అమ్మనుడి/సంపుటి 7/ఏప్రిల్ 2021/కొత్తమాటల పుట్టింపు
కొత్తమాట
స.వెం.రమేశ్
కొత్తమాటల పుట్టింపు
7
“అన్నయ్యా, పిండిని రుబ్బే గైండర్‌ను రుబ్బురోలు అని పిలుచుకోవచ్చుగా. మనకు ఉన్న తెలుగుమాటలకు మారుగా కొత్త మాటలను పుట్టించడం ఎందుకు?” అన్నాడు చిన్నయ్య.
“రుబ్బురోలును చేత్తో తిప్పుతాం. గైండరును మించు(విద్యుత్) తో తిప్పుతాం. అవి చేసే పనులు ఒకటే కావచ్చు కానీ, వాటి అడపొడ(ఆకారం)వేరువేరు. కాబట్టి గైండర్‌కు కొత్తమాటను పుట్టించితేనే బాగుంటుంది. కదూ అన్నయ్యా” చెప్పినాడు నారాయణ.
“అలాగయితే మన పాత తెలుగుపేర్లన్నీ పోయినట్లేగా. ఆ పేర్లతోపాటు ఆపేర్లకు చెందిన పనిపలుకులూ పోయినట్టేగా. రుబ్బురోలు అనే మాటను వాడడం చిన్నతనం అయిపోయి, గైండర్ అనే మాటను వాడుతున్నాం. రుబ్బురోలుతోపాటు రుబ్బడం అనే పనిపలుకూ పోయింది. గ్రైండ్ చేయడం అనేది వాడుకయింది. మిక్స్ చేయడం, వాష్ చేయడం, కుక్ చేయడం, కట్ చేయడం.... వంటివి కోకొల్లలుగా వచ్చేసినాయి. పనిపలుకులు పోవడం నుడికి పెనుముప్పని నువ్వే అంటుంటావుగా అన్నయ్యా” అంటూ అంగలార్చినాడు చిన్నయ్య, ఇక నేను కలిపించుకోక తప్పలేదు.
“చిన్నయ్యా, నీ అలమట నాకు ఎరుకపడింది. నువ్వు కాస్త గందరగోళంలో ఉన్నావు. రుబ్బురోలు, గ్రైండర్ మట్టుకే కాదు. ఎన్నో ఉరువు(వస్తువు)లు వాటి అడపొడను మార్చుకొని కొంగొత్త జాడలతో మనముందుకు వచ్చినాయి, వస్తున్నాయి కూడా. నారాయణ చెప్పినట్లు కొత్త అడపొడకు పాతపేరును మనవాళ్లు ఒప్పుకోరు. అలా పుట్టించినపుడే, వాటికి చెందిన పనిపలుకులు కూడా మనగలుగుతాయి. కొత్తమాటలు రాకపోతే పాతమాటలను వాడడానికి ఇచ్చగించక పెరనుడి మాటలనే తీసుకొని వాడేస్తారు. కాబట్టే కొంగొత్త ఉరువులకు కొత్తమాటలు కానే కావాలి” అన్నాను.
“ఎన్ని కొత్త ఉరువులు వచ్చినా కొత్తమాటల్ని పుట్టించగలమా?” అడిగినాడు చిన్నయ్య.
“అలా పుట్టించగలిగేదే కదా చేవయిన నుడి. ఇన్నాళ్లూ అన్నయ్య దగ్గరుండి నువ్వు నేర్చుకొన్నది ఇంతేనా. అన్నయ్య తలచుకొంటే వేలమాటలను పుట్టించగలడు” అన్నాడు నారాయణ.
చాలు నారాయణా, నీ పొగడ్తలను ఆపు. నన్ను పొగడడం అంటే, నాకాళ్లకింద గోతిని తీయడమే. వేలమాటలను నేనే కాదు, నువ్వయినా చిన్నయ్యయినా ఇంకెవరయినా కూడా పుట్టించవచ్చు. అది మన తెలుగుకున్న చేవ. మీకొక మందలను చెపుతాను వినండి. తెలంగాణలోని బోదన్‌లో పూదోట శౌరీలు అనే పంతులమ్మ ఉన్నారు. ఆడపిల్లల బడి అది. కొత్తమాటల పుట్టింపు ఎలా అనేది నేను చెపుతుంటే విని, ఎనిమిదవ తరగతి పిల్లలతో ముచ్చటించింది. తొలినాడు ఒక చేర్పును గురించి చెప్పి ఒకటి రెండు మాటలను పుట్టించి చూపించింది. 'మీరు కూడా ఈ చేర్చుతో కొత్తమాటలను పుట్టించండి చూద్దాం” అని పిల్లలతో అనింది. అంతే ఆ అరగంట తరగతంతా నవ్వులతో తెలుగుమాటలతో నిండిపోయింది. పన్నెండు పదమూడేళ్ల ఈడున్న ఆ పిల్లలు అరగంటలో ఏబైకి పైగా మాటలను పుట్టించినారు. రెండవనాడు ఇంకొక చేర్సును చెప్పమని శౌరీలమ్మని బతిమాలుకొన్నారు. ఆ రెండో చేర్పుతో కూడా పదులమాటలను పుట్టించినారు. ఆ పంతులమ్మ ఎలమికి ఎల్లలు లేకుండా పోయాయి. పసిపిల్లలు కూడా మాటలు పుట్టించగలిగినంత తేలికయిన నుడి తెలుగు. త్వచకుడ్యము, తరంగదైర్భ్యము, స్వపరాగ సంపర్మము, పరపరాగ సంపర్మము, అనులోమానుపాతము, త్త్వార్జము, విశేషణోత్తరపద కర్మదారయ సమాసము, జస్త్వసంది, శ్చుత్వ సంది, క్షితిజరేక, పత్రహరితము, ద్విచక్రవాహనము, ప్రయాణప్రాంగణము, ప్రాజ్నన్నయ యుగము, ఊర్ష్వకోణము, స్నిగ్ధతాగుణకము, ఆదునికానంతర కవిత్వము, విస్తృత ఆవర్తన పట్టిక, కాంతి పరావర్తనము, విహంగవీక్షణము... వంటి నూర్లవేల పెరమాటలను దింపుకొని, వాటినే తెలుగనుకొని, వాపునే బలుపనుకొని మురిసిపోతున్నాం. ఈ పోకడను వదిలించుకొంటే కానీ మన నుడి ఎదగదు” అన్నాను.
చిన్నయ్యా నారాయణా కాసేపు ఏమీ మాట్లాడలేదు. పిమ్మట చిన్నయ్య పెదవివిప్పి, “నువ్వు కలతపడవద్దు అన్నయ్యా, ఇప్పటికి మనం ఉన్నాముగా, ముందుముందు ఇంకా కొందరు ఈ పనికి పూనుకొంటారులే” అన్నాడు.
“అది సరే అన్నయ్యా, బోదన్ బడిలో శౌరీలమ్మ పిల్లలకు చెప్పిన చేర్పులు ఏమిటో చెప్పవా” అడిగినాడు నారాయణ.
“చెప్పుతాను నారాయణా, వాటిలో మొదటిది 'ఎన '. కొత్త ఉరువులకు కొత్తపేర్లను పుట్టించడానికి ఈ 'ఎన ' అనే చేర్చు బాగా ఒదుగుతుంది. ఇది కూడా మన తెలుగు నుడిగంటులలో కనిపించదు. అరవ నుడిగంటులలో “ఇనం” అనేమాట కనబడుతుంది. దీని తెల్లం “జాతి” లేదా 'రేస్ '. తెన్నాటి తెలుగువాళ్లు దీనిని 'ఎనం ' అని వాడుతారు. దానికీ మన 'ఎన 'కూ పొత్తు ఉంది. 'వస్తువు ' అనేది సంసుక్రుతపు మాట. ఉరువు అనేది కూడా సంసుక్రుత రూపం నుండి తెలుగు అయిందే. మరి దీనికి తెలుగుమాట లేదా అంటే, అదే ఈ 'ఎన '. తెలుగు నుడిగంటులలో లేకపోవచ్చు కానీ తెలుగువాళ్ల నోళ్లలో మట్టుకు బాగా ఉంది ఇది. దువ్వడానికి వాడే ఎన, దువ్వు+ఎన=దువ్వెన; ఈర్చడానికి వాడే ఎన ఈర్చు+ఎన=ఈర్పెన; రెండు వంతులను కలిపే ఎన, వంతు+ఎన= వంతెన బండి ఇరుసూ గానులూ మెత్తగిల్లడానికి అంటే కందడానికి వాడే ఎన, కందు+ఎన=కందెన ఇవి కొన్ని మచ్చులు. వెతుక్కొంటే మరిన్ని మాటలు దొరుకుతాయి. ఎనతో ఎన్నలేనన్ని మాటలను పుట్టించవచ్చు. మచ్చుకు కొన్నిటిని పుట్టిద్దాం” అంటూ మొదలు పెట్టినాను.
- 1. అరుచు+ఎన అరపెన లౌడ్ స్పీకర్
- 2. అర్చు+ఎన ఆర్పెన డ్రైయర్
- 3. ఈద+అదుపు+ఎన ఈదదుపెన ఏ.సి. ఈద =గాలి.
- 4. ఉజ్జు+ఎన ఉజ్జెన మాబ్ ఉజ్జు=తుడుచు.
- 5. ఉతుకు+ఎన ఉతుకెన వాషింగ్‌మెషిన్ .....
- 6. ఉలివు+ఎన ఉలివెన సౌండ్ బాక్స్ ఉలివు=సౌండ్.
- 7. ఎంచు+ఎన ఎంపెన కాలిక్యులేటర్
- 8. ఎత్తు+ఎన ఎత్తెన లిఫ్ట్
- 9. ఎనిక+ఎన ఎనికెన కంప్యూటర్
- ఎనిక=లెక్క సంగణక యంత్రం అంటున్నారు.
- 10. ఒత్తు+ఎన ఒత్తెన ఐరన్‌బాక్స్ .....
- 11. ఒరయు+ఎన ఒరయెన టెస్టర్ ఒరయు=టెస్ట్‌చేయు
- 12. కడుగు+ఎన కడుగెన వాషర్
- 13. కలుపు+ఎన కలుపెన మిక్సర్
- 14. కాచు+ఎన కాపెన గీజర్
- 15. కుందు +ఎన కుందెన కుర్చీ/చెయిర్
- కుందు =కూర్చొను; వీల్ చెయిర్ =గానుకుండెన: ఈజీ చెయిర్ =వాలుకుండెన
- చెయిర్ పర్సన్ =కుండెనరి.
- 16. కుమ్ము+ఎన కుమ్మెన ఒవెన్: కుమ్ము=వేడి నిప్పులు;కుంపటి =వేడినిచ్చేది;
- కుమ్మెన=వేడిచేయడానికి వాడేది
- 17. కోయు+ఎన కోతెన హార్వెస్టర్
- 18. గొరుగు+ఎన గొరుగెన రేజర్
- 19. చలవ+ఎన చలవెన కూలర్
- 20. చివ్వు+ఎన చివెన పీలర్
- 21. తుడుపు+ఎన తుడుపెన ఎరేజర్
- 22. తురుము+ఎన తురుమెన గ్రేటర్
- 23. తెంచు+ఎన తెంపెన. కట్టర్
- 24. (తొల)చూపు +ఎన (తొల)చూపెన టెలివిజన్; తొల=దూరం; తొలగు=దూరమగు;
- తొలగా ఉన్నవాటిని చూపునది తొలచూపెన. చిన్నదిగా చూపెన అని పిలచుకోవచ్చు. దూరదర్శన్ అంటున్నారు.
- 25.దంచు+ఎన దంపెన మిక్సీ
- 26. దుమ్ము+ఎన దుమ్మెన డస్టర్; దుమ్మును దులిపేది
- 27. దొరల్చు+ఎన దొరల్బెన కన్వర్దర్
- 28. నింపు+ఎన నింపెన ఫిల్లర్
- 29. పలుకు +ఎన పలుకెన ఫోన్;
టెలిఫోన్‌కు దూరవాణి అని వాడుతున్నారు. ల్యాండ్ ఫోన్‌కు స్తిరవాణి అని మొబైల్‌ఫోన్‌కు చరవాణి అనీ వాడుతున్నారు. ఫోన్‌కు, ఎనను చేర్చకుండా “పలుకి అనడం తెన్నాటి తెలుగువాళ్ల వాడకం. నేలపలుకి, అలపలుకి అనేవి కూదా. 'ఫోన్ చేసినారా అనడాన్ని 'పిలిస్తిరా అనడం, మిస్ట్‌కాల్‌ను 'దూసుపిలుపు” అనడం, తెన్నాట్ తెలుగు వాడకం.
- 30. పొదువు+ఎన ఫొదువెన రికార్డర్; పొదువుకొనేది.
- 31. పొల్లు+ఎన పొల్లెన సూయింగ్‌మెషీన్; పొల్లు = కుట్టు. కుట్టెన అనికూడా వాడవచ్చు.
- 32, పోజు+ఎన పోజెన ప్యూరిఫైయర్; పోజు= శుబ్ర పరచు.
- 33. మరతిప్పు+ఎన మరతిప్పెన స్క్రూడ్రేవర్
- 34. మార్చు+ఎన మార్పెన.... ట్రాన్స్‌ఫార్మర్; నియంత్రిక అని వాడుతున్నారు.
- ౩5. రుద్భు+ఎన రుద్దెన స్మబ్బర్ _.....
- 36. రుబ్బు+ఎన రుబ్బైన గ్రైండర్
- 37.వండు+ఎన వండెన కుక్కర్
- 38. వడ +ఎన వడెన ఫ్రిజ్; వడ =గట్టకట్టిన మంచు
- 39. విత్తు+ఎన విత్తెన సీడర్
- 40.వీయు+ఎన వీవెన ఫ్యాన్ .....
- 41. వెచ్చ+ఎన వెచ్చెన హీటర్ ....
- 42, వెలచు+ఎన వెలపెన ఫిల్టర్; వెలచు =వడకట్టు
“ఇట్లా ఎన్నో మాటలను పుట్టించవచ్చు. చిక్కుతీసే ఎన ఉంటే చిక్కెన. కలుపుదోకే ఎన దోకెన. చెక్కేది చెక్కెన. తిరిగేది తిరుగెన. చుట్టేది చుట్టెన. పిండేది పిండెన. నొక్కేది నొక్కెన. ఒలిచేది ఒలుపెన. కొలిచేది కొలుపెన. వేల ఉరువులు కొంగొత్తవి వచ్చినా ఈ ఎనతో వాటికి తెలుగుపేర్లను పెట్టవచ్చు. తెలుగు చేవగల నుడి. దానిని వాడుకొనే చేవ తెలిసుండాలి అంతే” అంటూ ముగించినాను.
“అన్నయ్యా, బొదన్ శౌరీలమ్మ, పిల్లలకు నేర్చిన రెండో చేర్చును గురించి చెప్పవా” అడిగినాడు చిన్నయ్య.
“నాకొక అరగలి(సందేహం) అన్నయ్యా,బోదన్ అనే పేరు వినడానికి వింతగా ఉంటుంది కదా. బహుదాన్యపురం, పౌదన్యపురం అని చెక్కింపు(శాసనా)లలో ఉందట. ఈ సంసుక్రతపు పేర్లు కాకుందా, దానికి తెలుగుకుదురు ఏదయినా ఉంటుందంటావా?” నడుమన దూరుతూ అడిగినాడు నారాయణ.
“తెలుసుకోవలసిన అడకనే అడిగినావు కానీ దీనిని విడమరచి చెప్పాలంటే చాలాసేపు పడుతుంది. అయినా కుదింపుగా చెపుతాను విను. బారతనాడులో తొలిమినుకు(రుగ్వేదం) వెలువడిన నాటికే పలునుడులు ఉనికిలో ఉన్నాయి. తెనుగు (మూలద్రావిడం) వాటిలో ఒకటి. తొలిమినుకు మీద తెనుగు వెలుగులు పడిన ఆనవాళ్లు ఉన్నాయి. తెనుగు ఆనాటికే నాగరికనుడి. హరప్పావంటి పేటలను కట్టుకొన్న నుడి. ఎంతో ఎడంగా ఉన్న గ్రీకు, సుమేరియన్లతో కవరం (వ్యాపారం) సాగించిన నుడి. కవరం కోసం కడళ్లనే దాటిన నుడి. అంతగా ఎదిగి ఉన్నది కాబట్టే తొలిమినుకు మీదనే దీని వెలుగు పడింది. తొలిమినుకులో ఉన్న నుడి పేరు వైదికం లేదా చాందసం. చాలామంది పొరపాటుగా దానిని సంసుక్రుతం అనేస్తుంటారు. చాందనం,తెనుగు వంటి ఒకటి రెండు నుడుల కలయికతో తావుతావుకూ కొంగొత్త గొంతులు వెలువడినాయి. వీటిని ప్రాక్రుతాలు అన్నారు. 'ప్రాక్రుతాలన్నిటికీ 'పెనునుడి ఒకటి కావలసి వచ్చింది. అందుకనే అప్పటి తెలివరులు, చాందసనుడిని ఆనుగా చేసికొని, తెనుగునుండి ఎన్నో మాటలను కలుపుకొని సంసుక్రుతాన్ని కట్టినారు. సంస్కరించి కట్టిననుడి కాబట్టే దానికి సంసుక్రుతం అనే పేరు వచ్చింది. కడలినీ కప్పళ్లనీ ఎరుగని చాందసనుడికీ, తెనుగునుండి ఎన్నో మాటలను కలుపుకొన్న సంసుక్రుతానికీ ఎంతో వేరిమి ఉంది. తెనుగునుండి తెలుగు విడివడినాకనే సంసుక్రుతవు కట్టుబాటు జరిగింది. అందుకే తెలుగు ఆనవాళ్లు సంసుక్రుతంలో చాలా కనిపిస్తాయి. తరిపోకడలో తెలుగుమీద చీకటికమ్ముకొని, అన్ని మాటలూ నంసుక్రుతం నుండే పుట్టి నాయి అనే అనిపింపు గట్టిపడిపోయింది. అటువంటి మాటలలో పోత,ఓడ, దోనె వంటివి ఉన్నాయి. ఇవన్నీ తెలుగునుండి వెళ్లినవి. కానీ మన నుడిగంటులలో మట్టుకు దిగుమతి అయినవిగా కనబడుతాయి. 'పొత ' పుట్టుక గురించి అమరకోశంలో ఏ విడమరపూ లేదు. పోత తెలుగుమాూట. దీనికి ముందు రూపు 'పొంత '. 'పాన్ ' అనే తెలుగుకుదురుకు కలయిక అని తెల్లం. పొందు,పొత్తు, పొంతకుండ, పొంగలి వంటి మాటలలో ఇది కనబడుతుంది. కొయ్యాకొయ్యా కలిసి ఏర్పడేది పొంత. దాని మరుపొడే పోత. పోతల మీద ఏరులను గడచి కదలిని చేరి ఓడలమీద దవ్వులకు చేరేవారు. ఓడలలో కప్పళ్లలో తెచ్చిన సరకును, పోతలమీదా పడవలమీదా లోతట్టుకు సాగించి కవరం చేసేవారు తెలుగువాళ్లు. అట్ల కవరం జరిగిన చోట్ల పేటలు ఏర్పడినాయి. వాటిపేర్లు కొన్ని 'పోత” తో మొదలయినాయి. పోతులూరు, పొందూరు, పోతనూరు, పొద్దటూరు, వంటివి అవి. బోదన కూడా అటువంటిదే. బట్టిప్రోలు చెక్కింపులో కూడా “పోత” అనేపేరు తగులుతుంది. బోర్లించిన పోత అడపొడలో కొన్ని గుడుల పైకప్పులను కట్టుకాన్నాడు తెలుగువారు. ఇది తెలియక ఇప్పటి తెలివరులు వీటిని 'గజప్పష్టం” అంటున్నారు. ఎంతో పాతదైన 'కపోత ఈశ్వర ' గుడిపేరులో కూడా పోత ఉంది. ఇటువంటి తెలుగు మాటలు నూర్లు వేలు మరుగున పడిపోయినాయి. ఈనాటికి, తెలుగువాళ్లకు ఏమీ చేతకాదు అని ఇరుగుపొరుగు వారు చాటుతుంటే, అవును అది నిక్మమే అని మనం తలలూపుతున్నాం” అంటూ నారాయణ అడకకు మారాడినాను.
“అన్నయ్యా, ఆ రెండో చేర్చును చెప్పన్నయ్వా” బతిమిలాడినాడు చిన్నయ్య.
“చెప్తతున్నా ఆ చేర్పు 'ఏగి. తెన్నాడులోని చోళనాడు తావున తెలుగువారు ఇప్పటికీ వాడుతున్న మాట ఇది. చోళనాడు తెలుగులో వాహనాన్ని 'ఏగి” అంటారు. 'ఏగు” అనే పనిపలుకు అన్నిచోట్లా వాడుకలో ఉన్నదే కదా. 'ఏగు” అంటే వెడలు, కదలు అని తెల్లం. ఏగేది ఏగి అయి ఉంటుంది. ఈ మాటను చేర్పుగా చేసికొని మనం కొత్త మాటలను పుట్టించవచ్చు. చూద్దాం రండి”
- 1. అద్దె+ఏగి అద్దేగి టాక్సీ
- 2. కోయు+ఏగి. కోతేగి హార్వోస్టర్
- ౩. చదును+ఏగి చదునేగి రొడ్ రొలర్ మ
- 4. జల్ల +ఏగి జల్లేగి ట్రక్‌వెహికల్ ..............
- 5. తవ్వు+ఏగి తవ్వేగి ప్రొక్లెయినర్ .............
- 6. తాను+ఏగి తానేగి ఆటోరిక్షా తానుగా ఏగేది. ఆటో=తనకుతాను
- 7. తూను+ఏగి... తూనేగి హెలీకాష్టర్ తూను=సాగు, ఎగురు; తూనీగ= ఎగిరేఈగ
- 8. తేరు+ఏగి తేరేగి కార్ కార్ అనేమాట చారియట్ నుండి పుట్టింది.
- చారియట్ అంటే తేరు. తేరు వంటి ఏగి తేరేగి.
- 9. తొట్టి +ఏగి తొట్టేగి టాంకర్
- 10.తోయు+ఏగి తోయేగి డొజర్
- 11.దుక్కి+ఏగి దుక్కేగి ట్రాక్టర్; ట్రాక్=చాలు; దుక్కి=నాగటిచాలు
- 12. నీరు+అడుగు+ఏగి నీరడుగేగి సబ్‌మెరైన్ జలాంతర్జామి అంటున్నారు
- 13.నొగులు+ఏగి నొాగులేగి ఆంబులెన్స్ నొగులు=డిసీజ్
- 14 పట్టె+ఏగి పట్టేగి ట్రైన్ప పట్టెలమీద వెళ్లేది
- 15. పాడె+ఏగి పాడేగి. ... శవయాత్ర వాహనం అంటున్నారు
- 16. పేరు +ఏగి పేరేగి బస్ బస్ అనే
మాట ఆమ్బీబస్ నుండి పుట్టింది. మందిని తీసుకొని వెళ్లేది అని తెల్లం. పేరు అంటే మందికి మరోమాట. ఎర్రాప్రగడ ఈ మాటను వాడినారు. పేరును తీసుకొని వెళ్లేది.
- 17.పోరు+ఏగి ఫోరేగి వార్‌టాంకర్. .......
- 18. మంట+ఏగి మంటేగి ఫైరింజన్ అగ్నిమాపక వాహనం అంటున్నారు.
- 19.మిన్ను+ఏగి మిన్నేగి రాకెట్ మిన్నుకు ఏగేది
- 20. సరకు+ఏగి సరకేగి లారీ.
“తమ్ముళ్లూ, పైన ఎన, ఏగి చేర్పులతో ఇచ్చిన మాటలలో కొన్ని నేను పుట్టించినవి కావు. బొదన్ బడిపిల్లలు పుట్టించినవి. ఆ పిల్లల పేర్లు నాకు తెలియదు. పిల్లలకూ వాళ్ల పంతులమ్మ అయిన శౌరీలమ్మకూ మనమందరమూ మప్పిదాలను చెప్పాలి” అన్నాను.
“మంచిమాట చెప్పినావు అన్నయ్యా. మరి శౌరీలమ్మ అప్పుడే ఈ మాటలను బయటపెట్టి ఉండవచ్చు కదా” అన్నాడు నారాయణ.
“శౌరీలమ్మ వాటిని బయటపెట్టాలనే అనుకొనింది. అప్పుడు కొన్ని నెలలపాటు నడుస్తున్నచరిత్ర రాలేదు. అమ్మనుడి ఇంకా అప్పటకి మొదలుకాలేదు. అందుకని తెలుగుకోసం నడుముకట్టుకాన్న తెలుగువెలుగు అనే నెలాకిక(మాసపత్రిక)కు పంపింది. అందులో అచ్చయినాయి”. చెప్పినాను.
“నిక్కంగానే తెలుగు కోసం నడుము కట్టుకొన్న ఆకిక కదా అది” అన్నాడు చిన్నయ్య.
కావచ్చు, ఆ నెలాకిక వాళ్లదే ఒక నాదాకిక(దినపత్రిక) కూడా ఉంది. అందులో ఒకసారి ఎలెక్టసిటీ ట్రాన్స్‌ఫార్మర్‌కు నియంత్రిక అనే పేరును పుట్టించి వాడినారు. దానిని చదివి పారుపల్లి కోదండరామయ్య అనే ఆయన నాకు పలుకిచ్చి(ఫోనుచేసి)నారు. ఆయన మించిడుపు(ఎలెక్టసిటీ డిపార్ట్‌మెంట్ )లో వంచ మరమరి(చీఫ్ ఇంజినీర్)గా పనిచేసినవారు. ట్రాన్స్‌ఫార్మర్ అంటే నియంత్రించేది కాదని మార్చేదనీ, దీనికొక తెలుగుపేరును చెప్పమనీ, ఆ ఆకికవాళ్లకు తెలియచేస్తాననీ అన్నారు. ఈర్చేది ఈర్పెన అయినపుడు, మార్చేది మార్పెన అవుతుంది. కాదూ కూడదూ అది నియంత్రిస్తుంది అని వాళ్లు అంటే నియంత్రికకు తెలుగుమాట అదుపెన అవుతుంది అని చెప్పినాను. పారుపల్లిగారు ఆ అకికకు ఇదంతా విడమరచి చెపుతూ ఒక కమ్మను రాసినారట. కమ్మ ఏమయిందో, నియంత్రిక అలాగే ఉంది. నన్నయ నుండి చిన్నయ వరకూ సాగిన సంసుక్రుత మాటలు చొప్పింత, కొన్నేళ్లపాటు ఆగింది. దానిని తెలుగు పేరోలగం(అకాడేమీ) వారు మరికొన్నేళ్లు సాగించి చాలించుకొన్నారు. ఇప్పుడు ఆ పనినీ ఒక నాదాకిక తలకెత్తుకొని మోస్తున్నది. ఎన్నాళ్లు మోస్తుందో చూద్దాం” అంటూ ముగించినాను.
(తరువాయి వచ్చే సంచికలో...)