అమ్మనుడి/సంపుటి 6/నవంబరు 2020/నాట్యతపస్వి శోభానాయుడు

డా॥ మండలి బుద్ధప్రసాద్‌ 9848780872

నాట్యతపస్వి శోభానాయుడు

కనువెలుగు 1956

కనుమరుగు 14-10-2020

1975లో మద్రాసులో కళాసాగర్‌ సంస్థ కూచిపూడి ఆర్ట్స్‌ అకాడెమీ వారి చండాలిక నాట్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. కూచిపూడి నాట్యకళ ఘన చరిత్రను ఒక మలుపు తిప్పిన ప్రదర్శన అది!.

విశ్వకవి రవీంద్రనాథ టాగూరు, బౌద్దుల కాలం నాటి ఒక ఇతివృత్తాన్ని తీసుకుని అస్పృశ్యత సమస్యపై వ్రాసిన నృత్యనాటికను ఎస్‌.వి. భుజంగరాయశర్మ గారు గొప్పగా తెలుగు చేశారు. పౌరాణిక అంశాలకు పరిమితమైన కూచిపూడి నృత్యరంగం మొదటిసారిగా ఒక సామాజిక సమస్యపై ఈ నృత్యరూపకాన్ని రూపొందించి ప్రదర్శించింది. ఆఘనత నాట్య గురువు వెంపటి చినసత్యంగారిది కాగా, చండాలిక పాత్రలో యువనర్తకీమణి శోభానాయుడు అభినయంలో తన విశ్వరూపాన్ని ప్రదర్శించి కూచిపూడి నాట్య విధానానికే కొత్త శోభను సమకూర్చారు.

ఆరోజు ఆమె నాట్యవిన్యాసాన్నీ చూసిన నాలుగువేలమంది అదృష్టవంతుల్లో నేనూ ఒకణ్ణి. మా నాన్న మండలి వెంకట కృష్ణారావుగారు ఆనాటి విద్యామంత్రిగా ఆ ప్రదర్శనకు ముఖ్య అతిథి కావటంతో వారితో కలిసివెళ్లి నేను మద్రాసులో ఆ ప్రదర్శన చూడగలిగాను.

ఆ తరువాత 1976లో హైదరాబాద్‌ రవీంద్రభారతిలో కూడా “చందాలిక” ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఆనాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావుగారితో సహా అనేకమంది ప్రముఖులు విచ్చేసిన ఆ సమయంలో రవీంద్రభారతి కిక్కిరిసిపోయింది. ఆనాటి ప్రదర్శన ఈ నాటికీ నాకళ్లముందు కదలాడుతూనే ఉంది.

అంతకు పూర్వమే 'శీకృష్ణపారిజాతం లాంటి నృత్యనాటికలలో సత్యభామ పాత్రలో శోభానాయుడు గారు పేరొందినప్పటికీ నా దృష్టిలో చండాలిక ఒక అపూర్వమైన పాత్ర!

వెంపటి చిననత్యం గారికి పద్మభూషణ్‌ పురస్కారం వచ్చిన సందర్భంలో అవనిగడ్డ గాంధీక్షేతంలో వారికి మా నాన్నగారు ఘనసన్మానం చేశారు. ఆ రోజు “పద్మావతీ శ్రీనివాసం” ప్రదర్శించటానికి శోభానాయుడుగారు అవనిగడ్డ వచ్చారు. తన ప్రదర్శనతో వేలాది మంది దివిసీమ ప్రజలను మంత్రముగ్ధులను చేశారామె!

అప్పటి నుండీ ఆమెతో పరిచయం ఉన్నప్పటికీ నేను మంత్రి అయిన తరువాత శోభానాయుడిగారితో కలిసి అనేక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం కలిగింది. ఆమె కొత్త నాట్య ప్రదర్శన జరిగినప్పుడు అతిధిగా నన్ను ఆహ్వానించి గౌరవించేవారు.

కిన్నెర రఘురామ్‌ ఎక్కువగా ఆమె కార్యక్రమాలు ఏర్పాటు చేసేవారు. “అతిథులుగా ఎవరిని పిలవమంటారనీ ఆమెను అడిగితే ఆమె మీ పేరునీ, కళాతపస్వి కె.విశ్వనాథ్‌ గారిని పిలవమని చెప్పేవారని రఘురాం నాతో చాలాసార్లు అన్నారు.

ఆమె మోకాళ్లకు ఆపరేషను చేయించుకున్న తరువాత యిచ్చిన మొదటి ప్రదర్శన నన్నెంతో ఆశ్చర్యపరచింది. ఆమె పట్టుదలకు, కృషికి నిదర్శనమే ఆ ప్రదర్శన. 60 యేళ్ల వయసులో మోకాళ్లకు ఆపరేషను చేయించుకున్నా ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేయగలగటం వరపుత్రులకే సాధ్యం అనుకుంటాను. "కూచిపూడి నృత్యం తన ఊపిరి, తన ప్రపంచం” అనీ సగర్వంగా ప్రకటించారామె!.

హైదరాబాదులో కూచిపూడి అకాడమీనీ ప్రారంభించినప్పుడు ఆమె 'మద్రాసులో నేను భక్తురాలిగా ఉన్నాను. హైదరాబాదులో నేను పూజారిణిని ' అన్నారట. నాట్యకళను ఒక భగవత్స్వరూపంగా ఆరాధించిన కళామూర్తిగా ఆమె అవుపిస్తారు.

2008లో సిలికానాంధ్ర ఆధ్వర్యంలో అమెరికాలో జరిగిన మొదటి అంతర్జాతీయ కూచిపూడి నాట్యోత్సవానికి అధ్యక్షత వహించే భాగ్యం నాకు కలిగింది. నాట్యగురువు వెంపటి చినసత్యంగారికి శోభానాయుడు గురుపూజ చేసిన మహత్తర సన్నివేశం అది! రెండు కళ్లూ చాలని గొప్ప దృశ్యంగా ఆ సమావేశాన్ని నేను భావిస్తాను. నాలుగు తరాల నాట్య గురువులు పాల్గొన్నారు.

వెంపటి చినసత్యంగారు ఒక ఆంగ్లపత్రికకు యిచ్చిన ఇంటర్వ్యూలో నావద్ద నాట్యాన్ని అభ్యసించినవారు ఎక్కువ మంది సినిమా రంగానికి వెళ్లారు. కానీ, శోభానాయుడు మాత్రం నాట్యరంగాన్ని మాత్రమే అంటిపెట్టుకుని ప్రసిద్ది పొందారని చెప్పారు.

శ్రీమతి శోభానాయుడు ఆరంగేట్రానికి మద్రాను కళాక్షేత్రం వ్యవస్థాపకురాలు శ్రీమతి రుక్మిణి అరండేలు వచ్చారు. ఆమె ప్రదర్శనకు అచ్చెరువొంది ప్రశంసించి, 'నువ్వు మద్రాసు వచ్చింది నాట్యం నేర్చుకోవటానికా... సినిమాలలో చేరటానికా...?” అని అడిగారట! దానికి ఆమె తటపటాయించకుందా 'నేను సినిమాలలోకి వెళ్లను. నా జీవితాన్ని నాట్యానికే అంకితం చేస్తాను” అని ప్రమాణపూర్వకంగా ప్రకటించారు. తరువాత అక్కినేని నాగేశ్వరరావు గారు 'మహాకవి క్షేతయ్య'కూ, దర్శకుడు బి.యన్‌.రెడ్డి గారు హిందీ 'సర్‌గమ్‌” సినిమాకీ, కె. విశ్వనాథ్‌గారు “శంకరాభరణం” సినీమాకీ, బాపుగారు 'సీతాకళ్యాణం” సినిమాకీ, యన్‌.టి.రామారావు గారు “బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమా కోసం ఇంకా ఎంతో మంది నిర్మాతలు, దర్శకులు నటించవలసిందిగా ఆహ్వానించినా ఆమె తన ప్రమాణానికే కట్టుబడి ఆ అవకాశాలను సున్నితంగా తిరస్కరించారు! ధనం కోసం, గ్లామర్‌ కోనం, తాపత్రయపడని కళాతపసిని ఆమె. ఆమెది ఋషితుల్యమైన కళాహృదయం. ఆ హృదయానికి కళాభిమానులు సాగిలబడి మొక్కుతారు. “నాన్ఫషిః కురుతే నాట్యం” అని ఆమె నిరూపించారు. ఋషి కానివారు నాట్యమయూరి కూడా కాలేరు.

కూచిపూడి నాట్యసౌరభాన్ని దిగ్గిగంతాలకు వ్యాపింప చేసిన కళామూర్తి ఆమె. రష్యాలో ప్రదర్శన ఇచ్చినప్పుడు ఇద్దరు రష్యన్‌ యువతులు కూచిపూడి నాట్యకళ పట్ల ఆకర్షితులై ఆమెను తమకు నేర్చించవలసిందిగా ప్రార్థించారు. పదే పదే ఆమెను కలిసి, ఇండియా వచ్చి నేర్చుకుంటామని కోరేవారు. తన డాన్స్‌ అకాడెమీలో వారికి శిక్షణనిచ్చి మంచి నాట్యతారలుగా ఆ ఇద్దరినీ తీర్చిదిద్దారామె. “ఈ ఘనత కూచిపూడి నాట్యకళది. ఆ కళలోనే ఆ ఆకర్షణ ఉంది. కానీ పట్టుదల లేకపోతే ఈ విద్య వంటబట్టదు. నన్ను నిలబెట్టిందీ పట్టుదలే. మరెవరికైనా కావలసిందీ అదే. పట్టుదల ఉంటే దానితోపాటు కావల్సివన్నీ వాటంతట అవే సమకూరుతాయి. ఆ రష్యన్‌ అమ్మాయిల పట్టుదలలో వెయ్యోవంతున్నాా అనుకున్న రంగంలో శిఖరాన్ని అందుకోవడం ఎవరికైనా సాధ్యమేనని నాకు బలంగా అనిపిస్తుంది అంటారామె!

104 డిగ్రీల వైరల్‌ జృరంతో బాధపడ్తున్నా పట్టు విడవకుండా, ఒంట్లో బాగోలేదని తప్పించుకోకుండా, గురువు మాట నిలబెట్టటం కోసం, కళ కోసం ఆమె నృత్యం చేసి ప్రదర్శనను రక్తికట్టించారు. చండాలిక, సత్యభామ, శకుంతల లాంటి పాత్రల్ని తలచుకుంటే శోభానాయుడు గుర్తుకొస్తారు. అంత బలంగా ఆమె రసహృదయుల మనసులమీద చెరగని ముద్రవేశారు.

తన చిన్నప్పుడు ఏలూరులోని గురువుగారు “మీ అమ్మాయికి నాట్యానికి కావలసిన ఆకృతి లేదు. ప్రేక్షకుల్ని ఒప్పించే శక్తి కూడా లేదు. అందువల్ల మీరు ఊరికే తాపత్రయపడొద్దు. అలా అని మాన్సించనూ వద్దు. నేర్పించండి. ఎప్పటికైనా వస్తే వస్తుందేమో!” అన్నారట. బహుశా మద్రాసు వెళ్లి వెంపటి చినసత్యం గారిని ఆశ్రయించి నాట్యమయూరిగా రాణించగలగటానికి ఆ గురువు మాటలకు పంతం పట్టి పట్టుదలతో వేసిన కృషే కారణం. నిజానికి శోభానాయుడుగారికి జన్మనివ్వటం మాత్రమే కాదు, ఆమెలో ఒక నాట్యమయూరికి జన్మనిచ్చింది కూడా ఆమె మాతృమూర్తే. గురువు లాభం లేదన్నా తండ్రి వ్యతిరేకించినా, అమ్మ వెనక్కి తగ్గలేదు."ఓ రెండేళ్లలో నాట్యం నేర్చుకుని ఆరంగేట్రం చేసి తిరిగి వస్తుంది. ఆ తరువాత అమ్మాయిని డాక్టర్‌ను చేస్తారో, ఏం చేస్తారో మీ ఇష్టం” అని భర్తను ఒప్పించిన మహా ఇల్లాలామె! ఆ ఒప్పందం మీదే నన్ను చెన్నయ్‌ పంపించారు” అని పలు సందర్భాల్లో శోభానాయుడు స్వయంగా చెప్పుకునేవారు. వైద్యం నేర్వకపోయినా నాట్యసరస్వతికి నిత్వనైవేద్యంగా తన జీవితాన్ని మలచుకున్నారామె. అందుకే ఆమె ధన్యజీవి.

మందలించారని గురువును వీడలేదు. వేరే గురువును ఆశ్రయించలేదు. గురువు మందలించారంటే లోపం ఎక్కడుందో తనను తాను సరిచూసుకుని, సరిచేసుకునీ మెరుగుపడితే కళలో రాణిస్తారనీ నమ్మిన వ్యక్తి ఆమె! గురువు కోప దూషణాదులు ఎప్పుడూ తన మంచికేనని భావించి, నిరాశ చెందకుండా దీక్షతో, పట్టుదలతో కృషి చేసి, గురువుకు తగిన శిష్యురాలనీపించుకున్నారామె! ఆత్మ విమర్శే ఆమెని అంత పెద్ద స్థానానికి చేర్చింది.

నాగరకతకు కళ గీటురాయి. ఏ దేశంలో నైనా నాగరకత ఎంతవరకూ వికసించిందో ఆ దేశంలో వర్ధిల్లిన కళల ద్వారా తెలుసుకోవచ్చు. ఆ కళలను వర్దిల్లచేసిన కళాకారులపట్ల జాతి రుణవడి ఉంటుంది. ఈ సత్యాన్ని మన ప్రభుత్వాలు గమనించకపోవటం దురదృష్టకరం. సంతాప సందేశాలతో సరిపెట్టకుండా భావితరాలకు అందించిన ఆదర్శాన్ని గుర్తుచేసేలా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలకుంది. దురదృష్టవశాత్తూ మన రాజకీయపక్షాలకు కళాసాహిత్య రంగాలంటే చిన్నచూపు ఎక్కువ.దేశప్రతిష్టకు, జాతి ప్రశస్తికి ఇవి గీటురాళ్లనే ఎరుక వాళ్లకు లేదు. అదే అసలు కారణం.

జీవితంలో నాట్యం కాదు, నాట్యమే జీవితంగా జీవించి, తెలుగు నేలకు, తెలుగుజాతికీ, తెలుగు సాంస్కృతిక వారసత్వానికీ ఎనలేనీ కీర్తినార్డించి పెట్టారు శోభానాయుడు! నాట్యసరస్వతి అనుగ్రహం సంపూర్ణంగా పొందిన ఆమె జన్మ ధన్యం. ఆమె కళాజీవితం నాట్య కళాకారులందరికీ ఆదర్శప్రాయం.