అమ్మనుడి/సంపుటి 7/ఏప్రిల్ 2021/ఆపత్కాలపు కవిత్వచూపు

సాహిత్యరంగం

బూర్ల వేంకటేశ్వర్లు 9491598040

ఆపత్కాలపు కవిత్వచూపు

పశ్చిమ ఆఫ్రికాలో 1981లో మొదలై ప్రపంచమంతా వ్యాపించిన HIV వైరస్‌ వలన మూడున్నర కోట్లమంది బలయ్యారు. 2009-10లలో వచ్చిన స్వైన్‌ ఫ్లూ మెక్సికోలో మొదలై ఐదు లక్షల మందిని పొట్టనబెట్టుకున్నది. 2015లో దోమల ద్వారా వచ్చిన జికా వైరస్‌ దక్షిణ, మధ్య అమెరికాలలో ఎంతో మంది జీవితాలపై ప్రభావం చూపింది. 2014-16లో వచ్చిన ఎబోలా వైరస్‌ పశ్చిమ ఆఫ్రికా గినీయాలో మొదలై పదివేల మందికి పైగా బలి తీసుకున్నది.2019లో మొదలైన కరోనా వైరస్‌ Coid19 వలన, ప్రపంచ వ్యాప్తంగా కోటీ డెబ్బై నాలుగు లక్షల మందికి పైగా ప్రభావితులయ్యారు. సుమారు ఆరు లక్షల డెబ్బై ఐదు వేల మంది మరణించారు. భారతదేశంలో సుమారు పదిహేడు లక్షల మంది ప్రభావితులయ్యారు. ముప్పై ఆరువేల మందికి పైగా చనిపోయారు.

ప్రపంచ ప్రజలందరూ కరోనా వైరస్‌ వలన ప్రాణ భయంతో ఉన్నారు. రోజు రోజుకూ వైరస్‌ విస్తృతి వార్తలు వింటూ, దాని బారిన పడకుండా ఉండే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సమాజంలోని పేద, ధనిక, వ్యాపార, మేధావి తదితర వర్షాలు భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నాయి. అయితే,మనష్యులు కష్టాల్లో ఉన్నప్పుడు, ఆందోళన చెందుతున్నప్పుడు, వాళ్ళ బాధలను చూసినప్పుడు కవుల స్పందన ఎలా ఉన్నదో లేఖామాత్రంగాతెలపడం ఈ వ్యాసం ఉద్దేశ్యం.

11జూన్‌ 2020 నాటివాషింగ్టన్‌ పోస్టో The poetry that speaks best to the pandemic అనీ జార్డ్‌ టౌన్‌ విశ్వవిద్యాలయం సహ ఆచార్యుడు సేత్‌ పెర్లో(Seth perlow) ఒక వ్యాసం రాశాడు. ఈయన “The poem Electric; Technology and the American Lyric " రచయిత. ఆయన ఏమంటాడంటే, “ఎప్పుడైనా భయానక పరిస్థితులు ఏర్పడితే నేను నా విద్యార్థులతో ప్రముఖ కవుల ఒక ఫోయెం పంచుకుంటాను”. ఇది సెప్టెంబర్‌ 11 దాడుల తర్వాత నాకు అలవాటైంది అంటాడు. అనుకోని సంఘటనలు జరిగి, భయానక పరిస్థితులు ఏర్పడినప్పుడు, కవుల సాంత్వన వాక్యాలు మనస్సుకు మందులాగా పనిచేస్తాయి. భయాందోళనలను తగ్గించి, థైర్య విశ్వాసాలనిస్తాయి. ఈ సందర్భంగా ఆయన ఉదాహరించిన W.H.Auden రాసిన September 1, 1939 కవిత, W.S.Merwin రాసిన Separation కవితలునాటి స్థితిని ప్రతిబింబిస్తాయి.

W.H. Auden September 1, 1939 కవితలో “నేను భార్యకు నిజం చెప్తాను/ నేను నా పనిపై ఎక్కువ దృష్టి పెడదతాను/ వారి నిర్చంథ ఆటను తిరిగి ప్రారంభించడానికి/ నిస్సహాయ గవర్నర్లు మేల్కొంటారు/ ఇప్పుడు/ఎవరు చెవిటి వారిని చేరుకోవచ్చు/మూగవారి కోసం ఎవరు మాట్లాడగలరు?/ నా దగ్గర ఉన్నది స్వరంమాత్రమే/ ముడుచుకున్న అబద్దాన్ని విడుదల చేయడానికి,

  • * *

ఆకలి ఎటువంటి ఎంపికను అనుమతించదు/పొరుడికి లేదా పోలీసులకు/మనం ఒకరినాకరు ప్రేమించుకోవాలి లేదా చనిపోవాలి "అంటాడు. ఆపత్కాలంలో సామాన్యులకోసం తన గొంతు నిచ్చి అబద్దాన్ని విడుదల చేయిస్తానంటాడు. ఆకలి అందరికీ ఒక్కటేనని ఇప్పుడు అందరూ మానవీయ ప్రేమను ప్రకటించాలని అంటాడు. W.S.Merwin రాసిన Separation కవితలో "సూది బెజ్జంలోంచి దారం వెళ్ళినట్లుగా ఉంది నీవు లేని ఒంటరి తనం. ఇప్పుడు చేయగలిగిందల్లా నీ స్నేహపు రంగుల దారాలతో జ్ఞాపకాల్ని కుట్టుకోవడమే” అంటాడు.

వివిధ సందర్భాల్లో “ఒంటరితనం, ఓదార్పు, బౌతిక దూరం, గోడలమధ్యన జీవితం, ఆత్మీయులు లేకపోవడం, ఉన్నదంతా కోల్పోవడం” లాంటి సమస్యలను పాశ్చాత్య కవులు గొప్ప అనుభూతితో చిత్రించారు. సాంఘిక జీవితం గురించి చాలా గొప్ప కవితలు రాశారు. మన సన్నిహిత సామాజిక క్షణాలలో కూడా దూరమనేది పాత్ర పోషిస్తుందని గుర్తించారు. మనం ఇతరులతో ఉన్నప్పుడు కూడా ఒంటరితనవు లోతైన భావాలు మనలో తలెత్తుతాయని గుర్తుచేస్తారు. కొన్నిసార్లు మన దగ్గరి సంబంధాలు గొప్ప దూరాలకు వంతెనగా ఉండవచ్చని అంటారు.

తెలుగులో ఆధునీక వచన కవిత్వంలో అనేక పార్య్వాలున్నాయి. యుద్దాలు జరిగినప్పుడు, తుపానులు ఉప్పెనలు ముంచెత్తినప్పుడు, భూకంపాలు సంభవించినప్పుడు - మానవీయ కోణంలో ఎన్నో కవితలు రాశారు తెలుగు కవులు. కొందరు ఆధునిక వచన కవులు రాసిన కవితా పాదాలు ఈనాటి సందర్భానికి సరిపోయేవి కనిపిస్తాయి. దేవరకొండ బాల గంగాధర తిలక్‌ రాసిన 'నగరంపై పీడనీడ” అనే అసంపూర్తి కవితలో “పవిత్రాగ్ని హోత్రాల వద్ద/బజారులమ్మట రాజ ప్రాసాదాలవద్ద/ చేరిన యీ జనసందోహాన్ని చూడు ప్రభూ/ చిదిమితే పాల్గారే చిన్నారిబుగ్గలు/ ముక్కుతూ మూల్చుతూ ఉండే ముసళ్ళు/ మోహన యౌవన వనసుమాలు తరుణ వయస్కులు/ వీరందరినీ కనికరించు అవధరించు ప్రభూ/ ఈ నగరంపై ఏదో నల్లని పీదనీడ పడింది/ మృత్యువు తన భయంకరపాశాన్ని విసిరింది” అంటాడు. అందరికీ చిరపరిచితమ్టైన శ్రీ శ్రీ బాటసారి కవిత కూడా బకుకుతెరువుకోసం పట్నానికి వచ్చిన వలస జీవి కష్టాన్ని వర్ణిస్తుంది. నిఖిలేశ్వర్‌ రాసిన '“విథ్వంస రాగం” కవితలో “మసిగా మిగిలిన శరీరాలపై/ పారుతున్న రక్తం మడుగులోంచి/ఒక తల్లి చంకలో/ సిద్దాంతాల గంట్లు పడని పసిపాప/ మంచీ చెడూ తెలియని మరో ఇద్దరు పిల్లలు/ నడుస్తున్న భయాక్రాంత విహ్వలమైన ముఖాలు/ ప్రతిఫలించిన పృద్య్వీ నిర్మలత్వపు నిస్సహాయత” నేటి భయంకర కాలానికి సరిపోతాయి.

ఈనాటి విషమ పరిస్థితులకు కారణం ప్రకృతి విధ్వంసమే అని తలచినప్పుడు పాపినేని శివశంకర్‌ రాసిన “ఆకుపచ్చని లోకంలో” కవితా వాక్యాలు సరిపోతాయి. “బహుశా ఒక స్వార్ధాన్ని మోస్తూ మోస్తూ/ మనిషి నాగరికుడయ్యాడు/ స్వప్నం భగ్నమై దృశ్యం ధ్వంసమై/మట్టితో తొలి రక్త బంధం తెగిపోయింది/ తనకీ తన చుట్టూ ఉన్నదానికి సామరస్యం తీరిపోయింది/ అసహజత్వం అమానవీకరణ/సుడేసిన యంత్ర ధూమాల్లో మానవారణ్యాలు/ మానవారణ్యాల్లో ప్లాస్టిక్‌ చెట్లు/ లాభాల వేటలో పక్షీ పశువూ చెట్టూ చేమా అన్నీ పరాయివే/ చల్లని నీడలు కరిగిపోయాయి/ కిలకిలలూ కువకువలూ ఆవిరై/ నదులూ అంతర్నదులూ కలుషితాలై/ ఇప్పుడు ప్రకృతే మనిషికి ప్రథమ శత్రువు/ క్రౌర్యానికి రూపంలేదు-అది కనబడదు గాక కనబడదు/ నేల మూగది ఆక్రోశం వినబడదు గాక వినబడదు” నేటి వలస కూలీల దుస్టితిలాంటిదే నీళ్ళకోసం వలసపోయిన వాళ్ళ స్థితి. నాళేశ్వరం శంకరంలోని “వలస " కవితా వాక్యాలు నేటి సందర్భానికి చాలా దగ్గరగా ఉన్నాయి. “ఇప్పుడు తరలిపోతున్న వాణ్ణి చూస్తే/ దిగులుగా టెలిపోన్‌ తీగ మీద ఏకాకిగా పాడుకునే పక్షి గీతంలా ఉంటుంది/ విసిగిపోయి తీరం చేరిన అలల నాదంలా ఉంటుంది/ పాకుతూ పరుగెత్తి పేలిన ఎయిరిండియా దిగులుగీతంలా ఉంటుంది/ భూమిని వదులుతున్నందుకు దిగులు/ పరిసరాలను వదులుతున్నందుకు దిగులు”

అయినవాళ్ళు ఐ.సి.యూలో ఉంటే ఎలా ఉంటుందో దేవీప్రియ “నువ్వక్కడ నేనిక్కడ” కవితా వాక్యాలను చదివినప్పుడు తెలుస్తుంది. “నువ్వక్కడ ఐ.సి.యూలో/అకస్మాత్తుగా నువ్వు సృష్టించుకున్న నీ కొత్త ప్రపంచంలో/ నీకేమి జరుగుతున్నదో తెలియని స్థితిలో నువ్వు/ నేనిక్కడ సముద్రం మధ్య/ ఒంటి స్తంభం మేడవంటి ఈ నిశ్శబ్దపు గదిలో/నాకేమి జరుగుతున్నదో అర్ధం కాని దశలో నేను/ రెండు వెలుగులు ఉన్నట్టుండి/ రెండు చీకట్లుగా మారిపోయిన ఘోరం ఇది రాజీ” అని ఒంటరితనపు బాధను కవిత్వీకరించాడు.

ఒక మరణం సంభవిస్తే, మరణాన్ని చూసి నేర్చుకోవాల్సింది ఏముంటుందో జింబో రాసిన “ఒక మరణం తర్వాత” కవితలో కనిపిస్తుంది. ఏముంటుందీ/ఒక మరణం తర్వాత/కాస్త బూడిద కాసిన్ని అస్థికలు/ కొంత బాధ మరికొన్ని కన్నీళ్లు/ ఏమైపొయ్యాయి?/పంటి బిగువున వున్న పట్టింపులు మన కోపాలు/ ఏం సాధించాం?/మన దుఃఖానికి ఏమైనా విలువుందా?/ మరణం తర్వాత తెలిసిన విషయం ఒక్కటే/ ఒక విషయాన్ని అంగీకరించడం వెనక ఎంత ఘర్షణ వుంటుందోనన్న విషయం/ ఒక జీవితాన్ని చూసి ఎంత నేర్చుకోవచ్చో ఒక మరణాన్ని చూసి/ అంతకన్నా ఎక్కువ నేర్చుకోవచ్చన్న విషయం” జీవితం సాధించిందేమిటో, కోల్పోయిందేమిటో మరణాన్ని చూని నేర్చుకోవాలనడం ఒక తాత్వికత.

నెల్లుట్ల రమాదేవి రాసిన 'గుప్పెడు ఓదార్పూ-గోరంత ప్రేమా ' ఎంతో చక్కగా ఈనాటి పరిస్థితికి అద్దం పడుతోంది. “నిశ్శబ్దపు సాయంకాలపు దిగులు నీడల్ని/ సందడి 'స్నేహాలతో హ్రన్వం చేయాల్సిందే/ వ్యాధి నివారణ అసాధ్యమైతే/ వ్యధా నివారణ వృధా కానేరదు/ అనంత దూరాల నిరంతర ప్రయాణంలో/ ఇవాళ అతడూ రేపు మనమే కదా/ నిశ్చయంగా విషాదాంత నాటకమని తెల్సినా/నిస్సహాయపు ప్రేక్షకులుగా మిగలకూదదు/ జనన మరణాల మథ్య సాగే జీవన ప్రయాణంలో/ అలసట తీర్చే ఆత్మీయ వృక్షాలమవుదాం/కరిగిన హృదయం కార్చే కడలేని కన్నీటిని తుడిచే/ చేతివేళ్ళ స్పర్శలమవుదాం/ నిరాశతో క్రుంగి కృశించిన భుజాలపై ఓదార్పు పావురాలమవుదాం/ అవును నిజమే/ శాస్త్రం నిర్దారిస్తుంది/ వైద్యం చికిత్సనిస్తుంది/ కానీ, ప్రేమ నయం చేస్తుంది కదా/ అందుకే గుప్పెడు ఓదార్చునూ/ గోరంత ప్రేమనూ ఇద్దాం” అని మానవీయ నైజాన్ని ప్రకటిస్తుంది.

ఆశారాజు రాసిన ఈ కవితా వాక్యాలు గొప్ప ఊరటనిస్తాయి. “ఒంటరితనం భయపెడితే/ మా ఇంటికిరా/ నడవలేక పడి ఉంటే/నన్ను పిలువు/ ఇది సముద్రం మిత్రమా/ ఈదలేనపుడు/ నా చేయి పట్టుకో/ ఊపిరాడకపోతే/ నన్ను చుట్టుకో/ నేను మునిగిపోయినా/నువ్వు ఒడ్డుకు చేరుతావు”. ఎన్ని సమస్యల్లో ఉన్న వాడికైనా, ఎంత ఉత్పాతంలో కొట్టుకుపోయే మనిషికైనా ఈ కవితా వాక్యాలు,బతుకు మీద ఆశను ఛిగురింపజేస్తాయి.

ఇక ప్రస్తుత కరోనా సందర్భానికి వస్తే తెలుగులోనూ, ఇతర భాషల్లోనూ వివిధ మాధ్యమాల ద్వారా అనూహ్య స్పందన వచ్చింది. కవిత్వ ప్రక్రియలైన వచన కవిత, గేయం, పద్యం, నానీలు వంచాలా ప్రక్రియల్లోనూ సాహిత్యం వచ్చింది. అమితాబ్‌ బచ్చన్‌ వెుదలుకొని ఎందరో సినిమా సెలబ్రిటీలు పాటల రూపంలో సందేశాలిచ్చారు. కొన్ని టీవీ చానళ్లు పాటలను, కవిత్వ కార్యక్రమాలను రూపొందించి చైతన్యపరిచాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, కరోనాపై ఒక కవితను ఉదాహరించి తెలంగాణలోని కవులు విపత్మర పరిస్థితుల్లో ప్రజలకు థైర్యాన్నిచ్చే కవితలు రాయాలని పిలుపునిచ్చారు. తోట సుభాపిణి సంకలనం చేసిన 'క్రిమి సంహారం ' బిల్ల మహేందర్‌ సంపాదకత్వంలో 'వలస దుః ఖం ' నల్లెల రాజయ్య సంపాదకత్వంలో “దుఃఖ పాదం” పేరుతో కరోనా కవితా సంకలనాలు వెలువడ్డాయి. “రిటన్‌ గిఫ్ట్‌ టు కరోనా” అని ఒక యూట్యూబ్‌ చానల్లో వందల సంఖ్యలో వీడియో కవితలను అప్లొడ్‌ చేశారు.

వలస కూలీల దుఃఖం గురించి “పిల్ల జెల్లా ఇంటికాడ ఎట్ల ఉండ్రొ " అని తండ్లాడిన ఆదేశ్ రవి పాట గుండె గుండెనూ కలచివేసింది. అట్టడుగు బాధితుల గోసకు గొంతునిచ్చి, సరళమైన పదాలనుపయోగించి, ఇంత పెద్ద దేశంలోని విషాదాన్ని ఒక్క పాటలో పలికించిన అదేశ్‌ రవి బహుదా ప్రశంసనీయుడు. ప్రఖ్యాత సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కూడా కరోనా కవితను గానం చేశారు. 'వాళ్ళు ఇల్లు చేరాలి అని గాజోజు నాగభూషణం రాసిన కవిత ఎంతోమందిని ఆలోచింపజేసింది. నెత్తురు పాదాలతో బయల్దేరిన వలస కూలీల దుస్థితిని హృద్యంగా పలికించిన పాదాలు చాలా మంది ప్రశంసలు పొందింది. అట్లాగే, రావులపాటి సీతారాం కవిత "ఎందుకు సీతక్కా .... ఎందుకే సీతక్కా ... ?” అంటూ సగటు మనుష్యుల క్రియా శూన్యతను, స్వార్థ పరత్వాన్నిబైటపెడుతూనే, మానవీయంగా ప్రవర్తించిన మనిషిని దేవుణ్ణి చేసి కీర్తించింది. 'నేటి మాట వినర సాటి మనిషి అనే మకుటంతో డా. కోయి కోటేశ్వరరావు “కోవిడ్డూరం” శతకం రాశాడు.కరోనా కవిత్వం గురించి వ్యాసాలు కూడా వచ్చాయి.

తెలుగులో వస్తున్న ఈనాడు దిన పత్రిక నెలరోజుల పాటు కరోనాపై కదనం పేరుతో కవితల పోటీ నిర్వహించింది. ఈ పోటీలకు ముప్పై రోజులలో ఇరవై వేల కవితలు వచ్చాయి. కరోనా పరిణామాల గురించి,సాహిత్వ అకాడమీ పురస్కారం పొందిన వాళ్ళ దగ్గర నుండి ఇప్పుడిప్పుడే కవితాలోకంలోకి అడుగు పెట్టిన వాళ్ళు కూడా ఎన్నో కవితలు రాశారు. ఈ కవితల్లో ప్రధానంగా ఈ విపత్మర సమయంలో మానవత్వాన్ని ప్రదర్శించాలని, ఇంటా బయటా ఒక మానవీయ ప్రపంచాన్ని నిర్మించాలని చెప్పడం కనిపిస్తుంది. ప్రకృతి విధ్వంసం పట్ల ఆవేదన, కరోనా కష్ట కాలంలో ప్రాణాలను పణంగా పెట్టి సేవ చేస్తున్న వారిపట్ల కృతజ్ఞత చూపడం కనిపిస్తుంది. వలస కూలీల గురించి, వీథి వ్యాపారుల గురించి, కార్మికుల గురించి, రైతుల గురించి బాధపడడం కనిపిస్తుంది. ధైర్యంతో, ఆత్మ విశ్వాసంతో పరిస్థితులను ఎదుర్మునే భరోసానివ్వడం కనిపిస్తుంది. అట్లాగే, ఆత్మ విమర్శ చేసుకొని ఇక నుంవైనా ఒక మార్పును ఆహ్వానించాలనే జ్ఞానోదయం కలిగినట్లు ప్రకటించడం కనిపిస్తున్నది. జూగ్రత్తలు చెప్పడం, ఉపదేశాలు ఇవ్వడం, సహాయకారులను మెచ్చుకోవడం ఇలా అనేక అంశాల మీద ఈ కవులు స్పందించారు.