అమ్మనుడి/సంపుటి 5/మే 2019/'ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం' ముందడుగు
ముందడుగు
“ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం” ముందడుగు
తెలుగుకు ప్రాచీన భాష హోదా ప్రభుత్వం వైవు నుండి లభించిన తర్వాత - కారణాలు ఏమి ఉన్నా, తర్వాత జరగాల్సిన పనులేవీ సాగకుండా నిలిచిపోయిన సంగతి తెలుగు ప్రజానీకాన్ని వ్యాకుల పరచుతున్నది. కేంద్రాన్ని మైసూరులోని భారతీయ భాషల సంస్థ ప్రాంగణంలోనే నెలకొల్పి పని సాగించనున్న సందర్భంలో - దానిని నాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే స్థాపించాలనే బలమైన వత్తిడి రావడంతో ఆ ప్రయత్నం ఆగిపోయింది. కాని అప్పటి సమైక్య రాష్ట్రంలోనూ, ఆ తర్వాత రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత గడచిపోయిన అయిదేళ్టులోనూ అదే పట్టని తనంతో పాలకులు వ్యవహరించడంతో కేంద్ర నిధులు మురిగిపోయే పరిస్థితుల్లో - ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రాన్ని మైసూరులోనే నెలకొల్పి కొన్ని పనులు చేపట్టడం జరుగుతున్నది. ప్రాజెక్టు డైరెక్టరుగా ఆచార్య డి. మునిరత్నం నాయుడుగారిని ఇటీవల నియమించడంతో పనుల్లో కదలిక వచ్చింది. ఆ తర్వాత ఇప్పటి వరకు జరిగిన పురోగతిని గురించి 'అమ్మనుడి ' పాఠకుల కోసం తెలియజేయాలని కోరగా, వచ్చిన నివేదికను క్రింద ప్రచురిస్తున్నాము -సంపాదకుడు.
భారతీయ భాషాసంస్థ, మానసగంగోత్రి మైసూరువారు పత్రికా ప్రకటన ద్వారా జెత్సాహికులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించి ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రంలో పనిచేయడానికి ముగ్గురు సీనియర్ ఫెలోస్, నలుగురు అసోసియేట్ ఫెలోస్ ఒక ప్రాజెక్టు డైరెక్టర్, ఇద్దరు దిగువస్థాయి కార్యాలయ సిబ్బందిని నియమించడమైంది. 2018 నవంబర్ 28 తేదీన సదరు సిబ్బంది తమ విధులలో చేరారు. అప్పటి నుండి ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం పనులను ప్రారంభించడమైంది.
మార్గనిర్దేశక కార్యగోప్టి:
'ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం స్వల్ప వ్యవధిలోనే అంటే 2018 డిసెంబర్ 26 నుండి 28 వరకు మూడురోజులపాటు మైసూరులో భారతీయ భాషా సంస్థలో ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం 'మార్గనిర్దేశక కార్యగోష్టి ' ఉభయ తెలుగు రాష్ట్రాలలోని సరిహద్దు రాష్ట్రాలలోని 28మంది విషయనిపుణులను ఆహ్వానించి నిర్వహించడమైంది. ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం తెలుగుభాష, సాహిత్యం, చరిత్ర, సంస్కృతులలో, చేపట్టవలసిన కార్యక్రమాలను, ప్రణాళికలను ఈ కార్యగోష్టిలో ప్రతిపాదించడమైంది. దీనికి సంబంధించిన ప్రతిని దీనితోపాటు జతచేయడమైంది. ఇందులో కేంద్రంలోని విద్యాత్మక సిబ్బంది ప్రాచీన తెలుగు భాషకు సంబంధించిన ఒక సంవత్సర వ్యవధితో ఏడుగురికి ఏడు ప్రాజెక్టులను అప్పగించడమైనది. ఆ మేరకు సదరు సిబ్బంది తమతమ ప్రాజెక్టులను ప్రారంభించడం జరిగింది.
మనసు ఫౌండేషన్ సందర్శన:
2019 జనవరి 12, 13 తేదీలలో శ్రీ రాయుడుగారు నెల్లూరు జిల్లా ఉదయగిరి సమీపంలోని వరికుంటపాడులో నిర్వహిస్తున్న మనసు ఫొండేషన్ కార్యాలయాన్ని వారి ఆహ్వానం మేరకు ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం ప్రాజెక్టు డైరెక్టర్ ఆచార్య డి.మునిరత్నం నాయుడు, మైసూరు విశ్వవిద్యాలయం విశ్రాంతాచార్యులు ఆచార్య ఆర్వీయస్. సుందరం గారితో కలిసి సందర్శించడం జరిగింది. మనసు ఫౌండేషన్ సంస్థ శ్రీ రాయుడు గారు నిర్వహిస్తున్న స్వచ్చంద సాహితీ సంస్థ. వారు తెలుగు భాష, సాహిత్యం, చరిత్ర, సంస్కృతులకు సంబంధించిన ప్రాచీనకాలం నుండి ఇటీవలి కాలం వరకు వెలువడిన గ్రంథాలను సేకరించి డిజిటలైజ్ చేసి వారి వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. వారు ఇప్పటివరకు 50వేల పుస్తకాలను, ప్రాచీన తెలుగు పత్రికలకు సంబంధించి 15 లక్షల పుటలను స్మానింగ్ చేసి డిజిటలైజ్ చేశారు. వారు చేసిన కృషి చాలా విలువైనది. వారితో ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యనయ కేంద్రం ఒప్పందం కుదుర్చుకొని ముఖ్యమైన సమాచారాన్నంతా కేంద్రం వెబ్‌సైట్‌లోకి తెచ్చుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
హైదరాబాద్‌లో జాతీయ సదస్సు:
2019 జనవరి 28, 29 తేదీలలో ప్రాదీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం, భారతీయ భాషా సంస్థ మరియు ఉస్మానియా విశ్వవిద్యాలయం భాషాశాస్త్ర విభాగం, తెలుగు భాషా శాస్త్రజ్ఞుల వేదిక హైదరాబాద్ సంయుక్తంగా ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన జాతీయ సదస్సులో ముఖ్య అతిధిగా భారతీయ భాషా సంస్థ సంచాలకులు ఆచార్య డి. జి. రావు, ప్రాచీన భాషల శాఖాధిపతి ఆచార్య ఫెర్నాండేజ్ మరియు ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం సంచాలకులు ఆచార్య డి. మునిరత్నం నాయుడు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈ సదస్సులో ఉభయ తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా పరిశోధకులు, ఆచార్యులు మొత్తం 42 మంది పాల్గొని వరిశోధన పత్రాలను సమర్పించారు. ఇందులో ప్రాబీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం నుండి డా. ఎన్. రాంబాబు, డా. కె. రమేశ్ అనే ఇద్దరు తమ పరిశోధన పత్రాలను సమర్పించడమైనది.
వివిధ కార్యక్రమాలు:
ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం వెబ్‌సైట్‌ను రూపొందించడానికి అవసరమైన సమాచారాన్ని కేంద్రంలోని సిబ్బంది తమ ప్రాజెక్టులను చేస్తూనే సేకరిస్తున్నారు. కేంద్రం పక్షాన ఒక ప్రామాణికమైన గ్రంథాలయాన్ని ప్రారంభించడానికి చర్యలు చేపట్టడమైంది. 2018 - 2019 ఆర్థిక నంవత్సరంలో 570 ముఖ్యమైన తెలుగు గ్రంథాలను కొనుగోలు చేయడమైంది. వాటిని భద్రపరచదానికి అవసరమైన 6 అరలను (6 Book Racks) కొనుగోలు చేయడమైంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాలలో ఉన్న తాళపత్ర గ్రంధాలయాల్లోని తెలుగు తాళపత్ర గ్రంథాలను డిజిటలైజ్ చేసి తెచ్చుకొని కేంద్రం వెబ్‌సైట్‌లో పొందు పర్చాలని నిర్ణయించడమైంది. ఆ మేరకు ఆయా గ్రంథాలయాలకు లేఖలు రాయడం జరిగింది.
ప్రభుత్వ ప్రాచ్య లిఖిత పరిశోధనాలయం - హైదరాబాద్‌లో కార్యశాల:
2019 ఫిబ్రవరి 11 నుండి 17 తేదీ వరకు హైదరాబాద్‌లోని ప్రభుత్వ ప్రాచ్య లిఖిత పుస్తక భాంఢాగారం మరియు పరిశోధనాలయంలో "శాసనాలు, లిపి, తాళపత్ర గ్రంథాల వరిష్కరణపై కార్యశాల నిర్వహించడమైంది. ఇందులో తెలంగాణలోని పూర్వ 10 జిల్లాలలోని పరిశోధక విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, జూనియర్ & డిగ్రీ కళాశాల అధ్యాపకులకు, విశ్వవిద్యాలయాల సహాయాచార్యుల వరకు అవకాశం కల్పించడమైంది. ఆయా అంశాలలో నిష్ణాతులైన వారి చేత ప్రయోగాత్మక శిక్షణ ఇవ్వడమైంది.
శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ ప్రాచ్య లిఖిత పరిశోధనాలయం తిరుపతిలో కార్యశాల:
2019 మార్చి 25 నుండి 31 తేదీ వరకు తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ ప్రాచ్య పరిశోధనాలయంలో 'శాసనాలు, లిపి, తాళపత్ర గ్రంథాల పరిష్కరణపై కార్యశాల నిర్వహించడమైంది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లోని 18 జిల్లాలలోని పరిశోధక విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, జూనియర్ & డిగ్రీ కళాశాల అధ్యాపకులకు, విశ్వవిద్యాలయాల సహాయాచార్యుల వరకు అవకాశం కల్పించడమైంది. ఆయా అంశాలలో నిష్ణాతులైన వారిచేత ప్రయోగాత్మక శిక్షణ ఇవ్వడమైంది. ఏడు రోజుల శిక్షణ కార్యక్రమాలన్నింటిని వీడియో రీకార్డింగ్ చేయడమైంది.
భవిష్యత్ ప్రణాళిక:
ఈ కేంద్రం తెలుగు భాషా సాహిత్యం చరిత్ర, సంస్కృతులకు సంబంధించిన ముఖ్యమైన, విలువైన సమాచారంతో ఒక సంగ్రహాలయాన్ని (మ్యూజియం) ఏర్పాటు చేయాలని భావించడమైంది. త్వరలోనే దీనికి సంబంధించిన సమాచారాన్ని సేకరించడం జరుగుతుంది. ప్రాచీన తెలుగు సాహిత్యం మీద పరిశోధనాత్మక వ్యాసాలను ఆహ్వానించి కేంద్రం పక్షాన 'తెలుగు సిరి 'అనే పేరుతో తైమాసిక పత్రికను (మొదట అంతర్జాలంలో, ఆ తర్వాత ముద్రణ రూపంలో కూడా) తీసుకరావాలని భావించడమైనది. ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రానికి సంబంధించిన లోగో నమునా (logo Model) రూపొందించడం జరిగింది.
తెలుగును బోధించడం కాదు : తెలుగులోనే అన్నీ బోధించాలి