అమ్మనుడి/సంపుటి 7/ఏప్రిల్ 2021/మానవజాతుల సమగ్ర వికాసం కోసమే మాతృభాషలు

సంపాదక హృదయం


సంపుటి; 7 సంచిక; 2

అమ్మనుడి

ఏప్రెల్‌ 2021

మానవజాతుల సమగ్ర వికాసం కోసమే మాతృభాషలు

మాతృభాషల పుట్టుక, పెరుగుదల ప్రపంచమంతా ఎన్నేళ్లక్రితం మొదలై కొనసాగుతున్నదో స్పష్టమైన అంచనాలు ఏమీలేవు. అయితే వాటి పతనం మాత్రం ఇటీవల కాలంలో చాలా వేగంగా జరుగుతోందనే అనుకోవాలి. లభిస్తున్న చారిత్రిక ఆధారాలను బట్టి, ఇరవై ఏళ్ల క్రితం వరకు యునెస్మో సేకరించిన వివరాలను బట్టి ఈ సమాచారం తెలుస్తుంది. ఇదంతా మన అమ్మనుడి చదువరులకు తెలిసిందే.

తెలుగు వారికి సంబంధించినంత వరకూ సుమారు ఇరవైఐదేళ్లుగా వెలికివస్తున్న ఆందోళనలు, ఆవేదనలు తరువాత దేశ వ్యాప్తంగాను, వివిధ భాషాజాతులలో వస్తున్న కదలికా మనందరం గమనిస్తున్నదే. ప్రపంచంలోని అనేక మంది మేధావులు వివిధ దేశాలలో చేస్తున్న ఆందోళనలు, ఉద్యమాలు ఈ పరిణామాలకు దోహదం చేస్తున్నాయి. బంగ్లాదేశ్‌ ఏర్పాటుకు దారితీసిన పరిణామాలు గానీ, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భాష విషయమై వస్తున్న కదలికలు గానీ సొంతభాషలతోనే అత్యాధునిక జ్ఞాన సముపార్దన సులభ సాధ్యమనేీ, నిరూపణ అవుతూనే ఉంది. కానీ స్వార్ధపర, అవినీతి మయ, వలసవాద ఆధిపత్య శక్తులు పాలనా రంగాల్లో బలపడుతుండడం వల్ల ఇది క్రమంగా రాజ్యాల మధ్య, ప్రభుత్వాల మధ్య మాత్రమే కాకుండా ప్రపంచ మానవ జాతుల మధ్య కూడా వైరుధ్యాలను పెంచేందుకు దారి తీస్తున్నది.

భారతదేశానికి సంబంధించి, ఈ పరిణామాలు చాలా త్వరగా చోటుచేసుకుంటున్నాయని, విజ్ఞులు హెచ్చరిస్తున్నారు. 2021 ఫ్రిబ్రవరి 21 ఎల్లనాడుల అమ్మనుడుల పండుగ సందర్భంగా, జరిగిన కార్యక్రమాలు ఇందుకు అద్దం పట్టాయి. రాజ్యాంగం గుర్తించిన 22 భాషలనూ అధికారిక భాషలుగా గుర్తిస్తూ రాజ్యాంగ సవరణ చేయ్యాలనే బెంగళూరు తీర్మానం కేంద్ర ప్రభుత్వానికి స్పష్టమైన హెచ్చరిక జారీ చేసింది. భారతీయ భాషల సాధికారతకై ఈ తీర్మానం పట్టుబట్టింది. నూతన జాతీయ విద్యావిధానం పేరిట ప్రభుత్వం చేసుకుంటున్న ప్రచారంలో పస లేదన్న సత్యం అందరికీ ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నది. పైకి చెప్పే గంభీరమైన మాటలకీ ఆచరణకీ ఉన్న దూరం అందరికీ పూర్తిగా తెలియడానికి ఒకటి రెండేళ్ల సమయం కంటే ఎక్కువ పట్టదు. అన్ని భాషలనీ సమదృష్టితో చూసే శాస్త్రీయ ధోరణిని విడిచిపెట్టి, పైకి డాంబికంగా మాట్లాడుతూ తమ చేతకానితనాన్ని అడుగడుగునా బయట పెట్టుకుంటున్న విద్యావేత్తలు, నిపుణులు నిజాయితీగా పని చేయడానికి సిద్ధం కాకపోతే వారిని ప్రజలు క్షమించరు. చరిత్ర మన్నించబోదు.

భాషాభిమానులమని పదే పదే చెప్పుకోవడానికి సంతోషపడే మిత్రులంతా తమ ఆలోచనలను, చూపునూ మార్చుకోవాలి. భాషల్ని ప్రేమిస్తున్నామనీ, గౌరవిస్తున్నామనీ మమకారాలను ఒలకపోసే పెద్దలు, పండితులు నేటి భాషావసరాలు ఏమిటో తెలుసుకోవాలి. ప్రజలు, ప్రజాస్వామ్యం, జ్ఞాన సముపార్ణనలో భాష అవసరం, మానవ మేథకూ భాషకూ గల సంబంధం వంటి కీలకాంశాలను గురించి తెలుసుకోకుండా భాషోద్యమాలను చేస్తున్నామని చెప్పుకోవడం వల్ల అపహాస్యం పాలవుతాము.

ఎవరి భాషలను వారు అన్ని రంగాల్లో పోటా పోటీగా వినియోగించుకుంటూ పరస్పర సహకారం, సమిష్టి అభివృద్ధి, లక్ష్యంగా ప్రపంచ భాషాజాతుల పురోగతి కోసం, అన్ని స్థాయిల్లోనూ ఉద్యమాలను నిర్మాణం చేసుకుంటూ ముందుకు సాగవలసిన తరుణం వచ్చేసింది. పాలక వర్గాలతో సహా అందరినీ కలుపుకుంటూ, అవసరమైనప్పుడు సంఘర్షిస్తూ ప్రజాసమూహాల మద్దతుతో ఇదంతా ముందుకు సాగాలి. నిజానికి మాతృభాషలను రక్షించుకోవాలనే నిజమైన తపనకు ఒక ఆకారం ఇప్పుడిప్పుడే అందుతున్నది. అర్థమవుతున్నది. ఇక ప్రయాణం ముందుకే. ప్రపంచ భాషాజాతుల అభివృద్ధికై తెలుగుజాతి కూడా కలిసి ముందడుగు వెస్తుంది.

తేదీ : 01-04-2021

సామల రమేష్ బాబు