అమ్మనుడి/సంపుటి 6/ఫిబ్రవరి 2021/మహిళాచైతన్య కెరటం దరిశి అన్నపూర్ణమ్మ
-డాక్టర్ షేఖ్ మహబూబ్ బాషా, 951579705
మహిళాచైతన్య కెరటం దరిశి అన్నపూర్ణమ్మ
ఇరవయ్య వశతాబ్టి ప్రథమార్థంలో సంఘసంస్మరణోద్యమం ముమ్మరంగా నడిచింది. పురుష సంఘసంస్మర్తలతో పాటు అనేకమంది మహిళాసంఘసంస్కర్తలు సంస్కర ణొద్యమంలో పాలు పంచుకొని ఉద్యమాన్నిముందుకు నడిపించారు. ఒకవైపు ఉద్యమంలో క్రియాశీలకంగా పాలు పంచుకుంటూనే ఇంకోవైపు సంస్మరణోద్యమ సాహిత్యాన్ని సృష్టించారు. అలాంటి మహిళా సంఘసంస్మర్తల్లో ప్రముఖురాలు దరిశి అన్నపూర్ణమ్మ (1907-1931). సంఘసంస్కర ణొద్యమంలోనూ, మహిళోద్యమంలోనూ అన్నపూర్ణమ్మ పోషించిన పాత్రను, ఆమె రచనల్నీ పాఠకులకు పరిచయం చెయ్యడమే ఈ వ్యాసం ఉద్దేశ్యం.
గదర్‌పార్టీ సంస్థాపకుల్లో ప్రముఖుడైన దరిశి చెంచయ్య మొదటి భార్య అయిన అన్నపూర్ణమ్మ 1907వ సంవత్సరంలో బళ్ళారిలో జన్మించింది. ఆమెతల్లి సంస్కరణ దృక్పథం కలది. తన రెండవ కుమార్తెను రజస్వల అయ్యేంతవరకు ఆపి, మదనపల్లె కళాశాలలో చదివించింది. అన్నపూర్ణమ్మను సంస్మరణభావాలుకల చెంచయ్యకిచ్చి వివాహం చేసింది. “వైశ్వకులములో రజస్వలానంతర వివాహమును ప్రారంభించింది అన్నపూర్ణమ్మగారి తల్లియేననుట సత్యదూరమని పించుకొనజాలదు” అని 1.1. 1932నాటి “గృహలక్ష్మి” (స్త్రీల పత్రిక) ప్రశంసించింది. అన్నపూర్ణమ్మ బళ్ళారి కాన్వెంటులోను, తిరువళిక్మేణి బాలికల టైనింగ్ కాలేజీలోనూ, గుంటూరులోని శారదా నికేతనంలోనూ విద్యాభ్యాసం చేసింది. 15 సంవత్సరాల వయస్సులో దరిశి చెంచయ్యను వివాహమాడింది. బాల్యవివాహాలు విస్త్రృతంగా ప్రాచుర్యంలో ఉండిన నాటి పరిస్థితులదృష్ట్యా అన్నపూర్ణమ్మ ఆలస్యంగానే పెళ్ళి చేసుకొందని చెప్పుకోవాలి.
అన్నమార్ణమ్మ మొదటినుండీ సంస్కరణభావాలు కలదైనప్పటికీ, పెళ్ళి తర్వాత వాటికి మరింత సానబెట్టి తనవంతు ప్రోత్సాహమందించారు చెంచయ్య. అన్నపూర్ణమ్మ 1920లో జరిగిన వితంతు పునర్వివాహోద్యమం దరిశి చెంచయ్య నడిపిందే. భర్తతో కలిసి అన్నపూర్ణమ్మ వైశ్య బ్రాహ్మణ, కమ్మ, విశ్వబాహ్మణ మొదలైన కులాల్లో మొత్తం 18 వితంతు పునర్వివాహాల్ని జరిపించింది. 19వ శతాబ్దంలో ఏ విధంగా కందుకూరి వీరేశలింగం -రాజ్యలక్ష్మమ్మలు వితంతు పునర్వివాహోద్యమానికి వెన్నెముకగా నిలిచారో అదేవిధంగా 1920ల్లో దరిశి చెంచయ్య -అన్నపూర్ణమ్మలు వెన్నెముకగా ఉండినారు. “మా ఇంట్లో (వితంతువులైన) వధువులెందరో వుంటూండేవారు. నాభార్య అన్నపూర్ణమ్మ వారినెంతో ప్రేమగా చూచుకొనేది. ఇలాంటి సంఘసేవ చేయాలనే ఆశతోనే ఆమె నన్ను వివాహం చేసుకొన్నది. సంఘసంస్మరణొద్యమాలంటే ఆమెకెంతో సంతోషం. వధువులతో ఆమె చాలా చనువుగా వుండేది. వారు వరుసలతో పిలుచుకొనేవారు.... భార్యల సహాయం లేనిదే స్త్రీల ఉద్యమాలను పురుషులమెంత శ్రమపడినా జయప్రదం చెయ్యలేము. నా ప్రథమ భార్య అన్నపూర్ణమ్మకు స్తీ ఉద్యమాలయందు ఎంతో ఉత్సాహముండేది. ఎందరో స్రీలు మా యింట్లో ఉండేవారు. వారందరిని ప్రేమతో ఆవరించేది అన్నపూర్ణ. వారు అన్నపూర్ణమ్మను ఎంతో ప్రేమించేవారు. జయాపజయాలు, ఫలితాలు మా యిద్దరివీని. ("నేనూ నాదేశం,”పు. 231-238). ఒకరకంగా అన్నపూర్ణమ్మ వితంతు పునర్వివాహోద్యమానికి తన జీవితాన్ని బలి పెట్టిందని చెప్పవచ్చు. 1931 నవంబరులో బందరులో ఒక వితంతు పునర్వివాహాన్ని నిర్వహించి వచ్చిన తర్వాత తీవ్రంగా అనారోగ్యానికి గురై నవంబరు 28న పాతిక సంవత్సరాల పిన్న వయస్సులోనే అన్నపూర్ణమ్మ చనిపోయింది.
అన్నపూర్ణమ్మ అభిప్రాయంలో వితంతువులకు పునర్వివాహం మాత్రమే పరిష్కారం కాదు విద్యకూడా చాలా అవసరం. అందుకే 12 మంది వితంతువులను విద్వార్దన దిశగా ప్రోత్సహించింది. వారికోసం ఉపకారవేతనాల్ని యేర్పాటు చేసింది. ఈ విధంగా వితంతువుల విద్యాభివృద్ధికి తోడ్పడింది. అమె 'పోత్సాహాన్నందుకున్న అనేకమంది వితంతువులు విద్వావంతులై జీవితాల్లో స్థిరపడ్డారు. 1927-1928 ప్రాంతంలో ఒకరోజు తన స్నేహితురాలు తుర్లపాటి రాజేశ్వరమ్మతో కలిసి విజయవాడలో రైవన్ కాలువగట్టున షికారుకెళ్ళింది అన్నపూర్ణమ్మ. ఎవరో వితంతువు శిశువును కని గొంతునులిమి పారవేయగా కాకులు పొడుచుకు తింటూండటం చూచిన యిద్దరూ ఏడుస్తూ యింటికొచ్చారు. ఈ విషయమై ఏదైనా చేయాలని దరిశి చెంచయ్యతో కలిసి ఆలోచించి " వితంతు శరణాలయాన్ని” స్థాపించారు. ఇందులో అన్నపూర్ణమ్మ కార్యనిర్వాహక సంఘ సభ్యురాలుగా పనిచేసింది. “ఆంధ్రపత్రిక " ఈ శరణాలయం గూర్చి బాగా ప్రచారం చేయడంతో అనేకమంది గర్భిణులైన వితంతువులు అక్కడికి రావడం మొదలుపెట్టారు; వీడ్ణల్ని కని అక్కడ వదిలి వెళ్ళేవారు. అలా సుమారు 60 మందికి ఆ శరణాలయం ఉపయోగపడింది. విజయవాడలోని మహిళా డాక్టర్లు, ముఖ్యంగా గుడిపాటి వెంకటాచలం వదిన అయిన డాక్టర్ రంగనాయకమ్మ ఈ శరణాలయానికి ఎంతగానో సహాయపడింది. బిడ్డలు లేని దంపతులు యిక్కడి పిల్లల్ని తీసుకొనిపోయేవారు. (నేనూ - నాదేశం పు. 234-235)
అన్నపూర్ణమ్మ ఆంధ్ర సార్వజనిక క్షేతంలో పనిచేయడం ప్రారంభించేనాటికి, వలసాంథ్రలో మహిళోద్యమం బలంగా వూళ్ళూనుకొని ఉంది. ఆంధ్రలోని పలు పట్టణాల్లోనూ, గ్రామాల్లోనూ మహిళా సంఘాలు యేర్చడి మహిళాభి వృద్దికి పాటుపడనారంభించాయి. యావదాంద్ర స్త్రీల విశాల వేదికగా “ఆంధ్ర మహిళా మహా సభ " 1910లో ఉనికిలోకి వచ్చి ప్రతిసంవత్సరం ఆంధ్రలోని వివిధ ప్రాంతాల్లో మహిళా సమావేశాలను యేర్పాటు చేసేది.” 'ఆల్ ఇండియా వుమెన్స్ కాన్ఫరెన్స్” ఆంధ్రరాష్త్రశాఖగా “ఆంధ్ర రాష్ట్ర మహిళా మహాసభ” 1927లో యేర్పాటు చేయబడి, ప్రతిసంవత్సరం క్రమం తప్పకుండా మహిళా సమావేశాలను నిర్వహించేది. ఈ నేపధ్యంలో 1928లో కొమఱాజు అచ్చమాంబ విజయవాడలో “భారత మహిళా మండలి” ని స్థాపించింది. దీనికి తుర్లపాటి రాజేశ్వరమ్మ అధ్యక్షురాలు కాగా దరిశి అన్నపూర్ణమ్మ కార్యదర్శిగా వ్యవహరించింది. అంతేకాకుండా 'ఆల్ ఇండియా వుమెన్స్ కాన్ఫరెన్స్, బెజవాడ శాఖకు కూడా అనేక సంవత్సరాలు అన్నపూర్ణమ్మ కార్యదర్శిగా పనిచేసింది. 1929లో బొంబాయిలో జరిగిన నాలుగవ * అఖిల భారత మహిళా సభకు ప్రతినిధిగా వెళ్ళిన ముగ్గురు ఆంధ్రస్తీలలో అన్నపూర్ణమ్మ కూడా ఉంది. ఈ విధంగా అన్నపూర్ణమ్మ సమకాలీన మహిళోద్యమంలో చురుకుగా పాల్గొని మహిళాభివృద్ధికి ఇతోధికంగా తోడ్పడింది.
అన్నపూర్ణమ్మ క్షేతన్భాయిలో పనిచేసిన కార్యకర్తేకాకుండా సంస్మరణోద్యమ సాహిత్యాన్ని సృష్టించిన మేధావికూడా. ఆమె కొన్ని కథల్నీ వ్యాసాల్నీ రచించిన సృజనశీలి. ఆమె రచనలు సంస్మరణ పక్షంవహించిన వైశ్యుల పత్రిక అయిన “వాసవి "లో ఎక్కువగా ప్రచురితమయ్యాయి. స్రీల పత్రిక అయిన “గృహలక్క్ష్మి " లో కూడా కొన్ని రచనలు ప్రచురించబడ్డాయి. “హైందవస్త్రీల హక్కులు -కర్తవ్యము ” అనే వ్యాసంలో స్త్రీల హక్కులు - బాధ్యతలకు సంబంధించిన అనేక విషయాలను చర్చించింది అన్నపూర్ణమ్మ. స్త్రీ-పురుషల మథ్య లింగబేధం తప్పిస్తే మరే విధమైన తేడాలేదని నొక్కివక్కాణించిన అన్నపూర్ణమ్మ స్త్రీలు “అబలలు " అనే పితృస్వామ్య భావజాలాన్నీ బద్దలు కొట్టింది. అవకాశాలు లేకపోవడం వల్లనే స్రీలు అబలలుగా మిగిలిపోతున్నారనీ, పురుషులు అవకాశాలు కల్సించినపుడు స్త్రీలు అన్ని రంగాల్లోనూ తమ శక్తిసామర్ధ్యాలను కనబర్చారనీ, కనబర్చగలరనీ విశదం చేసింది. రాచకార్యదురంధరులైన స్త్రీలనూ, బలశాలులైన స్త్రీలనూ, పండితస్త్రీలనూ, కవయిత్రులనూ ఉదాహరణలుగా చూపెట్టింది. “ఈ విధముగ అన్ని విషయములందును పురుషులతో సమానముగ స్త్రీలు కీర్తి గడించిరి” అని స్పష్టం చేసింది. పురుషులు కూడా శక్తిహీనులుగా ఉన్నారనీ అందుకే వారు విదేశీయుల పాలనలో మగ్గుతున్నారనీ తెలియజేసిన అన్నపూర్ణమ్మ “స్త్రీలు రాజ్య పాలనము చేసే యెడల ఇంతకంటె కనిన్టముగా చేయగలరా?” అని ప్రశ్నించింది.
“ప్రస్తుత హిందూ స్త్రీల కష్టాల్లో బాల్యవివాహాలు, అవిద్య ప్రధానమైనవిగా చెప్పిన అన్నపూర్ణమ్మ బాల్యవివాహాలు ప్రీవిద్యకు ఏవిధంగా ఆటంకంగా ఉంటున్నాయో చెప్పింది. అందుకే “వివాహమునకు పూర్వమే ప్రతిస్త్రీ పురుషుడు సంపూర్ణ విద్యావంతులై యుండవలెను” అనీ, విద్య అంటే “కేవలము అక్షరజ్ఞానము” కలిగి ఉండడం కాదనీ, “ప్రతి స్త్రీయును సుమారు పది పండ్రెండు సంవత్సరములైనను గురుకులవాసము చేసి విద్యనభ్యసించవలెను” అని నిజమైన విద్య అంటే ఏమిటో స్పష్టపరిచింది. వివాహం విషయంలో తల్లిదండ్రుల జోక్యం పోయి ఎంపిక విషయంలో వధూవరులకు ఎక్కువ స్వాతంత్య్రం ఉండాలని కోరుకొంది. పాశ్చాత్య స్రీలవలె భారత స్త్రీలకు ఆజన్మాంతం బ్రహ్మచారిణిలుగా వుండే అవకాశం లేదనీ, వివాహం చేసుకోవడం ఇష్టంలేని స్రీలకు బ్రహ్మచారిణిలుగా వుందే అవకాశం ఉండాలనీ చెప్పింది. అలాంటి స్త్రీలు పాశ్చాత్య దేశాల స్త్రీల మాదిరి తమ జీవితాల్ని సంఘసేవలో గడపగలిగే పరిస్థితులుండాలని వాంఛించింది.
శారదా శాసనం (బాల్యవివాహ నిరోధక చట్టం) పట్ల సంతృప్తి వెలిబుచ్చిన అన్నపూర్ణమ్మ శాసనాన్ని జయప్రదం చేయడానికి “శారదా సంఘా "ల్ని స్థాపించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పింది. హైదరాబాద్ మొదలైన స్వదేశీ సంఘాల్లో శారదా చట్టంలాంటి చట్టాన్ని చేయాల్సిన అవసరాన్ని తెలియజేసింది. శారదా శాసనం కనీస వివాహ వయస్సు స్త్రీలకు 14గాను, పురుషులకు 18గానూ యేర్పాటు చేసింది. అన్నపూర్ణమ్మ వివాహ వయస్సును పెంచాలని భావించి కనీస వివాహవయస్సు స్త్రీలకు 16గానూ పురుషులకు 21 గానూ వుండే విధంగా శారదా శాసనంలో సవరణ చేయాలని కోరుకుంది. స్రీలకుగానీ, పురుషులకు గానీ, “నిర్భంధ వివాహములు” ఉండకూడదంది. బహుభార్యత్వాన్ని నిరసించింది. చిన్న బాలికల్ని ముసలివాళ్ళకిచ్చి పెళ్ళి చేసే పద్ధతిని అసహ్యించుకొని అలాంటి “అనమ వివాహములను జరిపించిన తలిదండ్రులు శిక్షాపాత్రులగుటకు రాజశాసనముండవలెను” అంది. వితంతు సమస్యలపై స్పందిస్తూ “ఛిన్న బాలికలను సైతము భర్త చనిపోయినపుడు వితంతువులని పిలుచుట, నిర్బంద బ్రహ్మచారిణులుగా యుంచుట ధర్మమా?” అని ప్రశ్నించింది. నిర్బంధ బ్రహ్మచర్వాన్ని “అన్యాయము” అని ఈసడించింది. “ఇటువంటి అన్యాయము ఏ జాతీయందుగాని, ఏ దేశమందుగానీ, చివరకు పశుపక్ష్యాదులయందుగాని లేదు” అనీ తెలియజేస్తూ వితంతువులకు పునర్వివాహాలు చేయాల్సిన ఆవశ్యకతను తెలియబరిచింది.
స్త్రీలకు అస్తి హక్కు ఉండాలని బలంగా వాదించిన అన్నపూర్ణమ్మ తనకాలంలో స్త్రీలకు సదరు హక్కు లేకపోవడాన్ని గూర్చి వాపోతూ ఈ విధంగా అంది. “తల్లిగారి స్వగృహమందు పుత్రులతో సమానముగా పుత్రికలకు ఆస్తి పంచి యివరు అత్తవారింటియందైనను భర్తయాస్తిపై భార్యకు హక్కులేదు. “రెంటికి చెడిన రేవడి మాదిరి ఏనైవు జూచినను స్త్రీలు నిరాధారులైయున్నారు. పుత్ర సంతతిలేక భర్త చనిఫోయెనేని ఆస్తి వారసులకు చెల్లును. స్వయముగ కనిపెంచిన కుమార్తెలకు హక్కులేదు. వేరే మరియొక బాలుని దత్తత గైకొనిన యెడల ఆస్తి యంతయు వాని పరము చేయుటకు వీలున్నది. క్రైస్తవులలో ఐరోపీయులకు భర్త చనిపోయిన తరువాత ఆస్తి భార్యకు చెల్లును. తదనంతరము ఆస్తి కుమారులకు కూతుళ్లకు సమానముగా పంచి యివ్వబడును. బౌద్దమతమునందుకూడా యటులే జరుగుచున్నది. హిందూ సంఘమునందు మాత్రమే స్త్రీకి ఆస్తిపై హక్కులేదు. పై హక్కులేని లోపము వలన స్త్రీ బానిసకంటె అధమము. బానిసలా పెంచబడి, బానిసను వివాహము చేసెకాని, బానిసకు బిడ్డలై జనించినపుడు, పురుషులు బానిసలు గాకుండుటకు సాధ్యమా? వర్ణ వివక్షత లేక స్తీ పురుషులు హక్కులలో లోపములేక యుండినటువంటి బౌద్దమతమునుగాని, వేదమతమునుగానీ అవలంబించియున్నప్పుడు మన దేశము పరాధీనము కాలేదు.” (మరపురాని అన్నపూర్ణ, పద్మాముద్రాక్షరశాల, మద్రాసు,పు 162-63) ఆస్తిహక్కు లేకపోవడం వల్ల స్రీలు వివక్షకు గురౌతున్నారని చెబుతూ “తల్లిదండ్రులు కొమారులతోబాటు కొమార్తైెలను గౌరవముగ చూచుటలేదు. తగినంత ద్రవ్యమును వెచ్చించి విద్య నేర్పించరు. కొమార్తెలకు పెట్టిన ఖర్చంతయూ వృథాయని భావించెదరు.... ఇన్నిటికిని కారణము స్రీలకు ఆస్తిహక్కు లేకపోవుటయే” అని విశ్లేషించింది. “అస్తి విషయమందు స్త్రీలకు హక్కు గలిగిన నాడే సర్వహక్కులు వచ్చినట్లు భావించవచ్చును” అని ఘంటాపథంగా చెప్పింది. దత్తత విషయంలోనూ, సంరక్షకత్వం విషయంలోనూ స్త్రీలకు పురుషులతో సమానంగా హక్ములుండాలని బలంగా కోరుకుంది అన్నపూర్ణమ్మ.
1920ల చివరినుండీ ఆంధ్రస్త్రీలు విడాకుల సమస్యపై చర్చించడం మొదలుపెట్టారు. 1928లో హరిసింగ్ గౌర్ కేంద్ర శాననసభలో HINDU MARRIAGE DISOLUTION BILLని ప్రవేశపెట్టాడు. మొదటినుండీ విడాకుల చట్టానికున్న తీవ్ర విరోధుల కారణంగా గౌర్ తన బిల్లును వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. 1931-33 మధ్య పలుమార్లు మళ్ళీ ఈ బిల్లును ప్రవేశపెట్టినప్పటికీ వ్యతిరేకత కారణంగా చట్టరూపం దాల్బలేకపోయింది. తర్వాత జి.వి.దేశ్‌ముఖ్ విడాకుల బిల్లును ప్రవేశపెట్టాడు. అప్పటికీ, అంటే 1932లోనే స్వదీశీ సంస్థానమైన బరోడాలో విడాకులను చట్టబద్దం చేసి ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రస్త్రీలలో కొంతమంది విడాకుల చట్టాన్ని స్వాగతిస్తుండగా అనేకమంది తీవ్రంగా వ్యతిరేకించేవారు. కడప రామసుబ్బమ్మ లాంటి మహిళా మేధావులు విడాకుల చట్టాన్ని “దారుణాస్త్ర” మనీ, దాన్ని ఆహ్వానించడం “కొరివితో తలగోకుకోవడమే” ననీ వాదించేవారు. 18 నవంబరు 1934లో మదనపల్లెలో గుమ్మడిదల దుర్గాబాయమ్మ అధ్యక్షతన జరిగిన ఎనిమిదవ “ఆంద్ర రాష్ట మహిళాసభ "లో విడాకుల చట్టానికి సంబంధించిన తీర్మానం చర్చకు రాగా కడప రామసుబ్బమ్మ దాన్ని త్మీవంగా వ్యతిరేకించింది. మెజారిటీ సభ్యులు ఆమెను బలపరచారు. దాంతో ఆ తీర్మానం వీగిపోయింది. దీంతో ఆంధ్రలో విడాకుల చట్టానికున్న వ్యతిరేకత మనకు స్పష్టమవుతుంది.
ఇలాంటి చారిత్రక సందర్భంలో దరిశి అన్నపూర్ణమ్మ విడాకుల చట్టాన్ని మనసారా స్వాగతించింది. స్త్రీలు స్వలాభమును గోరి (విడాకుల) చట్టము కొరకు పోరాడుచున్నారనుట కేవలము సంకుచితాభిప్రాయము” అని నిశ్చయముగా తెలిపింది. “భార్యను జూడగనే మండిపడు పురుషుడును, భర్తను జూచి మూతి విరుచు భార్యయును, హృదయములు కోసినను మచ్చుకైన అనురాగము కాన్సీంచక, నామక: భార్యాభర్తలని వ్యవహరింవబడుచు యమలోక మనుభవించుటకంటే విడాకులిచ్చి ఎవరికి వారు స్వతంత్రులగుట ఉత్తమము కాదా? భార్య వ్యభిచరించుట తెలిసియు భార్యగా పరిగ్రహించుటయు, భర్త వ్యభిచారియైనను భర్తగ నెంచుటకంటెను విడిపోవుట సుఖముగాదా? న్యాయము గాదా?” అని సూటిగా ప్రశ్నించింది. విడాకులనేవి పాశ్చాత్యులనుండి నేర్చుకొన్న పద్దతి కాదనీ, పూర్వం నుండీ భారతదేశంలో ఉన్న పద్ధతేననీ “ఏ.కారణముల వలననో” ఈ పద్దతి కొన్ని కులాల్లో ఉండిపోయి కొన్ని కులాల్లో లేకుండా పోయిందనీ వివరించింది. విడాకుల చట్టం వచ్చినంత మాత్రాన ప్రతీ స్త్రీ విడాకులిస్తుందని భావించడం “హాస్యాస్పద”మని తెలియజేస్తూ విడాకులకు అవకాశం వున్న క్రైస్తవ, మహమ్మదీయ, బ్రహ్మసామాజికుల్లో “వెయ్యింటికొకరు మాత్రమే విడాకులిచ్చుకొనుట సంభవించుచున్నది” అని వాస్తవ పరిస్థితిని తెలియజేసింది. నిజమైన అనురాగము గల భార్యాభర్తలు విడాకులు తీసుకోరనీ “స్త్రీలకు ఉరిత్రాడు అయినటువంటిన్ని పురుషులకు మానహీనమైనటువంటిన్ని అనారోగ్యకరమైనటువంటిన్ని జారత్వము, బహుభార్యత్వమును మాన్సుట, క్రూరులగు భర్తలిడు బాథలను సహింపజాలక వంధలమంది స్త్రీలు నుయ్యిల గొయ్యిల పాలగుచుందుట నడ్డుపెట్టుటకే” విడాకుల చట్టం కావలసి వచ్చిందని విశ్లేషించింది. “పురుషులకు బానిసలుగ నుండుటకు బ్రహ్మ వారిని (స్త్రీలను) విధించినట్లును, స్త్రీలను అణగదొక్కి హింసించుటయే మగవారి కర్తవ్యమైనట్టును పురుషులు భావించుచు ”న్నారనీ, పురుషుల హింసనుంచి స్త్రీలను రక్షించడానికి విడాకుల చట్టం అత్యవసరమని ఘంటాపథంగా చెప్పింది.
కేవలం ఆంధ్ర, సంస్కృత భాషల్లో పాండిత్యం కలిగిన పండితులు, పీఠాధివతులు, పురోహితులు మొదలైనవారు సంఘ సంస్కరణొద్యమానికి అడ్డుతగులుతున్నారనీ, “పూర్వాచారపరాయణులు” రజస్వలానంతర వివాహాల్ని వితంతు వివాహాల్నిఅస్పృశ్యతా నిర్మూలనా కార్యక్రమాల్నీ విదేశీయాత్రల్నీ అంతర్వర్ణ భొజనాల్నీ అంతర్వర్ణ వివాహాల్నీ వ్యతిరేకిస్తూ సామాజిక మార్పును అడ్డుకొంటున్నారని విమర్శించింది అన్నపూర్ణమ్మ. స్త్రీలపట్ల పురుషుల కర్తవ్యాన్నీ గుర్తుచేన్తూ “స్రీలకు హక్కులనిచ్చి గొప్పవారినిగాజేసి గౌరవించినందున పురుషులు తమ తల్లులను, అక్మచెల్లెండ్రను, కుమార్తెలను బాగుచేనిన వారగుదురు. విద్వావంతులును, స్వతంత్రులును అయిన స్త్రీలు తమ పుత్రులను, భర్తలను థైర్యశాలులుగను, దేశభక్తులుగను, చేయుదురని వేరే చెప్పవలసిన అవసరము లేదు” అని స్త్రీలు పురుషులకందివ్వగల తోడ్పాటును వివరించింది. “హిందూదేశము తిరిగి ప్రపంచములో గౌరవస్థానమును అలంకరించునట్లు చేయుట స్త్రీపురుషుల కర్తవ్యమై యున్నది.” అని భారతదేశం పూర్వం అనుభవించింది అనుకొన్న ఔన్నత్యాన్ని తిరిగి సంపాదించడంలో స్త్రీ-పురుషుల బాధ్యతను గుర్తుచేసింది. స్త్రీలకు “పతిభక్తి మాత్రమే చాలద”ని నినదించిన అన్నపూర్ణమ్మ “అత్మబలము, దేహబలము, దేశభక్తి, దైవభక్తి మొదలైన అనేక శక్తులను సంపాదించుటకు” స్రీలకు పిలుపునిచ్చింది. అంతేకాకుండా “పతిభక్తి తప్ప మరేమియు కూడదనే పురుషులను స్త్రీలు గౌరవించు కాలము పోయినది” అని పురుషులను హెచ్చరించింది. గాంధీ, నెహ్రూ, లజ్‌పత్‌రాయ్, సరోజినీనాయుడు, అనిబీసెంట్ మొదలైన “ఆదర్శప్రాయులై”న నాయకుల్లాంటివారు “అసంఖ్యాకంగా” దేశంలో జన్మించాలంటే, స్త్రీలకు పురుషులతోపాటు అన్ని రకాల హక్కుల్నీ యివ్వాలని డిమాండు చేసింది.
అన్నపూర్ణమ్మ ఘోషా బురఖా పద్దతులు నిరసించింది. ఘోషా వలన “*స్వేచ్చగ బాహ్య విషయవులందు జోక్యము కలిగించుకానుటకు వీలుండదు” అనీ, దానీ వలన “అసమర్థత” కలుగుతుందనీ “అసమర్ధతే అజ్ఞానము” అనీ తెలిపింది. దీనివల్లనే స్త్రీలు మౌడ్యులుగా చిత్రీకరింపబడుతున్నారని విశదపరచింది.“ప్రపంచమందుండు ఱాయి -రప్ప, చెట్టు-చేమ, గొడ్డు -గోద ప్రతివస్తువును సూర్యరశ్మినుండి ప్రాణశక్తిని గ్రహించుచున్నవి. బురఖా థరించుటవలన సూర్యరశ్మి తగులక రక్తహీనులును, బలహీనులును యగుచున్నారు” అని ఘోషా-బురఖా వల్ల కలిగే ఆరోగ్యపరమైన చెడుగుల్ని తేటతెల్లం చేసింది.
వేశ్యావృత్తి “ప్రజాకంటకమైనది” అని ఎలుగెత్తి చాటిన అన్నపూర్ణమ్మ దాన్ని నివారించడానికి అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చి, ఆదిశగా కృషిచేస్తున్న డాక్టర్ ముత్తులక్షీరెడ్డిని బహుధా ప్రశంసించింది.
అస్పుశ్యతను నివారించడం “ముఖ్యావసరము”గా భావించినఅన్నపూర్ణమ్మ “అస్పృశ్యుల "ను హీనంగా చూసే “అగ్రవర్జా" లను నిందించింది. “నిమ్న జాతులయందుండు అనహ్యకరములగు అలవాట్లకు అగ్రవర్ణములవారే కారణభూతులు. వారిని చేరదీయక, గ్రామములందు నివసించుటకు అనుమతించక, దేవాలయములలో పూజలు చేసుకొనుటకు ఉత్తరువునివ్వక, అధమాధములనుగా చూచుచున్నాము” అని అగ్రవర్ణాల దుష్ట ప్రవర్తనను బట్టబయలు చేసింది. అగ్రవర్ధాలు పెట్టే “బాధలు పదజాలక” దళితులు క్రైస్తవం లేదా ఇస్తాంలలోకి మారి సౌభ్రాతృత్వాన్ని అనుభవిస్తున్నారని తెలియజేస్తూ “కైస్తువంటి, మహమ్మదువంటి దయాళుడైన బుద్దభగవానుడు మన దేశమున బుట్టలేదా?” అని నిష్ణూరముగా ప్రశ్నించింది. అందరినీ సమానంగా చూడమని బుద్దుడు చెప్పాడనీ, కానీ అతని ప్రవచనాలు పుస్తకాలకు మాత్రమే పరిమితమైపోయి కార్యాచరణలో ఉండడం లేదనీ వాపోయింది. ప్రస్తుత కాలంలో గాంధీ మహాత్ముడు అస్పృశ్యతా నివారణకోనం తీవ్రంగా కృషి చేస్తున్నాడని ప్రశంసించింది.
వర్ణవ్యవస్థను నిరసించిన అన్నపూర్ణమ్మ సహపంక్తి భోజనాల్లో శ్రద్ద కనబర్చేది. బ్రాహ్మణులు మొదలు దళితుల వరకు అందర్నీఒకే విధంగా ఆదరించేది. బంధువులు నివారించినా వినకపోయేది. పనిమనుషులు సహపంక్తి భోజనానికొచ్చిన వివిధ కులాల “అతిధుల విస్తళ్ళను, ఎంగిలి పాత్రలను” శుభ్రం చేయడానికి నిరాకరించినపుడు,ఆ పనులను తనే చేసేది. “జాతిమత ఖేదములేక సహపంక్తి భోజనములలో పాల్గొనినగాని, హైందవ సంఘమందలి దురాచారములు అంతరించి వేులుకలగద”ని ఆమె నొక్కి చెబుతుండేది.
రెండు భాగాలుగా రాసిన “జాతీయత” అనే వ్యాసంలో ప్రజలకుండే వివిధ అస్తిత్వాలను గూర్చి చర్చించిన అన్నపూర్ణమ్మ వాటిలో విశిన్ళమ్టైన అస్తిత్వమేదో తెలియజేసింది. ప్రజలకు కులాభిమానము, మతాభిమానము, దేశాభిమానము ఉండవచ్చనీ, కానీ దురభిమానం మాత్రం ఉండకూడదని తెలిపింది. “ఒక కులము ఎంత ఉన్నత దశయందున్నను పరకులస్తులను నిరసించుటగాని, ద్వేషించుటకాని కూడదు.” అని చక్కటి సూచనచేసింది. కుల,మతాభిమానాలకంటే దేశాభిమానము మెరుగైనదని స్పష్టం చేసింది. దానికన్నా “మానవ జాత్యాభిమానము సరొత్కృష్టమైనది. ఇట్టి యభిమానముగలవారు ఒక దేశస్తులనిగాని, ఒక మతస్తులనిగాని, నల్లవారనియు, తెల్లవారనియు. భేదము చూపరాదు. ఒక దేశము మఱియొక దేశముపై విరోధము వహించుట, దానిపై దండెత్తుట, అపజయమునుగాంచిన దేశమును నానా బాధలుపెట్టి హింసించుటమొదలగునవి అసహ్యకరములుగను పాపభూయిష్టమైనవిగను భావించి” న అన్నపూర్ణమ్మది విశాలమైన అంతర్జాతీయ దృక్పథం.
భారతదేశానికున్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా జాతీయవాదం యొక్క అవసరాన్ని ప్రబోధించింది అన్నవూర్ణమ్మ. ప్రజలు
కులమతాలకతీతంగా ఏకమై దేశ స్వాతంత్రంకోసం పాటుపడాలని పిలుపునిచ్చింది. దేశంకోసం అందరూ ఒక్క తాటిపై నడవాల్సిన సమయంలో ఏ కులానికాకులం “ఎవరికి వారే యమునాతీరే” అన్నట్లు ప్రవర్తిస్తే “గొప్ప పొరపాటు చేసిన వారగుదుము” అని హెచ్చరించింది. భారత జాతీయోద్యమంలో పాలుపంచుకోమని వైశ్యులకు ప్రత్యేకంగా పిలుపునిచ్చి వారు ఏవిధంగా దేశ స్వాతంత్రోద్యమంలో సహాయపడవచ్చునో తెలియజేసింది. “విదేశ వస్తు వ్యాపారము మాని స్వదేశ వస్తువులను అమ్ముట, దానథర్మములకు ఉపయోగపెట్టదలంచిన ద్రవ్యమును స్వరాజ్యోద్యమమునకు ఖర్చుపెట్టుట, యువకులు వాలంటీరులుగా చేరుట, ప్రచారము కొందరు బయలుదేరి ప్రతి గ్రామము పర్యటనము చేయుచు గ్రామవాసులకు దేశపరిస్థితులను స్వరాజ్యోద్యమము యొక్క మూల సూత్రములను బోధించుట, సంఘసంస్కరణ విషయములను గూడ బోధించవచ్చును. త్రాగుడు మాన్చించుటకు ప్రయత్నములు సలుపవలెను.” జాతీయోద్యమం పట్ల త్వీవంగా ఆకర్షితురాలైన అన్నపూర్ణమ్మ ఆంధ్రలో జరిగిన ఉప్పుసత్యాగ్రహం పట్ల మిక్కిలి సంతృప్తిని ప్రకటించింది. అందునా వైశ్యులు అందులో పాల్గొనడంతో ఆమె ఆనందానికి మేరలేకపోయింది. “వైశ్యులలోననేకులు ఈ యుద్యముమునకు సహాయుము చేయుచున్నారని వినుటకు ఎంతయో ఆహ్హాదకరముగనున్నది. గుంటూరు పట్టణమందు వైశ్యులలో ఇరువదిమంది పురుషులును, ఒక స్త్రీ శ్రీమతి కాళంగి శేషమాంబగారును జైలుకు వెళ్ళుటకు సంసిద్దులై వాలంటీరులుగా చేరినందుకు ఎంతయు సంతసము గలుగుచున్నది. ఆరు లక్షలమంది వైళ్యులలో నారీమణులు స్వరాజ్యోద్యమమునందు పాల్గొనలేదను నిందను బాపిన శ్రీమతి కాళంగి శేషమాంబగారు ఎంతయు స్తోత్రార్డులు....... ప్రస్తుత ఉద్యమ తీవతనుబట్టి కొలదికాలములో వైశ్యులందరును ఈ యుద్యమమునందు పాల్గొనులాగున కనుబడుచున్నది” అని మిక్కిలి సంతోషాన్ని వెలిబుచ్చింది.
"గాంధ్యవతారము” అనే వ్యాసంలో కలియుగంలో జన్మించిన గాంధీ అవతారము రామావతారము, కృష్ణావతారముల కన్నా “గొప్పది” అని విశ్లేషించింది అన్నపూర్ణమ్మ. గాంధీ అహింసా సిద్ధాంతంలో బలంగా నమ్మిన ఆమె రావణాసురుని, వాని అనుచరులను చంపక ధర్మప్రవర్తనులుగా జేసియుండిన యెడల రామావతారమును ఇంకను గొప్ప అవతారముగ భావించియుండమా? కౌరవులను నాశనము చేయక తన శిష్యులుగా మార్చియుండిన యెడల కృష్ణావతారము యత్యుత్తమమని భావించియుండమా?” అని ప్రశ్నించింది. త్రేత, ద్వాపర యుగాలకంటే కలియుగంలో “అధర్మము” ఎక్కువగా ఉందనీ, అయిననూ హింసను ప్రయోగించక “కలము, నాలుక” అనే రెండు ఆయుధములను వాడి “ధర్మ సంస్థాపన” కొరకు గాంధీ పాటుపడుతున్నాడనీ, ఆయనముందు శత్చపక్షంవారి “పశుబలము, సైన్యము, ధనము” నిరుపయోగమవుతున్నాయని తెలియజేసింది.హింసకూ అహింసకూ మధ్య జరుగుతున్న సమరంలో చివరకు “ఆధ్యాత్మిక బలమే జయము గాంచుచున్నది. శత్రుపక్షము క్రోధమును మాని గాంధీగారి శిష్యవర్గములో చేరవలనిన అవనరము కనబడుచున్నది. ఇట్టి ఆధ్యాత్మిక శక్తిని గనుపరచిన గాంధి అవతారము పూర్వపు అవతారములకంటే గొప్పదిగదా!” అనీ గాంధీ పట్ల తనకున్న ప్రగాఢమైన అభిమానాన్ని చాటుకున్నది.