అమ్మనుడి/సంపుటి 5/జూన్ 2019/నవయుగ వైతాళికుడు కందుకూరి వీరేశలింగం స్పూర్తి ఇప్పటికి అవసరమే!


ముఖ చిత్ర కథనం

సన్నిధానం నరసింహశర్మ 9292055531

నవయుగ వైతాళికుడు

కందుకూరి వీరేశలింగం స్పూర్తి ఇప్పటికి అవసరమే!



బాల్య వివాహాలు ఇప్పుడు జరగడంలేదు నిజమే! వాటికి వ్యతిరేకంగా వర్తమానకాలంలో ఉద్యమం అక్మరపడదు. స్త్రీ పునర్వివాహాలు ఇప్పుడు సమస్యకాదు. దాని గురించి ఉద్యమం నేడక్కడ పడదు. ఇందువల్ల వీరేశలింగంం ప్రబోధాలు స్ఫూర్తి నేటికి అవసరం లేదనుకుంటే - అది పాక్షిక ఆలోచనా సంకుచితత్వమే అవుతుంది. కందుకూరి వీరేశలింగం పంతులుగారి కాలాన్ని భావించుకుని ; నాటి ప్రధాన సమస్యలైన వాటిని ఎదుర్కొడంలో ఆయన ఆరాటాలూ పోరాటాలూ, నమ్మినవాటి పట్ల కుదురుతలపులు తలచుకొంటే ఒడలు జలదరిస్తుంది. చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది.


ప్రజల్లో ఛాందసులు బానిస తలంపులు ; మత పీఠాధిపతుల గిరి గీసుకుని గుండ్రంగా తిరిగే మౌడ్యాలు, ముందు మేలు చూపే వ్యవస్థలో కొందరు ధర్మశాస్త్రాలకు వక్రభాష్యాలు చేసే ధోరణులు; కొత్తలకు స్వాగతమెత్తడంలో సమకాలీన ప్రాపంచిక జీవన దృక్పధాలను చూసుకోకపోవడం - ఇటువంటి ఒకానొక సామూహిక వ్యతిరేక వాతావరణంలో ఆయన ప్రణాళికాబద్ద క్రియాత్మక సమర పాత్ర అషామాషీ కాదు;

ఓరోరీ జంగమా వీరేశలింగమా అని అంటూ దుమ్మెత్తి పోయడాలుండేవి. పాడయిపోయిన వాళ్లు ఆయన్ను పాడైపోతున్న వాడిగా భావించడం. అల్ప సంఖ్యాకులైన ఆనాటి ప్రగతిశీలురు ఆయనకు తోడ్పడుతుంటే వారిని నిరుత్సాహ పరచడం, భయపెట్టడం, వెలి వేయడం. స్త్రీ పునర్వివాహాలు జరిపించేటప్పుడు కావళ్లతో మంచినీళ్ళు తెచ్చేవారినీ వారించడం. కందుకూరి ఇల్లాలు రాజ్యలక్ష్మమ్మగారే తానే గోదావరికి వెళ్ళి బిందెలతో నీళ్ళు తేవడం ఇటువంటివెన్నో జరిగాయి.

ముక్కుపచ్చలారని వారికి బాల్య వివాహాలు చేయడం వీరేశ లింగాన్ని కలచివేసింది. స్త్రీ పునర్వివాహాల్ని ఆయన అంగీకరింపజేయడంలో ఆయనకు సంప్రదాయపు వ్యక్తిగా చెబితే తప్పులేదేమో.

ధర్మశాస్త్రాలు లోతుగా చదివి, కువ్వాఖ్యాన దురంధురుల్ని ఆ ధర్మశాస్త్రంలోని అంశాలనే ఎత్తిచూపి స్రీ పునర్వివాహాలు శాస్త్ర సమ్మతమని వాదించడంలో ఆయన నైపుణ్యం పాండిత్య పునాది నుండీ పుట్టింది.

మనం ఇక్కడ ఓ అంశాన్ని గమనించాలి. వివాహ సంస్మరణ అంశాల్లో ఆయన ఏకకుల దృష్టి వుందనేది వాస్తవం. అయితే ఆ కులీనుల ఛాందసులతోనే ఆయన భావ నమరం సాగించినదీ గమనార్హం.

హిత సూచని విషయంలో కావచ్చు తనకన్నా ముందే రాయబడిన రంగరాజు చరిత్రను తొలి నవలగా చెప్పకపోవడం కావచ్చు. కొన్నిటిలో తాను ప్రథముడినని చెప్పుకోవడంలో కావచ్చు, సమాంతర సంస్కృతి ఆలోచించడంలో కావచ్చు, స్వాతంత్య్ర సమర సంబంధ జాతీయభావాల్లో కావచ్చు. భోగము వారి విషయంలో పద ప్రయోగ విషయంలో కావచ్చు. - పంతులుగారి పై నున్న విమర్శలు ఆలోచనీ యాలూ ఆక్షేపణీయాలూ కావచ్చు. కానీ స్త్రీ విద్యా విషయంలో, స్త్రీ జన సముద్ధరణ విషయంలో దురాచారాల విషయంలో, అశాప్తీయ మౌడ్యాల అంశాల్లో ఆయన సాగించిన సమరాలు అమరాలే! కాకినాడ పి.ఆర్‌.కళాశాలలో ఉద్యోగానికి దరఖాస్తు చేసిన అచ్చమైన బ్రహ్మ సామాజికుడు, మచ్చలేని చరిత్రగల రఘుపతి వేంకటరత్నం నాయు

డుగారిని కాకినాడ తీసుకువెళ్ళి సిఫార్సు చేసిన అర్హతను గౌరవించిన వ్యక్తి కందుకూరి. తరువాత కాలాల్లో కొన్ని చారిత్రక కారణమే విభేదాలు వచ్చినా నాళం కృష్ణారావుగారిని సామాజిక కార్యకళాపాల్లో కలుపుకొన్న సామాజిక సేవకుడు వీరేశలింగం.

స్త్రీ విద్య ఫలానా స్త్రీలకే వుండాలని ఆయన ప్రవచించిన దాఖలాలు లేవు.

స్త్రీ పునర్వివాహాలు జరగాలని అభిలషించడంలో కందుకూరికి మానవీయ కోణం వుంది. బాల వితంతువులు తరువాత పడుపు వృత్తిలో దిగరాదని; భ్రూణహత్యలు నివారించాలనే ఆలోచనతో స్త్రీ పునర్వివాహాలు జరగాలనేది ధ్యేయం.

“బాల వితంతువులు తమ ద్వితీయ వల్లభులతో నిరంతర సౌఖ్యమనుభవించుచుండగా కన్నులు పండువుగా గనుగాన గలిగెడు భాగ్యమెప్పుడు లభించునా” యని నా హృదయములో నేనెంతో అభిలషిస్తున్నా "నని వీరేశలింగం స్వీయచరిత్రలో రాసుకున్నారు - ఈ వాక్యాన్ని అక్షరాక్షరము పట్టి పట్టి చదివి భాదిస్తే వీరేశలింగం గారికి స్త్రీ జన బాధల, సౌఖ్యాలపట్ల ఉన్న శ్రద్ధ మరొక్కరికెవరికైనా ఇంత లోతు తలపు, సహజానుభూతి ఉందా అనేది మన ఎదల్లో కదలాడుతుంది.

వీరేశలింగం సాహిత్య సేవ : వీరేశలింగం ఒక విద్వత్కవి. సంస్కృత నాటకానువాద దక్షుడు, ప్రజోపయోగ ప్రహసన గ్రంథ రచయిత వ్యాకరణ గ్రంథ రచయిత శాస్త్రజ్ఞాన రచయిత ఉపన్యాసాలను కరదీపికలుగా ముద్రించిన ఉద్యమ ప్రచారవాజ్మయ రచయిత. జీవిత చరిత్రల రచయిత పూర్వ గ్రంథ సంస్కార కర్త స్వీయ చరిత్ర కర్త సంఘ సంస్మరణోపన్వాసాల ఫొత్తాల కర్త, వీరేశలింగం పంతులు ప్రయోజనకర శతాధిక గ్రంథకర్త.

ఆయన రచనలు తొలినాళ్ళలో 12 సంపుటాలుగా వెలువడ్దాయి. ముఖ్యంగా ఆంధ్ర కవుల చరిత్ర ఆయన పరిశోధనల సంధానాల సంయుక్త శ్రమఫలం. 21 ప్రాబీన గ్రంథాల పరిష్కర్త, ఇన్ని పుస్తకాల రచన మామూలు అంశం కాదు.

ఆయన జీవితం సాహిత్వ సృజనకు, సంఘ సంస్కార సేవలకు పత్రికి నిర్వహణకు అంకితమైంది. వీటితో ఊరుకున్నారా? తన ఆశయాలు ఫలాల పంటలు ఎపుడూ పండుతూ ప్రజలకు వినియోగపడాలని పదికాలాల పాటుందే సంస్థల్ని స్థాపించారు. ప్రార్ధనామందిరం, రాజ్యలక్ష్మీ నివాసం. ఆంధ్రదేశంలోనే ప్రథమ పుర మందిరం రాజమహేంద్రవరంలో నిర్మించారు. ఆ పురమందిర నిర్మాణానికి తొలుత కొందరి వద్ద ఆయన విరాళాలు తీసుకోగా ఆయనకు అవినీతి అంటకట్టే ప్రయత్నాలుగా చేయగా బాధపడి ఎవరి సొమ్మును వారికి తిరిగిచ్చేసి కేవలం తనకు తన పుస్తకాల అమ్మకాలపై వచ్చే ధనంతో పురమందిరాన్ని నిర్మించి నిస్వార్థ అభిమాన ధనుడాయన.

చెన్నపురిలో, బెంగుళూరులో సమాజహిత కార్యక్రమాలకై మందిరాల్ని నిర్మించారు. థవళేశ్వరంలో బాలికా పాఠశాల రాజమండ్రిలో ఆస్తికోన్నత పాఠశాల - ఇలా ఇలా ఎన్నో భవన నిర్మాణ కార్యక్రమాలు చేపట్టి ప్రజాహిత కార్యక్రమాలకు నెలవులుగా చేశారు. వివేకవర్దనీ ప్రచురణాలయాన్ని నెలకొల్పి రచనోద్యమానికి బాసటగా చేసుకున్నారు.

ఎంతటి గొప్ప ప్రణాళికలు? ఎట్టి పట్టుదల పనితనాలు! ఎంతటి ముందు సేపు చూపులు! ముదుసలితనం వచ్చిన, పీసస జబ్బు వచ్చినా, నమ్మనవారిలో కొందరు దూరమైపోయినా ఒక మొండి పట్టుదలతో సమాజహితకారిణీ ధ్యేయాలను వదలని మహానుభావుడు.

1987లో చిలకమర్తి లక్ష్మీనరసింహం వీలేశలింగం చరిత్రను చదివితే అందులో వందలకొలది నీతి పాఠాలుంటాయని, వీరేశలింగ స్వీయచరిత్ర పఠనం అంటే ఆంధ్రదేశం యొక్క సాంఘిక చరిత్ర పఠనంగా తెలిపారు.

ఆరుద్రగారు సమగ్రాంధ్ర సాహిత్య చరిత్రలో వీలేశలింగ విరచిత 'పుస్తకాల జాబితా తయారు చేస్తే ఏదో పుస్తకాల వ్యాపారి కేటలాగులా ఉంటుం 'దన్నారని తెలిపారు. అంటే కందుకూరి గ్రంథ రచనలకు అంత విస్తృతి వుందని మాట;

వీలేశలింగం నాస్తికులు కారు. బ్రహ్మ సమాజ ఆస్తికులు విగ్రహారాధన వ్యతిరేకులు ఉపనిషత్తులు ప్రబోధించిన వానిని వాని సారాంశాలను గ్రహించిన 'ఏకేశ్వరోపాసన ' ఆయనది.

అంతకు మించి సంఘద్రోహులను 'ఏకేసే” కార్యోపాసన ' ఆయనది.

భాషాసేవ

భాషా సేవ, సాహిత్య సేవ పరస్పర ఏకమార్ల సంజనితాలే అయినా ప్రత్వేకంగా బాగులెంకగా కూడా కొంత ఆయన పాత్ర వహించకపోలేదు.

వీరేశలింగం - ప్రత్యేకంగా వాడుకభాషతో యుద్ధం చేసేటంతటి గ్రాంధికవాది కాదు, ఒకరకంగా ఆయనది గ్రాంధిక భాషానుసరణమే కాని గ్రాంధిక వాదానుసరణం కాదు, ఆయన 'పటాహఖం కృతుల... అభంగతరంగమృదంగ ' గ్రాంధికభాష కాదు...ఒడిదుడుకులులేని ఏకప్రవాహశైలి, స్పష్టభావ ప్రకటన ఆ శైలికి భూమిక. సరళ గ్రాంధిక సౌందర్య దర్శనం కలుగుతుంది.

కందుకూరి 25 ఏళ్ల చిన్న వయస్సులోనే చిన్నయసూరి బాల వ్యాకరణం లోటు పాట్లను ఎన్నగలిగాదు. కొక్కండ వారు పుస్తకాలే కాదు పత్రికలు కూడా గ్రాంధిక శైలిలో ఉండాలంటే దానిని ఖరాఖండీగా ఖండించారు.

పత్రికల భాష గ్రాంధిక ఫణితినున్న
పండితులుగాని వారికి పనికిరావు
పత్రికోద్దేశమే కొఱవడునుదాన
గాన నెవుడు సర్వజనోపకారమొదవ

పామరులకును తెలియంగ వ్రాయవలయు అని నిర్ద్యందంగా తన హృదయాన్ని నాటబలికారు.

తెలుగును బోధించడం కాదు ; తెలుగులోనే అన్నీ బోధించాలి

భాష విషయంలో ఉద్యమధారిగా ఆయన కనబడకపోయినా ఒక ఆంతరంగిక తరంగిత ఉద్యమం వుందేమో అనిపిస్తుంది.

అన్నీ పద్య కావ్యాలలో రాయడం పట్ల ఆయనకు కొంత అయిష్టం లేకపోలేదు. తానూ సంప్రదాయ మార్దానుసారిగా ఎంతగానో కొనసాగినా సంస్మరణ అంశాలు రాకపోతే కందుకూరి అవరు కదా. అందుకే

“పుస్తకములను సంస్కృత భాషలో వ్రాయుట కంటే దేశభాషలలోనే వ్రాయుట మేలైనపని. అట్టి ఉపయుక్త గ్రంథములను వచనములలో వ్రాయుట ముఖ్య కార్యము” అని ఆయన సూటిగా అనుభవ జ్ఞానంతో ప్రజావసర గ్రహింపుతో నుడివినాడంటే అది ప్రశంసనీయం కదా! అయితే కవిత్వ గ్రంథాలు వచనేతర రచనలుగా ఉండవచ్చని కూడా ఆయన అభివ్రాయం.

భాషా సాహిత్య సంబంధంగా ఆయనకుగల భావాలకు 'సరస్వతీ నారద సంవాదం” అనే చిన్న పుస్తకమే దాఖలా.

ఆంగ్ల పదాలకు ఆంధ్రపద సృజనలు

కవి, పండితుడు, పత్రికాధిపతి, కావ్యనిర్మాత సంస్కార కావ్య విధాత అయిన కందుకూరికి ఆంగ్ల భాషా పదార్థాలకు సరితూగే సాంస్కృతిక ఆంధ్ర భాషా పద సృజనలు చేసిన భాషా ప్రయోగశీలిగా కూడా స్మరణీయులే.

పరిశోధ దృష్టిగల రచయిత డాక్టర్‌ అరిపిరాల నారాయణరావు ఏకంవిధ పరసృజనలను పరిశీలించి లెక్కగట్టి 300 అని తేల్చారు.

వీరేశలింగ పదసృజనలు తెలుగు అకాడమీ చేసిన పద సృజనలు వంటివిగ కనపడినా అకాడమీలూ గికాడమీలు చేయని పనిని ఆ కాలంలో అలా తానుగా చేయడం అవిస్మరణీయం. మచ్చుకు కొన్ని...

ఆంగ్లం - ఆంధ్రం
కలెక్టరు -కరగ్రాహి
సేవింగ్స్‌ బ్యాంకు బుక్‌ - రక్షణ నిధి పుస్తకము
పోలీసు ఇనస్పెక్టర్‌ - పురారక్షక పర్యవేక్షకుడు
డి.ఎస్‌.పి. - మండల ఆరక్షకాధ్యక్షుడు
రైల్వే - అయోమయమార్గము
బిలియర్డ్స్ టేబుల్‌ - దంతగోళ క్రీడా ఫలకం
ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీరు - అనుష్టాన నియుక్త వాస్తు విద్యా విశారదుడు
స్కూలు ఫైనలు ఎగ్జామినేషన్‌ - పాఠశాలాంతిమ పరీక్ష
సెంట్రల్‌ జైలు - మధ్యస్థ కారాగారము
నాన్‌ అఫిషియల్‌ విజిటర్‌ - అనధికార ద్రష్ట
డిఫ్టిక్టు లోకల్‌ ఫండ్‌ బొర్టు - మండల స్థలనిధి సంఘము

ఇటువంటివి మరెన్నో ! ఈ అనువాద పద సృజనలు ఈ కాలము వారికి హాస్యము పుట్టించవచ్చు. కృతక భాషానువాద పద సృజనల వల్ల తెలుగు అకాడమీ సైతము కొంత హాస్యము పుట్టించింది.


కానీ వీరేశలింగంగారు ఆనాడు ఆ విధంగా ప్రయోగాలు చేసే బుద్ధి నైశత్వానికి ఆనందించి తీరాలి. ప్రత్యేకంగా 'తెలుగు ' అనే ఆలోచనలు లేనికాలంలో సంస్కృత వినియోగానికి అలవాటు పడిన కాలంలో ఈ పదానువాదాలు జరిగాయి.

ఇంతకీ ఇంత భాషా సేవ చేసిన వీరేశలింగంగారు తమ స్వీయ చరిత్ర రెండవ ప్రకరణలో “తెలుగు భాషను వృద్ధి చేయవలెనన్న అభిలాషము నాకు మొదటి నుండియు విశేషముగా నుండెను. నేను నా కాలమంతయు భాషాభివృద్ధి నిమిత్తమే ఉపయోగించి పాటు పడిన కొంత వరకు నా అభిలాషము నెరవేఱియుండునేమో " అని రాసుకోడంలో ఆయన హృదయ భావ భాష వెల్లడవుతోంది.

తాను నమ్మకుండా ఏదీ ఆచరించని కందుకూరి వీరేశలింగం వాడుక భాషావాదాన్ని చాలనాళ్ళదాకా, చాలా ఏళ్ళదాకా అంగీకరించ లేదు. ప.గో. జిల్లాలో కొవ్వూరులో జరిగిన ఒక సభలో గిడుగు రామమూర్తిగారి ఉపన్యాసాన్ని శ్రొతల మధ్య ఎక్కడో వున్న వీరేశలింగం విన్నారట. తలపాగతో ఓ పెద్దాయన వచ్చారని, ఆయన వీరేశలింగం గారని తెలుసుకొని సభా నిర్వాహకులు ఆయనను తోడుకొని వెళ్ళారట! అప్పుడాయన వాడుకభాషా వాదాన్ని నేనూ నమ్ముతున్నానని ప్రకటించారట

భార్య ప్రేమికుడుగా : పంతులుగారి భార్య రాజ్యలక్ష్మమ్మ సాధ్వీమణి అంటే సాధ్వీమణే! భర్త కార్యక్రమాలకు త్రికరణశుద్ధిగా తోడ్పాటునిచ్చిన అచ్చమైన జీవిత భాగస్వామి. అర్జాంగికే తన స్వీేయచరిత్రను అంకితం చేశారు కందుకూరి. భార్య అనాయాసంగా మరణించింది. వృద్ధులైన ఆయన దాన్ని తట్టుకోవడానికి రెండు మూడుసార్లు దైవ ప్రార్ధన చేసుకున్నారు. ఆవిడ తెల్లవారు రూమున చనిపోయిన ఆమెను చూడడానికి ఉదయవేళ వేలమంది జనం రావడం ఆయన్ని ఓదార్చడం వారి పట్లగల ప్రజాభిమానానికి దర్పణం. పురమందిర ధర్మకర్తలలో ఒక క్రైస్తవుడు ఒక ముస్లిము వుండాలని ఆయన రాసి పాటించడం విశాల హృదయ చిహ్నం.

అరడజను కొరతలున్నాా ఆరుడజన్ల మేలుములున్న చోట్ల తగ్గించుకో కూడదు అని బంగోరే అనేవారు. వీరేశలింగం జీవితచరిత్రను గమనించినప్పుడు ఈ వాక్యం గుర్తుకొస్తుంది.

లంచగొండితనం, క్రొత్తక్రొత్త మూఢాచారాలు, ఇంకా శకునాలు చూసుకోవడం, మహిళా సాధికార కార్యక్రమాలకు అడ్డంకులు. సామాజికపు కుళ్లుల ప్రక్షాళణకు - ఇప్పటికీ కందుకూరి స్ఫూర్తి అవసరమే కాదు, అత్యవసరం.

1848 ఏప్రిల్‌ 16న రాజమహేంద్రవరంలో పుట్టిన పంతులు గారు 1919 మే 27న చెన్నపట్నంలో కీర్తిశేషులయ్యారు.

ఒకటి కాదెన్నో ఉదయించి పెంఫొందె
సకలమ్ము వీరేశ సాహిత్య ఖని యందె
- మధునాపంతుల

ఆ ఖనిలో ఎన్నో లోతులు! ఆలోతులలో ఎన్నో సామాజిక చరితల పొరలు? వాటి సమ్మగ దర్శనంలో అదిగో నవయుగ వైతాళికుడు కందుకూరి రెండు తెలుగు రాష్ట్రాలకు గర్వకారకులు.