అభినయ దర్పణము/హస్తానాం చతుర్వింశతినామ నిరూపణమ్
| కటకావర్ధనశ్చైవ కర్తరీ స్వస్తికాభిధః, | 426 |
| మత్స్యకూర్మవరాహాశ్చ గరుడోనాగబన్ధకః, | 427 |
| చతుర్వింశతిసంఖ్యాకా స్సంయుతాః కథితాఃకరాః, | |
తా. అంజలి, కపోతము, కర్కటము, స్వస్తికము, డోల, పుష్పపుటము, ఉత్సంగము, శివలింగము, కటకావర్ధనము, కర్తరీస్వస్తీకము, శకటము, శంఖము, చక్రము, సంపుటము, పాశము, కీలకము, మత్స్యము, కూర్మము, వరాహము, గరుడము, నాగబంధము, ఖట్వ, భేరుండము, అవహిత్థము అనునీయిరువదినాలుగుహస్తములు సంయుతహస్తములు.
గ్రం౦థాంతరే
| అసంయుతానాం సంయోగాత్సంయుతాఖ్యాభవంతితే. | 428 |
| తేషాముత్పత్తిరేవైషా యోజనీయా మతా బుధైః, | 429 |
తా. అసంయుతహస్తములసంయోగమువలన సంయుతహస్తము లవును. అసంయుతహస్తముల ఉత్పత్తియే సంయుతములకును కాని అధిదేవతలు వేరు వేరు.
౧. అంజలిహస్తలక్షణమ్
| పతాకతలయోర్యోగా దంజలిః కర ఈరితః, | |
వినియోగము:—
| దేవతాగురువిప్రాణాం నమస్కారే౽ప్యనుక్రమాత్. | 430 |
| కార్యశ్శిరోముఖోరస్సు వినియోజ్యో౽౦జలిః కరః, | |
తా. దేవతలకును, గురువులకును, బ్రాహ్మణులకును, నమస్కారము చేయఁటయందు ఈహస్తము చెల్లును. అందు దేవతలకు మ్రొక్కునపుడు శిరస్సునందును, గురువులకు మ్రొక్కునపుడు ముఖమునందును, బ్రాహ్మణులకు మ్రొక్కునపుడు రొమ్మునందును క్రమముగా నొప్పును.
గ్రంథాంతరస్థాంజలిహస్తలక్షణమ్
| పతాకహస్త తలయోస్సంశ్లేషో యత్రజాయతే. | 431 |
| తమాహురంజలింహస్తం క్షేత్రపాలో౽ధిదేవతా, | |
తా. రెండుపతాకహస్తముల అరచేతులు చేర్చి పట్టఁబడునెడ అంజలిహస్ తమవును. దీనికి అధిదేవత క్షేత్రపాలుఁడు.
వినియోగము:—
| ప్రణామే వినయేతాలఘాతేశమ్భునిరూపణే. | 432 |
| కిఙ్కరోమితి వదనేథ్యానేచా౽౦జలిరుచ్యతే, | |
తా. నమస్కరించుట, వినయముతో వంగుట, తాళము వేయుట, శివస్వరూపమును నిరూపించుట, కింకరుఁడ ననుట, ధ్యానము చేయుట వీనియందు ఈహస్తము చెల్లును.
2. కపోతహస్తలక్షణమ్
| కపోత స్సకరోజ్ఞేయ శ్శ్లిష్టమూలాగ్రపార్శ్వతః. | 433 |
తా. ముందు చెప్పిన అంజలిహస్తము మొదలుతుదలు పార్శ్వభాగములు చేరియుండునట్లు పట్టఁబడినయెడ కపోతహస్త మగును.
వినియోగము:—
| ప్రమాణ గురుసమ్భాషా వినయాఙ్గీ కృతిష్వయమ్, | |
తా. ప్రమాణము, పెద్దలతో మాటలాడుట, వినయము ఒప్పుకొనుట వీనియందు ఈహస్తము వినియోగించును.
గ్రంథాంతరస్థకపోతహస్తలక్షణమ్
| అంజలేరంతరం యత్ర జాయతే విరళీకృతమ్. | 434 |
| స భవేత కపోతాఖ్యశ్చిత్రసేనో౽ధిదేవతా, | |
తా. అంజలిహస్తముయొక్క అంతరము విరళముగా పట్టఁబడినయెడ కపోతహస్త మవును. దీనికి అధిదేవత చిత్రసేనుఁడు.
వినియోగము:—
| అంగీకారే నారికేళ పూగహింతాళపాళిషు. | 435 |
| కదళీకుసుమే శీతే వినతే వస్తుసంగ్రహే, | 436 |
తా. అంగీకారము, టెంకాయ, పోక, హింతాళము, ఆరఁటిపూవు, చలి, వినయము, వస్తువులను సంగ్రహించుట, సంపుటము, మాదీఫలము వీనియందు ఈహస్తము వినియోగపడును.
3. కర్కటహస్తలక్షణమ్
| అన్యోన్యస్యా౽న్తరే త్రా౽ఙ్గుళ్యోనిసృతహస్తయోః, | 437 |
తా. ముందుచెప్పిన కపోతహస్తమందు వ్రేలివ్రేలిసందునను వ్రేళ్లు చొప్పించి వెలికిఁగాని లోపలికిఁగాని చాఁచిపట్టఁబడునెడల కర్కటహస్త మగును.
వినియోగము:—
| సమూహ దర్శనేతుంద దర్శనే శఙ్ఖపూరణే, | 438 |
తా. గుంపును చూపుట, లావైనదానిని చూపుట, శంఖనాదము చేయుట, ఒడలువిరచుట, చెట్టుకొమ్మను వంచుట వీనియందు ఈహస్త ముపయోగించును.
గ్రంథాంతరస్థకర్కటహస్తలక్షణమ్
| ఊర్ణనాభాంగుళీరంధ్రసంశ్లేషే కర్కటోభవేత్, | 439 |
తా. ఊర్ణనాభహస్తముయొక్క వ్రేళ్లసందులందు రెండవచేతివ్రేళ్లను చొప్పించిపట్టినయెడ కర్కటహస్త మగును. దీనికి విష్ణువు అధిదేవత.
వినియోగము:—
| విలాపేజృమ్భణే ఘాతే కర్కటే శంఖపూరణే, | 440 |
తా. దుఃఖము, ఆవులింత, కొట్టుట, ఎండ్రకాయ, శంఖమును ఊదుట, స్త్రీలు మెటికలు విరుచుట వీనియందు ఈహస్తము వినియోగించును.
4. స్వస్తికహస్తలక్షణమ్
| పతాకయో స్సన్నియుక్త కరయోర్మణిబన్ధయోః, | 441 |
| భయవాదే వివాదేచ కీర్తనే స్వస్తికోభవేత్, | |
తా. రెండుపతాకహస్తములందలి మణికట్టులను జేర్చిపట్టినయెడ స్వస్తికహస్త మగును. ఇది మొసలిని దెలుపుట, భయముతో మాటలాడుట, వాదాడుట, పొగడుట వీనియందు ఉపయోగించును.
5. డోలాహస్తలక్షణమ్
| పతాకావూరుదేశస్థౌ డోలాహస్తో౽యముచ్యతే. | 442 |
| నాట్యారమ్భే ప్రయోక్తవ్య ఇతి నాట్యవిదోవిదుః, | |
తా. రెండుపతాకహస్తములను తొడమీఁదికి వ్రేలునట్లు పట్టినయెడ డోలాహస్త మగును. ఇది నాట్యారంభమందు వినియోగింపఁదగినది.
గ్రంథాంతరస్థడోలాహస్తలక్షణమ్
| పతాకౌ పార్శ్వగౌ డోలా భారతీతస్య దేవతా. | 443 |
| మోహమూర్ఛా మదాలస్య విలాసాదిషుకీర్తితః, | |
తా. పతాకహస్తములు ఇరు పార్శ్వములందు వ్రేలునట్లు పట్టఁబడినయెడ డోలాహస్త మగును. దీనికి దేవత సరస్వతి. ఇది మోహము, మూర్ఛ, మదము, ఆలస్యము, విలాసము మొదలగువానియందు వినియోగించును.
6. పుష్పపుటహస్తలక్షణమ్
| సంక్లిష్టౌ సర్పశీర్షౌ చేద్భవేత్పుష్పపుటఃకరః. | 444 |
తా. రెండుసర్పశీర్షహస్తములను మనికట్టు మొదటిచిటికెనవ్రేలివరకుగల ఆరచేతి అంచులయందుఁ జేర్చిపట్టినయెడ పుష్పపుటహస్త మగును.
వినియోగము:—
| నీరాజనవిధౌ బాలఫలాదిగ్రహణే తథా, | |
| బాలానాం శిక్షణేచా౽యముత్సంగో యుజ్యతేకరః. | 449 |
తా. కౌఁగిలింత, సిగ్గు, భుజకీర్తులు మొదలగువానిని జూపుట, బాలురను శిక్షించుట వీనియందు ఈహస్త ముపయోగించును.
గ్రంథాంతరస్థోత్సఙ్గహస్తలక్షణమ్
| అరాళౌ స్వస్తికస్కంధా వుత్సఙ్గస్తదధీశ్వరః, | 450 |
| అఙ్గీకారే చ శీతే చ సాధ్వర్థే కుచగోపనే, | 451 |
తా. అరాళహస్తములను స్వస్తికాకారముగాఁ జేర్చి పట్టునెడ ఉత్సంగహస్త మగును. దీనికి అధిదేవత గౌతముఁడు. ఇది సిగ్గు, కౌఁగిలింత, అంగీకారము, చలి, మేలనుట, చన్నులను కప్పుకొనుట మొదలగువానియందు వినియోగించును.
8. శివలింగహస్తలక్షణమ్
| వామే౽ర్ధచంద్రేవిన్యస్తః శిఖరశ్శివలింగకః, | 452 |
తా. ఎడమచేతి యర్ధచంద్రహస్తమందు శిఖరహస్త ముంచఁబడెనేని శివలింగహస్త మగును. ఇది శివలింగమును జూపుటయందు వినియోగించును.
9. కటకావర్ధనహస్తలక్షణమ్
| కటకాముఖయోః పాణ్యోస్స్వస్తికా న్మణిబంధయోః, | 453 |
తా. కటకాముఖహస్తములయొక్క మనికట్లు స్వస్తికముగాఁ జేర్చి పట్టఁబడునేని కటకావర్ధనహస్త మగును.
వినియోగము:—
| పట్టాభిషేకే పూజాయాం వివాహాశిషియుజ్యతే, | |
తా. పట్టాభిషేకము, పూజ, పెండ్లిదీవన వీనియందు ఈహస్తము వినియోగించును.
గ్రన్ధాంతరస్థకటకావర్ధనహస్తలక్షణమ్
| కటకావర్ధనాఖ్యస్స్యా త్స్వస్తికౌ కటకాముఖౌ. | 454 |
| తస్య దేవో యక్షరాజో భావజ్ఞైశ్చ నిరూపితః, | |
తా. కటకాముఖహస్తములను స్వస్తికములుగఁ బట్టినయెడల కటకావర్ధనహస్త మగును. దాని కధిదేవత యక్షరాజు.
వినియోగము:—
| వినియోగో విచారేచ శృఙ్ఞారే కోపసాంత్వనే. | 455 |
| జక్కిణీనటనే దండలాస్యేభవతి నిశ్చయే, | |
తా. విచారము, శృంగారము, కోపశాంతి, జక్కిణి అను ఆట, కోలాటము, నిశ్చయము వీనియందు ఈహస్తము వినియోగించును.
10. కర్తరీస్వస్తికహస్తలక్షణమ్
| కర్తరీ స్వస్తికాకారః కర్తరీ స్వస్తికోభవేత్. | 456 |
వినియోగము:—
| శాఖాసు చా౽ద్రిశిఖరే వృక్షేషుచ నియుజ్యతే, | |
తా. చెట్టుకొమ్మలు, పర్వతశిఖరము, వృక్షములు వీనియందు ఈహస్తము ఉపయోగించును.
11. శకటహస్తలక్షణమ్
| భ్రమరౌ మధ్యమాఙ్గుష్ఠ ప్రసారాచ్ఛ కటోభవేత్. | 457 |
| రాక్షసాభినయేచా౽యం నియోజ్యో భరతాదిభిః, | |
తా. రెండుభ్రమరహస్తములే బొటనవ్రేలిని నడిమివ్రేలిని చాఁచినయెడ శకటహస్త మగును. ఇది రాక్షసులు మొదలయినవారల యభినయమునందు చెల్లును.
12. శంఖహస్తలక్షణమ్
| శిఖరాన్తర్గతాఙ్గుష్ఠ ఇతరాఙ్గుష్ఠసంగతః. | 458 |
| తర్జన్యాద్యాస్తతః శ్లిష్టాశ్శంఖహస్తః ప్రకీర్తితః, | 459 |
తా. శిఖరహస్తమునందలి యంగుష్ఠముతో రెండవచేతి యంగుష్ఠమును జేర్చి తక్కినవ్రేళ్ళను ఆశిఖరహస్తము పైకి చేర్చినయెడ శంఖహస్త మగును. ఇది శంఖము మొదలైనవానియందు వినియోగించును.
13. చక్రహస్తలక్షణమ్
| యత్రార్ధచంద్రౌతిర్యఞ్చా వన్యోన్యతలసంస్పృశౌ, | 460 |
తా. అర్ధచంద్రహస్తములను అడ్డముగా రెండు అరచేతులను జేర్చి పట్టినయెడ చక్రహస్త మగును. ఇది చక్రమందు చెల్లును.
14. సమ్పుటహస్తలక్షణమ్
| కుఞ్చితాఙ్గుళయశ్చక్రే సమ్పుటః కరఈరితః, | |
తా. ముందుచెప్పిన చక్రహస్తము వ్రేళ్ళను ముడిచిపట్టినయెడ సంపుటహస్త మగును.
వినియోగము:—
| వస్త్వాచ్ఛాదే సమ్పుటేచ సమ్పుటః కరఈరితః. | 461 |
తా. వస్తువులను దాఁచుటయందును, సంపుటమందును హస్తము చెల్లును.
15. పాశహస్తలక్షణమ్
| సూచ్యానికుఞ్చితే శ్లిష్టే తర్జన్యౌపాశ ఈరితః, | |
తా. సూచీహస్తముల చూపుడువ్రేళ్ళను వంచి చేర్చిపట్టినయెడ పాశహస్త మగును.
వినియోగము:—
| అన్యోన్యకలహేపాశే శృంఖలాయాం నియుజ్యతే. | 462 |
తా. పరస్పరకలహమునందును, త్రాటియందును, సంకెలయందును ఈహస్తము చెల్లును.
16. కీలకహస్తలక్షణమ్
| కనిష్ఠే కుఞ్చితే శ్లిష్టే మృగశీర్షే తు కీలకః, | |
వినియోగము:—
| స్నేహే చనర్మాలాపేచ వినియోగో౽స్య సమ్మతః. | 463 |
తా. స్నేహమునందును, ప్రియవచనమునందును ఈహస్తము చెల్లును.
17. మత్స్యహస్తలక్షణమ్
| కరపృష్ఠోపరిన్యస్తో యత్రహస్తః పతాకికః, | 464 |
| ఏతస్య వినియోగస్తు మత్స్యార్థే సమతో భవేత్, | |
తా. పతాకహస్తములను ఒకటిమీఁద నొకటి చేర్చి చిటికెనవ్రేళ్లను బొటనవ్రేళ్లను కొంచెము పట్టినయెడ మత్స్యహస్త మగును. ఇది మత్స్యార్థమునందు చెల్లును.
18. కూర్మహస్తలక్షణమ్
| కుఞ్చితాగ్రాంగుళిశ్చక్రేత్యక్తాంగుష్ఠకనిష్ఠకః. | 465 |
| కూర్మహస్తస్సవిజ్ఞేయః కూర్మార్థే వినియుజ్యతే, | |
తా. చక్రహస్తము మొనవ్రేళ్లను వంచి, చిటికెనవ్రేలిని బొటనవ్రేలిని జాఁచిపట్టినయెడ కూర్మహస్త మగును. ఇది తాఁబేటియందు ఉపయోగించును.
19. వరాహహస్తలక్షణమ్
| మృగశీర్షేత్వన్యకరస్తేన శ్శ్లిష్టస్థితో యది. | 466 |
| కనిష్ఠాంగుష్ఠయోర్యోగాద్వరాహఃకరఈరితః, | 467 |
తా. మృగశీర్షహస్తమును ఒకటిమీఁద నొకటి చేర్చి చిటికెనబొటన వ్రేళ్ల నుకూడఁబట్టిన యెడ వరాహహస్త మగును. ఇది పందియందు వినియోగించును.
20. గరుడహ్తసలక్షణమ్
| తిర్యక్తలస్థితావర్ధచన్ద్రావంగుష్ఠయోగతః, | 468 |
తా. అర్ధచంద్రహస్తములు రెండును అడ్డముగా బొటనవ్రేళ్లచేరికతో పట్టఁబడినయెడ గరుడహస్త మగును. ఇది గరుడునియందు ఉపయోగించును.
21. నాగబన్ధహస్తలక్షణమ్
| సర్పశీర్షౌ స్వస్తికాచే న్నాగబంధ ఇతీరితః, | |
తా. రెండుసర్పశీర్షహ స్తములు స్వస్తికముగ పట్టఁబడినయెడ నాగబంధహస్త మగును.
వినియోగము:—
| ఏతస్య వినియోగస్తు నాగబంధే నియుజ్యతే. | 469 |
| భుజంగదమ్పతీభావే నికుఞ్జానాంచ దర్శనే, | 470 |
తా. పాముల పెనవంటి రతిబంధమందును, పాముల పెనయందును, పొదరిండ్ల జూపుటయందును, అథర్వణమంత్రమునందును ఈహస్తము చెల్లును.
22. ఖట్వాహ స్దలక్షణమ్
| చతురే చతురం న్యస్య తర్జన్యంగుష్ఠమోక్షతః, | 471 |
తా. చతురహస్తముపై చతురహస్తము నుంచి చూపుడువ్రేలిని బొటనవ్రేలిని చాఁచిపెట్టినయెడ ఖట్వాహస్త మగును. ఇది మంచము మొదలైనవానియం దుపయోగించును.
23. భేరుండహస్తలక్షణమ్
| మణిబన్ధకపిత్థాభ్యాం భేరుండకరఇష్యతే, | 472 |
తా. కపిత్థహస్తములు రెండును మనికట్టులతోఁ జేర్చి పట్టఁబడినయెడ భేరుండహస్త మగును. ఇది భేరుండపక్షిదంపతులయందు వినియోగించును.
24. అవహిత్థహస్తలక్షణమ్
| సోలపద్మౌవక్షసిస్థావవహిత్థకరోమతః, | |
తా. రెండు సోలపద్మహస్తములు ఱొమ్మున కెదురుగాఁ బట్టఁబడినయెడ అవహిత్థహస్త మగును.
వినియోగము:—
| శృఙ్గారనటనే చైవ లీలాకందుకధారణే. | 473 |
| కుచార్థేయుజ్యతీసో౽యమవహిత్థకరాభిధః, | |
తా. శృంగారనటనము, పుట్టచెండును పట్టుట, స్తనము వీనియందు ఈహస్తము వినియోగించును.
| ఏవం సంయుతహస్తానాం నామలక్షణమీరితమ్. | 474 |
గ్రంథాంతరస్థసంయుతహస్తాః
1. అవహిత్థహస్తలక్షణమ్
| హృదయాభిముఖౌ యత్ర శుకతుణ్డావధోగతౌ, | 475 |
తా. రెండుశుకతుండహస్తములు క్రిందుగ హృదయాభిముఖములుగఁ బట్టఁబడినయెడ అవహిత్థహస్త మగును. దీనికి అధిదేవత మార్కండేయుఁడు.
వినియోగము:—
| దుర్బలత్వే దేహకార్శ్యే కౌతుకే చ కృశే మతః, | |
తా. బలహీనత, దేహము చిక్కియుండుట, సంతోషము, చిక్కినది వీనియందు ఈహస్తము చెల్లును.
2. గజదన్తహస్తలక్షణమ్
| బాహుమధ్యగతౌ సర్పశీర్షౌ స్వస్తికతామితౌ. | 476 |
| యదిస్యాద్గజదంతో౽యం పరమాత్మా౽ధిదేవతా, | |
తా. సర్పశీర్షహస్తములు బాహుమధ్యమందు స్వస్తికముగఁ జేర్పఁబడినయెడ గజదంతహస్త మగును. దీనికి అధిదేవత పరమాత్మ.
వినియోగము:—
| స్తమ్భగ్రహే శిలోత్పాటే భారగ్రాహే నియుజ్యతే. | 477 |
తా. స్తంభమును గ్రహించుటయందును, రాతిని పెల్లగించుటయందును, భారమును వహించుటయందును ఈహస్తము చెల్లును.
3. చతురశ్రహస్తలక్షణమ్
| చతురశ్రస్స్మృతోవక్షః పురోగౌ కటకాముఖౌ, | 478 |
తా. రొమ్మున కెదురుగ కటకాముఖహస్తములను బట్టినయెడ చతురహస్త మగును. దీనికి అధిదేవత వారాహి.
వినియోగము:—
| నియోగో దదిమన్థానే జక్కిణీ నటనే౽పిచ | 479 |
| వహనే మౌక్తికాదీనాం రజ్జ్వాదీనాఞ్చకర్షణే, | 480 |
| వీజనే చామరాదీనాం చతురశ్రోనియుజ్యతే, | |
తా. పెరుగు చిలుకుట, జక్కిణియను ఆట, ధరించుట, పాలు పిదుకుట, వస్త్రములను కప్పుకొనుట, ముత్యములు మొదలగువానిని ధరించుట, త్రాడు మొదలగువానిని ఈడ్చుట, పోకముడి, రవికముడి, పువ్వులు మొదలగువానిని ధరించుట, వింజామరము మొదలగువానిని వీచుట వీనియందు ఈహస్తము వినియోగించును.
4. తలముఖహస్తలక్షణమ్
| వక్షఃపురస్తాదుద్వృత్తౌ కరౌత్వభిముఖౌ యది. | 481 |
| నామ్నాతలముఖస్త్వస్య విఘ్నరాజో౽ధి దేవతా, | |
తా. రొమ్మున కెదురుగ పతాకహస్తములను మీఁది కెత్తిపట్టినయెడ తలముఖహస్త మగును. దీనికి అధిదేవత విఘ్నేశ్వరుఁడు.
వినియోగము:—
| ఆలిఙ్గనే స్థూలవస్తౌ మహాస్తమ్భాదిభావనే. | 482 |
| బుధైరభిహితో మఞ్జుమర్దళే మధురస్వనే, | |
తా. ఆలింగనము, పెద్దవస్తువు, గొప్పస్తంభములను జూపుట, మనోజ్ఞమయిన ధ్వనిగలమద్దెల వీనియందు ఈహస్తము చెల్లును.
5. స్వస్తికాహస్తలక్షణమ్
| త్రిపతాకౌ వామభాగే యది స్వస్తికతాం గతౌ. | 483 |
| స భవేత్స్వస్తికాహస్తో గుహస్తస్యా౽ధిదేవతా, | |
తా. త్రిపతాకములు ఎడమతట్టు స్వస్తికాకారముగాఁ బట్టఁబడినయెడ స్వస్తికహస్త మగును. వీనికి అధిదేవత గుహుఁడు.
వినియోగము:—
| కల్పద్రుమేషు శైలేషు హస్తో౽యం వినియుజ్యతే. | 484 |
తా. కల్పవృక్షములయందును పర్వతములయందును ఇది వినియోగించును.
6. ఆవిద్ధవక్రహస్తలక్షణమ్
| పతాకహస్తౌవ్యావృత్తౌ సవిలాసం సకూర్పరమ్, | 485 |
తా. రెండుపతాకహస్తముల మోచేతులను విలాసముతోఁ గూడుకొనునట్లు విరివిగాఁ బట్టినయెడ ఆవిద్ధవక్రహస్త మగును. దీనికి అధిదేవత తుంబురుఁడు.
వినియోగము:—
| మేఖలావహనే భేదే మధ్యకార్శ్యనిరూపణే, | 486 |
7. రేచితహస్తలక్షణమ్
| హంసపక్షౌ కృతోత్తాన తలావగ్రధృతౌయది, | 487 |
తా. రెండుహంసపక్షహస్తములను అరచేయి మీఁదుచేసి పట్టినయెడ రేచితహస్త మగును.
వినియోగము:—
| శిశూనాం ధారణే చిత్రఫలకస్య నిరూపణే, | 488 |
తా. బిడ్డలను ఎత్తుకొనుట, చిత్తరువుపలకను చూపుట మొదలగువానియందు ఈహస్తము చెల్లును.
8. నితమ్బహస్తలక్షణమ్
| ఉత్తానితావధోవక్త్రౌ పతాకా వంసదేశతః, | 489 |
తా. రెండుపతాకహస్తములను మూపులు మొదలుకొని క్రిందుమొగముగా పిరుఁదులు తాఁకునట్టు పట్టినయెడ నితంబహస్త మగును. దీనికి అధిదేవత అగస్త్యుఁడు.
వినియోగము:—
| శ్రమే౽వతరణేచైవ విస్మయే వివశాయితే, | 490 |
9. లతాహస్తలక్షణమ్
| పతాకౌ డోలికాకారౌ లతాఖ్య శ్శక్తిదేవతః, | |
తా. రెండుపతాకహస్తములను డోలాకారముగఁ బట్టినయెడల లతాహస్త మవును. దీనికి అధిదేవత శక్తి.
వినియోగము:—
| ఏతస్య వినియోగశ్చ నిశ్చేష్టాయాం మదాలసే. | 491 |
| స్వభావనటనారమ్భే రేఖాయాం యోగభావనే, | 492 |
తా. చేష్టలు లేకయుండుట, మదాలస్యము, స్వభావనటనము, రేఖ, యోగభావనము మొదలయినవానియందు ఈహస్తము చెల్లును.
10. పక్షవఞ్చితహస్తలక్షణమ్
| వినస్యా౽గ్రే కటీశీర్షే త్రిపతాకకరౌ యది, | 493 |
తా. రెండు త్రిపతాకహస్తములను ముందుగా నడుముమీఁదికి ఎగఁబట్టినయెడ పక్షవంచితహస్త మగును. దీనికి అధిదేవత అర్జునుఁడు.
వినియోగము:—
| ఊర్వోరభినయేభేదే వినియోగో నియుజ్యతే, | |
తా. తొడలయభినయమందును భేదమందును ఈహస్తము చెల్లును.
11. పక్షప్రద్యోతహస్తలక్షణమ్
| ఉత్తానితావిమౌ పక్షప్రద్యోతః సిద్ధదేవతః. | 494 |
తా. ఈపక్షవంచితహస్తము మరికొంచెము ఎగఁబట్టఁబడినయెడ ప్రద్యోతహస్త మవును. దీనికి సిద్ధుఁడు అధిదేవత.
వినియోగము:—
| నిరుత్సాహే బుద్ధిజాడ్యే విపరీతనిరూపణే, | 495 |
తా. ఉత్సాహములేమి, బుద్ధిమాంద్యము, విపరీతమును నిరూపించుట, మాయావరాహము, కుండాభినయము మొదలగువానియందు ఈహస్తము చెల్లును.
12. గరుడపక్షహస్తలక్షణమ్
| అర్ధచంద్రౌ కటీపార్శ్వేన్యస్యోర్ధ్వంసారితౌయది, | 496 |
తా. రెండు అర్ధచంద్రహస్తములు నడుముప్రక్కలను ఎగఁబట్టఁబడినయెడ గరుడపక్షహస్త మగును. దీనికి అధిదేవత సనందనుఁడు.
వినియోగము:—
| కటిసూత్రే౽ధికేచైవ ఏవమాదిషుయుజ్యతే, | |
తా. మొలనూలు, అధికము మొదలైనవానియందు ఈహస్తము చెల్లును.
13. నిషేధహస్తలక్షణమ్
| కపిత్థాఖ్యేన హస్తేన వేష్టితో ముకుళో యది. | 497 |
| నిషేధోనామచభవేత్తుమ్బురుస్త్వధిదేవతా, | |
వినియోగము:—
| సిద్ధాన్తస్థాపనే సత్యే నూనమిత్యభిభాషణే. | 498 |
| చూచుకగ్రహణే లిఙ్గపూజాయాం వినియుజ్యతే, | |
తా. సిద్ధాంతస్థాపనము, నిజము, నిశ్చయము చేయుట, చనుమొనలను అంటుట, లింగపూజ వీనియందు ఇది వినియోగించును.
14. మకరహస్తలక్షణమ్
| యత్రా౽న్యోన్యం పరిగతావర్ధచంద్రావధోముఖౌ. | 499 |
| చలాఙ్గుష్ఠేనమకరో మహేంద్రస్తస్య దేవతా, | |
తా. రెండు అర్ధచంద్రహస్తములను జేర్చి దిగుమొగముగా బొటనవ్రేళ్లను కదలించిపట్టినయెడ మకరహస్త మవును. దీనికి అధిదేవత ఇంద్రుఁడు.
వినియోగము:—
| కూలంకషే నదీపూరే సింహే దైత్యే మృగాననే. | 500 |
| కల్యాణే నిబిడే మఞ్చే నక్రేచా౽యం నియుజ్యతే, | |
తా. గట్టునొరయు, ఏటివెల్లువ, సింహము, అసురుఁడు, మృగముయొక్క మొగము, బంగారు లేక పెండ్లి, నిండినది, మంచె, మొసలి వీనియందు ఈహస్తము వినియోగించును.
15. వర్ధమానహస్తలక్షణమ్
| అధోముఖౌ హంసపక్షౌ యస్మిన్నన్యోన్యమున్ముఖౌ. | 501 |
| సవర్ధమానో భవతి వాసుకి స్తస్య దేవతా, | 502 |
తా. అధోముఖములయిన హంసపక్షహస్తములను పరస్పర మభిముఖ ములుగాఁ బట్టినయెడ వర్ధమానహస్త మవును. దీనికి అధిదేవత వాసుకి. ఇది నృసింహస్వామి. అతని తేజస్సు, హిరణ్యకశిపుని రొమ్మును చీల్చుట వీనియందు చెల్లును.
19. ఉద్వృత్తహస్తలక్షణమ్
| అధరోత్తరయో రేక సమయే హంసపక్షయోః, | 503 |
తా. ఒకేసమయమందు క్రిందుమీఁదులుగ హంసపక్షహస్తములు పట్టఁబడినయెడ ఉద్వృత్తహస్త మవును. దీనికి అధిదేవత వాసిష్ఠమహర్షి.
వినియోగము:—
| లజ్జాయాముపమార్థేచ సంతాపే కంటకాదిషు, | 504 |
తా. సిగ్గు, సాదృశ్యము, సంతాపము, ముల్లు మొదలయినది, భేదము, భయము, చింత వీనియందు ఈహస్తము వినియోగించును.
17. విప్రకీర్ణహస్తలక్షణమ్
| స్వస్తికః శీఘ్రవిశ్లేషాత్ విప్రకీర్ణస్స ఉచ్యతే, | 505 |
| చేలాఞ్చలస్యవిస్రంసే సయుజ్యేత విధూననే, | |
18. అరాళకటకాముఖహస్తలక్షణమ్
| అరాళకటకౌ హస్తౌ అరాళ కటకాముఖః. | 506 |
తా. అరాళహస్త కటకాముఖహస్తములను స్వస్తికాకారముగఁ బట్టినయెడ అరాళకటకాముఖహస్త మవును. దీనికి అధిదేవత వామనుఁడు.
| తాంబూలదళ ఖండానాం దానే చింతావిషాదయోః. | 507 |
| వినియోజ్యఇతిప్రోక్తః అరాళకటకాముఖః, | |
తా. ఆకుమడుపులు వక్కపలుకులు నిచ్చుట, చింత, విషాదము వీనియందు ఈహస్తము చెల్లును.
19. సూచ్యాస్యహస్తలక్షణమ్
| సూచీముఖౌ పురోదేశాద్యుగపత్పార్శ్వగామినౌ. | 508 |
| సూచ్యాస్య ఇతివిజ్ఞేయః అధిదేవో౽స్యనారదః, | |
తా. సూచీహస్తములను ఎదుటనుండి పార్శ్వములకు ఒకటిగా చేరఁబట్టినయెడ సూచ్యాస్యహస్త మగును. దీనికి అధిదేవత నారదుఁడు.
వినియోగము:—
| కింకరోమీతి వచనే విరహే సకలార్థకే. | 509 |
| విలోకయేతి వాక్యేచ సూచ్యాస్యాభినయంవిదుః, | |
తా. ఏమి చేయుదు ననుట, విరహము, సమస్త మనుట, చూడు మనుట వీనియందు ఈహస్తము చెల్లును.
20. అర్ధరేచితహస్తలక్షణమ్
| ఏకాంత్వధోముఖం ధృత్వా తౌ హస్తావథరేచితే. | 510 |
| అర్ధరేచితనామానౌ నందికేశో౽ధిదేవతా, | |
తా. రేచితహస్తమందలి యొకహంసపక్షహస్తమును అధోముఖముగఁ బట్టినయెడ అర్ధరేచితహస్త మవును. దీనికి అధిదేవత నందికేశుఁడు.
వినియోగము:—
| ఆవాహేచోపదాదీనాం కార్యగుప్తా విమౌ మతౌ. | 511 |
తా. ఆవాహనము కానుక మొదలగునది, కార్యమును మరుగుచేయుట వీనియందు ఈహస్తము చెల్లును.
21. కేశబద్ధహస్తలక్షణమ్
| పతాకౌస్యాత్కేశబంధః తస్యదుర్గా౽ధిదేవతా, | 512 |
తా. రెండు పతాకహస్తములు కేశబంధహస్త మగును. దీనికి అధిదేవత దుర్గ . ఇది రత్నస్తంభము, కొప్పు, చెక్కిళ్లు మొదలయినవానియందు వినియోగించును.
22. ముష్టిస్వస్తికహస్తలక్షణమ్
| ముష్టిహస్తౌ స్వస్తికతాం కుక్షి స్థానే గతౌ యది, | 518 |
తా. కడుపుమీఁదుగా ముష్టిహస్తములను స్వస్తికములుగఁ బట్టినయెడ ముష్టిస్వస్తికహస్త మగును. దీనికి అధిదేవత కింపురుషుఁడు.
వినియోగము:—
| క్రీడాకందుకసంధానే ద్వంద్వయుద్ధ నిరూపణే, | 514 |
తా, చెండాడుట, ద్వంద్వయుద్ధము, మిక్కిలి సిగ్గు, పోకముడి వీనియందు ఈహస్తము వినియోగించును.
23. నళినీపదకోశహస్తలక్షణమ్
| వ్యావర్తితౌ పద్మకోశౌ యది స్వస్తికతాం గతౌ, | 515 |
తా. పద్మకోశహస్తములను వెనుకకు త్రిప్పి స్వస్తికములుగఁ బట్టినయెడ నళినీపద్మకోశహస్త మగును. దీనికి అధిదేవత ఆదిశేషుఁడు.
వినియోగము:—
| నాగబంధే చ ముకుళే సమయోర్దానకర్మణి, | 516 |
తా. నాగబంధము, మొగ్గ, సమముగ నిచ్చుట, పూవుగుత్తి, పది యనుట, గండభేరుండపక్షి వీనియందు ఈహస్తము వినియోగించును.
24. ఉద్వేష్టితాలపద్మహస్తలక్షణమ్
| ఉద్వేష్టిత క్రియావంతౌ వక్షసో౽ గ్రే౽లపల్లవౌ, | 517 |
తా. అలపల్లవహస్తములను చుట్టుకోఁబడినవి అగునట్లు రొమ్మున కెదురుగాఁ బట్టినయెడ ఉద్వేష్టితాలపద్మహస్త మగును. దీనికి అధిదేవత శక్తి.
వినియోగము:—
| ప్రాణేశే దీనవచనే స్తనయోర్వికచాంబుజే, | 518 |
| కామితార్థ ప్రకరణే ఏతేషు వినియుజ్యతే, | |
తా. ప్రాణనాథుఁడు, దీనవచనము, స్తనములు, వికసించినకమలము, మోహితురాల నైతి ననుట, ప్రలాపమును నిరూపించుట, కోరినను తెలియఁజేయుట మొదలైనవానియందు ఈహస్తము వినియోగించును.
25. ఉల్బణహస్తలక్షణమ్
| తౌ నేత్ర దేశగాపుల్బణాభ్యో విఘ్నేశ దేవతః. | 519 |
| స్తబకేషు విశాలేషు నేత్రేషు చ నిరూపితః, | |
తా. ఆయలపద్మహస్తములే కంటికెదురుగఁ బట్టఁబడినయెడ ఉల్బణహస్త మౌను. దీనికి అధిదేవత విఘ్నేశుఁడు. ఇది పూగుత్తులయందును, విశాలములైన కన్నులందును వినియోగించును.
26. లాలితహస్తలక్షణమ్
| స్వస్తికాకరణావేతౌ శిరోదేశే౽లపల్లవౌ. | 520 |
| లాలితో గదితావేతౌ దేవతా వైష్ణవీ మతా, | 521 |
తా. అలపల్లవహస్తములను తలమీఁద స్వస్తికాకారముగ పట్టినయెడ లాలితహస్త మౌను. దీనికి అధిదేవత వైష్ణవి. ఇది మద్ది, మ్రాను, శత్రువులకు చొరరానికోట, కొండ వీనియందు వినియోగించును.
గ్రంథాంతరే
1. విప్రకీర్ణహస్తలక్షణమ్
| హస్తౌ తు త్రిపతాకాఖ్యౌ తిర్యక్కూర్పరసంయుతౌ, | 522 |
తా. రెండు త్రిపతాకహస్తముల మోచేతులను అడ్డముగాఁ గూడఁబట్టినయెడ విప్రకీర్ణహస్త మగును.
వినియోగము:—
| కవచేచ కరన్యాసే మంత్రావాహే క్షమాగుణే, | 523 |
తా. కవచము, కరన్యాసము, మంత్రావాహనము, క్షమాగుణము, విచారము వీనియందు ఈహస్తము వినియోగించును.
2. గజదంతహస్తలక్షణమ్
| కరాభ్యాం శిఖరౌ ధృత్వా కనిష్టే ప్రసృతే యది, | 524 |
తా. రెండుశిఖరహస్తములును చిటికెనవ్రేళ్లు చాఁచిపట్టఁబడినయెడ గజదంతహస్త మవును.
వినియోగము:—
| జలావగాహే ద్విరదదంతయోర్భూమిమానయోః, | 525 |
తా. నీళ్లయందు మునుఁగుట, ఏనుఁగుకొమ్ములు, భూమిమానము, శంకుస్థాపనము చేయుట వీనియందు ఈహస్తము వినియోగించును.
3. తాలముఖహస్తలక్షణమ్
| కరౌ పతాకనామానౌ అన్యోన్యాభిముఖీకృతౌ, | 526 |
వినియోగము:—
| భుజఙ్గసూక్ష్మనాట్యేచ ముఖనాట్యేచ మేళనే, | 527 |
తా. భుజంగనాట్యము, ముఖనాట్యము, కూడిక, గ్రహించుట, లావైనపదార్థము వీనియందు ఈహస్తము చెల్లును.
4. సూచీవిద్ధహస్తలక్షణమ్
| అన్యోన్యమభిసంస్పృష్టా సూచీవక్త్రాభిధౌ కరౌ, | 528 |
తా. రెండు సూచీముఖహస్తములు ఎదురెదురుగ జేరఁబట్టఁబడునెడ సూచీవిద్ధహస్త మగును.
వినియోగము:—
| హల్లీసలీనాభినయే లగ్నార్థే మేళనేదృఢే, | 529 |
౫. పల్లవ తా. కోలాటమునందలికలగలుపు, చేరిక, గట్టిది, రెండుకొమ్మలచేరిక వీనియందు ఈహస్తము చెల్లును.
5. పల్లవహస్తలక్షణమ్
| పతాకౌ మణిబంధేతు చలితా చేదధోముఖౌ, | 530 |
వినియోగము:—
| ఫలపుష్పాతిభారేణ నమ్రశాఖానులమ్బనే, | 531 |
తా. పుష్పఫలాదులచే వంగినకొమ్మల వ్రేలాడుట, వంగుట వీనియందు ఈహస్తము చెల్లును.
6. నితమ్బహస్తలక్షణమ్
| అంసదేశం సమారభ్య నితమ్బానధిచాలితౌ, | 532 |
తా. రెండు పతాకహస్తములు మూపులు మొదలుకొని పిరుఁదులదాఁక ప్రక్కలలో కదలుచుండునట్లు బట్టఁబడినయెడ నితంబహస్త మవును.
వినియోగము:—
| పరివేషేచ సూర్యేన్ద్వో రఙ్గ లావణ్యదర్శనే, | 533 |
| పార్శ్వసౌందర్యభావేచ నితమ్బాఖ్య కరోభవేత్, | |
తా. సూర్యచంద్రుల పరివేషము, చక్కదనము, ప్రాకారము, దేవతాదుల వేషము, భ్రమించుట, ప్రక్కల చక్కదనము వీనియందు ఈహస్తము చెల్లును.
7. కేశబంధహస్తలక్షణమ్
| ఏతావేవ నితమ్బాది కేశపర్యంతచాలితౌ. | 534 |
| యదీస్యాత్కేశబంధాఖ్య కరస్సమ్యఙ్నిరూప్యతే, | |
తా. ముందు చెప్పిన పతాకహస్తములే పిరుఁదులు మొదలు తల వెండ్రుకలదాఁక చలింపఁజేయుచు పట్టఁబడినయెడ కేశబంధహస్త మగును.
వినియోగము:—
| వృక్షద్వయే౽ధికేమేరో రర్ధేబహు విభావనే. | 535 |
| ఉత్తిష్టేతివచోభావే యుజ్యతే కేశబంధకః, | |
తా. రెండువృక్షములు, అధికము, మేరుపర్వతము, చాలా అనుట, లెమ్ము అనుట వీనియందు ఈహస్తము చెల్లును.
8. లతాహస్తలక్షణమ్
| అలపద్మావగ్రభాగ ప్రశ్రితౌ చలితౌ యది. | 536 |
| లతాహస్తస్సవిజ్ఞేయః ప్రోక్తో నాట్యవిశారదైః, | |
తా. రెండు అలపద్మహస్తములు ఎదురెదురుగ చలించునట్లు పట్టఁబడినయెడ లతాహస్త మౌను.
వినియోగము:—
| భ్రమరాభిధనాట్యేచ వాయోశ్చలితకోరకే. | 537 |
| లతాయాం పుష్పితాయాంచ స్తబకాచలనే౽పిచ, | 538 |
తా. భ్రమరనాట్యము, గాలిచేఁగదలెడిమొగ్గ, పూదీఁగ, పూగుత్తుల కదలిక, చెండు వీనియందు ఈ హస్తము చెల్లును.
9. ద్విరదహస్తలక్షణమ్
| పతాకనామ్నాహస్తేన స్కంధదేశే నివేశ్యచ, | 539 |
| సమౌ ధృతౌ చేద్ద్విరదహస్తో౽యం పరికీర్తితః, | |
తా. ఎడమచేత పతాకహస్తమును, కుడిచేత అధోముఖముగ పద్మకోశహస్తమును సమముగఁ బట్టఁబడినయెడ ద్విరదహస్త మవును.
వినియోగము:—
| గజస్య శుండాభినయే గజవక్త్రప్రదర్శనే. | 540 |
| యుజ్యతే కరిహస్తో౽సౌ నరహస్తానుసారతః, | |
తా. ఏనుఁగుతొండమునందును, విఘ్నేశ్వరుని జూపుటయందును, ఈహస్తము చెల్లును.
10. ఉద్ధృతహస్తలక్షణమ్
| ఊరసోగ్రే హంసపక్షావన్యోన్యాభిముఖీకృతౌ. | 541 |
| భవేదుద్ధృతహస్తో౽యం వినియోగో౽స్యకథ్యతే, | |
తా.రొమ్మున కెదురుగ హంసపక్షహస్తములను ఎదురెదురుగఁ జేర్చిపట్టినయెడ ఉద్ధృతహస్త మవును.
వినియోగము:—
| ఆవర్తేత్వవ్యథాత్యర్ధే భావనాయాం స్వరూపకే. | 542 |
| స్ధిరోభవేతి వచనే డోలాయాం స్థూలకే౽పిచ, | 543 |
తా. నీటిసుడి, అధికము, తలఁపు, స్వరూపము, స్థిరుడవు అగుమనుట, ఉయ్యాల, పెద్దది, ఇల్లు, ప్రకృతార్థము వీనియందు ఈహస్తము చెల్లును.
11. సంయమహస్తలక్షణమ్
| తర్జనీ మధ్యమౌ హస్తతలేనమ్రీకృతౌ యది. | 544 |
| ఇతరౌ ప్రసృతౌసో౽యం కరస్సంయమనామకః, | |
తా. చూపుడువ్రేలిని నడిమివేలిని అరచేతితట్టు వంచి తక్కినవ్రేళ్ళను చాఁచిపట్టినయెడ సంయమహస్త మవును.
వినియోగము:—
| ప్రాణాయామే మహాయోగే యుజ్యతేచా౽ర్యభావనే. | 545 |
తా. ప్రాణాయామము, యోగాభ్యాసము, పూజ్యలు అనుట వీనియందు హస్తము చెల్లును.
12. ముద్రాహస్తలక్షణమ్
| కరయోర్మధ్యమాఙ్గుష్టే యోగాన్ముద్రా కరోభవేత్, | |
తా. రెండుచేతుల నడిమివ్రేళ్ళను బొటనవ్రేళ్ళను జేర్చిపట్టినయెడ ముద్రాహస్త మవును.
వినియోగము:—
| అణౌ తృణే గోముఖేచ త్రోటీపుట నిదర్శనే. | 546 |
| ముద్రాహస్తోయుజ్యతే౽సౌ భరతాగమకోవిదైః, | |
తా. అణువు, గడ్డిపోచ, ఆవు మోర, పక్షి ముక్కు వీనిని జూపుటయందు ఈహస్తము చెల్లును.
13. అజాముఖహస్తలక్షణమ్
| సింహాననాభిధకరే తర్జనీచ కనిష్ఠికా. | 547 |
| మధ్యమానామికాపృష్టే యోగాద్భూయాదజాముఖః, | |
వినియోగము:—
| అజాదికానాం వక్త్రేషు నిర్విషాణ ముఖేషుచ. | 548 |
| గజకుంభే మల్లయుద్ధే అజావక్త్రో నియుజ్యతే, | |
తా. మేఁక మొదలైన జంతువులమోరలందును, కొమ్ములు లేనిజంతువుల ముఖములందును, ఏనుఁగు కుంభస్థలమునందును, జెట్టిపోట్లాటయందును ఈహస్తము చెల్లును.
14. ఆర్ధముకుళహస్తలక్షణమ్
| లాఙ్గూలాఖ్యకరే సమ్యక్కనిష్ఠా వక్రితా యది. | 549 |
| ప్రోక్తో౽ర్ధ ముకుళాఖ్యో౽సౌ భరతాగమవేదిభిః, | |
తా. లాంగూలహస్తపుచిటికెనవ్రేలు బాగుగ వంపఁబడినయెడ అర్ధముకుళహస్త మగును.
వినియోగము:—
| లికుచేశీలభావేచా ౽ప్యుచితే౽పి కుచే౽పిచ. | 550 |
| లోభే ముకుళపద్మే చ కరణే వినియుజ్యతే, | |
తా. గజనిమ్మపండు, మంచిస్వభావము, ఉచితము, కుచము, లోభము, తామరమొగ్గ, ఉపకరణము వీనియందు ఈహస్తము వినియోగించును.
15. రేచితహస్తలక్షణమ్
| అలపద్మకరౌ యత్ర శ్లిష్టౌ పార్శ్వప్రసారితౌ. | 551 |
| తత్తత్ప్రయోగకుశలైః రేచితో౽యం నిరూప్యతే, | |
వినియోగము:—
| చారీయే పార్శ్వనటనే నారికేళే ప్రలాపకే. | 552 |
| సర్వనాట్యేషు వేళాయాం యుజ్యతే రేచితఃకరః, | |
తా. చారీనాట్యమునందును, పార్శ్వనాట్యమునందును, టెంకాయయందును, ప్రలాపమునందును, ఎల్లనాట్యసమయములయందును ఈహస్తము చెల్లును.
16. కుశలహస్తలక్షణమ్
| అన్యోన్యాభిముఖావర్ధచంద్రౌ కుశలసంజ్ఞకః. | 553 |
| భూచారే నయనే పూర్ణవస్తునిర్దేశభావనే, | 554 |
తా. అర్ధచంద్రహస్తములను ఎదురెదురుగ పట్టినయెడ కుశలహస్త మౌను. ఇది భూసంచారము, నేత్రము, పూర్ణవస్తువులు నిర్దేశించుట, నీటిలో మునుఁగుట, తామరపూవు వీనియందు చెల్లును.
17. పక్షవఞ్చితహస్తలక్షణమ్
| కటిదేశగతావేతౌ పక్షవఞ్చితకో భవేత్, | 555 |
| పక్షవఞ్చితహస్తో౽యం యుజ్యతే౽త్ర పురాతనైః, | |
18. తిలకహస్తలక్షణమ్
| త్రిపతాకాభిధౌహస్తా లలాటే హృదయే స్థితౌ. | 556 |
| తిలకాభిధహస్తో౽యం కీర్తితో భావవేదిభిః, | 557 |
| తిలకాభిధహస్తో౽యం కీర్తితో భావవేదిభిః, | |
తా. త్రిపతాకహస్తములను నొసటను రొమ్మునందును నుంచినయెడ తిలకహస్త మౌను. ఇది దేవపుష్పాంజలి, వాసనగలవస్తువు మొదలైనది, తిలకభేదములు వీనియందు వినియోగించును.
19. ఉత్థానవఞ్చితహస్తలక్షణమ్
| త్రిపతాకావంసదేశ గతా వుత్థానవఞ్చితః. | 558 |
| విష్ణోరభినయే స్తమ్భభావనాయాం బుధోదితః, | 559 |
త్రిపతాకహస్తములను భుజమూలములకు సమీపమునఁ జేర్చిపట్టినయెడ ఉత్థానవంచితహస్త మౌను. ఇది మహావిష్ణువును అభినయించుట, స్తంభములను జూపుట వీనియందు చెల్లును.
20. వర్ధమానహస్తలక్షణమ్
| ఊర్ధ్వభాగోన్ముఖౌ హస్తౌ శిఖరౌ వర్ధమానకః, | 560 |
| కింకిమిత్యుక్తి సమయే కదాచి దితిభాషణే, | 561 |
తా. శిఖరహస్తములను మీఁది కెత్తిపట్టినయెడ వర్ధమానహస్త మౌను. ఇది ఎల్లప్పుడని చెప్పుట, ఇయ్యఁబడినది యనుట, ఏమి యేమి యనెడి సమయము, ఒకానొకప్పు డనుట వీనియందు చెల్లును.
21. జ్ఞానహస్తలక్షణమ్
| ఆదౌపతాకౌ ధృత్వాతు అంసాదూర్ధ్వముఖౌవహేత్, | 562 |
| గ్రహేచ హృదయే ధ్యానే జ్ఞానహస్తో విధీయతే, | |
తా. మొదట పతాకహస్తములను బట్టి భుజమూలముల కెదురుగ నిక్కించినయెడ జ్ఞానహస్త మౌను. ఇది గ్రహము, హృదయము, ధ్యానము వీనియందు వినియోగించును.
22. రేఖాహస్తలక్షణమ్
| అఙ్గుష్ఠఃకుఞ్చితో భూయాన్మధ్యమా౽నామికా తథా. | 563 |
| కుఞ్చితా స్యాత్కనిష్ఠా చ తర్జనీ ప్రసృతాయది, | 564 |
తా. అంగుష్ఠమును మధ్యమ అనామిక కనిష్ఠలను వంచి చూఁపుడువ్రేలిని చాఁచినయెడ రేఖాహస్త మౌను. ఇది ముద్రయం దుపయోగింపఁబడును.
23. వైష్ణవహస్తలక్షణమ్
| ఊర్ధ్వగౌ త్రిపతాకౌచే ద్వైష్ణవః కరఈరితః, | 565 |
27. లీనముద్రాహస్తలక్షణమ్
| ముద్రాఖ్యే తర్జనీనమ్రాలీనముద్రాకరోభవేత్, | |
తా. ముద్రాహస్తమందు చూపుడువ్రేలిని వంచిపట్టినయెడ లీనముద్రాహస్త మవును.
| అథైకాదశబాన్ధవ్యాస్తేషాం లక్షణముచ్యతే. | 370 |
తా. ఇఁక పదునొకండు బాంధవ్యహస్తములయొక్క లక్షణములు చెప్పఁబడును.
1. దమ్పతీహస్తలక్షణమ్
| వామేతు శిఖరం ధృత్వా దక్షిణే మృగశీర్షకమ్, | 571 |
తా. ఎడమచేత శిఖరహస్తమును, కుడిచేత మృగశీర్షహస్తమును పట్టఁబడినయెడ దంపతీహస్తమగును. ఇది భార్యాభర్తలయం దుపయోగించును.
2. మాతృహస్తలక్షణమ్
| హస్తేవామే౽ర్ధచంద్రశ్చ సందంశో దక్షిణేకరే, | 572 |
| స్త్రియఃకరో ధృతోమాతృహస్తఇత్యుచ్యతే బుధైః, | 573 |
3. పితృహస్తలక్షణమ్
| ఏతస్మిన్ మాతృహస్తేతు శిఖరో దక్షిణే న తు, | 574 |
| అయం హస్తస్తు జనకే జామాతరి నియుజ్యతే, | |
తా. ముందు చెప్పిన మాతృహస్తము కుడిచేయి శిఖరహస్తముగాఁ బట్టఁబడినయెడ పితృహస్త మగును. ఇది తండ్రియందును, అల్లునియందును వినియోగించును.
4. శ్వశ్రూహస్తలక్షణమ్
| విన్యస్యకణ్ఠేహంసాస్యం సందంశం దక్షిణేకరే. | 575 |
| ఉదరేచ పరావృత్య వామహస్తే తతఃపరమ్, | 576 |
తా. కంఠమందు హంసాస్యహస్తము నుంచి కుడిచేతఁ బట్టఁబడిన సందంశహస్తమును నాభికెదురుగాఁ ద్రిప్పి ఎడమచేత స్త్రీహస్తమును పట్టినయెడ శ్వశ్రూహస్త మగును. ఇది అత్తయం దుపయోగించును,
5. శ్వశురహస్తలక్షణమ్
| ఏతస్యా౽౦తే తు హస్తస్య శిఖరో దక్షిణే యది, | 577 |
తా. ముందు చెప్పఁబడిన శ్వశ్రూహస్తము కుడితట్టు శిఖరహస్తమును పట్టినయెడ శ్వశురహస్త మగును. ఇది మామయందు చెల్లును.
భర్తృభ్రాతృహస్తలక్షణమ్
| వామేతు శిఖరం ధృత్వా పార్శ్వయోః కర్తరీముఖమ్, | |
| ధృతో దక్షిణహస్తేన భర్తృభ్రాతృకరిస్స్మృతః. | 578 |
తా. ఎడమచేత శిఖరహస్తమును బట్టి రెండుపార్శ్వములయందును కుడిచేత కర్తరీముఖహస్తమును పట్టిన భర్తృభ్రాతృహస్త మగును. ఇది పెనిమిటి తోడఁబుట్టినవారియందు వినియోగించును.
7. ననాందృహస్తలక్షణమ్
| భర్తృభ్రాతృకరస్యా౽౦తే స్త్రీహస్తో దక్షిణేకరే, | 579 |
తా. ముందు చెప్పఁబడిన భర్తృభ్రాతృహస్తమును పట్టినపిదప స్త్రీహస్తము దక్షిణహస్తమందు పట్టఁబడెనేని ననాందృహస్త మగును. ఇది ఆడుబిడ్డయందు ఉపయోగించును.
8. జ్యేష్ఠకనిష్ఠభ్రాతృహస్తలక్షణమ్
| మయూరహస్తః పురతః పశ్చాద్భాగేచ దర్శితః, | 580 |
తా. మయూరహస్తము ముందుప్రక్కను వెనుకప్రక్కను పట్టఁబడినయెడ జ్యేష్ఠభ్రాతృకనిష్ఠభ్రాతృహస్తమగును. ఇది అన్నదమ్ములయందు ఉపయోగించును.
9. స్నుషాహస్తలక్షణమ్
| ఏతస్యా౽౦తే దక్షిణే తు స్త్రీహస్తశ్చ ధృతో యది, | 581 |
తా. ముందు చెప్పిన జ్యేష్ఠకనిష్ఠభ్రాతృహస్తమును పట్టి పిమ్మట కుడి చేత స్త్రీహస్తమును పట్టినయెడ స్నుషాహస్త మగును. ఇది కోడలియం దుపయోగించును.
10. భర్తృహస్తలక్షణమ్
| విన్యస్య కంఠే హంసాస్యౌ శిఖరో దక్షిణేకరే, | 582 |
తా. కంఠమందు హంసాస్యహస్తముల నుంచి కుడిచేత శిఖరహస్తమును పట్టినయెడ భర్తృహస్తమగును. ఇది మగనియం దుపయోగించును.
11. సపత్నీహస్తలక్షణమ్
| దర్శయిత్వా పాశహస్తం కరాభ్యాం స్త్రీకరావుభౌ, | 583 |
తా. పాశహస్తమును చూపి రెండుచేతులయందును స్త్రీహస్తములను పట్టినయెడ సపత్నీహస్త మగును. ఇది సవతియం దుపయోగించును.
| ఇత్యేకాదశ బాంధవ్యహస్తాస్సందర్శితాః క్రమాత్, | 584 |
తా. ఈరీతిగా పదునొకండు బాంధవ్యహస్తములు చెప్పఁబడినవి. ఇందు చెప్పఁబడనిబంధువులకు వారివారికి క్రియలను అనుసరించి హస్తములను తెలిసికోవలయును.
| అథ బ్రహ్మాదిదేవానాం భావనాభినయక్రమాత్, | 585 |
1. బ్రహ్మహస్తలక్షణమ్
| బ్రహ్మణశ్చతురో వామే హంసాస్యో దక్షిణేకరే, | |
తా. ఎడమచేత చతురహస్తమును, కుడిచేత హంసాస్యహస్తమును బట్టఁబడునెడ బ్రహ్మహస్త మగును.
2. శమ్భుహస్తలక్షణమ్
| శమ్భోర్వామే మృగశిర స్త్రిపతాకశ్చ దక్షిణే. | 586 |
తా. ఎడమచేత మృగశీర్షహస్తమును, కుడిచేత త్రిపతాకహస్తమును పట్టఁబడినయెడ శంభుహస్త మగును.
3. విష్ణుహస్తలక్షణమ్
| హస్తాభ్యాం త్రిపతాకాభ్యాం విష్ణుహస్తః ప్రకీర్తితః, | |
తా. రెండుచేతులను త్రిపతాకహస్తములు పట్టఁబడినయెడ విష్ణుహస్త మగును.
4. సరస్వతీహస్తలక్షణమ్
| సూచీకృతే దక్షిణే౽ర్ధచంద్రే వామకరే తథా. | 587 |
| సరస్వత్యాః కరః ప్రోక్తః భరతాగమవేదిభిః, | |
తా. కుడిచేత సూచీహస్తమును, ఎడమచేత అర్ధచంద్రహస్తమును పట్టఁబడినయెడ సరస్వతీహస్త మగును.
5. పార్వతీహస్తలక్షణమ్
| ఊర్ధ్వాధః ప్రసృతావర్ధ చంద్రాఖ్యౌ వామదక్షిణే. | 588 |
| అభయో వరదశ్చైవ పార్వత్యాః కరఈరితః, | |
తా. కుడియెడమచేతులకు క్రిందుమీఁదు చేసి అర్ధచంద్రహస్తము పట్టినయెడ అభయవరదహస్తము లగును. అవియే పార్వతీహస్తములు.
6. లక్ష్మీహ స్తలక్షణమ్
| అంసోపకంఠే హస్తాభ్యాం కపిత్థాభ్యాం శ్రియఃకరః. | 589 |
తా. బాహుమూలమందు రెండుకపిత్థహస్తములు పట్టఁబడినయెడ లక్ష్మీహస్త మగును.
7. విఘ్నేశ్వరహస్తలక్షణమ్
| పురోగాభ్యాం కపిత్థాభ్యాం కరాభ్యాం విఘ్నరాట్కర, | |
తా. ఎదురుగా రెండు కపిత్థహస్తములు పట్టఁబడినయెడ విఘ్నేశ్వరహస్త మగును.
8. షణ్ముఖహస్తలక్షణమ్
| వామేకరే త్రిశూలంచ శిఖరం దక్షిణేకరే. | 590 |
| ఊర్ధ్వంగతే షణ్ముఖస్య కరఇత్యుచ్యతే బుధైః, | |
తా. ఎడమచేతియందు త్రిశూలహస్తమును కుడిచేతియందు శిఖరహస్తమును ఎత్తుగా పట్టఁబడినయెడ షణ్ముఖహస్త మగును.
9. మన్మథహస్తలక్షణమ్
| వామేకరేతు శిఖరం దక్షిణే కటకాముఖః. | 591 |
| మన్మథస్య కరః ప్రోక్తో నాట్యశాస్త్రవిశారదైః, | |
10. ఇంద్రహస్తలక్షణమ్
| త్రిపతాకౌ స్వస్తికౌచే దింద్రహస్తః ప్రకీర్తితః. | 592 |
తా. రెండుత్రిపతాకహస్తముల మణికట్టులను చేర్చిపట్టునెడ ఇంద్రహస్త మగును.
11. అగ్నిహస్తలక్షణమ్
| త్రిపతాకో దక్షిణే తు వామే లాంగూలహస్తకః, | 593 |
తా. కుడిచేతియందు త్రిపతాకహస్తమును, ఎడమచేతియందు లాంగూలహస్తమును పట్టఁబడినయెడ అగ్నిహస్త మగును.
12. యమహస్తలక్షణమ్
| వామే పాశః దక్షిణే తు సూచీయమకరస్మృతః, | |
తా. ఎడమచేతియందు పాశహస్తమును, కుడిచేతియందు సూచీహస్తమును పట్టఁబడినయెడ యమహస్త మగును.
13. నైరృతిహస్తలక్షణమ్
| ఖట్వాచ శకటశ్చైవ కీర్తితో నైరృతేః కరః. | 594 |
తా. ఖట్వాహస్తమును శకటహస్తమును బట్టినయెడ నైరృతిహస్త మగును.
14. వరుణహస్తలక్షణమ్
| పతాకో దక్షిణే వామే శిఖరం వారుణః కరః, | |
తా. కుడిచేతియందు పతాకహస్తమును, ఎడమచేతియందు శిఖరహస్తమును పట్టఁబడినయెడ వరుణహస్త మగును.