అమ్మనుడి/సంపుటి 4/జూలై 2018/'విజ్ఞాన సర్వస్వం' కొమర్రాజు లక్ష్మణరావు

'విజ్ఞాన సర్వస్వం' కొమర్రాజు లక్ష్మణరావు

“లక్ష్మణరావుగారి వ్రతిభను అంచనా వేయాలంటే హిమవత్పర్వత శ్రేణుల భౌగోళిక న్వరూప నిర్ణయం చేయడం వంటిదే” - అడివి బాపిరాజు

చరిత్రకారుడుగా, పరిశోధకుడుగా, భాషా సేవకుడుగా, సాహితీవేత్తగా, సంఘసేవకుడుగా, మేధావిగా, పండితుడుగా, బహుభాషా కోవిధుడుగా, ఎనలేని పేరు ప్రఖ్యాతులు గడించిన గొప్ప సాహితీ సంపన్నులు కొమర్రాజు వేంకట లక్ష్మణరావుగారు (18-5-1877 - 13-7-1923). తెలుగుదేశంలో పుట్టి రెండు దశాబ్దాలు మహారాష్ట్రంలో పెరిగి, తెలుగులో అనేక ఉత్తమ సంస్థల్ని నిర్మించి, సాహిత్యానికీ, భాషకూ, సామాజాభివృద్ధికీ, కృషి చేసిన మహానుభావుడు.

కొమర్రాజువారు 1877 మే 18వ తేదిన కృష్ణా జిల్లా నందిగామ తాలూక పెనుగంచిప్రోలు గ్రామంలో జన్మించారు. గంగమ్మ వేంకటప్పయగార్లు వీరి తల్లిదండ్రులు. లక్ష్మణరావుగారు రెండేళ్ళ వయస్సులో వున్నపుడే తండ్రి చనిపోయారు. ఆ కారణంగా తన సవతి సోదరుడైన శంకరరావుగారి వద్ద కొంతకాలం వున్నారు. వీరు ప్రాథమికవిద్యను భువనగిరిలో పూర్తి చేశారు. వీరి సోదరి అచ్చమాంబను నాగపూర్లో ఇంజనీర్‌గా పనిచేసే, వారి మేనమామ భండారు మాధవరావుకి ఇచ్చి వివాహం చేశారు. లక్ష్మణరావుగారు నాగపూర్‌లో మేనమామ ఇంటిలో వుంటూ మాథ్యమిక విద్యను, ఉన్నత విద్యను అభ్యసించారు.

నాగపూరులోని మారిష్‌ కాలేజీలో బి.ఏ. ఆనర్స్‌ చదువుకున్నారు. ఎఫ్‌. ఎల్‌ కూడా పూర్తి చేశారు. బి. ఏ. లో పాళిభాషను అభిమానంగా తీసుకున్నారు. ఆ భాషలో ఉత్తీర్ణులయిన వారిలో ప్రథముడు మా గురువుగారే అని మల్లంపల్లివారు అన్నారు. ప్రైవేట్‌గా ఎమ్‌.ఏ. కలకత్తా విశ్వవిద్యాలయంలో పూర్తిచేశారు.

మహారాష్ట్రంలో వుండడం వల్ల ఆ రాష్ట్ర సంస్కృతి ప్రభావం తనపై పడింది. ఆయన కట్టూ బొట్టూ అన్నీ మారాయి. ఎంతగా పడిందంటే ఎప్పడూ కోటు, ఉత్తరీయం, తలపాగా, మీసాలు. ఇవన్నీ వుండేవి. వీరు సంస్కృతం, హిందీ భాషల్ని అధ్యయనం చేశారు. బెంగాలీ, గుజరాతీ, తమిళం, కన్నడభాషల్లో వీరికి పరిచయం వుంది. మహారాష్ట్రంలో వుండేటప్పుడు రావుగారు 'సమాచార్‌, వివిధ, విజ్ఞాన విస్తార' అనే పత్రికలకు సంపాదకత్వం వహించారు. 'కేసరి', 'మహారాష్ట్ర', మొదలైన పత్రికల్లో వ్యాసాలు రాశారు. తాను విద్యాభ్యాసం చేసిన మరాఠీ భాషలోనే పరిశోధనా వ్యాసంగం ప్రారంభించారు. మహారాష్ట్రంలో వున్నప్పుడే, విజ్ఞానశాస్త్రాల వ్యాప్తి ప్రాముఖ్యాన్ని రావుగారు గుర్తించారు.

మహారాష్ట్రలో వున్నప్పటికీ తెలుగు భాషా సాహిత్యాలపై వీరికి పట్టుసడలలేదు. సోదరి అచ్చమాంబ తెలుగు గ్రంథాల్ని పత్రికల్ని తెప్పించుకొని చదువుతుండేది. లక్ష్మణరావుగారుకూడా ఆ గ్రంథాల్ని పత్రికల్ని చదివేవారు. అచ్చమాంబ, లక్ష్మణరావు ఇద్దరూ రాసిన వ్యాసాలు తెలుగు పత్రికలలో ప్రచురితమయ్యాయి. రాయసం వేంకట శివుడు నడిపిన 'తెలుగు జనని' వత్రికలో వీరి వ్యాసాలు వెలువడ్డాయి. ఆ పత్రికలోనే కొమర్రాజుగారి “విశ్వం యొక్క విరాట్‌ స్వరూపం”, “విశ్వం యొక్క బాల్యస్వరూపం” మొదలైన విజ్ఞాన శాస్త్రాలకు సంబంధించిన వ్యాసాలు ముద్రించబడ్డాయి.

నాగపూర్‌లో వుండగానే తెలుగులో చరిత్ర గ్రంథాలు లేని లోపాన్ని పూరించడానికి “శివాజీ చరిత్ర” రాశారు. వీరు రాసిన “శివాజీ చరిత్ర” ప్రముఖుల ప్రశంసల్ని అందుకుంది. “ఆంధ్రభాష యందు చరిత్ర గ్రంథంబు లత్యల్పంబుగనున్నవి. కానచేతనైనంత వరకు మాతృభాషా సేవ చేయవలెననిన నిచ్ఛతోనే చరిత్ర గ్రంథంబు రాసినాడ, శక్తివంచనలేక ఇక ముందును నిటులనే భాషా సేవ చేయవలయునని నిచ్చగలవాడను” అని రావుగారు అన్నారు.

లక్ష్మణరావుగారు బెజవాడ తాలూకాకు చెందిన కంకిపాడు కరణం మల్లికార్జునరావు కుమార్తె కోటమాంబను పెళ్ళిచేసుకున్నారు. వీరికి అచ్చమాంబ, వినాయకరావు ఇద్దరు పిల్లలు. అచ్చమాంబ డాక్టర్‌గా, సంఘసేవకురాలుగా కీర్తి గడించారు. వినాయకరావు కొన్ని రచనలు చేశారు. కొంతకాలం ప్రెస్‌ కూడా నడిపారు.

నాగపూర్‌ నుంచి తన స్వస్థలం మునగాల చేరుకున్నారు. మునగాల రాజాతో తనకు వున్న నంబంధాల వల్ల లక్ష్మణరావుగారు మునగాలరాజాకు దివానుగా నడిగూడెంలో చేరారు. సంస్థాన వ్యవహారాలు చూసేవారు. మునగాల ఎస్టేట్‌కు సంబంధించిన కోర్టు వ్యవహారాలకోసం 1905 లో లక్ష్మణరావుగారు కుటుంబాన్ని మద్రాస్‌కు మార్చారు. మద్రాస్‌లో నివాసం వున్నప్పడే “దక్షిణ భారత సంఘ సంస్మరణ సమాజం” సభ్యులుగా చేరారు. ఈ సంఘాన్ని ఎస్‌. శ్రీనివాస అయ్యంగారు స్థాపించారు. వీరు సంస్కరణవాది. హరిజన విద్యకొరకు ఏర్పాటు చేసిన రాత్రి పాఠశాలలో లక్ష్మణరావుగారు పనిచేశారు కూడా.

విజ్ఞానశాస్త్రాలన్నీ సంస్కృతం, ఆంగ్లం భాషల్లో వుండడం వల్ల ఈ భాషలు తెలియని వారికి కూడా విజ్ఞాన శాస్తం అందుబాటులో వుండాలన్న మంచి ఉద్దేశంతో “విజ్ఞాన చంద్రికా గ్రంథ మండలి"ని 1906లో హైదరాబాద్‌లో స్థాపించారు. మునగాలరాజువారి ఇంట్లో లక్ష్మణరావు, హరి సర్వోత్తమరావు, రావిచెట్ల రంగారావు, అయ్యదేవర కాళేశ్వరరావు మొదలైనవారు సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు. సంపాదకుడుగా లక్ష్మణరావుగారు, కార్యదర్శిగా హరిసర్వోత్తమరావుగారు నియమితులయ్యారు. హైదరాబాద్‌ రెసిడెన్సీ బజార్లో ఈ మండలి కార్యాలయం వుండేది. మంచి లక్ష్యాలతో, ఆశయాలతో ఈ మండలి ప్రారంభమైంది. ప్రజల్ని చైతన్యవంతం చేయడం, స్వాతంత్రోద్యమం వైపు ప్రజల్ని నడిపించడం, అస్పృశ్యతా నివారణ, హరిజనాభివృద్ధి, స్త్రీవిద్య, స్త్రీ స్వాతంత్ర్యం, విజ్ఞాన విస్తరణ లాంటి ముఖ్యమైన లక్ష్యాలతో ఈ మండలి ముందుకు వెళ్ళాలని నిర్ణయించారు. అసలు విషయం ఏమంటే ఈ మండలి అభివృద్ధికి ఎవరూ ప్రతిఫలం ఆశించకూడదని ముక్తకంఠంతో అందరూ నిర్ణయం తీసుకున్నారు.

ఈ మండలి మొదటి గ్రంథంగా గాడిచర్ల హరిసర్వోత్తమరావు రాసిన “అబ్రహం లింకన్‌ చరిత్ర"ను ముద్రించింది. తర్వాత లక్ష్మణ రావుగారి “హిందూ మహాయుగం” ప్రచురించారు. డాక్టర్‌ ఆచంట లక్ష్మీపతి-జీవశాస్త్రం, వేలాల సుబ్బారావు-రాణీ సంయుక్త, కొమర్రాజువారి-మహమ్మదీయ మహాయుగం, మంత్రిప్రగడ సాంబశివ రావు-పదార్ధవిజ్ఞానశాస్త్రం, విశ్వనాథశర్మ-రసాయన శాస్త్రం, చిలుకూరి వీరభద్రరావు - ఆంధ్రుల చరిత్ర, భోగరాజు నారాయణమూర్తి-విమలాదేవి ఇలా అనేక గ్రంథాలు ఈ మండలి ద్వారా ప్రచురించ బడ్డాయి. తర్వాత ప్రకృతి శాస్త్రగ్రంథాలు వెలువడ్డాయి. ఉత్తను గ్రంథాల్ని మండలి ప్రచురించి, తెలుగు భాషా వ్యాప్తికి కృషి చేసింది.

లక్ష్మణరావుగారు 1910లో "విజ్ఞానచంద్రికాపరిషత్‌"ను స్థాపించారు. రచనలపోటీ పెట్టారు. ఆ పోటీలో నెగ్గినవారి గ్రంథాల్ని గ్రంథమండలి ప్రచురించింది. 1912 నుండి మండలి ప్రచురణలే పాఠ్య పఠనీయ గ్రంథాలుగా పరీక్షలు నిర్వహించటం ప్రారంభించారు. మొదటి బహుమతి పొందిన వారికి 116/- రూపాయలు మరియు బంగారుపతకం. రెండో స్థానం పొందిన వారికి యోగ్యతాపత్రం ఇచ్చారు. నాడు బహుమతి పొందినవారు కాంచనపల్లి కనకాంబ, పెంద్యాల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి, ఆదుర్తి భాస్కరమ్మ, నిడుదవోలు వేంకటరావుగార్లు.

ఆంగ్లంలోని బ్రిటీష్‌ ఎన్సైక్లోపీడియా పద్ధతిలో ఆంధ్రవిజ్ఞాన సర్వస్వం నిర్మాణం చేపట్టాలని రావుగారు సంకల్పించారు. 1915లో తెలుగు విజ్ఞాన సర్వస్వం రాయాలని పూనుకున్నారు. మూడు సంపుటాలు వెలువరించారు. వీరు ఈ మూడు సంపుటాల్లో విలువైన వ్యాసాల్ని రాశారు. భాషవిషయాల వ్యాసాలు 11, గణిత శాస్త్ర విషయాలు 2, ధర్మశాస్త్ర విషయాలు 9, జ్యోతిశ్శాస్త్ర విషయం 1, చరిత్రకు సంబంధించిన వ్యాసాలు 7, ప్రకృతి శాస్త్ర విషయాలు 2, కళా విషయం 1, రాజకీయ విషయం 11, తర్మశాస్త్ర విషయం 1, మొదలైన వ్యాసాలు ఆయా సంపుటాల్లో చోటు చేసుకున్నాయి. కొమర్రాజువారి ప్రతిభకు ప్రతిబింబం “విజ్ఞాన సర్వస్వం”.

ఇవి కాక రావుగారు అద్వైతం, అష్టాదశ పురాణాలు, పాణిని అష్టాధ్యాయి, అలంకారాలు, శృంగారం-పూర్వ లాక్షణికులు, అభిజ్ఞాన శాకుంతలం, అచ్చతెలుగు, అధర్వణవేదం మొదలగు వ్యాసాలు రాశారు. ఈ వ్యాసాల్ని “లక్ష్మణ రాయ వ్యాసావళి” అనే పేరుతో రెండు భాగాలుగా వెలువడ్డాయి. మొదటి భాగంలో 17, రెండో భాగంలో 5 వ్యాసాలు వున్నాయి. ఇందులోని కొన్ని వ్యాసాలు విజ్ఞాన సర్వస్వంలో కూడా వచ్చాయి.

లక్ష్మణరావుగారు, కాశీనాథుని నాగేశ్వరరావుగారు మంచి మిత్రులు. విజ్ఞాన సర్వస్వాన్ని నాగేశ్వరరావుగారే ప్రచురించారు. వారిద్దరి స్నేహానికి చిహ్నంగా విజ్ఞాన సర్వస్వం సహృదయ పాఠకుల ముందుకు వచ్చింది. విజ్ఞాన సర్వస్వం అంటే కొమర్రాజు లక్ష్మణ రావు, కొమర్రాజు లక్ష్మణరావు అంటే విజ్ఞానసర్వస్వం అనే పేరు లోకంలో స్థిరపడింది.

కొమగ్రాజువారు పరిశోధనా రంగంలో చెప్పకోదరగ్గ కృషి చేశారు. చరిత్ర, శాసనాలు, భాష, సాహిత్యం మొదలైన విషయాల్లో చాలాలోతుగా, నిశితంగా, ప్రామాణికంగా పరిశోధన చేశారు. ఇక విజ్ఞాన సర్వస్వ నిర్మాణం గూర్చి చెప్పనక్కరలేదు. రావుగారి రచనల్లో పరిశోధన దండిగా వుంది. విజ్ఞాన సర్వస్వంలోని ఆయన వ్యాసాలన్నీ పరిశోధన ఫలితాలే కానీ, అనుసరణలు, అనువాదాలు కావు. కొమర్రాజువారు పరిశోధనలో పరిపక్వం చెంది, పరాకాష్టకు చేరుకున్నారు.

నాగపూర్‌లో మెట్రిక్యులేషన్‌ చదువుతున్నపుడు ఒక ముసలి డాక్టర్‌ చిన్నపిల్లను పెళ్ళాడిన విషయాన్ని ఇతివృత్తంగా తీసుకొని “వృద్దభర్త-పడుచు భార్య” అనే ప్రహసనం రాశారు. ఈ ప్రహసనం మహారాష్ట్ర ప్రాంతంలో పెద్ద సంచలనాన్ని కలిగించింది. ఎఫ్‌.ఎ. చదువుచుండగా భార్య వియోగాన్ని గూర్చి మరాఠీ భాషలో “వియోగ గీతి” అనే పేరుతో గేయాన్ని రాశారు. అందులోని అనుభూతి సహజం గా వుండడం వల్ల చిన్నతనంలోనే భార్య వియోగం కలిగిందని కొందరు ఓదార్చడానికి ఇంటికి వచ్చారు. దీన్ని బట్టి ఆయన సృజనాత్మక సాహిత్య సృష్టి ఎలా వుంటుందో మనం అర్ధం చేసుకోవచ్చు. తెలుగులో వేరే పేర్లతో రావుగారు కథలు రాశారు. “క” రామానుజరావు అనే పేరుతో 'ఆంధ్ర పత్రిక" మొదటి ఉగాది సంచికలో “ఏబదివేల బేరము” అనే కథ అచ్చు అయింది. 'సావిత్రి' పత్రికలో “పుల్చాన్‌ బేగం”అనే కథ వెలువడింది.

రావుగారి గ్రంథాల్లోనూ, వ్యాసాల్లోనూ చాలా స్పష్టంగా పరిపూర్ణత, సాధికారిత, సప్రమాణత అనే మూడు లక్షణాలు కన్పిస్తాయి. రామాయణంలోని "పంచవటి” స్థల నిర్ణయం గూర్చి పండిత లోకంలో పెద్దచర్చ జరిగింది. వాదోపవాదాలు కూడా చోటుచేసుకున్నాయి. రావుగారు భద్రాచలం సమీపంలోని పర్ణశాలయే "వంచవటి" అని నిర్ధారించారు. అందరూ శభాష్‌ అన్నారు. వీరు రాసిన ఏకశిలా నగరము 'ఓరుగల్లే, చాళుక్యులు దాక్షిణాత్యులే, కృష్ణరాయలు నిదాన కాలము, యుద్దమల్లుని బెజవాడ శాసనం, త్రిలింగము నుండి తెలుగు పుట్టేనా లేక తెలుగు నుండి త్రిలింగము పుట్టేనా, మొదలైన వ్యాసాలు ప్రముఖుల ప్రశంసల్ని అందుకున్నాయి.

రావుగారు విద్యాభివృద్ధి పట్ల వితంతు పునర్వివాహాల పట్ల స్త్రీ స్వాతంత్ర్యంపట్ల ఎక్కువగా మొగ్గు చూపేవారు. తన కుమార్తెను యుక్తవయస్సు రాకముందే పెళ్ళి చేయాలన్న తన తల్లి మాటల్ని వ్యతిరేకించారు. అందుకే తల్లి కోపంతో ఇల్లువదలి కాశీ వెళ్ళిపోయింది. అయినా రావుగారు కూతురుకి చిన్నతనంలో పెళ్ళి చేయలేదు. అంతేకాదు కూతురిని విదేశాలకు చదువుకోసం పంపారు. తన రెండో మేనమామ గారిని వితంతు వివాహం చేసుకోవడానికి ప్రోత్సహించి అంతా తానే దగ్గర వుండి పెళ్ళి చేసిన సంఘ సేవకులు లక్ష్మణరావుగారు. కొమర్రాజువారు రాజకీయాల్లో బాలగంగాధర తిలక్‌ అభిమాని. రావుగారు స్వయంగా స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొనలేదు. అయితే స్వాతంత్రోద్యమానికి సహాయ సహకారాలందించారు. 1906లో కలకత్తాలో దాదాబాయి నౌరోజి అధ్యక్షతన సంపూర్ణ స్వాతంత్ర్య నినాదంతో జరిగిన కాంగ్రెస్‌ మహాసభలో నాయని వేంకట రంగరావు హరిసర్వోత్తమరావులతోపాటు తాను కూడా పాల్గొన్నారు. 1907లో నందిగామలో జరిగిన కృష్ణాజిల్లా కాంగైస్‌ మహాసభలో లాలాలజపతిరాయ్‌ మొదలైనవారిని అరెస్టు చేయటాన్ని ఖండిస్తూ ఉపన్యాసాలిచ్చారు. ఇదే సంవత్సరంలో దేశం అంతా పర్యటిస్తూ బిపిన్‌ చంద్ర పాలుకు స్వాగతమిచ్చిన వారిలో రావుగారు కూడా వున్నారు. 1908లో మద్రాసులో జరిగిన శివాజీ వర్ధంతి సభలో పాల్గొని రావుగారు మరాఠీ భాషలో ప్రసంగించారు.

గిడుగు, గురజాడ, కందుకూరి నడిపిన వ్యావహారిక భాషా ఉద్యమాన్ని లక్ష్మణరావుగారు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ కారణంగా ఎంతోమంది వ్యావహారిక భాషావాదులతో ఆనాడు తీవ్రమైన విమర్శలు ఎదుర్కోవలసి వచ్చింది.

తెలుగులో చరిత్ర, వైజ్ఞానిక గ్రంథాలులేని కొరతను తీర్చడానికి కంకణం కట్టుకున్న ఏకైక మహావిజ్ఞాని రావుగారు. విజ్ఞానాన్ని సమాజానికి అందించడంకోసం అనేక గ్రంథాల్ని ప్రచురించిన మహనీయులు లక్ష్మణరావుగారు. ఆయన ప్రతిభకు నిదర్శనంగా “కొమర్రాజు వేంకటలక్ష్మణరావు విజ్ఞానసర్వస్వ పీఠం”ను తెలుగు విశ్వవిద్యాలయం స్థాపించింది. వీరు రాసిన భాషా వ్యాసాలు 'తెలుగు భాషాతత్త్వం” గా వెలుగులోకి వచ్చింది.

తక్కిన వారితో పోల్చిచూసుకుంటే లక్ష్మణరావు గారిలో కొన్ని ప్రత్యేక లక్షణాలు చాలా స్పష్టంగా కన్పిస్తాయి. ఇతరులు స్పృశించని అనేక రంగాల్లో వీరు విశేషమైన కృషిచేశారు. విద్య, వైజ్ఞానిక శాస్త్ర వ్యాప్తి చరిత్ర, పరిశోధన అంశాల్లో రావుగారికి ప్రముఖ స్థానం వుంది. ఒక్క మాటలో చెప్పాలంటే కొమర్రాజువారు ఒక విజ్ఞాన సర్వస్వం.

తెలుగుప్రజల హృదయాల్లో సుస్థిరస్థానం సంపాదించుకున్న లక్ష్మణరావుగారు ఉబ్బసవ్యాధి కారణంగా 46 సంవత్సరాల వయస్సులోనే అంటే 1923 జూలై13 తేదిన పరమపదించారు. తక్కువ కాలం జీవించినా, తెలుగు సాహిత్యంలో మహోన్నతమైన స్థానాన్ని సంపాదించారు కొమర్రాజువారు.

“అనేక విషయాల్లో కొమర్రాజు వేంకట లక్ష్మణరావు ప్రథము డనవచ్చు. దక్షిణ భారతీయ భాషల్లో విజ్ఞాననర్వస్వ నిర్మాణ ప్రచురణల విషయంలో తెలుగుకు ప్రాధాన్యం సంపాదించిన వాడాయనే. స్వభాషలో న్వదేశ చరిత్రను రాసిన వారిలో యావద్దక్షిణ భారతంలో ఆయనే మొదటివాడు. గ్రంథాలయ స్థాపనలో శాసనాల సేకరణలో, ప్రచురణల్లో, మౌలిక సమాచారం మీద ఆధారపడి చరిత్ర పరిశోధన చేయటంలో, ఒక శాస్త్రీయ పద్ధతి వ్రకారం ప్రాచీన గ్రంథ పరిష్కరణ చేయడంలో, శాస్త్ర సాహిత్యపరికల్పినలో, పరిభాషా కల్పనలో, పాఠ్యగ్రంథ రచనలో, తెలుగువారి కాయన మార్గదర్శకుడు. ప్రాచీన లిపి శాస్త్రాన్ని తెలుగు వారికి నేర్పిన వాడాయనే ఆయన చిరస్మరణీయుడు”

- డా॥బూదరాజు రాధాకృష్ణ


స్పందన

పిట్టచూపు సరిగ్గా వుంది

జూన్‌ 2018 అమ్మనుడి సంచికలో పిట్టచూపు శీర్షికలో శ్రీ చలసాని నరేంద్ర విశ్లేషణ సమంజసంగా వుంది. రాష్ట్ర విభజనను ఏకపక్షంగా, ప్రజల మనోభావాలను తెలిసికోకుండా చేసినారని నాలుగేళ్లు గడిచినా ఇంకా నాయకులు అంటూనే ఉన్నారు అనీ ఇంకా ప్రజలను నాయకులు తప్పుదారి పట్టిస్తూనే ఉన్నారనీ రాశారు. ఈ విషయంపై మనం కొంత వెనక్కి వెళితే నాయకుల తీరు స్పష్టంగా తెలుస్తుంది.

1952లో పొట్టి శ్రీరాములుగారు ఆత్మార్పణం చేసినా, మద్రాస్‌ నగరం లేకుండానే, మరియు, బళ్లారి, కోలార్‌, హోసూరు, యానాం, తిరుత్తణి, గంజాం, బరంపురం, పర్లాకిమిడి పట్టణాలను కలుపుకోకుండా ఆదరాబాదరాగా అప్పటి మన నాయకులు ఆంధ్రరాష్ట్రం యేర్చాటైతే చాలు అని, మద్రాసు రాష్ట్రం నుండి విడిపోవడానికి ఒప్పుకున్నారు. 1766 నుండి 1953 వరకు అనగా (187) సంవత్సరాలు కలిసి ఉండి, విడిపోయేటప్పుడు ఆస్తులు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేస్తూ పంపకం చెయ్యాలని, తమవాటాను తమకు ఇవ్వాలని మద్రాసు, కేంద్ర ప్రభుత్వాలను అడుగలేదు. ఆంధ్రప్రదేశ్‌ను వేరుగా ఉంచుతూ 2014లో కేంద్రం నిర్ణయించినప్పుడు మాత్రం, ఆంధ్ర ప్రాంతం నాయకులు తమ వాటా జనాభా దామాషా ప్రకారం (58) శాతం పంచి యివ్వాలని అడిగి తీసుకున్నారు.

ఒక తెలుగురాజు మద్రాస్‌ ప్రాంతాన్ని (చెన్నపట్నం) ఆంగ్లేయులకు యిచ్చినాడు. అయినా మద్రాసు నగరాన్ని అడుగలేదు. వాటా గూడా అడుగలేదు - తమ తోటి తెలుగు వారైన తెలంగాణ వారి నుండి మాత్రం, వాటా తీసుకున్నారు! ఇదేమి న్యాయం - అక్కడొక న్యాయం, ఇక్కడ మరొక న్యాయమా?

రాయలసీమ నాయకుల ఒత్తిడికి తలొగ్గి కోస్తాంధ్ర నాయకులు కర్నూలును రాజధానిగా (1953)లో ఒప్పుకున్నారు - 1953లోనే విజయవాడ - గుంటూరు ప్రాంతంలో రాజధాని యేర్పాటు చేస్తే అనుకూలంగా ఉండేది.

ఆంధ్ర నాయకులు నాలుగేండ్లు గడిచినా ఇంకా విభజన గురించి తప్పుగా మాట్లాడడం ప్రజలను మభ్య పెట్టడానికే. పాడిందే పాటరా అన్నట్టు అదే పాట పాడుతున్నారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వ్యవసాయ, ఖనిజ సంపద మరియు సహజ వాయువు, సుదీర్ఘ కోస్తాతీరం, తెలివిగల కష్టపడేరైతులు ఉన్నారు. మంచి వ్యాపార దక్షతగల పెద్దలున్నారు. విద్యారంగంలో గూడా చాలా ప్రతిభావంతులు ఉన్నారు. నదులనీరు, డెల్టాప్రాంతం ఉన్నది. ఈ వనరులను సద్వినియోగం చేసుకుంటే రాష్ట్రం, దేశంలోనే అత్యధిక సంపదగల రాష్ట్రం అవుతుంది.

శ్రీ చలసాని నరేంద్ర వెలిబుచ్చిన అభిప్రాయంతో నేను సంపూర్ణంగా ఏకీభవిస్తున్నాను. వాస్తవాలను అంగీకరించడంలో నామోషి అక్కరలేదు. విభజన చట్టంలో ఉన్న అంశాలను కేంద్రంతో పోరాడి సాధించుకోవాలి. అధికార పక్షం, ప్రతిపక్షం పరస్పర ఆరోపణలు చేసుకుంటుంటే ప్రజల ముందు పలచనై పోతారు. కలిసికట్టుగా కేంద్రంతో పోరాడి మన హక్కులను, వనరులను సాధించుకోవాలి.

- కంచర్ల సత్యపాల్‌రెడ్డి 86864 86859

స్పందన : 41 పుట కూడా చూడండి.