుగుతున్న ఈ కాలంలో జ్ఞానార్జనకు భాష అడ్డుగోడగా ఉంటుందనడంలో నిజం లేదు. ఇక భారతదేశంలో ఉద్యోగ అవకాశాలు పొంది పనిచేస్తున్న వారిలో ఇంగ్లీషు భాషలో నిష్టాతులై, దానిని ఉపయోగిస్తూ సంపదను సృష్టించడమూ లేదు.
మూడు భాషల సూత్రం:
స్వాతంత్రానంతరం అప్పుడే వలసవాద నీడల నుంచి బయట పడుతున్న సమయంలో శ్రీమతి ఇందిరాగాంధీ ప్రభుత్వంలో 1968 లో భాషా సమూహ గుర్తింపునూ, జాతీయ ఐక్యతనూ దృష్టిలో ఉంచుకొని, పరిపాలనా సామర్థ్యం లక్ష్యంతో మూడు భాషల విధానాన్ని అమలు చేశారు. ఈ మూడు భాషల సూత్రం ప్రాంతాలను ఆధారంగా చేసుకొని రూపొందించినట్టుగా కనిపిస్తుంది. హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో హిందీ, ఇంగ్లీషు మరొక ఆధునిక భారతీయ భాషను ఉపయోగించాలనీ, హిందీ యేతర రాష్ట్రాల్లో స్థానిక భాష ఇంగ్లీషూ, హిందీ భాష ఉండాలని సూచించింది. తమిళనాడు రాష్ట్రం హిందీ భాషను బలవంతంగా రుద్దడం ఖండించి, మూడు భాషల సూత్రాన్ని వ్యతిరేకించారు. చివరకు మూడు భాషల సూత్రం దేశంలో
విజయవంతంగా అమలుపరచడంలో విఫలమై చతికెలపడిందని చెప్పొచ్చు. ఏది ఏమైనప్పటికీ, బ్రిటీష్ వారు రూపొందించిన ఇంగ్లీష్ మాధ్యమ విద్య నుండి బయటకు వచ్చి - స్థానిక భాషలో విద్యను అందించే ఆలోచన చేయడం హర్షణీయం. కానీ, ప్రభావవంతంగా ఈ సూత్రాన్ని అమలు చేసి, స్టానిక భాషల్లో విద్యను అందించినట్లయితే
ఫలవంతంగా ఉండేది. విద్యా నాణ్యతా, బొధనా పద్దతులూ ఆశించిన విధంగా లేకపోవడం వల్ల విద్యార్థుల ఫలితాలు పాఠశాలలో నిరాశ పరిచే విధంగా ఉన్నాయని 2018 వ సంవత్సరం లో విడుదల చేసిన ప్రపంచ బ్యాంకు గణాంకాలలో తేలింది. విద్యార్థుల అంతర్జాతీయ పరీక్షా ఫలితాలను ప్రపంచ దేశాలతో పోల్చి చూసినప్పుడు, నిరంతరం యుద్ద వాతావరణం గడిపే ఆష్థనిస్తాన్‌తో సమానంగా మన దేశ ఫలితాలు ఉండటం విచారకరం. సగటున వేయికి 400 ఉంటే, భారతదేశంలోని విద్యార్థుల ఫలితాలు 355 సంఖ్యలో ఉన్నాయి.
నూతన విద్యా విధానం -2020:
భారతీయ భాషలను ఒక అంశంగా కాకుండా- విద్యా మాధ్యమంగా చేయడం పూర్తిగా వలసవాదపు భావాలకు విభిన్నంగా ఉండటం గొప్ప విషయం. విద్యను వలసవాద నీడల నుండి స్వతంత్ర పరిచినట్టు ఉన్నది. అమ్మనుడులను బోధనా మాధ్యమంగా 29జులై 2020నుండి అమలు పరుస్తూ. ..”సాధ్యమైన చోట, కనీసం 5 వ తరగతి వరకు, కానీ 8 వ తరగతి వరకు, అంతకు మించి ఇంటిభాష/ మాతృభాష / స్థానిక భాష / ప్రాంతీయ భాష బోధనా మాధ్యమంగా ఉంటుంది” అని స్పష్టం చేసింది. దీనికి గల ప్రథాన కారణం బహుభాషావాదాన్ని ప్రోత్సహించడంతోపాటు, జాతీయ ఐక్యతను ప్రోత్సహించడం కోసం. ఈ విధానంలో మూడు భాషలు ఎంపికకు వీలు ఉన్నా, అందులో రెండు భారతదేశానికి చెందినవే అవ్వాలి. అయినప్పటికీ ఏ భాష కూడా బలవంతంగా విద్యార్థులపై గతంలో లాగా రుద్దదని - మానవ వనరుల అభివృద్ది విద్యా మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. నూతన విద్యా విధానం 2020లో భారతీయ సంస్కృతిని పాఠశాల విద్యలో ప్రతిబింబించేలా పాఠ్యప్రణాళికలు రూపొందించడం ప్రధానాకర్షణగా నిలుస్తోంది. ఇందులో కొన్ని విషయాలు మెరుగుపరచవలసినవి ఉన్నా పూర్తి స్థాయిలో ఇది ఎటువంటి ఫలితం తీసుకుంటుందో చూడాలి.
ఈ వ్యాసరచయిత పరిశోధక విద్యార్థి, హైదరాబాదు విశ్వవిద్యాలయం.
మాతృభాషలో చదివిన పిల్లలు, ఇతర భాషలో చదివిన పిల్లలకంటే మెరుగుగానూ, త్వరగానూ నేర్చుకొంటారు. ఇంటి భాషలో చదివిన పిల్లలు, తర్వాత పాఠశాలలో పరీక్షలలో పనితీరు బాగుంటుంది. ప్రతిభా నైపుణ్యాలకు మించి ప్రయోజనాలతో బాటు మెరుగైన ఆత్మనిర్భరత, ఆత్మగౌరవం, ఆత్మధైర్యం అలవడతాయి -యునెస్మో