అమ్మనుడి/సంపుటి 5/మే 2019/మూడు అక్రియావాదాలు-బుద్దుని క్రియాశీలవాదం
బుద్దపూర్ణిమ మే 18
డి. చంద్రశేఖర్ 92900 91232
మూడు అక్రియావాదాలు-బుద్దుని క్రీియాశీలవాదం
మానవుడు పొందే అనుభవాలు స్టూలంగా మూడు రకాలని చెప్పవచ్చు:సుఖకరమైన. దుఃఖకరమైన. ఈ రెండూ కాని తటస్థ అనుభవాలు. మానవ జీవితచరిత్రను పరిశీలిస్తే, ప్రపంచమంతటా అన్ని కాలాల్లొ, ఎటువంటి మినహయింపు లేకుండా, మనుషులందరూ ఈ మూడురకాల అనుభవాలను ఎదుర్కోవటం కనిపిస్తుంది. అందుకే మానవ జీవితం గురించి శోధించిన తత్వవేత్తలందరూ, ఈ అనుభ వాలకు దారితీసే కారణాలను అన్వేషించటానికి ప్రయత్నించారు. ఈ విషయంలో ప్రాచీన భారత తత్వవేత్తలు గణనీయమైన కృషి చేశారనేది, ఆధునిక పండితులంతా ముక్తకంఠంతొ అంగీకరిస్తున్న ఒక వాస్తవం.
ప్రాచీన భారత తాత్విక చింతనలొని భిన్నమైన ధొరణులను లేక వాదాలను క్రోడీకరించి చెప్పటానికి ప్రయత్నించిన తొలిగ్రంథాలు త్రిపిటకాలు అని నిస్సందేహంగా చెప్పవచ్చు. ప్రత్యేకించి బుద్ధుని ఉపదేశాలను ఆయన స్వంతమాటల్లో నమోదుచేశాయని చెప్పబడే, పాలి నికాయాలు మరియు సంస్కృత ఆగమాల్లో, ఆ కాలంనాటి విభిన్న తాత్విక ధోరణులను వివరించే సందర్భాలు పుష్కలంగా ఉన్నాయి.
వాటిలో, 'మానవ జీవితపు అనుభవాలకు దోహదం చేసే కారణాలను వివిధ తత్వవేత్తలు ఎటువంటి దృష్టితో చూశారు” అనేది చాల మౌలికమైన విషయం. దీని గురించి బుద్ధవచనం ఏం చెబుతుందో చూద్దాం.
ఈవిషయమై అంగుత్తరనికాయలోని ఒక సుత్తం (3:61) చాల స్పష్టమైన విశ్లేషణ అందిస్తుంది. దీనిలో బుద్ధుడు, మానవుని సుఖదుఃఖాలకు ఆనాటి బ్రాహ్మణేతర తత్వవేత్తలైన శ్రమణులు, బ్రాహ్మణ పండితులు చెప్పిన కారణాలను కింది విధంగా పేర్కొన్నాడు:
“భిక్షువులారా, (1) కొందరు శ్రమణులు బ్రాహ్మణులు, 'మనిషికి కలిగే సుఖ, దుఃఖ, తటస్థ అనుభవాలన్నీ గతకర్శల కారణంగానే (పూర్వకతహేతు) పొందుతాడు” అనే దృష్టి కలిగివున్నారు. (2) మరి కొందరు శ్రమణులు బ్రాహ్మణులు, “మనిషికి కలిగే సుఖ, దుఃఖ తటస్థ అనుభవాలన్నీ దైవసృష్టి కారణంగానే (ఈశ్వరనిర్మాణహేతు) పొందుతాడు" అనే దృష్టి కలిగివున్నారు. (3) ఇంకా కొందరు శ్రమ ణులు బ్రాహ్మణులు, 'మనిషికి కలిగే సుఖ, దుఃఖ, తటస్థ అనుభవాలన్నీ ఎటువంటి కారణం లేకుండానే (అహేతుప్రత్యయా) పొందుతాడు” అనే దృష్టి కలిగివున్నారు.”
'పైన ఉటంకించిన మూడురకాల వాదాలను వినిపించే అనేక మంది శ్రమణులను, బ్రాహ్మణులను తాను స్వయంగా కలిసినట్లు బుద్ధుడు అనేక సుత్తాల్లో ప్రకటించాడు. అంతేకాదు, వారి వాదాలు ఏవిధంగా దోషపూరితమైనవో చెప్పటానికి, బుద్ధుడు తగిన కారణాలను కింది విధంగా వివరించాడు.
(1) 'మనిషికి కలిగే సుఖ, దుఃఖ తటస్థ అనుభవాలన్నీ గతకర్మల కారణంగానే పొందుతాడు” అనేవాదం ప్రకారం, ఒకవ్యక్తి గతకర్మల కారణంగానే హత్యలు, దొంగతనాలు, వ్యభిచారం చేస్తాడు గతకర్మల కారణంగానే అబద్దాలు, తంపులమారి మాటలు, దురుసు మాటలు, పనికిరాని మాటలు మాట్లాడుతాడు. అతడు గతకర్మల కారణంగానే లోభి, దుర్మార్గుడు, తప్పుడుదృష్టి కలవాడు అవుతాడు. గతకర్మలు నిర్ణయాత్మకమైనవని నమ్మేవారు, *ఇది చెయ్యాలి? 'అది చెయ్యకూడదు” అనే సంకల్పం లేనివారవుతారు. ఏది చేయదగిందో, ఏది చేయకూడనిదో తెలియక, అయోమయంలో పడి దిక్కు తోచని వారు అవుతారు.
(2) 'మనిషికి కలిగే సుఖ, దుఃఖ, తటస్థ అనుభవాలన్నీ దైవ సృష్టి కారణంగానే పొందుతాడు" అనేవాదం ప్రకారం, ఒకవ్యక్తి దైవాజ్ఞ కారణంగానే హత్యలు, దొంగతనాలు, వ్యభిచారం చేస్తాడు దైవసృష్టి కారణంగానే అబద్దాలు, తంపులమారి మాటలు, దురుసు మాటలు, పనికిరాని మాటలు మాట్లాడుతాడు. అతడు దైవాజ్ఞ కారణం గానే లోభి, దుర్మార్గుడు, తప్పుడుదృష్టి కలవాడు అవుతాడు. దైవసృష్టి నిర్ణయాత్మకమైనదని నమ్మేవారు, 'ఇది చెయ్యాలి? “అది చెయ్యకూడదు” అనే సంకల్పం లేనివారవుతారు. ఏదిచేయదగిందో, ఏదిచేయ కూడనిదో తెలియక, అయోమయంలోపడి దిక్కుతోచనివారు అవుతారు.
(3) మనిషికి కలిగే సుఖ, దుఃఖ తటస్థ అనుభవాలన్నీ ఎటువంటి కారణం లేకుండానే పొందుతాడు' అనేవాదం ప్రకారం, ఒకవ్యక్తి ఏ కారణం లేకుండానే హత్యలు, దొంగతనాలు, వ్యభిచారం చేస్తాడు ఏ కారణం లేకుందానే అబద్దాలు, తంపులమారి మాటలు, దురుసు మాటలు, పనికిరాని మాటలు మాట్లాడతాడు. అతడు ఏ కారణం లేకుండానే లోభి, దుర్మార్గుడు, తప్పుడుదృష్టి కలవాడు అవుతాడు. అహేతుకత లేక కారణరాహిత్యం నిర్ణయాత్మకమైనదని నమ్మేవారు, “ఇది చెయ్యాలి? “అది చెయ్యకూడదు” అనే సంకల్పం లేని వారవుతారు. ఏది చేయదగిందో, ఏది చేయకూడనిదో తెలియక, అయో మయంలో పడి దిక్కుతోచనివారు అవుతారు.
బుద్దుడు ఖండించిన పై మూడువాదాల ప్రకారం, మనిషి చేసే నేరాలు, ఘూరాలు, కుట్రలు, కుతంత్రాలు, యితర అనైతికమైన పనులకు నేరుగా ఎవరూ బాధ్యులు కాజాలరు.
ఎందుకంటే, సదరు వాదాల ప్రకారం, తాను చేసే పనుల్లో ప్రవర్తనలో, మనిషి సంకల్పానికి లేక ప్రయత్నానికి ఎటువంటి స్థానం లేదు. అందుకే బుద్ధుడు ఈ మూడింటిని “లోతుగా పరిశీలించి, పరిశోధించి, విశ్లేషిస్తే, అంతిమ సారాంశంలో అవి అక్రియావాదాలు” గా మిగిలిపోతాయని అన్నాడు.
పైన పేర్కొన్న మూడు అక్రియావాదాలను సూటిగా, స్పష్టంగా తిరస్కరించిన బుద్ధుడు, వాటికి ప్రత్యాన్నూయంగా ప్రతిపాదించిన వాదం ఏమిటి? అనేది చాల సహజమైన, విలువైన ప్రశ్న అక్రియా వాదాలకు కార్యకారణ వాదమే సరైన ప్రత్యామ్నాయమని బుద్దుని అభిప్రాయం. పాలిభాషలో ఇదాప్పచ్చయతా (నిర్దిష్టకారణ) నియమం అని పిలవబడిన, బుద్ధుని కార్యకారణ వాదాన్ని క్లుప్తంగా యిలా చెప్పవచ్చు: “ఒక వస్తువు లేక ధాతువు లేక స్థితి ఉత్పన్నం కావటానికి తగిన కారణం (లేక కారణాలు) ఉన్నప్పుడే ఆ వస్తువు లేక ధాతువు లేక స్థితి ఉనికిలోకి వస్తుంది ఆ కారణం (లేక కారణాలు) నిరోధమైతే, ఆ వస్తువు లేక ధాతువు లేక స్థితి తన ఉనికిని కోల్పోతుంది.” అంటే, ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది, తనను ఉత్పన్నం చేసిన కారణం నిరోధం కాగానే ప్రతిదీ సమసిపోతుంది.
సరళమైన ఈ సూత్రం ఆధారంగానే బుద్దుడు, మానవ జీవితపు దురవస్థను రూపుమాపగల సమగ్రమైన మరియు ఆచరణాత్మకమైన మార్గాన్ని సూచించాడు.
బుద్ధుని కార్యకారణ వాదం 'పండితుల ' వ్యవహారమే గాని అది సామాన్యులకు అర్ధంకావటం దుర్లభమని కొందరు భావిస్తున్నారు. ఇది ఒక అపోహ మాత్రమేనని చెప్పకతప్పదు. నిజానికి బుద్దుడు చెప్పిన కార్యకారణ నియమాన్ని, సాధారణ రోజువారి అనుభవం ద్వారా మరియు అత్యంత సూక్ష్మమైన మానసిక ప్రక్రియలను విశ్లేషించటం ద్వారా కూడ అర్ధంచేసుకోవచ్చు. ఈ దిశగా రెండు ఉదాహరణలను చూద్దాం.
ఒకటి: ఒకానొక సందర్భంలో, లిచ్చవి జాతికి చెందిన భద్దియ అనే గృహస్తునితో బుద్దుడు జరిపిన సంభాషణ అం.ని. 4:193% కింది విధంగా ఉంది:
“భద్దియ, దురాశకులోనై దాని వశంలో చిక్కిన దురాశాపరుడు జీవహింస, దొంగతనం చేస్తాడు వ్యభిచరిస్తాడు, అబద్ధాలు చెబుతాడు ఇతరులను యిటువంటి పనులకు ప్రేరేపిస్తాడు. ఇది అతనికి దీర్హకాలం కీడు, దుక్థం కలిగించదా?”...“అవును, భంతే.” “భద్దియ, ద్వేషానికిలోనై దాని వశంలో చిక్కిన ద్వేషపరుడు...
మోహానికిలోనై దాని వశంలో చిక్కిన అజ్ఞాని... ఉద్రేకానికి లోనై దాని వశంలో చిక్కిన ఉద్రేకి. జీవహింస, దొంగతనం చేస్తాడు వ్యభిచ రిస్తాడు, అబద్ధాలు చెబుతాడు ఇతరులను యిటువంటి పనులకు ప్రేరేపిస్తాడు. ఇది అతనికి దీర్మకాలం కీడు, దుఃఖం కలిగించదా?” ...“అవును, భంతే.”
పై సంభాషణలో కనిపించే కార్యకారణ నియమం ఏమిటో చూద్దాం. దురాశ, ద్వేషం తదితరమైన కారణాల వల్ల, ఒక వ్యక్తి జీవహింస, దొంగతనాలు, లైంగికదురాచారం మొదలైన పనులు చేస్తాడు. అంతేకాదు, ఆ వ్యక్తి ఇతరులను కూడ అదేరకమైన పనులకు పురికొల్పుతాడు. అటువంటి ప్రవర్తన కారణంగా, అతడు (లేక ఆమె) దీర్జకాలంపాటు దురవస్థకు, దుఖానికి లోనుకాక తప్పదు.
కేవలం స్తూల భౌతికవాద దృష్టితో చూసేవారికి, బుద్ధుడు చెప్పినపై ఉపదేశం సబబుగా తోచకపోవచ్చు. ఎందుకంటే, జీవ హింస, దొంగతనాలు, లైంగికదురాచారం వంటి వనులకు పాల్పడి, అందుకు తగిన శిక్షలు లేక ప్రతిచర్యలు పొందకుండా తప్పించుకునే వారు అనేకులు మనకు కనిపిస్తారు.
కాని యిదే విషయాన్ని, మనోవిజ్ఞాన దృక్పథంతో పరిశీలిస్తే, దీనిలో అసలు విషయం మనకు బోధపడుతుంది. జీవహింస, దొంగ తనాలు, లైంగికదురాచారం వంటి అకుశలమైన పనులు చేసిన వ్యక్తి వాటిద్వారా తనలో కలిగే మానసిక క్షోభ నుండి తప్పించుకోలేదు. పైకి ఎంత డాంబికంగా విలాసవంతంగా నిర్భయంగా జీవిస్తున్నట్లు కనిపించినా, అతడు (లేక ఆమె) నిశ్చింతతో మానసిక ప్రశాంతతో జీవించటం కల్ల. అంతేకాదు, అటువంటి వ్యక్తి యితరులక్కూడా వ్యధాభరితమైన జీవితాన్నే అందిస్తాడు.
రెండు: మనోవిజ్ఞాన దృక్పధం నుండి, బుద్ధుడు కార్యకారణ నియమాన్ని మరింత లోతుగా వివరించిన మరో ఉదాహరణ చూద్దాం. దుక్ధానికి కారణం ఏమిటి? అనే ప్రశ్నకు బుద్ధుడు సంక్షిప్తంగా చెప్పిన జవాబు యిది:
“భిక్షువులారాా దుక్ఖానికి కారణం ఏమిటి? కన్ను, రూపం ఆధారంగా చక్షువిజ్ఞానం జనిస్తుంది. ఈ మూడింటి కలయికే స్పర్శ. స్పర్శ కారణంగా వేదన, వేదన కారణంగా తృష్ణ జనిస్తుంది. ఇదే దుఖానికి మూలం. (ఇదే రీతిలో తరువాత, చెవి - శబ్దాలు, ముక్కు - వాసనలు, నాలుక - రుచులు, మనసు - భావాల విషయంలో కూడ దుక్థం కారణాన్ని వివరించటం జరిగింది.”
ఈ విషయాన్ని మరింత స్పష్టంగా గ్రహించాలంటే, ఎవరికి వారు తమ మనసు అంతరాళంలోకి ప్రవేశించి, నిశితంగా పరిశీలించాలి. ఈపని ఎంత కష్టమైందో, దానిఫలితం అంతే విలువైంది.
పైన చెప్పిన ఉదాహరణల సారాంశం ఏమిటంటే, మనిషికి కలిగే సుఖ, దుఃఖ, తటస్థ అనుభవాలన్నిటికీ తగిన కారణం ఉంటుంది. ఆ కారణాలకు మనిషి మనసే చోదకశక్తి.
అంటే, మనిషి సంకల్ప పూర్వకంగా చేసే చర్యలు, మనిషి జీవన గమనాన్ని నిర్దేశిస్తాయి. కనుక, ఎటువంటి చర్యలు కీడు చేస్తాయో, అటువంటి చర్యలను విరమించాలి. ఏవి మేలు చేస్తాయో, అటువంటి వాటిని పెంపొందించాలి. అంటే, తాను పొందే సుఖ దుక్ఖాల్లో మనిషి క్రియాశీలమైన పాత్ర పోషించాలని బుద్ధుడు చెప్పాడు. అందుకే ఆయన, దేవునిపైన లేక విధిరాతపైన గాక్క “మీరు మీపైనే ఆధారపడండి, మరెవరిపైనా ఆధారవదవద్దు.
ధర్మాన్ని ఆశ్రయించండి, మరి దేనినీ ఆశ్రయించవద్దు.” అని చెప్పాడు. అదే బుద్దుడు మనకందించిన క్రియాశీలవాదం.