అమ్మనుడి/సంపుటి 5/మే 2019/తెలుగువాళ్ళ తమిళ నవలలు రెండు
"సాపొత్యరంగం
మధురాంతకం నరేంద్ర 98662 43659
తెలుగువాళ్ళ తమిళ నవలలు రెండు
తాను పుట్టిన వూరుపైన మక్కువ వుండడం మనిషికెంత సహజమో, అనేక కారణాల వల్ల అతను మరో ప్రాంతానికి వలస పోవడం గూడా అంతే సహజం. యే కుటుంబంగానీ అయిదు తరాల పాటూ వొకే వూరిలో వుండడం అసాధ్యమని మానవ పరిణామ శాస్త్రజ్ఞులు (ఆంధ్రపాలజిస్ట్) అంటారట! రామాయఇంలో రాముడు అడవికెళ్ళడం, మహాభారతంలో పాండవులు హస్థినాపురం నుంచీ వారణావతం పోవడం గూడా వలస వెళ్ళడమేగదా! జీవిక కోనం అనుకూలమైన ప్రదేశాన్ని వెతుక్కుంటూ వెళ్ళడం మానవ స్వభావం. 'వుద్యోగికి దూరభూమిలేదు” అంటుందో సామెత. జీవితానికి వుపనదిలా సాగే సాహిత్యంలో మానవుల వలసలను వస్తువులుగా తీసుకున్న రచనలు చాలానే వున్నాయి. జీవిక కోసం కాలిఫోర్నియాకు వలస వెళ్ళిన కుటుంబం గురించి జాన్ స్టెయిన్ బెక్ అనే అమెరికన్ రచయిత
రాసిన “గ్రేప్స్ ఆఫ్ ది రాత్” పుస్తకానికి నోబులు బహుమతి వచ్చింది. అమెరికా వంటి దేశాల్లో వలసలు పోవడమన్నది చాలా సాధారణంగా జరిగే పని. అలా వలస పోవడం వల్ల వాళ్ళకు జరిగే మార్పు కేవలం భౌగోళికమైనదిగానే వుంటోంది. అదే భారతదేశంలో జరిగినప్పుడు వలసలు వెళ్ళిన వాళ్ళు కోల్పోయేది భాష, సంస్కృతి గూడా! యెనిమిది తొమ్మిది శతాబ్దాల క్రితం, ముస్లిముల బారి నుంచీ తప్పించుకోవడం కోసం తెలుగు ప్రాంతం నుంచీ దక్షిణాదికి చేరుకున్న వాళ్ళు చాలామంది తమిళనాడులో, కన్యాకుమారికి వందమైళ్ళ దూరంలో, తూత్తుకుడి జిల్లాలో కుదురుకున్నారు. వాళ్ళల్లో నాయుళ్ళు, రెడ్డు, మాదిగలూ వున్నారు. నాయుళ్ళు కొందరు అక్కడే వొక గ్రామం కట్టుకున్నారు. ఆ వూరిలో పుట్టిన రచయిత వొకరు తెలుగు ప్రాంతాల నుంచీ వలస వెళ్ళిన ఆ గాధను రెండు నవలలుగా సాహిత్యీకరించాడు. ఆ నవలకు 1991 లోనే కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చింది. యిపుడా రచయితకు 96 సంవత్సరాల వయస్సు. ఆ నవల పేరు “గోప్రల్లె జనాలు” ఆ రచయిత పేరు కి.రాజనారాయణన్.
1928 సెప్టెంబరు 16వ తేదీన తూత్తుకుడిజిల్లా, కోయిలు పట్టి తాలూకాలోని ఇడైచేవలో అనే పల్లెలో పుట్టిన రాయంగల శ్రీ కృష్ణ రాజనారాయణ పెరుమాళ్ రామానుజం నాయకర్, చదువుకున్నది యెనిమిదవ తరగతి వరకు మాత్రమే. కి.రాజనారాయణన్ అనే పేరుతో ఆయన ఏడు కథా సంకలనాలు, నాలుగు నవలలు, మూడు వ్యాస సంకలనాలు రాశారు. మాండలిక భాషలో రచనలు చేసే కీ.రా.(కి.రాజనారాయణన్ 'కీరా 'గా తమిళ సాహిత్యంలో ప్రసిద్దులు. తమ మాండలిక నిఘంటువును గూడా తయారు చేశారు. పాండి చ్చేరి విశ్వవిద్యాలయంవాళ్ళు “ఫోక్ టేల్స్ డాక్యుమెంటేషన్ అండ్ సర్వే సెంటర్” కు కీరా గారిని సంచాలకుడుగా నియమించి గౌరవించి నారు. ఆయన అనేక తమిళ జానపద కథల్నీ, సాహిత్యాన్నీ సేకరించారు. యిప్పుడాయన పాండుచ్చేరిలోనే వుంటున్నారు.
తన వాళ్ళు తెలుగునాడు నుంచీ తూత్తుకుడి ప్రాంతం వరకూ వలస వెళ్ళిన గాధను కీరాగారు 'గోపల్లె, 'గోపల్లె జనాలు" అనే రెండు నవలలుగా రాశారు. 'గోపల్లె తమిళంలో వచ్చిన తొలి మాండలిక నవల. దీన్ని హోసూరువాసి నంద్యాల నారాయణరెడ్డిగారు 2012లో తెలుగులోకి అనువాదం చేశారు. “గోపల్లె జనాలు” నవలను చిత్తూరు జిల్లా వాసి (మధురై విశ్వవిద్యాలయంలో తెలుగు ఆచార్యులుగా పనిచేసినవారు) ఆచార్య శ్రీపాద జయప్రకాష్ 2016లో తెలుగులో అనువాదం చేశారు. యీ రెండు వుస్తకాలనూ తెలుగు సాహిత్యాభి మాని చెన్నూరు ఆంజనేయరెడ్డిగారు 'ఆర్ట్స్ అండ్ లెటర్స్” అనే సంస్థ తరపున ప్రచురించారు. వీటికి జానపద సాహిత్యంపైన పరిశోధన చేసిన సగిలి సుధారాణిగారు ఆర్థికంగా, హార్దికంగా సహాయం చేశారు.
కీరాగారిది మౌఖిక ధోరణి. పల్లెటూళ్లల్లో కథలు చెప్పే అమ్మమ్మల, నాన్నమ్మల కథన పద్దతి. వొక జానపదుడు భుక్తాయాసం తీర్చుకుంటూ, తన ముందు కూర్చున్న వాళ్ళకు నెమ్మదిగా, ఆశక్తికరంగా కథ చెప్పినట్టుగా ఆయన నవలలు కొనసాగుతాయి. యెక్కడో మొదలై, తర్వాత రకరకాల పిట్ట కథల్ని చెబుతూ, మరెక్కడో మళ్లీ మొదటికొచ్చి నేర్పుగా కథలనంతా వొకటిగా ముడివేసే జానపద ధోరణిలో కీరాగారు నవలను రాస్తారు (చెస్తారు!) రెండు నవలల్లో భారత స్వాతంత్రోద్యమం గురించి రానిన 75 పేజీలను మినహాయిస్తే మిగిలిన యీ రెండు నవలలు దాదాపు 250 పేజీలలో “కాలమూ, స్థలమూ” యిదమిద్దంగా చెప్పడం సాధ్యం గాదు. దాదాపు యేడు శతాబ్దాల్లో జరిగిన కథ ముందుకూ, వెనక్కూ అప్పుడప్పుడూ పక్కకు గూడా జరుగుతూ పాఠకుద్ని మనదిగాని వొక పాత కాలానికి, మనకు తెలియని వాక పాత లోకానికి తీసుకెళ్తుంది. రాజులూ, రాజ్యాలూ లేని, ప్రజలను రక్షించే ప్రభుత్వమంటూ యేదీలేని అరాజక కాలంలో 'గోపల్లె'" నవల ప్రారంభమవుతుంది. పాళెగాళ్ళ పాలన యింకా కొనసాగుతూనే వుంది. కుంపిణీ వాళ్ళ రాజ్యం యింకా మొదలుగాని కాలం అది. యే గ్రామానికా గ్రామం చిన్న రాజ్యంగా మారి, తమను తాము దొంగల బారి నుంచీ కాపాడుకోవల్సిన రోజుల్లో గోపల్లె గ్రామ సమీపంలో వాంటరిగా కనబడిన అభాగ్యురాల్ని చెరువులో తొక్కిపట్టి, ఆమె చెవులకున్న కాసిన్ని బంగారు నగలను దోచుకుంటాడో దుర్మార్గుడైన దొంగ. ఆమె ముఖాన్ని కాలితో నీటి అడుగుకు తొక్కుతున్నప్పుడు, వాడి కుడి కాలి బొటన వేలిని నోటితో గట్టిగా కొరికి పట్టుకుంటుందా ఆడ మనిషి, అలా తప్పించుకోలేక ఆవూరి రైతు చేతికి దొరికిపోతాడా దొంగ. ఆడమనిషి శవంతో బాటూ, ఆవిడ భర్త, హంతకుడూ ఆ వూర్లో జరిగే పంచాయితీకి హాజరు కావడంతో “గోపల్లె” నవల మొదలవుతుంది.
పంచాయితీని నడిపే కోట కుటుంబాన్నంతా పరిచయం చేశాక, ఆ కుటుంబానికున్న మూల స్థంభం. 'జేజి ' అనుభవాల పాతరనంతా కథకుడు తవ్వడం మొదలు పెడతాడు. 'చెన్నాదేవి అనే తన వేలు విడిచిన తోడబుట్టును రాణిగా చేసుకోవాలన్న తురక దొరనుంచీ తప్పించడం కోసం వొక గుంపు దక్షిణాదికీ పారిపోసాగింది. తురకరాజు సైన్యం వెంబడించ సాగింది. దారిలో యిలాగే తురక దొరల బారిన పడిన స్త్రీల గాధలు వినబడతాయి. (చిత్తూరు జిల్లా గుర్రం కొండ దగ్గర రెడ్దెమ్మ కొండ దగ్గర యిటువంటి కథే ప్రచారంలో వుంది. నవాబు బారి నుంచీ తప్పించుకోవడం కోసం రెడ్దెమ్మ అనే పల్లె పడతి రెండుగా చీలినరాతి లోపలికి దూరి మాయమైపోతుంది. ఆవిడ దేవతై పోయిందని అక్కడ గుడి కట్టారు. పిల్లలు పుట్టని వాళ్ళు అక్కడికెళ్ళి మొక్కు కుంటారు. చిత్తూరుజిల్లాలో రెడ్దెన్ము, రెడ్డెప్ప, రెడ్డిరాణి, యిలా మొక్కుతో పుట్టిన వాళ్ళు పేర్లు పెడతారు. యీ కథ ఆధారంగా ప్రసిద్ధ రచయిత్రి ఆర్. వసుంధరాదేవిగారు “శెడ్దెమ్మ గుండు” అనే నవలిక రాశారు)
అలా మైళ్ళకొద్దీ పారిపోయి వచ్చిన వాళ్ళు శ్రీరంగం దాటి వొకచోట ఆగి, అడవిని తీర్చి, వూరుగట్టుకున్నారు. ప్రకృతిలో జీవిస్తూ, దొరికిన చెట్లనుంచీ, దగ్గర వున్న పశు పక్షుల నుంచీ బతకదానికి కావల్సిన వస్తువులనూ, దినుసులనూ సమకూర్చుకోసాగారు. “యీ నిడుపు వేటలో వాళ్ళందరూ ఎలమీ, తనివీ (తృప్తి) పొందినారని చెప్పలేము. కొందరు తాము పుట్టిన తావును తలచి వగచేవారు. వరుసగా చాలా నాళ్ళు నడుస్తూ రావడం వలన ఇది తెలియలేదు. ఇక ఇక్కడే మనకు అని ఎరుక పడిన ఆ తలపు దగ్గర (భూతము) అయి పట్టి పీడించింది కొందరిని” అంటాడు కథకుడు. అతరి నుంచీ పారిపోయివచ్చి, ఆ గ్రామాన్ని చేరుకున్న 'గోవు” పేరుతో ఆ వూరిని “గోపల్లె" అని పిలవ సాగారు. మొదట్లో వీళ్ళలాగే తెలుగునాడు నుంచి వచ్చి అక్కడ స్థిరపడిన వాళ్లను కలిసి, వియ్యాలను యేర్చరచు కున్నారు.
యీ వలసల అనుభవాలనంతా చెప్పాక మళ్లీ కంసాలి భార్యను చంపిన హంతకుడికి సబళము యెక్కించే శిక్షను విధించే దగ్గరికి చేరుతుంది కథ. తమ పంటనంతా మిడతలు నాశనం చేయడంతో, భారతదేశానికి తెల్లవాళ్ళు రావడంతో మొదటి నవల “గోపల్లె” ముగుస్తుంది. కథ చెబుతూనే కీరా ఆనాటి సామాజిక పరిస్థితులనూ, ఆచార వ్యవహారాలను పరిచయం చేస్తారు. కరెంటు, రహదారులూ, యంత్రాలూ లేని వొక ఆదిమ కాలంలో మనుషులు ప్రకృతిలో మమేకమై జీవిస్తూ, పశువులతో జంతువులతో సహజీవనం చేస్తూ,ఆనాటి పితృస్వామిక వ్యవస్థ తాలూకూ విలువల కోసం పరితపిస్తూ జీవించిన వైనమంతా కథలో భాగంగా పాఠకుడ్ని చేరుకుంటుంది. పెళ్లయిన తర్వాతే వక్కాకు వేసుకునే సంప్రదాయమూ, కోడి యీకలతో చెవిని శుభ్రపరుచుకునే పద్దతీ, పెళ్ళాం కడువుతో వున్నప్పుడు మొగుడు గడ్డం పెంచే ఆ భారమూ, తెలుగు నాడుకు దూరమైనా “రామ నామము కలకండా!” అని భజనలు చేసుకునే మనుషులూ, యిలా తమిళ - తెలుగు కలయిక వున్న ప్రాంతాల్లో (ఉదాహరణకు చిత్తూరు జిల్లాలో) యిప్పటికీ వున్న సంప్రదాయాలనంతా తూత్తుకుడి జిల్లా తెలుగు వాళ్ళల్లోనూ గమనించవచ్చు.
“గోపల్లె జనాలు” నవల రెండు భాగాలుగా విభజించబడింది. మొదటి భాగం దాదాపుగా “గోపల్లె" నవలకు పొడిగింపుగానే కనబడు తుంది. దేశానికి తెల్లవాడు చాలా మార్పుల్ని తీసుకొచ్చాడు. మట్టి నూనెతో వెలిగే హరికేన్‌లాంతర్లు వచ్చాయి. పిల్లల చదువుల కోసం వూరి పెద్ద వాక అయ్యోరును తీసుకొచ్చి బడిని పెట్టాడు. ఆ అయ్యవారికి పల్లెలోని జనాలు తనతో మాటాడిన అరవమూ, తమతో తాము మాట్లాడుకునే తెలుగూ - రెండూ యిబ్బందినీ, విస్మయాన్నీ కలిగించాయి. గోపల్లెలో చివరగా వో సతీ సహగమనం గూడా జరుగుతుంది. చనిపోయిన భర్తపైన అంతులేని అనురాగంతో, అతడు చనిపోయాక తన అస్తిత్వపు అవసరమే లేదనుకున్న వో భార్యను సతీ సహగమనం చేయించిన పద్దతులు బీభత్సంగానూ, విస్మయం గానూ కనిపిస్తాయి.
యిప్పటికీ రాయలసీమ ప్రాంతంలో వాడుకగా వుండే “దేవ రెద్దు” సంప్రదాయం గోపల్లెలోనూ వాడుకలో వుండేది. మనుషుల్లాగే పశువులు గూడా కొత్త ప్రదేశానికి అంత త్వరగా యిష్టపడవు. అవిగూడా మనుషుల్లాగే వాసనలకూ కట్టుబడి వుంటాయి.
వ్రతం వుండేవాడు మరుపూటే వొక గంగాళం తిండిని తింటే కన్నతల్లి గూడా “నువ్వు వ్రతం వుండే అందం చాల్లేరా!” అనక తప్పదు. యింటినీ, వూరినీ కాపాడే కుక్కలను దారి మల్లించడం కోసం దొంగలు చిత్రమైన వశీకరణ మార్గాలు వెతుక్కుంటారు. అగి పెట్టె అన్న వస్తువు రాగానే ఆనాటి జనాలు భూమ్యాకాశాలు తలకిందులైనట్టుగా వాపోతారు. పెద్ద ఇళ్ళలో నిప్పును ఆరిపోకుండా కాపాడు కోవడం, లేనివాళ్ళు వెళ్ళి తెచ్చుకోవడమే గొప్పని వాళ్ళ ప్రగాఢ విశ్వాసం.
“గోపల్లె జనాలు” రెండవ భాగం ఆధునిక కాలానికి తీసుకొస్తుంది. యేదయినా పెళ్ళికి ముహూర్తాలు పెట్టుకుని తాంబూలాలు మార్చుకునే సమయంలో అమ్మాయి మేనమామ రోకలిని తీసుకెళ్ళి, ప్రధాన వాకిలి ముందు నిలబడి “తురక వాడు వస్తున్నాడు" అని మూడుసార్లు చెవ్చడం వొక ఆచారంగా మారిపోయింది. పిల్లలు పిలక జుట్టులు కత్తిరించుకుని క్రాపులు జేసుకున్నప్పుడు ముసలివాళ్ళు బాధతో కన్నీళ్లు పెట్టుకోసాగారు. పాత పద్దతిలో రాగం తీయకుండా వచనం లాగా పాఠాలు చదివే విద్యార్థులను జూసి పాతకాలం వాళ్ళు “వీళ్ళ చదువూ, చట్టు బండలూ!” అని విసుక్కో సాగారు. నోటి లెక్కలకు బదులు నోటు పుస్తకాలనంతా లెక్కలతో నింపేసి విల్లల్ని చూసినప్పుడు “అమ్మ విద్యకు సాటి వస్తుందా?” అని నిట్టూర్చ సాగారు. యింగ్లీషు కలెక్టర్లూ దేశీయ తాసిల్లార్హూ గ్రామీణ కరణాలూ, వూరి మునసబులూ దర్చారు చేయసాగారు. చాక్కాలూ, గడియారాలూ, అగ్గిపెట్టెలూ, రైల్లూ, పొంటెన్ పేనాలూ, దిక్సూచులూ, బేటరీ లైట్లూ, తుపాకులూ, కల్లూ సారా అంగళ్లూ-మొదలైన ఆధునిక సాధనాలు వచ్చినప్పుడంతా, గోపల్లెజనాలు ప్రపంచంలోకి వుపద్రవాలు ముంచు కొస్తున్నాయనీ, కలియుగం అంతమైపోతోందనీ వాపో సాగారు.
మొదటి ప్రపంచయుద్ధంకాలంలో తెల్లవాళ్ళు గ్రామీణుల్ని సైన్యంలోకి చేర్చుకుని, వాళ్లను యుద్ధంలో మొదటి వరసలో నిల్బోబెట్టి తాము వెనకుండి మోసం చేస్తున్నారని గ్రామీణులు బయపడసాగారు. చాపకింద నీళ్లలా యీ లోగా స్వాతంత్య్ర పోరాటం ప్రారంభమై పోయింది. గాంధీ బొమ్మను వచ్చ పొడిపించుకునే వాళ్ళూ, జాతీయ పతాకాన్ని వూరేగించేవాళ్ళూ పుట్టుకొచ్చేశారు. రూపాయనోట్లను చూసి వాళ్ళు నోళ్లు తెరిచేశారు. క్రమంగా మానవుల్లోని నైతిక విలువలు గూడా మారిపోసాగాయి.
గోపల్లెలో వోనాటి వుదయాన రావి చెట్టుకు మూడు రంగుల జెండా కట్టబడి వుండడం చూసిన మునసబు తన వుద్యోగం పోతుందన్న భయంతో గొల్లుమంటాడు. ప్రభుత్వానికి భయపడే వాళ్ళు “వందేమాతరం” అనే నినాదానికే భయపడి పో సాగారు. తపాలాఫీసు రావడమొక గొప్ప విప్లవం. దిన పత్రిక అన్నది గొప్ప సంరంభం. పాత బడుల స్థానంలోకి బోర్డు బడులు వచ్చేశాయి. బడుల్లో అన్ని కులాల వాళ్ళూ పక్క పక్కనే కూచోడం చాలా మందికి గిట్టలేదు.
యీ విషయాలనంతా వీరా తనదైన విశిష్టమైన మౌఖిక ధోరణిలో పాత్రల మూలంగా కథలాగే చెవ్పుకుంటూ పోతారు. 1911 వ సంవత్సరం జూన్ 17వ తేదీ శనివారం నాడు కొడైకెనాల్ కెళ్ళే రైలెక్కిన జిల్లా కలెక్టరు ఆష్ దొరను మణియాచ్చి జంక్షనులో 'సెంగోట్టె రఘుపతి అయ్యర్ కొడుకు వాంచినాదన్ అయ్యర్ కాల్చి చంపి, తానూ ఆత్మహత్య చేసుకున్నాడు " అని 30వ అధ్యాయంలో తొలిసారిగా ఖచ్చితమైన తారీఖున్తూ, వాస్తవమైన వార్తనూ పేర్కొంటాడు రచయిత. తరువాత స్వాతంత్రోద్యమంలో జరిగిన అనేక చర్యలకూ, పాల్గొన్న అనేక మంది నాయకుల విధానాలకూ గోపల్లెలోని జనాలంతా యెలా స్పందించారో చెబుతూ పోతాడు. కొన్ని అధ్యాయాలు ఆనాటి స్వాతంత్య్రోద్యమ చరిత్రగా మాత్రమే తయారయ్యాయి. తెల్లవాళ్లు దేశాన్ని వదలిపెట్టి వెళ్ళడానికి సిద్ధమవడంతో, దేశానికి స్వాతంత్య్రం రావడంతో నవల ముగుస్తుంది. స్వాతంత్రోదయవేళ దేశమంతా సంబరాలు చేసుకుంటున్న సమయంలో గాంధీ మౌనంగా రాట్నం వడుక్కుంటూ, తనను చూడవచ్చిన పత్రికా విలేఖరులతో “యేమీలేదు” అని మాత్రమే అంటాడు.
“అన్ని నవలలూ ముగింపులో బలహీనమైపోతాయి”. అంటాడు ప్రఖ్యాత ఆంగ్ల రచయితా, విమర్శకుడూ, యి.యం.ఫాస్టర్. “ప్లాట్” కూ పాత్రలకూ మధ్య జరిగే సంఘర్షణే యిందుకు కారణం.అయితే స్వాతంత్రోద్యమకాలం వచ్చే సరికి కీ రా గోపల్లె గ్రామ జీవన చిత్రణ కంటే యెక్కువగా ఆనాటి అహింసా పోరాటాన్నే ముఖ్యంగా భావించడంతో నవల చివర్లో కథగా కంటే చరిత్రగానే రూపొందింది. స్వాతంత్రోద్యమంలో స్వయంగా పాల్గొన్నవాడు గావడంతో కీ రా నవలకు కావలసిన తాటస్ట్రతను పొందలేక పోయివుండవచ్చు.
తమిళంలో రాసిన తెలుగువాళ్ళ నవలలు యీ రెండూ. గోపల్లె గ్రామ వాసులందరూ “పెరుమాళ్ళ” భక్తులు. తిరుపతి యేడు కొండల వాడు వాళ్ళ దైవం. యింట్లోంచీ బయటకెళ్ళబోతున్న శ్రీదేవితో తాను వచ్చే వరకూ అక్కడె కూర్చుని వుండమని చెప్పి, బయటకెళ్ళి బావిలోకి దూకేసే యింటి యజమాని వుదంతం తెలుగు వాళ్ళకు బాగా పరిచయమైన “ఉండమ్మా ! బొట్టు పెడతా!” కథను గుర్తు చేస్తుంది.
ఏ ఒళము పైకెక్కి చనిపోవడానికి సిద్ధంగా వుండే నేరస్థుడు తనను చూడవచ్చిన పిల్లలతో పాట పాడమంటాడు. అప్పుడు వాళ్ళు పెద్ద “గొబ్బియాలో” అంటూ తెలుగు పాట పాడతారు. స్వాతంత్య్ర పోరాట కాలంలో గూడా గోపల్లె గ్రామస్థుల పాటలు తెలుగులోనే వుంటాయి.
స్వాతంత్య్రానికి ముందుకాలంలో తమిళులతో కలిసి జీవిస్తూనే తమ తల్లిభాషను అంటి పెట్టుకోడానికి ప్రయత్నించిన తెలుగువాళ్ళు, స్వాతంత్రం వచ్చాక, భాషా ప్రయుక్త రాష్ట్రాలు వచ్చాక క్రమంగా తమిళంలోకి మారిపోయారు. యీ మార్చుకంతా నిలువెత్తు నిదర్శనంగా యీ రెండు నవలలూ నిలబడతాయి. వొక కన్నడ మహా సభల సమయంలో ప్రసిద్ధ కన్నడ నవలా రచయిత వొకరు “యీ సభలకంటే దోసెలే నాకు ముఖ్యం” అన్నాదు. బతకడానికి తిండే ప్రధానం. ఆ తరువాతే భాషయినా, సంస్కృతి అయినా! కాల ప్రవాహంలో అనేక మార్పులు వస్తూనే వుంటాయి. కానీ మనుషులు జననినీ, జన్మభూమినీ, మాతృభాషనూ వదులుకోడానికి సిద్ధంగా వుండరు. పరిస్థితులూ, ప్రభుత్వాలూ మనుషుల జీవితాలతో చెలగాటమాడుతూనే వుంటాయి. అటువంటి సమయాల్లో మానవజాతి నిజంగా నాగరికంగా యెదుగుతోందా - అన్న ప్రశ్న యదురౌతుంది.
తమిళంలో లబ్ధప్రతిష్టుడై, అనేక గొప్ప పురస్కారాలు పొందిన కీరా రైల్లో వొక తెలుగువాళ్ళ స్టేషనుకు వచ్చినప్పుడు తెలుగు మాటలు చెవినబడగానే యేదో దేవలోకానికి వచ్చానని మురిసి పోయాడు. “మనమంతా తెలుగుతల్లి బిడ్డలం. ఏదో కాలవశాన ఎప్పుడో మేము ఈ పక్కలో వుండి పోతిమి. మీరు ఆ పక్కలో వుండి పోతిరి. మనం ఉండేది యెక్కదైనా మనం మాట్లాడే తెలుగుభాషనువీడ కూడదు” అంటాడు నిష్కర్షగా.
“గోపల్లె “గోపల్లె జనాలు” నవలలు చదివాక, కీరా గారి ఘోష విన్నాక. మనమంతా వోరకమైన నిర్వేదంలో మునిగిపోతాం. అనేక ప్రశ్నలు మనముందు సవాళ్ళుగా నిలబడతాయి. వాటికేమని సమాధానాలు చెప్పాలో మనకు తోచదు.