అమ్మనుడి/సంపుటి 6/నవంబరు 2020/చదవడం అంటే ఏమిటి?
తెలుగు బోధన
సి. వి. క్రిష్ణయ్య 9396514554
చదవడం అంటే ఏమిటి?
చదవడం అంటే ఏమిటి? దేన్ని చదవడం అంటున్నాం? నేర్చుకోవడం అంటే ఏమిటి? దేన్ని నేర్చుకోవడం అంటున్నాం? చదవడం నేర్చుకోవడం రెండూ ఒకటేనా? ఈ విషయాల గురించి స్పష్టంగా తెలుసుకొందాం. మొదట విద్యార్థులనూ, టీచర్లనూ అడిగి వారేమి చెబుతారో విందాం.
ఒక అమ్మాయిని పలకరిద్దాం.
అమ్మాయీ! నీ పేరేమిటి? ఏ తరగతి చదువుతున్నావు?
“నా పేరు లత. పదోతరగతి చదువుతున్నాను!”
లతా! నీ చేతిలో ఏదో పుస్తకం ఉంది. ఏమిచేస్తున్నావు?
“రేపు పరీక్షలు, చదువుకొంటున్నాను”
చదవడం అంటే ఏమిటి?
“చదవడం అంటే అక్షరాలు గుర్తించి, పదాలు వాక్యాలు చదవడం. పుస్తకంలో పాఠం చదవడం”
“నువ్వు పాఠం చదువుతున్నట్లు లేదు. నీ చేతిలో నోట్‌బుక్ ఉంది”
“అవును. ప్రశ్నలకు జవాబులు నేర్చుకొంటున్నాను!
నేర్చుకోవడం అంటే ఏమిటి?
“నేర్చుకోవడం అంటే ఒకటికి పదిసార్లు చదివి కంఠస్థం చేసి గుర్తుపెట్టుకోవడం”
మరిచిపోతే ఎలా!
“మరిచిపోతుంటాం. మళ్లీ పరీక్షలప్పుడు చదివి గుర్తు చేసుకొంటూ ఉంటాం. పరీక్షల వరకు గుర్తుంటే చాలు”
“పరీక్షలు రాస్తావు. మార్కులు వస్తాయి. పాసైపోతావు. ఆ తర్వాత మరిచిపోతే మార్ములు కూడా పోవాలి గదా!”
“అదెలా! నేను కష్టపడి నేర్చుకొని పరీక్షల్లో రాసాను కదా”
“మార్కులు వేసేది జ్ఞానానికి కదా! జ్ఞానం మరిచిపోరు కదా! నువ్వు కంఠస్థంచేయకుండా పాఠం అర్థం చేసుకొని సొంతమాటల్లో రాస్తే జ్ఞానం సంపాదించుకొంటావు గదా!”
“పాఠం చదివి అర్ధం చేసుకోవడం కష్టం. పాఠంలో ప్రశ్నలుంటాయి. వాటికి టిచర్లు జవాబులు చెబుతారు. లేకపోతే గైడ్లు ఉంటాయి. జవాబులు నేర్చుకొనీ పరీక్షల్లో రాస్తే మంచి మార్కులు వస్తాయి. సొంతంగా రాస్తే ఫుల్ మార్కులు వేయరు”
ఇదీ సంగతి. పిల్లల దృష్టిలో చదవడం అంటే అక్షరాలు చదవడం. నేర్చుకోవడం అంటే జవాబులు కంఠస్థం చేయడం.
పాఠాలు అర్ధం చేసుకోవడం కష్టం. సొంత మాటల్లో రాస్తే “ఫుల్ మార్కులు” వేయరు. ఇది పిల్లల అభిప్రాయం. మరి టీచర్లు ఏమి చెబుతారో విందాం.
సార్ మీరు ఏ సబ్దక్టు చెబుతారు? -
“నేను సోషల్ అసిస్టెంటును. సోషల్ చెబుతాను.
“పిల్లలకు పాఠాలు చెబుతారా, ప్రశ్నలకు జవాబులు చెబుతారా”
“రెండూను. పాఠాలు చెబుతాను, ప్రశ్నలకు జవాబులూ చెబుతాను.”
“ప్రశ్నలకు జెవాబులు తెలుసుకొని రాయాల్సింది పిల్లలు గదా! మీరెలా జవాబులు చెబుతారు?”
“వాళ్లు అర్ధం చేసుకోలేరు”
“వాళ్లకు అర్ధమయ్యేటట్లు మీరు పాఠం చెప్పాలిగదా!”
“మేం పాఠం చెబుతాం. అర్థం చేసుకొనే వాళ్లు చేసుకొంటారు. చేసుకోలేని వాళ్లు చేసుకోలేరు. వారికి నోట్స్ ఇస్తున్నాంగా! అందరికీ అర్ధమయ్యేటట్లు చెప్పాలంటే సిలబస్ పూర్తిగాదు. అందుకే నోట్స్ ఇస్తున్నాము.”
అది టీచర్ల ఉద్దేశం.
ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. చదవడం అంటే ఏమిటి? ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. లిపి చదవడం, విషయం చదవడం. రెండూ ఒకటి కాదు. లిపినేర్చుకొంటాం. అది ఒక నైపుణ్యం, అది ఒక విద్య. ప్రాథమిక తరగతుల్లో లిపి నేర్చుకోవడం పూర్తవుతుంది. దీనీ అధారంగా పై తరగతుల్లో విషయం చదువుతారు. అంటే అర్దం చేసుకుంటారు. చదవడం అంటే అర్ధం చేసుకోవడం. విషయం ఇదీ అని తెలుసుకోవడం. చదవడం అంటే ప్రశ్నలకు జవాబులు నేర్చుకోవడం కాదు. చదవడం అంటే కంఠస్థం చేయడం కాదు.
అక్షరాలతో సంబంధం లేకుండా మనమందరం ఈ ప్రపంచాన్ని నిరంతరం చదువుతూ ఉంటాం. అంటే అర్థం చేసుకొంటూ ఉంటాం. అర్ధంచేసుకొనే శక్తి ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అది నేర్చుకొనేది కాదు. అది పుట్టుకతోనే మనలో దాగి ఉంటుంది. అది ఉపయోగించక పోతే జరిగే నష్టం అంతా ఇంతా కాదు.
అర్ధం చేసుకోడానికి ఒక పద్ధతి ఉంది. ఒక క్రమం ఉంది. అదేమిటో తెలుసుకొందాం.
ఈ సృష్టిలో ప్రతిదీ అద్భుతమే. రహస్యమే. ఆకాశం, నక్షత్రాలు సూర్యుడు, చంద్రుడు, భూమి, నిప్పు, నీరు, చెట్లు, రకరకాల జీవులు వీటి గురించి తెలుసుకోడానికి మానవ జాతి వేల సంవత్సరాలుగా కృషిచేస్తూ ఉంది. ఎంతోమంది శాస్త్రవేత్తలు, పరిశోధకులు తమ జీవితాలను ధారబోసి ఎన్నో విషయాలు తెలుసుకొన్నారు. వారి కృషి ఫలితమే ఈనాడు మనం అనుభవిస్తున్న జీవన విలాసాలు.
వేల సంవత్సరాలుగా ఎంతో విజ్ఞానం పోగువడింది. ఈవిజ్ఞానం దాచి పెట్టేది కాదు. తరం నుండి తరానీకి అందించాలి. ఈ విజ్ఞానం మనుషుల మెదళ్లలో చేరితేనే అది మరింతగా అఖివృద్ది అవుతుంది. అందుకోసమే ఈ స్మూళ్లూ, టీచర్లూ పాఠ్యపుస్తకాలు.
పిల్లల వయస్సును బట్టి తరగతులను బట్టి వాళ్లు ఎలాంటి విషయాలు ఎంత నేర్చుకోగలరొ అంత విజ్ఞానాన్ని కూర్చి పాఠ్యపుస్తకాలు తయారు చేస్తారు. వాటినీ చదివి పిల్లలు అర్ధం చేసుకోవాలి. ఇందుకోసం ఉపాధ్యాయులు సహకరిస్తారు. పిల్లలు పాఠ్యపుస్తకాలు చదవకుండా, సందేహించకుందా, ప్రశ్నించకుండా,టీచర్ చెప్పిన జవాబులు కంఠస్తం చేయడాన్ని చదవడం అందామా? మొత్తం వ్వర్థం అయిపోయినట్లే కాదా!
భూమి గుండ్రంగా ఉందనీ, అది తనచుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతున్నదనీ పాఠంలో ఉంది. విద్యార్ధి చదువుతాడు. కానీ భూమి చదునుగా బల్లపరుపుగా ఉన్నట్లూ, స్థిరంగా కదలకుండా ఒకే చోట ఉన్నట్లు కళ్లకు కనబడుతుంది. సూర్యుడు తూర్పున ఉదయించి, అలా పైకి ఎగబాకి పడమట దిగిపోయి సూర్యుడే భూమిచుట్టూ తిరుగుతున్నట్లు గమనిస్తాడు. తాను చూస్తున్న దానికి విరుద్దంగా పాఠంలో ఉంది. ఇప్పుడేమి జరగాలి? సందేహించాలి. ఇది నిజమా అని ప్రశ్నించాలి. టీచర్‌తో స్నేహితుల్లో చర్చించాలి. తర్కించాలి. వాదోపవాదాలు జరగాలి. అనేక రుజువులు చూడాలి. అర్జం చేనుకోవాలి. ఓహా ఇదా నంగతి అని ఆశ్చర్యపోవాలి. ఆనందించాలి. లోపల ఏదో ఒక అనుభూతి పొందాలి. అంతకుముందున్న అభిప్రాయంలో మార్పు వస్తుంది. సత్యమేదో తెలుసుకొంటాం. జీవితంలో దాన్ని ఉపయోగించు కొంటాం. ఇదేమీ జరక్కుండా అర్ధం చేసుకోవడం జరిగే పనికాదు. మద్యలో మరో పితలాటకం వచ్చి కూర్చుంది. ఏ భాషలో అర్ధం చేసుకోవాలి? ఏ మీడియంలో చదవాలి? ఇది అకస్మాతుగా ఇప్పుడు పుట్టిన సందేహం. ఏ భాషలో మాట్లాడతారో, ఏ భాషలో ఆలోచిస్తారో ఏ భాషలో ప్రశ్నిస్తారో ఆ భాషలోనేగదా అర్థం చేసుకోవాలి. అది మాతృభాషే గదా! పరభాషను నేర్చుకోవాలన్నా మాతృభాష సహాయంతోనే కదా! ప్రపంచమంతా ఇదేగదా ఘోషిస్తున్నది.
మధ్యలో వచ్చిన ఈ పితలాటకాన్ని పక్కన బెట్టి అనలు విషయానికి వద్దాం. చదవడం అంటే అర్థం చేసుకోవడం అని తెలుసుకొన్నాం. మరి నేర్చుకోవడం అంటే ఏమిటి? పుస్తకంలో ఉన్న వాక్యాలను కంఠస్థం చేయడమా? కంఠస్థం చేయడాన్ని నేర్చుకోవడం అనకూడదు. బట్టీపట్టడం అనాలి.
నేర్చుకొనేవి విద్యలు, నైపుణ్యాలు. డ్రైవింగ్ నేర్చుకొంటారు. టైలరింగ్ నేర్చుకొంటారు. సంగీతం నేర్చుకొంటారు. నాట్యం నేర్చుకొంటారు. పరభాషలు నేర్చుకొంటారు. ఇందు కోసం కొంత శ్రమపడాలి. అభ్యాసం చేయాలి. ఒక సారి నేర్చుకొంటే జీవితాంతం మనవెంటే ఇవి ఉంటాయి. ప్రశ్నలకు జవాబు మరిచిపోయినట్లు మరిచిపోరు.
కుండలు చేయడం, బుట్టలు అల్లడం, వంట చేయడం, వ్వవసాయం, ఇలాంటివి ఎన్నో విద్యలున్నాయి. చదువుతో సంబంధం లేకుందా చాలా మందికి చాలా విద్యలు తెలుసు.
కాబట్టి అర్థం చేసుకోవడం వేరు. నేర్చుకోవడం వేరు. అర్ధం చేసుకోవడం అంటే విషయం ఇది అని తెలుసుకోవడం. ఈ తెలుసుకోవడం మానవుడి సహజ లక్షణం. ఇందు కోసం మనిషి తన ప్రాణమైనా ఇస్తాడు. తెలుసుకోవడం ఆసక్తికీ కుతూహలానికీ సంబంధించినది. అవనరం ఉండవచ్చు లేకపోవచ్చు. కానీ నేర్చుకోవాలంటే అవసరం ఉండి తీరాలి. అది భవిష్యత్తులో కలగబోయే ప్రయోజనం కోసం చేసేపని. ఇందు కోసం శ్రమపడాలి. మనస్సు, శరీరం రెండూ ఉపయోగించాలి.
తెలుసుకోవడం మానవుడి సహజ లక్షణం. నేర్చుకోవడం మానవుడు సాధించిన లక్షణం.
అర్ధం చేసుకోకుండా చదివేది చదువు కాదు. అదొక వ్యర్థ కార్యకలాపం. ఇలాంటి చదువులు ఉన్న దేశాలు, సమాజాలు ఎంతో నష్టపోతున్నాయి. సమాజాలు అస్తవ్యస్తంగా మారిపోతున్నాయి. మన దేశం ముఖ్యంగా మన రాష్ట్రం ఎంతో నష్టపోతున్నది. ప్రతీదాన్ని డబ్బులతో కొలిచే ఈ ప్రపంచంలో ఇప్పుడు జరిగిన నష్టాన్ని డబ్బుతో లెక్కిస్తే కొన్ని లక్షల కోట్లు ఉంటుంది.
ఆ నష్టాలు ఇవే:
1. అద్భుతమైన బాల్యాన్నీ కాలాన్నీ డబ్బునూ నష్టపోతున్నారు. అర్ధం చేసుకోకుండా చదివినందు వల్ల క్రమంగా అర్థం చేసుకొనే శక్తిని కోల్పోతారు. అలోచించడం మానుకుంటారు. అస్తవ్యస్తంగా అలోచిస్తారు. దురభ్యాసాలకు లోనవుతారు. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారు. సులభంగా మోసపోతారు. ఇతరుల మీద ఆధారపడి బ్రతకడం అలవాటు చేసుకుంటారు.
2. కష్టపడి డిగ్రీలు సంపాదించుకుని ఉద్యోగస్తులైన వారు భవిష్యత్తులో ఒక్క పుస్తకం కూడా చదవరు. తమ వృత్తి నైపుణ్యాలను మెరుగు పరచుకోరు. ఎందుకంటే విజ్ఞాన సంబంధమైన పుస్తకాలు చదివి అర్ధం చేసుకోవడానికి భయపడతారు. అందువల్ల ఎలాంటి మార్పును స్వీకరించలేరు. సమాజాన్ని ముందుకు కదలనీయరు.
౩. ఉన్నత చదువులు చదివిన ఇంజినీర్లు, డాక్టర్లు, లాయర్లు, అధికారులు, అలోచించలేని జనాలను తమ కింద ఉద్యోగులను చూసి తమ అధిక్యతను ప్రదర్శించడానికి ప్రయత్నిస్తారు. క్రింది వారిని పురుగుల్లా చూస్తారు. తమ తెలివి తేటలతో ప్రజల సమస్యలను పరిష్మరించవలసిన వీరు ప్రజలకే సమస్యగా మారతారు.
ఈ మనుష్యులు బాల్యంలో, కౌమారంలో, యవ్వన కాలాల్లో వత్తిడి లేకుండా, భయం లేకుండా, ఆనందంగా అర్దం చేసుకొంటూ చదివివుంటే ఈ ప్రపంచాన్నీ ఆనందంగా ఉంచేవారు. ప్రపంచం ఇంత దుర్మార్గంగా ఉండేది కాదు.
చదువు గొప్పదే, బడీ గొప్పదే-కానీ బోధనా పద్దతులు, పరీక్షలు, మార్కులు, పాస్, ఫెయిలు ఇవన్నీ అశాస్త్రీయం.
ఈ చదువులు పరాయి పాలకులు తమకు ఊడిగం చేసే బానిసలను తయారు చేయడానికి ఏర్పాటు చేసిన విద్యావిధానంలో భాగం. వాళ్లు పోయినా వాళ్ల విద్యావిధానం అలానే ఉంది. మన పాలకులకు కూడా స్వతంత్రంగా ఆలోచించలేని బానిసలేగదా కావలసింది. అందుకనే విద్యావ్యవస్థను మరింతగా దిగజారుస్తూ చట్టాలు తెస్తూ ఉంటారు. ఇప్పుడు మాతృభాషలోగూడా ఆలోచించ గూడదు. చదువు కోకూడదు అనే చట్టం తెచ్చారు. పరాయి పాలకులు కూడా చేయలేని సాహసం చేశారు. కారణం తెలుస్తూనే ఉంది కదా! మన చదువుల ద్వారా ఇంత కాలం తయారైంది అర్ధం చేసుకోలేని వాళ్లు. ఆలోచించ లేనివాళ్లు అలోచించగలిగినా నీజాయితిగా ధైర్యంగా సత్యాన్ని ఒప్పుకోలేనివాళ్లు.
ఇంతకంటే వేరే రుజువులు ఎందుకు?
“పిల్లలు అదనపు భాషను త్వరగా, సులభంగా, బాగా నేర్చుకోటానికి తల్లిభాష ఉపయోగపడుతుంది"