అమ్మనుడి/సంపుటి 5/జూన్ 2019/భారతీయభాషల్లో ఇంటర్నెట్‌ :; కొన్ని గణాంకాలు


ఇంటర్నెట్‌

రహ్మానుద్దీన్‌ షేక్‌ 94930 35658

భారతీయభాషల్లో ఇంటర్నెట్‌ :; కొన్ని గణాంకాలు

ఈ మధ్య ప్రతి ఒక్కరు తమని తాము నిత్య విద్యార్థులమని పిలిపించుకోవటాన్ని ఇష్టపడుతున్నారు. అదొక పోకడగా తయారయింది.

బడికి వెళ్ళే పిల్లలు బడిలో నేర్చుకోలేని సంగీతమో, ఆట పాటలో, నృత్యమో. క్రీడలో, అబాకస్‌ లాంటి ఉన్నతస్థాయి విషయాలో బడి బయట అదే పనిగా నేర్చుకుంటున్నారు.

ఉద్యోగస్తులు, గృహిణులు, పెద్దవాళ్ళు - తాము విద్యార్థి దశలో నేర్చుకోలేక పోయిన కళనో, ఆటనో, రచనావ్యాసంగమో కొత్తగా నేర్చుకుంటున్నారు.

ఈ విధంగా ఏదోటి అందుబాటులో ఉన్నది నేర్చుకుందాం అనే భావన నిన్నటి కన్నా నేడు అధికమయింది. పుస్తకాలతో అనుబంధాలు ఏదో ఒక విధాన పెరుగుతున్నాయి. ఆహ్ల్హాదం కోసం కథలో, నవలలో, ముద్రిత పుస్తకాలు కొని చదవటం, ఈబుక్స్‌ రూపంలో కంప్యూటర్లలో, మొబైళ్ళలో చదవటం, ఇంకెవరో చదివి పెట్టినవి వినడం, సినిమాగానో, సీరియల్‌గానో తీస్తే పుస్తకం పక్కన పెట్టుకొని చదువుతూ ఆ సినిమానో, సీరియలో చూస్తూ ఆస్వాదించడం. ఇలా పుస్తకం రకరకాల అవతారాలతో నేడు మెప్పిస్తోంది.

ఇక ఏదైనా నేర్చుకోవాలంటే, అది మన మాతృభాష వాహికగా నేర్చుకోవటం సులువని ఎన్నో పరిశోధనలు తేల్చాయి. bit.ly/2jHklo

లింకులో ఉన్న యునెస్కో వారి “మదర్‌ టంగ్‌ మ్యాట్టర్స్‌: లోకల్‌ లాంగ్వేజ్‌ ఏజ్‌ ఎ కీటు ఎఫెక్టివ్‌ లర్నింగ్‌ (మాతృ భాషలు అక్కరకు వస్తాయి : ప్రభావవంతంగా నేర్చుకునేందుకు ప్రాంతీయ భాషలే ముఖ్యం)” పత్రంలో తెలిపిన విధంగా మాత్ళ భాషలో అభ్యసించిన విషయం త్వరగా అర్ధమవుతుంది, సులువుగా గుర్తుంటుంది, తిరిగి ఇంకొకరికి నేర్చాలన్నా ఒప్పచెప్పాలన్నాా నేర్చుకున్నది ఆచరణలో పెట్టాలన్నా మాతృభాషలో నేర్చుకున్నదే ఎక్కువ గాడంగా మన బుద్దికెక్కుతుందని తెలుస్తోంది.

కానీ నేర్చుకునేందుకు అందుబాటులో ఉన్న అంశాలు దాదాపుగా ఇంగ్రిష్‌ లోనే ఉన్నాయి.

ఇది ఇబ్బంది పెట్టే విషయమో, ఆందోళన చెందాల్సిన విషయమో కాదు.

ఎందుకంటే తెలుగులో సమాచారాన్ని రూపొందిస్తే అందుకు తగ్గ మార్కెట్‌ ఉందన్న విషయాన్ని కాస్త ఆలస్యంగా వాణిజ్య వ్యాపార సంస్థలు, విషయ సమాచార రచయితలు తెలుసుకున్నారు.

అమెజాన్‌ ప్రైమ్ లో తెలుగు భాషా సినిమాలు/సీరియళ్ళు మాత్రమే కాదు, ప్రాచుర్యమున్న ఇతర భాషా దృశ్యకాలకు తెలుగు ఉపశీర్షికలు అందుబాటులో ఉన్నాయి. యూట్యూబ్‌ తెరిచి చూస్తే వంటలు చేసి చూపించే వీడియోలు, సినిమా సమీక్షల వీడియోలు, యాత్రాస్థలాల వివరణ, వ్యాపార మెళకువలు ఇలా చాలా అంశాల మీద తెలుగులో సమాచారం విపరీతంగా వస్తోంది. ఐదేళ్ళ క్రితమే రోజుకు కనీసం ఇరవై షార్ట్‌ఫిల్మ్‌లు యూట్యూబ్‌ వేదికగా విడుదలయ్యాయి. ఇప్పుడీ సంఖ్య వందల్లో ఉంది.

కానీ ఇప్పుడున్న సమాచారానికి వేల రెట్లు ఎక్కువ సమాచారం అందుబాటులోకి రావాలి.

ముఖ్యంగా ఎవరైనా నేర్చుకోవడానికి అనువుగా ఒక


పాఠ్యాంశానికి/బొధనాంశానికి తగ్గట్టుగా తయారవ్వాలి.

ఇందుకు కావాల్సిన సాంకేతికత అందుబాటులో ఉన్నా తెలుగులో ఇంకా మొదలవ్వలేదు.

ఇది ఒక గొప్ప అవకాశం. తెలుగు వార్తాసంస్థలు ప్రస్తుతం ఈ ఖాళీలో ఇమడాలని చూస్తున్నాయి కానీ వారికది తలకు మించిన పని అవటం వలన నాణ్యమైన సమాచారం తయారవ్వటం లేదు.

“ఈ సందర్భంలో ఇలా మాట్లాడాలి, ఇలా ప్రవర్తించాలి, ఇలా మాట్లాడకూడదు, ప్రవర్తించరాదు” అని బోధ చేసే విషయాలు కానీ, సైకిల్‌. స్కూటర్‌, కార్‌. బట్టలుతికే మషీను లాంటి ఉపకరణాలను శుభ్రం చేసుకునే విషయాలను చెప్పే వీడియోలు లేదా కోర్సులు గానీ, వంటలను నేర్పే మార్గదర్శక వీడియోలూ కానీ, ఇలా రోజువారీ ప్రతి మనిషికి అవసరమయ్యే విషయాలపై తయారు చేసే సమాచారానికి మన దేశంలో కోట్లలో వీక్షకులున్నారు.

గూగుల్‌-కెపిఎంజి నివేదిక ప్రకారం మన దేశంలో 23 కోట్ల జనాభా భారతీయ భాషల్లో ఇంటర్నెట్‌ ను వాడుతోంది. ఆంగ్లంలో ఈ సంఖ్య 17.5 కోట్లు మాత్రమే. 2021 నాటికి 75 శాతం భారత ఇంటర్నెట్‌ వాడుకరులు తమ మాతృభాషల్లోనే ఇంటర్నెట్‌ వాడతారని అంచనా. ఆ రాబోయే జనాభాకు తగిన సమాచారాన్ని రూపొందించుకున్న సంస్థలు, వ్యక్తులు, మాత్రమే భవిష్యత్తు లో నిలదొక్కుకోగలరు.

ప్రతి ఒక్కరికీ, చవకగా, సులువుగా ఇంటర్నెట్‌ అందుబాటులోకి రావడం, మన ప్రమేయం లేకుండానే బ్యాంకింగ్‌ వ్యవస్థ, ప్రభుత్వ యంత్రాంగంతో మనం చేసే సంభాషణలు ఇంటర్నెట్‌ వాహికగా జరగటం వలన మనకు తెలీకుండానే మనం ఇంటర్నెట్‌ వాడుకరులము అయిపోయాం. ఆ విధంగా ఇంగ్లిష్‌ లో మాత్రమే అందుబాటులో ఉన్న సేవలు భారతీయ భాషలకు మారటం అనివార్యమయింది. 68 శాతం భారతీ యులు ఆంగ్లంలో కన్నా తమ సొంత భాషల్లో ఉన్న సమాచారాన్నే వినియోగిస్తున్నారు.

సరిగ్గా ఇక్కడే నేను చెప్పదలచిన విషయాన్ని ప్రస్తావిం చాలి. ఇంత ఎక్కువ స్థాయిలో భారతీయ భాషల్లో నాణ్యమైన సమాచారానికి మార్కెట్లో డిమాండ్‌ ఉన్నప్పటికీ, ఆ డిమాండ్‌ కి సరిపోయే సమాచారం అందుబాటులో లేదు. పేమెంట్‌ గేట్‌వేలు కావచ్చు, సమాచార పత్రికలు కావొచ్చు, చాటింగ్‌ చేసే అనువర్తనాలు కావచ్చు. వీటికి చాలా ఎక్కువ డిమాండ్ ఉంది.

60% భారతీయుల ప్రకారం మన భాషల్లో ఆయా సేవలు లేకపోవడం వలన సింహభాగం వాడుకరులు ఆ సేవ లను వాడేందుకు ముందుకు రావటం లేదు. పైన చెప్పిన గూగుల్‌ - కెపిఎంజి నివేదిక కోనం జరిపిన సర్వేలో 88% మంది భారతీయులకు ఆంగ్ల వాణిజ్య ప్రకటనల కన్నా భారతీయ భాషల వాణిజ్య ప్రకటనలు ఎక్కువగా ఆకర్షించాయట.

రాబోయే. 5 ఏళ్ళలో ఇంటర్నెట్‌ వాడుకరులుగా రాబోయే వారిలో 90 శాతం భారతీయ భాషలవారే ఉంటారని అంచనా.

దీనికి తోడు భారత ప్రభుత్వం డిజిటల్‌ లిటరసీ పేరుతో 2021 నాటికి కనీసం 60 వేల గ్రామీణ కుటుంబాలు పూర్తి స్థాయిలో ఇంటర్నెట్‌ వాడే దిశగా ప్రాణాళికలు రూపొందించింది. ఆహ్లాదం కోసం, వార్తల కోసం, ఆన్‌లైన్‌లో షాపింగ్‌, బ్యాంకింగ్‌ సేవలు, ఇలా అన్ని రంగాలలో భారతీయ భాషల్లో వాడకం బీభత్సంగా పెరిగిపోయింది. మరింత ఎక్కువగా రాబోయే రోజుల్లో పెరగనుంది. ఇలాంటి సందర్భంలో భారతీయ భాషల్లో, మన సందర్భంలో తెలుగులో విషయ సమాచారాన్ని అందుబాటులోకి తెచ్చే వ్యక్తులకు చేకూరే లాభం చాలా ఎక్కువ. ఆయా రంగాలలో ఇప్పటికే విజయాన్ని సాధించిన సంస్థలకు భారతీయ భాషల్లో నాణ్యమైన విషయ సమాచారం అందించే ఉద్యోగుల అవనరం రానుంది.